బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈవేళ “అత్తగార్ల దినోత్సవం ” ట…

   ఈవేళ ఈనాడు పేపరు చదువుతూంటే తెలిసింది, ఈవేళ అత్తగార్ల దినోత్సవం అని ! మొగుడు బెల్లం- అత్త అల్లం అనుకుంటూన్న ఈరోజుల్లో కూడా, ఈ అత్తగార్లకి ప్రత్యేకం ఒకరోజు కేటాయించడం బాగుంది కదూ !! అసలు ఈ అత్తాకోడళ్ళ వ్యవహారం ఉందే, వాళ్ళిద్దరూ ఏ గొడవాలేకుండా ఉన్నా సరే, ఊళ్ళోవాళ్ళకే కిట్టదు. నూటికి తొంభై కేసుల్లో, బయటివారి ద్వారానే వస్తాయి గొడవలన్నీ. వీటికి సాయం రాత్రనకా పగలనకా మన టీవీల్లో వచ్చే సీరియళ్ళోటి. ఆ చానెల్ వారి ultimate goal ఏమిటయ్యా అంటే, సుఖంగా ఉన్న కుటుంబాల్లో పుల్లలు పెట్టడం.మరీ టీవీల్లో చూపించినంత అధ్వాన్నంగా ఉండదు, నిజ జీవితాల్లో. కానీ ఉన్న కాస్తనీ అతిశయోక్తిగా చూపిస్తేనే కదా టీవీ వాళ్ళ TRP లు పెరిగేది !అదిగో దాన్నే సొమ్ముచేసికుంటున్నారు వాళ్ళు.

    కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటేనే కదా. ఇంటి మొగాళ్ళిద్దరూ just passive souls లోకే వస్తారు. వీరిప్రమేయం అసలుండదు.అధవా ఉన్నా, ఏదో తమఅస్థిత్వం చూపించుకోడానికి, ఏదో మాటవరసకి ఓ సలహా ఇస్తారు, వాళ్ళకీ తెలుసు ఎవరూ వినరని ! అయినా మానవప్రయత్నమంటూ ఒకటి చేయాలిగదండీ. ఇవన్నీ పూర్వకాలపు పరిస్థితులు.
ఈరోజుల్లో కోడళ్ళ ఆలోచనా పధ్ధతులు కొద్దిగా మారుతున్నాయి.ఎంత అవసరంలేదనుకున్నా, పెద్దవాళ్ళు దగ్గరలో ఉంటే ఉపయోగాలు చాలానే ఉంటాయి. వయసొచ్చిన కూతురుందనుకోండి, ఆ పిల్లకి “అమ్మ” అనే ప్రాణీ, తనకి పెళ్ళై ఇంకో పిల్లకో,పిల్లాడికో తల్లయేవరకూ బధ్ధశత్రువే.అలాటప్పుడు ఇంట్లోనో, ఇంటికిదగ్గరలోనో, తల్లో,అత్తగారో ఉంటే వాళ్ళైనా నయానో భయానో , ఈ పిల్ల బాగోగులు చూసుకుంటారు. ఎంతైనా అమ్మమ్మా, నానమ్మలతో అనుబంధం వేరుగా ఉంటుంది.

   భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూన్న ఈ రోజుల్లో, ఇళ్ళల్లో ఎవరోఒక పెద్దవారుండడంలో ఉండే ఉపయోగాలు కోకొల్లలు. ఈవిషయం కోడళ్ళు కూడా గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ సందర్భంలోనే అనుకుంటా, ప్రతీదానికీ తలా తోకాలేకుండా “దినోత్సవాలు” పాటిస్తున్నట్టే , ఈ “అత్తగార్ల” క్కూడా ఓ రోజు కేటాయించారు. శుభం !
2011 లో ఆంధ్రభూమి దిన పత్రికలో ఒక వ్యాసంDilmil వ్రాశాను. ఓసారి చదవండి.

   పురాణకాలంలో అత్తాకోడళ్ళు ఎంతో సఖ్యతగా ఉండేవారూ , అసలు గొడవలన్నీ ఈ నవతరానికే వచ్చాయీ అనే అపోహలో ఉండేవాడిని. కానీ ఈమధ్య గృహలక్ష్మి అనే మాసపత్రిక చదువుతూంటే తెలిసింది. 1936 అంటే 80 ఏళ్ళ క్రితమే మారాయని. 1936 అక్టోబరు సంచికలో శ్రీమతి తాడి నాగమ్మ గారు ” మానవ పరిణామము” అనే వ్యాసంలో స్త్రీలలో ఆనాటికీ ఈనాటికీ వచ్చిన మార్పులంటూ ప్రస్తావించారు.Grihalakshmi )ct 1936

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” నోరు మంచిదైతే ఊరంతా మంచిదే.”

    మేము ప్రస్థుతం ఉంటున్న ఏరియా చాలా hi-fi లెండి. అందరూ ఐటీ కంపెనీల్లో పనిచేసేవారే. బయటికీ, ఇక్కడకీ ధరల్లో చాలా తేడా కనిపిస్తూంటుంది. డబ్బుల గురించి ఎవరూ పట్టించుకోరు. బేరం అనేదే కనిపించదు. అలాగని ఆ కొట్టువాళ్ళు ధర తగ్గించి ఇవ్వరని కాదూ, బేరం అంటూ ఆడితే వాళ్ళూ అప్పుడప్పుడు తగ్గించి ఇస్తూనే ఉంటారు. “వీళ్ళు అడగరూ, వాళ్ళు ఇవ్వరూ ” అదీ bottom line. మొదట్లో ఇక్కడకి వచ్చినప్పుడు కొద్దిగా భయపడ్డాను, మనకొచ్చే పెన్షన్ తో బతగ్గలమా అని ! కానీ ఈ రెండేళ్ళ అనుభవం వల్లా తేలిందేమిటంటే, మనం ఎలా ఉంటే అవతలివారూ అలాగే స్పందిస్తారూ అని.

    ఈమధ్యన జరిగిన రెండు అనుభవాలతో ఈ విషయం పూర్తిగా స్పష్టం అయింది. ఆ మధ్యన మా ఇంటావిడ, కుక్కరు కి gasket తీసికుని రమ్మంటే, బయటకి వెళ్ళాను.రెండు మూడు కొట్లలో అడిగితే లేదన్నారు. ఇంతలో ఒకాయన ఫలానా కొట్లో తప్పకుండా దొరుకుతుందీ అంటే, వెళ్ళాను. ముందుగా సైజెంతా అంటే ఫలానా అని చెప్పగానే, ఓ సీల్డ్ కవరు తెచ్చి డబ్బులు తీసికున్నాడు. ఆ గాస్కెట్ పడుతుందా లేదా అని నేను అడగా లేదూ, అతను చెప్పా లేదూ. తీరా ఇంటికెళ్ళి సీలు విప్పి కుక్కరుకి పెడితే అదికాస్తా ఓ బెత్తెడు తక్కువయింది ఆ మాత్రం చాలదూ, కుక్కరులోంచి ఆవిరి బయటకు రావడానికీ.. మామూలుగా ప్రతీసారీ అయినట్టే, మా ఇంటావిడకి ఓ ఛాన్సు వచ్చింది, లెక్చెరు ఇవ్వడానికి– “అదేవిటండీ కుక్కరు సైజు చెప్పేరా అసలూ, వాడిచ్చింది మొహమ్మాటపడి తీసేసికున్నారా..” అంటూ. అలా కాదూ సైజు 10 లీటర్లని చెప్పేనూ, పైగా దానిమీద కూడా రాసుందిగా అంటే వినదే. పైగా ఇలాటి ఏరియాల్లో కొట్లవాళ్ళు కొన్నవస్తువు తిరిగి తీసికుంటాడో లేదో కూడా తెలియదాయె, పైగా కవరు చింపేసి సీలుకూడా తీసేశానూ, ఆ యాభై రూపాయలూ గంగపాలేనా అనుకున్నాను. దీనికి సాయం, మా ఫ్రెండొకరు, తనకి జరిగిన అనుభవం కూడా చెప్పేరు, ఆయనకి కూడా ఇలాగే జరిగితే కొట్టువాడు, సీలు విప్పేస్తే తిరిగి ఎలా తీసికొంటామూ అన్నాట్ట . అసలు సీలు విప్పకుండా, ఆ గాస్కెట్ కుక్కరుకి సరిపోతుందో లేదో ఎలా తెలుస్తుందీ ? అయినా కొట్లవాళ్ళకి మనం ఏ గంగలో దిగితే ఏమిటీ, వాడి సరుకు అమ్ముడవాలి అంతే ! ఆ నష్టం ఏదో మనమే భరించాలి. ఆయన చెప్పిన విషయం విని, నాకూ అలాటి సమాధానమే వస్తుందీ, అయినా ఓసారి అడిగిచూద్దామూ అనుకుని, కొట్టతని దగ్గరకు వెళ్ళి విషయం ఫలానా అని చెప్పడంతోనే, ” అరే sorry sir, రేపు తీసికొని రండీ, వీలుంటే కుక్కరు టాప్ కూడా తీసికొని వస్తే, దానికి సరిపోయేది ఇస్తానూ..” అన్నారు. నేను షాక్ తిన్నాను అతని సమాధానం విని, మర్నాడు వెళ్ళి సరిపడే గ్యాస్కెట్ తెచ్చుకున్నాను.

    రెండో అనుభవం నిన్న జరిగింది. మేము రాజమండ్రీ కాపురం పెట్టిన సందర్భంలో, మా అబ్బాయి, వాళ్ళ అమ్మకి, కాలక్షేపంగా ఉంటుందని, పాటలు download చేసి ఓ i-pod ఇచ్చాడు.దానితోపాటు ఛార్జరు, దానికి సంబంధించిన manual కూడా ఇచ్చాడు. ప్రతీరోజూ వాడతామా ఏమిటీ, ఏదో అప్పుడప్పుడు వాడడమే. చివరకి ఎక్కడ పెట్టేమో మరచిపోయాము కూడానూ. వారంలో ఓ రెండు మూడు సార్లు మా మనవడు చి.అగస్థ్య వచ్చి, మా ఆవిడ మొబైల్ మీదా Tab మీదా “దాడి” చేస్తూంటాడు, పాటలు వింటానని. పాపం వాడు సరీగ్గానే ఉపయోగిస్తాడు, భయమల్లా మనకే, ఎక్కడ పాడైపోతుందో అని. పైగా వీటికి రిపేర్లొచ్చాయంటే తడిపి మోపెడవుతుంది. అంత భరించే ఓపికా లేదాయె. వాడి చేతికందకుండా ఉంచడం most economical అని
ఫిక్సయిపోయింది మా ఇంటావిడ.నిన్న దేనిగురించో వెదుకుతూంటే ఆ i-pod కాస్తా కనిపించింది. మనవడొచ్చినప్పుడు దీన్నిస్తే హాయిగా వాడిక్కావాల్సిన పాటలు వింటాడూ, వాడూ సంతోషిస్తాడూ, అనుకుని అసలు దాని ప్రస్థుత అవస్థ ఏమిటీ అని చూస్తే, స్థబ్దుగా ఉంది. పాపం అదిమాత్రం ఏం చేస్తుందీ తీండీ, నీళ్ళూ చూసి ఎన్నాళ్ళయిందో ( అంటే battery charging అన్న మాట!). పోనీ ఆ charger ఎక్కడుందో తెలుసా అంటే అదీ లేదూ. పోనీ ఇంట్లో ఉండే chargers తో పనవుతుందా అంటే అదీ లేదూ. వాటికి మిగిలినవి పట్టవుట. సరే అనుకుని దగ్గరలో ఉండే కొట్టుకి, ఈ i-pod తీసికుని వెళ్ళి, దీనికి సరిపడెది ఇమ్మంటే, ఓ రెండు మూడు ట్రై చేసి, మొత్తానికి ఇచ్చాడు. ఆ కొట్టులోనే ఓసారి ఛార్జ్ చేసి, ప్రాణం పోశాడు. ఖరీదెంతా అంటే మూడు వందలన్నాడు. ఓరినాయనోయ్ ఇంత ఖరీదా అంటే , ఇది డూప్లికేటూ, ఒరిజినల్ కావాలంటే 1500 అనడంతో నోరుమూసుకుని తీసికున్నాను. పోనీ మూడొందలు పెట్టి కొన్నాముకదా, దీనికి గ్యారెంటీ ఏమైనా ఉందా అని అడిగితే, ఇలాటివాటికి గారెంటీలూ అవీ ఉండవూ, ” రాత్ గయీ బాత్ గయీ ” అని ఓ కవిత కూడా చెప్పేడు. పోనీ ఇంటికెళ్ళి ప్రయత్నించి, పనిచేయకపోతే ఏం చేయనూ అన్నాను. ” రాత్ గయీతో హీ బాత్ జాయెగీ..” అని నవ్వేశాడు. సరే అని ఇంటికొచ్చి చూస్తే ఏదో మొదట కొంచం సేపు బాగానే పనిచేసి, తరువాత మొండికేసేసింది.సరే అని మళ్ళీ ఆ కొట్టుకి ( దగ్గరలోనేలెండి), వెళ్ళి చూపించాను. ఈలోపులో, ఆ కొట్టువాడు ” మొదట్లోనే చెప్పేముగా.. etc..etc..” అని కానీ ఏదైనా అంటే, నేనుకూడా ఏమేం మాట్లాడాలో రిహార్సెల్ వేసేసికుని, అదేదో acceptance speech లాటిది తయారుచేసేసికున్నాను- మరీ ఇంత లూటింగా… etc..etc.. అని ! తీరా కొట్టుకి వెళ్ళి అతనికి చూపిస్తే నా
అదృష్టం బాగుండి, అక్కడకూడా పనిచేయలేదు.నేనూ, వీధిన పడే అవసరం లేకుండా, సొరుగు తీసి 300 రూపాయలూ చేతిలో పెట్టాడు ! కథ సుఖాంతం. ఇంక మళ్ళీ అలాటి adventures
చేయకుండా, చచ్చినట్టు వెదికి ఆ original charger ఎక్కడుందో పట్టుకోవాలి.

    చెప్పొచ్చేదేమిటంటే ఇక్కడనే కాదు, ఇంకో చోటైనా సరే, మనల్నీ బట్టే ఉంటుంది. మన మాట పధ్ధతీ, ప్రవర్తనా, పెద్దమనిషి తరహా అనండి, ఇవన్నీ కలిపితేనే కదా ” మనం ” అనేదానికి నిర్వచనం . మన “రూపం ” తో సంబంధం లేదు ఇలాటివాటికి. “ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే”.

%d bloggers like this: