బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెరటి చెట్టు…

పురాతన గ్రంధాల్లో చదివాము— వైద్య శాస్త్రంలో మన దేశంలో ఎందరో ఘనాపాఠీలుండేవారని… మన పెద్దలు తమ అనుభవంచేతనైతేనేమిటి,  ఆ గ్రంధాలు చదవడం వలన అయితేనేమిటి, తరతరాలుగా వనమూలికలనే ఉపయోగించి వైద్యం చేసేవారు. వీటిని ఎలా వాడాలో, ఏ మొతాదులో వాడాలో కూడా పుస్తకాల్లో వివరంగా ఉండేది… కాలక్రమేణా వంశపారంపర్యంగా సామాన్యులకి కూడా అందుబాటులోకి వచ్చాయి. పైగా ఈ వనమూలికలు చాలా ప్రదేశాల్లో దొరికేవి. ఏ మూలిక దేనికి ఉపయోగిస్తుందో తెలిస్తే చాలు… ఇంట్లోనే  ప్రధమ చికిత్సలాటిది కానిచ్చెసి, అవసరాన్నిబట్టి ఏ  వైద్యుడివద్దకో తీసికెళ్ళేవారు..

 అందుకనేనేమో మన చిన్నప్పుడు, ఏదెబ్బైనా తగిలి రక్తం కారుతూంటే, వెంటనే ఏ పసుపో అద్దేస్తే రక్తం కాస్తా కారడం ఆగిపోయేది. అలాగే ఏ కావిర్లు లాటివో వస్తే, అదేదో చెట్టు ఆకులు తెచ్చి, పసరు  ఓ నాలుగైదురోజులు తాగిస్తే, మామూలు గా అయిపోయేవారు. ఇంక పాము కాటులూ, తేలుకాట్లకీ అయితే , ఏవో మంత్రాలు వేస్తే, ఆ విషం కట్టుబడిపోయేది. “ మంత్రాలకి చింతకాయలు  రాల్తాయా”  అని ఇప్పటివారు హేళన చేయొచ్చు, కానీ రాలేవన్నది మాత్రం నిజం… అలాగే పెరిగిపెద్దయాము కదా.. ఏ పిప్పిపన్ను నొప్పో వస్తే ఓ లవంగం అక్కడ పెట్టుకుంటే, ఆ నొప్పి తగ్గేదిగా.  అవన్నీ ఈనాటివారు  విన్నప్పుడు నవ్వులాటగా కనిపించవచ్చు, కానీ ఈ లవంగాలతోనూ, ఈ పసుపుతోనూ తయారుచేసి, ఏదో బహుళజాతి కంపెనీవాళ్ళో , పెద్దపెద్ద  వ్యాపార ప్రకటనలతో హోరెత్తించేసి, తయారీ ఖర్చుకి నాలుగైదింతలు చేసి అమ్మినా, ఎగబడి కొనుక్కుంటారే కానీ, “ అరే ఇది మన పసుపే, మన లవంగమే కదా.. “ అని ఒక్కడూ ఆలోచించడు. ఒకానొకప్పుడు పళ్ళుతోముకోడానికి, బొగ్గో,  వేపపుల్లో వాడేవారు.. అవన్నీ  exploit  చేస్తూ,  “ మీ Tooth  paste  లో  Coal ఉందా,  Neem  ఉందా “ అని ప్రకటనరావడం తరవాయి, “ అబ్బ ఎంత మంచి పేస్టో.. “ అంటూ ఇంట్లో వాళ్ళందరూ ఆ పేస్టే వాడ్డం… వీటికి సాయం , యోగా లో ప్రసిధ్ధిచెందిన ఆ పతంజలి గారేమో , బహుళజాతి కంపెనీలు తయారుచేసే ప్రతీ వస్తువునీ, మన దేశీయ పేరుపెట్టగానే , వాటి వెనక్కాల పడ్డం ఓ వేలం వెర్రైపోయింది… MNC Brands  అన్నిటికీ ఓ దేశవాళీ పేరు పెట్టి, తన   Business Empire  ని లక్షల  కోట్లలోకి తీసికెళ్ళగలిగారు.

 ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆరొగ్యవిషయంలో, విదేశీ శాస్త్రజ్ఞులు చెప్పిందే మన వాళ్ళకి వేదం… పోనీ మనవాళ్ళేదైనా చెప్తే వింటారా, అబ్బే .  అదేదో  విదేశీకంపెనీ ఓ మందుతయారుచేసిందంటే, వాళ్ళ దేశం లో అమ్ముడుబడ్డా లేకపోయినా, మనవాళ్ళు మాత్రం తప్పకుండా కొంటారు… ఎంతైనా ఫారిన్ కంపెనీదికదాండీ.. అంటూ.. అవే మూలాలతో దేశంలో ఎవరో తయారుచేస్తే దానిమొహం చూసేవాడుండడు…  ఆ విదేశీ శాస్త్రజ్ఞులు తక్కువ తిన్నారా ఏమిటీ?   యుగయుగాలనుండీ మన దేశంలో విరివిగా వాడుకలో ఉండే కొన్నిటిని,  ఏదో  research  పేరుతో “ హాఠ్ దాన్ని ఉపయోగిస్తే ఆరోగ్యానికి హానికరం “ అంటాడు. అప్పుడెప్పుడో, మన పసుపు మీద అవాకులూ చవాకులూ మాట్టాడారు.. చివరకి వాళ్ళ విదేశీ కంపెనీలే తెలివితెచ్చుకుని, అదే పసుపు కి బ్రహ్మరధం పడుతున్నారు. ఈమధ్యన ఇంకోడెవడో “ కొబ్బరి నూనె విషంతో సమానం.. “ అన్నాడు. అంటే మనవాళ్ళు యుగయుగాలనుండీ కొన్ని చోట్లైతే వంటకి కూడా, వాడుతున్నది విషమా?  మనవాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యా రాలేదే?కరోనా మహమ్మారి ధర్మమా అని so called technologically developed  దేశాల్లోనే మరణాలు ఎక్కువగా రికార్డవుతున్నాయి.  ఆయనెవరో ఈమధ్యన  రొజూ ఓ మూడు నాలుగు చెంచాల కొబ్బరి నూనె తాగితే, ఎలాటి ఆరోగ్యసమస్యలూ ఉండవన్నారు. ఎవరిని నమ్మేదీ?

అంతదాకా ఎందుకూ… యుగయుగాలనుండీ అలవాటు పడ్డ  Gripewater  ని పక్కకు పెట్టేసారు.. ఈ విదేశీ కంపెనీలు.. నెత్తికి నూని, అన్నంలోకి నెయ్యీ వేసుకోవడం ఓ ఘోరపాపంకిందజమకట్టించేసారు..ప్రతీదానికీ అదేదో కొలస్ట్రాల్ పెరుగుతుందీ అని భయ పెట్టడం.. అసలు ఈరోజుల్లో వచ్చే రోగాలకి ముఖ్య కారణం—బర్గర్లూ, సబ్ వేలూ, వాటితో సాఫ్ట్ డ్రింకులూ అని మాత్రం ఒప్పుకోరు..

ఈ కరోనా  Lockdown  వలనైనా వీటి వాడకం తగ్గితే బావుండును…

గుర్తుండే ఉంటుంది- ఆమధ్యనెప్పుడో , తలనొప్పికి వాడే  SARIDON  మాత్రలు నిషేధించేమని ఓ ప్రకటన వచ్చింది. వాటిని వాడితే అవేవో  side effects  వస్తాయన్నారు. కొంతమందికి వాటిని వేసుకుంటేకానీ తలనొప్పి తగ్గదాయే. పైగా వీటికి డాక్టర్  prescription  కూడా అవసరం లేదు. ఏడాది తిరిగేటప్పటికల్లా సుప్రీం కోర్టు వారు, “ ఏం పరవాలేదూ వాడుకోవచ్చూ.. “ అని తీర్పిచ్చేసారు. అసలు మొదట్లో, ఎందుకు వాడద్దన్నారో మాత్రం తెలియదు. .. ఏమో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరైనా వైద్యుడున్నారేమో….

అసలు గొడవంతా ఎక్కడంటే, మనవాళ్ళు దేశంలో వైద్యవిద్య అభ్యసించి, పై చదువులకి విదేశాలు వెడతారే అక్కడొచ్చింది… పోనీ ఆ పైవిద్యేదో మన దేశంలోనే చదవొచ్చా అంటే, ఇక్కడేమో ప్రవేశానికే వందలకొద్దీ ఆటంకాలు, ఏవేవో అడ్డంకులు.., కాదూ కూడదంటే, ఏ  Private College  లోనో కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఈ గొడవంతా పడలేక, ఆ ఖర్చేదో పెట్టుకుంటే, హాయిగా విదేశీ   degree  దొరుకుతుందికదా అని, అక్కడకే లైను కట్టేస్తున్నారు. పైగా ఆ డాక్టరు  పేరు చివర ఓ విదేశీ degree  తగిలిస్తే, కాసుల వర్షమే కదా…

 “ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు “ అన్న  లోకోక్తిలోంచి బయటపడితే తప్ప, మనకి బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–keeping fingers crossed…

 ప్రవచనాల్లో చెప్పగా విన్నాం—కాలమానాన్ని  నాలుగు యుగాలుగా విభజించారని..

కృత యుగం

త్రేతా యుగం

ద్వాపర యుగం

కలియుగం

 ఏదో కాలజ్ఞానం బోధిస్తానేమో అని మాత్రం కంగారు పడకండి.. అంత పరిజ్ఞానం లేదు..ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం అని కదూ అంటారూ.. అది కూడా ఎలా తెలిసిందీ అంటే, మనింట్లో పెద్దవాళ్ళు , ఏదైనా కొత్త విషయం విన్నా, అసలలాటిది జరుగుతుందేమో అనే ఊహ కూడా లేనప్పుడు.. “ అంతా కలి కాలం బాబూ..” అనేవారు గుర్తుండే ఉంటుంది. అంటే ఈ “ కలియుగం “ లో   anything can happen beyond rational thinking  అనే కదూ..  ఆనాటి విషయాలేమైనా, వారు చదివినవో, లేక విన్నవో చెప్పడానికి ప్రయత్నించినా  ఈ తరం పిల్లలు సుతరామూ ఒప్పుకోరు… కనీసం ఇదివరకటి రోజుల్లో వినడమైనా వినేవారు.. ఇప్పుడు ఏ విషయం చెప్పినా ముందు “  Why? “  అంటారు.. దానికి సమాధానం మనదగ్గర ఉండదాయే..Life goes on…

 ఈ 21 వ శతాబ్దం ప్రారంభమయి 20 ఏళ్ళవుతోంది—అందరికీ గుర్తుండే ఉంటుంది.. 1999 వ సంవత్సరం పూర్తయి, 2000  సంవత్సరంలోకి అడుగెట్టే ముందర , నానా హడావిడీ జరిగింది..అంతర్జాలం ప్రాచుర్యంలోకి వచ్చి చాలాకాలమే అయింది.. సాధారణంగా సంవత్సరాలు రాయాల్సొచ్చినప్పుడు మరీ నాలుగంకెల్లో కాకుండా, రెండేసి అంకెల్లో తేల్చేసేవారు.. ఉదాహరణకి 1975 ని  75 అని రాస్తే సరిపోయేది.కానీ 1999 తరవాత  2000 వ సంవత్సరానికి 00 అని రాస్తే నానా అల్లరీ జరిగిపోయేది, 1900 కీ  00 రాసి, 2000 కీ 00 రాయలేముగా.. అదేదో   Y2K  అన్నారు..తరవాత 2001 నుండీ 01..02..03..20 దాకా వచ్చేసాము.

 ఈ రోజుల్లో అంతా స్పీడు యుగం.. కిందటి శతాబ్దంతో పోలిస్తే, ఎన్నో ఎన్నెన్నో కొత్త ఆవిష్కారాలు వచ్చేసాయి.. వచ్చే 30 -40  ఏళ్ళల్లోనూ  ఇంకా అభివృధ్ధి చెందుతాయనడం లో సందేహమే లేదు..మా రోజుల్లో మేము చదువుకున్నవి, నేర్చుకున్నవీ. ఈ రోజుల్లో వచ్చిన అభివృధ్ధితొ పోలిస్తే, ఎంత వెలవెలలాడిపోతున్నాయో, అలాగే ఈ రోజుల్లో నేర్చుకున్నవి కూడా, వచ్చే 30-40 ఏళ్ళల్లో  outdated  అయిపోవడం మాత్రం ఖాయం..

 కొత్తగా ప్రపంచాన్ని గడగడలాడిస్తూన్న “ కరోనా “ వైరస్ ధర్మమా అని, దేశంలో ఎప్పుడూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళూ కననివీ, విననివీ గత మూడువారాలుగా జరుగుతున్నాయి… ఇంకా ఎన్నా (న్నే) ళ్ళు కొనసాగుతాయో ఆ భగవంతుడికే తెలుసు.. ఎప్పుడూ కలలో కూడా ఊహించనివన్నీ జరుగుతున్నాయి.24 గంటలూ జనసందోహంతో నిండిపోయే  ముంబై లోకల్స్ 3 వారాలపాటు మూసేసారు.దేశమంతా విమానయానాలు ఏక్ దం బంధ్..దేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా జోడించే రైలు మార్గాలు అన్నీ కూడా 3 వారాలు బంధ్.నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఇదంతా ఎందుకూ.. ఆ మహమ్మారి  కరోనా, మరణ తాండవానికి బ్రేక్ పెట్టడానికి.దేశంలో ఉండే ప్రసిధ్ధ దేవాలయాలు మూసివేసారు.. చర్చిల్లో, మసీదుల్లో ఆదివారాలు, శుక్రవారాలు జరిగే ప్రార్ధనలక్కూడా బ్రేక్ పడింది.. అసలు ఇలాటి పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఊహించామా?కానీ వచ్చింది.. ఈ మూడు నాలుగు వారాలూ ఎలా ఉంటాయో అప్పుడే చెప్పలేము..ఒకలా చెప్పాలంటే సామాన్య జనజీవనమే బంధ్ అయిపోయింది.. ఇలాటివన్నీ సినిమాల్లో కెమేరా మాయాజాలంతో చూపించేవారు.. కానీ ఇప్పుడు యదార్ధంగా జరుగుతున్నదదే… పైగా ఈ LOCK DOWN  ఇంకా ఎన్ని రోజులు/నెలలు ఉంటుందో ఎవరూ చెప్పలేరు..

 అన్ని ఓ కొలిక్కొచ్చి పరిస్థితి చక్కబడిందే అనుకుందాం… అసలు గొడవంతా అప్పుడు ప్రారంభం అవుతుంది..  ప్రపంచ ఆర్ధికవ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది.. ఉద్యోగాలుంటాయో ఊడుతాయో చెప్పలేము..   సాధారణంగా కొత్త సంవత్సరం వచ్చిందంటే, ఏవేవో జాతకాలు మారుతాయేమో అని అనుకుంటాం, కానీ మరీ ఇంత దారుణంగా మారతాయని మాత్రం ఎవరూ ఊహించుండరు..

ప్రస్తుతరోజుల్లో ఉన్న సదుపాయం ఏమిటంటే, అంతర్జాలం ధర్మమా అని, దేశవిదేశాల్లో జరుగుతూన్న పరిణామాలని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాము..అంతరిక్షంలో తిరుగుతున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాల మూలంగా…  కర్మకాలి వాటిల్లో ఏమైనా సాంకేతిక లోపాలొచ్చి , ఆ కక్ష్యలోంచి బయటకొచ్చేస్తే ? రావని ఎవరుమాత్రం గారెంటీ ఇవ్వకలరూ?  ఆకాశంలో పక్షులు తప్ప మరోటి కనిపించడం లేదు, గత కొద్ది రోజులుగా..  ఇవన్నీ ఎప్పుడైనా ఊహించామా?

చివరకి తేలిందేమిటంటే  …ఏదీ మన చేతిలో లేదనీ, ఆ పైవాడు ఎలా ఆడిస్తే ఆడ్డమే అనీ.. ఈ విషయం ఎప్పణ్ణుంచో చెప్తున్నారు అయినా వినేదెవరూ?

సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– లౌడ్ థింకింగ్..

సాధారణంగా కొందరిని చూస్తూంటాము, జంతువులనో పక్షులనో పెంచుకోవడం, విదేశాల్లో అయితే పులిపిల్లలని కూడా పెంచుకుంటారుట. ఎవరిష్టం వారిదీ.. ఒకలా తీసుకుంటే మనకి పాలిచ్చే ఆవు, గేదె కూడా పెంపుడు జంతువుల కోవలోకే  వస్తాయి కదా.. అదృష్టమేమిటంటే, మరీ ఏనుగు ని పెంచుకునేవారిని గూర్చి వినలేదింకా. ఎంతైనా దాన్ని పోషించడానికి కొంచం ఖర్చెక్కువనేమో.. ఈ పెంపుడు జంతువులని తమ స్వంత పిల్లల్లా చూసుకుంటారు..ఒక్కోప్పుడు పిల్లలకంటే ఎక్కువగా, బహుశా నోరులేని జీవాలనేమో.. అందులో తప్పేమీ లేదు.
  సాధారణంగా తమ పిల్లలకి క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. వాళ్ళుకూడా తల్లితండ్రులు చెప్పిన మాట వినేరకమే.. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా చిన్న పిల్లలు మితిమీరి అల్లరి చేస్తే, తల్లో తండ్రో ఒక్కసారి గుడ్లెర్రచేసో, చేత్తో చూపిస్తేనో, అల్లరి ఆపేసేవారు. కానీ ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయి.

గారం అనండి, తల్లితండ్రుల్లో మొలకెత్తిన అబధ్రతా భావం అనండి, చిన్న పిల్లల  I Q  కూడా మోతాదెక్కువే…  ఆరోజుల్లో, చిన్నపిల్లలు ఏడిస్తే, ఏ ఆటబొమ్మో ఇస్తే ఊరుకునేవారు, ఆరోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడంతా మొబైల్, రిమోట్ల యుగమాయె. ఏదో ఒకటిస్తేనే కానీ పేచీ ఆగదు. తల్లితండ్రులుకూడా దానికి అలవాటైపోయారు.. పోనిద్దురూ ఎవరి సావకాశం వారిదీ. కానీ వీళ్ళెవరింటికైనా వెళ్ళినప్పుడు, కొంతమంది పిల్లలకి, ఆ ఇంట్లో ఉండే, మొబైల్, రిమోట్లమీదే కళ్ళుపడతాయి.. ఇంక ఊరుకోవడమంటూ ఉండదు, వెంటనే అదేదో చేతిలోకి తీసుకుని కెలికేదాకా ఊరుకోడు. ఇదిమాత్రం, కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, పోనీ ఆ పిల్లాడి పేరెంట్స్ ఏమైనా కలగచేసుకుని, కంట్రోల్ చేస్తారేమో అని చూద్దామా అంటే, అబ్బే వాళ్ళు తమ “ ఆంఖోకా తారా “ తెలివితేటలు చూసి మురిసిపోతారు తప్ప, “ కాదమ్మా అలా ప్రతీదీ తీసేయకూడదు “ అని మాత్రం ఛస్తే చెప్పరు.. ఇక్కడ ఈ గృహస్థు మాత్రం కంగారుపడిపోతూంటాడు, అసలే ఈ వచ్చినవాళ్ళు , తమని చూడ్డానికి వచ్చినవాళ్ళాయె, ఏ మొబైల్లో తగలేస్తే, కొడుకూ కోడలూ ఏమంటారో ఏమో. ఎరక్కపోయి పిలిచానురా బాబూ అనుకోవడం తప్ప చేసేదీ లేదు. పోనీ తనే చొరవ చేసి, ఆ మొబైలేదో ఆ పిల్లాడి చేతులోంచి తీసేసుకుందామా అంటే, ఆ వచ్చిన వాళ్ళ  so called  మనోభావాలు ఏమైనా  hurt  అవుతాయేమో అని భయం.. ఆ దేవుడిమీద భారం వేయడమే. ఇవి పిల్లల సంబంధిత సమస్యలు. ప్రాణాంతకం  కాకపోయినా, ఎవరింటికైతే వెళ్ళేరో వాళ్ళకి సమస్యలు తెస్తూంటాయి.

గదిలోకి వెళ్ళి తలుపు భళ్ళున వేసేసికోవడం ఓ పిల్లాడికి ఆటగా ఉంటుంది. వాళ్ళింట్లో అయితే, తాళాలు బయటే ఉంటాయికాబట్టి ఫరవాలేదు… కానీ అదే ఇంకోరి ఇంటికి వెళ్ళి చేస్తే,  తలుపులు బద్దలుకొట్టాల్సొస్తుంది. కొంతమంది తల్లితండ్రులు, ఎవరైనా వారింటికి వచ్చినప్పుడు, ఆటవస్తువులు దాచేస్తూంటారు… అదే తల్లితండ్రులు ఎవరింటికైనా వెళ్ళి, అక్కడి ఆటవస్తువులు తగలెట్టినా, పిల్లల్ని కంట్రొల్ చేయరు.

పిల్లల్లాగే కొంతమంది కుక్కలూ, పిల్లులూ కూడా పెంచుతూంటారు. వాళ్ళింట్లో వాళ్ళిష్టమే.. కానీ ఆ కుక్కని, కాలకృత్యాలు చేయించడానికి వీధిలోకి తీసికెళ్ళినప్పుడు, దాని మెడకు ఓ గొలుసు వేయాలని ఎందుకు గుర్తుండదో?  చాలామంది వేస్తూంటారు, కానీ వందలో పదిమందికి, వాళ్ళ కుక్కని వదిలేయడం ఓ దౌర్భాగ్యపు అలవాటు..కొత్తగా ఎవరినైనా చూస్తే,  అరవడం, వాళ్ళమీదకి ఎగరడం చూస్తూనే ఉంటారు పక్కనుంచి.. అయినా సరే “ ఏమీ చేయదండీ..” అంటారే కానీ దాన్ని కంట్రొల్ మాత్రం చేయరు… కొంతమందికి కుక్కలంటే భయం, అలాటివారు కుక్కలున్న ఇంటికి వెళ్తే నరకమే.. దాన్ని కట్టేస్తే దాని మనోభావాలు దెబ్బతింటాయట.. అందుకోసం, మనతోనే ఉంటుందిట. ఇవేం ప్రేమాభిమానాలో? పైగా ఆ కుక్కకి “ అంకుల్ వచ్చారు హలో చెప్పమ్మా.. “ అంటూ కబుర్లోటీ.. ఇక్కడ ఆ వెళ్ళినతనికి  B P  పెరిగిపోతూంటుంది. అలాగే  ఎపార్ట్మెంట్లలో పెంపుడు పిల్లుల్ని వదిలేస్తూంటారు.. రాత్రిళ్ళు బయట  పెట్టిన చెత్త బుట్టలన్నిటినీ బలవంతంగా పీకి పరిసరాలు ఖరాబు చేస్తూంటాయి. అయినా సరే, ఈ పెంపుడుపిల్లి యజమాన్లకి ఏమీ పట్టదు.

కుక్కల్నీ, పిల్లుల్నీ పెంచుకోవడం వద్దనడం లేదు, కానీ వాటిని బయట వదిలినప్పుడే అసలు గొడవంతానూ.. కొద్దిగా బయటివారి గురించికూడా ఆలోచించే సంస్కారం కూడా ఉంటే, అందరికీ బావుంటుంది…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– utter confusion

 సాధారణంగా చూస్తూంటాం..  పట్టణాలు, నగరాల్లో , ప్రతీ దానికీ , ఓ ప్రత్యేకమైన జాగా ఉంటుంది… ఒకే రకమైన వ్యాపారాలు అక్కడే కానిస్తూంటారు..  ఉదహారణకి  ఇనుప సామాన్లన్నీ ఓ చోటా, బంగారం కొట్లన్నీ ఓ చోట, అలాగే బట్టల దుకాణాలన్నీ ఓ చోటా.. అలాగే సబ్జీ మార్కెట్ కూడా .. ఫుట్ పాత్ ల మీద పెట్టే కూరలకొట్లు కూడా ఒకే వరసలో ఉంటాయి.. పూర్వపు రోజుల్లో వారాంతపు “ సంత “ లాగ.. ఒకవిధంగా జనాలకి సౌకర్యం కూడానూ.. ఓ కొట్లో వస్తువు నచ్చకపోయినా, లేకపోయినా, అదే వీధిలో ఉండే మరో కొట్టుకు వెళ్ళొచ్చు.. దీపావళి సామాన్లకి కూడా ఓ ప్రత్యేక స్థలం ఉంటుంది. అంతదాకా ఎందుకూ, ఈ రోజుల్లో చూస్తూంటాం.. ఊళ్ళో పురోహితులందరూ పొద్దుటే ఓ చోట సమావేశం అవుతూంటారు.. అలాగే రోజువారీ పనులు చేసే వడ్రంగి, ప్లంబర్, తాపీమేస్త్రీ, వగైరా … ఒకేచోటుంటారు. అలాగే మా చిన్నతనం లో కాకినాడ లో “ సినిమా స్ట్రీట్ “ అని ఉండేది..  సినిమా హాళ్ళన్నీ ఆవీధిలో ఉండేవి.. ఒకదానికి టికెట్ దొరక్కపోతే మరో సినిమా..  ఆరోజుల్లో అన్ని సినిమాలూ బావుండేవి.. ఇప్పటిలాగ కాదు… 

 కాలక్రమేణా, వివిధ రకాల వ్యాపారాలూ “ ఒకే గొడుగు” కిందవచ్చే  మాల్స్ తయారయాయి..అన్ని రకాల పనులూ పొద్దుటినుండి సాయంత్రం దాకా పూర్తిచేసేసుకోవచ్చు.కొనేవేవో కొనుక్కుని, అక్కడే ఉండే ఫుడ్ సెంటర్ లో తినేసి, అందులోనే ఉండే మల్టీ ప్లెక్స్ లో ఓ సినిమా కూడా చూసేసి రాత్రికి ఇంటికి వచ్చేయొచ్చు.

 వీటన్నిటిలోనూ ఓ విషయం గమనించొచ్చు.. ఖరీదుల విషయానికొస్తే, ఆ మాల్ లో ఉండే ప్రతీ కొట్టులోనూ, ఏదో డిస్కౌంట్ల తేడా తప్ప,  almost  ఒకేలా ఉంటుంది (  ofcourse on the higher side only)..  ఓపికుంటుంది కాబట్టి వెళ్తున్నారూ.. No issue..  అలాగే నగరాల్లో తిరిగే ఆటోలు, ఒక్కో వీధిలో ఒక్కో స్టాండ్ లో పెట్టుకుంటారు.. వాళ్ళనడిగినా అందరూ ఒకే రేటు.. మీటర్ పనిచేయడం లేదు.. ఎంత  ఐకమత్యతో కదా…కొంతకాలంగా అవేవో ఊబర్లూ, ఓలాలూ వచ్చాక , వాటిని వాడుకుంటున్నారు..కనీసం రోడ్డుచివరదాకా నడిచి ఆటోవాళ్ళతో బేరాలాడక్కర్లేదని..

 ఇంక ఆన్లైన్లో అయితే ఏదైనా తెప్పించుకోవచ్చు, మనిష్టం.. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఏదో ధరల్లో కొద్ది తేడాతో కావాల్సినవి కొనేసుకోవచ్చు.

 కానీ ఈ “ ఐకమత్యత” లేని  “ వ్యాపారస్థులు” ఎవరో తెలుసా?  ఏదైనా రోగం వస్తే, మనం సంప్రదించే డాక్టర్లూ, మానవ బలహీనతల్ని సొమ్ముచేసుకునే, టీవీ ల్లో వచ్చే జ్యోతిష్కులూ,  Youtube  లో 24 గంటలూ హోరెత్తేంచేస్తున్న , రకరకాల మూలికా వైద్యులూనూ…

 ఓ డాక్టరు దగ్గరకి వెళ్ళి రకరకాల టెస్టులూ, ఎక్స్ రేలూ తీయించుకుని, అదేదో second opinion  కోసం, ఈ ఫైలంతా మోసుకుని వెళ్ళండి—ఆఫైలువేపు కనీసం చూడకుండా, పక్కని పడేసి, ఇదివరకు తీసుకున్న టెస్టులే, ఇదివరకు తీసుకున్న ఎక్స్ రేలూ, మళ్ళీ చేయించుకుని రిపోర్ట్స్ తెమ్మంటాడు. అదేమిటండీ రిపోర్టులు తీసుకొచ్చానుగా మొన్ననే వేలకు వేలు పోసి తీసుకున్నానూ, అన్నా సరే.. అదేదో  parameter  రిపోర్ట్, ఫలానా  angle  లో X Ray..  కావాలంటాడు.. ఛస్తే పాత రిపోర్టులని మాత్రం నమ్మడు.. మందులు కూడా, తన క్లినిక్ బయటుండే  medical Shop  లోనే దొరుకుతాయి అదేం చిత్రమో.. వాళ్ళూ, వాళ్ళ స్నేహితుల లాబ్బులూ కూడా బతకాలిగా…

 అలాగే వారం వారం టివీ ల్లో వచ్చే “ వార ఫలాలు”.. ఒకే రాశికి, ఒకాయన ఒకటి చెప్తారు, మరో చానెల్ లో మరొకాయన, దీనికి పూర్తి విరుధ్ధంగా చెప్పి, ఏవేవో శాంతులూ, పూజలూ చేయించాలంటారు.. ఎవర్ని నమ్మాలో తెలియదు.. వీటికి సాయం, యూట్యూబ్ లో అయితే, మీకు ఓపికుండాలి కానీ, వందలాది జ్యోతిష్కులు రాశి కి ఓ క్లిప్పూ, నక్షత్రానికి ఓ క్లిప్పూ దాంట్లో ఆవారం భవిష్యత్తూ…అవి కూడా అంతే ఒకరొకరికి పొంతనుండదు.. ఏ సోషల్ మీడియాలోనో ఈ విషయం ప్రస్తావించినా,  వ్యక్తిగత జాతకాన్ని బట్టి అన్వయించుకోవాలీ అంటారు..

 ఈ మధ్యన యూట్యూబ్ లో మరో రంధి ప్రారంభమయింది.. దేశంలో ఉండే ప్రతీ రోగానికీ, తలో వైద్యమూ.. ఒకాయన నిషిధ్ధమని చెప్పిన తిండి, మరొకాయన  అదే తిండి, “ ఏం పరవాలేదూ.. హాయిగా తినొచ్చూ.. నేను గారెంటీ..” అంటారు.

 ఏమిటో అంతా గందరగోళం..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. moral policing..

మన దేశంలో  జనాలకి వినోదం కలిగించడానికి, ఒకానొకప్పుడు వీధినాటకాలు, ఆతరవాత  బహిరంగప్రదేశాల్లో, స్టేజి మీద నాటకాలు, ఆ తరవాత సినిమాలు.. మొదట్లో మూకీలూ, తరవాతరవాత టాకీలూ వచ్చాయి..  సినిమాలకి ఓ సెన్సార్ బోర్డు కూడా పెట్టారు.. ఏమైనా అభ్యంతరకర దృశ్యాలో, డయలాగ్గులో ఉంటే, వాటిని నియంత్రించడానికి.. వాటికి అవేవో.. U and A   సర్టిఫికేషన్ ఇచ్చిన తరవాత మాత్రమే, సినిమా విడుదలయేదీ, అవుతోంది కూడా..

ఆ సెన్సారింగ్ కూడా ఒక్కోప్పుడు మరీ చిత్రంగా ఉండేది. డయలాగ్గుల్లో ద్వందార్ధాలు ఉండకూడదూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంభాషణలుండకూడదూ.. పాటల్లో కూడా ఏవేవో నియంత్రణలుండేవి.. ఇంక దృశ్యాలైతే..  హీరోయిన్ చీర పాదాలపైకి కనిపించిందా.. కట్.. ముద్దులమాటే ఎత్తకూడదూ.. భార్యాభర్తల మొదటి రాత్రైతే .. ఓ పువ్వుమీద తుమ్మెద వాలినట్టు చూపించి, తరవాతి సీన్  లో ఓ పిల్లో పిల్లాడినో చూపించేస్తే సరిపోయేది..ఏమిటో ఆరోజుల్లో  ప్రేక్షకులు కూడా అల్ప సంతోషులు.. ఏ క్లబ్ డాన్సో వచ్చినప్పుడు ఈలలు వేసి, తమ ఆనందం వ్యక్తపరిచేవారు… కాలక్రమేణా, సెన్సారింగ్ లేకుండా, కొన్ని సినిమాలు విడియో టేప్ రూపంలో, రహస్యం గా, చూసేవారు..అప్పుడప్పుడు పోలీసులకి పట్టుబడేవారు..

 టీవీ ల్లో వచ్చినా, మరి కొన్ని కట్ లు  ఇప్పటికీ దూర్ దర్శన్ లో వేసే సినిమాల్లో చూస్తూంటాము.. టీవీల్లో  DTH  లు వచ్చాక, వేలాది చానెల్స ధర్మమా అని, విడేశీ చిత్రాలు కూడా చూస్తున్నారు.. ప్రస్తుతం అంతర్జాలం ధర్మమా అని, మరో మెట్టు ఎక్కారు.. అవేవో  Amazon Prime, Netflix, Hotstar, etc..  లలో అన్నిరకాలూ చూడగలుగుతున్నారు..  మన దేశంలో కాబట్టి, సెన్సారింగైతే ఉంటుందే.. అయినా అదో కాలక్షేపం.. కానీ వీళ్ళందరూ అవేవో  Webseries  అని మొదలెట్టారు అన్ని భాషల్లోనూ.. ఇవైతే  height of it.. ఎటువంటి restrictions  ఉండవు..వాళ్ళదే రాజ్యం.. పైగా వీటికి Seasons  ఓటీ 1…2..3.. అంటూ..కథేమీ ఉండదు పెద్దగా.. కానీ సినిమాల్లో ఛాన్స్ రానివాళ్ళూ, బుకింగులు తక్కువైన అలనాటి నటులూ, నటీమణులూ..వీటిల్లో హాయిగా ఛాన్సులు కొట్టేస్తున్నారు.. వీళ్ళకి ఉండాల్సిన  main qualification  ఒళ్ళంతా చూపించగలగాలంతే.. ఇంక డయలాగ్గులంటారా. వీళ్ళదే రాజ్యం..  Four letter words  ధారాళంగా ఉపయోగించొచ్చు.. సంభాషణలు రాసేవారిక్కూడా పండగే..ఒకానొకప్పుడు ప్రేక్షకుల ఊహాశక్తికి వదిలేసే శృంగార దృశ్యాలు  విచ్చలవిడిగా చూపిస్తారు.. కారణం వీటికి సెన్సారింగనేది లేదు కనుక.. పైగా మొదట్లో ఓ  disclaimer  పెట్టేసి చేతులు దులిపేసికుంటారు ఆ  Webseries  నిర్మాతలు.

  పైన రాసినది ఏదో చాదస్థంగా కనిపించొచ్చు.. కానీ ఒక్క విషయం చెప్పండి.. ఈ రోజుల్లో పైన చెప్పిన  Apps  అన్నీ కూడా, మొబైల్స్ లో కూడా చూడొచ్చుకదా..ఇలాటివన్నీ ధారాళంగా చూపిస్తూ.. దేశంలో అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయో అని ఏడవడం దేనికీ? ఈరోజుల్లో చేతిలో  smart phone  లేని, ఓ కుర్రాడూ కుర్రదీ ఉన్నారంటారా?  వాళ్ళని నియంత్రించగలరా?

 మాట్టాడితే  moral policing  అంటూ, నైట్ క్లబ్బులూ,  Porn sites అవీ నియంత్రిస్తారే మన ప్రభుత్వాలూ, ఈ  webseries  వాళ్ళ దృష్టిలోకి రాలేదంటారా లేక వచ్చినా ,  ఇలాటివి ఆ కోవలోకి చెందినవి కావని అభిప్రాయమా? కాదూ కూడదంటే తిరిగి అధికారంలోకి రాలేమేమో అని భయమా?

అసలు కారణం… వీళ్ళు ఎంత నియంత్రించాలని ప్రయత్నించినా వాటి దారి వాటిదే అని వీళ్ళకీ తెలుసు. మన దేశంలో ఎన్నో రకాల చట్టాలైతే ఉన్నాయి ప్రతీ దానికీ.. ఏదో సందర్భం వచ్చినప్పుడు, selective  గా ఉపయోగిస్తారు తప్ప అవేవో ఆచరించాలని చేసినవేవీ కావని అందరికీ తెలుసు…. ఇదంతా కంఠశోష అని తెలిసినా… ఏదో….

సర్వేజనాసుఖినోభవంతూ…