ఈవేళ ప్రొద్దుటే నాకు కాలేజీలో ఇంగ్లీషు పాఠాలు చెప్పిన ఒకాయన నెంబరు ” తెలుగువెలుగు” పత్రికలో దొరికితే, ఒకసారి ఆయనతో మాట్టాడి, పాత జ్ఞాపకాలు గుర్తుచేసికుందామని, ఆయనకు ఫోను చేసి, నేను ఫలానా అని గుర్తుచేయగానే, ఆయనకూడా, గుర్తుచేసికుని, మా నాన్నగారూ, అన్నయ్యల గురించీ గుర్తుచేసికుని, నేను ఇన్నేళ్ళ తరువాత కూడా, ఆయనని జ్ఞాపకం ఉంచుకున్నందుకు చాలా సంతోషించారు. చిన్నప్పుడు మనకి పాఠాలు చెప్పిన గురువుల్ని మర్చిపోతామా ఎక్కడైనా? నాలుగు అక్షరం ముక్కలు వంటబట్టాయంటే అది వారి చలవే కదా. నా ప్రస్థుత వివరాలు చెప్పిన తరువాత ఆయనకూడా వారి పిల్లలగురించీ,మనవలూ, మనవరాళ్ళ గురించీ చెప్పారు.ఓ పది నిముషాలు మాట్టాడి, పాత విషయాలు గుర్తుచేసికున్నాము. మాటల్లో మాస్టారూ మీకు మెయిల్ ఐడి ఏదైనా ఉందా, అని అడగ్గానే, అదేదో defensive గా ధ్వనిస్తూ, ఉందనుకో, కానీ ఎక్కువగా ఉపయోగించనూ, ఏదో పిల్లలే చెప్తూంటారూ, అనగానే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అలాగని నేనేదో గొప్ప net savvy అని కాదు కానీ, తగినంత working knowledge ఎలాగోలాగ సంపాదించేశాను. ప్రతీదానికీ పిల్లల్ని అడగఖ్ఖర్లేకుండా పనైపోతోంది, అది చాలదూ? ఇప్పుడు నాలాటివాళ్ళు ఏమైనా పరిశోధనలు చేయాలా, ప్రపంచాన్నేమైనా ఉధ్ధరించాలా? బయటికి వెళ్ళి ఎండలో తిరిగేబదులు, హాయిగా ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం అయిపోతోంది. అలాగని రోజులో మరీ ఎక్కువ సమయమేమైనా గడుపుతామా అంటే అదీ కాదు.
చిత్రం ఏమిటంటే నా స్నేహితులు ( నా సమకాలీనులు) చాలామంది, నెట్ అంటేనే, అదేదో “పాపం” చేసినంత బాధపడిపోతారు. అలాగని వారికి ఇంటర్నెట్టూ, కంప్యూటరూ కొత్తా అంటే అదీ కాదు, ప్రతీ ఇంట్లోనూ, కొడుకో,కూతురో, అల్లుడో, కోడలో ఎవరో ఒకరు ఐటీ లో పనిచేసేవారే. కొన్నిచోట్ల అంతా కట్టకట్టుకుని అలాటి ఉద్యోగాల్లో ఉన్నవారే. మరి ఆలాటప్పుడు, ఈ కంప్యూటరూ, నెట్టూ అంటే అంత నిరాసక్తత ఎందుకో అర్ధం అవదు. పోనీ పిల్లలు చెప్పరా అంటే అదీ కాదూ, ఊరికే ప్రతీదాంట్లోనూ వేలెట్టకుండా, హాయిగా ఓ కంప్యూటరు నేర్పేస్తే, హాయిగా వాళ్ళ దారిన వాళ్ళు కాలక్షేపం చేసికుంటారనే అభిప్రాయంతోటే ఉన్నారు ఈ రోజుల్లో.పైగా కంప్యూటరంటే ఇంట్లోనే కూర్చుని చేయాలేమో అనుకోకుండా, ఈరోజుల్లో ప్రతీవారూ తమ తల్లితండ్రులకి ఓ ఐపాడ్డో ఇంకోటో ఇచ్చేస్తున్నారు. అంటే సమస్యల్లా ఈ పెద్దాళ్ళతోనే అని అర్ధం అయిపోతోందిగా.
చిన్నప్పుడల్లా ప్రతీరోజూ తమ పిల్లలకీ, విద్యార్ధులకీ day in and day out అదినేర్చుకో, ఇదినేర్చుకో అని ఊదరగొట్టేశారే, మరి వీళ్ళకి తట్టదా, ఏమిటో “ఈరోజుల్లో చిన్నపిల్లాడిదగ్గరనుంచీ ప్రతీవాడూ, ఇంటర్నెట్ గురించే మాట్టాడుతాడూ, పోనీ అదేదో మనమూ నేర్చేసికుంటే పోలేదూ?”–అనీ? అసలు నాకోటి అనిపిస్తోంది, ఈ నిరాసక్తకు అసలు కారణం అంతా ఉక్రోషమూ, ఉడుకుమోత్తనమూ అనేమో అని !ఇదివరకటి రోజుల్లో అయితే, ప్రతీ విషయమూ పెద్దవారినే అడిగి చేసేవారు.ఏవైనా సందేహాలున్నా, వారినే అడిగేవారు. అలా అడిగినప్పుడల్లా వారికీ ఓ సంతృప్తి ఉండేది.కానీ ప్రస్తుతపు రోజుల్లో అడిగేదేమిటీ , ఈమాత్రందానికీ, గూగులమ్మని అడిగేస్తే పోలా అనో అభిప్రాయమూ, ఎందుకులే పెద్దాయన్ని ఇరుకులో పెట్టడమూ అనో, మొత్తానికి ఈ పెద్దాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోట్లేదు. చివరకి పసిపిల్లలతో సహా! దీనితోటి జరిగిందేమిటయ్యా అంటే, ఈ పెద్దాళ్ళకి “అలక” వచ్చేసింది. చెప్పుకోలేని కోపం, మనం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటీ అనే ఓ నిస్సహాయతా, మరి ఆ కోపం ఎవరిమీద చూపించుకుంటారు? పిల్లలూ, పెద్దలూ వినే స్థితిలో లేరు.అసలు ఈ పరిస్థితి రావడానికి మూలకారణం ఏమిటా అని ఆలోచించి, ఆ దిక్కుమాలిన కంప్యూటరు కదూ దీనికంతా కారణం అని, దానిమీద ఎక్కడలేని ఘృణా, నిరాసక్తతా పెంచేసికుని, కనిపించినవాళ్ళందరి దగ్గరా, ” ఏమిటోనండీ ఇప్పుడు ఎక్కడ చూసినా నెట్టుట..నెట్టు.. పెద్దాళ్ళ మాటలు వినే రోజులా ఇవీ..” అనేసి, నెట్టు గురించి మాట్టాడడం కానీ, దానివైపు చూడడం కానీ, చేస్తే అదేదో బ్రహ్మహత్యాపాతకం వచ్చేస్తుందేమోఅన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా ఓడెక్కి బయటి దేశాలకెళ్తే ప్రాయశ్చిత్తాలు చేయాల్సొచ్చేదిట, అలాగన్నమాట.
అయినా మీకెందుకండీ ఈ గొడవా, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు నేర్చుకుంటారూ, అన్నీ కోనసీమ బుధ్ధులూ, అవతలివాళ్ళ విషయాలంటే ఉన్న ఆసక్తి, మనగురించి పట్టదు. ఓ విషయం చెప్పండి, అయ్యో… అయ్యో.. సైకిలే తొక్కడం రాదా మీకూ.. షేం షేం.. పప్పీషేం అంటే మీకెలా ఉంటుందీ? దానికి నేను చెప్పే సమాధానం, ఆ శకం పూర్తయిపోయింది.పైగా నాకు సైకిలు రాకపోవడం వలన, నాకు లాభాలే కానీ, నష్టాలు కలగలేదు. ఓ బైక్కు కానీ, స్కూటరుకానీ, ఓ కారుకానీ కొనాల్సిన అవసరం కలగలెదు. పైగా నచ్చినా, నచ్చకపోయినా జీవితం అంతా చచ్చినట్టు నడిచే కాలక్షేపం చేశాను. ఆ నడక పుణ్యమా అని, మామూలుగా వచ్చే రోగాల( రక్తపోటూ, సుగరూ లాటివి) బారినుండి తప్పించుకోకలిగాను. మీరనొచ్చు ఇదో వితండ సమర్ధింపూ అని! అయినా సైకిలు నడపడం రాకపోవడానికీ, కంప్యూటరు నేర్చుకోపోడానికీ పోలికేమిటండీ? సైకిలు సరీగ్గా నడపడం రాకపోతే, ఏ రోడ్డుమీదకో వెళ్ళినప్పుడు ఏ కాలో చెయ్యో విరగడమో, అవతలివాడిది విరక్కొట్టడమో జరుగుతుంది. కంప్యూటరు విషయంలో అలా కాదే. పైగా మనమాట వినే ఏకైక “ప్రాణి” అదొక్కటే.
హాయిగా ఇంట్లో కూర్చుని ప్రవచనాలు వినొచ్చు,సినిమాలు చూసుకోవచ్చు,పుస్తకాలు చదువుకోవచ్చు, డబ్బు ఖర్చులేకుండా దేశవిదేశాల్లోని అందరితోనూ మాట్టాడుకోవచ్చు, అదీ ఇదీ కాదనుకుంటే నాలా చేతికొచ్చిందేదో వ్రాసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే, ఇళ్ళల్లో ఉండే పెద్దాళ్ళు ఎలాగూ మారరు, మీరే ఎలాగో వీలుచూసుకుని, చొరవతీసికుని వాళ్ళకి నేర్పేయండి.అలా చేస్తే మీకే లాభాలు. ఉత్తిపుణ్యాన్న మీతో గొడవలు పెట్టుకోరు, పిల్లలతో ఎప్పుడైనా బయటకు వెళ్తే మీతోపాటు బయలుదేరరు. వాళ్ళదారినవాళ్ళు పడుంటారు.పైగా ఇన్నేళ్ళలోనూ నేర్చుకోని విషయాలు నేర్చేసికుంటారు. అయినా ఉండేదెన్నేళ్ళూ? మహా అయితే ఓ పదిపదిహేనేళ్ళు.
అసలు ఈ గొడవంతా నిన్న రాద్దామనుకున్నాను. పేపరులో చూస్తే తెలిసింది, w.w.w అందరికీ అందుబాటులోకి వచ్చి ఇరవై ఏళ్ళయిందిటగా. నేను ఈమధ్యన ఎవరికి మెయిళ్ళు పంపినా, అచ్చతెలుగులోనే వ్రాస్తున్నాను. అప్పుడెప్పుడో రాజమండ్రీలో ఉన్నప్పుడు మా పక్కింటావిడ అడిగారులెండి, అయ్యో.. ఇంగ్లీషు రాదా, తెలుగులో వ్రాస్తారూ..అని ! టింగ్లీషు కంటే తెలుగే మంచిదిగా.
బైదవే రైల్వేల్లో రిజర్వేషన్లు ఇన్నాళ్ళూ 120 రోజుల ముందుగా చేసికునే సౌలభ్యం ఉండేది. కానీ రేపు మే ఒకటో తారీకునుండి 60 రోజులకి చేసేసారు. అందరికీ తెలిసే ఉంటుందిలెండి, అయినా తెలియదేమో అనీ, వ్రాశాను. మరి ఇలాటివే కదా సౌలభ్యాలూ…
నా బ్లాగులో ఈవేళ్టి టపా...
Like this:
Like Loading...
Filed under: Uncategorized | 13 Comments »