బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– అయోమయం అధ్వాన్నం…

గుర్తుందా మనదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే, ఊళ్ళో రెండుమూడేళ్ళకోసారి రోడ్లు వేస్తూంటారు. ఒకానొకప్పుడు మట్టిరోడ్లు, ఆ తరవాత కంకర, ఇప్పుడైతే ఏక్ దం కాంక్రీటులోకి దిగిపోయారు. ఒకప్పుడు వర్షాలువచ్చినప్పుడు ఆ నీళ్ళు  ఇంకడం, దానిద్వారా భూజలసంపద  పెరగడం, దానివలన ఎక్కడైనా ఓ చెరువో, నుయ్యో తవ్వినప్పుడు, నీళ్ళు పడడం  లాటివన్నీ కథల్లో చదువుకోడమే.. ఈరోజుల్లో మట్టి అనేదే కనిపించదు.. అయినా ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకులెండి– కాంక్రీటు రోడ్లకి అలవాటు పడిపోయారు జనాలు.. దానికి సాయం పంచాయితీ బోర్డులూ, మునిసిపాలిటీలూ, కార్పొరేషన్లూ కూడా ఈ రోడ్లు వేయడమనే ప్రక్రియకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోడ్లు వేయడంవరకూ బాగానే ఉంది..  ఆరోడ్డువేసేది ఓ శాఖవాడు, తీరా ఆరోడ్డు వేసిన తరువాత ఇంకో శాఖవాడికి గుర్తొస్తుంది– అరే అక్కడ నీళ్ళ పైపుకి ఏదో రిపేరీ వచ్చిందీ అని– ఆ వేసిన రోడ్డేదో తవ్వేసి వాడిపని వాడు చూసుకుంటాడు.. అలా వివిధశాఖలవారూ– అంటే టెలిఫోను, ఎలెట్రీ, వీళ్ళు కాకుండా ప్రెవేట్ కంపెనీల వాళ్ళూ ( కేబుల్స్ వేయడానికి).. ఎవరిదారిన వాళ్ళు , ఒకరితరవాత ఇంకోరు  వేసిన రోడ్డుని తవ్వుకుంటూ పోతారు. మధ్యలో  BRTS  అంటారు,  Metro  అంటారు.. ఇలా చెప్పుకుంటూ పోతే, మనరోడ్లు లక్షణంగా ఎప్పుడూ ఉండవు. అన్ని శాఖలవాళ్ళూ  coordinate  చేసుకుని పని ఎందుకుచేయరో ఛస్తే అర్ధమవదు.  అవునులెండి ..ఈ పనులకి టెండర్లూ.. అస్మదీయులూ, తస్మదీయులూ.. ఎంత కథ నడవాలీ?

ప్రభుత్వాల ముఖ్యోద్దేశమేమిటంటే, ఏదోలాగ జనాల్ని సుఖంగా బతకనీయకూడదని… ఏమిటేమిటో  welfare statట్టూ సింగినాదం అంటూంటారు. అప్పుడెప్పుడో UPA   ప్రభుత్వం, నందన్ నీలెకేనీ గారి నేతృత్వంలో ,    ఆధార్  గుర్తింపు కార్డులు మొదలెట్టారు.. వాటిని మొదలెట్టినప్పుడు, ప్రస్తుత అధికార ( ఆనాటి ప్రతిపక్షం )పార్టీవారు.. హాత్తెరీ ఇంత ఖర్చు అవసరమా, ఇదేమైనా అమెరికాయా ప్రతీ పౌరుడికీ గుర్తింపు కార్డెందుకూ, ఏదో ఎన్నికల టైములో పట్టించుకుంటే సరిపోదా…  blah..blah..  అని ఏవేవో అనేసారు., ఆ కార్డుల ప్రక్రియ పూర్తయేసరికి  UPA  వారి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది…   BJP  అధికారంలోకి రావడమేమిటి, ఇదివరకటి  సంక్షేమ పథకాల పేర్లన్నీ మార్చేసి, కొత్త పేర్లు పెట్టేసారు   Old wine in New bottle… పైగా ఇవన్నీ ” అచ్చే దిన్ ” అన్నారు.. ఓహో నిజమే కాబోసనుకున్నారు జనాలు. ఆధార్ గుర్తింపు కార్డుదగ్గరకొచ్చేసరికి, ఏం చేయాలీ  తీసేద్దామా పోనీ, అని తర్జనభర్జనలు చేసేసి, మళ్ళీ ఖర్చెందుకూ అనుకుని, ఏదో ఘనకార్యం చేసినట్టు , తీసేయకుండా కొనసాగించారు.పోనీ ఉంచినవాళ్ళు శాంతంగా ఉండాలా, అబ్బే, ప్రతీదానికీ లింకు చేయాలన్నారు. అసలు మన అస్థిత్వం , ఆ ఆధార్కార్డ్ లో నిక్షిప్తం అవాలన్నారు.. అసలు ఏవేంకావాలో, ఆ కార్డ్ చేసినప్పుడే అడిగేస్తే గొడవుండేది కాదు… అబ్బే ప్రభుత్వ నిర్వాకం కదా, రోడ్లు వేసేటప్పుడు, ప్రాంతీయ స్థాయిలో ఎలా ఉంటుందో, అదే జాతీయ స్థాయిలో  మొదలెట్టారు..  ఓవైపున  మొబైల్ లో కొత్త సిమ్ వేసుకోడానికి,  biometeric  ఎలాగూ చేస్తారు.. అది   TRAI  కి సరిపోదుట, మన ఆధార్ కార్డుకీ, మన మొబైల్ నెంబరు జోడించడం అనివార్యం అని మొదలెట్టారు… 

సరే మా ఇంటిదగ్గర ఉండే  IDBI Bank  బయట  2018  జనవరి నుండీ, ప్రతీరోజూ, జనాలు బారులు తీసి నుంచోడం చూడ్డమయితే చూసాను.. ఓ రోజు క్యూలో నుంచున్న ఓ పెద్దమనిషిని అడిగితే, ” ఏమో నాకూ తెలియదూ.. అందరూ నుంచుంటున్నారు కదా అని నేనూ నుంచున్నానూ, ఏమో మోదీగారు అప్పుడెప్పుడో ప్రతీ బ్యాంకు ఎకౌంటులోనూ 15 లక్షలు వేస్తానన్నారుగా.. అదయుండొచ్చూ.. “.. ఇలాకాదని అక్కడుండే సెక్యూరిటీ అతన్ని అడిగితే చెప్పాడు.. ఆధార్ – మొబైల్ లింకింగ్ ప్రక్రియ అని. మూడేళ్ళ క్రితం నా  Pension life certificate  కోసం  SBI  కి వెళ్ళినప్పుడు, నా అధార్ కార్డూ, నా  mobile  లో  O T P   లక్షణంగానే వచ్చాయి.. అయితే ఈ గొడవ నాకవసరం లేదని వదిలేసాను… ఆమధ్య ఎప్పుడో,  SBI ATM  కి వెళ్తే, మొట్టమొదట..  ” You want to update your ADHAAR ? ”  అని   display  అవగానే, బుధ్ధిమంతుడిలా, నెంబరు వేసాను… ” అబ్బే  ..  could not be verified  అంది.మరి ఇదివరకు లక్షణంగా ఉన్నది ఏమైపోయినట్టో ఆ దేవుడికే తెలియాలి.. సరే పేద్ద పనేమీ లేదుగా, నేనూ చేసేసికుందామనుకుని ఏప్రిల్ 3 న  IDBI Bank  కి వెళ్తే, ఆ  Adhar Exercise  అంతా ఆపేసామన్నారు. హాయిగా ఇంటిదగ్గరది వదులుకుని, ఊళ్ళో ఈ కేంద్రాలగురించి అన్వేషణ ప్రారంభం…  e- seva kendras  లు చూస్తే, అక్కడేమో కొల్లేరుచేంతాళ్ళంత క్యూలూ.., పైగా రోజుకి limited to 10 Nos,  వాటికి  టోకెన్లూ.. అడక్కండి, చిరాకెత్తిపోయింది. ఊళ్ళో ఉన్న ఈ కేంద్రాలన్నీ వెదికినా, ఇదే తంతు. పోనీ ఆ నింపాల్సిన  application form  ఇస్తారా అంటే అదీ లేదూ.. క్యూలో నుంచుంటేనే ఇస్తారుట.. ఈ మధ్యలో మా అబ్బాయి ..” డాడీ లింకుచేసారా.. ” అంటూ.. ఇంటావిడైతే అడక్కండి… ఈమధ్యలో వాళ్ళెవరో  Supreme Court  లో  P I L  వేసారు–ఇదంతా  against fundamental rights  అని.. వాళ్ళేమో   తీర్పు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని నోరుమూసుక్కూర్చోమన్నారు..ఏమో ఆ తీర్పెలా ఉంటుందో ఎవడికి తెలుసూ, మనపనేదో చేసేస్తే ఓ గొడవొదిలిపోతుందీ అనుకున్నాను. నా అదృష్టం చూడండి.. మా దగ్గరలో ఉండే,  IDBI Bank  దగ్గర బోర్డుపెట్టారు.. ఆధార్ కార్యక్రమం గురించి.. లోపలకి వెళ్ళిఅడిగితే, ఓ ఫారం ఇచ్చి, నింపితెమ్మన్నారు.. సరే అనుకుని మర్నాడు వెళ్తే, అదేదో మాయదారి  Server down.. ఓ గంట కూర్చున్నతరవాత మళ్ళీ రమ్మన్నారు. ఆ సోమవారం, ఇంటావిడ బయటకు వెళ్ళడంతో నేనూ, నా సంచీ ( పంచాంగం కట్టలాగ ) రెడీ.. మూడునిముషాల్లో పని పూర్తిచేసాడు ఆ అబ్బాయి. ఆంటీని మర్నాడు తీసుకొస్తే ఆవిడదికూడా చేసేద్దామూ అని ఆశ్వాసనిచ్చాడు. మర్నాడు నేనూ. ఇంటావిడా, నా సంచీ ..మళ్ళీ హాజరూ..  Server down  మళ్ళీ…

తిరిగి మూడున్నరకి వెళ్ళి ఆంటీగారి ఆధార్ సంబంధిత యజ్ఞం పూర్తిచేసాము.. కథ సుఖాంతం..

నాకో డౌటు– ఈ మధ్యన  TRAI  వాళ్ళు మొబైల్ నెంబర్లన్నీ  13 digits  లోకి మారుస్తామంటున్నారు.. మళ్ళీ ఇదంతా తిరిగిచేయాలేమో..  keeping fingers crossed.  మధ్యలో ఎవడో ” ప్రవర ” లింకుచేయాలనొచ్చు.. ఏమో.. ” అఛ్ఛే దిన్ ” కదా..  anything can happen.

%d bloggers like this: