బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Inversely proportional

 చిన్నప్పుడు బలవంతంగా నేర్చుకున్న లెక్కల సబ్జెక్ట్ లో విన్నట్టు గుర్తు. లెక్కలన్నా , కుక్కలన్నా నాకు చచ్చే భయం. అలాగని మిగిలినవాటిలో ధైర్యవంతుడుననీ కాదు. నేను ఈ టపాకి పెట్టిన శీర్షికని  సందర్భానుసారంగా పరిచయం చేద్దామని ఓ తపన.. అంతే. కొంతకాలం వరకూ, వయసుతోపాటు నా భయమూ పెరిగేది. దాన్ని అదేదో  Directly proportional  అంటారుట, గూగులమ్మని అడిగితే తెలిసింది. కానీ  రిటైరయిపోయినప్పటినుండీ  అదికాస్తా reverse  అయింది, కారణం దేనికీ లెక్కలు కట్టాల్సిన అవసరమే లేకపోవడం. ఇంక కుక్కల భయమంటారా, అంతగా చీకటి పడ్డాక బయటకే వెళ్ళడం మానేస్తే సరి. ఇదివరకటిరోజుల్లో షిఫ్ట్ టైమింగుల ప్రకారం డ్యూటికి వెళ్ళాల్సిరావడంతో వీధిన పడేవాడిని.ఆ గొడవే వదిలింది. అర్ధమయిందా ఇప్పుడు ఈ నిష్పత్తుల గోలేమిటో? 

తెలుగులో ఓ సామెత వినే ఉంటారు– ” చదవేస్తే ఉన్న మతి పోయిందిట “. అలాగ చదువెక్కువవుతున్నకొద్దీ , తెలుగు మాట దేవుడెరుగు, సందుసందుకీ ఉన్న  Spoken English, Written English  సంస్థల్లో చేరి, అలనాడెప్పుడో లార్డ్ మెకాలేగారు ప్రోత్సహించిన ఇంగ్లీషు భాషనికూడా   భ్రష్టు పట్టించేస్తున్నారు , ఈ ప్రచార సాధనాలు మొబైళ్ళూ అవీ వచ్చిన తరువాత ! ఒక్క ముక్క అర్ధం అవదు. ప్రతీ పదాన్నీ ” బోనసాయించేశారు”. చిన్నప్పుడు జేవీరమణయ్య గారి గ్రామరు లో చదువుకున్నవన్నీ మర్చిపోయేలా చేస్తున్నారు. ”  d ”   అంటే  ” the ”  అనుకోవాలిట. మేము నేర్చుకున్నది ,  a, an the  అనేవి అవేవో  articles  అంటారనీ, వాటిని ఎలా పడితే అలా వాడకూడదనీ, నేర్చుకున్నాము. ఆరోజుల్లో టెలిగ్రాములు పంపేటప్పుడు, పదానికి ఓ రేటుండడం చేత ఎడ్రెస్ దగ్గరనుండి ప్రతీదానినీ  కురచ చేసేవారు.   మహా అయితే గ్రీటింగ్స్ కి నెంబర్లుండేవి. కానీ ఈరోజుల్లో  ప్రతీదానికీ  ఓ షార్టు కట్టు.అదేమిటో అర్ధం అయిచావదు. ఓ పదం పూర్తిగా రాస్తే వాళ్ళ సొమ్మేం పోయిందిట? ఏమిటో అంతా గందరగోళం. పదాలకి షార్టు కట్లు    ఇవిట… మళ్ళీ వాటికి నెంబర్లు  ఇవిట… 

ఇదివరకటి రోజుల్లో ఇంటికి ఉత్తరం రాయాలంటే  నాన్నగారికి  ( డబ్బులవసరమైనప్పుడు మాత్రమే ) ఏదో  ” మహారాజశ్రీ తో  మొదలెట్టి, క్షేమసమాచారాలు విచారించి, ఏ మధ్యలోనో డబ్బుల సంగతి రాసేవారు. అమ్మకైతే ” మహాలక్ష్మీసమానురాలైన ” అని లక్షణంగా రాసేవారు. ఈరోజుల్లో ఆ ఉత్తరాలే లేవనుకోండి, అంతా అంతర్జాలమే పోనీ అదైనా సరీగ్గా ఉంటుందా అంటే అదీ లేదూ ”  Hi pop ”  పాప్ ఏమిటీ కూరల్లో పెట్టే పోపులాగ? అమ్మ ఎప్పుడో హాయ్ మాం అయిపోయింది..

 ఇంక వేషధారణంటారా, ఎంత కురచగా వేస్తే అంత మంచిదీ. ఇదివరకటిరోజుల్లో, కురచ లాగులు ఏ పోలీసాడో, రెవెన్యూ ఇనస్పెక్టరో, శాఖలకి వెళ్ళే ఏ ఆర్.ఎస్. ఎస్. వాళ్ళో వేసికునేవారు. ఇప్పుడు ఎక్కడచూసినా  హాఫ్ చెడ్డీలే. అప్పటిదాకా పంచా లాల్చీ వేసికున్నవారు కూడా నిక్కర్లలోకి దిగిపోయారు. తెల్లారేసరికి ఓ కుక్కని పట్టుకుని బయలుదేరడం.  Ofcourse  ఎవరి సరదా వారిదనుకోండి. 

చెప్పొచ్చేదేమిటంటే, జనాభా పెరిగేకొద్దీ వస్తూన్న పరిణామాలా ఇవి? అందుకే ఈ టపాకి  శీర్షిక అలా పెట్టాల్సొచ్చింది. మేమేమైనా చదువుకున్నామా  పెట్టామా?

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” బ్రహ్మోత్సవం” my take…

    సాధారణంగా  ఎవరి అభిరుచిని బట్టి , వారికి నచ్చిన పుస్తకం చదవడమో, లేక ఏదో సినిమా చూడడమో చేస్తారు.. ఇదివరకటి రోజుల్లో ప్రసారమాధ్యమాలు , మర్నాడు సాయంత్రం, అంతకుముందురోజు అర్ధరాత్రిదాకా వచ్చిన వార్తలకే పరిమితమయ్యే వార్తాపత్రికలు, రేడియో మాత్రమే.. కాలక్రమేణా టీవీలూ, ఈరోజుల్లో అయితే   ” मुठ्ठी मे दुनिया ” అంతర్జాలమూనూ.  ఎక్కడైనా భూకంపం వచ్చి ఇళ్ళు కదిలేసరికల్లా, ప్రపంచం అంతా క్షణాల్లో తెలిసిపోతోంది.. క్షణాలేమిటీ, భూమి కంపించేది కొన్ని సెకన్లైనా, ఇంకా కదలడం ఆగేలోపలే తెలుస్తోంది. ఇంత వేగంగా ప్రపంచం ముందుకుదూసుకుపోతూంటే, ఇంకా  ఏడు తరాలూ, బంధుత్వాల గురించీ ఆలోచనలకి స్థానం ఎక్కడుంటుందీ?  इषारा काफ़ी है…  నేనెక్కడికి వెళ్తున్నానో ఊహించేసుంటారు కదూ. ఎంతైనా మీ ఆలోచనలముందర మేమెంతా? తాబేలూ కుందేలు కథలోలాగ  జీవితాంతం తాబేళ్ళమే.. ఏమిటో ఆనాటి సంబంధ బాంధవ్యాలూ, ఆత్మీయతలూ పట్టుకు వేళ్ళాడుతూన్న వాళ్ళం.  అవన్నీ  outdated  అని తెలుసుకోడానికి ఇంకొంత టైము పడుతుందేమో. ఆలోపులో పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది.

 అయినా, టివీల్లో వచ్చే ” జబర్ దస్త్ ” లాటి దౌర్భాగ్యపు కార్యక్రమాలూ, ఎప్పుడు ఎవరి పీకనొక్కుదామా అని చూపించే సీరియళ్ళకీ అలవాటు పడ్డ ప్రాణాల కి ఈ సెంటిమెంట్లు ఎక్కడ అర్ధమవుతాయీ?  గత నాలుగురోజులుగా ప్రతీ  Social network  లోనూ, పేపర్లలోనూ హోరెత్తించేస్తున్నారు.   ఈరోజుల్లో వ్యవహారం ఎలా ఉందంటే, day in and day out  ఏదో ఒక పాటనో, ఎవరో ఓ వ్యక్తి గురించో, లేక ఓ సంస్థ గురించో ప్రేక్షకులని  bombard  చేసేస్తే చాలు. సగం పనైపోయినట్టే. సదరు విషయం ఓ సెలెబ్రెటీ అయినా అవొచ్చు, లేదా దానిమీద ఓ విపరీతమైన ఏహ్యభావమే నా రావొచ్చు.   Exactly  అదే జరిగింది ఈమధ్యన రిలీజైన  ” బ్రహ్మోత్సవం ” విషయంలో.

 ఓ విషయం చెప్పండి.. అందులో వినకూడని విషయమేమైనా ఉందా, పోనీ మామూలు సినిమాల్లోలాగ double meaning dialogues  ఉన్నాయా, లేక item songs కానీ overexposed heroins కానీ ఉన్నారా. ఆ అమ్మాయెవరికో నడుంమీద ఓ పుట్టుమచ్చ మాత్రమే చూపించారు. అదీ తప్పేనా? అసలు సెన్సారు బోర్డువాళ్ళే షాక్కయుంటారు, ఇది తెలుగు సినిమానా అని. చుట్టాలూ, ఆత్మీయతలూ , సంబంధ బాంధవ్యాల గురించి, గూగుల్ లో వెదకాల్సిన ఈ రోజుల్లో,  సినిమాలో చూపించినవి మింగుడు పడలేదు. పైగా ఆ గూగులమ్మకేం తెలుసూ అసలు ఇలాటివికూడా ఉంటాయని? న్యూక్లియర్ కుటుంబాలకి అలవాటు పడ్డ ఈరోజుల్లో, ప్రతీవాడూ కజిన్ , ప్రతీ పెద్దవారూ అంకుల్, ఆంటీలు గా రూపాంతరం చెందిన ఈరోజుల్లో, అత్తయ్యా, నాన్నగారూ, మావయ్యా ఏమిటీ  just rubbish  కదూ? నచ్చలేదంటే మరి ఎలా నచ్చుతుందీ? మహా అయితే తాత, అమ్మమ్మ, నానమ్మా, అదికూడా తమ పిల్లలని చూడ్డానికి, గుర్తుంటారు. అలాటిది మరీ ఏడు తరాలా   No way.. దేనికైనా అర్ధం పర్ధం ఉండొద్దూ? అసలు తెలుగు సినిమా అంటే ఎలా ఉండాలమ్మా? ఓ హీరో, ఓ కమేడియన్, ఇద్దరు హీరోయిన్లూ, ఆడా మగా తేడా లేకుండా వెకిలివేషాలూ, ద్వందార్ధ డయలాగ్గులూ, ఉంటే గింటే  ఓ ” నిర్భయ” ఘట్టం. అదీ సినిమా అంటే..  అంతేనే కానీ, ఏదో తిరుపతి వెంకన్నని నమ్ముకుంటారు కదా అని ” బ్రహ్మోత్సవం ” పేరుపెట్టి, ఇలా మోసం చేయొచ్చా హ..న్నా..

 ఆ సినిమాలో లోపాలంటారా, చాలానే ఉన్నాయి.  Bulk mail  ద్వారా తెలిసున్న నటులందరినీ పిలిచేసి, అందరికీ తలో లైనూ ఇచ్చారు..కెమేరా, దర్శకుడూ ఎప్పటికప్పుడు  clap  కొడుతూ, తలో సీనూ తీసేశారు. పాపం ఆ ఎడిటర్ గారికి ఖాళీ ఉండుండదు. తనకి నచ్చిన సీన్లని వరసలో copy  చేసేసి paste  చేసి మనమీదకి వదిలేశాడు. తలా తోకా లేదు. ఏదో సుమతీశతకం గురించి ఓ డాక్యుమెంటరీ చూసినట్టుంది. మా అబ్బాయన్నట్టు ఆ ఎడిటర్ గారికి ఇవ్వాల్సిన remuneration  ఇచ్చుండరేమో.  Skype  లోనో,  Facetime  లోనో  తల్లితండ్రులతోనూ, సోదరుడితోనూ మాట్టాడిన అమ్మాయి, తన తండ్రి పోయినప్పుడు ఎక్కడా కనిపించలేదు. రావడానికి టైముండుండదు. ఏసీన్ కీ సంబంధం లేదు. విడివిడిగా ఏ సీనుకాసీను చూస్తే, ఓహో..అలాగా.. అనుకుంటాము. ఏ రిసెప్షన్ కో వెళ్ళినప్పుడు, మరీ కూర ఓ ప్లేటులోనూ, అన్నం ఓ ప్లేట్ లోనూ, మిగిలినవన్నీ తలో ప్లేట్ లోనూ వేసికోముకదా, అన్నిటికీ ఒకే ప్లేట్ కదా.పైగా ఎన్ని ప్లేట్లు తీస్తే , ఆ క్యాటరర్ అన్ని శాల్తీలకి లెక్కేస్తాడు. అందుకే ఓ ప్లేటూ, రెండో మూడో బొచ్చెలూనూ. అలా అన్నిటినీ  పధ్ధతిలో చూపిస్తేనే పుణ్యం పురుషార్ధమూనూ. అందుకే ఇదివరకటి రోజుల్లో అరిటాకులోనో, అడ్డాకుల్లోనో పెట్టేవారు విందుభోజనాలు. అదీతేడా ఈ సినిమా  Intention was noble.. but execution awful.

 

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–జైసే కో తైసా

ఒకనొకప్పుడు  ఇంట్లొ పెళ్ళంటే పెద్దహడావిడిగా ఉండేది.. పెళ్ళిచూపులూ,  నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని,ముహూర్తాలు నిశ్చయించుకోగానే,  ఆఇంటికి పెళ్ళికళ దానంతట ఆదే వచ్చెసేది.వంట బ్రాహ్మలు, గాడిపొయ్యిలు తవ్వించడం, చలవ పందిరి వేయడం, బాజా బయంత్రీలు కుదర్చడం, పెళ్ళివారికి ఓ విడిదీ, పెళ్ళికి కావాల్సిన పానకం బిందెలూ, పెళ్ళికొడుకు  ఉంగరానికి  వేలి ఆదె తీసికొవడమూ, మధుపర్కాలూ, ఇలా ఒకటేమిటి, ఓ నెలరోజులు  ముందునుంచీ పన్లు  మొదలెట్టెసేవారు.ప్రతీ పనికీ ఒక్కొరికి బాధ్యత అప్పచెప్పేవారు. వాళ్ళు  చుట్టాలే కానక్కర్లేదు,  చివరి నిముషంలో అభాసు పాలుచేయకుండా ఉండే నమ్మకస్థుడైనా చాలు.. వంట సామగ్రి విషయం, వంట బ్రాహ్మలే చూసుకునేవారు. ఇంట్లో ఓ గదిని ఈ పెళ్ళిసామాన్లు భద్రంగా ఉంచడానికి కేటాయించేవారు.. మళ్ళీ ఆ Store room  కి ఓ incharge. తాళాలాయనదగ్గరే ఉండేవి. ఆయనకి తెలీకుండా ఒక్కవస్తువూ బయటకెళ్ళేది కాదు.

ఇవన్నీ పూర్తయినతరువాత శుభలేఖలు. దగ్గరలో ఉండే ఏ ప్రెస్ లోనో అచ్చేయడానికి , ఇవ్వడం. ఎవరెవరికి పోస్టులో పంపాలో, ఎవరెవరికి స్వయంగా, పొరుగూరైనా సరే వెళ్ళి పిలవాలో, ఎవరెవరికి పోస్టులో పంపినా ఓ సారి ఫోను చేయాలో లాటి వివరాలు తయారు చేసికోడమో, మళ్ళీ ఈ శుభలేఖలో బంధుమిత్రసపరివారం అంటే సరిపోతుందా, లేదా  కుటుంబ సభ్యులందరిపేర్లూ రాయాలా అని చర్చించడం. ఎవరిపేరు వేయకపోతే ఎవరిక్కోపాలు వస్తాయో, మళ్ళీ ఇదో గొడవా. దూరప్రాంతాలవారికి ముందుగానే ఉత్తరాలు రాసి ముహూర్తం తేదీ, టైమూ చెప్పడం,ఉండేది. తరవాతి రోజుల్లో ఫోన్లు చేసి చెప్పి, వారి  ఎడ్రెసు అడిగేవారు, పోస్టులో పంపడానికి. ఇంక కవర్లకి  అంచులకి పసుపు బొట్టెట్టి, కొన్ని బుక్ పోస్టుల్లోనూ, కొన్నిటికి అంటించి అదనపు స్టాంపులు పెట్టి పోస్టు డబ్బాలో పట్టకపోతే, పోస్టాఫీసుకే వెళ్ళి అక్కడే అందజేయడమూ, ఓ పదిరోజులు ముందుగా.    ఓ విధంగా పిలుపైపోయినట్టే. ఊళ్ళోవారికి, పెళ్ళికూతురు చేసే రోజుకి పేరంటానికి పిలవడం. చెప్పొచ్చేదేమిటంటే  పెళ్ళంటే ఇంత హడావిడుండేది.

 ఓ పదేళ్ళు అంటే 21 వ శతాబ్దానికి వచ్చేటప్పటికి, ఈవెంట్ మానేజ్మెంట్లూ గట్రా  మొదలయ్యాయి. ఇంక శుభలేఖలంటారా, పిల్లనో పిల్లాడినో అడగడం, ఎన్ని వేయించమంటారూ అని. పోనీ వాళ్ళైనా చెప్పొచ్చుగా, అబ్బే, నా ఫ్రెండ్స్ ఓ 50 మందిదాకా ఉంటారనేవారు.. పోనీ ఉండనీ అని,ఓ 50 శుభలేఖలు ఇస్తారు. వాడికెక్కడ తీరికా ఇవన్నీ పోస్టుచేయడానికీ, ఓ కార్డు  scan  చేసేసి, email  లో ఫ్రెండ్సందరికీ పంపేయడం. ఆమాటేదో ముందరే చెప్తే, ఆ ఖర్చేనా తగ్గేదిగా. ఒక్కోకార్డూ, పైగా వందల్లో ఉంటుంది. పెళ్ళికొడుకు కదా, ఏమీ అనకూడదూ. కొడుకు పెళ్ళై ఏ అమెరికాకో వెళ్ళిపోయిన తరువాత, వాడిరూమ్ములో ఓ మూల దొరుకుతాయి మిగిలిపోయిన 49 కార్డులూనూ. పోనీ చింపేద్దామా అంటే మళ్ళీ సెంటిమెంటోటీ, అలాగని ఏ పాతపేపర్లతోనో ఇచ్చేద్దామా అంటే, మనసొప్పదాయె.అదో tricky situation which every parent faced.

  క్రమక్రమంగా, ఈ శుభలేఖలకీ రెక్కలొచ్చాయి.. లేనిపోని ఖర్చంతా ఎందుకూ అనుకుని, ఏ web designer దగ్గరకో వెళ్ళి ఒక్కటంటే ఒకటే కార్డు, design చేయించుకుని, తన పేరే రాసుకుని, ఇంకో కార్డు తండ్రిపేర వేయించి, హాయిగా నయాపైసా ఖర్చు లేకుండా, ఏ  Whatsapp   లోనో పంపడం.. మొహమ్మాటానికి రాత్రి 9 తరువాత ఫుకట్ గా ఏ  BSNL  ఫోనులోనో చెప్పడం. పైగా ” రాపోతే ఊరుకోనురోయ్..” అనికూడా చెప్పడం.వచ్చేవాడొస్తాడు, లేనివాడు రాడు. కానీ గొడవంతా ఊళ్ళోవాళ్ళకే. ఏ పన్నెండింటికో ముహూర్తమో, రిసెప్షనో అయితే, ఆ  Uber వాడికి  surgepricing  లో 500 ఖర్చుపెట్టి, గిఫ్ట్ గా కవర్ లో ఓ 501 పెట్టి,, అక్కడ జైల్లోవాళ్ళలాగానో, హాస్పిటల్ లో రోగుల్లానో, లైన్లో పళ్ళాలు పట్టుకుని నుంచుని, భవతి భిక్షాందేహీ అనుకుంటూ బిక్షం వేయించుకుని, మళ్ళీ uber  వాడిని పిలిచి కొంపచేరడం. మధ్యలో లైన్లో నుంచుని, మొహంమీద  రాని నవ్వు పులుముకుని, ఓ ఫోటో తీయించుకోడం. హాయిగా కొత్తావకాయవేసికుని ఇంట్లో తినక, ఎందుకొచ్చిన రిసెప్షన్లూ? మనం వచ్చేమా లేదా అన్నది ఎవడికీ పట్టింపుండదు.  ఉన్నామో ఊడేమో పట్టింపుండదు. అంతా గుంపులో గోవిందా…

Wedding

 కానీ గుళ్ళోలింగాన్ని మింగేవాడొకడైతే, గుడినే మింగేవాడూ ఉంటాడు. పై పెట్టిన ఫొటో బావుంది కదూ.. అందుకనే ఈరోజుల్లో సంబంధ బాంధవ్యాలు అలా దిగజారిపోయాయి….

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అవేవో soft skills ట…

ఏమిటో ఈరోజుల్లో ఎవరినోట విన్నా ఇదేమాట.. ప్రెవేటు కంపెనీలో ఉద్యోగానికి వెళ్తే ముందర  ఈ  soft skills  అనేవున్నాయా లేదా చూస్తారుట.. ఎంతైనా మట్టిబుర్రకదా, దీనర్ధమేమి తిరుమలేశా అని వెదికితే ”  Soft skills is a synonym for “people skills.” The term describes those personal attributes that indicate a high level of emotional intelligence” అని తెలిసింది. EQ  గురించి ఇక్కడ చదివాను.. ఓరి మీ ఇల్లుబంగారంగానూ ఇదన్నమాట అని నవ్వుకున్నాను.  వీటిని skills  అంటారన్నమాట. మా చిన్నప్పుడు ఏదో ఒక విషయంలో ఇలాటివి లేని మనుషులే ఉండేవారు కాదూ. ఇప్పుడంటే గూగులమ్మలూ వాళ్ళూ వచ్చేసి, ప్రతీదానికీ బధ్ధకం పెంచేశారు కానీ, ఆరోజుల్లో ఇలాటివేమైనా చూశామా పెట్టామా? ఈరోజుల్లో ప్రతీదానికీ, తుమ్ముకీ దగ్గుకీ ఆ గూగులమ్మే దిక్కు. ఏదైనా అవసరం వస్తే, ఆ  Just Dial  కి ఫోనుచేసి నెంబరడగడం. పాపం పాపాల భైరవుడిలా, తద్దినాలకి బ్రాహ్మలు ఎక్కడ దొరుకుతారో దగ్గరనుంచి ప్రతీదానికీ శాంతంగా వివరాలందిస్తాడు కాబట్టి, కాలక్షేపం చేసేస్తున్నారు ఈనాటి యువతరం , వీధిన పడకుండా.

కానీ ఇలాటి సదుపాయాలు లేకుండానే . ఆరోజుల్లో ప్రతీ ఇంట్లోనూ ఎవరో ఒకరికి ఉండేవే, ఆడ, మగ వారికి. అలాగని వారు వాటిని స్వార్ధంతో కాకుండా, అందరికీ ఉపయోగించేవారు. ఒక్కోప్పుడు చిరాగ్గానూ ఉండేది అనుకోండి.కొన్ని ఉదాహరణలు చూద్దాం– ఓ ఇంట్లో ఒకావిడకి అప్పడాలూ, ఒడియాలూ పెట్టడం వెన్నతో నేర్పిన విద్య. ఆ విషయం,  అందరికీ ఎలా తెలుసూ అనకండి, వాటిని ఏ నులకమంచంమీదొ, ఎండలో ఆరపెట్టినప్పుడు, పక్షులురాకుండా ఆవిడే చూసుకునేది. వీధిలో పోయేవారందరికీ తెలిసేది ఓహో ఈ తల్లేనన్నమాట అప్పడాలు పెట్టిందీ, అందుకేనేమో ఆ ఎండలో చూరుకింద కూర్చుని కాకుల్ని తోలుతోందీ..ఆ అప్పడాలుకూడా వీధివీధంతా తలో పదో పంచేవారు. దానితో ఆవిడకి అప్పడాలు/  ఒడియాలు పిన్నిగారని పేరొచ్చేసేది. దానితో ఆ అగ్రహారంలో ఎవరింట్లో అప్పడాలూ, ఒడియాలు ( పిండివీ, బూడిదగుమ్మిడికాయవీ, రెండు వెరైటీలూ ) పెట్టాలన్నా ఆవిడకే కబురెట్టేవారు. అప్పడాల పిన్నిగారని పేరొచ్చేసింది.అలాగే ఆ ఇంటి పెద్ద గారు పనసపొట్టు కొట్టడంలో సిధ్ధహస్తులు.. అదేమైనా ఆషామాషీ పనా? ఎంత ఒడుపుండాలీ?  ఆ పొట్టుతో . ఆవపెట్టి కూర చేస్తే, వెన్నలా గొంతుకలోకి వెళ్ళాలి. అదీ పనసపొట్టంటే. . అంతేనే కానీ ఈరోజుల్లోలాగ గ్రైండర్ లో తిప్పే పొట్టూ పొట్టేనా?అవేవో పీసుల్లా ఉంటాయి.PPottu

PPP2

సో ఆ మాస్టారుకి ఆ వీధివీధంతా అభిమానులైపోయేవారు. ఎంతదాకా వచ్చిందంటే, ఎవరైనా వచ్చి  ఫలానా సుబ్బారావుగారిల్లు ఎక్కడా అంటే చెప్పలేరు కానీ, పనసపొట్టు మాస్టారంటే ఠక్కున చెప్పేసేవారు. ఆ ఊళ్ళో ఎక్కడ పెళ్ళి జరిగినా, సంతర్పణ జరిగినా పనసపొట్టు మాత్రం మాస్టారే కొట్టాలి.

 ఎవరికైనా కాలు బెణికినా, తేలు కుట్టినా అదేదో తేలుమంత్రం, ఇరుకు మంత్రం వేసే అమ్మమ్మలూ, బామ్మలూ ఉండేవారు. అలాగే ఏ కావిర్లో వస్తే , ఫలానా మాస్టారి ఇచ్చే ఆకు పసరు పడితేనే తగ్గేది. ఇవన్నీ  soft skills  కాక మరేమిటంటారూ?

ఇవే కాకుండా ఇంకొన్నుండేవి. ఆరోజుల్లో బ్యాటరీ లైట్లుండేవి.  వాటి ఉపయోగాలుకూడా ఎక్కువగానే  ఉండేవి. పెరట్లో కి వెళ్ళడానికో, చీకట్లో ఏ పొలం గట్లవెంట వెళ్ళేటప్పుడో ఉపయోగించేవారు.కానీ, దాన్ని ఎక్కువగా ఉపయోగించక ఓ మూలన పడెస్తే, కొద్దిరోజులకి ఆ బ్యాటరీలు నీరు కారిపోయి, ఎటూ కాకుండా పోయేవి. ఏ ఆదివారం పూటో, ఇంటిపెద్దగారు దీనిసంగతేదో తేలుద్దామని, ఓ సీసామూతలో కిరసనాయిలూ, ఇంకో  మూతలో  కొబ్బరి నూనె, ఓ పాతగుడ్డా పెట్టుకుని. ఆ బ్యాటరీలు తీసేసి, శుభ్రంగా తుడిచి,  దానికున్న బొడిపె దగ్గర ఓసారి ఏ సీనారేకుతోనో గీకి, కొత్త బ్యాటరీలు వేసేసరికి లక్షణంగా వెలిగేది. వీధివీధంతా , వీళ్ళింట్లో పాడైపోయిన బ్యాటరీ లైటు  బాగుచేసేరని తెలిసిపోయేది. ఎవరిద్వారా అంటారా, పనిమనుషులద్వారా. ఇంకేముందీ ఆ వీధిలో ఉండే పాడైపోయిన బ్యాటరీ లైట్లన్నీ వీళ్ళింట్లో ప్రత్యక్షం. కొందరు స్వయంగా తెచ్చీ, కొందరు వారి పిల్లలతో ” మా నాన్న దీన్నోసారి చూడమన్నారు.. ” అంటూనూ. పైగా ఏ బజారులోనో, సంతలోనో కనిపించినప్పుడు హక్కుగా అడగడమోటీ..” బ్యాటరీ లైటు ఎంతదాకా వచ్చిందీ..” అంటూ..

ఈవేళ్టికివి చాలు.. మరికొన్ని  soft skills  ఇంకో టపాలో….

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- ఏమైనా One day వండరా?

ఈ టపా మొన్నటి రోజునే రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల మనోభావాలేమైనా hurt  అవుతాయేమో అని నోరుమూసుక్కూర్చున్నాను. అసలు అర్ధం ఏమైనా ఉందా? ” అమ్మ ” గురించి అసలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటీ? అదీ సంవత్సరంలో ఒక్కరోజా? అసలు బుధ్ధి అనేదేమైనా ఉందా? మన అస్థిత్వానికే కారణభూతురాలైన ” అమ్మ” గురించి . ఆ ఒక్కరోజే  గుర్తుచేసికోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామన్నమాట.మనకి జన్మ ఇచ్చినప్పటినుండీ, ఒళ్ళు దాచుకోకుండా, ఒక్కమాటనకుండా , ఒంట్లో ఓపికున్నంతకాలమూ, తన పిల్లలకీ, వాళ్ళ పిల్లలకీ, ఇంకా బతికుంటే వాళ్ళ  వాళ్ళ పిల్లలకీ సేవలు చేయడమే. ఏ విదేశాల్లోనో ఉండే పిల్లలు తమ అవసరార్ధం అంటే పురుళ్ళకీ, పుణ్యాలకీ, ” అమ్మ” నే పిలుస్తారు.  నాన్న   Buy one get one లో బాపతు. పాపం ఆ వెర్రితల్లి సప్తసముద్రాలూ దాటి, తన పిల్లల పిల్లలకి సేవలు చేస్తుంది. ఆ పసిబిడ్డకి నడుం నిలిచేటైముకో, లేక అవతలివైపు జంట వచ్చేసరికో, వీళ్ళకి రిటర్న్ ఫ్లైట్.  ప్రపంచంలో  Taken for granted  ప్రాణి అనే వ్యక్తి ఉన్నారా అంటే, ఆ వ్యక్తి  ” అమ్మ” అని ఢంకా బజాయించి చెప్పొచ్చు..

శలవలొచ్చేసరికి  అటకమీంచి ఆటసామాన్లు తీసి దులిపినట్టుగా, ఈ  Mothers Day  వచ్చేటప్పటికి, ఓ చీర కట్టి ఓ ఫొటో తీయించేసికుని, ప్రపంచం అంతా చాటుకోవడం– చూడండి మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో అని. ఆవిడేమైనా ఎప్పుడైనా ఏదైనా అడిగిందా? తన పేగు చించుకొచ్చిన బిడ్డలు క్షేమంగా ఉంటే చాలనుకుంది. ఇదివరకటి రోజుల్లో బిడ్డలకి జన్మ ఇవ్వడానికి ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తిందో? పైగా ఆరోజుల్లో, ఇప్పటిలాగ ఎనెస్థీసియాలూ గట్రాకూడా ఉండేవి కావు. పళ్ళు బిగపెట్టుకుని నొప్పి సహించి, మనల్ని ఈభూమ్మీదకి తెచ్చిన తల్లి.   ఆవిడేమీ మణులూ మాణిక్యాలూ అడగలేదు. రోజుకోసారి తన బిడ్డ ఆఫీసునుంచి వచ్చేటప్పుడో, ఆఫీసుకి వెళ్ళేటప్పుడో, ఒక్కసారి… ఒక్కటంటే ఒక్కసారి  ” ఎలా ఉన్నావమ్మా..” అని అడిగితేచాలు, కొండెక్కేసినంత సంతోష పడే అల్ప సంతోషి.

అంతేకానీ, వేలంవెర్రిలా కవితలూ, ఫోటోలూ పెట్టేసికుంటే ఒక్కొక్కప్పుడు  ” అతి” గా కనిపిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో ” అమ్మ ” ఓ ఫోటోకి  Model  లాగానో, లేక ఓ కథకో వ్యాసానికో ఇతివృత్తంగానో కనిపిస్తోంది.. అంతేనేకానీ, నిజంగా అమ్మమీద అభిమానం ఉన్నవారు, ఇంత పబ్లిసిటీలిచ్చుకుని, ఊరంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఆవిడేమైనా  One Day Wonder  కాదుగా.జన్మజన్మలకీ గుర్తుపెట్టుకోవాల్సిన తల్లి.మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అమ్మ. ఈ సందర్భంలో… పచ్చినిజాన్ని ఆవిష్కరించిన ఓ మచ్చుతునక…

facebook_1462865064886

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Appraisals..

చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు,   అర్ధసాంవత్సరిక (  Half yearly),  సాంవత్సరిక (  Annual )  పరీక్షలముందు, ప్రతీనెలా  అవేవో స్లిప్ టెస్టులు (  Sliptests)  అని ఉండేవి గుర్తుందా? ఏదో పరీక్షలముందు రాత్రిళ్ళు టీ లు తాగేసి, బట్టీ పట్టేసి, మర్నాడు ఏదో రాసేద్దామనుకునే, నాలాటి వాళ్ళకు ఇదో పెద్ద గండం. ఎక్కడ సుఖపడిపోతామో అని, ప్రతీ నెలా ఇదో గోలా. ఏడాదంతా చదవమంటే ఎలా కుదురుతుందమ్మా?  అయినా అప్పుడు నేర్చుకున్న ప్రపంచ చరిత్రా, హిందూ దేశ చరిత్ర, ఛందస్సూ, ఇవన్నీ భావి జీవితంలో ఏముపయోగించాయంటారు?  చదివిన చదువుకీ, చేసిన ఉద్యోగానికీ ఎక్కడా సంబంధం లేదు. ఎలాగోలాగ ఓ డిగ్రీ తగిలించుకుంటే ఉద్యోగాలు వచ్చేవి ఆరోజుల్లో.ఇప్పుడంటే అవేవో  creative skiళ్ళూ, సింగినాదం కావాలంటున్నారు..

ఉద్యోగంలో చేరిన తరువాత, మనం ఆ ఏడాదంతా సరీగ్గా పనిచేశామో లేదో, ఆఫీసరుకి ఒంగి ఒంగి సలాములు పెట్టామో లేదో అనే ప్రాతిపదిక మీద, ఆ ఆఫిసరు , తన కింద పనిచేస్తున్న వారిగురించి, ACR ( Annual Confidential Report)  రాసేవాడు. ఆఫీసర్లందరూ నిజాయితీగా ఉండేవారా అంటే చెప్పడం కష్టం. వారితో మన ప్రవర్తన ఆధారంగా రాసిన సందర్భాలూ చూశాను.. ఎంతైనా 42 ఏళ్ళు పనిచేశానుగా..   మన దారిన మనం నిజాయితీగా ఉంటే గొడవే లేదు అలాకాకుండా ఉన్న ఆఫీసరుకి ” కాకా” పట్టి, రోజులు గడిపేసికుంటే  జరిగే పని కాదు. ఆ తరవాత వచ్చినవాడినీ, ఆ తరవాత వచ్చినవాడినీ… అలా ఉద్యోగ జీవితంఅంతా ఎవరోఒక పైవాడికి దాసోహం అంటునే ఉండాలి. ఎందుకొచ్చిన బతుకూ? గవర్నమెంటు సర్వీసులో, పనితనం చూసేవాడెవడూ ? మనం ఫలానా క్యాటిగరీలో ఉన్నామా లేదా, ఉన్నట్టైతే ఈ ACR  లూ అవీ ఉత్తుత్తివే. అయినా చేతిలో పనున్నప్పుడు భయపడ్డం ఎందుకూ?  అయినా ఈ ACR  లు ఏవో ఉధ్ధరించేస్తాయని కాకపోయినా, చెడ్డగా రాస్తే చిరాగ్గా ఉంటుంది. గమ్మత్తేమిటంటే, బాగా రాసినప్పుడు ప్రమోషన్లు రాలేదు.అదృష్టం ఏమిటంటే 42 ఏళ్ళూ, ఎవరిచేతా మాటపడకుండానే రిటైరయ్యాను.

పైచెప్పిన   ACR  లనె ఈరోజుల్లో అవేవో   Appraisals  అంటారుట. ప్రతీ ఏడాదీ , ప్రెవేటు కంపెనీల్లో  ఎప్పుడు  విన్నా వీటి గొడవే. పైగా ఈ appraisals  ని బట్టే, ఆ ఏడాది  ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా కూడా తేలుస్తారుట. వామ్మోయ్, గవర్నమెంటులో మరీ ఇంత సీరియస్సు కాదు.

ఇవన్నీ ఓ ఎత్తైతే, ఇళ్ళల్లో భార్యలు చేసే  appraisals  ఇంకోలా ఉంటాయి. ఈ ఏడాదిలో, ఎన్ని సినిమాలకి తీసికెళ్ళాడూ, ఎన్నెన్ని ఊళ్ళు తిప్పాడూ,  కొంచం వయసొచ్చిన తరువాత ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలకి తీసికెళ్ళాడూ, ఆ వెళ్ళినప్పుడు ఏ స్టార్ హొటల్లోనే ఉన్నామా లేక  ఏ దేవస్థాన సత్రంలోనేనా? విడిగా వెళ్ళామా, లేక టూర్లవాళ్ళతో వెళ్ళామా, విడిగా వెళ్తే ఏసి 2  లేక స్లీపరా?  On a scale of 10  ఇన్నేసి ఉంటాయి. , వీటన్నిటినీ ఎలాగోలాగ నెగ్గుకురావొచ్చులెండి, ఏదో ఇద్దరికీ హాయిగా బతికేటంత పెన్షనెలాగూ ఇస్తున్నారాయె, బాధ్యతలుకూడా లేవు. ఎవరికో దాచిపెట్టాలని కూడా లేదు. పిల్లలు వాళ్ళంతటివారు వాళ్ళైన తరువాత అలాటి బాధ్యతలు కూదా తగ్గుతాయి. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేయొచ్చు. మరి అలాటప్పుడు ఈ   భవిష్యత్తుని నిర్ణయించే ఈ  appraisals  గొడవేమిటీ అనుకుంటున్నారు కదూ.. అక్కడికే వస్తూంట…

 మన ఇల్లాళ్ళలో కొందరికి వేసవికాలం వచ్చిందంటే ఊరగాయలు స్వయంగానే పెట్టాలనుకుంటారు, మార్కెట్ లో ఎన్నిరకాల ఊరగాయలు దొరుకుతున్నా సరే. అదో తృప్తీ వాళ్ళకి.బయట దొరికే ఊరగాయల్లో ఏం నూనె వాడాడో ఏమిటో, ఆవపిండీ, కారం ఈరోజుల్లో ఎక్కడ చూసినా కల్తీయే కూడానూ. పోనిద్దూ ఒంట్లో ఓపికున్నంతకాలం ఓ యాభై కాయలు ఒరుగులుగానూ, ఇంకో నలభై కాయలు ఆవకాయా, మాగాయా కలిపేస్తే, పిల్లలు కూడా తింటారూ  అదేమైనా పెద్ద బ్రహ్మవిద్యా ఏమిటీ అని అనుకుంటారు. ఆశయం మహోన్నతమైనదే. కానీ ఆచరణలో బలైపోయేవాడు ఏ పనీపాటా లేకుండా రిటైరయి ఇంట్లో కాళ్ళకీ చేతులకీ అడ్డుపడే మొగుడు.దగ్గరలో ఉండే ఏ మాల్ కో వెళ్ళి నువ్వులనూనె, కారం, ఆవపిండీ, ఉప్పూ, ఓ ఇంగువడబ్బా తెచ్చికోడం… దానికి తోడొస్తారు. ఆ తెచ్చినవన్నీ ఆవకాయ గుండ  కలిపేసి ఇంక కాయలు వర్షం పడేలోపలే తెమ్మని రోజూ గుర్తుచేస్తారు. గత 43 ఏళ్ళ అనుభవ దృష్ట్యా, ” పోనీ నువ్వుకూడా వస్తావేమిటీ.. ఆ కాయలేవో నువ్వే చూసుకోవచ్చు..” తో మొదలవుతుంది. అబ్బే వాళ్ళా లొంగేదీ.. భార్య :-    ఆమాత్రం దానికి ఈ ఎండలో నేనెందుకులెండి, మీరే  మంచి కాయలు, టెంక పట్టినవేవో చూసి తెచ్చేయండి..ఇన్నేళ్ళనుండీ తేవడం లేదూ.. మీ సెలెక్షన్ ఫరవాలేదులెండి..  భర్త : – ఎన్నికాయలూ ?.. భార్య: ఎంతోకాదులెండి.. ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు చాలు..  ఆ గిన్నేమిటో ఆ కొలతలేమిటో ఛస్తే అర్ధం అవదు ఈ బక్క ప్రాణికి. పోనీ ఆ గిన్నేదో తీసికెళ్తేనో..  భార్య ఓ చూపు ( ఈమాత్రానికి ఆ గిన్నెందుకండీ అనే అర్ధం లో ) చూసేసరికి గిన్నె వదిలేసి, మార్కెట్ కి బయలుదేరడం.వాళ్ళు మాత్రం  ససేమిరా కాయలకోసం మార్కెట్ కి రారంటే రారు. సెలెక్షన్ ప్రాసెస్ లో వీళ్ళుకూడా ఉండి, ఆ కాయలు కోసిన తరువాత బాగాలేకపోతే, చివాట్లేయడానికి ఎవరో ఒకరుండొద్దూ? దానికన్నమాట. ఈ విశాల హృదయం.. కానీ భర్తపడే మానసిక ఒత్తిడి ఎవరికి తెలుస్తుందీ? ఆ నాలుగ్గిన్నెల కొలత గుర్తుపెట్టుకోవాలి. టెంక ఉండేటట్టు ముక్కలు కోయించాలి. మళ్ళీ తక్కువైపోతాయేమో అని ఇంకో కిలో కోయించడం. మొత్తం అన్నీ ఓ ఆటోలో వేసికుని కొంపకి చేరడం. ఇదిగో  ఈ ప్రకరణం అంతా   part and parcel of annual appraisal  అన్నమాట. పాసయ్యామా, ప్రతీరోజూ ధోకా లేకుండా కొత్తవకాయ, లేదా పాతావకాయే.  By the way…  నిన్నటి టెస్టులో పాస అయినట్టే కనిపిస్తోంది…

 

 

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Benchmark

 చిన్నప్పుడు చదువుకునేరోజుల్లో ఎప్పుడూ విన్నమాట కాదు ఈ  benchmarకో, కుర్చీమార్కొ. అయినా అంత ఇంగ్లీషు ఎక్కడ వచ్చి ఏడ్చిందీ ( మనలో మనమాట). ఏదో జెవి రమణయ్య గారి గ్రామరూ , లేదా అదేదో  status symbol కోసం Wren and Martin,    గైడ్లకోసం   Lifco Guide– వీటితోనే గట్టెకించేసి, కాలేజీలో కూడా అత్తిసరు మార్కులతో డిగ్రీలు తీసికున్న బతుకులాయె.  ” H ”  ని  ” హెచ్ ” అనకూడదూ, ” ఎచ్ ” అనాలని పిల్లలదగ్గర నేర్చుకున్న అర్భకులం.మొత్తానికి వీధినపడక్కర్లేకుండా లాగించేస్తున్నాము. అయినా ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది– ఈరోజుల్లో యువతరం మాట్టాదే కొన్ని పదాలైతే అసలు అర్ధమే అవదు. మామూలుగా చిన్నప్పుడు కాలేజీలో కెమిస్ట్రీలో  ” K ”  అంటే, అదేదో పొటాసియంకి సింబలని. కానీ ఈరోజుల్లో  ఏదో ” వేలల్లో” చెప్పాలంటే , అదేదో 10 K, 20 K  అనే చెప్తారు. నీజీతం ఎంతా అని కర్మకాలి అడిగేరా  50K  అంటారు.అది నెలకో, సంవత్సరానికో అర్ధం అయి చావదు. ఏమిటో అంతా గందరగోళం.దాంతోటి నా నెలసరి పెన్షన్ ఎంత చెప్పాలో తెలియకుండా పోయింది. అయినా అదేమైనా రత్నాలా మాణిక్యాలా? ఏదో సందర్భం వచ్చిందికదా అని ఎత్తాను.

 ఉద్యోగం చేస్తూన్నరోజుల్లో , అదేదో  Brainstorming  అని విన్నాను.  ఇంటికొచ్చి డిక్షనరీ చూసి, అర్ధం తెలిసికుని, అప్పటినుంచీ , ఎడా పెడా వాడేస్తున్నాను. మామూలుగా  Schedule  ని  షెడ్యూల్ అనే అంటారనుకునేవాడిని. అదేం కర్మమో, స్కెడ్యూల్  అనాలిట. అలాగే  often  ని ఆఫ్టెన్ అనాలిట. తెలుగు భాష ఎలాగూ అపభ్రంశం అయిపోయింది, పోనీ ఆ ఇంగ్లీషునేనా వదులుతారేమో అంటే అదీ లేకుండా పోయింది.

ఇప్పుడు మనం మాట్టాడుకుంటున్నది benchmark  కదూ. ఏరోజున ఒలింపిక్స్ లో నాడియా కొమెనాచి, 10 కి 10 తెచ్చుకుందో, అప్పటినుంచీ, మన దైనందిక కార్యక్రమాలు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో, నూటికి 60 పైన వస్తే, ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. 70 దాటితే డిస్టింక్షన్ అనేవారు. కానీ ఈరోజుల్లో– నూటికి 95 వచ్చినా,  తక్కువమార్కులు వచ్చాయని, ఆత్మహత్యలు చేసికునే విద్యార్ధులని చూస్తున్నాము. అంతా కలికాలం.

 వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఈ  benchmarకులు ఇళ్ళల్లోక్కూడా వచ్చేసి ప్రాణం తీస్తున్నాయి. ఉదాహరణకి  ప్రతీదానికీ ఓ  benchmark  వచ్చేసింది. ఇల్లంతా అద్దంలా మెరిసిపోవాలి. అసలు పనిమనుషులే దొరకడం లేని ఈరోజుల్లో, వాళ్ళని ఒకటికి రెండుసార్లు, ” చీపురు నొక్కి  తుడూ.. ఓసారి “పోచా ” చేసినతరువాత, ఆ గుడ్డ పిండూ..” అని సతాయిస్తే ఉంటారా ఆ పనిమనుషులూ? పైగా తోటి పనిమనుషుల దగ్గర ” యాగీ ” కూడా చేసేస్తారు. ” అక్కడ పనికెళ్ళొద్దు.. ఆవిడ ఓ పెద్ద మహంకాళి … ఎంతచేసినా మళ్ళీమళ్ళీ చేయమనే అంటుంది… ఈమాత్రం  పనే దొరకదా ఏమిటీ..” అని. వాళ్ళకి స్వేఛ్ఛా స్వాతంత్రాలున్నాయి కాబట్టి, పని మానేస్తారు. కానీ, రిటైరయినప్పటినుంచీ ” డొమీనియన్ ప్రతిపత్తి” లోనే ఉక్కిరిబిక్కిరవుతున్న భర్తల మాటేమిటీ?  పక్కమీద దుప్పటీ సరీగ్గా వేయకపోతే తప్పు. ఏ కాఫీయో, చాయో తాగేటప్పుడు జుర్రుమని శబ్దం చేస్తే తప్పు. చేతులు కడుక్కున్నతరువాత, ఏ కర్టెన్ కో తుడిస్తే తప్పు. వారానికి కనీసం రెండుసార్లైనా, Colin తో  అద్దాలూ, ఫ్రిజ్జీ తుడవకపోతే తప్పు. ఏదో బావుందికదా అని ఏ లేతరంగు చొక్కాయో, ఫ్యాంటో వేసికుంటే రెండో రోజుకి మార్చేయాలి..  వారానికోసారి ఫ్యాన్లు తుడవకపోతే తోచదు, ఓపిక లేకపోయినా సరే. ఆవకాయకాయకి టెంక ఉందో లేదో చూసి తేకపోతే తప్పు.లోపల టెంకుందో లేదో ఎలా తెలుస్తుందీ? కొట్టువాడుందంటే ఉన్నట్టే కదా… 

 ఈ ఈతిబాధలూ, benchmark  లూ భరించలెక, ఏ హిమాలయాలకో వెళ్ళిపోదామన్నంత కోపం వస్తుందంటే రాదు మరీ?  పెట్టే బేడా సద్దుకుంటూంటే గుర్తొస్తుంది– అక్కడ కందా బచ్చలి కూరా, అరటికాయ ఆవ పెట్టిన కూరా చేసి, ముక్కలపులుసుతో  సుష్టుగా భోజనం ఎవరు పెడతారూ అని. పాపం తను మాత్రం అడిగిందేమిటీ.. ఇల్లు శుభ్రంగా ఉంచండీ. ఏ వస్తువు దాని చోట్లో పెట్టండీ అనే కదా. ఉద్యోగంలో  మనం ఉన్నంతకాలమూ పాపం తనేకదా చూసుకునేదీ. పిల్లలు స్కూళ్ళకీ, భర్త ఉద్యోగానికీ వెళ్ళడంతో  హాయిగా ఇల్లు అద్దంలా ఉంచుకునేది. ఇప్పుడు కదా, ప్రతీదాంట్లోనూ వేలెట్టే  భర్తలు ఇంటిపట్టున ఉంటున్నదీ?

  మోదీగారైతే ” స్వఛ్ఛ్ భారత్ ” అని ఇప్పుడు మొదలెట్టారు కానీ, మన ఇంటి ఇల్లాళ్ళు , సంవత్సరాలతరబడి చేస్తున్నారు.. చేస్తూనే ఉంటారు. వాళ్ళ  Benchmark  10/10 కదా….

%d bloggers like this: