బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Interview on ND TV

ఇన్నాళ్ళకి ఓ సంచలనాత్మకమయిన ఇంటర్వ్యూ చూశాను ఇప్పుడే. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం

    మొన్న శనివారం నాడు కొత్తగా ఈమధ్యన చేరిన మిస్టరీ షాపింగు ఒకటి చేశాను. కళ్ళజోళ్ళకొట్టు Lawrence & Mayo కి వెళ్ళాను.కళ్ళ టెస్టింగు చేసికోమన్నారు. అప్పటికే ఇంకో ఏజన్సీ వాళ్ళ Titan Eye వి మూడు చేసి ఉన్నాను కాబట్టి, ఈ assignment ఏమీ అంత కష్టమనిపించలేదు.ఆ eye testing చేసిన డాక్టరుతో, నా పాత కబుర్లన్నీ- నాకు మొట్టమొదటిసారి ఫాక్టరీ డాక్టరుతో కళ్ళటెస్టింగు ఎలా అయిందీ, ముందరే రూమ్ము లోకి వెళ్ళి అక్కడుండే అట్టమీదున్న అక్షరాలన్నీ ఎలా బట్టీ పట్టేశానో, చివరకి ఎలా పట్టుబడిపోయానో వగైరా..- చెప్పేటప్పటికి, వాళ్ళందరూ నవ్వాపుకోలేకపోయారు. దానితో నేనొక VIP అయిపోయాను.కన్సల్టేషన్ ఫీ ఇవ్వఖ్ఖర్లేదన్నారు! నేనక్కడుంటున్నానూ అని అడిగితే చెప్పాను. మరి కళ్ళ టెస్టింగుకి ఇంతదూరం ఎందుకొచ్చారూ అన్న దానికి, మీ కంపెనీ పేరు నచ్చింది అందుచేత వచ్చానూ, తప్పా అన్నాను. కాలక్షేపం మాత్రం చాలా బాగా అయింది.బస్సులో వెళ్ళడానికి పేద్ద ఖర్చేమీలేదు, మా పూణె మునిసిపాలిటీ వారి ధర్మమా అని ( సీనియర్ సిటిజెన్స్ కి రోజుకి 10 రూపాయలు మాత్రమే, ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు). ఇంకో నెలలో ఎలాగూ డబ్బులు ( 600 రూపాయలు) పంపుతారు.

    ఇంకో ఏజన్సీ వారిది రెండు కూడాచేశాను ఈవేళ. దీనిలో తేడా ఏమిటంటే, మనం వస్తువు ముందర డబ్బు పెట్టి కొనాలి, ఓ నెలలో మనం ఆ వస్తువు కొనడానికి ఎంత ఖర్చుపెడితే అంతా పంపించేస్తారు. బావుంది కదూ!డిశంబరు నెలలో అదేదో ‘ మోకా’ ట, దానికి వెళ్ళి ఓ 550 రూపాయల తిండి తినాలిట.ఒక్కణ్ణీ తిండం కష్టమేనండి బాబూ. తిన్నంత తిని, ఆ పైది పార్సెల్ కట్టించుకొచ్చేస్తే సరి! వచ్చే నెలలో వాళ్ళు చెప్పిన మల్టీ ప్లెక్స్ కి వెళ్ళి సినిమా చూసి, ఆ థియేటర్ గురించి వ్రాయాలిట. వాళ్ళు ఎసైన్ చేస్తే చేయడం. కావలిసినంత కాలక్షేపం.కొత్తవాళ్ళైనా మాట్లాడడానికి ఏమీ భయం గట్రా ఏమీ లేవు.వయస్సులో పెద్దవాణ్ణి కాబట్టి, మరీ ఎవరూ ఇరుకులో పెట్టరు.ఇంకేం కావాలి?నాకూ మంచి టైంపాసూ.

    మా ఇంటావిడ కూడా చేస్తూంటుంది. ఇక్కడ వచ్చిన గొడవల్లా ఏమిటంటే, మిస్టరీ షాపింగుకి వెళ్ళినప్పుడు, డబ్బులు నా జేబులోంచి వెళ్తాయి, చెక్కు మాత్రం ఆవిడ పేరున పంపుతూంటారు! నా అదృష్టం కొద్దీ, ఈ మధ్యన చెక్కులు ఆపేసి
బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకే ఆ మధ్యన ఒకేనెలలో ఆవిడకి డెంటల్, కళ్ళజోడూ పెట్టించేశాను. ఆ వచ్చిన 5000/-కి అలా కాళ్ళొచ్చేశాయి!మహా అయితే, వైద్యం మీరేమైనా చేయించారా అంటుంది!పోనిద్దురూ, ఎవరి ఆనందం వాళ్ళది. ఆ మిగిలిన రెండు ఏజన్సీలలోనూ రిజిస్టర్ చేయించేస్తే ఓ గొడవొదిలిపోతుంది.తన ఖర్చులేవో తనే చూసుకుంటుంది! హాయి కదా!

    అందుకే అంటాను,రిటైరయి బాధ్యతలు చాలా భాగం తీరిపోయాక, మన దారిన మనమే ఏదో వ్యాపకం పెట్టేసికుంటే కావలిసినంత కాలక్షేపం. పిల్లలు ఎక్కడికైనా వెళ్తే, మనం కూడా నొరు వెళ్ళబెట్టికుని ‘ మేమూ వస్తామూ ఊ ఊ ఊ…’
అని పేచీ పెట్టఖర్లేదు
! పిల్లలు వాళ్ళ దారిన వాళ్ళుంటే వాళ్ళకీ హాయి. ఏ restaurant కేనా వాళ్ళు వెళ్తూ, మొహమ్మాటానికి మనల్నీ రమ్మంటారనుకోండి, పొనీ అని వెళ్ళేమా,అక్కడంతా అగమ్యగోచరంగా ఉంటుంది. సుఖానున్న ప్రాణానికి అంత హింస పెట్టాలంటారా ?

    నేనకోవడం మన దారిన మనం ఉండడం. ఎవరైనా మనింటికి వస్తే, ఓ సారి వాళ్ళింటికి వెళ్ళడం.ఎవరూ రారూ ఇంకా మహబాగు.మన కాలక్షేపం మనకి ఉండనే ఉంది.ఎవరైనా ఏ ఫంక్షనుకో పిలిస్తే వెళ్ళడం.కారణాంతరాలవల్ల, మనల్ని పిలవలేదూ తరవాత తెలిసి ఏడవకూడదు.ఇవ్విధంబుగా మా ఇంటావిడకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాను.చూద్దాం ఎంతవరకూ నెగ్గుకొస్తానో? వచ్చే వారం మాతో గడపడానికి మా కజిన్ వస్తున్నాడు. తనతో ఓ అయిదురోజులు కాలక్షేపం !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

నెట్ లో దేనిగురించో వెదుకుతుంటే ఈ లింకు దొరికింది. తెలుగు సినిమాలు ఎటువంటి యాడ్లూ లేకుండా హాయిగా చూసుకోవచ్చు ఇక్కడ.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఈవేళ మా స్నేహితొలొకరి ఇంటికి, వారి గృహప్రవేశానికి వెళ్ళాము.ఆ అమ్మాయి పంజాబీ, భర్త మలయాళీ.భర్తగారి తండ్రితో పరిచయం చేశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆయన 1950 నుండీ మన సికిందరాబాద్ లో ఉంటున్నారు. నా పరిచయం అయిన తరువాత, నేను తెలుగువాడినని తెలిసి, మా స్వంత ఊరు ఏదీ వగైరా ప్రశ్నలు వేశారు. మరీ తెలియదేమో అనుకుని, రాజమండ్రీ అని చెప్పాను. అంటే తూర్పుగోదావరా అన్నారు.అబ్బో, ఈయనకి అన్నీ తెలుసే అనుకుని, కాదూ దగ్గరలోనే అమలాపురం అని ఉంది అక్కడే పుట్టి పెరిగానూ అన్నాను.’ ఓహో కోనసీమా..’ అనడంతో, వామ్మోయ్ ఈయనకి చాలా తెలుసునూ, అనుకుని పిచ్చాపాటీలోకి దిగిపోయాను.

   అప్పుడు ఆయన తను అవిభక్త మద్రాసు రాష్ట్రంలో, ఎక్కడెక్కడ పనిచేశారో ఆ వివరాలన్నీ చెప్పారు.ఇప్పటికి సికిందరాబాద్ లో అరవై ఏళ్ళనుండి ఉంటున్నారుకదా, తెలుగు మాట్లాడడం అదీ వచ్చునా అని అడగ్గానే, టకటకా మని తెలుగులో కుశలప్రశ్నలు వేసేశారు! ఆ సందర్భంలోనే సికిందరాబాద్ లో ఉండే తన ఓ స్నేహితుడిగురించి చెప్పారు- ఆయన బెంగాలీ, ప్రస్తుత తమిళనాడు రాష్ట్రం లో పుట్టారు,చివరకి గుజరాతీ అమ్మాయిని పెళ్ళి చేసికుని, హైదరాబాదులో స్థిరపడ్డారు-
అన్ని భాషలూ అనర్గళంగా మాట్లాడుతారుట. ఈ స్నేహితుడిగురించి చెప్తూ,ఆయనకీ ఈయనకీ ఎక్కడ పరిచయం అయిందో చెప్తే ఆశ్చర్యపోయాను. సికిందరాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో ఫిజియో థెరపీ వార్డు దగ్గరట. ఈయనకి ఎడం వైపు, పెరాలిసిస్ స్ట్రోక్ రావడం తో, మందులూ అవీ వాడి, ఆ తరువాత ఫిజియో థెరపీకి వెళ్ళినప్పుడు, అక్కడ ఓ పెద్ద మనిషి, అక్కడికి వచ్చిన ప్రతీ పేషంటుతోనూ, వారి వారి భాషల్లో మాట్లాడుతూ, వారికి ధైర్యం చెప్తూ,అందరినీ ఉత్తేజ పరచడం చూసి, ఆయనతో మాటలు కలిపినప్పుడు తెలిశాయిట వివరాలన్నీ. ఆయనేమీ అక్కడ గైడ్ కాదు. తనుకూడా చికిత్సకోసం వచ్చిన వారే. తగిలిన చోట తగలకుండా, శరీరంలోని చాలా చోట్ల- కాలు,చెయ్యి,మోకాలూ- అడక్కండి ఎక్కడపడితే అక్కడ, విరిగో, బెణికో ఒకదాని తరువాత ఇంకో దాన్ని గురించి ఫిజియో థెరపీ కోసం ఇక్కడికి అంటే ఆ హాస్పిటల్ కి వస్తున్నారుట.చివరికి ఈ మధ్య బాత్ రూం లో జారిపడి నడుము దెబ్బ తిందిట!అయినా సరే, ధైర్యం కోల్పోక, పట్టువదలని విక్రమార్కుడిలా వైద్యం చేసికుంటునే వీలున్నంతవరకూ అక్కడికొచ్చిన పేషంట్లకి ధైర్యం చెప్తున్నారు! హాట్స్ ఆఫ్ !!

   ఇంకో విషయం కూడా చెప్పారు తన తమ్ముడి గురించి- ఆయన అవడం మలయాళీ అయినా, ఒక కన్నడ అమ్మాయిని వివాహం చేసికున్నారుట.ఆరొజుల్లో వాళ్ళ అమ్మగారు అభ్యంతరం చెప్తే, ఆయనన్నారుట-‘అమ్మా మీరూ, నాన్నా ఉండేది ఇంకో అయిదారు సంవత్సరాలు, ఆ తరువాత నేను ఎలాగూ ఒంటరివాడినే కదా, నాకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసికుంటేనే సుఖం కదా. కావలిసిస్తే మీ మాట ప్రకారం, మీరున్నంతవరకూ, ఒంటరిగానే ఉండిపోతానూ, అలాగని మీరెప్పుడు పోతారా అని ఎదురుచూడ్డం కాదు. మీరు ఇష్టపడితేనే ఈ పెళ్ళి, అనేటప్పటికి వారు కన్విన్స్ అయి ఆ అమ్మాయితో పెళ్ళి చేశారుట.అలాగని దానితోనే ఆగిపోలెదు, తన పిల్లలకి కూడా వాళ్ళకిష్టమైన వివిధ రకాల భాషల పిల్లలతోనూ పెళ్ళిళ్ళు చేశారుట. అందరూ హాయిగా ఉన్నారు.

   ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈవేళ ప్రొద్దుట జీ తెలుగులో ‘గోపురం’ కార్యక్రమంలో,’ కొత్తగా పెళ్ళైన భర్త ఎలా ఉండాలీ? ‘ అనే విషయం మీద చెప్పారు.ఆవిడ చెప్పినవన్నీ థీరిటికల్ గా బాగానే ఉంటాయి. తల్లితండ్రులతోనూ, భార్యతోనూ సంయమనం పాటించాలీ, ఓ సారధిలాగ ఉండాలీ వగైరా వగైరా.. ఓ మాట చెప్పండి ఈ రోజుల్లో అంత సంయమనం పాటించే ఓర్పూ, ఓపికా ఎవరికైనా ఉన్నట్లు కనిపిస్తోందా?

   ఏది ఏమైనా ఓ కొత్త పరిచయం అయింది.కొత్తవారితో పరిచయం చేసికున్నప్పుడే కదా తెలిసేది ప్రపంచం ఎలా ఉందో ? అంతేకానీ మనమూ, మన పిల్లలూ అనుకోకుండా కొత్తవారితో పరిచయం చేసికుంటూ ఉండండి.
బై ద వే ఈ రెండుమూడు రోజుల్లోనూ చేయడానికి రెండు మిస్టరీ షాపింగులు వచ్చాయి. పీటర్ ఇంగ్లాండ్, లారెన్స్ మేయో. ఆ అనుభవాలు అవి పూర్తయిన తరువాత ! సీ యూ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- చదువులు

    మనం చిన్నప్పటినుండీ నేర్చుకున్న చాలా చాలా పాఠాలు, అసలు ఆ గురువులు ఎందుకు నేర్పారో, మనం బట్టీ పట్టేసి ఎందుకు నేర్చుకున్నామో ఇప్పటికీ నాకైతే తెలియదు. ఉదాహరణకి తెలుగు అక్షరాల్లో అలు,అలూ ( ౡ).ఈ అరవైఅయిదేళ్ళలోనూ, చిన్నప్పుడు నేర్చుకోవడం తప్ప, ఇంకెక్కడా ఆ అక్షరాలు ఉపయోగించగా చూడలేదు. అలాగని నేనేమీ పేద్ద చదువుకున్నవాడిననడం లేదు. తెలుగుకి సంబంధించినంతవరకూ, మిగిలిన అక్షరాలు ఎక్కడో అక్కడ చదివే సందర్భం వచ్చింది, అదీ నేను చెప్పేది.మనకేం తెలుసునూ, ఈ అక్షరం వాడుక భవిష్యత్తులో ఉండదూ అని! నేర్చుకోకపోతే మాత్రం, ఓ తొడపాయసమో, గోడకుర్చీ యో,టెంకి జెల్లో మాత్రం పడేది!చచ్చినట్లు నేర్చుకున్నాము!

ఎక్కాలోటీ,రెండునుంచి పంథొమ్మిదో ఎక్కందాకా కిందనుంచి పైకీ, పైనుంచి కిందకీ బట్టీ పట్టాల్సిందే! ఆతరువాత ఇరవయ్యో ఎక్కంనుండీ కొంతకాకపోతే కొంత సుళువుగానే ఉండేవి.ఏదో అంతకుముందు నేర్చుకున్నవాటికి ఒకటో రెండో సున్నలు చేర్చేస్తే పనైపోయేది! అన్నిటిలోకీ చిత్రహింసలు పెట్టేది పదమూడో ఎక్కం.ఛస్తే వచ్చేది కాదు. అదివచ్చేదాకా ఇంట్లోనూ, స్కూల్లోనూ, ప్రెవేటు లోనూ బుర్ర పగలుకొట్టుకోవడమే! ఏమిటో ప్రపంచం అంతా మనకి శత్రువుల్లా కనిపించేవారు!మన ఇంటికి వచ్చే పాలవాడూ, చాకలీ, డబ్బులు లెఖ్ఖెట్టేటప్పుడు టకటకా మని నోటి లెఖ్ఖ కట్టేసి, టక్కుమని చెప్పేసేవారు. వాళ్ళని చూపించి ‘ వీళ్ళలా లెఖ్ఖలు నేర్చుకుంటే, పెద్దయిన తరువాత ఏ కొట్లోనో పద్దులు వ్రాసే గుమాస్తాగా అయినా ఉద్యోగం వస్తుందీ’ అని చీవాట్లేసేవారు.

ఎలాగోలా ఈ బాలారిష్టాలన్నీ దాటి పెద్ద స్కూల్లోకొచ్చేటప్పటికి జనరల్, కాంపొజిట్ మాథ్స్ అనేవొచ్చాయి.వాటిల్లో ఏమిటేమిటో స్క్వేర్ రూట్లూ అవీనూ.వాటిని ఎందుకు కనిపెట్టారో,అవన్నీ మనకి ఎందుకు ఉపయోగిస్తాయో అంతా అగమ్యగోచరంగా ఉండేది. పోనీ అలాగని నేర్చుకోనూ అందామా అనుకుంటే, పైక్లాసుకు వెళ్ళమేమో అనో భయం!జనరల్ మాథ్స్ లో అవేవో పొలాలూ, చుట్టుకొలతలూ, ఆవులూ, గడ్డీ,వైశాల్యాలూ అవీ ఉండేవి.గోడలు కట్టడాలూ, కూలీలూ కూడా.ఇంక కాంపోజిట్ మాథ్స్ కి వస్తే,ఏవేవో ఏ స్క్వేర్లూ, బీ స్క్వేర్లూ అవీ ఉండెవి. ఏమిటో ఈ గోలంతా అనిపించేది.కాలేజీకొచ్చేసరికి సైన్ తీఠాలూ, కాస్ తీఠాలూ, టాన్ తీఠాలూ వచ్చేశాయి.ఆ ఫిజిక్సోటీ,యాక్సిలరేషన్ డ్యూ టూ గ్రావిటీ ఎంతైతే మనకెందుకంట! ఎంతంత చిత్రహింసలు పెట్టారండి బాబూ!పైగా ఈ మాథ్స్ లో కాలుక్లస్,జామెట్రీ,ట్రిగనామెట్రీ, ఇవన్నీ సరిపోనట్లు ఎస్ట్రానమీ ఒకటీ.అన్నిటికీ విడివిడిగా క్లాసులూ! అసలు ఈ హింసలన్నీ దాటుకుని బతికి బట్ట కడతానా అనిపించేది!

ఏదో తిప్పలు పడి ఎలాగోలాగ ఆ బి.ఎస్.సీ పూర్తిచేసేననిపించుకున్న తరువాత, ఆ వెలగబెట్టిన చదువుకి సంబంధించిన ఉద్యోగం చేశామా అంటే అదీ లేదూ.ఏం చదివానో, ఎందుకు చదివానో అంతా అగమ్యగోచరం! ఇప్పటి వాళ్ళని చూస్తే అసూయ వేస్తుంది ఆ ఎక్కాలూ అవీ నేర్చుకోనఖ్ఖర్లేదు. ఓ కాలిక్యులేటరు తీసికుని ఠక్కు మని నొక్కేస్తే చాలు.పైగా అదికూడా అఖ్ఖర్లేదు.సెల్ ఫోన్లలోనే పెట్టేశారు.

ఆ రోజుల్లో తెలుగులో ఛందస్సూ,అలంకారాలూ, ఇంగ్లీషులో గ్రామరూ మనల్ని ‘ నిను వీడని నీడనులే ‘ అంటూ ఉండేవి. ఇంగ్లీషు గ్రామరుకైతే జే.వీ.రమణయ్య గారి గ్రామరు పుస్తకమో,కొంచం ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళైతే రెన్ ఎండ్ మార్టిన్ గ్రామరూ ఉంచుకునేవారు.కాంపోజిషనూ, లెటర్ రైటింగూ అయితే ఆ రోజుల్లో నేర్చుకున్నదే ఇప్పటికీ గుర్తు.లీవు లెటర్ వ్రాయడం, ఏదొ కంపెనీకి వ్రాయడం అప్పుడు నేర్చుకున్నదే.నాలుగక్షరాలు వంటబట్టాయీ అంటే,ఆ రోజుల్లో మనకి చదువు చెప్పిన గురువులదే ఆ చలవంతా.ఆ రోజుల్లో ఇంగ్లీషులో ‘ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనేదొకటి నేర్చుకున్నాము. ఈ మధ్యన ఏదో మాటల సందర్భంలో స్కూల్లో చదువుకునే ఒక అబ్బాయినడిగాను- మీకు ‘ఫిగర్ ఆఫ్ స్పీచ్’ నేర్పుతారా అని.అంటే అతనన్నాడూ, ‘అంకుల్ మాకు క్లాసులో ఉండే ఆడపిల్లల ఫిగర్ తప్ప ఇంకేదీ తెలియదూ’ అని.నవ్వాలో ఏడవాలో తెలియలేదు.

ఒకలా చూస్తే, మాకు కాలేజీల్లో నేర్పేవి ఇప్పుడు అయిదో, ఆరో క్లాసునుండే నేర్పుతున్నారు. మా మనవరాలి పుస్తకాలు ఒక్కొక్కప్పుడు చూస్తే తల తిరిగిపోతూంటుంది!ఆరోజుల్లోది తక్కువ స్టాండర్డా అనిపిస్తూంటుంది. పోన్లెండి ఈ గొడవలన్నీ పడఖ్ఖర్లేకుండా ఏదో గట్టెక్కేశాను !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొత్త ముఖ్యమంత్రి

    కొత్తగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమింపబడిన శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారిలో అన్నీ మంచి క్వాలిఫికేషన్సే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏణ్ణర్ధం పాటు మన అసెంబ్లీ లో అన్ని పార్టీలవారినీ సంభాళించుకుంటూ ఎక్కడా సంయమనం కోల్పోకుండా నెగ్గుకు రావడం అన్నిటికంటే గొప్పది. వయస్సు చూస్తేనా యాభై ఏళ్ళు.రాజకీయాల్లో మంచి అనుభవం ఉంది.మన రాష్ట్రంలో గత 14 నెలలుగా ఉన్న అనిశ్చిత ఇప్పటికేనా తొలగిపోయి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ముందుకి వెళ్తుందని ఆశిద్దాం.

ఏమిటో ఆయన ఫొటో ఎప్పుడు చూసినా సినీ నటుడు ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు. పోలికలో మాత్రమే !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అలా అయితే ఎంతబావుంటుందో….

    ఒక్కొక్కప్పుడు ఏమీ పనిలేనప్పుడు కూర్చుంటే, ఏమిటేమిటో చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చేస్తూంటాయి. మనకి తెలుసును గడిచిపోయిన సమయం మళ్ళీ రాదని అయినా వాటిని జ్ఞాపకం చేసికుంటే ఎంత సంతోషం వేస్తుందో? ఇలాటివి ఇంట్లోవాళ్ళకి చెప్తే ‘ఈయనకి మతి స్థిరం తప్పిందీ, ఏ డాక్టరుకైనా చూపించాలేమో ‘అన్నా అనుకోవచ్చు! అయినా సరే,నేను కొన్ని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నాను. అవేమీ పేద్దపేద్ద ఇడీల్ విషయాలేమీ కాదు. మామూలు విషయాలే. ఇప్పటి కాలమానపరిస్థితుల్ని చూస్తే అవన్నీ సిల్లీగా కనిపించొచ్చు. కానీ అవి జరిగినప్పుడు, మన బుల్లిబుర్ర ఎంత సంతోషించిందో, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.కాదూ, మీకు నచ్చలేదంటారూ వదిలేయండి, ‘ ఏదో పాడుకల వచ్చుంటుందీ,ఏమిటేమిటో వ్రాస్తున్నారూ’ అని!

నాకు గుర్తొచ్చినవి ఇవీ.జీవితంలో ఛాన్సంటూ వస్తే మళ్ళీ అలా చేయాలని….

చిన్నప్పటి జ్ఞాపకాలు–

1) తేగలు కాల్చుకుని తినడం, గుర్తుంచుకుని అందులో ‘చందమామ’ ని తినడం.
2) జనుము (ఆవులకీ, గేదెలకీ గడ్డితో పెట్టేది) పుల్లకి నిప్పంటించి గుప్పుమని పొగ పీల్చడం.
3) రోడ్డుమీద ఏ సీనారేకు డబ్బా అయినా కనిపిస్తే దాన్ని తన్నడం ( ఈ విషయం మీద అప్పుడెప్పుడో క్యాడ్బరీస్ యాడ్ కూడావచ్చింది)
4) గోడలమీద పెన్సిళ్ళతో వ్రాయడం, చివాట్లు తినడం.
5) ఫ్రెండ్స్ తో ఏదైనా ‘కాకి ఎంగిలి’ చేసి పంచుకోవడం.
6) దీపావళి రోజున ‘ తిప్పుడు పొట్లం’ తిప్పుకోవడం.
7) శలవల్లో పొద్దున్నే లేవఖ్ఖర్లేకుండా దుప్పటీ ముసుగెట్టుకుని నిద్రపోవడం.
8) మొదటి రోజు మొదటాటకి టిక్కెట్లకోసం నుంచోవడం, టిక్కెట్టు దొరికితే ఏదో సాధించేసేసేమన్నట్లు ఊరికే ‘ఫీలైపోవడం’.
9) ఇంట్లో ‘తద్దినాలు’ ప్రతీరోజూ వస్తే బాగుండుననుకోవడం. ఎందుకంటే ఆరోజే గారెలూ, అప్పాలూ చేస్తారుగా!
10) ఆ రోజుల్లోలాగ మన నెత్తిమీద వెంట్రుకలు గాలికి ఎగురుతూండాలనుకోవడం !
11) కోపం వస్తే పళ్ళు కొరుక్కోవాలనుకోవడం.
12) కిరాణా కొట్టుకెళ్ళి కొట్టువాడిని బెల్లం ముక్క పెట్టమనడం !
13) తీర్థాల్లో జీళ్ళు కొనుక్కోవడం, రంగులరాట్నంలో ఎక్కడం.
14) శ్రీరామనవమికి పానకం త్రాగడం.

    మా ఇంటావిడని ఈ విషయం అడిగితే,’ శుభ్రంగా తిని కూర్చోక, ఇప్పుడు అవన్నీ అడిగితే ఎలాగండి బాబూ’ అంది.మా అమ్మాయిని అడిగితే, ‘ డాడీ, ఇప్పటికే ఆదిత్య( అంటే మా మనవడు), నిన్నూ, విశాల్ వాళ్ళ డాడీ నీ, ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం చూస్తూంటే, ‘ మమ్మీ నేను కూడా రిటైరయిపోతే బావుంటుందనుకుంటున్నానూ అంటున్నాడు'” అని చెప్పింది! ఇంతాచేసి వాడు చదివేది ఫస్ట్ స్టాండర్డ్!

ఈయన IQ level ఇంతే, ఇంతకంటే ఏం గుర్తుకొస్తాయిలే అనుకున్నా ఫరవాలేదు. ఇప్పుడు ఈ వయస్సులో దేశాన్నేమీ ఉధ్ధరించేద్దామనుకోవడం లేదు!

అలాగని వదిలేస్తాననుకోకండి. మీకు గుర్తుకొచ్చి, మళ్ళీ అలా చేస్తే బావుండునూ,అనుకునే విషయాలు అందరితోనూ పంచుకోండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Some interesting news….

Vir Sanghvi “Tell me what should I tell them_” _ OPEN Magazine

పైన ఇచ్చిన రెండింటిమీదా ఒకసారి నొక్కి చూడండి. Most popular journalists వీర్ శాంఘ్వీ, బర్ఖా దత్ లు ఎంత influential వ్యక్తులో తెలుస్తుంది !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టైంపాస్

IE SG

    ప్రస్తుతం దేశంలో జరుగుతున్న విషయాలగురించి, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ లో ఎడిటర్ శ్రీ శేఖర్ గుప్త వ్రాసిన వ్యాసం పైన ఇచ్చాను. ఒకసారి చదివి, మనం ఎటువంటి దౌర్భాగ్యుల చేత పాలింపబడుతున్నామో తెలుస్తుంది.ఒక్కడంటే ఒక్కడు నీతీ నిజాయితీ ఉన్న రాజకీయనాయకుడు కనిపించడం లెదు. ఏదో మొహమ్మాటానికి, పైన ఇచ్చిన వ్యాసంలో, మన్మోహన్, చిదంబరం,ప్రణబ్, ఆంటొనీ లగురించి వ్రాశారు కానీ, వారి వారి పార్టీల్లో దారుణాలు చేసేవారిని, ఆపకుండా,దేశాన్ని కొల్లగొట్టించేసట్లు చూస్తూ ఉండడం , చేయడం కంటే పెద్ద నేరం ! ఏమైనా అంటే Coalition compulsions/ obligations అంటారు. ఇదేమి గోలండి బాబూ? ఈ దరిద్రులు పోతే ఇంకో దౌర్భాగ్యులు వస్తారు.అసలు ఈ రాజకీయనాయకులకి సిగ్గూ శరమూ ఉందాంట?

    ముంబైలోని ‘ఆదర్శ్ హౌసింగు స్కాం’ లో, అడ్డదోవలోంచి ఫ్లాట్లు కొట్టేసిన Defence అధికారులందరూ,వాళ్ళజీతాలు 50,000 లోపు చూపించారుట.మాజీ ముఖ్యమంత్రైతే అసలు అడగఖర్లేదు. 2G రాజా ఏమైనా అంటే, తను దళితుడిని కాబట్టి, అందరూ తనమీద కత్తికడుతున్నారూ అంటాడు. ఇతనికి సపోర్టు ఇంకో దౌర్భాగ్యుడు కరుణానిధి. ఏం చూసుకునో, అంతా కలిపి పధ్ధెనిమిది మందిలేరూ ( అందులోనూ సగం భాగం కాబినెట్ లో దూరేశారు),కర్ర పెత్తనం చేసేస్తున్నాడు.ఈమధ్యన తన కొడుకు కొడుకుదో, కూతురిదో పెళ్ళి చేశాడు. మన పార్లమెంటు సభ్యుల్ని చూసి నేర్చుకోమనండి. దేర్భ్యాల్లా 33 మందున్నారు. వచ్చిన మంత్రివర్గంలో స్థానాలేమిటీ,అదేదో Dy.Minister లూ,MOS లూనూ.అక్కడికే ఏదో ఘనకార్యం చేసేమనుకుంటూంటారు.

   కామన్వెల్తు గేమ్స్ స్కాం అదసలు ఎంతమంది ఎన్నెన్ని కోట్లు తినేశారో ఇంకా లెఖ్ఖే తేలలేదు, 2G ఏ బెటరూ, ఏదో ఓ లెఖ్ఖ చూపిస్తున్నారు.పదిరోజులయింది, పార్లమెంటు ప్రారంభం అయి, ప్రొద్దుటే సమావేశం అవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, మర్నాటికి పోస్ట్పోను చేయడం.మనమందరం నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూండడం!ఇంకా ఎన్నిరోజులు ఈ తమాషా చూడాలో? అందరూ అడిగిన జె.పి.సి. వేస్తే అసలు గొడవ వదిలిపోతుందికదా? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో?
మనం ఇన్నాళ్ళూ నీతిమంతులని అనుకుంటున్న ఏ ఘనాపాఠీల పేర్లు బయటకొస్తాయో? వస్తే మాత్రం ఏం పోయిందిటా? వాళ్ళకేమైనా శిక్షలు పడతాయా ఏమైనానా? ఎన్నెన్ని చూడలేదూ? ఓ నెలో రెణ్ణెల్లో మాట్లాడతారు, ఆ తరువాత అంతా మామూలే!

    ఇంక యడ్డిబాబా ని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.కావలిసిస్తే, మా పిల్లలకి రాసిచ్చేసిన భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాము( ప్రభుత్వానికి), అంతేకానీ, నన్ను ముఖ్యమంత్రి పదవినుండి తీసేయకూడదమ్మా అంటున్నాడు. అంటే’పట్టుకుంటే దొంగా, లేకపోతే దొరా’ అన్నమాట!వాడి కొడుకులైతే పేద్ద జోకర్లనుకుంటారు- వాళ్ళెవరో మైనింగు కంపెనీ వాళ్ళు వీళ్ళ ఎకౌంట్లలోకి 20 కోట్లరూపాయలు వేశారుట, అసలు వాళ్ళది మైనింగు కంపెనీయే అని వీళ్ళకి తెలియనేతెలియదుట సత్తె ప్రమాణికంగా! అబ్బ ఏం సత్యవంతులండి బాబూ!ఈవేళ్టి పేపర్లో ఇంకో సంగతి చదివాము- యడ్డి ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుండే ప్రారంభించాడుట ఈ వ్యవహారాలన్నీ. ఈయనగారి గర్ల్ ఫ్రెండు శొభా ద్వారా ‘ఆదర్శ్’ అనే కంపెనీ నుండి యడ్డి కొడుకులకీ కూతుళ్ళకీ డబ్బులొచ్చేవిట! చూశారా ఈ ‘ ఆదర్శ్’ అనే పేరు ఎంతమందికొంపలు తీస్తోందో? ఇక్కడ ముంబైలో ఓ ముఖ్యమంత్రిని పాపం ‘బలి’ తీసికుంది, ఇప్పుడేమో ‘అమాయకులైన’ యడ్డీ కుటుంబాన్ని వీధిన పెట్టేసింది.ఇవన్నీ బయటపెట్టిందెవరనుకున్నారు? ఇంకో’ నీతిమంతుడు’ కుమారస్వామి.

   ఏదో మనరాష్ట్రంలోనే నాయుడుగారూ, కాంగ్రెసోళ్ళూ డబ్బులు తినేస్తున్నారనుకుని ఏమీ ఏడవనఖ్ఖర్లేదు.బయటి వాళ్ళు వేల కోట్లైతే మనవాళ్ళు లక్షలకోట్లు అంతే!ఛాన్సొస్తే తిందామని సైడు స్క్రీన్ దగ్గర ఓపిగ్గా వేచి, డిశంబరులో ఫీల్డులోకి వద్దామనుకునేవారు ఇంకోళ్ళు! చెప్పొచ్చేదేమిటంటే, కాగడా పెట్టి వెదికినా యుగాంతం లోపులో మనకి ( రాష్ట్రానికీ, దేశం మొత్తానికీ) బాగుపడే ఆశలు లేవు. ఓ దరిద్రుడు పోతే ఇంకో భ్రష్టుడొస్తాడు.మనం మాత్రం Yours faithfully అంటూ ఓట్లేసి నెగ్గిస్తూంటాము.

   ఇంత డిప్రెషన్ లోనూ ఓ మంచిన్యూసు ఏమిటంటే, సుప్రీంకోర్టు వారు, CVC గా నియమింపబడిన థామస్ ( 2G స్కాంలో పావులు కదిపిన ఓ ఘనుడు</b.) నియామకం విషయంలో వివరాలిమ్మందిట! అడిగేరని ఇచ్చేస్తామేమిటీ మరీనూ, అని మన ప్రభుత్వం వారు అన్నా అనొచ్చు! మామూలేగా !!

సర్వేజనాసుఖినోభవంతూ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Part time job…..

   ఇదివరకటి రోజుల్లో ఓ చాకలి ఇంటికి వచ్చి ఉతికి, ఇస్త్రీ చేయడానికి బట్టలు తీసికెళ్ళేవాడు. మనం అంటే నాలాటివాళ్ళం, బట్టలు మాయగానైనా, ఇంటావిడ అదేమిటండీ నాలుగు రోజుల్నుండి అవే బట్టలేసుకుంటున్నారూ. అని చివాట్లు పెట్టినప్పుడో, బట్టలు విడిచేవాడిని.పెళ్ళైన కొత్తలో మాకు పూనాలో కూడా ఓ తెలుగు చాకలి దొరికాడు. పోన్లే పాపం మా ఇంటావిడకు భాషా సౌకర్యం ఉంటుందీ అని అతనికే ఇచ్చేవాళ్ళం. వచ్చినప్పుడల్లా ఏవేవో కబుర్లు చెప్పేవాడు, కొంతకాలం బాగానే కాలక్షేపం అయింది. ఒక్కోప్పుడు పద్దు వ్రాసేది, ఒక్కొక్కప్పుడు మేము ఏదో బయటకివెళ్ళే హడావిడిలో ఉన్నప్పుడు వస్తే, వ్రాయకుండానే ఇచ్చేసేది.ఒకసారి తను అతి అప్యాయంగా చూసుకునే చీర ఒకటి, కాల్చేసి తీసికుని రావడంతో మాన్పించేశాము.

ఆ తరువాత పిల్లల బట్టలూ, స్కూలు యూనిఫారాలు, మా బట్టలూ మరీ ఎక్కువైపోతూండడంతో, బయట ఉతికి+ఇస్త్రీ కి ఇచ్చే ఓపిక లేకపోవడంతో, మా ఇంటావిడ ఇంట్లోనే బట్టలుతకడం ప్రారంభించింది. మరి ఇస్త్రీ? మరీ చెంబులో నిప్పులు వేసి చెంబిస్త్రీ చేస్తే బాగుండదేమో అని, తను పెళ్ళైనప్పుడు తనతో తెచ్చుకున్న ‘ఉషా’ వారి ఇస్త్రీపెట్టెతో చేసేది. ఆరోజుల్లో ఇస్త్రీపెట్టెలకి టెంపరేచర్ కంట్రోల్ చేసే రియోస్టాట్లూ గట్రా ఉండేవి కావు. స్విచ్చి నొక్కిన అయిదు నిమిషాల్లో ఓ వేడెక్కిపోయేది. ఈవిడ అంత శ్రమ పడ్డం చూడలెక, నేనే అన్ని బట్టలూ ఇస్త్రీ చేయడానికి ఒప్పుకున్నాను. ఇందులో నా స్వార్ధం కూడా ఉందనుకోండి- ఇలాటిదేదో పెట్టేసికుంటే, పిల్లలకి చదువులు చెప్పడం తప్పించుకోవచ్చనీ! నేను చదివింది అదేదో బి.ఎస్సీ అయినా, చదువుకీ, నాకూ ఆమడ దూరం అని చాలా టపాల్లో విన్నవించుకున్నాను.ఏదో పిల్లలకి నా గాలి సోక్కపోవడం వలనే, అంతంత బాగా చదువుకుని జీవితంలో ఓ మంచి స్థానానికి వచ్చారని ఎప్పుడూ నమ్ముతాను.నేను బట్టలు ఇస్త్రీ చేయాలంటే, నేల మీద ఓ చాపా, దానిమీద ఇంట్లో ఉన్న అన్ని దుప్పట్లూ, బొంతలూ వేసేసికుని, ఓ చెంబులో నీళ్ళెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. చాపా, నీళ్ళూ అన్నానని ఊరికే ఏదేదో ఊహించేసుకోకండి రాత్రిళ్ళు పిల్లల చదువులు పూర్తయే వరకూ, బట్టల్ని రుద్దుతూనే ఉండేవాడిని. ఎక్కడ ఆపుచేస్తే, వాళ్ళొచ్చి డాడీ, దీనికి ఆన్సరేమిటీ? అంటారేమో అని! ఈ కార్యక్రమంలో ఒకసారి, మా ఇంటావిడ చీర ఒకటి- నైలెక్సో( ఆరోజుల్లో ఆ మెటీరియల్ ని నైలెక్స్ అనే అనేవారు, అదే కాలక్రమంలో మనుష్యులు తెలివి మీరాక దాన్నే సింథటెక్ అంటున్నారు) ఇంకోటేదో చీర మీద ఆ ఉషా& ఇస్త్రీ పెట్టి పెట్టేటప్పటికి, ఆ చీర కాస్తా కాలిపోయింది.ఓ పెద్ద చిల్లడిపోయింది. ఆ చీర ముక్క ఏమయిందా అని చూస్తే, అదికాస్తా ఆ ఇస్త్రీ పెట్టికి చిపక్కయిపోయింది. దాంతో ఆ ఇస్త్రీ పెట్టి రిటైరయిపోయి, అదేదో ఆటోమెటిక్ ది కొన్నాము.

రోజులన్నీ ఒకలాగే ఉంటాయా ఏమిటీ, మరీ చాదస్థం కాకపోతే! మా ఇంట్లోనూ, వాషింగు మెషీన్లొచ్చాయి, పిల్లలు పెద్దాళ్ళయ్యారు, చదువులూ, పెళ్ళిళ్ళూ అయ్యాయి, వాళ్ళకీ పిల్లలొచ్చారు. మరీ ఇంటికి పెద్దాణ్ణయిపోయానూ, బట్టలు ఇస్త్రీ చేస్తే చూసేవాళ్ళకీ బావుండదూ, ఇంట్లో కోడలు కూడా వచ్చిందీ, అందుకోసం బట్టలన్నీ ఆ వాషింగు మెషీనులో పడేసి, ఆ తరువాత బయట ఇస్త్రీకి ఇవ్వడం ప్రారంభించాము.బట్టకీ మూడో నాలుగో రూపాయలు, చీరలకైతే ఇరవయ్యీ తీసికుంటాడు.చాలా బ్రాడ్మైండుతో ( విశాల హృదయమో ఏదో అంటారుట),మా ఇంటావిడని నా ఒకానొక వీక్ మూమెంటులో, ప్రతీ రోజూ ఈవెనింగు వాక్కుకి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ చేసిన చీరలే కడుతూ ఉండమన్నందుకు, ఆవిడ కూడా వారానికో, పదిహెను రోజులకో ఓ అయిదారు చీరలిస్తూంటుంది ఇస్త్రీకి.

వాటన్నిటినీ ఓ మూట కట్టి లాండ్రీ ( అదేనండీ డ్రై క్లీనర్సంటూంటారు) వాడికి ఇస్తూంటాను.వాణ్ణి మరీ అర్జెంటు అంటే ఎక్కువ తీసికుంటాడేమో అని,వాడెప్పుడిస్తే అప్పుడే ఇమ్మంటూంటాను. ఇదిగో ఇక్కడే వస్తుంది అసలు గొడవంతానూ.
నా చీరలు ఇస్త్రీకి ఇచ్చి చాలా రోజులయిందనుకుంటాను అని జనాంతికంగా, అనేస్తుంది. అంటే వెళ్ళి తీసికుని రా అని అర్ధం. జీ హుజూర్ అనుకుని వెళ్తాను.అక్కడికెళ్ళగానే ఆ లాండ్రీ వాడు, చీరలు రోలరు ప్రెస్సో, సింగినాదమో ఏదో అయ్యాయీ, మీ చీరల ( అదేనండీ నేనిచ్చిన చీరలు) రంగేమిటీ అంటాడు.అక్కడకొచ్చేసరికి నాకు టెన్షను ప్రారంభం అవుతుంది. నిన్న తిన్నదే గుర్తుండి చావదు, వారం రోజుల క్రితం ఇచ్చిన చీరల రంగెవడికి గుర్తూ? పోనీ ఇంటికి వెళ్ళి ఆవిడని అడుగుదామా అంటే కలనేత చీరోటీ, తొపు రంగోటీ,చిలకాకుపచ్చోటీ అంటూ ఏవేవో చెప్తుంది. ఆ రంగులు దేనికీ డిక్షనరీలో అనువాదం ఉండదు, పోనీ లాండ్రీ వాడికి చెప్దామా అంటే!

ఆ లాండ్రీ కొట్లు మనవైపున్నట్లు పెద్దగా ఉంటాయా ఏమిటీ, ఓ రూమ్మూ దానిమీద ఓ అటిక్ ( అదేనండీ మనం అటక అంటామే దాన్నే వీళ్ళు స్టైలుగా అలా పిలుస్తారు). కొన్ని బట్టలక్కడా, కొన్ని బట్టలు కిందా ఉంచుతూంటారు. వాడు చెక్క మెట్లెక్కేసి పైకెళ్ళిపోయాడు, నన్ను కింద చూసుకోమని ( అదే నేనిచ్చిన చీరలు). ఇంతలో బట్టలిస్త్రీకివ్వడానికి కాబోలు వచ్చింది చేతిలో రెండు క్యారీ బాగ్గులతో. అప్పటికి నేను సీరియస్సుగా మా ఇంటావిడ చీరలకోసం వెదికేస్తున్నాను. ఆ వచ్చినావిడ నా అవతారం చూసి అక్కడ పనిచేసేవాడిననుకుందో ఏమిటో ४ साडी,४ कुर्ती,४पैजमा,४ शर्ट् అంటూ, इस्त्री केलियॅ అని చెప్తూ, పైగా अर्जेंट् అని కూడా చెప్పేసింది.ఇంకేమీ వినిపించుకోదే! చివరకి ఇంత బ్రతుకూ బ్రతికి లాండ్రీలో పార్ట్ టైం జాబ్ చేయాల్సొచ్చింది.అదేదో తప్పనడం లేదు. నాకూ డిగ్నిటీ ఆఫ్ లేబరూ వగైరాలమీద గౌరవం ఉంది.చివరకి ఫుకట్ గా చెయ్యవలసొచ్చిందే అనే బాధ!

పోనీ ఇన్ని తిప్పలూ పడ్డా చివరకు వ్రతఫలం దొరికిందా అంటే అదీ లేదు. చివరకు ఉద్యాపన కి మా ఇంటావిణ్ణే తీసికొచ్చి తన చీరలు ఐడెంటిఫై చేసికోమన్నాను !!