బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పదు…” అన్నట్టుగా…

    చాలా చోట్ల చూస్తూంటాము-ఏ పుణ్యక్షేత్రాలకో, విహార యాత్రలకో, ఒక్కళ్ళూ వెళ్ళడంకంటే, ఇంకోరితో కలిసి వెళ్తే బావుంటుందని, అదీ ఏ దగ్గర స్నేహితుడో, బంధువో అయితే ఇంకా బావుంటుందనీ. వినడానికి ఇది చాలా బావుంటుంది, కానీ చాలా విషయాలు ఆలోచించి మరీ ఇలాటివాటి వ్యవహారాల్లో ప్లాను చేసికోవాలి. పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం అంటే, కనీసం ఓ వారం పది రోజులు పడుతుంది.

ముందుగా ఆలోచించుకోవలసింది, ఆ ఫ్రెండో, చుట్టమో- లతో మనం పదిరోజులు గడపకలిగే ఓపికా, సహనమూ ఉన్నాయా లేదా అన్నది. రోజులో 24 గంటలూ వాళ్ళతోనే ఉండాల్సొస్తుంది. అదేమిటీ, వాళ్ళకీ మనకీ ఎంత స్నేహమో, మీకు అసలు తెలుసా అని మాత్రం అనకండి. రోజుకీ రెండేసి గంటలు చొప్పున సంవత్సరాలు గడపడానికీ, ఏక బిగిన 24 గంటల చొప్పున, వారం పదిరోజులూ గడపడానికీ ఎంతో తేడా ఉంటుంది.ప్రతీ రోజో, వారంలో ఏ మూడు రోజులో, ఓ గంటో, రెండు గంటలో కబుర్లు చెప్పుకోడం వేరు. మొహమ్మాటానికైనా, ఒకళ్ళు చెప్పిందానితో ఇంకోళ్ళు ఒప్పేసికుంటూంటారు. వినేస్తే పోలా, ఈ మాత్రం దానికి వాళ్ళ మనస్సులు కష్టపెట్టడం ఎందుకూ అనుకుని.

మన ఆలోచనా పధ్ధతికీ, అవతలివారి ఆలోచనా పధ్ధతికీ ఎంతో తేడా ఉంటుంది. మనకేమో, ఉన్న వారం పదిరోజుల్లోనూ, ఎన్నెన్ని స్థలాలు చూడగలిగేమూ అనుకోవచ్చు. మనతో వచ్చిన వారికి, దేముడూ, భక్తీ కొంచం ఎక్కువ పాళ్ళల్లో ఉండొచ్చు. ఎక్కడో ఓ గుడికి వెళ్ళేమనుకోండి, వాళ్ళ స్థ్రోత్రాలూ, పూజలూతోనే వెళ్ళిపోతుంది సమయమంతా, చివరకి ఆకలి వేసినా, అదేమిటండీ దేవతార్చనైనా జరక్కుండా, అప్పుడే భోజనమా అనొచ్చు.ఇక్కడేమో ఈ పెద్దమనిషికి కాఫీ గొంతుకలోకి వెళ్ళకపోతే అడుగు ముందరకి పడదు. “ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాము, ఇప్పటికి వీలయింది రావడానికి, ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటే బావుంటుందేమో అన్నయ్యగారూ…” తో ప్రారంభం అవుతుంది.వద్దూ అనలేడూ, అవునూ అన లేడూ, చివరకి పెళ్ళాం మీదకి తోసేస్తాడు. ” నీ ఇష్టం..” అని. ఇంక మిగిలిన ప్రయాణమంతా మూతి ముడుచుక్కూర్చుంటాడు. ఈమాత్రం దానికి ఈ యాత్రలూ, సింగినాదాలూ ఎందుకూ?

అంతకంటే, హాయిగా ఏ యాత్రా స్పెషల్ వాళ్ళతోనో వెళ్తే గొడవే ఉండదు. కానీ వీటిల్లోనూ ఒక్కొక్కప్పుడు సమస్యలొస్తూంటాయి. ఈవేళ మా ఫ్రెండొకరిని కలిశాను బస్సులో. ముందర సీటు లో కూర్చున్నాడీయన, పక్కనే ఇంకొకావిడ కూర్చుంటూ, ఈయన్ని చూసి, అర్రే, మా ఫ్రెండు వస్తుందీ ఇక్కడకీ అనుకున్నానే అన్నది. ఇంతలో ఆ ఫ్రెండు కాస్తా ఇంకో సీటులో సెటిల్ అయింది. పాపం ఆ ” ప్రాణ స్నేహితుల్ని ” విడతీసిన పాపం తనకెందుకూ అనుకున్నాడేమో ఏమో, తను కూర్చున్న సీటులోంచి లేచి, ఆ రెండో ఆవిడకి ఆఫర్ చేశాడు. ఆవిడేమో నాకు ఇక్కడే బావుందీ అని చెప్పింది. ఈయనేమో ఊరికే బాధపడిపోతున్నాడు. చివరకి వెనక్కాలనుంచి నేనన్నానూ ” పోనీయండీ, ఆవిడకే వాళ్ళ ఫ్రెండు పక్కన కూర్చోడం ఇష్టం లేదేమో, మీరెందుకు బలవంతపెడతారూ..” అనగానే నవ్వాపుకోలేకపోయాడు. అప్పుడు చెప్పాడు, తన అనుభవమోటి– ఒకసారి వీళ్ళు యాత్రా స్పెషల్ లో సీట్లు బుక్ చేసికున్నారుట. వీళ్ళ ఫ్రెండొకావిడ, బుక్కింగు వాడి దగ్గరకు వెళ్ళి, తనపేరూ, ఈయనగారి భార్యపేరూ పక్కపక్కనే కావాలందిట. ఓ రెండు రోజుల తరువాత ఈవిడకి ఆ విషయం తెలిసి, ఓర్నాయనో, పదిహేను రోజులు ఈవిడనెలా భరించగలనూ అనుకుని సీట్లు మార్పించేసికుందట.

ఆ మధ్యన రాజ్యసభ లో చూళ్ళేదూ, జయాబచ్చన్, రేఖా సీట్లు మార్పించేసికున్నారు ! ఇంక పిల్లల్నేసికుని రెండేసి కుటుంబాలు అన్నేసి రోజులు వెళ్ళాల్సొస్తే చాలా చాలా విషయాలు ఆలోచించుకోవాలి. వీళ్ళ పిల్లల తిండలవాట్లు వేరూ, వాళ్ళ పిల్లల తిండలవాట్లు వేరూ. ప్రయాణమంతా, చిరాకులూ పరాకులతోనే వెళ్తుంది. ఎవరిదారిన వాళ్ళెళ్ళడంలో ఉన్న హాయి ఎందులోనూ లేదు.

మాఇంటావిడకేమో పుణ్యక్షేత్రాలన్నీ తిరగాలనుంటుంది. నాకేమో హాయిగా ఇంటిపట్టునుండొచ్చుగా అనిపిస్తుంది. అలాగని వెళ్ళకూడదని కాదు, ఒక్కణ్ణీ తీసికెళ్ళే ఓపిక లేదు. ఎవరో ఒకరు తోడుంటేనే కానీ, inspire అవను.ఇంకోళ్ళుంటే మాత్రం రెడీ. ఇప్పటిదాకా మేము చూసిన ప్రదేశాలు,ఒక్క తమిళనాడు టూరిజం వాళ్ళదీ, ఇంకోసారి కలకత్తా, గంగాసాగర్ , ఇంకోసారి అరకు వాలీ తప్పించి మిగిలినవన్నీ ఇంకోరితో కలిసి వెళ్ళినవే. ఏమో ఈసారి వెళ్ళాల్సొచ్చినప్పుడు, ధైర్యం చేసేసి, ఏ టూరిస్ట్ ప్యాకేజీకో బుక్ చేసికోవాలనుంది. దాంట్లో అయితే కొత్త వారితో పరిచయాలవుతాయి. ఒకళ్ళ సెంటిమెంటుతో ఇంకోళ్ళకి పని లేదు, Its only a matter of just 10 days. ఆమాత్రం manage చేయలేమా ఏమిటీ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– possessiveness….

    మనలో ప్రతీవారికీ ఈ possessiveness అనేది, ఏదో విషయంలోనో, ఏదో వస్తువులోనో, అదీ కాదంటే, ఎవరో ఒకరి విషయంలోనో తప్పకుండా ఉంటూనే ఉంటుంది. పసిపిల్లల్ని చూస్తూంటాము, ఏదో ఒక బొమ్మమీద ఇలాటి గుణం ఉంటూంటూంది. చిన్నప్పుడెప్పుడో ప్రారంభం అయినది, పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత కూడా కంటిన్యూ అవుతూనేఉంటుంది, పరిస్థితులు అనుకూలిస్తే .

మామూలుగా ఇంటి ఆడపిల్లకి, చిన్నప్పుడు ఎంత పేచీ పెట్టినా, కొద్దిగా పెద్దయిన తరువాత, ఎన్ని సార్లు విసుక్కున్నా( మరి విసుక్కోదూ, ప్రతీదానికీ ఏదో ఒకటి అంటేనే కానీ ఒక్కరోజెళ్ళదు. డ్రెస్స్ సరీగ్గా వేసికోలేదనీ, ఊరికే షికార్లు కొట్టకుండా స్కూలు అయిన తరువాత ఇంటికి త్వరగా వచ్చేస్తూండమనీ, పధ్ధతిగా ఉండమనీ,ప్రొద్దుటే నిద్రలేచి స్నానాలు చేయమనీ, తిండి సరీగ్గా తినమనీ… ఒకటేమిటి, ప్రతీ దాంట్లోనూ ఆంక్షలే …), పెళ్ళై కాపరానికి వచ్చేసి, పిల్లలు కన్న తరువాత , అప్పుడు మొదలౌతుంది ఈ “అమ్మ” అంటే possessiveness. అమ్మ అనే character మీద ఇంకోళ్ళెవరికీ హక్కు ఉండకూడదు. బస్ ! అంతే !! ఈ ” అమ్మ” అనే ప్రాణికి, తను ఫోను చేసినప్పుడు “కట్” చేసే “ హక్కు” లేదు. తను చెప్పే ” పచర్ పచర్” అంతా నోరెత్తకుండా వినాలి. ఏ ఖర్మ కాలో ఈ పిల్ల ఫోను చేసినప్పుడే, ఎవరో వచ్చారని తలుపు తీసినా, కుక్కరు కూత పెట్టేసిందని “కొద్దిగా ఆగమ్మా…” అని కూడా చెప్పిన్నా అంతే “కోపం ” వచ్చేస్తుంది. “నాతో మాట్టాడ్డం కన్నా ఎక్కువా అవన్నీ...” అని ఫోను పెట్టేసినా పెట్టేయొచ్చు.

ఒకత్తే పిల్ల అయితే ఏ గొడవా ఉండదు.ఇద్దరు పిల్లలు అదీ ఒక మగా, ఆడా ఉన్నారంటే అయిపోయిందే ఈ ” అమ్మ” గారి పని ! ఈ మధ్యన మా మిత్రులు ఒకరు వచ్చారులెండి మా ఇంటికి. అవీ ఇవీ కబుర్లు చెప్పుకుంటూ, వారి అమ్మగారి గురించి చెప్పుకొచ్చారు. వీళ్ళు నలుగురు అప్పచెళ్ళెలుట,వీళ్ళందరి పిల్లలకీ అమ్మమ్మ గారి దగ్గరే చనువు. వారి చిన్నప్పటినుంచీ, ఒకళ్ళకైతే పెంపకం కూడా వారింటి దగ్గరే. మిగిలిన ముగ్గురు కూతుళ్ళ విషయంలోనూ, వారికి అవసరం అని కాకితో కబురెట్టినా, ఈ అమ్మమ్మ గారు రెక్కలు కట్టుకు వాలిపోయేవారుట.పాపం ఆవిడకి మనవళ్ళూ, మనవరాళ్ళూ అంటే అంత possessiveness మరి, ఏం చేస్తామూ? ఈ నలుగురి పిల్లలూ ప్రస్తుతం వయస్సులో పెద్దవారే. అయినా సరే ఆ అమ్మమ్మ గారు ఇప్పటికీ ఎప్పుడైనా అవసరం వస్తే క్షణాల్లో వెళ్తారుట.

మా ఫ్రెండు ( అంటే మా ఇంటికొచ్చినాయన) అంటూనే ఉన్నారు. ” మీ అమ్మ గారిని మీ అప్ప చెల్లెళ్ళందరూ ఇన్నాళ్ళూ exploit చేసికున్నారూ, ఆవిడ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా, ఊరికే చేస్తున్నారు కదా అని చేయించేసికూడదూ…” అని.ఆవిడ మాత్రం ఒప్పుకోరు, ” మా అమ్మ అంత enthusiastic చేస్తూంటే, అసలు మీకెందుకూ..” అని వాదన. చివరకి నేను రంగంలోకి వచ్చి, మీరు నలుగురు అప్పచెల్లెళ్ళేనా, ఇంకా అన్నదమ్ములెవరైనా ఉన్నారా అని అడిగితే, ఆవిడ మేము నలుగురమేనండీ, ఇంకెవరూ లేరూ అన్నారు. అదన్నమాట సంగతి, ఓ తమ్ముడో, అన్నగారో ఉండుంటే తెలిసొచ్చేది అసలు సంగతి అన్నాను.ఏమో నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే, ఈ possessiveness అనేది ఇంకోలా ఉండేది.. కొడుక్కి అంత possessiveness అనేది లేకపోయినా ( ఉన్నా కానీ, మగపిల్లలకి దాన్ని ప్రకటించే పధ్ధతి అంత బాగా తెలియదులెండి !), కోడలు మాత్రం ఆ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసికుంటుంది. వదినగారు ఎక్కడ, అత్తగారిని మంచి చేసేసికుంటుందో అని దుగ్ధ !ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందని తెలిస్తే చాలు, మూడ్ మారిపోతుంది ఆ ఇంటి కోడలుకి.అక్కడకి ఏదో అత్తగారంటే ప్రేమా అభిమానమూ అని కాదు, ఆ కూతురు ఈవిడదగ్గరనుంచి ఏమేం దోచుకుపోతోందో అని బాధ ! ఇదో రకం possessiveness !

అత్తగారి మీద సర్వహక్కులూ తనవీ, తన పిల్లలవీనూ అనే భావంలో ఉంటుంది. వీటిల్లో ఆ అత్తగారికి ఒరిగేదేమీ ఉండదు. పాపం ఆ తల్లికి ఇద్దరు పిల్లలమీదా అభిమానం ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? రేపెప్పుడో మంచం పడితే, ఆ కొడుకూ, కోడలే చేయాలిగా, అందుకోసం, తెలివిగా manage చేసుకుంటూంటుంది. కూతురిగురించి, కోడలు దగ్గరా, కోడలు గురించి కూతురి దగ్గరా చెప్పకుండా …!

అలాగే మనవడూ, మనవరాలూ ఉంటారనుకోండి, ఈ మనవడు character తన మామ్మ దగ్గరకి ఎవరినీ రానీయడు, ( మా అగస్థ్య టైపన్న మాట !).ఇంకొంతమందుంటారు, వాళ్ళు వాడుకునే వస్తువులు ఓ స్కూటరో, కారో ఛస్తే ఇంకోళ్ళకి ఇవ్వరు, ప్రాణం మీదకొచ్చినా సరే ! కావలిసిస్తే టాక్సీలో వెళ్ళడానికి డబ్బులైనా ఇస్తారు కానీ… స్కూటర్, కారు, బైక్కు నో..నో…

చదువుకునే రోజుల్లో, కొంతమంది, తమ నోట్స్లులు ఛస్తే ఇంకోళ్ళని చూడనిచ్చేవారు కాదు. దాన్ని possessiveness అనండి లేకపోతే, తన నోట్సులు చదివేసి అవతలవాళ్ళు బాగుపడిపోతారేమో అనండి, మీ ఇష్టం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, బస్సులో వెళ్తున్నప్పుడో, రైల్లో వెళ్తున్నప్పుడో, ఏ పసిపిల్లో కనబడి, ఆ పిల్లని ముద్దు చేయండి తెలుస్తుంది ! నాలుగు రోజులు తిండుండదు ! మీ ప్రేమా, అభిమానం ,అన్నీ మీ పిల్లలమీదే కానీ ఊళ్ళోవాళ్ళ పిల్లలమీద కాదు చూపించడం…

ఏదో రిటైరయిపోయారూ, నాలుగూళ్ళూ తిరిగొద్దామని అనుకున్నారే అనుకోండి.. ఊళ్ళోనే ఉండే కూతురు – “అస్తమానూ ఊళ్ళు వెళ్ళకపోతే హాయిగా ఇంటి పట్టునుండొచ్చుగా రెస్టు తీసికుంటే ఏం పోయిందీ..”– అంటూ జ్ఞానబోధలు. అలాగని పోనీ, ఎప్పుడైనా అమ్మా నాన్నలని చూడ్డానికి తీరికుంటుందా అంటే అదీ ఉండదు. ఏమిటో ఒక్కొక్కాళ్ళకి ఒక్కో రకం possessiveness….

గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు, చిన్నప్పుడేమిటిలండి, ఇప్పటికీ కొంతమందికి ఓ చిత్రమైన అలవాటుంది. తెలుగు/హిందీ సినిమా అభిమాన తారల ఫొటోలు, ఎక్కడ కనిపించినా దాచేసికోడం. ఇదివరకైతే అభిమాన తార ముఖపత్రంగా ఏ పత్రికైనా వస్తే, ఆ కాగితం తన నోట్సుకో, ఇంకోదానికో “అట్ట” వేసికోడం.పుస్తకమైనా చిరగొచ్చు కానీ, అభిమాన తార మాత్రం “చిరంజీవి” గానే ఉండేది. ఇంకోళ్ళెవరూ తన అభిమాన తార అంటే ఇష్ట పడకూడదు. ఈ సందర్భంలో మొన్నెప్పుడో ఓ మెయిల్ వచ్చింది. దాంట్లో మన glamorous cine stars మేకప్పు లేకుండా ఎలా ఉంటారో చూపించడానికి. ఇవి చూశైనా మనవాళ్ళు, ఆ సినిమా వాళ్ళంటే ఉన్న craze తగ్గించుకుంటే బాగుండును….enjoy…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-frustration లు…

    జీవితంలో ప్రతీవాడికీ ఈ frustration అనేది, ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఆఫీసు కి వెళ్ళడానికి ఫలానా టైముకి ఏ లోకలో, ఏ బస్సో పట్టుకోవాలని, ఆదరాబాదరాగా హడావిడి పడేసి, పరుగు పరుగున వెళ్ళేటప్పటికి, మన కళ్ళెదురుగుండానే, ఆ బస్సో, లోకలో వెళ్ళిపోయినప్పుడు ఎంత frustrate అవుతామో అనుభవించేవాడికే తెలుస్తుంది. అలాగని కారుల్లో వెళ్ళేవాళ్ళకి ఉండవని కాదు. వాళ్ళు వెళ్ళే దారిలో ఏ level crossinగో ఉందనుకోండి, ఇతని కారు గేటుకి ఇవతలవైపు ఉండిపోతుంది, పట్టాలమీదేమో సావకాశంగా ఓ గూడ్స్ బండి ఏ 70- 80 వాగన్లతో వెళ్తూంటుంది. అది ఎప్పటికి వెళ్ళనూ, గేటు ఎప్పటికి తెరవనూ, అవతలివైపుకి ఎప్పుడు వెళ్ళనూ, ఏమిటో అంతా frustratioనే ! ఇంతలో రెండో లైను మీద ఇంకో గూడ్సూ. మామూలుగా వెళ్ళే రూట్ లో కాకుండా, short cut కదా అని ఈ రూట్ లో వెళ్ళడంతో వచ్చిన తంటా అంతా ఇది !

మామూలుగా ప్రతీ రోజూ నగరాల్లో ఉండే ట్రాఫిక్కు జామ్ముల సంగతైతే అడగఖ్ఖర్లేదనుకోండి. ఓ లేన్ లో బళ్ళు ఎక్కువగా ఉన్నాయని, ఇంకో లేన్ లోకి వెళ్తూంటారు, కొంతమంది ప్రబుధ్ధులు అలాటివాళ్ళు పడే అవస్థలు చూస్తూంటే తెలుస్తుంది. అలాగే ఏ మాల్ లోకైనా వెళ్ళినప్పుడు చూస్తూంటాము, బిల్లింగ్ దగ్గర, ప్రతీ కౌంటరు దగ్గరా కొల్లెరు చాంతాళ్ళంత క్యూలు. ఏదో తక్కువుంది కదా అని ఓ క్యూలో, మన సామాన్లన్నీ పెట్టుకుని నుంచుంటాము. మన ముందరవాడేమో, ఓ బండెడు సామాన్లేసికుని, పైగా ఈ బిల్లింగేదో జరుపుతూంటే, ఏదో మర్చిపోయానని, ఇంకో వస్తువేదో తేవడానికి వెళ్ళడం, ఇంతట్లో మనం ముందుగా జనాలెక్కువున్నారని వదిలేసిన క్యూ, సాఫీగా జరుగుతూ వెళ్తూంటుంది. అలాటప్పుడు మరి ఎంత frustratioనో కదూ..!

ఇంక రైల్వే స్టేషనుకి రిజర్వేషన్ కౌంటరు దగ్గర చూడాలి, సరీగ్గా మన నెంబరొచ్చేసరికి, ఆ కౌంటరు వాడికి లంచ్ టైమవుతుంది, కిటికీ మన మొహాన్నే మూసిపారేస్తాడు!ఎక్కడ క్యూలుంటే అక్కడ ఈ frustration అనేది తప్పకుండా ఉంటుంది. మనవైపు వీధుల్లో ఉండే మంచి నీటి కుళాయిల దగ్గర చూస్తూంటాము ఈ పరిస్థితి.

అంతదాకా ఎందుకూ, ఈమధ్యన మా సొసైటీలో ఓ బిళ్వ చెట్టు ఒకటి చూశానులెండి, ఇంటావిడ పూజ చేసికుంటుంది కదా, అని ప్రతీ రోజూ కిందకు బిళ్వపత్రాలు తెద్దామని వెళ్తే, ఎప్పుడూ రెండున్నవే కానీ, పూజకి పనికొచ్చే మూడు ఆకులున్న బిళ్వపత్రాలు మాత్రం ఎప్పుడూ దొరకవు. ఉంటాయనుకోండి, కాని చేతికందే హైట్ లో మాత్రం ఉండవు. ఏ కుర్చీయో వేసికుని గోడెక్కి తీసికోవాలి, అలా ఈ వయస్సులో గోడలూ అవీ ఎక్కి కాలు జారితే అదో గొడవా! ఇలా కాదని మా వాచ్ మన్ తో ఓ ఒప్పందానికొచ్చేశాను. పాపం ప్రతీ రోజూ తనే, నాకోసం ఓ అరడజను కోసి అట్టేపెడతాడు. నాదైతే చాలా చిన్న frustration లెండి, అదికూడా సాల్వైపోయింది!

ఈ frustrationలనేవి ఉద్యోగ జీవితంలో చాలా వచ్చేస్తూంటాయి. కొత్తగా పెళ్ళైన రోజుల్లో, సాయంత్రం భార్యతో ఏ సినిమాకో వెళ్దామని ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు, బిచాణా అంతా సద్దేసి బయలుదేరదామనుకుంటూండగా, ప్యూనొచ్చి, పై అధికారి పిలుస్తున్నారూ అన్నప్పుడు వచ్చే frustration అంతా ఇంతా కాదు! వాడి బుర్ర పగలుకొట్టేద్దామా అన్నంత కోపం వచ్చేస్తుంది. పైగా ఏవో ఓ బొత్తెడు కాగితాలు మన మొహాన్న కొట్టి, వీటిని టైపు చేసి, డిస్పాచ్ అయేటట్టు చూడూ అని చెప్పినప్పుడు చూడాలి. ఈ టైపులూ డిస్పాచ్చిలూ ఏమిటీ అనుకోకండి, ఈ కంప్యూటర్లూ మెయిళ్ళూ లేని మారోజుల్లో మరి ఈ టైపురైటర్లూ, డిస్పాచ్చిలే కదా గతి!

ఒక్కొక్కప్పుడు ఉద్యోగాల్లో కొన్ని ఎలవెన్సులుండెవి. మనకి eligibility ఉన్నంతకాలమూ అవి ఉండేవి కావు, తీరా ఆ ఎలవెన్సులొచ్చేసరికి మనకేమో ఆ eligibility ఉండేది కాదు ! కొంతమంది జాతకాలు అలాగే ఉంటాయి! బోనస్సనేదోటి మొదలెట్టారు, చేసిన 42 ఏళ్ళల్లోనూ తీసికున్నది నాలుగే నాలుగు సారులు! ఇంక ప్రమోషన్ల సంగతంటారా అడక్కండి, దిక్కుమాలిన రూల్సేవో ఉండేవి.ఒకసారి ఎప్రంటీసులు మా కంటే ఎక్కువన్నారు, ఇంకోసారి డిగ్రీవాళ్ళకంటే, డిప్లొమా వాళ్ళే తెలివైనవారన్నారు దీని logic ఏమిటో నా బుల్లి బుర్రకి ఇప్పటికీ అర్ధం అవలేదు! అన్నీ పూర్తయి మన నెంబరు సీనియారిటీ లోకి వచ్చేసరికేమో, వాళ్ళెవరికో అవేవో రిజర్వేషన్లుట, పైగా వీటికి backlog లోటీ !! అప్పుడెప్పుడో అరుణ్ షోరీ గారు ఓ పుస్తకం వ్రాశారుట…Falling Over Backwards అని. ఆ పుస్తకం మీద ఒక రివ్యూ చదివాను ఈ మధ్య. ఉన్నదున్నట్టుగా వ్రాయడం ఓ ప్ర్తత్యేకత ఆయనకి.అందుకేనేమో ఎవరికీ నచ్చరు ఆయన !Indian-Express-Pune-18-August-2012-17. అందుకే అంటాను ఈ frustration అనేది అనుభవించినవాడికే బాగా తెలుస్తుంది.( షోరీ గారి సంగతి కాదు చెప్తూంట, నా సంగతి !)

ఈమధ్యన మన నాయుడు గారు వినడానికి rhyme బావుంది కదా అని ఓ కొత్త స్లోగను మొదలెట్టారు. “కేజీ నుంచి పీజీ” దాకా ఉచితంట వాళ్ళెవరికో! ఇవేమైనా వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్థులనుకుంటున్నాడా ఆయన. పన్నులేమో మీరూ నేనూ కట్టాలా, ఈ రాజకీయనాయకులేమో నోటికొచ్చినట్టు ఓట్లకోసం ఎడా పెడా వాగ్దానాలా? ఈ రాజకీయనాయకులు ఓట్లకోసం ఎటువంటి వాగ్దానాలైనా చేసేస్తారు. అప్పుడెప్పుడొ ఎవరో ఉచిత కరెంటన్నారు, ఇప్పుడేమో ఉచితం మాట దేముడెరుగు, అసలు కరెంటనేదే కనబడ్డంలేదుట ! కారణాలకేమిటీ, కావలిసినన్ని చెప్తారు కార్యం మాత్రం శూన్యం ! ఇలా చెప్పుకుంటూ పోతే జనాల్లో frustration అనేది పెరిగిపోతోంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- so whaaaaat…?

.

    ఈవేళ్టి టపా చదివి అందరూ అనుకోవచ్చు–” అయితే ఏమిటిటా...” అని. అవునూ, వ్రాస్తున్నారూ, మూడు సంవత్సరాల నాలుగు నెలలయిందీ.. soooo what... ఊరికే సుత్తికొట్టకుండా, చెప్పాల్సిందేదో చెప్పేయండి. మా కింకో పనేమీ లేదనుకున్నారా, మీ గోల భరించడం తప్ప.. ఆమాత్రం మేమూ వ్రాయగలం..అందరూ వ్రాసేవాళ్ళే అయితే చదివేవాళ్ళుండొద్దా అనుకుని కానీ…లేకపోతేనా… మీరు వ్రాసేపాటివి మేమూ వ్రాయకలమూ…” అంటారా, fine.. no issue.. మరి అదే కదండీ ఈ టపా ఉద్దేశ్యమూనూ…

   మొదట్లో అంటే మూడేళ్ళ నాలుగు నెలల క్రితం రాజమండ్రీ లో, నాకు కంప్యూటరులో తెలుగులో వ్రాయడం నేర్చుకున్న కొత్తలో అన్నమాట, మనమేమిటీ, ఈ బ్లాగులేమిటీ, వ్రాయడమేమిటీ అనుకున్నాను. పోన్లెద్దూ, ఓసారి ప్రయత్నించి చూస్తే ఏం పోయిందీ అనుకున్నాను. మేము రాజమండ్రీలో ఉన్నప్పుడు, మా చుట్టం ఒకాయన వచ్చారు. అతనికి “జాతకాలు” చూడ్డం ఓ హాబీ. మా వాళ్ళందరూ చూపించుకుంటున్నారు. ఇంత వయస్సొచ్చిన తరువాత, నేను చూపించుకునేదేమిటిలే అనుకున్నాను. అయినా ఇప్పుడు జీవితంలో జరిగేవేమిటిలెద్దూ అనికూడా అనుకున్నాను. జీవితంలోమనం చేయాల్సిన పనులేవో పూర్తయినట్టే ( పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ…) ,ఇంకా చేసేదేమిటీ, హాయిగా ఇంటావిడ తో కబుర్లు చెప్పుకుంటూ, గోదావరి గట్టున ఉండిపోకా, అనికూడా అనుకున్నాను.ఆరోజుల్లో, రాజమండ్రీలో మాకు ముందర దొరికిన ఫ్లాట్ అప్పారావు వీధిలో. మేమేమో గోదావరి అందాలు ప్రతీరోజూ ఆస్వాదించాలని కదా అసలు ఇక్కడకు వచ్చిందీ, ఆ గోదావరి గట్టుకి వెళ్ళాలంటే ఓ పేద్ద ప్రోగ్రాం పెట్టుకోవాలాయే, రిక్షాలూ, బస్సులూ గోలానూ..ఎప్పుడో మనసు పడి వెళ్ళి, గోదావరి గట్టుకెళ్ళినా, తొమ్మిదయేసరికి తిరిగొచ్చేయాలి. లేకపోతే రిక్షాలు దొరికేవి కావు. ఏమిటో ఇంటి బాల్కనీలోకి వస్తే రోడ్డు తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. ఈ మాత్రం ముచ్చటకి రాజమండ్రీ కూడా ఎందుకూ ఈ రోడ్లూ అవీ పూణే లో కూడా ఉన్నాయీ, అసలొచ్చింది గోదావరి గాలిని ఆస్వాదించాలని కదా, అనుకుని, మొత్తానికి గోదావరి గట్టు మీద, ఓ ఎపార్టుమెంటు పట్టేశాము. బాల్కనీ తలుపు తెరవగానే కనిపించేది ఆ ” గల గల గోదావరి”.

   మా ఇంటికి వచ్చిన చుట్టంతో అందరూ చూపించుకుంటూంటే, తను అడక్కుండానే ఓ మాటన్నాడు. మీకు త్వరలో , ఎన్నడూ ఊహించని గుర్తింపు వస్తుందీ,ప్రపంచంలో చాలా మంది మీ పేరు ప్రస్తావిస్తారూ.. అని ! వామ్మోయ్ ఇదెక్కడి గొడవరా బాబూ, ఈ వయస్సులో నాపేరు ప్రస్తావించవలసిన పనులు నేనేమి చేస్తానూ, పోనీ ఏమైనా చదువు వంటబట్టిందా అంటే అదీ లేదూ, పోనీ టాటా ల్లాగా, బిర్లాల్లా గ ఏమైనా philanthropy చేద్దామా అంటే, అంతంత ఆస్థిపాస్థులు లేవాయే, ఏదో ప్రభుత్వం వారిచ్చే పెన్షను మీద బతుకుతున్నవాడినీ, పోనీ అందచందాలున్నాయా అంటే శూన్యం !ఇంక ఏ రంగంలో నా పేరు ప్రస్తావించవలసిన అగత్యం వస్తుందీ అని ఆలోచిస్తే ఏమీ తట్టలేదు. One can either become popular or notorious పోనీ ఆ రెండోది ప్రయత్నిద్దామా అనికూడా అనిపించింది. హాయిగా మా ఇంటావిడ చేసే పనసపొట్టు కూరా, కందా బచ్చలి కూరా తిని గుట్టు చప్పుడు కాకుండా ఉందామంటే, ఈ పెద్దమనిషి లేనిపోని ” జాతకం” చెప్పి నా ప్రాణం తీశాడూ అనికూడా అనిపించింది.

    ఇంతట్లో మా అబ్బాయి నా Birthday gift గా ఇచ్చిన కంప్యూటరు లో “కెలుకుళ్ళు” ప్రారంభించి, తెలుగులో వ్రాయడం నేర్చుకున్నాను. చెప్పేనుగా అరవయ్యో ఏట వేవిళ్ళు అంటే ఇవే మరి ! యాధాలాపంగా నేను తెలుగులో వ్రాసిన ” కోతికొమ్మచ్చి” మీద వ్రాసిన అభిప్రాయం, స్వాతి పత్రికలో ప్రచురించడంతో,ఓ ఆలోచన వచ్చింది. నేను చెప్పే కాకమ్మ కథలు మా ఇంట్లో వాళ్ళు విని విని విసిగిపోయారు. నేను ఏదైనా మొదలెట్టడం తరవాయి, వాళ్ళే ఆ కథని పూర్తిచేసేవారు. పిల్లలయితే దూరంగా పూణె లో ఉండేవారు కాబట్టి బతికిపోయారు. పాపం మా ఇంటావిడకి తప్పలేదు ! నేను పెట్టే “హింస” భరించలేక, పోనీ తెలుగులో వ్రాయడం ఎలాగూ నేర్చుకున్నారూ, అవేవో వ్రాసేసి, అవేవో బ్లాగులుట వాటిల్లో రాసుకోవచ్చుగా, నాకూ “బాధ” తప్పుతుందీ, అని మొత్తానికి ఈ బ్లాగుప్రపంచంలోకి నెట్టేసింది. అలా సలహా ఇచ్చిన పాపానికి , నాక్కవలిసినవేవో చేసేదిలెండి !

    అదండి విషయం మిమ్మల్నందరినీ సుఖంగా బతకనీయడం ఎందుకూ అనుకుని, రోడ్డు మీద పడ్డాను. దానికి సాయం, నా టపాలు నచ్చడం ప్రారంభించాయి. ఎందుకు నచ్చుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి! అప్పుడు తెలిసింది, అదంతా పాఠకుల సహృదయమూ అని ! మొదట్లో వచ్చినన్ని వ్యాఖ్యలు రాకపోయినా, చదివే వారి సంఖ్య మాత్రం పెరుగుతూ… పెరుగుతూ… పెరుగుతూ.. మొత్తానికి ఈవేళ రెండు లక్షలకి చేరుకుంది….

    అయితే ఏమిటిటా అని మాత్రం అడక్కండి. ఏ రంగం లోనైనా అవేవో landmarks అని ఉంటాయిట, నాకూ తెలియదూ, ఈమధ్యనే తెలిసింది. ఎంత చెట్టుకు అంత గాలీ…..అలాగ ఈ నా బ్లాగుప్రస్థానంలో చూపరుల సంఖ్య 2,00,000 కు చేరిందంటే నాకూ సంతోషమేగా! అదేదో మీతో పంచుకుందామనిన్నూ, నన్ను ఇన్నాళ్ళూ భరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుందామనిన్నూ ఈ టపా…

    ప్రొద్దుటే Dash Board చూస్తే 1,99,990 దాకా వచ్చింది. పోనీ ఆ మిగిలిన పది హిట్లూ వచ్చేస్తే, ఆ రెండో లక్ష హిట్టు capture చేసి, అదేదో టపాలో పెడదామని చూస్తే రాదే. పోనీ realty show లలో SMS లాగ, ఆ మిగిలిన పదీ నేనే చేసేస్తే పోలా అనుకోడానికీ లేదు. నేను చేసే ” నొక్కులు” లెఖ్ఖలోకి రావు. అందువలన మీకందరికీ విన్నవించేదేమిటయ్యా అంటే, ఈ రెండు లక్షల నొక్కులూ, మీ అందరి చలవే !!పొద్దుణ్ణించి ఓపిగ్గా కూర్చుంటే మొత్తానికి వచ్చేశాయండి. “పరమపదసోపానం” ఆటలో “పందెం” సరీగ్గా పడితేనే “పండినట్టు” ట. నేనేం చెయ్యనూ 1,99,999 తరువాత ఒకటి పడొచ్చుగా, అబ్బే 3 పడి, 200002 చివరకి ఆట పండాలేదూ, ఏమీ లేదూ…..

    A BIG.. BIG… THANK YOU .. ONE and ALL ....

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“మనదేశం మన గీతం “- fantastic event by NTV at Nellore

    మన మీడియా వాళ్ళంటే ఉన్న దురభిప్రాయం, ఈవేళ NTV వారు నెల్లూరు పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమం చూసిన తరువాత, మార్చుకోవలసివచ్చింది. నెల్లూరు పట్టణం దురదృష్టవశాత్తూ ఈ మధ్యన కొన్ని వార్తలు/సంఘటనలు ధర్మాన్న వార్తల్లోకి వచ్చింది. వాడెవడో బస్సులో ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రయాణీకుల్ని కత్తితో పీకలు కోసేయడం, తమిళనాడు ఎక్స్ప్రెస్ లో అగ్నిప్రమాదం,( for all wrong reasons..) ఇలా నెల్లూరు పేరు వినేటప్పటికి ఇవే గుర్తొచ్చేవి.

    అలాటిది ఈవేళ నెల్లూరు పట్టణం లో చదువుకుంటున్న పిల్లలందరూ ఒకే గొంతుకతో జాతీయ గీతం ఆలాపించడం అద్భుతం. అసలు అంతమంది పిల్లల్ని, అంత క్రమశిక్షణతో ఉంచడం కూడా మామూలు మాట కాదు. ఆ పిల్లలు ప్రదర్శించిన discipline చూడాలే కానీ, వర్ణింప శక్యం కాదు.

    హిందూ మత ప్రచారానికి NTV వారు మొన్న ఆదివారం నాడు, తిరుపతి మహతి ఆడిటోరియం లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో చాలామంది, ఒకరు చెప్పింది ఇంకోరు ఖండించడతోనే సరిపోయింది. పైగా ఆయనెవరో కొద్దిగా ఘాటుగా మాట్టాడుతూంటే, చానెల్ వారు ఓ బ్రేక్ తీసేసికున్నారు.ఆ కార్యక్రమం వీక్షించడానికి వచ్చిన వారితో ఆడిటోరియం నిండిందనుకోండి, కానీ ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా వచ్చిన విద్యార్ధులతో ఓ మైదానం నిండడం చాలా ముదావహం.కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఆ పిల్లలు ప్రదర్శించిన క్రమశిక్షణ just awesome...

    ఏదైనా మంచి పనిచేయాలీ అని అనుకోవాలేకానీ, చేయడం ఎలాగో చేసి చూపించారు ఈ NTV నిర్వాహకులు. Hats off…

    నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనూ, కొన్ని దృశ్యాలు వీడియో(విడియోలు బాగుండకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి.) చేసి పెట్టాను. పూర్తి విడియో ఆ చానెల్ వారు త్వరలోనే పెడతారని ఆశిస్తూ…..

1 2

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Its disgusting…..

    ఇన్నాళ్ళూ మన తెలుగు సినిమాల్లో, ఏ రామ్ గోపాల్ వర్మో ఓ సినిమా తీశాడంటే, దాంట్లో ఓ controversy తప్పకుండా ఉండాల్సిందే. ఏదో పేరులోనో, ఓ పాత్రలోనో, ఎక్కడో అక్కడ ఓ controversy తీసుకురావడం అతనిలో ఉండే ప్ర్తత్యేకత! అక్కడికేదో అతను గొప్పవాడనడంలేదు. ఏ సినిమా తీసినా, underworld అనే genre మీదే తీస్తాడు. అందరూ చూడొద్దూ, దానితో రెండు మూడు నెలల ముందునుంచీ, వాటి promos దేశం మీదకొదుల్తాడు. మన రాష్ట్రంలో ఎవడో ఒకడికి చిర్రెత్తుకొస్తుంది.” గుమ్మిడికాయ దొంగా అంటే భుజాలు తడుముకున్నట్టు..” ఓ పేద్ద ఆందోళన మొదలెడతారు. ఇంక మన మీడియా వాళ్ళు కూడా దొరికిందే ఛాన్సుగా, ఆ సినిమా మీద చర్చలూ, సింగినాదాలూ, విడియో కాన్ఫరెన్సింగులో వర్మ గారూ, అడక్కండి, కావలిసినంత ప్రచారం. ఇంక మామూలు ప్రేక్షకుడు కూడా, ఓహో దీంట్లో ఏదో ఉంది కాబోసూ అనుకుని, సినిమా మొదటాటకే వెళ్తాడు. పైగా అలాటి సినిమా చూడ్డం ఓ status symbol ఆయే ! This is what exactly what the Producer wanted… mission accomplished... వాడి డబ్బులు వాడికొచ్చాయి. మన తెలుగు సినిమా చరిత్రలో ఇంకో సినిమా లెఖ్ఖలోకి వస్తుంది. మనవాళ్ళు కూడా చంకలు చరుచుకోవచ్చు. దేశంలో అత్యధిక సినిమాలు తీస్తున్నది మేమే అని! పైగా కేంద్రం సినిమాలకి అవేవో బహుమతులు ప్రదానం చేసినప్పుడు, ఒక్క తెలుగు సినిమాకీ బహుమతి రానప్పుడు, గుండెలు కూడా బాదుకోవచ్చు. కావలిసినంత కాలక్షేపం !!

    ఇంత జరుగుతూన్నా, క్వాలిటీ సినిమాలు తీద్దామని మాత్రం ఎవడికీ తట్టదు. పైగా ఏమైనా అంటే, ప్రేక్షకుల తీర్పుని బట్టే మేము సినిమాలు తీస్తున్నామూ అని ఓ పేద్ద లెక్చరూ. ఈ లోపులో, పైరేటెడ్ సీడీలూ అవీ ఎలాగూ ఉన్నాయి. వాటిమీదో గొడవా. వందలకి వందలు తగలేసి, ఆ దిక్కుమాలిన సినిమాలు చూడ్డం కంటే, హాయిగా ఇంట్లోనే కూర్చుని ఏ సీడీయో చూసేస్తే పోలా? అది పైరేటెడ్ అయితే ఏమిటీ, లీగల్ అయితే ఏమిటి? అసలు అన్నన్ని కోట్లు తగలేసి సినిమా తీయమన్నదెవరూ, థియేటర్లలో చూడ్డం లేదని ఏడవమన్నదెవరూ?

    ఇవన్నీ ఇలా ఉండగా, దేశంలోని విద్యార్ధులు ఏమైనా miss అయిపోతున్నారేమో అనే ” బాధ” తో , వాడెవడో Sorry Teacher అనే ఓ సిణేమాని రేపు 27 న ప్రజల్లోకి వదుల్తున్నాట్ట. అప్పుడే వాటి ప్రొమోస్ యూ ట్యూబ్ లో కూడా పెట్టేశారు. ఆ డైరెక్టరో, ప్రొడ్యూసరో ఎవడో ఒకడు లెండి, వల్లకాట్లో రామలింగయ్య, ఈవేళTV9 లో ఓ చర్చా కార్యక్రమం !ఓ ఇద్దరు స్త్రీలూ( యాంకర్ తో కలిపి ముగ్గురూ), ఈ పెద్ద మనిషీనూ. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ, పక్కనే ఆ సినిమాలోని ప్రొమోసూ. అసలు వాళ్ళు ఆ దిక్కుమాలిన సినిమాకి పబ్లిసిటీ ఇస్తున్నారా, లేక ఇంకోటా అనేది అర్ధం అవలేదు.ఈ మధ్యలో ఆయనెవరో సెన్సార్ బోర్డు మెంబరుట, ఈ మాయదారి సినిమాకి U/A ఇచ్చారని ఈ ప్రొడ్యూసరూ, ఠాఠ్ కాదూ ఎవరో ఒక మహిళా మెంబరు తప్ప అందరూ ఆ సినిమాకి A సర్టిఫికేట్టే ఇవ్వాలీ అన్నారూ అని, ఆ సెన్సార్ బోర్డాయనా కొట్టుకు చచ్చారు. టైమైపోయింది, కథ కంచికీ వెళ్ళిపోయింది.ఆ చర్చలో ఏం సాధిద్దామనుకున్నారో, ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఆ చర్చ చూసినవాళ్ళు మాత్రం 27 తారీఖున మొదటాటకి వెళ్ళడం మాత్రం ఖాయం.

    ఇవన్నీ చాలవన్నట్టు ఈ మధ్యన హైస్కూల్ అనే ఓ మహత్తర తెలుగు ధారావాహిక ఒకటి మొదలెట్టారుట అదేదో చానెల్ లో. మధ్య మధ్యలో వాటి ప్రొమోస్ చూపిస్తున్నారులెండి. మన సినిమాలూ, ప్రసార మాధ్యాలూ, విద్యార్ధులకి చేస్తున్న ” సేవ” అసలు ఇంకెవరైనా చేయగలరంటారా? అసలే కోతులు వాళ్ళు దీనికి సాయం వాళ్ళ చేతుల్లో కొబ్బరికాయలోటా?

    మిమ్మల్నెవరు చూడమన్నారూ అసలూ, అని మాత్రం అడక్కండి… బుధ్ధిలేక !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-batteries recharged…

   అప్పుడే almost వారంరోజులైపోయింది, టపా వ్రాసి.ఎప్పుడు మొదలెడదామని కంప్యూటర్ ముందు కూర్చున్నా, అస్సలు వ్రాయడానికే మూడ్ రావడం లేదు. పొనీ అలాగని టాపిక్కులకి కొదవా అంటే అదీ లేదు.అదేదో బ్యాటరీలు డౌన్ అయిపోయాయంటారే అలాగన్నమాట. ఇదివరకటి రోజుల్లో అయితే, బ్యాటరీలు ఒకసారి డౌన్ అయిపోయాయీ అంటే, వాటిని అవతల పారేయడమే. కానీ ఈ రోజుల్లో అదేదో recharging ట. ఒకసారి అదేదో చేసేస్తే కొన్ని నెలలపాటు శుభ్రంగా పనిచేస్తాయిట! ఇదీ బాగానే ఉందనుకుంటూ, ఈ బ్యాటరీ recharging కి మార్గమేమిటా అని ఆలోచిస్తూంటే, కృష్ణాష్టమి రోజున, మా నవ్యకి స్కూలుకి శలవని, మా దగ్గర వదిలేసి వెళ్ళాడు అబ్బాయి. ఇదివరకెప్పుడైనా వస్తే, టివీ ముందరే సెటిల్ అయిపోయేది. అలవాటు ప్రకారం తను చూసే చిన్నపిల్లల ఛానెల్స్ పెడుతూంటే, ” వద్దు తాతయ్యా ఈవేళ టివీ అస్సలు చూడనని డడ్డా కి చెప్పాను..” అంది. బాప్రే ఇంత బంగారు తల్లివెప్పుడు అయ్యావే బంగారం అన్నాను.

    ఏదో కొంతసేపు ఏవో డ్రాయింగులు వేసికుంది. పాపం ఎంతసేపని వేసికుంటుందీ, తను మాత్రం. ఇంటావిడ తనని తీసికొచ్చి, కంప్యూటరు ఓపెన్ చేసి, ముందుగా ఏవేవో పాటలు వింది. అప్పుడు మొదలెట్టింది, ఆ సైట్ లో బ్రౌజింగ్.ఇంక చూడండి, వదిలితే ఒట్టు.ఏమిటో గేమ్స్ అంటుంది, ఇంకోసారి పైంటింగ్స్ అంటుంది. టైము ఇట్టే గడిచిపోయింది. ఇంతట్లో అబ్బాయి ఫోనూ, రెడీగా ఉన్నారా అంటూ. కృష్ణాష్టమి సాయంత్రం పూజా అవీ చేసికుంటుందిగా, మా శిరీష, అగస్త్య ని creche నుండి తీసికుని, మా ఇంటికి వెళ్ళాము.

    అక్కడ మా నవ్యేమో రాధట, అగస్త్యేమో కృష్ణుడుట తనేమో వాళ్ళ అక్కని ” ఆదా డియర్..( రాధకొచ్చిన పాట్లు!)” అంటూ ఏడిపించడం, తనేమో ఆదా కాదూ, రాధా అనూ అని అనడం. వాళ్ళకి కొన్ని ఫొటోలూ వగైరా తీసి, శిరీష పూజ పూర్తయిన తరువాత, మా నవ్యేమో వాళ్ళ నాన్నని ” మనక్కూడా “దహి అండీ” ఉండాలీ అంటూ పేచీ పెట్టేటప్పటికి, అబ్బాయేమో ఓ indigenous దహి అండీ తయారు చేసేశాడు.

   అగస్త్యేమో కృషుణ్ణి వసుదేవుడు బుట్టలో పెట్టుకున్నట్టు, నన్నుకూడా ఓ బుట్టలో పెట్టి తీసికెళ్ళూ అన్నాడు, ఇప్పుడు బుట్టా, తట్టా ఎక్కణ్ణుంచి తెచ్చేదీ? ఇంట్లో ఐడియాలకేమీ తక్కువ కాదుగా, బాత్రూం లోంచి ఓ ప్లాస్టిక్ టబ్ తీసికొచ్చి దాంట్లో పిల్లలిద్దరినీ చెరోసారీ నెత్తిమీద పెట్టుకుని, ఆ ప్రకరణమేదో పూర్తిచేశాడు. రోజంతా ఇంత హాయిగా గడిపిన తరువాత మా బ్యాటరీలు ఛార్జయ్యేయంటే మరి అవవూ? చివరి రెండు ఫొటోలకీ background చూశారా, బాపూ గారి అద్భుత సృష్టి “ దశావతారాలు”.

    మనవలూ, మనవరాళ్ళూ మనం ఉండే ఊళ్ళోనే ఉంటే వచ్చే ఆనందాలు ఇవే మరి !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– The other side of it……

   ఈమధ్యన వచ్చిన జనాభా లెఖ్ఖలూ, projections చదువూతూంటే తేలిందేమిటంటే, కొన్ని సంవత్సరాల్లో, ప్రపంచంలోకెల్లా, మన భారత దేశం లోనే ఎక్కువ సంఖ్యలో Senior Citizens ఉంటారని. ఇంక ప్రతీ వాళ్ళూ, అయ్యో.. అయ్యో.. అనుకుని గుండెలు బాదేసికోడమే. ఈరోజుల్లో పిల్లలకి తమ తల్లితండ్రులంటే, ఎంత అనాదరణో, ఈ Senior Citizens ఎన్నెన్ని బాధలు పడిపోతున్నారో, etc etc … లమీద రిసెర్చ్ రిపోర్టులూ, వాటిని ఎక్కడెక్కడి మీటింగుల్లో చదివేయడమూ, మీడియాలో ఆ రిపోర్టుల గురించి, exaggerate చేసేయడమూ చూస్తున్నాము.దానికి సాయం మన ప్రభుత్వం వారు కూడా Parents and Senior Citizens Bill, 2007 అని అదేదో చేశారుట. దాని వివరాలు ఇక్కడ చదవండి. కానీ ఒక్కళ్ళైనా వారివైపునుండి కూడా చూడాలని అనిపించిందా? ఎవరో ఖర్మ కాలి చెప్పాలని ప్రయత్నించినా, ” చెప్పొచ్చేవులేవోయ్..” అనేయడం.This is not fair అని నా అభిప్రాయం. దానితోటి జరుగుతున్న దేమిటంటే, మా ఇంటావిడ వ్రాసిన టపా sandwich generation లో సభ్యుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎవరికి వాళ్ళే అనుకుంటారు అసలు సిసలు శాండ్విచ్ జనరేషన్ అంటే మనమే అని ! దీనికి అంతం అనేదుండదు. కాశ్మీరు సమస్య లాటిది.

   వారి సమస్యలు వాళ్ళకీ ఉంటాయి, అర్ధం చేసికోడంలోనే అసలు సమస్యంతా.కొంతమంది పెద్దాళ్ళను చూస్తూంటాము, మాకు విడిగా రూమ్ముండాలీ అని మొదలెడతారు. ఇదివరకటి రోజుల్లో లాగ, పడగ్గదులూ, పురుటి గదులూ, బయటుండే గదులూ, కచేరీ సావిళ్ళూ ఉండే రోజులా ఇవి. ఆరోజుల్లో అంటే చెల్లేయి, ఇలాటి లగ్జరీస్ అన్నీనూ. అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లలో ఇలాటివన్నీ కావాలంటే కుదురుతుందా? ముందుగా adaptable mentality ఉండాలంటాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వ్యవస్థ లో క్రమశిక్షణ లేదో.. అని ఏడవడం ఎందుకో…

    ఈమధ్యన రిజర్వ్ పోలీసు దళానికి చెందిన వారి కుటుంబాలు, రోడ్డెక్కేసరికి, మన పోలీసు అధికారులందరూ గుండెలు బాదేసికున్నారు. రూల్సూ, క్రమశిక్షణా అంటూ ఏమేమో చెప్పడం మొదలెట్టేశారు. ఆ కుటుంబాలు మాత్రం ఏం చేస్తాయీ? మన డిజీపీలూ వాళ్ళూ CAT/High Court లలో ఒకళ్ళమీద ఒకళ్ళు వ్యాజ్యాలు వేసికోవడానికే టైము చాలడం లేదు. ఒకాయనెవరో డిజిపి గా నియమింపబడగానే, ఠక్కున ఇంకో ఆయన కోర్టుకెళ్ళిపోతాడు.పోనీ ఆ అవతాలాయనేమైనా బుధ్ధిమంతుడా అంటే అదీ లేదూ, ఎవరిదో సంతకం ఫోర్జరీ చేశాడుట, ఈమాత్రం దానికి ఇంకోళ్ళమీద పడి ఏడవడం ఎందుకో? పోనీ మన రాష్ట్ర ప్రభుత్వానికైనా బుధ్ధుందా, గత కొన్నేళ్ళుగా డిజిపీ నియామకాల్లో ఓ పారదర్శకత అనేదుండాలని, సుప్రీం కోర్టు వారు ఎంత గడ్డి పెడుతున్నా, అసలు పట్టించుకునే నాధుడే లేడు. అయినా మన మంత్రులకి ఇవన్నీ చూసే తీరికెక్కడిదీ, కొడుకులు చేసే భూకబ్జాలే కవరు చేసికుంటారా, లేదా తమమీద వచ్చిన ఆరోపణలకే జవాబులిచ్చుకుంటారా?

    ఇంతంత పనుల హడావిడిలో పడి, ఆ afterall పోలీసుల గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఈవేళ సాక్షి పేపరు “తూ.గో.జి” ఎడిషన్ చదువుతూంటే తెలిసింది, పోలీసులకి ( ఆఫీసర్లు కాదు) ఇచ్చిన గృహాల స్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో. మళ్ళీ “సాక్షి” పేపరుని కోట్ చేస్తున్నారా అనకండి.ఏ పేపరువాడైనా సరే, ఉన్నదున్నట్టుగా చెప్తే కొద్దిగా చేదుగానే ఉంటుంది. గోదావరి జిల్లాల్లో పోలీసు క్వార్టర్లు పశువుల పాకలకంటే హీనంగా ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కట్టిన క్వార్టర్లే గతి. మళ్ళీ మన రాజకీయనాయకులూ, మంత్రులూ– వీళ్ళకిచ్చిన నివాసస్థలాలేమో పెద్ద పెద్ద బిల్డింగులూ, కొత్తగా వచ్చిన వాడు వాస్తూ, వల్లకాడూ అంటూ వాటికి కోట్లకి కోట్లు మనం కట్టిన పన్నుల్లోంచే డబ్బులు తగలేయడం. ఇలాటివి ఎవడూ అడక్కూడదు. ఏమైనా అంటే రూల్సూ, సింగినాదాలూనూ.
వీటికి సాయం, వాళ్ళ డ్యూటీ టైములు- మరి ఆ కుటుంబాలన్నీ రోడ్డెక్కాయంటే ఎక్కవూ మరి? ఏదో ఈ పోలీసులన్నవాళ్ళు, నూటికి తొంభై పాళ్ళు, డ్యూటీ చేస్తున్నారు కాబట్టే ఈమాత్రమైనా బతుకుతున్నాము. ప్రతీ వ్యవస్థలోనూ ఉంటాయి కలుపుమొక్కలు. అలాగని పూర్తి వ్యవస్థే మంచిదికాదూ అనడం బావుందా? మొత్తం అందరూ, అదేదో సినిమాలో చూపించినట్టు, శలవు పెట్టేసి పోతే వదుల్తాయి రోగాలు.

    మొన్న పూణె లో జరిగిన పేలుళ్ళ గురించి వినే ఉంటారు. బాంబులూ వగైరాలు పెట్టినప్పుడు, అదేదో BDDS అనేవాళ్ళు రంగం లోకి వస్తూంటారు.ఇంకా పేలకుండా ఉన్న బాంబులు, ఎక్కడున్నాయో చూడ్డం, వాటిని జాగ్రత్తగా వాటిని నిర్వీర్యం చేయడమూ వీళ్ళ పని. ఆ రోజున జరిగిన సంఘటన సందర్భంగా, ఇంకా పేలని రెండు బాంబులు కనుక్కుని, మొత్తానికి వాటిని నిర్వీర్యం చేశారులెండి.ఆ సందర్భంలో ఈ BDDS గురించి, ఓ పేపరు వాళ్ళు సమాచారం సేకరించారు. దాంట్లో తేలిందేమిటయ్యా అంటే. ఈ BDDS వాళ్ళకి అసలు Insurance cover లేదుట !! అసలంటూ ఉందిలెండి, కానీ దానికి కట్టాల్సిన premium కట్టడం కొద్ది నెలలుగా మర్చిపోయారుట… వహ్వా వహ్వా…అదండీ మనం, మన ప్రాణాలు కాపాడే వాళ్ళకిస్తున్న విలువ! ఇలాటివొచ్చినప్పుడు, ఆ ఆఫీసర్లని వెళ్ళి ఆ బాంబుల వ్యవహారమేదో చూడమంటే తెలిసొస్తుంది. వదులుతుంది రోగం ! మొత్తానికి ఆ పేపరు ధర్మమా అని, ఆ ప్రీమియం ఏదో కట్టారుట.అలాగే సాక్షి వారు వ్రాశిన న్యూసు ధర్మమా అని, ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులుండే ఇళ్ళు బాగుపడితే మంచిదేగా.

    కొద్ది సంవత్సరాలుగా మన సైన్యం లో ఉంటున్న విజయకుమార్, ఈ ఒలింపిక్స్ లో సిల్వర్ సంపాదించిన షూటర్ మొన్నెప్పుడొ, ఆర్మీలోంచి బయటకొచ్చేస్తానూ అని ఓ ప్రకటన చేశారు. కారణం తను అన్నన్ని రికార్డులు సృష్టించినా గత అరేళ్ళుగా ఎవడూ పట్టించుకోనే లేదూ, ఆర్మీలో కూడా ఒక్క ప్రమోషనూ రాలేదూ అని. దిక్కుమాలిన క్రికెట్టులో ఓ వైపున డబ్బులకి డబ్బులు సంపాదించుకుంటూన్నా అదీ కోట్లలో, మన కాప్టెన్లకి, మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు, వారికి నీరాంజనాలిచ్చి, ఆర్మీలో అవేవో ఆనరరీ కల్నల్లూ అవీ చేసేస్తారే, అలాటిది ఆర్మీలోనే ఉంటూ, దేశానికి అఖండ గౌరవం తెస్తున్న విజయకుమార్ లాటి వారిని పట్టించుకోకపోవడం అసలు ఏమైనా బాగుందా?

    అందుకే పోలీసు కుటుంబాలూ అవీ రోడ్డెక్కాయి…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఇదివరకటి రోజుల్లోనే బాగుండేదనుకుంటాను. అంటే మరీ మా చిన్ననాటి రోజులని కాదు, సెల్ ఫోన్లొచ్చిన కొత్త రోజులు. కనీసం, ఎక్కడో అక్కడ ఆగి ఫోనులో మాట్టాడుకునేవారు. కాలక్రమేణా, అవేవో చెవుల్లో పెట్టుకునేవి వచ్చాయి, తరువాత అదేదో blue tooth ట. ఇదివరకటి రోజుల్లో వినలేని వారు, అలాటివి పెట్టుకుంటే అవతలివారికి తెలిసేది,ఆ మెషీన్ పెట్టుకున్న చెవిలో చెప్పేవారు. కాలక్రమేణా అవి ఇప్పుడు ఎవరికి చూసినా కర్ణాభరణాల్లాగ తయారయ్యాయి. ఏమిటో రోడ్డుమీద వెళ్తూండడం, ఏదో గొణుక్కుంటూ పోవడం. అయ్యో పాపం, అనుకునేవారం.ఎంత చెవిలో పెట్టుకున్నా, ఎదురుగా ఏమొస్తోందో చూసేవారు.
ఇప్పుడు ఈ మధ్యన touch phones,2G,3G లూ వచ్చిన తరువాత, రోడ్లమీద వెళ్ళేవారికి బాహ్య దృష్టే తగ్గిపోయింది. ఎప్పుడు చూసినా, ఆ సెల్ ఫోనులోకే చూపంతా !

ఏదో కొంపకి చేరిన తరువాత సావకాశంగా చూసుకోవచ్చుగా, అబ్బే, దృష్టంతా కిందకే. ఏం చూస్తారో, ఏం చేస్తారో ఆ భగవంతుడికే తెలియాలి.ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటారు.ఇంక ట్రైన్లలో అడక్కండి. ఏసీ బోగీల్లో ఎక్కడ చూసినా వీటిని ఛార్జింగ్ చేయడంతోనే సరిపోతోంది.పక్కవాడున్నాదో, పోయాడో కూడా చూసుకోరు. అంతంత కొంపలు మునిగే విషయాలేముంటాయో అర్ధం అవదు. పోనీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడైనా చేతులు ఖాళీగా ఉంటాయా అంటే అదీ లేదు. ఓ భార్యా భర్తా, ఓ కూతురూ, ఓ కొడుకూ ఎప్పుడైనా బయటకెళ్ళరా అంటే, ననుగురి చేతుల్లోనూ ఒక్కో touch phone ఉండాల్సిందే. ఈ మాత్రందానికి బయటకెళ్ళడం దేనికీ, హాయిగా ఇంట్లోనే కూర్చుంటే పోలా? ఓ మాటుండదు, మంతుండదు, కొంపలు మునిగిపోయినట్టు, ఏమిటో చూసేసికోవడం.

ఇదివరకటి రోజుల్లో గుర్తుందా, కొద్దిగా స్థితిపరులైన వారింట్లో తప్పకుండా ఉండే వస్తువు- వీణ. కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చిందవొచ్చు, కొంతమంది ఇంట్లో కూతురికి నేర్పించడానికి కొన్నదయుండవచ్చు. ఏదో కొన్ని నెలలు శ్రధ్ధగానే నేర్చుకుంటారు. ఆ తరువాతే, ఈ పెళ్ళైన పిల్లకి కొత్తకాపరంలో పంపిద్దామని ఆ తల్లితండ్రులు అనుకున్నా కానీ, వద్దుపొమ్మంటుంది.చివరకి పుట్టంట్లోనే సెటిల్ అయిపోతుంది ఆ పూర్ వీణ. ఈ తల్లితండ్రులు పాపం తమ కూతురికి గుర్తుగా, కొత్తగా కొన్న ఇంట్లో హాల్లో ప్రత్యేకంగా ఓ షో కేస్ తయారుచేయించి, ఆ వీణని దాంట్లో పెడతారు. ఎవరైనా వచ్చినప్పుడు ” ఆంటీ మీరు వీణ వాయిస్తారా ..” అని అడుగుతారేమో అని, వాళ్ళ కూతురు వీణ వాయించినప్పటి ఫోటో ఒకటి పక్కనే పెడతారు.

ఎప్పుడో ఆ కూతురు పిల్లా పాపలతో పుట్టింటికి వచ్చినప్పుడు, మనవడో మనవరాలో “ వాహ్ మమ్మా..you used to play Veena..…” అంటూ ఓసారి ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ అడిగేసరికి, పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది.” haan.. dear..I used to. But your pappa was not interested...అంటూ ఆ అమాయకపు భర్త మీదకు తోసేస్తుంది. ఈ రోజుల్లో ప్రతీవారికీ, అవేవో multiple talents ట, అదో added qualification కూడానూ.దానితో కూతురో కొడుకో అయితే ఈ వీణ మనతో తీసుకుపోదాం, నేన్నేర్చుకుంటాను అని అడగ్గానే, మొత్తానికి ఆ వీణ కి స్థాన చలనం కలుగుతుంది.ఆ పిల్లో పిల్లాడో శ్రధ్ధగా నేర్చుకున్నారా లేదా అన్నది వేరే విషయం అనుకోండి.

అలాగే మధ్య తరగతీ, అంతకంటె కొద్దిగా కిందిమధ్య తరగతి ఇళ్ళల్లో ఉండేది Sewing Machine. ప్రతీ ఇంట్లోనూ place of honour ఉండేది ఈ కుట్టు మెషీనుకే ! పెద్ద సంసారమూ, ఓ నలుగురైదుగురు ఆడపిల్లలూ, ఓ ఇద్దరు మొగ పిల్లలూ. వీళ్ళందరికీ టైలరుకిచ్చి బట్టలు కుట్టించడానికి తడిపిమోపెడైపోతోందనే సదుద్దేశ్యంతో, ఆ ఇంటి పెద్ద, వాయిదాల్లో ఓ మెషీనోటి కొని పెట్టేస్తారు. ఉన్న రెండు గదుల్లోనూఓ రూమ్ములో సగం ప్లేసు దీనితోనే నిండిపోతుంది. ఉత్తినే మెషీన్ కొనేసి పడేస్తే సరిపోదుగా, బట్టలు కుట్టడం నేర్చుకోవాలాయే. ఆ రోజుల్లో “ఉషా” వాళ్ళవి స్కూళ్లుండేవి, వాటిల్లో నేర్పేవారు. ఇంట్లో ఉండే ఓ కూతురిని అక్కడకి పంపి, నేర్చుకోమనేవారు. మరీ ఇంట్లో మొగాళ్ళ బట్టలు కాకపోయినా, ఆడవారి జాకెట్లూ అవీ, ఇంట్లోనే కానిచ్చేసేవారు. పుట్టింట్లో ఈ కుట్టు మెషీను ఉండడం చేత, కొంతమంది స్త్రీలు, పెళ్ళైన తరువాత కూడా, భర్తచేత కొనిపించుకునేవారు. ఏదో కొంతకాలం బాగానే ఉండేది. కాలక్రమేణా, ఆ మెషీను తొక్కడానికి ఓపిక తగ్గిపోయి, దానికో మోటారోటి పెట్టించుకునేవారు. ఈ రోజుల్లో అంతంత పెద్ద మెషీన్లు ఉంచుకోడానికి స్తలం ఎక్కడా, మన అగ్గిపెట్ల ఎపార్టుమెంట్లలో? దానితో, ఆ మెషీను ఆకారం కూడా మారిపోయి, portable లోకి వచ్చేసింది.
పోనీ ఇంట్లో మెషీనుందని బట్టలేమైనా కుడతారా అంటే అదీ లేదు. ఏదో గతజన్మ జ్ఞాపకాల్లాగ, ఈ portable కుట్టుమెషీను ఇంట్లో అలంకారార్ధం మిగులుతుంది.

ఎప్పుడో పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ అయిపోయి, ఒక్కళ్ళూ ఉన్నప్పుడెప్పుడో గుర్తొచ్చి, ఆ మెషీన్ కి దుమ్ము దులిపి, ఏదో ఓ కర్టెనో ఇంకోటో కుట్టడానికి ప్రయత్నిస్తారు. ఆ కుట్టేమో సరీగ్గా పడదూ, ఎలా పడుతుందీ, అన్నేసేళ్ళు పనీ పాటా లేకుండా ఉంటే? ఈ రోజుల్లో టైలరు దగ్గరకి వెళ్ళాలంటే భయం వేస్తోంది. వాళ్ళు వసూలు చేసే ఛార్జీలు అవీ చూసి. పైగా ఓ పట్టాన వాళ్ళు కుట్టినవి నచ్చవూ.ఇంకోళ్ళని పట్టుకోడం, ఆ కొత్త టైలరు ఏదో మొదట్లో కావలిసినట్టుగానే కుట్టినా, తరువాత్తరువాత వీళ్ళకీ వాళ్ళకీ కుదరదు. మళ్ళీ ఓ కొత్త టైలరుకోసం వేట !

%d bloggers like this: