బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు– చిన్నపిల్లలు క్రెచ్ లు

    ఈ వేళ సాక్షి న్యూస్ పేపర్లో పిల్లలూ–హాస్టల్సూ అని ఒక వ్యాసం పడింది. చాలా బాగా విశ్లేషణ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల వలన కొంతమంది తల్లితండ్రులు పిల్లల్ని
కార్పొరేట్ స్కూల్/కాలేజీ లలో చదివించడానికి కంపల్సరీ గా హాస్టల్ లోనే ఉంచి చదివించాలి.దీని వలన పిల్లలమీద మంచి/చెడు ప్రభావాలుంటాయి. ఇదివరకటి రోజుల్లో అయితే బాగా డబ్బున్నవాళ్ళే ఈ బోర్డింగ్ స్కూళ్ళలో తమ పిల్లల్ని పెట్టి చదివించేవారు. ఇప్పుడు తల తాకట్టైనా పెట్టి పిల్లల్ని పేరున్న కార్పొరేట్ కాలేజీ లలో చేర్పిస్తున్నారు.ఎవరి కారణాలు వారివి.కొంతమంది
పక్కవాడెవడో చేరేడని తమ పిల్లల్ని అవసరం ఉన్నా లేకున్నా ఇంకా గొప్పదైన కాలేజీ లో చేర్పిస్తారు. ఈ ” పోటీ పరుగు” కి ఎక్కడా అంతం ఉన్నట్లు కనిపించడం లేదు.

ఇది కాలేజీలకీ, స్కూళ్ళకే కాదు –చిన్న పిల్ల ఆరు నెలలు దాటేసరికి పేరున్న “క్రెచ్ ” లకి పంపేస్తున్నారు. భార్యా భర్తా ఉద్యోగాలు చేస్తూండడం వలన ఈ అవసరం బాగా వస్తోంది. ఇంట్లో వారి తల్లితండ్రులున్నా సరే ” మిమ్మల్ని ఇంకా శ్రమ పెట్టడం మాకు ఇష్టం లేదు ” అని ఓ కుంటి సాకు చెప్పి వాళ్ళని ఈ క్రెచ్ లకి పంపేస్తున్నారు. అంత శ్రమ పెట్టడం ఇష్టం లేకపోతే,ఇంట్లోనే ఓ పనిపిల్లని సహాయంగా పెట్టి తమ తల్లితండ్రుల వద్దే ఉంచొచ్చుగా ! అబ్బే ఈ ముసలి వాళ్ళ చేతిలో పిల్లలు పాడైపోతే అమ్మో ఇంకేమైనా ఉందా ? ఒక విషయం మర్చిపోతున్నారు–తాము ఎలా పెరిగేరో? బహుశా తమ తల్లితండ్రులకి ఆర్ధిక స్ఠోమత లేక ఇంట్లోనే ఉంచారేమో అనే ఒక దురభిప్రాయం ఇప్పటి వారిలో బాగా పాతుకు పోయింది.అంతే కానీ, మనమీద ప్రేమాభిమానాలతో క్రెచ్ కి పంపలేదూ అని ఎందుకనుకోరూ ?

ఆరో నెల నుండీ చిన్న చిన్న పాపలు డే కేర్ సెంటర్లకీ( కొన్నిచోట్ల అలా పిలుస్తారనుకుంటాను), క్రెచ్ లకీ వెళ్ళి సాయంత్రాలకి తిరిగి వస్తూంటే కడుపు తరుక్కు పోతుంది.ఇంట్లో ఎవరూ పెద్దవారు లేకపోతే అనుకోవచ్చు, కానీ ఇంట్లో కంటే అక్కడే పెంపకం బాగుందనుకోవడం కొంచెం అతిసయోక్తిగా అనిపిస్తుంది.మాటలు వచ్చిన తరువాతైతే ఫర్వాలేదు, మరీ పాలు తాగే వయస్సుకే పంపడం చూడ్డానికి ఎంత మాత్రం బాగాలేదు.అయినా ఈ రోజుల్లో వినేవారెవ్వరు?

చిన్న పిల్లో, పిల్లాడో నడక వచ్చేసిందంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమే –ఎందుకంటే అప్పటికి పెద్దవాళ్ళ వయస్సు కూడా 55-65 ల మధ్య ఉంటుంది, ఈ చిన్నపిల్లలతోపాటు పరిగెత్తలేరు.ఇంకో విషయ మేమంటే వాళ్ళ పిల్లల్ని పెంచినంత ” అథారిటీ” తో మనవల్నీ, మనవరాళ్ళనీ పెంచలేరు. ఏమంటే ఏమౌతుందోనని భయం.వాళ్ళ తల్లితండ్రులు ఇంటికి వచ్చిన తరువాత పొద్దుటినుంచీ చేసిన సేవలు మర్చిపోయి వాళ్ళ కాళ్ళని చుట్టేసి ” అమ్మమ్మ ఇలా అంది, తాతయ్య నన్ను కోపడ్డారూ ” అంటూ కంప్లైంట్లూ. ఇవన్నీ చూస్తే పిల్లలు క్రెచ్ లోనే బెటరూ అనుకుంటాము.

కొంతమంది ఉంటారు నెలల పిల్లల్ని చూడడానికి ఓ పనిపిల్లని పెడతారు ఇంట్లో వాళ్ళకి సహాయంగా, అంతవరకూ బాగానే ఉంది. వచ్చిన గొడవేమిటంటే పొద్దుటినుండీ ఎన్నిసార్లు పాలు తాగిందీ, ఎంతసేపు నిద్రపోయిందీ, ఎన్నిసార్లు డైపర్లు మార్చేమూ– ఆ వివరాలన్నీ ఓ ” లాగ్ బుక్ ” తయారుచేసి చెప్పాలి. అదికూడా ఫర్వాలేదు, ఎక్కడ చిరాకు వస్తుందంటే, వీళ్ళు చెప్పిన విషయాలన్నీ పనిపిల్ల దగ్గర వెరిఫై చేస్తారు.అంతకంటే ఇన్సల్ట్ ఏమీ ఉండదు. ఏ అమ్మమ్మా, నానమ్మా కూడా వాళ్ళ చిన్ని చిన్ని వరాల మూటల్ని నెగ్లెక్ట్ చేయరు. పైగా తమ పిల్లలకంటే శ్రధ్ధగా చూస్తారు.

ఇంకొంతమందిని చూశాను, వాళ్ళకి తమ పిల్లల్ని ఇలాంటి క్రెచ్ లలో వేయడం ఇష్టం లేదనుకోండి– ఓ కొత్తరకమైన పాట మొదలెడ్తారు--క్రెచ్ ల్లో పిల్లలకి మత్తుమందు ఇచ్చి పడుక్కోపెడతారుట అందుకని అవంటే మాకు ఇష్టం లేదూ–అని.ఇంత ఘోరాతి ఘోరమైన అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేయగా విన్నాను.వాళ్ళకి ఇష్టం లేకపోతే వేయొద్దు, అంతేకానీ
క్రెచ్ ల కెళ్ళే పిల్లలందరూ ” డ్రగ్ ఎడిక్ట్స్ ” అన్నట్లు మాట్లాడితే ఎలాగ?

ఒక్క విషయం ఒప్పుకోవాలి, ఈ క్రెచ్ ల వాళ్ళు డబ్బు బాగాతీసికొన్నా పిల్లల్ని మాత్రం అఛ్ఛోణీల్లాగ తయారుచేస్తారు. మా మనవడు, మనవరాలు కూడా క్రెచ్ పెంపకమే.బహుశా మా పెంపకంలో వాళ్ళు అంత స్మార్ట్ గా అయిఉండేవారు కాదేమో.

ఈ హాస్టల్లూ, క్రెచ్ లవల్ల వచ్చే ఉపయోగం ఏమిటంటే, వాళ్ళు పెద్దైన తరువాత, వాళ్ళ తల్లితండ్రుల్ని ఆశ్రమాలకీ, ఓల్ద్ ఏజ్ హోమ్ లకీ పంపడానికి ఎటువంటి సంకోచాలూ ఉండవు, ఎందుకంటే ” నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా “. ఇదొక ట్రైనింగ్. ఎంత చెప్పినా మన పిల్లల్ని అన్ని రంగాల్లోనూ ప్రవీణులు చేయాలిగా.

%d bloggers like this: