బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– attention seekers…

    పైన పెట్టానే శీర్షిక అలాటి వారు ఓ unique breed కి చెందినవారు. వాళ్ళో వ్రతంలా చేస్తూంటారు. ప్రపంచం ఏమైనా సరే మనకంటూ ఓ అస్థిత్వం ఉందని నిరూపించుకోవాలి. ఎవడో ఒకడు మనమీద దృష్టి పెడతాడుగా అది చాలు !Mission accomplished.. మళ్ళీ ఇంకోటేదో వెదుక్కుంటూ పోవడం…

   చిన్నప్పుడు ఇదివరకటి రోజుల్లో, గుర్తుండేదనుకుంటాను ఇంటినిండా పిల్లలూ, అందరినీ చూడ్డంకూడా కష్టమే కదా, ఏ ఎడపిల్లాడికో అనిపిస్తుంది, తనకి రావలిసినంత attention రావడంలేదో అని, సావకాశంగా ఏదీ కారణం లేకుండా ఏడుపు, పేచీ మొదలెడతాడు. ఏదో పాపం మొదట్లో వాడి కోరిక నెరవేరేది, కానీ ఈ “పేచీ” లాటిది మరీ అలవాటైపోతే, ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇంటికొచ్చిన వారెవరైనా, “అదేమిటండీ అలా గుక్కపెట్టి ఏడుస్తూంటే మరీ ఏమీ పట్టనట్టుంటారూ..” అని అడిగినా, ” ఫరవాలేదండీ, వాడికది అలవాటే, ఏడ్చి ఏడ్చి ..వాడే ఊరుకుంటాడూ మీరసలు వాడివైపు చూడకండి..” అనేసేవారు, ఈ పేచీ పెడుతున్న వాడి “యజ్ఞం” కాస్తా ఫ్లాప్పైపోయేది.. ఇంకో ప్రక్రియ మొదలెట్టేవాడు, లేకపోతే వీణ్ణి పట్టించుకునేదెవరు?

    కానీ ఈ రోజుల్లో అలా కాదు, ఇంటికి ఒకళ్ళో ఇద్దరో పిల్లలు, వాళ్ళేమో ఈ తల్లితండ్రుల ” ఆంఖో కా తారాలు“. మరీ పిల్లల మధ్య ఎడం లేకపోతే వచ్చే సమస్య ధర్మమా అని, పెద్ద పిల్లాడో, పిల్లకో ఎప్పుడోఒకప్పుడు అనిపిస్తుంది, అరే ఇదేమిటీ ఇలాగే సాగితే గొడవే, అనేసికుని ఏదో మరీ అల్లరి పాలవకుండా ఉండే, జ్వరమో, కడుపు నొప్పో. ఒక్కొక్కప్పుడు My head is reeling mummaa.. అనేసి, పైగా ఈరోజుల్లో ప్రతీదీ ఇంగ్లీషులో చెప్పడం ఓ ఫాషనాయే, ఏదో ఒకటిలెండి, మొత్తానికి ఆ రెండొ పిల్లనో, పిల్లాడినో చూస్తున్న ఆ తల్లితండ్రుల attention మొత్తానికి divert చేస్తుంది. ఏమైతేనే, సాధించిందా లేదా? ఇంక ఈ తల్లితండ్రులు, నెట్ లో ఓసారి వెదికేసి ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు బుర్ర అదేనండి head తిరుగుతుందో, తెలిసేసికుని, వెంటనే వాళ్ళు నెలలో కనీసం నాలుగైదుసార్లువెళ్ళే డాక్టరుగారి కి ఫోను చేసేసి, ఓ appointment ఫిక్స్ చేసేసికుంటారు. అదృష్టం ఎమిటంటే ఇలాటివన్నీ వీకెండ్స్ కే పరిమితం. లేకపోతే మళ్ళీ అఫిసులూ, శలవలూ గొడవ! ఆ డాక్టరుగారికీ తెలుసు ఇదేమీ పేద్ద సీరియస్సు కాదూ అని, ఇలాటివాటికి ఫోన్లలో వైద్యం చేయరు, మళ్ళీ వందరూపాయలు వట్టం కాదూ? ఓసారి బట్టలూడతీసి, అదేదో టేబుల్ మీద పొడుక్కోబెట్టి, తల్లీ తండ్రీ పక్కనే ఆ రెండో పిల్లనో/పిల్లాడినో చంకలో పెట్టుకుని, ఈ పరీక్ష చేయబడుతున్న మొదటి పిల్ల/పిల్లాడి వైపు ఆందోళితాభరితమైన దృష్టితో చూస్తూంటారు. ఈ డాక్టరుగారు ఏవేవో పరీక్షలు చేసేసి, సింకులో ఓసారి చేతులు కడిగేసికుని, తాపీగా కుర్చీలో సెటిల్ అయి చల్లగా చెప్తాడు..There is nothing serious.. just cramps.. ఇంగ్లీషులో చెప్తే అదో స్టైలూ.. ఏవేవో మందులు నాలుగైదు(ఏక్ దం harmless) రాసేసి, తనకి రావలిసిన వందరూపాయలూ టేబుల్ సొరుగులో పెట్టుకుంటాడు. ఇంక రోజంతా ఆ పెద్ద పిల్లకి attenషనే attention.. ఎప్పుడో వీలు చూసికుని మళ్ళీ చేస్తుంది… life goes on.. వాళ్ళు మానా మానరూ, వీళ్ళు పరుగులెత్తకా ఉండరూ…

    ఇంకో టైపు వాళ్ళుంటారు, మరీ పిల్లలు కాదూ, రాజకీయనాయకులు చూడండి, ఎప్పుడో ” జంబూ ద్వీపే భరతఖండే.. ” రోజుల్లో ఈయన మంచి ఫారం లో ఉండేవాడు, అన్ని రోజులూ ఒకేలా ఉండవుగా, ఇంకో ప్రబుధ్ధుడు వచ్చి, ఈయన్ని loop line లోకి తోసేశాడు.మామూలుగా పట్టణంలో జరిగే ఏ సభకీ ఈయన్ని పిలవడం లేదు, పోనీ ఎవడో గుర్తెట్టుకుని పిలిచినా, ఆ మీటింగులో ఎవరూ పలకరించిన పాపాన్న లేరు. సడెన్ గా ఈయనకనిపిస్తుంది, ఇదేదో చూడాలీ ..అని, పెద్ద నగరాల్లో అయితే ఏ టీవీ చర్చా కార్యక్రమంలోనో నాలుగు డబ్బులు స్వంతవే ఖర్చుపెట్టుకుని ఓ ” చర్చా” కార్యక్రమంలో పాల్గోవచ్చు. కానీ, పంచాయితీ లెవెల్ గ్రామాల్లోనూ, టౌన్లలోనూ ఎలాగా మరి? ఏ పత్రికా విలేఖరినో పిలిచి ఓ స్టేట్మెంటిచ్చేయడం, విషయం ఏమీ పెద్దదవఖ్ఖర్లేదు.. ” మాతృభాషకి అన్యాయం జరిగిపోతోందీ… లంచగొండి తనం ప్రతీ రంగంలోనూ విచ్చలవిడి అయిపోయిందీ.. సింగినాదం, జీలకర్రా..” అంటూ. ఈయనెవరో రాజకీయసన్యాసం నుంచి బయటకొచ్చి చెప్పాలంటారా, మనకి తెలియదూ? ఈ ప్రేలాపనంతా మన్నాడు పేపర్లలో “పతాక శీర్షిక” లో వచ్చేస్తుంది.మన కరెస్పాండెంటు మరీ ఆ టౌన్ నుంచి వార్తలేమీ పంపడంలేదూ అనే గొడవా ఉండదూ, ఈ అజ్ఞాత( ఎవరి దృష్టిలోనూ పడని) రా.నా. గారికీ కావలిసినంత attenషనూ !!

    ఇంకోరకం వాళ్ళుంటారు, ఇళ్ళల్లో బాగా వయస్సుమళ్ళిన అత్తగారో, మావగారో మరీ పిల్లలు తమకేమీ attenషను ఇవ్వడంలేదనుకుంటారనుకోండి, ” ఏవిటోనే వేడి చేసినట్టున్నట్టుంది… అంటూ ఖళ్ళుఖళ్ళు మని ఓసారి దగ్గితే చాలు కావలిసినంత attenషను.అలాగే మనం బయటకి వెళ్ళినప్పుడు ఎవ్వరూ పలకరించడంలేదేమో అనే ఓ “అభద్రతా భావం” లాటిదొచ్చిందనుకోండి, ఊరికే ఉదాహరణకి..అందరికీ కనిపించేలా మొహం మీదో, చేతిమీదో, నిక్కర్లెసికునేవాళ్ళు ఏ మోకాలిమీదో, క్యాప్రీలు వేసికునేవాళ్ళు ఏ చీలమండమీదో, ఓ బ్యాండేజీయో, చివరాఖరికి ఓ బ్యాండైడ్డో అయినా సరే వేసేసికుని బయటకెళ్ళడం. ప్రతీవాడూ పరామర్శించేవాడే.. ” అయ్యో ఏమయిందండీ.. ” అంటూ..

    అప్పుడెప్పుడో ఆవిడెవత్తో మనవాళ్ళు అదేదో క్రికెట్ మ్యాచ్ నెగ్గితే బట్టలూడ తీసికుంటానందిట, అక్కడకి ఏదో అలాటివాళ్ళని చూడనట్టు ! పాపం మనవాళ్ళుకూడా నెగ్గేశారు… కానీ ఆవిడేమయిందో మాత్రం తెలియలేదు! అలాగే మన సినిమావాళ్ళూనూ, తిన్నతిండరక్క ఏదో చేస్తారు, ఇంక రాష్ట్రమంతా ధర్నాలూ,ఉపోషాలూ గట్రనూ, వీళ్ళందరూ మరి attention seekerసే ..

    అసలు ఈ సోదంతా ఎందుకుమొదలెట్టానంటే, ఈవేళ ప్రొద్దుటే రోడ్డుమీద వెళ్తున్నప్పుడు ఒకాయన ఎదురయ్యారు. ఆయన్ని రోజూ రెండు కుక్కలేసికుని తిప్పడం చూస్తూంటాను. వాటి దగ్గరకా నెను వెళ్ళనూ, మీదపడితే ! ఆయన చేతికి అదేదో sling అంటారే దానితో, ” అయ్యో పాపం ” అనుకుని, పరిచయం లేకపోయినా పలకరించి, ” మిమ్మల్ని ప్రతీ రోజూ ఆ కుక్కలతో చూస్తూంటానూ, కానీ నాకు కుక్కలంటే భయం వలన పలకరించలేదూ..etc.etc..” చెప్పాను.దానికాయన “అవి ఏమీ చెయ్యవూ.. చాలా obedient..” అంటూ ఏవేవో చెప్పారు. నిజమే ఆయనకి obedienటే కాదనం, కానీ వాటికి మనతో పరిచయం లేదుగా.. అనేసి, ఏమిటీ కథా అంటే చెప్పుకొచ్చారు ఆ accident ఎలా అయిందో వివరాలు.మేము మాట్టాడుతూంటే ఇంకోకాయనొచ్చి మళ్ళీ ఇదేప్రశ్న, మళ్ళీ మొదట్నుంచీ చెప్పుకొచ్చాడు. ఇంతట్లో ఇంకో పెద్దమనిషీ, మళ్ళీ ప్రారంభం..హాయిగా ఓ బోర్డెసికుంటే గొడవుండేది కాదు. కానీ ఇదంతా పాపం attention కోసంకాదు నిఝంగా జరిగింది.

    ఒక్కొక్కప్పుడు అవసరంలేని attention వస్తూంటుంది. నాకు జ్ఞానం వచ్చినప్పటినుంచీ మోకాల్నొప్పుంది. ఏదో లాగించేస్తున్నాను. దీనిధర్మమా అని సైకిలు కూడా నేర్చుకోలేదు. బస్సులూ, నడకానూ. దీనివలన ఎవరికీ హాని లేదు.అవేవో షూస్ వేసికోమంటే అవికూడా వేసికునే నా పాట్లేవో నేను పడుతున్నాను. చెప్పానుగా ప్రాణహానేమీలేదు. మొన్న నా అదృష్టం బాగోక పిల్లలొచ్చినప్పుడు, వాళ్ళకి బై చెబ్దామని మామూలు చెప్పులేసికుని వచ్చాను. అలాటప్పుడు కొద్దిగా అడుగు ఎత్తి వేయాల్సొస్తుంది, అదిగో అదే నాప్రాణం మీదకి తెచ్చింది. “మావయ్యగారూ ఓసారి orthopaedician ని కన్సల్ట్ చేద్దామూ అని మర్నాటి సాయంత్రానికల్లా, నన్ను లాక్కెళ్ళారు. అవేవో ఎక్స్ రేలూ అవీ తీసెసి, you must go for implant అనేశాడాయన.నాకు వద్దుమొర్రో అన్నా వినరే,ఆ డాక్టరు ” ఎన్నాళ్ళనుంచీ ఈ నొప్పీ..” అంటే పాతికేళ్ళన్నాను. పాతవేమైనా ఎక్స్ రేలున్నాయా అంటే లేవుపొమ్మన్నాను.అయినా వదలడే, ఫలానాదైతే రెండు లక్షలూ, ఫలానా ఇంపోర్టెడ్ ది అయితే మూడు లక్షలూ అంటూ ఏవేవో చెప్పేశారు. పిల్లల టెన్షను వాళ్ళదీ, రేపెప్పుడో మంచంపట్టవలసొస్తే వాళ్ళకే కదా పాట్లు. ఏదో ఓసారి వైద్యం చేయిస్తే బావుంటుందీ అని వాళ్ళ తాపత్రయం.అప్పుడే అయేదికాదనుకోండి, మా డాక్టరుగారు కూడా చెప్పాలి, అప్పుటిదాకా నా దారిన నేనుకాలక్షేపం చేస్తాను. ఇదిగో ఇలాటివి అవసరం లేని attentionలంటే…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– moments of happiness…

    మనిషన్న తరువాత జీవితంలో ప్రతీ రోజూ పైన పెట్టిన శీర్షిక లాటి క్షణాలుండవు. అలాగని రోజూ ఏడుస్తూనే ఉంటే కుదరదుగా దొరికినదాంట్లోనే ఆ “క్షణాలు” వెదుక్కోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలము.ఏమిటో చెప్తారూ, మీకేమీ పని లేదూ అన్నా అనొచ్చు, కానీ నేను జీవితంలో నేను అనుభవించే అలాటి moments of happiness, గురించి ఓకసారి మీతో పంచుకుందామనే ఈ టపా.అవి చాలా silly గా కనిపించొచ్చు. కానీ ఆలోచిస్తే అవును కదూ..అనిపించినా అనిపించొచ్చు. అది మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.

ఏదో లాటరీల్లోనో, వారానికి రెండురోజులు వచ్చే KBC లోనో కోట్లు సంపాదిస్తేనే గొప్పకాదు. సంతోషం ఉంటుంది కానీ ప్రతీవారికీ రాదుకదా, ఆ వచ్చినవాణ్ణి చూసి మనకీ వస్తే ఎంత బావుండునూ అనిపిస్తుంది. తీరా వస్తే, దానితోపాటు వచ్చే “కష్టాలు” చాలానే ఉంటాయి.మనకొచ్చిన డబ్బుగురించి ప్రపంచంలో ప్రతీవాడికీ తెలుస్తుంది.ఆ నెలరోజులూ వచ్చేpublicity చాలా బావుంటుంది. అక్కడితో ఆగదుకదా, ఎక్కడో ఎవడో మన లొకాలిటీలోనే ఉండే ఏ రౌడీ వెధవకో ఓ ఆలోచన వచ్చేస్తుంది- ఈ ప్రైజు వచ్చినవాడెవడో మన దగ్గరలోనే ఉన్నాడూ, వీడి దగ్గరనుండి కొంత లాగిస్తే బావుంటుందని, ఏదో ఒకరూపంలో extortion లోకి దిగుతాడు.పోనీ అవేమైనా ఎదుర్కునే ఓపికుందా అంటే అదీ ఉండదు.ఎందుకొచ్చిన ప్రైజురా భగవంతుడా అనుకుంటూ జుట్టుపీక్కోడం మిగులుతుంది.అలాగని ప్రైజు రాకూడదనడంలేదు, ఫుకట్ గా వచ్చే డబ్బు చేదా ఏమిటీ? ఊరికే ఉదాహరణకి చెప్పాను. మనకెలాగూ రాదూ గొడవే లేదూ…

మరి అలాగైతే ఇంక మనం ఈ so called moments of happiness ని అనుభవించడం ఎలాగా మరీ? అదిగో అక్కడకే వస్తున్నాను. ప్రొద్దుటే నిద్ర లేవగానే అనిపిస్తుంది, ఈవేళ ఎలా ఉంటుందో అని.ప్రొద్దుటే లేచి బాల్కనీలో కూర్చున్నప్పుడు ఇంటావిడ కాఫీ చేసి ఇస్తే అందులో సంతోషం చూడొచ్చు.. అంటే ప్రతీ రోజూ ఇవ్వదా అని కాదు, అలాగని మనం ప్రతీరోజూ దానిలోని సంతోషాన్ని గుర్తించడం లేదుగా, ఏదో routine గా ఇస్తోంది కానీ, ఇందులో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవలిసినదేముందీ అనుకోకూడదు. ప్రతీరోజూ మనం స్నానం చేసి ఆ తడితువ్వాలేదో మనమే పిడుచుకుని ఆరేసికుంటాము. కానీ సడెన్ గా ఇంటావిడ, ఆ తువ్వాలేదో బకెట్టులోనే వదిలేయండీ అందనుకోండి…నిన్ననే మా ఇంటావిడ ఓ టపాకూడా వ్రాసేసింది.

బ్రేక్ ఫాస్టు కి ప్రతీ రోజూ తినే చపాతీలో, ఇడ్లీలో కి బదులు ఇంకోటేదో చేసిందనుకోండి అది సంతోషదాయకం కదా మరి? నాలాటివాడికి ప్రతీరోజూ బయటకి వెళ్ళకుండా ఉండలేడు. బస్సు పట్టుకుందామని వెళ్తూంటే, మనం వెళ్ళేలోపలే ఆ బస్సు మనల్ని దాటిపోతూంటే అయ్యో అనుకుంటూంటే, ఆ బస్సు డ్రైవరు బస్సుని కొద్దిగా ఆపి మనల్ని ఎక్కించుకుంటే,ఎంత బావుంటుందో.. ఆ డ్రైవరుకి ఆ అవసరం లేదు అయినా ఆ క్షణంలో ఏమనుకున్నాడో ఏమో బస్సు ఆపి మనల్నెక్కించుకున్నాడు. కాకపోతే ఇంకో బస్సొచ్చేదాకా ఎండలో ఆగాలి.మరి అలాటిది moment of happiness లోకి రాదు మరీ?

నిన్నఓ బ్లాగులో ఒకాయన వ్రాశిన వ్యాసం చదివాను. ఆయనకూడా పూనా లోనే ఉద్యోగంలో చేరారుట అరవైల్లో, ఆయన ఎడ్రసు తెలియచేయమని ఓ వ్యాఖ్య పెట్టాను. ఆ బ్లాగు ఓనరు గారు వెంటనే స్పందించి, ఆ వ్యాసం వ్రాసినాయన వివరాలు పంపారు,వెంటనే అయనకి ఫోను చేసి, పరిచయం చేసికుని మా “పాతరోజులు” గుర్తుచేసికుని, ఆరోజుల్లో మా ఫ్రెండ్సందరినీ పేరుపేరునా గుర్తుతెచ్చుకున్నాము. ఎక్కడెక్కడ ఎవరెవరుంటున్నారో తెలియని ఈ రోజుల్లో ఏదో యాభై ఏళ్ళ క్రితం మన స్నేహితుల్ని గుర్తుకు తెచ్చుకున్నామంటే అంతకంటే సంతోషమేముంటుందీ? వివరాలు తెలపవలసిన అవసరం కానీ అగత్యంకానీ ఆ బ్లాగు ఓనర్ గారికి లేదు, అయినా ఆ క్షణం లో అనిపించిందేమో, పంపారు. అదీ moment of happiness అంటే !

రోడ్డుమీదనుంచి వెళ్తూంటే ఎవరో ఆపి ఫలానా చోటుకి దారెటూ అని అడిగితే, మనం వారికి ఆ సమాచారం ఇవ్వకలిగితే ఎంత బావుంటుందో కదూ. రోడ్డుమీద ఎంతోమంది వెళ్తూంటారు, అయినా అతని దృష్టి కి మనమే కనిపించాము, అతనికి తెలియనిదానిని గురించి చెప్పకలిగాము.ఏదో పేద్ద ఘనకార్యం చేసేశామని కాదు.. just…

అలాగే కొంపకు చేరుతూంటే రోడ్డు పక్కన ఓ బండిలో నవనవలాడుతూన్న ఏ మెంతికూరో కనిపించిందనుకోండి, మామూలుగా కట్ట పదిరూపాయలకి దొరికేది, ఆ బండివాడు అయిదు రూపాయలంటే సంతోషం కాదూ. ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో అర్ధణాకి వచ్చేది ఇప్పుడు అయిదు రుపాయలా బాబోయ్ అనుకోకుండా, పదిరూపాయలది సగానికి సగం అయిదురూపాయలకే రావడం ఓ moment of happines అంటాను. మొదట్లోనే చెప్పానుగా మనం చూసే దృష్టికోణం లో ఉంటుంది.భోజనంలో నిమ్మకాయపెట్టి అరటికాయ కూర చూసేటప్పటికి సంతోషం

ఇలా ప్రతీరోజూ మనం చూసేవాటిల్లోకూడా మనం ఆనందాన్ని అనుభవించగలిగితే హాయిగా ఉండొచ్చు. అసలు మనం ఇంటికి రాగానే మనమొహం చూస్తేనే అర్ధం అయిపోతుంది ఇంటావిడకి.. ఏమిటీ మంచి ఉషారుగా ఉన్నారూ అంటుంది. అలా కాకుండా ప్రతీదానికీ మొహం ముటముటలాడిస్తూంటే మనకీ సుఖం ఉండదూ, చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం ఉండదూ.

ఏదో ఏ ఆదివారంనాడో మనణ్ణీ మనవరాలునీ చూడడానికి వెళ్ళలేకపోయినప్పుడు సడెన్ గా ఆరోజు మధ్యాన్న్నం “తాతయ్యా.. నానమ్మా.. ” అంటూ అరిచే అరుపుల్లో ఎంత సంతోషముంటుందీ? అలాగని ప్రతీరోజూ కలవలేకపోతున్నామే అని బాధపడేకంటే, దొరికిన మధురక్షణాల్ని ఆస్వాదించడంలోనే సంతోషమెక్కువుంటుంది. వాళ్ళు ఊరికే ఏమీ కూర్చోరు, ఇల్లంతా నానా హడావిడీ చేస్తారు అలాగని వాళ్ళు రాకూడదూ అనుకుంటామా? వాళ్ళు రావాలీ, నానమ్మ ముద్దుముద్దుగా విసుక్కోవాలీ, ఓ రెండు మూడు గంటలుండి వెళ్ళినతరువాత మళ్ళీ ఈసురోమంటూ అన్నీ సద్దుకోవాలీ, కానీ వాళ్ళని చూసి recharge అయిన మన బ్యాటరీలు ఎంత సంతోషంగా ఉంటాయీ? అదన్నమాట నేను చెప్పేది, చిన్న చిన్న విషయాల్లో మనం ఆ moments of happiness వెదికి టుపుక్కున పట్టేసికోవాలి !

అంతదాకా ఎందుకూ ఆ మధ్యన నేను వ్రాసిన ఒకటిరెండు టపాలమీద, నాకూ ఓ reader కీ కొద్దిగా అభిప్రాయ బేధం వచ్చింది.యాదృఛ్ఛికంగా నా టపాలమీద మళ్ళీ వ్యాఖ్యలు పెట్టలేదు, కోపం వచ్చిందేమో అనుకున్నాను. కానీ గత రెండుమూడు రోజుల్లోనూ మళ్ళీ పునర్దర్శనం అయ్యేసరికి సంతోషమనిపించింది…పైగా ఎప్పుడో నేను వ్రాసిన ఓ టపామీద కూడా,ఓ పరిశీలనాత్మక వ్యాఖ్య పెట్టారు. Thats what I call a ‘moment of happiness

మీగొడవేదో మీరుపడండీ, మాకు ఇలాటివాటిల్లో ఆ “క్షణాలు” ఆస్వాదించే ఓపికా, సహనం లేదంటారా మీ ఇష్టం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఏవేవో పేర్లు పెట్టేశారు revenge అన్నారు, ఇంకో సింగినాదం అన్నారు. ఏదో గప్ చుఫ్ గా ఆడేసి ఆ తరవాతేదో పేరెట్టొచ్చుకదా, మళ్ళీ pitch లు మాకు కావలిసినట్టుగానే తయారు చేసుకుంటామన్నారు. ప్రతీవాడూ నోరు పారేసికున్నాడు. చివరకేమయిందీ తుస్సుమంది…ఏమిటో నాకు zeal ఎక్కువా, నాకు తోచినప్పుడే రిటైరవుతానంటాడు ఒకాయన, అదృష్టం బావుండి, ఆ పుజారా ఎవరో, ఇంకా కొత్తగా నాజూగ్గా ఉండబట్టి సరిపోయింది లేకపోతే….వచ్చే టెస్టుదాకా ఇంక వీటిమీదే చర్చలు.. అప్పుడు కూడా ఏదో “పొడిచేస్తారని” కాదు, గేమ్ముని గేమ్ములా కాక, ” మాతాతలు నేతులుతాగారూ..” అంటూ ఏదో సామెత చెప్పినట్టుగా ఎందుకండీ? 28 సంవత్సరాలపాటు అజేయంగా ఉన్న మన హాకీ జట్టూ ఇలాగే తయారయింది. చివరకి మన జట్టుకి విదేశీ కోచ్చిలు తెచ్చుకోవలిసిన దుర్గతి పట్టింది ! స్పిన్ను స్పిన్ను అన్నారు, చివరకి భారతీయ సంతతికే చెందిన పనేసార్ మనవాళ్ళనందరినీ చంకనెట్టుకు పోయాడు ! ఏదో ఈ టెస్టు ఓడిపోయారని కాదు, ఎప్పుడూ ఇదే గొడవా? ఆ పుజారాయో ఎవరో అతన్నైనా సరీగ్గా ఆడనిస్తారని అనుకోను, ద్రవిడ్ తరువాత ఇతనే అని అప్పుడే మొదలెట్టేశారు.మిగిలిన వారిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఇదివరకటి రోజుల్లో ఎం.ఎల్.జయసింహ అని మనవాడే ఒకాయనుండేవాడు, ఎప్పుడైనా టీం లోంచి తీసేస్తారేమో అని భయం వేసినప్పుడల్లా ఓ సెంచరీ కొట్టేసేవాడు మళ్ళీ ఓ పది టెస్టులు సరీగ్గా స్కోరుచేయకపోయినా గొడవుండేది కాదు! అలాగే పేపర్లవాళ్ళూ, మీడియావాళ్ళూ గోలెట్టడం ప్రారంభిస్తారో ఓ పాతికో, పరకో కొట్టేస్తే చాలు జీవితసాఫల్య ఎవార్డుకి అర్హుడైపొతాడు ! Thats cricket for us !! రేపెప్పుడో నెగ్గినా నెగ్గొచ్చు.. అదిగో చెప్పలేదూ.. అంటారు !!

    ప్రపంచతెలుగుమహాసభలుట వచ్చేనెలలో జరుపుతారుట. మనరాజకీయపార్టీలు ఒకళ్ళమీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటున్నారప్పుడే. నిన్న ఓ మరాఠీ చానెల్ లో మూడుగంటలపాటు ఓ కార్యక్రమం చూశాము. విషయం ఏమిటా అంటే మహరాష్ట్ర రాజ్య పురస్కార్ అని 49 వ వార్షికోత్సవం సినిమాలకి బహుమతి ప్రదానం అవీనూ. నమ్మండి నమ్మకపొండి, మూడు గంటల్లోనూ ఒక్కటంటే ఒకే ఇంగ్లీషు మాట విన్నాను. అదికూడా సినిమాల్లోని rerecording విభాగంలో బహుమతి ఇచ్చినప్పుడు. అప్పుడుకూడా ప్రయత్నించి మొత్తానికి మరాఠీలో చెప్పాడు. వాళ్ళెవరో మాతృభాష కి పట్టం కట్టేస్తున్నారో అని చెప్పడానికి కాదు చెప్పేది, ప్రయత్నిస్తే మనవాళ్ళూ చేయగలరు. అలా చేయగల ఉద్దండులూ ఉన్నారు మనవాళ్ళలోనూ, కానీ జరుగుతున్నదేమిటయ్యా అంటే, నిన్న అదేదో దిక్కుమాలిన కార్యక్రమం “మా” టీవీలో చూశాము ఖర్మకాలి, అదేదో “డుబాయి” లో జరిగిందిట. చూస్తూంటే వెగటేసింది.

   దీనికి విరుధ్ధంగా మేము చూసిన మరాఠీ కార్యక్రమంలో మరాఠీ జానపద నృత్యం లావణీ లో నటీమణులు తొమ్మిదిగజాల చీరలో కూడా ఎంత అద్భుతంగా నృత్యం చేశారో? మనవాళ్ళేమో ఒంటిమీద బట్టుంటే తప్పేమో అన్నట్టుంటారు. ఇంక పాటల విషయంలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిదేమో. ఓ అర్ధం పర్ధముండదు. ఊరికే కుయ్యో మొర్రో ఒకటే వినిపిస్తుంది.ఇంక కథ అంటారా, అసలంటూ ఉంటేకదా? ఈమాత్రందానికి గోవాలో జరిగే పిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించే భారతీయ చిత్రాల్లో ఏ ఒక తెలుగు సినిమాకూడా లేదని ఏడవడం ఎందుకో తెలియదు.అన్నిటిలోకీ ముఖ్యమైన విషయం– కార్యక్రమం జరిగిన మూడుగంటలూ ముఖ్యమంత్రి చవాన్ ఉండడం. మన మంత్రులకి ఎక్కళ్ళేని పనులూనూ, ఏదో తూతూమంత్రంగా రావడం, మాట్టాడమంటే ఏవేవో ప్రసంగాలు చేయడం. ఈ కార్యక్రమంలో రెండంటే రెండే నిమిషాలు మాట్టాడారు.

   మనవాళ్ళకంటే మిగిలినవాళ్ళంటేనే ఇష్టం అనిమాత్రం అనొద్దు. రోగమేమిటీ, మనవాళ్ళూ అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు చేస్త్తూంటారు. కానీ చాలా తక్కువగా !

    ఇంక సంగీత కార్యక్రమాల పేరుతో వస్తూన్న కొన్ని”మా” టీవీ లో అదేదో “సూపర్ సింగర్సు”ట, అసలెందుకు చేస్తున్నారో అర్ధం అయి చావదు.జీ టీవీలో సరిగమప అని ఓ హిందీ కార్యక్రమం చూడండి. తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళూ పాడే విధానం, పాడే పాటలు, అన్ని జానెర్సు లోనూ.అన్నిటిలోకీ ముఖ్యం ఆ కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు, ఒక్కోవారం ఒక్కో పిల్లో, పిల్లాడో నిష్క్రమిస్తూంటే బాధేస్తుంది. అయ్యో ఇంతబాగా పాడేడూ పాపం అనిపిస్తుంది.అలా ఉండాలి కానీ, చూసినమొహాలే చూడ్డం, ఆయనెవరో నేర్పించిన ఆ వందపాటలే వినడం ఇంకా ఈ హింస ఎన్నాళ్ళు భరించాలో?

    మొత్తానికి కేజ్రీవాల్ గారు పార్టీ పేరు చెప్పేశారు. ఎంతవరకూ “ఆంఆద్మీ” కి ఉపయోగిస్తుందో చూడాలి. మన పార్లమెంటు as usual.. గా వాయిదాలమీద వాయిదాలు 2014 దాకా ఇలాగే లాగించేస్తారు. ఎవరికొంపా మునగదు. మహా అయితే మనకొంపలే కొట్టుకుపోతాయి. ఎలాగూ మనం dispensable category లోకే వస్తాము…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేనికైనా “బడా దిల్” అనేదుండాలి….

   ప్రతీదీ commercial దృష్టి తోనే చూసే ఈ రోజుల్లో అక్కడక్కడ, “బడా దిల్” ఉన్నవాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషమనిపిస్తుంది. వారి ఉద్దేశ్యమల్లా అవతలివారికి ఉపకారం చేయడమే. ఆ ఉపకారం మనకి ఉపయోగించేదయుండొచ్చు, మనసుకి ఆహ్లాదం కలిగించేదయుండవచ్చు. ఏదైనా సరే ఆ positive streak అనేదుంటుందే దాన్నే నేను “బడా దిల్” అంటాను. తెలుగులో విశాలహృదయం అనొచ్చేమో, కానీ మన రాష్ట్రభాష హిందీలోనే వ్యక్తపరచాను. మాతృభాష లో చెప్పనందుకు క్షమించండి. నా ఉద్దేశ్యం అర్ధం అయితే చాలు…

    మొన్నెప్పుడో మా ఇంటావిడ మధ్యాన్నం పాలు తోడు పెట్టింది, కానీ నేను చూసినప్పుడు తోడుకోలేదు. సరే దగ్గరలో ఉన్న మిఠాయి దుకాణంలో ఏ అమూల్ దో, నెస్లేదో దొరికితే తీసికుందామని అక్కడకి వెళ్ళి అడిగితే, సీల్ వేసిన బ్రాండెడ్ పెరుగు దొరకదూ, లూజుగా ఉండేదే తనదగ్గర ఉందీ అని చెప్పాడు. కాదూ, మాకు బ్రాండెడ్ దే కావాలీ అంటే, మాములుగా అయితే, అంటే నూటికి తొంభై దుకాణాలవాళ్ళు, తమ బేరం పొగొట్టుకోడం ఇష్టం లేక, అంత అవసరం అయితే మనదగ్గరే తీసికుంటాడులే అనుకుని, మనం దగ్గరలో ఇంకెక్కడైనా దొరుకుతుందా అని అడిగితే, “నాకు తెలియదు ఫో..” అంటూంటారు. నేను నిజంగా అదే expect చేశాను. కానీ, దానికి విరుధ్ధంగా, ఆ కొట్టతను, ఇదే వరసలో నాలుగోది, బేకరీ, అందులో చూడమన్నాడు.
అలాగే వెళ్ళి చూస్తే అక్కడ మాక్కావలిసినది దొరికింది. తిరిగి వచ్చేటప్పుడు, ఆ ముందరి కొట్టతనికి థాంక్స్ చెబుదామని చూస్తే, అక్కడ ఎవరో ఆడావిడ కూర్చున్నారు, వచ్చేశాను.మర్నాడు బస్ స్టాప్ కి వెళ్తూంటే అతను కనిపిస్తే వెళ్ళి థాంక్స్ చెప్పాను.

    మీరనుకోవచ్చు, ఇందులో పెద్ద విశేషమేముందీ, ఆ రెండు కొట్లూ అతనివే అయుండొచ్చూ అని, అదే సందేహం అతనితో అడిగితే నవ్వి అన్నాడూ ” క్యా సాబ్ ఎహీ తో ప్రోబ్లెం హై ..బోలాతో గల్తీ, నయ్ బోలాతోభీ గల్తీ..” అర్ధం అయిందనుకుంటాను- ” చెప్తే ఓ సమస్యా, చెప్పకపోతే ఇంకో సమస్యా..” అని !నిజమే కదూ ఎవరైనా out of the way సహాయం చేస్తే ముందుగా అతన్ని సందేహిస్తాము. మానవనైజం. కట్నం వద్దని ఎవరైనా పెళ్ళికొడుకన్నాడంటే వాడిలో ఏదో లోపం ఉందీ అనుకునే రోజులాయె ఇవి! అతనితో అన్నాను- “ఊరికే సరదాగా అన్నానూ, ఇలా తనకొట్లో సరుకు కొననివాడికి, వీళ్ళకు కావలిసిన కొట్టు వివరాలు చెప్పే “బడా దిల్” అందరికీ ఉండదూ, నాకు తెలిసినవారిలో మీరే మొదటివారూ.. ” అని. అతనన్నాడూ, ” ఇలా థాంక్స్ చెప్పే మొదటివారూ మీరే..” అని !

    అలాగే ఈవేళ మా మనవడు వచ్చినప్పుడు తినే ” రాజ్ గీరా లడ్డూలు” అయిపోయాయంటే, కూరలు తీసుకోడానికి బజారుకెళ్ళినప్పుడు, నాలుగైదు కొట్లలో లేకపోవడంతో చివరగా ఓ కొట్టుకి వెళ్ళి, అక్కడా లేకపోతే అక్కడా ఇదే అనుభవము- ఏ కొట్లో దొరుకుతాయో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. సీన్ రిపీట్...

    తెలుగు పేపర్లు కొనుక్కుని కొంపకి చేరాను. నెట్ లో అన్ని తెలుగు పేపర్లూ (ఇక్కడ దొరకనివి) చదివే అలవాటోటుందని ఇదివరలోనే విన్నవించుకున్నాను. ఆ సందర్భంలో “సాక్షి” తూ.గో.జి ఎడిషన్ చదువుతూంటే ఓ వార్త ఆకర్షించింది. రాజమండ్రీ లో ఓ పుస్తకాల కొట్టుందిట. అక్కడ ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలే దొరుకుతాయి, గొల్లపూడి వీరాస్వామి లాటిదన్నమాట. మేము రాజమండ్రీలో ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం లేదనుకోండి. Mohan Publications అని ఆ కొట్టు పేరు. వివిధ రకాల ఆధ్యాత్మిక పుస్తకాలూ ప్రచురించి, అమ్మడం వీరి వ్యాపకం. SO ఈ సందర్భంలో వీరి కొట్టు పేరు ఎందుకు చెప్పాల్సొచ్చిందీ అని అడగొచ్చు, అదిగో అక్కడికే వస్తున్నాను.వీరు క్రయవిక్రయాలే కాకుండా, వారి సైట్ www.mohanpublications.com లో ఎన్నెన్నో ఉపయోగించే తెలుగు పుస్తకాలు pdf చేసి పెట్టారు. నిజంగా అంత అవసరముందంటారా? వారిదగ్గర దొరికే పుస్తకాల జాబితా, వాటి ఖరీదులూ ఎలాగూ పెట్టారు. కావలిసినవాళ్ళు తెప్పించుకుంటారు, లేదా మానేస్తారు. కానీ ఇంత గొప్పమనసుతో తెలుగువారికి ఉపయోగపడేలా నెట్ లో పెట్టారే అందుకే వారిని “బడా దిల్” క్యాటిగరీలో చేర్చాను. ఓసారి చూడండి ఆ లింకు, అందులో దొరికే కొన్ని ఆసక్తికరమైన పుస్తకాలూ…

    అన్నిటిలోకీ “బడా….. దిల్....” మన బ్రహ్మశ్రీ చాగంటివారి సైటు ఉండనే ఉంది. ఆ సైటుకి పోలికగా ఇంకోటుందనుకోను. ఈ సైటే లేకపోతే ఎలాఉండేదో ఊహించడానికే కుదరడం లేదు. వారి ప్రవచనాలు ప్రత్యక్షంగా వినే అదృష్టం లేని మాలాటివారికి ఇదో వరం. మాగంటి వారిదైతే సరేసరి. చెప్పఖ్ఖర్లేదు ఏక్ దం సూపర్.. ఇదివరకెప్పుడో తెలుగు థీసిస్ అని ఓ సైటుండేది. ఏమొచ్చిందో ఏమో ఎత్తేశారు. దానిలో కొన్ని అద్భుతమైన పుస్తకాలుండేవి.

    ప్రతీవారికీ ఉండమంటే ఉంటుందా మరి ఇలాటి “బడా దిల్లూ..”? వార్తాపత్రికల సంగతి వదిలేయండి, అన్నిభాషల పేపర్లూ చదివేసికోవచ్చు. కానీ Weekly ల విషయం వచ్చేటప్పటికి మనవాళ్ళు ఒక్క ” నవ్య” తప్పించి, మిగిలిన అందరూ కంజ్యూసే!! పోనీ ఓ వారం తరువాతైనా వాటిని నెట్ లో పెట్టొచ్చుగా అబ్బే, కావలిస్తే కొనుక్కోండి,లేదా మీఖర్మ.. అనే attitude.మళ్ళీ ఇంగ్లీషులో అలా కాదు, ప్రతీదీ నెట్ లో చదువుకోవచ్చు. తెలుగు లో విషయసూచిక ఇచ్చేసి వదిలేస్తారు.. ఎప్పుడు వీళ్ళకీ ఆ “బడా దిల్ ” వస్తుందో కానీ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మొహమ్మాటాలూ, చొరవా…

    ఈ టపాకి పెట్టిన శీర్షిక ఒకదానికొకటి విరుధ్ధంగా ఉంది కదూ !! ఎందుకంటే మొహమ్మాటం ఉన్నవారికి చొరవనేది ఎన్ని జన్మలెత్తినా ఉండదు. ఇంక ప్రతీదానిలోనూ చొరవ తీసికునేవారికి ఈ మొహమ్మాటమనేది ఏ కోశానా ఉండదు…కొంతమందిని చూస్తూంటాము, పాపం ప్రతీదానిలోనూ మొహమ్మాటమే, అడిగితే బావుండదేమో, ఏమైనా అనుకుంటారేమో, మరీ వెకిలిగా ఉన్నామనుకుంటారేమో…అంటూ ఎప్పుడూ back foot మీదే.ప్రపంచం తన దారిన తను పరిగెత్తేస్తూంటుంది, ఎక్కడ గొంగళీ అక్కడే అన్నట్టుగా, ఈ పెద్దమనిషి అలా చూస్తూంటాడు. అదృష్టం బావుండి ఇతని life partner కొద్దిగా, మొహమ్మాటం లేనిదైతే ఫరవాలేదు, అలా కాకుండా తనూ అదే కోవకి చెందినదైతే దొందుకుదొందే అన్నట్టు,everybody takes them for a ride.. అందుకేనేమో భగవంతుడు కూడా అలాటి అగత్యం లేకుండగా, ఇద్దరు విభిన్న మనస్థత్వవాల వారిని కలుపుతూంటాడు..బహుశా అదే కారణం అయుంటుంది ఇంకా ఈ భూమిమీద జనాలు బతుకుతున్నారు !!

ఈ “మొహమ్మాటాల” శాల్తీలకి ఈ గుణం పుట్టుకనుండీ వస్తుంది. చిన్నప్పటినుండీ పెరిగిన వాతావరణమో కారణం అయుండొచ్చు.ఆవ్యక్తి ఆడా, మగా అని తేడా ఉండదు. ఇంటినిండా గంపెడు పిల్లలుండే కుటుంబంలోంచి వచ్చారనుకోండి,ఎప్పుడైనా ఏదైనా కావలిసొచ్చినా తల్లితండ్రులని అడగడానికి మొహమ్మాటం, ఊరికే అడిగి పాపం వాళ్ళని బాధపెట్టడం ఎందుకులే అనో, పోనిద్దూ తన చెల్లెలికో, తమ్ముడికో ఉంటుందిలే అనుకుని అడక్కపోవడమో, కారణం ఏదైతేనేం, ఈ “మొహమ్మాటం” అనేది నరనరానా ఓ virus లాగ పాకిపోతుంది.పైగా ఓ “అంటువ్యాధి” లాగ మిగిలినవారికి కూడా పాకుతుంది.దానితో ఏమౌతుందంటే, దాంపత్యజీవితం ప్రారంభించిన తరువాత పుట్టిన ఒకరిద్దరు పిల్లలలో ఒకళ్ళు మాత్రం guarantee గా వంశపారంపర్యంగా వచ్చిన మొహమ్మాటానికి flag bearers గా కొనసాగుతారు. మరి ఇవి పొమ్మంటే ఎక్కడకిపోతాయి?

పైగా ప్రతీదానికీ ఇలాటి “మొహమ్మాటాల” బక్రాలు ఉండకపోతే, ఆ రెండో category వాళ్ళ మనుగడ సాగేదెట్లా? ముందుగా ఈ back footed వాళ్ళని చూద్దాము.దేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక సందర్భంలో క్యూల్లో నుంచోవలసివచ్చే పరిస్థితి చూస్తూంటాము. ప్రతీదానికీ క్యూలే. బ్యాంకుల్లో, రైలు రిజర్వేషన్లు, స్కూళ్ళలో పిల్లల ఎప్లికేషన్లు తెచ్చికోడం, ఏదో రేషన్ షాపుల్లో ఈమధ్యన “ఆంఆద్మీ” లకి కిరసనాయిలూ, పంచదారా, బియ్యం ఇవ్వడం మానేశారుకాబట్టి ఫరవాలేదు కానీ, లేకపోతే అక్కడా, మరీ ఇళ్ళబయటకి వెళ్ళి ఓ బకెట్టో, బిందో పట్టుకుని వీధి కుళాయిలదగ్గర నుంచోవలసిన పరిస్థితి లేదు కాబట్టికానీ, లేకపోతే అక్కడా, అన్నిటిలోకీ అర్జెంటుగా అవసరం వచ్చి ఏ sulabh దగ్గరైనా నుంచోవలసివచ్చినా ఇదిగో పాపం మొహమ్మాటం పక్షులు బలైపోతూంటారు.

ఎక్కడికైనా వెళ్ళాలని ఏ బస్సుకోసమో, లోకల్ ట్రైనుకోసమో చూస్తూంటారనుకోండి, ఆ బస్సో ట్రైనో వచ్చీరాగానే ఎక్కుతాడా, అబ్బే ఛస్తే అలా చేయడు.పాపం అవతలివాడికి అర్జెంటేమో అనేసికుని, మిగిలినవాళ్ళు ఎక్కేదాకా చూస్తూండడం, ఇంతలో ఆ బస్సో ట్రైనో వెళ్ళిపోవడం. మరి ఇక్కడ మన “ మర్యాదరామన్న” ఉన్నట్టు ఆ బస్సుకీ, ట్రైనుకీ తెలియదుగా! ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళింట్లో ఇచ్చే చాయ్ లోనో, కాఫీలోనో పంచదార తక్కువైనా, అడగడానికి మొహమ్మాటం, అడిగితే ఏమైనా అనుకుంటారేమో.చివరకి అర్జెంటుగా అవసరం వచ్చినా, wash room ఎక్కడుందో అడగడానికి కూడా మొహమ్మాటమే, బావుండదేమో.. అనుకోడం.బస్సుల్లో ఏదో సీటు ఖాళీగా ఉన్నా సరే ఆ రాడ్డు పట్టుకుని వేళ్ళాడడంలోనే అత్యంత ఆనందం అనుభవిస్తాడు.చివరకి ఏ mall లోకో వెళ్ళినప్పుడు cash counter దగ్గర ఏ ప్రబుధ్ధుడో అడగ్గానే వాణ్ణి ముందరకి తోయడం. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా తనలో తను “రమిస్తూ” ఉంటాడు.

చిన్నప్పుడు అమ్మచేత “ పాపం అమాయకుడండీ నోట్లో నాలుకే లేదూ.. రేపు ఎలా బతుకుతాడో..” అనీ, పెళ్ళయిన తరువాత, “ మావారు నోట్లో వేలెట్టినా కొరకేలేరండీ...” అని భార్యచేత చెప్పించికోడంలోనే సంతోషమేమో. అయినా ఎవరి ఆనందం వాళ్ళదీ. ఇలాటివారిని చూసినప్పుడు జాలిలాటిది వేస్తూంటుంది. ఏమో ఇదివరకటి రోజుల్లో ఇలాటి సద్గుణాలకి ఓ recognition ఉండేదేమో కానీ, ఈరోజుల్లో ఇలాటి గుణాలని exploit చేసేవారే ఎక్కువ.

ఇంక ఈ రెండో టైపు వాళ్ళు- అంటే ప్రతీదాంట్లోనూ చొరవ చూపించేవాళ్ళు, వీళ్ళకి ఎక్కడికెళ్ళినా ఢోకా లేదు.ఎక్కడికెళ్ళనీయండి తన పని అయిపోవాలి, అవతలివాడు ఏ గంగలోనైనా దూకనీయండి.ప్రతీ విషయంలోనూ చొరవే, ఒక్కొక్కప్పుడు అవతలివారికి embarrassing గా కనిపించినా సరే. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో టివీ రిమోట్ ని చేతిలో తీసేసికోడమూ, వీడిక్కావలసినదేదో పెట్టేసికోడం.ఆ ఇంట్లో పిల్లల్ని ఓ పధ్ధతిలో పెంచుతూంటాడు ఆ ఇంటాయనో, ఇంటావిడో, అడక్కుండా చానెళ్ళు మార్చే అలవాటుండదు, అలాటిది ఈ పెద్దమనిషెవడో వచ్చి చేతిలోది లాగేసికోవడంతో ఆ పిల్లలకి కూడా ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఆ పెద్దమనిషి వెళ్ళినతరువాత, తండ్రినో, తల్లినో నిలేస్తారుకూడానూ, ” మమ్మల్ని కోప్పడతారూ.. మరి ఆయన అలా చేసినప్పుడు ఊరుకున్నారే..” అంటూ. Ofcourse,ఇవన్నీ టీవీలు కొత్తగా వచ్చిన రోజుల్లోవి, ఇలాటివి ఈరోజుల్లో మరీ ఎక్కువ కనబడవులెండి, ఎవరి గదిలో వారికి విడిగా టీవీ లున్న రోజులాయె.ఊరికే ఉదాహరణకి చెప్పాను.

ఏదైనా అర్జెంటవసరం వచ్చిందనుకోండి, మొహమ్మాటం లేకుండా, మీఇంట్లో wash basin ఎక్కడుందండీ అని లౌక్యంగా అడిగేయడం, ఎలాగూ దానిపక్కనే ఆ రెండోది కూడా ఉంటుందీ, మన పని చేసెసికుని రావొచ్చూ.ఇంక బయటకి ఎక్కడకి వెళ్ళినా క్షణాల్లో పనిపూర్తిచేసికొచ్చే ఘనత ఎలాగూ ఉంది.జేబులో, పెన్నూ కాగితమూ లేకపోయినా సరే, ఆ అడిగినవాడిదగ్గరే ఆ రెండూ పుచ్చుకుని, వీలునిబట్టి వాడిచేతే ఆ ఎప్లికేషనేదో వ్రాయించేసి ఓ సంతకం ఏదో పేద్ద oblige చేస్తున్నట్టుగా పోజుపెట్టేయకలడు.

ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ముందుగా వాళ్ళతో ఓ చుట్టరికం కలిపేయడం.ఇది ఆడవారిలోనూ, మగవారిలోనూ ఓ “చొరవ ప్రాణు” లలో చూస్తూంటాము. పెద్దాళ్ళైతే పిన్నిగారూ, అవతలివారింట్లో ఆడావిడని మరీ అక్కయ్యగారూ అనలేక( అక్కడికేదో ఈవిడ వయస్సులో తక్కువైనట్టు) వదినగారూ అనేస్తే ఓ గొడవుండదు.పని కానిచ్చేసికోడం.

ఇలాటివాళ్ళకి చిన్నప్పటినుంచీ ఈ అలవాటు ఉంటుంది, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటివారి పిల్లాడి ఆటబొమ్మలు హడఫ్ చేయడంతోటే వీడి చొరవా ( వీడి తల్లితండ్రుల ఉద్దేశ్యంలో!), భవిష్యత్తులో వీడు ఎంత వృధ్ధి లోకి వస్తాడో, చొరవతో జీవితంలో ఎంతలా దూసుకుపోతాడో అన్నీ సినిమారీళ్ళలాగ కనిపిస్తాయి !

చొరవ అనేది ఉండాలి, కాదనము. కానీ దానివలన ఆ మొహమ్మాట పక్షికి నష్టం రానంతవరకూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– operation deletion….

    ఏమిటో మొన్నెప్పుడో సావకాశంగా కూర్చుని చూస్తూంటే, నా సెల్లు నిండా ఎవరెవరివో నెంబర్లున్నాయి. ఓ దుర్గుణం ఉందిగా, ఎవరైనా కనిపిస్తే ఏదో రోజూ ఫోను చేసేవాళ్ళలాగ, వారి ఫోన్ నెంబరు అడగడం.పోనీ ఆమాత్రం పరిచయం ఉన్నందుకు అవతలివారో, లేదా ఆ నెంబరు నోట్ చేసికున్న పాపానికి మనమైనా ఫోను చేస్తామా అంటే అదీ లేదూ.ఎందుకొచ్చిన గొడవలు చెప్పండి హాయిగా ఎవరి దారిన వారిని ఉండనీయక?

    పైగా సెల్లులో ఇలా నెంబర్లన్నీ నోట్ చేసికుంటే ఇంకో గొడవుంది.రేపెప్పుడో మనం పోయినప్పుడు, పిల్లలకి ఎవరెవరెవరికి తెలియపరచాలో తెలియక ఇరుకులో పడతారు.అలాగని అందులో ఉండే నెంబర్లన్నిటికీ తెలియపరచలేరుగా. మనకి దగ్గరవాళ్ళెవరో వాళ్ళకీ తెలియదు.అయినా మనం చేసే ఘనకార్యాలన్నీ పిల్లలతో ఎక్కడ చెబుతాము కనుక? అసలు మన చుట్టాలెవరో కూడా తెలియని ఈరోజుల్లో మనస్నేహితులెవరో తెలిసే అవకాశం ఎక్కడ? దీనికి పిల్లల్ననీ లాభంలేదనుకోండి, మనం చేసే నిర్వాకం ఏమిటి? ఇదివరకటి రోజుల్లో మన బంధువులెవరో తెలిసే సందర్భాలుండేవి, రాకపోకల కారణంగా, ఇప్పుడు అలాటివన్నీ అటకెక్కేశాయి.

    ఆమధ్యన మా ఫ్రెండొకాయన భార్య స్వర్గస్థురాలైతే చూడ్డానికి వెళ్ళాము. ఆయనతో మాట్టాడుతూంటే, మధ్యమధ్యలో వారి కూతురు రావడం అడగడం–” అప్పా.. ఈ నెంబరుకి తెలియచేయాలా..” అంటూ, ఈయనకేమో ఆ నెంబరెవరిదో తెలియదాయె. ఇలాటి పరిస్థితులు వస్తూంటాయి. మా ఇంటావిడ సెల్లులో వాళ్ళ ఫ్రెండ్సందరి నెంబర్లూ ఉంటాయి, అలాగే తను expect చేసేదేమిటీ, నా సెల్లులో కూడా నా ఫ్రెండ్సందరి నెంబర్లూ ఉంటాయని, కానీ నాదాంట్లో ఊళ్ళోవాళ్ళ నెంబర్లన్నీ ఉంటాయి. పోనీ ఆ నెంబర్లవాళ్ళైనా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తే పరవాలేదు. ఎప్పుడో పున్నానికో, అమావాస్యకో ఓ ఫోను చేయడం, కొంతమందైతే అదీ మానేశారులెండి అది వేరే విషయం.

    ఇంకొంతమందుంటారు, వాళ్ళకి ఏదో అవసరం ఉన్నప్పుడు ఎవరి ద్వారానో తెలిసికున్నానని మనకి ఫోను చెయ్యడం. సంగతేమిటా అంటే వాళ్ళకి ఇంట్లో ఏదో పూజ ఉందిట, తెలుగులో పూజ చేయించే పురోహితుడెవరైనా ఉన్నారా అని, 50 ఏళ్ళబట్టీ ఇక్కడే ఉండడంతో, నాకేదో తెలిసుంటుందని. ఏదో ఫలానా నెంబరుకి ప్రయత్నించండీ అంటాను. ఏదో కాలక్షేపం కబుర్లేవో చెప్పేసి పెట్టేస్తారు.ఏదో ఫోను చేశారుకదా అని ఆ నెంబరు save చేసికోడం. పోనీ మనం ఇచ్చిన సమాచారం ఏమైనా ఉపయోగించిందో లేదో తిరిగి తెలియచేయడానికి వారికీ తీరికుండదు. పోనిద్దూ పనైపోయిందిగా అనే “చల్తాహై” attitude.అలాగే ఇంకొకాయన ఇంకోరెవరిదో పేరు చెప్పి, “ఫలానా వారింట్లో మనం కలిశామూ” అంటూ, వాళ్ళింట్లో ఏదో కార్యక్రమానికి తెలుగు వంటలు చేసేవాళ్ళు కావాలీ, మీకెవరైనా తెలుసా.. అంటూ అడగడం.

    ఎక్కడైతే పరిచయం అయిందో చెప్పే సందర్భంలో ఆ ” ఇంకో ఆయన” పేరుచెప్పడంలో ఉద్దేశ్యం అర్ధం అవదు. దీనితో జరిగేదేమిటీ, “ఓహో మన ఫ్రెండుగారి పరిచయస్థులు ఇలాటివారన్నమాట..” అని ఓ (దుర) అభిప్రాయం ఏర్పడిపోతుంది.మనం ఏదో సమాచారం చెప్పామూ, అలాగని జీవితాంతం ఋణగ్రస్థులవాలని కాదు నేను చెప్పేది, ఏదో విషయం తెలిసిందిగా, పోనీ అది ఉపయోగించిందో లేదో చెప్తే, మనకీ తెలుస్తుంది, రేపెవరైనా ఇంకోరు అడిగితే చెప్పొచ్చూ అని. లేదా తనకి ఇంకొంత సమచారం తెలిస్తే, ఇంకోరికి ఉపయోగపడుతుంది. కాదూ ఎవడెలాపోతే మనకేమిటీ, మనపనైపోయిందిగా అనుకుంటే అసలు గొడవేలేదు.

    అసలు ఎవరైనా ఇలాటి సమాచారాలు అడిగినప్పుడు ” నాకేమీ తెలియదండీ..” అనేస్తే ఇన్నిన్ని పీక్కోడాలే ఉండవుకదూ !!అన్నిటిలోకీ ఇదే హాయంటాను.ఏమిటో అన్నీ మనకే తెలిసినట్టు అడగ్గానే ఎగేసికుంటూ, మనకి తెలిసినవీ, తెలియనివీ, తెలుసుకోబోయేవీ ప్రతీదీ చెప్పేయడం, మళ్ళీ వాళ్ళేదో తిరిగి ఫోనుచేయలేదో అని మొత్తుకోడం, ఎందుకొచ్చిన గొడవలూ. అప్పటికీ మా ఇంటావిడ చివాట్లేస్తూనేఉంటుంది ఎందుకొచ్చిన తాపత్రయాలండి బాబూ, “మీరేమో ఏదో చెప్తారు, వాళ్ళేమో తిరిగి ఫోను చెయ్యరూ, ప్రతీవాళ్ళకీ మీకున్నంత తీరికెక్కడిదీ, చెప్పాలనుకుంటే చెప్పేయండి, అంతేకానీ వాళ్ళు తిరిగి ఫోనుచేయలేదని ఊరికే బ్లడ్ ప్రెషరు పెంచేసికోకండి..” అంటూ “గీతా జ్ఞానం” బోధిస్తుంది.సరే అనేసికుని ఇంక మళ్ళీ జీవితంలో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకూడదూ అని ఓ “ఒట్టోటి” పెట్టేసికోడం.అదెంతసేపూ, మళ్ళీ ఎవరో ఫోను చేస్తారూ, ఆ “ఒట్టేదో” గట్టున పెట్టేయడం, మళ్ళీ మొదలూ..పుట్టుకతో వచ్చిన బుధ్ధులు ఎక్కడకి పోతాయీ, అవీ మనతోపాటే...

    అసలు ఈ సోదంతా ఎందుకు వ్రాశానూ అంటే, సాయంత్రం ఏదో నెట్ లో కెలుకుతూంటే ఓ ఫోనొచ్చి కట్టయిపోయింది. పోనీ నెంబరుందికదా అని, నేనే తిరిగి ఫోను చేశాను.తీరా ఆయన ఫోను తీసి, ” మీరెవరండీ..” అన్నారు. ముందుగా ఫోను చేసింది ఆయనా, నన్నడుగుతున్నారు అనుకున్నాను.కొద్దిగా ముందుకువెళ్ళి, మీరెక్కణ్ణించీ అన్నారు, సరే ప్రస్తుతం ఫొనుచేసింది నేనే కదా అనుకుని పూణె నుండీ అన్నాను.పూనా.. అక్కడెవరూ నాకు తెలిసినవారు లేరే అంటూ,మీకు ఫలానావారు చుట్టాలేనా అన్నారు.అప్పుడు ఇద్దరికీ click అయింది, ఇదివరకు మేమెప్పుడు కలుసుకున్నామో, అవీఇవీ కబుర్లు చెప్పేసికున్నాము. ఆయనకీ నాలాగే ఎవరెవరివో నెంబర్లు నోట్ చేసేసికోడమూ, సావకాశంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేయడమూనూ, అదే ప్రకరణంలో నాకూ ఫోను చేసినట్టున్నారు. తీరా నా ఫోన్లో caller tune హిందీ పాట ” ఖోయా ఖోయా చాంద్..” వినిపించుంటుంది, ఇదెక్కడ గొడవరాబాబూ అనుకుని పెట్టేసుంటారు. ఏదో పాతపాటలమీద అభిమానంకొద్దీ ఆ పాట పెట్టుకున్నాను.అప్పుడు తెలిసింది ఆయనకీ నాలాగే నెంబర్లు నోట్ చేసికునే దురలవాటు ఉందని.

    ఈ గొడవలన్నీ పడలేక ఆ మధ్యన కూర్చుని అవసరంలేనివీ, ఎప్పుడో అవసరానికి ఫోన్లు చేసేవారివీ నెంబర్లు delete చేసేశాను. హాయిగా ఉంది….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    నాకొకటి ఎప్పుడూ అర్ధం అవదు.. మార్కెట్టులోకి ఏదైనా కొత్తగా వస్తువులు వచ్చినప్పుడు, ఆ manufacturers , ఆ వస్తువులకి ఓ fancy ధర పెట్టేస్తూంటారు. మార్కెట్టులోకి కొత్త వస్తువు ఎప్పుడు launch అవుతోందా, ఆ వస్తువుని, మిగిలినవారికంటే ఎప్పుడు, స్వంతం చేసికుందామా అని, ఆత్రంగా ఉండే మనుష్యులకి ఏమీ కొదవలేదు( నాతో సహా…). కొంతమందికి అదో obsession, పిల్లలకి ఓ కొత్త బొమ్మనండి,ఓ ఎలెక్ట్రానిక్ వస్తువనండి, ఇంకోటేదైనా సరే, మార్కెట్ కి వెళ్ళడం, ఫలానా వస్తువొచ్చిందా అని అడగడం,” ఇంకా మా దగ్గరలేదండీ..” అని ఆ కొట్టువాడు చెప్పినా సరే, ” అరే ఈవేళే టివీ లోనో, పేపరులోనో దాని యాడ్ చూశానే…ఇంకా మీరు తెప్పించేలేదేమిటీ…”, ఇంకో కొట్టుకి వెళ్ళడం. మొత్తానికి నానా తిప్పలూ పడి ఆ వస్తువేదో కొనేసికోడం. అది ఉపయోగిస్తుందా లేదా అన్నది వేరే విషయం. మార్కెట్ లోకి వచ్చిందీ, మన షెల్ఫ్ లో ఉండాలీ.. బస్.. అంతే...no second thought...

    ఇదిగో ఇలాటివాళ్ళ ధర్మాన్నే అలుసుగా తీసికుంటారు ఆ manufacturers ! వెదకాలే కానీ, కావలిసినంతమంది బక్రాలు. ఉదాహరణకి కిందటేడాది అదేదో
Nu Gen అని ఓ హెర్బల్ తలనూనెట అదేదోవచ్చింది. షాపుకి వెళ్ళి అడిగితే, అసలు దాని పేరే వినలేదన్నాడు. ఇక్క్డడ ఇంట్లోనేమో, టివీ ల్లో ఏ కార్యక్రమం చూసినా, వాళ్ళదే sponsorship, ప్రతీ తెలుగు పత్రికలోనూ, న్యూసు పేపరులోనూ వాళ్ళవే పేజీలకి పేజీలు ప్రకటనలు. హోరెత్తించేశారు. పైగా వాటితో పాటు అదేదో షాంపూ, కీళ్ళ నొప్పులకి ఔషధం ఓటీ !వాడి కాళ్ళా వేళ్ళా పడి మొత్తానికి తెప్పించాను, (నాకోసం కాదు, పుటం వేసినా నా నెత్తిమీద జుట్టు రాదు,ఉన్న జుట్టుకే క్షువరకర్మ మూడు నెలలకోసారి చేయించుకుంటూంటాను, నాకెందుకూ…). ఏదో పాపం అడక్క అడక్క మొట్టమొదటిసారి అడిగింది కదా ఇంటావిడా అనీ..

   తీరా తెచ్చిన తరువాత రేటు చూస్తే గుండె గుభేలుమంది. దాని ఖరీదు అక్షరాలా 400/- రూపాయలు. పైగా ఆ సీసాకో పై ప్యాకింగోటీ, అందులో ఉండేది 100 ml. అయినా మాటిచ్చేశానని నాలుగొందలూ ఇచ్చి తీసికున్నాను. ఖరీదంతా అంటే మళ్ళీ వాడదేమో అని, పైగా ప్రామిస్సోటి చేసేశాను– ” ఇది పూర్తయిపోగానే చెప్పూ, ఇంకోటి తెస్తానూ…” అని. కొత్తగా వాడ్డం మొదలెట్టినప్పుడు, బాగానే పనిచేస్తాయి ప్రతీదీనూ. జుట్టు రాలడం తగ్గిందీ అని చెప్పింది ఇంటావిడ. ఇదివరకటిలాగ ప్రతీ రోజూ ఏదో ఒక తలనూనె రాసుకుంటే, జుట్టూ రాలదూ, న్యూజెన్లూ, ఓల్డ్ జెన్నులూ వాడఖ్ఖర్లేదు, అది వేరేసంగతనుకోండి.. ఆవిడకి మాటిచ్చేశానుకాబట్టి, ఇంకో బాటిల్ కొన్నాను. ఈ టపా అదేదో ఖర్చుచేసేశానే అని చెప్పడానికి కాదు, ఆ మాయదారి కంపెనీ వాడు ఈమధ్య అదేదో వాడి కంపెనీ యానివర్సరీట, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని యాడ్లూ.. వీడిల్లుబంగారంగానూ, ఇన్నాళ్ళూ మనల్ని దోచెసికున్నాడన్నమాట!!

    అలాగే కొన్నేళ్ళ క్రితం పాండ్స్ వాడు ఏజ్ మిరెకిల్ అని కొత్తగా ఒకటి మొదలెట్టాడు. నా మిస్టరీ షాపింగు సందర్భంలో, కొనవలసివచ్చింది. డబ్బులేమైనా నా జేబులోంచి వెళ్తున్నాయా అనుకుని, కొన్నాను, దాని ఖరీదు 500/- రూపాయలు. ఈమధ్యన చూస్తే దాని ఖరీదు కాస్తా 200/- అయింది.మరీ ఇంత అన్యాయమా? అలాగే కొన్నేళ్ళ క్రితం SONY వాళ్ళది 2200 W సౌండ్ సిస్టం కొంటే, 17000/- పుచ్చుకున్నాను. ఇప్పుడేమోదాంట్లో సగనికి సగం కంటే కిందకు దిగిపోయింది. పైగా నా దగ్గరున్నదానికి ఏదైనా రిపేరు వస్తే స్పేరు పార్టులు కూడా దొరకవు. అలాగని మరీ దాన్ని పాతసామాన్ల వాడిక్కూడా ఇవ్వడానికి మనసొప్పదూ, దేర్భ్యంలా, సామాన్లు పెట్టుకునే ర్యాక్కు మీద పడుంటుంది, పైగా కవల పిల్లల్లా చెరో వైపునా పెద్ద పెద్ద స్పీకర్లోటీ !!

    అలాగే మాల్సు లోనూ ఒకచోటకీ ఇంకోచోటుకీ రేట్లలో పోలికుండదు. కిరాణా కొట్లవాళ్ళైతే గొడవే లేదు, అదేదో పూర్తి నిజాయితీపరుడిలాగ దానిమీదెంతుంటే అంతకే అమ్ముకుంటాడు.కొన్నిచోట్ల అదేదో ఒకటికొంటే ఇంకోటి ఉచితం అంటూ.. ఆ రెండోది మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనకంటకట్టేస్తాడు. అలాగని దాన్ని ఇంకోళ్ళకెవరికీ అమ్ముకోలేమూ. చెప్పానుగా పోటీ ఎక్కువయ్యేటప్పటికి మెడికల్ షాప్పువాళ్ళు కూడా ఈమధ్యన 10% డిస్కౌంట్లు ఇస్తున్నారు.

    మరి ఇంతంత గొడవల్లో మళ్ళీ అవేవో FDI లుట. బయటి దేశాల్లో దివాళా ఎత్తేసిన వాళ్ళందరికీ బక్రాలు మనమోళ్ళున్నాము కదా. ఇక్కడ ఉన్నవాటినేమో ఎడాపెడా ఎత్తేస్తున్నారు, ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళొకళ్ళు. ఏమిటేమిటో కబుర్లు చెప్పేసి, ప్రపంచంలో తనే మొదటి స్థానంలో ఉండాలనే సదుద్దేశ్యంతో అన్ని లిక్కర్ కంపెనీలూ acquire చేసేసి, తీరా Kingfisher మునిగిపోయేటప్పటికి , దాన్ని కాస్తా Diageo కి అమ్మేశాడు.

    మమతా బెనర్జీ ప్రభుత్వం మీద అవిశ్వాసతీర్మానం పెడదామని ఊరికే ఉవ్విళ్ళూరిపోతోంది. రాకరాక అధికారంలోకి వచ్చి, ఆ కారత్ గారి ధర్మమా అని పంతాలకి పోయి UPA 1 ని దింపేశారా ఏమయిందీ, కమ్యూనిస్టులు దేశంలో ఎక్కడా తుపాగ్గుండుకి కూడా కనిపించడం లేదు. అందుకే మన సీతారాం ఏచూరిగారు మమతమ్మకి ఓ సలహా కూడా ఇచ్చేశారు, అలాటి వెర్రివెర్రి పనులు చేయకూ అని!

   ఆంధ్రదేశంలో అయితే ఏం జరుగుతోందో, ఏం జరుగుతుందో, అసలు ఎందుకు జరగాలో ఎవడికీ ఏదీ అర్ధం అవడం లేదు. గొడవే లేదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    దీపావళి పండగ బాగానే చేసికుండిఉంటారని ఆశిస్తున్నాను. మాకు కూడా బాగానే జరిగింది.నేను రోజూ బస్సుల్లోనే వెళ్తూంటానుగా, మా మనవడు అగస్థ్యకి ఓ ముచ్చటా, తనుకూడా నాతోరావాలని. మొన్నెప్పుడో ఆ ముచ్చటా తీర్చేశాను. మధ్యలో ఒకటి రెండుసార్లు ఎత్తుకోవలసొచ్చిందనుకోండి, అయినా లాగించేశాను. ఇప్పుడు ఓపికెక్కడిదీ.. అయినా మనవలకి తాతయ్యలని “ఇబ్బంది” పెట్టడం ఓ సరదా ! అందుకేచెబుతూంటాను, తాతయ్యలు డెభైయ్యో పడిలో పడేముందరే ఇలాటి ఆనందాలన్నీ అనుభవించేయాలని! ఆ తరువాత చేసేదేమీ ఉండదు !!

   తమ్ముడుకి అలాటి ఛాన్సొస్తే, అక్కగారూరుకుంటుందా మరి? మరీ ఇద్దరినీ కలిపి తీసికెళ్ళే ఓర్పూ సహనమూ కూడా ఉండాలిగా. దానికోసం ముహూర్తం ఇదిగో నిన్న దీపావళినాడు పెట్టాను. నవ్యని తీసికుని,బస్సెక్కించి, మేముడే ఫ్లాట్టుకి తీసికొచ్చాను.ఎలాగూ సాయంత్రం ఇక్కడ మా ఇంటావిడ లక్ష్మీపూజ అయినతరువాత వెళ్దామనే కార్యక్రమం ఉండనే ఉంది. Unexpected గా మనవరాలొచ్చేసరికి, ఇంటావిడ కూడా బోల్డంత సంతోష పడిపోయింది.

    కూతురుని ఇక్కడ వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నా ఎలా ఉండగలరూ, వాళ్ళూ, మనవణ్ణి తీసికుని వచ్చేశారు. ఎలాగూ వచ్చారూ, భోజనం చేసేసి వెళ్ళండర్రా, అని ఇంటావిడచెప్పగా, వాళ్ళూ సరే అని చేసేశారు. అలాగ అనుకోకుండా, పిల్లలతో కలిసి గడిపే మధుర క్షణాలు అనుభవించేశాము.

    ఇలాటి moments ఈరోజుల్లో అస్తమానూ రమ్మంటే వస్తాయా మరి? ఎవరికి వారే బిజీ.. బిజీ… అలాటప్పుడే చిన్ననాటి జ్ఞాపకాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి.ఆరోజుల్లో అలా చేశామూ.. ఇలాచేశామూ అంటూ. జరిగిపోయిన రోజులు తిరిగి రమ్మంటే వస్తాయా, ఏదో ఆ జ్ఞాపకాల్లోకి ఓసారి వెళ్ళిపోవడం. సాయంత్రం లక్ష్మీ పూజకోసం పువ్వులూ అవీ తెమ్మని ఇంటావిడ ఆర్డరు. ఎలాగూ బజారుకెళ్ళానుకదా అని కనిపించాయని తోరణం కట్టుకోడానికి మావిడాకులు కనిపిస్తే, ఎంత బాబూ అని అడిగితే రెండు రొబ్బలూ పది రూపాయలన్నాడు. అసలు మావిడాకులు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడమే ఓ దౌర్భాగ్యం, దానికి సాయం రెండంటే రెండు రొబ్బలకి పదిరూపాయలనడం ఇంకా అన్యాయం ! అలాగే అక్కడ కలువపూవులు కనిపించాయి కదా, పోనీ అమ్మవారికి ఈ పువ్వులంటే ఎంతో ప్రీతిట అని శ్రీచాగంటి వారి ప్రవచనాల్లో విన్నామూ అనుకుని, ఖరీదెంతా అని అడిగితే పువ్వు ఒకటికీ ఇరవైరూపాయలన్నాడు. పోనీ అదైనా fresh గా ఉందా అంటే వాటికి నావయస్సుంది ! నోరుమూసుకుని కూర్చుని, ఏవో మిగిలిన పువ్వులు తీసికుని వచ్చేశాను.

    పువ్వులంటే గుర్తొచ్చింది, మేముండే సొసైటీలో ఓ నాలుగు పువ్వులమొక్కలున్నాయిలెండి,అవేవో చంద్రకాంతాలుట ( ఇంటావిడ చెప్పగా తెలిసికున్నది) తెలుపూ, పసుపూ రంగుల్లో ఉంటాయి ఆ చెట్టుకి.ఆమధ్యన మా సొసైటీలోనే ఉండే ఓ చెట్టు చూపించి, ఇవి బిళ్వపత్రాలూ, వీటితో పూజచేస్తే బాగుంటుందీ అని మా ఇంటావిడ చెప్పినప్పటినుంచీ, ప్రతీరోజూ ప్రొద్దుటే కిందకెళ్ళడం, అదృష్టం బాగుండి దొరికితే ఆ పువ్వులూ, కొన్ని బిళ్వపత్రాలూ తెచ్చి ఇవ్వడం. అదృష్టం అని ఎందుకన్నానంటే, మా సొసైటీలోనే ఓ పెద్దావిడొకరున్నారు, నాకంటె ముందుగా వచ్చిందా, ఒక్కపువ్వూ వదలదు, ఏం లేదూ ఆ చెట్టు ఆవిడవేసిందిట! చెట్టంటే వేసింది కానీ మిగిలిన కార్యక్రమాలు– నీళ్ళుపోయడమూ, రాలిన చెత్త బాగుచెయ్యడమూ సొసైటీ వాచ్ మన్నే కదా చేస్తున్నదీ? వాడికిచ్చే డబ్బుల్లో మనవీ ఉన్నాయిగా, ఇలాటి సున్నితమైన ప్రశ్నలు వేయకూడదూ, ఎప్పుడైనా నేను ముందర పువ్వులుకోస్తే మాత్రం, నాకు కావలిసిన ఓ నాలుగు పువ్వులు కోసికుని, మిగతావి వదిలేస్తూంటాను. మరి ఆ ‘పెద్దావిడ‘ కి అంత ‘ ఆబ’ ఎందుకో అర్ధం అవదు!

    ఈ ‘ఆబ’ అంటే గుర్తొచింది, బఫేలకి వెళ్ళినప్పుడు చూస్తూంటాము, తినే ఓపికున్నా లేకపోయినా, ఉన్నవన్నీ ప్లేటులో వేసేసికోడం, ఫ్రీగా వస్తున్నాయి కదా అని, తింటాడా పోనీ, అదీలేదు, చివరకి తినగలిగినన్ని తినడం, మిగిలినవన్నీ అదేదో పెడతారు, దాంట్లో పడేయడం, ఎవరు తిన్నట్టూ? అలాగే సొసైటీలో నీళ్ళు ఏ ఓవర్ హెడ్ ట్యాంకులో క్లీన్ చేయడానికి, రావంటారో అనుకోండి, ఇంక చూడండి, నీళ్ళొచ్చినంతసేపూ, ఇంట్లో ఎక్కడో ఉన్న బిందెతో పాటు, బుల్లిబుల్లిగ్లాసులదాకా అన్నిటిలోనూ నింపేసికోడమే. తీరా ఆ మర్నాడు ఎలాగూ వస్తాయి, మరి ఇంటినిండా నింపిన బకెట్లలోవీ, బిందెల్లోవీ నీళ్ళెఖ్ఖడ పోయడం– గట్టరులోకి. అంతంతేసి నీళ్ళు నింపడం ఎందుకూ, వాటిని అలా పారపోయడం ఎందుకూ? జనాలు ఇలా ఉన్నంతకాలం మనం బాగుపడమంటే ఎలా బాగుపడతాము? ఇలాటివన్నీ చాదస్థం మాటల్లాగ ఉంటాయి.

    ఇదివరకటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకుంటే మరి ఇలాటివే గుర్తొస్తాయి.ఇదివరకటి రోజుల్లో మరి ఇలాటివుండేవా? ఏమైనా అంటే జనాభా ఎక్కువయ్యిందీ అంటూ ఓ కుంటిసాకోటి చెబుతారు. జనాభా ఎంత ఎక్కువైనా, ఉండవలసిన బుధ్ధీ, జ్ఞానం అనేవుంటే ఇంత పాడైపోదు పరిస్థితి.

    చాదస్థం అంటే గుర్తుకొచ్చింది- మనం ఉండే ఎపార్టుమెంటుల్లో తలుపులకి అవేవో ఆటోమెటిక్ తాళ్ళాలుట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సినా, ఇంట్లో తలుపులేసి పడుక్కోవాలనున్నా, ఆ తలుపుని ఓలాగు లాగేస్తే లాకైపోతుంది. ఇదివరకటి రోజుల్లోలాగ, సింహద్వారాలకి ఓ గడియా అవీ ఎక్కడుంటాయి ఈ రోజుల్లో? అయినా అవన్నీ చూసుకునే ఓపికెక్కడుంది? “హాయ్.. బై.. అంటూ, ఆఫీసులో రాత్రి పన్నెండింటిదాకా పనిచేసి , ఏ అర్ధరాత్రో, అపరాత్రో ఇంటికి వచ్చి, ఇంకా పక్కమీదే నిద్రోతున్న భార్యనో, భర్తనో మళ్ళీ disturb చేయడం దేనికిలే అనుకునేవారికి ఈ సదుపాయం హాయి! ఇలాటి ” హాయి” లున్నప్పుడు, వాటితో తీసికోవలసిన జాగ్రత్తలూ ఉంటాయిగా మరి, ఇదిగో అలాటివే గుర్తుండవు. పోనీ అలాగని చెబ్దామా అంటే “ఎప్పుడూ ఒకటే సొద, అక్కడకి మాకేదో తెలియదన్నట్టు ఎప్పుడూ ఇదే గొడవా..”, లాటి మాటలూ వింటూంటారు, ఇళ్ళల్లో ఉండే “చాదస్థపు” పెద్దవాళ్ళు. అయినా వాళ్ళు చెప్పేవి మానరూ, నా బ్లాగుల్లాగే...

    చెప్పొచ్చేదేమిటంటే, నిన్న సాయంత్రం మా ఇంటావిడ పూజచేసికుంటుంటే, నేను ఏదో కంప్యూటరులో కెలుకుతున్నాను, ఇంతట్లో ఎవరో బెల్లుకొట్టారు, ఏమిటా అని చూస్తే ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి. ” అంకుల్, మీదగ్గర గాద్రెజ్ తాళం ఏదైనా ఉందా” అంటూ. విషయమేమంటే, ఈవిడ బయట ఏదో ముగ్గులేస్తోందిట, అవతలివైపు తీసున్న తలుపులోంచి గాలి బాగా వీచి, ఈ తలుపు కాస్తా మూసుకుపోయింది. మూసుకోకేంచేస్తుందీ? అప్పటికీ ఇదివరకు ఇలా రెండు మూడు సార్లు జరిగినప్పుడు ( ఎవరికో కాదు వీళ్ళకే), మా ఇంటావిడ చెప్తూనే ఉంది, తాళ్ళాల గుత్తైనా కొంగుకి ముడేసికో, లేదా బయట గడియేసే బోల్టైనా బయటకి పెట్టుకో అని. ఏదో ఆ రెండు మూడు సందర్భాల్లోనూ, డూప్లికేటు తాళ్ళం ఉన్న , మరిదిగారు, ఆఫీసునుంచి వచ్చేవరకూ మా ఇంట్లోనే కూర్చుని ఎలాగో గట్టెక్కేశారు. ఈసారి ఆ మరిది కాస్తా దీపావళికి ఊరెళ్ళాడు, మనం వీధిన పడ్డాము !!! పోనీ నీభర్తకి ఫోనుచేసి తాళాలు తీసేవాడిని పిలూ అంటే, ఫోను కూడా ఇంట్లోనే ఉందీ, మా తల్లే అనుకుని, నా ఫోను తోనే సమాచారం అందచేసింది. ఇలాటివైనప్పుడు ప్రతీవాడూ పరామర్శ చేసేవాడే. ఇంతలో పైనుండి ఒకడు వచ్చి, అసలెలా జరిగిందీ అంటూ. నీకు తాళం తీయడం వస్తే తియ్యి, అంతేకానీ, ఎప్పుడు జరిగిందీ, ఎందుకు జరిగిందీ లాటి ప్రశ్నలతో ఉపయోగమేమైనా ఉందా అని అడిగేసరికి, ఎవరింటికైతే వచ్చాడో ఆ ఇంటి యజమాని తనకు తెలిసిన వాడికెవరికో ఫొను చేసి మొత్తానికి ఆ గాద్రెజ్ తాళం తీయించాడు. కథ సుఖాంతం…

    మన ఆంధ్ర దేశ ప్రజ్ఞా పాటవాల కి ఓ దృష్టాంతం...PGI

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Peepli-live…

    ఇదివరకటి రోజుల్లో నాకో సందేహముండేది– యదార్ధ సంఘటనలని సినిమాలుగా తీస్తారా, లేక సినిమాలు చూసి మిగిలినవాళ్ళు నేర్చుకుంటూంటారా అని…ఆ మధ్యన అన్నాహజారే గారు, అప్పుడెప్పడో ఢిల్లీలో నిరాహార దీక్షచేశారూ, దేశంలోని చాలామంది సమర్ధన తెలియచేశారు, ఏవేవో ప్రసంగాలు చేశారు, అదన్నారు ఇదన్నారు.. ఓ పెద్ద నాటకీయంగా ముగిసింది ఆ ప్రకరణం. వీళ్ళడిగినది, ప్రభుత్వం కాదన్నారు, ప్రభుత్వం చెప్పింది అన్నా టీం వాళ్ళు కాదుపొమ్మన్నారు, ఓ రెండు మూడు నెలలపాటు కావలిసినంత హడావిడి పేపర్లవాళ్ళకీ,టీవీలవాళ్ళకీ కావలిసినంత కాలక్షేపం. ఓ రెండు మూడు నెలల తరువాత ఆ టీం లోవాళ్ళు కొందరు బయటకెళ్ళిపోయారు.పోని అలా వదిలేస్తారా, ఇంకోసారి మళ్ళీ ప్రయత్నిద్దామేమిటీ అనుకుని ముంబైలో మళ్ళీ అన్నాగారిని ఉపోషానికి కూర్చోబెట్టారు. నాకు ఓపికలేదు మొర్రోమంటూన్నా ఠాఠ్.. కూర్చోపోతే ఎలాగా అంటూ బలవంతంగా కూర్చోపెట్టేశారుట ! ఇవన్నీ నా మాటలు కావు. అన్నా హజారే గారే శేఖర్ గుప్త ( Editor Indian Express) తో స్వయంగా చెప్పిన మాటలు. Walk the Talk లో.‘I didn’t want to fast in Mumbai, but was forced to do so. My health deteriorated’. నిజమే కదూ.. మనకేమిటీ ఆయనేమైపోతే, కార్యం ప్రధానం. ఆ ఉపోషాలేవో చేస్తానూ అని ప్రతీరోజూ ఒకటే గొడవా.. కూర్చోబెడితే సరీ.. అనుకున్నారు కేజ్రీవాలూ, బేడీ, ప్రశాంతభూషణుడూనూ….

    ఇది చూస్తూంటే అప్పుడెప్పుడో 2010 లో అమీర్ ఖాన్ తీసిన Peepli-live గుర్తొచ్చింది. అందులోకూడా ఇలాగే బలవంతంగా ఓ పాత్రని మొహమ్మాటపెట్టేస్తారు. దానికీ, దీనికీ తేడా ఏమిటిట? చివరకి అదంతా ఓ గొడవైపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఈమధ్యలో ఎవరికి తోచినదేదో వాళ్ళు లాగించేస్తూనే ఉన్నారు. సర్వేజనా సుఖినోభవంతూ...

    ఇలాకాదూ, వీళ్ళందరినీ టీంలో ఉంచుకుంటే మళ్ళీ ఏం కొంపముంచుతారో అని ఆ అన్నా టీమ్ముని కాస్తా disband చేసేశారు. ఆ కెజ్రీవాలేమో విడిగా ఓ రాజకీయ పార్టీ పెట్టాడు ( దానికింకా బారసాల ముహూర్తం కుదరలేదనుకోండి). ఊరికే కూర్చోడమెందుకూ అనుకుని ఆమధ్యన రోజుకోడి పేరు తీసికుని press conference లూ గట్రానూ. అదో కాలక్షేపం.
ఈమధ్యలో 2G, Coalgate,CWG వ్యవహారాలేమయ్యాయో ఎవడికీ పట్టదు.

   ఆ కేజ్రీవాల్ అస్తమానూ కాంగ్రెసు వాళ్ళనే తిడితే monotonous గా ఉంటుందని, BJP ని పట్టుకున్నాడు. గడ్కరీ నాకేం తెలియదు పొమ్మన్నాడు.అదన్నారు ఇదన్నారు.. సందట్లో సడేమియాలాగ ఆద్వానీ గారు,, ” అసలు నాకు ప్రధానమంత్రి పదవి మీద వ్యామోహమే లేదూ.. ” అని మొదలెట్టారు. నిజమేకదూ మధ్యలో మళ్ళీ ఈయన గొడవేమిటీ? ఈవేళ ఆయనెవరో బ్లాగులో వ్రాసినట్టు, అటల్ బిహారీ వాజపేయి గారు అసలు ఉన్నారో, ఉంటే ఎలా ఉన్నారో మాత్రం ఒక్కడికీ పట్టదు. అసలు వీళ్ళగొడవలు భరించలేకే ఆయన retire అయ్యారేమో!

    ఒకటిమాత్రం చెప్పుకోవాలి All India Level లో ఒక జాతీయపార్టీ అద్యక్షుడి ” అవినీతి భాగోతం” బహిరంగం అయిన ఘనత మాత్రం భారతీయ జనతా పార్టీదే.. Great!! అప్పుడెప్పుడో మన తెలుగుతేజమూ, ఇప్పుడేమో గడ్కరుడూనూ !అలాగని మిగిలిన పార్టీలవాళ్ళు ఏదో “పొడిచేసేశారని కాదు, వాళ్ళు దొరకలేదూ, వీళ్ళు దొరికిపోయారు. మిగిలినవాళ్ళందరూ ఆట్లో అరటిపండు లాటివారు! ఊరికే కూర్చోక ఆ గడ్కరీ దావూద్ ఇబ్రహీమ్మునీ, స్వామి వివేకానంద గారితో పోలుస్తూ ఏదో అన్నాడు. ఠాఠ్ నన్ను out of context కోట్ చేశారూ అని మళ్ళీ ఓ కరెక్షనూ. అసలు ఒకే breath లో అనడం ఎందుకూ, తరువాత మొత్తుకోడం ఎందుకూ?

    మళ్ళీ మొదటికి వస్తే.. అన్నాగారు త్వరలో ఓ revamped team ప్రకటిస్తారుట. అందులో ఎవరూ, అదేదో జన్మతారీకు గొడవలో ప్రసిధ్ధి చెందిన సింగుగారూ, మిగిలినవాళ్ళందరూ పాతమొహాలేలెండి.. మళ్ళీ దీనికి revamped team అని ఓ పేరూ.. ఏమిటో ప్రతీరోజూ కావలిసినంత కాలక్షేపం..

    ఆమధ్య జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన సంగ్మా గారు కోర్టులో వ్యాజ్యం వేశాడు, ఎన్నిక చెల్లదూ అంటూ.. నిన్నో మొన్నో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అలాటివేవీ ఉండవా మరి? సరదాగా అలాటిదేదో వేస్తే ఎంత బాగుంటుందో ఏమిటో చెబితే అర్ధం చేసికోరూ.. ( భానుప్రియ స్వర్ణకమలం డయలాగ్గు)

    మొన్నటి టపాలో వ్రాశానుగా, నాకు తెలుగుపత్రికలు కొనుక్కుని చదవడం అనే ‘దుర్గుణం’ ఉందనీ, దానికి గ్రహణం పట్టే రోజులొస్తున్నట్టున్నాయి. లేకపోతే ఏమిటండీ, ఏదో పాఠకదేవుళ్ళంటూ నెత్తిమీద శఠగోపం పెట్టేయడమే ఆ బలరాముడు గారు? మరీ 10 నుంచి 15 చేసేయాలా స్వాతి వారపత్రిక ఖరీదూ? ఆ పుస్తకం కొనేది “బాపు” గారి కార్టూన్ కోసం. మిగిలినవేమున్నాయి, ఆమధ్య అల్లుడితో ఏవేవో గొడవలయ్యాయని ఆ ఖర్చంతా మన నెత్తిమిద రుద్దేస్తే ఎలాగండి బాబూ? పెట్రోల్ ధర పెరిగితే గాడీలు నడపడం మానేశారా అనకండి. అది వేరూ, ఇది వేరూ.. ‘నవ్య’ ( ఆంధ్రజ్యోతి) వారిదుందనుకోండి, దాని ఖరీదు 10 రూపాయలు.అయినా కొనలేకపోయినా, ఏ కారణం చేతైనా దొరక్కపోయినా తాజా సంచికని ఇక్కడ చదివేసికోవచ్చు హాయిగా..చతుర, విపుల, కూడా అలాగే.

   మరీ 15 రూపాయలెట్టి డబ్బులు తగలేయడం అనవసరమేమో.. ఆ మాయదారి న్యూసుపేపర్లూ అలాగే తయారయ్యాయి నాలుగేసి రూపాయలూ, ఆదివారం అయిదూనూ. ఏమైనా అంటే cost of production పెరిగిపోయిందీ అంటారు. నిజమే కాదనం యాడ్లోటి తగలడ్డాయిగా, ఎలాగూ పత్రికలలోనూ,పేపర్లలోనూ కనిపించేవవేగా?…కొనలేకపోయినా హాయిగా నెట్ లోనైనా చదవొచ్చు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–etiquette లు….

    ఇంట్లో ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. మహా అయితే, కట్టుకున్నావిడచేత నాలుగు చివాట్లు తినడం తప్పించి.. కానీ బయటకి వెళ్ళినప్పుడైనా కొన్ని కొన్ని మర్యాదలు లాటివి పాటించాల్సొస్తూంటుంది. మనకోసం కాకపోయినా చూసేవాళ్ళేమైనా అనుకుంటారేమో అన్న “పాపభీతి” లాటిదోటుండాలని నా అభిప్రాయం. కాదూ నాకిష్టమొచ్చినట్టుంటానూ అంటే, అందరిలోనూ “తలతిక్క” వాడూ అని ఓ పేరొచ్చేస్తుంది. వస్తే రానీ అంటారా అది మన ఖర్మ !

నూటికి తొంబైమందిలో కొంతమందికి ఇంట్లో ఎలా ఉన్నా, బయటకొచ్చేసరికి ఓ పేరు రావాలని గొప్ప తపనలాటిదుంటుంది.కొంతమందైతే as a matter of habit అలవాటుపడిపోయి, ఇంట్లోనూ బయటా ఓలాగే ఉంటారు. కానీ మిగిలిన పదిమందీ ఉన్నారే వాళ్ళతోనే వచ్చిన గొడవంతానూ. ఎవడెలాపోతే మనకేమిటీ, మన పనేదో మనకైపోవాలి, పక్కనున్నవాళ్ళు ఏ గంగలో దిగితే మనకెందుకూ అనుకుంటారు.

కొన్నికొన్ని విషయాలు మరీ ఎవరూ బొట్టెట్టి చెప్పఖర్లేదు.బుధ్ధీ, జ్ఞానమూ స్వతహాగా ఉండాలి. నెత్తిమీదికి ఏళ్ళొస్తే సరిపోదుగా! ఈ సందర్భంలో ఇప్పుడు ప్రతీ వారి చేతిలోనూ సహజకవచకుండలాల్లాగ ఉండే cell phones. చాలామంది ఏదో చెవుల్లో పువ్వులాటివి పెట్టేసికుని లాగించేస్తారు. రోడ్డుమీద వెళ్తున్నప్పుడల్లా ఏమిటేమిటో మాట్టాడేస్తూంటారు, మొదట్లో పాపం వాడికి “మానసిక సంతులన్” ఏమైనా తేడా వచ్చిందేమో అనుకునేవాడిని. కానీ క్రమక్రమంగా అలాటి ” పక్షులు” ప్రతీచోటా కనిపిస్తూంటారు. వీళ్ళవల్ల ఊళ్ళోవాళ్ళకేమీ నష్టం లేదు. మహ అయితే వాడికే నష్టం. ఈ చెవుల్లోవాటివల్ల, వెనక్కాలొచ్చే వాహనాల హారన్లు వినిపించక accidents చేసికుంటూ ఉంటారు. వాడి ఆయుద్దాయం అంతేకాబోసనుకోడం వదిలేయడం.

కొంతమందుంటారు, ఎక్కడకివెళ్ళినా తమదగ్గర cell phone ఉందీ అని చూపించుకోవాలని యావ కాబోలు, దాని నోరైనా నొక్కరు. దానిదారిన అది మోగూరుకుంటే ఫరవాలేదు, వింత వింత రింగు టోన్లూనూ. ఊళ్ళోవాళ్ళందరికీ తెలియొద్దూ.. అక్కడికేదో పుట్టడమే సెల్ ఫోనుతో పుట్టాడా అనిపిస్తుంది. మహ అయితే ఓ పది పదిహేనేళ్ళయిందనుకుంటాను ఈ ఫోన్లొచ్చి. ఈ రోజుల్లో వచ్చే emergency లు, ఈ మాయదారి ఫోన్లు రాకపూర్వమూ ఉండేవిగా, అప్పుడేంచేసేవారుట? Technology ధర్మమా అని మనకి ఈ communication చాలా సులభం అయింది. కానీ అలాటి సాధనాలు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఉపయోగించుకోవాలో అనే విషయం మనలో ఉంది. ఆ మర్యాదలు పాటించడానికి కూడా options ఇచ్చారు కదా. వాటినేవో ఉపయోగించుకుంటే ఎవరికీ తగాదా ఉండదుగా. అక్కడే etiquette లు రంగంలోకొస్తాయి.

బహిరంగ ప్రదేశాల్లో అంటే, మీటింగుల్లోనో, ఏ సంగీతకచేరీల్లోనో, సినిమా హాళ్ళలోనో దాని నోరు నొక్కేయడానికి(silent mode), అదేదో వణకడానికి ( vibration mode) లాటివి ఉంటాయిగా. దేంట్లోనో దాంట్లో పడేసుండొచ్చుగా. రైళ్ళలో చూస్తూంటాము, ఎవడికో, ఏ అర్ధరాత్రో దిగాలంటే, ఈ సెల్లు ఫోనుకి, ఓ అలారం లాటిది పెట్టుకుని, మిగిలినవాళ్ళందరి ప్రాణాలూ తీయడం ! అదేదో vibration mode లో పెట్టుకుని చావొచ్చుగా, అబ్బే వాడితోపాటు బోగీలోని మిగిలినవాళ్ళ నిద్రలు కూడా తగలడితే వీడికి కడుపు నిండుతుంది.

అవన్నీ ఓ ఎత్తూ ఇప్పుడు నేను చెప్పేదింకో ఎత్తూ.. ఈవేళ మా నాన్నగారి అబ్దీకం పెట్టుకోడానికి రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. పిలవడమంటే ప్రొద్దుటే తొమ్మిదిన్నరకే వచ్చేయమంటారు కానీ, మొదలెట్టేసరికి పదకొండు, కార్యక్రమం అంతా కలిపి ఓ 45 నిముషాలు. ఈ 45 నిముషాలూ కూడా,ఆ దిక్కుమాలిన సెల్ ఫోనుని నోరునొక్కుంచాలనే ఇంగితజ్ఞానం లేని ఇద్దరు ప్రబుధ్ధులని చూశాను. జన్మనిచ్చి పైలోకాలకి వెళ్ళిపోయిన తల్లితండ్రులని స్మరించుకోడానికి ఉన్న ఆ ఒక్కరోజునకూడా, ప్రశాంతంగా ఉండనీయరు. ఆ serenity of the occasion కోసమైనా మర్యాద పాటించాలనే జ్ఞానం లేదు.ఇంతలో ఏం కొంపలుమునిగిపోతాయిట? అప్పటికీ ఆ క్రతువు జరిపిస్తున్న పూజారి చేతకూడా చెప్పించుకున్నారు, అబ్బే బుధ్ధి రాదే.

అలాగే ఆ మధ్యన ఓ funeral కి వెళ్ళాల్సొచ్చింది, అక్కడా అంతే, ఎక్కళ్ళేని అత్యవసరాలూ అప్పుడే వచ్చేస్తాయి. ఓ వైపున ఆ పార్ధివ శరీరానికి ఏవేవో పూజలూ అవీ జరుపుతూంటారు, మధ్యలో ఎవడిదో సెల్ ఫోను ఆవాజూ. ఒక్కొక్కప్పుడనిపిస్తూంటుంది- ఇలాటప్పుడు ఆ పాడె మీద పడుక్కోబెట్టినవాడుకూడా లేచి రావొచ్చనీ. అత్యవసరాలుంటాయి, ఆయనెవరో పోయారుగానీ, మనం ఇంకా బతికే ఉన్నాముగా, అది రైటే, కానీ ఆ సెల్ ఫోనుని ఏ “vibration mode” లోనో పెట్టుకుని, బయటకెళ్ళి మాట్టాడొచ్చుగా, అబ్బే అన్నిరాచకార్యాలూ అప్పుడే! మహ అయితే ఏమౌతుంది? దాంట్లో చూస్తే ఓ missed call ఉంటుంది. అంత అర్జెంటైతే ఫోనుచేసి మాట్టాడొచ్చు, ఇలాటప్పుడే etiquette లు రంగంలోకొస్తాయి. ఇలాటివన్నీ ఎవరూ నేర్పఖ్ఖర్లేదు. కానీ అలాటివి ఆచరించినప్పుడు మాత్రం చూసేవాళ్ళకీ అనిపిస్తుంది, ఫరవాలేదు, మంచీ మర్యాదా తెలిసినవాడే అని…

ఈమధ్యన పెళ్ళిళ్లల్లో పురోహితుళ్ళుకూడా ఓ రెండో మూడో బేరాలొప్పుకుంటారు, ఒకచోట తాళి కట్టిస్తూంటే ఫోనూ ఇంకో చోటనుంచి, గౌరీ పూజకి టైమైపోతోందో అనో, స్నాతకానికి పీటలమీద కూర్చోమంటారా అంటూ.. ఆ ఫోన్లు చేసినవాళ్ళందరికీ తలో sloట్టూ alloట్ చేసేస్తాడు మన పురోహితుడు గారు. ఇలాటివన్నీ చూసే వాడెవడో అదేదో సినిమాలో బ్రాహ్మణులని నవ్వులపాలు చేశారూ అంటూ ధర్నాలూ, మానవహక్కులవాళ్ళదగ్గర పితూరీలూ అవీనూ.ఎవరి గొడవ వాళ్ళది…

పోనిద్దురూ ఎవడెలాపోతే మనకేమిటీ… మా చిన్నప్పుడు “రత్నం” పెన్నని ఒకటుండేది. దాన్ని వాడడం అంటే ఓ status symbol గా భావించేవారు. చిన్నపిల్లలని ముట్టుకోనిచ్చేవారు కాదు. మా నాన్నగారి దగ్గరా ఉండేది. నా చిన్నప్పుడు, పాకబడిలో చదివేటప్పుడు, వాడెవడో శనగపప్పూ, జీళ్ళూ ఇస్తానంటే, ఆ పెన్నుకాస్తా వాడికిచ్చేశాను, వాడు దాన్నమేశాడు. అదీ నాకూ “రత్నం” పెన్నుకీ ఉన్న అనుబంధం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ “రత్నం” పెన్ను ఘనత విన్నాను/ చదివాను