బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు-పొల్యూషన్

ఒకానొకప్పుడు వాతావరణం లో మార్పు వచ్చి, ఎండలు ఎక్కువైనప్పుడు, కిటికీలకి వట్టివేళ్ళ తడకలని ఉండేవి, ఆ తడకలు కట్టి వాటిమీద నీళ్ళు చల్లి, ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకునేవారు…  కాలక్రమేణా Air Coolers, Air Conditioners  ఆవిష్కరించబడ్డాయి. ఎవరి స్థోమతని బట్టి వారు, ఏదో ఒకటి అమర్చుకుని  ఇళ్ళలోనూ, ఆఫీసుల్లోనూ  వాతావరణం చల్లబరుచుకుంటున్నారు. Global warming  ధర్మమా అని, వాతావరణం  వేడెక్కిపోతోంది…

ఇలాటి వాతావరణ మార్పులకు ముఖ్యకారణం, ఎక్కడా చెట్టూ చేమా ఉండకపోవడమే… రోడ్లు వెడల్పు చేయాలంటే, ఎన్నో సంవత్సరాలపూర్వం నాటిన పెద్దపెద్ద చెట్లు ముందర బలి అయిపోతున్నాయి… అలాగే ఉన్న చెట్లు కొట్టేసి, ఆ స్థానంలో పెద్దపెద్ద ఎపార్టుమెంట్లు వచ్చేస్తున్నాయి.  మట్టిరోడ్లూ, కంకర రోడ్లూ,   concrete  లోకి మారిపోయాయి. వర్షాలకి పడ్డ నీళ్ళు, మట్టిలో ఇంకి, , చెరువుల్లోనూ, నూతుల్లోనూ సంవత్సరమంతా నీళ్ళు పుష్కలంగా ఉండేవి. ఈరోజుల్లో మట్టీలేదూ, నీళ్ళు ఇంకడాలూ లేవు… దానితో భూగర్బజలాలు ఎండిపోయాయి.  దీనితో సొసైటీల్లో తవ్విన బోరుబావుల లో నీళ్ళనేవి కనిపించడంలేదు. అందుకే ఈరోజుల్లో ఎక్కడ చూసినా నీళ్ళ ట్యాంకులద్వారానే  నీళ్ళు. ..

ఇంక ఎండ వేడిని తట్టుకోవడానికి  పెద్దపెద్ద  కార్పొరేట్ ఆఫీసుల్లో, మొత్తం బిల్డింగంతటికీ  ఎయిర్ కండిషనింగూ, అదికూడా  Centrally Airconditioned.  వీటిలో ఉండే ఇబ్బందేమిటంటే, కర్మవశాత్తూ ఆ  AC Duct  లో ఎక్కడో  short circuit  అయి, మంటలు చెలరేగి  మొత్తం బిల్డింగంతా ఆహుతైపోవడమూనూ.. ప్రమాదాలు పొంచిచూస్తూంటాయి. ఏ   బహుళాంతస్థుల బిల్డింగ్ లోనైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు, చెప్పే కారణం ఇదే… పెద్దపెద్ద కార్పొరేట్ Hospitals  లోకూడా ఇలాటివి చూస్తూంటాము..

 ఆరోజుల్లో ఇళ్ళల్లో  అన్నం మిగిలిపోతే, తరవాణి లో ఆ అన్నాన్నుంచి, మర్నాడు పొద్దుటే చద్దన్నంగా తినిపించేవారు. అలాగే కూరగాయలు కూడా ఓ బుట్టలో పోసుకోవడమో, లేక ఇంట్లోనే ఏ పెరట్లోనో ఓ తోటలాటిదుంటే, అందులోనే కూరగాయల మొక్కలు నాటుకుని, ఏరోజుకారోజు కూర కోసుకోవడమే… అయినా ఆరోజుల్లో కూరగాయలు కూడా, ఏ సంతనుండైనా తెచ్చినవైనా సరే, ఓ నాలుగురోజులపాటు పాడవకుండా ఉండేవి… కానీ ఈరోజుల్లోనో,   Fertilizers and Pesticides  ధర్మమా అని, బయటనుండి తెచ్చిన కూరగాయలు, మహా అయితే ఓ రోజు తాజాగా ఉంటాయంతే. అలాగని రోజూ కూరలు తెచ్చుకోవడంకూడా కష్టమే…  Refregirators  ఆవిష్కరించిన తరవాత పరిస్థితి బాగుపడింది. ఈరోజుల్లో ఏ ఇంటిలో చూసినా, ఏదో ఒక సైజుది  Refregirator  లేని ఇల్లులేదంటే ఆశ్చర్యం లేదు.

అలాగే  పొలాలనుండీ, తోటల నుండీ , కూరగాయలూ, పళ్ళూ, పాలూ  టోకున కొనేసి, చిన్నచిన్న వ్యాపారస్థులకి Supply  చేయడం చూస్తూంటాము.. పెద్ద ఎత్తున వాటిని కొనేయడంతో సరిపోదుగా, అవి పాడవకుండా చూడడానికి  మళ్ళీ  Cold Storage  లు  రంగంలోకి వచ్చాయి…  ఈరోజుల్లో, కూరగాయలు కాపాడ్డం దగ్గరనుండి,   Hospitals  లో శవాలు ఉంచేదాకా  ఎక్కడ చూసినా  Cold Storage  లే.

ఇన్నిచోట్ల వేడిని తట్టుకోడానికి, ఇన్నేసి సాధనాలుండగా, ప్రయాణవ్యవస్థ మాటేమిటీ ?  ఇదివరకటి రోజుల్లో ఏ బస్సులోనైనా వెళ్తున్నప్పుడు, కిటికీ తెరిస్తే శుభ్రమైన చల్లగాలికి నిద్ర పట్టేసేది.. కానీ ఈ రోజుల్లోనో దుమ్మూధూళీ తో నిద్రమాటదేవుడెరుగు రోగాలొస్తున్నాయి… దానితో చిన్న చిన్న కారుల దగ్గరనుండి,  దూరప్రయాణాలు చేసే పెద్దపెద్ద బస్సులదాకా అన్నీ ఎయిర్ కండిషండే.. రైళ్ళ సంగతి సరేసరి. ప్రతీ   Train  కీ కనీసం ఓ నాలుగు  AC Coaches  తప్పనిసరైపోయింది… సినిమాహాళ్ళ సంగతైతే అందరికీ తెలిసిందే..

వీటిల్లో కొన్ని కష్టాలుకూడా ఉన్నాయి— ఒకానొకప్పుడు  Ventilation  అనేది ఉండడం వలన, మనిషి ఆరోగ్యకరమైన గాలి పీలుస్తాడనేవారు. కానీ ఈ  AC  లవలన, లోపలవారికి ఊపిరాడదేమోనంత దుస్థితి.. అయినా సుఖాలకి అలవాటు పడితే. వాటితో కష్టాలుకూడా అనుభవించాలిగా..

ఈ కొత్తగా వచ్చిన Lock Down  ధర్మమా అని, కొన్ని మంచి మార్పులు—వాతావరణ కాలుష్యానికి సంబంధించినంతవరకూ – వచ్చాయి.. రోడ్లమీద మోటారు వాహనాలే లేకపోవడంతో.. air pollution  అనేది పూర్తిగా తగ్గిపోయిందిట..అలాగే నదీ కాలుష్యం కూడానూ.. శబ్దకాలుష్యం కూడా అసలు లేదు..దీనర్ధం ఏదైనా మన ప్రాణం మీదకు వస్తే తప్ప, కంట్రొల్ అవదని తేలిపోయింది..ప్రాణభయంతో మొత్తానికి మే మొదటివారం దాకా ఈ Lock out ఉపయోగించడం ఖాయం.. కానీ ఆతరవాత మన ప్రవర్తన ఎలా ఉంటుందీ అన్నదే అసలు ప్రశ్న.. ఎలాగూ అలవాటుపడిపోయారు కదా, ఇదే పధ్ధతిలో కంటిన్యూ అయిపోతారూ అని కొందరూ… అబ్బెబ్బే అలా ఏం కాదూ.. ఈ  restrictions  ఎత్తేసిన తరువాత, అంతా ఇదివరకటిలాగే ఉంటుందీ అని కొందరూ, ఇప్పటికే బెట్టింగ్స్ కూడా వేస్తున్నారు.మన దేశంలో ప్రతీదానికీ బెట్టింగే కదా..

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– లౌడ్ థింకింగ్

    ఈ రోజుల్లో మన యువతరం, మాలాగ ఒకే ఉద్యోగానికి వేళ్ళాడరుగా. ,ఎక్కడ బాగా జీతం వస్తే అక్కడికి మారిపోతూంటారు. దానికి నేను తప్పు పట్టడం లేదు. ఏదైనా ఉద్యొగం చేసినప్పుడు దానిలో Job satisfaction అనేది ఉండాలి. నాకు ఒక విషయం అర్ధం అవదు–ఈ, Job satisfaction అంటే ఏమిటీ–నిజంగా ఇదే కారణం అయితే, మనం చేసే job ఏదైనా అందులో కూడా ఆనందం పొందవచ్చు. చెప్పేదేమిటో క్లియర్ గా ” డబ్బు” కోసమే మేము జాబ్ లు మారుతామూ అని ఒప్పుకుంటే, ఇంకా నిజాయితీ గా ఉంటుంది.

    ఇదివరకటి రోజుల్లో ఎలా ఉండేదీ– మాస్టారి అబ్బాయి మాస్టారే అయ్యేవాడు, బి.ఇ.డీ లేక సెకండరి గ్రేడ్డో. తాలుకాఫీసులో పనిచేసేవారి కొడుకు అందులోనే చేరేవాడు. డాక్టర్ గారి పిల్లలు డాక్టర్లే, ప్లీడర్ గారి పిల్లలు ప్లీడర్లే– ఎదో అక్కడక్కడ వీటిలో కొంచెం మార్పుండేది.70 ల దశకం ప్రారంభం అయిన తరువాత వచ్చిన జనరేషన్ కి ఇదేమీ నచ్చలేదు.ఇంకా పాతచింతకాయ పచ్చడిలా, ఉంటే ఎలాగా అని ఆలోచించారు. అవకాశాలు కూడా అలాగే వచ్చేవి. జీవితం అంతా పరుగులు పెట్టడం ప్రారంభం అయింది. డబ్బే ప్రధానమయ్యింది జీవితానికి, అది సంపాదించాలంటే ఎన్నెన్నో openings కనిపించాయి. మరీ డబ్బుకోసం ఉద్యోగం మారుస్తున్నామనుకోవడానికి మొహమ్మాటం వేసి ఈ job satisfaction అనే కొత్త పదానికి శ్రీకారం చుట్టారు.కొంతమందైతే  Job Profile  బాగోలేదంటారు..
ఇప్పటివారు చెప్పే ఈ కొత్త పదానికి పాత వారు ఎలా అర్ధం చెప్తారు? వాళ్ళు చేసేది ఏ పనైనా పూర్తి sincerity తో చేస్తే అందులోనే ఆనందం కనిపిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగాలేమీ  bed of roses  కాదు, ఎంత సిన్సియర్ గా పనిచేసినా, రావాల్సిన ప్రమోషన్ మరొకడికి వస్తుంది,వాడెంత జూనియర్ అయినా, ప్రభుత్వాలు గత 73 ఏళ్ళుగా కొనసాగిస్తూన్న కొన్ని ప్రత్యేకతలవలన..అలాగని ఉద్యోగాలు మార్చలేదే?    వాళ్ళే
 ఇప్పటివాళ్ళలాగ, రోజుకో ఉద్యోగం మార్చి ఉంటే, వీళ్ళు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివేవారా, ఉద్యోగం స్థిరంగా లేకపోతే డబ్బెక్కడినుండి వస్తుందీ, చదువులూ, పెళ్ళిళ్ళూ ఎలా చేసేవారు? ఏమైనా అంటే ఇప్పటివారు చెప్పే explanation ఒక్కటే–అప్పటి వారు జీవితం తో reconcile అయిపోయారు అని. ఒప్పుకున్నామండి.దానివల్ల లాభం ఎవరికి వచ్చిందీ?

ఇంకా ఏమైనా అంటే అప్పటికీ, ఇప్పటికీ సహస్రాలు తేడా ఉందీ, ప్రపంచం అంతా స్పీడ్ గా వెళ్తోందీ, మీలాంటివారు ఇంకా పాత జ్ఞాపకాలలోనే బ్రతుకుతున్నారూ అంటారు. ఒక్కటి చెప్పండి-ఇప్పటి వారికేమైనా మాలాంటివారి కొచ్చే Feel good జ్ఞాపకాలు ( ఉద్యోగాలకి సంబంధించినంత వరకూ) ఉన్నాయా? ఉండడానికి ఒకే ఉద్యోగంలో ఉన్నవాళ్ళెంతమంది? నాకు ఒక విషయం అర్ధం అవదు. మనం రోజూ తినే తిండితో బోర్ అవుతామా? రోజూ చూసే పిల్లలతో బోర్ అవుతామా? లేనప్పుడు రోజూ చేసే పనితో బోర్ ఎలా అవుతాము?,

    మనింటికి ప్రతీ రోజూ పని మనిషి వస్తుంది, చాకలి బట్టలు తీసుకుని వెళ్తాడు, పాల వాడు పాలు తీసికొస్తాడు, ఒక్కసారి ఊహించుకోండి వీళ్ళంతా వారి వారి పనులతో బోర్ అయిపోయి,
So called job satisfaction అనే వంక తో పని మానేస్తే ఎలా ఉంటుందో?
 నేను చెప్పేదేమిటంటే ఏదో ఒక ఉద్యోగంలోనైనా కొన్ని సంవత్సరాలు పని చేసి, ఆ పనిలొ నిమగ్నమై
జీవితంలో కొంత సమయమైనా ఈ Feel good అంటే ఏమిటో తెలిసికోవడానికి ప్రయత్నించమని.ఇదంతా పాత రాతి యుగం ఖబుర్లలాగా ఉన్నాయంటారు కదూ?
నేను వ్రాసినదంతా ప్రతీ ఏడాదీ ఉద్యోగాలు మార్చేవారి గురించి మాత్రమె.
 మనం చేసే ప్రతీ పనిలోనూ ఏదో ఒక ఆనందం ఉంటుంది. దానిని గుర్తించి, దానిని enjoy చేయడంలోనే ఉంది.

గత నెల రోజులుగా మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా, ఉద్యోగస్థుల దృష్టికోణం లో కూడా మార్పులు చూడొచ్చేమో… ఈ  Lock Down  పూర్తయేటప్పటికి, అసలు ఎంతమందికి ఉద్యోగాలుంటాయో తెలుస్తుంది.. అలాగని ఉద్యోగాలు ఊడిపోతాయనీ కాదు.. ఏమో what the future holds for us  అన్నదానికి గారెంటీ లేదుగా.. అయినా అంతా మంచే జరగాలని ఆశిద్దాం..

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..చట్టాలు…

 చట్టాల దారి చట్టాలదీ.. మన దారి మనదీ…

మనదేశంలో, చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం ఏమైనా ఉందా అంటే, ప్రభుత్వాలు చేసిన చట్టాలూ, సాంప్రదాయాలూనూ అనడంలో సందేహం లేదు. పట్టించుకోకపోవడం మాట అటుంచి, ఎవరైనా పెద్దమనుషులు, వాటిని పట్టించుకోవడం చూస్తే, వారిని వేళాకోళం చేయడమోటీ. దానితో ఎవరికివారే, “ మనకెందుకొచ్చిన గొడవా…” అనుకోడం.. దీనితోనే, సమాజంలో జరిగే , నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పోనీ, చట్టాలు కాపాడాల్సినవారు, ఏమైనా తమ విధులు సరీగ్గా నిర్వర్తిస్తున్నారా అంటే, అదీ తక్కువే.  ఎక్కడో, నూటికీ, కోటికీ ఒకరో, ఇద్దరో నిజాయితీ మనుషులు కనిపిస్తారు. పోనీ, వాళ్ళైనా క్షేమంగా ఉంటారా అంటే, అదీ లేదూ.. ఏరంగం తీసికున్నా, ఇదే రంధి. సునితంగా పరిశీలిస్తే, మనకే తెలుస్తాయి.

దేశంలో జరిగే ప్రతీ విషయానికీ, ఓ చట్టం చేసేశారు, మనరాజ్యాంగ కర్తలు. వచ్చిన గొడవేమిటంటే, ఆ చట్టంలో, వాటిని ఎలా, చట్టబధ్ధంగా అతిక్రమించొచ్చో, వెసులుబాట్లు కూడా చెప్పేశారు. ఏమాత్రం బుర్రలో “గుజ్జు” ఉన్నవాడైనా, వీటిని హాయిగా ఉపయోగించేసి, బలాదూర్ గా తిరిగేస్తున్నాడు. పైగా, ఏమైనా అంటే, “చట్టప్రకారమే కదా చేశానూ” అంటాడు. కావాల్సిందల్లా, అధికారమూ, లేదా కనీసం, అధికారం లో ఉన్నవాడితో పరిచయం..

ఉదాహరణకి, 18 సంవత్సరాల వయసు వచ్చేవరకూ, పిల్లలకి డ్రైవింగు  లైసెన్సు ఇవ్వకూడదూ అని ఓ చట్టం ఉంది. కానీ, ప్రతీరోజూ మనం చూసేదేమిటీ? స్కూలుకో, ట్యూషనుకో , ఒ పిల్లో, పిల్లాడో  జుయ్యిమంటూ స్కూటీ మీదో, బైక్కుమీదో  వెళ్ళడం. పైగా ఒక్కరే కాదు, మొగపిల్లలు ఓ ముగ్గురూ, ఆడపిల్లలైతే ఇద్దరూ, హెల్మెట్ అనేది ఉండాలి అని ఓ చట్టం ఉంది. కానీ, చాలా నగరాల్లో, వీటిని పట్టించుకునే వాళ్ళే లేరాయె. అటు తల్లితండ్రులూ, అలాగే ఉన్నారు, పిల్లల సంగతి సరే సరి. మన మనస్థత్వం ఏమిటంటే, ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి, దాన్ని ఉల్లంఘించడం మన జన్మహక్కు. బస్…

 ఏడాదికోసారి, అవేవో పాన్ మసాలాలూ, ఘుట్కాలూ, నిషేధించామంటారు. అయినా సరే, తినేవాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి.. ఇంక టీవీల్లో యాడ్లు కూడా, ఆ కంపెనీ తయారు చేస్తూన్న ఇంకో పదార్ధం పేరుతో చూపించేస్తూంటారు.

 ఇంక ట్రాఫిక్కు సంగతి అడగొద్దు. ఎర్ర దీపం ఉన్నాసరే,  దూసుకుపోయేవారు కొందరైతే, పోనీ అని ఓ క్షణం ఆగి వెళ్ళేవారుకొందరూ, కొంతమంది బుధ్ధిమంతులు, పూర్తి ఆకుపచ్చ లైటొచ్చేదాకా, కదలరు, అలాటివాళ్ళని,  వెనకాలున్నవారు, హారన్ కొట్టి,కొట్టి  భయపెట్టేవారుకొంతమంది.

 ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల విషయానికొస్తే, చట్టాలలో ఉండే లొసుగులు తెలియచెప్పే , టాక్స్ కనసల్టెంట్ల విషయం ఎవరికి తెలియదూ? మరి నల్లధనం పేరుకుపోతోందంటే పెరగదు మరీ ? ఇంక మన రాజకీయనాయకుల విషలు కూడా, ఈ చట్టాలకి అతీతులే. వాళ్ళేం చెప్తే అదే చట్టం. ఇవన్నీ చట్టానికి బంధించినంతవరకూ.

రాజకీయ నాయకుల విషయమైతే..  less said the better… వారెప్పుడూ,    దివినుండి, భువికి దిగొచ్చిన దైవదూతలనుకుంటారు. పైగా అధికారంలో ఉన్నప్పుడే కాదు, “ మాజీ “ లూ , వారి “  అనునాయులూ”,  ఓ  “ పార్టీ కండువా” వేసికున్న ప్రతీ గల్లీ నాయకుడు కూడా…

పుణ్యక్షేత్రాలలో చూస్తూంటాము– ఫొటోగ్రఫీ నిషిధ్ధమూ అని బోర్డులమీద రాసుంటుంది. అయినా సరే, ఎవరికీ కనిపించకుండా, రహస్యంగా ఫొటోలు తీయడం, కొందరికి ఆనందం. పైగా ఇంకోరితో గొప్పలు కూడా చెప్పుకోవచ్చుగా, మేము ఫలానా చోట ఫొటోలు తీసికున్నామూ అని. కానీ, వారు ఎంత హీనస్థితికి దిగజారిపోయారో వారికే తెలియని పరిస్థితి.  ఆ దేవాలయం అధికారులెవరైనా, ఈ విషయం గమనించి, వారి కెమేరాని, లాక్కుంటే తెలుస్తుంది, … మళ్ళీ దానికీ ఓ “ విరుగుడు “ ఉందండోయ్…  భక్తులమీద దేవాలయ అధికారుల ధాష్టీకం అంటూ, మీడియా ముందర హడావిడి చేయొచ్చు. లేదా కులంపేరుతో, ధర్నాలు చేయొచ్చు. కాదూ కూడదంటే, కెమేరా  ఉపయోగించింది, ఓ స్త్రీ అయితే, కావాల్సినంత కాలక్షేపం… మహిళా సంఘాలన్నీ ఊరేగింపుగా వచ్చి, స్త్రీల హక్కులమీద పేద్ద గొడవ చేయొచ్చు. ఇంతహడావిడిలోనూ, అసలు కారణం తెరవెనక్కు వెళ్ళిపోతుంది.

ఏడాదికోసారి, విద్యాసంస్థలు వసూలుచేసే ఫీజులగురించి, ఓ విధానమో, చట్టమో వస్తూనే ఉంటుంది. అయినా, వాళ్ళు వసూలుచేసే ,  “ మామూళ్ళ “ గురించి, చెప్పే ధైర్యం ఎవడికైనా ఉందా? కారణం, మన ప్రెవేటు విద్యాసంస్థలన్నీ, ఏదో ఒక రాజకీయనాయకుడికి సంబంధించినదే. అలాగే ప్రెవేటు ట్రావెల్స్ కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, ఏ పండగైనా వచ్చినప్పుడు, ఎడా పెడా ఛార్జీలు పెంచేస్తోంటే,  వీళ్ళనడిగేదెవడూ?

 పైగా ఇలాటివాటి గురించి ఎత్తితే “ చట్ట విరుధ్ధం “ అనడం.ఈమధ్యన అయితే దేశద్రోహం అని కూడా అంటున్నారు…. మరో తమాషా ఏమిటంటే, ఒకే చట్టం డబ్బున్నవారికి ఓలాగా, డబ్బులేనివారికి ఇంకోలా వర్తింపచేయడం.. గొప్పగొప్పవారు ఎలాటి నెరాలు చేసినా అదేదో bail  క్షణాల్లో వచ్చేస్తుంది.. కొండొకచో  anticipatory bail  కూడా దొరుకుతూంటుంది..కాదూకూడదనుకుంటే, విదేశాలకి పారిపోవడానికి  Passport, Visa  లు  home delivery  కూడా అవుతూంటాయి..

చట్టాలు వాటికి అప్పుడప్పుడు చేసే మార్పులూ చూస్తూంటే, ఎంతో ఆనందం వేస్తుంది.. ” అబ్బ మన దేశం లో ఎన్ని చట్టాలో.. ” అని..కానీ సాధారణంగా ఈ చట్టాలనబడేవి, నోరులేని అమాయక ప్రాణులమీదే అనడంలో సందేహం లేదు.. సంఘంలో పెద్దమనుషులుగా చెల్లుబాటవుతున్నవారికి తెలుసు.. ఏమీ పరవాలేదూ అని.. ఆమధ్యన ఎలెక్షన్లతరువాత, నేర చరిత్ర ఉన్న ప్రతీ రాజకీయనాయకుడూ, అధికార పార్టీలోకి లైను కట్టారు.. కనీసం ఓ అయిదేళ్ళపాటు గొడవుండదని.. వీళ్ళు ఓడిపోయి మరో పార్టీ వస్తే దాంట్లోకి జంప్.. సిగ్గూ శరమూ ఎప్పుడో వదిలేయబట్టే కదా రాజకీయాల్లోకి వస్త…

 సమాజంలో ఏ “ పెద్దమనిషి” ని అయినా అరెస్టు చేస్తే, వెంటనే ఓ ప్రకటన వింటూంటాము… “ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది “ అంటూ. అలాగే, చట్టం దారి చట్టానిదీ, మన దారి మనదీనూ…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ఆటొమేషన్

 ఒకానొకప్పుడు  ఎవరైనా ఏ పనైనా చేయాల్సొస్తే, స్వయనా చేసుకోవడమో, మహా అయితే  ఆరోగ్యరీత్యానో, వయసురీత్యానో ఇంకోరెవరిచేతో చేయించుకునే వారు. అలాగే ఏదైనా తెలియకపోతే , స్కూల్లో ఉపాధ్యాయులనో, లేక ఇంట్లో ఉండే ఏ పెద్దవారినో అడిగి తెలుసుకునేవారు.

ఉదాహరణకి ఏ లెక్కలో తెలియకపోతే, ముందుగా ఎక్కాలు బట్టీపట్టించేవారు., దీనితో ప్రతీదీ లెక్కకట్టడం సులభంగా వచ్చేది. కొంతమందైతే నోటితోనే లెక్కలు కట్టేవారు—చాకలీ, పాలవాడూ లాటివారు. వాళ్ళకి లెక్కకట్టడానికి ఓ పేపరూ, పెన్సిలూ అవసరమయేవికావు. అలాగని వాళ్ళేమీ పెద్దపెద్ద చదువులు చదివేరనీ కాదు. వ్యాపారంలోకి వచ్చిన తరవాత, కనీసం లెక్కలైనా  వచ్చుండాలని ఓ దృఢనిశ్చయం  లాటిదన్నమాట.. నోటిలెక్కలు రాని, ఏ వ్యాపారస్థుదూ ఉండేవారు కాదు. అలాగే మన ఇళ్ళల్లో  మన అమ్మలూ, అమ్మమ్మలూ కూడా, బయటకెళ్ళి చదువులు చదవకపోయినా, రాయడం, చదవడం, అలాగే లెక్కలు కట్టడం కూడా సునాయసంగా వచ్చేసేది..  Degrees లేకపోయినా, పెద్దపెద్ద రచనలు చేసేవారు… ఎవరిపనులు వారు చేసుకోవడంలోనే ఆనందం పొందేవారు. దీనివలన ఇంకో ఉపయోగమేమంటే, ఆ పనిలో ఉండే సుళువులు కూడా తెలిసేవి, ఇంకోరికి చెప్పగలిగే స్థితిలో ఉండేవారు… ఎవరిపని వారే చేసుకోవడంతో, తమ ఆరోగ్యాలుకూడా బావుండేవి. శరీరంలోని అవయవాలకి , ఆ చేసే పని రూపేణా, మంచి   Exercise  కూడా ఉండేది. ఉదాహరణకి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, స్వంతంగా ఆలోచిస్తేనే కదా, మెదడుకి మేతలాటిదుండేదీ? అలాగే ఏపని స్వంతంగా చేసినా, సంబంధిత అవయవం, తుప్పుపట్టకుండా నాలుక్కాలాలపాటు పని చేసేదీ?

 కాలక్రమేణా, విజ్ఞానమూ  అభివృధ్ధి చెందిందీ, దానితో పాటు, సంబంధిత పనులకి కొన్నికొన్ని , పరికరాలూ, సాధనాలూ పుట్టుకొచ్చాయి… వీటిని ఏదో అత్యవసరానికి ఉపయోగించుకోవడం కాకుండా, ఎప్పుడుపడితే అప్పుడే  ఉపయోగంలోకి వచ్చి, అవి లేకపోతే మన జీవితమే వ్యర్ధమన్నంతగా తయారైపోయాయి…దీనివలన మనుషుల్లో బధ్ధకం, ఊబకాయం, లేనిపోని ఆరోగ్యసమస్యలూ మొదలయ్యాయి… ఆ తరంవారికీ, ఈతరంవారికీ స్పష్టంగా కనిపించే తేడా ఇదే… ఇదివరకటిరోజుల్లో శుభ్రమైన తిండీ, గాలీ ఉండడంతో విడిగా వ్యాయామాలూ, పరిగెత్తడాలూ అవసరమయేవి కావు.. ఓరకమైన క్రమశిక్షణ ఉండేది… అలాగని ఇప్పుడు లేదా అనీ కాదూ, ఉంది.. కానీ ఏ పనిచేయడానికైనా దానికో మెషీనూ, అది బాగా పనిచేసినంతకాలమూ గొడవలేదు. ఏ కారణం చేతైనా మూలపడిందా, మనం వీధిన పడిపోతున్నాము..

ఉదాహరణకి, ఏ పచారీ కొట్టుకైనా వెళ్ళి  పప్పులూ, ఉప్పులూ తీసుకున్నామనుకోండి, ధరని బట్టి, మొత్తం ఎంతయిందో నోటితో లెక్కకట్టడానికి బదులు, అదేదో  Calculator  ఉంటేనేకానీ, లెక్కకట్టే స్థితిలోలేరు… వాడి మెదడుకీ  పనిలేదూ, వాడికీ పనుండదూ, .. బహుశా ఇదంతా  Time saving  అని ఈతరం వారు సమర్ధించొచ్చు, కానీ  at what cost?

 ఆ భగవంతుడు మనకి ఆలోచించడానికి మెదడనే ఓ అద్భుతమైన అవయవం ఇచ్చినప్పుడు, దాన్ని ఉపయోగించడానికి ఏం రోగం ? ఈరోజుల్లో ఏది చూసినా ఔట్ సోర్సింగే (  Out sourcing )  కదా, అందుకేనేమో మనుషులు కూడా, అదే రంధిలో పడ్డారు. వాడేవాళ్ళకీ, తయారుచేసేవారికీ కూడా లాభదాయకంగా ఉంటోంది. ఉపయోగించేవాళ్ళుండబట్టేకదా తయారయేదీ… ఉభయతారకంగా ఉంది….

 టెక్నాలజీ ఎంతగా అభివృధ్ధి చెందిందో ఉదాహరణకి ఆమధ్యన  కొత్తగా ఆవిష్కరించబడ్డ   ALEXA  అనే పరికరం… దాన్ని ఏదడిగితే అది చేస్తుందిట. ఏపనైనా చేస్తుందిట. ఏ సందేహమడిగినా క్షణాల్లో జవాబు చెప్పేస్తుందిట. మంచంమీద పడుక్కుని , లైటార్పేయాలన్నా, గాస్ కట్టేయాలన్నా, టీవీ కట్టేయాలన్నా, తలుపులు మూసేయాలన్నా… ఒకటేమిటి, మనం ఒకానొకప్పుడు స్వయంగా చేసుకునే పనులన్నీ “ జీ హుజూర్.. “ అంటూ చేసేస్తుందిట. కాపరాలుకూడా చేసేస్తుందేమో చూడాలింక…ఈ మధ్యన ఎక్కడ చూసినా “ రోబో టెక్నాలజి “ ఉపయోగం స్పష్టంగా కనిపిస్తోంది.. అదేదో మెషీన్ , ఓసారి స్విచ్ ఆన్ చేస్తే, మొత్తం కొంపంతా తుడిచి. “ మాప్ “ కూడా చేసేస్తుందిట.. పనిమనిషెందుకూ ఇంక?

దీనివలన ఉపయోగాలమాటెలా ఉన్నా, బధ్ధకం మాత్రం పెరగడం తథ్యం.  ఒకానొకప్పుడు చదువుకునే పిల్లలు ఏదైనా సందేహం వస్తే, ఏ పుస్తకం లోనో చదివేవారు.. ఇప్పుడో, ఆ  ALEXA  ని అడిగితే చాలు.  ఇంక ఆ పుస్తకాలూ, చదువులూ చట్టుబండలూ ఎందుకంటా?

టెక్నాలజీ అభివృధ్ధి చెందడం ఎంతో అవసరం, కానీ  మరీ మనుషుల్లో బధ్ధకం, అలసత్వం పెరిగేటట్టుగానా?  ఏమో కాలమే నిర్ణయిస్తుంది వీటి పరిణామాలు.. అవేవో తెలిసేదాకా హాయిగా సుఖపడ్డమే…

బాతాఖాని -లక్ష్మిఫణి కబుర్లు.. పరీక్షల హడావిడి..

   ఇదివకటి రోజుల్లో పరీక్షలైపోగానే శలవులిచ్చేసేవారు. ఆ శలవల్లోనే, పరిక్షపేపర్లు దిద్దడాలూ, ఫలితాలూ స్కూల్లో ఓ బోర్డుమీద పెట్టేవారు. ఓ విషయం చెప్పుకోవాలిలెండి, మరీ అధమాధముడయితే తప్ప, ప్రతీ వాడూ పై క్లాసులోకి వెళ్ళేవాడు. మరీ అత్తిసరు మార్కుల్లాంటివొస్తే, ఏదో మోడరేషన్ పేరుచెప్పి పై క్లాసులోకి తోసేసేవారు. ఉన్న నాలుగైదు సబ్జెక్టుల్లోనూ, దేనిలోనైనా కొద్దిగా తక్కువొచ్చినా, మిగిలిన మార్కుల  ప్రభావంతో గట్టెక్కేసేవారు. ఈ శలవల్లో, ఉపాధ్యాయులు పేపర్లు దిద్దే టైములో బలే తమాషాగా ఉండేది. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకి మార్కులు వేయించుకోడానికి, టీచర్ల ఇళ్ళచుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ కరోనా మహమ్మారి ధర్మమా అని, దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ ఏడాదికి మాత్రం 1st  నుంచి  9th   దాకా పరీక్షలు లేకుండా పాస్ చేసేస్తారుట.. సుఖపడ్డారు పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూ…

 ఇవన్నీ ఓ ఎత్తూ, స్కూలుఫైనల్ పరీక్షలు మరో ఎత్తూనూ.  మారోజుల్లో SSLC  Board  కర్నూల్లో అనుకుంటా ఉండేది.. రాష్ట్రంలోని అన్ని పేపర్లూ, రాష్ట్రం మొత్తంమీది అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకీ, దిద్దడానికి సద్దేవారు. అంటే, సాధారణంగా ఏ స్కూలు పేపరు ఏ చోటకెళ్ళిందో తెలిసేది కాదు.  ఆ పేపర్లు దిద్ది , ఓ  సైనుగుడ్డలో వాటిని పొందిగ్గా సద్ది, అటుపైన ఆ సైనుగుడ్డని సూదీదారంతో డబుల్ కుట్లు వేసి, రిజిస్ట్రీలో పంపేవారు. ఈ వివరాలన్నీ నాకెలా తెలుసా అంటే, మా ఇంటినిండా టీచర్లే.. మొత్తానికి ఏ శలవులాఖరికో ఫలితాలు వచ్చేవి. మళ్ళీ అదో పెద్ద సరదా. ఏ విశాలాంధ్ర పేపరులోనో రిజల్ట్స్ వచ్చేవి. మార్కులెలా వచ్చాయో తెలిసికోవాలంటే ఇంకో పదిరోజులో, పదిహేనురోజులో ఆగాల్సొచ్చేది.  SSLC  Book  అని ఒకటుండేది. దాంట్లో శ్రీ బి. వెంకటరమణప్పగారి  సంతకం స్టాంపుతో, మన మార్కులు వచ్చేవి. ఎంతచెప్పినా, ఓ 50 % వచ్చిందంటే గొప్పగా ఉండేది. ఆ  SSLC Book  అప్పటికీ, ఇప్పటికీ మన జన్మదిన దాఖలా. ఈరోజుల్లోలాగ  Birth Certificates  వగైరా ఉండేవి కావు. దాంట్లో వేసిన జన్మతిథే ఫైనల్.

మొత్తానికి SSLC  పాసయితే, ఊళ్ళోనే ఉండే కాలేజీ. ఎక్కడో తప్ప పైఊళ్ళకి పంపేవారుకాదు. పైగా ఆరోజుల్లో, ఇప్పటిలాగ కార్పొరేట్ స్కూళ్ళూ, కాలేజీలు ఉండేవి కావు. ఊళ్ళో ఉండే ఏ జమిందారుగారో, ఊరికి ఉపకారం చేద్దామని, సమృధ్ధిగా విరాళాలూ, భూదానం చేసి ఓ కాలేజీ మొదలెట్టేవారు. దాన్ని రాష్ట్రంలో ఉండే ఏ మూడు నాలుగు విశ్వవిద్యాలయాలకో అనుబంధం చేసేవారు. కాలేజీ పరీక్షలు ఆ విశ్వవిద్యాలయం వారు నిర్వహించి, డిగ్రీ ఇచ్చేవారు. కాలేజీ లెక్చెరర్స్ అయినా, స్కూలు ఉపాధ్యాయులైనా  ఓ బాధ్యతతో చెప్పేవారు. ఇప్పుడున్న కోచింగ్ క్లాసులూ, సింగినాదం ఉండేది కాదు.. సాధారణంగా క్లాసులో చెప్పేదే అర్ధమయేటట్టు చెప్పడం ఓ ప్రత్యేకత. అంతగా అర్ధం కాకపోయినా, మాస్టారింటికి  వెళ్ళి అడిగే చొరవా, చనువూ ఉండేది. మాతృభాష తెలుగుకి స్కూల్లోనూ, కాలేజీ మొదటి సంవత్సరంలోనూ కూడా పెద్దపీటే వేసేవారు.. కాలేజీకి వెళ్ళేదాకా సాధారణంగా నిక్కర్లే. కాలేజీకి వచ్చిన తరవాతే, చేతికో వాచీ, వేసికోడానికి ప్యాంటులూనూ. డిగ్రీ చేతికి వచ్చిన తరువాత, వారివారి ఆర్ధిక స్తోమతను బట్టి, ఏ పైచదువులు ఇంజనీరింగుకో, మెడిసిన్ కో ఏ విశాఖపట్నమో, కాకినాడో, గుంటూరో వెళ్ళేవారు. కారణం ఆ కాలేజీలు అక్కడే ఉండేవి కాబట్టి. మిగిలినవారు ఏ టీచర్ ట్రైనింగుకో వెళ్ళేవారు. మిగిలినవారంతా ఏ తాలూకాఫీసులోనో  ఉద్యోగాల్లో చేరేవారు. ఎక్కడో నూటికీ కోటికీ ఏ తెలివైనవారో విదేశాలకి వెళ్ళేవారు. ఆరోజుల్లో అలా వెళ్ళిన మన తెలుగువారే, అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ఉన్నతస్థానాలు చేరుకుని, విదేశాల్లో వెలిగిపోతున్నారు. వాళ్ళూ పైచెప్పిన క్రమంలోనే చదువుకుని పైకొచ్చిన వారే. కానీ వారి పునాదులు గట్టివి.  చదువుని ఓ దేవతగా భావించి అభివృధ్ధిలోకి వచ్చారు. కాలేజీల్లోనూ అక్కడా, కొత్త విద్యార్దులని ragging  పేరుతో హింసించేవారు కాదు. అలాగని అసలు ఆ సరదాయే లేదనీ కాదు. సరదాగా వారిని ఆటపట్టించి కొత్త పోగొట్టేవారు. రాజకీయాలుండేవా అంటే ఉండేవే అని చెప్పుకోవాలి. కానీ అవన్నీ కులమతాలకి అతీతంగా ఉండేవి.  విద్యార్ధులకి ఓ హెడ్మాస్టారన్నా, ప్రిన్సిపాలుగారన్నా ఓ విధమైన భక్తీ గౌరవమూ ఉండేవి. కారణం వారి ప్రవర్తనే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పటివారికి ఆరోజుల్లో చదువులంటే , ఏదో వానాకాలం చదువుల్లెద్దూ అనే ఓ దురభిప్రాయం ఉంది.

%d bloggers like this: