బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– కోతి పేరంటాళ్ళు…aka పోతు పేరంటాళ్ళు…

మొన్నటినుండి శ్రావణమాసం  ప్రారంభమయిందిగా.. కొత్తగా పెళ్ళైన ఆడపడుచులందరూ, వారివారి వీలుని బట్టి , మంగళగౌరి వ్రతం చేసుకోవడం  ఆనవాయితీ కదా.. మనవైపు ముత్తైదువలకి , ఆ అమ్మవారి దయతో కొరత లేదు… కానీ  బయటి రాష్ట్రాలలో కొంచం  శ్రమ పడాల్సొస్తూంటుంది. ఉండడానికి 5 లక్షల తెలుగువారున్నా, అందరూ తలోమూలానూ..Facebook  ధర్మమా అని ఈ రోజుల్లో , ముత్తైదువల గురించి మరీ    గూగులమ్మని అడగక్కర్లేదు… ఎక్కడో అక్కడ ఓ లింకు దొరికితే, మరీ పుష్కలంగా కాకపోయినా, మొదటి  శ్రావణ మంగళవారానికి, దొరక్కపోరు..అదండీ ఈ టపాకి ఉపోద్ఘాతం..

బెంగళూరు లో ఉండే,  శ్రీమతి వేదుల సుభద్ర ( ” అగ్రహారం కథలు ఫేం ) కీ, మాకూ పరిచయం. ఓ రోజు నాకు మెసేజ్ పెట్టింది.. “బాబయ్యగారూ, పిన్నిగారితో పనుందీ.. ఓసారి మాట్టాడాలీ.. ” అంటే  తన నెంబరిచ్చాను… మనకెందుకూ ఏం మాట్టాడుకుంటారో, మన అవసరం వస్తుందిగా అప్పుడు చెప్తా…. చూద్దాం.. ( All in jest ).. ఆ అర్జెంట్ పనేమిటంటే, పుణే లో ఉన్న తన మేనమామ గారి అమ్మాయి చేత , మంగళగౌరి వ్రతం చేయించడానికి,  సుభద్ర అమ్మగారు పుణే వస్తున్నారట, ఆ వ్రతానికి ఆహ్వానం.. నాలుగు రోజుల ముందునుంచీ..మాకూ, వారికీ ఓ common friend  కూడా ఉన్నారు, శ్రీ కొంపెల్ల వెంకట శాస్త్రి గారు.. మొత్తానికి ఇద్దరు ముత్తైదువులూ  ( మేం కాదు.. మా ఇద్దరి ఇంటి ఇల్లాళ్ళూనూ).. ఆ దంపతులు  On His Majesty’s Service  లో  on duty..  ఏం లేదూ వాళ్ళ మనవల సేవలో…విషయమేమిటంటే, మేం నలుగురమూ, మంగళవారం అక్కడకి వెళ్ళి,  వాయినం, భోజనం చేసి, రావడమన్నమాట.. .. పాపం ఆవిడ  హైదరాబాదు నుంచి , సోమవారం అర్ధరాత్రికి పుణె వచ్చి, , మేనకోడలి చేత వ్రతం చేయించి, మాకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలని, ఆవిడ కార్యక్రమం. మరీ  .అంత దూరం నుండి వస్తూ, మళ్ళీ శ్రమైపోతుందని, భోజనానికి వద్దన్నాము. ఆవిడా ఊరుకునేదీ, ఇద్దరు దంపతులకి భోజనం పెడితే పుణ్యం కూడానూ .. అని ఒప్పించారు. ఎంతైనా ” కోనసీమ ” ఆడపడుచాయే.. ఈ వారఫలాల్లో వాహన యోగం, భోజనయోగం,   నూతన వస్త్రయోగమూ ఉన్నట్టున్నాయి. శాస్త్రిగారి కారులో, వాళ్ళింటికి వెళ్ళి ” కోనసీమ ” రుచులతో విందూ, మా బుచ్చిలక్ష్మిలకి చీరా, తాంబూలం …

శ్రీరమణ గారి   ” మిథునం ” లో అప్పదాసుగారిలా , మా బుచ్చిలక్ష్మి లతో  ” కోతి పేరంటాళ్ళమయాము

IMG-20170726-WA0012

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను… అయినా…

ఏదో ఉద్యోగంలో ఉన్నప్పుడంటే, ఇంటికి సంబంధించినవి అడిగితెలుసుకోవడమో, లేదా తనే చెప్తే వినడమో చేసేవాడిని. అవసరమైనదేదో చేసేస్తే పనైపోయేది. కానీ ఆఫీసులో అలా కుదరదుగా– బాధ్యత ఓ సెక్షన్ కి ఇన్ ఛార్జ్ గా ఉండగా, నా దృష్టికేదొచ్చినా అడిగి తెలుసుకునేవాడిని… ఏమైనా జరిగితే సమాధానం చెప్పాల్సింది నేనేకదా. 

రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఉద్యోగం వయసు 60 ఏళ్ళు రాగానే ఇంటికి పంపేస్తారు. కొత్త జీవితానికి అలవాటు పడ్డానికి కొంత టైము పడుతుంది… ఇదివరకంటే ఎప్పుడు పడితే అప్పుడు చాయ్ పడాల్సిందే.. కానీ ఆ తరవాత గంటగంటకీ చాయ్ కావాలంటే అయేపని కాదు. అప్పటికీ మా ఇంటావిడ, నా అలవాటు గమనించి, రోజులో అయిదారుసార్లు చాయో, కాఫీయో ఇస్తూనేఉంటుంది.  God bless her.

 రిటైరయిన తరవాత ఏదో వ్యాపకం ఉండాలిగా, కాలక్షేపానికి అంతర్జాలం బెస్టూ అనుకుని, మా అబ్బాయి ధర్మమా అని, అందులోనూ అడుగెట్టి, దేనికీ బయటకెళ్ళాల్సిన అవసరం లేకుండా, కానిచ్చేస్తున్నాను… మధ్యలో కొంతకాలం,   Mystery Shopping  తో కొంత కాలక్షేపం అయింది. అవీ 400 పైగా  assignments  చేసేటప్పటికి, ఇంక చాలనుకుని తగ్గించేశాను.  But I enjoyed the job.  పైగా ఈరోజుల్లో assignment  కి వెళ్ళినప్పుడు,  audio/ video recording  కూడా కావాలంటున్నారు. మరీ అంత  Tech savvy  కాకపోవడంతో, ఓ దండం పెట్టేశాను.

ఏదో మొత్తానికి ఓ రెండు స్మార్ట్ ఫోన్లూ, ఓ లాప్ టాప్పూ, ఓ కంప్యూటరు తో కాలక్షేపం అయిపోతోంది… Facebook  లో రోజూ ఏవేవో పెట్టడమూ, వాటిని సహృదయంతో , నా స్నేహితులు వ్యాఖ్య పెట్టడమో, కనీసం లైక్ చేయడమో చూడ్డంతో మనసుకి ఆహ్లాదంగా ఉంటోంది… ఎప్పుడొ ఎవరో చివాట్లేసేదాకా కానిస్తాను. ఇదేకాకుండా,   అంతర్జాల పత్రిక   gotelugu.com  లో   గత 200 వారాలకి పైగా ప్రతీవారమూ, నేను రాసిన ఒక వ్యాసం , వారుకూడా సహృదయంతో ప్రచురిస్తున్నారు. టైము గడవడానికి ఇంకేం కావాలీ? ఏడాదికోసారో, రెండుసార్లో  ఎక్కడో అక్కడికి వెళ్ళి ఓ వారం గడిపి రావడం.ఇక్కడే ఉండబట్టి పిల్లలు ప్రతీవారమూ వచ్చి  కలవడమూ, మనవరాళ్ళనీ , మనవల్నీ చూసి సంతోషించి, వాళ్ళతో కాలక్షేపం చేయడమూ.. I am quite happy and contented.

 ఇంక మా ఇంటావిడంటారా– తనూ, తన  పజిల్సూనూ….    వాటిని కనీసం అర్ధం చేసికునేటంత  IQ  లేదాయె, ఎందుకొచ్చిన గొడవా, బుర్రకి టెన్షన్ పెట్టడమూ?  ఎప్పుడినా అవసరం వస్తే, మిగిలిన పజిల్స్ కి ఓ  printout  తీసిచ్చేస్తే తన దారిన తను బిజీగా ఉంటుంది.. ఉభయతారకం కదూ..

మధ్యమధ్యలో తనకి ఫోన్లొస్తూంటాయి.. అమ్మాయైతే రోజూ చేస్తుంది. .. తన స్నేహితులో, చుట్టాలో ఎవరోఒకరు మాట్టాడుతూంటారు..నేనూ వివరాలడగను. చెప్పాల్సొచ్చేదైతే తనే చెప్తుంది కదా అని.ఎప్పుడో మర్చిపోయి అడుగుతూంటాను. పాపం తనూ చెప్తుంది. వచ్చిన గొడవేమిటంటే, తను చెప్పేటప్పుడు అంతగా శ్రధ్ధ చూపెట్టకుండా, ఏదో ఫోనులో కెలుకుతూంటాను, ఓ చెవి అటువైపు వేసే… కానీ తనకు అది నచ్చదు.. ” పోన్లెండి, మీకంత ఇంటరెస్ట్ లేకపోతే ఎందుకూ… ” అంటుంది.. అయినా నాకెందుకూ ఆర్చేవాడినా తీర్చేవాడినా.. అస్సలడక్కూడదూ అని.. కానీ చెప్పేనుగా, అనుకోవడంతో సరిపోదు, ఆచరణలో కూడా పెడుతూండాలి..

నాకా గొడవలేదు.  కొత్తగా పుణె వచ్చినవారికో, ఏదో అవసరం పడ్డవారికో సడెన్ గా గుర్తొస్తూంటాను, పుణె లో ఉన్నానని. ఫోను చేసి ఏదో సమాచారం అడుగుతారు. నాకు తెలిసిందో, ఎవరినైనా అడిగో, మొత్తానికి వాళ్ళకి మెయిల్ ద్వారానో, ఫోను ద్వారానో, చేతనైనంత సమాచారం ఇస్తూంటాను. వచ్చిన గొడవేమిటంటే, ఆ సమాచారం ఇవ్వబడినవాళ్ళు, మళ్ళీ తుపాగ్గుండుక్కూడా దొరకరు. అలాగని ఏదో థాంక్స్ చెప్పాలీ, జీవితాంత ఋణపడుండాలీ అని కాదు,  just formality  కోసమైనా ఫోనుచేస్తే సంతోషిస్తాము.. పైగా ఇంకోరికెవరికైనా అవసరం వస్తే చెప్పొచ్చు కదా. అబ్బే, వాళ్ళకే మనం ఏదో ఋణం ఉన్నట్టు ప్రవర్తిస్తారు.

దాంతో గతకొద్దికాలంగా, ఈ రెండూ — వివరాలు చెప్పడం, అవసరంలేనివాటిల్లో వేలెట్టకపోవడమూ—తగ్గించుకోవాలని ఆలోచనైతే ఉంది…. కా…. నీ… పుర్రెతోవచ్చిన బుధ్ధాయె….