బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వడ్డించేవాళ్ళుంటేనే….

మన చిన్నప్పుడు గుర్తుందా, స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ఎవైనా  Annual Day Function  జరిగినప్పుడు, ఏ పెద్దమనిషినో  ముఖ్యఅతిథిగా పిలవడం ఆనవాయితీ.. ప్రైజులు కూడా ఆయనెచేతిమీదుగానే ఇవ్వబడేవి…  అదేం చిత్రమో, ఆటల్లోనూ,  academics  లోనూ ఏ ఇద్దరికో ముగ్గురికో అన్ని ప్రైజులూ వచ్చేసేవి… ఆరోజుల్లో సినిమాల్లో చూపించేవారు– సాధారణంగా సినిమా హీరోకే ఇలాటి సౌలభ్యాలుండేవి..  ముఖ్యఅతిథి , ఆ హీరో భుజం తడుతూ.. ” జీవితంలో నువ్వు బాగా పైకి వస్తావు, ఏ సహాయం కావాల్సినా నేనున్నానని మరిచిపోకు..  blah..blah..”  అంటూ ఏవేవో చెప్పేవారు.. ఓ నాలుగు రీళ్ళ తరవాత , ఈ హీరో ఆ ముఖ్యఅతిథి ఇంటికి వెళ్ళినా గూర్ఖా ఇంట్లోకి వెళ్ళనిచ్చేవాడు కాదు. .. నేపథ్యంలో ఓ పాటుండేది  symbolic  గా…

అవన్నీ పాతరోజులు.. రోజులు మారినా,   talent  గుర్తింపబడకపోవడం మాత్రం ఏమీ మారలేదు. బయటి దేశాల్లో చైనా,  East European Countries  లోనూ అయితే, ఆటల్లో ఎవరైనా ప్రతిభ   చూపిస్తే, ప్రభుత్వమే ఆ పిల్ల్లల ఆలనా పాలనా చూసుకుని, ఆ బిడ్డ తల్లితండ్రులకీ, దేశానికీ కూడా గౌరవం కలిగేటట్టు చూస్తారు. బహుశా అందుకేనేమో, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో, బయటి దేశాలవారికే అన్నన్ని పతకాలు వస్తాయి. ఇలాటి పోటీలు జరిగినప్పుడల్లా  మన నాయకులూ, పాలకులూ ఓసారి గుండెలు బాదేసుకుంటారు. మనదేశంలో క్రీడలకి ప్రోత్సాహంలేదూ, 100 కోట్ల జనాభా అయితే ఉంది కానీ, ఒక్కడూ అంతర్జాతీయ స్థాయిలో లేడూ.. అంటూ.. అసలంటూ, ప్రభుత్వాలు మన  యువక్రీడాకారుల ప్రతిభ గుర్తించి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు కదా..  especially  మన తెలుగురాష్ట్రాల్లో, ఏ తెలుగువాడైనా, ఆఖరికి తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న పరాయి రాష్ట్రాలవారైనా సరే, ఒక్కసారి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించడం చాలు, ఎగేసుకుంటూ పోతారు.. ” ఫలానా వాడు మనోడే.. ” అంటూ.. మన మాజీ ముఖ్యమంత్రిగారైతే, ఏ తెలుగువాడు పైకొచ్చినా ఆ ఘనంతంతా తనదే అనేవాడు– సత్య నాదెళ్ళ నుండి, సింధు వరకూ..  కానీ  ఆ తేజాలు శ్రమపడుతున్నప్పుడు ఏమైనా ప్రోత్సాహం ఇచ్చేరా అంటే అదీ లేదూ.. ఒక ముఖ్యమంత్రిగారు ఏకంగా ఓ క్రీడాకారిణిని  Brand Ambassador  ఛేశేసారు. ఎప్పుడూ, ఆమె ఖ్యాతి సంపాదించిన తరువాత..

 ఈ కంఠశోషంతా ఎందుకూ అంటే, మన తెలుగురాష్ట్రాల్లోనే, ఒక  యువతేజం   SNEHIT ,  అంతర్జాతీయ క్రీడలో  World No 24   స్థానం సంపాదించాడు– ఏ నాయుడుగారూ చెప్పడం వలన కాదు.. తన తల్లితండ్రుల ప్రొత్సాహం, తన కఠోర శ్రమ వలనానూ…. తను చేసిన పాపం ఏమిటంటే, జనాలందరూ ఎగబడి చూస్తారే .. అలాటి  Cricket  కాకపోవడం.. లేకపోతే ఈపాటికి ఏ  Sports Company వాడో, sponsor  చేసేవాడు.వెర్రి పిల్లాడు.. తను ఈ స్థాయికి వచ్చింది  Table Tennis  లో..  దిక్కుమాలిన కోడిపందాలకే కోటానుకోట్లు  చేతులు మారడం చూసాము.. లక్షలకోట్లు  IPL  అనే  క్రికెట్ తమాషా లో చూసాము,  Match fixing  లు అవుతున్నాసరే…. కానీ  delicate touch  తో ఆడే, ఈ  Table Tennis  గురించిమాత్రం ఎవడూ పట్టించుకోడు..మన రాష్ట్రాల్లో కుల , మత ప్రాతిపదికలమీదే ప్రభుత్వ ప్రోత్సాహాలు లభిస్తాయన్నది కఠోర సత్యం…  అదీ కాకపోతే  Prominent position  లో మనకు తెలిసినవాడైనా ఉండాలి… ఇవేమీ లేకపోతే, తల్లితండ్రులే ఆస్థులు అమ్ముకుని తమ పిల్లల భవిష్యత్తుకి బాటవేసుకోవాల్సిన దుస్థితి….

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు — నయనం ప్రధానం

సాధారణంగా, ఏదో రోజుమర్రా జిందగీలో, పగటిపూటా, రాత్రిళ్ళు లైటులోనూ ,  చూసి , వస్తువులనీ, మనుషులనీ గుర్తుపట్టగలిగితే, కంటి చూపు పరవాలేదనుకోచ్చు. ఓ వయసు దాటిన తరువాత, కొంచంకొంచం చూపు మందగిస్తూంటుంది.  అదేమీ ప్రాణాంతకం కాదు.. ఓ కళ్ళజోడు పెట్టుకుంటే పనైపోతుంది.. ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిముందర , కళ్ళజోడుంటే, పెళ్ళవదని భయపడేవారు.. ఇప్పుడైతే అందరికీ కళ్ళజోడు ఓ ఫాషనైపోయింది… 

నాగురించి చెప్పుకోవాలంటే, అదేం కర్మమో, ఎప్పుడూ  సరీగ్గా కనిపించేదేకాదు.కాలేజీలో బోర్డుమీద రాసింది ఛస్తే కనిపించేది కాదూ, పోనీ మొదటి బెంచీలో కూర్చుందామా, ఏదో కళ్ళు చిట్లించుకునైనా చూడొచ్చూ అనుకుంటే, మాస్టారు ఏవైనా ప్రశ్నలు వేస్తే… వామ్మోయ్, జవాబు చెప్పేటంత  I Q  ఉండేది కాదూ.. మొత్తానికి ఎలా పాసయానో ఆ భగవంతుడికే తెలుసు, ఉద్యోగంలో చేరిపోయాను. పూనా వచ్చిన తరువాత, ఉద్యోగంలో ప్రతీ ఏడాదీ ,  medical examination  అని ఒకటుండేది, ఏదో నాడి పట్టుకుని, గుండె ఆడుతోందో లేదో చూసి,   ఆ ఏడాదికి  fit  చేసేసేవారు.. సినిమాలకి వెళ్తే టైటిల్స్ కనిపించేవి కావూ..బస్సునెంబర్లైతే సరేసరి. అంతదాకా ఎందుకూ, పెళ్ళి సంబంధాల సందర్భంలో, దారిలో తణుకులో దిగాం, మా దొడ్డమ్మగారింట్లో, మేము అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే , ఓ ఇద్దరు ఆడవారొచ్చారు… ఏమో మా దొడ్డమ్మగారి చుట్టాలేమో అనుకున్నాను.  అంత పరీక్షగా చూద్దామనుకున్నా, అసలే  ఆరోజుల్లో ఇళ్ళల్లో , పూర్తిచికటి పడితేనేకానీ, లైట్లు వేసేవారు కాదాయే..  ఏదో నకూర్చున్న నావైపు ఓ  cursory glance   వెసేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు..అమలాపురం వెళ్లినతరువాత, మా అమ్మమ్మగారు, తణుకులో చూసిన పిల్ల ఎలా ఉందిరా అని, అడిగితే ” ఏమో ఇద్దరిని చుసానూ.. బాగానే ఉన్నారూ..” అన్నాను. ఆవిడ, ” వెధవా, వచ్చింది తల్లీకూతుళ్ళు ..” అన్నారు.  ఎదో మర్నాడు, నేను చూసుకోబోయే బుల్లెమ్మ వచ్చింది, నాలుగైదడుగుల దూరంలో చూసానూ, కథ సుఖాంతం. మాకు అమ్మాయి పుట్టిన తరువాత, ఓసారి ఫాక్టరీ  Medical Examination  లో కళ్ళుకూడా టెస్ట్ చేయాలని, ఓ విపరీతబుధ్ధిపుట్టింది డాక్టరుగారికి..  నేనెమో ఆ  TEST BOARDS  మీదున్న ఇంగ్లీషు అక్షరాలు బట్టీపట్టేసి రెడీఅయిపోయాను.. ఆయనచేతులో పట్టుబడిపోయి, , ఉద్యోగం ఊడబోయి, మొత్తానికి కళ్ళకి అద్దాలొచ్చేసాయి.

మా ఇంటావిడకి ఈమధ్యన, అవేవో రోజూ పజిల్స్ తయారుచేస్తోందికదూ, కంటికి జోడున్నా, మసకమసగ్గా ఉంటున్నాయిట, అసలు విషయం అదికాదు,  ఇంట్లో ఎక్కడైనా బూజు పడితే, రాత్రిళ్ళే కనిపించేవి, sudden  గా అవికూడా అలాగే కనిపిస్తున్నాయిట. ఎక్కడైనా బూజుంటే ఈవిడకేమో నెద్ర పట్టదాయే… సరే ఈవిడకి  Software update  చేయిద్దామని, మా  CGHS  ద్వారా, అదేదో  Corporate Hospital కి వెళ్ళి టెస్టు చేయించుకుంటే, అదేదో  Cataract  అన్నారు, పైగా రెండుకళ్ళకీ.. సరేఅని  Surgery  కి ముహూర్తం పెట్టుకుని, ఇక్కడ  National Institute of Opthomology  కి వెళ్ళాము.. నేనూ , మా అమ్మాయీ తోడుగా…. నాకుతెలిసినంతవరకూ, కంటికి ఆపరేషనంటే,  ఏదో కంటికి ఓ పట్టీ, ఆ పట్టీ తిసేటప్పుడు, డాక్టరుగారూ, మెల్లిమెల్లిగా పట్టీతీస్తూ,, ఎవరినో ఎదురుగా నుంచోమని… clear  గా కనిపిస్తోందా అని అడుగుతూ… ఏవేవో అనుకున్నాము. మేము మాట్టాడుకుంటూంటే, తీసికెళ్ళిన పావుగంటలో, కళ్ళకి నల్లద్దాలు పెట్టుకుని, టింగురంగా మని వచ్చేసింది. అలాగే రెండో కంటికి కూడా, ఓ వారంరోజుల్లో  చేయించేసుకుని, రోజుకి మూడుపూటలా, అవేవో  drops  వేయించుకుంటూ, నల్ల కళ్ళద్దాలు అస్సలు తీయకుండా, (కరుణానిధిగారిలా).. , ఈ  రెండునెలలలోనూ, అమ్మాయి, కోడలూ సౌజన్యంతోనూ, మధ్యమధ్యలో  Zomato  ద్వారానూ… అప్పుడప్పుడు తను నిర్దేశించిన పాళ్ళలో నాచేతా,, ఎలాగోలాగ కాలక్షేపం చేసి, ఆ కాటరాక్ట్ యజ్ఞం  పూర్తయింది. ఇంకేముందీ..  ” నిన్న లేని అందాలేవో… ” అన్నట్టుగా ఈవిడకి, దూరంనుంచే, టీవీ,  ఫ్రిజ్ , టేబుల్ మీదా, మరకలే మరకలు కనిపించేస్తున్నాయి.. నేనేమో ఫ్ పాతగుడ్డా,  Colin  పట్టుకుని తుడవడం. 

మళ్ళీ వంటింటి సామ్రాజ్యంలోకి అడుగెట్టేసి, షడ్రసోపేతంగా వంట చేసేస్తోంది. పజిళ్ళూ తయారుచేసేస్తోంది…

 life goes on …

బాతాఖాని – లక్ష్మిఫణి కబుర్లు– Return of the native…

 ఏడాదైపోతోంది, బ్లాగులవైపు చూసి… అలాగని రాయడం మానేసానా అంటే అదీకాదూ… జస్ట్ బధ్ధకం..  ఈ ఏడాదిలోనూ   కొన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.. కేంద్రంలోనూ, తెలంగాణా లోనూ , పాతవారే తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు, ఆంధ్రరాష్ట్రంలో, కొత్త ప్రభుత్వం..

 పాత పార్టీయే తిరిగి ఎన్నికైనప్పుడు ఓ పేద్ద  disadvantage  ఉంటుంది, పాతవాళ్ళని తిట్టడానికి వీలుండదు.. ఆ తిట్టడాలూ, తప్పులు పాతవారిమీదకి తోసేయడాలూ, వీళ్ళు వారి మొదటి అయిదేళ్ళలోనూ చేసేసారు. ఇప్పుడు ఏమైనా లోటుపాట్లుంటే, అదంతా గత అయిదేళ్ళలోనూ, వీళ్ళ నిర్వాకమే కదా.. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటుంది, కారణం, తిరిగి అధికారంలోకి రావడానికి పాతప్రభుత్వం,  ఎడాపెడా, సంక్షేమ కార్యక్రమాల పేరిట, డబ్బు ఉదారంగా ఖర్చుపెట్టేస్తారు… ఖజానా ఖాళీగా ఉండడంతో , ఎన్నికలవాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులుండవాయే.. దానితో ప్రతీదానిమీదా పన్నుల మోత మొదలూ.. మరో చిత్రం ఏమిటంటే, ఈ సంక్షేమపథకాలకి అర్హులు  Only BPL ( Below Poverty Line ).. వీళ్ళకిచ్చేదంతా మధ్యతరగతివారు కట్టే టాక్సుకే..  అందువలన ప్రభుత్వం వడ్డించే టాక్సులవలన ఆ  BPL  వాళ్ళకి వచ్చేనష్టం ఏమీ ఉండదు. ఎంత చెప్పినా మనది  Welfare State  కదా. 

 ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి– ఒకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే , కొన్ని లాభాలుకూడా ఉంటాయి. ఉదాహరణకి, మొదటి దఫా పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులకి ముక్తీ మోక్షం ఉంటాయి.. అలా కాకుండా కొత్తవాడొస్తే, as a matter of principle  పాతవాటిని ఆపేయడమో, మార్పులు చేయడమో చూస్తూంటాము.

 ఎన్నికల ప్రచారాల్లో పాపం ప్రతీ పార్టీ వాళ్ళూ, ఎదురుపార్టీమీద బురదజల్లడంలోనే బిజీ గా ఉంటూంటారు. నోటికొచ్చిందల్లా వాగి వీధినపడిపోతూంటారు.. ఈ ప్రసంగాల మీద పరువునష్టం కేసులూ గట్రా ఉండవు అదేం చిత్రమో… పైగా అవతలివాడేదో వాగేడని కూడా పట్టించుకోరు. అదో కాలక్షెపం..ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి … ఏదో  public consumption  కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు కానీ, పాపం ఎన్నికలయిన తరువాత, ఒకళ్ళ వీపులు మరొకరు గోక్కుంటారు..  అసలు ఓ విషయమైతే ఛస్తే అర్ధం అవదు.. ఓ  particular  నాయకుడు, ఏవేవో అరాచకాలు చేసేడంటారు, మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలుసు.. అయినా సరే అధికారంలో ఉన్న అయిదేళ్ళూ వీళ్ళకి చీమకుట్టినట్టైనా ఉండదు.. ఏదో ప్రజల్ని ఊరుకోపెట్టడానికి ఏవేవో  Special Investigation Teams  వేసామంటారు. ఉత్తుత్తిదే…

ప్రపంచంలో మొత్తానికి  largest Democracy  మనదేనట.ఒకవైపు చూస్తే, కేంద్రం లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కూడా ఒకే పార్టీకి ఊహించని మెజారిటీ లభించింది… ప్రతిపక్షం అన్నది నామ మాత్రమే.. ఇదిమాత్రం అంత ఆరోగ్యకరంకాదు..  ఇలాటిది ఒక నిరంకుశపాలనకి దారితీయొచ్చు. రెండు పక్షాల బలాబలాలూ  మరీ సగంసగం కాకపోయినా, 60-40 అయినా ఉండుంటే బాగుండేది. మరీ 50-50 అయితే వచ్చేప్రాణం పోయేప్రాణంగా ఉంటుంది. అయినా ప్రతిపక్షాలకి( ఏ పార్టీ అయినా సరే ). 2004- 2014 వీళ్ళుచేసారూ, 2014-24 వాళ్ళు చేస్తారూ   అలవాటే కదా.. సెషన్ సజావుగా సాగనిస్తారా ఏమిటీ ? 

   ఇటుపైనుండి , తిరిగి రెగ్యులర్ గా పోస్టులు పెట్టడం ప్రారంభిస్తానని మనవి… కంగారు పడకండి, మరీ బోరుకొట్టేయను…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– అయోమయం అధ్వాన్నం…

గుర్తుందా మనదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే, ఊళ్ళో రెండుమూడేళ్ళకోసారి రోడ్లు వేస్తూంటారు. ఒకానొకప్పుడు మట్టిరోడ్లు, ఆ తరవాత కంకర, ఇప్పుడైతే ఏక్ దం కాంక్రీటులోకి దిగిపోయారు. ఒకప్పుడు వర్షాలువచ్చినప్పుడు ఆ నీళ్ళు  ఇంకడం, దానిద్వారా భూజలసంపద  పెరగడం, దానివలన ఎక్కడైనా ఓ చెరువో, నుయ్యో తవ్వినప్పుడు, నీళ్ళు పడడం  లాటివన్నీ కథల్లో చదువుకోడమే.. ఈరోజుల్లో మట్టి అనేదే కనిపించదు.. అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకులెండి– కాంక్రీటు రోడ్లకి అలవాటు పడిపోయారు జనాలు.. దానికి సాయం పంచాయితీ బోర్డులూ, మునిసిపాలిటీలూ, కార్పొరేషన్లూ కూడా ఈ రోడ్లు వేయడమనే ప్రక్రియకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్లు వేయడంవరకూ బాగానే ఉంది..  ఆరోడ్డువేసేది ఓ శాఖవాడు, తీరా ఆరోడ్డు వేసిన తరువాత ఇంకో శాఖవాడికి గుర్తొస్తుంది– అరే అక్కడ నీళ్ళ పైపుకి ఏదో రిపేరీ వచ్చిందీ అని– ఆ వేసిన రోడ్డేదో తవ్వేసి వాడిపని వాడు చూసుకుంటాడు.. అలా వివిధశాఖలవారూ– అంటే టెలిఫోను, ఎలెట్రీ, వీళ్ళు కాకుండా ప్రెవేట్ కంపెనీల వాళ్ళూ ( కేబుల్స్ వేయడానికి).. ఎవరిదారిన వాళ్ళు , ఒకరితరవాత ఇంకోరు  వేసిన రోడ్డుని తవ్వుకుంటూ పోతారు. మధ్యలో  BRTS  అంటారు,  Metro  అంటారు.. ఇలా చెప్పుకుంటూ పోతే, మనరోడ్లు లక్షణంగా ఎప్పుడూ ఉండవు. అన్ని శాఖలవాళ్ళూ  coordinate  చేసుకుని పని ఎందుకుచేయరో ఛస్తే అర్ధమవదు.  అవునులెండి ..ఈ పనులకి టెండర్లూ.. అస్మదీయులూ, తస్మదీయులూ.. ఎంత కథ నడవాలీ?

ప్రభుత్వాల ముఖ్యోద్దేశమేమిటంటే, ఏదోలాగ జనాల్ని సుఖంగా బతకనీయకూడదని… ఏమిటేమిటో  welfare statట్టూ సింగినాదం అంటూంటారు. అప్పుడెప్పుడో UPA   ప్రభుత్వం, నందన్ నీలెకేనీ గారి నేతృత్వంలో ,    ఆధార్  గుర్తింపు కార్డులు మొదలెట్టారు.. వాటిని మొదలెట్టినప్పుడు, ప్రస్తుత అధికార ( ఆనాటి ప్రతిపక్షం )పార్టీవారు.. హాత్తెరీ ఇంత ఖర్చు అవసరమా, ఇదేమైనా అమెరికాయా ప్రతీ పౌరుడికీ గుర్తింపు కార్డెందుకూ, ఏదో ఎన్నికల టైములో పట్టించుకుంటే సరిపోదా…  blah..blah..  అని ఏవేవో అనేసారు., ఆ కార్డుల ప్రక్రియ పూర్తయేసరికి  UPA  వారి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది…   BJP  అధికారంలోకి రావడమేమిటి, ఇదివరకటి  సంక్షేమ పథకాల పేర్లన్నీ మార్చేసి, కొత్త పేర్లు పెట్టేసారు   Old wine in New bottle… పైగా ఇవన్నీ ” అచ్చే దిన్ ” అన్నారు.. ఓహో నిజమే కాబోసనుకున్నారు జనాలు. ఆధార్ గుర్తింపు కార్డుదగ్గరకొచ్చేసరికి, ఏం చేయాలీ  తీసేద్దామా పోనీ, అని తర్జనభర్జనలు చేసేసి, మళ్ళీ ఖర్చెందుకూ అనుకుని, ఏదో ఘనకార్యం చేసినట్టు , తీసేయకుండా కొనసాగించారు.పోనీ ఉంచినవాళ్ళు శాంతంగా ఉండాలా, అబ్బే, ప్రతీదానికీ లింకు చేయాలన్నారు. అసలు మన అస్థిత్వం , ఆ ఆధార్కార్డ్ లో నిక్షిప్తం అవాలన్నారు.. అసలు ఏవేంకావాలో, ఆ కార్డ్ చేసినప్పుడే అడిగేస్తే గొడవుండేది కాదు… అబ్బే ప్రభుత్వ నిర్వాకం కదా, రోడ్లు వేసేటప్పుడు, ప్రాంతీయ స్థాయిలో ఎలా ఉంటుందో, అదే జాతీయ స్థాయిలో  మొదలెట్టారు..  ఓవైపున  మొబైల్ లో కొత్త సిమ్ వేసుకోడానికి,  biometeric  ఎలాగూ చేస్తారు.. అది   TRAI  కి సరిపోదుట, మన ఆధార్ కార్డుకీ, మన మొబైల్ నెంబరు జోడించడం అనివార్యం అని మొదలెట్టారు… 

సరే మా ఇంటిదగ్గర ఉండే  IDBI Bank  బయట  2018  జనవరి నుండీ, ప్రతీరోజూ, జనాలు బారులు తీసి నుంచోడం చూడ్డమయితే చూసాను.. ఓ రోజు క్యూలో నుంచున్న ఓ పెద్దమనిషిని అడిగితే, ” ఏమో నాకూ తెలియదూ.. అందరూ నుంచుంటున్నారు కదా అని నేనూ నుంచున్నానూ, ఏమో మోదీగారు అప్పుడెప్పుడో ప్రతీ బ్యాంకు ఎకౌంటులోనూ 15 లక్షలు వేస్తానన్నారుగా.. అదయుండొచ్చూ.. “.. ఇలాకాదని అక్కడుండే సెక్యూరిటీ అతన్ని అడిగితే చెప్పాడు.. ఆధార్ – మొబైల్ లింకింగ్ ప్రక్రియ అని. మూడేళ్ళ క్రితం నా  Pension life certificate  కోసం  SBI  కి వెళ్ళినప్పుడు, నా అధార్ కార్డూ, నా  mobile  లో  O T P   లక్షణంగానే వచ్చాయి.. అయితే ఈ గొడవ నాకవసరం లేదని వదిలేసాను… ఆమధ్య ఎప్పుడో,  SBI ATM  కి వెళ్తే, మొట్టమొదట..  ” You want to update your ADHAAR ? ”  అని   display  అవగానే, బుధ్ధిమంతుడిలా, నెంబరు వేసాను… ” అబ్బే  ..  could not be verified  అంది.మరి ఇదివరకు లక్షణంగా ఉన్నది ఏమైపోయినట్టో ఆ దేవుడికే తెలియాలి.. సరే పేద్ద పనేమీ లేదుగా, నేనూ చేసేసికుందామనుకుని ఏప్రిల్ 3 న  IDBI Bank  కి వెళ్తే, ఆ  Adhar Exercise  అంతా ఆపేసామన్నారు. హాయిగా ఇంటిదగ్గరది వదులుకుని, ఊళ్ళో ఈ కేంద్రాలగురించి అన్వేషణ ప్రారంభం…  e- seva kendras  లు చూస్తే, అక్కడేమో కొల్లేరుచేంతాళ్ళంత క్యూలూ.., పైగా రోజుకి limited to 10 Nos,  వాటికి  టోకెన్లూ.. అడక్కండి, చిరాకెత్తిపోయింది. ఊళ్ళో ఉన్న ఈ కేంద్రాలన్నీ వెదికినా, ఇదే తంతు. పోనీ ఆ నింపాల్సిన  application form  ఇస్తారా అంటే అదీ లేదూ.. క్యూలో నుంచుంటేనే ఇస్తారుట.. ఈ మధ్యలో మా అబ్బాయి ..” డాడీ లింకుచేసారా.. ” అంటూ.. ఇంటావిడైతే అడక్కండి… ఈమధ్యలో వాళ్ళెవరో  Supreme Court  లో  P I L  వేసారు–ఇదంతా  against fundamental rights  అని.. వాళ్ళేమో   తీర్పు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని నోరుమూసుక్కూర్చోమన్నారు..ఏమో ఆ తీర్పెలా ఉంటుందో ఎవడికి తెలుసూ, మనపనేదో చేసేస్తే ఓ గొడవొదిలిపోతుందీ అనుకున్నాను. నా అదృష్టం చూడండి.. మా దగ్గరలో ఉండే,  IDBI Bank  దగ్గర బోర్డుపెట్టారు.. ఆధార్ కార్యక్రమం గురించి.. లోపలకి వెళ్ళిఅడిగితే, ఓ ఫారం ఇచ్చి, నింపితెమ్మన్నారు.. సరే అనుకుని మర్నాడు వెళ్తే, అదేదో మాయదారి  Server down.. ఓ గంట కూర్చున్నతరవాత మళ్ళీ రమ్మన్నారు. ఆ సోమవారం, ఇంటావిడ బయటకు వెళ్ళడంతో నేనూ, నా సంచీ ( పంచాంగం కట్టలాగ ) రెడీ.. మూడునిముషాల్లో పని పూర్తిచేసాడు ఆ అబ్బాయి. ఆంటీని మర్నాడు తీసుకొస్తే ఆవిడదికూడా చేసేద్దామూ అని ఆశ్వాసనిచ్చాడు. మర్నాడు నేనూ. ఇంటావిడా, నా సంచీ ..మళ్ళీ హాజరూ..  Server down  మళ్ళీ…

తిరిగి మూడున్నరకి వెళ్ళి ఆంటీగారి ఆధార్ సంబంధిత యజ్ఞం పూర్తిచేసాము.. కథ సుఖాంతం..

నాకో డౌటు– ఈ మధ్యన  TRAI  వాళ్ళు మొబైల్ నెంబర్లన్నీ  13 digits  లోకి మారుస్తామంటున్నారు.. మళ్ళీ ఇదంతా తిరిగిచేయాలేమో..  keeping fingers crossed.  మధ్యలో ఎవడో ” ప్రవర ” లింకుచేయాలనొచ్చు.. ఏమో.. ” అఛ్ఛే దిన్ ” కదా..  anything can happen.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రెండు సినిమాలు

 ఒకానొకప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలు ఏ కారణం చేతైనా మిస్సయితే, వాటిని  TV  లో చూడ్డానికి చాలారోజులు పట్టేది. పైగా ఈమధ్యన  Social media  ధర్మమా అని, కొత్తసినిమాల రివ్యూలూ, అభిప్రాయాలూ ఊదరగొట్టేస్తున్నారు.. ఏదైనా సినిమా వస్తే చాలు Facebook  లో పోస్టులూ, వాటిపై స్పందనలూనూ.. అవన్నీ చదివి అయ్యో మనం చూడలేకపోయామే అనే ఓ రకమైన  disappointment  కలుగుతుంది… సినిమా మాటెలా ఉన్నా, దాన్ని మొదటి వారం లో, ( ofcourse  ఇదివరకటిరోజుల్లోలాగ శతదినోత్సవాలు కాదనుకోండి,) లేదా కనీసం పన్నెండొ రోజుకైనా చూడలేకపోతే, సమాజంలో అందరూ చిన్నచూపు చూస్తారు… వీటన్నిటికీ విరుగుడుగా, కనీసం నెలన్నరలోపులో అయినా చూడ్డానికి కొత్తగా రెండు మాధ్యమాలు ..  Amazon Prime Video, Netflix  రంగంలోకి వచ్చాయి. హాయిగా మనిష్టం వచ్చినప్పుడు, ఎటువంటి చెత్త యాడ్లూ లేకుండా చూడొచ్చు. ఏదో అత్తగారు తిట్టిందనికాదుకానీ, తోటికోడలు నవ్వినందుకన్నట్టు, సమాజంలో ఇంకోరితో చెప్పుకోడానికి చూడాల్సొస్తోంది.. ఎవరో మనకి తెలిసినవారు.. ఫలానా మహానటి చూసారా? మా అమ్మాయి ఫోనుచేసి చెప్పడంతో , వెంటనే వెళ్ళిపోయామూ.. అయ్యో మీరింకా  చూడలేదా… అని .

వీళ్ళెలాగూ చూడలేదుకదా అని, ఒకటికిరెండింతలు చేసేసి, వర్ణించేసి, అక్కడికేదో మనం జీవితంలో ఏదో మహావిలువైనది పోగొట్టూకున్నామన్నంత   guilty feeling  ఆపాదించేస్తారు. అందుకోసం ఊళ్ళోవాళ్ళకోసమైనా సినిమాలు చూస్తూ ఉండడం ఆరోగ్యకరం… ” పొగత్రాగడం, మద్యపానం చేయడం ఆరోగ్యానికి హానికరం ” లాగన్నమాట.

ఈమధ్యన అలాటి  guilty feelings  ఉండకూడదనే సదుద్దేశ్యంతో రెండు సినిమాలు చూసేఅదృష్టం కలిగింది.

మొదటిది ” రంగస్థలం “-RS

ఈ సినిమా పుణెలో వచ్చినట్టుగా కూడా తెలియదు. తెలిసినా బహుశా వెళ్ళుండకపోవచ్చు.  Somehow  రెండో తరం సూపర్ స్టార్ల సినిమాలు  ( ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి )  నాకంతగా వంటపట్టలేదు…  may be my mindset/ block.  ఒకరకమైన అనాసక్తి.. అంతే.. ఇప్పటిదాకా ఇతను నటించిన ఏ ఒక్కసినిమా చూడలేదూ, చూడనందుకు  విచారించాలేదు.. కానీ రంగస్థలం  గ్గురించి అద్భుతంగా  రివ్యూలు చదివాను.. పోనిద్దూ వీళ్ళంతా అభిమానసంఘాల వారూ.. అనుకుని వదిలేసా.. .. కానీ నెలన్నరక్రితం   Amazon లో browse  చేస్తూంటే, కనిపించింది.. పోనీ ఒక్కసారి చూద్దామా అనిపించింది.. ఏక బిగిన  pause  లేకుండా కట్టిపడేసింది. చాలా చాలా బావుంది,  especially  క్లైమాక్స్.. పాటలు, నటన excellent.  అంత గ్లామొరస్ హీరో, హీరోయిన్లు , ఎటువంటి భేషజం లేకుండా, పక్కా గ్రామీణ యాసతో డయలాగ్గులూ…  overall  very excellent  అనొచ్చు.

Rating : 4.5 / 5

 

రెండో సినిమా  ” మహానటి “

MN1

ఈ సినిమా మాకు పుణెలో అన్ని మల్టీప్లెక్సుల్లోనూ రిలీజవలేదు. ఎక్కడో దూరంగా ఉన్నవాటిలో అయితే ఉంది… అంతదూరం వెళ్ళి చూసేటంత ఆసక్తైతే లేదు నాకు… somehow  ఈ  biopic  లమీద నాకు అంత సదభిప్రాయం లేదు. ఉన్నదున్నట్టుగా చూపించే ధైర్యం ఉండదు దర్శక నిర్మాతలకు– బతికున్న ఆ మహామహుల ( ఎవరి బయోపిక్కు తీసారో)  దాయాదులకి కోపాలొస్తాయేమో అని.  ఏదైనా సినిమాకి  Biopic  అన్నందుకు, వారిలో ఉన్న  both positive and negative shades  కూడా చూపించాలి. అలాకాకుండా,  cinematic  గా చూపించడం , మోతాదుకి మించి గ్లామరైజు చేయడం fair  కాదు.

సావిత్రిగారు మహానటి అనడంలో ఏమాత్రం సందేహమూ లేదు… ఆవిడ జెమినీ గణేశన్ తో  ఎలా ప్రేమలో పడిందీ, చివరకు ఆవిడ ఏ స్థితికి చేరిందీ అన్న విషయాలు , వివరాలూ, ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలలో చదివాము… ఆ చదివినవాటి వెనుక ఉండే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ఆశిస్తారు.. అలాగే మిస్సమ్మ చిత్రంలో భానుమతి గారి స్థానంలో సావిత్రి ని ఎలా తీసుకున్నారో అనే విషయం మీద, ఏదో  నామ్ కే వాస్తే గా ప్రస్తావించకుండా, మరిన్ని వివరాలు ఇచ్చుండొచ్చు. సినిమా చాలా భాగం జెమినీ గణేశన్ ని   over dignify  చేయాల్సిన అవసరం లేదు… అలాగే సావిత్రి గారు నటించిన ఎన్నో ఎన్నెన్నో చిత్రాలలో అద్భుతమైన సన్నివేసాలున్నాయి.. వాటన్నిటినీ స్పృసించలేకపోయినా,  మరికొన్నైనా చూపించవలసింది.  విమర్శించడం సుళువే..  ఇదేదో జెమినీగణేశన్   PR  Exercise  లా ఉందే కానీ, మహానటి  టైటిల్ కి న్యాయం చేకూర్చలేదేమోననిపించింది.   నిజమే రెండున్నరగంటల్ల్లో జీవితచరిత్ర తీసి మెప్పించడం కష్టమే.. ఆ దృష్టితో చూస్తే  , సినిమా మరీ అందరూ పొగిడినంత కాకపోయినా ,  just above average  అనిపించింది.

మరో విషయం… ఏదైనా మనసుకి నచ్చిన సినిమా ఒకసారి చూస్తే, మళ్ళీమళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ  ” మహానటి ” మరోసారి చూడొచ్చేమో అని అనిపించలేదు. కానీ ” రంగస్థలం ” అలా కాదు.. మరోసారి చూసే సినిమాయే… Both films are of different genres.. so comparison is not fair. Comparison is only about the overall quality , and of repeat viewing…

Rating :  3 / 5

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–జ్ఞానోదయం….

  ఈమధ్యన రాజమండ్రి, తణుకు ప్రయాణాల్లో, ఒకింత జ్ఞానం వంటబట్టింది.ఎప్పుడో ఏ బంధువో ఆహ్వానిస్తే వెళ్ళడం తప్పదు.  వాటిని సామాజిక బాధ్యత అని ఓ పేరుకూడా పెట్టొచ్చు… ఒక వయసు దాటిన తరువాత ప్రయాణాలు చేయడం కూడా కష్టమౌతోంది.అలాగని చెప్పి ఏదో విధాయకంగా వెళ్ళే ప్రయాణాలకి మరీ  flights  ఎందుకూ, అత్యవసర పరిస్థితుల్లో అయితే ఎలాగూ వెళ్ళాలి.. అంతకంటే, హాయిగా, మన భారతీయ రైల్వేలని పోషిస్తే, పుణ్యమూ, పురుషార్ధమూనూ, అనేది నా policy.   ఉద్యోగం చేస్తున్నప్పుడు వెళ్ళలేదూ? ఇప్పుడుమాత్రం, మనకేమైనా కొమ్ములొచ్చాయా ఏమిటీ?. పైగా కొన్ని రైళ్ళలో  AC First Class  కూడా ఉంటోంది. మన వయసు దృష్ట్యా ఏవో  కన్సెషన్లు కూడా ఉంటున్నాయి.. హాయిగా దాంట్లో ప్రయాణం చేస్తే, సుఖానికి సుఖం, కిట్టుబాటుకి కిట్టుబాటూనూ.. కదూ…అంతే కాకుండా పేద్ద పోజుకూడా పెట్టొచ్చు… జీవితమంతా జనతా జనార్ధన్ క్లాసుల్లో ప్రయాణాలు చేసిన మొహమే నాది…. ఏం చేస్తాం అప్పుడు అంతే తాహతు. ఇప్పుడు బాధ్యతలు తీరిన తరువాత, అప్పుడప్పుడు , మనకోసం కాకపోయినా, జీవిత సహధర్మచారిణి సుఖంకూడా చూడాలిగా, ఆవిడతోపాటే  Also ran  లా మనమూనూ..పైగా నీ  comfort  కోసమే ఈ  ఏసీలూ, ఫస్ట్ క్లాసులూ అని తోసేయొచ్చు…

ఇలాటి ప్రయాణాల్లో  గమనించేదేమిటంటే, మనకి వేలల్లో ఖర్చు ఎలాగూ అవుతోంది.. ఇంకొచం ( మరీ వేలల్లో కాదూ) మనవి కాదనుకుంటే, ప్రయాణంలో ఎటువంటి శ్రమా లేకుండా, హాయిగా ఉంటుంది. ఆ  మాత్రందానికి వెనుకాడకూడదు. ఇన్నేళ్ళకి, ఇన్ని ప్రయాణాలు చేసిన తరువాత కలిగిన జ్ఞానోదయం… అదికూడా స్వతహాగా కాదులెండి… ఇంటావిడ చెప్తే అనిపించింది నిజమే కదూ… అని.

మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు, పెద్ద స్టేషనుదాకా కాకుండా, ” గోదావరి ” స్టేషనులో దిగి, హొటల్ కి ఆటోలో వెళ్ళి  check in  అయ్యాము… ఆ వివరాలన్నీ ఇంకో పోస్టులో.. 

కిందటిసారి రాజమండ్రీ నుండి, తణుకు వెళ్ళడానికి ఓ టాక్సీలో వెళ్ళడంలో ఉండే సుఖానికి రుచిమరిగాము.హాయిగా బస్సులోనో, రైల్లోనో వెళ్ళడానికి రోగమా అనొచ్చు, కొందరు.. అలాటప్పుడు ఏసీలూ అవీ ఎందుకూ, హాయిగా 3  Tier Sleeper  లో వెళ్ళొచ్చుఎవడు చోడొచ్చాడూ? ఏదో ప్రాణానికి సుఖంగా ఉంటుందనేగా, ఏసీలూ అవీనూ.. అలాగే ” పల్లెవెలుగు ” బస్సులోనూ వెళ్ళొచ్చు, ఇంక సుఖపడేదెప్పుడండీ? పిల్లలేమీ అడగరాయే, డబ్బులన్నీ అలా వృధా చేస్తున్నారా అని, పైగా బస్సులూ అవీ ఎక్కిప్రయాణాలు చేస్తే, కోప్పడే రోజులు కూడానూ.. పైగా ఈ వయస్సులో అంతంత దూరాలు వెళ్తూ, లేనిపోని హైరాణెందుకూ అంటారు. అలాగని వెళ్ళకుండానూ ఉండలేమాయె.. వయామీడియాగా అన్నమాట ఈ టాక్సీలూ అవీనూ.. Anyway  మొత్తానికి అప్పుడుతీసికెళ్ళిన టాక్సీ అతనికే ఫోను చేసి, మా ప్రోగ్రాం అంటే, రాజమండ్రి to  తణుకు , మధ్యలో నిడదవోలులో, ఓ గంటన్నర, మా ఇంటావిడ స్నేహితురాలితో.. ఎలాగూ ఇంతదూరం వచ్చామూ, ఓసారి మండపాక ఎల్లారమ్మ దర్శనంకూడా చేసుకుంటే, బావుంటుందీ.. ఎంతైనా ఈ సుఖాలన్నీ ఆ అమ్మ దయే గా…. అనుకున్నాము… అంటే ఆ టాక్సీ అబ్బాయి, పన్నెండయిపోయిందీ, గుడితలుపులు మూసేస్తారూ, సాయంత్రం వచ్చి తీసికెళ్తానూ అన్నాడు. అలాగే వచ్చి తీసికెళ్ళాడు… మా తిరుగు ప్రయాణం గురించి అడగ్గా,   తెల్లవారుఝామున  3 గంటలకి అని చెప్పాము.. మేమున్న మా అత్తవారిల్లు, ప్రాంతంలో, పగటిపూట రిక్షాలు దొరకడమే కష్టం.. ఇంక అర్ధరాత్రీ, అపరాత్రీ ఎవడొస్తాడూ?.. ” కంగారు పడకండి, నేనే వచ్చితీసికెళ్తానూ ..” అన్నాడు. టైముకి రాకపోతే .. మళ్ళీ అదో డౌటూ.. సెకండ్  షో సినిమా చూసేసి, మీ ఇంటికెదురుగానే టాక్సీలో పడుక్కుంటానూ, రెండింటికి మీరే లేపండీ అని చెప్పి, స్టేషనుకి రెండున్నరకల్లా చేర్చాడు. మేమూ, మా రెండు సూట్ కేసులూ, ఓ సంచీనూ. తీరా వెళ్ళేసరికి ట్రైన్ ఇంకో ప్లాట్ఫారానికన్నారు. అంతంత దూరాలు సామాన్లు మోయలేమూ, ఎంత  సూట్ కేసులకి చక్రాలున్నా,   Overbridge   ఒకటుందిగా, కూలీలా  ఉండరూ.. చివరకి ఆ టాక్సీ అతనే, రైలొచ్చేదాకా, ఆగి , ఆ రైలా ఆగేది ఒకే నిముషం.. మమ్మల్ని ముందరెక్కమని, సామాన్లు అందించి. క్షేమంగా పంపాడు.అతనితో కుదుర్చుకున్న లెక్కకంటే, నేను ఇచ్చింది మరికొంత చిన్న ఎమౌంటు.. అదీ అతనడగలేదు.. ఈ  AC  ల్లో తీండీ తిప్పలకి చాలా కష్టం.. ఈ బోగీలూ ఆ చివరో, ఈ చివరో ఉంటాయి, మనకా వెళ్ళే ధైర్యం లేదు, రైలు కదిలిపోతే, పరిగెత్తే ఓపిక్కూడా లేదు. ఇలాటప్పుడు ఆ బోగీలో ఉండే  attendant  మన rescue  కి వస్తాడు.. తనకే డబ్బులిచ్చి, ఏ ఫలహారమో, పళ్ళో తెమ్మంటే, పాపం తెచ్చిపెడతాడు– మనం అడిగే పధ్ధతిలో ఉంటుంది… అలాటప్పుడు ఓ టిప్పులాటిది ఇవ్వడంలో తప్పేమీ లేదూ, మన ఆస్థులేమీ కరిగిపోవడం లేదూ..హొటళ్ళలో ఇవ్వడం లేదూ.. ఇదీ అలాగే…

మొత్తానికి పుణె అర్ధరాత్రి ఒంటిగంటకి చేరాము…  Platform No 1  మీదే ఆగడంతో,  overbridge  దాటాల్సిన అవసరంకూడా లేకపోయింది. మామూలుగా  Uber, Ola  లైతే అర్ధరాత్రి ఓ 200   దాకా పడుతుంది… మేము గేటు బయటకి రావడంతోనే, ఓ ఆటో వాడు , ఎక్కడకో చెప్పగానే, 250 అన్నాడు… కాదు 230  అన్నాను, బేరంఆడ్డం జన్మహక్కాయే… సరే అని ఒప్పుకుని,  సామాన్లుకూడా తనే ఎత్తి,  మా సొసైటీకి చేర్చి, లిఫ్ట్ లో సామాన్లుకూడా పెట్టడంతో, నాకే అనిపించింది– ఇరవైరూపాయలకోసం అంత కక్కూర్తి పడాలా అని..  అతనడిగినదానికి ఇంకో పాతిక చేర్చి ఇచ్చాను… మొత్తం ప్రయాణం లో నేను అదనంగా  ఖర్చుచేసింది మహా అయితే నామమాత్రమే.. బస్..ఎక్కడా శ్రమన్నదిలేకుండా హాయిగా కొంపకి చేరాము. ఈ అదనపు ఖర్చుకి  చూసుకుంటే ఏమయ్యేదో చెప్పక్కర్లేదుగా… 

వేలల్లో ఖర్చుపెడుతున్నప్పుడు,  Goodwill  కోసం కొంత ఖర్చుపెట్టడంలో నష్టమేమీ లేదన్నది నా అనుభవం…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” అఛ్ఛే దిన్ ” అంటే ఇప్పుడు తెలుస్తోంది…

అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం, అవేవో ” అఛ్ఛేదిన్ ” వచ్చేస్తున్నాయంటే, నిజమే కాబోసనుకున్నాము. .. అవన్నీ మనలాటి సామాన్యులకి కాదనీ, బ్యాంకుల్లో డబ్బులు దోచేసుకుని, దేశాలు వదిలి పారిపోయేవారికే ననీ…పోనిద్దురూ ఎవరో ఒకళ్ళు బాగుపడ్డారు కదా అంటారా? సరే అయితే..

 రాత్రికి రాత్రి ఏదో కోటీశ్వరులైపోతామనేమీ కలలు కనలేదు… కానీ ఉన్న డబ్బులేవో, బ్యాంకుల్లో సవ్యంగా డిపాజిట్టైనా చేసుకోవచ్చనుకున్నాము. అబ్బే అదీ కుదరదుట… వీలైనన్ని తిప్పలు పెట్టడమే ప్రభుత్వ ధ్యేయం కాబోలు..

ఇదివరకటి రోజుల్లో బ్యాంకులలో ఓ సాదాసీదా నెంబరుండేది మన ఎకౌంటుకి.. దాన్ని అదేదో  Core Banking  అని పేరుపెట్టి, కొల్లేరుచాంతాడంత చేసారు.. ఛస్తే గుర్తుండదు. పైగా దీనివలన దేశంలో ఏ బ్రాంచి నుంచైనా, లావాదేవీలు చులాగ్గా చేసుకోవచ్చన్నారు. అవేవో  ATM లు,  Netbanking  లూ వచ్చాయి.  ATM  లలో డబ్బులుండవనుకోండి, అది వేరే విషయం..

 బ్యాంకింగ్ వ్యవస్థ  User friendly  అన్నారు..  thats the Joke of the Century..   ఈరోజుల్లో ఖరీదులు చూస్తే, అసలు డబ్బులే మిగలవనుకోండి.. అధవా మిగిలినా, బ్యాంకులకి వెళ్ళి  Deposit  చేయడానికి, ఎన్ని తిప్పలు పెడతారో తెలిసొచ్చింది… మా ఇంటావిడ  అప్పుడూ ఇప్పుడూ దాచుకున్న డబ్బులు ,  బ్యాంకులోనే వేయమంటూంటుంది.. తను మాత్రం ఏం చేస్తుందీ, ఎప్పుడో రాత్రికి రాత్రి,  ఎవడో.. రేపణ్ణుంచి ఫలానా ఫలానా నోట్లు చెల్లవూ.. అన్నా అనొచ్చు. అఛ్ఛే దిన్ కదా మరి.

నిన్నటి రోజున దగ్గరలోనే ఉందికదా అని  HDFC Bank  కి వెళ్తే, ఇది నీ  Home Branch  కాదూ, 25000  దాటితే, వెయ్యికి 5 రూపాయలు  charges  వసూలు చేస్తామూ… అన్నారు. మళ్ళీ ఆ ఫారాల్లో సరిదిద్ది ,  చేసొచ్చాను. మిగిలిన డబ్బులని, ఛార్గెస్ లేకుండా, మూడు దఫాల్లో deposit  చేసుకోవచ్చన్నారు… ఈ మాత్రం ముచ్చటకి మూడుసార్లెందుకూ దండగా, అనుకుని, ఇవేళ ఇంకో కొంత  amount  అక్కడే, వేసి, ఆ మిగిలినదేదో, ఎదురుగుండా ఉన్న  State Bank  కి వెళ్ళాను. అక్కడి సీను….

 ATM    Debit Card  ఏదీ అంటుంది.. ఇది నీ  Homebranch  కాదుగా, అక్కడకెందుకు వెళ్ళలేదూ?

అంటే అక్కడకి వెళ్ళడానికి ఇంకో వందో రెండువందలో ఖర్చుపెట్టుకోవాలన్న మాట… ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు, మొత్తానికి తీసుకుంది ఆవిడ. సరే విషయం తెలుసుకుందామనుకుని,  Home branch  లో ఎంత డబ్బు ఒకేసారి చేయొచ్చూ అని అడిగితే,  ఒకేసారి ఎంతైనా  deposit  చేయొచ్చూ, కానీ  ఖాతాదారు స్వయంగా వెళ్ళాలీ ట.

 మరి అప్పుడు అదేదో  Demonitisation  చేసినప్పుడు, ఖాతాదారులందరూ స్వయంగా వెళ్ళే, తమ  black money  ని white  చేసుకున్నారటా? లేక ఈ తలతిక్క  Rules  అన్నీ మనలాటివాళ్ళకేనా?

ఈ తిప్పలన్నీ పడలేక, అసలు  Banking System  అంటేనే చిరాకొచ్చి, మొత్తం వ్యవస్థని కూలగొట్టే ప్రయత్నమంటారా?  అలాకాదంటే, ఉన్న డబ్బంతా ఇంట్లో నేల మాడిగలు తవ్వి దాచుకోవాలనటా?   ఓవైపు  Black money  control  చేయడానికే  demonetisation  అని ప్రగల్భాలు చెప్పినప్పుడు, ఈ తలతిక్క  rules  ఎందుకూ? 

అదీకాదూ అంటే, ఏ రాత్రికి రాత్రో… ” మిత్రోం.. రేపణ్ణుంచి మీ దగ్గరున్న కరెన్సీ నోట్లు చెల్లవూ.. ” అని ఇంకో దఫా ” అఛ్ఛే దిన్ ” స్లోగన్  చెప్పుకోడానికా?

ఆ భగవంతుడొచ్చినా సామాన్య మానవుడిని బాగుచేసే వాడుండడు..

%d bloggers like this: