బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–just give a thought…

    ఏ టపా అయినా మొదట్లోనే ..” మా చిన్నప్పుడు…” అని మొదలెడితే, చదివేవాళ్ళనుకుంటారు- “బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడురా బాబూ ఈయన జ్ఞానబోధలు..” అని. కానీ ఏ విషయమైనా ఇంకోదానితో పోల్చినప్పుడే కదా తెలిసేది లోటుపాట్లు. అందువలన, మరీ చిరాకు పడకుండా ఓసారి చదివేయండి. మీరే చెప్తారు- నిజమేనండీ.. అని. అందుకోసమే కదా పేపర్లవాళ్ళు చేసే సర్వేలూ అవీనూ. మనకి అంత స్థోమత లేదుకాబట్టి, ఎప్పుడో జరిగిన విషయాలు ఈనాటి వాటితో పోల్చడం అన్న మాట. ఏదో వ్రాసే ఓపికుంది కాబట్టి టపాల్లో పెట్టడం.

    ఇదివరకటి రోజుల్లో, పుస్తకాలు చదవడం ఎందుకు అలవాటయ్యేదీ అని ఒకసారి ఆలోచిస్తే, మీకే తెలుస్తుంది. అప్పుడు ఈ రోజుల్లోఉన్నన్ని మాధ్యమాలుండేవి కావు అనేదో కారణం. ఇంట్లో ఏదున్నా లేకపోయినా ఓ న్యూస్ పేపరోటి తెప్పించేవారు. ప్రతీ రోజూ అది చదవడం ఓ నియమం లా ఉండేది. సినిమా ఖబుర్లేనా తెలుస్తాయని, తప్పకుండా చదివేవారు.నేను చెప్పేది చిన్న పిల్లల గురించి ప్రస్తుతం. వయస్సొచ్చే కొద్దీ కిళ్ళీ కొట్లలో పది పైసలకీ, ఇరవై పైసలకీ అద్దెకు తెచ్చి, ఏ క్లాసు పుస్తకంలోనో దాచుకుని మరీ చదివేవారు. ఏదో ఒకటీ పుస్తకపఠనం అనేదానికి hook అయిపోయేవారు. పెద్దయ్యేకొద్దీ అదో వ్యసనంలా మారిపోయేది. వయస్సుతో వచ్చిన జ్ఞానం అనండి, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పగా అయితేనేమిటనండి, తెలుగు,ఇంగ్లీషు సాహిత్యాల్లో చాలా మంది చాలా పుస్తకాలు చదివారు. ఊరికే చదివేసూరుకోడం కాదు, అప్పుడు చదివిన పుస్తకాలు జీవితాంతం గుర్తుంటాయి. అది ఓ టెంపోరావు, కొమ్మూరి సాంబశివరావు, ఆరుద్ర వ్రాసిన డిటెక్టివ్ పుస్తకాలే కావొచ్చు, అలాటివి గుర్తుచేసికున్నప్పుడు వచ్చే ఆనందం ఎంత బావుంటుందీ?

    ఇంక ఈ రోజుల్లో అయితే, అసలు పేపర్ తెప్పించడమే ఓ నేరం అనే వాళ్ళనీ చూశాను. పైగా తెలుగు పేపరైతే అడక్కండి. ఇదివరకటి రోజుల్లా కాదుగా ఇప్పుడూ, అన్ని పేపర్లూ దేశం లోని చాలాచోట్ల దొరుకుతున్నాయి. అయినా తెలుగు పత్రిక తెప్పించుకోడం నామోషీగా భావించేవారినీ చూశాను. మా ఇంట్లో Times ఒకటే చదువుతామండీ, అక్కడికేదో Newyork Times, London Times లెవెల్లో చెప్తారు. పోనీ తెలుగు చదవడం రాదా అంటే అదీ లేదూ, ఇంగ్లీషు పేపరే తెప్పిస్తే అదో స్టేటస్ సింబలూ! పోనీ ఆ తెప్పించే పేపరేనా చదివే తీరికుంటుందా, అంటే అదీ లేదూ. వచ్చిన పేపరు వచ్చినట్టుగానే మడతైనా నలక్కుండా రద్దీ లోకి వెళ్ళిపోతుంది. అదీ కాకపోతే, ఏ బీరువాల్లోనో వేసికోడానికి ఉపయోగిస్తుంది. పేపరు చదవడం ఎంత వ్యసనం లాటిదంటే, చిన్నప్పుడు ఏ కొట్లోనైనా పొట్లాలు తెస్తే, సరుకు తీసేసిన తరువాత, ఆ పొట్లం పేపరు సాపు చేసి మరీ చదివెవారిని కూడా చూశాము.

    ఈరోజుల్లో ఎవరిని చూసినా బిజీ బిజీ.. ఎవరికీ టైముండదు. పిల్లలేమో వాళ్ళకి attention ఇవ్వడం లేదని గోలా. ఏదో ఒకటి చేసి, వాళ్ళని ఊరుకోపెట్టడం ఎలా మరి. అదిగో అక్కడే వచ్చేశాయి మన టి.వీ.లూ, సెల్ ఫోన్లూ, ఐపాడ్లూ అంతర్జాలాలూనూ. ఎంత చెప్పినా, మనం దేనికి అలవాటు చేస్తే దానికే addict అవుతారు పిల్లలు. ఏ పుస్తకమో,పేపరో చదవడం అలవాటు చేస్తే, మళ్ళీ అదేదో అర్ధం అవలేదని తల్లితండ్రుల్ని హోరెత్తించేస్తారు. వీళ్ళకా టైమే లేదు. So, ఓ రిమోట్ చేతికిచ్చేసి టి.వీ.ఎదురుగుండా కుదేస్తే సరిపోతుంది. ఆ పిల్లాడికి శలవొచ్చిందంటే, అక్కడే నిద్రా తిండీ అన్నీనూ. వాడి తప్పు మాత్రం ఏముందీ, అందులో చూపించినదే ప్రపంచం అనుకుంటాడు. ఆ కార్టూన్లు తప్పించి ఇంకో చానెల్ కి తిప్పడూ, తిప్పనీయడూ.

    So,bottomline is addiction . ఈమధ్యన ఈ ఊళ్ళోనే ఓ తెలుగు వారింటికి వెళ్తే, ఆవిడ చెప్పారు, నేను ఏదో మంచి సినిమా వచ్చినప్పుడు తప్ప టి.వీ చూడనూ అని. అంతే కాదు వారి అబ్బాయికి కర్ణాటక సంగీతం కూడా నేర్పిస్తున్నారుట.Hats off !! ప్రపంచంలో ఆంధ్రదేశానికి బయట ఇలాటివారుకూడా ఉన్నందుకు ఎంతో సంతోషమయింది.God bless you.

    ఈమధ్యన మా అబ్బాయికి ఓ మెయిలొచ్చింది. చదివే ఉంటారు “పుత్రోత్సాహం” అని. ఇక్కడ పూణే లో ఉన్న స్కూలు పిల్లలు వ్రాసిన కథలు, యతాతథంగా ప్రచురించి, ఓ పుస్తకం రిలీజ్ చేశాడు మా అబ్బాయి. ఆ విషయం నా బ్లాగులో చదివి,బంగళూరు నుండి, ఒకాయన, నాకు వెంటనే ఆ పుస్తకం పంపించండీ అని మెయిలు వ్రాశారు. నాకైతే ఎంత సంతోషమనిపించిందో. చెప్పొచ్చేదేమిటంటే, ఆ రిమోట్లు మానేసి, పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే, పిల్లలకీ వారి సృజనాత్మక శక్తి ఏమిటో తెలుస్తుంది. ఈవేళ ఓ చిన్న కథతో మొదలెట్టిన వారు భవిష్యత్తులో ఓ ఆర్ కే నారాయణ్, ఓ రస్కిన్ బాండ్, ఓ ముల్క్ రాజ్ ఆనంద్ గా అవొచ్చేమో. పోనీ ఏదో కారణాలవలన అవలేదూ అనుకుందాము, పెద్దయిన తరువాత, తను చిన్నప్పుడు వ్రాసిన ఓ కథ చూసుకుని, మారొచ్చేమో! దేనికైనా మనం కూడా ఓ platform ఏర్పరచాలి కదా! అసలు అలాటిదేదీ ఏర్పరచకుండా, మన సౌకర్యం కోసం పిల్లలకి రిమోట్లూ, సెల్లులూ కాకుండా, ఓ పుస్తకం చదవడం అలవాటు చేస్తే దాన్నే పట్టుకుని వేళ్ళాడతారు.

   బయటి దేశాల్లో మనవారు తెలుగుకి ఇవ్వవలసిన ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. వచ్చిన గొడవల్లా దేశంలోని వారితోనే. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు, కంప్యూటరులో తెలుగు వ్రాయడం నేర్చుకున్న కొత్తలో అన్నమాట కొత్త పెళ్ళికొడుకు పొద్దెరగడూ అన్నట్టు, తెలిసిన వాళ్ళందరికీ తెలుగులోనే మెయిల్స్ పంపుతూంటే ఒకావిడన్నారులెండి ” ఇంతా చేసి ..తెలుగులోనా వ్రాస్తున్నారూ..” అని అక్కడికేదో మేము చేయరాని పనేదో చేసినట్టు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం…

   ఏమిటో ఈమధ్యన నా మిస్టరీ షాపింగులతో బిజీ బిజీ.. అయిపోతున్నాను. క్రిందటి 15 రోజుల్లోనూ అయిదు చేశాను. పాపం వాళ్ళు కూడా ఇదివరకు చేసినవాటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుండబట్టి, నాకూ చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండడం లేదు. అదో కాలక్షేపం. ఈ మిస్టరీ షాపింగు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటే, నేను ఎప్లై చేయకపోయినా, వాళ్ళే ఓ ఫోను చేసి, ఎలాగోలాగ చేసేయండీ అంటున్నారు!

   ఆ సందర్భం లోనే మొన్నెప్పుడో ట్రావెల్ ఏజన్సీ ఎస్.ఓ.టి.సి కి నాలుగో సారి వెళ్ళవలసివచ్చింది. మర్నాడు ఫోను చేసి, అదేదో వీసా ప్రాసెసింగ్ సెంటర్ వి.ఎఫ్.సి కి వెళ్ళమన్నారు. నాదేం పోయిందీ, 500/- ఇస్తూంటే! అక్కడకెళ్ళి డుబై వెళ్ళడానికి వీసా ఫార్మాలిటీస్ కనుక్కోవాలిట. సరేఅనీక్కడకి వెళ్తే, వాడడిగిన మొదటి ప్రశ్న అసలెందుకు వెళ్ళాలనుకుంటున్నారూ అని. ఏం లేదూ ఓసారి దావూద్ ని చూసొద్దామనీ, లేకపోతే వాడికెందుకూ అసలు. తిన్న తిండరక్క వెళ్తున్నానూ, నా పాస్ పోర్టూ, నేనూ expire అయ్యేలోపల ఓ సారి దాంట్లో స్టాంప్ వేయించుకుంటే బాగుంటుందీ అందుకోసమనీ అనేటప్పటికి, వాడు నవ్వలేక నవ్వలేక తిప్పలు పడ్డాడు! ఇలా ఉంటాయి నా వ్యవహారాలు. ఏదో కావలిసిన సమాచారం ఇచ్చాడూ, వాటిని మా వాళ్ళకి పంపేశాను.ఏమైనా దుబై వెళ్ళానా పెట్టానా! అదో సరదా. ఇంకోళ్ళెవరో సగం సగం తెలిసిన మహాశయులు మనకి చేసే జ్ఞానబోధలు వినఖ్ఖర్లేకుండా, మనమే తెలిసికుంటే బావుంటుంది కదూ!

   ఇంతలో మళ్ళీ ఫోనూ-ESPRIT కి వెళ్ళమని. ఇప్పటికే ఊళ్ళో ఉన్న మూడు outlets చేశాను. ఈసారి ఇంకోటి మిగిలిపోయిందిట, అదేదో ఎమనోరా ( హడప్సర్) లో ఉంది.ఓ 2000/- దాకా ఖర్చుపెట్టుకోమన్నారు, ఇంక నాకు అదుపేముంటుందీ. ఏదో మా ఇంటావిడకి ఓ హ్యాండ్ బ్యాగ్ కొందామనుకున్నాను. ఇంతలో ఓ క్యాప్ కనిపించింది. పెట్టుకుని చూస్తే సరీగ్గా సరిపోయింది. పైగా అద్దం లో చూసుకుంటే, మొహం కూడా తమాషాగా కనిపించింది. పైగా అలాటిది ఎప్పటినుంచో తీసుకోవాలని ఓ కోరికోటీ.ఊరికే కూర్చుని అంతంత డబ్బులు తగలేయడానికి, మనకేమైనా ఇస్టేట్లున్నాయా ఏమిటీ?ఆ టోపీ ఖరీదు అక్షరాలా 1690/- రూపాయలు. ఎవరో ఇస్తున్నప్పుడు కొనుక్కోవడానికి ఏం రోగం? ఇంటావిడ బ్యాగ్ క్యాన్సిల్.. కానీ అది పెట్టుకున్న తరువాత మా వాళ్ళందరూ బాగానే ఉందన్నారు. ఫొటో పెట్టాను. మీరూ ఓ సారి చూడండి!. కానీ తిడితే మాత్రం ఊరుకోను!

   అక్కడకి దగ్గరలోనే ఉన్నారు కదా అని మా టెండర్ లీవ్స్ మెంబరు ఓ తెలుగావిడని పోనీ కలుద్దామా అనుకుని ఫోను చేశాను. చెప్పానుగా నా సెల్ లో ఏదో ఫోను నెంబరు నోట్ చేసికుని, ఏదో పేరు వ్రాసేసికుంటాను. పేరు తప్పూ అని కలిసిన తరువాతే కదా తెలిసేదీ. ఇప్పుడూ అంతే! ఫోను చేసి మీరు ఫలానాఏనా అన్నాను. మీరు మా గ్రంధాలయంలో మెంబరు కదా అన్నాను. అంతా రైటేనండీ కానీ నా పేరు ఫలానా లక్ష్మి కాదూ, ఇంకో లక్ష్మీ అన్నారు. ఏ లక్ష్మైతేనేమిటీ, ఓసారి మిమ్మల్ని కలుస్తానూ అభ్యంతరం లేకపోతే అన్నాను. పాపం ఆవిడమాత్రం ఏం చేస్తారూ, నెత్తిమీద కూర్చుంటే, ఏదో ఒకటీ అనుకుని వాళ్ళింటికి చేరాను. ఓసారి పరిచయం అవ్వాలే కానీ, కబుర్లకేమిటి లోటూ? పాపం ఆవిడకి బోరుకొట్టేసుంటుంది. ఏం చెయ్యను చెప్పండి, మాట్లాడడం మొదలెడితే హద్దూ అదుపూ ఉండదు! ఓ ప్లేట్ లో బాలుషాహి, మినపసున్నుండా ఇచ్చారు. మరీ అన్నీ తినేస్తే బావుండదని ( అప్పటికి చచ్చే ఆకలేస్తోంది), మొహమ్మాటానికి ఓ మినపసున్నుండ , మరీ నోట్లో కుక్కేస్తే బాగుండదని, సుతారంగా ముక్కలు చేసికుని మరీ తినడం మొదలెట్టాను. పాపం వాళ్ళ సోఫా నిండా ఆ పొడి పడుంటుంది! చీమలు పడితే నన్ను తిట్టుకుంటారు! ఇప్పుడు నేర్చుకున్నదేమిటంటే, ఎవరైనా మినపసున్ని లాటిది పెడితే, ఓ ప్లేటులో విడిగా వేసికుని తింటే, వీధిన పడమూ అని! అదండీ విషయం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    అదేమిటో, అందరి భాషలో చెప్పాలంటే నాకు కొన్ని idiosyncrasy లు ఉన్నాయి. చిన్నప్పటినుంచీ, ప్రముఖుల దగ్గర ఆటోగ్రాఫులు తీసికోడం, వారికి ఉత్తరాలు వ్రాసి జవాబు సంపాదించడం వగైరా వగైరా… కొంతమంది అంటారూ, వాటిలో అంత సంతోషించేయవలసిన విషయం ఏముందీ, అదేమైనా తిండెడుతుందా, గూడిస్తుందా అని. కొంతమంది, నాలాటి “పిచ్చి” ఉన్నవారైతే, ఆహా ఓహో అంటారు.ఏదిఏమైనా ఉన్నదేదో చెప్పేసికుంటే హాయీ.. ఎవడిపిచ్చివాడికానందం. కొంతమంది stamps, కొంతమంది coins ఇలా ఎందరికో వివిధరకాలైన హాబీలుంటాయి. అవతలివాడికి కష్టం తెప్పించకుండా, ఎవరిక్కావలిసినవి వాళ్ళు చేసికుంటే వీళ్ళందరిదీ ఏం పోయిందిట?

    అలాటివే నాకు ఉన్నాయి. అదేమిటో, నాకు హాకీ అంటే చాలా ఇష్టం. అలాగని ఎప్పుడైనా ఆడేనా అంటే అదీ లేదు. నేను చెప్పేది 28 సంవత్సరాలపాటు, మన దేశానికి ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం వచ్చిందీ అంటే, ఈ హాకీ చలవే. ఈరోజుల్లో ఆ క్రికెట్ తో పోలిస్తే, పాపం మిగిలినవాళ్ళకి వచ్చేది “చిల్లర” ఖర్చులకి కూడా సరిపోదు. అది మనవాళ్ళు చేసికున్న దౌర్భాగ్యం. 70 నిముషాల్లో, మెరుపుతీగల్లా పరిగెడుతూ ఆడతారే అదీ గేమ్ అంటే! అంతేకానీ, సహజ కవచకుండలాల్లా హెల్మెట్లూ అవీ పెట్టుకుని ఆడే ఆటా ఓ ఆటేనా? చెప్పాలంటే మన జాతీయ క్రీడ హాకీ, కానీ దానికివ్వవలసిన ప్రోత్సాహం ఎవ్వరూ ఇవ్వరు. ఏదో ఆ షారూఖ్ ఖాన్ ధర్మమా అని, అప్పుడెప్పుడో చక్ దే ఇండియా లాటి సినిమా తీశారు. యాడ్లు చూడండి, ఆ క్రికెటర్స్ తప్ప ఇంకోళ్లెవరైనా ఇంకోళ్ళని చూస్తామా? ఎక్కడ చూసినా క్రికెట్..క్రికెట్…

    ఈవేళ మా కోడలు తరపు చుట్టాలు వస్తే, మా ఇంటికి లంచ్ కి వెళ్ళాము . తిరిగి వచేటప్పుడు, ఓ ఆటో ఎక్కాము.మాటల్లో ఆ ఆటో అతను , “मै निमाल का बॅटा हूं” అన్నాడు.In fact,he did’nt expect any reaction from me . కానీ ఆ పేరు వినగానే ఆటో ఆపుచేయించి, అతనికి షేక్ హ్యాండిచ్చేసరికి అతను ఆశ్ఛర్యపడ్డాడు. కారణం మన భారతదేశానికి వరసగా 28 ఏళ్ళు స్వర్ణ పతకం సంపాదించిన మన భారత హాకీ టీం అంటే, నాకు చాలా అభిమానమూ, గౌరవమూనూ. ఈ నిమాల్ అనే ఆయన, 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో మన జట్టుకి ఆడారు. ఒక్కసారిగా అలాటి తండ్రికి పుట్టిన కొడుకుని కలిసేసరికి నాకూ చాలా ఆనందం అయింది.

    మమ్మల్ని మేముండే ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతుంటే, మేమే చాయ్ తాగి వెళ్ళమన్నాము. ఓ గంట సేపు కబుర్లు చెప్పాడు. తన తండ్రి గురించి చెప్తూ ఎంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. ఆ కళ్ళల్లో ఓ మెరుపు చూశాము. వెళ్తూ వెళ్తూ మా ఇద్దరి కాళ్ళకీ దండం పెట్టి మరీ వెళ్ళాడు. ఏదో కాళ్ళకి దండం పెట్టాడు కదా అని ఈ టపా వ్రాయలేదు, తన తండ్రి పేరు చెప్పగానే, ఇప్పటికీ స్పందించే మనుష్యులున్నారని తెలిసి, ఆనందం పట్టలేక, అలా దండం పెట్టి వెళ్ళాడు.
మాకూ చాలా సంతోషమయింది. సాయంత్రం మా అబ్బాయీ,కోడలూ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాము. తనుకూడా చాలా సంతోషించాడు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఎప్పుడేం తిక్కొస్తుందో తెలియదు…

    ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా గ్యాస్ బుక్ చేసికోవాలంటే, ఓ ఫోను చేస్తే సరిపోయేది, మన నెంబరిస్తూ. ఫోను ఖర్చెందుకూ మళ్ళీ అనుకుంటే, ఏ బజార్లోకెళ్ళినపుడైనా, వాడికి మన నెంబరు చెప్తే, వాడేదో కార్డు తీసి దాన్ని కన్ఫర్మ్ చేసికుని ఏ వారానికో, పక్షానికో వస్తుందనేవాడూ, వాళ్ళకి ఎప్పుడు బుధ్ధి పుడితే అప్పుడొచ్చేసేది, మనఖర్మకాలి, ఆ గ్యాస్ వాడొచ్చినప్పుడు, మన ఇల్లు తాళం పెట్టుందా, మళ్ళీ చెప్పుకోడం. ఏదో ఒకటీ పనైపోయేది. ఇప్పుడు అన్నీ online వ్యవహారాలాయే. ఉద్దేశ్యాలు మంచివే కాదనం. కానీ, మనదేశం లో నూటికి యాభై మందికి చదువూ సంధ్యా, రాదుకదా అలాటివారందరినీ శ్రమపెట్టడం లో ఉన్న ప్రభుత్వం వారి “ పైశాచికానందం” ఏమిటో అర్ధం కాదు.

    నాది Indane Gas లెండి. అప్పటికీ మా అమ్మాయి చెప్పనే చెప్పింది, డాడీ కొట్టుకెళ్ళి బుక్ చేసికోడం ఆపేశారూ, అంతా online లోనే అని, ఏవో నెంబర్లిచ్చింది. ఏమిటో వీటి మీద నాకు అంత నమ్మకం లేదు. ఏదో ఫోను చేస్తాం. ఒకటి నొక్కూ, రెండు నొక్కూ, ఇంకోటేదో.. నొక్కూ ఏమీ కాకపోతే, వాడి పీక నొక్కూ..అంటూంటారే కానీ, గ్యాసొస్తుందో లేదో తెలియదు. ఇలా కాదని మా ఏజన్సీ కి వెళ్ళాను. అక్కడున్న పిల్ల బుక్ చేయదే, online లోనే చేయాలంటుంది. అదేమిటో నాకు తెలిసి చావదూ, ఆ పనేదో నువ్వే చేయమనడంతో, ఏదో పెద్దవాణ్ణని జాలిపడి, ఆ online booking నా సెల్ తీసికుని చేసిపెట్టింది. మరి రాకపోతే ఏం చేయాలీ అన్నాను. దానికో పేద్ద లెక్చరిచ్చేసింది. “మీరు బుక్ చేయగానే, మా సిస్టం లో వచ్చేస్తుందీ, రెండు మూడు రోజుల్లో సిలిండర్ వచ్చేస్తుందీ, వగైరా వగైరా.. అహ అలా కాదూ, సిలిండర్ రాకపోతే గతేమిటీ అన్నాను. అసలా ఛాన్సే లేదూ అంటూండగానే, ఓ ఫోనొచ్చింది– ఆయనెవడో పాపం వారంరోజులై బుక్ చేశాడుట, ఇంకా రాలేదూ.. అని! ఈ పిల్లేమో అవి నొక్కీ, ఇవి నొక్కీ మా సిస్టం లో లేదూ అని చెప్పింది. తిరిగి ఆయన నెంబరు పుచ్చుకుని, మూణ్ణాలుగు రోజుల్లో వస్తుందీ అని “ఆశ్వాసన్” ( assurance) ఇచ్చేసింది. మరి ఇప్పుడేం అంటావమ్మా అని అడిగితే, అబ్బే అప్పుడప్పుడు జరుగుతూంటాయీ ఇలాటివీ, మీరుకూడా complaint చేయొచ్చూ, గ్యాస్ రాపోతేనూ, మరి ఈమాత్రం దానికి ఈ online booking లూ హడావిడంతా ఎందుకో? సిటీల్లో పరవాలేదు, చిన్న చిన్న ఊళ్ళల్లో ఇలాటివి ఉంటే ఎంత కష్టమో కదా. అసలే గ్యాస్సు రాకా ప్రాణం పోకాభగవంతుడిక్కూడా తెలియదు, మళ్ళీ ఈ గోలోటా !!!

    ఇదివరకటి రోజుల్లో డబ్బులు దాచుకోవాలంటే పోస్టాఫీసులూ, cooperative bank లే గతి. కాలక్రమేణా, ప్రభుత్వ బాంకులూ, తరువాత్తరువాత Private Sector Bank లూ వచ్చాయి. ఆ పోస్టాఫీసు వాళ్ళకి, సంతకంలో ఏ మాత్రం తేడా వచ్చినా, డబ్బిచ్చేవారు కాదు! దానితో ఆ పోస్టాఫీసుల్లో దాచుకోడం తగ్గింది. ఈ బ్యాంకులోళ్ళు, సంతకం ఎలా తగలడినా, మరీ ఇబ్బంది పెట్టరు ఏ outstation cheque ఇచ్చినప్పుడో తప్ప. వాటికీ ఏవో online transfers మొదలెట్టి మన పని సులభం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. ఏదో ఊళ్ళోనే ఉండేవాడికి , ఎప్పుడో ఒకప్పుడు cheque ఇవ్వాల్సిన అవసరం రావొచ్చుగా, కారణం అందరూ వాళ్ళ account number ఇవ్వడానికి ఇష్ట పడరు, వాళ్ళ సొమ్మేదో దోచేస్తామని భయపడి, అలాటివాళ్ళూ తారసపడ్డారు లెండి నాకు. అయినా వాళ్ళ సొమ్మెందుకండి బాబూ, ఏదో ఇంకో ఊళ్ళో ఉంటున్నారుకదా, హాయిగా ఏదో money transfer చేసేస్తే ఓ గొడవొదుల్తుంది కదా అని account number అడిగితే, ఛస్తే ఇవ్వరు. వాళ్ళ సరదా వారిదీ! పైగా నా principle అండీ అని ఓ జ్ఞానబోధోటీ !

    ఇప్పుడు ఈ చెక్కుల విషయం కదా నేను చెప్తున్నదీ, ఇన్నాళ్ళూ ఎవరికైనా ఓ చెక్కివ్వాలంటే, ఎవరికైతే ఇస్తామో వారి పేరు పొడి అక్షరాలతో ( ఉదాహరణకి భమిడిపాటి ఫణిబాబు ని బి.ఫణిబాబు) రాస్తే సరిపోయేది. ఇప్పుడు ఈ బ్యాంకుల్లో ఎవడికేం తిక్క రేగిందో, పూర్తిపేరు వ్రాయకపోతే, ఆ cheque ని honour చేయకపోగా, అవేవో ఛార్జీలు కూడా వేస్తారుట! పోనీ ఈ విషయాలేమైనా అందరికీ చెప్తారా అంటే అదీ లేదూ. మనం ఇచ్చిన చెక్ accept అవనప్పుడు మాత్రమే తెలుస్తుంది! ఈ గొడవేమిటిరా బాబూ అని అడిగితే అంతా system security కోసం అని జవాబూ! మనవాళ్ళ సంగతెలా ఉన్నా, ఉత్తర హిందుస్థానం లో అందరి పేర్లూ ఓలాగే ఉంటాయి- శర్మ, సక్సేనా, దీక్షిత్, వగైరా వగైరా- పైగా వాటి ముందర AKSharma, AKSaxena అని రాస్తే వాడు ఆనంద కుమారో, అజిత్ కుమారో తెలిస్సి చావదు. సరేనండీ, కానీ మన దక్షిణభారత పేర్లు, మరీ ప్రవరతో సహా రాయాలంటే, ఆ చెక్కు మీదుండే space సరిపోతుందా అసలూ?వీరవెంకటవరాహసుబ్రహ్మణ్యమార్కండేయదత్తాత్రయదీక్షితులూ, పైగా వాటికి ఓ ఇంటిపేరోటీ తగిలించి చూడండి, ఆ దిక్కుమాలిన చెక్కుమీద రాయగలరేమో!

    కొత్తగా ఓ రూల్ పెడుతున్నప్పుడు అన్నీ ఆలోచించాలనే జ్ఞానం అసలు వీళ్ళకెందుకుండదో అర్ధం అవదు. ఎవడికో ఓ దౌర్భాగ్యపు ఐడియా వస్తుందీ, జనాలెలాపోతే వాళ్ళకెందుకూ మన చేతిలో అధికారం ఉంది బస్ !

    ఈ గొడవంతా ఎందుకు వ్రాశానంటే, మా అబ్బాయి, మా టెండర్ లీవ్స్ గ్రంధాలయానికి ఓ ఫ్లాట్ అద్దెకు తీసికున్నాడు. వాళ్ళకి అద్దెఇవ్వొద్దూ ప్రతీనెలానూ, ఏణ్ణర్ధం నుంచీ ఏ గొడవా లేకుండా, ఏదో ఆ ఇంటాయన పేరు మలయాళీ లెండి, ఇనీషియల్స్ పెట్టి వ్రాసిచ్చేవాడు చెక్కు. ఈసారీ అలాగే ఇస్తే, ఠాట్ కుదరదూ అన్నారుట, Union Bank వాళ్ళు. ఏమిటీ అని ఈయన వెళ్ళి అడిగితే ఇదీ విషయం అని చెప్పారు.ఆయన వచ్చి చెప్పారు పూర్తిపేరు, మనవాళ్ళవైతే గుర్తైనా ఉంటుంది, వీళ్ళవి ఊరుపేరూ, తండ్రి పేరూ, ఇంకోరెవరిదో పేరూ, కొల్లేరు చాతాడంత ఉంటుంది. పైగా వ్రాసేటప్పుడు spelling mistakes వస్తే అదో తంటా! గోడ మీద వ్రాసుకుని కూర్చోవాలి. ఏమిటో జీవితం…. నా బాధ భరించలేక BSNL వాళ్ళు నాకు landline ఇచ్చేశారోచ్....

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమైనా ఉపయోగిస్తుందేమో చూసుకోండి…

నాతో వచ్చిన గొడవేమిటంటే, నాకు ఏదైనా విషయం తెలిస్తే, ఎవరో ఒకరికి ఉపయోగపడొచ్చేమో అని బ్లాగులో పెడుతూంటాను. అలాగే ఈవేళ నాకు ఒక మెయిల్ వచ్చింది. ఎంత విమానాల్లోనూ, కార్లలోనూ ప్రయాణాలు చేసినా, నాలాటి ” ఆంఆద్మీలు” కూడా ఉంటూంటారు. బయటి దేశాల మాటేమిటో నాకైతే తెలియదు, మన దేశంలో రైలు ప్రయాణాల్లో అనేక కష్టాలు చూసినవారు, అనుభవించినవారు, చాలా మందే ఉండొచ్చు. అదిగో అల్లాటివారి ఉపయోగార్ధం అన్నమాట కింద ఇచ్చిన మెయిల్ వివరాలు. ఉపయోగిస్తే చూసుకోండి, లేకపోతే ఈయనకేమీ పనిలేదూ అనూరుకోండి…అంతేకానీ, తిట్టడం మాత్రం తిట్టకండి…..

Nice thing if it works – We can try atleast at times of Need !

*Incident 1 ***
It happened few months back. We were travelling and I and my family were
waiting in the A/C waiting room at Secunderabad Station. The attached
bathroom was not clean and was giving bad smell. Added to this
dicomfort, the bathroom door was not closing tight , and I also observed
that shutter was not closing tight because of faulty door
closer. I complained to the attendant .
I also sent an SMS ” The bathroom of A/C waiting room on platform No 1 of
Secunderbad Station is dirty and stinking. Pl arrange cleaning . Also the
the door is not closing properly”. After few minutes we left the waiting
room as our train arrival was announced. Within few minutes I received text
reply from Railways, givinng an Id No and that action will be taken .
After few hours I received a message that the bathroom has been cleaned .
After ten days I received another message that the faulty door has been
repaired and thanking me.
*Incident 2 ***
Recently on 24 th October I and my wife were travelling by Hyderabd Ajmeer
Express on our Rajasthan trip. Next day morning , I noticed there was no
water in the bathroom and the taps are all dry, wheras our journey will
continue and we will be reaching our destination ( Bhilwara near Ajmeer)
after another 18 hours. I was worried that it is going to be a miserable
time to travel without water. Water or No water, people will continue to
use the bathrooms and the stink will become unbearable. I complained to
the Conductor. I also sent a SMS “Travelling in the A1 compartment of
Hyderabad Ajmeer express train No 12720. No water in the bathrooms . Pl
arrange. Also replace leaking valves else problem repeats.” Pat came the
reply” Your reference id is 1110250019. For status visit
http://www.scr.indianrailways.in . or SMS as STATUS TO 8121281212 .
Thanks for registering complaint ” . After about 20 minutes I received
message that water will be filled at the nearest Railway station having
water filling facility. At Itarsi station water was filled and we had no
problem . After about a week I received another message that the faulty
valves have been replaced . It was amazing.
I am thankful to the Railway authorities for introducing a system where one
can complain from a running train and doubly grateful that they
have acknowledged the complaint and attended.
I collected this help line number from the Railway waiting room !
Many times while travelling by train, we are put to
unexpected inconvenience , we react by cursing and criticizing. No other
response. Of course, once we reach our destination we just forget.
There is no use in cursing the darkness around you, do light a candle
however small it be, it gives an inspiration and ten more candles will be
lit . The process continues reducing the darkness.
The Railway Number to which you can SMS is 8121281212 . Please pass on
this message to your friends and it may help some one in need including
you .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- టైములో పన్లు చేయడానికి రోగమా….

    అందరికీ ఉండే రోగమే ఇది! కొంతమంది చెప్పుకోడానికి సిగ్గూ, మొహమ్మాటం పడతారూ, ఇదిగో నాలాటివాళ్ళు వీధిన పడతారు! ఏ పనైనా సరే టైముకే చేయడం వలన చాలా చికాకులు తగ్గుతాయి. పాపం అప్పటికీ ఇంటావిడ గుర్తుచేస్తూనే ఉంటుంది. అయినా సరే, అక్కడకి మనమే తెలివైనవాళ్ళం అనుకుని, వాయిదా వేస్తూంటాం. ఎప్పటికప్పుడు అనుకుంటాము, ఈ సారి ఆవిడచేత చెప్పించుకోకుండా సరైన టైములో చేసేయాలీ అని. అబ్బే, అది క్షణికం. పురిటి,శ్మశాన వైరాగ్యాల్లాటివి.रात गयी बात गयी !! మళ్ళీ ఎప్పుడో మొదలూ. జీవితం సాగుతూనే ఉంటుంది. అయినా బుధ్ధి మాత్రం ఛస్తే రాదు. దాని గురించే ఈ టపా.

    అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను. మా ఇంట్లో BSNL వాళ్ళ ఓ WLL ఉందిలెండి. మాకిటికీ పక్కనే వాళ టవర్ ఉన్నా సరే, దానికి సిగ్నల్ దొరికి చావదు. అలంకారార్ధం గంధం సమర్పయామి లా దాన్నీ, BSNL వాళ్ళనీ మాత్రం పోషిస్తున్నాను. మా ఇంటావిడ ప్రతీ నెలలోనూ గుర్తు చేస్తూనే ఉంటుంది, ఆ దిక్కుమాలిన ఫోను ఇచ్చేసి landline తీసికోండి మహప్రభో అని. వినొచ్చుగా, అబ్బే, చూద్దాంలెద్దూ అనేయడం. ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు, బస్సెక్కితే పావుగంట. అయినా నేను ఏదో ప్రతీ రోజూ చాలా బిజీగా ఉన్నట్టు పోజెట్టేసి, వాయిదా వేయడం. ఈవిడ మాత్రం ఏ “నెలా తప్పకుండా”, ప్రతీ నెలా చాలా రెలిజియస్సు గా చెప్తూనే ఉంటుంది.

    అసలు గొడవంతా ఎక్కడొస్తుందంటే ఆవిడ సెల్ లో డబ్బులెస్తున్నప్పుడు. అందరిదగ్గరా landline లు ఉన్నాయి. పోనీ, వాళ్ళిచ్చే ఫ్రీ కాల్స్ లోనే కాలక్షేపం చేస్తానూ, మీకూ అస్తమానూ నా సెల్ లో డబ్బులేయఖ్ఖర్లేదూ,అని నా మంచికే చెప్తుంది. అది తెలుసండి బాబూ, కానీ ఏం చేస్తాం, ఆ బుధ్ధుందే, అది సరీగ్గా ఉండదు కదా. ఈసారీ అలాగే అయింది.మొత్తానికి వాణ్ణి అడిగితే, ముందుగా ఆ lineman చేత చివాట్లూ, మీకెన్ని నెలలనుంచి చెప్తున్నానూ, ఎప్లికేషన్ ఇవ్వండి, రెండో రోజుకి మీ ఇంట్లో landline, నాలుగో రోజుకి Broadband పెడతాననీ ( హిందీ మరాఠీ భాషల్లో!). ఏమిటో రోజు బావుండకపోతే, ఇలాగే ఉంటుంది. అయినా ఛాన్స్ దొరికినప్పుడు, దేవుణ్ణీ, రోజునీ తిట్టేస్తే సరిపోతుంది. అంతేకానీ, సరైనటైములో చేయాలని బుధ్ధి మాత్రం రాదు! పుర్రె తో వచ్చిన బుధ్ధి పుడకలతోనే వెళ్తుందంటారు !

    స్వంత ఇల్లు అయితే ఓ రేషన్ కార్డూ, పాస్ పోర్టూ మన ఎడ్రస్ ప్రూఫ్ గా సరిపోతాయి. కానీ ఉండేది అద్దింట్లో కదా మరి. అప్పటికీ, అద్దెకొచ్చిన మొదట్లో, ఓ lease agreement వ్రాసుకున్నాము, ఏదో గాస్ కనెక్షన్ కీ,టెలిఫోన్ కనెక్షన్ కీ అవసరం అవుతాయి కదా అని. అప్పటినుంచీ దాని ఒరిజినల్ కూడా మా ఓనర్ కి ఇవ్వకుండా, పని కానిచ్చేశాను. దాని photocopy తీసికుని, ఓ ఫొటో పెట్టి, ఆ ఎప్లికేషనేదో ఇచ్చేస్తే రెండు రోజుల్లో కనెక్షన్ ఇచ్చేస్తానన్నాడు కదా అక్కడకి బయలుదేరాను. అక్కడుండే వాడితో కబుర్లు చెప్పి, నా ఎప్లికేషన్ ఇచ్చాను. అదీ ఇదీ చెక్ చేసి, నా photocopy చూసి, ఠాఠ్ ఇది చెల్లదూ అన్నాడు. ఇదేమిట్రా అంటే, దానికి “కాలదోషం” పట్టేసిందిట. నిజమే కదూ ఈ lease agreement ల ఆయుద్దాయం 11 నెలలు మాత్రమే! వాడితో మళ్ళీ దెబ్బలాటా, మా ఓనర్ కే అంత పట్టింపు లేకపోతే, అసలు నీకెందుకూ అని. ఔను నాకు పట్టింపే, కనెక్షన్ కావాలంటే, ఈవేళ్టి రోజున ఇదీ నా ఎడ్రస్ ప్రూఫూ అని ఓ కాయితం తీసికురా. Thats final అన్నాడు. అప్పటికీ నా ఈ ఎడ్రసుకి వచ్చే, WLL బిల్లు చూపించాను. కుదరదూ, దాన్ని ఒప్పుకోమూ అనేసి పంపేశాడు.

    రెండేళ్ళనుండీ మొత్తుకుంటోంది మా ఇంటావిడ, ఫోను తీసికోండీ అని. అప్పుడే తీసుకుంటే, నాదగ్గరున్న ఫొటో కాపీతో పని కానిచ్చేసేవాడిని కదా. చెప్పానుగా, తిన్న తిండరక్కా!
ఆ మాత్రం నా ఎప్లికేషన్ తీసికోవచ్చుగా అని ఆ BSNL వాళ్ళమీద ఎగిరితే లాభం ఏమిటీ? వాళ్ళ రూల్స్ వాళ్ళవీ. అసలు మనకే బుధ్ధంటూ ఉంటే ఇంత గొడవే జరిగేది కాదు కదా. మా ఓనర్ గారి దగ్గరకు వెళ్ళి, కొత్త ఎగ్రీమెంటు తయారుచేయమని చెప్తే, సాయంత్రం రెడీ చేసి ఉంచుతానన్నారు.

    ఇలాగే టైముకి రెన్యూ చేయవలసినవి ఈ రోజుల్లో చాలానే ఉంటాయి. గాడీల కీ, ఇళ్ళకీ, మన బతుకులకీ ఇన్యూరెన్స్ అనోటి తగలడిందిగా. వాటిని ముందర చేసేయడం అయితేచేసేస్తాం, సమయానికి రెన్యూ చేయడానికే బధ్ధకం! అప్పటికీ , ఆ కంపెనీ వాళ్ళు రిమైండర్లు పంపుతూనే ఉంటారు. అయినా మనకి గుర్తుండి చావదు. ఎప్పుడో ఏ కారో, టు వీలరో చోరీ అయినప్పుడు, మొట్టమొదట గుర్తొచ్చేది, ఆ ఇన్స్యూరెన్సే! తీరా చూస్తే, దాని“ప్రాణం” కాస్తా గుటుక్కుమని రెండో మూడో “మాసికాలు” కూడా అయ్యాయి. శ్రీమద్రమాణగోవిందో హరీ అని తూర్పుకి తిరిగి దండం పెట్టడమే!
ఆతావేతా చెప్పేదేమిటంటే, సరైన టైములో చేస్తూండండి. లేకపోతే ఇదిగో ఇలాగే జరుగుతాయి. ఇంట్లోవాళ్ళు చెప్పింది అప్పుడప్పుడు వింటూండొచ్చు….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–time management

    ఈ టపా శీర్షిక చూసి, ఏదో జ్ఞానబోధ చేస్తున్నానేమో అనుకుని అపోహ పడకండి. ప్రతీ రోజూ నేను చూసేవీ, ఏమీ చేయలేక ఇదిగో ఇలా ఊరిమీద పడ్డాను. ఇదివరకటి రోజుల్లో అదేమిటో టైము గడవడమే కష్టం అయేది. ఇప్పుడు ఏ పనిచేయాలన్నా, “అదేమిటోనండీ అసలు టైమే ఉండడం లేదూ..” అంటూ సాగదీసుకుని చెప్పేవారే ఎక్కువయ్యారు. “మీకేమిటీ, ఓ పనా, పాడా, హాయిగా రిటైరయ్యి ఇంట్లో కూర్చుని, ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఊళ్ళోవాళ్ళందరిమీదా కావలిసినన్ని టపాలు వ్రాయొచ్చు, అడిగేవాడు ఉండడుగా. మీదారిన మిమ్మల్ని వదిలేసి, మీ ఇంట్లోవాళ్ళు సుఖపడ్డారు“, అని ఎవరైనా అన్నా దులిపేసుకుని పోతాను. కానీ… నేను మాత్రం చెప్పాల్సింది చెప్పడానికే ఈ టపా !!

రోజులో ఉన్నది ఇరవైనాలుగ్గంటలే, కాదనరు ఎవరూ. నిద్రకో అయిదారు గంటలు తీసికుని, మిగిలిన సమయాన్ని సరీగ్గా మేనేజ్ చేసికోవచ్చుగా. అబ్బే టైములేదండీ అనేవాళ్ళే ఎక్కువ. దీనివలన పేద్ద casualty, మనం తినే తిండి ! ఓ పధ్ధతిలో తినవలసిన టైములో తిండి తిని అస్సలు ఎన్ని సంవత్సరాలయిందో ఒక్కళ్ళకేనా గుర్తుందా? ఏదో అదృష్టం బాగుండి, ఉన్నఊళ్ళోనే చదువు పూర్తిచేసిన వారి మాటేమో కానీ, మిగిలినవారికి హాస్టల్ నిద్రా, మెస్సు భోజనం ( సత్రవు భోజనం, మఠం నిద్రా లాగ). ఏది ఉన్నా లేకపోయినా తిండీ,నిద్రా ఉండాలికదండీ మనుష్య జన్మెత్తిన తరువాతా? దురదృష్టవశాత్తూ ఇప్పటి వాళ్ళకి అదే కరువయింది.

ప్లేస్కూలుకెళ్ళే చిన్నపిల్లల దగ్గరనుంచీ, ఆఫీసులకెళ్ళే పెద్దవాళ్ళదాకా అందరూ పరుగేపరుగు. ఏదో టైముకి నిద్ర లేచి, తయారవొచ్చుగా, అబ్బే ముందురోజు అర్ధరాత్రిదాకా మెళుకువగా ఉండడం, పెంద్రాళే మెళుకువ రమ్మంటే ఎక్కణ్ణుంచొస్తుందీ? నిజమే ప్రస్తుతపు ఐటి యుగంలో, ప్రపంచంలో ఎవడికో చాకిరీ చేస్తున్న ఈరోజుల్లో, ఉద్యోగాలు చేస్తున్నవారికి తప్పవు, మరి మంత్రసానిపనికి ఒప్పుకున్న తరువాత చెయ్యాలిగా. కానీ పిల్లలకి ఓ డిసిప్లీన్ లాటిది నేర్పి, వాళ్ళనైనా ఓ టైముకి నిద్ర లేచేలా చెయ్యొచ్చుగా.ఇంట్లో తిండానికి టైముండక, బస్సులోనే తినేయమనడం. మధ్యాన్నం స్నాక్స్ కి ఓ కుర్ కురే ప్యాకెట్టోటి స్కూలు బ్యాగ్గులో పెట్టడం.

ఇంక పెద్దవారి సంగతి అడగఖ్ఖర్లేదు. అసలు వాళ్ళేం తింటున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. బ్రేక్ ఫాస్ట్ కి సిరియల్సుట, ఇంక లంచ్ విషయానికొస్తే ఏదో పిజ్జాలో ఇంకో సింగినాదమో. మధ్యలో ఇవి గొంతుకు దిగడానికి అవేవో “రియల్’ జ్యూసులూ వగైరా. వాడెవడో చెప్పాట్ట, అందుకోసం మన యువతరం అంతా, అరే షారుఖ్ చెప్పాడూ, సచిన్ చెప్పాడూ లేకపోతే ఇంకోడెవడో చెప్పాడూ అని చంకలెగరేసికుంటూ, ఏ మాల్ కో వెళ్ళడం, అదీ కుదరకపోతే ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేయడం. ఈమధ్యన ప్రతీవాడి చేతిలో అవేవో క్యాన్ లోటీ.

ఓ పధ్ధతిలో చేసికుంటే, అన్నీ సక్రమంగా చేసికోవచ్చు. కానీ అసలు చేయాలని ఉద్దేశ్యమే లేకపోతే, ఎవరేం చేస్తారు? పైగా ఎవర్నడిగినా ఈరోజుల్లో lifestyle అంతేనండీ. తిండీ,నిద్రా అనేవిjust secondary అని జ్ఞానబోధోటీ! వాటినిprimary concern చేయకపోతే, వచ్చే రోజుల్లో తెలుస్తాయి. ఇదివరకటి తరం వారు, తొంబై ఏళ్ళ దాకా బతికారంటే, వాళ్ళు జీవితంలో పాటించిన క్రమశిక్షణ. అలాగని ఏదో ఋషుల్లాగా, మునుల్లాగా ఉండమని కాదు, మన బతుకులు ఎలాగూ beyond economic repairs అయిపోయాయి, పిల్లలకైనా నేర్పమని.

ఇంట్లో పెద్దాళ్ళు, పిల్లలకేమైనా పోనీ చెబ్దామా అంటే వాళ్ళ తల్లితండ్రులకి నచ్చదూ. అక్కడికేదో వాళ్ళ పిల్లల్ని ఈ పెద్దాళ్ళు చిత్రహింసలు పెడతారా ఏమిటీ?Just leave him/her అనేయడం. ఏమిటో రోజులు వెళ్ళిపోతున్నాయి….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– విని విని విసిగెత్తిపోయింది….

Pune Newsline

    పైన Pune Newsline అని ఒక పి.డి.ఎఫ్ పెట్టాను. ఈమధ్య నేను పనిచేసి రిటైరయిన ఫాక్టరీలో ఒక దుస్సంఘటన జరిగి, అందులో ఒక వర్కర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాటి accidents అవవని కాదూ, కానీ వాటిని prevent చేయడానికి మానేజ్మెంట్ ఎంత జాగ్రత్త తీసికుంటోందో అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాటివి ఎక్కడ జరిగినా, మెడమీద తలున్న ప్రతీవాడూ చెప్పేదొకటే!It is very unfortunate. We would make every effort to prevent recurrance of such accidents, blah..blah... పైన ఇచ్చినదీ అలాటిదే. ఇక్కడ తేడా ఏమిటంటే, అదే Organisation లో నేను దాదాపు 42 సంవత్సరాలు పనిచేసి, అందులోనూ 20 సంవత్సరాలు, Safety సెక్షన్ లోనే పనిచేశాను. అందువలన నేను వ్రాసేదానిలో కొంతైనా content ఉంటుంది. అక్కడికేదో నేను గొప్ప expert అని చెప్పుకోనుకానీ, నా ఉద్యోగ రీత్యా నేను పడ్డ కష్టాలు,ప్రత్యేకంగా implementing safety standards, ఎలా ఉంటాయో, అందరిదగ్గరనుండీ, ఎలాటి రెసిస్టెన్స్ ఉంటుందో చెప్పాలనే ఈ టపా.

    నేను నా ఉద్యోగం ప్రారంభించింది High Explosives Factory. లో. అక్కడ అసలు ఈ సేఫ్టీ అంటే ఏమిటో తెలుస్తుంది. మనమాటెలాగున్నా, పక్కవాడు తప్పు చేసినా చాలు, వాడితోపాటు మనమూ గోవిందో గోవిందా!! దానితో అక్కడ పనిచేసిన ప్రతీవాడూ, జనరల్ మేనేజర్ నుంచి, కింద పనిచేసేవాడివరకూ అందరూ జాగ్రత్తగానే ఉండేవారు. నరనరాల్లోనూ, ఇదే మంత్రం. దీనివలన మాకు జీవితం లో ఓ డిసిప్లీన్ అనేది కూడా వంటబట్టింది.అక్కడున్న 20 సంవత్సరాలూ సేఫ్టీ సెక్షన్ లోనే పనిచేశాను. ఆ తరువాత, ఓ ఫిల్లింగ్ ఫాక్టరీ కి బదిలీ చేశారు.అక్కడి పరిస్థితులు చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. పోనీ ఏదో కొద్దిగా తెలుసును కదా అని జగ్రత్తలు చెప్పడం ప్రారంభించేసరికి, ఇంకో సెక్షన్ కి మార్చేశారు. కారణం, నేను చెప్పే జాగ్రత్తలు వాళ్ళకి చాదస్థంగా కనిపించాయి.మేనేజ్మెంట్ కేమో, ఒకటే ధ్యాస–meeting production targets. To hell with safety. మరి అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదుగా! ఆ ఫాక్టరీలో 15 సంవత్సరాలు పనిచేసి, ఇంకో ఫిల్లింగ్ ఫాక్టరీకి వచ్చాను. వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటన చెప్తాను–

    ఓ చోట ఓ వర్కర్ కి యాసిడ్ మీదపడి, చేతులూ, మొహమూ కాలాయి. మా మానేజ్మెంట్ అదృష్టం బాగోక, దాని ఇంక్వైరీకి నన్ను వేశారు. నా దారిన నేను ఇంక్వైరీ చేసి నా రిపోర్ట్ వ్రాశాను.మావాళ్ళకి నచ్చలేదు, మార్చమన్నారు నేను మార్చనూ అన్నాను. నన్నుతీసేసి ఇంకోడికిచ్చారు.కారణం మరేమీ లేదు, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, అక్కడ పేరుకి మాత్రమే, safety equipment పెట్టారు కానీ, వాటిగురించి చెప్పే దిక్కే లేదు.ఉండవలసినsafety equipment చాలామట్టుకు లేనేలేవు.మరి ఇలాటివన్నీ రిపోర్ట్లో వ్రాస్తే, ఆ సేఫ్టీ ఆఫీసర్ కి, జనరల్ మేనేజర్ చేతిలో చివాట్లు పడతాయిగా మరి, అందుకోసమన్నమాట మార్చడం! అలా ఉంటాయి తూతూమంత్రాలు.

    అసలు వచ్చిన గొడవల్లా, కెమికల్స్ వాడే చోట, అందులో ప్రవేశం ఉన్నవాడిని వేయాలి కానీ, ఓ ఆర్ట్స్ వాడినో, మెకానికల్ వాడినో వేస్తే ఇదిగో అలాగే ఉంటాయి మరి.ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. 42 సంవత్సరాలూ, మేము పనిచేసిన ఫాక్టరీల్లో , ప్రొద్దుటే వెళ్ళి సాయంత్రానికి కొంప చేరేమంటే, దానిక్కారణం ఇంటి ఇల్లాళ్ళ తాళి బొట్టు గట్టితనం! అంతేకానీ, ఏవేవో జాగ్రత్తలు తీసేసికుంటున్నారని కాదు! ఇలావ్రాయడం బాగోలేదు, కానీ ఉన్నదేదో చెప్పాలిగా!ఎక్కడ చూసినా ఇదేపరిస్థితి.చల్తాహై…

    అందుకే పైన( పిడిఎఫ్) లో వ్రాసింది చదవగానే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అంతదాకా ఎందుకూ, హెల్మెట్ పెట్టుకోవాలని గొంతెత్తుకు చెప్తారు, ఎంతమంది పాటిస్తారు? పైగా అదిపెట్టుకుంటే ఓ న్యూసెన్సండీ అంటారు. రూల్స్ పాటించవలసిన పోలీసు వ్యవస్థే దానిగురించి పట్టించుకోనప్పుడు, ఎవడెక్కడికి పోతేనేం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   కిందటి టపాలో ప్రస్తావించాను కదా, మొన్న 15 న నా పుట్టిన రోజని, దానితో పాపం ఆ టపా చదివినవారు, మొహమ్మాటానికి శుభాకాంక్షలు చెప్పవలసివచ్చింది! పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నా పుట్టింరోజో అని కొంపెక్కి అరుస్తూంటే, పోనిద్దూ పెద్దాయనా సంతోషిస్తాడూ, అయినా ఇంకా ఎంతకాలం? మనమేమైనా సెలిబ్రెటీసా ఏమిటీ, అందరికీ గుర్తుండడానికి, ఫలానా రోజు పుట్టింరోజూ అని. చెప్పుకుంటేనే కదా తెలిసేదీ! పైగా, ఎంతమందిbest wishes చెప్తే అంత ఆయుద్దాయం పెరుగుతుందేమో అని ఓ ఆశా ! ఎంతచెప్పినా మానవమాత్రులం కదా!! ఏదో ఇంకా బతికుండి ఎవళ్ళనో ఉధ్ధరించాలని కాదు కానీ, బతికున్నన్నాళ్ళైనా నలుగురి నోట్లోనూ పడితే అదో తుత్తీ!! ఏమిటో ఎవడి గోల వాడిదీ!

   ఆ టపాలో వ్రాశానుగా, పూణె ఆంధ్రసంఘం వారు, అప్పుడప్పుడు చేసే మంచికార్యక్రమాల్లో ఒకటైన ప్రవచనం , ( బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే) ఏర్పాటు చేశారు. శుక్రవారం, శనివారం వెళ్ళాము. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆదివారం నాడు ప్రొద్దుటా, సాయంత్రము కూడా ఏర్పాటు చేశారు. చెప్పానుగా, ప్రవచనాలు పూర్తయిన తరువాత, ఇచ్చిన “ప్రసాదాలు” అద్భుతంగా ఉన్నాయి. మా పూణె లో కూడా ఇంతరుచికరంగా చేయగలరని ఇప్పటివరకూ తెలియదు. క్రిందటేడాది కూడా ఇచ్చారనుకోండి, కానీ ఎవరో అన్నారూ, మనవైపునుంచి ఎవరో వచ్చి తయారు చేశారూ అని విన్నాను. ఓహో కాబోసూ అని ఊరుకున్నాను.అందుకే పూర్తిగా తెలియకుండా ఏమిటేమిటో అనేసికోకూడదు! ఈసారికూడా, మళ్ళీ కిందటేడాది లాగే “రుచీ”, ఇంక ఈ విషయం వదలకూడదనుకుని, మా ఆంధ్రసంఘం సెక్రటరీ గారిని ( మా అమలాపురం ఆయనే లెండి, అందుకే ఆ చనువు!) అడిగేశాను.ఆయన చెప్పారూ, ఇక్కడే పూణే లోనే ఉన్నారండి అని చెప్పి, ఆ కేటరర్స్ ఫోను నెంబరూ వగైరా ఇచ్చారు.

   ఇంకో రోజు ప్రసాదాల రుచి ఆస్వాదించొచ్చుకదా అని, శనివారం రాత్రి కొంపకి చేరుకున్నాము. పొద్దుటే, ఫోనూ, ” ఫణిబాబు గారూ, కార్యక్రమాలు క్యాన్సిలయ్యాయీ, శ్రీ షణ్ముఖ శర్మగారి సోదరుడు అకస్మాత్తుగా దివంగతులైనందున, శ్రీ శర్మగారు ఉదయం ఫ్లైట్ లో విశాఖపట్టణం వెళ్ళిపోయారూ” అని. అందుకే అంటారు, దేనికైనా యోగం ఉండాలీ అని. అసలు ఆప్రవచనాలమీద భక్తుండాలి కానీ, ప్రసాదాల మీదుంటే ఇదిగో ఇలాగే ఉంటాయి!

   మా ఇంటావిడ విషయమే తీసికోండి, స్వంత ఇల్లు ఉండాలీ అని ఆ భగవంతుణ్ణి ప్రార్ధించిందే తప్ప, అందులో ఉండే అదృష్టం కూడా ప్రసాదించూ అని అడగలేదు. ఉండడానికి ఇప్పటికినాలుగు ఇళ్ళకి రిజిస్టారాఫీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాము, కానీ ఉండేదెక్కడా, ఓ అద్దె కొంపలో!అలాగని ఇక్కడేదో మేము కష్టపడిపోతున్నామని కాదు, అయ్యో తనకున్న బుల్లి కోరిక తీరలేదే అన్న బాధ! నాకైతే అలాటి సెంటిమెంట్లేమీ లేవు చెప్పాలంటే, మనకెక్కడ రాసిపెట్టుంటే అక్కడే ఉంటాము అన్నది నా ఫిలాసఫీ! మనమేమైనా వెళ్ళేటప్పుడు కట్టుకుపోతామా ఏమిటీ,పిల్లలతోనూ, స్నేహితులతోనూ సంబంధబాంధవ్యాలు ఉంటే చాలు, మిగిలినవన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు.అవి ఎలాగూ ఉన్నాయి, వాటికేమీ లోటు లేదు.Thats all.ఏమంటారు?

    ఆదివారం ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం, పొద్దుటొకచోట ప్రవచనం, సాయంత్రం ఇంకోచోటా పెట్టుకున్నాము కదా, దానితో మా అబ్బాయీ కోడలూ మమ్మల్ని మాదారిన వదిలేశారు! కానీ కారణాంతరాలవలన, ఆ కార్యక్రమాలు క్యాన్సిలైపోయాయి. పైగా ఆ slots ఫిల్ చేయడం ఎలా? మా ఇంటావిడేమో, మేముండే ఇంట్లో, రెండురోజుల పని అలాగే ఉండిపోయిందీ అని చెప్పి అక్కడకి వెళ్ళిపోయింది. ఇంక నేను మిగిలాను, అలాగని ఏ సినిమాకో వెళ్ళిపోతే బావుండదుకదా, సరే అని మా అబ్బాయినడిగాను, ఏం చేద్దాం నాయనా అని. అప్పుడు నేనడగ్గానే నా కోరిక తీర్చడానికి సహాయ పడిన ( To meet my favourite Sri RKLaxman) మా అబ్బాయి ఫ్రెండు వస్తున్నాడూ, అతన్ని కలుసుకుందామా అన్నాడు. తప్పకుండా కలిసి పెర్సనల్ గా థాంక్స్ చెప్పుకోవాలీ అనుకుని, సరే అన్నాను. మా కోడలి చేతివంటే తినేసి, Pune Camp లో ఒక రెస్టారెంటుకి వెళ్ళాము.1.30 కి వెళ్ళామండి, మూడు గంటలపాటు అతనితో కబుర్లే కబుర్లు! ఆ అబ్బాయి ( అబ్బాయని ఎందుకంటున్నానంటే, అతనిదీ మావాడి వయస్సే) విషయానికొస్తే, చెప్పడం ప్రారంభిస్తే అసలు అంతే ఉండదు.

    అతనికీ నాలాగే ఆటోగ్రాఫుల పిచ్చీ! నా వీలునిబట్టి ఏదో ఉత్తరాలు వ్రాసి సంపాదించాను. ఇతనిదేమో ఇంకో పధ్ధతీ. ఏ celebrity ని కలుసుకున్నా సరే, వారితో ఓ ఫొటో తీయించుకోడమూ, వెంటనే ఆ ఫొటో మీద వారి ఆటోగ్రాఫ్ తీసేసికోడమూనూ! అతని కలెక్షన్ చూస్తూంటే కళ్ళు తిరిగిపోయాయి! ఒకళ్ళని కాదు, Film Stars, Cricketers, Singers, Scientists, Business People అలా ఎందరెందరితోనో, కొంతమందికి అదో passion ! అంతే.ఈమధ్యన జరిగిన Formula 1 Champion, Sebastian Vettel తో సహా ఉన్నాయి! కొంతమందికి ఏమిటీ ఈ పిచ్చీ అనిపిస్తుంది, కానీ అందులో ఉండే మజా అందరికీ తెలియదుగా! అవన్నీ చూపించాడు.పైగా వెళ్తూ వెళ్తూ ఓ మాట కూడా చెప్పి వెళ్ళాడు– అంకుల్, మీకు ఎవరినైనా కలియాలనిపిస్తే హరీష్ ( మా అబ్బాయి) కి చెప్పండీ, ఎరేంజ్ చేస్తానూ అని!– ఇంతకంటే ఏం కావాలి?

    RAC Quota లో నాకు, అతనితో గడిపిన ఆ మూడు గంటలూ అద్భుతం! RAC Quota అని ఎందుకన్నానంటే, మా ఒరిజినల్ కార్యక్రమం క్యాన్సిల్ అవబట్టే కదా, ఈ అవకాశం వచ్చిందీ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొత్తానికి భగవంతుడి దయవలన, ఇంకో పుట్టిన రోజుకూడా గడిచింది. ఏదో మన కాళ్ళమీద మనం ఉంటున్నామంటే, అందులో మన ఘనత ఏమీ లేదు. ఆ భగవంతుడికి ఇంకా మనమీద దయ ఉన్నట్టే అనుకోడం, ముందుకి పోవడం.

    శ్రీ అప్పారావుగారూ, జ్యోతిగారూ, ఒకే ఒక్క శంకరూ, అతని భార్య స్వాతి, అమెరికా నుండి బ్లాగరు ఫ్రెండు అబ్బులూ, ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పారు. థాంక్స్ వాళ్ళకి అప్పుడే చెప్పేశాను, కానీ పబ్లిక్కుగా కూడా చెప్పుకోవాలిగా! ఫేస్ బుక్ ధర్మమా అని చాలామందికి తెలిసి, వారందరూ ఓ సందేశం పెట్టారు. మా అబ్బాయీ,కోడలూ పదిరోజుల క్రితమే ఓ గిఫ్టిచ్చేశారు. కానీ నిన్నటి రోజున, మా ఒకేఒక్క శంకర్ ఓ అద్భుతమైన గిఫ్టు పంపాడు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలు ( రామాయణం, మహాభారతం) రెండు సీడీ ల్లో పెట్టి పంపాడు! థాంక్స్! అలాటి ఐడియాలు ఎలా వస్తాయి బాబూ?గిఫ్ట్ ఇవ్వడం ఓ ఎత్తూ, అది అవతలివారికి ఎంతో ఇష్టమైనదిగా ఉండడం ఇంకో ఎత్తూ!

    ఇదివరకటి రోజుల్లో కుటుంబ సభ్యులందరూ కలసి భోజనం చేయడం తప్పని సరిగా ఉండేది. ఓ టైముకి అందరూ కలిసి కూర్చోవలసిందే. కానీ ఈ రోజుల్లో అలా కాదుకదా. కారణాలు అనేకం. పిల్లలూ,మనవలూ,మనవరాళ్ళూ ఒకే ఊళ్ళో ఉన్నా సరే, అందరూ కలిసి భోజనం చేయాలంటే, ఏ హొటల్ కో వెళ్ళాల్సిందే. మేముండే ఫ్లాట్ లో నా “నవరత్నాలూ” పట్టరూ, పోనీ మా స్వంత ఫ్లాట్ కి వెళ్దామా అంటే, అక్కడ మాత్రం అందరూ కలిసి భోజనం ఎలా చేస్తారూ, తలో ప్లేటూ పట్టుకుని ఏ హాల్లోనో కూర్చోడమేగా. అందులో ఆనందం ఎక్కడుందీ? కనీసం ఏ హొటల్లోనైనా అయితే,ఉన్న ఆ గంటా, రెండు మూడు టేబిళ్ళమీద కలిసి కూర్చుని తినే అవకాశమైనా ఉంటుందీ అని హొటల్ కే వెళ్తూంటాము. నిన్నా అదే పని చేశాము!
అయినా ఇంట్లో తిన్నట్టుంటుందా ఏమిటీ? కానీ ఎక్కడో అక్కడ సద్దుకుపోవాలి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలా?

    ఈవేళ సాయంత్రం పూణె ఆంధ్రసంఘం వారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి భాగవత ప్రవచనాలు ఏర్పాటు చేశారు. శనాదివారాలు కూడా ఉన్నాయి. చాలా బాగా చెప్పారు. టి.వీ.లో విన్నప్పుడు ఇంకోలా ఉండేవి. కానీ ప్రత్యక్షం గా వినడం అద్భుతం! కార్యక్రమం పూర్తయిన తరువాత, ప్రసాదాలు ( పులిహోర, చక్రపొంగలి, దధ్ధోజనం) ప్రవచనాలని మించున్నాయి!

%d bloggers like this: