బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పళ్ళూ, కూరలూ

   ఈ మధ్యన రిలయన్సులూ, స్పెన్సర్లూ, మోర్లూ వచ్చిన తరువాత, చాలా మంది కూరలకోసం వాటిల్లోకే వెళ్తున్నారు. అన్నీ నీట్ గా పెట్టి, వాడేం చెప్తే ఆ ధరకే కొనుక్కోవడం. దానితో బయట అమ్మేవాళ్ళదగ్గర కూరలు తీసికోవడం బాగా తగ్గింది. మా చిన్నతనంలో, శనివారాల్లో ఒకచోటా, ఆదివారాల్లో ఇంకో చోటా సంతలుండేవి. చుట్టుపక్కల పొలాల్లోంచీ, తోటల్లోంచీ కూరలూ, పళ్ళూ వగైరాలు తెచ్చి అమ్మేవారు.ఆ సంతకెళ్ళడం ఓ అద్భుతమైన జ్ఞాపకం. అక్కడ కూరలూ పళ్ళే కాకుండా మిగిలిన సరుకులు కూడా దొరికేవి.ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది,తూకాలూ అవీ అంత సరీగ్గాఉండేవి కావేమో అని.

ఇప్పటికీ చూస్తూంటాము, రోడ్డు పక్కన బండిలో అమ్మేవాళ్ళు, చవగ్గా ఎందుకిస్తారూ? కాటాలో ఏదో గోల్ మాల్ ఉందన్నమాట.వీధిలోకి అమ్మడానికి వచ్చే కరివేపాకు, ఓ గిద్దెడు బియ్యం ఇస్తే ఇచ్చేవాడు. ఇప్పటి ధరలనుబట్టి, బియ్యం ఇచ్చుకోడం కంటే, హాయిగా డబ్బులిచ్చే కొనుక్కోడం హాయి. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు ( క్రిందటేడాది), ప్రతీరోజూ ఒకతను సైకిలుకి బుట్ట తగిలించుకుని కూరలు తెచ్చేవాడు. ఏదో దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, ఇంటి దగ్గరే దొరుకుతున్నాయికదా అని, అతనిదగ్గరే కొనడం మొదలెట్టాను.బేరం ఆడేవాళ్ళకి తక్కువచేసిచ్చేవాడు. ఓ నాలుగురోజులు చూసి, మానేశాను.రాజమండ్రీ మెయిన్ రోడ్డులో ఒక బండివాడుండేవాడు. అతనిదగ్గర కొద్దిగా ధర ఎక్కువైనా, కూరలు ఫ్రెష్ గా ఉంటాయి కదా అని, అక్కడే తీసికునేవాడిని. మా కజిన్ తో ఒకసారి వెళ్ళినప్పుడు, తీసికోరా అంటే, ‘ వద్దూ, వీడిదగ్గర ఖరీదెక్కువా ‘అని తీసికునేవాడు కాదు.I think one has to pay the price for the quality. అయినా ఉన్నది లింగూ లిటుకూ అంటూ ఇద్దరమే కదా. పోతే పోనీయ్ అని ఖరీదెక్కువైనా అక్కడే తీసికునేవాడిని.

కొంతమందంటారు ఫలానా పెద్ద మార్కెట్ లో చాలా చవకండీ, అన్నీ హోల్ సేల్ ధరలకే ఇస్తారూ అని.ఏదో పనిమీద ఆవైపుకి వెళ్తే కొనుక్కోవాలికానీ, చవగ్గా ఇస్తారు కదా అని అంతదూరం వెళ్ళడంలో అర్ధం లేదు.రానూ పోనూ అయే ఖర్చు కూడా చేరిస్తే, దగ్గరలో ఉన్న బండి వాళ్ళ దగ్గర కొనుక్కోవడమే హాయి! వచ్చిన గొడవల్లా, తూకాలదగ్గరే. ఆతూకంరాళ్ళు ఏ గుప్తులకాలానివో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు, ఏవో నట్లూ, బోల్టులూ వేసి, తూస్తూంటారు. మాల్స్ లోకి వెళ్తే
ఈ తూకం మాత్రం డిపెండబుల్ గా ఉంటుంది.

మా ఫ్రెండోడుండేవాడు, మార్కెట్ మూసే సమయానికి వెళ్ళేవాడు, కొట్టు మూసేస్తూ, రోజులో అమ్మగా మిగిలిన కూరలన్నీ, హోల్ సేల్ గా తోచిన ధరకిచ్చేస్తారని!ఆ కొట్లవాళకేమైనా కూలింగ్ ఛాంబర్సూ అవీ ఉంటాయా ఏమైనా? ఇంక ఆకు కూరల విషయానికొస్తే,ఆ కట్టల్లో ఏవేవో కలిపేసి కట్టి అమ్ముతారు. కొంపకొచ్చి చూస్తే, అందులో సగం అవతల పడేసేవే! ఈ మాల్స్ లో కొనడం అదీ మంచి stylish గానే ఉంటుంది.కానీ అక్కడ బిల్లింగు చేసేటప్పటికి ప్రాణం మీదకొస్తుంది. అదే బయట అమ్మే కొట్లవాళ్ళదగ్గర అయితే यूं गया यूं आया ! చారులోకి ఏ కొత్తిమిరో కావాలంటే, ఈ చిన్న దుకాణాలే హాయి! పైగా ఈ మాల్స్ లోకి వెళ్ళామంటే, తీసికోవాల్సిన కూరలతో పాటు, ఇంకా అవసరం ఉన్నవీ, లేనివీ తీసికోవాలనిపిస్తుంది.అదేదో పిల్లలకిష్టం, ఇంకోటేదో ఇంటావిడకిష్టం అనుకుంటూ! పైగా అక్కడుండేవన్నీ తళతళా మెరుస్తూంటాయి లైట్లలో!కూరలకోసం వెళ్ళడమూ, ఓ యాపిల్ బావుందని, ఇంకో పైనాపిల్ బాగుందనీ,లేకపోతే ఇంకో ఫలానాది బావుందనీ అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం.పోనీ తెచ్చాము కదా అని ఇంట్లో వాళ్ళేమైనా తింటారా అంటే,వాటిని ఓ బుట్టలో పెట్టి పూజచేయడమే.చివరకి ఆ పళ్ళకి ముసమలొచ్చేసి, మిగలముగ్గిపోతాయి. పైగా కొంతమందికి పదునులూ, అంతలా ముగ్గితే టేస్టుండదూ అని! కూరలనండి, పళ్ళనండి, మార్కెట్ నుంచి తెచ్చినవి పూర్తిగా ఏ ఇంట్లోనూ సొమ్ము చేయరు. ఏదో అది కొనేద్దామూ, ఇదికొనేద్దామూ అని యావే కానీ ఇంకెమీ కాదు.

అన్నిటిలోకీ తక్కువ shelf life ఉన్నది అరటి పండు.బావున్నాయికదా అని ఓ అరడజను తెచ్చామనుకోండి, రెండో రోజుకల్లా రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. ఎవరైనా వచ్చినా చేతిలో కూడా పెట్టలేము.అన్నిటిలోకీ, దేవాలయాల దగ్గర అమ్మే అరటిపళ్ళు చూస్తే నవ్వొస్తుంది- ఓ రుచీ పచీ ఉండవు, అందుకే కాబోలు దేముడరిటిపళ్ళంటారు! అలాగే గుళ్ళల్లో ఇచ్చే పళ్ళన్నీ ప్రత్యేకం దేముడికోసమే పండించారా అనేట్లుంటాయి.కొంతమంది శ్రావణమాసం వాయినాల్లో ఇస్తూంటారు- ఓ పండూ, శనగలూ, ఓ వక్కపొడి పొట్లం.అన్నిటిలోకీ funny character ఆ వక్కపొడి పొట్లం, దానికి ఓ ఉల్లిపొరకాయితం తోపాటు ఓ వక్క పలుకోటుంటుంది. ఎందుకూ ఉపయోగించదు. నిన్న వ్రాసిన పెట్టుబడి బట్టల కోవలోకే వస్తాయి ఈ వాయినాల్లో ఇచ్చే, దేముడుగుళ్ళల్లో ఇచ్చే పళ్ళూ, ఈ వక్కపొడి పొట్లాలూనూ. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదంటే లేదూ!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెట్టుబడి బట్టలు

   ప్రపంచం లో ఉన్న ప్రతీ occasion కీ బట్టలు పెట్టడం అనేది, మన ఆంధ్రదేశంలోనే ఎక్కువనుకుంటాను.ఎవరింటికి వెళ్ళినా, ఆడవారికి, వారి పరిచయాన్ని బట్టి ఓ చీరో జాకెట్టు ముక్కో పెట్టేస్తూంటారు.బాగా తెలిసినవాళ్ళైతే, కొంచెం మంచి క్వాలిటీ ది,చుట్టాలైతే ఓ చీర బోనస్సు! అవి అటూ ఇటూ తిరిగి, చివరకు మొదటిచ్చిన వాళ్ళ దగ్గరకే వస్తూంటుంది. అది వేరే విషయమనుకోండి! అసలు ఈ బట్టలుపెట్టడం అనే ఆచారం ఎక్కడినుంచొచ్చిందండి బాబూ? ఎవరైనా పీటలమీద కూర్చుంటే, వాళ్ళకి (దంపతులకి) బట్టలు పెట్టాలిట.ఈ సెంటిమెంటులేమిటో, ఈ గొడవలెంటో నాకు మాత్రం ఎప్పుడూ అర్ధం అవవు.ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతూంటుంది- ఇంట్లో ఏ శుభకార్యం అయినా, మా ఇంటావిడవైపు చూస్తాను, ఎవరెవరికి బట్టలు కొనాలో!

పైగా ఎవరైనా పుట్టింటికి వెళ్తే, ఆవిడ అక్కడినుంచి తిరిగివచ్చిన తరువాత, అందరికీ తనకి ఎవరెవరు ఏమేమి బట్టలు పెట్టారో, అందరినీ పిలిచి మరీ చూపిస్తారు.అదంతా తన పుట్టింటి వారి status చూపించుకోడం అన్న మాట! ఏ పరిస్థితుల్లో అయినా, అక్కడినుంచి, బట్టలు రాకపోయినా, కొంచెం చవకబారు బట్టలొచ్చినా, తిరిగి వచ్చేటప్పుడే, కొట్లోకి వెళ్ళి ఖరీదైన బట్ట కొనుక్కోవడమూ, పుట్టింటివారిచ్చేరని చెప్పుకోవడమూనూ.అలా బట్టలు పెట్టిన వాళ్ళెవరైనా, మనింటికి వస్తే, వాళ్ళిచ్చినదానికంటె ఓ మెట్టు పైది పెట్టడం. లేకపోతే మన పరువు పోదూ?

ఇంట్లో బీరువా నిండా, ఓ మోపెడు బ్లౌజు పీసులు దాస్తూంటారు.ఇంటికి మొదటిసారి వస్తే బ్లౌజు పీసివ్వాలిట.పైగా ఆ వచ్చినవాళ్ళుకూడా take it for granted గా, ఆ బ్లౌజుపీసేదో ఇస్తేనేకానీ కదలరు! పైగా ఇస్తున్నప్పుడు ‘ఇప్పుడెందుకండీ ఇవన్నీనూ’ అంటూ ఓ మొహమ్మాటం డయలాగ్గోటీ. వీళ్ళు <b.ఇవ్వకా మానరు, ఆ వచ్చినవాళ్ళు పుచ్చుకోకా మానరు, ఊరికే public consumption కోసం ఈ డయలాగ్గులు! ఇవన్నీ అస్తమానూ ఎందుకూ అంటే, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చీర తీసికోలేదేమిటీ, తిరిగి పెట్టకపోతే బావుంటుందా అంటూ ఇంటివాడి నోరు నొక్కేస్తూంటారు!అసలు in the first place తీసికోమ్మనదెవడంట? అప్పుడు తీసికోకపోతే ఇప్పుడు ఇచ్చే అవసరం ఉండేది కాదుగా!

ఈ బట్టలవ్యవహారాలు ఈ మధ్యన, ఆడవారివరకే పరిమితం అయ్యాయి.మొగాళ్ళకి, ఓ జేబురుమ్మాలో, ఓ తువ్వాలో పెట్టేస్తున్నారు.మారోజుల్లో, ఏ సన్మానం లాటిది జరిగినా శాలువాలు కప్పేవారు. ఈ మధ్యన ప్రతీ వారికీ, ఓ కండువా భుజంమీదెయ్యడం ( ఏ పార్టీవాళ్ళైతే ఆరంగుది).ఒకప్పుడు ఆ కండువాకి చాలా పెద్ద honour ఉండేది. కండువా వేసికున్నవారిని ఓ ప్రత్యేక గౌరవంతో చూసేవారు. కండువా లేకుండా, వీధిలోకి కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడో ప్రతీ కోన్కిస్కాగాడికీ ఓ కండువాయే! వాడు history sheeter అవొచ్చు, లేక అప్పుడో, ఆముందురోజో పార్టీ ఫిరాయించిన రాజకియ నాయకుడవచ్చు!

ఒక్కొక్కప్పుడు మగాళ్ళకి పంచలచాపు పెడుతూంటారు. వాటినేం చేసికుంటాం, లుంగీగా కట్టుకోడమో, లేక ఇంకోదానికో మడిబట్టలా కట్టుకోడం.ఇంక ఇలా అవతలివారిచేత పెట్టించబడ్డ బట్టలు ( మగాళ్ళ పాంటు పీసులూ, షర్టు పీసులూ) ఇంట్లో పెట్టినిండా ఉంటాయి. అలా పెట్టినింపుకోడం తప్పించి, మనమేమైనా కుట్టించుకుంటామా, పెడతామా? మళ్ళీ మనింటికి ఎవరైనా చుట్టాలొస్తే, వాటికి ముక్తీ మోక్షం వస్తాయి. మళ్ళీ ఇందులో ఓ జాగ్రత్త తీసికోవాలి, మరీ వాళ్ళిచ్చిందే తిరిగి వాళ్ళకి పెట్టేయడం కూడా బాగోదు! మనవైపు చూశాను- ప్రతీ బట్టల దుకాణంలోనూ, పెట్టుబడి బట్టలని విడిగా ఉంటాయి. వాళ్ళకీ తెలుసు,ఈ బట్టల ఇకనామిక్స్!వాటి క్వాలిటీ కూడా అంతంతమాత్రమే! చివరకి అవన్నీ ఏ గిన్నెలమ్మేవాళ్ళదగ్గరకో చేరతాయ!

ఇలా వ్రాసేనని, మా ఇంటికి పూణె లో రావడం మాత్రం మానేయకండి. మరీ మొగాళ్ళకి ఏమీ పెట్టనుకానీ, ఆడవారికి మాత్రం మా ఇంటావిడ అతిథి సత్కారం గత 38 ఏళ్ళనుంచీ చేస్తూనేఉంది, అందరికీ మరీ చీరలనను కానీ,వయస్సుని బట్టి ఓ డ్రెస్సో, ఓ చీరో ( పెట్టుబడి క్వాలిటీ మాత్రం కాదు!)పెడుతూనేఉంటుంది. మరీ అంత పరిచయం లేనివారికైతే టూ బై టూ బ్లౌజు పీస్సోచ్ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైం పాస్ !!

   మొత్తానికి నాలుగురోజులపాటు, మాతో hide and seek ఆడేసికుని, కరెంటు వచ్చిందండీ. ఆఖరికి నిన్న కూడా,వాళ్ళు చేసిన రిపేరు, ఆరుగంటలు మాత్రమే ఉండి, మళ్ళీ డిమ్ము అవడం ప్రారంభించింది.ప్రొద్దుటే 8.30 కల్లా హాజరీ వేయించుకుని, ఎలాగైతేనేం, రాత్రి తొమ్మిదికి లైట్లొచ్చేశాయి. కథ సుఖాంతం ( ప్రస్తుతం వరకూ!!). ఈ వేళ ప్రొద్దుట ఓ మిస్టరీ షాపింగు assignment సందర్భంలో ఓ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళాను.వాళ్ళని, నన్ను Swiss/Paris Tour Package గురించి అడగమన్నారు. అవేమైనా చూశానా పెట్టేనా, ఉత్తిత్తినే !!వివరాలు అన్నీ అడిగి, నా contact details ఇమ్మన్నప్పుడు, అదో బెంగా, రెండో రోజునుంచీ ప్రారంభిస్తారు, ఫైనలైజు చేసేరా అంటూ,అందుకోసమని చెప్పాను- ఈ టూర్ నాకోసంకాదూ, మా ఊళ్ళో మా తమ్ముడున్నాడూ, అతనికోసమూ అని,ఆతావేతా అడిగినా, ఇంకా తను ఫైనలైజు చేయలేదూ అని చెప్పడం కోసం!

   బస్సుకోసం వెయిట్ చేస్తూంటే, తెలిసిన ఒకావిడ ‘హల్లో అంకుల్ ఎలా ఉన్నారూ’ అని పలకరించారు. ఆవిడని ఎక్కడ చూశానో మర్చిపోయాను.ఎక్కడో చూసినట్టే ఉందీ, గుర్తుకురాలేదు.ఆవిడని చూడగానే ఇంకొకామె గుర్తొచ్చారు, ఆగుర్తొచ్చినావిడకి ఆమధ్య చేతి వేలు విరిగింది.ఆవిడే అయిఉంటారూ అనుకుని, <b.వేలెలాఉందీ, మీ అబ్బాయి ప్లే స్కూలుకి వెళ్తున్నాడా అని పరామర్శచేశాను. ఆవిడకేమో అంతా అయోమయంగా ఉంది, ఓసారి వేలు చూసుకుని, అర్రే బాగానేఉందే అని ఆశ్చర్యపడిపోయారు! ఆవిడ ఏదో విషయంగురించి సమాచారం అడిగి, వివరాలు తెలిసిన తరువాత, నాకు ఓసారి ఫోను చేయండీ అన్నారు. నేను నోరుమూసుక్కూర్చోవచ్చా, మీ శ్రీవారి నెంబరు నాదగ్గర ఉందీ అన్నాను.అదేమిటీ మిమ్మల్ని మావారెప్పుడు కలిశారూ అని ఇంకా ఆశ్చర్యపడిపోయారు. ఎక్కడో ఏదో పేద్ద తేడా వచ్చేసింది.నేను ఒకరిని చూసి ఇంకోరనుకున్నాను. అయినా అరగంటసేపు మాట్లాడాను!ఆవిడిచ్చారుకదా, అని ఫోను నెంబరు తీసికుని, పేరడిగినప్పుడు తెలిసింది, నేననుకున్నావిడ కాదూ అని!

    ఈవిడకి ఉన్నది అమ్మాయి,పైగా ఆపిల్ల ప్లేస్కూలుకి కాదు వెళ్ళేది,కేంద్రీయవిద్యాలయంలో ఏడో క్లాసుకి,ఆవిడ శ్రీవారిని నేనెప్పుడూ చూడలేదు, కారణం ఆయన ముంబైలో పనిచేస్తున్నారు!మాట్లాడగా మాట్లాడగా చివరికి ట్యూబ్ లైటు వెలిగింది,ఆవిడనెక్కడ కలిశానో! ఇంక వళ్ళు దగ్గిరెట్టుకుని, మళ్ళీ confuse అవకుండా మాట్లాడాను! ఏమిటో వయస్సొచ్చేస్తూందనిపిస్తోంది, నెత్తిమీదికి 65 ఏళ్ళొస్తే, ఇంకా వయస్సొచ్చేస్తోందనేడవడం ఎందుకూ? అయినా సరే కొత్తవారిని పరిచయం చేసికోడం మానను! అలాగని కాళ్ళూ చేతులూ కట్టుకుని ఇంట్లోనూ కూర్చోనూ! బయటకెళ్తే,ఎవరోఒకళ్ళని పలకరించకా మానను! మావాళ్ళ ప్రాణం మీదికొస్తోంది, నాతో వేగలేక!

    నేను చేసే మిస్టరీ షాపింగు ఏజెన్సీ డైరెక్టరు, పాపం రోజువిడిచి రోజు ఫోను చేసి అడుగుతూంటారు, ఫలానా చోట assignment ఉంది, చేస్తారా అంటూ. ఏదో దగ్గరలోదైతే సరే అంటాను, కాకపోతే వదిలేస్తాను.నాకు సంతోషం ఎక్కడా అంటే, ఈ కొత్త ఏజెన్సీ వారుకూడా,పాత ఏజెన్సీ వారిలాగే, ఫోను చేసి మరీ అడుగుతూంటారు! మామూలుగా, మనం ఎప్లై చేస్తేనే ఇస్తూంటారు.అలాకాకుండా, వాళ్ళే ఫోను చేసి ఎసైన్ చేయడం, ఒక్కోసారి అనిపిస్తూంటుంది,వీటితో మన ఇగో కూడా ఎలా satisfy అవుతోందో! ఎవరికైనా అంతేకదా, బయటవారి దగ్గరనుండి recognition వచ్చినప్పుడే కొండెక్కేసినట్లుగా ఉంటుంది. These are small things in life. But, they make all the difference in life!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- జ్ఞాపకాలు

   మనం విద్యుఛ్ఛక్తికి ఎంత బానిసలయ్యామో ఈ రెండు రోజుల్లోనూ బాగా తెలిసింది.శనివారం పగలూ,రాత్రీ మా అమ్మాయిదగ్గర గడిపి, ఆదివారం మా ఫ్లాట్ కి తిరిగి వచ్చాము.తనతో గడపడం లేదని, అమ్మాయి కోప్పడుతుందేమో అని,రోజంతా అక్కడే గడపాలని నిశ్చయించుకుని ఉండిపోయాము.నాకు చూపించాలని ఎప్పటినుండో అనుకుంటున్న ఓ రెండు మరాఠీ సినిమాలు, झेंडा, हरिस्चन्द्राची फाक्टरी చూపించింది.మొదటిది ఎంత సీరియస్సో, రెండోది అంత హాస్యం,అద్భుతం ! ఇన్నాళ్ళూ, ఆ సినిమా గురించి విన్నా, ఏమిటో 100 సంవత్సరాలక్రిందటి పాటలూ, సెట్లూ బ్లాక్ ఎండ్ వైట్ లో ఉంటాయేమో అనుకుని, ఆ సినిమా చూడ్డానికి అంత ఆసక్తి చూపలేదు. మా అమ్మాయి అంటూనే ఉంది- The movie is simply awesome, I know you would love it. అలాగే తనన్నట్లే ఆ మూవీ చాలా చాలా బాగుంది…

ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సాయంకాలం దాకా బాగానే ఉంది. 3 Idiots సినిమా వస్తుంటే, కరెంటు పోయింది. పక్క బిల్డింగుల్లో అందరికీ వచ్చింది, మాకు మాత్రం డిమ్ముగా వస్తోంది.కంప్యూటరు లేదు, టి.వీ.లేదు, ఫ్రిజ్ ఆపేయవలసివచ్చింది. రాత్రంతా దోమల బాధ. అడక్కండి. ప్రొద్దుటే స్నానం చేయడానికి, గిన్నెతో వేణ్ణీళ్ళు పెట్టుకుని, లిఫ్ట్ పనిచేయకపోవడంతో, మాట్లాడకుండా, నాలుగు అంతస్థులూ మెట్లమీదుగా దిగి, వాచ్ మన్ ని అడిగాను-ఎలెట్రీవాళ్ళని ఎలా పిలవడమూ అని.వాడికేం తెలుసూ,అంతేకాదు, ఓ ఫోన్ నెంబరుకూడా లేదు.పోనీ అని సొసైటీ లో చాలామందికి, రాత్రంతా లైటులేదుకదా, పోనీ వాళ్ళదగ్గరైనా ఉండకపోతుందా అని అడిగితే, వాళ్ళకీ ఏమీ తెలియదుట!అక్కడ గత నాలుగేళ్ళనుండీ ఉంటున్నారూ, ఆమాత్రం తెలియదూ అంటే ఆశ్చర్యం వేసింది.ఎవడోఒకడు కంప్లైంటు చేస్తాడులే, వాడికొస్తే,మనకీ వస్తుందీ అనే భరోసా! పోనీ, నలుగురికీ ఉపయోగించేటట్లుగా ఉంటే ఏం పోయిందీ?

ఇది మన సిటీల్లోనూ, ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ వస్తూన్న ఓ కొత్త జాడ్యం!మనకి దేనిగురించైనా తెలిస్తే, ఇంకోళ్ళకి చెప్పకుండా ఉండడం.ఏదో రోజు, నీళ్ళురావని, ఏ పేపర్లోనైనా వేసేడనుకుందాము, దాన్ని చదివినవాడు, అందరికీ చెప్పొచ్చుగా, అబ్బే అలా చెప్పేస్తే అందరూ సుఖపడిపోరూ, తనొక్కడే బాగుపడాలి. పైగా సొసైటీ లో మిగిలినవాళ్ళందరూ, అదేమిటీ, చెప్పాపెట్టకుండా, కార్పొరేషను వాళ్ళు ఇలా నీళ్ళు బందుచేశారూ, అనుకుంటూంటే, మన హిరో పేద్ద గొప్పగా
నిన్న పేపర్లో ఇచ్చారు, నేను చదివానూ, అందుకనే రాత్రే నీళ్ళుపట్టిపెట్టేసికున్నానూ అంటాడు. ఆ మాత్రం అందరితో చెప్పడానికేంరోగం?

మనకి తెలిసినది, ఏ విషయమైనా సరే ఇంకో నలుగురితో పంచుకోడంలో ఉన్న ఆనందం, మనమే అనుభవించాలనుకోడం చాలా తప్పు.ప్రతీవారూ పేపరు చదవకపోవచ్చు, న్యూసు చూడకపోవచ్చు, అలాటివారికి ఉపయోగిస్తుందికదా.ఒక్కొక్కప్పుడు, ఊళ్ళో ఏదైనా మంచి కార్యక్రమం జరగబోవచ్చు, దానిగురించి తెలిసినవారందరికీ చెప్తే, దానిమీద ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చుగా, అంతేకానీ, మనకే తెలుసునుకదా అని మనదారినమనం చూసొచ్చేసి, గొప్పగా అందరితోనూ, ‘మేము ఫలానా కార్యక్రమం చూసొచ్చామోచ్’ అంటే, చాలా బాధొస్తుంది. నామట్టుకి నాకైతే, తెలిసిన విషయాన్ని నలుగురితోనూ పంచుకుంటాను. ఇష్టమైన వాళ్ళు వింటారు, లేనివాళ్ళు మానేస్తారు. మనకేమీ నష్టంలేదు.లేనిపోనివన్నీ,తెలిసినవీ,తెలియనివీ exaggerate చేయకూడదు.ఒకసారి విన్నా, దాన్లోని నిజా నిజాలు తెలిసిన తరువాత మన మొహం చూడడెవడూ!

దీనివలన మనం ఇంకో నలుగురు స్నేహితుల్ని సంపాదించుకుంటాము. కాదూ నన్నుముట్టుకోకు నామాలికాకీ లా ఉందామనుకుంటారా మీఇష్టం.మనం పోయినతరువాత, మన గురించి చెప్పుకునేది వీటిగురించే! నా ఎలెట్రీ గొడవలోంచి, దేంట్లోకో వెళ్ళిపోయాను!మొత్తానికి ఎలెట్రీ ఆఫీసు పట్టుకుని,complaint ఇచ్చిన తరువాత, బాగుపడింది.మళ్ళీ ఇవాళ సాయంత్రం అదే తంతు. అదేమిటో శాపం పెట్టినట్టుగా ఠంఛనుగా, సాయంత్రం ఆరుగంటలకల్లా మళ్ళీ మొదలూ, ఈ సారి మెట్లుదిగి వెళ్ళే ఓపిక లేక, ఫోను చేస్తే, పాపం వాళ్ళు, ఎనిమిదింటికల్లా బాగుచేశారు! దాని ఫలితమే ఈ టపా.

కరెంటుపోయిందంటే, కాళ్ళూ చేతులూ పడిపోతాయి.మన దినచర్యలు దానితో ఎంత పెనవేసుకుపోయాయీ అనేది చూస్తూంటే,కరెంటు లేనిరోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమా అనిపిస్తూంటుంది.సాయంత్రం అయేసరికి, కొంచెం పెద్ద చిమ్నీ ఉండే, కోడిగుడ్డు ల్యాంపు తీసికుని, ఆ చిమ్నీలో ముగ్గువేసి, క్లీను చేసికుని, వెలిగించడం.ఇంట్లో అందరి భోజనాలూ, అమ్మ వంటిల్లు కడగడం అదీ అయిన తరువాత, సావిట్లో, దానిముందర, కూర్చుని, పుస్తకాల్లోది బట్టీ పడుతూ,మధ్య మధ్యలో జోగుతూ, నాన్న ” ఏరా చదువుతున్నావా” అనగానే ఉలిక్కిపడడం, అలా ఉలిక్కిపడి, దీపం మీదికి వంగడం, దాంతో మనమొహం మీదపడే వెంట్రుకలు కొద్దిగా కాలడం, ఆ వాసన తగిలి, నాన్నో, అమ్మో ‘ చాల్లే చదివింది ఇంక పడుక్కో’అనడం, అబ్బ ఎన్నెన్ని జ్ఞాపకాలో !!
ఇవి కాకుండా, హరికెన్ లాంతర్లని ఉండేవి.పెట్రోమాక్స్ లైట్లకి, అదేదో మాంటిల్ అనేదాన్ని వెలిగించగానే, అది ఓ తమాషా చప్పుడు చేసికుంటూ, బ్రహ్మాండంగా వెలిగేది.సాయంత్రాలవగానే, ఓ నిచ్చేనేసికుని వీధిదీపాలు వెలిగించడానికొచ్చేవారు
పంచాయితీ వాళ్ళు!ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని జ్ఞాపకాలో !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- झेंडा

    నిన్న మా అమ్మాయి’జెండా’ అనే మరాఠి సినిమా చూపించింది. ఆ సినిమాలో ముఖ్యంగా,మహరాష్ట్రలోని శివసేన, అద్యక్షుడు బాల్ ఠాక్రే, అతని కొడుకు ,మేనల్లుడుల మధ్య అభిప్రాయ బేధాలూ, రాజ్ ఠాక్రే శివసేనలొంచి బయటకు వచ్చేసి, ఇంకో పార్టీ ప్రారంభించడం గురించి.

   ఈ సినీమా, ఒక్క ఈ రాష్ట్రం వారికేకాదు, దేశంలోని రాజకీయాలు ఎలా ఉన్నాయీ, నాయకులు వారి స్వార్ధానికి, వర్కర్లని ఎలా ఉపయోగించుకుంటారూ,చివరకు, వీరికీ,వర్కర్లకీ మధ్య ఉండే దళారులు ఎలా బాగుపడతారూ, అనే విషయం
చాలా బాగా చిత్రీకరించారు.ఇక్కడనే కాదు, దేశంలో ఏ రాజకీయనాయకుడైనా సరే, ఎంత నీచానికైనా ఎలా దిగజారుతాడో, ఏవేవో ఆశయాలు పెట్టుకుని,యువత ఈ దరిద్రులవెంట పడి, తమ జీవితాల్ని ఎలా పాడిచేసుకుంటారో అద్భుతంగా చిత్రించారు.

    బహుశా ఇలాటి చిత్రం తెలుగులో తీసుంటే, మన వాళ్ళు అంత sportive గా తీసికోపోవచ్చు.నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే- శివసేన వాళ్ళు, అసలు ఈ చిత్రాన్ని ఎలా అనుమతించారో అని!! వీలుంటే ఓ DVD తీసికుని చూడండి. దానిలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఉన్నాయి. హాయిగా అర్ధం అవుతుంది. ఈ సినిమాలో, చివరివరకూ వచ్చే పాట!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” బామ్మ” గారికి డ్రెస్సు !!!

    ఏదో శనివారం, టపాలేమీ వ్రాయకుండా, మా ఇంటావిడ చేసే coconut rice సాంబారులో కలుపుకుని తినేసి, హాయిగా ఉందామనుకుంటే నా టపాలో raa1 గారు ఓ వ్యాఖ్య- “> మా ఇంటావిడకో డ్రెస్ తెచ్చాను
అచ్చ తెలుగు తణుకు బామ్మ గారు, డ్రెస్ లు వేసుకుంటున్నారా” అని పెట్టారు. ఆ వ్యాఖ్యకు అక్కడే జవాబివ్వొచ్చు.కానీ నా సమాధానం ఇంకో టపా అంత అవుతోంది,
దాని రిజల్టే ఈ టపా.

    వయసొచ్చినతరువాత కూడా, ఆడవారు డ్రెస్సు(పంజాబీ) వేసికోవడంలో ఉన్న ఆక్షేపణ ఏమిటో నాకు అర్ధం అవదు. మగవాళ్ళు, తాతయ్యలై, డెభ్భై ఏళ్ళొచ్చినా, జుట్టుకి రంగేసికొని, అమెరికా నుంచి, కొడుకో కూతురో పంపించిన
క్యాప్రీలూ, నిక్కర్లూ వాటిపైన పువ్వుల టీషర్టులూ వేసికొని దసరాబుల్లోళ్ళలాగ తిరగ్గాలేనిది, ఆడవారు డ్రెస్సులు వేసికొంటే తప్పేమిటీ? మగాళ్ళు వేసికోవడం comfort & convenience కోసం అంటే ఇదీ అంతే.ప్రయాణాల్లో చూస్తూంటాము
నిద్రపోతున్నప్పుడు ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా, అక్కడో అక్కడ దుప్పటీ తప్పుకుని, చీర పైకి వెళ్ళిపోతూంటుంది, అక్కడున్నవాళ్ళల్లో ఒక్కడైనా చొంగ కార్చుకుంటూ,అక్కడే దృష్టిపెడతాడు,ఇంకా పైకి ఎప్పుడు వెళ్తుందా అని!ఇంక పైబెర్తు లోకి
ఎక్కేటప్పుడు అడగఖ్ఖర్లేదు.

    హాయిగా డ్రెస్స్ వేసికుని రైల్లో ప్రయాణం చేస్తే, ఈ గొడవలూ ఉండవు. మెళ్ళో ఏ గొలుసైనా ఉన్నా, లోపలికి వేసేసికుంటారు.ఉత్తర భారతదేశంలో, చాలా మంది ఆడవారు,వారిలో తల్లులుండవచ్చు, అమ్మమ్మలూ,బామ్మలూ, ముత్తమ్మమ్మలూ కూడా ఉండొచ్చు.వారందరూ డ్రెస్సుల్లోనే ఉంటారు, అదేమీ వింతగా కనిపించదే? వచ్చిన గొడవల్లా, మన దక్షిణ భారత దేశంలోనే,ఎప్పుడూ ఆడవారిని, చీరల్లో చూసి చూసి అలవాటుపడిపోయి, ఒక్కసారి డ్రెస్సుల్లో చూసేసరికి
‘అమ్మో అంత వయసొచ్చీ, ఎలా డ్రెస్సులు వేస్తోందో’ అని ముక్కుమీదవేలేసికుంటారు.

   మా ఇంటావిడకి డ్రెస్సులు కొంటేనే నాకు హాయి. ఎందుకంటే, ఏదో ముచ్చటపడి చీరకొంటే, దానికి పీకో,ఫాలూ,మాచ్ అయే లోపలి పరికిణీ, వీటన్నిటికీ మాచ్ అయే బ్లౌజు పీసూ అన్నిటికీ కలిపి తడిపిమోపెడౌతుంది.పైగా వీటన్నిటికీ పెట్టే ఖర్చుతో ఓ రెండు మూడు డ్రెస్సులు కొనుక్కోవచ్చు!! ఏదైనా మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. దానికి వయస్సుతో సంబంధం లేదు. ఈ సందర్భంలోనే, మా ఇంటావిడ ఓ టపా కూడా వ్రాసింది.

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–భ్రమలు-2

    ‘భ్రమ’లు మొదటి భాగంలొ చెప్పినట్టు,ఇంకోరు చేసే పనిని మనం చేయలేమా అనే క్యాటగిరీలో, ఇంట్లో ఎప్పుడైనా, కిచెన్ లోకి వెళ్ళి, ఏ బనానా షేక్కో చేద్దామనే అతి ఉత్సాహంతో, మిక్సీ తీసికుని, దాని మూత సరీగ్గా పెట్టకుండా, పాలూ,అరటిపండు ముక్కలూ వేసి, ఓసారి తిప్పేటప్పటికి, చూడండి, నాసామి రంగా, మన మొహం, బట్టలే కాకుండా కిచెన్ లో అన్ని చోట్లకీ చిందిపోతుంది. ఇంటావిడ లేచేలోపలే, ఏదో క్లీను చేసేశామనే, భ్రమలో, ఓ తడిగుడ్డ తో
తుడుస్తాము.గిన్నెలూ, బట్టలూ క్లీను చేసేసికుని, ఏమీ తెలియనట్లు మొహంపెడతాము. ఆవిడేమో, ఏ చాయో పెడదామని, గిన్నే తీసేటప్పటికి, అంతకుముందు మనం చేసిన నిర్వాకం బయట పడుతుంది! ఎందుకొచ్చిన గొడవండి బాబూ
మనకి చేతకాని పనుల్లో వేలుపెడితే ఇలాగే వీధిన పడతాము!

   నాకు ఎప్పుడైనా, గీజరువేసి, వేడినీళ్ళు బకెట్ లోకి తీస్తాననే అంటుంది, పాపం మా ఇంటావిడ. అబ్బే నీకెందుకు శ్రమా, నేనే తీసికుంటానూ అని అంటూనే ఉంటాను.అదేం ఖర్మమో, వేడి నీళ్ళు ఏ ట్యాప్పు తిప్పితే వస్తాయో ఇప్పటికీ
తెలియదు! ఇంకోటి, ఎప్పుడైనా బయటకు వెళ్ళేముందర ఏమైనా తిని, చెయ్యి కడుక్కోడానికి, కిచెన్ లోఉన్న సింకు ఉపయోగించమని చెప్తూనే ఉంటుంది. అబ్బే,మనం ఎందుకు వింటామూ?పేద్ద తెలిసున్నట్టుగా, బాత్ రూం లోకి వెళ్లి ఓ ట్యాప్పు తిప్పగానే, పైనున్న షవర్ లోంచి, నెత్తిమీద నీళ్ళు పడతాయి!దాన్ని ఏ పొజిషన్ లో పెడితే నీళ్ళు వస్తాయో ఇప్పటికీ తెలియదు! ఏదో బిందెలోంచీ, బకెట్టులోంచీ చెంబుతో నీళ్ళొంపుకున్న వాడినీ!

    వర్షాల్లో ఉపయోగించే రబ్బరు బూట్లు,తొందరగా చిరిగిపోతూండేవి.మామూలుగా అయితే, చిరిగిపోయిన బూట్లని అవతల పారేయడమే. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం, వాటిని కూడా రిపేరు చేయడం మొదలెట్టారు.రోడ్డు పక్కన ఒకడు
చేతిలో ఓ స్క్రూ డ్రైవరూ, పక్కనే ఓ కుంపటీ, దాన్నిండా కణకణలాడే నిప్పులూ, ఆనిప్పుల్లో కాల్చి, దాన్ని సుతారంగా, మన చిరిగిపోయిన బూటుమీద రాసేవాడు. బస్, సెకనులో, ఆ చిల్లుకాస్తా మూసుకుపోయేది, ఆ షూ కి ఇంకో సీజను దాకా ఢోకా లేదని చెప్పి, ఓ అర్ధరుపాయో,రూపాయో తీసికునేవాడు. ఆమాత్రం మనం చేయలేమా అని ఇంట్లో మనం ప్రయోగాలు చేస్తే, ఉన్న చిల్లుమాట దేముడెరుగు, ఇంకాస్త చిరుగుతుంది!

   అలాగే ప్లాస్టిక్/పోలిథీన్ బ్యాగ్గుల్ని, కొట్లలో కొవ్వొత్తి మంటమీద, నాజూగ్గా సీలు చేస్తూంటారు. మనకి ఛస్తే ఇంట్లో వీలవదు! అలాగే ఏ పైజమాకో బొందు పెడదామని, ఓ సూదిపిన్నీసుకి, నూలుతాడు గుచ్చి, బొందెక్కించడం మొదలెట్టండి,ఆ పిన్నూ,బొందూ ఛస్తే చివరిదాకా తీయలేము. మధ్య మధ్యలో,నానా తిప్పలూ పెడుతుంది!
ఏమిటో జీవితం అయిపోతూంది, ఒక్క పనీ రాదూ అని ఓ విరక్తి పుట్టుకొచ్చేస్తూంటుంది!అలాగని మానుతామా, ప్రతీదీ నాకేతెలుసూ అని వేలెట్టడం, చివాట్లు తినడం!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   రెండురోజులనుండి, మా కంప్యూటరుకి సుస్తీ చేసింది.మా అబ్బాయి ఏదో చేసి దాన్ని దారిలో పెడతాడనుకుంటే, తనకి టైము లేక, ఓ రెండు మూడు రోజులాగమన్నాడు. అమ్మోయ్ అన్ని రోజులే. ఈ నెట్ అనేది ఓ నషాగా తయారయ్యింది.దానికి సాయం, నా చుట్టాలందరూ ఎలాఉన్నారో అని తహతహా! ఇదికాదు పనీ అనుకుని, ఓ షాపువాడిని పిలిచి బాగుచేయించాను. చూశారా మొన్న ‘ఫుకట్ సర్వీసు’ లో వ్రాసినట్లు, నేను కూడా మా అబ్బాయిచేత పని కానిచ్చేసుకుందామనుకున్నాను! ఆ ఇంజనీరు రెండో రోజు వచ్చి, ఓ రెండు గంటలు ఏవేవో సి.డీ లు పెట్టి మొత్తానికి,నా కంప్యూటరుకి ప్రాణం పోశాడు. వచ్చినగొడవల్లా, మధ్య మధ్యలో ఏవేవో అడుగుతాడు, నాకేమీ తెలియదు.చివరకు చెప్పేశాను-‘చూడు నాయనా, నన్ను ఇరుకులో పెట్టకు,ఏదో గుట్టుగా బ్లాగులు వ్రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అదుందా, ఇదుందా అంటూ ఊరికే ప్రశ్నలు వేసి చంపకు. కావలిసిస్తే ఓ కాఫీ తాగు’ అని చెప్పినతరువాత, మొత్తానికి రెండు గంటలు కూర్చుని,ఓ నాలుగొందలు తీసికుని వెళ్ళాడు.

    నిన్నంతా, Titan Eye వాళ్ళ కొట్టుకి మిస్టరీ షాపింగుతో కాలక్షేపం అయింది.మా పిల్లలెప్పుడో క్రిందటేడాది, Shoppersstop వారి గిఫ్ట్ వోచరిస్తే, దాన్ని ఎక్కడో పెట్టిమర్చిపోయాను.చూస్తే ఏడాది అయిపోయిందీ, ఇస్తాడా అని అడిగితే, ఈ నెల 22 దాకా రివాలిడేట్ చేసిచ్చాడు. దాన్ని తీసికెళ్ళి, మా ఇంటావిడకో డ్రెస్ తెచ్చాను.ఇలాటివన్నీ గుర్తుండవు ఆవిడకి,అప్పుడెప్పుడో ఐస్ క్రీం తెచ్చి ఇల్లంతా, వళ్ళంతా పోసేననేవే గుర్తెట్టుకుంటుంది, పైగా అవన్నీ అందరితోనూ చెప్పుకోవడం ఓటీ! ఇక్కడ చదవండి. మంచివాళ్ళకి రోజులుకావండి బాబూ. ప్రతీరోజూ ఎంతచేస్తే ఏం లాభం? ఎప్పుడో చేసిన దరిద్రపు పనే గుర్తుంటుంది!

    పోనీ చాలా రోజులయిందికదా, టి.వీ సావకాశంగా చూసి అని టి.వి. పెడితే, కనిపించిన ప్రతీ వాడూ ‘తెలుగువారి ఆత్మగౌరవం’ గురించే ఘోష! అదేమిటో రాత్రికిరాత్రి ఏదో కొంపములిగిపోయినట్టుగా,చెప్పేశారు.ఆఖరికి ఆయనెవరో రిటైర్డ్ డి.జీ.పీ ట, పోలీసులు అంత దాష్టికం చేయకుండా ఉండవలసిందీ అంటూ. అక్కడికేదో మన పోలీసులు తక్కువ తిన్నట్లు!
ఛాన్సు దొరికితే చాలు, చావకొట్టేస్తారు.వాళ్ళకున్న frustration అంతా చూపించుకుంటారు. ఎప్పుడైనా పోలీసులుండే ఇళ్ళు చూశారా? ఓ రూమ్మూ, వంటిల్లూ ఉన్న చిన్న క్వార్టరు లో
పిల్లా పాపలతొ కాపరం చేసికుంటారు.నేను ప్రతీరోజూ ఆంజనేయస్వామి గుడికెళ్ళేటప్పుడు, వాళ్ళ క్వార్టర్స్ మీదుగానే వెళ్తూంటాను.ఆ వాతావరణం,పరిసరాలూ చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
ఈ ప్రభుత్వాలు ఏమిటేమిటో ఖబుర్లు చెప్తారు,police reforms గురించి.ఉండడానికి సరైన కొంప ఇమ్మనండి ముందర, ఆ తరువాత మిగిలిన విషయాలు చూడొచ్చు.మరి ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసికుంటున్నారని ఏడవడం ఎందుకూ?

    ‘తెలుగువారి ఆత్మగౌరవం’ రామలింగరాజు, ఏనాడైతే అందరినెత్తిమీదా శఠగోపం పెట్టాడో, ఆనాడే పోయింది.ఇప్పుడేం కొత్తగా పోయిందేమీలేదు.వచ్చిన గొడవంతా ఏమిటంటే, మిగిలిన రాష్ట్రాల్లో తెలుగువాళ్ళు సుఖపడిపోతున్నారూ, మనకి లేని సుఖం వాళ్ళకి మాత్రం ఎందుకూ అని! ఇప్పుడు అందరూ కట్టకట్టుకుని ఏడవ్వచ్చు. మన రాజకీయనాయకులకి ఛాన్సు దొరికితే, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళ కాపరాల్లోనూ చిచ్చు పెట్టగలరు.

   ప్రస్తుత రాజకీయనాయకులు, ఏ స్వాతంత్ర పోరాటంలోనూ జైళ్ళకెళ్ళకుండా, గాంధీగారి పేరుచెప్పుకుని బండి లాగించేస్తున్నారు. చివరకి ఆ జైళ్ళ రుచేమిటో, లాఠీల దెబ్బేమిటో అప్పుడప్పుడు తెలిసికుంటేనే అసలు మజా!ఊరికే, ఏదైనా మర్డరు చేసేసి,ఎవడికొంపో కూల్చేసి,anticipatory bail తీసేసికోవడం కాదు.ఈ గొడవల్లో ‘ఓదార్పు యాత్ర’ ఏమయిందో తెలియడంలేదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఫుకట్ సర్వీసులు

    ‘భ్రమ’ ల గురించి వ్రాద్దామనుకున్నాను. అవెక్కడికి వెళ్తాయిలెండి, మనతోపాటే ఉంటాయి. వాటిగురించి ఇంకో రోజు వ్రాయొచ్చులే అని, ఇంకో విషయం గుర్తుకొచ్చింది. దానిగురించీ టపా.మనం కానీ, మన పక్కింటివాళ్ళో,అదేబిల్డింగులో ఉండే ఇంకోరో, లేక అదే సొసైటీలో ఉండే మరోరో,ఫుకట్ గా ఏదైనా వస్తోందన్నా, లేక పనైపోతుందన్నా, ఛాన్సొదలరు!అది ఎవరినో విమర్శిస్తున్నానని కాదు, నేనైనా ఇదే పని చేస్తాను,మానవ సహజం అది.

7nbsp;  మా చిన్నప్పుడు టార్చి లైట్లనుండేవి. అంటే ఇప్పుడు లేవనికాదు,ఇప్పుడు అవేవో చాలా sleek గా ఉండేవి వస్తున్నాయి.సెల్లులో లైటు,తాళం కప్పలో లైటు, లేకపోతే ఇంకో లేసరు లైటో చాలా వచ్చాయి. కానీ, మా రోజుల్లో Eveready వాళ్ళవి, స్టీలుతో ( అలా అనేవారు!) చేసిన టార్చ్ లైట్లొచ్చేవి, బుల్లిదీ, కొద్దిగా పెద్దదీ,మూడు బ్యాటరీలు వేసికునే పేద్దదీ. ఇందులో బుల్లిది మామూలుగా డాక్టర్లదగ్గర ఉండేది.మనకేమైనా వచ్చి డాక్టరుగారిదగ్గరకు వెళ్తే, ఆయన ముందుగా మన నోరు తెరిచి నాలుక బయటకు పెట్టమంటారు, మళ్ళీ అలా కాదూ, ఇంకా సౌండొచ్చేలా నాలిక బా…..గా చాపమంటారు, అప్పుడు ఆ బుల్లిలైటు దాంట్లోకి(అంటే తెరిచున్ననోట్లొకి) వేసి, ఓసారి నిట్టూర్పు విడిచి, బాగా inflame అయిపోయిందీ అంటూ ఏదో మందు రాసిచ్చేసేవారు. అలాగే పళ్ళడాక్టరుగారుకూడా పళ్ళ గ్రహస్థితులు తెలిసికోడానికి ఉపయోగించేవారు. వాటిలో టార్చ్ లైటు సైజులాగే మీడియం సైజు బ్యాటరీలు వేసేవారు.

ఇంక కొద్దిగా పెద్దసైజువి, వాటిని ఇంచుమించు ప్రతీ ఇంట్లోనూ వాడేవారు. అదిలేకపోవడం ఓ నామోషీగా ఉండేది.చీకట్లో బయటకి వెళ్ళాలన్నా, లైట్లుపోతే ఫ్యూజు వేయాలన్నా, ఏ పురుగో పుట్రో ఇంట్లోకి వస్తే, దాన్ని పట్టుకోవాలన్నా దీని ఉపయోగం అమోఘం.ఆ రోజుల్లో సైకిళ్ళకి లైటుండకపోతే, పోలీసులు పట్టుకునేవారు. అందరికీ సైకిళ్ళకి డైనమో పెట్టుకునే స్థోమతుండేది కాదు కదా, అలాటి వారు, సైకిలు మీదెళ్తుంటే, ఏ పోలీసైనా ఎదురుపడితే, ఈ టార్చ్ వేసి పనికానిచ్చుకునేవాడు!

7nbsp;  ఇంక మరీ పెద్ద టార్చ్ లైటు-దీంట్లో మూడో నాలుగో బ్యాటరీలు వేసేవారు. దాని ఫోకస్ కూడా చాలా దూరం వచ్చేది.వాటిని జనరల్ గా, రాత్రిళ్ళు కాపలా కాసే, నైట్ వాచ్ మన్లదగ్గరుండేవి. ఆరోజుల్లో నైటువాచ్ మన్లెక్కడుండేవారూ అనడగకండి,బ్యాంకుల్లోనూ వాటిలోనూ ఉండేవారు.పొలాల్లోకి వెళ్ళడానిక్కూడా వీటి ఉపయోగం ఉండేది.ఇదేమిటీ ఈయన, ఆయన రాసిన టపాలు చదువుతున్నాము కదా అని, టార్చ్ లైట్ల ‘ప్రవర’ చెప్తున్నాడూ అనుకుంటున్నారు కదూ!
ఇంక అసలు కథలొకి వచ్చేద్దాం.

ప్రతీ ఇంట్లోనూ ఓ టార్చ్ ఉంటుందన్నాను కదా, ఆ టార్చ్ లైటుని ప్రతీరోజూ ఉపయోగించంకదా, ఎప్పుడో ఏడాదికో, ఆర్నెల్లకో వాడుతాం.పనైపోగానే దాన్ని ఏగూట్లోనో పెట్టేసి వదిలేస్తాం.ఏ వస్తువైనా, ఆఖరికి, మనుష్యులైనా సరే, వాటికీ
periodical maintenance అనేది ఒకటుండాలి. లేకపోతే పడకెక్కుతాయి. అలా పడకెక్కిన టార్చ్ లైటు,మన కళ్ళల్లో పడుతుంది.పడకెక్కిందనెందుకు తెలిసిందంటే, ఆ ముందురాత్రి, పక్కవాళ్ళింట్లో అవసరమై, టార్చ్ లైటు గురించి అడగ్గానే, పేద్ద పోజు పెట్టి, వాళ్ళపిల్లాడికి మన గూట్లో ఉన్న లైటిస్తాము.వాడు నిమిషంలో తిరిగొచ్చేసి, అంకుల్, ఈ బాట్రీ లైటు ( టార్చ్ లైటుకి ముద్దుపేరు) వెలగడంలేదూ, అని మన మొహాన్న కొట్టి పారిపోతాడు.అదేమిటీ, ఆమధ్యనే
బ్యాట్రీలు కూడా మార్పించాను, అని ఓసారి ఇంట్లో వాళ్ళందరిమీదా ఎగురుతాడు,ఎవరడిగితే వాళ్ళకి ఎరువిచ్చేస్తూంటారూ, ఏ వెధవ, దీంట్లో బ్యాట్రీలు మార్చేశాడో అంటూ.నిజం చెప్పాలంటే, దాంట్లో బ్యాటరీలు మార్చి, ఆరునెలలైనా అయిఉంటుంది.సరే, రేపు దీని సంగతి చూద్దాం అనుకుని, అప్పటికి వదిలెస్తాడు.

మర్నాడు ప్రొద్దుటే గెడ్డం వగైరా గీసికుని, ఓ కాఫీ తాగేసి, ఈ టార్చ్ లైటు వ్యవహారం ఏదో తేలుద్దామని, ఓ పాత గుడ్డా, ఓ మూతలో కిరసనాయిలూ వేసికుని సెటిల్ అవుతాడు. ముందుగా ఆ టార్చ్ లైటు వెనక్కాలుండే మూత, అప్పటికే బిగుసుకుపోయుంటుంది, తీసి నీరు కారిపోతున్న బ్యాటరీలు( ఆ లిక్విడ్ ఇల్లూ వళ్ళూ చేసికుంటూ)అవతల పారేస్తాడు.పైగా ఆ ముందురోజు రాత్రేమన్నాడూ-ఈ మధ్యనే కొత్త బ్యాటరీలు వేయించానని (ఉత్తిదే)– అంత కొత్తబ్యాటరీలైతే నీళ్ళెందుకు కారుతాయమ్మా? మొత్తానికి, ఆ బ్యాటరీలు తీసి,కిరసనాయిల్లో ముంచిన గుడ్డతో ఓ సారి, లోపలంతా శుభ్రంగా తుడుస్తాడు.ఆ బల్బుండేచోటోటి, దాని బుడిపికింద నీలంగా ఓ కోటింగోటొస్తుంది.దాన్ని కూడా తుడిచి, కొత్త బ్యాటరీలు వేయగానే, కొత్త పెళ్ళికొడుకులాగ వెలుగుతుంది.

ఇంట్లో వాళ్ళందరూ, అబ్బ మా నాన్న ఎంతబాగా రిపెరు చేశాడో అని పిల్లలూ, మా ఆయనెంత ఇంజనీరులా,బాట్రీని మళ్ళీ వెలిగించారో అని ఇంటావిడా ఆనందపడిపోయి, కాలనీలోఉన్న ప్రతీ వాళ్ళకీ చెప్పేయడం, ఈయన ఏ బజారుకో వెళ్తూంటే, అందరి కళ్ళూ తనమిదే ఉన్నాయని మురిసిపోడం.ఇంతాచేసి ఆయన చేసిందేమిటయ్యా అంటే ఓ బాట్రీ లైటుకి మళ్ళీ వెలుగివ్వడం. ఇంతటితో ఆగదీ వ్యవహారం, బాట్రిలు బాగుచేసేవాడొకడు దొరికాడుగా, కాలనీలో ఉన్న ప్రతీవాడూ,వాళ్ళింట్లో పనిచేయని బాట్రిలు, పనిగట్టుకుని మరీ వెదికి, వీళ్ళింట్లో వాటికి తన పేరున్న కాగితం అంటించి, వాళ్ళబ్బాయిచేత పంపించి, ‘అంకుల్ మా టార్చ్ వెలగడం లేదు,డాడీ మిమ్మల్నోసారి చూడమన్నారు’ అంటూ కాలనీ లో ఉన్న, ఓ పది టార్చ్ లైట్లు మనకొంపలోకి చేరతాయి.దీంతో ఆగదు,ఎప్పుడో బజార్లో స్నేహితుడితో వెళ్తున్నప్పుడు, పనిమాలా ఆపి, ‘మాస్టారూ మా బాట్రీ రిపేరయిందా, అయితే మావాడిని పంపిస్తాను సాయంత్రం’ అంటూ ఓ పలకరింపూ. తనతో ఉన్న స్నేహితుడు, ఆశ్చర్యపడి ‘ ఇదేమిట్రా, ఈ మధ్యన సైడు బిజినెస్సు మొదలెట్టావా ఏమిటీ, నాతో చెప్పనేలేదూ’అంటూ పరామర్శా.

ఏ కొట్లోకో వెళ్ళి టార్చ్ లైట్లు రిపేర్ చేసికోవచ్చు. మళ్ళీ దీనికి డబ్బులు తగలేయడం దేనికనీ, అప్పనంగా అవుతోందని పక్క వాళ్ళమీద బతికేద్దామనే ఆబ ఉందే, చాలా మందిలో చూస్తూంటాము.అలాగే మిక్సీలూ, రేడియోలూ ఇంకా ఏమైనా సరే మీకు రిపెరీ చేసికోడం వచ్చిందా, సైలెంటుగా మీపనేదో మీరు చూసుకోండి. అంతేకానీ గొప్పకోసం ఊళ్ళో అందరికీ టముకెసికున్నారా అంతే సంగతులు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    రెండు మూడు రోజులనుండి, పేపర్లలోనూ, టి.వీ ల్లోనూ హోరెత్తించేస్తున్నారు- బాబ్లీ డ్యాం కి మన నాయుడుగారూ, ఇంకో డెభ్భై మంది ఎం.ఎల్.ఏ లూ, మీడియావాళ్ళనీ కలుపుకుని అక్కడకు వెళ్ళారనీ, అక్కడ వీళ్ళని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారనిన్నూ, దగ్గరలో జైలూ అదీలేక, ఐ.టి.ఐ క్యాంపస్సులో బంధించారనిన్నూ, వారికి బ్రేక్ ఫాస్టులూ, మధ్యాన్న భోజనాలూ సరీగ్గా పెట్టడం లేదనిన్నూ.

   అసలు నాకోటనిపిస్తోంది, రోశయ్యగారే అశోక్ చవాన్ కి ఫోను చేసి,‘మావాళ్ళందరినీ జైల్లో పడేయ్, ఇక్కడ రోజూ అసెంబ్లీలో నా ప్రాణం తీస్తున్నారూ, ఓ వారంరోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చూ’అని చెప్పారేమో ! ఒకవిషయం చెప్పండి, వీళ్ళేమైనా పిక్నిక్కు కి వెళ్ళారా లేక హనీమూన్ కి వెళ్ళారా, సకల మర్యాదలూ చేయడానికి! గొడవంతా ఎక్కడొచ్చిందంటే, తెలంగాణా విషయంలో, నాయుడు గారు, అటు ఆంధ్రావాళ్ళకీ, ఇటు తెలంగాణా వారికీ సద్ది చెప్పలేక,ఎవరు పట్టించుకుంటారులే అని ఏవేవో స్టేట్ మెంటులు చేసేశారు. రాబోయే ఉప ఎన్నికల సందర్భంలో, తెలంగాణా వారికి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి, ఇక్కడకొస్తే కాళ్ళిరక్కొడతామన్నారు. ఇంక issue లేకపోయింది,ఎన్నికలకి.
దాంతో ఉభయతారకంగా ఉంటుందని ఈ బాబ్లీ వ్యవహారంలో popular అవుదామని ఇలా మందీ మార్బలంతో వెళ్ళారు.To be on safe side, మనల్ని టి.వీ ల్లో బోరుకొట్టడానికి, ఓ ముగ్గురు నలుగురు నిలయవిద్వాంసుల్ని, ఇక్కడే వదిలేసి!

   మన టి.వీ. వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం కావాలిగా.ఈ లోపులో, టి.ఆర్.ఎస్ రావుగారు, ఇదేమిటీ బాబ్లీ గోడ పెంచేస్తే మనకి కదా నీళ్ళు రానిది,ఈ నాయుడేమిటీ,తనెళ్ళిపోయాడూ, అనుకుని ‘ఇదంతా ఎన్నికల స్టంటూ’ అని ఓ స్టేట్మెంటిచ్చేశారు!నారాయణ గారికీ, రాఘవుల గారికీ ఊళ్ళో ఎక్కడ గొడవైనా, ఓ స్టేట్మెంటిచ్చేస్తే పోదా అనుకుని left,right,centre బాదేస్తున్నారు.ఈ మధ్యలో మన హోం శాఖామంత్రిణి గారు,’ఎవరింటికో వెళ్ళి, అక్కడ గొడవచేస్తే
వాళ్ళు అరెస్ట్ చేయరా అంటూ ‘ నా పుట్టలో వేలెడితే కుట్టనా’అని చీమన్నట్లు,
ఓ స్టేట్మెంటిచ్చారు. పాపం నాయకులందరూ అక్కడేక్కడికో వెళ్ళి కష్టపడిపోతున్నారూ అనుకుని, మన మిగిలిన ఛోటా, మోటా నాయకులంతా ఓ ‘బంద్’ ఏర్పాటుచేసి, బస్సులన్నీ ఆపేసి గొడవ చేస్తున్నారు.Let the common man go to hell అనేట్లుగా!ఒక్కరోజు ఈ బందులూ, హర్తాళ్ళూ చేయడం వలన, ఆ బాబ్లీ గోడ తగ్గుతుందా, అదేమీ ఒక్కరోజులో చేసిందికాదే, అందరు రాజకీయనాయకులకీ తెలుసు ఆవిషయం.ఎవడికి కావలసినట్టుగా వాడు, దాన్ని exploit చేసుకుంటున్నారు.

    ఇంకో విషయం- గోదావరీ, కృష్ణా కూడా మహరాష్ట్రలోనే పుట్టాయికదా, ఏదో అక్కడ ఖాళీ లేక ఆంధ్రదేశంలోకి పొంగిపొర్లి, సముద్రంలో కలుస్తున్నాయి.మరాఠీ వాళ్ళు వాళ్ళింట్లో ఏదో చేసుకుంటున్నారు,అది పక్కవాడికి బాగోలెదూ అని, ఏదో అన్ని పార్టీలూ కూర్చుని మాట్లాడుకుని, వ్యవహారం సెటిల్ చేసికోవడం పోయి ఈ బందులూ అవీ చేసి, మామూలు జనాల్ని ఇరుకులో ఎందుకు పెడతారో తెలియదు.ఇన్నాళ్ళూ మనవాళ్ళకీ, మరాఠీలకీ ఏ గొడవలూ లేకుండా, హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు నాయుడు గారి ధర్మమా అని, ఏం గొడవలొస్తాయో?

    ఈ రాజకీయనాయకులందరూ దొందుకు దొందే,వీళ్ళూవాళ్ళూ బాగానే ఉంటారు, మధ్యలో నలిగిపోయేది మనలాటివాళ్ళే.రోశయ్యగారేమో ఢిల్లీ లో ఆయనగొడవేదో ఆయన పడుతున్నారు. చిరంజీవి గారు తిరుపతి వెంకన్న గురించి, పాదయాత్రచేస్తే పుణ్యం పురుషార్ధం అనుకున్నారు. ఇంక మన టి.వీ.వాళ్ళు అదేదో రెండు దేశాలమధ్య యుధ్ధం అవుతున్నట్లుగా,ఫలానా సరిహద్దు ప్రాంతం అంటూ ఊదరకొట్టేస్తున్నారు…మనదృష్టం ఎలాఉందో, ఈ బస్సుల్నీ,రైళ్ళనీ నమ్ముకుని, రిజర్వేషన్లు చేయించుకోడానికి లేదు, ఏ క్షణాన్న ఏ రాజకీయపార్టీకి ఏలాటి ఆలోచన్లొస్తాయో ఆ దేముడిక్కూడా తెలియదు.