బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– feel good..

మనసుకి ఆహ్లాదకరంగా ఏదైనా జరిగినప్పుడు   feel good  అంటారుట. సరీగ్గా మాకు ఇవేళ అలాగే ఉంది. ఈమధ్యన పుణె లోని దగుడూ సేఠ్ గణపతి, చతుశృంగీ మాత  గుడీ చూసొచ్చాము. పెద్దాయన దర్శనం చేసుకోపోతే మళ్ళీ ఆయనకి కోపంవస్తుందేమో అని, ఆయన దర్శనం కూడా చేసొచ్చాము. పుణే పాషాన్ లో శ్రీ సోమేశ్వరవాడి అని ఓ ప్రాంతం ఉంది. అక్కడ ఓ పురాతన శివమందిరం ఒకటుంది. శివాజీ మహరాజ్ తల్లి జిజియామాత ఈ దేవాలయానికి చాలా సేవలు చేశారట్.

s1

ఆ ప్రశాంత వాతావరణంలో ఓ గంట గడిపి, పక్కనే, మహారాష్ట్ర ప్రభుత్వ గ్రామీణా శాఖ వారు నిర్మించిన ఒక అద్భుత  Enclosure  లోకి మనిషికి 50/- టికెట్ తీసికుని లోపలకి ప్రవేశించాము. ఇదివరకటిరోజుల్లో పెద్ద పెద్ద వృక్షాలతో నిండిన ప్రాంతమది. కొత్తగా చెట్లూ పుట్టలూ పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు తయారు చేసిన  శిల్పాలకి ముందర ఓ ఫెన్సింగ్ వేసి, లాన్ తయారుచేసేశారు. మన గ్రామీణ వాతావరణంలో ఎలాటి దృశ్యాలు కనిపిస్తాయో, అంటే వీక్లీ మార్కెట్, వీధరుగుమీద ఓ టైలరూ, పశువుల పాకా, గానుగా, ఇలా కనిపించే ప్రతీదానికీ ఓ శిల్పరూపం చేసి ప్రాణం పోశారు ఆ శిల్పాలకి. ఏదో ఫెన్సింగుంది కాబట్టికానీ, లేకపోతే ఓసారి తడిమిచూసేటంత  tempting  గా ఉన్నాయి.  మాట ఒకటీ తక్కువంతే.. హావభావాలు ఎంత చక్కగా చూపించారో. ఇదివరకు హైదరాబాదులో శిల్పారామం చూశాము కానీ, అక్కడి శిల్పాల్లో ఇంత జీవకళ ఉట్టిపడ్డట్టు కనిపించలేదు.. పైగా ఆకాశాన్నంటే చెట్లూ, నిజంగా ఏదో మారుమూల గ్రామానికి వెళ్ళొచ్చినట్టే అనిపించింది.

img20170222105031img_20170222_105648img20170222104204img_20170222_104525img_20170222_103433

 ఇదంతా OLA  వారి సగంరేటు సౌజన్య్ సే… ఈసారి మీరెప్పుడైనా పుణే వస్తేమాత్రం   దర్శనీయస్థలాల్లో  ఇది మాత్రం తప్పకుండా పెట్టండి.  You would love it.. its awesome…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” సౌజన్య్ సే..”

 ఈరోజుల్లో ఎక్కడ చూసినా  commercial ads  తో హోరెత్తించేస్తున్నారు. టీవీ ల్లో కూడా ప్రత్యేక చానెళ్ళు ప్రారంభించేశారు… అయినా సరే, వార్తలు, సినిమాలూ, చివరకి ప్రవచనాల కార్యక్రమాల్లో కూడా, ఈ వ్యాపార ప్రకటనల దాడి లేకుండా చూడలేము. ఒకానొకప్పుడు ఈ వ్యాపార ప్రకటనలకి కొన్ని  ethics  అనండి, లేదా restrictions  అనేవి ఉండేవి. ఉదాహరణకి .. ఓ కార్యక్రమాన్ని ఏదో ఫలానా కంపెనీ sponsor  చేస్తున్నప్పుడు, అలాటి products  గురించి మరోcompetitive కంపెనీ వారి ప్రకటనలుండేవి కావు. కానీ ఇప్పుడంతా దానికి విరుధ్ధం.. ఒకే రకమైన  product  గురించి, నాలుగైదు కంపెనీల ప్రకటనలు గుప్పించేస్తున్నారు. అది ఓ కాలినెప్పి మందనండి, లేక ఏ పూజాద్రవ్యాల సామగ్రనండి, చివరాఖరికి బియ్యం, మినప్పప్పనండి,  ప్రతీదానికీ, రెండు మూడు  వివిధ కంపెనీల ప్రకటనలు. అలాగే  Real Estate, Detergents, Health Drinks  దేన్నీ వదలకుండా, ఒకే చానెల్ లో అంతా గందరగోళం చేసేస్తున్నారు. మధ్యలో  ఎవడో వచ్చి ఫలానా చెప్పులంటాడు.. చూసేవాళ్ళని  confuse  చేసేస్తున్నారు… ఏ కంపెనీ  product  వాడాలో తెలియక… అరగంట కార్యక్రమంలోనూ 10 నిముషాలు వీళ్ళే తినేస్తున్నారు. పోనీ ఒక్కసారి చూపించి వదులుతారా అంటే అబ్బే, కనీసం 3 సార్లు భరించాలి… ఒప్పుకుంటాం.. ఈ ప్రకటనలే టీవీ చానెళ్ళకి జీవనాధారం.. కానీ మరీ ఇంతలా  bombard  చేసేయాలా?

ఇవికాకుండా రోడ్లపక్కనుండే   భూతాల్లాటి  Hoardings..  పోనీ అవేమైనా శుభ్హ్రంగా ఉంటాయా అంటే అదీలేదూ, ఏ అమ్మాయిదో సగంసగం బట్టలతో.. ఆ హోర్డింగ్ చూస్తూ ఏ కారో స్కూటరో నడుపుతూ.  accidents  చేయడం. ఆమధ్యన సుప్రీం కోర్టు వాటి ఎత్తూ, ఒడ్డూ, పొడుగూ లమీద ఏవో కొన్ని restrictions  పెట్టారు కాబట్టి బతికిపోయాము..

ఇవి ఇలాఉండగా, కార్యక్రమాలు  sponsor  చేయడంకూడా వదలడంలేదు.. బిడ్డ బారసాలతో మొదలెట్టి, ఏ ప్రముఖుడిదో అంతిమయాత్రదాకా, ఎక్కడ చూసినా ప్రకటనలే… ఒక భాషలో తీసేయడమూ, ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగు చేసి మనల్ని హింసించడమూనూ.. ఇవేళ అదేదో ad  -HIV  గురించి చూస్తూంటే నవ్వొచ్చింది. గర్భవతి ముందర    పుట్టబోయే బిడ్డకి  dress  తో ప్రారంభించి, పళ్ళ దుకాణానికి వెళ్ళి, ముందర  apples  అడిగి, తరవాత  Oranges  చేతిలో పట్టుకుని,  baby  కి  oranges  ఇష్టం అంటుంది..OK fine..  వెంటనే  … ” అందుకే హాస్పిటల్ కి వెళ్ళి  HIV Test  కూడా చేయించుకోవాలి..” అంటే దానర్ధం–  oranges  ఇష్టం కాబట్టి  HIV Tests  చేయించుకోవాలనా… నా మట్టి బుర్రకి అర్ధం అవలేదు.. 

ఈ సౌజన్య్ సే అంటే, మనవైపు టాక్సీలకీ, ఆటోలకీ వెనక్కాల రాస్తూంటారు పెద్దపెద్ద అక్షరాలతో  ” ఫలానా బ్యాంకు వారి సౌజన్యం ” తో అని. అంటే అప్పుతీర్చే సదుద్దేశం లేదన్నమాటే కదా. ఆ బ్యాంకువాడేమైనా అప్పనంగా ఇచ్చాడా ఏమిటీ, ముక్కుపిండి వడ్డీతో సహా తీసికుంటాడు. ఈమాత్రం దానికి  ఈ ” సౌజన్యాలూ, సింగినాదాలూ” ఎందుకంట?

అలాగే అత్యోత్సాహానికి వెళ్ళి, ఎవడో తలమాసినవాడు, తన పిల్లకో, పిల్లాడికో బారసాల,  పోనీ ఖర్చులైనా కలిసొస్తాయని. ఏ కంపెనీ వాడో  sponsor చేస్తే, తాటికాయలంత అక్షరాలతో   banners  పెట్టుకుంటాడు.. ఫలానా పాప/ బాబు..ఫలానా కంపెనీవారి  సౌజన్య్ సే .. అని. అంటే పాపం కష్టపడి కన్న ఆ తండ్రిని  doubt  చేసినట్టు కాదూ?….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- అర్ధం పర్ధం లేని రూల్స్..

మనదేశంలో మనం ఎలాటి చట్టాలైనా చేయొచ్చు.. కానీ ఇతర దేశాల్లో . మనల్ని ఇరుకునపెట్టే చట్టాలేమైనా  చేస్తే.మాత్రం. కొంపలెక్కేసి. మనవారందరికీ అన్యాయం జరిగిపోతోందని ఘోషించొచ్చు..

మిగిలిన రాష్ట్రాలసంగతి నాకైతే తెలియదూ, కానీ ఇక్కడ మహారాష్ట్రలో , మన పిల్లలెవరికైనా ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజీల్లో  ఎడ్మిషన్ తీసికోవాలంటే , అదేదో  domicile certificate  అనివార్యం. 40 సంవత్సరాలకి పైగా ఉండి, వీళ్ళకి పన్నులు కడుతున్నాసరే,  ఈ సర్టిఫికెట్ మాత్రం తప్పదంటే తప్పదు, చేసిన పాపం ఏమిటంటే మనం ఇంకో రాష్ట్రానికి చెందిన వాళ్ళం. సరేనండీ, లోకల్ candidates  కి అన్యాయం జరక్కూడదని ఈ రూలు పెట్టారే అనుకుందాం. ఏవో తిప్పలు పడి, మన అస్థిత్వ ఋజువులు చూపించి ఆ సర్టిఫికేట్ ఏదో సంపాదిస్తాము, అక్కడితో గొడవ అయిపోదు. మళ్ళీ ఈ సర్టిఫికేట్ చూపించి, అదేదో మనం భారతీయులమే (  Nationality Certificate )  అనికూడా ఋజువు చేసుకోవాలిట. 1992 లో మా అమ్మాయి విషయంలో ఈ తిప్పలన్నీ పడ్డాను.  History Repeats  అన్నట్టు, ఇప్పుడు తను, మా మనవరాలికోసం పడుతోంది… ఇలా ఉంటాయి మనదేశంలోనే పుట్టి పెరిగినా సరే మన జాతీయత ఋజువుచేసికోవాల్సిన పరిస్థితి. నా విషయంలో అయితే, ఇంకా చిరాకైపోయింది– రక్షణ శాఖలో 42 ఏళ్ళు పనిచేసినా , అవన్నీ పనికిరావుట.

ఈమాత్రందానికి, అమెరికాలో , తమవాళ్ళకే ఉద్యోగాలు రావాలని, అవేవో H1 Visa మీద restrictions  పెడితే అంతలా ఏడవడం ఎందుకో అర్ధం అవదు.ఈ లోకలూ, నాన్ లోకలూ concept  తగ్గేదాకా ఇలాటివి తప్పవు.దీన్నే గురివిందగింజ  తత్వం అంటారు.ఎక్కడలేదూ ఇలాటి పోలరైజేషనూ? ఎక్కడ చూసినా ఫలానా కులాల హాస్టల్ అనీ, ఫలానా వారి హొటల్ అనీ బోర్డులు చూస్తూంటాము.. పెళ్ళిళ్ళల్లో చూడండి, గ్రూపులు గ్రూపులుగా ఓ బల్ల చుట్టూ చేరతారు, ఒకే కుటుంబంవాళ్ళు. బయటివాళ్ళతో ఛస్తే కలవరు… అధవా కలిసినా, ఏదో వంకపెట్టి, తిరిగి స్వంత గూటిలోకి చేరిపోతారు. 

మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి కూడా ఎవరైనా తెలియచేయండి..చట్టాలుండాలి కాదని కాదు, కానీ ప్రజలకి సౌకర్యంగా ఉండాలి. డోమిసైల్ అయినతరవాత,  నేషనాలిటీ కూడా కావాలనడం  its a big joke.. 

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ” గగనానికీ..ఇలకూ బహుదూరంబని… “

 ఆ త్యాగరాజస్వామి, ఆభేరి రాగంలో నగుమోమూ..గనలేని కీర్తనలో అన్నది, ఆ దేవుడూ, తన గురించీ అన్నదనుకుంటాను. కానీ ఆ వాక్యాలు మాత్రం మన జీవితాల్లో సరీగ్గా సరిపోతాయి.. ఎన్నో సందర్భాల్లో అన్వయించుకోవచ్చు…

ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని చదివించేటప్పుడు.. వాళ్ళేదో గొప్పగొప్ప డాక్టరూ, ఇంజనీర్లూ గా తయారవుతారని ఆశించిన తల్లితండ్రులు, చివరకి ఆ పిల్లలు ఇంజనీరింగు బదులు, ఏ డిప్లొమాలోనో చేరి ఏ ఓవర్సీరు గానో,  ఎంబిబిఎస్ బదులుగా , ఏ RMP  డాక్టరుగానో సెటిలయినప్పుడు కలిగే ఓ ఫీలింగు…అయినా వాళ్ళందరినీ ఇంజనీర్లూ, డాక్టర్లూ అని పిలవడం మానేస్తామా? ఎవరిమనోభావాలూ కించపరిచానని మాత్రం భావించకండి. ఉన్నదేదో రాశాను.

మిగిలిన విషయాల్లోకి వస్తే… పూర్వపు రోజుల్లో మన ఆర్ధిక స్థోమతను బట్టి సంసారం లాగించేవారు. కానీ కాలక్రమేణా , ఆర్జనా పెరిగిందీ, దానికి సాయం బ్యాంకుల వాళ్ళు ఇచ్చే ఋణాల అవకాశమూ పెరిగింది. ప్రతీదానికీ అప్పు ఇవ్వడానికి రెడీ. ఓ సంతకం పెట్టేస్తే వారంరోజుల్లో చెక్ వచ్చేస్తుంది. ఇంక పెద్ద పెద్ద వస్తువులు కొనడానికైతే  Instant Finance  ఎల్లవేళలా  రెడీ..  ఆ వస్తువేదో కొనేముందర, ఓసారి భార్యాభర్తా నోటిలెక్కలేసేసికుంటారు, మనం  EMI  కట్టగలమా లేదా అని.. పైగా  ఆటైములో అంతా హరాభరాగానే కనిపిస్తుంది. పైగా ఎప్పుడో చేతిలో డబ్బులొచ్చిన తరువాత ఈ వస్తువు కొంటే, అప్పటికాలశ్యం అయిపోదూ.. లేడికిలేచిందే పరుగన్నట్టు అనుభవించేటైములోనే అనుభవించాలీ అనుకోడం,వెంటనే ఆ ఫైనాన్సువాడిచ్చిన ఫారాలమీద సంతకంపెట్టేయడమూ..

అసలు కష్టాలన్నీ మొదటివాయిదా ఆటోమేటిక్ గా మన ఎకౌంటు నుండి  debit  అయినప్పుడు. అప్పటికే ఇంటిలోనూ, కారు లోనూ, ఏ కొడుకో కూతురో పైచదువులుచదువుతూంటే ఏ ఎడ్యుకేషన్ లోనో… అన్ని కట్లూ పోగా మిగిలేది?

అదేంకర్మమో, ఉద్యోగంలో చేరినప్పుడూ చేతిలో డబ్బులు మిగిలేవీకావూ, కాలక్రమేణా జీతాలు పెరిగినా సరిపోయేవీకావూ.. ఎప్పుడూ defict budgeట్టే.. మన ప్రభుత్వాల వార్షిక బడ్జెట్లలాగ ! ఇంక పెన్షనైతే అడగక్కర్లేదు.  జీవితంలో అప్పనేదిలేదు ఈవేళ అనే రోజెప్పుడైనా చూస్తానా అనుకుంటాను. అందుకే ఆ త్యాగరాజ కీర్తన గుర్తొచ్చింది..  ముఖ్యంగా ” గగనానికీ  ఇలకూ.. ” అన్న వాక్యాలు.మరీ అంత ప్రాణాంతకం కాకపోయినా, ప్రశాంతంగా మాత్రం ఉండదు… ఇలాక్కాదని మా ఇంటావిడదగ్గరే ఆ అప్పేదో చేసేస్తే  గొడవేఉండదుగా…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– శ్రేయోభిలాషులు …

ప్రపంచంలో కొందరు ” శుభ చింతక్ ” లు ఉంటూంటారు.  Very noble  ప్రాణులు.. వారినే శ్రేయోభిలాషులు అని కూడా పిలుస్తూంటాం. ఎవరికి కష్టమొచ్చినా, ముందుగా వీరే స్పందిస్తూంటారు.. చెప్పడం వరకే కాబట్టి ధారాళంగా సలహాలిచ్చేస్తూంటారు.. వాళ్ళది పోయేదేముందీ.. పోతే ఆ సలహా బాధితుడే పోతాడు. చెప్పడం మన విధాయకం అనే టైపు… ఆ సలహా అవతలివాడికి లాభమా, నష్టమా అని కూడా పట్టించుకోరు.

ఉదాహరణకి ఎవరికైనా పిప్పిపన్ను సలుపు పుట్టిందనో, మోకాలు నొప్పనో తెలిసీతెలియడమేమిటి, వాళ్ళింటికి వెళ్ళి  ముందుగా పరామర్శ చేయడం.ఈ పరోపకారి పాపన్నల గురించి ముందే తెలుసు ఆయనకి.. ఏం కొంపముంచుతాడో అనుకుంటాడు… “అయ్యో పిప్పిపన్నా ఏమిటీ…. దవడ ఎలా వాచిపోయిందో…” అసలే నొప్పిభరించలేక రాత్రంతా నిద్ర పట్టలేదు.. రాత్రి అదేదో మాత్ర వేసుకున్నాలే.. అని వదిలించుకోవాలని ఓ వ్యర్ధ ప్రయత్నం చేస్తాడు… ఇలా కాదని ఆ వచ్చినాయన, వంటింట్లోకి వినిపించేటట్టుగా.. ” చెల్లెమ్మా.. బావగారు ఇంత బాధపడుతూంటే కబురైనా పెట్టలేదేమిటీ  “, ఆవిడ ఐసైపోయి.. చాయో కాఫీయో ఇస్తుంది… అవునన్నయ్యా చెప్తే వింటారా.. ఎప్పుడూ నోట్లో వక్కముక్కలే.. పళ్ళు పుచ్చిపోకేమవుతాయీ..మీకేమైనా చిట్కాలేమైనా తెలుస్తే చెప్పు, ఆయన బాధ చూడలేకపోతున్నానూ.. ” అంటుంది.. అసలు బాధపడేది వీళ్ళిద్దరూ కాదూ, ఆ దవడ వాచిపోయిన పెద్ద మనిషి. పడేవాడికేగా తెలిసేదీ బాధా…ఓ రెండు లవంగమొగ్గలు నవలమను అదే తగ్గుతుంది. ఆ లవంగాల ఘాటు భరించేదే? 

అలాగే మోకాలు నొప్పులకి, మిరియాలపొడీ, మెంతిపొడీ చెరో చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలిట, ఇవి అయ్యే పనులే?  తనకి వస్తే మోకాలునొప్పంటే ఏమిటో తెలుస్తుంది అని సణుక్కుంటాడు.  చెప్పొచ్చేదేమిటంటే ఈ శ్రేయోభిలాషులు ,అవతలి వారికి కలగబోయే  tangible/ intangible losses  గురించి ధ్యాసుండదు..

మొన్న ఓ టపా రాశానుకదూ — ” అప్పుల చిఠ్ఠా ” అని.. ఏదో స్వతహాగా సహృదయుడిని కాబట్టి, ఏమీ దాచకుండా రాశాను.   Most impractical  సలహాలు.. ఒకరేమో ”  అసలన్నేళ్ల ఉత్తరాలు దాచినందుకు బహుమతిగా ఆ హామీలు తీర్చేయొచ్చు మీరు.. ” ఇంకోరేమో  ”  మరి ?! తీర్చండి అప్పులన్నీ….” 

మరొకరేమో  ..” తిరిగి తిరిగి పిన్నిగారి దగ్గరకి తీసుకొస్తే తప్ప తోచదేం??? “.. అక్కడికేదో నేనేదో ” గృహహింస”  పెడుతున్నట్టు…అన్నీ మొదలెట్టాను ఎప్పుడో.. శులభ వాయిదా పధ్ధతుల్లో తిర్చడం.  ఆ మధ్యన  De Mo  ధర్మమా అని, తన ఖజానా అంతా బయటపెట్టాల్సొచ్చింది..తన దగ్గర ” నిత్య గంగ” లా డబ్బులెప్పుడూ ఉంటాయే.. . అయినా  sincere  గా ఓ విషయం ఒప్పుకోవాలి– అవసరార్ధం తనే డబ్బులు సద్ది నన్ను అత్యవసర పరిస్థితుల్లో  bail out  చేస్తూంటుంది.. నా బుజ్జి  ATM తను. మాటిమాటికీ గుర్తుచేస్తూంటుంది–ఆరోజున ఇంతిచ్చానూ, ఫలానా రోజున అంతిచ్చానూ అని.. పద్దు రాసుకో అంటూంటాను..అక్కడే వస్తుంది అసలు గొడవంతా,  Round off  చేయడంలో మంచి దిట్టలెండి.. ఏ 1656 ని 2000 చేసేస్తూంటుంది. ఏదో 1700 చేసుకోవచ్చు కానీ, మరీ 2000 కొంచం ఎక్కువే కదూ… ఇలాటివి ఈ శుభచింతక్ లకి ఏమర్ధమవుతుందీ?

మరొక సహృదయుడు… ”  చిఠ్ఠాలకి ,కాలదోషం పట్టేసిందని తప్పించేసుకోండి.. ” అని సలహా ఇచ్చారు. ఆ ముచ్చటా తీరింది మాస్టారూ… ఓసారి ధైర్యం చేసి.. “అప్పూ లేదూ సప్పూలేదూ.. తీర్చను, నీ దిక్కున్నచోట చెప్పుకో… ” అని కళ్ళు మూసుకుని చెప్పేశాను. ఓ పదిపదిహేను రోజులు  strategic retreat  చేసి ఓ కొత్త పథకం అమలు పరిచింది. వివరాలు  ఇక్కడ,  ఇక్కడా  చదవండి.. సామదానబేధోపాయాలన్నీ ప్రయత్నించి, ఇలా స్థిరపడిపోయాను. Beyond economic repairs…

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– so called అఛ్ఛే దిన్…

Teacher: How much is 2+2_
_Student: 9.50_
_Teacher: How on the earth is that possible?_
_Student: 2+2 = 4 + Vat + Service tax + Higher Education Cess + Swacch Bharat Cess + Krishi Kalyan cess; it comes to 9.50 Mam!._
_Teacher fainted!!_

పైన పెట్టిన జోక్ ని లైట్ గా తీసికోకండి. ప్రస్థుత పరిస్థితికి అద్దం పడుతోంది కదూ.. ఎన్నికల ముందర ఏవేవో చెప్పేశారు.. భూతలస్వర్గం కళ్ళముందర పెట్టారు.. ఆ ముందర వాళ్ళు అన్నీ తామే తినేసి, మనకేమీ మిగల్చలేదూ, పోనీ ఈ కొత్తాయన ఏమైనా పొడిచేస్తారేమో అనుకుని,  వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ గుడ్డిగా నమ్మేశాము.వాళ్ళకీ వీళ్ళకీ ఏమీ తేడాలేదు. పైగా ఏమైనా అంటే, 70 ఏళ్ళగా ఉన్నది రెండేళ్ళలో ఎలా బాగుపడుతుందీ అని ఓ వితండవాదన. ఈ 70 ఏళ్ళలోనూ, వీళ్ళుకూడా అధికారంలోనే ఉన్నట్టున్నారు కదూ. మధ్యమధ్యలో? అడక్కూడదిలాటివి, పైగా ఏమైనా అంటే ” దేశద్రోహులు” అన్నా అనొచ్చు.

Senior Citizens  కి ఏవేవో చేసేశామని పెద్దపెద్ద  ప్రసంగాలు చేశారు. వీళ్ళు చేసింది ఉన్నది ఊడకొట్టడం. ఇదివరకే నయం- 5 ఏళ్ళ FD  కి  8% పైగా వచ్చేది. ఇప్పుడో 10 ఏళ్ళకి 8% లోకి దించేశారు.ఏం ఉధ్ధరించారుట?  Pay Commission  విషయంలోనూ అంతే… ఆ లెఖ్ఖా ఈలెఖ్ఖా చూపించి జీతాలూ/పెన్షన్లూ పెంచేశామని మీడియాలో ఊదరకొట్టేశారు.పెరిగిందెంతా just 2-3 %.   కానీ ప్రసారమాధ్యమాల్లో చేసిన ప్రచారం ధర్మమా అని మార్కెట్ లో ఖరీదులు పెరిగిపోయాయి. పెట్రోలూ, డీసెలు ధరలైతే అడగక్కర్లేదు. LPG  ని కూడా వదల్లేదు.. ఇంక రైల్వే విషయమయితే ఏవేవో పేర్లు చెప్పి , ఎడా పెడా పెంచేశారు. రైళ్ళ్లలో  Senior Citizen concession  ఉందికదా అనొచ్చు… అది పాత ప్రభుత్వ దయాధర్మం. దాన్ని రద్దుచేయకుండా ఉంటే  పదివేలు.

మన ప్రభుత్వం కంటే,  OLA  TAXI  వాడే మెరుగు.   ఇక్కడ పూణె లో  Senior Citizens  కి  10  Trips  మీద  50%  రాయితీ ఇస్తున్నాడు.హాయిగా ఉంది. ఆటో మీద  20 % రాయితీ.మిగిలిన నగరాల్లో కూడా ఉందేమో తెలియదు.. నిన్న పుణె లోని దగుడూ సేఠ్  గణపతి దర్శనానికి వెళ్ళాం. OLa  బుక్ చేసినప్పుడు,  estimated rate  155 /-  వచ్చింది. తరవాత  Billed Amount just 74/-.  కనీసం ఎవడో ఒకడు జ్యేష్ఠ నాగరికుల కష్టాలు గుర్తించాడు.వచ్చిన డ్రైవరు  అసలు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడుట.  Land  మీదకు వచ్చిన రెండునెలలూ , part time  గా ఈ OLA వాళ్ళతో contract  ట. ఎంతబాగా మాట్టాడేడో.

మన పాలకులు చేసేదేమైనా ఉందా అంటే, ఎన్నికల ముందు , వాళ్ళాబ్బసొమ్ములా , ఎక్కడలేని వాగ్దానాలూ చేసేస్తారు. వాళ్ళ డబ్బులేమైనా ఏమిటీ ? మీరూ నేనూ కట్టే పన్నుల్లోంచే కదా, ఈ  freebies.వాళ్ళు అప్పనంగా సంపాదించి కూడబెట్టిన దాంట్లోంచి ఇవ్వమనండి తెలుస్తుంది. పార్టీ తో ప్రమేయం లేకుండా అందరూ అంతే.

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– జరుగుబాటు…

ఈ జరుగుబాటనేదుందే , ప్రపంచంలో ఏ కొద్దిమందికో ఉంటుంది. ఊరికే రాదు, పెట్టిపుట్టాలి. అదో  special status  లాటిది…. కావాలంటే వచ్చేదికాదూ,.  ఈ జన్మలోకానీ, క్రిందటి జన్మలోకానీ, పుణ్యం చేసుకోవాలి. ఒకసారి eligibility  సంపాదించారా, అడిగేవాడెవడూ ఉండడు. ” ఎంతైనా అదృష్టవంతుడయ్యా .. ” అని అందరూ చెప్పుకుంటారు.  Owner’s pride and neighbour’s envy   లాటిదన్నమాట.

ఉదాహరణకి చిన్నపిల్లలు చూడండి, శుభ్రంగా నడవకలిగినా మనల్ని వీధిన పెట్టడానికి , ఏ బజారుకెళ్ళినప్పుడో, రోడ్డుమీద చతికిలపడతాడు. ఓసారి కోప్పడినా, అమ్మో నాన్నో ఎత్తుకుంటారని. లేకపోతే ఆ ఏడుపు/పేచీ చూసి పక్కవాళ్ళేమైనా అంటారేమో, ఎంతైనా  image  కి భంగం కదా.. చచ్చినట్టు చంకనేసుకుంటారు.. ఈ భాగ్యమంతా, వాడికి ఓ చెల్లో,తమ్ముడో వచ్చేంతవరకే.  Purely Temporary  జరుగుబాటన్నమాట.

ఇంకొంతమందికి జీవితాంతం ఉంటుంది  on a permanent basis… వీళ్ళు దేనికీ కంగారు పడరు.. నిర్వికార్ నిరాకార్, నిర్లజ్… చిదానంద స్వరూపులు. అవతలివాళ్ళే చూడలేక మన  rescue  కి వస్తారు, ఏ జన్మలో ఋణపడి ఉన్నారో పాపం.. ప్రతీరోజూ  రాత్రిపూట  వేపుడూ, చారూ మరీ   monotonous  అయిపోయాయని, ఏదో దేవుడిపేర  శనాదివారాలు ఒంటిపూట ఫలహారం పేరుతో ,  మొదలెట్టడం. పైగా ఆ ఫలహారాలకి  వెరైటీ ఓటి. ఈ గొడవ భరించలేక, ఇంటావిడ, ఏ ఉప్పిడిపిండో, వాశినపోలో చేసేదాకా, నిరాటంకంగా సాగిపోతుంది….

ఉదాహరణకి నా విషయమే తీసికోండి– సైకిలు కూడా తొక్కడం రాకుండా, 73 ఏళ్ళు లాగించేశాను. అలాగని  పనీ పాటూ లేకుండానా, అబ్బే 42 ఏళ్ళపాటు షిఫ్టుల్లో కూడా డ్యూటి చేశాను ఒక్కోప్పుడు  6 AM- 2.30 Pm, 2PM – 10 30 PM..  లాటి టైమింగ్స్ లో. ఫాక్టరీకి ఎలా వెళ్ళేవాడిననడక్కండి.. ఎవరూ లేనివాళ్ళకి దేవుడే దిక్కు.. నా కాళ్ళే నా దిక్కు. పైగా 5.6 కిలోమీటర్లదూరం. నన్నుచూడలేక ఎవరో ఒకరు తమ వాహనాలమీద కనీసం సగం దూరం తీసికెళ్ళేవారు. ఒకతనైతే సైకిలు మీద కూడా.. చెప్పేనుగా నిర్వికార్ నిర్లజ్ టైపుని కదా..తరవాత్తరవాత ఫాక్టరీ బస్సు, తిరిగి పూణె వచ్చిన తరవాత  ఫ్రెండు తో స్కూటరూ..  రిటైరయిన తరవాత బస్సులూ, లోకల్ ట్రైనులూ.. చివరకి  OLA, UBER  లూ.. లాగించానా లేదా… అదే జరుగుబాటంటే…

 ఉన్న పళ్ళన్నీ 2001 లోనే పీకించేశాను. మళ్ళీ ఆ డెంచర్లూ అవీ ఎందుకని, అలాగే బోసినోటితోనే కానిచ్చేస్తున్నాను. నోట్లో వేలెడితే కొరకలేని అర్భక ప్రాణిని.. పాపం నవలలేనని ఇంటావిడైతే మెత్తమెత్తటి కూరలూ , లాటివి చేస్తూంటుంది. పైగా ఈ విషయం మాకు తెలిసినవాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. పాపం దానితో, వాళ్ళు కూడా అదే పధ్ధతి. మరీ “తింటే తినూ లేకపోతే గంగలూ దిగూ” అనలేరుగా… అదో జరుగుబాటాయె.

 వయసు పెరిగే కొద్దీ కొన్ని extra privileges  కూడా వస్తాయి. ఎవరూ ఏ పనీ చెప్పరు. ” పాపం పెద్దాయనా.. ” అని..భోజనం వేళకి పెడతారు. క్రింది బెర్తులూ, బస్సుల్లో లేచి సీటు ఇవ్వడమైతే ఉంటుందే.ఇవన్నీ జరుగుబాట్లు కాక ఇంకేమిటంటారూ?

%d bloggers like this: