బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు-Comfort Zone

    ఈ మధ్యన ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ వా వ్రాసిన Out of my Comfort Zone చదువుతున్నాను. అసలు ఈ Comfort Zone అంటే ఏమిటీ అని ఆలోచించాను. ఒక్కొకళ్ళకి ఒకో రకమైన కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఒకడికి నచ్చింది ఇంకోడికి సిల్లీ గా కన్పించొచ్చు. మనం అనుకుంటామూ అవతలివాడికి ప్రపంచంలో ఉన్న అన్ని లక్షరీలు ( మన ఉద్దేస్యంలో) ఇచ్చినా అస్తమానూ ఎందుకు ఏడుస్తూంటాడూ అని ఓ సందేహం కలుగుతుంది.

మన ఇంట్లో ఎవేవో పిండివంటలు చేసేసి వచ్చిన వారికి పెట్టామనుకోండి–లాభం ఏమిటీ ఆయనకు ఏ డయాబీటిసో ఇంకోటో ఉండి తినలేకపోవచ్చు.ఆయనకు కాకరకాయో ఏదో తినాలనిపించవచ్చు.తిండి వ్యవహారాలే కాదు, ప్రతీ వారికీ అన్నింట్లోనూ వారి వారి Comfort Zone ఉంటుంది. అది గుర్తించి వారి జీవితాన్ని వారికి నచ్చేవిధంగా చేస్తే అందరికీ మంచిది.

నా చిన్నప్పుడు చూసేవాడిని మా పెద్దన్నయ్యగారు కలం ఇంక్ బాటిల్ లో ముంచి వ్రాసేవారు. హాయిగా పెన్ను పెట్టుకోవచ్చుగా అనుకునేవాడిని. ఇప్పటికీ చాలా మంది ఇంక్ పెన్ను తోనే వ్రాస్తారు. బాల్ పెన్ ఛస్తే ఉపయోగించరు. అలాగని వారిని పాతకాలంవారనలేముగా. నాకు స్కెచ్ పెన్ తో వ్రాస్తేనే బాగుంటుంది. అదో పైత్యం ! స్కెచ్ పెన్నుతో ఎడంచేత్తో కూడా వ్రాయగలను.
కొంతమందికి రేడియో పెద్దగా పెట్టుకుని వినాలని ఉంటుంది. అది అవతలవాడికి చిరాకుగా ఉంటుంది. మనకి కావలిసిన ట్.వి. చానెల్ పెట్టుకుని చూసిన సినిమాయే ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. అదో అలౌకికానందం. వచ్చిన గొడవేమిటంటే మనతో ఉన్నవాళ్ళకి ఇది బోరింగ్ గా అనిపిస్తుంది.అందరూ కలసి ఉండేటట్లైతే ఇంట్లో వయస్సులో ఉన్న పెద్దవారే కాంప్రమైజ్ అవాలి. లేకపోతే అందరిచేతా చివాట్లు.చివాట్లంటే డైరెక్ట్ గా ఏమీ అనరు-వారి వారి ప్రొటెస్ట్ ఇంకో విధంగా చూపిస్తారు.” సమఝ్నేవాలేకో ఇషారా కాఫీ హైనా “. మనం సీన్ నుంచి తప్పుకుంటే అందరికీ హాయి. ఎవరూ బయట పడఖర్లేదు.

ఒక్కొక్కప్పుడనిపిస్తుంది జీవితం అంతా కాంప్రమైజ్ గానే బ్రతకాలా అని. అదో పాసింగ్ వేవ్. మళ్ళీ మామూలే.ఇవన్నీ నేను అనుభవిస్తున్నవనుకోకండి–ఇది మామూలుగా మధ్య తరగతి ఇళ్ళల్లో జరిగేవి. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, పిల్లలూ, చదువులూ వీటన్నింటితోనూ కాంప్రమైజ్, అంతకుముందు ఇంట్లో మనకి స్వాతంత్రం లేక కాంప్రమైజ్, చివరకు వచ్చేసరికి మనవలూ, మనవరాళ్ళతో కాంప్రమైజ్. ఈ పెద్దవాళ్ళేదో టి.వి. చానెల్ చూడాలనుకున్నారనుకోండి ఇంతలో చిన్నవాళ్ళు వచ్చేసి చేతిలో రిమోట్ లాగేసికొని కార్టూనో, పోగో వో పెట్టుకుంటారు.అది వారి
కంఫర్ట్ జోన్, వాళ్ళనీ ఏమీ అనలేము. పొద్దుటినుండి స్కూల్లో ఉండి వస్తారు వారి సరదాకుడా తీర్చుకోవాలిగా!

కొంతమంది తల్లితండ్రుల్ని కష్ట పెట్టకూడదని సదుద్దేస్యం తో ఇంట్లో ఒక వంట మనిషిని పెడతారు. ఆవిడేమో బ్రెక్ఫాస్టూ, లంచీ, డిన్నరూ తయారుచేస్తుంది.పిల్లలనుకుంటారు మన తల్లితండ్రులకి ఏదో కంఫర్ట్ ఇచ్చేసేమనుకుంటారు.అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రతీ రోజూ చేసే మసాళా కూరలు హరాయించుకొనే శక్తి ఉండదుగా నాయనా.ఏ వయస్సుకి ఆ తిండి ఉంటేనే బాగుంటుంది.అందుకనే ఎప్పుడైనా ఆ వంటావిడ రానప్పుడు పోనీ ఇంట్లో చేసేసుకుని తిందామా అనుకుంటే పిల్లలు హోటల్ కి వెళ్దామంటారు.మళ్ళీ మామూలే. వచ్చిన ఒక్క అవకాశం కూడా హాంఫట్.

ఇంక బట్టల విషయానికొస్తే హాయిగా లుంగీ వేసికొని ఉండాలనిపిస్తుంది. కానీ ఇంకోరి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళేటప్పడికి పైజమాల్లోకి, మారాలి. మన పాతలుంగీలన్నీ అలికే గుడ్డల్లానో, లేక మన అదృష్టం బాగుంటే ఇంట్లో వచ్చే మనవడికో, మనవరాలికో బొంతల రూపంలోకో మారిపోతాయి.పైగా మన ఆడవాళ్ళు మనచేత ఇంకా మెత్తటి కాటన్ బట్టలు కొనిపిస్తారు-అది మనమీద ప్రేమతో కాదు, ఆవచ్చే వాళ్ళకి లంగోటాల కోసమో, అస్తమానూ మార్చే పక్క బట్టలకోసమో. ఇదో కాంప్రమైజూ.

కొంతమందుంటారు మన ఊళ్ళనుండి చుట్టపు చూపుగా వచ్చేవాళ్ళు, అందులో మగవారికి అవసరమైనప్పుడు రోడ్డుపక్కనే ” పని” కానిచ్చేయడం ఓ అలవాటు. ఇక్కడ సిటీ లలో అలా చేయనీయంలేముగా. ఇంట్లోనే, లెకపోతే రోడ్సైడున్న టాయిలెట్ల లోకే వెళ్ళమంటాము. అదో బాధ ఆయనకి అక్కడ ఉన్నన్నిరోజులూ. మనం ఇక్కడ ఎన్ని సౌకర్యాలిచ్చినా లాభంలేదు ఊరు తిరిగి వెళ్ళిన తరువాత అందరితోనూ చెప్తాడు--సిటీల్లో ఏముందీ, వెధవది బయటకు వెళ్ళనీయరూ, ఇక్కడే హాయిగా ఉందీ-– అని. అంటే ఆయన కంఫర్ట్ జోన్ ఏమిటో తెలిసిందా?

ఇలా వ్రాసుకుంటూ పోతే ఎన్నెన్నో వ్రాయవచ్చు. నేను చెప్పేదేమిటంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే వారి వారి కంఫర్ట్ జోన్లు తెలిసికోండి. వాళ్ళకేమీ మణులూ, మాణిక్యాలూ అఖర్లేదు.బుల్లి బుల్లి కోరికలుంటాయి. ఏదో రెండురోజులకోసారైనా హాయ్ అనడం, వాళ్ళకి కావల్సినవి ఇంట్లో పెట్టడమూ, మీరు తెచ్చే న్యూడుల్సూ, పాస్తాలూ వాళ్ళకి జీర్ణం అవవు బాబూ.
ఊరికే చప్పలించుకోవడానికి పిప్పరమెంట్లూ, నిమ్మతొనలూ లాంటివి. అందులోకి మనవలూ, మనవరాళ్ళూ వాటాకి వస్తే ఆ పెద్దవాళ్ళ హృదయాలు ఎంత ఉప్పొంగిపోతాయో! ఇంట్లో పటికబెల్లం పెట్టి ఉంచండి. ఎవరైనా వాళ్ళని చూడ్డానికి వస్తే వాళ్ళ చేతిలో పెట్టడానికి.

వాళ్ళ దారిని వాళ్ళని బతకనీయండి, మీరు కార్లలో ఎన్నిసార్లు తీసికెళ్ళేరూ అనికాదు, ఎన్నిసార్లు ఫైవ్ స్టార్ హొటల్కి తీసికెళ్ళారూ అనికాదు, వారి చిన్న చిన్న కోరికలు గుర్తించి, వారి జీవితమూ, మీజీవితమూ శుఖమయం చేసికోండి. They deserve it.

%d bloggers like this: