బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” మన పని అయిపోయింది.. చాల్లెద్దూ…”

    ఇదివరకటి రోజుల్లో ఎవడైనా , ఏ సరుకైనా ఎరువుకి తీసికెళ్తే, ఆ వస్తువు మనకి తిరిగిరావడమనేది, మన అదృష్టం మీద ఆధారపడి ఉండేది. అధవా, ఎప్పుడైనా కనిపించినా , అసలు ఓ వస్తువు తీసికున్నట్టే గుర్తులేదన్నట్టు మొహం పెట్టేవారు. పోనీ , ఆ వస్తువులు ఏమైనా విలువైనవా అంటే అదీ కాదు. కానీ, అవసరాన్ని బట్టి వాటికి విలువ కూడా ఎక్కువే. అవసరం వచ్చినప్పుడే కదా తెలిసేది వాటి విలువ. ఉదాహరణకి , బూజులు దులుపునే కర్ర, వేసవికాలంలో, మామిడికాయలు కోసుకోడానికి చిక్కం తో ఉన్న కర్ర, అలాగే ఆవకాయకాయ లకి మడత కత్తిపీట, నూతిలో చేద పడిపోతే తీయడానికి గేలం, పనసపొట్టు కొట్టడానికి కత్తి, సత్యన్నారాయణ పూజకి దేవుడి పీటా, మర్చేపోయాను నిచ్చెన ఒకటీ… ఇలా చెప్పుకుంటూ పోతే, ఇవన్నీ నిత్యావసరాల్లోకి రావు, కానీ ఏదైనా అవసరమంటూ ఉంటే, పైచెప్పిన వస్తువులన్నీ ఉండాలే. ఎప్పుడో అవసరానికి ఉపయోగిస్తాయి కదా అని, వాటన్నిటినీ కొనరు కదా. ఏ పక్కింటి పరోపకారి పాపన్ననో అడిగితే పనైపోయేదానికి, ఈ “ చిల్లర” వస్తువులన్నీ ఇంట్లో పెట్టికోవడం దేనికీ అనుకోవడం.

పైచెప్పినవే కాకుండా, కొద్దిగా స్థాయి పెంచి, ఓ సైకిలో, కాలక్రమంలో ఓ స్కూటరో, కాదూ అంటే, కూతురి పెళ్ళిచూపులున్నాయని నగా నట్రా కూడా ఎరువుతీసికునేవారు చాలామందే ఉండేవారు. ఆరోజుల్లో అడిగేవారున్నట్టే, అడగడం తరవాయి ఇచ్చేవారుకూడా ఉండేవారు.. కానీ, పనైపోయిన తరువాత ఇవ్వడం అనేది, సునాయసంగా మర్చిపోవడం. అదికూడా మర్చిపోయారనడంకంటే, అడిగితే ఇద్దాములే అనే ఓ స్వభావం. ఎవరైతే అడగ్గానే ఇచ్చారో, వాళ్ళకీ అవసరం ఉంటుందేమో, లేదా మనలాటివాళ్ళకింకోరికివ్వాల్సొస్తుందేమో అనేది మాత్రం ఛస్తే తట్టదు.. సంఘంలో ఇలాటి “ పక్షులు” కోకొల్లలు.

అవసరం వచ్చినా అడగడానికి మొహమ్మాట పడతాడు పరోపకారి పాపన్న గారు. ఎంతో అవసరం ఉండే పాపం, ఆయన తీసికెళ్ళాడూ, ఇంకా పని అయుండదు అనుకోడం. అడగడానికి మొహమ్మాటం, ఇంక ఆ తీసికెళ్ళినాయనంటారా, పనైపోగానే, అదేదో “అంటరాని వస్తువు” లా ఓ మూలన పడేయడం. అడిగినప్పుడే చూద్దాం అనుకోవడం. తీరా అడిగేసరికి “ అర్రే మర్చేపోయాను.. అవసరం ఉంటే మీరే అడుగుతారని చూస్తున్నాను.. “ అని కొడుకునో, కూతురునో పిలిచి “ అక్కడ పెరట్లో మాస్టారి తుప్పుపట్టేసిన గేలం/ చిక్కం చిరిగిపోయిన కర్ర/ పనసపొట్టు కొట్టినప్పుడు పూసిన నూనె మరకలతో కత్తీ/ ఇలా చెప్పుకుంటూ పోతే, నామరూపాలు మారిపోయిన వస్తువు….. తీసికునిరా” అని ఆర్డరు వేస్తాడు. తీసికున్న వస్తువు శుభ్రపరిచి ఇద్దామూ అనే ఇంగిత జ్ఞానం మాత్రం ఉండదు. మన పనైపోయింది కదా అనేదే ముఖ్యం. ఇవన్నీ పాతరోజులు.

ఈ రోజుల్లో నూతులూ లేవు, మామిడి చెట్లూ లేవు, పనసకాయలూ లేవాయె. అంతా instant యుగం. అలాటివి కాకపోతే ఇంకోటి. అవసరాలూ, స్వభావాలు మాత్రం అలాగే నిరాటంకంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం అంతా సమాచార యుగం. దానితో, మహానగరాల్లో కొన్ని సంస్థలు Just Dial లాటివి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. “ గూగులమ్మ” అయితే ఉండనే ఉంది. కానీ వాటిని ఉపయోగించుకోడానికి బధ్ధకం ఒక కారణమైతే, అడగడం తరవాయి, చెప్పడానికి సిధ్ధంగా ఉండే వెర్రిబాగులోళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎన్నాళ్ళైనా ఉంటూనే ఉంటారు..

కొత్తగా ఏదైనా ఉద్యోగార్ధం ఊరెళ్తే, అక్కడ ఆబ్దీకాలు, పెట్టేవారో, మడిగా వంటలు చేసేవారో కావాల్సొస్తుంది, మరి ఆ వివరాలు ఆ Just Dial ని అడిగితే వారికేం తెలుస్తుందీ? ఎవరికో ఫోను చేసి అడగడం, ఆయనేమో అడగడమే మహాభాగ్యంగా భావించేసి, ఏవో రెండు మూడు ఫోనునెంబర్లూ అవీ చెప్పడం. అంతవరకూ బాగానే ఉంది, కానీ, వచ్చిన గొడవల్లా ఏమిటంటే, కనీసం పని అయినతరువాతైనా ఒకసారి తిరిగి ఫోను చేసి, చెప్తే వీళ్ళ సొమ్మేపోయిందో అర్ధం అవదు. అదేదో ఆజన్మాంతం ఋణపడిపోయి ఉండాలని కాకపోయినా, కనీసం వారిచ్చిన సమాచారం ఇంకొకరికి కూడా చెప్పొచ్చూ అని, ఆ సమాచారం ఇచ్చినాయన సంతోషిస్తాడూ అని ఎందుకు తట్టదో. కొంతమందికి తెలిసిన వైద్యుడి సమాచారం అవసరం రావొచ్చు. కొంతమందికి ఏదో వస్తువో, ఓ పుస్తకమో అవసరం రావొచ్చు. అవసరానికి గుర్తొచ్చిన వారికి, ఓ follow up గా, పనైపోయిన తరువాత తిరిగి చెప్పడంలో వీరికొచ్చిన నష్టం ఏమిటో? ఇలాటివాటన్నిటికీ కావాల్సింది సంస్కారం. ఏదో “మన పని అయిపోయిందిగా, మళ్ళీ చెప్పేదేమిటీ, ఫోను ఖర్చు తప్పా..” అనుకునేవారిని ఏమీ చేయలేము.. కానీ నష్టపోయేది వారే అని గుర్తించాలి. ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

చెప్పొచ్చేదేమిటంటే, ఎవరైనా సరే, ఎప్పుడైనా ఓ సమాచారం ఇంకొకరినుండి తెలిసికున్నప్పుడు, , కనీసం ఆ పని పూర్తయిన తరువాత ఒక్కటంటే ఒక్క ఫోను చేసి తెలియచేయండి. థాంక్స్ కాదు ఆశించేది అవతలివారు, తను ఇచ్చిన సమాచారం సరైనదేనా, కాదా అని తెలిసికోడానికి మాత్రమే అని తెలిసికుంటే, మానవసంబంధాలు ఇంకా పెరుగుతాయి.

సర్వేజనాసుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈముచ్చటెన్నాళ్ళో…

    గుర్తుండే ఉంటుంది, టెలిఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో, ఓ స్కీము మొదలెట్టారు. రాత్రి 11.00 నుండీ, ఉదయం 7.00 దాకా అనుకుంటా, సగం రేటుతో పనైపోయేది.. స్వంతరాష్ట్రంలో మాటెలా ఉన్నా, బయటి రాష్ట్రంలో ఉండే , చుట్టాలకీ, స్నేహితులకీ, హాయిగా సగంరేటుతో మాట్టాడేసేవారు. మనవైపు చాలామందికి ఓ అలవాటుంది, రాత్రి తొమ్మిదయేసరికల్లా పడకెక్కేయడమూ, ఏ తెల్లారుఝామునో లేవడమూనూ. అయినా , ఆరోజుల్లో తెలుగువారిళ్ళల్లో , మంచి మంచి అలవాట్లుండేవి. చదువుకునే పిల్లలు, తెల్లారకట్ల లేచి, చదువుకోవడం, అందులో ముఖ్యభాగం. ఈరోజుల్లోలాగ , ప్రొద్దుటే టిఫినీలూ అవీ ఉండేవి కావు. ఏ పొరుగూరినుండి చదువుకోవడానికి వచ్చే , పిల్లలు , దగ్గరలో ఉండే ఏ పాక హొటల్ లోనో ఇడ్లీలు తినేవారు. ఇంక స్వంతఇళ్ళల్లో, తల్లితండ్రుల అజమాయిషీలోనో, అన్నావదినల ఏడ్మినిస్ట్రేషన్లోనో ఉండేవాళ్ళకి, బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండేవికావు. మహ అయితే, ఆవకాయ పెచ్చేసికుని, ఏ తరవాణీ అన్నమో పెట్టేవారు. తొమ్మిదయేసరికి హాయిగా భోజనం చేసేసి, స్కూళ్ళకీ కాలేజీలకీ వెళ్ళిపోవడం. రాత్రి రేడియోలో ఇంగ్లీషు వార్తలొచ్చేసరికి , లైట్లార్పేయాల్సిందే, ఈలోపులోనే ఏం చేసినా. తెల్లవారుఝామున నాలుగింటికల్లా పుస్తకం తెరవాల్సిందే. అలాటి క్రమశిక్షణలో పెరిగారు కాబట్టే, అవే అలవాటు పడిపోయారు. అందుకే చూడండి, 60 వ దశకానికి పూర్వం పుట్టిన వారందరిలోనూ ఇదే దినచర్య చూస్తూంటాము.

    ఈరోజుల్లో,కాలమానపరిస్థితులను బట్టి, నిద్రపోవడానికీ, మంచం మీదనుండి లేవడానికీ, ఓ టైమంటూ లేదు. ఉద్యోగాలూ అలాగే ఉన్నాయి.. ఏ అర్ధరాత్రో ఆఫీసునుండి రావడం, పొద్దెక్కినతరువాత లేవడం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేటట్టయితే, పరిస్థితి ఇంకా చిత్రంగా ఉంటుంది. మధ్యలో, పిల్లల దారి పిల్లలదీ, అందరూ కలిసేది ఏ శలవురోజున మాత్రమే. దానితో తిండి అలవాట్లు కూడా , చిత్రవిచిత్రంగా మారిపోయాయి, ఓ వరసా వావీ లేకుండా పోయింది.
ఏమిటో కానీ, దేనితోనో మొదలెట్టి, దేంట్లోకో వెళ్ళిపోయాను. ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది. వారానికి నాలుగైదు టపాల చొప్పున, నాలుగేళ్ళపాటు టపాలు టకటకా వ్రాసేసేవాడిని. టాపిక్కులు కూడా కావాల్సినన్నుండేవి. నా అదృష్టం కొద్దీ, నన్నూ, నా రాతలనీ అభిమానించేవారు కూడా చాలా మందే ఉండేవారు. 2014 తరువాత, కారణమేమిటో స్పష్టంగా చెప్పలేనుకానీ, బ్లాగులో టపాలు వ్రాయడం తగ్గిపోయింది. కానీ, అలనాడు నేను వ్రాసిన టపాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని, నన్నూ, నా టపాలనీ, తమ ఇంటర్వూ లలో ప్రస్తావించిన శ్రీ శ్యామలీయం గారికి మనసారా ధన్యవాదాలు చెప్పుకుందామని ఈ టపా.. శ్రీ శ్యామలీయం గారు తణుకులో పుట్టడమూ, అమలాపురం ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో చదివారనీ చెప్పారు, వారి ఇంటర్వ్యూలో. అంతకంటే మంచి కారణం ఏముంటుంది చెప్పండి, నాకు ఆయనంటే ఇష్టం అని చెప్పడానికీ?
Thanks Shyamaliyam garu for the kind words you said, about me.

    తీరా రాద్దామని కూర్చునేసరికి, అసలు టాపిక్కే తట్టదే. కారణం మళ్ళీ కాలమానపరిస్థితులే. రాజకీయవాతావరణం గురించి పోనీ రాద్దామా అంటే, లేనిపోని చర్చలూ, గొడవలూ వస్తాయి. సరీగ్గా అప్పుడు తట్టింది ఓ విషయం- ఈమధ్యన మన ప్రభుత్వ టెలిఫోను సంస్థ వారు ప్రారంభించిన, రాత్రి 9.00 నుండీ, ఉదయం 7.00 వరకూ ఇస్తూన్న ఉచిత సేవ. పైగా ఏ నెట్ వర్క్ కైనా చేసేయొచ్చుట. ఆ విషయం తెలియచేస్తూ ఎస్.ఎం.ఎస్. లు కూడా పంపించారు. ఎందుకైనా మంచిదని ఫోను చేసి కూడా కనుక్కున్నాను లెండి.
ఈ రోజుల్లో యువతరానికి ఫోను ముఖ్యం కానీ, ఉచితమా కాదా అన్నదానితో పనిలేదు. పైగా బి.ఎస్. ఎన్.ఎల్ అంటే చిన్న చూపోటీ. ఇదనే కాదు, ప్రభుత్వరంగానికి సంబంధించిన ఏ సంస్థైనా సరే… దానిజోలికి వెళ్ళడం ఏదో పాపం చేసినంతగా బాధపడిపోతారు. ఎప్పుడు పడితే అప్పుడు, అంతర్జాలం లభించే సెల్ ఫోన్లూ, టాబ్లెట్లూ చేతులో ఉండగా, ఏదో ఫలానాటైమునుండి ఉచిత సేవలు వాడుకోడం ఎంత నామోషీ ? కానీ, ఇంకా “ పాతచింతకాయ పచ్చళ్ళు” ఉన్నారుగా, పాపం వాళ్ళందరికీ మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. నేనూ, ఆ కోవకి చెందినవాడినే అని చెప్పుకోడానికి గర్వపడతాను. ఆ స్కీము వచ్చినప్పటినుండీ, రాత్రి తొమ్మిదయిందంటే చాలు, నేను కొంతసేపూ, మా ఇంటావిడ కొంతసేపూ వీటితోనే కబుర్లు చెప్పుకోవడం. కానీ వచ్చిన గొడవంతా ఎక్కడంటే, మనవైపునుండి చేసేవారు మాత్రం , తెల్లవారుఝామున ఫోన్లు చేయడం మాత్రం మానలేదు. మరీ అంత ప్రొద్దుటే కాకపోయినా, ఆరున్నర కూడా ‘పెందరాళే” లోకే వస్తుంది. అప్పటికింకా వెలుగైనా రాదాయె. కానీ అలవాటు పడిపోయాము.

    ఈ“ ముచ్చట “ ఎన్నాళ్ళుంటుందో చూడాలి. అసలు నిజంగా ఉచితమేనా, లేక ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడడానికి ఈ స్కీము మొదలెట్టారా అన్నది వచ్చే బిల్లులో తేలిపోతుంది. అప్పటిదాకా, ఎడాపెడా ఉపయోగించేసికోడమే…
సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చెవిలో పువ్వులు….

    సాధారణంగా , ఎవరినైనా ఆట పట్టించాలంటే, హిందీలో उल्लू बनाया, అనీ, ఇంగ్లీషులో అయితే taken for a ride అనీ అంటారని విన్నాను. ఈ రెండు ప్రక్రియలనీ తెలుగులో “ చెవిలో పువ్వు పెట్టడడం “ అంటారనుకుంటాను. ఆ పెట్టబడిన పువ్వు, కనకాంబరం పువ్వా, లేక కాలీ ఫ్లవరా అన్నది, పరిస్థితుల మీద ఆధార పడుంటుంది.నేను ఉద్యోగం చేసే రోజుల్లో, మాకో ఆఫీసరుండేవారు. ప్రతీదానికీ, జిఎం తో మాట్టాడతాననేవారు. జిఎంగారి పిఏ ఆఫీసుదాకా వెళ్ళి, ఈ ద్వారం గుండా వెళ్ళడం, బయటకి రావడమూనూ, పెద్దాయన్ని కలిసిందీ లేదూ, పెట్టిందీ లేదూ. ఆంధ్రప్రదేశ “ యువరాజావారి, అమెరికా పర్యటన విషయం చూస్తూంటే, పై రెండు పువ్వులకంటే, ఏదో ఇంకా పెద్దపువ్వే పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 7 వ తారీకున, అమెరికా అద్యక్షుడు ఒబామా, మన యువరాజావారిని కలుస్తున్నారా? నిఝంగానే? ఆయనకి ఇంతకంటే పనేమీ లేదా? ఈ పెద్దమనిషి, ఏదేశానికైనా అద్యక్షుడా, ప్రధానమంత్రా, కనీసం శాసనసభ్యుడా, అబ్బే ఏదీకాదు. శ్రీ మోదీ గారు ప్రధానమంత్రి గా కానప్పుడు, అసలు అమెరికాలోనే అడుగెట్టనీయలేదు. అలాటిది, అకస్మాత్తుగా మన యువరాజావారికి appointment ఇచ్చారంటే , నమ్మదగ్గదిగా ఉందా అసలూ? ఈ సందర్భంలో ఒక వార్త చదివాను ఇక్కడ.

    8 వ తారీకున, ఈటీవీ లోనూ, ఈనాడు పేపరులోనూ, మన యువరాజావారు, ఒబామా గారూ కలిసి తీయించుకున్న ఫొటోలు చూసికూడా నమ్మకపోతే మీ కర్మ.. అని కూడా అనొచ్చు. రాఘవేంద్రరావు గారిని అడిగితే, ఒబామా ఏమిటి, ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో తీయించుకున్న ఫొటోలుకూడా పెట్టొచ్చు. గుర్తులేదూ, ఏ తాజ్ మహల్ చూడడానికైనా వెళ్తే, అక్కడుండే ఫొటోగ్రాఫర్లు, తాజ్ మహల్ ని మన అరచేతిలో ఉండేట్టు ఫొటో తీసేవారు. అదేం బ్రహ్మవిద్యా ఏమిటీ? ఈ మధ్యనే యువరాజా వారు అన్నారు కూడానూ—రాష్ట్రాభివృధ్ధికి ప్రకటించిన విరాళాల్లో సగానికి సగంకూడా రాలేదని. మరి ఇప్పుడు అమెరికా పర్యటనలో వీరు సాధించేదేమిటో…పైగా ఈయన వెళ్ళాడని, పక్క రాష్ట్ర యువరాజా వారు కూడా, రేపో మాపో అమెరికా వెళ్తున్నారుట. కనీసం ఆయనకి మంత్రిపదవైనా ఉంది. వీళ్ళిద్దరి కాంపిటీషనూ చూస్తూంటే నవ్వొస్తోంది.

    “రాబోయే గోదావరి పుష్కరాలకి రాజమండ్రీ దాకా ఎందుకూ, మన రాష్ట్రంలోనే గోదావరి ఎక్కువగా ప్రవహిస్తోందీ..” అంటారొక “చంద్రుడు” గారు. రెండో “ చంద్రుడు” గారైతే, vision 2050 అని మొదలెట్టేశారు, ఎందుకైనా మంచిదీ అని. ఈలోపులో “చెట్టూ చేమా”, “గాలీ నీరూ” అంటూ కొత్త కొత్త స్లోగన్ల తో కాలక్షేపం చేయమన్నారు.
ఒకానొకప్పుడు, విదేశాల్లో ఉండే తెలుగుభాష మాట్టాడేవారందరూ, ఒకే తాడుమీద ఉంటారనే అపోహ ఉండేది. ఇప్పుడు ఆ ముచ్చటా తీరిపోయింది. ఇద్దరు “ చంద్రుల “ ధర్మమా అని, అక్కడ కూడా polarization ప్రారంభం అయింది. “ఆటాలు” “ తానాలు” ఏమైపోతాయో మరి ?

    అప్పుడెప్పుడో ఓ సినిమాలో చూశాను—ఇంట్లో కూతురి పెళ్ళవుతుంటే, అక్కడ వీరికి దగ్గరైన ఒకతను , వధువు తండ్రిని అడుగుతాడు—వాజపేయీ గారికీ, కలాం గారికీ కార్డులు పోస్ట్ చేశావా అని. అదేమిటీ, వాళ్ళకి మనమెవరో తెలియదుగా అంటే, మనకి వాళ్ళు తెలుసుగా అంటాడు. అలాగే, మన ప్రముఖ నటుడొకాయన, శ్రీ మోదీ గారిని, తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించారుట. ఆయనేమో “ అయ్యో .. అదే తేదీకి నేను చైనా కో ఇంకో దేశానికో వెళ్తున్నానూ… ఏ మాత్రం వీలున్నా తప్పకుండా వచ్చి అక్షింతలు వేస్తానూ..” అన్నారుట.

    ఏమిటో ఈమధ్యన దేశాద్యక్షులకీ, ప్రధానమంత్రులకీ, పెద్ద పనున్నట్టు కనిపించడం లేదు. ఎవరొచ్చి కలుస్తారా, ఎవరి పెళ్ళికి పిలుస్తారా అనే చూస్తూండుంటారు కదూ…

    చెవుల్లో పువ్వులు పెట్టించుకునే వాళ్ళు పుష్కలంగా ఉన్నంతవరకూ, పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు. వాళ్ళదేంపోయిందీ?

   సర్వే జనా సుఖినోభవంతూ…