బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్..

    ఈమధ్యన టీవీ పెట్టాలన్నా, ఓ వార్తాపత్రిక చదువుదామన్నా చిరాకెత్తుకొచ్చేస్తోంది. అప్పుడెప్పుడో కొత్త భారతరత్న రావుగారు, మన రాజకీయనాయకులందరూ ఒఠ్ఠి idiots అని శలవిచ్చి ఇరవైనాలుగ్గంటలు గడిచిందో లేదో, అబ్బెబ్బే నేనలాగనలేదూ అన్నారు. అనుకున్నదేలెండి. ఆయన్ని ఎవరైనా అడిగారో లేక, భారతరత్న వచ్చేసిందికదా అని నోటికొచ్చినట్టు మాట్టాడచ్చనుకున్నారో, ఇస్రో వారు రాకెట్లు గగనంలోకి పంపేముందర, తిరుమలేశుని ఆశీర్వచనం తీసికోడం మూఢాచారం అని కొట్టిపారేశారు. అదే ప్రక్రియ- శ్రీవెంకటేశ్వరుని ఆశీర్వచనం తీసికోడం,ఆయుధపూజనాడు సరస్వతీదేవిని పూజించినట్టూ అని బ్రహ్మశ్రీ చాగంటి వారు శలవిచ్చారు. ఏమిటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది.వార్తలు చూద్దామన్నా, చదువుదామన్నా ఒకటే గొడవ. హాయిగా ప్రవచనాలు వింటే హాయీ అనుకుంటే,వాటికీ ఏదో గొడవే. ఆ శ్రీవెంకటేశ్వరా చానెల్ వాళ్ళైనా, చాగంటివారి ప్రవచనాలు ,”పంచనదులు” అయిదురోజులూ ప్రత్యక్షప్రసారాలు చేస్తారా అంటే, చెప్పా పెట్టకుండా చివరి రోజున మానేశారు. కారణాలు ఆ తిరుమలేశునికే ఎరుక !

    రోజుకో గొడవ- ఒకరోజునేమో కంచి స్వాములారు అదేదో కేసులో, తొమ్మిది సంవత్సరాల తరువాత నిర్దోషులుగా బయటపడ్డారుట. సాక్షుల్లో సగానికి సగం మంది hostile అయిపోయారుట, దానితో కేసు కొట్టేశారుట. అసలు పరమపవిత్రమని భావించే శంకరమఠాలకి ఈ గొడవలెందుకో?జయలలిత గారు పోనిద్దూ అని ఊరుకుంటుందా, లేక పైకోర్టుకి ఎపీల్ చేయిస్తుందా? ఇంక ఆ ఆసారామ్మో ఎవరో ఆయన గొడవ ఇంకోరకం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అంతా అగమ్యగోచరంగా ఉంది.
మధ్యలో ఎన్నికలోటీ. భవిష్య ప్రధానమంత్రి గారైతే చెప్పఖ్ఖర్లేదు. ఏదో అధికారపార్టీవాళ్ళని నాలుగు కడిగేయడంతో సరిపెట్టుకోక, చరిత్రలోకి వెళ్ళడం ఎందుకో? ఒక్కటీ సరీగ్గా తెలియదు. నోటికెంతొస్తే మాట్టాడేయడమే. తనుచెప్పేదేదో సరీగ్గా చెప్తున్నాడా లేదా అనేది అసలు చూసుకోకపోడం. వినేవాళ్ళూ అలాగే ఉన్నారులెండి, ఈయనేం మాట్టాడితే దానికి హర్షధ్వానాలు చేసేయడం. ఏదో పప్పులో కాలేయడం, దానికేమో అధికారపార్టీవాళ్ళు గేలిచేయడం. ఎందుకొచ్చిన గొడవంటారూ? ఈమధ్యన ఎన్నికల్లో నుంచుండే కాండిడేట్ల ఆస్థి వివరాలు చదువుతూంటే , కళ్ళు తిరిగిపోతున్నాయి. ప్రతీవాడూ కోటీశ్వరుడే. పైగా కొంతమందైతే క్రిందటి ఎన్నికలనుండి, ఈ ఎన్నికలలోపులో ఆస్థి వందనుండి వెయ్యి రెట్లు అభివృధ్ధ్ది చెందిన కేసులే. ఏదో అయిదేళ్ళలోనూ, దేశాన్ని అభివృధ్ధి చేస్తారనుకున్నాము.

    ఇంక మన రాష్ట్రం సంగతి చూస్తూంటే, అడక్కండి. ఏం జరుగుతూందో ఎవరికీ తెలియదు.మధ్యలో తుఫాన్లోటీ, వాటికేమో చిత్రాతిచిత్రములైన పేర్లోటీ. ఇదివరకటి రోజుల్లోనే హాయి, ఏదో ఏడాదికోసారి గాలివాన అనేవారు, దానికో పేరుండేది కాదు, ఉన్నా విన్న జ్ఞాపకంలేదు. అసలు వీటికి పేర్లెందుకూ అని, వెదికితే గూగుల్ లో కనిపించింది.cycname ఏడాదికీ నాలుగైదుసార్లు వచ్చేస్తూంటే మరి పేర్లుండొద్దూ?

    రోజుకో sensational news, అదేదో పేపరుండేది తెహల్కా అని. ఉండేదని ఎందుకన్నానంటే, ఇంక ఆ పేపరుకి అయుద్దాయం రోజుల్లోకి వచ్చేసింది. దాని ఎడిటర్ గారు, అక్కడ పనిచేసే అమ్మాయితో ఏదో వెర్రివేషాలేశాడట, వీధిన పడ్డాడు. పడ్డవాడు ఊరికే ఉన్నాడా, గోవాలో బిజేపీ అధికారంలో ఉందీ, వాళ్ళకి నేనంటే ఎక్కడలేని కోపమూ, అందుకే నన్ను అరెస్టు చేస్తామంటున్నారూ అని మొదలెట్టడంతో, ఈవేళ ఢిల్లీ లో బిజేపీ వాళ్ళందరూ గొడవ చేశారు. ఈవిషయంలో బిజేపీ వారైతే మహాత్ముల్లాగ కబుర్లు చెప్పేస్తున్నారు. ఒకవైపున గుజరాత్ లో అప్పుడెప్పుడో ఓ అమ్మాయి విషయంలో జరిగిన గొడవ పక్కకు పెట్టేశారు. ఏమైనా అంటే అదివేరూ, ఇదివేరూ అనడం. ఇంక బెంగాల్ లో అయితే , చిట్ ఫండు గొటాలాలో మమతమ్మ చెయ్యుందని ఆయనెవడో శలవిచ్చాడు.

   అయిదుసంవత్సరాలక్రితం, Noida లో జరిగిన ఖూనీ కేసులో, తల్లితండ్రులే దోషులూ అన్నారు.వాళ్ళేమో కాదూ అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలిసేదేమిటంటే, దేశంలో జరిగే ఎటువంటి సంఘటనైనా సరే, మన మీడియా, (especially visual media) ముందుగా ఓ ట్రయల్ చేసేస్తుంది. ఎవరికివారే జరిగినదానిమీద వారి వారి అభిప్రాయాలూ, నిర్ణయాలూ చెప్పేస్తూంటారు. ప్రజల్లోకూడా ఓ రకమైన అభిప్రాయం ఏర్పడిపోతూంటుంది. పైగా ఒక్కో చానెల్ దీ ఒక్కో అభిప్రాయం. ఎవడు రైటో తెలియదు.

   అసలు ప్రతీ విషయాన్నీ మీడియాలో చర్చించడం ఎందుకో అర్ధం అవదు.అందుకే టివీ చూడాలన్నా, పేపరు చదవాలన్నా చిరాకేసికొస్తోంది. హాయిగా నెట్ లో వివిధ సైట్లకీ వెళ్ళి కాలక్షేపం చేస్తేనే సుఖంగా ఉందనిపిస్తోంది. ఆ సందర్భం లోనే మాగంటి. ఆర్గ్ , శ్రీ వంశీమోహన్ గారు, తన సైట్టుకి ఈమధ్యన చేసిన ఇంప్రూవ్మెంట్లు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యేకంగా ఆడియో లింకుల విషయంలో, ఎక్కడెక్కడా దొరకని ఆకాశవాణి కార్యక్రమాలు నిక్షేప పరిచారు. చూసి/విని ఆనందించండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Moral of the story i……s….

    ఏదైనా అనుభవం మీదే తెలుస్తుందని ఇంకొకసారి ఋజువయింది. మా అబ్బాయి మూడు సంవత్సరాల క్రితం ఉద్యోగం మానుకుని, తనకి పుస్తకాలమీద ఉండే passion తో ఒక online library ప్రారంభించాడు. ముందుగా తెలుగు పుస్తకాల గురించి నేనూ, ఇంగ్లీషు పుస్తకాల గురించి తనూ చేయాల్సిన “సర్వే” లాటిది చేసే మొదలుపెట్టాము. తను ఆ గ్రంధాలయంలో వీలున్నన్ని సదుపాయాలు– ఇంటిగుమ్మంలోకే పుస్తకాలు వచ్చేటట్టూ, ఆలశ్యం అయినా late fee అనేది లేకుండేటట్టూ, ఫలానా పుస్తకం మాదగ్గరలేనిది ఏదైనా కావాల్సొస్తే ఒక wish list చెప్తే, వీలైనంత తొందరగా ఆ పుస్తకం తెప్పించడం వగైరా-– కలగచేశాడు. పుస్తకాలే కాకుండగా , మిగిలిన కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. తను చేసిన కార్యక్రమాల విశేషాలు నేను ఒకటి రెండు టపాలు కూడా వ్రాశాను. మధ్యలో ఒకసారి ఇక్కడ ఉండే స్కూలు పిల్లలచేత కథలు వ్రాయించి, వాటికి ఒక పుస్తకరూపం తెచ్చాడు. ఇవన్నీ నేనేదో గొప్పకోసం చెప్పుకుంటున్నవి కావు. తను ఎంత whole hearted గా ఇందులో involve అయ్యాడో చెప్పడానికి మాత్రమే. ఈ కార్యక్రమాల వలన అనండి, లేదా తన పాప్యులారిటీ అనండి, మొత్తానికి ఇంగ్లీషు పుస్తకాలకి సభ్యులు బాగానే చేరారు. పుస్తకాలు కూడా ఓ 10,000 దాకా పెట్టాడు. పుస్తకాలు ఇంటింటికీ బట్వాడా చేయడానికి ఓ అయిదుగురు కుర్రాళ్ళూ, ఆఫీసులో ఎప్పటికప్పుడు పనులు చూసుకోడానికి ఇంకో అయిదుగురూ మొత్తం ఓ పదిమందిదాకా పనిచేసేవారు. వీళ్ళందరికీ పనికి తగ్గట్టు జీతాలూ అవీ ఇవ్వాలా వద్దా? మరి వీటన్నిటికీ డబ్బు ఖర్చవుతుంది కదా, ఆ ఖర్చుల నిమిత్తమే సభ్యులనుండి నెలకీ, రెండు మూడు వందలదాకా సభ్యత్వ రుసుము లాటిది పెట్టాడు. మనదేమీ ఓ Charitable Institution కాదుకదా.

    పూణె లో ఉండే అయిదులక్షల తెలుగువారికీ సదుపాయంగా ఉంటుందని ఓ 700 తెలుగుపుస్తకాలు ( in all genres) కూడా పెట్టాడు. నాకు వీలున్నంతవరకూ ఊరంతా తిరిగి చేయాల్సినంత ప్రచారం చేశాను. మెయిల్స్ ద్వారానైతేనేమిటి, తెలిసినవారి ద్వారానైతేనేమిటి , Pamphlets, Book Marks రంగుల్లో ప్రింటు చేసి పుణె లో ఉండే వివిధప్రాంతాలకీ స్వయంగా శనాదివారాలు వెళ్ళి చేయకలిగినంత చేశాను. చిత్రం ఏమిటంటే, నేను స్వయంగా కలిసిన ప్రతీవారూ, ఎంతో ఉత్సాహం చూపించేసి… ” అలాగాండీ, తెలుగు పుస్తకాలు కూడా దొరుకుతాయన్నమాట, తప్పకుండా చూస్తామండీ..” అనేవారే. కానీక్రియారూపం మాత్రం రాలేదు. సభ్యత్వం తీసికున్న పది పదిహేనుమందీ కూడా నా ప్రోద్బలం లేకుండగానే చేరారు, వారికి ఉన్న పఠనాసక్తి వలన. నేను చేసిందల్లా, అలా చేరినవారితో వీలునుబట్టి వారింటికి వెళ్ళి కలవడమో, లేదా ఫోనులో పలకరించడమో

    ఈ కార్యక్రమమంతా ఏదో సమాజ సేవ చేయాలనే కాదు, పుస్తకపఠనం మీద ఆసక్తి ఉన్నవారికి వీలైనంత చవకలో పుస్తకాలు అందుబాటులో తేవాలనే ఉద్దేశ్యంతోనే చేశాడు. కొంతమంది దీన్ని వ్యాపారం అని కూడా అనొచ్చు. ఏ వ్యాపారమైనా financially viable అయితేనే కదా చేసేదీ? ఏదో కొంతవరకూ భరించొచ్చు. ఆసక్తి ఉందీ, మొదలెట్టాడు, ఓ మూడేళ్ళు చేశాడు, కుదరలేదూ, మూసేశాడు. ఆ సందర్భంలో తను ఎంతో బాధపడుతూ ఒక టపా పెట్టాడు. అయ్యో పాపం తన ఉత్సాహం మీద నీళ్ళు చల్లినట్టయిందే అని మేమూ బాధ పడ్డాము. మహా మహా ఫౌండేషన్ల వారే ఇంటింటికీ పుస్తకాలు బట్వాడా చేయడానికి కొంత రుసుము వసూలు చేస్తున్నారు. అలాటిది ఒక ఉత్సాహవంతుడైన వ్యక్తి, సాధ్యమైనంతవరకూ తనకు తోచినదేదో చేయడానికి కొంత రుసుము వసూలు చేయడం అంత తప్పనుకోను. అలాగని ఉచితంగా సేవ చేసేటంత ఆర్ధిక స్థోమత కూడా ఉండాలిగా.

    ఇందులో తను నష్టపోయిందేమీ లేదు. చేతిలో శుభ్రమైన చదువుందీ, అనుకూలవతి అయిన భార్య ఉందీ. ఇంకో వ్యాపకం పెట్టుకుంటాడు. పెట్టుకోవడమేమిటీ, అప్పుడే ఇంకో వ్యాపకం లోకి దిగిపోయాడు కూడానూ. అద్భుతమైన అవకాశం ఉండికూడా ఉపయోగించుకోలేని పూణె లోని తెలుగువారి గురించే నా బాధంతానూ. తెలుగు పుస్తకం చదవాలంటే ఎప్పుడైనా మన రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కొనుక్కోవడమో, లేదా ఏ పోస్టులోనో తెప్పించుకోడమో.

    అతావేతా Moral of the story i……s…

   1) Passion అనేది ఉంటేనే చాలదు. చేతినిండా డబ్బేనా ఉండాలి, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సేవైనా చేయాలి.

   2) ఊరికే కబుర్లు చెప్పేవారిని నమ్మి దేంట్లోనూ అడుగెట్టకూడదు. ఫలానా లైబ్రరీ మొదలెడుతున్నామని చెప్పగానే, మొదలెట్టగానే చెప్పండేం, పుస్తకాలకి మొహం వాచిపోయున్నాం మీ లైబ్రరీ ధర్మాన్నైనా పుస్తకాలు చదువుకోవచ్చు అన్నవారే, తీరా మొదలెట్టిన తరువాత మొహం చాటేసికోడం.

   3) పుస్తక పఠనం అనేది జన్మతహా రావాలి కానీ, అప్పటికప్పుడు తెచ్చుకుంటే వచ్చేది కాదు. అన్నిటిలోకీ ముఖ్యం , అందుతున్న సేవకి తృణమో పణమో ఖర్చుపెట్టడానికి సిధ్ధపడాలి. ఏదో ఎవరింటికో వెళ్ళినప్పుడు ఓ పుస్తకమో, పత్రికో చూసి ,” ఓసారి చదివిచ్చేస్తాను” అని తెచ్చేసికుని,మళ్ళీ వాళ్ళు అడిగేదాకా ఇవ్వకపోవడం లాటిది కాదు.

   4) తెలుసుకున్నదేమిటంటే, వార్తాపత్రికల్లో, సినిమాలకీ, పుస్తకాలకీ review వ్రాసేవారి మీద ఎంతో సదభిప్రాయం ఉండేది ఇదివరకటి రోజుల్లో, కానీ ఇప్పుడు అర్ధం అయిందేమిటయ్యా అంటే, ఏదో ప్రచారం కోసం పత్రికా యాజమాన్యం వారికి ఉచితంగా ఇచ్చే పుస్తకాలకి మాత్రమే రివ్యూలు వస్తాయి. ఎవరూ పుస్తకం కొని వ్రాసేటంత ఉదారహృదయులు ఉండరని. అలాగే సినిమాలూనూ ఏదో కాంప్లిమెంటరీ పాసులు వస్తే చూడ్డం కానీ, స్వంత డబ్బులు ఖర్చుపెట్టి చూసే త్యాగాలు ఎవరూ చేయరని.

   Irony ఏమిటంటే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ గ్రంధపఠనం పెంచాలనే ఉద్దేశ్యంతో ఊరూరా గ్రంధాలయాలు తెరిచి , ప్రతీ సంవత్సరమూ గ్రంధాలయ వారోత్సవాలు జరుపుకుంటూన్న నవంబరు నెలలోనే మా గ్రంధాలయానికి ” అల్విదా..” చెప్పడం.

    ఏదో అబ్బాయి ప్రారంభించిన గ్రంధాలయం మూసేయడం వలన ఏదో దుగ్ధ కొద్దీ వ్రాసింది కాదు. అవకాశం వచ్చినా అందుకోలేని దురదృష్టవంతుల గురించి బాధపడుతూ వ్రాసిన టపా ఇది. అందుకే అంటారు దేనికైనా పెట్టిపుట్టాలీ అని. ఏమో బాబూ నేనూ మా ఇంటావిడా అయితే అక్కడ ఉండే తెలుగు పుస్తకాలన్నీ చదివేశాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Thank God….

    దేశంలోని చాలా మంది అదృష్టం బాగుండో, ఆ భగవంతుడే అందరూ కొన్ని నెలలనుండి అనుభవిస్తూన్న హడావిడి ఇక చాలనుకున్నాడో ఏమో, మొత్తానికి భారతప్రభుత్వమూ సరైన సమయానికి స్పందించో, మన పేపర్లూ, టీవీ చానెళ్ళూ, బ్లాగులూ, సాధారణ జనజీవితంలోకి ఇంక అడుగెట్టొచ్చు.”దైవత్వం” ఆపాదించబడ్డ ఒక వ్యక్తి గుణగానాలకు ఇంక ఒక విశ్రాంతి లభిస్తుంది. నిజమే అతను మనదేశంలోని చాలామంది ఆటగాళ్ళకంటే, గొప్పవాడే, ఆ విషయంలో ఎటువంటి సందేహమూ లేదు. గుర్తుందా అప్పుడెప్పుడో సైనా మహీవాల్ ని అందరూ పొగిడేస్తూంటే, ఇంకో ఆట ఆడే సానియామీర్జా ఏమందో? “ఆ.. పోదూ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళెందరూ ప్రపంచ దేశాల్లోనూ, ఆడితే నాలాగ టెన్నిస్ లో పేరు తెచ్చుకోవాలి కానీ..”. అదే arguement ప్రస్తుతానికీ అన్వయిస్తే, క్రికెట్ ప్రపంచంలో ఆడే దేశాలెన్నిట? ఆడిన ప్రతీసారీ ఏదో ఒక ప్రపంచ రికార్డే మరి !అఛ్ఛా పోనీ ఒప్పుకుందాం, క్రికెట్టే గొప్పదీ, దాంట్లోనే హాయిగా ఫిక్సింగులూ గట్రా చేసికోవచ్చూ, దాంట్లోకే ఎక్కడలేని డాన్ లూ ఆసక్తి చూపుతారూ. దేశంలోని ప్రతీవాడూ ఓ గొప్ప క్రికెటరైపోదామని కలలు కంటాడూ, ప్రతీ రాజకీయనాయకుడూ ఏదో ఒక రాష్ట్ర క్రికెట్ ఎసోసిఏషన్ కి అద్యక్షపదవి కొట్టేయాలని అనుకుంటాడూ, ఫిక్సింగులూ వగైరాలు చేశారన్న ఆరోపణలు వచ్చినా, అవన్నీ పక్కన పెట్టేసి పార్లమెంటు సభ్యులైపోవచ్చూ, లేదా టీవీ వ్యాఖ్యాతలైపోవచ్చూ, ఒకటేమిటి ఎన్నెన్ని సువిధాలు, క్రికెట్ లో ఒక్కసారి ప్రవేశం లభిస్తే చాలు— డబ్బులే డబ్బులు.. దురదృష్టంకొద్దీ ఈ క్రికెట్ మనకి so called యువతకి స్పూర్తినిచ్చే ఆట ట. స్పూర్తి అనేకంటే National obsession అంటే రైటేమో. పోనీ ఎంతమంది యువతకి అంతంత అదృష్టం కలుగుతోందీ? పోనీ కలిగిందే అనుకుందాం, ఆ ప్రబుధ్ధుడు ఏదో ఒకటి రెండు సెంచరీలి చేశాడంటే చాలు, ప్రతీ product కీ యాడ్లివ్వడం, వాడుచెప్పే అవాకులూ చవాకులూ వినడం. రాజకీయరంగంలోలాగ ఇంకొన్ని సంవత్సరాలలో ఈ ఆటగాళ్ళ కొడుకులు ప్రవేశిస్తారు. ఇప్పటికే వాళ్ళ ప్రవేశానికీ పావులు కదుపుతున్నారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఇందులో కొన్ని రాజకీయావసరాలు కొన్నుంటూంటాయి, అప్పుడెప్పుడో జమ్మూ కాశ్మీరునుండి ఒకతన్ని సెలెక్టుచేశారు, కారణం అదేదో diplomatic exigency అని వాళ్ళే ఒప్పుకున్నారు.ఆ ఆటగాడేమైపోయాడో ఎవరికీ తెలియదు.

    పోనీ ఈ నాటకరంగాన్ని నిర్వహిస్తూన్న BCCI ఏమైనా లక్షణంగా పనిచేస్తోందా అంటే అదీ లేదు.ఆయనెవరినో కొన్నేళ్ళ క్రితం అధ్యక్షపదవినుండి తరిమేసి, మళ్ళీఈ ఆయన్నే తాత్కాలిక అధ్యక్షపదవిలో కూర్చోపెట్టారు. ఇంక ప్రస్థుత అద్యక్షుడైతే less said the better.అల్లుడేమో జైలుపాలయ్యాడు. ఇంకో మేధావి లలిత్ మోడీ అయితే దేశాలు పట్టి తిరుగుతున్నాడు.పోనీ తను ప్రారంభించిన IPL ఏమైనా సరీగ్గా ఉందా అంటే అదీ లేదూ. ఎవరూ పట్టించుకోరేమో అనుకుని, ఓ రెండు మూడు నెలలక్రితమే ఫలానా రెండువందలో టెస్టు పూర్తయిన తరువాత రిటైరవుతానని చెప్పడం తరవాయి, సన్నాహాలు మొదలయ్యాయి. 199 ది ఎక్కడా, 200 ది ఎక్కడా అని. ఒకానొకప్పుడు క్రికెట్ రంగంలో దిగ్గజాల్లా ఉన్న వెస్టిండీస్ దొరికేరు. వాళ్ళకీ రోజులు బాగోలేవు, ఒప్పుకున్నారు, వచ్చేరు, వెళ్ళేరు. మన ఎకౌంటులో ఇంకో విజయం.అసలు మిగిలిన వాళ్ళు ఎలా ఆడారూ, ఏం చేశారూ అనే ప్రశ్నే లేదు.ప్రకటన వెలువడ్డదగ్గరనుంచీ, ఆ “దేవుడు” గారి మీడియా మానేజర్లు పేట్రేగిపోయారు. ఓ ఫలానా చానెల్ అని లేదు, ఫలానా భాష అని లేదు, ఏ పేపరు చూసినా, ఏ చానెల్ త్రిప్పినా ఒకటే ఘోష. ఎంతదాకా వచ్చిందీ అంటే , ఈ గొడవ ఎప్పుడు వదులుతుందిరా బాబూ అని విసుగొచ్చేటంత !

    మొత్తానికి విముక్తి లభించింది. అయినా అక్కడక్కడ ఇంకా కొన్ని పేపర్లవాళ్ళు ఆ “యావ” లోంచి బయట పడలేదు. ఇంకా ఈవేళ కూడా, ఆయన ఏంచేశాడూ, చాయ్ పెట్టుకుని త్రాగేడూ, కొడుకుని స్కూలుకి తీసికెళ్ళేడూ వగైరా వివరాలు. దానికేముందిలెండి, ఇంకో రెండు మూడు రోజులు భరించాలి.అయినా మన మీడియా వాళ్ళకి అలవాటే కదా, ఓ సంజయ్ దత్తు జైలుకెళ్తే వాడికేం నెంబరిచ్చారో, జైలుకూడా, లేక ఇంటినుంచి వచ్చిందా, అలాగే లాలూ జైలుకెళ్ళినప్పుడూ అంతే. ఏదో ఓ నాలుగైదురోజులుంటుంది ప్రభావం.

    అఛ్ఛా ఇంక భారత రత్న దగ్గరకు వద్దాం. మన ప్రభుత్వ policy ప్రకారం క్రీడాకారులకి ఇన్నాళ్ళూ చేసేవారేకాదు. చేయడం అంటూ మొదలెడితే, భారత దేశాన్ని క్రీడారంగంలో అత్యున్నత స్థానం లో నుంచోబెట్టిన Hockey wizard ధ్యాన్ చంద్ తో శ్రీకారం చుట్టిఉండుంటే ఎంతో బాగుండేది.పాపం ఆయనగురించి lobbying చేసేవారే లేరాయె. ఉన్న వాళ్ళ మాటవినేవాళ్ళే లేరాయె. అయినా ఇస్తేనేమిటి, ఇవ్వకపోతేనేమిటి, ఏమైనా ఎన్నికల్లో ఓట్లొస్తాయా ఏమిటీ? ఈ భారతరత్న ప్రకటన ఇప్పుడే చేయడంలో ఎన్ని మతలబులున్నాయో ఆ పెరుమాళ్ళకే ఎరుక! మరీ ఒక్కరికే ప్రదానం చేస్తున్నట్టు ప్రకటిస్తే బాగుండదేమో అని, ఆయనెవరో రావు గారి పేరు కూడా చేర్చారు. ఆయనేమన్నారూ రాజకీయనాయకులందరూ ఒఠ్ఠి idiots అని. ఒదిలింది రోగం ! అయినా ఇదేమైనా కొత్తవిషయమా ఏమిటీ, శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టు, ఓ “భారతరత్న” గారు చెప్పేరు కాబట్టి అది వేదం.

    మధ్యలో బిజేపీ వాళ్ళు కొత్తగొడవోటి మొదలెట్టారు, పటేల్ గారికీ, వాజపేయీ గారికీ ఎందుకివ్వలేదూ అని. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారా?అరే మర్చేపోయాము పటేల్ గారు కాంగ్రెస్ వారు కదూ, ఏదో ఇప్పుడంటే రాజకీయకారణాల ధర్మమా అని సర్దార్ పటేల్ గుర్తుకొచ్చారు కానీ ఆయన ఎప్పుడో కనుమరుగైపోయారు.

   . ఇదివరకూ క్రికెట్ లో చాలామంది ఆటగాళ్ళు వచ్చారూ, ఇటుపైనా వస్తారు.ప్రస్తుత ఈ అంశంమీద healthy discussion చేయడానికి ఎంతమంది ప్రయత్నించారో తెలియదు. పోనిద్దురూ ఏదో ఒకటీ,మొత్తానికి ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా ఈ మీడియా హైప్పులో, ఎన్నెన్ని విషయాలు తెరవెనక్కి వెళ్ళిపోయాయో ఆలోచించారా? మన జోకర్లు అంటే రాజకీయనాయకులు, పేలే అవాకులూ చవాకులూ వినే, చదివే అదృష్టాన్ని కోల్పోయాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“Out of the Blue”

    మళ్ళీ ఈవేళ ఏం వచ్చిందీ అనుకోకండి శీర్షిక చూసి. పైన పెట్టిన శీర్షిక పూణె లోని esquare లో ఉన్న ఒక restaurant పేరు. నాకైతే అలాటి రెస్టారెంట్లకి వెళ్ళే అలవాటులేదు. అది ఒక multiplex లో ఉండడం ఒకకారణం. ఇక్కడ ఏదో అప్పుడప్పుడు ఏ మంచి తెలుగు సినిమాయో వచ్చినప్పుడు తప్ప, వారానికోసారి మారిపోయే హిందీ సినిమాలు చూసేటంత ఓపికా, స్థోమతా లేకపోవడం మరో కారణం.ఎలాగూ కొత్త హిందీ సినిమాలు ఓ రెండుమూడు నెలల్లో ఏదో ఒక టీవీ చానెల్ లో వచ్చేస్తున్నాయి,తెలుగు సినిమాల పరిస్థితీ అలాగే ఉందీ, అంత పెద్దస్క్రీను మీద అంతంత శబ్దకాలుష్యాల హింస భరించలేకపోవడం మరో కారణం.

    ఈమధ్యన indiblogger.in లో ఒక ప్రకటన చూశాను. పుణె లో ఉండే బ్లాగర్లు సమావేశం అవుతున్నారూ 10 వ తారీకు ఆదివారం నాడు అని. వెన్యూ కూడా నాకు వెళ్ళడానికి సదుపాయంగా ఉండబట్టి, నేనూ రిజిస్టరు చేసికున్నాను. కానీ తీరా చేసికున్నతరువాత ఓ పెద్ద సందేహం వచ్చింది. నేనేమో తెలుగులో వ్రాస్తానాయె, పైగా వయసులో కొద్దిగా పెద్దవాడినీ, అంతగా బాగుండదేమో అని.అక్కడకి వచ్చేవారందరూ వయసులో చిన్నవారూ, పైగా ఇంగ్లీషులో వ్రాస్తారు కూడానూ, ఓ వ్యాఖ్య పెట్టాను నా సందేహం తెలుపుతూ. వెంటనే జవాబొచ్చింది. మీరు అలాటి సందేహాలు పెట్టుకోవద్దూ, తప్పకుండా రండి అని. సరే చూద్దాం, అంతగా నచ్చకపోతే కొంచంసేపు ఉండి వచ్చేయొచ్చూ అనుకుని 11 గంటలకి మీటింగైతే 10.45 కి చేరాను. అప్పటికే రావాల్సిన 40 మందిలోనూ ఓ అరడజను మంది వచ్చేశారు. నా పరిచయం చేసికుని, కూర్చున్నాను. మెల్లిమెల్లిగా మిగతావారూ రావడం ప్రారంభం అయింది.

    ఒక్కొక్కరూ పరిచయాలు చేసికోవడం ప్రారంభించారు. నేనైతే ముందుగా నా ప్రవర చెప్పుకుని. తరువాత అసలు ఈ బ్లాగులోకంలోకి ఎందుకు ప్రవేశించానో చెప్పి, నా పాఠకుల అభిమానం గురించి చెప్పుకొచ్చాను. మిగిలిన వారందరూ కూడా తమతమ పరిచయాలు చేసికున్నారు. ఈ మధ్యలో బ్రేక్ ఫాస్టు ఒకటీ. ఒకసారి కబుర్లు చెప్పడం ప్రారంభించేక నన్ను ఎవరు పట్టుకుంటారు? నా మిస్టరీ షాపింగుగురించి కూడా చెప్పేను.వాళ్ళకి అందులో ఉండే ఉపయోగాలు తెలియచేయడానికి, నాకు ఈ మిస్టరీ షాపింగుద్వారా లభించిన హ్యాట్టూ(Espirit), షర్టూ(Vanheusen), ప్యాంటూ(Allen Solly), కళ్ళజోడూ(Lawrence Mayo), షూసూ (Puma), సాక్సూ(Nike) వేసికుని మరీ వెళ్ళాను. అంతే, వివరాలడగడం మొదలెట్టారు. ఇంకో చిత్రం ఏమిటంటే, నేను ఇప్పటికే 800 పైగా టపాలు వ్రాశానని, అదీ తెలుగులో వ్రాశాననీ విని ఆశ్చర్యపడ్డారు. ఏదైనా సాఫ్ట్ వేర్ తీసికున్నారా అని అడిగితే, నేను రెగ్యులర్ గా వ్రాసే యంత్రం.కాం గురించి చెప్పాను.

    రెండు గంటలకి లంచి ( బఫే) కి లేవమన్నారు. నాకేమో వెజ్జికీ, నాన్ వెజ్జికీ తేడా తెలియదూ, పాపం ఒక తెలుగబ్బాయి సహాయం చేశారు. మొత్తానికి ఓ అరగంట ఉండి వచ్చేద్దామనుకున్నవాడిని, అక్కడి వాతావరణం, అక్కడకు వచ్చినవారు చూపించిన అభిమానమూ, వారు, నాకూ నా వయస్సుకీ ఇచ్చిన గౌరవమూ, నన్ను నాలుగ్గంటలు అక్కడే ఉండేటట్టు చేశాయి. స్నేహపూరిత వాతావరణంలో నాలుగ్గంటలు గడిపే అవకాశం వచ్చింది. ఈ లంచీ, బ్రేక్ ఫాస్టూ ఖర్చులెవరివీ అని అడిగితే తెలిసింది. ఆ restaurant యాజమాన్యమే స్పాన్సర్ చేశారని.

    ఇలాటి సమావేశాలకి వెళ్ళడానికి సంకోచిస్తాము కానీ, వెళ్తే మాత్రం కొత్తకొత్త విశేషాలు ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. మూడేళ్ళ క్రితం తెలుగుభాషా దినోత్సవానికి భాగ్యనగరం వచ్చినప్పుడూ ఇలాటి అనుభవమే కలిగింది. ఎందరో కొత్త స్నేహితులు లభించారు. నిన్నటి రోజున మళ్ళీ ఆ రోజునే గుర్తుచేసికున్నాను. కొన్ని ఫొటోలు తీశాను.
Bloggers Meet 007Bloggers Meet

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Unhappy…

    ఇదేమిటీ ఈ టపాకి శీర్షిక అదోలా ఉందీ, ఈయన హ్యాపీ గా ఉంటే ఎవడిక్కావాలి, అన్ హ్యాపీ గా ఉంటే ఎవడిక్కావాలీ అనుకుని కోప్పడకండి. నాక్కావాల్సింది మీరందరూ హ్యాపీగా ఉండాలనే నా కోరిక. మరి ఈ శీర్షిక వెనకాల కథా కమామీషూ ఏమిటంటారా, ఇది SBI వారి 24×7 సర్వీసు పేరు. బ్యాంకుల్లో పనిచేసేవారికీ, అందులో పనిచేసి పదవీ విరమణ చేసినవారికీ తప్ప, మనలాటి ఆంఆద్మీ లకి తెలియదు. ఎప్పుడో పేపర్లలో వేశారుట. పోనిద్దురూ ఇన్నాళ్ళూ ఏ గొడవా లేదుకాబట్టి తెలిసికోవాల్సిన అవసరం కూడా కలగలేదు. మొన్న ఒక టపా వ్రాశాను, చదివే ఉంటారు, పింఛనీదార్ల ఇక్కట్ల గురించి. మాకు ఈ ఊళ్ళో ఒక స్నేహితుడు ఉన్నారు. ఆయన SBI లోనే పనిచేసి రిటైరయ్యారు. నా టపా చదివిన తరువాత, నాకు ఫోను చేసి ఈ సర్వీసు గుర్తుచేశారు, ఎప్పుడో చెప్పేరులెండి, అయినా ఈ Grievance Redressal Cell లమీద అంత విశ్వాసం లేకపోవడం మూలాన, దాని విషయం మర్చిపోయాను. ఆయన నిన్న ఫోనుచేయగానే , పోనీలే ఒక SMS చేస్తే, మనసొమ్మేంపోయిందీ అనుకుని చేశాను. SMS చేయాల్సిన నెంబరు 8008202020. మనకేమైనా సమస్య ఉంటే( SBI కి సంబంధించినంతవరకూ) ఈ నెంబరుకి Unhappy అని ఒక SMS చేసేయడం. వెంటనే ఒక రిప్లై వస్తుంది..”Your SMS has arrived in SBI’s Happy Room. Your satisfaction is our destination. We shal call you shortly to get details..” అని.ఇలాటివి ఎలాగూ ఆటోమేటెడ్ సమాధానాలే, అయినా చూద్దాం అనుకున్నాను.

    కానీ ఈవేళ ప్రొద్దుట ఒక ఫోను వచ్చింది, సమస్య ఏమిటీ అని. మొన్న నాటపాలో వ్రాసిన విషయాలన్నీ వివరంగా చెప్పేను. తప్పకుండా ఈ సమస్య ని resolve చేస్తామనైతే చెప్పేరు. చూద్దాం.

    బ్లాగు పాఠకులందరికీ ఇలాటి సమాచారం అంతగా ఉపయోగపడకపోవచ్చు. మొదటి కారణం ప్రభుత్వరంగ బ్యాంకులతో ఈతరం వారికి లావాదేవీలు పెట్టుకోడం అంతగా ఇష్టం ఉండదు. ICICI, HDFC,CITI, YES లాటి బ్యాంకులకే ఎక్కువ ఇష్టపడతారు.ఎంతచెప్పినా వారి సర్వీసు ప్రభుత్వరంగ బ్యాంకులంత అధ్వాన్నం కాదుకదా. కానీ మీమీ ఇళ్ళల్లో ఉండే ఏ పెద్దవారికో ఏదైనా సమస్య వస్తే పైన వ్రాసిన సర్వీసు ఉపయోగబడవచ్చు.

    ఇదివరకెప్పుడో రైల్వే వారి నెంబర్లు కూడా ఇచ్చినట్టు జ్ఞాపకం. ఇదివరకు వివిధ జోన్లకీ, విడిగా నెంబర్లుండేవి. కానీ ఇప్పుడు ఒకే నెంబరు : 8121281212
Railway Complaints

    పొగత్రాగడం హానికరం అని ఎన్ని ప్రకటనలు పెట్టినా, సిగరెట్ కాల్చేవారు కాలుస్తూనే ఉంటారు. ఆ సిగరెట్ మీద ఒక వ్యాసం చదవండి.సిగరెట్

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఎప్పుడు బాగుపడతారో కానీ…

    పదవీవిరమణ చేసిన ప్రభుత్వోగస్థులందరికీ నవంబరు నెల వచ్చిందంటే, కావాల్సినంత కాలక్షేపం. రిటైరయిన మరు సంవత్సరంనుండీ ప్రారంభం అవుతుంది ఈ భాగోతం. బ్రతికేఉన్నట్టు పెన్షను తీసికునే బ్యాంకు కి వెళ్ళి ఓ Life Certificate సమర్పించుకోవాలి. ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్ళనుండీ జరుగుతోందీ, బతికున్నన్నాళ్ళూ జరుగుతుంది, దానికైతే సందేహమే లేదు. ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే, పెన్షనర్ల సంగతి గోవిందా… ఏదో దగ్గరలోఉండే బ్యాంకుల్లో ఓ ఎకౌంటూ ఓపెన్ చేసికుని, వాళ్ళిచ్చిన ఏటీఎం కార్డుతో లాగించేస్తున్నారు. అయినా పాపం చాలామంది బ్యాంకులకే వెళ్ళి వారి వారి పెన్షన్లు తీసికుంటూంటారు. ఏటీఎం కార్డులు ఉపయోగించుకోవడం తెలియకవొచ్చు, లేదా ఎవరితోనైతే ఉంటున్నారో, కొడుకో, కూతురో ఇంకోరెవరో, వీళ్ళ కార్డులు దుర్వినియోగం చేసేస్తారేమో అనే భయం అయుండొచ్చు, హాయిగా నెలలో ఒకసారైనా పెన్షన్ వంక పెట్టి, బయటకి వెళ్ళొచ్చనో,కారణాలకేమిటిలెండి కావాల్సినన్ని.ఎప్పుడైనా బ్యాంకులకి మొదటివారంలో వెళ్తే , పెద్ద పెద్ద క్యూలు కనబడుతూంటాయి. అలాటి అవసరంలేక, నెట్ బ్యాంకింగులోనే పేమెంట్లు చేసేవారూ, ఏటీఎం కార్డులు ఉపయోగించుకునేవారూ, ఇలాటి దృశ్యాలు చూసి నవ్వుకుంటూంటారు. ఏవిటో హాయిగా ఓ ఏటీఎం కార్డుతీసేసికుంటే గొడవుండదుగా అనుకుని.సంవత్సరం పొడుగునా హాయిగా వెళ్ళిపోయినా, నవంబరొచ్చిందంటే చాలు, ఈ “ఆంఆద్మీ” లతోపాటు తనూ క్యూలో నుంచోవాల్సొస్తుంది. అందుకే ఎప్పుడూ, ఎవరినీ చూసి నవ్వుకోకూడదు.
ప్రతీ ఏడూ జరిగేదేకదా, పోనీ బ్యాంకులవాళ్ళైనా లక్షణంగా చేస్తారా అంటే, ఒక్కో బ్యాంకుదీ ఒక్కో పధ్ధతి.పోనీ అందులోనైనా uniformity ఉందా అంటే అదీలేదూ. ఈ ఏడాది ఉపయోగించిన ఫారం, వచ్చే ఏడాదికి ఉపయోగించదుట.ఏడాదేడాదికీ, ఆ బ్యాంకులవాళ్ళరూల్స్ మారిపోతూంటాయి. మళ్ళీ క్యూల్లో నిలబడ్డం ఎందుకులే అనుకుని, ఒకేసారి ఓ నాలుగు ఫారాలు తీసికుంటే, అవి చెల్లవంటారు మళ్ళీ ఏడాదికి. పేద్ద తేడా ఉంటుందా అంటే అదీ ఉండదు. అదో సరదా బ్యాంకులవాళ్ళకి. పెన్షనర్లని హింసించడంలో ఓ పైశాచికానందం ఈ బ్యాంకులకి. వాళ్ళకి కావలిసిన సమాచారం ఏవిటీ– పెన్షనర్ బతికున్నాడా లేదా, అంతే కదా.అయినా , వివిధ బ్యాంకులవాళ్ల proforma లకి ఓ పోలికకానీ, సాపత్యంకానీ ఉండదు.

    ఓ బ్యాంకువాడు ఫొటో కావాలంటాడు, ఇంకోడు ఎడ్రస్ proof కావాలంటాడు,ఇంకోడు PPO కావాలంటాడు.ఇంకోడైతే వీటన్నిటి కాపీలూ జతచేసి, ఎవడిచేతో attest చేయించమంటాడు. అదృష్టం కొద్దీ ఇంకా affidavit కూడా కావాలనే దిక్కుమాలిన ఆలోచన ఇంకా రాలేదు. అదీ ఎప్పుడో వస్తుంది.పోనీ ఇవైనా ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతూంటే నవంబరొచ్చేసరికి వీటన్నిటితోనూ సిధ్ధపడిఉంటారు.అబ్బే అలా చేస్తే సుఖపడిపోరూ.ఏడాదేడాదీ మార్చడంలోనే మ.రా.శ్రీ. ప్రభుత్వం వారికి సంతోషదాయకం. బ్యాంకుకి వెళ్లి ఎదురుగా నుంచుని, సంతకం చేస్తున్నాడే, మళ్ళీ ఈ గోలంతా దేనికండి బాబూ? గంటసేపు క్యూలో నుంచుని, తీరా తనవంతు వచ్చేటప్పటికి అక్కడ కూర్చున్నవాడు చిద్విలాసంగా “ఇది కుదరదండీ..” అనేసి, next.. అంటాడు.తాను బ్రతికే ఉన్నానని మాత్రం, మొదటి షాట్ లో నిరూపించుకోవడం జరగదు. నానా తిప్పలూ పడి నాలుగైదు ప్రయత్నాలు పడుతూంటాయి.అదికూడా మనం లేచినవేళమీదే ఆధారపడిఉంటుంది.

    ఇదోరకమైన చిత్రహింసైతే, SBI వారిది ఇంకోతంతు.గత చేదు అనుభవాల ధర్మమా అని ఒకటో తారీకుకే బ్యాంకుకి వెళ్ళడం ప్రారంభించాను. ఈనెల వెళ్ళగానే, ఇంకా ఫారాలు రాలేదూ, మధ్యలో రెండు రోజులు దీపావళి శలవలూ, అతావేతా ఆరో తారీకుకి రమ్మన్నారు. సరే ఆ ఫారం ఏదో, నేనుండే ప్రాంతంలో ఉన్న SBI బ్రాంచీకి వెళ్ళి, తెచ్చుకున్నాను. దానిమీద బ్రాంచి పేరు కూడా ప్రింటుచేశారు. ఏదో దాన్ని కొట్టేసి, నేను పెన్షన్ తీసికునే బ్రాంచ్ పేరు వ్రాస్తే సరిపోతుందిలే అనుకుని, ఇంట్లో వివరాలు వ్రాసి, నిన్న బ్యాంకు తెరిచే సమయానికి, ఆటోలో వెళ్ళి, మొత్తానికి క్యూలో నాలుగోవాడిగా నుంచున్నాను.అయిదు నిమిషాల్లో క్యూ కొల్లేరు చాంతాడులా పెరిగిపోయింది.ఆటోలో రావడం మంచిదయింది. నా ముందరి ముగ్గురినీ ఏవేవో కారణాలు చెప్పి మళ్ళీ రమ్మన్నారు. నా వంతొచ్చేటప్పటికి, 1. ఈ ఫారం కుదరదూ, మా బ్రాంచి ఫారమే ఉండాలి. 2. నీ ఎడ్రసు, సిస్టంలో లేదూ.అన్నాడు. మొదటిదానికి చెప్పేనూ– మీ SBI ఇంకో బ్రాంచిదేనూ, ఇంకో బ్యాంకుది కాదూ. రెండో దానికి ఈమధ్య ఒక లెటరు పంపేరుకదా, నా ఎడ్రసులేకుండా ఎలా పంపగలిగేరూ అని అడగ్గానే వీడితో కుదరదూ అనుకున్నాడేమో కానీ, సరే అని ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు ,సణుక్కుంటూమొత్తానికి ఒప్పుకున్నాడు.అయినా ఓ మెలిక పెట్టేడు, నేను తెచ్చిన SBI ఇంకో బ్రాంచి ఫారంలో అన్నీ పూర్తిచేసిన తరువాత సాక్షి సంతకాలుండాలి, ఇక్కడి బ్రాంచి ఫారానికి ఇంకోటెవో వివరాలు కావాలి. అదండి తేడా. ఇన్నితిప్పలూ పడి మళ్ళీ సాక్ష్యాలెక్కడ తేగలనూ? ఏదో తెలిసినవాడే కాబట్టి, మొత్తానికి ఒప్పేసుకుని పని కానిచ్చేశాడు.

    నాకు అర్ధం కానిదేమిటంటే, ఒకే బ్యాంకు వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండే వివిధ బ్రాంచీలకీ వేరు వేరు ఫారాలు ఎందుకు పెడతారు? అదేమైనా ఆస్థివీలునామాలా ఏమిటీ? ప్రపంచం లో అన్ని లావాదేవీలూ simplify చేస్తూంటే, ఈ బ్యాంకులవాళ్ళు మాత్రం సాధ్యమైనంతకష్టతరంచేస్తున్నారు. ఎప్పటికి బాగుపడతారో ఆ భగవంతుడికే తెలియాలి.పైగా ఎవరినీ– అన్నేసి సంవత్సరాలు విధినిర్వహణ చేసి, జీవిత చరమాంకంలో విశ్రాంతి తీసికునే సమయంలో ఇంత చిత్రహింస అవసరమంటారా? ఎప్పటికైనా ఈ వ్యవస్థ బాగుపడే సూచన ఉందంటారా…లేక, పోనిద్దూ ఈ పెన్షనర్ల వల్ల ఏగాణీ ఉపయోగంలేదూ, సరదాగా ఓసారి ఆడుకుందాము అనే ఉద్దేశ్యం అంటారా? ఏదో నాలుగక్షరాలు తెలుసుకాబట్టి పని కానిచ్చేసుకుంటాము కానీ, అసలు ఏమీ తెలియనివారి గతి ఏమిటీ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    చిన్నప్పుడు పెద్దవారి మాటలే వేదంగా ఉండేవికాబట్టి , వారు చెప్పేవే మనసులో హత్తుకుపోయేవి. ఓహో నిజమే కాబోసూ అనుకునేవారం. అలాగని మన తల్లితండ్రులు ఏవేవో చెప్పి మనల్ని నమ్మించేవారూ, ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలిగిందనీ కాదు.నా ఉద్దేశ్యం ఏమిటంటే ఆరోజుల్లో ఇప్పుడున్నన్ని ప్రసారమాధ్యమాలూ ఉండేవి కావు. ఉన్నా మనకి అందుబాటులో ఉండేవీకావు. సదరు కారణాల ధర్మమా అని స్కూళ్ళలో గురువులు చెప్పినవీ, ఇంట్లో తల్లితండ్రులు చెప్పిన వాటిమీదే పెరిగి పెద్దయ్యాము.అప్పుడు acquire చేసికున్న so called విజ్ఞానంతో బ్రతుకుబండి లాగించేశాం.మన పిల్లలవరకూ, వాళ్ళూ మనమీదుండేగౌరవం అనండి, లేదా మన తల్లితండ్రులు అప్పటికింకా జీవించే ఉండడంవలనైతేనేమిటి, 80 ల దశకందాకా ప్రసారమాధ్యమాల కొరతవల్లనైతేనేమిటి,ఏదో మనం వీధినపడలేదు. అది తప్పని చెప్పడం నా ఉద్దేశ్యం ఎంతమాత్రమూ కాదు. అదే ఈ రోజుల్లో చూడండి, ఏదైనా ఒక విషయం చిన్నవారితో చెప్పాలని చూసినా, అసలు ముందుగా విననేవినరూ, అథవా మన అదృష్టం బాగుండీ, వారి “మూడ్” బాగుండీ, మనల్ని ఊరుకోపెట్టడానికి విన్నారే అనుకున్నా, మన “మూడ్” ఇరుకులో పెట్టడానికి , విన్నట్టే విని, “ఎందుకూ” అని దాన్ని మనమీదకు తిప్పికొడతారు. వాళ్ళడిగినదానికి సమాధానం చెప్పే సమర్ధతైతే మనకు లేనేలేదు. ఎందుకొచ్చిన గొడవా అని ఈ ” జ్ఞానబోధలు” అనే కార్యక్రమానికి స్వస్తి చెప్పేస్తాం.

    ఆ ప్రకారం పగలనకా, రాత్రనకా విని..విని..విని.. మనకూ కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోయాయి. అవి తప్పా కాదా అనే వివక్షత తెలిసికోడానికి కూడా ప్రయత్నించలేదు. మన చిన్నప్పుడంటే , స్వాతంత్రం కొత్తగా వచ్చినరోజులు. అంతకుముందు అంటే 1920, 30 దశకాల్లో పుట్టిన వారికి ఇప్పుడు జ్ఞాన్ కీ ఖోజ్ చేసే ఓపికాలేదూ, చేద్దామనుకున్నా ఈనాటి fast life లో వీరి గోల పట్టించుకునేవారూ లేరు. ఏదో వ్యక్తిగతంగా ఉండే ఉత్సాహం వలన , మొత్తానికి ఓ కంప్యూటరు ఉపయోగించుకోవడం నేర్చుకున్నాము. పోనీ అదైనా పూర్తిగా తెలుసునా అంటే అదీ లేదూ. ఏదో చదవడం, వ్రాయడం వచ్చుకాబట్టీ, పిల్లలకి మన సందేహాలు తీర్చే తీరిక లేకపోబట్టి, మనకి మనమే ఏదో తిప్పలుపడుతున్నాము. అదృష్టంకొద్దీ ఏ ఐటీ కంపెనీలోనూ పనిచేయాల్సిన అగత్యం లేదు కాబట్టి, చిన్నప్పుడు అవకాశాలు రాకా, పెళ్ళై సంసారభవబంధాల్లో చిక్కుకున్నతరువాత తీరిక లేకా, అథవా తీరికున్నా,స్తోమత లేకా, మొత్తానికి పుస్తకపఠనమనేది, అటకెక్కేసింది. ఉద్యోగబాధ్యతలనుండి విముక్తి దొరికిన తరువాత, పోనీ చిన్నప్పుడెప్పుడో విన్న పుస్తకాలు ఓమారు చూద్దామేమిటీ అనుకుని, తీరా పుస్తకాల కొట్లకి వెళ్తే, పాతపుస్తకాలైతే దొరకనే దొరకవూ, పోనీ దొరికినా వాటి ఖరీదు చుక్కల్లో ఉంటుంది. ఏదో ఈ అంతర్జాలమహిమ ధర్మమా అని, ఏనాడో “పేర్లు వినడానికే” పరిమితమయిపోయిన, కొన్ని అఛ్ఛోణీల్లాటి పుస్తకాలు దొరుకుతున్నాయి. ఆ మధ్యన కొన్ని లింకులు ఇచ్చాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే చదువుతారేమో అని. ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలియదు.

    ప్రస్తుతానికి వస్తే, చెప్పేనుగా చిన్నప్పుడు “విశాలాంధ్ర” అని వార్తాపత్రిక పేరైతే విన్నాము. ఏదో SSLC పరీక్షాఫలితాలకే , ఆ పేపరుతో మన చుట్టరికం. మిగిలిన పేపర్లకంటే ముందర “విశాలాంధ్ర” లో వచ్చేవి. విశాలాంధ్ర అంటే కమ్యూనిస్టువారి పేపరూ అనే వినేవాళ్ళం.పైగా కమ్యూనిస్టులగురించి మాట్టాడితే చాలు ఇంట్లో చావకొట్టేవారు.కారణాలూ తెలిసేవి కావు. దానితో జీవితమంతా, కమ్యూనిస్టులన్నా, వారి నాయకులు రాజేశ్వరరావుగారన్నా, నంబూద్రిపాదు గారన్నా అదో రకమైన indifference ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వూవస్తుంది, బాధా వేస్తుంది. ఇప్పుడున్న so called జాతీయనాయకులకంటే వారే ఎన్నో రెట్లు మెరుగు. ఓ మాటమీద నిలబడేవారు.ఏ topic తీసికున్నా ఒక in depth పరిశోధన చేసేవారు.అధికారపక్షానికి కూడా వారంటే ఒకవిధమైన గౌరవం ఉండేది. కమ్యూనిస్టు పార్టీలో దేశదేశాంతరాల్లో ఘనత వహించిన ఓ మహామనీషి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు. పైన చెప్పినట్టు కమ్యూనిస్టులంటే ఉన్న ఒక prejudice వలన, ఆయనన్నా, ఆయనవ్రాసిన పుస్తకాలన్నా పేద్ద ఆసక్తి ఉండేది కాదు. పోనిద్దూ వామపక్ష సిధ్ధాంతాలగురించే కదా వ్రాసేదీ అనుకునేవాడిని. నెట్ లో ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆణిముత్యాల్లాటి పుస్తకాలు దొరుకుతూండగా, ఇప్పుడు పని కట్టుకుని ఈ పుచ్చలపల్లాయన ఎందుకూ అనుకునేవాడిని.

    కానీ స్నేహితుడు రెహమాన్ ధర్మమా అని, నా అభిప్రాయం ఎంత far from truత్తో తెలిసింది. శ్రీ సుందరయ్యగారు స్వయంగా వ్రాసినవే కాక, తాము సేకరించిన వివిధ తెలుగు ప్ర్ఖఖ్యాత రచయితల పుస్తకాలు కూడా digitalise చేసి ఈ లింకులో పొందుపరిచారు. ఒకసారి చూశారంటే, కొన్ని మంచిపుస్తకాలు చదివేమన్న అనుభూతి మిగులుతుంది.

    ఆంధ్రదేశానికి గర్వకారణమయిన శ్రీ కోడిరామ్మూర్తి గారి గురించి ఒకవ్యాసం దొరికింది(నా కోరిక మన్నించి, ఈ వ్యాసం వెదికి పట్టిన ఘనతంతా మా ఇంటావిడదే....).కోడి రామ్మూర్తి గారు