బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అనుకున్నట్టుగానే ఆంఆద్మీ పార్టీ వారు అన్ని కబుర్లూ చెప్పి చివరకి , ఏ పార్టీనైతే తిట్టిన తిట్టు తిట్టకుండా ఎన్నికలలో “చీపురు” తో తుడిచిపెట్టారో, ఆ కాంగ్రెస్ పార్టీ తోనే చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇంక కేజ్రీవాలైతే, ప్రపంచంలో అందరిమీదా చివరకి తన పిల్లలమీద కూడా “ఒట్లు” పెట్టేసి, బిజెపీ కాంగ్రెస్ వారితో చేతులు కలపనూ అన్నాడే, మరి ఇప్పుడేమయిందిట? పైగా తమను ఎన్నుకున్న ఓటర్లందరూ ఆంఆద్మీ వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకున్నారుట ! అదీ ఎక్కడా… అంతర్జాలం ద్వారా.. అంతర్జాలంలో విషయాలు ఎంతగా manipulate చేయొచ్చో ఎవరికి తెలియదు? తనకి పదవీ వ్యామోహం ఉందీ అని ఒప్పుకోడానికి ఏం రోగం? ఎవరైనా కాదన్నారా? పోనీ ఈ కాంగ్రెసు వారి చరిత్ర ఏమైనా అంత ఉత్కృష్టమయినదా, అప్పుడెప్పుడో చౌధరీ చరణ్ సింగుకి కూడా సపోర్టు ఇచ్చినట్టే ఇచ్చి, ఠపీమని తీసేశారు. ఇప్పుడుమాత్రం అలాటిది జరగబోదని ఏదైనా భరోసా ఉందంటారా?కబుర్లు అందరూ చెప్తారు, ఆచరణలోకి వచ్చేటప్పటికే అసలు రంగు బయట పడుతూంటుంది.

       నిన్న ఏదో తెలుగు పేపరు చదువుతూంటే ” పది కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేవాడిని..” అని మన మహామహీం రాష్ట్రపతి గారి ఉవాచ ట, అదేమో ఒక తెలుగు వార్తాపత్రికకి పతాక శీర్షికట ! ఇంతకంటే ముఖ్యమైన వార్తే దొరకలేదా? పోనీ దొరకలేదే అనుకుందాము, అందులో అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటో నాకైతే అర్ధం కాలేదు. నూటికి డెభై మంది పరిస్థితి అలాటిదే. సామాన్యప్రజల కష్టాలు కనిపించవూ,VIP లవైతే , అందరూ చదివి అయ్యో పాపం అనుకోవాలిట. 

    నిన్నననుకుంటా, ఆంధ్రప్రదేష్ హైకోర్టువారు, ఓ ఇద్దరు సినిమా నటుల్ని వారికిచ్చిన “పద్మ” ఎవార్డులని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయమని ఆదేశించారుట. వారి వారి పేర్లకు ముందుగా ఉపయోగించడం ఓ కారణంట. ఇదేదో అందరికీ వర్తిస్తుందంటారా? లేక only a select few కి మాత్రమేనా? భారతరత్న ల విషయమేమిటిట? అయినా మనకెందుకూ ఆగొడవలన్నీ, మనందరికీ వచ్చేయా పెట్టేయా?

    ఈసారి నా పుట్టినరోజుకి మా అబ్బాయి, కోడలు, నవ్య, అగస్థ్య ఓ తమాషా బహుమతి ఇచ్చారు.Image

    అదికూడా ఒకరోజు ముందుగా! అసలేంజరిగిందంటే, 13 న మా చుట్టాల అమ్మాయి పెళ్ళి రిసెప్షన్ కోసం, వాషి ( న్యూ ముంబై) వెళ్ళాము. మర్నాడు పుణె తిరిగొచ్చిన తరువాత, ఆదివారం ఉదయం ఆరుగంటలకల్లా శతాబ్దిలో భాగ్యనగరానికి వెళ్ళాల్సొచ్చింది, అదీ ఇంకొక స్నేహితుడి కూతురి పెళ్ళికి. ఆ విశేషాలన్నీ ఇంకో టపాలో.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “బాపు” రే… ఎక్కణ్ణించి వస్తాయో ఆ ఆలోచనలు…

Shri Bapu

    తెలుగువారు ప్రస్థుత వాతావరణం లో కూడా సిగ్గూ ఎగ్గూ వదిలిపెట్టేసి పరిసరాలు కూడా మర్చిపోయి మనసారా నవ్వుకోగలుగుతున్నారంటే దానికి ఒకేఒక్క కారణం మన బాపు గారే అనడంలో సందేహమేమీ లేదు. అసలు ఆయన వేసే కార్టూన్లు చూడ్డంతోటే నవ్వొచ్చేస్తుంది. ఇంక వాటికి వ్రాసిన కాప్షన్లైతే మరీనూ. ఆ బుర్రలోకి అలాటి ఆలోచనలు ఎలా వచ్చికూర్చుంటాయో తెలియదు. ఈ టపాలో పెట్టిన ఫొటో ఎప్పుడో “హంస” పత్రిక కి ముఖచిత్రంగా వేశారు. మరి దానికి సంబంధించిన వ్యాసం కూడా చదివేయండి..మన బాపు

    తెలుగు ఆడబడుచుకి నిర్వచనం చెప్పి, తెలుగమ్మాయి ఎలాఉండాలో చూపించిన ఘనత ఆయనదే. ఓ అమ్మాయి అంటే ఓ benchmark సృష్టించి అమ్మాయంటే ఇలాగుండాలీ అని ఓ ఆర్డరు పాస్ చేసేశారు.తెలుగు ఆడబడుచుకి ముగ్ధమనోహరరూపం సృష్టించింది “ఆంధ్రసచిత్రవారపత్రిక” కి ” ముఖపత్రచిత్రం వెనక కథ ఏమిటో కూడా చదివి ఆనందించండి.
ముఖపత్ర చిత్రం

    ఆరోజుల్లో శ్రీబాపు గారు “తెలుగువెలుగు” శీర్షికతో పాటు కొన్ని కథలు చిన్నపిల్లలకోసం వ్రాసేవారు. మచ్చుకి ఓ జపనీస్ కథ ఆధారంగా వ్రాసిన కథ కూడా చదవొద్దూ మరి..అమ్మ బొమ్మ– శ్రీ బాపు

    అసలు తాము తీసిన సినిమాలమీద వ్యంగ్యాస్త్రాలు వేయడం ఎప్పుడైనా విన్నామా? మరి అదే శ్రీ బాపు గారి ఖలేజా..మా సినిమాలు-బాపు( This link may take some time to open.. please bear with me. Be patient..its worth the delay)

    అసలు ఎన్నో ఎన్నెన్నో వ్రాయాలనుకున్నాను. కానీ ఆయన గురించి వ్రాయడానికి మనకి ఓ అర్హత కూడా ఉండాలిగా. అది లేకే ఇంకెవరెవరో వ్రాసినవి మీ అందరితోనూ పంచుకుంటున్నాను.ఈ సందర్భంలోనే , శ్రీ బాపు గారి “గొప్ప మనసు” గురించి, తన అనుభవాన్ని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారి అక్షరరూపంలో ఉంచారు. చదవండి.satamanam

    అఛ్ఛా Also ran.. అని ఎప్పుడంటారో విన్నారా? ఇదిగో ఇలాటప్పుడు– ప్రముఖులకి సంబంధించిన విషయాలలో ఇంకో అర్భకుడి గురించి చెప్పాల్సొస్తే, ఇలా Also ran.. అని అంటూంటారు.ఇక్కడ ఆ అర్భకుడికి ఎటువంటి ప్రాముఖ్యతా ఉండదు ఏదో ఓ ఒక్క విషయంలో తప్పించి..అదిగో అలాటి సందర్భంలోనే నేను కూడా Also ran. గురువుగారు డిశంబరు 15 న ఎనభైయ్యో సంవత్సరం పూర్తి చేసికుంటూంటే నేను డెభైయ్యో పడిలోకి అడుగెడుతున్నాను, అది నేను చేసికున్న అదృష్టం.

    ఇలాటి జన్మదినాలు ఎన్నో..ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్ధిస్తూ…

     శ్రీ బాపు గారికి

     హృదయపూర్వక శుభాకాంక్షలు

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” అమృతం కురిసిన రాత్రి..”

Rare Photo of NTR, ANR

    గత రెండు మూడు వారాలుగా టీవీ లో ప్రత్యేకంగా ఈటీవీ లో నిజంగానే అమృతమే కురుస్తోంది. మొదటిసారి ఆ కార్యక్రమాలు ప్రసారం చేసినప్పుడు చూసి వినే అదృష్టం కలగలేదు. కారణం అప్పుడు అదే సమయానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూండడం వలన అనుకుంటా, అప్పుడు ఈ అమృతాన్ని ఆస్వాదించ లేక పోయాము. ఈటీవీ వారికి ఎలా తెలిసిందో ఏమో, మళ్ళీ అవే కార్యక్రమాలు, ఎడిట్ చేసి తిరిగి చూపిస్తున్నారు. చాలా మంది చూసే ఉంటారు.

    శ్రీ రామోజీ రావుగారి గురించి, (ఆయన రాజకీయ సిధ్ధాంతాలూ, వ్యాపార విషయాలు పక్కకు పెడితే) చెప్పాలంటే ఎన్నో ఎన్నెన్నో మంచివిషయాలే ఉన్నాయి. ETV2 లో వారు ప్రతీ ఆదివారం ప్రసారం చేసే “తెలుగు వెలుగు”, గత కొన్ని సంవత్సరాలుగా ఔత్సాహిక గాయకులను ప్రోత్సాహ పరిచే “పాడుతా తీయగా”, ప్రతీరోజూ వచ్చే ” తీర్థ యాత్ర” ద్వారా మనందరికీ ప్రత్యక్ష దర్శనం కలిగించే పుణ్యక్షేత్రాలూ, అలనాటి తెలుగు చలన చిత్రాలూ, ఈమధ్యనే శనివారాలు ప్రసారం చేస్తూన్న బ్రహ్మశ్రీ చాగంటి వారి ” అంతర్యామి”– ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుత కార్యక్రమాలు మనకి అందిస్తున్నారు.

    పైన చెప్పినవి అన్నీ ఒక ఎత్తైతే ” స్వరాభిషేకం” ఒక ఎత్తు. చలనచిత్ర పరిశ్రమ ప్రారంభించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నిర్వహించిన ఓ అద్భుత కార్యక్రమం. మామూలుగా ఏదైనా ఎవార్డుల ఫంక్షనుకీ, అవేవో ఆడియో రిలీజుల ఫంక్షన్లకీ ఆ సినిమాలకి సంబంధించిన వారిని చూస్తూంటాము. కానీ “స్వరాభిషేకం” పేరున, ఆనాటి గాయకులనూ, వర్ధమాన గాయకులనే కాక, సంగీత దర్శకులనూ, ముఖ్యంగా నిర్మాతలను ఒకే వేదిక మీదకు చేర్చి, వారిచేత నిజంగా స్వరాభిషేకమే నిర్వహించారు.

    గత 80 సంవత్సరాలలోనూ వచ్చిన పాటల్లో కొన్ని “ఆణిముత్యాలు” ఎంపికచేసికుని, కొన్నిటిని ఎవరైతే పాడేరో ఆ గాయకుల నోటా, కొన్నిటిని వర్ధమాన గాయకులచేతా పాడించి నిజంగానే ” అమృతం కురిసిన రాత్రి ” అనిపించారు. ఒక్కో పాటా వింటూంటే ఆనాటి దృశ్యాలు ప్రత్యక్షం అయాయి. ఇంక వర్ధమాన గాయకుల విషయానికొస్తే, అసలు పాట పాడిన దిగ్గజాలలాటి గాయకుల ఎదురుగా వారు పాడిన పాటని, అదే స్థాయిలో పాడి మెప్పించడం అంటే మాటలా మరి? పాటలు సినిమాల్లోనూ, సీడీల్లోనూ, వింటూనే ఉంటాము.కానీ అవే పాటలు “live” గా వేదికమీద , అదీ అతిరథమహారథుల సమక్షంలో, పాడి, వారిచేత శభాశీ అందుకోడమంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయమే.

    ఈ పాటలకి సంగీతం అందించిన orchestra గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒరిజినల్ పాటలో ఉండే nuance లు అన్నిటినీ capture చేయకలగడం అద్భుతం.

    ఈ స్వరాభిషేకం ధర్మమా అని చలనచిత్ర రంగ దిగ్గజాలు- శ్రీ బాపూ, బాల చందర్, రామానాయుడు, విశ్వనాథ్,భారతిరాజా, దాసరి, ఎంఎస్ విశ్వనాథన్,మిగిలిన సంగీత దర్శకులూ, గాయకులు మంగళంపల్లి వారు, పి.సుశీల, వాణీ జయరాం, యేసుదాస్, చిత్ర, శైలజ వీరందరినీ చూడడం చాలా బాగుంది. ఇదంతా చూసిన తరువాత ఎక్కడో ..ఏదో లోటు కనిపించింది. కొంతమంది ప్రముఖులు కావాలని avoid చేశారా, లేక చేయబడ్డారంటారా? వారు కూడా వచ్చుంటే ఈ కార్యక్రమానికి సంపూర్ణత్వం వచ్చుండేదేమో. అయినా రానివాళ్ళ గురించి బాధపడేకంటే, వచ్చిన వారు మనకు ప్రసాదించినది ఆనందించడంలోనే బాగుంటుందేమో.

    ఆ కార్యక్రమాలు చాలామంది చూసే ఉంటారు. ఎవరైనా మిస్సయితే క్రింది లింకులు చూడండి.

నవంబరు 24 కార్యక్రమం డిశంబరు 1 కార్యక్రమం

    ఈ పైలింకులలోకి వెళ్ళినప్పుడు, ప్రక్కనే మిగిలిన లింకులు ( మొదటిసారి ప్రసారం అయినవి) చూడవచ్చు. ఈ సందర్భంలో డిశంబరు 1 వతేదీన చూపించిన కార్యక్రమం విని, మా మిత్రులు శ్రీ కృష్ణమోహన్ గారు, మంగళంపల్లివారు నర్తన శాలలో పాడిన పాట విని, తన పాత మధుర జ్ఞాపకాన్ని తాజా చేసికున్నారు.swarabhishekam

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమిటో.. బిజీ బిజీ అయిపోయింది..

    ఎప్పటికప్పుడు ఓ టపా పెట్టాలనిపించడం, వ్రాద్దామంటే టైమే ఉండకపోవడమూనూ. ” చెప్తార్లెండి కబుర్లు.. రిటైరయిన తరువాత చేతినిండా టైమే టైమూ.. పనా పాటా , చదివేవాళ్ళుంటే వ్రాయడానికి కావలిసినన్ని కబుర్లూ..” అనికూడా మీరు భావించొచ్చు. కానీ సత్తెప్రమాణికంగా క్రిందటి నెలలో అసలు కుదరనే లేదు. నా మిస్టరీ షాపింగు ఎసైన్మెంట్లు ఓ పదిదాకా చేశాను. ఏదో నాలుగు డబ్బులిస్తూంటారుకదా, ఆ చేసేదేదో శుభ్రంగా చేసి, ఆ రిపోర్టేదో పంపేస్తే వాళ్ళకీ బాగుంటుంది, నాకూ సంతృప్తిగా ఉంటుంది. నేను ఎప్లై చేయకపోయినా వాళ్ళే ఫోన్లు చేస్తూంటారు ఫలానాది మాకు అర్జెంటూ అని.ఇదేదో గొప్పకి చెప్పుకుంటున్నదికాదు, నా సామర్ధ్యం మీద వారికి ఉన్న నమ్మకం. ఇలాటి సందర్భాలు మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని వృధ్ధి చేస్తాయి.

    కార్తీక మాసంలో బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాల ప్రత్యక్ష ప్రసారాలు సరేసరి. ఏదైనా మిస్ అవొచ్చుకానీ, ఆ ప్రవచనాలు మిస్సవడమే.. అబ్బే సాధ్యం కాదు.వీటన్నిటికీ తోడు, క్రిందటి నెలలో నామీద ఎంతో అభిమానంతో నన్ను కలవడానికి వచ్చిన స్నేహితులు. అందులో ముందుగా ప్రస్తావించాల్సింది, స్నేహితులు మోహన్ గారు. ఇక్కడ పూణె లో ఏదో ముఖ్యమైన పనిమీద వచ్చి, ముందుగా నన్ను కలిసి, అదీ ఎక్కడా ఖడ్కీ రైల్వేస్టేషను వెనక్కాల ఉండే న్యూసు పేపరు కొట్టుదగ్గర,Friends 001 నా కోరికమేరకు అంత బిజీ షెడ్యూల్ లోనూ, మా ఇంటికి కూడా వచ్చి, మా ఇద్దరినీ కలియడం ఓ గొప్ప అనుభవం. ఆయనకీ నాకూ పరిచయం నా బ్లాగుద్వారానే. నేను వ్రాసే కాలక్షేపం కబుర్లు, నా అదృష్టంకొద్దీ వారికి నచ్చడం, ప్రతీ టపాకీ తప్పకుండగా ఓ వ్యాఖ్య పెట్టి నన్ను ప్రోత్సాహ పరచడం. ఏదో నచ్చడం వేరూ, కానీ అత్యంత విలువైన సమయాన్ని నాకుకూడా కేటాయించడం చాలా సంతోషమనిపించింది.Thank you Doctor gaaru.You made my day..

    క్రిందటి నెల ఆంధ్రభూమి మాసపత్రికలో ఒక మినీ నవల ” శ్రీరామదూతం శిరసానమామి” మొదటిభాగం ప్రచురించారు. రచయిత శ్రీ ఉప్పులూరి కామేశ్వరరావుగారు. “సుందరకాండ” లోని విషయాలు ప్రస్థుత పరిస్థితులకి అన్వయిస్తూ వ్రాసిన కథ. కథ మాట ఎలా ఉన్నా, ఆ నవలలో , మా కోనసీమలోని ఇందుపల్లి గ్రామం, అమలాపురం గురించి ప్రస్తావనా వ్రాస్తే నేనూరుకోగలనా? అసలే “కోనసీమా” , గోదావరీ నా “బలహీనత”లాయె, పైగా ఆ రచయిత ఫోను నెంబరుకూడా ఇచ్చారు, నేనా అలాటి అవకాశం వదిలేదీ. వెంటనే ఫోను చేసేసి ఆయనతో మాట్టాడి పరిచయం చేసికునేదాకా ఉండలేకపోయాను. మా ఇంటావిడ నా ఈ వెర్రి చూసి అంటూంటుంది, ” ఊరికే అలా ఫోన్లు చేస్తే ఏమైనా అనుకుంటారేమోనండీ, మీ వెర్రిమీదీ..” అని. ఫోను నెంబర్లు ఇచ్చేది, ఎవరైనా ఫోను చేస్తారనేకదా, చేసి చూద్దాం, నచ్చితే మాట్టాడతారు, లేకపోతే పొడిపొడిగా నాలుగు మాటలు మాట్టాడి పెట్టేస్తారు, మహ అయితే ఓ ఫోనుకాలు ఖర్చు. కాకపోతే ఓ కొత్తపరిచయం జరిగినట్టు మనకీ సంతోషమే కదా అని నా పాలసీ. చెప్పొచ్చేదేమిటంటే ఆ తరువాత ఆయనే ఫోను చేసి ఓ అరగంట మాట్టాడారు. అంటే నచ్చినట్టే కదా ! శుభం !

    రోజులో నాలుగేసి గంటలు ఆన్ లైన్లో ఉండడంతో ఒక్కొక్కప్పుడు చిత్రమైన పరిచయాలుకూడా కలుగుతూంటాయి.ఎవరిదో ఒక పేరు చూశాను ఆన్ లైన్లో ఉన్నట్టు. ఆవిడ, మా ఇంటావిడ స్నేహితురాలేమో అని అనుకుని, ఆవిడతో చాటింగు మొదలెట్టాను. ఆవిడతో ఉన్న చనువుకారణంగా, కొద్దిగా వ్యంగ్యంగా కూడా చాట్ చేయడం మొదలెట్టాను. కానీ ఆవిడ ఇచ్చే సమాధానాలలో ఎక్కడో తేడా కనిపించింది. చివరకి అడిగేశాను మీరు ఫలానాయే కదూ అని. “మీరనుకుంటున్న నేను, నేను కాదూ..” అని అష్టాచెమ్మా సినిమాలోని డయలాగ్గు చెప్పేశారు. పైగా నా బ్లాగుకూడా చదువుతానూ అన్నారు. అదిచాలదూ నాకూ ! ఆవిడ ఫోను నెంబరు అడిగి, వెంటనే ఓ అరగంట మాట్టాడాను. ఫోనులో మాట్టాడినప్పుడు చాలాచాలావిషయాలే మాట్టాడుకున్నాము.ఏమనుకున్నారో ఏమో? ఆవిడ ఐడి తీసికుని ఓ మెయిల్ కూడా పంపాను, ఇంకా సమాధానం రాలేదు.

   ఇవన్నీ ఒక ఎత్తూ, 1963 లో నేను ఉద్యోగంలో చేరినప్పుడు కలిసి పనిచేసిన స్నేహితులని యాభై సంవత్సరాల తరువాత కలవడం మరో అద్భుత అనుభవం. నేను పధ్ధెనిమిదో ఏటనే, చదువూ సంధ్యా అంతగా అబ్బక ఉద్యోగంలో చేరిపోయాను, ఇంక చదువు గొడవ ఉండదుగా అనుకుని.మరీ అంత చిన్నవయసులో ఉన్న ఊరు వదిలి ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒక్కడినీ ఉండడమంటే ఏదో “బెంగ” గానే ఉండేది.పోనీ బెంగ అందామా అంటే మళ్ళీ వెనక్కిపిలిచి ఏ చదువులోనైనా పెట్టేస్తారేమో అని ఓ భయమూ, ఎలాగోలాగ సెటిలయిపోదామని నిశ్చయించేసికున్నాను. అంతా కొత్తా, భాష కూడా అంతంత మాత్రమే. హిందీ మరాఠీ అయితే అడగొద్దు. ఏదో హిందీ సినిమాలూ, బినాకా గీత్ మాలాలూ మాత్రమే నాకు హిందీతో ఉన్న పరిచయం. అలాటి పరిస్థితుల్లో తెలుగు మాట్టాడేవారు, అదీ గోదావరి జిల్లాలవారి పరిచయం అంటే నేనెంత అదృష్టం చేసికున్నానో కదూ? అప్పటికే ఉద్యోగంలో ఉన్న తెలుగు వారందరూ, నాకంటె వయసులో పెద్దవారే. నేనేమో ఇంకా మీసమైనా మొలవని కుర్రగాడినీ.నన్ను అందరూ ఓ చిన్న తమ్ముడిలా భావించి, నాకున్న బెంగ పోగొట్టారు.ఫరవాలేదూ అని ఓ భరోసా ఇచ్చి నన్ను చూసుకున్నవారిని ఎప్పటికీ మరువలేముకదూ. అలా పరిచయం అయినవారిలో ఇద్దరు స్నేహితులు శ్రీ సుందరరామయ్య, మోహనరావూ అన్నవారు రెండురోజులక్రితం పూణె వచ్చారు. ఇంకొక స్నేహితుడి ద్వారా నన్ను మొత్తానికి కలిసి, మా ఇంటికి వచ్చి సమయం గడిపారు. ఒకటా రెండా యాభై సంవత్సరాల కబుర్లు. ఆరోజుల్లో మేమందరమూ కలిసి లొనావలా వెళ్ళినప్పటి బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలుంటే, అవి చూసికుని ఒక్కసారగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాము.
Friends in 1963IMG_20131203_112303

    ఇంత హడావిడి అయింది, మరి బిజీ బిజీగా ఉన్నట్టుకాదూ మరి?

%d bloggers like this: