బాతా ఖాని-తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు.

    ఈ వేళ పొద్దుట అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాను.శుక్రవారం నాడు అలంకరణలూ అవీ చేస్తారు, దర్శనమూ అవీ పూర్తి అయేసరికి బాగా ఆలశ్యం అవుతుంది.అందువలన శనివారం నాడు ఉదయం 9.00 దాటేదాకా గుడిలో కార్యక్రమాలు మొదలవ్వవు. మొదట్లో నెను ప్రతీ రోజూ 8.00 గంటలలోపునే వెళ్ళేవాడిని. కానీ ఈ తంతు చూసేటప్పడికి నా ప్రోగ్రాం కూడా 9.00 గంటలకే మార్చాను.

అందరూ వరుసగా నిలబడతారు, పూజారి గారు పూజలూ అవీ చేసి అందరికీ తీర్థం అదీ ఇస్తారు. ఈ వేళ పొద్దుట ఆ కార్యక్రమం జరుగుతూంటే ఓ సెల్ ఫోన్ మోగడం మొదలెట్టింది. అందరికీ చిరాకు పుట్టింది, అయినా ఎవరూ మాట్లాడలేదు. అది అలా మోగుతూనే ఉంది. ఇంక నేనే ఊరుకోక, ఆ సెల్ ఫోన్ మూసెయ్యొచ్చుకదా అన్నాను. ఆ పెద్దమనిషికి పేద్ద కోపం వచ్చేసింది!! ఎవరికీ లేని పట్టింపు మీకే ఎందుకూ అన్నాడు. అంటే నేనుచెప్పానూ, ” మాస్టారూ, గుడికి వచ్చేది ఏదోధ్యానం చేసికోవడానికి, అంతే కానీ మీ సెల్ ఫోన్ వినడానికి కాదు, అంత అర్జెంట్ వ్యవహారాలెమైనా ఉంటే ఆ సెల్ ఫోన్ ని ” వైబ్రేషన్” మోడ్ లో పెట్టుకోవచ్చుగా. ఎవరికీ గొడవుండదూ “ అన్నాను. ఏమనుకొన్నాడో ఆ సెల్ ని ఆఫ్ చేసేశాడు. ఆ తరువాత ఆ గుడికి సంబంధించిన వారన్నారూ, ” ఈయనతో ఎప్పుడూ ఉండే గొడవేనండి ఇది, తెలిసున్నవాడూ, అందువలన మేమెవరమూ చెప్పలేకపోయాము”.

చాలా మందికి అలవాటు ఎక్కడికెళ్ళినా సెల్ ఫోన్లు అలా అరుస్తూనే ఉంచుతారు. లేకపోతే ఊళ్ళో వాళ్ళు వినేటట్లుగా పెద్ద పెద్ద గా మాట్లాడడం, ఎంత అసహ్యం గా ఉంటుందో. అవతలివాళ్ళకి చిరాకు పుట్టనట్లుగా ఉండడం అనే సంస్కారం ఒకళ్ళు చెప్పేది కాదు. స్వతహాగా రావాలి. కొంతమంది ఉంటారు చిత్ర విచిత్రమైన రింగ్ టోన్స్

అందరికీ తెలియాలనుకునేవారు, ఏవేవో అరుపులూ, కేకలూ సడెన్ గా వింటే ఉలిక్కి పడతాము. వాళ్ళకి ఇక్కడా అక్కడా అని ఉండదు, సినిమా హాళ్ళలోనూ, ఆఖరికి హాస్పిటళ్ళలో కూడా వీళ్ళ దారి వీళ్ళదే. రైలు ప్రయాణంలో అయితే ఇంక వీళ్ళని పట్టేవాళ్ళుండరు. మన అదృష్టం బాగుంటే సిగ్నల్ ఉండదు.ఇదివరకు చార్జింగ్ అయిపోవడం వలన మాట్లాడలేకపోయేవారు. ఈ మధ్యన రైల్వే వాళ్ళు, ప్రతీ చోటా చార్జింగ్ కి ప్లగ్ పాయింట్లు పెట్టారు.ఇంక కంపార్ట్మెంట్ అంతా వెతుకుతారు, ఎక్కడ పాయింట్ ఖాళీ గా ఉందా అని, అక్కడ వాళ్ళ సెల్ ఫోన్ పెట్టేసి, దానికి అక్కడ కూర్చున్నవాళ్ళని కాపలా పెడతారు. పోనీ అదేదో వాడే కూర్చోవచ్చుగా !!

    ఆ మధ్యన 3 టైర్ లో సైడు న రెండు బదులు, మూడు బెర్త్ లు వేయడం మొదలెట్టారు. ఆ మధ్యలో బెర్త్ వచ్చినవాడికి కూర్చోడానికి అక్కడ కాదు, పక్కనే.ప్రయాణీకుల సంఘాలు అభ్యంతరం చెప్పేటప్పడికి ఈ మధ్యన మళ్ళీ మాములుగా చేసేశారు. బ్రతికి పోయాము. దక్షిణ మధ్య రైల్వే లో ఓ విచిత్రం చూశారా? ఏ రైల్వే స్టేషన్లోనూ ( విజయవాడ, హైదరాబాద్ లతో సహా) ఓవర్ బ్రిడ్జ్ కీ మెట్లే తప్ప రాంప్ లు ఉండవు. దీని వలన వయస్సులో పెద్దవాళ్ళైన మాలాంటి వాళ్ళకి ఓ అసౌకర్యం ఉంది. కూలీ దొరికినా దొరక్కపోయినా పరవాలెనట్లుగా ” వీల్స్ ” ఉన్న సూట్ కేసులే తీసికెళ్ళడం మొదలెట్టాము. కానీ ఈ రాంప్ లేని ఓవర్ బ్రిడ్జ్ ల మూలంగా, అక్కడ ఎత్తికెళ్ళే ఓపిక లేక చచ్చినట్లు కూలీని పెట్టుకోవలసి వస్తోంది. మామూలుగా ఏసి కోచ్ ప్లాట్ఫారానికి ఆ మూలో ఈ మూలో ఉంటుంది. ఇంక ఆ కూలీ అడిగినంతా ఇవ్వవలసివస్తూంది. ఇదేదో కూలీలూ, రైల్వే వాళ్ళు కలసి ఆడే నాటకంలా ఉంది !! ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో అవేవో కొన్ని స్టేషన్లని ఆధునికరణ చేస్తామంటున్నారు,ఓవర్ బ్రిడ్జి లకి రాంపులు పెడితే చాలు.

    కొంతమందుంటారు వాళ్ళ లగేజీ చూస్తూంటే మొత్తం ఇల్లంతా మార్చేస్తున్నారేమో అనిపిస్తుంది,ఉండేవి మూడు టికెట్లు, వాళ్ళ సామానంతా ఎక్కడ పడితే అక్కడ బెర్త్ ల క్రింద దూర్చేయడం.ఇంకెవ్వడికీ ఖాళీ ఉండకుండా చేయడం.అవతలవాళ్ళకి కూడా సామాన్లుంటాయి అనే ఇంగితజ్ఞానం ఉండదు వీళ్ళకి. అందరూ అలా ఉండరు, ఈ మధ్యన ఒకాయనని చూశాను, సామాను చాలా ఉండడం వలన రెండు బెర్త్ లు ఎక్కువగా తీసికున్నారు !!

    ఈ వేళ ఓ టెలివిజన్ చానెల్ ” కలర్స్ ” లో ఓ మంచి ప్రోగ్రాం చూశాను ” ఇండియా గాట్ టాలెంట్ “ అని. దానికి శేఖర్ కపూర్, కిరణ్ ఖేర్, సోనాలి బెంద్రే జడ్జీలు. అన్నిరకాల టాలెంట్లనీ ప్రదర్శిస్తున్నారు. చాలా బాగుంది. మాములుగా ఉండే వాటికన్నా భిన్నంగా ఉంది.శని, ఆది వారాలు రాత్రి 9.00 గంటలకి, వీలుంటే చూడండి.

%d bloggers like this: