బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– level of concentration….

    ఈ టపాకి పెట్టిన శీర్షిక ” ఏకాగ్రత” గురించి. మరీ కోకాకోలా concentrate, లేక మనవైపు తిన్న తిండరక్క, తోచినప్పుడు విసిరే యాసిడ్ల concentration గురించీ మాత్రం కాదు. మనమేమీ అష్టావధానాలూ, శతావధానాలూ చేయగలిగే ఉద్దండ పండితులం కాదు. అలాటి మహామహులు, ఒకే సమయంలో, ఎవరెన్ని చెప్పినా, వాటిని గుర్తుంచుకుని, సమాధానాలు చెప్పగలిగే వారు. అందుకే అంత పెద్దవారయ్యారు. మనలాటి ఆంఆద్మీలకి అలాటివేవీ అవసరమూ లేదు. చేతిలో ఉన్న పనేదో సరీగ్గా చేయగలిగితే చాలు. అదికూడా చేయలేము మనము. ఓ పని మొదలెట్టామనుకోండి, ఆ టైములోనే ప్రపంచంలోని అన్ని విషయాలూ గుర్తొచ్చేస్తూంటాయి. దానితో చేతిలో ఉన్న పని కూడా తగలడుతూంటుంది. ఇక్కడే ” ఏకాగ్రత” అన్నది చాలా అవసరం వస్తూంటుంది.

రోడ్డుమీద వెళ్తూన్నప్పుడు చూస్తాం, కారో, బైక్కో, స్కూటరో మామూలుగా డ్రైవు చేసికోవచ్చుగా, అబ్బే అప్పుడే ఏదో గుర్తొస్తుంది. జేబులోని సెల్ ఫోను లో మాట్టాడడం. మెడ ఓ వైపుకి పెట్టేసికుని ( మెణ్ణరం పట్టినవాడిలా!), రోడ్డుమీదవాళ్ళు ఏమైపోయినా ఫరవాలేదు. వీడి మాటలు వీడికి కావాలి. అలాగే ఏ కారులోనో వెళ్తున్నప్పుడు, సెల్ ఫోను లో మాటాడ్డం, మ్యూజిక్ సీడీ లు మార్చడం, అదీకాకపోతే పెళ్ళాంతోనో, ముందుసీటులో కూర్చున్నవాడితోనో సొళ్ళు కబుర్లు చెప్పడం, వీటివలన రోడ్లమీద ఎన్నెన్ని accidents జరుగుతున్నాయో చూస్తూంటాము. అయినా వీళ్ళు బాగుపడరూ, ఇంకోళ్ళని బ్రతకనివ్వరూ.

మేముండే రోడ్డు పక్క ఓ వినాయకుడి గుడుందిలెండి, అదేమిటో సరీగ్గా అక్కడకొచ్చేటప్పటికి, ఆ స్కూటరు/బైక్కు మీదెళ్ళేవాడికి, ఎక్కడలేని భక్తీ పుట్టుకొచ్చేస్తూంటుంది. రోడ్డు మీదెంత ట్రాఫిక్కున్నాసరే, అటువైపే చూడ్డం, రెండు చేతులూ వదిలేసి, ఓ దండం పెట్టడం. వీడు దండం పెట్టకపోతే, పోనీ ఆ వినాయకుడేమైనా అనుకుంటాడా, అంటే అదీ లేదు. అంత దైవదర్శనమే చేసికోవాలనిపిస్తే, హాయిగా అక్కడ కొంతసేపు ఆగి, దండం పెట్టుకోవచ్చుగా, అబ్బే అలా కాదు, అన్నీ పన్లో పనే అయిపోవాలి. మిగిలినవాళ్ళు ఏ గంగలో దూకినా సరే!

ఇంకొంతమందిని చూస్తాము, చెవిలో అవేవో పెట్టేసికుని, అలౌకికానందం పొందేస్తూ, రోడ్డు క్రాస్ చేసేస్తాడు. వీడదృష్టం బావుంటే సరే, లేకపోతే తెలుసుగా! రోడ్డు వరకూ పరవాలేదనుకుందాము, మా ఇంటికి దగ్గరలో ఓ level crossing ఉందిలెండి,గత నెల రోజుల్లోనూ, ముగ్గురు, రైళ్ళపట్టాలు క్రాస్ చేస్తూ, చచ్చారు. భాష కొద్దిగా సున్నితంగా వ్రాయవలసిందేమో అనుకున్నా, రాయలేకపోయాను. ఎందుకంటే, వాళ్ళు చేసిన పనికి, they deserved it. గేటు బందుగా ఉంది, రైలొస్తోందని, పక్కనుంచరుస్తున్నారు అందరూ, అయినా సరే, వాడికి వినిపిస్తేగా! level crossing దగ్గరకొచ్చేటప్పుడు, ప్రతీ ట్రైనూ పెద్దగా కూత పెడుతుంది. అదికూడా వినిపించనంత ఆనందంలో ఉన్నాడు వాడు. బాధపడ్డవాళ్లు ఎవరూ, అతని తల్లితండ్రులు, అయ్యో చేతికందొచ్చిన కొడుకు ఇలా పోయాడే అని.

బస్సుల్లో వెళ్ళేటప్పుడు చూస్తూంటాను. అసలు కాలేజీలకెళ్ళేటప్పుడు, సెల్లుఫోన్లూ, ఐపాడ్లూ, చెవుల్లో “పువ్వులూ”( ear phones) అంత అవసరమంటారా? వీళ్ళు కాలేజీలకెళ్తున్నారా, పిక్నిక్కులకెళ్తున్నారా అనిపిస్తుంది. అయినా వీళ్ళనని లాభం ఏమిట్లెండి? ఆ తల్లితండ్రులకి బుధ్ధుండాలి, ఏ టైములో చేయవలసినది ఆ టైములో చేయాలని చెప్పకపోవడం వల్లే కదా ఇవన్నీ. చిన్న పిల్లల్ని చూస్తూంటాం, అమ్మ పెట్టిన చపాతీ, కూరా ఓ ప్లేటులో పెట్టుకుని, హాల్లో, టివి ముందర సెటిలవుతారు.ఇంక తిండేం తింటారు? ఏ ఇంట్లో చూసినా ఇలాగే. కంసే కం భోజనాలు చేసేటప్పుడైనా, ఆ దిక్కుమాలిన టీవీ కట్టేస్తే, పిల్లలకి ఇలాటి అలవాట్లవవు. అసలు మనకే, ఆ కంట్రోల్ లేకపోతే, పిల్లల్నని ఏం లాభం?
ఇలాటివన్నీ తెలియకనా, అబ్బే ప్రతీవాడికీ తెలుసు, అయినా సరే ధ్యాసుండదు.పోన్లెద్దూ, పిల్లాడు ఈ వంకనైనా ఏదో ఒకటి తింటున్నాడు కదా , లేకపోతే ప్రతీదానికీ పేచీయే అని ఓ compromise. అంతేకానీ, ఇలాటివి కంట్రోల్ చేయకపోవడం వల్ల, ఆ పిల్లో పిల్లాడో ఎంత నష్టపడుతున్నాడో అన్న ఆలోచన మాత్రం రాదు. ఏదో ఒకటీ పనైపోతోందిగా!

అసలు మన టీవీల్ననాలి. ఇదివరకే బావుండేది, హాయిగా ఒకటే చానెలూ. ఇప్పుడో వందలాది చానెళ్ళు. పోనీ ఏదో ఒకటి చూస్తూనైనా ఆనందిస్తారా అంటే అదీ లేదు, ఇంకో చానెల్లో ఏమైపోతోందో , అందులో హీరోయిన్ ఏమయ్యిందో, అత్తగారు ఏమయ్యిందో అన్నీ వర్రీలే. టుప్కూ టుప్కూమంటూ రిమోట్ నొక్కేయడం. ఒక్క ప్రోగ్రామూ సరీగ్గా చూడనీయరు. వాళ్ళు సుఖపడరూ, ఇంకోళ్లని సుఖపడనీయరూ. అడక్కూడదూ, ఏమీ అనకూడదూ, భరించాలి!

అంతదాకా ఎందుకూ, ఏ వంట చేసేటప్పుడో, ఎవరిదైనా ఫోనొచ్చిందనుకోండి, స్టవ్ మీద పెట్టిన పాలూ గుర్తుండదు, పప్పులోనో, పులుసులోనో ఉప్పేశారో. లేదో గుర్తుండి చావదు.మొత్తంమీద ఈ టెక్నాలజీ అంతా, మన బతుకులు అస్థవ్యస్థం చేయడానికే వచ్చిందా, అంటే అదీ కాదు. వాటిని సరీగ్గా ఉపయోగించుకోడమనేది మన చేతిలోనే ఉంది. అయినా జీవితాలు వెళ్ళిపోతున్నాయి…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైం పాస్…

    మన రాష్ట్ర మాజీ గవర్నరు గారికి, “రక్త దానం”, చేయడానికున్న అభ్యంతరమేమిటో తెలియడం లేదు. పైగా “రక్తదానం” అన్ని దానాల్లోకీ శ్రేష్ఠమైనదంటారు. ఏమైనా ఇదివరకటి రోజుల్లో చేసిన “ వెధవ పనులు” బయట పడతాయని భయమేమో.. హైకోర్టు వాళ్ళు ఆర్డరు చేసినా, సిగ్గూ శరమూ లేకుండా, సుప్రీం కోర్టుక్కూడా వెళ్ళాడు. అక్కడా చుక్కెదురయింది. నాలుగు తన్ని ఆ DNA టెస్టేదో చేసేయక ఇంకా ఆపేరెందుకో మరి?

    BCCI ప్రెసిడెంటు కొడుకు ది ఇంకో “గొడవ”. పాపం అతనికి ఆడపిల్లల కంటె మొగాళ్ళంటేనే ఇష్టం ట. మధ్యలో శ్రీనివాసన్ కి ఎందుకూ?మహ అయితే “కోడలు” బదులుగా “కోడలుడు” వస్తాడు. ఆ మధ్యన మన సుప్రీం కోర్టువారు కూడా ఇలాటివాటికి ” ఆమోద ముద్ర” ఇచ్చారనుకుంటా?

   ఏదో మొత్తానికి ఓ మంత్రిని అరెస్టు చేసేసి, చరిత్ర సృష్టించేశారు మొత్తానికి మన CBI వాళ్ళు. అక్కడికేదో ఇదే మొట్టమొదటిదంటారు, ఆ మధ్యన వాడెవడో రాజా కూడా మంత్రే కదా. ఓహో మన రాష్ట్రంలోనా? ఔనండోయ్ నిజమే మరీ… ఇంక మిగిలిన ప్రబుధ్ధులు కూడా క్యూ కట్టాలేమో మరి.

    ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. ఇదివరకటి రోజుల్లో జైళ్ళలో ఏదో దొంగతనాలు చేసినవాళ్ళూ, మర్డర్లూ అవీ చేసినవారూ ఉండేవారు.ఏమిటో అంతా డల్ గా ఉండేది.వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే ఉండేవారు కాదు. కానీ ప్రస్తుతం ఉన్నవారి సంగతలా కాదే. వాటి ambience కూడా క్రమక్రమంగా మారిపోతోంది. IAS, IRS, IOFS, IPS ఆఫీసర్లతో పాటు, రాజకీయ వేత్తలూ, మినిస్టర్లూ, పారిశ్రామిక వేత్తలూ, అబ్బో ఒకరేమిటి, మన సొసైటీ లో ఉన్న ” బడా బాబులు” అన్ని categories వాళ్ళూ చేరిపోతున్నారు.టెర్రరిస్టుల గురించి అడగఖ్ఖ్ర్లేదు. కావలిసినంత మందున్నారు. పోనిద్దురూ వీళ్ళ ధర్మాన్నైనా జైళ్ళ infrastructural facilities బాగుపడతాయి. ఇంకా ఇంకా వెళ్ళడానికీ ముందుకొస్తారు !!!

   ఈరోజుల్లో జైలుకెళ్ళడం అంటే అదో status symbol అయిపోయింది. ఇదివరకటి రోజుల్లో ఎంపీ, ఎం ఎల్ ఏ లనీ, మినిస్టర్లనీ ఎరెస్టు చేయాలంటే అదేదో పెర్మిషన్ కావాలనే వారు, ఈమధ్యన్ రూల్స్ మారిపోయాయా ఏమిటీ? మారే ఉంటాయిలెండి, లేకపోతే మరీ ఇలా “ మావిడికాయలు” రాయిచ్చి కొట్టినట్టు, టఫ్ టపా మంటూ ఎరెస్టులు చేసేస్తారా ఏమిటీ? ఏది ఏమైతేనేం, బలే కామెడీగా ఉందిలెండి. అదో కాలక్షేపం.

    ఆమధ్యన ఆంధ్రదేశం లో టెన్త్ పరీక్షా ఫలితాలు, ప్రకటించడానికి, మహనీయ మంత్రి గారికి ఇంకోటేదో కార్యక్రమం రావడం వల్ల, వాయిదా వేశారుట. అసలు ఈ ఫలితాలు ప్రకటించడానికి, ఆ దిక్కుమాలిన మంత్రెందుకండీ? ఆయనేమైనా పరీక్షలు వ్రాసేడా పెట్టాడా? మా రోజుల్లో, ఈ నెట్లూ అవీకూడా ఉండేవి కావు. హాయిగా ఆంధ్ర పత్రిక/ప్రభ ల్లో వచ్చేవి. పైగా మా కోనసీమలో పేపరు కూడా ఆలశ్యంగా వచ్చేది. అదికూడా గోదావరి దాటి, బస్సుల్లోనే. అసలు అందులో ఉండే సస్పెన్సూ, మన నెంబరు పేపర్లో చూసుకోడం లో ఉండే ఆనందం, ఇప్పుడొస్తోందా? పైగా ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప, మరీ ఈరోజుల్లోలాగ కార్పొరేట్ స్కూళ్ళా ఏమిటీ? పైగా ఈ మధ్యన ఇంకో గొడవ, రిజల్ట్స్ వచ్చిన మర్నాటినుండీ, టివీ ల్లో నూ పేపర్లలోనూ యాడ్లోటీ. మాయదారి పేపరు నాలుగైదు పేజీలన్నీ ఇవే.
ఏమిటో అంతా గందరగోళం!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ ..చిన్న మార్పు…it makes a huuuuuuuge… difference…

   ఈ మధ్యన మా కంప్యూటరు కొద్దిగా తిప్పలు పెట్టడం ప్రారంభించింది. పాపం దానికీ నా లాగే వయస్సు మీద పడుతోంది. మొదట్లో ఉండే ఉత్సాహం ఇప్పుడుండమంటే ఉంటుందా ఏమిటీ? పని చేస్తోంది, కానీ ,మరీ ప్యాసెంజరు బండిలా ( ఈ రోజుల్లోవి కావు, మారోజుల్లోవి) వెళ్తోంది. ఈరోజుల్లో లోకల్ ట్రైన్లనుండి, ప్యాసెంజరు బండ్ల దాకా అన్నీ ఎలెట్రీ ఇంజన్లతోనే కాదా నడిచేదీ, కానీ మా రోజుల్లో బొగ్గింజన్లే గతి. దానికి సాయం ప్రతీ స్టేషన్లోనూ ఆగడం. దీనితో ఆ ప్యాసెంజర్లలో వెళ్ళడం అంటే ప్రాణం మీదకొచ్చేది! ఓ వేళాపాళా ఉండేది కాదు. ట్రైనుందా అంటే ఉంది. లేదని ఎలా అంటాము?రాకపోకలు దైవాధీనాలు, అలాగ తయారయింది మా కంప్యూటరు. అంత పేద్ద ప్రోగ్రామింగులూ అవీ ఏం చేస్తారు మీరు, అని అనకండి మరి. నేను కాలక్షేపానికి వ్రాసుకునే టపాలు నాకు సంబంధించినంత వరకూ, అది కూడా ఓ పెద్ద ప్రోగ్రామింగే మరి! ఎంత చెట్టుకంత గాలి !

   ఇదివరకు బ్రాడ్ బాండ్ కోసం, రిలయెన్సు వాడి నెట్ కనెక్ట్ ఉండేది, దానితో బాధలు భరించలేక, బి ఎస్ ఎన్ ఎల్ వారి బ్రాడ్ బాండ్ కొన్నానని చెప్పానుగా, శుభ్రంగా పనిచేస్తోంది. ” ఆయనే ఉంటే మంగలెందుకూ..” అన్నట్టు, అన్నీ బావుంటే, ఈ గొడవెందుకూ? మొత్తానికి, మా కంప్యూటరు ” పాసెంజర్ మోడ్ ” లోకి వెళ్ళిపోయింది. ప్రొద్దుటే లేవగానే సిస్టం ఆన్ చేయడం, స్నానపానాదులూ,బ్రేక్ ఫాస్టులూ అయే సమయానికి, ఏదో ఆడుతూ పాడుతూ, నెట్ కనెక్టవడం. పోనీ కనెక్టయింది కదా అని మొదలెడితే, మధ్యలో ఏం రోగం వస్తుందో ఆగిపోవడం. ఏమిటో అంతా గందరగోళం. అప్పటికీ అబ్బాయినడిగాను, దీని సంగతేమిటో చూడు నాయనా అని. వాళ్ళకా టైముండదు. డాడీ టెక్నీషియన్ ని పిలిచి, ఓ సారి క్లీనింగు చేయించేయి, ఏదో వైరస్ లాటిదొచ్చిందీ అని చెప్పాడనుకోండి, ఆ మధ్యన ఒకతను వచ్చినప్పుడు, మీ కంప్యూటరు ని అదేదో అప్ గ్రేడ్ చేయండీ అన్నాడు. ఈ గొడవలన్నీ నాకెక్కడ తెలుస్తాయీ? నేనేమైనా మీ అందరిలాగా కంప్యూటర్లలో పుట్టానా పెరిగానా? ఏదో వీధిన పడకుండా, నా మిడిమిడి జ్ఞానాన్ని బయటపెట్టుకునేఅగత్యం లేకుండా, లాగించేస్తున్నాను. అలాగని మధ్యమధ్యలో గుర్రాల్లాగ “మెడ్డువారీలు” చేస్తే ఎలాగ మరి? ఈ ” మెడ్డువారీలు” అంటే ఏమిటండీ అని అడుగుతారు. మా చిన్నప్పుడు, ఒంటెద్దు బళ్ళ తో పాటు, గుర్రబ్బళ్ళని కూడా ఉండేవి. గుర్రం తో నడిపేవారు. ఏదో పాతసినిమాల్లో తప్ప కనిపించవు. ఆ గుర్రాలకి సడెన్ గా మూడ్ మారిపోయి, పరిగెత్తడం మానేసేవి. బండి కి కట్టున్నా సరే, రోడ్డుమధ్యలో ఆగిపోయేవి. ఈ ప్రక్రియనే “మెడ్డువారీ” అనేవారు. తప్పేదైనా అంటే కరెక్టు చేయండి.

   ఏదో మా దారిన మేమున్నాము కాబట్టి, ఈ వేషాలన్నీనూ. ఇదివరకటి రోజుల్లో మా ఇంట్లో ఉండే డెస్క్ టాప్, పిల్లల బెడ్రూంలో ఉండేది. మనకి ఈ కంప్యూటర్లూ కథా కమామీషూ తెలియనప్పుడైతే పరవా లేదు కానీ, ఓసారి తెలిసిన తరువాత, అస్తమానూ “కెలక” బుధ్ధేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు, కొడుకూ, కోడలూ ఉండే రూం లోకి వెళ్ళడం బాగోదు కదా, అలాగని వాళ్ళేమైనా అంటారనికాదూ, ఏదో చిన్నప్పటినుంచీ అబ్బిన సంస్కారం. ప్రొద్దుటే వాళ్ళిద్దరూ ఆఫీసులకెప్పుడెళ్ళిపోతారూ, మనం కంప్యూటరు దగ్గర ఎప్పుడూ కూర్చుందామూ అనే ఆలోచన. ఇంక వీకెండ్లొచ్చాయంటే, అడగఖ్ఖర్లేదు. పోనీ అప్పుడైనా చూద్దామా, పిల్లలు ఏ బయటకెళ్ళినప్పుడో అనుకుందామా అంటే, డాడీ అందరం కలిసి బయటకెళ్దామేమిటీ అంటారు. అసలు ఈ గొడవలేమీ లేకుండా, హాయిగా ఆ కంప్యూటరు ని అందరూ ఉపయోగించుకునేటట్టుగా ఏ హాల్లోనో పెట్టేసికుంటే ఎంత బావుంటుందీ?ఇప్పుడసలా గొడవే లేదు. ఇంట్లో మూడు లాప్ టాప్పులు. మా కోడలూ, అబ్బాయీ , ఎప్పుడు కావలిసిస్తే అప్పుడుపయోగించుకోండి అంటారు. వాళ్ళకీ ఓ నమ్మకం, ఈయన వీటినేమీ తగలేయడూ అని !! వాళ్ళు మాకు ఆ ఫ్రీడం ఇచ్చారు కాబట్టే కదా ఈమాత్రం నేర్చుకున్నామూ?

    మరీ ” బాగ్ బాన్” సినిమాలోలాగ, ఏ అర్ధరాత్రి కీబోర్డు నొక్కినా చప్పుడైనా అవదు. మన పెద్దవారి ఏ కూతురో, ఎక్కడో అమెరికాలోనో, ఇంగ్లాండు లోనో ఉందనుకుందాము. ఆ పిల్లలకి అమ్మా నాన్న లతో మాట్టాడడానికి ఏ అర్ధరాత్రో తప్ప వీలవదూ. ఈ డెస్క్ టాప్ కొడుకు బెడ్ రూం లో ఉంటే, ఈ సౌకర్యాలన్నీ ఎలా వీలౌతాయీ? అంత కంప్యూటరు లేకుండా రోజే వెళ్ళదా అనకండి. పెద్దాళ్ళకి అదో వ్యాపకం మరి. ఇదివరకటి రోజుల్లో సైకిలు లేని ఇల్లు ఎలా లేదో, అలాగే ఈ రోజుల్లో కంప్యూటరు లేని కొంప లేదు. ఇందులో ఇంకో సౌలభ్యం ఉంది, ఒక్కసారి కంప్యూటరు వ్యసనానికి అలవాటు పడ్డారంటే, ఈ పెద్దాళ్ళు, హాయిగా ఇంటి పట్టునుంటారు. రోజంతా దిక్కుమాలిన టివీ చూడమనడం కంటే ఇదో option కూడా ఉంటే బావుంటుందిగా. వాళ్ళేమీ ఏదో బయట ట్రినింగులకెళ్ళి దేశాన్ని ఉధ్ధరించేద్దామనే ఉద్దేశ్యాలేమీ ఉండవు. ఏదో మీకు వీలున్నప్పుడు, ఓసారి basics నేర్పేస్తే చాలు, భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు. ఇంత వయస్సొచ్చి, ఇంత అనుభవం వచ్చేక, ఆ మాత్రం కంప్యూటరు నేర్చుకోడం బ్రహ్మవిద్యేమీ కాదు.

    ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఇంట్లో అంటూ కంప్యూటరంటూ ఉంటే, దాన్ని మరీ బెడ్రూమ్ముల్లో పెట్టేయకండి. కాదంటారూ, ఓ లాప్ టాప్ కొనిచ్చేయండి. ఆమాత్రం కొనగలరు, ఈరోజుల్లో చేసే ఖర్చుల్లో ఇదేపాటిది? అప్పుడు చూడండి, మీ అమ్మా నాన్నలెలా ఉంటారో? ఇదేమిటి మీరూ, ప్రపంచం లో ఉన్న పెద్దాళ్ళందరి తరఫునా వకాల్తా పుచ్చుకున్నారా, మా గొడవలేవో మేము పడతామంటారా మీ ఇష్టం… కంప్యూటరు హాల్లో పెట్టండర్రా అని మరీ అడగలేరు వాళ్ళు. మీరే వారి చిన్న చిన్న కోరికలు గమనిస్తూ ఉండాలి…and watch the change...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చూస్తూ.. చూస్తూంటే.. రోజులెలా గడిచిపోతాయో కదా….

    ఏమిటో ఇప్పుడు వ్రాయడం వచ్చు కదా అని, ఇన్నాళ్ళూ జీవితంలో జరిగిన సంఘటనలు వ్రాయడానికి బాగానే ఉంటుంది. కానీ, అవి జరగడానికి ముందర ఎంతంత టెన్షన్లు అనుభవించామో, తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తూంటుంది. అసలు మనమేనా, అలా చేయగలిగామూ అని! కానీ, ఇన్నేళ్ళ తరువాత , ఆ సంఘటనల పరిణామాలు ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రం అదో రకమైన ఆత్మవిశ్వాసం మరోసారి rekindle అవుతూంటుంది. భగవంతుడి మీద నమ్మకం కూడా ఇంకా..ఇంకా ..పెరిగిపోతూంటుంది. దీన్నే మానవజీవితం అంటారేమో… ఇదేమిటీ సడెన్ గా ఫిలాసఫీలోకి దిగిపోయాడేమిటీ ఈయనా అనుకుంటున్నారా? నిజమే కదా, జీవితంలో అసలు పెళ్ళంటూ అవుతుందా, నాకూ ఓ సంసారం, పిల్లలూ అనేవాళ్ళు ఏర్పడతారా అని అనుకున్నంతసేపు పట్టలేదు, పెళ్ళీ అయింది, నన్ను పూర్తిగా అర్ధం చేసికుని, నా tantrums భరించి ( మరి ఆరోజుల్లో అలాగేగా ఉన్నది !), ఆరేళ్ళు తిరక్కుండా, ఇద్దరు రత్నాల్లాటి పిల్లలకు జన్మ ఇచ్చి, వాళ్ళ చదువుసంధ్యలకి పూర్తి బాధ్యత తీసికుని, ఈవేళ ఇలా బ్లాగులు వ్రాసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నానంటే, దీనికంతకూ ముఖ్య కారణం, మా ఇంటావిడే.

    ప్రతీ భార్యా అలాగే ఉంటుంది, ఇందులో పేద్ద గొప్పేమిటమ్మా అనుకోవచ్చు. కానీ ఎవరి భార్య వాళ్ళకి గొప్పే కదా! వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోరు, అందులోనే ఉంది వారి గొప్పతనమంతా! మనకీ తెలుసు, వారి సహకారం లేనిదే, మనం బిగ్ జీరో అని. అయినా ఒప్పుకోడానికి అహం అడ్డొస్తూంటుంది!అయినా ఉన్నదేదో చెప్పేసికుంటే అదో తృప్తీ. అసలు ఈవేళ ఇలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళడానికి కారణం ఏమిటయ్యా అంటే, మా బంగారు తల్లిని ఓ అయ్య చేతిలో పెట్టి ఇవేళ్టికి 15 వసంతాలు పూర్తయాయి.. మొదటినుండీ, ఆంధ్రదేశానికి బయటే ఉండి,కూతురికి సంబంధాలు తేవడం అంత సులభం కూడా కాదూ, పైగా ఈ రోజుల్లో ఉన్నన్ని మాధ్యమాలు అందుబాట్లో లేనప్పుడు మరీనూ! ఎవరో మధ్యవర్తి తప్ప ఇంకో దిక్కు లేదు. కూతుర్ని కన్న తరువాత, వివాహం చేయడం మన బాధ్యతే కదా.అలాగని, అన్ని సంవత్సరాలు బయట ఉండి, సంబంధాలు తేవడం అంటే మాటలా? కూతురి భవిష్యత్తుకూడా దృష్టిలో పెట్టుకుని చూడాలి. మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకు తెలియదు. మరీ, ఇన్నాళ్ళూ తెలుగు సంప్రదాయాలకి దూరంగా ఉంటూ, ఒక్కసారి అక్కడి సంబంధం చేస్తే పిల్ల పాపం ఇమడగలదా అని ఓ అనుమానం. అంతేకాదు, ఇప్పుడంటే పరవాలేదు కానీ, ఆ రోజుల్లో పిల్ల పెళ్ళి చేయాలంటే, తండ్రి రూపురేఖలు కూడా ముఖ్యం. నాకున్న సమస్య నాది. ఏం చేస్తానూ?

    మరి ఇన్ని సమస్యలకీ ఆ శ్రీవెంకటేశ్వరస్వామి ఠక్ మని, మా అమ్మాయి మనస్సులో ప్రవేశించేసి, “డాడీ, నాకు ఫలానా అబ్బాయంటే ఇష్టం..” అనిపించేలా చేశారు. ముందుగా like any middle class parents, షాక్ తిని, ఆ తరువాత నేనూ, ఇంటావిడా ఆలోచించి, ఇంట్లో పెద్దవారైన మా అమ్మగారితోనూ, మా అత్తగారూ,మామగారు లతోనూ సంప్రదించి, వారి ఆశీర్వచనంతో వివాహం జరిపించాము. ఒక్కొక్కప్పుడు అనుకుంటూంటాము, 15 సంవత్సరాల క్రితం suppose మేము మన ప్రాంతాల్లోనే ఉన్నట్టైతే, ఇంత పెద్ద decision తీసికునే ఉండేవారమా అని ! ఊళ్ళో వాళ్ళేమనుకుంటారో, చుట్టాలందరూ మనతో సంబంధబాంధవ్యాలు కటాఫ్ చేసికుంటారేమో, ఏమిటో అన్నీ అనుమానాలే ! చేద్దామని మనసా వాచా అనుకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయత. ఎంత చెప్పినా ఆనాటి పరిస్థితులూ, మానవ స్వభావాలూ మరీ ఇప్పటిలా లేవు కదా. ఎవరో ఏదో అంటారు, బాధపడ్డం తప్ప ఇంకేమీ చేయలేము.

    అందుకే destiny ని నమ్ముతాము మేము. మన చేతిలో ఏమీ లేదు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచేయడమే. మా అల్లుడూ, అమ్మాయీ, మనవరాలు తాన్యా, మనవడు ఆదిత్య లను చూసినప్పుడల్లా అనుకుంటాము– Yes we were right... అని. ఇందులో మా గొప్పేమీ లేదు, ఆ దేవదేవుడే మాకు అలాటి శక్తిని ప్రసాదించారు. బ్లాగులోకంలోకి ప్రవేశించిన కొత్తలో మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది. అదికూడా చదివేయండి మరి….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–almost సుఖపడిపోయాననుకున్నాను….

    వేసంకాలం వచ్చిందంటే నాకు “పరీక్షాకాలం”. ఈ బ్లాగుల ప్రపంచంలోకి ప్రవేశించిన తరువాత, నా ఈతిబాధలు ,వేసంకాలంలో వచ్చేవాటిని గురించి, ఇదివరలో 2010 లో ఒక టపా, 2011 లో ఒక టపా వ్రాశాను. మనలో ఉండే బాధని బయట పెట్టేసికుంటే అదో ఆనందం. అందువల్లనే ఆ టపాలు వ్రాశాను. మొదటి దానికి కౌంటరు పెడుతూ మా ఇంటావిడ కూడా ఓ టపా వ్రాసింది. తూగోజి, పగోజి వారు, తమతమ పార్టీలని సమర్ధించేసికున్నారు. మళ్ళీ ఈ ఏడాదేమౌతుందో అని , I kept my fingers crossed….ఎప్పుడో ఆర్డరు వేసేస్తుంది, మామిడికాయలూ… అంటూ సాగదీసుకుంటూ…, ఆ శుభముహూర్తం ఎప్పుడా అని ఎదురుచూడ్డం తప్ప ఏం చేస్తాను? పైగా ఉన్నదేదో చాలక, నేనే ఎందుకు ఎత్తాలి? కావల్సొస్తే తనే అడుగుతుంది. అయినా ఇంకా నూనె, కారం, ఆవపిండి, తెమ్మని అడగే లేదూ, ఏమిటి చెప్మా..

    చాలామందికి గుర్తుండేఉందనుకుంటాను, స్కూళ్ళలో చదివేటప్పుడు, ఒకటో ఫారం నుండి అయిదో ఫారం దాకా ప్రతీ నెలా స్లిప్ టెస్టులూ ( వాటినే యూనిట్ టెస్ట్ లని కొద్దిగా మొడర్నైజు చేశారు), క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, చివరగా యాన్యుఅల్ పరీక్షలు. ఆ వాతావరణం లోనే పెరిగి పెద్దయ్యాము. రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఆ తరువాత అదేదో క్లాసులోనే Annual అన్నారు. అలా కాలక్రమేణా ప్రస్తుతం టెన్త్ దాకా అసలు పరీక్షలే లేవంటున్నారు. అమ్మయ్య సుఖపడ్డారనుకున్నాను. ఏమిటో, దేనికైనా పెట్టిపుట్టాలంటాను. మారోజుల్లో ఇలా ఉండి ఉంటే ఎంత బావుండేదో కదా… ఏదో నెలనెలా పరీక్షల ధర్మాన్నైనా, ఆమాత్రం చదువు వంటబట్టుండొచ్చు, లేకపోతే నాలాటివాళ్ళెక్కడుండేవారో…

    నాలాటి వాళ్ళకి పరీక్షాకాలం ఒక్క వేసంకాలంలోనేలెండి. నా పై టపాలు చదివితే తెలుస్తుంది. అలాటిది సడెన్ గా మా ఇంటావిడ, ఈ ఏడాది ఆవకాయ పెట్టడంలేదూ అని ఓ historic announcement చేసేసింది. కారణం మరేమీ లేదు, కిందటేడాది అబ్బాయికిచ్చిన సీసాడు ఆవకాయా, ఇంకా అలాగే ఉంది. ఆమధ్యన మా ఇంటికెళ్ళినప్పుడు చూసింది. కోడలు చెప్పేదాంట్లోనూ పాయింటుంది, ఇదివరకటి రోజుల్లో లాగ ఇప్పుడు, రోజూ ఆవకాయ ఎవరు వేసికుంటున్నారూ, ప్రతీ రోజూ నియమంగా భోజనం చేయడానికే టైముండడం లేదు, ఈ tenderleaves.com ధర్మమా అని. మేమా ఇదివరకటిలాగ, ప్రతీ వారం వెళ్ళడం లేదు, కొంచమైనా చెల్లుబాటవడానికి. ఇంక మా అమ్మాయి సంగతంటారా, అక్కడ తనొక్కత్తే వేసికుంటుంది. ఆతావేతా తేలిందేమిటంటే, మా ఇంట్లో కూడా అలాగే ఉండిపోయింది. ఇద్దరికి ఓ పేద్ద సీసాడావకాయ ఎక్కీ తొక్కీనూ… సదరు కారణాల పరిణామమే ఆ historic announcement కి కారణం.

    కారణం ఏదైతేనేం ఈ ఏడాదికి మనకి పరీక్షలు క్యాన్సిల్…It really calls for celebration.. అని అనుకోబోయి, మరీ సంతోషించలేదు నయం !ఈమధ్యన అబ్బాయీ,కోడలూ, మనవరాలూ, మనవడూ ఎక్కడికో long drive కి వెళ్ళి, వచ్చేటప్పుడు, ఎక్కడో మామిడి చెట్లు కనిపించాయిట, అవన్నీ కోసి, ఓ పాతిక, ముఫ్ఫై కాయలు తెచ్చారు. వాళ్ళేం చేసుకుంటారు అన్ని కాయలు, ఉందిగా మా ఇంటావిడ, కార్లో వేసికుని తెచ్చి, మా ఇంట్లో పెట్టారు. ఇంక మా ఇంటావిడకి అన్ని కాయలు చూసేసరికి “ పూనకం” వచ్చేస్తుంది. అబ్బ ఎంత బావున్నాయో కాయలు, అసలు కాయలంటేఇలా ఉండాలీ… వగైరా ..వగైరాలు మొదలెట్టింది. ఈ నలభై ఏళ్ళలోనూ, ఆవిడ నోటంట ఒక్కసారంటే, ఒక్కసారి ఇలాటి సెభాసీ వినాలని, ఎంత తహతహ లాడిపోయానో అసలావిడకు తెలుసా?
కొడుకు తెస్తే బావున్నట్టా, కట్టుకున్నవాడు తెస్తే ఎప్పుడూ సణుగుడా, ఏం చేస్తాం లెండి.

    రాత్రికి రాత్రి అవన్నీ కడిగేసి, నన్ను బయటకి పంపి ఉప్పు తెప్పించి, ఓ కత్తిపీట ( నేను మా కొత్తకాపరంలో 1972 లో కొన్న మొట్టమొదటిది!) ముందేసికుని, కస్ ..కస్.. మంటూ తరిగేసి, అలా తరిగిన ప్రతీ కాయకూ, అబ్బ టెంకంటే ఇలా ఉండాలి అంటూ మోనోలాగ్గులూ, నాతో డయలాగ్గులూ, మొత్తానికి వాటి షేప్ మార్చేసి ఉప్పులో పడేసింది. ఓ రెండు రోజులు ఊట పూర్తిగా కారనిచ్చి, ఇంక ఎండలో పెట్టడం తరవాయి అంది. నేనేమో ప్రొద్దుటే, లేచి, లిఫ్ట్ పనిచేయకపోవడం వల్ల మెట్లన్నీ దిగి కిందకెళ్ళి, వాచ్ మన్ దగ్గర టెర్రెస్ తాళం తీసికోడం, ఆ ఎండలో ఈ ముక్కల్ని పెట్టడం. పైగా తనేమో ఏ.సి. పెట్టుకుని హాయిగా ఉంటుంది, నేనేమో బయటేమైనా మేఘం పడుతుందేమో, ఏ జల్లైనా పడితే, ముక్కలన్నీ తగలడిపోతాయి అనుకుంటూ, కూర్చోడమూ, ఇంట్లోనేలెండి. కానీ అది కూడా ఓ పనేగా మరి! మొత్తానికి నాలుగు రోజులు ఎండలో పెట్టేసరికి ” ఒరుగులు” తయారైపోయాయి. ఇంతా చేసి అన్ని మామిడి కాయలూ ఓ డబ్బాడు తయారయ్యాయి, అవి ఏ మూలకీ? నిన్న కోడలొచ్చేసరికి అవన్నీ తనకిచ్చేసింది. ఇంక కూతురికోసం తయారు చేయొద్దూ, ఇదిగో ఈవేళ పంపి, ఓ పాతిక్కాయలు తెప్పించింది. మళ్ళీ రేపణ్ణించి Action Replay– టెర్రేసూ, తాళం చెవీ, లిఫ్ట్ పని చేయకపోడం, మేఘాలూ etc..etc..

    ఇవన్నీ ఎవడికీ కనిపించవు. అమ్మ అంత కష్టపడిపోతుందీ, మాకోసం ఏడాదికి సరిపడా “ఒరుగులు” చేసిందో అని ఆవిడ tangible కష్టాలు కనిపిస్తాయి కానీ, నేను పడ్డ intangible తిప్పలు మాత్రం ఎవరికీ కనిపించదు. ఏం చేస్తాను? పోన్లెద్దురూ పిల్లలు ఏడాదంతా, ఎప్పుడు కావలిసొస్తే అప్పుడు, మావిడికాయ పప్పులో వేసికుంటున్నారా లేదా….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

   ఈ ఆదివారం ఏదో కొద్దిసేపు తప్పించి, రోజంతా శ్రీరామచంద్రుడి దర్శనమే ! ప్రొద్దుటే రామదాసు, మధ్యాన్నం అలనాటి “లవకుశ”, రాత్రికి బాపూ రమణల సృష్టి “శ్రీరామరాజ్యం”.
ఒకేరోజున శ్రీరామచంద్రుడి దర్శనం కొంచం ఓవర్ డోస్ అయిందనుకోండి. కానీ లవకుశ, శ్రీరామరాజ్యం ఒకే రోజున చూసిన కారణంగా రెండు సినిమాలకీ comparative study చేయడానికి సాధ్యపడింది. దేని గొప్ప దానిదే అనుకోండి.

   “లవకుశ” : ఈ సినిమా రిలీజ్ అయి వచ్చే ఏటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్ని సార్లైనా చూడ్డానికి బావుంటుంది. కారణం అందులో ఎన్ టి ఆర్ పోషించిన శ్రీరామ పాత్ర, అంజలీదేవి పోషించిన సీత పాత్ర. ఇద్దరికిద్దరే ఆ పాత్రల్లో జీవించారు. వీటికి సాయం ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో ఆ చిత్రం లోని 37 పాటలూ, పద్యాలూ ప్రతీదీ ఓ అఛ్ఛోణి లాటిదే. పంటికింద రాయిలా శ్రీ ఎన్ టి ఆర్ గారి గ్నాపకం, కృతగ్నత వదిలేస్తే మిగిలిన డయలాగ్ డెలివరీ “నభూతో నభవిష్యతి”. ఒక్క చోట — భూదేవి, సీతమ్మ ని తనతో వచ్చేయమని అడిగినప్పుడు, భూదేవి ఎంతో ప్రయత్నిస్తుంది convince చేయడానికి, అయినా సీతమ్మ ఒప్పుకోరు. అప్పుడు భూదేవి చెప్పిన డయలాగ్గు,” అయితే నీ ఖర్మ..” అనడం కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపించింది.అదికూడా, ఏదో మనం మాట్టాడేటట్టుగా ఉంది. వాల్మీకి మహర్షి సీతమ్మవారికి :లోకపావని” అని పేరు పెట్టారు. నాగయ్య గారికి ఘంటసాల వారు కాకుండా, ఆయన్నే పాడమనుంటే ఇంకా బావుండేదేమో.ఆ సినిమాని 26 కేంద్రాల్లో రిలీజు చేస్తే ప్రతీ కేంద్రం లోనూ శతదినోత్సవం చేసికుంది. తెలుగులో కోటి రూపాయలు చేసికున్న మొదటి చిత్రం ట.

   ఇంక శ్రీరామరాజ్యం విషయానికొస్తే, It is out and out a Bapu Ramana classic. ప్రతీ ఫ్రేం లోనూ శ్రీబాపు గారే కనిపిస్తారు. ఆయనమీద తెలుగువారికున్న అభిమానం ఒకటి కారణం అయుండొచ్చు. ఇందులో 16 పాటలున్నాయి.ఇళయరాజా సంగీతం సినిమాకి ఓ హైలైట్. ఇంక డయలాగ్గుల విషయానికొస్తే, శ్రీ ముళ్ళపూడి వారి, stamp ప్రతీ చోటా వినిపిస్తుంది. వచ్చిన అసలు గొడవల్లా ఏమిటంటే, బాలకృష్ణ ని చూసినప్పుడల్లా “సింహా”, “సమరసింహారెడ్డి” గుర్తొస్తాయి. నయనతార పరవాలేదు. బాలకృష్ణ డయలాగ్ డెలివరీ లో అసలు శ్రీరామచంద్రుని తో రిలేట్ చేసే శాంతమూ, ప్రేమ, అభిమానమూ అన్నదే వినిపించలేదు. ఏ ఎస్.పీ చేతో డబ్బింగ్ చేయించేస్తే సరిపోయేది. Latest Technology was fully utilised. ఈ సినిమాలో సీతమ్మవారికి, వాల్మీకి ఆశ్రమంలో “లక్ష్మీ దేవి” అని పేరు పెట్టారు.
మొత్తానికి రోజంతా బాగానే కాలక్షేపం అయింది. నిన్న టివీ లో మాయదారి పాటలు విని బోరుకొట్టేయగా, నెట్ లో వెదికితే ఓ మచ్చుతునక కనిపించింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Body language…

   ఇదివరకటి రోజుల్లో ఈ Body language… అంటే తెలిసేది కాదు…ఈ Body ఏమిటీ, దీనికీ ఓ language ఏమిటీ అనుకునేవాడిని. కాలక్రమేణా, కొద్దిగా అనుభవం అనండి, లేక ఇంకోటేదో అనండి, మొత్తానికి ఈ పదానికి అర్ధం తెలుస్తోంది. ఇంక తెలిసిందిగా ఓ కొత్త పదం, ఎడా పెడా ఉపయోగించడం మొదలెట్టేశాను. దానితో, అందరిలోనూ ఓ గుర్తింపోటొచ్చేస్తోంది, ఓహో ఆహా అనుకోడం మొదలెట్టేశారు. ఓ నలుగురు కలిశారనుకోండి, ఏదో టాపిక్కు మొదలెట్టడం, చూసి చూసి ఈ మాటని ఉపయోగించేయడం, దానితో అవతలవాడూ అనుకుంటాడు, మనం ఏదో “ బుధ్ధిజీవుల” కోవలోకి వస్తామని! బుధ్ధిజీవులా, పాడా, అరవై ఏళ్ళు దాటి డెభయ్యో పడిలో పడేవాడికి,Body ఏ ఉండదూ లక్షణంగా,, మళ్ళీ దానికి ఓ laanguaజా, అకస్మాత్తుగా acquire చేసేదేమీ ఉండదు. అదో సరదా !! ఇంక ఉండేదా ఎన్నాళ్ళూ, ఉన్నంత కాలమైనా హాయిగా గడపాలనుకుంటే, ఇలాటివి తప్పదు.

అయినా సరే మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూస్తే తెలుస్తుంది. బయట రోడ్డు మీదకెళ్ళండి, SUV ల మీద వెళ్ళేవాడికి, మిగిలిన వాహనాలంటే చిన్నచూపు! అక్కడకి రోడ్డంతా తనదే అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఓ పార్కింగు తీసికోండి, ట్రాఫిక్కు సిగ్నల్స్ దగ్గరనండి, లేన్లు మార్చడం దగ్గరనండి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవతలవారిని dominate చేయడమే, వీరి ultimate aim. తనకంటూ ఓ ప్రత్యేకత చూపించుకోవాలి. అది వాడి తప్పు కాదు. ఆ SUV వల్ల వచ్చిన confidence, దీన్నే Body language.. అంటారనుకుంటాను. రోడ్లమీద ఈ మధ్యన ఎక్కడ చూసినా వోల్వోలూ, మెర్సిడీజ్ లూనూ, వీళ్ళకి మామూలు “ పల్లె వెలుగు” ఎర్ర బస్సులంటే చిన్న చూపు. అవికూడా బస్సులేనా అన్నట్టు ప్రవర్తిస్తూంటారు!

అంతదాకా ఎందుకూ, ఈ మధ్యన వస్తూన్న అవేవో పవర్ డ్రివెన్, గేర్ లెస్స్ బళ్ళవాళ్ళకి, మిగిలిన సాదా సీదా మారుతి 800 అంటే చిన్న చూపు! బైక్కుల మీద వెళ్ళేవాళ్ళకి, స్కూటర్లమీదా, స్కూటీల మీదా వెళ్ళేవాళ్ళంటే చిన్న చూపు. పోనీ ఈ బైక్కుల వాళ్ళకైనా అంతా బావుంటుందా అంటే అదీ లేదూ, మళ్ళీ దాంట్లో అవేవో సీసీ (cc)లూ, సింగినాదాలూనూ! పైగా ఎంత చప్పుడు చేస్తే అంత గొప్పట! నూతుల్లో బైక్కులు నడిపేవాళ్ళలాగ పేద్ద చప్పుళ్ళు చేసికుంటూ పోతారు. నూటికి యాభై మంది, spoiled brats లోకే వస్తారు. రోడ్డు మీద వెళ్ళె వాహనాలూ, నడిపే విధానాన్ని బట్టీ, వాళ్ళBody language తెలిసిపోతుంది. మరీ పెళ్ళాం పిల్లలూ ఉండి, బాధ్యతలు తెలిసినవాళ్ళు ఇలా వెర్రి వేషాలు వేయరులెండి. రోడ్ల మీద అష్టవంకర్లూ తిరుగుతూ, ఒక్కొక్కప్పుడు చేతులు వదిలేస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా horn మోగిస్తూ, మిగిలిన వాహనాలవాళ్ళని హడలు కొట్టేస్తూ వెళ్తున్నాడూ అంటే, వాడి బాబురాజకీయ నాయకుడైనా అవొచ్చు, సినిమాల్లో నటించేవాడైనా అవొచ్చు, అదీ కాదనుకుంటే ఓ history sheeter అయినా అవొచ్చు!

పైన చెప్పినవన్నీ వాహనాల మీద వెళ్ళేవారి గురించి. చివరకి సైకిలేనా నడపడం రాని నాలాటి వాడికి వీటన్నిటి గురించీ ఎలా తెలిసిందా అనుకోకండి. దాన్నే Body language. మహాత్మ్యం అంటారు !! ఆ విషయమూ చెప్తాను, కొంచం ఓపిక పట్టండి మరీ… వాహనాలు నడపడమే రావాలా ఏమిటీ, పోజులు పెట్టడానికి? ఏదో పేపర్లు చదవడం, నెట్ లో పనీ పాటా లేకుండా, బ్రౌజు చేస్తూ, ఏదో ఒకదానిగురించి చదవడం, ఇంక ఛాన్సొస్తే చాలు, దాన్ని గురించి నలుగురూ చేరిన చోట ఉపయోగించేయడం. ఈ మధ్యన మా ఫ్రెండెవరో ఒకాయన షష్ఠిపూర్తి కి వెళ్ళాల్సొచ్చింది లెండి. అక్కడ ఏదో నలుగురం చేరి కబుర్లు చెప్పుకుంటూంటే, అందరూ ” బయట” కు వెళ్ళొచ్చినవాళ్ళే, ఎక్కడో షికాగో లో అలా ఉందీ, మా పిల్లలు ముగ్గురూ సియాటిల్ లొనే ఉంటున్నారూ, సింగపూర్ లో ఏమిటోనండీ… అన్నీ అవే కబుర్లే. మరి నా సంగతో, ఏదో అంబాజీపేటా, అమలాపురం దాటి, ఏదో ఉద్యోగ ధర్మమా అని ఈ పూణె వచ్చానుకానీ, వాళ్ళు చెప్తున్నవన్నీ చూశానా పెట్టానా? పైగా అలాటి అవకాశం కూడా ఎక్కడా లేదు.అలాగని, నేనెందుకు నన్ను తక్కువ చేసికోవాలీ? ఆ మాటా ఈ మాటా చెప్తూ, మనకి తెలిసున్న టాపిక్కు లోకి తెచ్చుకోవాలి! అక్కడక్కడ మనకున్న మిడిమిడి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి! నాలుగైదు sophisticated మాటలు, అర్ధం తెలిసినా, తెలియకపోయినా ఉపయోగించేయడమే! ఖాళీ డబ్బాలే చప్పుడు ఎక్కువ చేస్తాయిట.( నాలాటి వాళ్ళు).

చాలామంది వేషధారణ బట్టి అవతలివారిని అంచనా వేస్తారు. ఇదివరకటి రోజుల్లో ఇప్పుడున్నన్ని వేషాలుండేవా ఏమిటీ? అయినా సరే, అవతలివారి వేషధారణద్వారా, వారి intellecctual level తెలిసేది. వారి Body language కూడా అలాగే ఉండేది.అలాగని ఏదో “గర్వం” తోనూ, ” అహంకారం” తోనూ ప్రవర్తించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో అలా కాదే, మన వేషధారణ బట్టే, అవతలివారి అభిప్రాయమూనూ! ఏం చేస్తాం, కాలంతోనే ముందుకు వెళ్ళాలిగా,మనం ఎంత వద్దనుకున్నా, కొన్నిటితో compromise అయి, ప్రస్థుత వాతావరణానికి adapt అవాల్సొస్తోంది. వేషధారణనండి, బయటకి కనిపించే హంగులనండి, వీటి కారణాలతోనే మన Body language లోకూడా తేడా కనిపిస్తోంది.ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, ఆ diffident attitude లోంచి మారుతున్నాము. దానితో మన confidence levels కూడా మారుతున్నాయి. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూఉంటుంది
ఇలా “తెచ్చిపెట్టుకున్నవి” అంత అవసరమా అని. కానీ if it helps change our body language, why not... అనుకుంటే పోతుందిగా…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Though late…..

    ఒకానొకప్పుడు, అంటే చదువుకునే రోజులే కాకుండా, ఉద్యోగంలో చేరాక కూడా, క్రికెట్ అంటే పడి చచ్చేవాణ్ణి ! ప్రపంచంలో జరిగే ప్రతీ టెస్ట్ మాచ్ రికార్డులు కూడా పుస్తకంలో వ్రాసుకునేవాణ్ణి. అసలు క్రికెట్ అంటే ఇష్టం లేనివాళ్ళుంటారా ప్రపంచంలో అనుకునేవాణ్ణి. నా అదృష్టం బాగుండి, మొత్తానికి ఆ “మత్తు” లోంచి బయటపడకలిగాను. ఎంత హాయిగా ఉందో నిజంగా . ఏదో ఒక వ్యాపకం ఉండాలిగా మరి, Soccer, Tennis, F1 ల మీద అభిమానం పెంచుకున్నాను. దీనికి కారణం మా అబ్బాయికూడా అనుకోండి. ఏది ఏమైతేనేం, అన్ని లీగ్ మాచిలూ ఫాలో అవడం, మొదలెట్టడం ప్రారంభం అయింది.

   ఈవేళ జరిగిన English Premier League మాచిలు, వహ్వా..వహ్వ.. ఫుల్ టైమైన తరువాత stoppage time లో Manchester City కొట్టిన రెండు గోల్సూ అత్యద్భుతం. పైగా ఈ మాచ్ నెగ్గి, Manchester United నుండి, EPL Title ( అదీ Goal Difference మీద ) నెగ్గడం, ఓ సినిమా suspence thriller లా జరిగింది. ఎంతలా ఆస్వాదించామంటే చెప్పలేను. అస్తమానూ ఒకే టీమ్ నెగ్గితే బోరు కొట్టేస్తుంది కదూ.. Champions League లో Real Madrid, Barcelona నాకౌట్ అవడమూ, ఇక్కడ Manchester United కి టైటిల్ రాకపోవడమూ, అదండి excitement అంటే.

   ఒకానొకప్పుడు, మా అన్నయ్యగారు చేసిన అలవాటు ధర్మమా అని న్యూస్ పేపరు చదవడం ఓ అలవాటు చేసికున్నాను. నన్ను చూసి పిల్లలూ అనుకోండి. అదేమిటో, ప్రతీ రోజూ పేపరు చూడందే తోచేది కాదు. పుణె లో తెలుగు పేపరు దొరుకుతున్న కారణం అయితేనేమిటి, మరీ ఎవరైనా వస్తే అర్రే మీ ఇంట్లో పేపరే తెప్పించుకోరా అని అంటారేమోననే భయం వల్ల అయితేనేమిటి, తెలుగు పేపరు ఒకటి కొనేవాడిని. అప్పుడప్పుడనుకునేవాడిని, హాయిగా నెట్ లో చదువుకోక, రోజుకి మూడు రూపాయలు తగలెట్టడం అంత అవసరమా అని, కానీ మొత్తానికి గత వారం రోజులుగా జరిగిన పరిణామాల ధర్మమా అని, చూస్తున్నదేమిటీ, ఈనాడు, సాక్షి వాళ్ళు ఒకళ్ళమీదొకళ్ళు దుమ్మెత్తి పోసుకోడం తప్పించి. అమ్మయ్య, ఇంక పేపరు కొనఖ్ఖర్లేదూ అని డిసైడయిపోయాను. దానికి సాయం మా ఇంటావిడ కూడా చెప్పేసింది, నేనూ నెట్ లోనే చదివేస్తాను, పేపరు మానేయండి అని. సుఖపడ్డాను..

   అయినా ఈ దిక్కుమాలిన పేపర్లు కొనకపోతే ఏమౌతుందిట? ఇంక తెలుగు వారపత్రికల మీద దృష్టి పెట్టాలి.”నవ్య” పత్రిక, శ్రీరమణ గారి “మొదటి పేజీ”, ఆయన వెళ్ళిపోయిన తరువాత, జగన్నాధ శర్మ గారు కంటిన్యూ చేస్తున్న మొదటి పేజీ, అలాగే ఇంకా కొన్ని ఆసక్తికరమైన శీర్షికలు కోసం తప్పకుండా చదివేవాణ్ణి. ఇంకేమీ పని లేనట్టు, ఈమధ్యన ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు వ్రాస్తున్న “నేనూ నా పాఠకులూ” అని ఒకటి మొదలెట్టారు. మొదటి భాగం చదివాక, అమ్మయ్య “నవ్య” కొనడం ఇంక మానేయొచ్చూ అనిపించింది. కానీ రచయితల ఫోను నెంబర్లిస్తూంటారు. పోనీ వాటికోసమైనా కొంటే పోలా అనిపిస్తుంది. చూడాలి..

   ఒకానొకప్పుడు సినిమా మొదటి రోజు చూడని బ్రతుకూ ఓ బ్రతుకేనా అనిపించేది. ఇప్పుడో, ఏదో ఒకటీ అరా తప్పించి, అసలు సినిమా అనేదే చూడాలంటే అసహ్యం వేస్తోంది. ఇదంతా ఏదో చాగంటి వారి ప్రవచనాలు వినడం మొదలెట్టిన తరువాత వచ్చిన వైరాగ్యం అనుకోకండి, ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది, మన జీవితకాలంలో ఎంతంత టైము వేస్టు చేస్తున్నామూ అని. అయినా మనస్సుకి entertainment అనేది ఉండాలికదా అనొచ్చు.

   మనకి part and parcel of our life అని ఒకప్పుడు అనుకునేవాటినుండి కూడా బయటపడొచ్చు, పడాలనుకుంటే… though late than never…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కోపం వస్తే ఎవరికంట….

   ఉద్యోగం లో ఉన్నంతకాలం మనకి ఒక previlege ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ళమీద కోపం తెచ్చేసికోడం. ఆ కోపానికి ఓ అర్ధం పర్ధం ఉండేది కాదు. అప్పుడు తెలిసేది కాదు, కారణం, అధికారం. మా జిఎం ఒకరుండేవారు వరంగాం లో, ఆయన దగ్గరకు మా ఫ్రెండు ఒకతను వెళ్ళి సలహా అడిగాడు, ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం మంచిదా, ప్రభుత్వం లో మంచిదా అని. అప్పటికి అంటే పదిహేనేళ్ళు ముందరి మాట, ఈ పేకమిషన్లలో ప్రభుత్వోద్యోగులకి, మరీ అంతంత జీతాలుండని రోజులు. ఆ జిఎం గారిచ్చిన సలహా ఏమిటంటే, Govt job is always good, as it carries lot of power.. అని! నిజమే కదూ, చప్రాసీ దగ్గరనుండి, Chief Excecutive దాకా ప్రతీ వాడికీ పవరే. వామ్మోయ్ గేటు దగ్గర నుంచీ, ప్రతీ వాడూ పోజెట్టేవాడే. ఏదో అందరినీ దాటుకుని, మొత్తానికి “గర్భగుడి” దాకా చేరినా, శ్రీవారి పిఏ గారి చలవుండాలి. దీనితో ఏమయ్యిందంటే, ప్రభుత్వం లో పని చేసి రిటైరయిన ప్రతీవాడికీ ఈ కోపం అనేది అలవాటైపోయింది. ఉద్యోగంలో అయితే పరవా లేదు కానీ, రిటైరయిన తరువాత వీళ్ళ మాటెవడు వింటాడండి బాబూ?

   ఏదో రిటైరయిన కొత్తలో మహ అయితే కట్టుకున్న భార్య వినొచ్చు. ఏదో పోనిద్దూ, అలవాటైన ప్రాణం అని. పాపం ఆయన్ని ఈ వయస్సులో క్షోభ పెట్టడం ఎందుకులే అని.ఈ సంగతి గుర్తించలేక, మన “హీరో” గారు, ఇంకా పేట్రేగిపోతూంటాడు. అయిన దానికీ, కానిదానికీ కోపం తెచ్చేసికోడమే, పేద్ద కారణమేమీ ఉండఖ్ఖర్లేదు. ఏదో ఇంట్లో వాళ్ళమీదైతే ( అదీ limited to wife only..) కోపం తెచ్చుకోవచ్చుగానీ, బయట వాళ్ళ మీద కొపాలూ తాపాలూ తెచ్చికుంటే, కాళ్ళిరక్కొడతారు.

   పసిపిల్లల్లో చూస్తూంటాము, వాళ్ళక్కావలిసినది ఇవ్వకపోతే, కోపం తెచ్చేసికుని, చేతిలో ఏముంటే అది విసిరి కొడుతూంటారు. వాళ్ళకైతే చెల్లుతుంది, ఏదో పెద్దయినతరువాత తమర్ని ఉధ్ధరించేస్తారూ, ఈమాత్రం కోపం ఉంటే పరవాలేదూ, వృధ్ధిలోకి వస్తాడూ అని, ఏదో “నజరందాజ్” చేసేస్తూంటారు, కొంతమంది తల్లితండ్రులు. కానీ ఆ ఇంటిపెద్ద కోపిష్టి అయినవాడైతే, నాలుగు దెబ్బలేస్తాడు. అదికూడా ఓ లిమిటెడ్ పిరీయడ్ దాకానే, ఎప్పుడో వాడు తిరగబడేదాకా! తెలివైన తండ్రులు, బలే పట్టేస్తారులెండి, ఆ threshold ని !కొంతమంది తల్లితండ్రులైతే, వాడి దారిన వాణ్ణేడవనీయండి, వెధవ కోపం వీడూనూ, ప్రతీదానికీ పేచీ పెడితే కుదురుతుందా, అంటూంటారు. కొంత సేపు ఏడిచేసి, ఎవరూ పట్టించుకోడంలేదని తెలిసి, చివరకి ఊరుకుంటాడు. వాళ్ళ కోపాలు తాటాకు మంటల్లాటివి, ఓసారి పేద్ద మంటొచ్చేసి ఆరిపోతాయి. పెద్ద నష్టమేమీ ఉండదు.

    ఈ short tempered ప్రబ్రుధ్ధుల్ని చూస్తూంటాము బయట. ఓ బస్సు టైముకి రాకపోతే కోపం. ఓ ట్రైను టైముకి రాకపోతే కోపం. బస్సులో కూర్చోడానికి సీటు దొరక్కపోతే కోపం.
సొసైటీలో లిఫ్ట్ పనిచేయక, అన్ని మెట్లూ ఎక్కేడప్పడికి కోపం. నీళ్ళు రాకపోతే కోపం. ఒకటేమిటి, ప్రపంచంలో అందరూ కలిసి తనమీద కసి తీర్చుకుంటున్నారేమో అన్నంత కోపం. వీటిల్లో కోపం తెచ్చుకుని చేసేదేమీ లేదు. రైళ్ళెక్కడం మానేస్తామా, బస్సులో వెళ్ళడం మానేస్తామా, మెట్లెక్కి కొంప చేరడం మానేస్తామా, అవసరం వస్తే కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోడం మానేస్తామా, ఏమీ లేదు ఉత్తి జరుగుబాటు రోగం. వాళ్ళనేమీ చేయలేక లోకువగా ఉన్న ఇంటావిడ మీద ఎగరడం.

    ఒక్కొక్కప్పుడు నాకే అనిపిస్తూంటుంది, ఉత్తిపుణ్యాన్న మా ఇంటావిడ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటానూ అని! పోనీ తనేమైనా తప్పుమాట అన్నదా అంటే అదీ లేదు. “ అన్నన్ని మిస్టరీ షాపింగులు చేసి, ఇంటినిండా అన్నేసి, బ్రాండెడ్ బట్టలు కొంటున్నారే, మరి అస్తమానూ ఆ దిక్కుమాలిన దీక్షా వస్త్రాలు వదలరే, హాయిగా ఆ కొత్త బట్టలేసికోవచ్చు కదండీ, ఎవరికోసం దాచిపెట్టడమూ...” అని. ఇవాళ్టికివాళ, మామిడికాయ ముక్కలు ఉప్పులో పోసి ఎండబెట్టడానికి, టెర్రెస్ తాళం వాచ్ మన్ ని అడిగి తీసికుని ఎండలో పెట్టాము. ఆ తాళం చెవి వాడికి తిరిగిచ్చేయకపోయారా , జేబులో వేసుకెళ్ళడం ఎందుకూ అంది. అంతే కోపం వచ్చేసింది. మరీ చిన్న పిల్లాడిలా చేతిలో ఉన్నది విసిరేయడం కాదనుకోండి, హై పిచ్ లో మాట్టాడడం అన్న మాట. అంత అవసరమంటారా ఇలాటి వెర్రి వేషాలు నాకూ? అసలు గొడవేమిటంటే, మేముండేది నాలుగో అంతస్థులో, ఆ దిక్కుమాలిన లిఫ్ట్, కొన్ని ట్రైన్లు ముంబై CST దాకా కాకుండా, కుర్లా లోనో, దాదర్ లోనో ఆగిపోయినట్టు, రెండో ఫ్లోర్ దాకానే వస్తోంది. ఆ లిఫ్ట్ బాగు పడదూ, చెప్పానుగా మా సొసైటీ లో సీనియర్ సిటిజెన్లు మేమే. మిగిలినవాళ్ళందరికీ మెట్లెక్కడం అంటే ఎంత సంబరమో! నన్ను డబ్బులెఖ్ఖలడిగితే. కోపం, షూస్ పాలిష్ చేయించుకోమంటే కోపం.బట్టలు రోజువిడిచి రోజు మార్చుకోమంటే కోపం, ఒకటేమిటి ఓ కారణం అఖ్ఖర్లేదు. అయినా భరిస్తోంది పాపం! ఎప్పుడో చెప్పేస్తుంది enough is enough అని, వదిలిపోతుంది రోగం! అప్పటిదాకా ఇలా కానిచ్చేయనీయండి.

   ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఏ కారణం లేకుండా, కోపాలు తెచ్చుకునేవాడు, గ్యారెంటీగా ప్రభుత్వోద్యోగే ! ప్రెవేట్ లో వాళ్ళకి పాపం ఇన్నిన్ని అవకాశాలు లేవు. ఏదో అన్నా హజారే గారి లాటివారు ఏ ధర్నాయో, ఉద్యమమో ప్రారంభించినప్పుడు, ఆయన్ని సపోర్టు చేయడం తప్ప …..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గ్యాపకం ఉండి చావదు….

   మరీ “జ్ఞాపకం” అని వ్రాస్తే, మరీ ఇదేమిటీ ఈయన ఇంత గ్రాంధికంగా వ్రాస్తున్నాడూ అని అపోహ పడే అవకాశం ఉండడం చేత, ఈ టపాకి అలా శీర్షిక పెట్టాల్సొచ్చింది. అప్పుడే వారం రోజులైపోయింది, టపా వ్రాసి, ఏమిటో బిజీ బిజీ అయిపోయాను. ఫ్రెండ్సూ, పిల్లలూ, మిస్టరీ షాపింగులూ ఒకటేమిటి, ఇదివరకటి కంటె బిజీ అయిపోయాము. దానితో ఈ టపాలూ, బ్లాగులూ అసలు గ్యాపకమే ఉండటం లేదు.

ఈ గ్యాపకాల విషయానికొస్తే, టివీ ల్లో శ్రీ చాగంటి వారివీ, మల్లాది వారివీ, గరికపాటివారివీ ప్రవచనాలు వింటూంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు వారికి ఆ ధారణా శక్తి, భగవంతుని వరమేమో అని. ఎక్కడెక్కడివో పద్యాలూ, శ్లోకాలూ సునాయాసంగా చెప్పేస్తూంటారు. మన ఇళ్ళల్లో పెద్దవారిని చూడండి, మన చుట్టాల్లో ఎవరెవరి పుట్టినరోజులు ఎప్పుడో తిథి వార నక్షత్రాలతో సహా చెప్పేస్తూండేవారు. మరి అవి వారు పాటించే జీవన విధానం లో ఉందంటారా?

చిన్నప్పుడు మనకీ గ్యాపకం ఉండేవి ఎక్కాలూ, పద్యాలూ, వగైరా. కానీ కాలక్రమేణా, టెక్నాలజీ ధర్మమా అని, ఆ “గొడవ” ఒకటి తప్పింది! ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు మాత్రం గుర్తుంటూంటాయి. ఎప్పుడో ఎవడో అన్న మాటలు, వాడితో ప్రతీకారం ఎలా తీర్చుకుందామా ఇలాటివి. అంతేకానీ, ఉపయోగించే విషయాలు మాత్రం గుర్తుండవు. ఏదైనా లెఖ్ఖ చెప్పాలంటే, calculator లేకుండా పని జరగదు. ఏదైనా సమాచారం కావాలంటే “ గూగులమ్మ” ఎలాగూ ఉండనే ఉంది. మళ్ళీ ఈ గ్యాపకం ఉంచుకోడాలెందుకూ, లేని పోని తంటా?
హాయిగా ఓ నొక్కు నొక్కితే “ప్రపంచం మీ గుప్పెట్లో”. దీనితో మన మెదళ్ళని టాక్స్ చేసే అవసరం పోయింది. దానితోనే ఈ రోగాలూ రొచ్చులూనూ. దేనికివ్వాల్సిన exercise దానికివ్వకపోతే అలాగే తగలడుతుంది.

మన ఇళ్ళల్లోనే చూడండి, ఏ వస్తువు ఎక్కడ పెట్టామో ఛస్తే గ్యాపకం ఉండదు. అవసరం వచ్చినప్పుడు కనిపించదు. ఇల్లంతా పీకి పందిరేసేస్తాము. ఎప్పుడో కనిపిస్తుంది. మా ఇంటావిడకి ఓ అలవాటుంది. ఏ కాఫీయో, చాయో తాగ్గానే, ఆ కప్పులోనో, గ్లాసులోనో నీళ్ళు పోసేస్తుంది, ఎండి పోకుండా. అంతవరకూ బాగానే ఉంది. వచ్చిన గొడవల్లా, గిన్నెలో మిగిలిపోయిన కాఫీయో, చాయో, మళ్ళీ వేడి చేసి, అప్పుడప్పుడు నాకిస్తూంటుంది.పోనీ అదేదో నాకొక్కడికే ఇస్తే ఏం పోయిందిట. మళ్ళీ అందులో కొంత తనూ తాగుదామని, అక్కడే ఉన్న కప్పులోనో, గ్లాసులోనో పోసుకుంటుంది. అంతకుముందు, దాంట్లో నానపెట్టడానికి పోసిన నీళ్ళ సంగతి గ్యాపకం ఉండదు, అదేమిటీ కొంచమే కదా మిగిలిందీ, మరీ ఇంతయిందేమిటీ, అని నోట్లో పెట్టుకుంటే , అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో ఆ నీళ్ళు తీయనేలేదూ అంటూ!దానితో ఈమధ్యన, ఎప్పటి పని అప్పుడే చేసేస్తోంది! లాండ్రీ వాడికి ఎప్పుడైనా మా ఇంటావిడ చీరలు వేసి, తెచ్చేటప్పుడు గొడవొస్తూంటుంది. ఏదో నాలుగు చీరలున్నాయని గుర్తుంటుంది కానీ, ఏ రంగువో ఎప్పుడూ గ్యాపకం ఉండదు. ఇలా కాదని ఈమధ్యన ఆ చీరలేసేముందు, ఓ ఫొటో తీసిపెట్టుకుంటూన్నాను. ఇలా తగలడింది, నా గ్యాపకాలు పెట్టుకోడం!!

ఎవరివో మన చుట్టాలవో, ఫ్రెండ్స్ వో పుట్టిన రోజులూ, పెళ్ళి రోజులూ ఎక్కడో నోట్ చేసికుంటాము. ఎక్కడో గుర్తుండదు. అయినా ఉజ్జాయింపుగా ఓ ఫోను చేస్తాము. అప్పుడు తెలుస్తుంది, ఆ ముందురోజే అయిపోయిందనో, అసలు ఆ నెలలోనే కాదనో !ఎవరో భోజనానికి వస్తారనీ, మర్నాటికి పెరుగు అవసరం ఉంటుందీ అని గుర్తుంటుంది. కానీ వేడి చేసిన పాలల్లో తోడు పెట్టాలని గ్యాపకం ఉందదు. అంత అవసరం పడితే, బయటనుంచి, ఓ పెరుగు డబ్బా తెచ్చుకోవచ్చులెద్దూ అనే, సదుపాయం ఉందే, అదీ కారణం తోడు పెట్టకపోవడానికి.

ఇదివరకెప్పుడో ఒక టపా వ్రాశాను, ఈ “మర్చిపోవడాల” గురించి. నవ్వడం ఓ “భోగం” అన్నట్లు, ఈ మర్చిపోవడాలూ, గ్యాపకం లేకపోవడాలూ ఓ ” రోగం”. ఇలాటివే పెరిగి పెద్దయేసరికి, అవేవో Alzheimer’s Disease లోకో ఇంకో దేంట్లోకో దారితీసేస్తూంటాయి.మరీ అంత కాకపోవచ్చుననుకోండి, కానీ అలాటి అవకాశాలున్నాయి. పైగా చిన్న పిల్లలకి
జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని, మార్కెట్ లో ఈమధ్యన ఎక్కడ చూసినా, అవేవో Memory Busters అని కొన్ని మొదలెట్టారు. వాటికి టివీ ల్లోనూ, పేపర్లలోనూ పెద్ద పెద్ద యాడ్లూ.
ఇంక పెరెంట్సూకూడా అమ్మయ్య ఇలాటిదేదో రోజూ పట్టించేస్తే, మనవాడు ఏ ఐఏఎస్సో అయిపోతాడూ అని కలలు కనేస్తూంటారు. ఈ consumerism ధర్మమా అని, ఎంత నష్టపోతున్నామో మాత్రం గుర్తించరు. ఆ మధ్యన ఒక article చదివాను. మీరూ చదవండి.తెలుస్తుంది అసలు గొడవంతా ఎక్కడుందో? అర్ధరాత్రుళ్ళూ అపరాత్రుళ్ళదాకా టివీలు చూస్తూ కూర్చోడం, ఏది పడితే దాన్ని తినడం ,ఒకటేమిటి, మనం ఈరోజుల్లో చేస్తున్న ప్రతీ పనీ, తింటున్న ప్రతీ చెత్త, వీటికి కారణాలే. పైగా మనం ఒక్కళ్ళమే కాకుండా, పిల్లలకీ ఇవే అలవాట్లు. మరి ఏదీ గ్యాపకం ఉండడం లేదంటే, ఎక్కణ్ణుంచుంటుందీ.

%d bloggers like this: