బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో ఏడాది వెళ్ళిపోతోందట…so what?

    ఇంక కొద్ది గంటల్లో 2012 వెళ్ళిపోయి, 2013 వస్తుందట. అయితే ఏమిటిట? ఒకానొకప్పుడు, కొత్త సంవత్సరం వస్తోందంటే జరిగే హడావిడి గురించి క్రిందటి సంవత్సరం ఒక టపా వ్రాశాను.అప్పటికీ ఇప్పటికీ ఏమీ పెద్ద తేడా ఏమీ లేదు.ఒక విషయం ఏమిటంటే, అప్పుడు 2012 లో ఏవేవో జరుగుతాయేమో అనే ఆశన్నా ఉండేది. కానీ అలాటివేవో జరుగుతాయేమో అన్న ఆశ పెట్టుకోడం ఉఠ్ఠి బుఱ్ఱతక్కువ పనీ అని మాత్రం తేలింది.

    ప్రతీవారికీ కొత్తసంవత్సరం వచ్చిందంటే అవేవో New Year Resolutions ట, అలాటివి చేసేసికోడం ఓ పెద్ద సరదా. ఎందుకు చెప్పండి, అలాటివాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రొద్దుటే బయటకెళ్ళినవాడు లక్షణంగా కొంపకు చేరుతాడో లేదో తెలియని పరిస్థితాయే.Everything is unpredictable.ఈ మాత్రం దానికి రిజల్యూషన్లూ అవీ ఎందుకూ? పోనీ ఇదివరకటిలాగ ఏ గ్రీటింగు కార్డైనా కొందామనుకున్నా, ఆ గ్రీటింగ్ కార్డులు అమ్మే Archies, Hallmark వాళ్ళ దుకాణాలే కనిపించడం లేదాయె. ఎక్కడ చూసినా SMS లూ, e-greetings. కొద్దిరోజులక్రితం వరకూ డిసెంబరు 31 వచ్చిందంటే చాలు, టివీ ల్లో అద్భుతమైన కార్యక్రమాలు రాత్రి పన్నెండింటిదాకా. ఇప్పుడో ఆ కార్యక్రమాలంటేనే వెగటుపుట్టుకొస్తోంది. దిక్కుమాలిన రికార్డింగు డ్యాన్సుల్లోకి వెళ్ళిపోయాయి.

    గడిచిపోయిన సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనల గురించి ఓ కార్యక్రమం ఉండేది. ఇప్పుడు గత సంవత్సరంలో జరిగిన వాటిని గుర్తుకుతెచ్చుకుందామన్నా ఉండేవి ఏమిటిట, స్త్రీల మీద అత్యాచారాలూ, మర్డర్లూ, కిడ్న్యాపింగులూ, పార్లమెంటులో అల్లర్లూ, తుఫానులూ ఇవే కదా? మధ్యలో లంచగొండితనం మీద దీక్షలూ, ధర్నాలూనూ. పోనీ మనదేశంలో చట్టాలు చేయాల్సినవారు ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అదీ లేదూ. ఏదో కారణంతో పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ అల్లర్లే.

    ఏదైనా “ప్రగతి” సాధించామా అంటే,అది Scams విషయంలో . ఎవరెవరినో జైళ్ళలో పెట్టారు. వాళ్ళు కూడా ఏ అరడజనుమందో తప్పించి మిగిలినవారందరూ హాయిగా బెయిలు మీద బయట తిరుగుతున్నవారే. ఆ మిగిలినవాళ్ళూ తొందరలో బయటకొచ్చేస్తారు. మనం మాత్రం Face Book, Twitter, Google+ ల్లో గ్రూపులూ, మెమొరాండాల్లమీద సంతకాలు సేకరించే హడావిడిలో ఉంటాము. ఈమధ్యన “సంతకాల సేకరణ” ఓ ఫ్యాషనైపోయింది. ప్రతీవాడూ సంతకాలు సేకరించేవాడే. వాటితో ఏం చేస్తారో మాత్రం తెలియదు.

    ఓ సంవత్సరం వెళ్ళి ఇంకో సంవత్సరం వచ్చిందీ అంటే జరిగేదేమిటయ్యా అంటే, మన వయస్సు ఇంకో సంవత్సరం పెరిగినట్టు, అంతకంటే జరిగేదేమీ లేదు.

    ఈమధ్యన నెట్ లో ఓ short film చూశాను. సరదాగా మీరూ చూడండి.

WISH YOU ALL A HAPPY 2013.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– inhibitions 2

    కిందటి టపాలో కొన్ని inhibitions గురించి ప్రస్తావించానుగా, అసలు జీవితమంతా ఏదో ఒక inhibition తోటే వెళ్ళిపోతూంటుంది. వాటిల్లోంచి బయట పడాలంటే మళ్ళీ అదో inhibitioనూ , ఏమిటో అంతా గజిబిజిగా ఉంది కదూ. ఇప్పటి వాళ్ళకే హాయీ, ఏ గొడవా లేదు. పెద్దవాళ్ళేదో చెప్తే వినాలని inhibition ఉంటే కదా, దాంట్లోంచి బయటపడడమెలాగా అని బుఱ్ఱ పగలుకొట్టుకునేదీ, అసలు అలాటిదే లేనప్పుడు ఎంత హాయో కదూ? అందుకే ఈరొజుల్లో వాళ్ళని చూస్తూంటే నాకైతే చాలా envious గా ఉంటూంటుంది. ఈ మాత్రం తెలివితేటలు మనకెందుకు లేకపోయాయీ అని.

    ఏ విషయం తీసికోండి, తమకి convenient గా ఉన్నది మాత్రమే చేస్తారు, అవతలివాడు ఏమైనా అనుకుంటే అది వాడి ఖర్మ! కానీ, ఇళ్ళల్లో ఉండే ఈ పెద్దాళ్ళున్నారే ప్రతీ దానికీ నసే.పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారూ, వాళ్ళ పెద్దాళ్ళు చెప్పినవే “వేదవాక్కు” గా భావించి, అలాగే ఉండాలి కాబోసూ, అని భావించేసి, వాళ్ళు పడ్డ పాట్లూ ( అలాటివి implement చేయడానికి), వాళ్ళ ‘నమ్మకాలూ” ఇంట్లోవాళ్ళ నెత్తిమీద రుద్దడానికి ప్రయత్నిస్తూంటారు, అవేమో, వీళ్ళకి నచ్చవూ, పోనీ ఏదో చెప్తున్నాడు కదా అని, ఒకటో అరో విన్నారా, అయిపోతుంది, ప్రతీ దాంట్లోనూ వేలెట్టేస్తారు.పైగా ఈ inhibitions అన్నవి ఇక్కడితో ఆగిపోవు, వాళ్ళ పిల్లలకి చెబ్దామని ప్రయత్నిస్తారు, అలా వంశపారంపర్యం కింద మారిపోతుంది.

   అందుకే, ఈ పెద్దాళ్ళే మారిపోతే అసలు గొడవే ఉండదుగా, వంశమూ లేదూ, పారంపర్యమూ లేదు.చెప్పానుగా తెల్లారి లేస్తే చాలు, ఇలా చెయ్యకూ, అలా చెయ్యకూ, ఫలానాది ఫలానాగానే చెయ్యాలీ అంటూ ఒకటే క్లాసులు.వీళ్ళ “బాధ” పడలేక వినేసేవారు. అయినా ఆ రోజుల్లో ఎదురు చెప్పేటంత ధైర్యం ఎక్కడేడిసిందీ? వినేయడంతో సరిపోతుందా మరి,వాటిని ఆచరించడం కూడా part of the deal . ఇలా ఆచరించి, ఆచరించి జీవితంలో ఓ భాగం అయిపోయాయి.మరి వాటిల్లోంచి బయటపడాలంటే కొద్దిగా టైము పడుతుంది కదా. ఈ time gap తోటే అసలు గొడవంతానూ. ఈ inhibitions అనేవి వ్యసనాల్లాటివి, ఓ సిగరెట్టు కాల్చడమో, ఓ పెగ్గేసికోడమో, కాదూ కూడదంటే ఓ “పాన్ మసాలా ” లాటిది వేసికోడమో, లేదా ఓ “కారా కిళ్ళీ’ లాటిది వేసికోడమో లాటిది.

    చిన్నప్పుడు ఎవడికైనా ఏ చెయ్యో కాలిందనుకోండి, చన్నీళ్ళు అసలు తగలకూడదూ, బొబ్బలెక్కిపోతాయీ అనేవారు.అలాటిది, ఈ రోజుల్లో ఏక్ దం ఉల్టా– చన్నీళ్ళే పోయాలిట. మనమేమైనా డాక్టర్లమా ఏమిటీ, ఈ మార్పులన్నీ తెలియడానికీ, మనకి చిన్నప్పుడు తెలిసిన ఆ limited knowledge తోటే ఇంట్లో ఖర్మకాలి ఎవరికైనా ఏ చెయ్యో, కాలో కాలితే ఓ సిరా బుడ్డి ఖాళీ చేసేవారం, అదే first aid అనుకునే వారం. తీరా డాక్టరుదగ్గరకు వెళ్తే, చివాటేస్తాడు, ఆమాత్రం తెలియదా చన్నీళ్ళు పోయాలనీ అని.

   ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మంగళవారాలు ప్రయాణం చేయకూడదనేవారు మా అమ్మగారు. మరి ఈరోజుల్లో కుదురుతాయా అవన్నీనూ, పైగా ఇంతింత దూరాలు వెళ్ళడానికి ఆ weekly once train మంగళవారాలే ఉంటుంది. పైగా ఏ వారారంభంలోనో శలవు తీసికుని, వారం వర్జ్యం. చూస్తూ కూర్చోలేము కదా.ఇంక మడీ, తడీ ఆచారాలూ అయితే అడక్కండి.ఆ తడిబట్టతోనే వంటలు చేయడం, ఈరోజుల్లో అయితే అంతంత సేపు అలా తడిగుడ్డలతో ఉంటే, ఏ న్యుమోనియాయో వస్తుందీ, అంటారు.ఆరోజుల్లో మరి ఎవరికీ న్యుమోనియాలు వచ్చిన దాఖలాలే లేవే. అలాటివే ఆ “మూడురోజులూ” నూ. ఈ రోజుల్లోనూ చెసేవారు ఉన్నారనుకోండి, కానీ నూటికీ కోటికీనూ. ఏదో ఒక ఉద్దేశ్యంతోనే పెట్టారనుకోండీ అలాటివన్నీనూ, కానీ ఈ రోజుల్లో అలాటివన్నీ ఆచరించడం అంటే మాటలా మరి. ఎకడికక్కడే సరిపెట్టేసికోవాలి. అందుకే అంటారు, ఈ ఆచారాలూ అవీ, కాలమానపరిస్థుతుల బట్టే ఆచరించాలీ అని. ఆ రోజుల్లో జరిగేవి, ఇళ్ళూ అవీ కూడా అలాగే ఉండేవి.

    అలాగే “శకునాలు”-ఆ రోజుల్లో part and parcel of our daily life.ఎక్కడికెళ్ళాలన్నా శకునం చూస్తేనే కానీ కుదరదు. పరీక్షలకైతే ఆ “అమ్మ” గారే ఎదురొచ్చేసేవారు. ఎవరైనా తుమ్మితే కుదరదు. ఇప్పుడో ఏదో dust allergy తో ప్రతీవాడూ తుమ్మేవాడే. ఆ రోజుల్లో స్కూలుకి వెళ్ళె పిల్లలు ఆడైనా మొగైనా నుదుటిమీద బొట్టు లేకుండా ఉండేవారా? కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలమాట దేముడెరుగు, పెద్దాళ్ళకే దిక్కులేదు.నిన్న అదేదో Life is beautiful అనే ఓ తెలుగు సినిమా చూసే ‘దురదృష్టం’ కలిగింది. ఆయనెవరో శేఖర్ కమ్ముల గారి సినిమా ఇదీ, దానికి సాయం పేపర్లలోనూ, బ్లాగుల్లోనూ ఏమిటేమిటో పొగిడేశారూ, బావుంటుందేమో అని కూర్చున్నాను. దాంట్లో ఓ పిల్ల ఇంకో పిల్లతో అంటుంది, ” ఆ మొహం మీద ఆ బొట్టేమిటీ అసహ్యంగానూ..” అని.ప్రస్తుత పరిస్థితి అదాయే మరి.ఖర్మకాలి పెట్టుకోవలసివచ్చినా అవేవో మ్యాచింగు బొట్లు. అవన్నీ తప్పని కాదు నేననేది, మారారా లేదా, ఇళ్ళల్లో తల్లులుకూడా తమతమ inhibitions లోంచి బయట పడుతున్నారు.

    ఆ మధ్యన కష్టేఫలే శర్మ గారు ఓ టపా వ్రాశారు. వారి వియ్యంకుడు గారు స్వర్గస్థులైన సందర్భంలో. సరీగ్గా నాకూ అదే పరిస్థితి ఎదురయింది ఇక్కడ. మా అమ్మాయి మామగారు అక్టోబరు ఒకటిన స్వర్గస్థులయ్యారు. మనవైపైతే చెల్లుతుంది, వియ్యంకుడు పోతే వియ్యంకుడు వెళ్ళకూడదూ అని. కానీ ఇక్కడ అలా కుదరమంటే కుదురుతుందా?

    ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. మెల్లిమెల్లిగా బయటపడ్డానికి ప్రయత్నమైతే చేస్తున్నారు, కానీ టైముపడుతుంది మరి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– inhibitions….1

    అసలు ఇలాటి శీర్షికతో టపా వ్రాస్తాననగానే మా ఇంటావిడ, “ఎందుకండీ లేనిపోనివీ, ఏదో వ్రాస్తున్నారూ, మీమీద అభిమానం ఉన్నవాళ్ళు చదువుతూంటారూ, ఇప్పుడు ఇలాటివి వ్రాయడం అంత అవసరమంటారా, బావుండదేమో…” తో మొదలయింది, ఈ inhibitions. తో ఎలా పెరిగిపెద్దయామో చెప్పడానికి.ప్రతీదానికీ ఏదో ఒకటనేవారు. పెద్దాళ్ళు అదీ “అమ్మ” లు కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఆటలకి పంపేసేవారు. వాళ్ళు చెప్పుకునే కబుర్లేవో వినాలని ఈ చిన్నపిల్లలకి ఆత్రుత, వాళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు మధ్యలో ఏమైనా ప్రశ్నలేసి ఇరుకులో పెడతారేమో అని భయం కావొచ్చు, లేదా ఆ particular topic గురించి మనకు తెలియచేసే టైము రాలేదనుకోవచ్చు, ఏదో ఒకటీ, చిన్నపిల్లలకి తెలియకూడదూ అంతే… దానితో ఆరోజుల్లో ప్రతీదీ mystery గానే మిగిలిపోయింది ! అలాగని అడిగినా తప్పే మళ్ళీ- “ పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటీ వెధవ ప్రశ్నలూ నువ్వూనూ..” అంటూ కసిరిపారేసేవారు.మరి వాళ్ళకి అసలు అలాటి విషయాలెప్పుడు తెలిశాయిట అనే ప్రశ్నుండేది కాదు.వాళ్ళకెప్పుడు తెలిస్తే నీకెందుకూ, నువ్వుమాత్రం నోరుమూసుక్కూర్చో..అలా ప్రతీ విషయంలోనూ ఎన్నెన్నో inhibitions.తోటే చిన్నతనమంతా గడచిపోయింది.వాటన్నిటినీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది.అలా పెరిగాము కదా అని ఏమీ regret ఏమీ లేదండోయ్.ఆ కాలమానపరిస్థితులకి అలాగే బావుండేది.

కానీ రోజులన్నీ ఒకేలా ఉండవుగా, మెల్లిమెల్లిగా ప్రతీ రంగంలోనూ ఓ “పారదర్శకత”( transperency) లాటిది మొదలయింది.గుర్తుండేఉంటుంది, సినిమాల్లో చూపించేవారు హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ, అనురాగం లాటివి వస్తే అదేదో “పక్షుల్ని” దగ్గర చేర్చడమూ, ఆ “తరువాతి” కార్యక్రమం కోసం ఓ పువ్వూ, దానిమీద ఓ తుమ్మెదా etc.etc.. కాలక్రమేణా హీరో హీరోయిన్లని ఇంకొంచం దగ్గరగా తీసికొచ్చి తరువాతిది.. leave it to our imagination.. తరువాత్తరువాత బ్లూ ఫిల్ములకీ సినిమాలకీ తేడాయే లేదనుకోండి.. all in the name of entertainment.

ఇంక పుస్తకాల విషయంలోకూడా అలాగే ఉండేది. కిళ్ళీకొట్లలో వేల్లాడతీసి పెట్టేవారు “కొన్ని” genre పుస్తకాలు, అసలు అలాటివాటివైపు చూస్తేనే పాపమేమో అనే అభిప్రాయంతో పెరిగాము. కానీ మగాడన్నా, ఆడపిల్లన్నా అవేవో harmonal changes అనేవుంటాయి కదా, ఆడపిల్ల ” పెద్దమనిషి” అయేటప్పటికి అప్పటిదాకా ఆ లొకాలిటీ లో ఉండే అందరు పిల్లలతో ఆడుకునే ఆ పిల్లకి ఓ పరికిణీ, ఓణీ వేసేయడం, ఆ పిల్లేమో ఎవరిని చూసినా పమిట సద్దుకోడం…లాటివి మొదలయ్యేది. ఇంక మగపిల్లాడు, ఇంట్లోవాళ్ళకి కనిపించకుండా, ఆ “కిళ్ళీకొట్టు పుస్తకాలు” తన నోట్సుల్లో దాచేసి తెచ్చుకోడమూ, ఎవరూ చూడకుండా చదివి చొంగ కార్చుకోడమూనూ. ఎందుకంటే అలాటి పుస్తకాలు ఏక్ దం taboo. మరి వీటినే inhibitions అంటారు.కానీ రోజులు గడిచేకొద్దీ వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆరోజుల్లో “చలం” గారి పుస్తకాలు చదివినా, చూసినా డొక్క చించేసేవారు. ఓహో ఆ చలంగారు వ్రాసేవన్నీ “బూతు” పుస్తకాలేమో అనే ఓ దురభిప్రాయంతోనే పెరిగాము. అలాగే “కొవ్వలి” వారివీనూ.

అదేకాకుండా అమ్మలు ఏ పేరంటానికైనా వెళ్ళినప్పుడు తన పిల్లాడిని తీసికెళ్ళిందనుకోండి, వాడిని “ కోతిపేరంటాలు” అని ఏడిపించేవారు. దానితో ఓహో.. మొగాళ్ళు పేరంటాలకి కానీ, ఆడవారి functions కి కానీ వెళ్ళకూడదన్నమాట అనే ఓ inhibition ఏర్పడిపోయేది.మరి ఈరోజుల్లో అలా జరగాలంటే కుదురుతుందా, ఇంటికో భార్యా భర్తా ఓ పిల్లో పిల్లాడో ఉండే రోజుల్లో,“ఫలానా పని నేను చేయకూడదూ, నా చిన్నప్పుడు చెయ్యనిచ్చేదికాదూ మా అమ్మా..” అంటే కుదురుతుందా. ఏ శ్రావణమంగళవారం పేరంటమో చేస్తే, నచ్చినా నచ్చకపోయినా శలవు పెట్టుకుని, శనగలూ, తాంబూలాలూ ప్లేట్లలో సద్దే కుర్రాళ్ళని చూస్తూంటాము. అయినా ఈరోజుల్లో నోములూ, వ్రతాలూ ఎవరు చేస్తున్నారులెండి అనకండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇంకా మన ఇళ్ళల్లో ఆచారాలూ, వ్యవహారాలూ ఇంకా బ్రష్టు పడిపోలేదు.

అంతదాకా ఎందుకూ మా ఇంటావిడ ఇప్పటికీ ఛస్తే కేక్కు తినదు, దాంట్లో ఎగ్ వేస్తారని! ఇంకో చిత్రం spring onion అని ఈరోజుల్లో మార్కెట్ లో దొరికేవాటిని తన చిన్నప్పుడు “ఉల్లికోళ్ళు” అనేవారుట, అదేదో మాంసాహారమనే భావంతో ఇంట్లోకి కూడా తేనిచ్చేది కాదు. పైగా పిల్లలతో, “మనము అలాటివి వండుకోమమ్మా..” అని కూడా చెప్పేది ! నిజమే కాబోసనుకునేవారు మా పిల్లలు. మార్కెట్ లో దొరికే స్వీట్లమీద అద్దుతారే సిల్వర్ ఫాయిల్, దాన్ని అదేదో జంతువు పేగులతో తయారు చేస్తారని ఎక్కడో చదివిందిట, బస్.. అలాటి స్వీట్స్ కి lifelong ban.. !

ఇవన్నీ “ఆ కాలం” నాటివాళ్ళకనుకోండి. ఇప్పుడు inhibitionసూ లెవూ, సింగినాదమూ లేదూ. ఏం కావలిసొస్తే దాన్ని నెట్ లో వెదుక్కోడమూ, పైగా తలితండ్రులకే కొన్నిటిని నేర్పడమూ. సేఫ్ పీరియడ్ అంటే, తల్లితండ్రులకంటే పిల్లలకే ఎక్కువ తెలిసే కాలం ఇది. టివీలలో కార్యక్రమాలూ అలాగే ఉన్నాయనుకోండి.సినిమాలకి సంబంధించినంతవరకూ ఏదో నామ్ కే వాస్తే ఓ సెన్సార్ బోర్డూ, ఓ సర్టిఫికేట్టూనూ.

అసలు ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈవేళ ప్రొద్దుట రైల్వే స్టేషనుకి తెలుగు పుస్తకాలు తెచ్చుకోడానికి వెళ్ళాను. ఈ వారం “స్వాతి” అట్టమీద “whisper ఈ సంచికతో ఉచితం” అని వ్రాసుందికదా అని, ఇమ్మన్నాను.దానికి ఆ కొట్టబ్బాయి అన్నాడూ, ” అడగడానికి సిగ్గుపడుతున్నారూ అందుకని అడిగినవారికే ఇస్తున్నానూ..”. “నాయనా ఇప్పుడు ఇలాటివి నాకేమీ అవసరం లేదూ, కానీ ఓ కూతురూ, కోడలూ, ఇద్దరు మనవరాళ్ళూ ఉన్నప్పుడు ఇలాటివాటి అవసరాలుంటాయి కదా..” అనేసి తీసికుంటూంటే పక్కనే ఉన్న ఒకావిడ నవ్వాపుకోలేకపోయారు. ” నిజం అంకుల్ ఎంత బాగా చెప్పారూ, అయినా ఈరొజుల్లో ఎవరు సిగ్గుపడుతున్నారులెండి..”,మరి అది ప్రశంసో, వెటకారమో తెలియదు. కానీ చిన్నప్పటి inhibitions. లోంచి మాత్రం బయటపడాలి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    గత నాలూగైదు రోజులనుండీ దేశమంతా “అట్టుడికి” పోతోంది, దేశ రాజధానీ నగరంలో జరిగిన ఓ దురదృష్టకరమైన సంఘటన వలన. నిజమే ఆ విషయం తెలిసి చాలా బాధ పడ్డాము. కానీ దేశంలో ఇలాటివి కొత్తేమీ కాదు. అలాగని ఆ సంఘటనని dilute చేయాలని మాత్రం కాదు ఈ టపా.కానీ విశేషమేమిటంటే, దేశరాజధానీ నగరంలో జరిగేటప్పటికే, పార్లమెంటులోనూ, పెద్ద పెద్దనగరాల్లోనూ చేశారే హడావిడి, అదీ. నిందితులకు ఉరిశిక్ష వేయమన్నారు. దేశ విద్రోహచర్యలకు పాల్పడినవాడికే, ఉరిశిక్ష వేసినా, దాని సంగతేదో ఇప్పటిదాకా తేలలేదు.మళ్ళీ ఇంతలో ఇంకోటా? ఈ సందర్భంలో ఈవేళ “సాక్షి” పేపర్లో ఒక వ్యాసం వచ్చింది, చదవండి. ఉన్నదున్నట్టుగా చక్కగా సమీక్షించారు. చాలామందికి నచ్చకపోవచ్చు, ఎప్పుడూ ఉండేదేగా నిజాన్ని ఒప్పుకోపోడం. అలాగే Indian-Express-Pune-20-December-2012-8 ఒకసారి చదవండి.దేశంలో ఎలా ఉందో.

    ఆడపిల్లలమీద యాసిడ్ దాడిల విషయం అసలు లెఖ్ఖలోకే తీసికోరు.కానీ ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే జనం నిద్రలేస్తారు. రాజకీయనాయకులూ, సెలిబ్రెటీలూ అయితే అడగనే అడగఖ్ఖర్లేదు.ఇక్కడ జరిగేవాటికి దిక్కులేదు కానీ, ఆమధ్యన అమెరికాలో జరిగిన కాల్పుల సంఘటనమీద మాత్రం చర్చలూ, అభిప్రాయాలూనూ. ముక్తకంఠంతో అందరూ చెప్పేశారు, అసలు వాళ్ళది gun culture అండీ అంటూ.మరి మన culture ని ఏమంటారుట?

    ఇంక eve teasing గురించి ప్రతీవాడూ మాట్టాడేవాడే. ఆ మధ్యన పంజాబ్ లో ఒక తండ్రి, తన కుమార్తెను ఏడిపిస్తూన్నారని అడ్డుకోబోతే, ఓ ప్రబుధ్ధుడు తుపాకీతో కాల్చిపారేశాడు. చిత్రం ఏమిటంటే ఆ తండ్రి ఓ పోలీసు అధికారీ, కాల్చిన దౌర్భాగ్యుడు అధికారపక్షానికి చెందినవాడూనూ.మరి మనకి లేదా ఆ gun cultuరో ఏదో.

    ఈవేళ ప్రొద్దుట టివీ చానెళ్ళలో scrolling లో చూశాము, కాకినాడలో ఓ corporate college లో పిల్లలు 500 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందీ అనిన్నూ అందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉందనిన్నూ. ఎవడో ఓ చానెల్ వాడు ఆ కాలేజీ పేరు (చైతన్య) బైటపెట్టేశాడు. మళ్ళీ ఆ విషయం మాత్రం ఎవడికీ పట్టలేదు. అసలు అలాటి సంఘటనే జరిగినట్టుకూడా లేనట్టుగా, మన మీడియా ప్రవర్తిస్తోంది. అంటే ఆ కాలేజీనుంచి వివిధ చానెళ్ళవాళ్ళకీ “ఆమ్యామ్యాలు” ముట్టినట్టా? ఈ మాత్రందానికి ఫ్రీ మీడియా అంటూ ఇళ్ళెక్కి అరవడం ఎందుకో? అప్పటికీ శ్రీ కట్జూ గారు చెప్పనేచెప్పారు– మొన్నటి గుజరాత్ ఎన్నికల సందర్భంలో వచ్చినవన్నీ paid news లే అని ! అంత ఉన్నతస్థానంలో ఉన్నాయనే అలా చెప్పారంటే, మన మీడియా ఎంత దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉందో చెప్పఖ్ఖర్లేదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏదైనా చెప్తే నమ్మేట్టుండాలి…..

    ఈవేళ సుబ్బారాయుడి షష్ఠి కదా, పోనీ నా చిన్నతనంలో జరిగినవాటి గురించి వ్రాద్దామా అని మొదలెట్టాను. కానీ కిందటేడాది సరీగ్గా ఈ టైములోనే ఓ టపా పెట్టాను. మరీ ఏడాది తిరక్కుండా అందరినీ బోరు కొట్టేస్తే, చదివేవాళ్ళు కూడా చదవరూ అనేసికుని దాని లింకు మాత్రమే పెట్టేసి వదిలేశాను. బోరుకొట్టినా మళ్ళీ ఓసారి చదివేయండి.అంతే కానీ ఈ టపాకి శీర్షిక పెట్టానుకదా అని అలాటిదేమోలే అని మాత్రం భావించకండి. నేను వ్రాసే టపా మామూలుగా మీడియాల్లోనూ, ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకునేటప్పుడు చెప్పే విశేషాల్లోనూ జరిగేవి.

    కొంతమందుంటారు, వాళ్ళు ఏదైనా కొత్త వస్తువో, లేదా ఓ ఫ్లాట్టో కొనుక్కున్నప్పుడు, వాళ్ళు చెప్పే కబుర్లు కోటలు దాటేస్తూంటాయి. వినేవాడుండాలే కానీ కావలిసినన్ని ” కోతలు” కోసేయొచ్చు. వాటిని ఏదో entertainment అనేసి ఊరుకోవాలి కానీ, మరీ సీరియస్సుగా తీసికోకూడదు.నా పెళ్ళికాకపూర్వం, ఓ ఫ్రెండుండేవాడు, అతని భార్యకి పురుడొచ్చినప్పుడు రెండుసార్లూ, అదేదో ప్రపంచంలో ఆవిడొక్కరికే పురుడొచ్చినట్టూ, ” చచ్చి బతికినట్టూ” చెప్పేవాడు. నాకేం తెలుసూ నిజమే కాబోసనుకునేవాడిని. ప్రపంచంలో పురుటి సమయంలో ప్రతీ స్త్రీకీ నిజంగా పునర్జన్మే ఆ సమయంలో.కానీ అవన్నీ ఇదివరకటి రోజుల్లో, వైద్యసహాయాలు అంతంత మాత్రమే ఉన్న రోజులాయె. కానీ నెలతప్పినప్పటినుంచీ ఏవేవో టెస్టులు చేస్తూన్న ఈ రోజుల్లో అలాటివి చెప్పినా లాభం లేదు.అలాగే మిగిలిన వైద్య విషయాల్లోనూ ఏదో ఆపరేషను చేయించుకొచ్చిన తరువాత, ఆ డాక్టరుగారు ఇంతటివాడూ, అంతటివాడూ, మా ఆపరేషననేసరికి మిగిలిన పనులన్నీ వదిలేసికుని మరీ చేసేశారూ లాటి కబుర్లు.నిజమే కావొచ్చు, కానీ మరీ అంతగా exaggerate చేయవలసిన అవసరం లేదు.ప్రపంచంలో ప్రతీ డాక్టరూ చేసేదే ఇది.అలాగని dilute చేయాలనీ కాదు.ఎంత వరకూ అవసరమో అంతదాకా చెప్పి వదిలేయాలి. చెప్పిందే చెప్తే విసుగేస్తుంది.

    ఇంక న్యూసుపేపర్లలోనూ, టివీ ల్లోనూ వచ్చే వార్తలు ఆయనెవరో మాట్టాడిన బహిరంగ సభకి లక్షల్లో ప్రేక్షకులు వచ్చారని, అసలు ఇదేమైనా నమ్మతగ్గట్టుందా, వీళ్ళేమైనా లెఖ్ఖపెట్టారా ఏమిటీ? ఏదో ఉజ్జాయింపుగా ఓ అంకె చెప్పేయడం, నమ్మితే నమ్మారు, లేకపోతే వాళ్ళ ఖర్మ ! ఇవనే కాదు ప్రతీదానికీ ఉన్నది లేనట్టుగా చూపించడం ఈ మీడియా వాళ్ళకే చెల్లింది. దానితో వారి credibility దెబ్బ తింటోందని మాత్రం వీళ్ళకి తట్టదు.

    ఇంక కొంతమందుంటారు, ఈ రోజుల్లో ఉన్న దంపతులు అందరూ అని కాదూ, కొంతమంది, ఏదో పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా అని, ఎక్కడికో అక్కడకి తీసికెళ్ళడం part of life అయిపోయింది. తప్పనడం లేదు. అలా బయటకెళ్ళాలంటే, ఎంత ప్లానింగు చేసికోవాలి? ఆఫీసుల్లో శలవలెట్టుకోవాలి, టిక్కెట్లు బుక్కు చేసికోవాలి, డబ్బులకేముందిలెండి క్రెడిట్ కార్డులెలాగూ ఉన్నాయి, ఇదివరకటి రోజుల్లా కాదు కదా!ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఉండడానికి హొటళ్ళు బుక్ చేసికోవాలి, పిల్లల హోం వర్కేదైనా ఉంటే దాని సంగతి చూసుకోవాలి,ఇంత హడావిడి. ఇదంతా దేశంలో ఉండే చోట్లకి వెళ్ళాల్సొస్తే మాత్రం. ఇంక విదేశాలకెళ్ళాల్సొస్తే, అవేవో వీసాలూ అవీనూ. రాత్రికి రాత్రయ్యేవిషయాలు కావు.ఓ ఆర్నెల్ల ముందరనుంచీ ప్లాన్ చేసికుంటే కానీ సాధ్యపడదు.

    ఇదిగో ఇలాటప్పుడే వీళ్ళు చెప్పే కబుర్లు వినాలి.అసలు మేము flight లోనే వెళ్దామనుకున్నాము కానీ, చివరి నిముషంలో ట్రైనుకే సెటిలయిపోయామూ తో మొదలెడతారు. ఇదేమైనా అమలాపురం నుంచి అంబాజీపేట బస్సులో వెళ్ళొచ్చినట్టుదా? మన దేశంలో ట్రైన్లలో టిక్కెట్లు కావాలంటే, ఓ నాలుగు నెలలు ముందుగా చేసికున్నా వెయిటింగు లిస్టులే. పోనీ అదేదో “తత్కాల్” లో చేద్దామన్నా గొడవే.వీడికి flight లో వెళ్దామనుకున్నాడుట, దొరకలేదుట, మన irctc వాళ్ళు వీడికి నీరాంజనాలు పట్టి, ” అర్రే అలాగా, మా ట్రైన్లలో నీకు కావలిసినవేవో తీసేసికో..” అన్నారుట . వీళ్ళు చెప్పారూ, అవతలివాళ్ళు నమ్మేయాలి.
ఏదైనా emergency వస్తే అక్కడకి వెళ్ళాలి. అలాటప్పుడు జరిగాయంటే నమ్మొచ్చు. కానీ పెళ్ళాం పిల్లలతో హాలిడే కి వెళ్ళినప్పుడు ఇలాటివి జరుగుతాయంటే అంత నమ్మ శక్యం కాదు. మామూలుగా ఈరోజుల్లో పిల్లలు తల్లితండ్రులకి ఆఖరి నిముషంలో చెప్పేవిలాగే ఉంటాయి.ఆ చెప్పేదేదో వాళ్ళు ప్లాన్ చేసికున్నప్పుడే చెప్పేస్తే, వీళ్ళూ ఆ టైములో ఏదో ఓ ప్రోగ్రాం పెట్టుకుంటారు.అంతేకానీ, మమ్మల్ని కూడా తీసికెళ్ళండిరా అని అడిగే తల్లితండ్రులు బహు తక్కువ. ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే ! ఊళ్ళొనే ఉండే తల్లితండ్రులు FIRE ENGINES లాటివాళ్ళు. ఎప్పుడూ ఖాళీగానే ఉంటారు.ఆ FIRE ENGINES లాగానే ఏడాదంతా పనుండదు. కానీ అవసరం వస్తే మాత్రం వీళ్ళే దిక్కు. ఓ మాట వీరి చెవినేస్తే బావుంటుంది, అంతేకానీ చివరి నిముషంలో పెట్టుకున్నామూ, పిల్లలకి శలవలు కదా అనీ.. లాటి ఫాల్తూ కబుర్లు చెప్తేమాత్రం చిరాకేస్తుంది.

    అబ్బాయీ, కోడలూ పిల్లలతో సింగపూర్ వెళ్ళడానికి నిశ్చయించుకున్న రోజే చెప్పారు మాతో, వెళ్తున్నామూ అని.మాకిలాటి గొడవలు లేవు. మా కార్యక్రమాలేవో, మేము టిక్కెట్లు రిజర్వ్ చేసినరోజే చెప్పేస్తాము పిల్లలతో. వాళ్ళ ఎరేంజ్ మెంట్లేవో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకీ హాయీ, వీళ్ళకీ హాయీ. బయటికెళ్ళాసొస్తేనే కాదు, ఊళ్ళోనే ఉంటున్నా, మా ప్రోగ్రాములేవో, వాళ్ళకి చెప్తామూ, వాళ్ళ ప్రోగ్రాములేవో వాళ్ళూ చెప్తారు.సాయంత్రాలు ఓ గంటన్నర మాత్రం పిల్లలకోసం ఉంచుకుంటాము. ఏ క్రెచ్ లోంచో పిల్లల్ని తీసుకునిరావలసొచ్చినప్పుడు ఫ్రీగా ఉంటాను కదా అని,అదే టైములో అమ్మాయికేదైనా అవసరం వస్తే, మా ఇంటావిడ చూసుకుంటుంది. ఇదేమీ ఘనకార్యం అని కాదు, ఏదో ఊళ్ళోనే ఉంటున్నప్పుడు ఈమాత్రం చూసుకోవచ్చు.అప్పుడే పిల్లలతో సంబంధబాంధవ్యాలు బావుంటాయి.

    ఆ క్రికెట్ బోర్డువాళ్ళు చూడండి, మూడేళ్ళ కార్యక్రమాలు చెప్పేస్తూంటారు ముందుగానే, అలాగ మా ప్లాన్లు వేసికున్నప్పుడే వాళ్ళతో చెప్తాము. వాళ్ళూ అలాగే మాతో చెప్తూంటారు.ఊళ్ళోనే ఉంటున్నాము కాబట్టి, లేకపోతే గొడవే లేదూ. ఇదేదో one way traffic లాటిది కాదు, ఇద్దరికీ ఉండాలి. అప్పుడే జీవితం హాయిగా వెళ్ళిపోతుందని నా అభిప్రాయం.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఊరికే వచ్చినవాటికి విలువుండదు…..

    అందరికీ తెలిసినదే.. ఏదైనా ఊరికే అంటే ఏ ఖర్చూలేకుండా వస్తే దాని విలువ తెలియదు. పోనీ అలాగని అప్పనంగా దొరికేవి వదులుతామా అంటే అబ్బే అలా కుదరదు.ఈ అంతర్జాలం వాడుకలోకి వచ్చినప్పటినుంచీ, ఎడా పెడా వెదికేయడమే ఏ సైటులో freebies దొరుకుతాయో,దానికి సాయం కొన్ని బ్లాగులుకూడా కనిపిస్తూంటాయి అదేదో ఫలానా సైటుందీ, అందులో ఉత్తినే రిజిస్టరు చేసికుంటే అదేదో లోషనిస్తారూ, హెయిర్ ఆయిలిస్తారూ, ఇంకో క్రీమేదో ఇస్తారూ అంటూ.ఇంకోళ్ళకి చెప్పడం బాగానే ఉంటుంది, నేనూ ఒకటిరెండు సార్లు కక్కూర్తిపడ్డాననుకోండీ, అలాగే దీపావళి కీ, దసరాలకీ దుకాణాలవాళ్ళు ఏదో కొంటే ఇంకోటేదో ఉచితం అని, పొలోమని వెళ్ళిపోతూంటాము. ఆ కొట్టువాడికి అమ్మకం అవలేదూ ఓ వస్తువూ అని అనిపిస్తే, ఇంకోటేదో కొంటే దానితో అంటాకట్టేస్తూంటాడు. మనమేమో కొనేస్తూంటాము. చెప్పొచ్చేదేమిటంటే “వస్తువులు” అనేటప్పటికి ఎగరేసికుంటూ వెళ్ళిపోతాము. అదే ఓ సలహా అనో, జ్ఞానబోధో అనిమాత్రం అనండి, ఛస్తే దాని జోలికి మాత్రం వెళ్ళము.అదేమిటో మనకి సంబంధించింది కాదూ అనేసికుని, పాటిస్తేనే ఏదో పాపం అనుకుంటాము.

పోనీ ఆ సలహాలూ, జ్ఞానబోధలూ చేసేవాళ్ళు, మనకేమైనా శత్రువులా అంటే అదీ కాదూ, మన శ్రేయోభిలాషులే, అయినా సరే వీళ్ళు చెప్పేదేమిటీ, మనం వినేదేమిటీ అనే ఓ అభిప్రాయం.దీనితో ఏమైపోతుందీ అంటే, మనం అన్నేళ్ళనుండీ పాటిస్తున్న పధ్ధతులే మంచివీ సరైనవీ,ఆ అవతలివారు చెప్పేది ఏదో కాలక్షేపం కబుర్లూ అని ! ఉదాహరణకి మనకో అలవాటుందనుకోండి, చిన్నప్పుడు తల్లితండ్రులో, స్కూల్లో మాస్టారో పాపం ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ వయస్సులో మన బుర్రకెక్కదు. పెళ్ళైన తరువాత భార్యకూడా ప్రయత్నిస్తుంది, వీళ్ళంతా మన శత్రువులా, కానే కాదు. చిన్నప్పటి మాట వదిలేయండి, భార్య చెప్పినా కూడా, ” నాదారిన నన్నొదిలేద్దూ, నేను చేసేదాంట్లో నాకు సుఖం ఉందీ, దీనివలన నేనెమైనా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నానా ఎప్పుడైనా, నా సరదా నాదీ, ప్రాణహాని లేనంతకాలం ఫరవాలేదు లెద్దూ, నీకేం కావలిసినా క్షణంలో చేస్తున్నాను కదా..” అంటూ, తనుచేసేదానిలో, తనకే కనిపించే ఏదో ఒకటి చూపించేసి సమర్ధించేసికుంటాడు. పైగా ఇంగ్లీషొచ్చునుకదా అని దానికో ముద్దుపేరు-comfort level/zone అని కూడా పెట్టుకుంటాడు. ఎందుకొచ్చిన గొడవా, గట్టిగా ఏదైనా అంటే దేశాలట్టుకుపోయినా పోవచ్చూ, అసలే మొండి ఘటం కూడానూ అని ఆవిడా వదిలేస్తుంది !

ప్రస్తుత రోజులు చూడండి, ఇళ్ళల్లో పెద్దాళ్ళు, ఊరికే కూర్చోలేక, ప్రతీ దాంట్లోనూ సలహాలిచ్చేస్తూంటారు, అలా కాదూ, ఇలా కాదూ అంటూ. ఈ సలహాపంపిణీ కార్యక్రమం ధర్మమా అని, ఈ పెద్దాళ్ళంటే, కుర్రకారుకి ఎక్కళ్ళేని చిరాకులూనూ.రిటైరయిన తరువాత పనిలేక చేసే పనులూ అనే కానీ, ఓసారి వింటే ఏంపోయిందిలే అనిమాత్రం అనుకోరు.ఇంట్లో చిన్నపిల్లలుంటారు, వాళ్ళకా చెయ్యీ కాలూ ఊరుకోదు, పోనీ అలాగని ఏ activity లేదూ అంటే, అదో రోగం అనుకుంటారు, ఏ వయస్సులో ఆ అల్లరి చెయ్యాలి, కాదనరు ఎవరూ.ఇంట్లో పెద్దాళ్ళకేమో ఈ చిన్న పిల్లల అఘాయిత్యాలు చూసి గుండె బేజారెత్తిపోతూంటుంది, పోనీ అలాగని ఏదైనా అదిలించారా, ఆ చిన్నపిల్లల తల్లితండ్రులు వెంటనే react అవుతారు. వాళ్ళదారిన వాళ్ళని వదిలేయండీ, ఓసారి పడితేనే కదా తెలిసేదీ,అప్పుడెప్పుడో నెట్ లో కూడా చదివానూ, అలాగే వదిలేయాలిటా అని ఆ పెద్దాళ్ళకి ఓ క్లాసు పీకుతారు. దానితో ఈ పెద్దాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతారు,ఏం చెప్తే ఏం తప్పో అనుకుని. చిన్నపిల్లలకి ఫలానాది పెట్టకూడదని చెప్పకూడదు. వాళ్ళని అంతగా తిండికి మొహంవాచిపోయేటంతగా చేయాల్సిన అవసరం ఏముందీ ఇప్పుడూ, ఇద్దరం లక్షలులక్షలు సంపాదిస్తున్నాముగా, అని కొట్టిపారేస్తారు!

ఇలా ప్రతీవిషయంలోనూ ఎడ్డెం అంటే తెడ్డెం లాగే జరుగుతూంటుంది. చివరకి ఈ పెద్దాయన భార్య రంగంలోకి దిగి, “మీకెందుకండీ ఊరికే హైరాణ పడిపోతారూ, మీరుమాత్రం నామాటెప్పుడైనా విన్నారా..” అంటూ ఓ కసురు కసిరేసరికి నోరుమూసుక్కూర్చుంటాడు. అదన్నమాట అసలు విషయం- ఒకళ్ళు ఊరికే చెప్పింది ఇంకోళ్లకి నచ్చదూ.. అంటే నచ్చదూ.. Thats the bottom line.

అసలు ఈ సోదంతా ఎందుకూ అంటే, చెప్పానుగా ఆమధ్య పిల్లలు, నన్ను ఓ అర్హోపెడీషియన్ దగ్గరకు తీసికెళ్తే ఆ మోకాలి చిప్పకి అదేదో ఆపరేషను చేయాలీ అనగానే, మేము ఇంకో డాక్టరు దగ్గరకి వెళ్ళడమూ వగైరా..వగైరా, ఆ సందర్భంలో అన్నమాట ఈ టపా. చెప్పేనుగా, ఆయన ఏవేవో మందులువ్రాసి, ఓ పదిరోజులు తరువాత కనిపించమన్నారు. ఆఅగే అనుకుని వెళ్ళాము. ఆయనేమో simple గా ఓ అరడజను exercise లు చెప్పారు. ఓ పదేళ్ళదాకా ఢోకా( కాలికి) లేదని ఢంకా బజాయించి మరీ చెప్పారు. పోనీ ఆయనచెప్పినవేమైనా కొత్తవా అంటే, అదీకాదు,పోనీ వాటికి ఏమైనా అదనపు ఖర్చా అంటే అదీ లేదూ, పోనీ వాటికోసం కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా అంటే అదీ లేదూ, పెళ్ళైన అయిదేళ్ళనుంచీ, మా ఇంటావిడ నెత్తీ నోరూ మొత్తుకుని చెప్తున్నవే. పాతికేళ్ళనుంచీ, మాడాక్టరు స్నేహితుడు చెప్తున్నవే. సులభమైన భాషలో చెప్పాలంటే, నా body posture లో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోమన్నారు. As simple as that— మొదలెట్టానూ, మార్పు కనిపిస్తోంది. ఈ తెలివితేటలేవో ముందరే ఉంటే, ఇంత గొడవయ్యేదీ కాదూ, Xray లకీ, మందులకీ, డాక్టర్ల ఫీజులకీ ఇంత ఖర్చూ అయ్యెది కాదు. అబ్బాయే పెట్టుకున్నా ఖర్చు ఖర్చే కదా!అరవైఅయిదేళ్ళనుండీ ఉన్న మోకాలి నొప్పి రాత్రికి రాత్రే తగ్గిపోయిందని కాదు కానీ, తగ్గే మార్గం లో మాత్రం పడింది. I can feel it !

పోనీ ఇంతజరిగాకైనా, మన తప్పు ఒప్పుకుంటామా అంటే అదీ లెదూ, ” పొనిద్దూ రాసిపెట్టుందీ, ఖర్చయిందీ..” అని ఓ దిక్కుమాలిన వేదాంతమోటీ ! ప్రతీదానికీ వేదాంతమోటి చెప్పేసి, అవతలివాళ్ళ నోరుమూసేయడం. ఇందులో మాత్రం రెడియే.చూడండి, బ్రహ్మశ్రీ చాగంటి వారు తన ప్రవచనాల్లో ఏం చెప్తున్నారూ, భగవంతుడి దయ ప్రాప్తించాలంటే ఏవిటేవిటో పూజలు చేయఖ్ఖర్లేదూ, ఓ బిళ్వపత్రమో, ఓ తులసాకో భక్తితో ఆ దేవుడికి సమర్పిస్తే చాలూ. ఖాళీ ఉన్నప్పుడల్లా శ్రీరామ శ్రీరామ అనుకోమంటున్నారు. వీటికేమైనా డబ్బులు ఖర్చుపెట్టాలా ఏమిటీ? పోనీ ఆయన చేసే ప్రవచనాలకి టిక్కెట్టేమైనా కొన్నామా అంటే అదీ లేదూ. ఉచితంగా ఆయనచెప్పే ప్రవచనాలు- వింటున్నంతసేపూ బాగానే వింటాము, ఇదిగో రేపణ్ణించీ మొదలెట్టేయాలీ అనేసికుని, మర్నాటినుంచీ మళ్ళీ మామూలే, చిన్నపిల్లల దగ్గరనుంచీ నోట్లో “శ్రీరామ” మాట దేవుడెరుగు, వినిపించేవి ఏమిటీ– ” షీలాకీ జవానీలూ”, “నా వయసింకా పదహారేలూ..” నూ.

అవతలివారు చెప్పేవి రైటూ అని తెలుసు, కానీ వాటిని ఆచరించేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతుంది! ఏది చెప్పండి, ” ఇప్పణ్ణుంచీ ఎందుకులెండి, ఇంకా టైముందిగా..” అనేవారే. అలాగనుకునే ఇంతదాకా తెచ్చుకున్నాను, ఇప్పటికి జ్ఞానోదయం లాటిది కలిగింది, Though late than never...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Oh… Mr.Cool…

    ఈ టపాకి నేను పెట్టిన శీర్షిక, ఎవరినిగురించో తెలిసికోడానికి ఏమీ పేద్ద తెలివితేటలు అవసరం లేదు ! “తనదాకా వచ్చేదాకా…” అన్న మన తెలుగు సామెత ఎంత అనుభవంతో ప్రాచుర్యం లోకి వచ్చిందో అర్ధం అవుతోంది.అసలు మనవాళ్ళలో ఉండే జాడ్యం ఏమిటంటే, ఏ రంగంలోనైనా సరే, ఎవరిదారిన వారిని పనిచేయనీయరు, ఏదో ఒకరకమైన బయటి ఒత్తిళ్ళు తేవడంలో experts.

    పోనీ అలాగని వదిలేశారా, నెత్తికెక్కేస్తారు.ఏమైనా అంటే ఓ తప్పూ, అనకపోతే ఇంకో తప్పూ. అసలు ఈ మీడియాని అనాలి, ఎవడో ఎక్కడో ఏదో నెగ్గేశాడని, వాడికి అభిషేకాలు చేసేసి, ఆహా..ఓహో.. అనేసి మునగచెట్టెక్కించేస్తారు. కిందకు దింపేయడంలోనూ వాళ్ళే అనుకోండి. అదేదో T20 World Cup మొదటిది, నెగ్గేశాడని,ధోనీని ఆకాశంలోకి ఎత్తేశారు.అదృష్టం బావుండి, ఆ రోజుల్లోనే మన టెస్ట్ తీం కూడా నెంబర్ 1 కి వెళ్ళింది.అదేమీ ధోనీ గొప్ప కాదు నిజంచెప్పాలంటే, అంతకుముందు కొన్ని సంవత్సరాలనుండీ వివిధ కెప్టెన్ల ఆధ్వర్యంలోనూ, నెగ్గిన కారణం చేతనూ,వీళ్ళు ఆ గెలుపులవల్ల వచ్చిన పాయింట్ల దృష్ట్యా, దానికి సాయం మిగతా ప్రపంచ జట్ల performance ధర్మమా అని, మనవాళ్ళు నెంబర్ 1 కి వెళ్ళగలిగారు. ఆ టైములో ధోనీ కెప్టెన్ గా ఉండడం just coincidence ! అంతే కానీ, ఇతనేదో పొడిచేసేడని కాదు.

    క్రికెట్ అనేది బ్రష్టు పట్టిపోయిందని, T20 మొదలెట్టినప్పుడే తెలిసింది.అదంతా ఓ “తమాషా” గా తయారయింది. వీటికి సాయం అదేదో IPL అని ఒకటి మొదలెట్టారు. పైగా వీటిల్లో ఆటగాళ్ళ వేలాలోటీ ! అప్పుడే కొందరన్నారు, డబ్బులకోసం వళ్ళమ్ముకునే వాళ్ళకీ, ఈ ఆటగాళ్ళకీ ఏమీ తేడా లేదని.చాలామందికి కోపాలొచ్చాయి. ఏది ఏమైతేనేం, అతనెవరో మోడీ ని అంతటివాడు లేడూ, ఇంతటివాడు లేడూ అనేసి, ఆకాశానికి ఎత్తేసి ఏమిటేమిటో చేసేశారు.చివరకి ఏవో కేసులన్నారు, డబ్బులు తినేశాడన్నారు, ఇంకా ఇప్పటికీ ఇంటి మొహమైనా చూడకుండా, అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడు,దేశానికి తిరిగొస్తే ఎక్కడ జైల్లో పెడతారో అనే భయంతో. దావూద్ ఇబ్రహీంకీ ఇతనికీ పెద్ద తేడా లేదు. ఒకడు దేశంలో విద్రోహ కార్యక్రమాలు చేశాడు, ఇంకోడేమో శుభ్రంగా ఉన్న క్రికెట్ ని తగలేశాడు.కానీ మోడీ చేసిందేమిటంటే అందరికీ “డబ్బు” రుచి ఏమిటో తెలిసొచ్చేలా చేశాడు. అందరూ రుచి మరిగారు, ఎక్కడ ఎవడు డబ్బులెక్కువిస్తే అక్కడకి వెళ్ళిపోవడం. పైగా ఏమైనా అంటే, వీళ్ళు professionalసూ, డబ్బులకోసమే ఆడతారూ అన్నారు.మరి వీళ్ళకీ మెర్సినరీలకీ కీ తేడా ఏమిటిట? వీళ్ళూ డబ్బులిస్తే, ఎవణ్ణి చంపమంటే వాణ్ణి చంపేసొస్తారు. Bottom line డబ్బు.. డబ్బు.. డబ్బు..దేశం, ప్రతిష్టా ఎక్కడకి పోతే ఎవడిక్కావాలి?

    పైగా Test Matches ఎప్పుడైనా ఆడవలసొస్తే ” అలిసి” పోయేవారుట! IPL లో ఆడడానికి మాత్రం ICU నుంచికూడా పరిగెత్తికెళ్ళేవారు.అప్పుడు ఈ “అలుపులూ” fatigue లూ కనిపించేవి కావు!అలాటప్పుడు క్రికెట్ లో ఉండే వివిధ formats కీ తలో కెప్టెన్ నీ పెడితే ఏం పోయిందిట, మిగిలిన దేశాల్లో లాగ? అబ్బే మనదేశం లో Once Captain.. always captain.. ఇంకో format లో ఇంకోడి కింద ఆడ్డానికి నామోషీ ! పైగా జాతీయ టీం కెప్టెనాయె !

   మొత్తానికి ఈ రోజంతా మొహిందర్ అమర్ నాథ్ “బయటపెట్టిన” గుట్టుగురించే. ఈమధ్యలో మన కెప్టెన్ గారు, గంభీర్ సరీగ్గా ఆడడంలేదూ, నామాటే వినడంలేదూ అని ఓ complaint ఇచ్చాడుట! అక్కడికి తనేదో ఉధ్ధరించేస్తున్నట్టు! ఈవేళ జరిగిన చర్చల్లో తేలిందేమిటంటే, ఆ శ్రీనివాసన్ బోర్డు అద్యక్ష హోదాలోట అసలు ాఅ ధోనీ మంగళసూత్రాలు కాపాడాట్ట.

    ఈ గొడవలు మన క్రికెట్ లో ఏమైనా కొత్తా ఏమిటీ? అప్పుడెప్పుడో పాలీ ఉమ్రీగర్ రాజీనామా చేశాడని, మళ్ళీ ఇవ్వలేదు. పటౌడీని, మర్చెంటు గారు సీనియర్ పటౌడీతో తనకున్న తగాదావలన, జూనియర్ నవాబ్ ని తీసేశాడు. సచిన్ అయితే, అసలు నాకు కెప్టేన్సీయే వద్దన్నాడు. గంగూలీ ని అల్లరిపెట్టేసి పంపించేశారు.మన అజ్జూ మియ్యా అదేదో కక్కూర్తి పడ్డాడన్నారు.

    ఆతావేతా తేలేదేమిటంటే, మన దేశంలో రాజకీయనాయకులూ, పారిశ్రామికవేత్తలూ ఈ ఆటలని వదలనంతకాలం, మనకి ఈ గొడవలు తప్పవు. ఎక్కడైనా ఏ ఆటగాడైనా, అంపైర్ వైపు వేలెత్తి మాట్టాడితే action తీసికుంటారు. అలాటిది, మన ధోనీ గారు, అదేదో మ్యాచ్ లో పాకిస్తాన్ అంపైర్ ని వేలెత్తి చూపిస్తున్నా, ఆ ICC వాళ్ళకి ఏమీ అనే ధైర్యం కూడాలేదు.

    ఒక క్రికెట్టనే ఏమిటీ, ప్రతీదాంట్లోనూ రాజకీయాలు అలాగే తగలడ్డాయి. ఇంకోటిలెండి- ఏ ఆటలోనైనా నెగ్గుతూ ఉంటే, అదేదో Team Spirit అని ప్రతీవాడూ ఆకాశానికి ఎత్తేస్తాడు. కానీ ఓడిపోయినప్పుడే కదా అసలు సిసలు చిట్టాలు బయటపడేది?

%d bloggers like this: