బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పైసా వసూల్…

   ఏమిటో ఏదో అనుకుని ఏదో చేస్తాము.మొన్న ఆదివారం మార్కెట్ కి వెళ్ళినప్పుడు, నేను రెగ్యులర్ గా కూరలు తీసికునే కొట్టువాడు, దొరికినప్పుడల్లా తప్పకుండా తీసికునే ‘బచ్చలి కూర’ తెచ్చాడు. ఆ బచ్చలికూర చూస్తే అసలు వళ్ళూ ఇల్లూ తెలియదు నాకైతే.ఓ అరకిలో తూపించి, దానితో ఇంకో అరకిలో కంద కూడా తీసికుని కొంపకు చేరాను. ఆరోజు, పిల్లలు హైదరాబాదు నుంచి ఇంకా రాలేదు కదా అని, మా ఇంట్లోనె ఉన్నాము. తెచ్చిన కూరలన్నీ, పనిమనిషి చేత ఫ్రిజ్ లో పెట్టిస్తూ చూసింది, మా ఇంటావిడ నేను తెచ్చినవి. ‘అబ్బా మళ్ళీనా బాబూ కందా బచ్చలీనూ..’ అంటూ. నేనేమైనా మణులడిగానా మాణ్యాలడిగానా, ఎప్పుడైనా కందా బచ్చలీ దొరికినప్పుడు, కూర చేయమన్నానంతే కదండీ. పోనీ మా అబ్బాయీ వాళ్ళకుక్కు చేత చేయించనా అంది. వద్దుబాబోయ్ ఆవిడకి కంద కీ కాందా( ఉల్లిపాయ) కీ తేడా తెలియదు. ఎలాగోలాగ ఓపిక చేసికుని, మనం ఉండే ఇంటికి వెళ్ళిన తరువాత చెయ్యీ, అని బ్రతిమాలించుకుని, బామాలించుకుని మొత్తానికి ఒప్పుకుంది.

   అవ్విధంబుగా కందా బచ్చలికూర కార్యక్రమం ఈవేళ పెట్టుకుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి, కందా బచ్చలికూర బ్రహ్మాండంగా చేస్తుందిలెండి. అలాగని మిగిలినవి చేయదనికాదూ, దానితోపాటు మామిడికాయ పప్పూ,మజ్జిగపులుసూ, కొత్తావకాయైతే ఉండనే ఉంది.ఇంకేం కావాలి? ఏదో వేళపట్టున అప్పుడప్పుడు ఇలాటి తిండి తినొచ్చుననే కదా, విడిగా ఫ్లాటు తీసికుని ఉంటున్నదీ? అక్కడైతే ఆ కుక్కు చేసే వంటలు తినే ఓపికా సహనమూ లేదు నాకైతే.ఆవిడ మాత్రం ఏంచేస్తుందీ,పిల్లలు నూనె ఎక్కువ వేయొద్దూ, ఉప్పూ కారం తగ్గించూ అంటే. ఏమిటో అర్ధం అవదు, బతికున్న నాలుక్కాలాలపాటూ హాయిగా నోటికి హితవుగా ఉండేవి తినకుందా, ఏమిటో, హెల్త్ కాన్షస్సూ అంటూ…

   ప్రొద్దుటే వెళ్ళి, మా అమ్మాయికి ఈవిడిచ్చిన మాగాయ, మామిడికాయ ఒరుగులూ ఇచ్చేసి, తనతో ఓ గంట కబుర్లు చెప్పి,ఓ చాయ్ తాగెసి, దారిలో మా ఇంటికి వెళ్ళి, కోడలుతో మాట్లాడి, మెల్లిగా పన్నెండున్నరకి కొంపకి చేరాను.ఈవేళ మా ఇంటావిడ చేసిన మెనూ చెప్పానుగా (పైన రెండో పేరాలో మొదటి లైను..).వహ్వా ‘ఏనాటి నోము ఫలమో..అని త్యాగరాజస్వామివారి కృతి హమ్ చేసికుంటూ, భోజనం పూర్తి చేశాను. అప్పుడు కూడా పొంచి ఉన్న డేంజరు పసికట్టలేకపోయాను. అన్నదాతా సుఖీభవా అని ఆశీర్వదిస్తూ భోజనం పూర్తయిన తరువాత, ఓ కునుకు తీద్దామని పడుక్కున్నాను.

   నాలిగింటికి ఏదో కిరసనాయిలు వాసనేస్తూందేమిటా అనుకుంటూ చూశాను. అప్పటికే మా ఇంటావిడ క్లీనింగ్ అభియాన్ కార్యక్రమంలో కొంత భాగం పూర్తి చేసి, ఓ కుర్చీ వేసికుని ఫాన్లు తుడుద్దామనే సదుద్దేశ్యంతో ఓ ఫాన్ కింద నుంచుని, ప్రయత్నం చేస్తోంది.అప్పటికే, ఈ కిరసనాయిలు వాసన తగిలి ఒకావిడ వచ్చి ఇంక్వైరీ చేసింది. దానిమీద ఓ టపా కూడా వ్రాసేసింది ( మా ఇంటావిడే లెండి).ఎంత కాళ్ళెత్తినా ఆ ఫాన్ అందుతుందా ఏమిటీ? పైగా ఏ కాలో తూలి కిందపడిందంటే అదో గొడవా.అసలు ఈ ఫాన్లెందుకో, పీరియాడికల్ గా వాటిని క్లీనింగెందుకు చేయాలో అర్ధం అవదు నాకు. నాకు తెలిసినదల్లా, మా ఇంటావిడ స్లిప్ అయి కిందపడకుండా చూడ్డం మాత్రమే. పోనీ నేనేమైనా తాటి చెట్టులా పొడూగ్గా ఉంటానా అంటే అదీ లేదూ, మా ఇంటావిడకంటె ఓ బెత్తెడు పొడుగు. నా ఖర్మకాలి, కుర్చీ వేసికుంటే ఆ ఫాన్ రెక్కలు నాకు అందేలా ఉంటాయి. అదండీ నేను చేసికున్న పాపమల్లా! పొనీ పక్కవాళ్ళింట్లో ఎత్తుగా ఉండే స్టూలు తెద్దామా అంటే, వాళ్ళ పిల్ల, స్టూల్ కనిపించడంలేదూ అని డిక్లేరు చేసేసింది. ఆ స్టూలేమైనా చిన్నదా చితకదా మాయం అయిపోవడానికీ, ఏమిటో నా దురదృష్టం!

   ఇంక ప్రారంభం నా exercise,ఆ కుర్చీ పాడైపోకుండా ఓ గుడ్డ వేసి, నా చేతిలో కిరసనాయిల్లో ముంచిన గుడ్డోటి పెట్టి, your time starts now.. అంటూ ఓ విజిలేసింది.ఆ ఫాన్ రెక్కలకున్న బూజూ,మట్టీ ఇంతా అంతానా? నేను ఈ కిరసనాయిల్లోముంచిన గుడ్డ పెట్టి తుడవడం మొదలెట్టేసరికి అక్కడ అప్పటిదాకా లేని మరకలు, పైగా ఆ ఫాన్ రంగుకూడా క్రీం కలరేమో,తయారయ్యాయి.పైగా ఎండే లోపల, పొడిగుడ్డతో తుడిచేయాలని, instructions from time to time ఓటీ.ఒక రెక్క తుడుస్తూంటే ఇంకో రెక్క మీద ఆరిపొకుండా ఉంటుందా? ఏమిటో ఈవిడ చేతిలో పడ్డానూ, అనుకుంటూ, ఆ దిక్కుమాలిన కిరసనాయిల్లో ముంచిన గుడ్డ అవతల పారేసి, మామూలు సీదా సాదా తడిగుడ్డ తీసికుని, మా ఇంటావిడ దర్శకత్వంలో మొత్తానికి, ఆవిడ చేత ‘ఫరవాలేదూ..’ అనిపించుకుని ఆ కుర్చీ దిగాను. అప్పుడే ఎక్కడయిందీ ఇంకా రెండు ఫాన్లు మిగిలాయి.అదృష్టం ఏమిటంటే, వాటి కలర్ బ్రౌన్ ! మరీ నన్ను తిప్పలు పెట్టకుండా రక్షించాయి.

   అప్పుడనిపించింది, ప్రొద్దుటే కందా బచ్చలి కూర చేయమన్నందుకు ఏమైనా రివెంజ్ కార్యక్రమమా ఇదీ అని! ఏమైతేనేం, మా ఇంటావిడకి పైసా వసూల్!అప్పుడే ఎక్కడ అయిందిలెండి, ఏ రాత్రివేళో లైటు వెల్తుర్లో మళ్ళీ ఏ మరకైనా కనిపించిందో
మళ్ళీ మొదలూ, కుర్చీ,దానిమీద ఓ గుడ్డా, చేతిలో ఓ తడిగుడ్డా! అర్ధరాత్రి లేపకుండా ఉంటే చాలు !!!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఒక్కొక్కప్పుడు చూస్తూంటాము, ఎవరైనా వాళ్ళింట్లో జరగబోయే, వివాహ మహోత్సవానికి, ఆహ్వాన పత్రిక ఇచ్చేటప్పుడు, దాంట్లో ‘బంధుమిత్ర పరివారం…’ అని ఉన్నప్పటికీ, మన పేరు వ్రాసేటప్పుడు, కవరు పైన, ఫలానా శ్రీమతి, శ్రీ అని వ్రాస్తూ ఎండ్ ఫామిలీ అనికూడా వ్రాస్తూంటారు. కానీ కొంతమందుంటారు, ఇంటి పెద్ద ఒకడినే పిలుస్తారు! మహ అయితే, అతని భార్యనీ.రిసెప్షన్ లో ఎన్ని ప్లేట్లు డిన్నరో, లంచో ఖర్చవుతుందో తెలియాలి కదా.ఈ మధ్యన నేను బాపట్ల వెళ్ళిన సమయం లో, మా స్నేహితులిద్దరి కొడుకుల వివాహ రిసెప్షన్లయ్యాయి. నేను వెళ్ళలెకపోతున్నాను కదా అని, మా ఇంటావిడా, అబ్బాయీ కోడలూ పిల్లలూ వెళ్ళారు. కారణం- ఆ ఇద్దరూ కూడా, వెడ్డింగ్ కార్డిచ్చినప్పుడు, నా పేరుతో ఎండ్ ఫామిలీ అని వ్రాశారు.

మా నవ్యని హైదరాబాద్ లో వాళ్ళ అమ్మమ్మ దగ్గర దిగబెట్టడానికి, మా అబ్బాయీ కోడలూ, తనని కారులో తీసికెళ్ళారు. నిన్న, మా సొసైటీ లో ఒకతని కొడుకు పెళ్ళి రిసెప్షనూ, మా అబ్బాయి అడిగాడు, డాడీ, ఆ రిసెప్షన్ కి మా తరపున ఎటెండ్ అవకూడదా అని, నేను చెప్పానూ, నాయనా అతను కార్డిచ్చినప్పుడు, నీదీ, నీభార్యదీ మాత్రమే పేర్లు వ్రాశాడు, మమ్మల్ని ఎకౌంటులోకి తీసికోలేదూ, అందువలన నాకు వెళ్ళే కోరిక ఏమాత్రమూ లేదూ, అని చెప్పేశాను.తను కొద్దిగా ఫీలు అయినట్లనిపించింది. కానీ ఏం చెయ్యను, నాకు ఇలాటివాటిల్లో కొద్దిగా పట్టింపు ఉంది. It may look a bit silly for others. ఇలాటివన్నీ అనుభవం మీదే తెలుస్తాయి. మేము వరంగాం లో ఉంటున్నప్పుడు, మా కొలీగ్గొకడు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, మగ కొలీగ్గులని మాత్రమే పిలిచాడు. పొనీ మర్చిపోయాడా అందామా అంటే, ప్రత్యెకంగా మరీ చెప్పాడు- కొలీగ్గులని మాత్రమే పిలుస్తున్నానూ అని! ఈ కారణంగా ఎవరూ వెళ్ళలేదనుకోండి, అది వేరే విషయం. అలాగే ఇక్కడ పూణె లో పని చేస్తున్నప్పుడు ఇంకొకతనూ అలాగే, కొలీగ్గులనే పిలిచి, ప్రత్యేకంగా చెప్పాడు, ఇంటికొక్కరే అని!
అందుకే అంటాను, ఏ విషయమైనా, అనుభవం మీదే తెలుస్తుందీ అని. ఎవరో చెప్తే అంత పట్టించుకోరు. ఊరికే చెప్పొచ్చారూ పేద్ద, ఎవరో ఒకరి పేరు వ్రాస్తే సరిపోదా అని.అది పధ్ధతి కాదు, శ్రీమతి, శ్రీ ఫలానా ఎండ్ ఫామిలీ అని వ్రాస్తే, మీ సొమ్మేంపోయిందండీ, అలా వ్రాస్తే, ఏమైనా ఫామిలీ అంతా తీసికొచ్చేస్తారని భయమా, అలా తీసికొచ్చేవాడు, మీరు వ్రాసినా వ్రాయకపోయినా తీసికొస్తాడు.కానీ, అలా వ్రాయనప్పుడు మాత్రం, నాలాటి తిక్క శంకరయ్యలు పట్టించుకుంటారు! రేపెప్పుడో కనిపించి, మా రిసెప్షన్ కి ఎందుకు రాలేదూ అని అడిగితే, ఇదీ కారణం అని చెప్పే ధైర్యం ఉందా, అదీ లేదూ,ఏదో అతను ఈ బ్లాగులూ అవీ చదవడులే అని ధైర్యం! కారణం అతను మళయాళీ!!

శుభలేఖల్లో చూస్తూంటాము, క్రింద ఫలానా వారి అభినందనలతో అని, వాళ్ళ కుటుంబం లోని బంధువులందరి పేర్లూ వ్రాస్తూంటారు. ఎవరి పేరు వ్రాయకపోతే వారికే కోపం.ఎక్కడిదాకానో ఎందుకూ, మా ఇంట్లోనే, మా పెద్దన్నయ్య గారి పెళ్ళి అయినప్పుడు, శుభలేఖ, మా పెదనాన్నగారి పేరుమీద వేశారు, ఫలానా మా సోదరుడి కుమారుడు అని మా నాన్నగారి పేరు ఎలాగూ వేశారు, వచ్చిన గొడవల్లా, మా ఇంకో పెదనాన్నగారి పేరు రాలేదని ఆయనకి కోపం వచ్చింది! ఈ రోజుల్లో అసలు ఆ గొడవలే లేవు- ” బంధుమిత్రుల అభినందనలతో..” అని వ్రాసేస్తున్నారు!

చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా శుభకార్యాలకి ఆహ్వానం పంపేటప్పుడు వీలైనంతవరకూ ఇంటి పెద్ద పేరు వ్రాసేసి, ఎండ్ ఫామిలీ అని వ్రాసేస్తూండండి. ఇంకో విషయం ఈ కార్డులు ఇచ్చేటప్పుడు చూస్తూంటాము, ఎవడిదో పేరు కొట్టేసి, ఏ ఇంటికైతే వెళ్ళామో ఆఇంటాయన పేరు వ్రాసేయడం! ఇదో పరమ దౌర్భాగ్య పధ్ధతి.ఏదో టైము కలిసొస్తుంది కదా అని , ఎవరెవరికివ్వాలో వాళ్ళ పేర్లన్నీ వ్రాసేస్తారు, ఆ ఇంటికెళ్ళే సరికి, వాళ్ళ పేరున్న కార్డు ఛస్తే దొరకదు, దాంతో చేతికొచ్చిన కార్డు తీసి, దాని మీదున్న పేరు కొట్టేయడం. హాయిగా బ్లాంకు కార్డులు తీసికుని, ఎవరింటికైతే వెళ్ళేమో వారి పేర్లు వ్రాసి ఇవ్వడం మంచి పధ్ధతి. పైగా మనం పేరు వ్రాసే లోపులో, కాఫీయో, చాయో దొరికినా దొరకొచ్చు!. ఇలా బ్లాంకు కార్డులుంటే, ఎవరింటికో వెళ్ళినప్పుడు, ఏ తెలిసిన పెద్ద మనిషో ఉంటే ఆయన పేరుమీదా, ఓ కార్డిచ్చేయొచ్చు. ఇలాటివన్నీ మొహమ్మాటం పిలుపులే అనుకోండి. మేము ఈ గొడవలన్నీ దాటేశాము.భవిష్యత్తులో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఈ సలహానూ టపానూ !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- తిరుగు ప్రయాణం లో …

   విజయవాడ నుండి శనివారం సాయంత్రానికి బదులుగా, ప్రొద్దుటే తిరిగిరావడంతో, ఆ రోజు భోజనం ఎక్కడో తెలిసింది కాదు,ఆదివారం లంచ్ అయితే, ‘వారం’ చెప్పేసికున్నా.అందుకోసం, ఎస్.ఆర్ .నగర్/కల్యాణి నగర్ లో ఉంటున్న, మా మరదలి ఇంటికి ఫోను చేసి, ఆరోజుకి తిండి పెడుతుందో లేదో తెలిసికుని, ఆటో లో కాచిగూడా నుండి, అక్కడకు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా,వాళ్ళిల్లు పట్టుకోవడం నాకెప్పుడూ కన్ఫ్యూజనే!ఏదో మొత్తానికి, ఆటో వాడిని, తోటి ఆటో వాళ్ళని అడిగించి,చేరాను.ఆరోజు సుజాత గారికీ, రెహ్మానుకీ ఫోను చేశాను. మళ్ళీ ఆదివారం సంగతి మర్చిపోతే వామ్మొయ్.ఎందుకైనా మంచిదీ, వాళ్ళచెవినీ ఓ మాటేసి, వాళ్ళచేత ఓసారి confirm చేసేసికుంటే, ఓ గొడవొదిలిపోతుంది!

   మా డాక్టరు ఫ్రెండున్నారే ఆయనదీ ఇదే పాలసీ- వారు మా ఇంటికొచ్చినా, మేము వారింటికి వెళ్ళినా, భోజనాల ఏర్పాటు ఎక్కడో చెప్పమనెవారు!!-ఆదివారం ప్రొద్దుటే, పదకొండు గంటలకల్లా వాళ్ళింటికొచ్చేయమని వచ్చేయమని సుజాతా,
ఎటువంటి పరిస్థితుల్లోనూ తొమ్మిదిన్నర కల్లా, నేనుండే చోటుకి వచ్చి, నన్ను తీసికెళ్ళతానని రెహ్మానూ, మొత్తానికి అంచెలంచెలుగా, 10.45 కి బయలుదేరి 11.30 కి సుజాత గారుండే కొండాపూర్ చేరాము.అక్కడకి ఎలా వెళ్ళేమంటారా, ఓ పాయింటు నుంచి ఇంకో పాయింటు దాకా ఓ షేర్ ఆటో, మళ్ళీ అక్కడినుండి ఇంకో చోటకి ఇంకో ఆటో! ఆ పాయింట్ల పేర్లడక్కండి, నాకైతే గుర్తు లేవు.నాకు తెలిసినదల్లా, తీసికెళ్ళేవారు తెలిసినవారూ,వెళ్ళేవారు తెలిసినవారూ! మధ్యలో ఏమయితేనేమిటీ?

   ఈ షేర్ ఆటోల్లో నలుగురికి బదులుగా ఓ అరడజను మందిని కుక్కేస్తారు. వెనక్కాల ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళూ, ముందు డ్రైవరుకి భుజకీర్తుల్లా, చెరోవైపునా ఒక్కోళ్ళు!దారిలో ఏ ట్రాఫిక్కు పోలీసో కనిపించాడనుకోండి, మనవాడు, రోడ్డు పక్కగా ఆటో ఆపేసి, సీరియస్సు గా ఆ పక్కనే ఉన్న పోలీసులదగ్గరకి వెళ్ళి, ఏదో దక్షిణ ఇచ్చేసి, పైగా దానికో ప్రింటెడ్ రసీదోటి తెచ్చి, ఆటో ముందర అంటించేస్తాడు! ఒకసారి ఆ రసీదుని చూస్తే చాలుట, ఇంక ఆరోజంతా వీడు ఎంతమందినెక్కించికున్నా, ఎవడూ అడగడుట!mutually accepted and government approved system!! వహ్వా!

   సుజాత గారింటికి వెళ్ళేటప్పటికి అక్కడ వేణు ఉన్నారు. ఆయనకీ నాకూ పరిచయం,’తెలుగుబాట’ కార్యక్రమం లో,ఎటువంటి హడావిడీ లేకుండా, ఏ చానెల్ వాడితోనూ ‘బైట్లు’ తీసికోబడకుండా,మా దారిన మేమిద్దరమూ ‘తెలుగుతల్లి’ విగ్రహం నుంచి, జ్ఞానభూమి వరకూ పాదయాత్ర ( ఎవరి దగ్గరా లిఫ్ట్ తీసికోకుండా) చేసిన ఇద్దరు ప్రాణులం! అంతా బావుంది కానీ, ఒక్కటే లోటు అనిపించింది. ఆవిడ లంచ్ కి పిలిచారు కదా, ఓ పండో, స్వీటో తీసికెళ్ళాలని తట్టొద్దూ,వాళ్ళమ్మాయికి ఓ క్యాడ్బరీస్ తీసికెళ్ళాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, చేతులూపుకుంటూ వెళ్ళాము.అక్కడకి వాళ్ళేదో expect చేస్తారని కాదు,జస్ట్ ఏ సంప్రదాయం! అసలు రెహమాన్ననాలి దీనికంతకూ, ఓ పాయింటు నుంచి ఇంకో పాయింటు వరకూ షెర్ ఆటో కోసమే చూస్తాడా, లేక ఈ విషయమే గుర్తుచేస్తాడా? ఏదో అలా జరగాలని రాసిపెట్టుంది ,జరిగింది.But it left a bitter taste in my mouth. Sorry అమ్మా!

   ఇంక అక్కడ కబుర్లంటారా, అడక్కండి, ఎన్నెన్ని టాపిక్కులో! మధ్యలో ఆ బజ్జులోటీ.విసుగొచ్చేసి, దాంట్లోంచి బయటకొచ్చి, బ్లాగులే రాస్తామన్నారు. అనడం వరకే లెండి, సుజాతా, రెహమానూ ఇంకా ఆ ‘మాయ’ లోనే ఉన్నారు!ఇంతలో శ్రీనివాసు వచ్చారు. మళ్ళీ ఈ శ్రీనివాసెవరని అడక్కండి, ఆ ఇంటి యజమాని!!సుజాతా శ్రీనివాసుల గారాల పట్టి, వీళ్ళిద్దరికంటే యాక్టివ్! అసలు నాకూ వీళ్ళందరికీ సంబంధం ఏమిటండీ?ఏదో ఈ బ్లాగులద్వారా పరిచయం.వారందరితోనూ గడిపిన నాలుగైదు గంటలూ, వారందరూ చూపిన అభిమానమూ, గౌరవమూ, సుజాత వడ్డించిన -పప్పూ, వంకాయకూరా, పులిహారా,దప్పళమూ,గారె- వీరందరి మనస్సులాగ షడ్రసోపేతం గా ఉన్నాయి.It made my day.

   నాలుగున్నరయిన తరువాత, శ్రీనివాస్ తన కార్ లో బస్ స్టాప్ దగ్గర దింపగా, రెహమాన్ బస్సులో ఇద్దరికీ టిక్కెట్లు తీసి, ఆ కండక్టరుకి నన్ను కోఠీ దగ్గర దింపేయమని అప్పగింతలు పెట్టేయగా,ఎవరి టిక్కెట్టు వారిదగ్గరే ఉంచమని ఆ కండక్టరు చెప్పగా,మొత్తానికి, కోఠీ దగ్గర దిగేసి, ఆటోలో కాచిగూడా చేరాను క్షేమంగా! అక్కడితో అయిందా, సాయంత్రం ఆరింటికి రామూ దగ్గరనుండి ఫోనూ, ‘ఇంకో అయిదు నిముషాల్లో మీ ముందరుంటానూ..’అని. అలాగే అయిదునిముషాల్లో వచ్చేసి ప్రత్యక్షం అయారు.ఆయనతో ఓ గంటన్నర కబుర్లూ. వచ్చేటప్పుడు ఏం తెచ్చారో తెలుసా? ‘చింతకాయలు’,అదేమిటో వాటిని చూడగానే నేను గుర్తొచ్చానుట, పైగా పుల్ల పుల్లగా ఉండే యాపిల్సూ! నాకేమైనా వేవిళ్ళా ఏమిటీ ( రామూ మరీ సీరియస్సుగా తీసికోకూ, ఉత్తిత్తినే, ఇదంతా మీరందరూ ఇచ్చిన చనువే ! నెత్తికెక్కించుకుంటున్నారుగా భరించాలి మరి !).

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–తిన్న తిండరక్క చేసే పనులు…

Indian ExpressIndian Express2

ఈవేళ్టి Indian Express లో వచ్చిన ఒక వార్త, పైన నీలంరంగులో ఇచ్చాను. ఓ నొక్కు నొక్కితే చదవగలరు. ఒక విషయం అర్ధం కాదు. ఏదో ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి, జరిగిన సంఘటనికి బోల్డు కోపం తెచ్చేసికుని, ఆయనెవరో జనరల్ మేనెజర్ ని సస్పెండు చేసేశారుట. ఈ సి.ఎం.డి గారు రిటైరయిన తరువాత, ఈయన మొహం ఎవడైనా చూస్తాడంటారా? బ్రతికున్నన్ని రోజులూ అందరితోనూ సఖ్యతగా ఉండక, ఇదేం చిత్రమండి బాబూ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–‘ అతిరుద్ర మహాయజ్ఞం ‘

AthiRudraMahaYajnam_Schedule

అమెరికా లో ఉండే మా స్నేహితుడొకరు ఈ క్రింది మెయిల్ పంపారు.ఆసక్తి ఉన్న ప్రతీవారూ, ఈ కార్యక్రమాన్ని వీక్షించ ప్రార్ధన…ఆయన పంపిన మెయిలూ, బ్రోచరూ ఈ టపాతో జత పరుస్తున్నాను. ఆ కార్యక్రమం ఈవేళ సాయంత్రమే.ఇంటర్నెట్ ఎలాగూ ఉంది, ఆ కార్యక్రమేదో చూస్తే మనకీ పుణ్యమూ పురుషార్ధమూనూ, ఏమంటారు?

ఈ రోజు ముఖ్యంగా మీకు మెయిలు పంపించడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుడిలో రేపటినుంచి (అంటే ఇండియా టైమ్ బుధవారం సాయంత్రం నుంచి), ఆరు రోజుల పాటు “అతిరుద్ర మహాయజ్ఞం” చేస్తున్నారు. ఇంటర్నెట్లో ప్రత్యక్షప్రసారం (http://www.athirudram.us/live-webcast) కూడా ఏర్పాటు చేసారు. మీకు ఇలాటివి చాలా ఇష్టం కదా! అందుకే మీ చెవిలో ఒక మాటవేద్దాం అని రాస్తున్నాను. వీలైతే తప్పక చూడండి. మెయిలుతో పాటు బ్రోచర్ కూడా జతపరుస్తున్నాను. ఇక్కడి టైమ్ ఇండియాకంటే పన్నెండున్నర గంటలు వెనుక అని గమనించగలరు. క్రింది వెబ్ సైట్ లో ఈ కార్యక్రమ వివరాలు ఉన్నాయి....

http://www.athirudram.us/

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   భాగ్యనగరం లో తిరుగు ప్రయాణం లో జరిగిన విశేషాలు ఓ టపా వ్రాసి, దానికి అలంకారాలూ గట్రా చేసి, తీరా పోస్టు చేద్దామనుకుంటూంటే, అకస్మాత్తుగా కనెక్షన్ పోయింది! అయినా ఇలాటివి మామూలెగా, సేవ్ చేశానుకదా అని అనుకున్నంతసేపు పట్టలేదు, ‘అన్ని టపా’ ల్లోకీ వెళ్ళి చూస్తే, శీర్షిక ఒకటే మిగిలింది! రాసిన కంటెంటంతా గాయబ్ అయిపోయింది! ఏదో వ్రాసుకుంటూ పోతే, వ్రాసేయకలను కానీ, మళ్ళీ అదంతా గుర్తుపెట్టుకుని వ్రాయాలంటే కొంచెం కష్టమే!మళ్ళీ రేపు వ్రాయాలి
ఆరోజెప్పుడో, కాచిగూడాలో నవోదయా కి వెళ్ళానని చెప్పాను కదూ. అదేమిటో ఇలాటివన్నీ నాకళ్ళకే కనబడతాయి!1.. కి ఎదురుగా వ్రాశారు చూడండి..” తెలుగు వల్ల ఓరిగేదేమిటి..” అంటే అర్ధం ఏమిటి? ‘ఒరిగేదేమిటి’ అని వ్రాయడానికి బదులుగా ‘ఒ’ కి దీర్ఘం ఇచ్చారా లేక ‘ ఓరుగేది’ అనే పదమే సరైనదా?  కొద్దిగా చెప్పండి

   ఏదో  కబుర్లు చెప్తూంటే, ఎవరో అన్నారులెండి, ప్రయాణాలు చేసేటప్పుడు, హాయిగా ఇంటినుండే online లో టిక్కెట్టు బుక్ చేసికోవచ్చు కదా, ఊరికే హైరాణ పడి ఆ క్యూల్లో గంటల తరబడి వేచి ఉండఖ్ఖర్లేకుండా అని. అవునూ నిజమే,బ్యాంకు పనులు కూడా చేసికోవచ్చూ అనుకున్నాను. ఏం లేదులెండి, నాకు ఈ కంప్యూటరు నేర్చుకున్నప్పటినుండీ, స్టేషనుకి కానీ, బ్యాంకుకికానీ వెళ్ళలేదు. హాయిగా ఉంది.ఆఖరికి రిలయన్స్ సెల్ బిల్లులూ, డి.టి.ఎచ్, బ్రాడ్ బాండ్ బిల్లులూ ఆన్ లైన్ లోనే! అక్కడకేదో నేను Computer savvy అయిపోయానని కాదు.

   అవతలి వారెందుకు అలా చేయలేకపోతున్నారూ అంటే, వారికి Comfort zone మాన్యుఅల్ గా చేయిస్తేనేమో బాగుంటుందనేమో! ఎవరి కంఫర్ట్ లెవెల్ వారిదీ.అందరూ flight లో వెళ్తేనే, బాగుంటుందీ, టైమూ సేవ్ చేయొచ్చు, కంఫర్టబుల్ గా ఉంటుందీ అంటారు. నాకైతే ట్రైనులో వెళ్తేనే సుఖంగా ఉంటుంది. అది నా కంఫర్ట్ లెవెలూ!పైగా వెళ్ళిన ఒక్కసారీ దడా వణుకూనూ.ఎన్ని రోజులైనా సరే హాయిగా ట్రైన్లో వెళ్తే ఉండే సుఖం దేంట్లోనూ లేదనిపిస్తుంది. మావాళ్ళూ వదిలేశారు ‘నీ ఖర్మ’ అని.

హాయిగా కాళ్ళు మడత పెట్టుకుని సోఫాలో కూర్చోడం నాకిష్టం. మా ఇంటావిడ గయ్యిమంటుంది. ఏం చేస్తాను? ఏదొ ఇంటర్వ్యూకి కి కూర్చున్నట్లు, సిన్సియర్ గా ‘రాముడు మంచి బాలుడు’ లాగ కూర్చుంటాను, ఎక్కడికెళ్ళినా!భోజనం చేసి, చెయ్యి కడుక్కుని, ఏ లుంగీకో తుడిచేసికుంటే ఉండే ఆనందం,ఏదో ఫార్మాలిటీకి పెట్టిన న్యాప్కిన్ను తో తుడుచుకుంటే వస్తుందా? అవన్నీ ఇంటికి వచ్చేవాళ్ళకి. ఏమిటో అర్ధం చేసికోరూ, చెప్తే వినరూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- బాపట్ల -2

   ఆంధ్రదేశంలో అంతగా తిరిగింది లేదు. అలాగని మిగిలిన ప్రదేశాలన్నీ చూశానని కాదు. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికంటూ వెళ్తే, అక్కడ రిక్షాల్లోనూ, ఆటోల్లోనూ తిరగనైనా తిరగాలి, లేదా నడిచైనా తిరగాలి అని నా ఉద్దేశ్యం. ఎవరో కారుల్లో తీసికెళ్తే ఏం తెలుస్తుందీ? అయినా ఏదైనా ప్రదేశాన్ని గురించి వ్రాయడానికి, కనీసం రెండు మూడు రోజులైనా గడపందే ఏం తెలుస్తుందండీ?ఏదో పెళ్ళికి వెళ్ళానూ, పైగా ఎంతో దూరం (పూణె నుంచాయే) నుండి వచ్చానూ, ఎక్కడ శ్రమ పడిపోతానో, అని ఏ.సీ. రూమ్ముల్లో వసతీ, ఇంకేం తెలుస్తుందీ?

   మమ్మల్నుంచిన హొటల్, ఒక వారం క్రిందటే ప్రారంభించారుట.అందుచేత, దానిలోని లోటు పాట్లు అప్పుడే బయట పడలేదు! మహరాష్ట్ర గవర్నరు గా పనిచేసిన, కోన ప్రభాకర్రావుగారిదిట ఆ హొటల్.ఈ హోటల్ కి ఎదురుగానే ఓ ఓపెన్ యెయిర్ థియేటరోటీ,అది కూడా ఆయనదే.ఇంక ఊరుసంగతంటారా,మామూలుగా ఉండే యావరేజ్ పట్టణం లాగానే ఉంది. దుమ్మూ, ధూళీ,ఓ వరసా వావీ లేని ట్రాఫిక్కూ. రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపాలిటీ వారిచే, కొట్టేయబడిన మొండి గోడలూ, వాటి పక్కనే శుభ్రంగా ఉన్న షాప్పులూ, కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళు కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారుట! ఇంక అయినట్లే రోడ్డు వెడల్పు కార్యక్రమం !</b.

   బాపట్ల ప్రజలమీద రుద్ద బడిన పార్లమెంటు సభ్యురాలు,పనబాక లక్ష్మి, అక్కడావిడ కాదుట! ఆ ప్రాంతానికి చెందిన పురంధరేశ్వరిని విశాఖ పట్టణమో ఎక్కడకో పంపించేశారుట. ఏమిటో, ఈ రాజకీయాలూ అవీనూ.అదే రోజున కడప ఎన్నిక ఫలితాలొచ్చాయి. ఓ రెండు మూడు ఆటోల్లో ఓ పాతికమందిదాకా అరుచుకుంటూ, టపాకాయలు కాల్చుకుంటూ తిరగడం మాత్రం చూశాను.

   నెట్ లో చదవడం వలన, భావన్నారాయణ గుడి అంత ప్రాచీనమైనదని తెలిసింది. ప్రొద్దుటే 11.30 కి వెళ్తే, మూసేసుంది. అందువలన ప్రత్యేకంగా సాయంత్రం ఆరింటికి వెళ్ళి దర్శనం చేసికున్నాను.మామూలుగా నారాయణుడుండే చోట లక్ష్మీ దేవి ఉంటుందంటారు. ఏమిటో ఆ వైభవేమీ కనిపించలేదు, నా కళ్ళకి.The temple looked its age (1400 years). అంత పురాతనమైన దేవాలయం అక్కడ ఉండడం, అదృష్టంగా భావించి, ప్రభుత్వం వారుకూడా, ఓ చెయ్యేస్తే,బావుండేది. కానీ అలాటిదేమీ ఉన్నట్లు లేదు. తమిళనాడులో ఇన్నాళ్ళూ డి.ఎమ్.కే వారికి దేముడిమీద అంత నమ్మకం ఉండకపోయినా, దేవాలయాలన్నీ బాగానే మైన్టైన్ చేశారు. మీకెల్లా తెలిసిందీ అని అడక్కండి, 2004 లో నేనూ మా ఇంటావిడా టిటిడిసి వారి టూర్ లో ఓ వారం రోజులు తిరిగొచ్చాము.అప్పుడనిపించింది అలా !

   ఆ తరువాత తూ.గొ.జి లో ఉన్న చాలా ప్రాచీన దేవాలయాలు చూసే అవకాశం కలిగింది. అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే చాలా బాధేసింది.దేవాలయం ఎంత ప్రాచీనమైనదయితే అంత Poor maintainance. ఈమాత్రందానికి,దేవాదాయ శాఖలూ అవీ, మళ్ళీ వాటికి ఓ కమీషనరూ వగైరాలు ఎందుకో? ఏదో ప్రైవేటు మానెజ్మెంటు దేవాలయాలు,తప్ప మిగిలినవన్నిటి పరిస్థితీ అంతే. పోనీ దేముడూ, భక్తీ లేదంటారా, అబ్బే ఎక్కడ చూసినా దీక్షలూ, వ్రతాలూ, నోములే!కావలిసినంతమంది స్వాములూ,ఆశ్రమాలూనూ. మరి దేవాలయాలంటే అంత చిన్న చూపెందుకో మన ప్రభుత్వానికి? వాళ్ళని మాత్రం అని లాభం ఏమిటిలెండి?ఎవరి గొడవలో వాళ్ళు.ఒకరు తెలంగాణా అంటారు, ఇంకోరు సమైఖ్యాంధ్ర అంటారు. ఒకాయనేమో తొమ్మిదేళ్ళు పాలన చేసి, ఐ.టి. తప్పించి ఇంకేమీ లేదన్నారు. ఒక్కసారి గద్దె దింపెసరికి, రైతులూ వాళ్ళూ గుర్తొచ్చారు.

   పోనీ ఏ బస్సైనా ఎక్కి విజయవాడ వెళ్ళేనా అంటే అదీలేదు, తెలిసినవారితో ఝూమ్మని కారులో వెళ్ళానాయే.పోనీ ఓ రెండు మూడు రోజులుందామా, పనీ పాటూ లేదూ అనుకుంటే, నన్నెవడుంచుకుంటారు?పెళ్ళిళ్లల్లోనే, అప్పగింతలవగానే
బిచాణా కట్టేసికుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు.ఇంక నేనెంత?