ఏప్రిల్ లో దేశమంతా ఎన్నికలు పూర్తయి, మేలో ఫలితాలు వచ్చేదాకా టివీ లో కానీ,వార్తాపత్రికల్లోకానీ, రాజకీయాల గురించి అసలు పట్టించుకోకూడదని పెట్టుకున్న నియమం ధర్మమా అని, ఇంకోటేదో వ్యాపకం పెట్టుకోవాలిగా మరి. క్రిందటి టపాలో వ్రాసిన నా బ్యాగ్గుల గోలతో కొంత కాలక్షేపం అయింది.
మా ఇంట్లో ఓ ఫ్రిజ్ ఒకటుంది. అదేం గొప్పా ఏమిటీ, ప్రతీ ఇంట్లోనూ ఉండేదేగా, దీనిక్కూడా అదేదో పెద్ద విషయంలా ఓ టపా పెడుతున్నాడూ, అడిగేవాళ్ళు లేకపోతే సరీ అని మీరు తిట్టుకున్నా సరే, చెప్పేదేదో చెప్పేస్తేనేకానీ నేనుండలేను మరి. సామాన్యంగా ఈరోజుల్లో ఫ్రిజ్ లు ఎలా ఉంటాయీ, Automatic Defrost తో కదూ. మాదానికి అలాటి లక్షణాలు శూన్యం.మరి అదే ప్రత్యేకత ! రెండురోజులకోసారి ఆ Defrost Button నొక్కితే, క్రింద ఉన్న Tray లోకి వెళ్ళే నీళ్ళు వెళ్ళగా, మిగిలిన నీళ్ళు ఇల్లంతా పాకుతాయి. ఆ మాయదారి Tray ఏమో లిటికంత.ఇలా నీళ్ళనీ బయటకు వచ్చేసినప్పుడు, నేనే ఓ పాత గుడ్డా, పాత్రా తీసికుని, ఆ ఫ్రిజ్ ని switch off చేసేసి, క్రింద చతికిలబడి, ఆ గుడ్డని ఆ Tray లో ముంచి, నీళ్ళు పాత్రలోకి పిండుతూంటాను. దిక్కుమాలిన ఫ్రిజ్ కొన్నది నేనేకదా, మరి అనుభవించొద్దూ? ఎవరో సలహా ఇవ్వగా, రాజమండ్రీ కాపరంలో కొన్నాను.క్రితజన్మలో చేసిన పాపాలు అనుభవించొద్దూ మరి? ప్రతీ నెలలోనూ ఏదో ఒక “మూడు” రోజులు నాకు తప్పదు ఈ శిక్ష ! ఏమిటో కానీ, వయసొచ్చేసినతరువాతకూడా ఇలాటివి తప్పడం లేదు. పోనీ ఆ ఫ్రిజ్ ఏదో మార్చేసి కొత్తది కొనుక్కోవచ్చుగా అని సలహా మాత్రం ఇవ్వకండి. ఆ ఫ్రిజ్జే దానంతట అది “చల్లబడడం” మానేసేదాకా మార్చను. అంటే దానర్ధం, దాని బాగోగులకి ఒఖ్ఖ పైసా కూడా ఖర్చుపెట్టదలుచుకోలేదు.
ఇన్నాళ్ళూ చలికాలం అవడంతో ఆ ఫ్రిజ్జ్ ఉపయోగంకూడా అంతమాత్రమే. దాన్ని periodical గా defrost చేయడం కొద్దిగా అశ్రధ్ధ చేసినమాట నిజమే ( మా ఇంటావిడ ఉవాచ !). వచ్చేది వేసవికాలంకదా, ఆ ఉన్న ఫ్రిజ్జి ని సద్వినియోగం చేసికుందామూ అనే సదుద్దేశ్యంతో ఒకసారి దానివైపు దృష్టి పెట్టాను. ఈమధ్య అసలు నీళ్ళు తోడాల్సిన అగత్యమే రాలేదేమిటి చెప్మా అని చూస్తే ఇంకేముందీ, “అమరనాథ “ దృశ్యం కళ్ళబడింది.
అందులో పేరుకుపోయిన హిమవత్ఖండాలని కరిగించాలంటే ఓ రెండు మూడు రోజులైనా పట్టేటుంది. ఇన్నిరోజులూ ఫ్రిజ్ లేకుండా గడపడం కూడా కష్టమే. అలాగని పుట్టినప్పటినుండీ ఫ్రిజ్ లతోనే పెరిగామని కాదూ, చిన్నప్పుడు ఇలాటివేమైనా చూశామా పెట్టామా, తరువాత్తరువాత పుట్టుకొచ్చిన సుకరాలు ఇవి. అయినా అలవాటు పడిపోయాము కదా. ప్రస్థుత సమస్య ఆ హిమఖండాలని కరిగించడం. సడెన్ గా ఓ అవిడియా వచ్చేసింది.వేడి తగిలితే కరుగుతాయేమో అని! వేడి ఎలా తగిలించడం? పైగా అలాటి పిచ్చి పనులు చేస్తే, ఫ్రీజరు తగలడుతుందేమో,పోనిద్దూ పీడా వదులుతుంది,కొత్తది కొనేయొచ్చు, కారణం ఒకటి పుట్టుకొచ్చిందిగా అనుకుని, ఆ వేడి చేయడం ఎలాగా అని ఆలో..చించి..చించి..చించగా మొత్తానికి ఓ highly innovative idea వచ్చేసింది ! ఇంట్లో ఎలాగూ ఓ hot water bag ఒకటుందిగా, కాపడాలు పెట్టుకోడానికి దాంట్లో మరుగు నీళ్ళు నింపి కాపడాలు పెట్టుకునేవాళ్ళం కదా. ఆ “కాపడం” ఏదో ఆ ఫ్రీజరుకి పెట్టేస్తే సరీ అనుకుని రంగంలోకి దిగిపోయాను. శుధ్ధధన్యాసి రాగంలో హరికేశనల్లూర్ ముత్తయ్యభాగవతార్ గారు రచించిన ” హిమగిరితనయే హెమలతే ..” కీర్తన గుర్తు చేసికుంటూ ఆ బ్యాగ్గునిండా మరుగు నీళ్ళు పీకలదాకా నింపేసి ఆ ఫ్రీజరుకి కాపడం పెట్టేశాను.. ఓ పావుగంటలో ఆ హిమఖండాలన్నీ avalanche లా టప టప మంటూ పిగిలిపోయాయి. కథ సుఖాంతం..
నా ఈ అఘాయిత్యప్పనుల తరువాత అసలు ఫ్రిజ్ పనిచేస్తోందా లేదా అని సందేహం లేకుండా, శుభ్రంగా ఐస్ ట్రే లో నీళ్ళు నింపి ఓ గంట తరువాత చూస్తే లక్షణంగా పనిచేస్తోంది.
గత కొన్నిరోజులుగా ఈ టపాలు వ్రాయడం మానేసి Facebook లో షికార్లు కొట్టేవాడినిగా, అదేమిటో కానీ అందరూ కొత్తవారే ఎవరో ఒకరిద్దరు తప్ప. దాంట్లో పాతవి ఫొటోలూ అవీ పెట్టి కాలక్షేపం చేశాను. ఆ సందర్భంలోనే కొన్ని లింకులు కూడా పెట్టాను. శ్రీ నండూరి సుబ్బారావుగారు ( గణపతి పాత్రని అజరామరంగా పోషించినవారు) విజయవాడ ఆకాశవాణి కేంద్రంద్వారా ఆయన నటించిన కొన్ని మచ్చుతునకలు దొరికాయి, అక్కడ ఆ లింకులు ఇచ్చినప్పుడు ఇక్కడకూడా పంచుకోవడం భావ్యం కదూ… ఇంకెందుకు ఆలశ్యం.. మీరూ వినేయండి ఇక్కడ ఈ లింకు నొక్కితే కుడిచేతివైపు కుడిప్రక్కన ఓ అయిదు నాటికలు వినొచ్చు. Enjoy..
Filed under: Uncategorized | 9 Comments »