బాతాఖానీ- తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–మన తెలుగు చానెళ్ళు

    మేము పూణే లో ఉన్నప్పుడు, మా కేబుల్ టి.వీ. వాడు రెండంటే రెండే తెలుగు చానెల్స్ ఇచ్చేవాడు. అదికూడా అన్నిరోజులూ ఉండేది కాదు. మనమేదో మన దేశం ( తెలుగు) గురించి ఎదో మిస్ అయిపోతున్నామనుకొని, TataSky కనెక్షన్ తీసికొన్నాము, అదికూడా ఇంట్లో రెండు టి.వీ లున్నాయి కాబట్టి రెండు కనెక్షన్లు.అదేదో కొత్త మోజు అన్నట్లు వాడిచ్చే 9-10 తెలుగు చానెల్సూ చూసేవాడిని. తెలుగు సినిమాలూ,మొదట్లో బాగానే ఉండేవి చూడడానికి, క్రమక్రమంగా అవేసినిమాలు నెలలో రెండేసి సార్లైనా చూడవలసివచ్చేది. ఒకసారి BlockBuster Movie అనీ, ఇంకోసారి Box Office Hit అనీ, మరింకోసారి Movie of the Month అనీ చూడవలసి వచ్చేది.వీడిల్లు బంగారంగానూ, ఒకే సినిమాని ఎన్నిసార్లు చూపిస్తాడో అదీ ఒకే నెలలో !

    ఏడాది నుండీ రాజమండ్రీ లో ఉండడం వలన ఇంకో అరడజను చానెల్స్ చూసే భాగ్యం కలిగింది. కనీసం ఇందులో కొన్ని మంచి చానెల్స్ చూడకలిగేము–భక్తి ట్.వి. సితార టి.వి, వనిత టి.వి. నీజంగా ఈ మూడు చానెల్సూ ఎంత బాగున్నాయో, వివిధ రకాలైన Variety Entertainment చూశాము. ఈ మూడు చానెల్సూ బాగుండడానికి కారణం నా ఉద్దేశ్యం లో వీటిలో
News programme లేకపోవడమే.భక్తి వారి ధర్మమా అని శ్రీ గరికపాటివారి మహాభారతం, మేఘసందేశం, రామాయణం వినగలిగాము. అలాగే వనితా లో అనుకుంటా ప్రతీ ఆదివారం పొద్దుట శ్రీమతి విజయలక్ష్మి దేసికన్ గారి ద్వారా తెలుగు/ హిందీ పాటలలోని మాధుర్యం తెలిసికోగలిగాము.

    ఒకటి రెండు తప్పించి ఈ చానెల్స్ లో వచ్చే సీరియల్స్ గురించి Less said the better. తల తిరిగిపోతుంది ఆ మ్యూజిక్కూ, డబ్బింగూ, వినేటప్పటికి ! ఏమైనా అంటే ఆ చానెల్స్ యొక్క TRP ల గురించి చెప్తారు. కావల్సివస్తే చూడండి లేకపోతే మానేయండి, మీరొక్కరూ చూడకపోవడం వల్ల మాకేమీ నష్టం లేదూ అంటారు. ఇంక మన ఆంధ్ర దేశం లో ఉన్న చాలా మంది నారీమణులు, యువతా కూడా ఈ సీరియల్స్ లోని పాత్రలతో identify చేసేసికొని వాళ్ళే హీరోలూ, హీరోయిన్లూ అనుకుంటారు.

    మొదట్లో అంటే కేబుల్ టి.వి వచ్చిన కొత్తలో శ్రీ బాలూ గారు ఈ.టి.వి లో ప్రారంభించిన ” పాడుతా తీయగా ” కార్యక్రమం ధర్మమా అని మంచి గాయకులు గుర్తించబడ్డారు. పైగా ఆ రోజుల్లో అది ఒకటే కార్యక్రమం అవడంతో అందరికీ నచ్చేది. క్రమక్రమంగా అన్ని చానెళ్ళూ మొదలెట్టేశాయి. చూసిన వాళ్ళనే చూడడం. పైగా ఇంకోటి ఆ కార్యక్రమాల ప్రసార సమయం కూడా ఒకే టైములో పెడతారు. ఏది చూడాలో తెలియదు. చిన్న చిన్న పిల్లలు మంచి మంచి పాటలు పాడుతూంటే వినడానికి చాలా బాగుంటుంది.కానీ వాళ్ళ elimination round వచ్చేటప్పటికి మాత్రం భరించలేము. వాళ్ళ ఏడుపులు, వారి తల్లితండ్రుల భారీ డయలాగ్గులూ అన్నీ dramatize చేసేస్తారు. కొన్ని వాటిల్లో వచ్చే జడ్జీ లు చాలా బాగా analyse చేస్తారు.

    అన్నింట్లోకీ horrible కార్యక్రమం న్యూస్. ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే మన చానెళ్ళ ప్రతినిధుల behaviour చూసి నవ్వాలో ఏడవాలో తెలియదు. ఈ చానెళ్ళవాళ్ళ కోసమే వేచి ఉన్నట్లుగా మైక్ పుచ్చుకొని దొరికిందే చాన్స్ అని జరిగిన సంఘటన గురించి చిలవలూ, పలవలూ చేసేసి మనని బోర్ కొట్టేస్తాడు.జరిగిన దానికంటే మన ప్రతినిధుల అభిప్రాయాలే ఎక్కువ.
మొన్నెప్పుడో ఓ చానెల్ వాడు, అదేదో ఊళ్ళో ఓ కుర్రాడు టెలిఫోన్ టవర్ ఎక్కి అక్కడనుంచి దూకేస్తానన్నాడుట–కారణం- ఈ బడుధ్ధాయి ప్రేమించిన పిల్ల వీడిని వద్దందిట.ఇదంతా మనకి ప్రత్యక్ష ప్రసారం చేసి మనకి విందు చేశారు. ఆ ఊరు వెళ్ళి వాడిని టవర్ మీదనుండి తోసేయ్యాలంత కోపం వచ్చింది. ఆ బడుధ్ధాయి, ఓ రెండు గంటల తరువాత కిందకి దిగాడు.ఈ చానెల్ వాళ్ళకి ఇంతకంటే ముఖ్యమైన న్యూస్సే దొరకలేదా?

    ఎక్కడైనా నేరస్థుల్ని పట్టుకుంటే వాళ్ళతో ఇంటర్వ్యూలూ, వాడేదో దేశనాయకుడిలా పోజు పెట్టి ఏదో వాగుతాడు,అయినా వాళ్ళనని ఏం లాభం? మన రాజకీయ నాయకులైతే Bunch of jokers. ఈ మధ్యన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య అదేదో సయోధ్య కుదిరిందిట, అప్పటి దాకా కోర్టుల్లో కొట్టుకు చచ్చారు. ఇంకా ఖర్చెందుకని టి.వి. వాళ్ళని పిలిచి ఓ వెర్రి నవ్వు నవ్వేసి అందరినీ ఫూల్ చేశారు! ఆ నాయకులెలా పోతే మనకెందుకూ. అందరూ ఒకళ్ళకొకళ్ళు కావలిసిన వాళ్ళే. మనని అంటే ప్రజల్ని వెర్రి వెధవలు చేస్తున్నారు.తిన్న తిండి అరక్కపోతే ఓ చానెల్ వాడిని పిలవడమూ, ఎదేదో చెత్త వాగడమూ.

    ఇంక మన శాసనసభా కార్యక్రమాలు చూడడం ఒక Comedy show చూసినట్లుగా ఉంటుంది.ఎవడూ ఎవడి మాటా వినడు.వీళ్ళని చూసి మన యువత పాడైపోతూంది.ఆ నాయకుడికేదైనా బయట engagement ఉంటే, ఏదో వంక పెట్టి Walk out,/b> చేసేయడం.ఇక్కడే కాదు, మన పార్లమెంట్ కూడా అలాగే తగలడింది. ఆ అరుపులేమిటండీ, కుర్చీలు విసిరికోవడేమిటండీ
సిగ్గూ ఎగ్గూ లేదు , వీళ్ళకి ఎలాగూ 5 సంవత్సరాల దాకా మన మొహం చూడక్కర్లెదు.

    మన సినిమాల వాళ్ళు వీళ్ళని imitate చేస్తున్నారా లేక వీళ్ళు సినిమాలు చూసి ఇలా తయారయ్యేరా తెలియదు.ఇదివరకటి రోజుల్లో మన శాసన సభ్యులు ఎలా ఉండే వారు? ఏ పార్టీ కి చెందిన వారూ అని కాదు ప్రశ్న, వారి Dignity, Statesmanship ఇప్పటి వారిలో చూడగలమా?శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు, శ్రీ వావిలాల, శ్రీ లచ్చన్న గారూ, శ్రీ కళా వెంకట్రావు గారూ, మన దురదృష్టం కొద్దీ ఆ రోజుల్లో టి.వీ లూ, ప్రత్యక్షప్రసారాలూ లేకపోవడం వల్ల వారి speeches వినే భాగ్యం మనకి కలగలేదు.మర్నాడి పేపర్లే గతి.దాంట్లోనే చదువుకోవడం.
మన టి.వీ చానెళ్ళు బాగుపడే రోజు వస్తూందా? ఏమో భగవంతుడికే తెలియాలి !