బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– జ్ఞాపకాలు …జ్ఞాపకాల గానే ఉంటేనే బాగుంటుంది..

    చాలామంది, పుట్టి, పెరిగిన ఊరు వదిలి, ఉద్యోగరీత్యానో, ఇంకో కారణం చేతనో, వేరే పట్టణానికో, నగరానికో, రాష్ట్రానికో, దేశానికో వెళ్ళి స్థిరపడిన తరువాత, ఓ వయసు వచ్చిన సమయంలో, అదేదో nostalgia పేరు చెప్పి, ఓసారి మనం పుట్టిన ఊరువెళ్ళి చూసొస్తే బాగుండునూ అనే ఓఅర్ధరహితమైన భావన వస్తూంటుంది. అర్ధరహితం అని ఎందుకన్నానంటే, ఎప్పుడో పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇన్ని సంవత్సరాల తరువాత చూసేందుకేమీ ఉండదు. ఎక్కడ చూసినా మార్పే. అరే ఇక్కడ “ఫలానా వారిల్లుండేదీ.. పిన్నిగారు ఎప్పుడు వెళ్ళినా పటిక బెల్లం పెట్టేవారూ, వాళ్ళ ఇంటరుగుమీద హాయిగా ఆడుకునే వారమూ..”, ఇక్కడ ఓ పెద్ద కొబ్బరి తోటుండేదీ, మా ఇల్లు ఇక్కడే కదూ ఉండేదీ..ఇంటికి పెద్ద కాంపౌండూ, వెనకాల పెద్ద పెరడూ..10-15 గదులూ, పెరట్లో నుయ్యీ.. అక్కడే కదూ తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవాడినీ…( ఆరోజుల్లో ఆడవారికి మాత్రమే స్నానం గదులు ). నూతిగట్టు పక్కనే ఓ పొయ్యీ దానిమీద ఓ “డేగిసా” తో వేణ్ణీళ్ళు కాచుకోడమూ, తెల్లారేసరికి అమ్మ, పెరట్లో తులసికోట దగ్గర ప్రదక్షిణాలు చేయడమూ, అన్నిటిలోనూ ముఖ్యం పెరట్లో ఓ రుబ్బురోలూ, పండగల్లో అమ్మ గారెలకోసం మినపప్పు రుబ్బడం, పచ్చళ్ళు వంటగదిలో ఉన్న బుల్లి రుబ్బురోలులో.ఇంట్లోనే ధాన్యం పోసుకోడానికి ఓ గాదె…. ఇలా సినిమా రీలులాగ యాభై ఏళ్ళ క్రితం పాత గుర్తులన్నీ తిరుగుతాయి. కానీ, యదార్ధానికి ప్రస్తుతం అక్కడ ఉన్నదేమిటీ– ఓ కార్పొరేట్ స్కూలూ, దానికో సెక్యూరిటీ వాడూనూ. ఏదో వాడి కాళ్ళావేళ్ళా పడి, ఓసారి లోపలకి వెళ్ళి చూసొస్తామని వెళ్ళడం. మనకి కనిపించేది ఏమిటీ, ఉత్త ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడమీదే, సుద్ద ముక్కతో నాలుగు నిలువు గీతలు గీసికుని, వాటినే వికెట్లనుకుని, చక్క బ్యాట్టు, టెన్నిస్ బాలుతో క్రికెట్ ఆడిన రోజులు గుర్తొచ్చి, ఎమోషనల్ అయిపోవడం. అదృష్టమేమిటంటే, ఆరోజుల్లో నాతో క్రికెట్ ఆడిన నా కజిన్ కూడా నాతో ఉండడం. ఇద్దరం కలిసి, ఆ మిగిలిన ప్రహారీ గోడ మీద ఆప్యాయంగా చెయ్యి వేసి ఫొటో తీసికోడం !Trip 097 Trip 098

..Trip 095

అదే వీధిలో, మా అమ్మమ్మ గారి ఇంటికి ఎదురుగా, రామాలయం దగ్గర ఒక ఇల్లుండేది. అక్కడ రేమెళ్ళ శేషమ్మ్మ గారని ఒక పండు ముత్తైదువ, ఒంటి నిండా నగలు పెట్టుకుని, మహలక్ష్మి లా ఉండేవారు. ఎప్పుడైనా అమలాపురం భూపయ్య అగ్రహారం అంటే, ఆవిడే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడో.. శిథిలమైపోయిన ఆ ఇల్లు చూసేటప్పటికి గుండె నీరైపోయిందిTrip 091

ఆనాటి జ్ఞాపకాల లో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నది ఏమైనా ఉందీ అంటే, రామాలయం. ఆరోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. శ్రీరామనవమికి పానకాలూ, తాటాకు విసినకర్రలూ గుర్తుచేసికుని ఓ సారి సంతోషించాను.Trip 092

అక్కడనుండి బోడసకుర్రు గోదావరి మీద వేసిన కొత్త వంతెన మీదుగా, పాశర్లపూడి వెళ్ళి, మా స్నేహితుడిని కలవడానికి వెళ్తే, అక్కడ చూసిందేమిటీ, ఓ అరడజను 10 లీటర్ల మినరల్ వాటర్ సీసాలు. కోనసీమ అంటేనే, నీరు అమృతంలా ఉండేది. అలాటిది త్రాగడానికి మంచినీరు లేక, అదీ గోదావరికి 2 కిలోమీటర్ల దూరంలో, మినరల్ వాటర్ వాడాల్సిన దౌర్భాగ్యం !. మళ్ళీ జీవితంలో తిరిగి రాకూడదనుకుని , వస్తే ఇంకా ఎన్నెన్ని భయానక దృశ్యాలు చూడాల్సొస్తుందో అని భయం వేసింది.

కానీ ఇంత బాధలోనూ ఊరట కలిగించిన దృశ్యం అలనాటి గుర్రబ్బండి…Trip 044

అందుకే పుట్టిపెరిగిన ఊరికి వెళ్ళి, ఏదో ఉధ్ధరించేయడంకంటే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుండెల్లో పదిలంగా దాచుకోవడమే ఉత్తమం..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “పద్మ” ఎవార్డులు ఓ “వేళాకోళం” అయిపోయాయి….

    ఒకానొకప్పుడు గణతంత్ర దినోత్సవానికి ముందురోజు, కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకి , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవార్డులు ప్రకటించేవారు. సాధారణంగా, మర్నాటి వార్తాపత్రికల్లోనే చదివి తెలిసికునేవాళ్ళం. పేపరులో చదవగానే, ” ఓహో.. ఫలానావారికిచ్చేరన్నమాట..” అనుకునేవారం. ” భారతరత్న” అయితే, ప్రతీ ఏడాదీ కాకుండా, సంఘంలో ఎంతో ఘనత సాధించినవారికి, ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకీ ప్రకటించేవారు. భారతరత్న బిరుదు కూడా, కనిపించిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోలేదు. భారతరత్న బిరుదాంకితుల లిస్టు చూస్తేనే తెలుస్తుంది. కానీ, కొంతకాలానికి, రాజకీయ కారణాలతో ఇచ్చేవారు. అప్పటినుండీ మొదలయింది, అసలు ఈ రత్నాలు, విభూషణాలూ, భూషణాలూ, శ్రీ ల గొడవంతానూ. కేంద్రంలో ఏ రాజకీయపార్టీ ఉంటే, వారికి , ఏదో ” లాబీయింగు” ధర్మమమా అని వచ్చేయడం మొదలయింది.

    చివరకి ఎంత దౌర్భాగ్యానికి దిగిందంటే, ఎవరికి వారే, మాకు ఫలానా కావాలీ, ఫలానా దానికి మాకంటే అర్హులెవరూ అని కొట్టుకు చచ్చేటంత హీన స్థితికి చేరిపోయారు. ఆ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆ మధ్యన, ఫలానా అతనికి భూషణం రికమెండు చేస్తే, నేను మాత్రం అర్హురాలిని కాదా అన్నారు. పైగా, అవేవో ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల లాగ. ఏదో ఒకసారి “శ్రీ” ఇస్తే, అయిదేళ్ళదాకా “భూషణాలు ” రావుట. వీళ్ళ గొడవ పడలేక, మొత్తానికి క్రీడా మంత్రిత్వ శాఖ వారు, ఇద్దరినీ, రికమెండు చేశారు. కానీ, రికమెండేషనుతో సరిపోదుగా, చివరకి ఇద్దరికీ రాలేదు. పీడా విరగడయింది. ఇంకొక సినిమాలకి సంబంధించినాయన, నా మిత్రుడు ( ఈయన గారి “జోడీ” లెండి) కి, భూషణం రాగా లేనిది, నాకు మాత్రం ఉఠ్ఠి “శ్రీ” యేనా అని వాపోయాడు.

   ఇంక మన మహారాజశ్రీ ప్రభుత్వం వారైతే ఎప్పుడో దివంగతులైన దేశ నాయకులందరికీ బిరుదులు ప్రదానం చేసేస్తున్నారు. ఏదో వీళ్ళెవరో “బిరుదు” ఇస్తారని , దేశానికి సేవ చేయాల్సిన గతి పట్టలేదు, వారికి. నిస్వార్ధ సేవ చేసి, దేశప్రజల నీరాంజనాలు అందుకున్న మహా మహులు వారందరూ. వీళ్ళేదో బిరుదులు ఇచ్చారని, వారి గొప్పతనం పెరగాలేదూ, ఇవ్వకపోతే తగ్గనూ తగ్గదూ. ప్రభుత్వ శైలి చూస్తూంటే, ఎప్పుడొ శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికీ, భీష్మాచార్యులకీ కూడా భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపడనఖ్ఖర్లేదు. అప్పుడు మనంకూడా రామాయణం, మహాభారతం పక్కన పెట్టేయొచ్చు, ఎలాగూ బిరుదులు వచ్చేశాయిగా !

    ఇంక ఎడాపెడా ఈ బిరుదులు స్వీకరించిన ” మహామహులు”, అసలు వారి పేరుముందర వారికి వచ్చిన “బిరుదు” వాడకూడదూ అని ఓ నియమంకూడా ఉందిట. అదెప్పుడు తెలిసిందీ అంటే, ఆయనెవరో నటుడు పద్మశ్రీ..ఫలానా.. అని సినిమా టైటిల్స్ లో పెట్టుకుంటున్నాడని, ఓ “తలమాసినవాడు” (తనకి రాలేదని దుగ్ధ తో ) కోర్టుకెళ్తే, ఆ మ.రా.శ్రీ కోర్టువారు ఠాఠ్ .. పెట్టుకోకూడదూ అన్నప్పుడు. అయినా చాలామంది ఇంకా పేరుకి ముందర వాడుకుంటూనే ఉన్నారనుకోండి. ఇంకో పెద్దాయనైతే ” భారత రత్న” దారి దానిదే, నేనూ నా వ్యాపారప్రకటనలు మానుకుంటానా అని, ఈ బిరుదులు ఏమైనా తిండిపెడతాయా అంటాడు.

   ఏదో బిరుదులు వస్తేనే గొప్పవారైపోరు.ప్రజల అభిమానం సంపాదించాలి. అందుకు ఉదాహరణ, మన బాపూ గారే. అన్ని సంవత్సరాలపాటు, తెలుగువారందరి గుండెల్లోనూ ఓ స్థానం సంపాదించిన శ్రీ బాపు గారిని అసలు, ఏ తెలుగుప్రభుత్వమూ పట్టించుకోనేలేదాయె. చివరకి తమిళనాడు ప్రభుత్వం వారి దయతో ఓ ” పద్మశ్రీ” వచ్చింది. అదీ ఎప్పుడూ, వారి జంట శ్రీ ముళ్ళపూడి వారు దివంగతులైన తరువాత. అలాగని శ్రీ బాపూ గారు.. అరే ఇదేమిటీ నాకు “శ్రీ” తో సరిపెట్టేశారూ, “భూషణం” కదా రావాల్సిందీ.. అనుకుంటూ, కార్ట్యూన్లు వేశారా . ఏదో పేపర్లకి ప్రకటనలిచ్చేసి, హడావిడి ఏమైనా చేశారా? అబ్బే, అంత అనారోగ్యంతోనూ, నిరాడంబరంగా వెళ్ళి స్వీకరించారు, వారికి వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో. అదీ నిజమైన గొప్పవారిలో ఉండే నిజమైన గొప్పతనం.ముళ్ళపూడి వారి ప్రతిభని ప్రభుత్వం గుర్తించకపోవడం వలన, ఆయనలోని “ఘనత” తగ్గిందా? అయ్యో బాపురమణ లకి జంటగా వచ్చుంటే బాగుండునని బాధ పడని తెలుగువాడు లేడు.

   ఈ సంవత్సరం బాబా రాందేవ్, శ్రీశ్రీ రవిశంకర్ గార్లు, వారికి తెలుసు, ఈ ప్రభుత్వ బిరుదులు స్వీకరించి, ఊరికే అల్లరి పడడం దేనికీ అనుకుని, ముందుగానే ప్రభుత్వానికి తెలియచేసేశారు, మమ్మల్ని ” ఇరుకు” లో పెట్టొద్దూ అని !

   ఈ బిరుదుల ప్రహసనం ఓ రెండుమూడేళ్ళపాటు ఆపేస్తేనే హాయేమో… మేరా భారత్ మహాన్…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నేను ఎంతో అభిమానించే ” త్రిమూర్తులు “

   సాధారణంగా ప్రతీ వారికీ, తన కుటుంబంలో వారు కాకుండా, బయటి వ్యక్తులు కొందరిమీద ఎంతో అభిమానం, భక్తీ, పెంచుకుంటారు. ఎవరి కారణాలు వారివి. అలా అభిమానింపబడ్డవారు, ఓ ఆటలకి సంబంధించిన వారవొచ్చు, ఓ సినిమా నటుడో, నటో కావొచ్చు, ఓ రాజకీయాలకి సంబంధించినవారు కావొచ్చు. మనం అభిమానిస్తున్నాము కదా అని, అలాటివారితో ఏదైనా quality time గడిపామా అంటే అదీ లేదు. కారణం, మనకు వారు తెలిసుండొచ్చు, కానీ వారికి సంబంధించినంతవరకూ, వారిని అభిమానించే లక్షలాదిమందిలో మనమూ ఒకరం. ఎంతమందినని గుర్తుపెట్టుకుంటారు వారు మాత్రం?

    కానీ నా విషయంలో మాత్రం, నేను ఎంతగానో అభిమానించే ముగ్గురు “ఘనాపాఠీ ” లతో కొద్ది గంటలు గడపగలిగే అదృష్టం నాకు కలగడం, నేను చేసికున్న పూర్వజన్మసుకృతం అనుకుంటాను. నా మిగిలిన జీవితం అంతా, ఆ మధురక్షణాలని గుర్తుచేసికుంటేనే చాలు, ఒళ్ళు పులకరించేస్తుంది. గత యాభైసంవత్సరాలుగా, ఓ పుస్తకంకానీ, ఓ ఇంగ్లీషు పేపరుకానీ, కొని చదివానూ అంటే దానికి కారణాలు, నాకు ఎంతగానో నచ్చే ముగ్గురు వ్యక్తులు– వారినే ” త్రిమూర్తులు ” గా భావిస్తాను. శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు, శ్రీ బాపు గారు, నిన్న దివంగతులైన శ్రీ ఆర్.కే. లక్ష్మణ్ గారూ.

   ఆ మహనీయుల గురించి ఎంతని చెప్పగలము? మనిషికి ” నవ్వు” అంటే ఎలా ఉంటుందో నేర్పిన ఉద్దండులు వారు. ఎంత కష్టంలో ఉన్నా సరే, ముళ్ళపూడివారి జోకో, శ్రీ బాపు, శ్రీ లక్ష్మణ్ గారి కార్టూనో చూస్తే చాలదండీ, మన కష్టం మరచిపోడానికీ?

   ఆ “మహామహుల” త్రయం, భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారు సృష్టించిన అద్భుతాలు , ఎప్పటికీ మరచిపోలేనివి. అటువంటి మహామహులు మన నేలమీద నడియాడే సమయంలోనే మనం కూడా ఈ లోకంలో పుట్టడమంటే మాటలా మరి?

    వారిని కలిసి, ఒక్కోరితో రెండు మూడు గంటలు గడిపిన మధుర క్షణాల గురించి, ఇదివరకు మూడు టపాలు వ్రాశాను.

    https://harephala.wordpress.com/2010/08/18/baataakhaani-301/

   . https://harephala.wordpress.com/2010/08/23/baataakhaani-304/

    https://harephala.wordpress.com/2011/12/03/baataakhaani-615/

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– -अच्छा लगता है….

    ఈ టపా శీర్షిక చూసి కంగారు పడకండి. ఎప్పుడైనా, ఎక్కడైనా , మనసుకి సంతోషం కలిగించేది ఏదైనా జరిగితే, feel good అనుకోవచ్చు, లేదా రాష్ట్రీయభాషలో చెప్పాలంటే –अच्छा लगता है… అనుకోవచ్చు. అలాటిది ఏదో లాటరీలో ప్రైజే కానఖ్ఖర్లేదు. అనుకోకుండా, మనం అడక్కుండా సహాయం పొందినప్పుడు, ” అరే ..వీరేమిటి, మనకి సహాయం చేస్తున్నారూ.. మనం ఎప్పుడూ వీరిని కలవలేదు కూడానూ, పరిచయం కూడా లేదాయే, అసలు మనకి సహాయం చేయాలని, వీరికెందుకు అనిపించిందో.. అని మధన పడిపోతాము. కానీ, మనసులో మాత్రం –अच्छा लगता है…..

   అలాటి సందర్భాలు, మాకు ఈమధ్యన చేసిన ప్రయాణాల్లో ఓ నాలుగైదైనా కలిగుంటాయి. ఉన్నది మేమిద్దరమే అయినా, ప్రయాణం అంటే, కనీసం రెండు సూట్ కేసులూ , ఇంకో బ్యాగ్గూ, వీటికి తోడు భుజానికి తగిలించుకునే ఓ బ్యాగ్గూ.. వెరసి నాలుగు శాల్తీలు. ఎంత ” చక్రాలు” ఉన్న సూట్ కేసులైనా, టాక్సీలోంచి, స్టేషను లోపలదాకా , ఎలాగోలాగ లాక్కొచ్చినా, ఎక్కడో అక్కడ వాటిని ఎత్తి మోయాల్సొస్తుంది..మనమా అర్భకులం, సూట్ కేసులా పీకలదాకా కుక్కబడ్డాయి, దానికి సాయం సూట్ కేసు బరువోటీ… అంతంత బరువులు ఎత్తిమోసే ఓపిక మాటెలా ఉన్నా, ఏ నడుమో, భుజమో బెణికిందంటే గోవిందో..గోవింద.. నాంపల్లి లో దిగి, సికిందరాబాద్ స్టేషన్ కి , లోకల్ కాకుండా, ఇంకో ట్రైనేదో ఎక్కాము. మేమిద్దరమూ ప్లాట్ఫారం మీద దిగగానే, ఓ అబ్బాయి, మా సామాన్లు కిందకు దింపడంతో మొట్టమొదటి feel good ప్రస్థానం ప్రారంభం. మేము వెళ్ళాల్సిన ట్రైను 10 వ నెంబరు ప్లాట్ఫారం మీదకొస్తుందిట. ఇంతలో క్యాంటీనులో కాఫీ తాగుతూ, ఎవరో ఇద్దరు పెద్దమనుషులతో పరిచయం చేసికున్నాను. నా అలవాటు ప్రకారం కబుర్లు చెప్పడమన్నమాట ! మాటల్లో తెలిసిందేమిటంటే వారిలో ఒకరి నాన్నగారిది కోనసీమా, అమ్మగారిది తణుకూ..భలేగా ఉందీ, మాకాంబినేషను కూడా ఇదేనండీ అంటూ కబుర్లు చెప్పాను.. మా సామాన్లు పట్టుకుని, 10 వ నెంబరుకి ఎలా వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే ( ఎస్కలేటర్ ఉందనుకోండి, కానీ ఇదివరకు ఒకసారి జరిగిన సంఘటన మూలంగా, నేను ఎక్కను.), పాపం వారిద్దరూ సహాయం చేశారు..

   ఇంక తిరుపతి యాత్రలో నాలుగురోజులూ, మేమిద్దరమూ, ఓ కారూ. ప్రతీ చోటా డ్రైవరు కారు ఎక్కడో పార్కు చేయడమూ, మా ఫోన్లు కారులోనే పెట్టడంతో, ఎవరో ఒకరి సహాయం తీసికుని అతన్ని ఫోనులో పిలవడమూ. కనీసం నలుగురు అపరిచితులు సహాయం చేశారు. నాలుగో రోజు రాత్రి 11 గంటలకి రాజమండ్రీ చేరాము. మళ్ళీ ఇక్కడా అదే –ట్రైను రెండో ప్లాట్ఫారం మీదా, మేమూ, మా లగేజీతో మొదటి ప్లాట్ఫారానికి వెళ్ళడానికి, పాపం అతనెవరో మా అవస్థ చూడలేక, ఎస్కలేటరు ద్వారా మా సామాన్లు పంపారు.

    నేనూ, మా కజినూ రాజమండ్రీలో, మేము అక్కడ ఉండే రోజుల్లో ప్రతీరోజూ దర్శనం చేసికునే దేవాలయాలకి వెళ్ళాము. వెళ్ళిన ప్రతీ గుడిలోనూ ఉండే పూజారులు నన్ను దూరంనుండే గుర్తించి, పలకరించి, గోత్రనామాలతో పూజ చేయడం. అదీ నాలుగు సంవత్సరాల తరువాత…ఎంత సంతోషమనిపించిందో… వీటన్నిటికీ కొసమెరుపేమిటయ్యా అంటే, 25 న మా ట్రైను అర్ధరాత్రి 2 గంటలకి. అంతరాత్రివేళ ఆటోలు దొరకవని, పన్నెండున్నరకే స్టేషనుకి వచ్చేశాము. ట్రైను ఒకటిలోకే వస్తుందని నిర్ధారించుకున్న తరువాత, అక్కడే వెయిటింగు రూమ్ములో కూర్చున్నాము. ఆఖరి క్షణంలో రెండో ప్లాట్ఫారం అన్నారు. మళ్ళీ మొదలూ- ఉరకలూ పరుగులూ. ఒక్క కూలీ ఉండడు అంతరాత్రివేళ.. మళ్ళీ ఎక్కణ్ణుంచి వచ్చారో ఇద్దరు అబ్బాయిలు, మా సామాను తీసేసికుని, రెండో నెంబరు ప్లాట్ఫారం మీద పెట్టేసి, మేము థాంక్స్ చెప్పుదామని చూసేసరికి మాయం అయిపోయారు. మా ప్రయాణం లో ఎక్కడా శ్రమ పడకూడదనే, ఆ భగవంతుడు, దేవదూతలని పంపీంచేడా అనిపించింది.. ఎక్కడా, కాలు కింద పెట్టనవసరంలేకుండా జరిగింది మా యాత్ర…

   అన్నిటిలోకీ ముఖ్యం శ్రీ కాళహస్తీశ్వరుడి దర్శనం. ఎక్కడచూసినా క్యూలే. ఎవరో చెప్పగా, మేము 200 రూపాయల టిక్కెట్లు తీసికున్నాము. ఆ టిక్కెట్లు చేతిలో, కనిపించేటట్టుగా పెట్టుకుని, తిన్నగా దర్శనానికి వెళ్ళిపొమ్మన్నారు. అదే చిత్రమో కానీ, మా చేతిలో టిక్కెట్టు చూడడం, క్యూ ఆపేసి, మాకోసం గేటు తెరవడమూ, క్షణంలో మూలవిరాట్టుకి ఎదురుగా ఉన్నాము. అలాగే అమ్మవారి దర్శనమూనూ. తిరుమలలోనూ అలాటి అనుభవమే. 300 రూపాయల టిక్కెట్టు రెండు కాపీల బదులు, ఒకటే ఉంది. ఫొటోకాపీ తెమ్మన్నారు. రాకరాక పదేళ్ళ తరువాత వచ్చామూ, దర్శనం అవదేమో, అని భయపడ్డంతసేపు పట్టలేదు, ఎవరో ఓ అబ్బాయి సహాయం చేశాడు.

   మరి అడుగడుగునా ఇలాటి అనుభవాలు జరిగినప్పుడు अच्छा लगता है… కాక ఏమంటారు మరి ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Comfort level

   ఒకానొకప్పుడు అంటే 40-50 సంవత్సరాల క్రితం, ఎక్కడికైనా , ఏ తెల్లవారుఝామునే ప్రయాణం పెట్టుకుంటే, ఆ ముందురోజే, ఏదో మనకి వాడికలో ఉన్న, ఏ ఒంటెద్దు బండివాడికో చెప్పుంచేవారు. కాల క్రమేణా, ఈ ఒంటెద్దు బళ్ళు వెళ్ళిపోయి, గుర్రబ్బళ్ళూ, లాగే రిక్షాలూ వచ్చాయి.అవీ వెళ్ళిపోయి, సైకిల్ రిక్షాలొచ్చాయి. కాలక్రమేణా అవీ, కాలగర్భంలో కలిసిపోయి, ఆటోరిక్షాలు వచ్చాయి. వీటికి కూడా “కాలదోషం ” పట్టేటట్టు కనిపిస్తోంది.ఈ మధ్యన పెద్ద పెద్ద నగరాల్లో ఎన్నో కంపెనీల వాళ్ళు call cabs మొదలెట్టారు. పైగా, వీటి apps మొబైల్ లో పెట్టేసికుంటే, క్షణాల్లో క్యాబ్ రెడీగా ఉండడంతో, అర్జెంటుగా వెళ్ళాల్సిన వారికి ఇది చాలా సదుపాయంగా ఉంది.

ఆ మధ్యన ఇలాటి క్యాబ్ లో వెళ్తూ, డిల్లీ లో ఒక మహిళ మీద అత్యాచారం జరగడంతో, ప్రభుత్వం వారు , వెంటనే ఆ కంపెనీ, దానితోపాటు ఇంకో కంపెనీ క్యాబ్బులమీదా , ban పెట్టేశారు. మన నాయకులూ, వగైరాలందరూ, ” ఆహా..ఓహో..” అనేసికున్నారు. మహిళ మీద అత్యాచారం జరగడం, చాలా విచారకరమే, ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చు. కానీ, ఆ సమస్యకి పరిష్కారం, ఎడా పెడా ప్రజలకి సౌకర్యంగా ఉన్న సర్వీసులని బ్యాన్ చేయడం కంటే, ఆ కంపెనీ వాళ్ళు, డ్రైవర్లని recruit చేసే పధ్ధతిలో, ఇంకొన్ని conditions పెట్టుంటే బాగుండేదేమో.ఆ కంపెనీ వాళ్ళు, డ్రైవర్ల పూర్వాపరాలు పూర్తిగా తెలిసికోకుండా ఉండడం వలన ఇలాటి పరిస్థితి వచ్చిందీ, అలాటి వాళ్ళను తప్పిస్తే నష్టం ఏమిటీ, అనేవాళ్ళు ఉన్నారు. మరి అత్యాచారాలు ఆటోల్లో జరగడంలేదా, అంటే సమాధానం ఎవడూ చెప్పడు. అప్పుడెప్పుడో డిల్లీలో ఓ బస్సులో ఒక అమ్మాయిమీద అత్యాచారం చేసి,హత్య చేసినందుకు, అదేదో ” నిర్భయ్” చట్టాన్ని చేశారు. ఆ సంఘటనలో పాలుపంచుకున్న దోషులకి ” మరణ శిక్ష” వేశారు, అదెంతవరకూ అమలు పరుస్తారో ఆ భగవంతుడికే తెలుసు. అలా బస్సులో అత్యాచారం జరిగిందని బస్సులన్నీ బ్యాన్ చేశారా? అప్పుడెప్పుడో షిరిడీ వెళ్తూన్న బస్సు లో మంటలొచ్చి, ఎంతోమంది ప్రాణాలు పోయాయి. వెంటనే, మొత్తం ట్రావెల్స్ వాళ్ళ బస్సులన్నిటికీ తూతూమంత్రంగా కొన్నిరోజులు ఆపేశారు. మళ్ళీ మామూలే. కారణం, దేశంలోని ఏరాష్ట్రంలోనైనా సరే, ఈ ట్రావెల్స్ బస్సులవాళ్ళు, ఎంతో “పలుకుబడి” కలిగిన రాజకీయనాయకులే. వాళ్ళ ముఖ్యోద్దేశ్యం డబ్బులు చేసికోడంకానీ, మనుషుల ప్రాణాలెవడు పట్టించుకుంటాడూ?

అయినా మన నాయకులకీ, మీడియా వారికీ ఇది అలవాటేకదా- ఏదైనా సంఘటన జరిగినప్పుడు, చిలవలూ పలవలూ చేసి, నానా హడావిడీ చేసేయడం, అక్కడకి వాళ్ళే దేశప్రజల సౌభాగ్యానికి పాటుపడుతూన్నట్టు చూపించుకోడం. చివరకి సాధారణ పౌరుడి గురించి పట్టించుకునే వాడు ఎవరయ్యా అంటే తనే . ఎవరో వస్తారూ ఏదో ఒరగబెడతారూ అనుకోవడం బుధ్ధితక్కువ. ఆ క్యాబ్బులవాళ్ళని ban చేయడం వలన ప్రభుత్వానికి ఏమైనా ఒరిగిందా అంటే “ఏమీ లేదు”. మహా అయితే, ఆ కంపెనీలవాళ్ళు మళ్ళీ వాళ్ళ సర్వీసులు మొదలెట్టడానికి, ఎవరి ” చెయ్యో ” తడపాలి. కానీ, ఆ సదుపాయం లేక, నష్టపడ్డవారు మాత్రం చాలామందే ఉన్నారు.

అయినా ground realties తెలిసికోకుండా కనపడ్డ ప్రతీదాన్నీ బ్యాన్ చేయడం , మన ప్రభుత్వాలకి ఓ సరదా ! ” మనకేమిటీ, ప్రభుత్వ వాహనాలున్నాయి.. దానికి సాయం convoy పేరుచెప్పి ఇంకో పది కార్లూ..ఇంక సామాన్య మానవుడంటారా, వాడి అవసరం ఇంకో అయిదేళ్ళదాకా ఎలాగూ ఉండదూ…”.అనే భావనే, తప్ప, పోనీ బస్సు సర్వీసులు బాగున్నాయా, ఆటోవాళ్ళు వాళ్ళిష్టమొచ్చినంత “వసూలు” ఆపుతారా, అని ఏమాత్రం ఆలోచించరు. మన Transport వ్యవస్థ దౌర్భాగ్యంగా ఉండడం మూలానే కదా, ఆర్ధిక స్తోమత ఉన్న వారు, ఈ క్యాబ్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారేమో అన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికీ కలగలేదు. ఓ ఆర్డరు మీద సంతకం చేసి, క్యాబ్ సర్వీసులు ban చేయడంతో, తమ పని అయిపోయిందనుకుంటారు. ఎవడు ఏ గంగలో దిగితే మనకెందుకూ అనుకోడం.

మిగిలిన నగరాల్లో పరిస్థితి గురించి నాకైతే తెలియదు. కానీ, పూణె లో పరిస్థితి గురించి చెప్పాలంటే, ఈ క్యాబ్బు సర్వీసులు వచ్చినప్పటినుండీ, సుఖాలకి అలవాటు పడ్డామంటే ఆశ్చర్యం లేదు. ఇదివరకు మేముండే చోటునుండి, మా ఇంటికి వెళ్ళాలంటే, ముందుగా మా సొసైటీనుండి, ఆటోలు దొరికే చోటుకి వెళ్ళాలంటే, ఓ అరకిలోమీటరు నడవాలి.రోడ్డు చివర ఉండే ఆటో స్టాండు వాడిని అడిగితే, 70 రూపాయలో మొదలెడతాడు. మీటరేమయిందిరా అంటే, ” పని చేయడం లేదు “…ఎప్పుడూ ఒకటే సమాధానం. మనకి తెలుసు, వాడడిగేది ఎక్కువా అని, కానీ చేసేదేమీ లేదు, పోనీ రోడ్డుమీదవెళ్ళే ఇంకో ఆటోని ఆపి అడుగుదామా, అంటే , వీళ్ళని చూసి వాళ్ళు ఆటో అసలు ఆపనే ఆపరాయె. ఫలితం, ఇంకో పావుకిలోమీటరు ఆపసోపాలు పడుతూ, నడవడం, అదృష్టం బాగుంటే, మీటరు మీదొచ్చేవాడు దొరికితే సరే సరి, లేకపోతే 50 రూపాయలకి బేరం కుదుర్చుకోడం. పైగా ఇందులో ఓ ” ego satisfaction ” ఒకటీ, మనం అనుకున్న రేటుకే కుదుర్చుకున్నామూ అని ! కానీ, దానికోసం ముప్పావు కిలోమీటరు నడిచామూ అనేది, మర్చిపోతాము !!

ఈ మధ్యన ఈ క్యాబ్బుల వాళ్ళు- OLA, TAXI FOR SURE, MERU.. లాటివి వచ్చిన తరువాత సుఖపడ్డామంటే నమ్మండి. అందులో Taxi for sure వాడి మినిమం 49 రూపాయలు. మిగిలిన వాళ్ళవి 99 రూపాయలు. మా ఇంటికీ, మేముండే ఇంటికీ దూరం 4 కిలోమీటర్లు. హాయిగా 49 రూపాయలతో పనైపోతోంది. అమ్మాయి ఇంటికి వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు.ఓ ఎనభైరూపాయలతో పనైపోతోంది. ఇదివరకు వందలకి వందలు ధారపోసేవాళ్ళం. పైగా అడుగు కిందపెట్టకుండా, హాయిగా ఇంటిముందర ఎక్కి, గుమ్మంలో దిగడం. మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు ఇలాటి సదుపాయం చేయగలరా? పైగా ప్రకటనలకి మాత్రం లోటుండదు. ఏ ఆటో వాడైనా ఎక్కువ వసూలు చేస్తే ఫలానా..ఫలానా.. నెంబరుకి ఫోను చేసి ఫిర్యాదు చేయండీ అంటూ. ఆ ఫోను ఛస్తే పనిచేయదు. పోనీ చేశామే అనుకోండి, ఆ ఆటోవాడు మర్నాడో. మూడోనాడో రోడ్డుమీద వెళ్తూంటే, ఏ బెడ్డో విసిరితే, మన గుండు పగిలితే మన rescue కి ఏ ప్రభుత్వం వస్తుందిట? పోనీ, అలా అంటే, ” మీలాటి అర్భకులవల్లే దేశం మట్టికొట్టుకుపోతోందీ, ఎవరో ఒకరు మొదలెట్టాలికదా..” అంటూ social media లో ప్రతీవాడూ ఏకేసేవాడే…ఎందుకొచ్చిన గొడవా.. హాయిగా ఇంటికి టాక్సీ పిలిపించుకోడంలో ఉన్న హాయే వేరూ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాట పధ్ధతి

    సాధారణంగా, మనం మాట్టాడే పధ్ధతిని బట్టి, అవతలివారు, మనల్ని అంచనా వేయగలుగుతారు. అందుకే , ఎప్పుడైనా సరే ఆచి తూచి మాట్టాడుతూండాలి. విషయం ఎంత పెద్దదైనా, చిన్నదైనా, మాటాడే పధ్ధతి ని బట్టి, exaggerate or light చేయొచ్చు. మన మనస్థత్వాన్ని బట్టి ఉంటుంది. జీవితం అంతా, తామే ఎంతో గొప్పవారిననీ, అవతలివారు ఎప్పుడూ, తమకంటే “తక్కువ” వారే అన్న అభిప్రాయంతో, మాట్టాడే వారు, జీవితంలో అవతలివారిలో ” మంచి” అనేది ఎప్పుడూ కనిపించదు. ప్రతీదానికీ సణుగుడే.. ఓ అర్ధం పర్ధం అనేది ఉండదు.ఓ సామెత ఉంది, వినే ఉంటారు..” విస్సన్న చెప్పిందే వేదం..” అని.

కొంతమంది అర్భకులుంటారు. ఏ యాత్రకైనా వెళ్ళొచ్చి, ప్రసాదాలూ, వగైరా తెలిసినవారికి వెంటనే, ఇచ్చేస్తే సంతోషించేవాళ్ళు. ఏ కొత్త సంవత్సరమో అయితే, ఏ తెలుగు క్యాలెండరో కూడా జతచేసి, రెండూ కలిపి, ప్రత్యేకంగా, ఏ కారులోనో వెళ్ళి మరీ రావడం. ఇందులో వీళ్ళకి ఒరిగేదేమీ ఉండదు, ఓ రకమైన ఆత్మసంతృప్తి తప్ప. కారులో వెళ్ళారుకదా, అని, మరీ పెట్రోలు డబ్బులు అడుగుతారని కూడా కాదు. ఏదో, ఆనందంగా యాత్ర పూర్తిచేసికుని వచ్చామూ, తెలిసినవారితో విశేషాలు పంచుకుంటే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుందనే, కానీ, ఆ అవతలివారు, జీవితంలో యాత్రలే చేయలేదనీ, తెలుగు క్యాలెండర్ల మొహమే ఎప్పుడూ చూసినవారు కాదు అనీ, కాదు. తెలుగు ప్రాంతాల్లో, ఈ తెలుగు క్యాలెండర్లకీ, పంచాంగాలకీ కొదవ లేదు. కానీ, తెలుగేతర రాష్ట్రాల్లో , ఓ తెలుగు క్యాలెండరన్నా, పంచాంగమన్నా, తిథి,వార, నక్షత్రాలు చూసుకునే వారికి, మంచి బహుమతే మరి. ఇదివరకోసారి, మా కాలనీ లో ఉండే తెలుగువారు, ఉగాది సంబరాలు జరుపుకుందామనుకునేసరికి, తీరా కొత్త పంచాంగం, లేదని తెలిసేసరికి, తెలిసున్నవారందరిదగ్గరా అడగడం మొదలెట్టారు. నా దగ్గరుందని తెలిసి, దానితో పని కానిచ్చేశారు. ఏదో ఘనకార్యం చేశాననికాదు, ప్రవాసాంధ్రులకి, తెలుగు క్యాలెండర్లూ, పంచాంగాలూ ఎంత ముఖ్యమో చెప్పడానికి మాత్రమే. ఈ రోజుల్లో అయితే జనవరి ఒకటో తారీకుకి, ఇక్కడ వచ్చే తెలుగువార్తాపత్రికలతోపాటు, ఓ తెలుగు క్యాలెండరుకూడా, దొరుకుతూండడంతో, బాగానే ఉంది. కానీ, ఆ పేపరూ, ఉచిత క్యాలెండరూ ఒకటోతారీకు ప్రొద్దుటే వస్తాయి కానీ, ముందురోజుకు కాదుగా. ఇత్యాది కారణాలవలన, ఈ ఏడాది, మా యాత్రల ప్రసాదమూ, రాజమండ్రీలో మాకు దొరికిన తెలుగుక్యాలెండర్లూ, తీసికుని, మాకు తెలిసినవారి ఇళ్ళకు, ఓ టాక్సీలో వెళ్ళి, ఇచ్చొచ్చాము.

ఈ ఒకటో తారీకున, కొత్తసంవత్సరం తో పాటు, వైకుంఠఏకాదశికూడా కలిసొచ్చింది. ఈవేళ ప్రొద్దుటే ఓ ఫోనూ–” మీరిచ్చారుకదా అని, నమ్మకంతో, ఏకాదశి ఘడియలు ఎప్పటిదాకా ఉన్నాయో, అని చూసి మావారిని కంగారు పెట్టేశానూ, తీరా ఈవేళ్టి పేపరుతో వచ్చిన క్యాలెండరు చూస్తే, తెలిసిందీ, మీరిచ్చిన క్యాలెండరులో చాలా తప్పులున్నాయీ..” అంటూ.అక్కడికేదో, మా ఇంటావిడ, ఉద్దేశపూరకంగా, ఆవిడని misguide చేసిందనే అర్ధం వచ్చేటట్టు. మా ఇంటావిడ, తెగబాధపడిపోయింది, “అయ్యో పాపం.. అలాగా..” అంటూ. అప్పుడే, నేనూ, బయటకెళ్ళొచ్చి, ఈవారపు తెలుగు వారపత్రికలూ అవీ తెచ్చాను. వచ్చీరాగానే, తను విషయం చెప్పింది. బహుశా మేమిచ్చిన క్యాలెండరంతా తప్పుల తడకేమో. రాజమండ్రీ లో క్యాలెండర్లిచ్చిన పెద్ద మనిషికి ఫోను చేద్దామా అనుకుంటూ, పోనీ ఇంట్లో ఉన్న పంచాంగాలూ, “కాలనిర్ణయ్” తెలుగుక్యాలెండర్లూ, చూస్తే తెలిసిందేమిటంటే, ఆ ఏకాదశి ఘడియల విషయంలో , అన్నిటిలోనూ. ఏదో ఓ అరా, నిముషం తేడాగా, ఒకే టైమిచ్చారు. మా ఇంటావిడ ఊరుకోక, తిరిగి ఆవిడకి ఫోను చేసి, ఇంట్లో ఉన్న తెలుగుక్యాలెండర్లూ, పంచాంగాలూ ముందరేసికుని, విషయం చెప్పింది.ఏదో మొత్తానికి, సమస్య తీరిందనుకోండి. ఇక్కడ విషయం ఎవరి క్యాలెండర్లూ రైటూ, ఎవరివి తప్పూ అని కాదు. గతేడాది జరిగిన almost ప్రతీ పర్వదినం విషయంలోనూ, మన పండితులు కొట్టుకుంటూనే ఉన్నారు, టీవీ ల్లో చర్చలోటీ. అయినా పండగలూ ఆగలేదు, పబ్బాలూ ఆగలేదూ, ఎవరి పాండిత్యం వారు చెప్పుకున్నారు. అంతదాకా ఎందుకూ, గోదావరి పుష్కరాల విషయంలోనూ ఇదే తంతు. చెప్పొచ్చేదేమిటంటే, controversy ముందరా, తెలుగువాడు తరువాతా పుట్టారు, ఈ లోకంలో… ఏది తీసికోండి, ఏదో ఒక సమస్యే..అవతలివాడు చెప్పింది, మనం ఎందుకు వినాలీ ? That is the bottomline…

పైన వ్రాసిన విషయం అంటే ఘడియల తేడా, ఎప్పుడో కలిసినప్పుడు కూడా చెప్పొచ్చు.. అలా చెప్పడంవలన విషయం dilute కూడా అవొచ్చు, లేదా ఇంకో పండగ/ తిథి విషయంలో మేమిచ్చిన క్యాలెండరులో ఎన్నెన్ని “తప్పులు” ఉన్నాయో పరిశీలించి, ఏదో మాటల్లో ప్రస్తావించొచ్చు. కానీ, మా ఇంటావిడ చూస్తూన్న క్యాలెండరంతా “తప్పుల తడక ” అని ఏకంగా నిర్ధారించేయడం,పనికట్టుకుని ఫోను చేయడం వగైరాలు అంతగా బాగుండలేదు. ఏదో “పుణ్యానికి వెళ్తే…” అన్నట్టు తయారయింది, మా ఇంటావిడ పరిస్థితి. దీనికంతా మూలకారణం ఏమిటంటారూ– over enthusiasm. పైగా దీనివలన కొత్తగా నేర్చుకున్నదేమిటయ్యా అంటే, ఏ యాత్రలకైనా వెళ్ళొచ్చినా, ఎగరేసికుంటూ వెళ్ళఖ్ఖర్లేదని. ఏదైనా అనుభవం మీదే కదా తెలిసేదీ? ఈ ఇచ్చేవారికున్న అత్యోత్సాహం, తీసికుంటున్నవారికేమీ ఉండాలని లేదు.

ఉదాహరణకి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, పెళ్ళి ఫొటో ఆల్బమ్ములు తెచ్చి పడేస్తారు. అందులో ఉన్నవారెవరో మనకు తెలియదాయె, అలాగని చూడనంటే అదో గొడవా. ఇచ్చే కాఫీ మానేస్తారేమో అని ! అలాగే, ఇంట్లో ఉండే ఏ చిన్నపిల్లాడో, వాడికొచ్చిన విద్యలన్నీ ప్రదర్శింపచేస్తారు. ఈ ఇవతలివారు ఆ phaseలన్నీ దాటొచ్చినవారే అనికూడా గ్రహించకుండా. గ్రహించినా, “అన్ దేఖీ” చేసేయడం.”ప్రతీరోజూ మనం భరించడంలేదేమిటీ.. ఒక్కరోజు ఏమీ ముంచుకుపోతుందేమిటీ..” అనే అభిప్రాయమైనా కావొచ్చు.

చివరగా చెప్పేదేమిటంటే, ఎవరైనా అభిమానంతో ఏదైనా తెచ్చిస్తే, దాని లోటుపాట్లు వివరించడానికి , ఓ సమయమూ, సందర్భమూ ఉండేలా చూసుకోండి.. వెంటనే అఘమేఘాలమీద చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత చిన్న విషయానికి ఇంత పోస్టా అనుకునేవారూ ఉంటారు. కానీ, ఓ బ్లాగ్గులూ, పోస్టులూ అనుభవాలు ఇతరులతో పంచుకోడానికేగా.. ఇలాటి అనుభవాలు ఇంకోరికి “పాఠాలు” అయే అవకాశం కూడా ఉంటుంది.