బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అవతలివాడు బాగుపడిపోతున్నాడేమో…..

    కొంతమందుంటారు, వాళ్ళకి ఎప్పుడూ ఒకటే ధ్యాస.. అవతలివాడు, మనకంటే ఏదో బాగుపడిపోతున్నాడేమో అనే ఏడుపు!దానితో అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాటనడమో, అడిగినవాడికీ, అడగనివాడికీ దండోరా వేయడమో.అవతలివారు, ఏదో తమ దారిన తాము వెళ్తున్నారుగా, అసలు ఈ “పక్షుల” కి ఎందుకూ అంట? ఆ పక్షులు మొగాళ్ళవొచ్చు, ఆడాళ్ళవొచ్చు.ఏడవడం వచ్చేసరికి లింగవివక్షతనేదుండదు.మనం చేయలేనిదేదో, అవతలివాడు చేస్తున్నాడూ, వాళ్ళకి తాటాకులుకట్టడం మన పనీ, అంతే!దానికి ఓ అర్ధం పర్ధం ఉండదు.

ఇదివరకటి రోజుల్లో , ఇదివరకేమిటిలెండి, ఈమధ్యదాకా, అంటే ప్రభుత్వం వారు పే కమీషను వేసి, ప్రభుత్వోద్యోగులకీ జీతాలు పెంచేదాకా, కుటుంబ పరిస్థితులవలననండి, లేదా, ఇంట్లో సౌఖ్యం, శాంతీ ఉండకపోవడంవలననండి, ఏదో ఒక కారణంచేత, ఉద్యోగానికి సాయంగా, ఆఫీసునుంచి వచ్చేసిన తరువాత, అక్కడినుంచే direct గానో, ఇంటికొచ్చి ఓ కాఫీయో, చాయో తాగేసి, ఓ రెండు మూడు గంటలపాటు ఓ part time job చేసేవారు.ఏ రాత్రి తొమ్మిదింటికో, పదింటికో కొంపకు చేరేవారు. మళ్ళీ ప్రొద్దుటే లేవడం, ఆఫీసూ వగైరా..ఇలా వచ్చిన పైసంపాదన తనుసంపాదిస్తున్న జీతభత్యాలకి వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాగ ఉపయోగపడేది.అదేమీ తప్పేం కాదు.చూసేవాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

ఇంటిమగాడు, ఏదో రెండుమూడు బట్టల దుకాణాల్లోనో, కిరాణా దుకాణాల్లోనో పద్దులు వ్రాయడం, వాళ్ళ ఎకౌంట్లు చూడ్డం చేసేవారు. వాటినే ఈ రోజుల్లో data entry అని ఓ sophisticated పేరు పెట్టేరనుకోండి, అది వేరే విషయం.మా ఫ్రెండొకాయనుండేవాడు, తెలుగువాడే, ఫాక్టరీ లో షిఫ్టులని బట్టి, ఓ ఆటో నడుపుకునేవాడు.అది తప్పని ఎలా అనగలమూ? ఇళ్ళల్లో ఆడవారు,ఏ బ్యుటీషియన్ కోర్సో చేసి, హాయిగా ఇంట్లోనే ఓ పార్లరు లాటిది తెరిచి పని చేసేవారు. కాదూ కూడదూ అనుకుంటే, హాయిగా బట్టలు కుట్టడం నేర్చుకోడం, కాలనీలో వాళ్ళకి కుడుతూండడం. అలా అలవాటై చేసినవాళ్ళే ఇప్పుడు, బొటీక్కులూ అవీ ప్రారంభించారు.లక్షలకి లక్షలు సంపాదిస్తున్నారు.

కానీ, వీళ్ళందరూ ఆ part time joబ్బులు ప్రారంభించినప్పుడు, మన ” పక్షులు” న్నారే, వాళ్ళు ఎంతంతగా యాగీ చేసేవారో- “విన్నావుటే.. ఫలానా ఆవిడ బట్టలు కుడుతోందిట, మన ఇంటా వంటా ఎక్కడైనా విన్నామా.. ఫలానా ఆవిడ అదేదో బ్యూటీ శలూన్ అని పేరెట్టి, అడ్డమైన పనులూ చేస్తోందిటా…ఏమిటో కలికాలమూ...”.మరి ఈరోజుల్లో లేడీస్ టైలర్లూ, బ్యూటీ శలూన్ లూ లేకుండా జరుగుతోందా? ఎవరికిష్టమున్నది వారు నేర్చుకుంటారు. అలాగే వంటలూ, వార్పులూనూ, ఈరోజుల్లో క్యాటరింగుకీ, హోటెల్ మానేజ్మెంటుకీ కాలేజీలూ అవీనూ… అదే ఇదివరకేమనేవారూ.. ” అయ్యో..అయ్యో.. వంటమనిషిగా చేస్తోందిట…”. ఏ పనైనా సరే dignity of labour చూడాలి కానీ, తాము చేయలేనిదేదో, అవతలివారు చేసేస్తున్నారో బాగుపడిపోతున్నారో అని ఏడవకూడదు.

ఈ రోజుల్లో వారివారి ఆసక్తులనిబట్టి ఆడవారూ, మగవారూ కూడా ఎన్నెన్నో రంగాల్లో part time jobs చేస్తున్నారు. ఉదాహరణకి కాలేజీకెళ్ళే పిల్లలు, శలవలొచ్చాయంటే, pocket money కోసం, ఏదో ఒక పని చేస్తారు, బుధ్ధిమంతులైనవాళ్ళు- ఓ న్యూసుపేపరు డెలివరీ కావొచ్చు,లేదా ఏ Mcdonalds, Pizza Hut, Dominos లోనో డెలివరీ బాయ్ కింద. అలాచేస్తున్నాడు కదా అని, ఏదో చేయరాని పని చేస్తున్నట్టు చెవులు కొరుక్కోడం బాగుండదు.

ఈరోజుల్లో ఎక్కడ చూసినా Corporate Colleges, Management Institutes..కావలిసినన్నున్నాయి, అదీ పెద్ద పెద్ద నగరాల్లో అయితే మరీనూ. వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకన్నా, part time వాళ్ళంటేనే ఆసక్తి చూపిస్తారు. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి- రెగ్యులర్ వాళ్ళైతే పిఎఫ్ లూ, శలవలూ, యూనియన్లూ గొడవానూ, హాయిగా గంటకింతా అని, ఎవరినో engage చేసేసికుంటే, వాళ్ళ పనీ అవుతుంది,ఆ చెప్పేవాళ్ళ అవసరమూ తీరుతుంది. ఉభయతారకం.

ఎంత పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారైనా, ఏదో అవసరాన్నిబట్టో,టైం పాసుకో,కాదూకూడదూ అంటే, చిన్నప్పటినుండీ అవకాశాలు రాక నిద్రాణమైన కోరిక తీర్చుకోడానికో, ఏ వీకెండుకో ఏదో ఒక కాలేజీలోనో, లేక ఏదో ఒక Management Institute లోనో పాఠాలు చెప్పడానికి చేరతారు. అదేదో తిన్నతిండరక్క కాదు.పోనీ అవన్నీ ఏమైనా Cake walk లా ఏమిటీ, ఎంతంత శ్రమ పడాలి, ఇంట్లో భర్తా పిల్లలనీ చూసుకోవాలి, అక్కడ తీసికున్నపనికి న్యాయం చేయాలి. ఇంత కార్యక్రమం ఉంది. కానీ, పనీ పాటాలేని, రోజంతా టీవీ సీరియళ్ళలోనో, కిట్టీ పార్టీల్లోనో కాలం గడిపేవారికి ఇలాటివి somehow they just can not digest. ఛాన్సు దొరికినప్పుడల్లా ఏదో ఒక మాటనడం.అవతలివారిని బాధపెట్టడం. అదో sadistic pleasure.

అంతదాకా ఎందుకూ, నేను నా కాలక్షేపం కోసంచేసే Mystery Shopping ల విషయంలోనే ఇలాటి “పక్షుల” నుండి, ఎన్నెన్నో విమర్శలు విన్నాను. మొదట్లో కొద్దిగా బాధేసీది. నేనేమైనా వాళ్ళని అప్పడిగానా, కాదూ నాకు బ్రాండెడ్ బట్టలు కొనిపెట్టమన్నానా, పోనీ మా ఇంట్లోకేదైనా తెచ్చిపెట్టమన్నానా, నా దారిన నేనేదో చేసుకుంటూంటే నా గొడవ అసలు వాళ్ళకెందుకూ అనుకునేవాడిని. వారిదారిన వారు “సలహాలు” (unsolicited) ఇచ్చేవారు, ఈ వయస్సులో మీకెందుకండీ ఇంత “యావ” అనేవారు కూడానూ.విన్నాను.. విన్నాను.. ఇంక ఇదికాదు పనీ అనుకుని, in no uncertain terms.. చెప్పేయవలసొచ్చింది.. mind your business.. అని.తిట్టుకునేవాళ్ళు తిట్టుకున్నారు,పోనిద్దూ వాడి ఖర్మ వాడిదీ అనుకునేవాళ్ళూ ఉన్నారు, ఏది ఏమైనా, నా దారిన నన్ను వదిలేశారు..

అసలు నేను ఈ Mystery Shopping ఎందుకు చేస్తున్నానో కూడా చెప్పాను. I simply love and enjoy it.సంఝాయిషీ చెప్పుకోవలిసినది కట్టుకున్నవాళ్ళకి తప్ప ఇంకోళ్ళకి కాదు. భార్య భర్తకీ, భర్త భార్యకీ ఇంక మిగిలినవారంతా to hell..ఇష్టముంటే,మాట్టాడతారు లేకపోతే.. ఏమీ గొడవలేదు.పోనీద్దూ అని వదిలేస్తారా, అబ్బే, కడుపులో దాచుకున్నది కక్కొద్దూ.. ఎప్పుడైనా, కొత్త షూసూ, కొత్త బట్టలూ వాటికి సాయం ఓ టోపీ కూడా పెట్టుకుని కనిపించడం తరవాయి, ” హల్లో.. ఏమిటీ ఈమధ్య కొత్తపెళ్ళికొడుకులా తయారైపోతున్నారూ.. ఇవన్నీ వాళ్ళెవరో ఇచ్చినవేనా..” అంటూ. అక్కడికేదో నేను సంభావనలకి వెళ్తున్నట్టూ, అక్కడేదో సంపాదించినట్టూ..మరీ వాళ్ళంతకిందకు దిగజారలేక, ఓ నవ్వు నవ్వేసూరుకుంటాను.

ఈ “పక్షులు” అస్తమానూ విసిరే మాటల తూటాలు భరించలేక ఒకరు నన్నడిగారు, ఇలాటివారిని ఎలా deal చేయాలీ అని. నేను మూడు మార్గాలు చెప్పాను…

ఒకటి Do not react.. మనం react అయ్యీకొద్దీ, అలా మాట్టాడేవారు ఇంకా రెచ్చిపోతారు…

రెండు ఓపికుందా నాలుగు ఝణాయించి చెప్పు. మళ్ళీ నోరెత్తరు…

మూడు.. అన్నిటిలోకీ ఉత్తమం… just ignore.. చెప్పి చెప్పి వాళ్ళే విసుగెత్తి మానేస్తారు…
సర్వేజనా సుఖినోభవంతూ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

   మనదేశంలో ప్రతిపక్షాలు ఏమిటో అంటున్నాయనో, లేక ఎవరెవరో ఏమిటేమిటో ఆరోపణలు చేస్తున్నారనో, అధికారపార్టీ వారికి పేద్ద పట్టింపేమీ ఉండదు..పోనిద్దూ వాళ్ళకీ కాలక్షేపం.. ఏదో అరుచుకోనిద్దూ.. అనేసికుని, వాళ్ళు చేసేదేదో చేసేస్తూంటారు..అదే క్రమంలో నిన్న జరిగిన మంత్రివర్గ మార్పులూనూ..ఇందులో బాగుపడ్డవాళ్ళెవరయ్యా అంటే, మన రాష్ట్రానికి చెందిన ఎం.పీలు.అక్కడికెదో వాళ్ళు మన నెత్తిమీద రాయెడతారని కాదూ, ఇన్నాళ్ళూ ఉన్నవాళ్ళెవరు పెట్టారు కనక? మనమూ అందరితోనూ చెప్పుకోవచ్చు… చూడండి, మన తెలుగువారికి ఎన్ని మంత్రిపదవులొచ్చాయో అని.మళ్ళీ ఇందులో, ఆయనకెవరికో ఇవ్వలేదూ, ఈయనకెవరికో ఇవ్వలేదూ అంటూ మళ్ళీ ఏడుపులూ, అలకలూ.. ఇలాటివి మామూలే ఎప్పుడూ.

   అవేవో Football లాటి ఆటల్లో మొదటి హాఫ్ లో కొందరూ, రెండో హాఫ్ లో కొందరూ ఆడుతూంటారు. అలాగే మన “గౌరవనీయ” ప్రజా ప్రతినిధులూనూ. కొంతకాలం, వాడెవడో చేశాడు, ఇప్పుడు నా వంతూ అనుకోడం, కాలక్షేపం చేసేయడం.లేకపోతే ఆ శసీ తరూర్ విషయంలో, అసలు logic ఏమైనా ఉందా? అప్పుడెప్పుడో, IPL గొడవలో ఆ “పెద్దమనిషి” రాజీనామా చేశాడో, చేయించారో.. మొత్తానికి రెస్టు ఇచ్చారు.ఇప్పుడు మళ్ళీ ఎందుకుట తీసికోడం? ఉన్న పార్టీ ప్రతినిధుల్లో అంత “తెలివైన” వారే లేరా?

   ఒకవైపున ఆ కుర్షిద్ ఏమిటో గొటాలాలు చేశాడని ఆరోపణలొచ్చాయి. ” పోనిద్దూ వాటిని పట్టించుకోవాలా ఏమిటీ..” అనుకుని, ఆయనకి ప్రమోషను కూడా ఇచ్చారు.ఎన్ని చెప్పండి, మన “మెగాస్టార్”గారి పని మాత్రం హాయిగా ఉంది. ఏదో “సామాజికన్యాయం” అంటూ ఓ కొత్త పార్టీ పెట్టారు మొదట్లో, కాలక్రమంలో కాంగ్రెసు తో విలీనం చేసేసి, రాజ్యసభ మెంబరైపోయి, హాయిగా ఇప్పుడు మంత్రిపదవి కూడా కొట్టేశారు. అద్గదీ యోగం అంటే అలాగుండాలి. పైగా ఆ శాఖలో ఏదైనా చేయకలిగాడా అని అడిగేవాళ్ళూ లేరు–పర్యాటక శాఖట!

    ఆ కేజ్రీవాలేమో ఆమధ్య రోజుకోడిని expose చేయడం మొదలెట్టారు. ఏమయిందీ చివరకీ? అక్కడ గడ్కరీ బాగానే ఉన్నాడు, వాధ్రాకూడా బాగానే ఉన్నాడు, ఇప్పుడు కుర్షీదు ఒకరు చేరారు ఆ లిస్టులోకి. మన సినిమావాళ్ళు చూడండి, publicity కోసం, ఏదో ఒక controversy తెస్తూంటారు, అదేదో వికటించడం మాటటుంచి, వాళ్ళ మంచికే జరుగుతూంటుంది. ఇందులో “నీతి” ఏమిటయ్యా అంటే– ఎపుడైనా ఎవడైనా “బాగుపడాలీ” అనుకుంటే, ఆ కేజ్రీవాల్ కి ఓ ఫోను కొట్టడం !

    అసలు అల్లుళ్ళు ఎలా ఉంటారో ఈ కాలపు వాళ్ళకి ఏం తెలుసూ? నెహ్రూ గారి అల్లుడు శ్రీ ఫిరోజ్ గాంధీ గారి గురించి చదవండి.ఒక్కరోజుకూడా నెహ్రూ గారిని ప్రశాంతంగా నిద్రపోనీయలేదు! తెల్లారితే ఏం కొంపముంచుతాడో అనే భయం. అలాగని, ఆయన బయటపెట్టిన స్కామ్ములు అలాటివీ ఇలాటివా..

    ఈమధ్య భారతీయ సంతతికి చెందిన రజత్ గుప్తా కి రెండేళ్లు జైలు శిక్ష వేశారు. అలాటిది మన ” పవిత్ర” భారతదేశంలో ఎరుగుదుమా ఏమిటీ? ఎవణ్ణో పట్టుకుంటారు, వాడు ముందుగా కడుపునొప్పో, కాలునొప్పో, నడుంనొప్పో, గుండె నొప్పో అంటూ ముందర హాస్పిటల్ లో చేరిపోతాడు. ఆ నొప్పులన్నిటినీ దాటి, మొత్తానికి వాడిని కోర్టులో పెడతారు.వాడు ఆ కబురూ, ఈ కబురూ చెప్పడం వాడి హక్కూ.ఏదో ఖాళీలుంటేఓ జైల్లో కూర్చోబెడతారు. మీడియా వాళ్ళకీ, రాజకీయనాయకులకీ కావలిసినంత కాలక్షేపం. వాడిని , వాడి వారఫలాన్ని బట్టి బైలు మీద వదిలిపెడతారు. మళ్ళీ ఈ బెయిలుమీద హైకోర్టులూ, సుప్రీం కోర్టులూనూ వాయిదాలూ… ఎప్పుడో ఒకప్పుడు బయటకొచ్చేస్తాడులెండి… ఆ కేసు దారి కేసుదే. ఈ మధ్యలో ఆ ప్రబుధ్ధులు పార్లమెంటుకీ వెళ్తారూ, మధ్యమధ్యల్లో సన్మానాలూ వగైరాలూ జరుగుతూంటాయి.వెధవ కేసుకేముందీ..దాని దారి దానిదీ..

    మన అదృష్టం బాగోపోతే, ప్రధానమంత్రో, రాష్ట్రపతో కూడా కావొచ్చు..చివరకి కంఠశోష మిగిలేదెవరికీ, మీకూ, నాకూనూ..
ఈమధ్యలో పాదయాత్రలూ, అవేవో యాత్రలూనూ.. వాళ్ళ ఓపిక్కి మాత్రం మెచ్చుకోవాలి.అప్పుడెప్పుడో ఆయనెవరో పాదయాత్రచేస్తే టక్కున ముఖ్యమంత్రి అయ్యారుట. ఇంక ప్రతీవాడికీ ఇదే వేలంవెర్రయిపోయింది. ప్రజలమీద ఈమాత్రం శ్రధ్ధ ఇదివరకే ఉంటే గొడవే ఉండేదికాదుగా! ఏమిటో…

    ఇంక ఈమధ్యన entertainment పేరుతో, సినిమాలు తీసేవాళ్ళు కొత్తకొత్త పోకడల్లోకి దిగారు. వాళ్ళూ జాగ్రత్తలు తీసికుంటారులెండి. సినిమాలు మొదలెట్టేటప్పుడు పూజలకీ, పునస్కారాలకీ, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయించడానికీ ఈ పురోహితులు కావాలి, కానీ వాళ్ళమీదే జోక్కులేయడం.ఏమైనా అడిగితే, అదేదో freedom of expression అంటూ ఓ పేరెట్టడం.సరదాగా ఇంకో మతం వారిమీద జోక్కులేసి చూడమంటే సరీ కుదురుతుంది రోగం! ఇంకో కులం మీద కోపం ఉండొచ్చు, కానీ అంత దిగజారవలిసిన అవసరం లేదు.పైగా ఇప్పుడే ఓ స్టేట్మెంటోటీ.. ఎవరినీ కించపరచలేదూ, ధర్నాలు చేసేవాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారూ అంటూ..అసలు సినిమాల్లో కామెడీ అని పేరుచెప్పి చూపిస్తున్నదే చాలా చీప్.పైగా వాటికి హాస్యం అని ఓ పేరుపెట్టడమోటీ.. చెప్పేనుగా it can happen in India only..

    విజయ మాల్లయ్య గారు దీపావళికి ఓ వాయిదా జీతాలిస్తాడుట… అబ్బ ఎంత దయామయుడో కదా! ఇంకో విషయం మర్చేపోయాను… రాజమండ్రీ ఎంపీ ఉండవిల్లాయన కళ్ళు ఆ సెంట్రల్ జైలు మీద పడ్డాయి. ఎలాగోలాగ ఆ జైలుని అక్కడనుంచి మార్పించేసి, ఆ స్థలమేదో real estate వాళ్ళకి కట్టబెట్టేద్దామని ప్లానులేస్తున్నాడు.ఎంతదాకా సాధిస్తాడో చూడాలి !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఎవడిని నమ్మేటట్టు?

    అప్పుడెప్పుడో ప్రవచనాల్లో విన్నాను- దేముడు ఇదివరకటి యుగాల్లో వివిధ అవతారాలు ఎత్తి, రా‍క్షసుల్ని, దుష్టులనీ తెగనాడడానికి కారణం, ఆ రాక్షసులకి ఓ unique identity అనేది ఉండేదిట. కానీ ఈ కలియుగంలో రాక్షసుడు అనేవాడు, విడిగా ఉండడుట.మనిషి రూపంలోనే ఉంటాడుట, అలాగని భూమిమీద ఉన్న ప్రతీ మనిషినీ సంహరించడం అంటే మాటలు కాదుగా, దానితో దేముడు, ఈ కలియుగంలో అవతారం ఎత్తడం మానేసికున్నాడుట. విజ్ఞులు చెప్పిన మాటల్ని, వారంత పెద్దపెద్ద మాటలలో చెప్పేటంత పరిజ్ఞానం నాకు లేదు కానీ, నేను విన్న మాటల సారాంశం మాత్రం ఇదే.

    నిజమే కదూ.. మనలోనే రాక్షస ప్రవృత్తి కలవాళ్ళు ఎంతమందిలేరూ? ప్రతీ రోజూ పేపర్లలో చూస్తూంటాము, ఫలానా ఊళ్ళో కొడుకు తల్లినో, తండ్రినో చంపేశాడనీ, ఎవరో ఓ చిన్న పిల్లమీద అత్యాచారం చేశాడనీ, ఇంట్లోనే దుర్వ్యసనాలకోసం దొంగతనం చేశాడనీ, ఒకటేమిటీ…ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్ని. ఇదివరకటి యుగాల్లోని రాక్షసులు చేసే ప్రతీదీ ఈ కలియుగంలో మానవరూపంలో ఉన్న రాక్షసులు చేస్తున్నవే, ఎవడిని నమ్మాలో, ఎవడిని నమ్మకూడదో తెలియదు.

    కాకపోతే, అమెరికాలో ఈమధ్య ఆ దరిద్రుడెవడో, ఆ పసిపాపని కిడ్నాప్ చేసి చంపేయడమేమిటీ? ఆ పసిపాప చేసిన పాపం ఏమిటీ? ఈ దౌర్భాగ్యుడి దృష్టిలో పడడం తప్ప.అమెరికాలో జరిగుండడం కాబట్టి, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, దోషిని పట్టకలిగారు, శిక్ష కూడా అంత త్వరలోనూ అమలు చేస్తారనే ఆశిద్దాము. ఆ దరిద్రుణ్ణి శిక్షించడం వలన, పోయిన పాప తిరిగొస్తుందని కాకపోయినా, ఇలాటి పనులు చేసినవాడికి శిక్ష పడాలి.

    ఇదే సంఘటన మన దేశంలో జరిగుంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవేమో. పోలీసు యంత్రాంగం అసలు వాడిని పట్టినా, రకరకాల ఒత్తిళ్ళూ వచ్చుండేవి. అన్నీ పూర్తిచేసి కోర్టులో శిక్ష పడేసరికి ఓ దశాబ్దం, మళ్ళీ presidential pardon అంటూ ఇంకో దశాబ్దం.

   మనకు దగ్గరవాళ్ళే అసలు dangerous characters అనడానికి ఓ ఉదాహరణ, మా కళ్ళెదురుగుండానే, మేము వరంగాం లో ఉన్నప్పుడు జరిగింది. Victim మన తెలుగువారే.వారిదీ మా అమలాపురమే,కొద్దిగా average కంటే ఎక్కువ స్థాయి డబ్బున్నవాళ్ళూ.ఇంకో చిత్రం ఏమిటంటే, వారికి మన తెలుగువారి కుటుంబాలకంటే, మిగిలిన వారితోనే intimacy ఎక్కువా.ఒక్కో బిల్డింగులోనూ, నాలుగేసి ఫ్లాట్లుండేవి.ఒకదాంట్లో వీళ్ళూ, ఇంకోదాంట్లో ఓ బెంగాలీ కుటుంబమూ.

    ఒకరోజు ఫాక్టరీలో ఉండగా ఫోను వచ్చింది, ఫలానా వారింట్లో దొంగతనం జరిగిందీ, ఇంట్లో ఉన్న, మా ఫ్రెండు భార్యని, సీరియస్సుగా గాయపరచి, బంగారం తీసికుని వెళ్ళిపోయారూ అంటూ..అప్పటికే సాయంత్రం అయిదున్నరయింది, ఇంటికొచ్చి,ఈ సంఘటన జరిగిన ఫ్రెండింటికి వెళ్ళేటప్పటికి, అప్పటికే ఆవిడని సీరియస్సు కండిషన్ లో జలగాం పెద్ద ఆసుపత్రికి తీసికెళ్ళిపోయారుట, ఆ రోజు రాత్రి, మా జిఎంగారు కారు పంపించి,నన్ను అక్కడకి వెళ్ళి పరిస్థితి ఏమిటో తెలిసికునిరమ్మన్నారు.

    అసలు జరిగినవిషయంలోకి వస్తే తెలిసిందేమిటంటే, ఈ దోపిడీ చేసినవాడు, ఎక్కడో బయటనుండి వచ్చినవాడు కాదు, వీళ్ళ పక్క పోర్షనులోనే ఉంటున్న బెంగాలీవాళ్ళ కొడుకు. ఇంటరో, ఏదో చదివేవాడు.వాడి తండ్రి, మా కొలీగ్.వీళ్ళకీ, వాళ్ళకీ రాకపోకలూ, ఒకళ్ళింట్లో చేసికున్నవి, ఇంకోళ్ళింట్లో పంచుకోవడాలూ వగైరాలన్నీ ఉండేవి.ఇదేదో చాలదన్నట్టుగా, ఈవిడ ఇంట్లో ఉన్న నగా, నట్రా వివరాలూ అవీ కూడా ఆవిడో, వాళ్ళాయనో ఈ బెంగాలీవాళ్ళతో పంచుకున్నారు.ఎంతదాకా వచ్చిందీ అంటే, ఈ తెలుగువారింట్లో ఏ వస్తువు ఎక్కడుందో, వాళ్ళకంటే ఈ బెంగాలీ కుర్రాడికి ఎక్కువ తెలుసు!

    ఓ రోజు మధ్యాన్నం మూడింటికి, ఎవరో కాలింగు బెల్లు నొక్కితే, ఈవిడ తలుపు తెరిచేసరికి, ఆవిడని తోసుకుంటూ, మొహానికి ఓ మాస్క్ లాటిది చుట్టుకుని, ఓ కుర్రాడు లోపలికి వచ్చి, ఈవిడని బెదిరించి (కత్తితో),నగా నట్రా మూటకట్టేశాడు.ఎక్కడెక్కడ ఏమేమున్నాయో, ఇదివరకే తెలిసున్నవాడు కాబట్టి,అన్నీ సద్దేసి, ఇంక బయటకు పారిపోదామనుకుంటుండగా, ఆవిడ with all her might , వాడిని పట్టుకుని. ఆ మొహాన్నున్న మాస్కు కాస్తా పీకేయడంతో తెలిసింది, ఈ దరిద్రుడెవడో. తన identity తెలిసిపోయేసరికి, వాడూ చెలరేగిపోయి, నెత్తిమీద ఫ్లవరువాజు పెట్టి కొట్టడంతో ఆవిడ స్ప్ఱ్హహ తప్పి పడిపోయారు. ఇద్దరికీ మధ్య జరిగిన గొడవలో వాడికీ దెబ్బలు తగిలాయి. ఈవిడ పడిపోగానే, వాడు, నెమ్మదిగా తలుపులేసి, కిందకొచ్చేసి, ఆ నగల మూట తీసికుని ఫ్రెండింట్లో పెట్టి,ఇంతలో ఇంటికొచ్చేసరికి, అందరికీ ఆవిడ స్ప్ఱ్హహ తప్పి పడిపోయారని తెలిసి, పాపం అందరూ మూగుండడంతో, వీడూ ఆ గుంపులో చేరి, అయ్యో ..పాపం అనికూడా అన్నాడుట !

    ఇవన్నీ పోలీసువారి ఇంక్వైరీలో తేలాయనుకోండి, వివరాలన్నీ వ్రాయాలంటే ఓ పెద్ద కథ అవుతుంది.వాళ్ళింట్లో పోయిన నగల విలువ, ఉజ్జాయింపుగా ఓ మూడు లక్షలున్నాయన్నాడు, మా ఫ్రెండు, చివరకి పోలీసులు పట్టినవేమో అయిదారు లక్షలదాకా ఉండేటప్పటికి, చివరకి ఆ నగలు వీళ్ళకీ దక్కలేదుట, ఆ దొంగతనం చేసినవాడికీ కాకుండా పోలీసుల పరం అయ్యాయిట.కొసమెరుపేమిటంటే, వాడి కేసు వాడే వాదించుకుని, అతితక్కువ శిక్షతో బయటకొచ్చాడు!

    చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో కొద్దిగా పరిచయం అయిందంటే చాలు, వాళ్ళేదో వీళ్ళకి ఏదో పేద్ద intimate అయిపోయినట్టు, వీళ్ళ ఆస్థిపాస్థులూ వగైరాలన్నీ చెప్పేసికుంటారు. ఎప్పుడో వీలు చూసుకుని, ఇదిగో పైన చెప్పినట్టుగా ఆ “పక్కవాడే” నెత్తిమీద శఠగోపం పెడుతూంటాడు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొత్తరకం protesట్టులు…

    సంసారాలన్నతరువాత, భార్యమీద భర్తకీ, భర్తమీద భార్యకీ మాటతేడా రావడమూ, ఒకరి మీద ఇంకోరికి పీకలదాకా కోపం వచ్చి మాట్టాడుకోడం మానేయడం పేద్ద విచిత్రమేమీ కాదు. అస్సలు ఇలాటి అలకలు లేకుండా, కాపరాలు చేస్తే అందులో మజా ఏమిటండీ? పెళ్ళైన కొత్తలో భార్య అలిగితే, ఆ వెర్రి అమాయక భర్తే రాజీకి వచ్చేవాడు. ఓ పిల్లో, పిల్లాడో పుట్టుకొచ్చేసరికి, వాళ్ళని మధ్యలో పెట్టుకుని ఏదో లాగించేసేవారు.

    ఇంటిపెద్దాయన రిటైరయిన తరువాత మళ్ళీ వీళ్ళిద్దరే ( భార్యాభర్తలు) మిగులుతారు.మాటతేడాలకేమిటీ, కావల్సినన్నుంటాయి..వెదకాలేకానీ ఆవిడమాటాడే ప్రతీ మాటలోనూ పెడార్ధం తీసి, కావలిసినంత కోపం తెచ్చేసికోవచ్చు.ఇంటావిడ చేసే పనులో, ఆవిడ మనకి చెప్పిన పనులో, లేదా ఒక్కరోజూ మర్చిపోకుండా చేసే జ్ఞానబోధ లో, అదో కాలక్షేపమూ.. ప్రాణహాని లేనంతవరకూ ఏదైనా ఫరవాలేదనేది నా సిధ్ధాంతం.

    ఏ పనీపాటా లేకపోతే ఎప్పుడో నలభై ఏళ్ళక్రితం జరిగిందేదో గుర్తుకు తెచ్చేసికుని.. “అప్పుడు గుర్తుందా ఫలానా రోజున మనం బయటకెళ్ళాలని రెడీ అవుతూంటే, నన్ను వేళాకోళం చేశారు, అందరెదురుగుండానూ.. అప్పుడు నాకెంతకోపం వచ్చిందో తెలుసా..మా అమ్మ దగ్గర ఎంత ఏడిచేశానో తెలుసా.. ఫరవాలేదమ్మా కొత్తకదా.. అలా ప్రతీదానికీ కోపం తెచ్చేసికూడదూ,మా బంగారుతల్లివి కదూ..” అని సముదాయించడం వలన వదిలేశాను.ఆనాటి కాలమానపరిస్థితులలాటివి మరీ.. ఈరోజుల్లో అలాటి వేషాలేస్తే నలభై ఏళ్ళదాకా ఆగడం అవీ ఉండవు, మర్నాడే ” hi dear whats your problem..” అనేసి, తాడో పేడో తేల్చేయడమే.అందరూ అలా ఉంటారని కాదూ, అక్కడక్కడ!

    ఎప్పుడు ఎవరికి కోపం వస్తుందో… ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళడం, పని ఒత్తిళ్ళూ..ఇంట్లో పనిమనిషో, వంటమనిషో రాకపోవడంవల్ల వచ్చేవో.. చెప్పేనుగా వెదకాలే కానీ కావలిసినన్నీ..పోనీ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళకి ఇలాటివుంటాయీ, హాయిగా పెన్షను తీసికుంటూ, పిల్లలతో హాయిగా ఉండక, లేనిపోని కోపాలూ, తాపాలూ ఎందుకండీ అని అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు గొడవంతా, చాగంటి వారు చెప్పినట్టు ” ఇక్కడే మీరు పట్టుకోవాలి”.నన్నేదో అనకుండగా ఆవిడకీ రోజెళ్ళదు, ఆవిడమీద గయ్యిమనకుండా నాకూ రోజెళ్ళదు. ఏమిటో రిటైరయినప్పటినుండీ అలవాటు పడిపోయాము. పైగా విడిగా ఉంటున్నామాయే. ఊరికే మాటా మంతీ లేకుండా ఒకరు టీవీ దగ్గరా, ఇంకోరు కంప్యూటరుదగ్గరా కూర్చుంటే మజా ఏముంటుందీ? అదేదో mourning లా ఉంటుంది. హల్ చల్ ఉండొద్దూ, అలాటివి కావాలంటే ఒకళ్ళనొకళ్ళు మాటనుకోవాలి, కోపాలు తెచ్చేసికోవాలి, ఏదో కారణం ఉండొద్దూ నాకు, బయటకి వెళ్ళిపోడానికీ.. ఏమిటో అర్ధం చేసికోరూ.. ఎంత కథా కమామీషూ..

    ఆమధ్యన గురువారాలు గోమాతకి రొట్టెలు పెట్టడం మొదలెట్టానులెండి, వాటికీ నా బ్రేక్ ఫాస్టుకీ కలిసొస్తుందని మా ఇంటావిడేమో ఓ పది రొట్టెలు( అవేవో పుల్కాలంటారుట) చేస్తుంది. నాకు పెట్టేవాటిల్లోనైనా ఓ నూనె చుక్కో, నేతి చుక్కో వేస్తే, ఆవిడ సొమ్మేంపోయిందిటా? ఆ పుల్కాలేమో నాకు నవలడానికి వీలుండదూ ( కారణం అస్తమానూ చెప్పఖ్ఖర్లేదు!),ఈవిడ చూసేసరికి నేను, చాగంటి వారి ప్రవచనం వింటూ, బలవంతగా నోట్లో కుక్కుకుంటున్నాను. అంతే ఏమయ్యిందీ అంటూ కొశ్చనూ.. మరీ పొడిపొడిగా ఉన్నాయీ అని నా నోటివెంట వచ్చిందో లేదో, నిన్ననే వెన్న కాచి ఉంచిన ( ఇంకా పేరుకోలేదుకూడానూ) నెయ్యి తెచ్చి నా ప్లేటులో నాలుగు చెంచాలు వంచేసింది. మరీ అంత కోపగించుకోవాలా?

    ఒక్కొక్కప్పుడు, నేను బయటకెళ్ళాను కదా అని, ఇంట్లో తుడుపులూ, తడిగుడ్డతో తుడవడాలూ చేసికుంటూంటుంది. అదేదో శాపం పెట్టినట్టుగా, ఆవిడ ఇల్లు పూర్తిగా తడిగుడ్డతో తుడిచేసి, ఆరుతుంది కదా అని ఫ్యాను వేయడం, ఠింగురంగా మంటూ నేను ప్రత్యక్షం. అదేమిటండీ.. మామూలుగా పన్నెండున్నరకి కదా కొంపకు చేరేదీ,ఇప్పుడే రెక్కలు పడిపోయేలా ఇల్లు తుడిచానూ..అంటూ “అసలు ఎవడు రమ్మన్నారు ఇంటికీ ” అనే అర్ధంలో విసుక్కుంటే, మరి నాకు కోపం వచ్చిందీ అంటే రాదు మరీ.. ఇంట్లో ఆవిడ చేసే పనులకేమైనా live coverage ఉందా ఏమిటీ, నాకు తెలియడానికీ?

    ఈమధ్యన గోధుంపిండి, గోధుమలు కొని, మరపెట్టించి తెమ్మన్నప్పుడల్లా, ఈ గొడవంతా ఎవడు పడతాడూ, అనుకుని కొట్టువాడికే చెప్తూంటాను. వాడసలు ఏం గోధుమలు మర పట్టిస్తాడో ఏమిటో, ఆ పిండికి రుచీ పచీ ఉండదు. ఏదో మోతతప్పుతుందికదా అని కానీ, నాకేమైనా సరదా ఏమిటీ,అంత డబ్బూ ఇచ్చి ఆ గోధుంపిండి తెప్పించడానికీ? ఏదో ఒకసారి చెప్పింది సరిపోదూ, ఈసారి దగ్గరుండి చేయిస్తానులే అని అనేస్తాను. ఈవిడకేమో, ఏ Topiక్కూ లేనప్పుడు, ఆ గోధుంపిండి గుర్తుకొస్తుంది, మళ్ళీ మొదలూ.. ఒకటి మాత్రం చెప్పుకోవాలి- ఆవిడకి మాత్రం Topiక్సు కి లోటులేదు. ఎప్పుడు చెప్పినా కొత్తగా చేసినదేమో అన్నంత fresh గా చెప్పేస్తూంటుంది. నిజమే కాబోలనుకుంటాను అమాయక అర్భక ప్రాణిని.

    ఈమధ్యన ఇలాటికోపాలు వచ్చి “అర్ధదిన నిరసనలు” జరిగేటప్పుడు, ఏదో ఎవరి పని వారైనా చేసికునేవాళ్ళం.ఆవిడకి కొత్తగా ఫోను వచ్చినప్పటినుండీ ఓ కొత్త పధ్ధతి మొదలెట్టింది. సాయంత్రాలు అదేదో ఈవెనింగ్ వాక్కులకి వెళ్తూంటుంది.మామూలుగా తను వెళ్ళడం, ఓ అరగంట తరువాత నేనేమో వెళ్ళి ఆవిడతో కలిసి కొంపకు చేరడం.ఈ కోపాలూ, తాపాలూ వచ్చినప్పుడు, మరి మాట్టాడకూడదుగా, మరి నాకెలా చెప్పడం, బాల్కనీలోకి వెళ్ళి తెలుగులో ఓ మెయిల్ పంపించేస్తుంది..ఇదో hi tech protesట్టూ..బయటకు వాకింగు కి వెళ్తున్నానూ.. ఆలశ్యం అయితే కుక్కరు పెట్టేయండీ… అంటూ. అదేదో నోటితోనే చెప్పొచ్చుగా, పెట్టనంటానా ఏమిటీ? ఈవిడ మెయిల్స్ కాదుకానీ, వాటితోనే నా inbox అంతా నిండిపోతోంది!!

    అఛ్ఛా నాకో విషయం చెప్పండీ– ఆ కొత్త ఫోనూ, ఆవిడ wi-fi విన్యాసాలతోటీ, నా desk top మరీ నత్తనడకైపోయింది. అదేదో బోరింగు నూతులు తవ్వినప్పుడు, ఒకరికంటే ఇంకోరు లోతుగా తవ్వేసికుని, అవతలివారికి నీళ్ళు రానీకుండా చేస్తూంటారూ, అలాగ నా modem నుంచి వచ్చే సిగ్నల్స్ ఏమైనా ఈ కొత్త ఫోను హడప్చేసేసికుంటోందా ఏమిటీ?

   అమ్మాయిచ్చిన టాబ్బూ, ఈవిడ కొత్త ఫోనూ కలిపి నన్నూ, నా సిగ్నల్స్ నీ రోడ్డెక్కించేశారు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అడిగితే బావుండదేమో…..

   ఒక్కొక్కప్పుడు కొన్ని విషయాలు అవతలివారిని అడిగితే బావుండదేమో అనిపిస్తూంటుంది. కొన్నైతే చాలా delicate గా కూడా ఉంటూంటాయి. ఉదాహరణకి ఎవరైనా మనింటికి వస్తామంటారనుకోండి, వారికిష్టమైనప్పుడు రానీయాలి కానీ, ఎప్పుడు వస్తారూ అని మాటిమాటికి అడగలేము.అసలు ఈ అడగడం అనేదెందుకంటే, మనవైపు అయితే ఫరవాలేదు, కానీ ఈ పెద్దనగరాల్లో దూరదూర ప్రాంతాల్లో ఉంటూంటామాయె, ఎప్పుడో “మూడ్” కుదిరి, ఆ వద్దామనుకున్నవారు, మన ఇంటికి బయలుదేరి వచ్చారే అనుకోండి, అప్పుడు మనం, వాళ్ళు అదే రోజున వస్తారని తెలియక బయటకు వెళ్ళుండొచ్చు, అలాటప్పుడు ఇద్దరికీ బావుండదు.

    అలాగే ఈ రోజుల్లో ఎవరైనా స్నేహితులో, చుట్టాలో వచ్చారనుకోండి, మరీ వాళ్ళు టాక్సీ లోంచో, ఆటో లోంచో దిగకుండానే, గుమ్మంలోనే నిలబెట్టి, తిరుగు ప్రయాణం ఎప్పుడూ అని అడగలేము కదా. అలా కాకుండా, ఆ వచ్చినవాళ్ళే తిరుగుప్రయాణానికి కూడా టికెట్లు బుక్ చేసేసికుంటే గొడవే లేదు. ఉభయ తారకం. అలా కాకుండా, ఎప్పుడో వాళ్ళు తీరిగ్గా, ఇంక బయలుదేరుతామూ, టిక్కెట్లున్నాయేమో చూడూ అన్నప్పుడే గొడవొస్తూంటుంది.మేము ఇదివరకటి రోజుల్లో, అంటే ఈ online లూ అవీ లేనప్పుడన్నమాట, తణుకు వెళ్ళాల్సొచ్చినప్పుడల్లా, మా మామ గారికి ముందుగానే తెలియపరచేవాళ్ళం, ఫలానా రోజుకి వస్తున్నామూ, ఫలానా రోజుకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వు చేసుంచండీ అని.

    కొంతమంది ఏదో ఫలానా ఉద్యోగానికి apply చేస్తున్నామనో, చేశామనో చెప్తూంటారు. విషయం ఏమైందని మనం అడిగితే ఏమనుకుంటారో అని భయం, అసలు అలాటప్పుడు వాళ్ళు మనకెందుకు చెప్పారూ అని కూడా అనిపిస్తూంటుంది. అడిగితే, ఓ గొడవా, అడక్కపోతే ఇంకో గొడవా. పైగా కొంతమంది విసుక్కుంటూంటారు కూడానూ,ఏదైనా result వస్తే మేము చెప్పమా ఏమిటీ? చూస్తూంటే మాకంటే మీకే ఆత్రుతగా ఉన్నట్టుందే అంటూ అక్షింతలు కూడా పడొచ్చు.
పెళ్ళిసంబంధాల విషయాల్లోనూ ఇలాటి అనుభవాలు కలుగుతూంటాయి. ఏదో దగ్గరి వారు కదా అని అడిగామా, అన్నీ బావుంటే
సరైన సమాధానం వస్తుంది.ఏదో అటూ ఇటూ గా ఉన్నప్పుడే గొడవ.అవతలివారు చెప్పే సమాధానాన్ని బట్టి, ఒక్కొక్కప్పుడు, ఇంటావిడచేతిలోనూ చివాట్లు పడుతూంటాయి.. ” అస్సలు మీకెందుకండీ వాళ్ళ గొడవా.. ఊళ్ళోవాళ్ళ విషయాలన్నీ కావాలి.. అదే శ్రధ్ధ ఇంటి విషయాల్లో పెడితే ఎంత బావుండేదీ.. ” అని.

   ఆమధ్య, నాకు తెలిసిన వారి భార్య స్వర్గస్థులయ్యారు. నేనూ, నా ఫ్రెండూ మాకు దగ్గరలో ఉన్న ఓ పూజారిని, కర్మకాండలకోసం ఎరేంజ్ చేసి, ఆ అవతలివారిని direct గా,బాడీ తీసికుని వచ్చేయమన్నాము. నేనూ, నా ఫ్రెండూ వాళ్ళువచ్చే ముందరే, అక్కడకి చేరుకున్నాము. అప్పటికే ఆ పూజారి కూడా వచ్చేసున్నారు. మమ్మల్ని చూడగానే, “అరగంట అయిందీ వచ్చి, ఇంకా ఎంతసేపూ బాడీ తీసుకురావడానికీ..” అంటూ, మామీద కోప్పడ్డంమొదలెట్టాడు. మా ఫ్రెండు, పోనీ ఫోనుచేద్దామా, బయలుదేరారో లేదో తెలుస్తుందీ, అని ఒకసారి ధైర్యం చేసి ఫోను చేసి, పది నిముషాల్లో బయలుదేరుతారూ అనే విషయం తెలిసికున్నాడు. ఇలాటివాటిల్లో ఓ టైమూ అవీ keep చేయడం కూడా కష్టమే కదా, అలాగని మాటిమాటికీ ఫోను చేసి అడగడమూ భావ్యం కాదు. చాలా delicate situation.ఎదురుగుండా ఉంటే, ఆ పూజారి మమ్మల్ని అడగడం మానడూ, ఇలా కాదని కొంచం దూరంలో వెళ్ళి నుంచున్నాము, ఇతని గొడవేనా తప్పుతుందని. ఓ 45 నిముషాల తరువాత వచ్చారనుకోండి.

    ఇలాటివి జరుగుతూంటాయి. సమయస్పూర్తితో విషయం చక్కబెట్టడం తప్పించి చేసేదేమీ లేదు…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ చిన్న correction…

   నిన్న తిన్నతిండి అరక్క, ఎవరో నాకు తెలిసినవారు పంపారూ, పోనీ ఎవరికైనా ఉపయోగిస్తుందీ అనుకుని, ఆ మెయిల్ లోని వివరాలు తీసి, పైగా వాటిని ఎఱ్ఱ రంగులో కూడా పెట్టి ఓ టపా వ్రాశాను.. అందులోని విషయాలైతే నాకసలు అర్ధమే అవలేదు.అది వేరే విషయం. కానీ బాధెక్కడ వేసిందంటే, నా మీద అభిమానం కొద్దీ, చాలా మంది చదివారు, ఇంకా చదువుతున్నారు కూడానూ. It is only fair on my part to bring the truth to all readers. అదికూడా ఎప్పుడు తెలిసిందీ అంటే నా టపాలో sunnA గారు పెట్టిన వ్యాఖ్య ద్వారానూ, పెట్టిన లింకు ద్వారానూ.

    ఇప్పుడు తెలిసిందేమిటంటే, ఏ మెయిల్ పడితే ఆ మెయిల్ నిజానిజాలు తెలిసికోకుండా ఊరికే టపాల్లో పెట్టేయకూడదూ అని !

    మళ్ళీ ఛస్తే అలాటివి చేయను ( unless I confirm the veracity). ఏదో ఈసారికి క్షమించేయండి.. ఆ టపా కూడా delete చేసేశాను..

   Thanks a lot sunnA

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఊరికే కూర్చుని valuable documents పోగొట్టుకోకండి…

    అదేమిటో, నాకు ఇంట్లో ఉండే ముఖ్యమైన కాగితాలు misplaceచేయడం ఓ అలవాటుగా మారిపోయింది!! ఏదో ఇంగ్లీషులో misplace అంటే కొంచం స్టైలుగా ఉంటుందని కానీ, నిజం చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి, ఏది ఎక్కడ పెట్టామో మర్చిపోడమన్న మాట! మరీ ఇంటికి పెద్దాణ్ణి కదా అని, ఎవరూ నోరుపారేసికోరు.అప్పుడెప్పుడో నా CGHS కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. నానా తిప్పలూ పడి మొత్తానికి పోలీసు స్టేషన్లో కంప్లైంటిచ్చి ఏదో డూప్లికేటోటి సంపాదించేశాను. ఉద్యోగంలో ఉన్నప్పుడు, నా ID Pass కూడా అలాగే పోగొట్టుకుని మూణ్ణాలుగు సార్లు కొత్తది తీసికోవలసివచ్చింది.అలవాటు ఎందుకు మార్చుకోడం లే అని, రిటైరయినతరువాతకూడా అదే రంధి !!

    చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడో “స్వర్ణయుగం” రోజుల్లో అదేదో కో ఆపరేటివ్ బాంకు లో కొంత డబ్బులు ఎఫ్ డి లో వేశాను ( అప్పుడప్పుడు మా ఇంటావిడకు surprise ఇస్తూందామని!), గత నాలుగైదేళ్ళుగా, faithful గా బాంకుకి వెళ్ళడం, renew చేయించుకోడమూనూ.. ఏమిటో ఈమధ్యన నా contemporaries అందరూ ఒకళ్ళ తరువాత ఇంకోళ్ళు ” వెళ్ళిపోతూండడంతో“, నాకూ వైరాగ్యం లాటిదోటొచ్చేసి, మా పేరన ఉన్నవి కాస్తా, ఒకేచోట పెడితే బావుంటుందేమోనన్న ఓ మంచి ఆలోచన వచ్చి, మిగిలిన కాగితాలు దొరికాయి, కానీ ఈ మాయదారిది దొరకదే. మామూలు HDFC, ICICI వాళ్ళలాగ, ఈ బాంకు వాళ్ళు కూడా అడగ్గానే డూప్లికేటు ఇచ్చేస్తారులే అనే ఉద్దేశ్యంతొ, వాళ్ళని వెళ్ళి అడిగితే, అదేదో 200 రూపాయల స్టాంపు పేపరు మీద, ఆ బాంకు వాళ్ళిచ్చిన మరాఠీ ముక్కలు టైపుచేయించి, దాన్ని అదేదో నోటరైజుట, చేయించి తెమ్మన్నారు.

    ఏదో ఒక పని లేకుండా వెళ్ళదుగా రోజూ.. నా project stamp paper మొదలెట్టి, మొత్తానికి సంపాదించాను నా స్నేహితుడు చెప్పిన వివరాల ధర్మమా అని. దాన్ని మరాఠీలో టైపు చేయించాలి, దాన్నేమో నోటరైజుకూడా చేయించాలి కదా అని, ఇక్కడ కంటోన్మెంటు కోర్టనోటుందిలెండి, అక్కడకి వెళ్తే రెండు పనులూ ఒకేసారి పూర్తిచేసికోవచ్చూ అనుకుని, నాలుగు రోజులక్రితం వెళ్ళాను.ఈ కోర్టుల్లో ఒక సౌలభ్యం ఉంది, మనమేమీ వెదుక్కోనఖ్ఖర్లేదు, గేటు తీసికుని లోపలకి వెళ్ళేసరికి, నల్లకోట్లేసికుని, ఓ గొడుక్కింద టేబిలూ, ఓ టైపింగ్ మెషీనూ పెట్టుకుని కావలిసినంతమంది కనిపిస్తారు. ప్రతీవాడూ పలకరించేవాడే, ఏమిటో బాధేస్తుంది.. ఇంత చదువూ చదివి చివరకి ప్లీడరీ చదువు ఇంత దిగ జారిపోయిందా అని! ఔననుకోండి న్యాయశాస్త్రం చదివిన ప్రతీ వాడూ ఓ సోలి సొరాబ్జీయో, ఎంసిఛాగ్లాయో, తారాపూరో, పాల్కివాలాయో, తార్కుండేయో కాలేరుగా, ఎంత చెట్టుకంత గాలి.అందరూ వీళ్ళలాగైపోతే మన ఎఫీడవిట్లూ వగైరాలెవడుచేస్తాడూ?

    అందువలన డాక్టర్లలో RMP లూ, ప్లీడర్లలో ఇలా గొడుగులకిందకూర్చుండేవాళ్ళూ part of life.. ఇలాటివాళ్ళే లేకపోతే మనలాటివాళ్ళు మట్టికొట్టుకుపోతారు. So hats off for these professionals!! కథలోకొస్తే, నన్ను చూసి ఒకావిడ ఎదురొచ్చారు. మళ్ళీ ఆడావిడే ఎందుకొచ్చారూ అని అడక్కండి..ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, నా పనేదో చెప్పాను-ఓహ్ దానికేముందీ, మొత్తం నోటరైజు చేయించి ఇవ్వడానికి టోటల్ ప్యాకేజీ 350 రూపాయలన్నారు. మళ్ళీ అక్కడకీ, ఇక్కడకీ ఎవడు తిరుగుతాడులే అని సరే అన్నాను.
.

    అయిదంటే అయిదే నిముషాలంటూ ఓ అరగంటకొచ్చాడు, మరాఠీలో టైపు చేసేవాడు, ఈవిడకి రాదుగా మరీ.మళ్ళీ ఇందులో ఓ మెల్తీ.. మాదేమో జాయింటెక్కౌంటూ, వెళ్ళిందేమో నేనొఖ్ఖణ్ణీనూ, ఆ నోటరైజు చేసే ఆయనేమో ఇద్దరి గురించీ అడుగుతాడాయే, ఎలా మరీ.. మళ్ళీ ఆవిడే dont worry, I will manage.. అన్నారు. మళ్ళీ ఈ “manage” కి ఏమైనా extra charge అడుగుతుందేమో అనుకుని, అయినా ఇంతదాకా వచ్చిన తరువాత చేసేదేముందీ అనుకుని, కానిమ్మన్నాను. ఈ ప్లీడర్లకేమి తెలివితేటలండి బాబూ, వామ్మోయ్ అందుకేనేమో తిమ్మిని బమ్మీ, బమ్మిని తిమ్మీ చేసేస్తూంటారు !!అదేదో disqualification అని కాదూ, విషయం చెప్పాను!!

    మొత్తానికి ఆ టైపుచేసేవాడితో ఏం చెప్పారో కానీ, అతనుకూడా, మా ఇంటావిడ పేరు పట్టేంత ఖాళీ ఉంచేసి ఆ టైపింగేదో పూర్తిచేసేశాడు. ఆ టైపుచేయబడిన కాగితాలూ, నేనూ, ఆ ప్లీడరమ్మగారూ, ఇంకో “గొడుగు” కింద కూర్చున్న ఓ నోటరీ దగ్గరకు వెళ్ళి, ఆయనగారి ఎసిస్టెంటు ఎక్కడెక్కడో stamps వేసేయగా, ఆ నోటరీగారేమో సంతకాలు పెట్టేశారు. అందులో ఏం టైపుచేశారో, నాకూ తెలియదూ, ఆ సంతకం చేసినాయనకీ తెలియదు. But at the end of the day, 200Rs Stamp Paper, notarised.. thats what mattered !!

    ఇంక రెండో పార్టుకి రావొద్దూ మరీ, ఆ నోటరీగారి ఎసిస్టెంటు గారేమో, ఆ కాగితాలన్నీశుభ్రంగా స్టాపిల్ చేసి మరీ ఇచ్చారు. వాటిని విడదీయాలి, ఆ ఉంచిన ఖాళీలో, మా ఇంటావిడ పేరు టైపుచేయాలి, మళ్ళీ alignment పాడవకుండా జాయిన్ చేయాలి.క్షణాల్లో చేసేశాడు !!

    ఈ పనులన్నీ చక్కబెట్టుకుని, ఇంటావిడచేత “ఖాళీల్లో” సంతకం పెట్టించి, ఆ బాంకాయన దగ్గరకి తీరా వెళ్తే, ఆ కాగితాలన్నీ తిరగేసి, ఇందులో ” సాక్షి” సంతకం లేదు పొమ్మన్నాడు. మళ్ళీ ఇదేం గొడవరా బాబూ అనుకుని అడిగాను, ఎవరిదైనా పరవా లేదా అని. ఫరవాలేదూ, కానీ ఆ సంతకం పెట్టిన వాడి పేరూ, ఎడ్రసూ ముఖ్యం అన్నారు.మళ్ళీ మొదలూ.. ఆ “సాక్షి” కోసం. ఈరోజుల్లో స్టాంపు పేపర్లమీద సాక్షి సంతకాలు పెట్టమంటే ఎవరికైనా భయమే, ఏం కొంప మునుగుతుందేమో అని! అంతదాకా ఎందుకూ.. నేనైతే సంతకం పెట్టను..అలాటిది నాకు సంతకం పెట్టేవాడెక్కడ దొరుకుతాడూ, అయినా ఆ “సాక్షి” సంతకం లేకపోతే నా పనీ పూర్తవదూ.. అప్పుడప్పుడు మందులూ, మాకులూ తీసికునే మెడికల్ షాపతనిదగ్గరకు వెళ్ళి బాబ్బాబు కొద్దిగా సాక్షి సంతకం పెట్టూ అని అడగ్గానే, మరీ నా “శీలం” శంకించకుండా, ఆ సంతకమేదో పెట్టేయగా, ఆ కాగితాలు తీసికెళ్ళి ఆ బాంకాయనకిచ్చొచ్చాను.రేపు శలవూ.. ఎల్లుండొచ్చి తీసికెళ్ళూ అన్నారు.. ఇంకేమీ గొడవుండదనే అనుకుందాము… ఇదండీ వెరసి 550 రూపాయల ఖర్చూ, తిరుగుడూ… అ బాంకువాళ్ళిచ్చే నెలసరి వడ్డీ కంటే ఎక్కువే మరి..
Moral …. It is economical not lose valuable documents….

    ఈ మధ్యన మా అబ్బాయి హరీష్ ప్రతీ రోజూ పేపర్లలోకి వచ్చేస్తున్నాడు…Workshop for parents, Tenderleaves Workshop

    ఇవన్నీ ఇలా ఉండగా, ఈవేళ మహర్నవమి అని, ఇంటావిడ వడలు చేసింది, నైవేద్యానికి.. ఇప్పుడే నాలిగింటికి ఒకటి నోట్లో వేసికుని.. ఏవండీ మినప్పప్పులో కానీ రాళ్ళేమైనా తగిలాయా… అయినా “పంటికింద రాయి మీకేం తెలుస్తుందిలెండీ...” అంటూ..మళ్ళీ ఆ మాటెందుకో.. ఏమిటో ఇలా ఉన్నారు ఇంట్లోవాళ్ళుకూడా…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఇదివరకటి రోజుల్లోనూ పిల్లలు పై ఊళ్ళకి వెళ్ళి హాస్టళ్ళలో ఉండి చదువుకునేవారు. కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళుండి, పని కానిచ్చేసేవారు.కానీ ఈ రోజుల్లో పిల్లలు పైచదువులకి పై ఊళ్ళకి వెళ్ళారూ అంటే చాలు, పేపర్లలో చదివే వార్తలు, సంఘటనలూ చూసి, గుండె బేజారెత్తిపోతోంది.పై ఊళ్ళకనేమిటిలెండి, ఉన్న ఊళ్ళో చదివినా, ఎప్పుడు ఏం కొంపముంచుతాడో అనే భయం.అంటే దీనర్ధం పిల్లలకి values తగ్గాయనుకోవాలా, లేక అక్కడి peer pressure కారణంగా అనుకోని పరిస్థితుల్లో చిక్కడిపోతున్నారో తెలియడం లేదు. ఏది ఏమైనా తల్లితండ్రులకి మాత్రం దినదినగండం గా తయారయింది ప్రస్తుత పరిస్థితి.పిల్లలు ఎవరైనా, ఎక్కడివారైనా వాళ్ళని కన్నతల్లితండ్రులు పడే బాధ కి, కులం, ప్రాంతం, భాష అనే వ్యత్యాసం ఉండదు.

   ఈరోజుల్లో వచ్చిన వాతావరణ మార్పుల ధర్మమా అని, ప్రతీదీ super fasటే. ఇప్పటి తరం తల్లితండ్రులకి గుర్తుండే ఉంటుంది, వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇళ్ళల్లో కట్టుబాట్లు ఎలా ఉండేవో. అవేవో dictatorship లాటివీ, మనం మన పిల్లల్ని అలాటి వాతావరణం లో పెంచడమా అనేసికుని, so called freedom లాటివి ఇచ్చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. It is their own making, can not blame anybody..స్వేఛ్ఛ ఇవ్వాలి, కాదనం, కానీ ఎంతవరకూ? ఇదివరకూ ఇచ్చేవారు, కానీ ఆ ఇచ్చిన స్వేఛ్ఛని monitor చేసేవారు.ఈరోజుల్లో టైముండడం లేదు.ప్రతీదానికీ change, development అంటూ పేర్లోటీ..ఏమైనా అడిగినా, ” మీ రోజుల్లోలా ఉండమంటే ఎలా కుదురుతుందీ, కాంపిటీషన్ ధర్మమా అని పిల్లలు అన్నిరంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలీ, వాళ్ళకి free hand ఇస్తేనేకానీ కుదరడం లేదూ అంటూ ఏవేవో కారణాలు చెప్తుంటారు.

    మొన్నెప్పుడో పేపర్లో చదివాను- అమలాపురంలో ఒక అమ్మాయి, తన తల్లితండ్రులు నిశ్చయించిన సంబంధానికి ఇష్ట పడక, తాను ప్రేమించిన పిల్లాడితో పారిపోతూ, కొత్తపేట దగ్గర వాళ్ళు ప్రయాణం చేస్తూన్న కారు పంట కాలవలో పడడంతో , ఈ పిల్ల కాస్తా మరణించింది ప్రమాదంలో ! పైగా ఈ పారిపోవడాలూ వగైరా process అంతా, ఈ అమ్మాయి ప్రేమించిన పిల్లాడి ఫ్రెండ్స్ ఎరేంజ్ చేశారుట! వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఈ పిల్లమాత్రం వెళ్ళిపోయింది. ఏం సాధించిందిట? పైగా ఏదో సినిమాల్లో చూపించినట్టు, ఎవడో రావడం ఏమిటీ, ఈ పిల్లేమో పెళ్ళికోసం తల్లితండ్రులు ఇంట్లో ఉంచిన 30 లక్షల రూపాయలూ, బంగారమూ తీసికుని పారిపోవడేమిటీ.. వివరాలు ఇక్కడ చదవండి..

   వాడెవడో అదేదో సినిమాలో అలా చేశాడుట అందువలన మనమూ అలాగే చేద్దామూ అనుకోడమూ- ఇంకో ఆలోచన రాదసలు. దిక్కుమాలిన సినిమాలు కూడా అలాగే తగలడ్డాయి. ఓ అర్ధం పర్ధం ఉండదు.ఏమైనా అంటే, సినిమాలేం చేస్తున్నాయీ, క్రమశిక్షణ అనేది తల్లితండ్రులు నేర్పాలికానీ అంటారు ఆ సినిమా వాళ్ళు. వీళ్ళేమో సినిమాల ప్రభావం ఎక్కువవుతోందీ అంటారు. ఇవన్నీ కాశ్మీరుసమస్య లాటివి. Final losers are parents..

    నిన్నెక్కడో విశాఖపట్నం రుషి కొండ బీచ్ లో ఓ అరడజనుమంది పిల్లలు ( బి.టెక్ మొదటి ఏడాది) సముద్రంలో గల్లంతయ్యారుట.పోలీసులూ, మత్స్యకారులూ చెప్తున్నా వినకుండా సముద్రం లోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ రోజూ దేశంలో ఎక్కడో అక్కడ ఇలాటివి సామాన్యం అయిపోయాయి. ఇలాటి సంఘటనలకి అసలు అంతెక్కడా?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొత్తదేదో కొనాల్నుండడమే కాదు….

    ఏమిటో ఇదివరకటి రోజుల్లో అయితే, పుట్టినరోజులకి ఇంట్లోవారికి ( పిల్లలూ, ఇంటావిడ) ఏదైనా బహుమతీగా ఇవ్వాలంటే, ఏదో ఒకటి కొని, ఇంకోరెవరికీ చెప్పకుండా, అదే రోజు ఇస్తే అందులో ఒక అందమూ, surprise elemenటూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అలా కుదరడంలేదు. కారణాలు మరేమీ పెద్దవి కాదనుకోండి, అయినా ఆ అవకాశం కూడా కలగడంలేదు.

    పిల్లల విషయంలో వాళ్ళకి అవసరమైనవి, వారే కొనుక్కుంటారులే అనే సదుద్దేశ్యంతో ఏ Shopperstop గిఫ్ట్ ఓచర్లో ఇచ్చేస్తున్నాము. అదీ కాకపోతే, ఓ కవరులో మనకి ఓపికున్నంత డబ్బు పెట్టేసి చేతిలో పెట్టేస్తే సరిపోతోంది.మరీ, మనవరాళ్ళకీ, మనవలకీ అలా డబ్బూ, గిఫ్ట్ వోచర్లూ పెడితే ఏమ్ బావుంటుందీ, పోనీ అలాగని ఏదైనా కొందామా, అంటే, నేను కొందామనుకున్న వస్తువు అప్పటికే వాళ్ళ అమ్మా, నాన్నలు కొనేయడం ధర్మమా అని, దీంట్లో ఏమీ novelty ఉండడం లేదు.పైగా మనం ఇచ్చినదాన్ని చూస్తూనే–“అర్రే తాతయ్యా, నా దగ్గర ఇదివరకే ఉందీ.”.. అనడం, దాన్ని సద్దడానికి పిల్లలు ఏదో మొహమ్మాటానికి వాళ్ళతో, “నీదగ్గర ఉన్నది, పాత వెర్షనూ, ఇది కొత్తదీ..” అనేసి ఊరుకోబెట్టడమూ పిల్లల్నీ, మనల్నీ..ఏమిటో ఈ రోజుల్లో ప్రతీదానికీ( ఒక్క కట్టుకున్నదానికి తప్పించి) వెర్షన్లూ అవీనూ…

    ఇంక ఇంటావిడతో అయితే, పుట్టినరోజుల గిఫ్టుల విషయంలో, ఇదివరకటి రోజుల్లో అయితే, ఇంట్లో అందరికీ ఉపయోగించే వస్తువోటి తెచ్చేసి, దానికే నీ పుట్టినరోజు గిఫ్టూ అని పేరెట్టేసి లాగించేసేవాడిని !! ఆనాటి కాలమానపరిస్థితుల బట్టి, పాపం తనూ సరిపెట్టేసికునేది, అప్పట్లో మరీ వీధిన పెట్టకుండా !! కానీ రోజులు గడిచే కొద్దీ, ఎప్పటికో అప్పటికి తను ఇన్నాళ్ళూ కడుపులో దాచుకున్నవేవో , రావొద్దూ మరీ. కడుపులో తొమ్మిది నెలలూ దాచుకున్న పిల్లల్నైతే 1974 ఒకరినీ, 1980 లో ఒకర్నీ, బయటకు తెచ్చేసి, వాళ్ళని పెంచి పెద్దచేసి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేటట్టు చేసేసి, వాళ్ళకో తోడూ ఏర్పాటు చేసింది.

    కానీ ఆ మిగిలినవాటిని కూడా బయటకు తేవొద్దూ మరీ, ప్రతీ పుట్టినరోజుకీ, తనను నేనూ పిల్లలూ ఎలా “ taken for riడ్డో ” అల్లుడితోనూ, కోడలుతోనూ, మనవళ్ళూ, మనవరాళ్ళతోనూ,ఓ చిఠ్ఠా తెరిచి, చెప్పుకుని సంతోషిస్తూంటుంది…అయినా ఇన్నేళ్ళొచ్చినతరువాత ఇంకా surpriజులు ఇచ్చే ఓపికెక్కడా? అయినా ఓసారి ప్రయత్నిద్దామని, ఈసారి ( oct 15) ఓ రెండు మూడు రోజులు ముందుగానే, పాపం ఎప్పణ్ణుంచో అడుగుతోందీ, ఆ మాయదారి సెల్ ఫోను మారుస్తారాఅంటూ, పోన్లే అదేదో తెద్దామని కొట్టుకి బయలుదేరాను.పోనీ అందరూ ఈ రోజుల్లో తెప్పించుకునేటట్టు అవేవో online stores ల ద్వారా తెప్పిద్దామా అంటే, ఏదో ఒకటి తెప్పించామే అనుకోండి, అదేదో వాడడం తెలియకో, సరుకులోని నాణ్యత తక్కువో అయితే, మళ్ళీ మార్చడం అవీ అదో గొడవా.

    ఈమధ్యన mystery shopping సందర్భాల్లో ప్రతీ పెద్ద పెద్ద షాపులకి వెళ్ళడమోటొచ్చిందిగా, పోనీ ఈసారి ఓ genuine shopper గా వెళ్దామూ, లేకపోతే ఆ అలవాటు మర్చిపోయినా మర్చిపోవచ్చూ, అనే సదుద్దేశ్యంతో, మా ఇంటావిడ దగ్గరుండేది ఎలాగూ Nokia ఏ కదా అదేదో తెచ్చేస్తే సరిపోతుందీ అని బయలుదేరాను, మరీ ipad లూ, Galaaxiలూ, Smartphonలూ తెచ్చే ఓపిక లేక నిజం చెప్పొద్దూ.. వాడిదగ్గరకెళ్ళి, ఏదో ఫలానా రేంజ్ లో ఓ ఫోను చూపించూ అని అడిగాను.ఏమిటేమిటో చూపించేసి ఏవేవో చెప్పేశాడు. అవేమీ అర్ధం అవలేదనుకోండి, అయినా ఓ టోపీ అవీ పెట్టుకుని వెళ్ళి, వాడు చెప్పినవాటికన్నీ తలూపేస్తే ఎలా, నాకూ తెలుసునని పోజు పెట్టొద్దూ? అదేదో Wi-fi ఉందా దీంట్లో అని అడిగాను. నిజం చెప్పాలంటే నాకు Hi-fi కీ Wi-fi కీ తేడా ఈషణ్మాత్రం తెలియదంటే ఒట్టు ! ఏదో వినడానికి బావుంది కదా అని, అలా అడిగాను, ఆ కొట్టులోవాడికి అర్ధం అయిందో లేదో– ఉందీ అన్నాడు.

   అయినా ఈమధ్యే తెలిసిందిలెండి, ఈ Wi-fi అంటే ఏమిటో, అదీ మా అమ్మాయీ అల్లుడూ ఇచ్చిన Tab ధర్మమా అని- ఇంట్లో ఉపయోగిస్తే డబ్బులవవూ, బయటకివెళ్ళి ఉపయోగిస్తే బిల్లులు తడిపిమోపెడవుతాయీ అని!ఏదో మొత్తానికి అదేదో touch screenట తీసికున్నాను.ఇంటికొచ్చి, మా మనవడు నిద్రపోతూండగా, అబ్బాయికిచ్చి ఆ పాతదానిలోని siమ్మో,సింగినాదమో అదేదో మార్పించి, ఇంటావిడ చేతిలో పెట్టేస్తే ఆవిడే ఏదో తిప్పలు పడుతుందీ అనుకుని, చేతిలో పెట్టేశాను ఓ రెండు మూడు రోజులు ముందుగానే. పిల్లల్ని అడిగే కొన్నారా అంటూ ఓ query.. ఏదో సరదా పడి నాకు నచ్చిందేదో కొంటే మళ్ళీ ఇదోటా?

    దీనిల్లుబంగారంగానూ, దాంట్లో Wi-fi లేదుట. పైగా ఆ Touch screeనో అదేదో, త్వరగా జరగదూ, జరపాలని చూడ్డం, ఎక్కడ నొక్కితే అదేదో open అయిపోవడమూ, ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది! ఏమిటో స్వంతంగా ఏదో మొదటిసారి కొందామనుకుంటే ఇలా ఉంది నిర్వాకం! ఇంటావిడ మొహంలోకి చూడాలంటేనే కుదరలేదు. అప్పటికీ చెప్తూనే ఉన్నాను, కొత్తది కదా,అలవాటయ్యేకొద్దీ అదే కదులుతుందిలే అంటూ.. ఇదేమైనా కొత్త చెప్పుల్లాటివా ఏమిటీ, వాడేకొద్దీ కఱవడం మానేస్తాయీ అనడానికీ?

    ఇలా కాదనుకుని, పోనీ మారుస్తాడేమో అని అడుగుదామా అంటే, ఒప్పుకుంటాడో లేదో, అయినా అదేదో Wi-fi ఉందీ అన్నాడూ, అదిలేదూ అని ఓ సాకు చెప్పి మారుస్తావా అని ఫోనులో అడిగాను.మారుస్తానూ అని ఆ ఫోనెత్తిన పిల్ల చెప్తే, ఆ ఎండలో పడి పోయాను. చెప్పానుగా నా Mystery Shopping “తెలివితేటలు”, అన్నీ ఉపయోగించేసి, తప్పంతా వాళ్ళదే అన్నట్టు చెప్పేశాను.నా అవతారంచూసి, పోనీ పెద్దాయన్ని శ్రమ పెట్టడం ఎందుకులే అనుకుందేమో, ఇంకో మోడల్ చూపించింది.చూపించింది కదా అని, ఈ రెండు మూడు రోజుల్లో నేర్చుకున్న కొత్త vocabulary అంతా ఉపయోగించేసి, ఫలానాదుందా, ఫలానాదుందా అంటూ అడిగేశాను.

    ముందుగా అది సరీగ్గా “జరుగుతోందో లేదో ” చూసుకున్నాను.మనలో మనమాట, నాకున్న సందేహాలన్నీ తీర్చేసికుని, ఆ అమ్మాయికి “God bless you” చెప్పేసి,ఎక్కువయిన డబ్బులేవో ఇచ్చేసి ( కొత్తదానికైన ఖరీదు మాత్రమే), కొంపకు చేరాను.

    కొత్తగా తెచ్చింది, మొత్తానికి నా పరువు కాపాడింది.మనం చెప్పినట్టుగా వినడమూ, ఓ పధ్ధతిలో నడుచుకోడమూ లాటివన్నమాట! అయినా నాకేమిటీ, నేనేమైనా ఉపయోగించుకోవాలా ఏమిటీ, నిన్నటినుంచి మాత్రం నెట్ ఎడా పెడా ఉపయోగించేస్తోంది… నాకంటే ముందరే మెయిల్స్ చెక్ చేసేసికోడం లాటివి…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– enjoy your job…

    నేను Mystery Shopping లు చేస్తున్న ఒక సంస్థ వారు, మొన్న శనివారం నాడు, ఇక్కడ పూణే లో ఓ interaction session ఒకటి ఏర్పాటు చేసి, రమ్మనమని ఫోను చేశారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఓ యాభై పైగా ఆడిట్లు చేశానులెండి. ఓ మూడు గంటల కాలక్షేపం. అక్కడకి వచ్చిన పాతికమందిలోనూ, ” తాతయ్య” ని నేనొక్కడినే. మిగిలినవారిలో ఓ ఇద్దరు ladies నాకంటే ఎక్కువ ఆడిట్లు చేసినవారు.కారణమేమిటంటే, వారు కొన్ని కొత్తసంస్థలకి కూడా చేస్తూంటారుట. ఆ వివరాలేవో చెప్పమని అడగ్గానే, ఒకసారి google లోకి వెళ్ళి వెదికితే కావలిసినన్ని దొరుకుతాయీ అని చెప్పారు. సరే ఇంటికి వెళ్ళి అదేదో చూద్దాములే అని వదిలేశాను. తరువాత ఇంకో రెండింటిలో జాయినయ్యాను.

    మేము ముగ్గురం తప్ప, మిగిలినవారందరూ ఈమధ్యనే దీంట్లోకి వచ్చినవారు. ఆ సంస్థవారు, మమ్మల్ని,వాళ్ళందరికీ explain చేయమన్నారు. ఏదో నాకు తెలిసినవీ, నా అనుభవాలూ వారందరితోనూ పంచుకున్నాను. అందరికీ ఒకటే సందేహం- ఇంత వయస్సొచ్చినా అంత ఉత్సాహంగా ఎలా చేయకలుగుతున్నానా అని ! దానికి సాయం, ఆ మీటింగు పెట్టినవాళ్ళు కూడా, ” మాకు పూణె లో ఎప్పుడైనా అకస్మాత్తుగా అవసరం వచ్చినప్పుడల్లా, మాకు తెలుసు ఫణిబాబు మా rescue కి వస్తారూ అని, దానితో ఆయనకు ఫోను చేసీ చేయగానే Ok .. no problem.. అనేయడం, మర్నాడు వెళ్ళి చేసేయడం.”.

    వాళ్ళందరూ వ్యక్తపరిచిన సందేహానికి నేను ఒక్కటే సమాధానం చెప్పాను– I enjoy the job… bottomline is ” enjoy”.. మనం ఏ పనిచేసినా దానిని enjoy చేస్తేనే దానికి న్యాయం చేయగలం. ఉదాహరణకి మా అబ్బాయి, ఇదివరకు చేసే 9-7 జాబ్ కంటే, ఇప్పుడు తను నడుపుతున్న tenderleaves లోనే ఎక్కువగా enjoy చేయకలుగుతున్నాడు. పైగా రోజుకి 24 గంటలుకూడా సరిపోవడం లేదు. ఊరికే పుస్తకాలతోనే సరిపెట్టికోకుండా, మిగిలిన వాటిలోకీ diversify Workshop for children – Times Of India చేస్తున్నాడు. దీనికి సాయం తను ఉపాధి కల్పించిన పదిమందీ కూడా ఇదే కోవకి చెందినవారవడంతో ఇంకా సంతోషపడుతున్నాడు.వారంలో ఒకటి రెండు రోజులు వెళ్తూంటాను, అప్పుడు చూస్తూంటాను అక్కడ జరిగేవన్నీ…

    ఇంక నేను నా Mystery Shopping ల సందర్భంగా ఈమధ్యన వరుసగా ఓ అరడజను Jewellery Shops కి వెళ్ళవలసొచ్చింది. అసలే బంగారం రేటు చుక్కల్నంటుకుంటున్న ఈ రోజుల్లో ఈ గొడవేమిటిరా బాబూ అని అనుకున్నా, పోనీ ఈ వంకతోనైనా కొద్దీ సమయం గడుపుదామని ఒప్పేసికున్నాను.నేను చేసినవి Tanishq, Gitanjali, Sparkles షాపులు. వీటిలో రెండు Tanishq వి. పైగా వాటిలో ఏదో ఒక వస్తువు కూడా కొనాలన్నారు. మళ్ళీ ఇదో తిరకాసా అనుకుని, కొనడానికి డబ్బులిస్తారా అని అడిగాను. మరేంలేదూ, ఇదివరకెప్పుడో SOTC వాళ్ళది ఆడిట్ చేయమని,పైగా ఓ ఇద్దరికి ఓ ప్యాకేజీ టూర్ బుక్ చేయాలన్నారు. బుక్కింగు ఏమైనా ఊరికే చేస్తారా ఏమిటీ, 20,000 ముందుగా కట్టాలిట. అదేదో“ఆయనే ఉంటే…” అన్న సామెతలాగ, నాలాటి కేంద్రప్రభుత్వ పెన్షనరు దగ్గర అంతడబ్బు ఎలా ఉంటుందీ, నేను చెయ్యనూ అని చెప్పేశా. కాదూ, పదిరోజుల్లో నా రిపోర్టు రాగానే ఆ 20.000లూ reimburse చేసేస్తామూ అన్నారు. నేను ఒప్పుకోలేదు.. చివరకి వాళ్ళు ఆ 20,000 లూ నా ఎకౌంటులోకి ట్రాన్స్ఫర్ చేశారూ, తరువాత ఆ డబ్బే ఉపయోగించి,ఆ ఆడిట్టేదో పూర్తిచేశాను.

    ఈసారి Tanishq కి, ముందుగా ఓ 10,000 పెట్టి ఏదో ఒకవస్తువు కొని, బయటకు వచ్చి, మళ్ళీ లోపలకి ఈ ఏజన్సీ వాళ్ళిచ్చిన ఓ అథారిటీ లెటర్ తీసికెళ్ళి, చూపిస్తే ఆ వస్తువు తిరిగి తీసికుని, మన డబ్బులు పుచ్చేసికోవచ్చుట ! ఇదీబాగుందీ అనుకుని ఒక outlet ఒకరోజూ, ఇంకోటి మర్నాడూ చేసేసి, అదే 10,000 లనీ తిప్పేశాను…మిగిలిన రెండింటిల్లోనూ పేద్ద ఖరీదారీ ఏమీ లేదనుకోండి, ఊరికే రెండు మూడు ఫొటోలు తీయడమే..

   అలాగే ఆమధ్య NIKE కి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ ఏమిటో తెలిసికునిరమ్మన్నారు. అప్పటికే ఆ షాప్పుకి ఒకసారి వెళ్ళి కాకమ్మ కథలు చెప్పొచ్చాను. మళ్ళీ ఆ కొట్టువాడు గుర్తుపట్టి ఏమైనా అంటే..వచ్చినప్పుడల్లా ఈయన తిక్కశంకరయ్య ప్రశ్నలేస్తూంటాడూ, కొనేబేరం కాదూ అనుకోవచ్చుగా. దానికీ ప్రిపేర్ అయ్యి, మా మనవడు ఆదిత్యకి స్కూల్లో ఏదో వ్యాసం వ్రాయాలిటా, ఈ shoes లో ఉపయోగించే టెక్నాలజీ గురించీ, బాబ్బాబు అదేదో చెప్పి పుణ్యం కట్టుకో అని అడగ్గానే ఆ టెక్నాలజీ గురించి ఓ లెక్చరిచ్చేశాడు. ఆ వివరాలు మా ఏజన్సీవాళ్ళకి పంపేశాను.

    ఇలా అత్యవసరాలకి మా వాళ్ళందరినీ ఉపయోగించేస్తూంటాను! ఏదో నాకూ కాలక్షేపం అయిపోతోంది. చివరగా చెప్పొచ్చేదేమిటంటే, మనం ఏపని చేసినా దాన్ని enjoy చేస్తేనే దానికి న్యాయం చేసినవాళ్ళవుతాము…

%d bloggers like this: