బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అమ్మమ్మలు,నాన్నమ్మలు-2

   ప్రతిఫలాపేక్ష ఏదీ లేకుండా, పసిపాపలకి సేవ చేసేది ఈ అమ్మమ్మలూ,నాన్నమ్మలే అని నా అభిప్రాయం! ఆఖరికి తల్లితండ్రులు కూడా ఆ కోవలోకి చేరరేమో, ఎందుకంటే, అందరూ కాకపోయినా కొంతమంది తల్లితండ్రులైనా, ఈ పిల్లో పిల్లాడో పెద్ద అయినతరువాత తమకి ఆసరాగా ఉంటాడని ఆశించేవారే!కొంతమందికి నా అభిప్రాయం కోపం తెప్పించొచ్చుననుకోండి, కానీ ఫాక్ట్ ఈజ్ ఎ ఫాక్ట్ ! అందుకేనేమో చాలామందినుండి వింటూంటాము, ‘వాణ్ణి ఎంతో కష్టపడిపెంచామూ, చూశారా ఆ మాత్రం కృతజ్ఞతైనా లేకుండా, పెళ్ళాం మాటల్లో పడి, వేరింటి కాపరం పెట్టేశాడూ’ అని.దీనర్ధం ఆ పిల్లల దగ్గరనుండి ప్రతిఫలం ఆశించినట్లే కదా మరి!

   ఇంక కొంతమందుంటారు, పిల్లో పిల్లాడో పెళ్ళయి వెళ్ళేదాకా, వీలున్నంతవరకూ వాళ్ళచేత ఏదో ఒకటి కొనిపించుకోవడం, రిటైరయిన తరువాత వాళ్ళు ఉద్యోగంలో ఉన్నంతకాలం చూడలేకపోయినవన్నీ,చూపించుకోవడం, పైగా ఏమైనా అంటే, ‘పెళ్ళైతే ఎలాగూ మన చేతుల్లో ఉండడండీ, ఏదైనా చేయించుకుంటే ఇప్పుడే’ అని ఓ సమర్ధనోటి!మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూడమంటే, ఏవేవో కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం, పిల్లల్ని చూడూ అంటే, కాదు పెద్దాళ్ళైపోయారూ మా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాలీ అనడం, పోనీ ఆ పెద్దవారైన తల్లితండ్రుల్ని చూస్తారా, వాళ్ళడిగితే, మనవలూ,మనవరాళ్ళనీ చూసుకోవాలీ అనడం. ఆతావేతా జరిగేదేమిటంటే, ఎదో ఒక వంక ( సందర్భాన్ని బట్టి)చెప్పేసి, ఇద్దరికీ చేయకుండా తప్పించేసికోవడం! వీళ్ళ పనే హాయి కదూ ! ఓ కమిట్మెంటు లేదు.పైగా కోడలుతో చెప్పడం, ఏవమ్మోయ్ నీ పిల్లల్ని మామీద వదిలేసి ఉద్యోగం అంటూ వెళ్ళిపోకే,నాకూ వయస్సొచ్చేసింది, ఏదో మీ పిల్లలకి కాలూ చేయీ, మాటా వస్తే ఫరవా లేదు కానీ,పిల్లల ఉచ్చలూ,దొడ్లూ తుడిచే ఓపిక మాత్రం లేదమ్మోయ్!అని.

   ఈ రోజుల్లో భార్యా భర్తా ఉద్యోగం చేయకుండా, త్రీ బెడ్ రూం ఫ్లాట్టులూ, హోం థియేటర్లూ, ఐ-10,ఐ-20 కార్లూ, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎడ్మిషన్లూ ఎలా వస్తాయిటమ్మా? ఆ భార్య కాస్తా ఉద్యోగం మానేసిందంటే, రెండు మూడు ఈ ఎమ్ ఐ లు
గోవిందా గోవింద
. తమ తమ సర్కిళ్ళలో, తమ పిల్లలు ఎంతంత పేద్ద పేద్ద ఇళ్ళల్లో ఉంటున్నారో, వాళ్ళింట్లో ఏమేమి ఉన్నాయో,వీళ్ళని వీకెండ్లకి ఎక్కడెక్కడికి తీసికెళ్ళారో, చెప్పుకోవాలీ, వారి మధ్యలో ఓ ఇమెజ్ బిల్డ్ అప్ చేసికోవాలీ, కానీ కోడలు మాత్రం ఉద్యోగానికి వెళ్ళకూడదు! ఆహా ఏం న్యాయమండీ ! నేను నిన్న చెప్పిన 99% కాక మిగిలిన 1 % లోకి వస్తారు ఈ జనాలు! ఎవడెలా పోయినా సరే, అది కొడుకవనీయండి, కూతురవనీయండి, మనం పెంచి పెద్దచేశామూ
అందువలన వీళ్ళు బ్రతికున్నంతకాలం వీళ్ళ ఆలనా పాలనా ఆ పిల్లలే చూడాలి బస్! నో అర్గ్యుమెంట్ ! ఉన్న ఆస్థంతా పోయేటప్పుడు కట్టుకుపోతారా ఏమైనా?

   అలాటివాళ్ళ సంగతి వదిలేయండి, పారసైట్లుంటూనే ఉంటారు.ఉత్తినే మూడ్ పాడిచేసికోవడం కంటే, అసలు సిసలైన అమ్మమ్మలూ, నాన్నమ్మలగురించీ మాట్లాడుకుందాం, పుణ్యం పురుషార్ధమూనూ!ఒకవైపు ఏదో మందులు మింగనేనా మింగుతారు కానీ, మనవళ్ళకీ మనవరాళ్ళకీ మాత్రం ఏమీ లోటు రానీయరు. వాళ్ళు పడే బాధేమిటో, భర్తలతో మాత్రమే పంచుకుంటారు. ఆ పసిపిల్లల్ని సాకుతూంటే ఏదో తను కన్న పిల్లల్నే చూసుకుంటారు. మరి అదే కన్నపేగంటే! ఈ విషయంలో మాత్రం ఇప్పటి జనరేషన్ వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే, ఏదో ప్లానింగూ, కెరీయరూ అంటూ ముఫై నలభై ఏళ్ళొచ్చేదాకా పిల్లల్ని కనడం మానెయకండి, ఎందుకంటే మీరు కనే టైముకి, మన మోస్ట్ వాల్యుబుల్ అమ్మమ్మ, నాన్నమ్మలకి మరీ అరవైఏళ్ళు దాటుతాయి. అప్పుడు వాళ్ళని శ్రమపెట్టడం భావ్యం కాదు.చెయ్యాలని ఉంటుందీ, శ్రమౌతుందీ, చెప్పుకోలేరూ అలాగని మనవల్నీ, మనవరాళ్ళనీ వదులుకోలేరూ.మరీ మంచం పడితే ఏమో కానీ, కాలూ చేయీ ఆడుతున్నంతకాలం ఈ బుడతల ధ్యాసే! ఆఖరికి కట్టుకున్నవాడిని కూడా పట్టించుకోరు!

   ఇంక తాతయ్యల సంగతంటారా, వీళ్ళు చెప్పానుగా సండ్రీ పన్లు చేయడానికి మాత్రమే! పసిపిల్లలకి డయపర్లు మారుస్తూంటే, చూస్తూ కూర్చోడం తప్ప, ఏది ఎటువైపుపెట్టాలో కూడా తెలియని ప్ర్రాణులు!అలాగని ఏదీ తెలియనట్లు పొజెట్టఖ్ఖర్లేదు, ఆ తీసేసిన డయపర్ని, ఏ వేస్ట్ పేపర్ బాస్కెట్ లోనో పడేయొచ్చు. దీనికేమీ పేద్ద టాలెంట్ అఖ్ఖర్లేదుగా!అలాగే,బాటిల్ ఫీడ్ అయిన తరువాత, వాటిని కడిగెసి స్టెరిలైజు చేయొచ్చూ, పిల్లల బట్టలు మార్చేటప్పుడు,ఆ విప్పిన బట్టల్ని, బకెట్ లో పడేయొచ్చు, ఎండలో ఆరేసిన బట్టల్ని మడతలు పెట్టొచ్చూ, చేయాలంటే ఇలాటివి కావలిసినన్నున్నాయి. చేయాలని మనసే ఉండాలి. ఈ సండ్రీ పన్లన్నీ అమ్మమ్మల్నీ, నాన్నమ్మల్ని చేయమంటే మాత్రం, ఆ తరువాత వాళ్ళకి ఏదైనా వస్తే మనకే నష్టం!వయస్సైపోయిందని, మనల్ని ఆ పిల్లల్ని ఎత్తుకోమని మాత్రమ్ ఎవరూ అడగరు, కారణం ఆ పిల్లో పిల్లాడో మన దగ్గరకొచ్చేటప్పటికి కెవ్వుమనరుస్తాడు. మొత్తం కొంపలో ఉన్నవాళ్ళంతా పరిగెత్తుకొచ్చేస్తారు ‘ఏం చేశారండి వాణ్ణి‘ అంటూ! వాడేం మనకు శత్రువా ఏమిటీ, మనమేం చేస్తాం. ‘ఏదో చేసే ఉంటారు, అందుకే ఇప్పటిదాకా ఆడుకుంటూన్నవాడు, మరీ అలా అరిచాడు’అని ఓ క్లాసూ!

   ఆ మధ్యనెక్కడో పేపర్లో చదివాను-ఇంగ్లాండు లో వాడెవడో ఎంగెస్ట్ గ్రాండ్ ఫాదర్ ( 29 ఏళ్ళకే) అవుతున్నాడుట! మరీ అలాగుండాలని కాదూ, ఏదో వీళ్ళు సీనియర్ సిటిజెన్లయే లోపల ఏదో మీరు చేయవలైన పనేదో కానిచ్చేశారంటే, అందరికీ సుఖం!

This is my humble tribute to all the Ammammas and Nannammaas of the World !.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- అమ్మమ్మలూ నాన్నమ్మలూ

   గత వారం రోజులనుండీ, నేనూ, మా ఇంటావిడా బిజీ అయిపోయాము. నేనైతే, కొంతలోకొంత, ఒకటో రెండో టపాలు పోస్ట్ చేసికోకలిగాను. మా ఇంటావిడకి ఆ ఛాన్సుకూడా రాలేదు, ఆవిడకి మా మనవడు అగస్థ్యతోనే సరిపోతుంది. వాడేమో, ఈవిడని చూడ్డం తరవాయి, మీదకెక్కేస్తాడు. ఉండడం అంటే, ఇంకో ఫ్లాట్ లో ఉంటున్నాము కానీ, ఈవిడకెప్పుడూ వాడి ధ్యాసే! ఏదో ఊళ్ళోనే ఉంటున్నాం కాబట్టి సరిపోయింది కానీ, అదే ఏ రాజమండ్రీలోనో ఉండి ఉన్నట్లైతే, నా ప్రాణం మీదకొచ్చేది, నా పెన్షనంతా రైలు ప్రయాణాలకే అయ్యేది.పైగా మా ఇంటావిడకి సీనియర్ సిటిజెన్ల కన్సెషన్ కూడా లేదు. ఇప్పుడు, ఓ ఆటోలో తీసికెళ్తే చాలు! అందుకే అంటారు, ఏది ఎలా జరిగినా మన మంచికే అని.

    ప్రపంచం లో ఆడవారికి ఎంత ఓర్పూ సహనం ఉంటుందో, ప్రత్యక్షంగా చూస్తేనే కానీ తెలియదు.అలా దగ్గరగా చూసే ముహూర్తం ఎప్పుడు వస్తుందిట,రిటైరయిన తరువాతే.అసలు భార్యలో ఉండే సుగుణాలన్నీ తెలిసికునే సమయం ఎక్కడేడిచిందీ ఉద్యోగం చేసినంత కాలం? ఏదొ సంపాదిస్తున్నాము,వండి పారేస్తోందీ,పిల్లల బాగోగులు చూసుకుంటోందీ అనే కానీ,వాళ్ళకీ ఏవెవో చిన్న చిన్న కోరికలుంటాయీ అని ఎప్పుడైనా అలోచిస్తామా?మనకైతే ప్రభుత్వం వారి ధర్మమా అని ఓ రిటైరుమెంటోటి ఉంది,మరి వాళ్ళకీ? పెళ్ళైయేదాకా,ఇంట్లో పెద్ద పిల్లైతే చెల్లెళ్ళకీ,తమ్ముళ్ళకీ సేవ చేయడం,ఆ తరువాత కట్టుకున్నవాడికీ,కన్న పిల్లలకీ చేయడం,ఆ తరువాత మనవళ్ళకీ,మనవరాళ్ళకీ చేయడం.ఈ లోపులో అత్త మామలుకూడా ఉంటే,వాళ్ళొకళ్ళు.ఆతావేతా జీవితకాలం అంతా సేవ చేయడం తోటే సరిపోతుంది. అసలు ఈ ఆడవాళ్ళకి అంత ఓపికా,సహనం ఎక్కడనుండి వస్తుందో తెలియదు.

   మనం రిటైరయ్యాక ఓ పెద్దరికం ఒకటి కట్టబెట్టేయడం తో బతికిపోయాము. లేకపోతే తెలిసేది ఇప్పటి పసిపిల్లల్ని అదీ 1-4 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో? వామ్మోయ్ వాళ్ళు పిల్లలా పిడుగులా!వాళ్ళవెనక్కాలే పరిగెత్తే ఓపిక లేదు. పైగా ప్రాక్టీసుకూడా తక్కువ, ఉద్యోగంలో ఉన్నప్పుడైతే ఏదో వంకుండేది. ఆఫీసులో ‘సో కాల్డ్ టైరైపోయి రావడం’ అనేది. టైరూ లేదూ సింగినాదం లేదూ, ఉత్తి పోజు! గవర్నమెంటు ఆఫీస్సులో పని చేసి, మగాళ్ళెవరూ టైరైపోవడం నేనైతే ఎప్పుడూ చూడలేదండోయ్.ఎప్పటి పని (ఆఫీసులో) అప్పుడు చేసేసికుంటే టైరెందుకవుతారూ? వాడితోటీ వీడితోటీ హస్కేసుకుని కూర్చుంటే చెప్పలేము. మా బాస్ అనేవారు- నో బడీ డైస్ ఆఫ్ ఓవర్ వర్క్ ఇన్ గవర్నమెంట్-అని!ఆఫిసునుండి, కొంపకి చేరడానికి ట్రాఫిక్కులో ఇరుక్కుపోవడం టైరైపోవడం అంటే చేసేదేమీ లెదు.ఆఫీసుల్లో పనిచేసే ఆడవారి సంగతేమిటి మరి?

   ఇంక ఇప్పటి నానమ్మలు/అమ్మమ్మల సంగతికొస్తే,వామ్మోయ్ మనవలతో ఎన్నెన్ని ఆసనాలూ,డాన్సులూ చేయాలో, నాకు మాత్రం అంత ఓపికలేదు బాబూ.ఏదో ముస్తాబు చేసి, ఏ ప్రామ్ లోనో కూర్చోబెడితే, బయటకి తీసికెళ్ళి తిప్పమంటే మాత్రం రెడీ!అంతేకానీ అస్తమానూ చంకెక్కుతానంటే మాత్రం ఎత్తుకోలేను. ఈ పిల్లలు పూర్తిగా నడక రాదూ,నడవాలని తాపత్రయం. మధ్యలో ఏదో చేస్తారు, బట్టలు మార్చాలి, పోనీ ఏదో సహాయం చేద్దామా అని అనుకున్నా, వాళ్ళు మనచేతిలో ఉండరూ, ‘ఏమిటండీ ఒక్కసారి పట్టుకోమంటే అంత హడావిడి చేసేస్తారూ’ అంటూ చివాట్లూ!ఏదో ఒక్కసారి నిద్రపోగొట్టుదామా అనుకున్నా, ఊరికే ఏడుస్తాడు. వాణ్ణి సముదాయించడం ఓ పేద్ద టాస్క్. ‘ఏడవకమ్మా, దాయి దాయి…’అనాలికానీ,ఊరికే వాడిమీదలా అరిస్తే వింటాడా? అని మళ్ళీ క్లాసూ.ఎందుకొచ్చిన రిటైర్మెంటయ్యా భగవంతుడా, హాయిగా ఉద్యోగంలో ఉన్నప్పుడే బావుండేది అని విసుపూ!

   రోజులో ఒక్క గంట ఆ చిన్న పిల్లల్ని సముదాయించలెని బ్రతుకూ ఓ బ్రతుకేనా అని అనుకుందామన్నా, అమ్మో రోజంతా చూడమంటే, ఏదో ‘మమ’ అని ఒకసారి అనుకుంటే పోతుంది.లేనిపోని గొడవల్లోకి వెళ్ళకూడదు!నూటికి తొంభైతొమ్మిది మంది అమ్మమ్మలూ, నానమ్మలూ, ఎంత నడుంనొప్పివస్తున్నా సరే, ఎంతంత గూళ్ళనొప్పి వస్తున్నా సరే, ఎంతంత మోకాళ్ళ నొప్పి వస్తున్నా సరే, ఈ చిన్న పిల్లల్ని చూడ్డం మాత్రం మానరు.’నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలోయ్’ అన్నా సరే
‘పోనిద్దురూ, మనమేమీ రోజూ చూస్తున్నామా ఏమిటీ, ఏదో ఇలా అవసరం పడినప్పుడు అడుగుతారు పిల్లలు, వాళ్ళేం పరాయివాళ్ళా ఏమిటీ’ అని మనల్ని వీటో చేసేస్తారు!చివరకి మన మాటే మిగిలిపోతుంది కానీ, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. అదీ ఈ నానమ్మల/అమ్మమ్మల గ్రేట్ నెస్!
నూటికి తొంభైతొమ్మిది అన్నానే, ఆ మిగిలిన ఒక పెర్సెంటు వాళ్ళనీ చూశాను. ముందరే చెప్పేస్తారు, మీ పిల్లలకి నడకా మాటా వచ్చేదాకా మేం చూళ్ళేమమ్మొయ్ అని! నడకా మాటా వస్తే, మనం చూసేదేమిటీ, వాళ్ళే మనల్ని చూస్తారు!
వాళ్ళగురించి ఇంకో టపాలో!
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

    చిన్నప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే, ఎంతో ఉత్సాహంగా ఉండేది. ముందురోజు, రేడియో లో దేశాద్యక్షుడి ప్రసంగం, ఆ తరువాత జాతీయ గీతాలాపనా, అబ్బో ఆనాటి మన దేశాద్యక్షులు, ఎవరికి వారే చాలా గొప్పవారు. మర్నాడు అంటే జనవరి 26 న, జాతీయ బహుమతులు భారత రత్న, పద్మ విభూషణ్, భూషణ్, శ్రీ వచ్చిన వారి పేర్లు తెలిసికోడానికి, ఎంతో ఆత్రంగా, ప్రొద్దుటే ఏడు గంటలకి, రేడియో లో వచ్చే తెలుగు వార్తలూ, వాటిని చదివే శ్రీ పన్యాల రంగనాథ రావు గారూ, ఇంగ్లీషులో 8.00 గంటలకి మళ్ళీ వినడం, ఆ తరువాత స్కూలుకి వెళ్ళడం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలూ, వాటినన్నిటినీ గుర్తుచేసికోవడం ఎంతో బాగుంటుంది.

   ఆ తరువాత దూర్ దర్శన్ ధర్మమా అని, ఢిల్లీ లో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్ చూసే అదృష్టం కలిగింది. రానురానూ రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చే ఎవార్డులు లలో ఇదివరకుండే, ఉత్తేజం కలగడం లేదు.ఎవరి influence ని బట్టి వారికి, ఇస్తున్నారు. వాటికి పెద్దగా వరసా వావీ ఉండడం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఎవార్డ్ ఇవ్వకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తోంది. గత నాలుగైదు రోజుల్నుండీ టి.వీ లో చూస్తున్నాము, సచిన్ తెండూల్కర్ కి భారత రత్న ఇవ్వాలని మహరాష్ట్ర ప్రభుత్వం రికమెండు చేశారని. సచిన్ definete గా ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఆటగాళ్ళలో గొప్పవాడే. ఈ విషయం నిర్వివాదాంశం. కానీ అతను ఇంకా ఆడుతున్నాడు, తనకిష్టమైనప్పుడే రిటైరవుతానని, నొక్కి చెప్పాడు.ఇంకా ఎన్నేన్నో పోటీల్లో పాల్గొంటాడు, అటువంటి పరిస్థితుల్లో అతనికి ఇప్పటినుంచీ భారత రత్న ఈయవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. No doubt, Sachin Tendulkar deserves the highest civilian decoration of the Country. Can’t we wait till he retires? మన దేశం లోని ఫాన్లు most fickle minded అని మనకందరికీ తెలుసు. రేపెప్పుడో World Cup లో, సచిన్ ఆడలెకపోవడంతో, అతనిని దుయ్యబట్టేతంత ఘనులు మన క్రిటిక్సూ, ఫాన్లూనూ ! మరి అది బాగుంటుందా?

   కజోల్, టబూ లకి పద్మశ్రీ ఇచ్చారుట. వాళ్ళూ మామూలుగా చేసే నటులే.మరి వారిలో మన ప్రభుత్వానికి ఏం ప్రత్యేకత కనిపించిందో, ఆ భగవంతుడికే తెలియాలి. వీరికంటే గొప్ప నటులే దొరకలేదా? అందుకే అంటున్నాను, ఏదో ఓ నలుగురైదురు తప్పించి, ఈ సంవత్సరపు ఎవార్డులు వచ్చిన వారిలో,ఏదో కలకాలం గుర్తుపెట్టుకునేటంతటి ఘనులెవరూ కనిపించలేదు.వారికి ప్రభుత్వంలొ ఉన్న ప్రాపకం బట్టి వచ్చినవె!అసలు ఒక విషయం అర్ధం అవదు ఈ ఎవార్డులకి కొలమానం ఏమిటీ అన్నది.Less said the better.

   ఇంక ఈరోజు ప్రసారమైన కార్యక్రమాల్లో, ‘మా’ టి.వీ. లో వచ్చిన ‘వెలుగు వెలిగించు’ కార్యక్రమంలో చూపించిన నృత్య ప్రదర్సన అద్భుతం! రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శించే వివిధ రక్షణ బలాల కవాతు చూస్తూంటే, మనం ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే, వీళ్ళ చలవే కదా అనిపిస్తుంది. కానీ, మళ్ళీ మన రాజకీయ నాయకులు వేసే వెధవ్వేషాలు చూస్తూంటే,Do we really deserve all the sacrifices made by our Armed Forces? అనికూడా అనిపిస్తుంది. మన దేశాద్యక్షురాలినె తీసికోండి, ఆవిడ అంత అత్యుత్తమ పదవిలో ఉండబట్టి, మనం ఏమీ అనకూడదు కానీ, అసలు ఆవిడలో ఏం చూసి అద్యక్ష పదవి ఇచ్చారో? ఇలాటి పదవులు రాజకీయ ప్రాభవంతో వచ్చినంతకాలం మనకి ఇవి తప్పవు

   నిన్న మన్మాడ్ లో ఒక అసిస్టెంటు కలెక్టరుని పెట్రోల్ పోసి దహించేశారుట. ఆయన చేసిన తప్పేమిటీ, ఆయిల్ మాఫియా ని పట్టుకోవడం, తప్పకుండా ఈ మాఫియా వెనక ఎవడో రాజకీయనాయకుడి హస్తం ఉండే ఉంటుంది.ఎప్పుడో పాపం పండిన తరువాత, బయట పడతారు. ఈలోపులో వీళ్ళందరూ మనల్ని పరిపాలిస్తూంటారు. ఖర్మ! కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డీ, పూణె ఎం.పి. కల్మాడీ,సి.వీ.సీ థామస్, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధిపతి బాలకృష్ణన్ వీటికి ఉదాహరణ మాత్రమే. పట్టుకుంటే దొంగా, పట్టుకోనంత కాలం దొరా! మేరా భారత్ మహాన్ అంటూ చప్పట్లుకొట్టుకుంటూ కూర్చోడమే !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   చిన్నప్పుడు, చంటి పిల్లల్ని జోకొట్టాలంటే, ‘చందమామ రావే జాబిల్లి రావే’ లాటివీ, ఆ తరువాత్తర్వాత ‘జో అచ్చుతానంద జోజో ముకుందా‘, ఆ తరువాత స్వాతిముత్యం లో సుశీలమ్మ పాడిన’ వటపత్ర శాయీ…’ లాటి అద్భుతమైన పాటలు పాడేవారు అమ్మలైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా. దోమల మందులకి దోమలు ఇమ్యూన్ అయిపోయినట్లు, చంటి పిల్లలు కూడా, ఆ పాత పాటలకి నిద్రపోవడం మానేశారు. మరి ఇప్పుడేం కావాలిట? దబంగ్ లోని ‘మున్నీ బద్నాం హుయీ.., లేక తీస్ మార్ ఖాన్ లోని ‘మై నేం ఈజ్ షీలా, షీలాకీ జవానీ...ఏం ఖర్మొచ్చి పడిందండి బాబూ?

   అది ఇక్కడి పరిస్థితీ, మరి మన ఆంధ్రదేశంలో ( భాగ్య నగరం తప్పించి) ఎలా ఉందో, మీరెవరైనా చెప్తేనే కదా తెలిసేది! ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యన అదేదో ఫిల్మ్ అవార్డుల ప్రోగ్రాం చూస్తూంటే, ఈ రెండు పాటలకీ, అత్యుత్తమ ఎవార్డ్ దొరికింది! ఏడవాలో నవ్వాలో తెలియలేదు.పైగా ఏమైనా అంటే ‘మీకెందుకూ, ఆ పాటలు మోస్ట్ పాప్యులర్ అయ్యాయీ, అందుకోసం జ్యూరీ వాళ్ళు అలా ఇచ్చారూ’ అంటారు. పోనీ మ్యూజిక్ దర్శకులని అడిగితే, అదంతా
ఫోక్ మ్యూజిక్కూ అంటారు. ఇదివరకటి రోజుల్లోనూ ఉండేవి, ఈ ఫోక్ మ్యూజిక్కులూ సింగినాధాలూనూ. నయాదౌర్, తీస్రీ కసం,మధుమతి.. ఇలా ఎన్నింటిలో లేవూ? తెలుగులో కూడా రోజులు మారాయనండి, వెలుగునీడలనండి, ఇంకో మంచి మనసులనండి, ఎన్నెన్ని సినిమాల్లో లేవూ?

   పైగా బీట్ పేరు చెప్పి, ఆ పాటలు వ్రాసే రచయితలు కూడా, ద్వందార్ధాలు వచ్చే పాటలే వ్రాస్తున్నారు. మరి మన తీయని తెలుగు బాగుపడమంటే ఎలా బాగుపడుతుందీ?ఒక్క పాటలోనూ, అర్ధం అయ్యే ముక్క ఒక్కటీ ఉండదు.అన్నిటిలోకీ విచిత్రం ఏమిటంటే, ఈ సంకర జాతి పాటలు ప్రతీ పాటలపోటీలోనూ, చిన్న చిన్న పిల్లలు నేర్చుకుని పాడడం. ప్రతీ సభలోనూ, మెడమీద తలకాయున్న ప్రతీ వాడూ, ఘోషించడమే, మన భాష తగలడిపోతూందీ అంటూ.మరి బయటి లౌడ్ స్పీకర్లలోనూ, టి.వీ. ల్లోనూ ఈ దరిద్రపు పాటలే హోరెత్తించేస్తూంటే, ఇంకోటి ఎలా పైకి వస్తుంది?

   ఈ మధ్యన ఒక్క సినిమాలోనైనా మెలొడీ ప్రధాన పాట ఒక్కటైనా వచ్చిందా? రేడియో ( ఎఫ్.ఎం), లేక మ్యూజిక్ చానెల్ ఏది తీసికోండి, ఇవే పాటలు.వీటికి సాయం, ఇళ్ళల్లో హోం థియేటర్లూ, ఓ డజనో, పరకో స్పీకర్లూ, వాటికి డాల్బీ, సర్రౌండ్ సిస్టమ్లూ,ఒకటేమిటి, ఇంటినిండా అవే! ఇంక ఆ ఇంట్లో ఉండే పసిపాపలుకూడా, ఈ పాటలకి స్టెప్పులూ, తలలూపడాలూ. పైగా ఏమైనా అంటే, మావాడికి ఈ పాటంటే ఎంతిష్టమో అని అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పి మురిసిపోవడం.
ఇంట్లో కూర్చోవాలంటే గుండె ఠారెత్తిపోతూంది. ఎప్పుడో అది కాస్తా ఆగిపోతే సుఖపడతాము.

   అస్తమానూ, ఏవో దేముడి భజనలూ, సుప్రభాతాలూ పెట్టుకోమని కాదు, దేనికైనా ఓ టైముంటుంది. ఈ పసిపిల్లలు కూడా, పగలంతా నిద్రపోయి, ఏ అర్ధరాత్రో లేచి కూర్చుంటారు, గట్టిగా ఏడుస్తారు, ఆ పిల్లనో పాపనో ఊరుకోపెట్టాలంటే, పక్కనే ఉండే, సీ.డీ. ప్లేయరులో అప్పటికే ఉండే సీ.డీ. పెట్టేయడం. వాడేమో కిలకిలా నవ్వడం. అబ్బో మా పిల్లాడికి మ్యూజిక్కంటే ఎంతిష్టమో అని ఆ తల్లితండ్రులు సంతోష పడ్డం. ఇవే ఎక్కడ చూసినా!పోనీ బయటకు వెళ్తే కారుల్లోనూ ఇవే!టోటల్ బొంబార్డ్మెంట్ ! వాతావరణ కాలుష్యం గురించి, లెక్చర్లివ్వగానే సరిపోదు, మనం ఇళ్ళల్లో ఎంత కలుషితం చేస్తున్నామో కూడా చూసుకోవాలి.

   ఈ దరిద్రం ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఆఖరికి సాయిబాబా భజనలూ, అయ్యప్ప భజనలూ లాటివి కూడా ఈ సినిమా పాటల ట్యూన్ లో వినిపిస్తున్నారు.పాపం ఆ దేముళ్ళు మాత్రం ఏం చేస్తారూ, నోరుమూసుకుని వింటున్నారు.అన్నమయ్య సినిమాలో,చూశాము, పాపం తెలుగులో ఆయన్ని గురించి వ్రాసిన పాటలు లేవని, అన్నమయ్యని భూలోకంలొకి పంపి ధన్యుడయ్యాడు.మరి మన సంగతెవడు చూస్తాడు?ఈ మధ్యన ఏదో పుస్తకం లోఒక వ్యాసం చదివాను- ప్రస్తుతం మ్యూజిక్కు పోటీల్లో పాడే పిల్లల ప్రతిభ చాలా బాగుంటోంది. సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళంతా, 30 ఏళ్ళకి అంత మెచ్యూరిటీ సంపాదించారు. అదే పాటలని చిన్న పిల్లలు అయిదారేళ్ళవాళ్ళదగ్గరనుంచీ అలవోగ్గా, ఒరిజినల్ పాటలకంటే బాగా పాడుతున్నారు,నిజంగా వాళ్ళంతా ఛైల్డ్ ప్రాడిజీలే ! సందేహం లేదు.ఆరేళ్ళకే 30 ఏళ్ళ మెచ్యూరిటీ వచ్చేసిందంటే, 30 ఏళ్ళొచ్చిన తరువాత వీరి పరిస్థితి ఏమిటీ? అసలు వీళ్ళకి బాల్యంలో ఉండే మధుర స్మృతులనేవి ఉంటాయా…– అని. నిజమే కదూ !

   తల్లితండ్రులకి కూడా, ఈ జాడ్యం పూర్తిగా వచ్చేసింది. కొన్ని కార్యక్రమాల కర్టెన్ రైజరుల్లో చూస్తూంటాము,వరద బాధితుల్లా ఆ పిల్లలూ, వాళ్ళ తల్లి తండ్రులూ, క్వాలిఫై అయినవాళ్ళు గెంతులూ, కానివారు ఏడుపులూ, తీరా చివరికి చూసిన మొహాలే కనిపిస్తాయి.టి.వీ. ల్లో వచ్చే ఏ సంగీతప్రధాన కార్యక్రమమైనా ఇదే సీను! ఇంక డ్యాన్సు కార్యక్రమాలగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి! మేరా భారత్ మహాన్ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పిల్లలు, ఎడాలు

   ఇదివరకటి రోజుల్లో అంటే, మా ముందు తరం వారి రోజులన్నమాట, ఇంటికి ఎంతమంది పిల్లా పాపా, పాడీ ఉంటే అంత సుభిక్షమనే సదుద్దేశ్యంతో ఉండేవారు.అందుకనే ఏ ఇంట్లో చూసినా కనీసం, నలుగురైదుగురు పిల్లలుండేవారు. ఆనాటి పరిస్థితుల ధర్మమా అని, తిండికీ, బట్టకీ కూడా లోటుండేది కాదు. ఎవరి ఓపికనిబట్టి వారు చదువులూ, పెళ్ళిళ్ళూ కానిచ్చేవారు.
క్రమక్రమంగా, న్యూక్లియర్ ఫామిలీలు వచ్చేశాయి, మహ అయితే ఇద్దరు పిల్లలతో సరిపెట్టేసికుంటున్నారు. అంతకంటె ఎక్కువయితే పోషించే ఓపికెక్కడిదీ? అప్పుడప్పుడు టి.వీల్లో మా ఊరివంట కార్యక్రమం లో విటూంటాము, మీకు పిల్లలెంతమందీ అని యాంకరమ్మ అడగడం, వెరైటీ అయితే ‘పాపా, బాబూ’ అని చెప్పడం, ఇద్దరు పాపలే అయితే కొద్దిగా డిఫిడెంటు గా చెప్పడం, ఇంక ఇద్దరూ మొగపిల్లలే అయితే పేద్ద పోజెట్టి చెప్పడం!ఆతావేతా తేలెదేమిటంటే, మేమిద్దరం, మా పిల్లలు ఇద్దరూ అని! ఏక్ దం డిసిప్లీన్డ్ సిటిజెన్!!

మా ఇంట్లో పిల్లలిద్దరికీ ఎడం ఆరేళ్ళు. మా అమ్మాయికి అయిదేళ్ళు, అబ్బాయికి మూడున్నరేళ్ళు వాళ్ళ పిల్లలకున్న ఎడం.మాకైతే అంత సమస్యుండేది కాదు, బాబు పుట్టే సమయానికి, అమ్మాయి స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ లో ఉంది, తన సంగతి అప్పుడప్పుడు నేను చూసుకున్నా, బాబు విషయం మా ఇంటావిడే చూసుకునేది.అంతే కాకుండా అక్కకి తమ్ముడిమీద ఓ మెటర్నల్ ఫీలింగు కూడా వస్తుంది, వయస్సు తేడా వలన.పిల్లలిద్దరి మధ్యా మరీ, రెండేళ్ళే తేడా ఉంటే, కొద్దిగా కష్టం అయిపోతుంది, ఇద్దరినీ సముదాయించడం. ఇద్దరికీ అమ్మే కావాలి. కవలపిల్లలైతే అసలు గొడవే లేదు! తిట్టుకుంటూనో, కొట్టుకుంటూనో మొత్తానికి, ఓ పదేళ్ళు మన చెప్పుచేతల్లో ఉండి, ఆ తరువాత, వాళ్ళ దారిన వాళ్ళు పెద్దైపోతారు!

అప్పుడప్పుడు చూస్తూంటాము, ఎవరికైనా ఇద్దరు పిల్లలు అదీ పాపా, బాబూ అయితే’అబ్బ ఏం ప్లానింగండీ’ అనడం! అక్కడికేదో, వీడు ఓ పెద్ద ప్లానేసికుని ఓ మొగా, ఓ ఆడా కనేసినట్లు పోజిచ్చేస్తాడు. ఇప్పటికీ క్రొమొజోమ్ములో అవేవో ఫలానా గా కలిస్తే ఆడపిల్లా, ఇంకోలా కలిస్తే మగాడూ అని అంటారు మన సైంటిస్టులు, వాటికి ఇప్పటిదాకా పేరే పెట్టలేకపోయారు, అదేదో లెఖ్ఖల్లొలాగ x, y అంటున్నారు, వాళ్ళకే ఈ బ్రహ్మ రహస్యం తెలియక కొట్టుకుంటుంటే, మరి ఈ తండ్రిగారికి ఎలా తెలిసిందండి బాబూ? ఏదో ఘనకార్యం చేసేసినట్లు పోజూ!

ఇద్దరు పిల్లలకీ మరీ తక్కువ ఎడం ఉంటే, కొద్దిగా కష్టమే. పెద్దవాళ్ళు ఎప్పుడూ శాంతస్వభావం కలవారే, అని మా ఇంటావిడా, అమ్మాయీ అంటూంటారులెండి.పోనీ ఏదో అనుకుంటున్నారులే అని వదిలేద్దామా అనుకుంటే, దానికి ఓ కొరాలరీ పెడతారు-రెండో వాళ్ళెప్పుడూ రౌడీలే అని! అదొక్కటే బాగోలెదు. ఔనూ, నోరుందీ, నెగ్గుకొస్తారూ తప్పెమిటీ? ప్రస్తుతం మా మనవలిద్దరినీ చూస్తున్నాను కదా, మా ఇంటావిడ చెప్పెది నిజమేమో అని! వాడికి మొన్న ఏడో తారీఖుకి, ఏడాది నిండింది, ఇప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ లో రెండూ, బాల్కనీ లో రెండూ పళ్లొచ్చాయి. అదేమిటో ఇన్నాళ్ళూ, మేమిద్దరమూ పళ్ళవిషయంలో, ఒక్కటే అనుకునేవాడిని, కానీ ఈ నాలుగు పళ్ళూ వచ్చేటప్పటికి, అప్పుడప్పుడు కొరుక్కుని, నన్ను rag చేస్తున్నాడేమో అనిపిస్తూంటుంది.

ఈ రెండో పిల్లలున్నారే,ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా ‘చాలూ’ లోకే వస్తారు!అమ్మా నాన్నా లకి ఎప్పుడూ సింపతీ తనమీదే ఉంటుందని,తననుకున్నది సాధించాలంటే, పేద్దగా అరిచి గీ పెట్టేస్తారు. అమ్మొ, నాన్నో ఇంకో గదిలోంచి, ఓ అరుపు అరుస్తారు,’అదేమిటే, పెద్దదానివి కదా, పాపం వాడడుగుతూంటే ఇవ్వొచ్చు కదా’ అని.అప్పుడు ఈ చిన్నాడికీ/చిన్నదానికీ ఓ విషయం confirm అయిపోతుంది. నోరుంటే ఎక్కడైనా నెగ్గుకు రావచ్చని! వీళ్ళకి భవిష్యత్తులో రాజకీయనాయకులయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి!పాపం, ఆ పెద్ద పిల్లో,పిల్లాడో భరిస్తారు వీళ్ళ ఆగడాలన్నీ.ఒక్కొక్కప్పుడు ఈ పెద్ద పిల్లలూ వారికి కావలిసినవేవో, అంటే ఏదో ఔటింగుకి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా,ఆ చిన్నాళ్ళని ఓ సారి తొడపాయసం పెడితే చాలు.అదో tactic.ఇంట్లో అయితే ఫరవాలేదు, అమ్మో నాన్నో వీళ్ళ rescue కి వస్తారు, మరి బయటో ఆ పెద్దాళ్ళమీదే ఆధార పడాలిగా! అందుకే ప్రతీ విషయం లోనూ give and take policy!
ఆహా మన పిల్లలెంత అన్యోన్యంగా ఉన్నారో అని ఆ poor తల్లితండ్రులు
మురిసిపోతూంటారు! అంతా ‘మాయ’!

కొంతమందిని చూస్తూంటాము,’పిల్లలెంతమందీ’ అని అడగండి–‘ ఆయ్ మీ దయవలన ఇద్దరండి’ అంటాడు! వీడి మొహం, ఏదో భగవంతుడి దయ అంటే బావుంటుంది కానీ, అవతలివాడి దయేమిటీ, విన్నవాళ్ళేమనుకుంటారో అని కూడా ఆలోచించరు!

బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు-Melville D’mellow

Melville D’mellow

ఈవేళ సాక్షి పేపరు చదువుతూంటే నాకు అత్యంత ఇష్టమైన ఒక మహా వ్యక్తి గురించిన ఒక వ్యాసం కనిపించింది. నేను చేసికున్న అదృష్టమేమంటే, ఆయన దగ్గరనుండి నాకు రెండు ఉత్తరాలు వచ్చాయి. వాటిని,ఇదివరకు నా టపా లో
ప్రస్తావించాను. మళ్ళీ ఇంకొకసారి ఆయన, శ్రీ Melville D’mellow ని గుర్తుచేసికోవడం చాలా బాగుంది. పైన ఇచ్చిన వ్యాసం సరీగ్గా కనిపించకపోతే ఇక్కడ నొక్కండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- చిరుగు కూడా మంచిదేట !!

   ఇదివరకటి రోజుల్లో, వేసికున్న చొక్కాకి,కట్టుకున్న చీరకీ, పంచకీ చిరుగు కనిపిస్తే, ‘ఉత్తరేణి కుట్టు’ అని వేసికుని మళ్ళీ కట్టుకునేవారు. వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి ఉండేవి, వారు కట్టే బట్టలు. పాత సినిమాల్లో చూసేవారం-బాగా బీద గా ఉండే, బడిపంతులు గారో, లేకపోతే ఏ ఇంట్లోనో వంటలు చేసే ఆవిడనో చూపించవలసివస్తే, తప్పని సరిగా ఎక్కడో అక్కడ ఓ చిరుగు చూపించేవారు.అది ఆ సినిమా దర్శకుడి,ప్రావీణ్యం చూపించినట్లన్నమాట.It was symbolic of the poverty, that particular character was suffering!అప్పుడెప్పుడో శంకరాభరణం సినిమాలో చూసినట్లు జ్ఞాపకం- శంకరశాస్త్రి గారు, తన వైభవాన్ని కోల్పోయి, అతి బీద స్థితి లోకి వచ్చినప్పుడు,
‘ఆహా విశ్వనాథ్ గారు, ఎంత అద్భుతంగా తీశారో వగైరా వగైరా.’ ప్రశంశలు కురిపించేశారు!

   అంతదాకా ఎందుకూ, చిరిగిన పాంటు వేసికుంటే, బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు.అలాగే చిరిగిపోయిన ఓణీ ఓ అతిబీదస్థితిలో ఉండి, తండ్రి పెళ్ళి చేయలేని స్థితిలో ఉన్నట్లన్నమాట.అలాగ చిరుగు అన్నది ఓ నెగటివ్ సంకేతం లా ఉండేది. ‘ఏ అమ్మాయి మీదైనా అత్యాచారం జరిగితే, ‘పాపం ఆ అమ్మాయి జీవితం చిరిగిపోయిన విస్తరి లా అయిపొయింది’ అనే వాక్య ప్రయోగాలు కూడా చదివాము, విన్నాము!ఇలాటివన్నీ, ఎకనామిక్ రిఫార్మ్స్ ముందర లెండి!

   మరి ఇప్పుడో, చిరుగు అన్నది ఓ status symbolఅయిపోయింది! కట్టుకున్న బట్టకి ఎన్ని చిరుగులుంటే అంత ఫాషనుట!అదేం ఖర్మమో, బయటకు వెళ్తే చూసేది ఈ చిరుగులే!ఇదెక్కడి ఫాషనండి బాబూ?అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కట్టుకున్న జీన్స్ పాంటుకి, మోకాళ్ళు రెండింటి మీదా రెండు చిరుగులుండాల్సిందే!ఇంక అమ్మాయిలకైతే, అడక్కండి,అసలే ఓ గుడ్డపీలిక కట్టుకుని వస్తారు, దానికి సాయం ఈ చిరుగులోటి.ఇదంతా నేను చాదస్థం గా వ్రాస్తున్నది కాదు,బస్సుల్లోనూ, మాల్స్ లోనూ చూస్తూంటాము, ఒంటిమీద బట్ట ఉండదు.ఇందులో వాళ్ళు పొందుతున్న ఆనందం ఏమిటి? శీతాకాలం లో అసలు వాళ్ళకి చలేయదా?ప్రొద్దుటే, స్కూలుకి వెళ్ళే పిల్లలు, ఆ చలిలో, మోకాళ్ళ పైదాకా వచ్చే యూనిఫారం వేసికుంటేనే, గుండె కరిగిపోతుంది అయ్యో పాపం ఈ చలిలో ఎలా వెళ్తున్నారో అని!
సినిమా స్టార్లూ,ఫాషన్ పెరేడ్ లో పాల్గొనేవారూ, పోనీ అలాటి బికినీలూ, వళ్ళంతా చూపించుకునే బట్టలూ వేసికున్నారంటే అర్ధం ఉంది, ఎందుకంటే వాళ్ళు పూర్తి బట్టలతో ఉంటే ఎవడూ వాళ్ళవంక చూడడు కాబట్టి.మామూలుగా ఉండే వాళ్ళకి ఏం రోగం? ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళ అందాలు చూపించుకోవలసిన అవసరం ఏమిటో ఇప్పటికీ అర్ధం అవదు. ఇలాటి దరిద్రపు డ్రెస్సులు వేసికుని, వాడెవడో ఈలేశాడూ, కాలు తొక్కాడూ, గిల్లాడూ అని ఏడవడం ఎందుకూ? ఇంట్లో తల్లితండ్రులకి బాధ్యత ఉండదా? లేక వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇలా ‘ప్రదర్శనలు’ ఇస్తున్నారా? క్రీడలు ఆడేవారూ, ఆసుపత్రిల్లో పనిచేసే నర్సులకీ అయితే వేసికోవాలే ఆ స్కర్టులు. అ స్కర్టులూ అవీ వేసికోకూడదనడం లేదు. కానీ దానికీ ఓ సమయం సందర్భం ఉంది.చీరల్లోనూ, పంజాబీ డ్రెస్సుల్లోనూ ఉండేవాళ్ళు అందంగా ఉండరా? కట్టుకునే పధ్ధతిలో ఉంది అందం అంతా.

   బయటకు వెళ్ళినప్పుడు చూస్తూంటాము ఇంక ఈ అబ్బాయిలు- underarm growth అంతా ఊళ్ళో వాళ్ళకి చూపించుకుంటేనే, వాడు macho అనుకుంటాడా ఏమో! ఎంత అసహ్యంగా ఉంటుందో ఎప్పుడైనా తడుతుందా వీళ్ళకి అసలు?అలా ఉండడం unhygeinic అని వీళ్ళకు తెలియదా? బస్సుల్లోనూ, రైళ్ళల్లోనూ నుంచున్నప్పుడు, ఖర్మకాలి, మన మొహం వాడి చంక దగ్గరకి వస్తుంది, దేర్భ్యంలా చెయ్యి పైకెత్తి నుంచుంటాడుగా.వెధవది ఏదో deodrant స్ప్రే చేసికుంటే చాలనుకుంటాడు ఆ దరిద్రుడు.ఇళ్ళల్లో ఎన్నెన్ని వెధవ్వేషాలు వేసినా ఫరవా లేదు, బయటకి వచ్చినప్పుడైనా ఇంకోరికి అసౌకర్యం కలక్కుండా చూసుకోవాలి.

   ఇదివరకటి సినిమాల్లో చూసేవారం, చీర కొద్దిగా,పకి వెళ్ళిందంటే సెన్సార్ వాళ్ళు కట్ చేసేవారు. ఇప్పుడో పూర్తిగా బట్ట కడితే కట్ చేసేస్తున్నారు.ఏదైనా ‘అతి’ అయితే మొహం మొత్తుతుంది. దేనికైనా ఓ’అడ్డం’ ఉంటేనే,దానిమీద ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయం ఈ జనరేషన్ వారికి ఎప్పుడు తెలుస్తుందో? అందరూ అలా డ్రెస్ చేసికుంటారని కాదు,చూపించుకునేవేవో, చూడవలసినవారికే పరిమితం చేయండి, అంతేకానీ, ఊళ్ళో వాళ్ళందరికీ కనువిందు చేయఖ్ఖర్లేదు.ఏమిటీ ఈ పాతచింతకాయ పచ్చడీ అంటారా మీ ఇష్టం.అయినా ఎవడెలా డ్రెస్ చేసికుంటే, మీకెందుకూ, వాళ్ళిష్టం,కావాలంటే మీరూ వేసికోండీ అంటారా.Fine, no issue. కానీ మనం ఓ సొసైటీ లో ఉంటున్నాముగా, ఓసారి వాళ్ళగురించీ ఆలోచించండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   చూస్తూ ఉంటాము, కొంతమందికి ఓ అలవాటుంటుంది.కనిపించినదల్లా కొనేయడం. అది అవసరమా కాదా అన్నది చూసుకోరు. ఇంటినిండా పేర్చేసికోవడమే! ఏమిటీ అని అడిగితే అదో సరదా అంటారు. ఒక్కళ్ళూ ఉన్నంత కాలం అయితే ఫరవాలేదు. కానీ, ఏ అత్తారింటికో వెళ్ళినప్పుడు, అక్కడ కూడా ఇదే అలవాటు కంటిన్యూ అవుతూంటుంది. అందుకనే, వాళ్ళుండే ఫ్లాట్లు ఒక్కొక్కప్పుడు సరిపోని పరిస్థితి ఏర్పడుతూంటుంది! ఇదివరకటి రోజుల్లో అయితే, అంత availability ఉండేది కాదు కాబట్టి, పెద్ద సమస్య అయేది కాదు. అవసరమున్నదేదో కొనుక్కోవడం, అది కాస్తా పూర్తవగానే మళ్ళీ బజారుకెళ్ళడం.అంతే కాక అప్పటిరోజుల్లో ఇంటి పెద్దలు discretion ఉపయోగించేవారు కూడా!కారణం మరేమీ పెద్దది కాదూ, జేబు బరువును బట్టి అంతే! దాన్నే మనం discretion అని మొహమ్మాటానికి అంటాం!

ఇప్పుడు అంతా mall culture. దానికి సాయం, ఏ చిన్న పిల్లల్నో కూడా తీసికెళ్ళారో, ఇంక అంతే సంగతులు! సడెన్ గా मा की ममता ooze అయిపోయి, వాళ్ళు అడిగినదీ, అడుగుతారేమో అనుకున్నదీ, ప్రతీదీ వాళ్ళతో తీసికెళ్ళే trolley లో పడేయడం! బిల్లు పే చేయవలసినవాడు ఇవన్నీ ఎందుకూ అని అడిగాడో చచ్చాడే !ఆ రోజుకి ఉపవాసమే!నోరు మూసుకుని,అవన్నీ పోగుచేసి, బిల్లు పే చేసి, కారు డిక్కీ లో పడేసి కొంపకు చేరడమే. వాళ్ళు అవ్విధంబుగా కొన్న వస్తువుల్లో సగానికి సగం, తిన్న తిండరక్క పోగుచేసినవే! ఏదో జ్యూసంటారు, స్నాక్కంటారు, పైగా ఆ జ్యూసులు ఒకసారి ఓపెన్ చేస్తే, ఫ్రిజ్ లోకూడా ఉంచకూడదుట. ఇంతా చేసి, ఆ జ్యూసు కొనిపించిన పిల్లో పిల్లాడో,ఆ బాటిల్ ఓపెన్ చేసిన తరువాత పూర్తిగా తాగుతారా, అబ్బే, ఏదో ఔపోసన చేసినట్లు, ఓ సారి నోటి దగ్గర పెట్టుకుని, ‘యాక్! టేస్ట్ బాగో లేదు మమ్మీ’అనడం.ఆ ఇల్లాలు, ఫిగర్ maintain చేసే హడావిడిలో, ఆ జ్యూసుని, మన వాడిని తాగమంటుంది. ఛాన్సొచ్చింది కదా అని ఇంక ఈయన పెళ్ళాం మీద ఎగిరాననుకుంటూ, ‘ అక్కడే చెప్పానా, కనిపించిందల్లా కొనద్దూ అనీ, ఇప్పుడేమో నా ప్రాణానికొచ్చింది, ఈ దరిద్రపు జ్యూసులన్నీ నామొహాన్ని కొడుతున్నారు’అని.అందుకే అన్నారు భరించేవాడే భర్త అని!అక్కడికి ఆరోజు కార్యక్రమం పూర్తవుతుంది. అమ్మా నాన్నా కొట్టుకోవడం చూసి, ఆ పిల్లలు , వాళ్ళమానాన్న వాళ్ళని వదిలేసి, ఆటలకి పోతారు.మాల్ నుంచి తెచ్చినవన్నీ, చివరికి కప్ బోర్డ్ లోకి చేరతాయి.

ఎప్పుడో ఆ వస్తువులకి ముక్తీ మోక్షం వచ్చినప్పుడు గుర్తొస్తాయి. తీరా చూస్తే, best used within 72 hours అనో, లేకపోతే, దాని పుణ్యకాలం( expiry date) పూర్తయో కనిపిస్తుంది.చివరకి వాటన్నిటినీ, చింపి చీరేసి, ఏ వేస్ట్ బాస్కెట్ లోనో తగలేయడం. మరీ అలా చేయకుండా పడేస్తే, ఎవరైనా వాటిని త్రాగి ప్రాణం మీదకు తెచ్చుకుంటే, మళ్ళీ అదో గోలా! ఈ తెలివేదో ముందరే ఉంటే ఎంత బావుండేది?ఏదో యాడ్ చూడ్డం, దాన్నే కొనాలని పిల్లలు పేచీ పెట్టడం
వగైరా వగైరా అవన్నీ అంత అవసరమా? ఇప్పటి వాళ్ళని అడిగితే అవసరమే అంటారు,మీకేం తెలుసూ, మార్కెట్ లో ఎన్నెన్ని వస్తున్నాయో, మీరింకా రాతియుగం లో ఉన్నారు మాస్టారూ అంటారు.

ఇదంతా తిండి వ్యవహారం.ఇంక ఇంటాయనకి కనిపించిన సీడీ కొనేయాలి. ఇదివరకటి రోజుల్లో ఈ సీడీ లూ అవీ లేని రోజుల్లో కాసెట్లొచ్చేవి. పైగా కొన్ని కొట్లల్లో, రికార్డెడ్ కాసెట్లూ, అలాగే వీడియో కాసెట్లూ.పోనీ రోజూ ఏమైనా పెట్టుకుని వింటారా, చూస్తారా? అదేం లేదు, తెచ్చిన మొదటి వారంలో sincere గా వాటిని వాడడం. ఆ తరువాత వాటికి ఓ డబ్బా, మొదట్లో చెక్కది, తరువాత్తరువాత, ఏ కార్డ్ బోర్డ్ కార్టనో.ఇలా ప్రోగు చేసిన కాసెట్లు చివరకి అటకమీద తేల్తాయి, అక్కడే దుమ్ముకొట్టుకు పోయి చరిత్ర లోకి వెళ్ళిపోతాయి. ఏ ఇంట్లో చూడండి, కనిపించేవి ఈ పాత కాసెట్లే! ఆ రోజుల్లో వీడియో కాసెట్లొచ్చేవి. ప్రతీ ఇంటిలోనూ, ఏపిల్లదో పిల్లాడిదో పెళ్ళి క్యాసెట్టు కంపల్సరీ.ఆ కాసెట్లకో ప్లాస్టిక్కు కేసూ, దానిమీద అడ్డంగా ఓ కాగితం మీద పెద్దబ్బాయి పెళ్ళి, ఇంకో దానిమీద అమ్మాయి పెళ్ళి అని వ్రాసి అంటించడం. పైగా పిల్ల పెళ్ళి చేస్తే, వియ్యాలారికో కాపీ ఇవ్వాలి.తీరా, ఏ అయిదేళ్ళకో ఆరేళ్ళకో ఏ పాత చుట్టమో ఇంటికి వస్తే, వాళ్లు మన ఇంట్లో పెళ్ళికి రాలేదని గుర్తొస్తుంది, అంతే, వాళ్ళని కూర్చోపెట్టి ఓ రెండు మూడు గంటల పాటు ఈ దృశ్యకావ్యాన్ని చూపించడం. చూడకపోతే, వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టరేమో అనే భయంతో వాళ్ళూ నోరెత్తకుండా చూస్తారు! మధ్యలో, మాటవరసకి,’ ఈమధ్యన కాసెట్లు, సీ.డీ ల్లోకి మారుస్తున్నారుట, పోనీ వీటన్నిటినీ మార్చేయకూడదూ.. ‘ అని ఓ ఉచిత సలహా పడేస్తారు. పైగా ఇదో ఖర్చోటీ! ఇంకోటండోయ్, అక్కడికేదో విన్న ప్రతీదీ రికార్డు చేసేవాడిలాగ,బ్లాంక్ కేసెట్లోటి. దాంట్లో మన పిల్లల మొదటి మాటలూ, మొదటి పచర్ పచర్లూ, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వినిపించడానికి, మనం అంతదాకా బ్రతికి బావుంటే!

చివరకి తేలేదేమిటంటే ఇంటినిండా, కాసెట్లూ, సీడీలూ వాటికి సంబంధించిన వైర్లూ వగైరా. పైగా అవి పాడైపోతే, వాటిని బాగుచేసేవాడు దొరకడు, దొరికినా వాటి స్పేరు పార్ట్స్ ఉండవు.ఎప్పటివో ఇక్ష్వాకులపు రోజులనాటివి, ఏ కొట్టుకైనా తీసికెళ్తే నవ్వుతారు కూడానూ! ఆ సీడీ లు కూడా పోయి ఇంకేదో అదేదో బ్లూ..వచ్చిందిట.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-తెలిసింది ఇతరులతో పంచుకోడం

   రాజమండ్రీ లో ‘భక్తి’ టి.వి. చానెల్ కి అలవాటు పడిపోయి, పూణె తిరిగి రాగానే,Airtel వాడిస్తున్నాడు కదా అని, ఏడాది subscription కట్టేసి తీసికున్నాను. ఏం పోయేకాలం వచ్చిందో, ఆ చానెల్ కాస్తా తీసేసి, ABN ఇచ్చాడు.ఉన్న న్యూసు చానెళ్ళు చాలకనా, ఇంకో న్యూసూ అనుకున్నాను కానీ, ఏడాదికీ కట్టేయడం వలన, చచ్చినట్లు అట్టేపెట్టుకున్నాను, ఏం చేస్తాను? డిశంబరు 1 న ఆ పుణ్యకాలం కాస్తా పూర్తవడం తో, Reliance Big TV లోకి మారిపోయాను. దీంట్లో ‘భక్తి’ ఇప్పటివరకూ ఇస్తున్నాడులెండి, చూద్దాం ఇదెన్నాళ్ళో? నాకు ఆ చానెల్ లో శ్రీ గరికపాటి వారి, మహాభారతం మీద సామాజిక వ్యాఖ్యలు, శ్రీ చాగంటి వారి ప్రవచనాలూ చాలా ఇష్టం. మా ఇంటావిడ, రాత్రి 11.00 నుండి, 12.00 వరకూ, టి.వీ. నాకొదిలేస్తూంటుంది.

   ఈ వారం లో ధర్మరాజు-యక్షప్రశ్నలు గురించి, అద్భుతం గా చెప్పారు.ఆయన చెప్పినట్లుగా, డబ్బులు తగలేసి, ఏవేవో కోర్సుల్లో చేరే బదులు, హాయిగా మహాభారతం చదివి అర్ధం చేసికుంటే చాలు, మనకి ఇంకో దాని అవసరమే ఉండదు.ఏదో ‘ఆయనే ఉంటే….’ అన్న సామెత లాగ, ఆ మహాభారతం చదివి అర్ధం చేసికునే తెలివితేటలే ఉంటే,ఇలా ఎందుకుంటాము? అందుకనే, ఈ భక్తి టీవీల వెనక్కాల పడడం! మొన్నెప్పుడో ఆయన చెప్పారు’ ప్రతీదీ మనకే తెలుసునూ అన్నట్లు,ఎక్కడ పడితే అక్కడ వేలెట్టకూడదుట.కానీ, మనకేదైనా విషయం, గ్యారెంటీ గా తెలిస్తే మాత్రం, తప్పకుండా ఓ పదిమందితో పంచుకోవాలి’ట, ఈ సందర్భం లోనే, నేను అప్పుడెప్పుడో ఓ టపా పెట్టాను.అందులోది ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలియదు. కానీ ఆ కంపెనీల వాళ్ళు మాత్రం నన్ను ఊదరకొట్టేస్తున్నారు. మీకు తెలిసినవారెవరినైనా చేర్పించండి అని.అందుకోసమే ఆ టపా లింకు మరోసారి ఇచ్చాను పైన. మిస్టరీ షాపింగు కోసం ఈమధ్యనే వచ్చిన ఇంకో ఏజన్సీ ఇది. వీళ్లకోసం ఒక ఎసైన్మెంటు చేశాను.

   ఇక్కడ మా ఫ్రెండ్స్ తో పంచుకుంటే, హాయిగా మన దారిన మనం ఉండకుండా, ఈ గొడవలన్నీ ఎందుకూ అన్నారు! నిజమే కదా,సాయంత్రం పూట అదేదో సీనియర్ క్లబ్బుల్లో పేకాడడం లో ఉన్న మజా దేంట్లో ఉంటుందీ? లేకపోతే, మనవళ్ళనీ, మనవరాళ్ళనీ స్కూలుకి దింపడం, అదేదో పేద్ద ఘనకార్యం చేసేస్తున్నట్లు, అడిగిన వాడికీ, అడగని వాడికీ చెప్పుకుని సింపతీ సంపాదించుకుంటే ఉన్న హాయి ఇందులో ఎక్కడుంటుందీ?నిజమే లెండి, ఎవడి comfort level వారిది! ఏదో ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ తమకే వచ్చేసినట్లు,చెప్పుకుంటే, ‘అయ్యో అలాగా…పాపం…’అని కావలిసినంత సింపతీ సంపాదించవచ్చు!cheap and best!

   ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, గత 25 సంవత్సరాలనుండీ పరిచయం ఉన్న మా డాక్టరు గారూ, భార్యా నిన్న మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి ప్రస్తుతం US లో ఎం.ఎస్. చేస్తోంది, శలవలకి వచ్చింది.తనతో కలిసి వచ్చారు భుసావల్ నుంచి. మా ఇంట్లో ఎవరికి ఏ సమస్యొచ్చినా, ఆయన్నే కన్సల్ట్ చెస్తూంటాను. హస్తవాసి చాలా మంచిదిలెండి.అవీ ఇవీ మాట్లాడుకుంటూ, నేను ప్రస్తుతం వ్రాస్తున్న టపాలగురించీ, నామిస్టరీ షాపింగులగురించీ ఎలా నడుస్తోందీ అని అడిగితే, ఆ మధ్యన నా పుట్టినరోజు కి మావాళ్ళిచ్చిన నా టపాల పుస్తకం చూపించాను. ఆయనన్నారూ ‘నాకు ఎప్పుడైనా పేషంట్లకి కౌన్సెలింగు చేసే సమయం లో, మీ గురించే చెప్తూంటానూ, రిటైరయ్యిన తరువాత కూడా, ఓ వ్యాపకం ఏర్పరుచుకుని,ఎవరి గొడవల్లోనూ దిగకుండా,హాయిగా ఒక Square cm తనదీ అనుకునే, ఓ ప్రపంచంలో ఎలా ఉండొచ్చూ‘అని. అబ్బో, నాగురించి ఇంకోరికి ఉదాహరణగా చెప్పేటంత, గొప్పవాడిని కాదు కానీ, నామట్టుకు నేను మాత్రం fully enjoying ! అప్పుడప్పుడు ఇలాటి సంతోషాలూ ఉండాలి లెండి.
పైన వ్రాసిందంతా ఏదో స్వంత డబ్బా కొట్టుకోడానికి కాదు వ్రాసింది, మన Sq cm స్థలం మనం ఏర్పరుచుకుంటే, ఎంత హాయిగా ఉంటుందో చెప్పడానికి మాత్రమే.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం

   ఈవేళ మా మనవడు చి.ఆదిత్య స్కూల్లో grandparents’ day ఉందంటే, నేనూ, మా ఇంటావిడా వెళ్ళాము.ప్రొద్దుటే, మా అమ్మాయి తను కారులో తీసికెళ్తానని చెప్పింది కానీ, మళ్ళీ తను ఇంతదూరం రావడం ఎందుకని మేమే
ఆటో లో వెళ్తామన్నాను. బయటకి వచ్చి ఓ ఆటో వాడిని ఫలానా చోటుకి వస్తావా అని అడగ్గానే, కొద్దిగా ఆలోచించి 70 రూపాయలవుతుందీ అన్నాడు. నేను వెంటనే సరే అన్నాను. అలా తను అడగ్గానే ఒప్పుకునేసరికి, ఏమైనా తక్కువ చెప్పేనా అని ఒకటే టెన్షను ఆ ఆటోవాడికి.అదేదొ దారిన వెళ్దామా, ఇంకో దారిన వెళ్దామా అంటూ మొదలెట్టాడు. చివరకు అడిగేశాను,’నువ్వు అడగ్గానే ఒప్పేసుకున్నందుకు కదా నీకింత టెన్షనూ, అందరిలాగే బేరం ఆడిఉంటే నీకూ బాగుండేదీ’అన్నాను. అప్పుడు చెప్పాను మేము ప్రతీ రోజూ మా ఇంటికి ఆటోలోనే వెళ్తామూ, అందువలన మీటరువేసినా ఎంత అవుతుందో, దానిమీద ఓ అయిదు రూపాయలెక్కువే ఇస్తూంటానూ, అయినా కావలిసిస్తే నువ్వు కూడా, మీటరు వెయ్యి, తెలుస్తుందీ అన్నాను. మొత్తానికి అతని టెన్షను తగ్గించాను. అప్పుడన్నాడతను’ మిమ్మల్ని ప్రతీ రోజూ చూస్తూంటాను, ప్రొద్దుటే శుభ్రంగా బొట్టు పెట్టుకుని, బయలుదేరుతూంటారూ, మీతో మాట్లాడాల్ని ఉంటుందీ, అయినా భయపడేవాడినీ, ఎప్పుడైనా నా ఆటోలో ఎక్కితే బాగుండునూ’ అని. అందుకోసమని, నేను అడగ్గానే డెభ్భై అనేశాడుట, అదీ ఇదివరకోసారి ఎవరినో మీటరు మీద తీసికెళ్ళింది గుర్తుంచుకుని! అబధ్ధం చెప్పాలనిపించలేదట!ఒక్కొక్కప్పుడు ఇలాటివారూ తటస్థ పడుతూంటారు!

   మొత్తానికి స్కూలుకి చేరి సీట్లు సంపాదించాము.అక్కడందరూ మన ‘జాతి’ వారేగా!!అంటే తాతయ్యలూ, అమ్మమ్మలూ, నానమ్మలూ. అది ఓ హై-ఫై స్కూలులెండి. అంటే నాఉద్దేశ్యం, నేను చదివిన బోర్డు హైస్కులూ, మా పిల్లల్ని చదివించిన కేంద్రీయ విద్యాలయం టైపూ కాదు. మరి అక్కడికి వచ్చే పిల్లలు కూడా మరి ఆ స్టేటస్ వాళ్ళేగా! ఎవర్ని చూసినా కార్లలో వచ్చేవారే.చేతుల్లో కెమెరా ఫోన్లూ, వీడియో కెమెరాలూ, అబ్బో ఎంత హడావిడో. ఏమో ఇదివరకటి రోజుల్లో అయితే బహుశా డిఫిడెంటు గా ఉండేవాడినేమో, కానీ ఇప్పుడు అలాటివన్నీ ‘ఒట్టుతీసీ గట్టుమీదా పెట్టూ” లాగ వదిలేశాను.గత అయిదేళ్ళనుండీ, మనవడూ, మనవరాళ్ళూ ఆ స్కూలికే వెళ్తున్నారూ, ఇలా అప్పుడప్పుడు grandparents’ day లాటివాటికి వెళ్ళడం వలనేమో! ఇదివరకైతే, ఎవరినైనా పలకరించాలంటేనే కొద్దిగా భయ పడేవాడిని, భయం అంటే, వాళ్ళేం కొరికేస్తారో తినెస్తారో అని కాదూ, ఏదో మనం మధ్యతరగతి వాళ్ళం, వాళ్ళందరూ మనకంటే పై అంతస్థులో వాళ్ళేమో అని ఓ flying thought, అంతే!మనం అలా భయపడినంతకాలం, అవతలివాళ్ళు, తామే గొప్పవారేమో అన్న దురభిప్రాయం లో ఉంటారు.ఎక్కడో అక్కడ తెగించాలి.ఇదెలాటిదంటే, ఏ హొటల్ కైనా వెళ్ళినప్పుడు బిల్లు ఇచ్చెసిన తరువాత ప్లేటులో టిప్పు వేయడం లాటిది! వేయకపొతే, వాడేమైనా అనుకుంటాడేమో, వేస్తే ఎంత వేయాలీ, మరీ తక్కువైతే బాగోదేమో అన్నీ సందేహాలే!

   ఈ కార్యక్రమం విషయానికొస్తే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు నేర్పించిన పధ్ధతిలో బాగానే ప్రదర్శన ఇచ్చారు.ప్రతీ విద్యార్ధీ బాగానే చేశారనాలి. వారి కార్యక్రమం ఇంకా జరుగుతూండగానే, కొంతమంది, వారి వారి పిల్లల ప్రదర్శన పూర్తయిపోవడంతో,సడెన్ గా లేచి బయటకు వెళ్ళడం మొదలెట్టారు.ప్రపంచంలో ఇంతకంటే దౌర్భాగ్యపు పని ఇంకోటుండదు. పోనీ, అక్కడ స్టేజీ మీద పిల్లలు ఇంకా ఏదో చేస్తున్నారూ, ఇలా లేచి వెళ్ళిపోతే పాపం వాళ్ళు బాధ పడతారేమో అన్న ఇంగితజ్ఞానం లేని సో కాల్డ్ ఎలీట్ పెద్దలు!అసలు మనలోనే సంస్కారం లేకపోతే, ఇంక మనవలకీ, మనవరాళ్ళకీ ఏం నేర్పుతాం?కార్యక్రమం పూర్తయేదాకా ఉండే ఓపికా, సహనం లేకపోతే అసలు రానేకూడదు, వస్తే, పూర్తయేదాకా ఉండాలి.ఏం డబ్బులెట్టి సినిమాకి వెళ్తే పూర్తయేదాకా ఉండడం లేదూ? ఇక్కడ ఫ్రీగా వస్తోందికదా అని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమా?

   పాపం ఆ పిల్లలు మనల్నుండి ఆశించేదేమిటీ, ఓ క్లాప్,పూర్తిగా చూసి, ఒకసారి చప్పట్లు కొడితే వీళ్ళ సొమ్మేంపోయిందిట? మీలో ఎవరైనా ఇలాటి చిన్న పిల్లల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, చప్పట్లు కొట్టకపోతే మానేయండి, కానీ మధ్యలో మాత్రం లేచొచ్చేయకండి, ప్లీజ్ !!

%d bloggers like this: