బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Santoor Syndrome….

    ఇదివరకటి రోజుల్లో కంపెనీలు తయారుచేసే సరుకులకి ప్రకటనలు మొదట్లో పేపర్లలోనో, పత్రికల్లోనో మాత్రమే చూసే అవకాశం ఉండేది. ఆల్ ఇండియా రేడియో వారు “వ్యాపార ప్రకటనలు” ప్రారంభం చేసిన తరువాత, ఆ ప్రకటనలకి సంగీతం జోడించి రేడియోలో ప్రసారం చేసేవారు.అలాటి ప్రకటనలకి సంగీతం చేసే ఏ ఆర్ రెహ్మాన్ వృధ్ధిలోకి వచ్చాడు. దృశ్య రూపంలో చూడాలంటే ఏ సినిమాయో చూడాలనుకున్నప్పుడు, ఆ థియేటర్ లో ఓ పావుగంట ఈ దృశ్య ప్రకటనలు చూడగలిగేవారం. క్రమక్రమంగా, టీవీ ల ధర్మమా అనీ, ఆ తరువాత శాటిలైట్ టీవీ ధర్మమా అని, మన ఇళ్ళలోకే వచ్చేశాయి ఈ వ్యాపారప్రకటనలు. వీటివలన మార్కెట్ లోకి వచ్చే కొత్తవస్తువు గురించి తెలిసికోగలుగుతున్నాము. మరి తెలిసేసికుని ఊరికే కూర్చుంటే ఎలాగా, వెంటనే మార్కెట్ లోకి వెళ్ళి ఫలానా వస్తువుందా అని, కొట్టువాడిని హోరెత్తేయించేయడం. వాడు ఇంకా ఆ వస్తువు మార్కెట్ లోకి రాలేదు మొర్రో అని మొత్తుకున్నా సరే వినకుండా. ఆ వ్యాపార ప్రకటనల ఉపయోగం ఏమిటయ్యా అంటే ఆ వస్తువు వచ్చేలోపలే అందరికీ brain wash చేసేయడం.

దేనికైతే ప్రకటన చేశారో ఆ వస్తువు గురించి, చాలా చాలానే exaggerate చేస్తూంటారు లెండి. కానీ ఆ విషయం తట్టదుగా. పిల్లల విషయంలో అయితే కొద్దిగా ఎక్కువే చేస్తూంటారు. శలవు రోజొచ్చిందంటే పిల్లలు ఆ టీవీ ముందరేగా కూర్చునేదీ, ఏదో “పొడుగెదగడానికి ” ఫలానా డ్రింకు త్రాగండీ అంటాడు. ఇంక ఆ పిల్లలు తల్లితండ్రుల ప్రాణం తీసేస్తారు, ఫలానా డ్రింకే కావాలీ..లీ..లీ .. అంటూ, అక్కడికేదో రాత్రికి రాత్రే తాటిచెట్టంత పొడుగు ఎదిగేయొచ్చన్నట్టు. డ్రింకులేమిటీ, ప్రతీవస్తువు గురించీ చిలవలూ పలవలూ చేసేస్తారు. ఇంక టూత్ పేస్టులైతే మరీనూ, అదేదో “ఉప్పు” ఉందా అంటాడు ఒకడూ, ప్యూర్ వెజిటేరియన్ అంటాడు ఇంకోడూ, దీనితో ఇంకో కంపెనీ పేస్టు వాడేవాళ్ళు భయపడిపోతారు- “హవ్వ.. హవ్వ.. ఇన్నాళ్ళూ మనం వాడేదాంట్లో “నీచు” ఉందిటే, అందుకే హాయిగా ఏ “కచికో”, “నంజన్ గూడ్” ఎర్ర పళ్ళపొడో వాడమని మొత్తుకుంటాను, వింటారా నా మాటా ఎవరైనా, కలికాలమమ్మా ..కలికాలం..”, సంసారం భ్రష్టు పడిపోయిందన్నట్టుగా అల్లరి చేసేస్తారు.

ఇంక సబ్బుల విషయానికొస్తే అడగనే అఖ్ఖర్లేదు, ఆవిడెవరో ఫలానా సబ్బు వాడుతుందిట, ఈవిడ శరీరం భర్తకి తగిలించేటప్పటికి, ఆ కుర్రాడు కాస్తా, వర్షం వస్తూన్నా ఆ గొడుగు వదిలేసి, డ్యాన్సులు చేస్తాడు. ఇంకో సబ్బులవాడు, ఫలానా సబ్బువాడితే అసలు రోగాలే దగ్గరకు రావంటాడు, మరి లక్షలు పోసి డాక్టరీ డిగ్రీ తెచ్చుకున్నవాళ్ళందరూ ఏ గోదాట్లోకి దిగుతారుటా?

వీటన్నిటిదీ ఓ ఎత్తూ, సంతూర్ వాళ్ళది ఓ ఎత్తూ ! ఆ సబ్బువాడితే అసలు వయస్సే తెలియదుట ! ఈ కంపెనీలవాళ్ళు ఎటువంటి ప్రకటన రిలీజ్ చేసినా సరే చివరకి, ఓ పిల్ల ” మమ్మీ..” అంటూ వచ్చేస్తుందీ, ఆ హీరోయేమో ” అరే ..మమ్మీ..”అంటూంటాడు. ఈ ప్రకటనలో కంపెనీ వారు చెప్పే “నీతి” ఏమిటయ్యా అంటే, ” మా సబ్బు వాడండి, మీ వయస్సు దాచుకోండీ..” అని.

ఉదాహరణకి ఇద్దరు స్త్రీలని చూశామనుకోండి, ఏదో మొహమ్మాటానికి మీరిద్దరూ ” అప్పచెల్లెళ్ళా,,” అని ఆడగ్గానే, మెలికలు తిరిగిపోతూ.. “కాదండీ ఇది మా అమ్మాయి..” అని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్తారు. అంటే ఆ పెద్దావిడ ” సంతూర్” సబ్బే వాడుతోందన్నమాట ! ఇలాటి దానికే Santoor Syndrome అని అంటారు !

ఇదేదో ఆడవారు మాత్రమే అనుభవించే previlege అనుకోకండి. మొగాళ్ళకీ ఇలాటి Santoor feelings వస్తూంటాయి. దానికి ఆ సబ్బే వాడాలని రూలేమీ లేదు. మామూలు “సున్నిపిండి” వాడినా చాలు ! ఏదో బయటకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకబ్బాయి తన కొడుకో, కూతురితోనో కనిపించి పలకరిస్తూ ” అంకుల్ కి నమస్తే చెప్పమ్మా..” అంటాడనుకోండి, ఇద్దరు మనవలూ, ఇద్దరు మనవరాళ్ళకీ “తాత” అయిన తనని ” అంకుల్” అని ఇంకో చిన్నాడు పిలిస్తే, మరి తన వయస్సేదో తగ్గిపోయినట్టుగా అనిపించదూ మరి? అలాగే , తాను ఉద్యోగం చేసి, పదేళ్ళక్రితం రిటైరయిన ఆఫీసులో, ఎవరో పలకరించి, ” ఇంకా ఎన్నేళ్ళు మాస్టారూ మీ సర్వీసూ..” అని అడిగితే సంతోషంగా ఉండదూ మరి?

అలా కనిపించడానికి మనమేమీ క్రీమ్ములూ, సబ్బులూ, రంగులూ వాడఖ్ఖర్లేదు, just positive thinking చాలు అని నా అభిప్రాయం. మనం ఎంత positive గా ఆలోచిస్తే రోగాలు అంత దూరంగా ఉండి, మనల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. సర్వే జనా సుఖినోభవంతూ..

ఈ వారం గోతెలుగు.కాం లో నా వ్యాసం ఒకటి ప్రచురించారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అన్నిటిలాగే మన మాతృభాష ఏమిటో గుర్తుచేసికోవాలననుకుంటా, “తెలుగుభాషా దినం” అని ఒకటి మొదలెట్టారు. మిగిలిన “దినాల్లాగే” ఇదీనూ.ఆ ఒక్కరోజే మన మాతృభాష గురించి గుర్తుచేసికోవలసిన దుస్థితి వచ్చిందీ అంటేనే చాలు, తెలుగుభాషయొక్క పరిస్థితి ఎలా ఉందో? ఏదో తెలుగువారందరూ ఒకే ఛత్రం క్రింద బ్రతుకుతారూ అని, ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదిస్తే, ఆ సంతొషం కూడా లేకుండగా చేస్తున్నారు, మన రాజకీయనాయకులు. ఏదో ఎవరి స్వార్ధం వారు చూసుకోవడమే కానీ, సామాన్య ప్రజలకి విభజన ఇష్టమా లేదా అనిమాత్రం ఆలోచించడం లేదు. ఎక్కడో ఇంకో రాష్ట్రంలో ఉంటున్నావూ, నువ్వుకూడా మాట్టాడడమేనా అని కొంతమంది అనొచ్చు. కానీ ఏ రాష్ట్రం అని చూసుకోకుండా, తెలుగుభాషమీద అభిమానంతోనే కదా, ఏదో నాకు తెలిసినది మీతో పంచుకుంటున్నానూ?

    ఈ సందర్భంలో ఏనాడో శ్రీశ్రీ గారు వ్రాసిన వ్యాసమొకటీ, శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు వ్రాసిన వ్యాసమొకటీ మీతో పంచుకుంటున్నాను.

తెలుగుతనం-శ్రీశ్రీ-ఆనందవాణి-1946

అసలు తెలుగు భాష

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Avoidable torture..

   మనకి ఉన్న తెలుగు చానెళ్ళలో “మా” టీవీ వారు, ఫరవాలేదూ అనుకుని చూస్తూంటాను.పైగా పదిరొజులక్రితం ” అమృతోత్సవం” అని ఓ అద్భుత కార్యక్రమం, ప్రసారం చేశారు, ఆ మర్నాడు ఆ కార్యక్రమం మీద ఒక టపాకూడా పెట్టాను. మనతో వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఏదో ఒకసారి పెట్టారుకదా అని, ప్రతీసారీ పెడతారని అనుకోవడం శుధ్ధ తప్పు అని , నిన్న తెలిసింది. మామూలుగానే ఎవార్డుల సభలు అదీ, సినిమాకి సంబంధించినవైతే, అసలు ఆ చానెలే చూడను.కానీ, ఆ కార్యక్రమంలో శ్రీ బాపు గారికి ఫిలింఫేర్ వారు, జీవిత సాఫల్య పురస్కారం ఇస్తున్నారూ అని తెలిసి, చూడడం మొదలెట్టాను.ముందుగా,అతిథులు ప్రాంగణం లోకి వచ్చేటప్పుడు, ఆ అమ్మాయెవరో ఆ వచ్చిన అతిథులని ఏవో ప్రశ్నలు వేసింది. చాలామంది, శ్రీబాపూ గారికి పురస్కారం వస్తోందీ, ఆయనని ఒకసారి దర్శనం చేసికోవచ్చనే, వచ్చినట్టు చెప్పారు. అసలు నేను టివీ ముందర కూర్చున్నదికూడా అందుకేగా, నన్నెవరూ అడగలేదు, నేను చెప్పాలేదు ! Leave it.. శ్రీబాపూగారు వచ్చినప్పుడు కూడా ఏవో ప్రశ్నలు వేసింది, ఆయనకూడా స్పందించారు.

    ఇంక కార్యక్రమం మొదలెట్టారు. ఆ కార్యక్రమాన్ని యాంకరింగు చేసిన, అమ్మాయీ, అబ్బాయీలగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఏమిటో వాళ్ళు “జోక్‌కు” లనుకున్నవి, వాళ్ళే నవ్వుకున్నారు, ఎవరికీ నవ్వురాలేదు కాబట్టి ! ఆ హావభావాలూ, మాట్టాడే పధ్ధతీ అసహ్యంగా ఉంది. ఇంక వేదిక మీద ప్రదర్శించిన ఆటపాటల గురించి less said the better. నాకు బాధ వేసింది ఎక్కడా అంటే, ముందు సీట్లలో కూర్చున్న శ్రీ బాపూ గారిని ఇంత “హింస” పెట్టొచ్చునా అని ! It was unadultrated torture. అంత వయస్సులో శ్రీబాపూ గారు, అంత torture భరించారంటే, అది ఆయన గొప్పతనమే అనడానికి సందేహం లేదు.

    ప్రతీ సారీ బ్రేక్ లో “coming up” లో శ్రీబాపూగారికి ఇచ్చే పురస్కారం చూపిస్తారేమో. అదేదో చూసి కట్టేద్దామనుకుంటే, చిట్టచివరకి రెండు గంటల తరువాత, మొత్తానికి చూపించారు. భోజనం సంగతి పక్కకి పెట్టి, టీవీ ముందర సెటిలయినందుకు disappoint అవలేదు ! ముఖ్యంగా శ్రీ బాపూగారి గురించి చెప్పిన నాలుగుముక్కలూ, దృశ్యాలూ వింటూ చూసినతరువాత, సంతోషమనిపించింది. మా స్నేహితుడు శ్రీ శాస్త్రిగారి సౌజన్యంతో, మీరుకూడా ఆ క్లిప్పింగు ఇక్కడ చూసి ఆనందించండి.

    ఎందుకొచ్చిన బాధలు చెప్పండి, శ్రీ బాపూగారు ఏమైనా అడిగారా, పెట్టారా, పురస్కారాలు కావాలీ అని ! పోనీ ఆ ఫిలింఫేర్ వారికే ఆ భగవంతుడు సద్బుధ్ధి కలిగించి, ఇద్దామే అనుకున్నారనుకుందాము, అదేదో చెన్నైలో వారింటికే వెళ్ళి ఇచ్చేస్తే , ఆయనకీ ఈ “చిత్రహింస” తప్పేదిగా ! కనీసం ఇటుపైనైనా చిత్రసీమలో ఎలాటి జీవితసాఫల్య పురస్కారాలాటివి ఇద్దామనుకుంటే, ఎలాగూ అలాటివి వచ్చేవి సామాన్యంగా వయోవృధ్ధులకే కాబట్టీ, వాళ్ళు ప్రదానం చేసే కార్యక్రమాలలో ఎలాగా చెత్త పాటలూ, అంతకంటే దరిద్రపు నృత్యాలూ పెట్టకుండా ఉండలేరూ కాబట్టి, ఆ పెద్దవారిని మరీ ఇరుకున పెట్టి , బాధపెట్టకుండా, ఆ ఇచ్చేదేదో కార్యక్రమానికి మొదట్లోనే ప్రదానం చేసేస్తే , ఆ పుచ్చుకునేవారికీ క్షేమం, ఇచ్చేవారికీ శ్రేయస్కరం.

    అలాగని సినిమాకి సంబంధించిన కార్యక్రమాలలో “ప్రవచనాలూ”, భరతనాట్యాలూ ఉండాలని కాదు. నిజమే అలాటి events కి తగ్గట్టుగానే, మూడు నాలుగ్గంటల కార్యక్రమం organise చేస్తూంటారు, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చూస్తారూ ఆనందిస్తారూ. కానీ వాటిల్లో పెద్దవారిని హింసించే కార్యక్రమం avoid చేస్తేనే బాగుంటుందేమో…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“మధుర” మా, “చిదంబర” మా

    సాధారణంగా, అంటే ఇదివరకటి రోజుల్లో అనుకోండి, భార్యలు తమ భర్తలని మరీ చిన్నచూపు చూస్తున్నారని ఎవరైనా భావిస్తారేమో అనే భయం అనండి, లేదా ఈయనగారితో తన భావిజీవితం అంతా ఎలాగూ గడపక తప్పదుకదా అనే ఉద్దేశ్యంతో అనండి,స్వతసిధ్ధంగా ఉండే శాంతస్వభావం అనండి, లేదా ఇంట్లో తల్లితండ్రుల పెంపకం అనండి, లేదా తన తల్లి తన తండ్రిని సంబోధించే పధ్ధతనండి, కారణాలు ఏవైతేనేం, కనీసం అందరి ఎదురుగుండా, ” ఏవండీ..” అనే సంబోధించేవారు. ఆ పిలుపు క్రమక్రమంగా “ ఇదిగో.. మిమ్మల్నే..” లోకి, ఓ పదిపదిహేనేళ్ళకి మారింది.

ఇంక భర్తలంటారా, సామాన్యంగా ” ఏమోయ్..”, కొద్దిగా mcp ల తెగవారైతే ” ఏమే..” “ఒసేయ్..” లకే పరిమితమయ్యేవారు. అయ్యేవారేమిటిలెండి, జరుగుబాటునిబట్టి ఇప్పటికీ అలాగే లాగించేసేవారిని ఇప్పటికీ చూడొచ్చు.అయినా మనకెందుకూ, పిలవడానికి ఆయనకీ, పిలిపించుకోడానికి ఆవిడకీ అభ్యంతరం లేనప్పుడు? ఊరికే సందర్భం వచ్చిందికదా అని చెప్పాను. అయినా పిలుపులో ఏముందిలెండి,అభిమానమూ, ఆపేక్షా ఉంటే చాలదా అంటారనుకోండి. వినేవారికి , చూసేవారికీ తెలుస్తూంటుంది భర్త భార్యని ఎలా సంబోధిస్తాడో, దానిని బట్టి బేరీజు వేస్తూంటారు, ఆ ఇంట్లో పరిస్థితి, ఏమాత్రం లోకజ్ఞానం ఉన్నవారైనా.సంసారంలో ఉండే status ఊళ్ళోవాళ్ళందరికీ తెలియాలంటే ఇంతకంటె ఇంకో మంచిమార్గం లేదు. అలాగే female domination ఉండే ఇళ్ళల్లో కూడా తెలిసిపోతుంది, భార్య భర్తని పిలిచే పధ్ధతి చూసి. ఏ పెళ్ళిసంబంధమో స్థిరపరుచుకోడానికి వస్తే, ఇట్టే తెలిసిపోతూంటుంది, ఇంట్లో ఎవరిప్రభావం ఎక్కువో అనేది.

అలాగని ఎవరి domination ఎక్కువో తెలిసికోడానికి, సంబోధించే పధ్ధతే yardstick అని కాదు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళు భోజనానికి ఉండకూడదా అని, మొగాళ్ళని ఇరుకులో పెట్టడానికో, లేదా మర్యాదకోసమనో ఈ భర్తలని అడుగుతారు.ఏమంటే ఏం తప్పో అనుకుని, గొడవలేకుండగా, మా ఆవిణ్ణడగండి అని తప్పించేసికుంటారు. పైగా ” నాదేముందండీ, ఈవేళ్టి భోజనం ఎక్కడ ప్రాప్తో తెలిస్తే చాలు..” అని ఓ చెత్త జోక్కులాటిది కూడా వేస్తారు, ఏడవలేక నవ్వడానికి. ఆమాత్రం చాలదూ, మాస్టారి పరిస్థితి ఏమిటో తెలియడానికీ? ఇదివరకటి రోజుల్లో వచ్చే సినిమాల్లో సూర్యకాంతమ్మగారు నటించిన ఎక్కువభాగం పాత్రలు ఇలాటివే. భర్త అనబడే ఆ బక్కప్రాణి కి నోరెత్తే ధైర్యం ఉండేది కాదు. ఏదో సినిమా కాబట్టి నవ్వుకునేవాళ్ళం. కానీ, నిజజీవితాల్లో కూడా అలాటివి చూస్తూనే ఉంటాము.

Ofcourse పైన చెప్పినవన్నీ “ఇదివరకటి” కాపురాలగురించనుకోండి. ఈరోజుల్లో అసలు ఆ గొడవే లేదు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు పేర్లతోనే పిలుచుకుంటున్నారు. ఎంత చెప్పినా ” ఆధునిక యుగం” కదా ! పేర్లకీ, ముద్దుపేర్లకీ కొదవే లేదు. ఏదో ఇంకా అదృష్టం కొద్దీ పిల్లలు ఇంకా తల్లితండ్రుల్ని పేర్లతో సంబోధించడం లేదు. పిలిస్తే మాత్రం తప్పేవిటీ అనొచ్చు. నిజమే కదా, మరి పిల్లలతో అంత intimacy కదా !

ఇన్నేళ్ళూ ఓ పధ్ధతికి అలవాటు పడిపోయిన ప్రాణులకి ఈమధ్యన, కొత్త పరిణామాలకి adjust అవడానికి కొద్దిగా టైము పడుతోంది. ఇదివరకటి రోజుల్లో అయితే, “ఏవండీ కొద్దిగా మంచినీళ్ళు తెచ్చిపెడతారా..” అంటే , వాళ్ళమధ్యఉండే సంబంధబాంధవ్యాల బట్టి తెస్తే తెస్తాడు, లేకపోతే మానేస్తాడు, ఆ భర్తప్రవృత్తిని బట్టి. కానీ అదే భార్య భర్తని ఆ “ఏవండీ” తీసేసి, ” మంచినీళ్ళు తేరా..” అనేటప్పటికి షాక్కవుతాడు, ఈవిడకేమొచ్చిందీ ఇన్నాళ్ళూ లక్షణంగానే అడిగేదీ, ఇప్పుడేమిటీ “రా” లోకి దిగిపోయిందీ అనుకుని, ” మరీ ఆ పిలుపేమిటీ.. రా.. ట.. రా.. మరీ అంత రోడ్డెక్కాయాలా, అఘాయిత్యం...” ఇంట్లో ఉండే పెద్దావిడో, పెద్దాయనో అనుకునే ఆస్కారం ఉంటుంది. కానీ బ్రహ్మశ్రీ చాగంటివారు చెప్పినట్టు, ప్రతీవిషయమూ లోపలికి వెళ్ళి దాని నిక్షిప్తార్ధం పట్టుకోవాలిట.

ఆ సందర్భంలో ధైర్యం చేసి, భర్త భార్యతో ” మరీ అలా అడిగేశావేమిటీ, ఇంక నా గతి అంతేనా..” అని అడిగితే, ఆ భార్యగారు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, “ఫరవాలేదే మాస్టారు లైనులోకి వస్తున్నారూ ..” అనుకుని, ” అదేమిటండీ మరీ నేను అంత బరితెగించినదానిలా కనిపిస్తున్నానా ఏమిటీ, నేనడిగిందేమిటీ ” మంచినీళ్ళు తేరా..” అంటే దానర్ధం మంచినీళ్ళు తేరా? ప్లీజ్..” అని. అలాగే fan ఆర్పరా, కిటికీ అద్దాలు తుడవ..రా.. వీటన్నిటికీ ” ? “ మార్కు పెట్టుకుంటే గొడవుండదు.

వ్రాసేటప్పుడు కాబట్టి “?” మార్కు అన్నాను. కానీ, ప్రత్యక్షంగా జరిగినప్పుడు “వాతావరణం”, body language, లాటి ఇత్యాది పరిస్థితులకి అనుగుణంగా అర్ధాలు మారుతూంటాయి. మన అదృష్టం బాగోపోతే మన కర్మం అని ఓ దండం పెట్టడం !!

ఇంతకీ మీ ఇంట్లో “మధుర”..మా , “చిదంబర”..మా ?

“కిన్నెర”-1955 జనవరి సంచికలో, మానవజీవితాలలో వృక్ష లక్షణాల అనుసంధానం ఎంతగా ఉందో శ్రీ చదలవాడ గారు వ్రాసిన వ్యాసం చదవండి.మానవకోటి-వృక్షలక్షణాలు-

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాలతీ చందూర్ గారి కొన్ని ” జవాబులు”

    మాలతీ చందూర్ గారి గురించి వ్రాయాలంటే, అంత తేలికగా అయ్యే పని కాదు. కానీ, నిన్నంతా కూర్చుని, నెట్ లో ఉన్న ఆంధ్రప్రభ 1955 వ సంవత్సరంలో, “ప్రమదావనం” శీర్షికలో ఆవిడ ఇచ్చిన కొన్ని జవాబులు చదివి, వాటిని పిడిఎఫ్ చేసి మీతో పంచుకోవాలనుకున్నాను. శాంపిల్ కి ఓ 10 పేజీలు చేశాను. చదివితే, మీకే తెలుస్తుంది, ప్రతీ ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివి,వాటికి ఎంతో ఆత్మీయంగా జవాబు వ్రాయడమంటే అంత ఆషామాషీ ఏమీ కాదు.ఈ జవాబులే కాకుండగా, వంటలూ, అల్లికలూ ఒకటేమిటి, కొత్తగా పెళ్ళై కాపరానికి వెళ్ళే ప్రతీ ఆడపిల్లనీ, self sufficient చేశారనడానికి సందేహం లేదు.
ఆవిడ స్పృశించని topic లేదు. ఆ రోజుల్లో “ఆంధ్రప్రభ” సచిత్రవారపత్రిక వచ్చిందీ అంటే, ఇంట్లో ఆ పుస్తకం తామే ముందు చదివేయాలని అంతగా ఎందుకు పోట్లాడుకునేవారో, సరదాగా ఈ జవాబులు చదివితే తెలుస్తుంది.
Malati Chandur

   గత కొన్నివారాల లాగే ఈవారం కూడా గోతెలుగు.కాం లో నా వ్యాసం ఒకటి ప్రచురించారు.

    HAPPY WEEK END…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ముందుగా శ్రీమతి మాలతీ చందూర్ గారికి శ్రధ్ధాంజలి. నా ఉద్దేశ్యంలో ఆంధ్రదేశం లో, ఆవిడ వ్రాసిన “వంటల” పుస్తకాన్ని, ఒకసారైనా చదవకుండగా, కొత్తకాపరంలోకి అడుగెట్టిన ఆడపిల్ల ఉంటుందనుకోను. ఈరోజుల్లో అయితే ఇంటర్నెట్లూ, టివీ కార్యక్రమాలలో చూపించే “మా ఇంటివంట”, “అభిరుచి”etc..etc.. లాటి కార్యక్రమాలలో నేర్చేసికుంటున్నారు. కానీ ఈ మాధ్యమాలు రాకపూర్వం శ్రీమతి మాలతీ చందూర్ గారి పుస్తకం, ఒక్కసారి చదివితే, వంట మీద ఓ ‘పట్టు’ లాటిది వచ్చేసి, అంతదాకా అమ్మచేతివంటనే మెచ్చుకునేవాడు కూడా, భార్యలకి దాసోహం అయిపోయారంటే ఆశ్చర్యం లేదు !ఎంత చెప్పినా, “జోరూ కా గులాం” ( భార్యావిధేయుడు ) అవడానికి, రాజమార్గం మొట్టమొదట చేతి వంటే కదా. ఆ తరువాతే మిగిలిన… కార్యక్రమాలు. ముందుగా కడుపు నిండితేనే కదా.. ఆ కడుపూ, తిండీ వ్యవహారాలలో, ఆనాటి ఆడపిల్లలందరికీ ఆరాధ్య దైవం శ్రీమతి చందూర్ గారే అనడంలో సందేహం లేదు. ఒప్పుకోడానికి నామోషీగానీ, అప్పుడప్పుడు ఇంట్లో వంట చేయాల్సొచ్చిన సమయాల్లో , మనమూ ఆ పుస్తకం చూసే నేర్చుకున్నాము.

    ఇవే కాకుండా, ఆనాటి ఆంధ్రప్రభ వారపత్రికలో ఆవిడ నిర్వహించిన “ప్రమదావనం”, ప్రశ్నలూ జవాబులూ శీర్షికలకోసమే, ఆ పుస్తకాలు కొనుక్కుని, చదివి, ఆ కాగితాలు పుస్తకంనుండి విడతీసి, మొత్తం ఏడాది పొడుగునా ప్రింటయిన కాగితాలు, ఓ పుస్తకంగా, కంఠాణీ, ట్వైను దారంతో కుట్టుకునో, కుట్టించో, ఆ పుస్తకాన్ని బైండు చేయించి, ఈ పుస్తకాన్ని కూడా భద్రపరచిన వారు ఇప్పటికీ ఉన్నారు. ఆవిడ “వంటల” పుస్తకం ఎన్నిసార్లు పునర్ముద్రణ జరిగిందో లెఖ్ఖే లేదు. తరువాత్తరువాత వచ్చిన వంటల పుస్తకాలన్నిటికీ ఆవిడ పుస్తకమే ఆధారం అన్నా తప్పులేదు.

    ఇంగ్లీషులో వచ్చిన ప్రఖ్యాతపుస్తకాలని, పరిచయం చేయడంలో ఆవిడకి ఆవిడే సాటి. ఎలాటి controversy కూడాలేని ఓ మహా మనీషి లేని లోటు ఎప్పటికీ తీరదు. నిన్న యూట్యూబ్ లో వెదికితే ఒక క్లిప్ దొరికింది. ఇక్కడ చూడండి.

    మూడు నాలుగు రోజుల క్రితం పుణె లో డాక్టర్. నరేంద్ర దాభోల్కర్ అనే ఆయన హత్య చేయబడ్డారు. ఆయన గత పదిపదిహేను సంవత్సరాలుగా, “అంధ విశ్వాస నిర్మూలన” మీద ఆందోళనలు చేస్తున్నారు, ఆయన హత్యచేయబడిన రెండురోజులకి, మహరాష్ట్ర ప్రభుత్వం ఒక “anti superstition” ordinance అని ఒకటి జారీ చేసింది. ఈ “అంధ విశ్వాసం” అనేది చర్చనీయాంశం అని నా అభిప్రాయం. ఓ చట్టం చేయగానే , మనుష్యులు ఇన్ని సంవత్సరాలుగా నమ్ముతున్న వాటిని ఆపేస్తారని ప్రభుత్వం ఆశిస్తోందా? పైగా ఈ “నమ్మకం” అనేది ఓ relative term. ఎవరి నమ్మకాలు వారివీ. దేశంలో నూటికి తొంభైమంది, ఏదో ఒక దేవుడిని నమ్మేవారే కదా. పైగా మన దేశంలో ఉన్నన్ని “మతాలు” ఇంకే దేశంలోనూ ఉండవేమో. దేవుడిని నమ్మడంలో తప్పుందనుకోను, కానీ గుడ్డిగా నమ్మడం మాత్రం అంతమంచిది కాదేమో. కానీ ఈ “నమ్మడం, గుడ్డిగా నమ్మడం” లకి threshold limit ఎవరైనా చెప్పగలరా? ఏదో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తూంటాడు. గట్టెక్కిస్తే ఫలానా తలనీలాలు సమర్పించుకుంటామనో, నిలువు దోపిడీ ఇచ్చుకుంటామనో మొక్కుకుంటాడు. ఈ కొత్త చట్టం చూస్తే, కష్టం మాట దేవుడెరుగు, జైల్లో పెడతారేమో అని భయం మొదలవుతుంది. ఇంక స్వామీజీలూ, బాబాల గురించికూడా ఈ చట్టంలో ప్రస్తావించారు, వారు “చమత్కారాలు” చేస్తామని ప్రకటిస్తే తప్పుట. సరేనండి, హిందూ బాబాలనీ, స్వామీజీలనీ కట్టుబాటు చేయొచ్చు, కానీ క్రిస్టియన్ మతం లో ఉండే faith healing మాటేమిటీ? ఆషాడ ఏకాదశి కి ఆళందీనుంచీ, దేహూ గావ్ నుంచీ, లక్షలాది వార్కరీలు కాలినడకన, పాల్కీ లతో కొన్ని దశాబ్దాలుగా వెళ్తున్నారే, ఏదో నమ్మకం తోనే కదా. ఇప్పుడలాటివన్నీ చట్టవిరుధ్ధాలుగా అయిపోతాయా?

    ఇంత ” అంధవిశ్వాసాలకి” విరుధ్ధంగా ఉండి, టక్కున ఓ ordinance జారీచేసే ఈ పాలకులు, దైవదర్శనాలకి V VIP లలా ఎందుకు వెళ్తున్నారో, గుండెలమీద చెయ్యేసికుని చెప్పగలరా? వాళ్ళకైతే పర్వాలేదూ, ఈ చట్టాలూ ఆర్డినెన్సులూ మామూలు సామాన్య ప్రజలకోసమా? మహారాష్ట్రలో శివాజీ మహరాజ్ అంటే అందరికీ ఎంతో భక్తి శ్రధ్ధలు, ఆయనకి అమ్మవారి అనుగ్రహం ఉందని చదువుకున్నాము. శ్రీశైలం లో ఆయన నిర్మించిన గాలిగోపురం ఇప్పటికీ చూడొచ్చు. ఇన్ని శతాబ్దాలుగా ఉన్న నమ్మకాలు తప్పూ అని అనుకోవాలా? ఈరోజుల్లో ఈ అంధవిశ్వాసాలగురించి మాట్టాడడం ఓ status symbol. అవతలవారికి ఎటువంటి నష్టమూ కలగచేయనంతవరకూ, ఎవరు ఎవరిని నమ్మితేనేం? ఇంకో విషయం, ఏదో ఇప్పుడు కాంగ్రెస్/ ఎన్.సి.పి సంకీర్ణ ప్రభుత్వం ఉందికాబట్టి , ఈ ఆర్డినెన్స్ జారీచేశారు కానీ, అదే బిజేపీ వారు చేస్తారా? చేస్తే మరి అయోధ్యలోని రామమందిర నిర్మాణం సంగతేమిటీ?

    మరో విషయం, దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇంకెన్నో ముఖ్యమైన సమస్యలున్నాయి, వాటిగురించి పట్టించుకునే నాధుడే లేడు. దేవుడిమీద భక్తీ, నమ్మకమూ అసలు ఎందుకు ఎక్కువవుతున్నాయో గుర్తించారా మన పాలకులూ, ఎదురుగుండా కనిపించే వీరు ఏమీ చేయలేకపోతున్నారే, పోనీ ఆ కనిపించని భగవంతుడైనా కనికరిస్తాడేమో అని. ఎవరో ఒకరిమీద నమ్మకం పెట్టుకోవాలిగా?

బాతాఖాని-లక్ష్మీఫణి కబుర్లు– ఎవరో ఏదో అనుకుంటారేమో…

    ఈరోజుల్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో… బాగుండదేమో ..అనే అభిప్రాయాల ధర్మమా అని, ఒక్కొక్కప్పుడు మనకి సాధారణంగా ఉండే consumer rights గురించి కూడా అడగడానికి సంకోచిస్తూంటాము. ఉదాహరణకి ఏదైనా mall కి ఏ సరుకులైనా కొనడానికి వెళ్ళామనుకోండి, అక్కడ వివిధ రకాలైన offers కనిపిస్తూంటాయి. మామూలుగా మనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ వస్తువు కొనుక్కుంటూంటాము. పైగా ఆ offers కూడా , ఆ యాజమాన్యం వాళ్ళు మనమీద ఏదో అభిమానం కొద్దీ ఇచ్చేవిగా కూడా ఉండవు. ఫలానా సరుకు మరీ అమ్ముడవకపోతే, దానిని ఇంకో ఎక్కువగా అమ్ముడయ్యే సరుకుని కొద్దిగా దాని ఖరీదుకూడా పెంచేసి, ఈ అమ్ముడవకపోయే సరుకుని అంటగట్టేస్తాడు. ఎన్ని చెప్పినా, “ఉచిత” వస్తువులమీద సామాన్య ప్రజానీకానికి ఉండే ప్రీతి వలన, అవసరం ఉన్నా లేకపోయినా, మనమూ ఆ వస్తువుని కొంటామనే మనస్థత్వాన్ని cash చేసికుంటాడు. కొన్నిటిమీద 10 రూపాయలో, అదేదో శాతం(%) తగ్గింపంటాడు.ఏది ఏమైనా సరుకు అమ్ముడవడం ఆ కొట్టువాడి ముఖ్యోద్దేశం.

    ఏ సూపర్ బజారు చూసినా, ఏ మాల్ చూసినా, ఏ బ్రాండెడ్ వస్తువుల కొట్లు చూసినా, ఇవి మామూలే. ఎక్కడ చూసినా పేద్దపేద్ద హోర్డింగులూ, ఎప్పుడో కర్మజాలక మన నెంబరు ఇస్తే ఎస్ ఎం ఎస్సులూ, మెయిళ్ళూ, మన సొసైటీ లెటర్ బాక్సుల్లో పాంఫ్లెట్ట్లూ ఒకటేమిటి కావలిసినంత హడావిడి. మనవైపు పండుగ అమ్మకాలూ, ఆషాఢం సేల్సూ కూడా ఇలాటివే. ఎవరైనా ఇంటికి చుట్టాలొస్తే పెట్టడానికి ఈ ఆషాఢం సేల్స్ లో ఓ పదిచీరలు చవకలో కొనిపెట్టేస్తే, ఏడాదంతా హాయిగా వెళ్ళిపోతుంది.

    మాకు దగ్గరలో రిలయన్సు వాళ్ళ మార్ట్ ఒకటుంది. సాధారణంగా అక్కడికే వెళ్టూంటాను ( ఒక్క్ణణ్ణే అనుకోండి), ఆ మధ్య ఒకసారి, అదేదో సర్ఫ్ ప్యాక్‌కు ఒకటి మూడో, నాలుగో వందలు పెట్టి, ఇంటికి మోసుకొచ్చాను.ఆ తరువాతి వారంలో మా ఇంటావిడ, ఆ ప్యాక్కుని తెరిచినప్పుడు, దానిమీద bucket pack అని చూసి, బకెట్టేదండీ అంది.నాకేం తెలుసూ, దానితో బకెట్టుకూడా ఉందనీ, ఆ మూడు కిలోల ప్యాక్కుతోపాటు మిగిలిన సరుకులు కూడా ఉండడంతో, ఆ ఖంగారులో చూసిఉండలేదనుకుంటాను. తప్పు నాదే. “పోన్లెండి, ఇన్నిరోజుల తరువాత ఇస్తాడో లేదో, వదిలేయండీ.. మళ్ళీ శ్రమెందుకూ ..” అని వదిలేయమని చెప్పకుండానే చెప్పేసింది. అయినా ఓసారి ప్రయత్నం చేస్తే తప్పేమిటీ, అయినా ఒక్క బకెట్టే కదా అంత బరువూ ఉండదూ, అనుకుని, ఆ వస్తువులుకొన్న రసీదు కోసం వెదికితే అదృష్టంకొద్దీ దొరికింది ! రసీదులూ, ఏటీఏం స్లిప్పులూ ఓ డ్రాయరులో పడేసి, నెలకోసారి ఖాళీ చేయడం అలవాటు. చూశారా ఇలా చెత్తకాగితాలన్నీ పోగేయడంతో ఇంటావిడచేత చివాట్లు తిన్నా, వీటివలన నష్టాలకంటే , ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. మనల్ని కాదని దులిపేసికుంటే ఏ గొడవా ఉండదు. మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా, క్రమక్రమంగా అలవాటైపోతుంది..( గమనించ ప్రార్ధన). ఇలాటి మంచి అలవాట్లు ఉంటేనే బతికి బట్ట కట్టేది !

    ఏదో మొత్తానికి ఆ రసీదు పట్టుకుని మళ్ళీ ఆ రిలయెన్స్ మార్ట్ కి వెళ్ళాను. ఏదో ఉత్తిచేతుల్తో వెళ్తే బాగుండదుకదా, అనుకుని ఓ బిస్కెట్ ప్యాకెట్టోటీ, దేనిమీదైతే ఆ bucket pack అని వ్రాసుందో ఆ ప్యాక్కూ తీసికుని బిల్లింగుకోసం వెళ్ళి, దీనితో బకెట్టుకూడా ఇస్తారుకదా అని అడిగితే, అవునూ అంది. ప్రస్థుతం నాకు ఈ ప్యాక్‌కు అఖ్ఖర్లేదూ, ఊరికే అడిగానూ బకెట్టుందా లేదా అని తెలిసికోడానికిమాత్రమే అని చెప్పి, అంతకుముందు వారంలో నేను తీసికున్న ఆ ప్యాక్కుతో, బకెట్టు మర్చిపోయానూ అని చెప్పగానే, రసీదుందా అని అడగ్గానే ఠక్కున తీసి చూపించాను. ఈమధ్య చూడండి, క్రికెట్టులో UDRS ( Umpire Decision Review System) అని ఒకటి మొదలెట్టారు. ముందుగా బౌలర్ వేసిన బాల్ సరీగ్గా ఉందా, లేక నో బాలా అని చూపిస్తారు, ఆ తరువాత ఏవేవో కెమేరాల దృశ్యాలు చూపించి, మొత్తానికి ఆ అంపైర్ ఇచ్చిన నిర్ణయం సరైనదో కాదో చెప్తారుట. అలాగ మొదటగా రసీదుందా లేదా, ఉందీ.. అయితే ముందుకెళ్ళొచ్చూ… రెండో విషయం… ఎప్పటిదీ… ఓ వారం క్రితం దీ… అలాగా అయితే ఆగు…ఎందుకూ.. నా పైవాడు చెప్పాలీ ఇవ్వొచ్చో, లేదో… సరే .. వాడినే పిలూ…మళ్ళీ వాడితో విషయాలన్నీ రిపీట్... ఏదో అదీ ఇదీ మాట్టాడి బకెట్టు ఇవ్వడం ఎగ్గొడదామనుకున్నట్టు కనిపించాడు, సరే మీ ఫ్లోర్ మేనెజరుని పిలూ… నా Mystery shopping ధర్మమా అని తెచ్చుకున్న ధైర్యం, ఆ మాల్ వాడు మనకేమైనా మేనత్తకొడుకా, మేనమామ కొడుకా వదలడం ఎందుకూ, అనుకుని, మీ మేనేజరుని పిలూ అనడంతో, పక్కనుండే మిగిలిన కస్టమర్లు చూస్తున్నారనే భయం అనండి, నాలాటి తిక్క శంకరయ్యలతో గొడవెందుకూ అనుకున్నాడేమో, మొత్తానికి నేను అడిగినదానికి ఒప్పుకుని, ఆ బకెట్టేదో ఇచ్చాడు.

    ఆ బకెట్టు ఓ చేతిలో పట్టుకుని బయటకు వచ్చాను. ఈ మార్టు పక్కనే ఓ రెండు మూడు ఐటీ కంపెనీలున్నాయిలెండి, చాయ్ త్రాగడానికి ఉద్యోగస్థులు ఆడా, మొగా బయట నుంచుంటూంటారు. అందులో చేతిలో సిగరెట్టు పట్టుకుని నుంచున్న ఓ జంట, నన్నూ, నా చేతిలో బకెట్టునీ చూసి నవ్వినట్టనిపించింది. నా దారిన నేను వెళ్ళిపోతే బాగుండేదిగా, పనేమీలేక, ఆగి వాళ్ళని అడిగాను.. ఎందుకు నవ్వుతున్నారూ అని. దానికి వాళ్ళిచ్చిన సమాధానం.. That bucket in your hand looked a bit odd..uncle.. అన్నారు. నిజమేకదా, కారుల్లో ఎవరికీ కనిపించకుండా, చీపుళ్ళూ, బకెట్లూ తీసికెళ్ళొచ్చుకానీ, మరీ ఇలా పబ్లిగ్గా బకెట్లూ అవీ మోసుకెళ్తే odd గానే కనిపిస్తాయి మరి. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటీ What looks odd today, may be tomorrow’s fashion.. who knows, everybody may carry a bucket..అనగానే వాళ్ళూ నవ్వేసి, నిజమే అంకుల్ అని ఒప్పుకుని, చాయ్ ఆఫరు చేశారు.

    దీనితో అయిపోతే బాగుండేదిగా, ఇంకో రోజు రెడ్ లేబుల్ చాయ్ తీసికుంటే, దానిమీద Rs 10 off అని పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసుంది. బిల్లింగయిపోయి ఇంటికి వచ్చేసిన తరువాత చూశాను, MRP ఎంతుందో అంతా వసూలు చేశాడు, నాకు రావలసిన 10 రూపాయల డిస్కౌంటు ఇవ్వలేదు. చెప్పెనుగా కొన్నిటిలో ఊరుకోలేను, దానికి పాతచింతకాయపచ్చడి అనుకోనూవచ్చూ, ఓ పదిరూపాయలకోసం ఇంత గొడవా అనికూడా అనుకోవచ్చు. నిజమే ఉత్తి పదిరూపాయలకోసమూ, ఓ ఉచిత బకెట్టుకోసమూ పెట్రొల్ ఖర్చుపెట్టి వెళ్ళడం అవసరంలేదు, కానీ ఇంటిపక్కనే ఉండే కొట్లలోకి, మళ్ళీ వెళ్ళి అడగడంలో తప్పేమీ లేదనే నా అభిప్రాయం. చివరకి ఆ రిలయెన్స్ మార్టు కి వెళ్ళి, నా రసీదు చూపించి, నాకు రావాల్సిన పది రూపాయలూ తీసికున్నాను.

    సర్వే జనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– రమణ గారి ప్రసక్తి లేకుండా, బాపు గారి గురించి వ్యాసం…

   ఓరినాయనోయ్… శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రసక్తే లేకుండగా, శ్రీ బాపు గారిగురించి వ్యాసమా? అలా కూడా సంభవించింది, 1963 లో “హంస” అనే మాసపత్రికలో వచ్చిన వ్యాసం, శ్రీ బాపు గారి ముఖచిత్రంతో ప్రచురించారు. చదవండి…

హంస-1963-ముఖచిత్రం

బాపు-1

బాపు-2

బాపు-3

    ఈరోజుల్లో ఓ టివీ ముందర కూర్చున్నా, ఓ పత్రిక తెరిచినా ప్రకటనలే ..ప్రకటనలు. 1949 ఆంధ్రసచిత్రవారపత్రిక లో ఆనాటి ప్రకటనలమీద శ్రీ జి.ఎస్. సూరి గారి వ్యాసం చదివి ఆనందించండి.
ప్రకటనలు-వ్యాసం

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–few flying thoughts…

    ఒక్కొక్కప్పుడు “అలక” అనేది ఎందుకు వస్తుందో తెలియదు. ఏదో అనుకుంటాము, అలా కానప్పుడు, అందరిమీదా కోపం లాటిది వచ్చేసి, ” పోనిద్దూ ఎవరెలాపోతే మనకేమిటీ..” అనేసికుని తాత్కాలిక అస్త్రసన్యాసం లాటిది చేసేస్తూంటాము. సరీగ్గా నావిషయంలోనూ అలాగే జరిగింది. వయస్సొస్తే లాభం ఏమిటీ, అన్నీ ఆలోచించుకోవద్దూ, మనం అలిగితే నష్టం ఎవరికీ, నాకేగా.

అసలు ఈ బ్లాగనేది ఎందుకు మొదలెట్టినందుకూ, ఇంట్లో వాళ్ళందరికీ, నా కథలు విని..విని.. బోరుకొట్టేసిందనేకదా, నాకున్న ఇద్దరు మనవరాళ్ళూ, ఓ మనవడూ వాళ్ళ చదువుల్లో పడి, నాతో కబుర్లు చెప్పే టైమే ఉండడం లేదాయె. మిగిలిన ఒక్క మనవడూ ఏదో ఇంకా ప్లేస్కూలుకే పరిమితం అయిన కారణంగా, నామాట వింటూంటాడు. ఓ ఏడాది గడిచిందంటే ఆ ముచ్చటా తీరిపోతుంది.వ్రాయడం మొదలెట్టిన కొత్తలో చాలామంది వ్యాఖ్యల రూపంలో చాలా ప్రోత్సహించేవారు. నేను వ్రాసేది అంతబాగుంటోందా అని బోల్డంత ఆశ్చర్యపడిపోయి, రోజుకో టపా పెట్టేసేవాడిని, మొదటి సంవత్సరంలో. రానురానూ చదివేవారికికూడా విసుగెత్తి, వ్యాఖ్యలు తగ్గించేశారుకానీ చదవడంమానలేదు అని అర్ధం అయింది . నేను వ్రాసే టపాలు నచ్చో, నచ్చకో మొత్తానికి చదువుతున్నారుకదా, మళ్ళీ వ్యాఖ్యలే పెట్టడంలేదని ఏడుపెందుకూ? టపా వ్రాయడమంటే ఏదో copy, paste చేసేయడం కాదుగా, ఒళ్ళుదగ్గరపెట్టుకుని వ్రాయాలి. మనం వ్రాసేది ఇంకోరికెవరినీ కించపరిచేటట్టుగా ఉండకూడదూ, లేనిపోని controversies ఉండకూడదు. నేను గమనించిందేమిటంటే, అంతగా వ్యాఖ్యలు రావడంలేదూ అనుకుంటే, ఏదో ఒక విషయం తీసికుని, దానిని శల్యపరీక్షచేసేసి, మన ” స్వంత” అభిప్రాయాలని, అవతలివారిమీద రుద్దేయడం. వ్యాఖ్యలు గోదావరి వరదలా వచ్చేస్తాయి, కానీ, ఆ వరదలో మనమూ, మన బ్లాగూకూడాకొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన మన అస్థిత్వం కాపాడుకోవాలంటే, చాలా జాగ్రత్తలు తీసికుంటూండాలి.

ఎందుకొచ్చిన గొడవా అనుకుంటే అసలు ఈ బ్లాగులోకంలోకే అడుగు పెట్టకూడదు. అథవా పెట్టినా “ఆటుపోట్లకి” తట్టుకునే సహనమూ, ఓపికా కూడా ఉండాలి. ఇవన్నీ after thought గా వచ్చేవేలెండి. ఏదో శ్రమ పడి ఓ టపా పెట్టేమనుకుంటాము, మర్నాడు ప్రొద్దుటే లేచి కంప్యూటరు తెరిస్తే ఒఖ్ఖ వ్యాఖ్యకూడా కనిపించదు, పోనీ చదవలేదా అనుకుంటే, దేశవిదేశాల్లో వందలకొద్దీ చదివినట్టు తెలుస్తుంది. మరి అంతమందిలోనూ ఒక్కరికీ నచ్చలేదా, అని కొద్దిగా నిరాశా, నిస్పృహా కలగడం సహజం. పోనీ అలాటి విషయాలు, ఏదో ఒకటపారూపంలో పెట్టగానే, మన టపా అభిమానులుంటారే వాళ్ళందరూ, ఎవరికివారే-” మీ టపాలు నచ్చకపోవడమూ అనే మాటే లేదూ..” ” ప్రతీసారీ మీటపా అద్భుతమూ, అజరామరమూ..blah..blah..” అని వ్రాయడానికి కూడా బాగుండదూ..” అని కొందరూ,” మీరుకూడా వ్యాఖ్యలకోసమే వ్రాస్తున్నారంటే చాలా బాధగా ఉందీ..” అని జ్ఞానబోధలుకూడా, వ్యాఖ్యల రూపంలో పెట్టేస్తారు. కొంతమందైతే గీతాసారం బోధిస్తారు. నీవు చేసేదేదో చేసేయ్ ప్రతిఫలం ఆశించొద్దూ అని. చెప్పడం వరకూ బాగానే ఉంటుంది. కానీ మనం ordinary mortals సారూ. తన రాతలకి ఓ గుర్తింపనేది ఉంటుందనేకదా వ్రాస్తాడు, అదికూడా కరువయ్యేసరికి, బ్లాగులోకానికి దూరదూరంగా జరిగిపోతాడు పోనీ వ్యాఖ్యలు పెట్టడానికి అంత టైములేకపోతే, టపా చివరలో ఉండే ” ఈ టపా ఇష్టపడేవారి..” మీద ఓ నొక్కైనా నొక్కొచ్చుగా, ఇలా ఎన్నో మార్గాలున్నాయి టపానచ్చినట్టు అభిప్రాయం వ్యక్తీకరించడానికి.

చిన్నపిల్లలకైనా సరే ఓ “శభాషీ” (pat on the back) ఓ దివ్యౌవుషధం లా పనిచేస్తుంది. ఈ టానిక్కులు కరువౌవడంతోనే, చాలామంది రచయితలు బ్లాగులోకం వదిలేసి, ఇతరరచనా వ్యాపంగాల్లోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నారేమిటీ, వెళ్ళిపోయారుకూడానూ. పోనీ వ్రాయడం మానేశారా అంటే అదీకాదూ, ఇంకొక “వేదిక” ఎంచుకున్నారు. వ్రాయకలిగేవారు ఎక్కడైనా, ఎప్పుడైనా వ్రాయకలరు. దానికి సందేహమూ లేదు, ఇంకొకరి సర్టిఫికేట్ అవసరమూ లేదు.

పైన చెప్పినవన్నీ, నేను వ్రాసే టపాలకి వ్యాఖ్యలు రావడంలేదని చెప్పడంలేదు.ప్రస్తుతం బ్లాగులోకంలో జరుగుతున్న “emotional athyaachaar”. ఇవన్నీ చదివేవారికి చేదుగా ఉండొచ్చు. కానీ అక్షరసత్యాలు. అలాగని అసలు టపాలకి వ్యాఖ్యలే లేవనడానికీ లేదూ, ఈ బ్లాగులోకంలో ఓ చిత్రం ఉంది, ఒక్కొక్క రచయితకీ ఓ ‘fan club’ లాటిదుంది. సినిమావాళ్ళకి ‘అభిమానసంఘం’ లాగ.. ఈ అభిమానసంఘాలవారు, వారికి నచ్చే టపాలే చదివి, వాటిల్లోనే తమ సంతొషాన్ని వ్యాఖ్యలరూపంలో వ్యక్తపరుస్తూంటారు.” అవునూ, మాకు నచ్చినవాటినే చదువుతామూ, అస్వాదిస్తామూ, మీకేం వచ్చిందీ, మీకు వ్యాఖ్యలు ఎండిపోయాయని కుళ్ళూ..” అనొచ్చు. కాని ఇలాటి పధ్ధతివలన చివరకి జరిగేదేమిటంటే, ఈ ‘limited ‘ వ్యాఖ్యలూ,వ్యాఖ్యలు పెట్టి పెట్టి , ఈ వ్యాఖ్యలు పెట్టేవారికీ విసుపువచ్చేస్తుంది. అసలు మన మాతృభాషలో బ్లాగులు ప్రారంభం అయిందెందుకూ, వ్రాయడంలో ఏ కొద్దిగానో నేర్పు ఉన్నవారు, తమకు తోచిందేదో వ్రాసి, చదివేవారికి ఓ change of scene సృష్టించాలనే కదా. దీనివలన వ్రాసేవారికి భాషలో పట్టూ, చదివేవారికి ఓ కొత్తవిషయం తెలిసిందన్న ఆనందమూ కలగాలనేకదా. సరే మీభాషా పటిమకోసం మమ్మల్ని హింసించడం ఎందుకూ అనికూడా అనొచ్చు. పైనే చెప్పాను, వ్రాయకలిగేవాడు ఎక్కడైనా వ్రాయకలడు.

ఇలా పైన వివరించిన భావాలన్నీ కలగాపులగం అయిపోయి, గత పదిపదిహేను రోజులుగా, అసలు ఒక్క టపాకూడా పెట్టకూడదని నిశ్చయించేసికుని, ఆ సందర్భంలోనే అంతర్జాలం లో ఈమధ్యన కొత్తగా వస్తూన్న గోతెలుగు.కాం లో వ్రాయడం మొదలెట్టాను. వారికీ నేను వ్రాస్తూన్న వ్యాసాలు నచ్చి, ప్రచురిస్తున్నారు. అవేవో కొత్తగావ్రాస్తున్నవీ కావు, నిజజీవితంలో మనకి అనుభవమయ్యే సంఘటనలే, ఇలాటివి గత నాలుగేళ్ళలోనూ నా బ్లాగుల్లో కూడా వ్రాశాను.ఇదివరకు వ్రాసినవాటి పోలికలు కొద్దిగా కనిపించొచ్చు, కానీ అలాగని వాటికి నకలుకూడా కాదు. అవేసంఘటనలని కొద్దిగా refresh చేసి , ఇంకొద్దిగా జోడించి, ఓ కొత్త దృష్టికోణం లో వ్రాస్తున్నాను. సంఝాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. అలాగని ఈయనకే వ్రాయడం వచ్చూ పేద్ద గొప్పా.. అనే అహంభావంతో వ్రాస్తున్నాననిమాత్రం అపార్ధం చేసికోవద్దని మనవి. నాకూ తెలుసు, నేను వ్రాసేదాంట్లో ఏమీ గొప్పగొప్ప విషయాలుండవూ, ఏదో కాలక్షేపానికిమాత్రమే వ్రాస్తున్నవీ అని. తెలుగుబ్లాగులోకంలో వ్రాస్తూన్న అతిరథ మహారథులతో పోల్చుకుంటే నా స్థానం చిట్టచివరనే ఉంటుందనీ తెలుసు.

టపాలు పెట్టడం తగ్గించేసి, ఆమధ్యన నా టపాల్లో పెట్టిన కొన్నిలింకుల్లో లభించే , అద్భుతమైన మేలిమిబంగారం లాటి, పాతపుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఒక్కోటీ చదువుతూంటే కొత్తకొత్తవిషయాలు తెలియడం మొదలయింది. నాకు సాయం, మా ఇంటావిడకూడా ఓ పుస్తకం చదవడమూ, పక్క గదిలో ఉన్న నన్ను పిలిచి ” ఏవండోయ్ మీకు ఈ విషయం తెలుసో తెలియదో, ఫలానా వారు ఫలానా వారితో ఇలాగన్నారుట..” అంటూ, నేను పుట్టకపూర్వం జరిగిన విషయాలనీ, జరిగిన సంఘటనలనీ ,నాతో పంచుకోవడం మొదలెట్టింది. ఎవరైనా ఏదైనా కొత్తవిషయం తెలిసికుంటే, ఆ విషయాన్ని ఇంకొకరితో పంచుకుంటే వచ్చే ఆనందమే వేరు. ప్రస్థుతం మేమిద్దరమూ ఒకరు తెలిసికున్న విశేషం ఇంకోరితో చెప్పుకోవడానికే పరిమితం అయింది.అలాగని ఒకానొకప్పుడు నా టపాలు చదివి , నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన నా అభిమానపాఠకులతో పంచుకోపోతే ఎలా, అనుకున్నాను.

అందువలన సన్యసించడం మానేసి హాయిగా నేను ,మా ఇంటావిడా చదివిన ఓ కథో, ఓ poitical commentary యో, ఏ ప్రముఖ రచయిత గురించి ఓ వ్యాసమో, మాకేది నచ్చితే దాన్ని నాటపాలో జోడించి మీఅందరితోనూ పంచుకోవాలని నిశ్చయించేసికున్నాను. ఈమధ్యన దొరికిన ఖజానా అంతా ఇంతా అమూల్యమైనదనుకుంటున్నారేమిటీ, మీ అందరికీ వాటన్నిటినీ ఓపెన్ చేసి చదివే సావకాశం ఎలాగూ ఉండదు. కానీ అలాగని వాటిని అందరూ చదవలేదే అనే ఓ లోటుకూడా ఉండకూడదనే అభిప్రాయంతో ఇటుపైన ప్రతీ టపాలోనూ ఒకటి జోడించదలుచుకున్నాను. అలాగని అవన్నీ మీకూ నచ్చాలని లేదు. నా పనేదో నేను చేసికుంటాను. ఆ పరంపరలో మొదటగా…శ్రీ మునిమాణిక్యం వారు వ్రాసిన “అల్లుళ్ళు” చదవండి. ఎలాగా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ అల్లుళ్ళ గొడవలే ఎక్కువగా వింటున్నాము.

మునిమాణిక్యం అల్లుళ్ళు

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ‘మా’ టీవీ లో ఓ మంచి కార్యక్రమం…

    గత పది పదిహేను రోజులుగా తెలుగు చానెళ్ళు చూస్తూంటే, అంతా అగమ్యగోచరంగా ఉంటోంది. ఎవరికి వారే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా, ప్రకటనలు చేసేస్తున్నారు. అక్కడ సీమాంధ్రప్రాంతంలో ఊహించినట్టుగానే ఆందోళనలు ప్రారంభం అయాయి. దీనితో తెలుగు కార్యక్రమాలు చూడాలంటేనే ఒకరకమైన భయం వేస్తోంది. కానీ ఈవేళ “మా” టీవీ లో ప్రసారం చేసిన “అమృతోత్సవం” ఓ అద్భుతమైన కార్యక్రమం గా నిలిచిపోతుంది. ఎన్నో రోజుల తరువాత, సినిమా ప్రభావం లేని ఓ స్వచ్చమైన తెలుగు కార్యక్రమం చూడగలిగే భాగ్యం కలిగింది.

    మూడున్నరగంటలపాటు నిజంగా అమృతమే వర్షించింది.చిన్నపిల్లల పాటల తో మొదలయి,ఓ సుందరమైన నృత్యం, ప్రియా సిస్టర్స్ గానం చేసిన కొన్ని కీర్తనలూ, చివరగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి inspirational ప్రసంగంతో కార్యక్రమం ముగించారు.

    బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రసంగం గురించి చెప్పగలిగే తాహతు ఎవరికీ ఉంటుందనుకోను. ఏ విషయం తీసికున్నా, అలవోకగా , అందరికీ అర్ధం అయేటట్టు చెప్పడం, వారిలోని ప్రత్యేకత అని ప్రత్యేకంగా చెప్పాలంటారా? ఆయన ధారణా శక్తి అమోఘం, అద్వితీయం అని వేరే చెప్పఖ్ఖర్లేదు. గోదావరి తీరంలో అలనాడు అపర అన్నపూర్ణ అని పేరుగాంచిన సాధ్వీమణి డొక్కా సీతమ్మగారిని గురించి , బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్తూంటే విని ఆనందించడం మన అదృష్టం.Dokka Seetamma Garu అలాగే గోదావరి ప్రాంతాలని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి చెప్పిన మాటలూ మొత్తం ప్రసంగానికి ఓ అందం తెచ్చాయి.

    డొక్కా సీతమ్మ గారి గురించి ఆకాశవాణి లో ప్రసారం అయిన ఒక రూపకం క్రింద చదవండి.

DS1

DS2

DS3

DS4

DS5

DS6

   డొక్కా సీతమ్మ గారి గురించి కల్లూరి శైలబాల గారు 2011 లో వ్రాసిన ఒక అద్భుతమైన వ్యాసం ఇక్కడ చదవండి.

%d bloggers like this: