బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– for once…

    నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకోని షాక్కులు తగిలేయి. ఒకవైపున, తీరా రాజకీయనాయకుల లబ్ధి కోసం జారీ చేసిన ఆర్డినెన్సు ని “చింపి పారేయమని” రాహుల్ గాంధీ ప్రకటన నుంచి ఇంకా తేరుకోకముందే , సాయంత్రానికి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్, కాంగ్రెస్ అధిష్టానాన్ని కడిగి పారేశారు. ఆయన ఆ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అందరికీ నచ్చకపోవచ్చు. అనుకున్నట్టుగానే, సమైక్యాంధ్ర వారు ” ఒకే ఒక్క మగాడూ” అనీ, తెలంగాణా వాదులైతే ముఖ్యమంత్రిని బర్తర్ఫ్ చేసేశాయాలనీ మొదలెట్టారు.

    శ్రీ కిరణ్ చెప్పినదాంట్లో నిజానిజాల మాటెలా ఉన్నా, ఆయన చెప్పిన పధ్ధతి మాత్రం అద్భుతం. ఆయన ఏమీ అలాటిలాటివారు కాదు, ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు. సాధారణ రాజకీయనాయకులు ప్రకటనలు చేయడం వేరూ, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన వేరూ. తనని ముఖ్యమంత్రిగా చేసిన అధిష్టానాన్ని ఎదిరించడం అంటే మాటలు కాదు. అప్పుడెప్పుడో 1969 లో ఇందిరాగాంధీ, సిండికేట్ వారు నిర్ణయించిన అభ్యర్ధికి ఎదురుగా, తన అభ్యర్ధి శ్రీ వివీగిరి గారిని నెగ్గించిందే, ఆ విషయాలు గుర్తొచ్చాయి. అలాగే అంతకుముందు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారూ, ఎంతో బలోపేతమైన నెహ్రూ కుటుంబాన్ని ఎదుర్కొని , దేశంలో ప్రజలనుండి ఎంతో అభిమానం సంపాదించినా, చివరకి ప్రాణత్యాగం చేయాల్సొచ్చింది. ఈమధ్యన స్టార్ న్యూస్ లో “ప్రధానమంత్రి” అని ఒక కార్యక్రమం ప్రసారం చేస్తున్నారు. పైన ఇచ్చిన లింకులోకి వెళ్ళి చూస్తే మిగిలిన ఎపిసోడ్లు కూడా చూడొచ్చు.

    అలాగే మన తెలుగుతేజం శ్రీ నరసింహరావుగారు ,నెహ్రూ లేరూ, వాళ్ళ కుటుంబాలూ లేవూ అనుకుంటూ, మొత్తానికి దేశ ఆర్ధికవ్యవస్థనే మార్చేశారు. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినరోజుల్లో ఆంధ్రరాష్ట్ర సాధనకోసం, ఆంధ్రకేశరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని కూడా సంస్మరించుకోవాలి. ఏదో అప్పుడప్పుడు దశాబ్దానికి ఏ ఒక్కరో తప్ప, మిగిలిన కాంగ్రెస్ నాయకులందరూ sychophant లోకే వస్తారు. అధిష్టానాన్ని ఎదిరించి మాట్టాడితే ఏం కొంపమునుగుతుందో అనుకునేవారే తప్ప, ఉన్నమాట చెప్పగలిగే ధైర్యం ఒక్కడికీ లేదన్నది సత్యం.

    నిన్నటి ప్రెస్ మీట్ తరువాత ఎవరికి వారే విమర్శిస్తున్నారు. ఒకళ్ళేమో మాచ్ ఫిక్సింగంటారు, ఇంకొకరేమో కాంగ్రెస్ ఆడే నాటకం అంటారు, ఎవడికివాడే ,తామే శ్రీరామచంద్రుడూ అన్నట్టుగా ఎడాపెడా మాట్టాడుతున్నారు. అంతదాకా ఎందుకూ, ఓ జోకర్ లాగ నోటికొచ్చినట్టు మాట్టాడే దిగ్గీసింగు కి కూడా దీటైన జవాబిచ్చిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు శ్రీ కిరణ్. అంతలా రెచ్చిపోతున్నారే, అసలు కిరణ్ గారు అన్నదాంట్లో తప్పేముందిట? తెలంగాణా ఇవ్వకూడదని ఆయన ఎప్పుడూ అనలేదు. విభజన చేసేముందర, అన్ని విషయాలూ settle చేయమనేకదా చెప్పిందీ? ఊరికే అవాకులూ చవాకులూ పేలే వివిధ పార్టీ నాయకుల్లా కాక, ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా, ఇప్పటివరకూ జరిగింది రాజకీయ నిర్ణయమే కానీ, ప్రభుత్వపరంగా ఇప్పటివరకూ ఏరకమైన సమాచారమూ లేదనే కదా చెప్పిందీ?

    ఏమో నాకైతే శ్రీకిరణ్ కుమార్ గారి calling spade a spade అనే పధ్ధతి మాత్రం చాలా నచ్చింది.బహుశా ఓ కొత్త ఒరవడికి నాందీ ఏమో… నిన్నటి ప్రెస్ మీట్ ఏవరైనా చూసి ఉండకపోతే క్రింద ఇచ్చిన లింకులు చూడండి.

Part 1

Part 2

Part 3

Part 4

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం

    నిన్నో మొన్నో, ఒకానొకప్పుడు అంతటివాడూ, ఇంతటివాడూ అని పొగడబడ్డ లలిత్ మోడీ కి అదేదో life ban చేశారుట మన భారత క్రికెట్ సంఘం వారు. అక్కడికేదో వీళ్ళు చేసే life ban లూ అవీ మహ సీరియస్సు అయిపోయినట్టు ! ఇన్నేళ్ళనుండీ ఎంతమందికి ఇలాటివన్నీ జరగలేదూ, అలా శిక్షపడ్డవాళ్ళందరూ ఎంతమంది తిరిగి రాలేదూ? ఇదో పెద్ద డ్రామా. అజరుద్దీన్ కి చేశారు, ఏమయ్యిందీ, హాయిగా పెళ్ళికొడుకులా పార్లమెంటుకి ఎన్నికా అయ్యాడూ, తిరిగిరానూ వచ్చాడు. పైగా మళ్ళీ క్రికెట్ ఎందుకూ అనుకుని బాడ్మింటన్ లోకి చేరాడు. దాల్మియా ని అంత హడావిడి చేసి పంపించేశారు,అలాటిది మొన్నెప్పుడో తాత్కాలిక అద్యక్షుడుగా కూడా కొన్ని రోజులున్నాడు ! వాళ్ళెవరో ఫిక్సింగులు చేశారని ఏవేవో శిక్షలు వేశారు. ఓ రెండేళ్ళలో పార్లమెంటు మెంబర్లవడం ఖాయం. పైగా మన దేశంలో ఎంత శిక్షపడితే అంతలా మళ్ళీ rebound అయి మరీ లేస్తారు ! అందుకేనేమో ప్రతీవాడూ, జీవితంలో కనీసం ఒక్కసారైనా జైలుకెళ్తే బాగుండునేమో అనే ప్రార్ధిస్తూంటాడు !

    ఒకానొకప్పుడు ఇంకంటాక్సువారి దాడులు ఓ status symbol గా భావించేవారు. మన డిజీపీగారు ఇంకో ఏడాది పాటు ఉందామనే అనుకున్నారు పాపం, కానీ విధి అనుకూలించలేదు. ఆయనెవరో చెప్పిన పితూరీల విషయమైనా ఏదో విధంగా సెటిల్ చేసికోనివ్వచ్చుగా పోనీ? ప్రస్తుతం మన రాష్ట్రంలో అసలు పరిపాలనా వ్యవస్థ పనిచేస్తోందా లేదా తెలియడం లేదు. ఏ మంత్రికామంత్రే రాజీనామా చేశానని ఒకరూ, ఇదిగో చేసేస్తున్నానూ అని ఇంకొకరూ, ఆలోచిస్తున్నానని ఇంకోరూ, ముఖ్యమంత్రిగారైతే అడగఖ్ఖర్లేదు. వీళ్ళకి జీతాలూ అవీ వస్తున్నాయా అసలే గడ్డురోజులాయె. అందరూ సరీగ్గా పనిచేస్తేనే జీతాలసంగతికి దిక్కులేదాయే.

    ఏదో అందరికీ ఉపకారం చేద్దామని ఆ ఆర్డినెన్సేదో జారీ చేస్తే ఇదేమిటీ రాహుల్ బాబా అలా కోప్పడేశాడూ? మన అత్యోన్నత న్యాయస్థానం వారు, దేశప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో జడ్జిమెంటు ఇస్తారు, ఇప్పుడేమో ఓటు వేసేటప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఇమ్మని. మన రాజకీయనాయకులా వీటిని సాగనిచ్చేదీ? ఎవడికో ఈపాటికే పురుగు దొలిచేస్తూంటుంది, రేపో మాపో ఇంకో ఆర్డినెన్స్ జారీ చేసేస్తారు. ఆప్షనూ లేదూ, సింగినాదమూ లేదు,కొత్తగా ఏమీ తెలివితేటలు ప్రదర్శించఖ్ఖర్లేదు, ఓవైపున మేమేమో జైళ్ళలో ఉన్నా ఎన్నికల్లో నుంచోవచ్చూ అని ఆర్డినెన్సులు జారీ చేస్తూంటే మళ్ళీ మధ్యలో ఈ గోలేమిటీ ఇన్నాళ్ళూ జరగలేదూ.. నోరుమూసుక్కూర్చుని, ఎవడు ఎక్కువ డబ్బులుఇస్తే వాడికే ఓటు.. తెలిసిందా.. ఆప్షనుట ..ఆప్షను పనీపాటూ లేకపోతే సరి.

    పోనిద్దురూ ఈ గొడవలు పోయేవీ కావు. హాయిగా బ్రతికున్న ఈ నాలుక్కాలాలపాటైనా ఓ మంచి కథ చదివి నవ్వుకుందాం.మునిమాణిక్యం వారి ప్రణయ కలహం చదవండి.

    బ్రహ్మశ్రీ చాగంటి వారేమో మనుష్య జన్మ ఎత్తినందుకు ఓ రామాయణమో, భాగవతమో ఇంట్లో తప్పకుండా ఉండాలీ, ప్రతీరోజూ అందులోని ఒక్క పద్యమైనా చదవాలీ అంటున్నారు. ఏదో అదృష్టంకొద్దీ నెట్ లో ఈమధ్యనే ఒక అద్భుతమైన లింకు దొరికింది. చూసి తరించండి.

    ఈవారంకూడా గోతెలుగు.కాంలో నావ్యాసం ప్రచురించారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్..

    ఒకానొకప్పుడు అంటే, మేము ఉద్యోగంలో చేరినప్పుడన్నమాట (1963 లో) , ప్రతీ సంవత్సరమూ ఉద్యోగస్థులందరిచేత ఒక oath లాటిది చెప్పించి, ఓ రిజిస్టరులో సంతకం చేయించేవారు. నేను చేరింది, Indian Ordnance Factories లో కాబట్టీ, అక్కడ దేశ రక్షణ కోసం, మా ఫాక్టరీలలో తయారుచేయబడే , ఆయుధ సామగ్రి, మందుగుండు(Ammunition) ల వివరాలు బయటివారికీ, వారిద్వారా శత్రుదేశాలకీ తెలియకూడదనే సదుద్దేశ్యంతో. ఆరోజుల్లో ఎప్పుడో ఒకసారి, నోరుజారి ఏదో మాట్టాడితే, మా చిన్నన్నయ్యగారు – ఆయనకూడా రక్షణశాఖ వారి ఒక sensitive విభాగంలోనే పనిచేసేవారు- నన్ను చెడామడా కోప్పడ్డారు, oath తీసికోలేదా, లేకపోతే పరవాలేదులే అనుకున్నావా అంటూ.అప్పటినుంచీ పెళ్ళైనతరువాత ఇంటావిడతో కూడా, ఫాక్టరీ సంబంధిత వ్యవహారాలు మాట్టాడేవాడిని కాదు. ఇదంతా నేనేదో ఘనకార్యం చేశానని చెప్పుకోడానికి కాదు, మన దేశంలో ఒకానొకప్పుడు దేశరక్షణకి సంబంధించినంతవరకూ , అతి చిన్న ఉద్యోగినుండి, అత్యున్నత పదవిలో ఉన్నవారి వరకూ , వారు నిర్వహిస్తూన్న పదవికి ఎంత గౌరవం ఇచ్చేవారో(serenity of the job) చెప్పడానికి మాత్రమే.

    మొదటినుండీ అదే అలవాటైపోయింది.అలాటిది ఆ “లక్ష్మణ గీత” ఎప్పుడు దాటేరో కానీ, ఇప్పుడు ప్రతీదీ నెట్ లో దొరుకుతాయి. ఎన్ని ఫాక్టరీలూ, సంవత్సర ఉత్పత్తి బాంబులూ, గ్రెనేడ్లూ ఒకటేమిటి, తయారుచేసే ప్రతీ వస్తువూ ఎంతంత తయారవుతుందీ మొదలైన వివరాలు. కారణం- ఓ వస్తువుకి కావాల్సిన ముడిపదార్ధాలు ప్రతీదీ మార్కెట్ నుంచే కొనాల్సిరావడం వలన. ఎవరి దగ్గరైతే కొంటామో, వాళ్ళకిచ్చే ఆర్డరు ధర్మమా అని, ఈ వివరాలు తెలిసికోవడం ఓ పెద్ద పని కాదు.చెప్పేదేమిటంటే ప్రతీ విషయం లోనూ ” గోపనీయత” ( confidentiality) అన్నది had gone for a toss. ఈ ఆధునిక యుగంలో అందరూ అనేది ఒకటే మాట–openness, transparency అని. కరెక్టే, కానీ ఎంతవరకూ? దేనికివ్వాల్సిన గౌరవం దానికివ్వాలి. ఒక అత్యున్నత స్థానంలో పనిచేసిన పెద్దమనిషి, తాను అధికారంలో ఉండగా, ఏవేవో కారణాలవల్ల ఎన్నెన్నో చేయాల్సొస్తుంది. అన్నీ తెలుసు కదా అని, పదవీవిరమణ చేయగానే, తాను పదవిలో ఉండగా చేయాల్సొచ్చిన ప్రతీ పనినీ బహిరంగంగా చెప్పుకోవాలని ఏమీలేదు. ఏదో sensationalise చేయడానికి తప్ప ఇంకో కారణం కనిపించదు.

    ప్రస్థుతం మన మాజీ సైన్యాద్యక్షుడు చేసిన పని అదే. అప్పుడెప్పుడో, మాజీ వాయుసేనాద్యక్షుడు గురించి ఏవేవో విమర్శలు వచ్చాయి, అంతకుముందు, మా Indian Ordnance Factories చైర్మన్ గారినైతే జైల్లోనే పెట్టారనుకోండి. ఏ విభాగం తీసికోండి, అప్పటిదాకా పనిచేసినవాడెవడో, memoirs అని ఓ పుస్తకం వ్రాస్తానని చెప్పీచెప్పడంతోనే ఆర్డర్లు బుక్కైపోతాయి. అలా వ్రాయబడ్డ ప్రతీ పుస్తకంలోనూ, తానేదో శ్రీరామచంద్రుడనీ, మిగిలినవారందరూ ఒఠ్ఠి చవటాయలనీ వ్రాయడమే. ఈ మాయదారి “memoirs” అనబడే అవాకులూ చవాకులూ, వ్రాసినందుకో, ఏ ghost writer చేతో వ్రాయించినందుకో , ఈయనగారికి జీవితాంతం రాయల్టీలూ. అన్నీ అబధ్ధాలనడంలేదు, చాలా భాగం అతిశయోక్తులే.

    ఇదివరకటి రోజుల్లో ఓ రాజకీయనాయకుడో, ఓ ప్రముఖవ్యక్తో, లేదా వీరిదగ్గర పనిచేసిన కార్యదర్శులో, లేదా ఏ దగ్గరివారో కూడా తమతమ జ్ఞాపకాలపందిరిని అందరితోనూ పంచుకునేవారు, కానీ ఎప్పుడూ, అలా వ్రాసినవారి తదనంతరం.దానికీ ఓ కారణం ఉండేదనుకోండి, బ్రతికుండగా ప్రచురిస్తే మళ్ళీ ఏం గొడవలొస్తాయేమో అనే భయం అయుండొచ్చు. అతావేతా పోయిన తరువాత ప్రచురిస్తే ఓ గొడవుండదు. ఎవడిగురించినా వ్రాసినా, మిగిలినవాళ్ళందరూ కొట్టుకు ఛస్తారు. సర్వే జనా సుఖినోభవంతూ అనుకోవడం, ఓ వారంరోజులు మీడియాలో మొండెంమీద తలున్న ప్రతీవాడూ, “ఖండించేయడం”.

    పంజాబులో ఉగ్రవాదం, చాలా ఎక్కువగా ఉన్నరోజుల్లో ఆ గిల్లుగారో ఎవరో ఏమిటేమిటో చేసేశారనీ,ఎన్నెన్నో విషయాలు విన్నాము. ఉగ్రవాదం తగ్గిందాలేదా. అదీ ముఖ్యం, ఎవడెవడికి ఎంతంత డబ్బిచ్చారూ, వాటికి లెఖ్ఖా పత్రం ఉందాలేదా, అంటూ కోడిగుడ్డుకి వెంట్రుకలు లెఖ్ఖపెట్టడం బుధ్ధితక్కువతనం. పోలీసు వ్యవస్థలో informers అని ఉండరూ, వాళ్ళ సహాయమే లేకుండానే మనపోలీసులు నేరస్థులని పట్టుకుంటున్నారా ఏమిటీ? అలాగని అత్యున్నత పోలీసు అధికారి, పదవీ విరమణ అయిపోయిందికదా అని, ఆ informers ల పేర్లూ, వాళ్ళకిచ్చిన రొఖ్ఖం వివరాలూ అన్నీ బయటపెడతారా? సమాచారం అనేదానికి ఓ వెల ఉంటుంది, ఊరికే ఎవడూ పంచుకోడు. కాశ్మీరులో గొడవలు తగ్గించడానికి ప్రభుత్వం కొంత సొమ్ము కేటాయిస్తుంది, ఖర్చుపెట్టే తీరు వాళ్ళే నిర్ణయిస్తారు. మన సింగుగారు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ,కాశ్మీరులో, ప్రభుత్వం రాజకీయనాయకులకి డబ్బులిస్తోందీ అన్నారే, ఆయన పదవిలో ఉండగా ఎప్పుడూ నోరెత్తలేదే? అవునులెండి, ఆయన date of birth గొడవల్లో పడి ఇది దృష్టికి రాలేదేమో.

   అసలు మనరాజకీయనాయకులు ఎన్నికల్లో ఏ డబ్బూ ఖర్చుపెట్టకుండానే నెగ్గుతున్నారా? పోనీ ఆ లెఖ్ఖా పత్రం అడుగుదామంటే, మనప్రభుత్వం రాజకీయనాయకులని RTI నుంచి exempt చేద్దామనుకుంటోంది. దొందుకిదొందే.

    దేశరక్షణకి సంబంధించినంతవరకూ, మన త్రిదళాలూ, రాత్రనక, పగలనకా నిస్వార్ధంగా పనిచేస్తున్నారు కాబట్టే మనం , హాయిగా సమ్మెలూ, బంధులూ, రాస్తారోకోలూ చేసికోగలుగుతున్నాము. దిక్కుమాలిన సినిమాలు చూడగలుగుతున్నాము.అదేదో Grand Masti అని సినిమాట, దాన్ని చూస్తూ నవ్వినవ్వి గుండాగి చచ్చిపోయాడుట !అదృష్టవంతుడు. ఆ సినిమా గురించి ఎవరో, అసలు అలాటి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారూ అని అడిగితే, మన కేంద్రసెన్సార్ అద్యక్షురాలు, ఆవిడెవరో ఓ గొప్ప డ్యానసరుట, ఏం చేయనూ దేశంలోని ప్రాంతీయ సెన్సార్ బోర్డులలో ఉండే సభ్యులు నూటికి తొంభైమందిదాకా, నిరక్షరాశ్యులూ, నిశానీగాళ్ళూనూ అన్నారుట, మిగిలిన వారందరూ ఆవిడకి లీగల్ నోటీసులిచ్చారు, ఠాఠ్ అలాగంటావా, అందరినీ వీధిలోపెట్టాలా అంటూ. ఇలా తగలడ్డాయి మన సెన్సార్లూ, సినిమాలూ

    ఆయనెవరినో ఇవేళ జైలునుండి బెయిలు మీద విడుదల చేస్తారుట, సంబరాలు చేసికుంటున్నారు. ఇదివరకటిరోజుల్లో స్వాతంత్రసమరంలో జైలుకెళ్ళి విడుదలయి వచ్చేరంటే ఓ అర్ధం ఉండేది. ఆమధ్యన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ముగ్గురో, నలుగురో మంత్రులు, ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లులేవోచ్ అని సంబరాలు చేసికున్నారుట, తీరా ఆ సంబరాలు పూర్తయే లోపలే, ఆవిడెవరిదో పేరు చేర్చారుట. ఈవేళో రేపో కేంద్రప్రభుత్వం ఓ Ordinance తెస్తోందిట, రాజకీయనాయకులకి సంబంధించినంతవరకూ, వారిమీద ఎలాటి ఆరోపణలు ఉన్నా సరే ఫరవాలేదూ అని ! అందరూ లాలూని రక్షించడంకోసమే ఈ Ordinance అంటున్నారు. కానీ ఆలోచిస్తే , ఈవేళ బెయిలు మీద విడుదలయే ఆయనకోసమే అని కూడా అనుకోవచ్చుగా. ఆయననేమిటీ, దేశంలో ఉన్న రాజకీయనాయకులలో కనీసం నూటికి యాభైమంది మీద ఏదో రకమైన ఆరోపణలున్నాయే, వాళ్ళందరూ ఎన్నికల్లో నిలబడి మనల్నందరినీ ఉధ్ధరించొద్దూ?

   అందుకే మేరా భారత్ మహాన్..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– there can never be a greater tribute…

    ఏ జన్మలో చేసికున్న పుణ్యమో కానీ, నాకు లభించిన స్నేహితులు ఒకరిని మించినవారింకొకరు. నిన్న నా మెయిల్ చూస్తే, నా స్నేహితుడు శ్రీ కృష్ణమోహన్ గారు, తాను మొన్న 18 వ తారీకున , శ్రీ బాపూ గారిని చూడాలనిపించి చెన్నై వెళ్ళారుట. అక్కడ శ్రీ బాపూ గారి స్టూడియో లో , ఓ అద్భుతమైన స్కెచ్ చూశారుట.. గురువుగారి కార్టూన్లు ప్రతీవారం స్వాతి వారపత్రికలో చూస్తూనే ఉన్నాము. తనకు ఎంతగానో నచ్చిన కథలకి కూడా ఒక్కొక్కప్పుడు బొమ్మలు వేస్తున్నారు. స్వాతి అసలు కొనేదే శ్రీ బాపూగారి బొమ్మలకోసం. కానీ, శ్రీ కృష్ణమోహన్ గారు మొన్న చూసిన స్కెచ్ ఇంకా పబ్లిక్ కాలేదనుకుంటాను. ఏమో అయిందేమో, నేనైతే ఇంకా చూడలేదు. ఏది ఏమైనా శ్రీ కృష్ణమోహన్ గారు, తన మెయిల్ లో వీలుంటే తాను పంపిన స్కెచ్ , నా టపాలో ప్రదర్శించి, నా పాఠకులతోనూ, శ్రీ బాపూ గారి అభిమానులతోనూ పంచుకోమన్నారు. ఇంత మంచి స్కెచ్ ని, అందరితోనూ పంచుకోవాలా ఏమిటీ అని నాలో స్వార్ధమైతే ఒకసారి తొంగి చూసింది. కానీ, ఆలోచిస్తే అనిపించింది, నేను అనుభవించిన ఆనందం, ఎంతో అభిమానం చూపిస్తున్న నా బ్లాగు పాఠకులకు మాత్రం ఎందుకు అనుభవించకూడదూ అని.

   అప్పుడడిగాను శ్రీ కృష్ణమోహన్ గారిని– సార్, మీరు నా టపాలో పెట్టమన్నారనుకోండి, కానీ శ్రీబాపూ గారి ప్రెవేట్ కలెక్షన్లలోని ఓ స్కెచ్ ని , ఆయన అనుమతి లేకుండగా పెడితే, ఏమైనా అనుకుంటారేమో, ఒక్కసారి ఆయనకి ఫోను చేసి వారి అనుమతి తీసికుంటే బాగుంటుందేమో– అనగానే, సరే ఆయన అనుమతి తీసికుని మీకు చెప్తానూ, అప్పుడు పెట్టండీ అన్నారు. శ్రీ బాపూగారితో పరిచయం ఉందికదా, పోనీ నేనే అడిగితే బాగుంటుందేమో అనుకుని, ఈవేళ ప్రొద్దుటే పదిన్నరకి ఫోను చేశాను. నా పరిచయం మళ్ళీ ఇంకోసారి చేసికుని, ఫలానా సార్ అనగానే, ” గుర్తున్నారండీ..” అని ఆయన చెప్పేసరికే, నా మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఆయన ఆరోగ్యం విషయం అడిగి, ఫలానా కృష్ణమోహన్ గారు, మొన్న మీ దర్శనానికి వచ్చినప్పుడు, మీ స్టూడియోలో ఉన్న ఓ స్కెచ్ ని కూడా ఫొటో తీసి, నాకుకూడా పంపించారూ, ఆ డ్రాయింగుని, నా బ్లాగు పాఠకులతో పంచుకోడానికి, మీ అనుమతి కోసమండీ ఈ ఫోనూ, అని చెప్పగానే, “అయ్యో దానికేముందండీ తప్పకుండా పెట్టండీ, అసలు మీకు అలా అడగాలననిపించిందే , దాంట్లోనే తెలుస్తోంది మీ సంస్కారం..” అని ఆయన అనుమతి ఇచ్చారు కాబట్టి, ఆ అద్భుతమైన స్కెచ్ ని మీ అందరితోనూ పంచుకుంటున్నాను. ఆ ఫొటో మీద ఒకసారి నొక్కి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది.

untitled

    అక్కడతో వ్యవహారం ఆగిపోలేదు. నేను శ్రీ బాపూగారికి ఫోనుచేసి వారి అనుమతి తీసికున్నానూ, అని శ్రీ కృష్ణమోహన్ గారికి ఫోను చేద్దామనుకొనే లోపునే,
మళ్ళీ ఆయనదగ్గరనుండి ఫోనూ, ప్రొద్దుటే శ్రీ బాపూగారి దగ్గరనుంచి ఫోనొచ్చిందీ, ఇంట్లో లేకపోవడంతో, నేనే ఇప్పుడే ఫోను చేసి మాట్టాడానూ, అప్పుడు అడిగానూ, మొన్న వారింట్లో నేను తీసికున్న ఫొటోలు బ్లాగుల్లో పెట్టొచ్చా అనీ, దానికేముందండీ, “మా వెంకటరావు గురించి, ప్రపంచంలో ఎంతమంది గుర్తుచేసికుంటే, నాకు అంత సంతోషంగా ఉంటుందీ, తప్పకుండా పెట్టమనండీ ..” అని ఆయన ఇంకోసారి అనుమతిచ్చేశారు. అప్పుడు చెప్పేను, నేను కూడా శ్రీబాపూగారికి ఫోను చేసిన విషయం. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఓ పావుగంట వ్యవధిలో మూడు వివిధప్రాంతాల్లో ఉన్న ముగ్గురికి , శ్రీ ముళ్ళపూడి వెంకట రమణగారి గురించి మాట్టాడుకునే అదృష్టం కలిగింది.

    ఇంక ఆ స్కెచ్ విషయానికొస్తే, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారి “బోసి నవ్వు” ని కూడా ఓ ” గీత” లో చూపించగలిగే చతురత శ్రీ బాపూగారికి కాకపోతే ఇంకెవరికుంటుందమ్మా

    ఈవారం కూడా గోతెలుగు.కాం లో నా వ్యాసం వచ్చింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం

    గత వారంరోజులుగా, నాకై నేను తెచ్చుకోని సమస్యతో అవస్థ పడుతున్నాను. కొన్ని కారణాలవలన నా మిస్టరీ షాపింగు కొంచెం తగ్గించుకున్నాను. అలాగని పూర్తిగా మానేయనూలేదు. నా అంతట నేను ఎప్లై చేయడం తగ్గించుకున్నాను, మరీ బాగుంటేనేతప్ప. మనం తగ్గించుకుందామనుకున్నా, బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా, అవి మనల్ని వదలవుగా. ఆయన చెప్పినదానిలో ఎంత యదార్ధముందో ఇప్పుడు అర్ధం అయింది.

    ఒకసారి ఒక రంగంలోకి అడుగెట్టిన తరువాత , వాటిల్లోంచి బయట పడడం అంత సుళువుకాదు. నేను ఎప్లై చేయడం అంటే మానేశానుకానీ, నా అదేదో ఇంగ్లీషులో అంటారే reputation ఓటి సంపాదించానుగా, దానికారణం చేత, ఆ ఏజన్సీలవాళ్ళకి పూణే లో ఏదైనా అర్జంటుది ఉంటే, ఓ ఫోను చేస్తూంటారు, నేనూ కాదనలేక ఒప్పేసుకుంటూంటాను. ఇలాటి మొహమ్మాటాలే ఒక్కొక్కప్పుడు సమస్యలు తెస్తూంటాయి. అలాటిదే, ఓ పదిపదిహేను రోజుల క్రింద, ఒక ట్రావెల్ ఏజన్సీది చేయమన్నారు. మామూలుగా అయితే, అక్కడకి వెళ్ళడం, ఏవో కబుర్లుచెప్పేసి, ఓ కాఫీ త్రాగేసి, వాళ్ళిచ్చిన బ్రోచర్ తీసికుని, ఆ మాట్టాడిన అమ్మాయో, అబ్బాయో వాళ్ళ విజిటింగ్ కార్డొకటి తీసికుని, ఇంటికొచ్చి, వాళ్ళిచ్చిన బ్రోచరూ, విజిటింగ్ కార్దూ స్కాన్ చేసి, వాళ్ళిచ్చిన ప్రశ్నలకు జవాబులిచ్చేసి, చేతులు దులిపేసికోవడమే. ఓ రెండు నెలల్లో వాళ్ళిచ్చే డబ్బులేవో మన ఎకౌంటులోకి వచ్చేస్తాయి, సర్వేజనా సుఖినోభవంతూ.

   అలాటివి ఓ పాతికదాకా చేశాను, వాళ్ళకీ నచ్చినట్టుందీ, ఈసారికూడా అలాటిదే చేస్తావా అని అడుగుతూ, అందులో ఓ మెలిక పెట్టేరు. ఊరికే కబుర్లు చెప్పేయడమే కాకుండా, అదేదో ప్యాకేజీ కి ఎడ్వాన్స్ బుకింగ్ కూడా చెయ్యాలిట. పైగా అదేమో ఓ పాతికవేలు, రెండు రోజుల్లో reimburse చేసేస్తారుట. అదేదో సామెత చెప్పినట్టు ” ఆయనే ఉంటే…..” అంతంత డబ్బులే ఉంటే , ఇంక అడిగేదేముందీ? పైగా పెన్షనర్నీ. ఏదో సరదాగా ఏ బ్రాండెడ్ బట్టో ఏదో కొనుక్కుంటే, కనీసం ఆ సరుకైనా మనం కొన్నట్టుంటుంది. వాళ్ళు డబ్బులిచ్చేరా మహబాగు, లేదా పోనీ మనమే కొనుక్కున్నామనుకుంటాం, వదిలేస్తాం.ofcourse ఇప్పటిదాకా చేసిన రెండువందల పైగా ఎసైన్మెంట్లకి డబ్బులు ఇచ్చారు. మోసం ఎప్పుడూ లేదు. అలాగని మరీ పాతికవేలు ముందుగా కట్టేసి, వాళ్ళు డబ్బు ఎప్పుడు తిరిగిస్తారా అనుకుంటూ వేచి ఉండడం, ప్రతీ రోజూ ఇంటావిడ చేత క్లాసులు తీయించుకోవడమూ అంత అవసరమంటారా? ఏదో ఇంటాయన ఏదో సరదా పడుతున్నాడూ, అప్పుడప్పుడు మాక్కూడా ఏవేవో తెస్తూంటారూ, ఆ మాత్రం కాలక్షేపంకూడా లేకపోతే, రోజంతా ఇంట్లోనే కూర్చుని, నాప్రాణం విసిగిస్తారూ అనుకుని, కొత్తపెళ్ళికొడుకులా బ్రాండెడ్ బట్టలు వేసికుని నిగనిగలాడిపోతున్నారూ, పోనిద్దూ, అనే ఒక్కకారణం చేత ఇన్ని సంవత్సరాలూ చేయనిచ్చింది. నా లిమిట్ మూడువేలు. అంతేకానీ తాహతుకిమించి ఏదో ఉధ్ధరించేద్దామనుకోవడం బుధ్ధితక్కువ పని. ఎవరో అంటారేమో అని కాకపోయినా, మనం కూడా మన హద్దుల్లో మనం ఉండాలి. అలా ఉంటేనేకదా, అందరూ సంతోషించేదీ?

    రెండు మూడు సంవత్సరాలక్రితం కూడా, ఇదే ఏజన్సీ, అదే ట్రావెల్స్ వాళ్ళదగ్గరకు వెళ్ళి అదే పధ్ధతిలో ఎడ్వాన్సు ఇరవై వేలూ ఇచ్చి రమ్మంటే, అప్పుడుకూడా, ఠాఠ్ కుదరదని చెప్పేను. వాళ్ళు ఆ డబ్బు ముందర నేను అడిగినట్టుగా, నా ఎకౌంటులోకి మార్చనూ, మార్చారూ, నేను కూడా బుధ్ధిమంతుడిలా ఏటీఎం కి వెళ్ళి, డ్రా చేసి, ఆ డబ్బు కట్టేశాను. చెప్పొచ్చేదేమిటంటే, అప్పుడూ నేనే, ఇప్పుడూ నేనే, మారింది ఆ ఏజన్సీలోని ఉద్యోగస్థులు మాత్రమే. అదే విషయం వాళ్ళకి చెప్పి, చూడండమ్మా ఇదీ సంగతీ, మీరు డబ్బు ముందుగా ఇస్తే, నేను వాళ్ళకి కట్టొస్తానుకానీ, నాదగ్గర అంతంత డబ్బులుండవూ, మీమీద నమ్మకం మాట అటుంచండీ, మీరు తీరిగ్గా నా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవరకూ వేచిఉండే ఓపిక లేదూ, ఇదివరకటిలాగే మీరు ముందుగా డబ్బు ఇవ్వండీ, నేను మీ పని చేసిపెడతానూ అని చెప్పేను. సరే ,we will come back to you, అనేసి ఊరుకున్నారు.

    క్రిందటివారం ఓ ఫోను వచ్చింది. మీరు అడిగినట్టుగా డబ్బు ముందరే ట్రాన్స్ఫర్ చేస్తామూ, ఈవేళ వెళ్ళి, ఫస్ట్ రౌండ్ ఎవాల్యుఏషన్ చేసి రమ్మన్నారు. అంటే ఆ ట్రావెల్స్ కి వెళ్ళి ఊసుబోక కబుర్లు చెప్పి, ఫలానా ప్యాకేజీకి ఎంత ఖర్చూ.. వగైరాలు అడిగి రావడం. వీటిల్లో ఓ గొడవుంటుంది, మన వివరాలు వాళ్ళు నోట్ చేసికుంటారుగా, రోజువిడిచి రోజు ఫోనొస్తూంటుంది, ఎప్పుడు బుక్ చేస్తున్నారూ అంటూ. ఇదివరకైతే ఇంకా ఆలోచిస్తున్నామూ అని ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడిని. పైగా ఊళ్ళో ఉన్న చాలా ప్రముఖ ట్రావెల్స్ కి కూడా వెళ్ళాను. అస్తమానూ మన పేరే చెప్తే, వీళ్ళు వదిలేటట్టుగా లేరూ అనుకుని, మా చుట్టం కోసమూ అని చెప్పేవాడిని. వాళ్ళు ఎప్పుడైనా ఫోను చేసినా “మా చుట్టం ఇంకా ఏమీ చెప్పలేదూ..” అనేసేవాడిని. గొడవుండేది కాదు.

    ఈసారి అలా కుదరదుగా నా పేరే చెప్పాల్సొచ్చింది.అనుకున్నట్టుగానే మర్నాటినుండీ ఫోన్లూ, మర్నాటిలోపులో బుక్ చేసేసికుంటే అదేదో డిస్కౌంటూ, ఆలశించిన ఆశాభంగం అంటూ. నాకేమిటీ, వెళ్ళేనా పెట్టేనా ఏదో కాలక్షేపం. చివరకి చెప్పాల్సొచ్చింది, నాయనా నాకైతే చేయాలనే ఉందీ, కానీ డబ్బులు ఇంకా రాలేదూ అని . వదలడే, మీరు చెప్తే మా రెప్ ని పంపుతానూ అంటాడు, అక్కణ్ణించేమో డబ్బులు రావాయే, ఇక్కడ ఈ ట్రావెల్స్ వాడేమో నన్ను ఊరికే మొహమ్మాటపెట్టేస్తున్నాడు. ఆ ఏజన్సీ వాళ్ళదగ్గరనుంచి ఫోనూ, డబ్బు ట్రాన్స్ఫర్ చేసేశామూ అని, తీరా చెక్ చేస్తే డబ్బూ లేదూ, దస్కమూ లేదూ. ఇలా వారంరోజులనుండీ, వాళ్ళు చేసేశామనడం, నేనేమో ఇంకా రాలేదు మొర్రో అనడంతో గడిచిపోయింది.
అసలు తిరకాసంతా ఎక్కడొచ్చిందంటే ఇదివరకు వాళ్ళు ముందుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, తరువాత నా దగ్గర ఓ అండర్ టేకింగ్ తీసికున్నారు, “ఫలానా డబ్బు ఫలానా పనికే ఉపయోగిస్తానూ, స్వంత ఖర్చులకి ఉపయోగించనూ..” అని, ఈసారి కొంచం తెలివి మీరారు, వాళ్ళు డబ్బు పంపడానికి ముందే, నాకు ఒక డాక్యుమెంటు పంపి, అది సంతకం చేసి పంపమన్నారు. ఫరవాలేదూ, ఒక్కరోజే కదా అని నేనూ వాళ్ళడిగినట్టే పంపేశాను. చివరకి వాళ్ళదగ్గర నా రసీదుందికానీ, వాళ్ళ డబ్బులుమాత్రం రాలేదు. మరీ గొడవేమీ రాదనుకోండి, బ్యాంకు వాళ్ళ హిస్టరీ ఉంటుందిగా, అయినా లేనిపోని చికాకూ. ఇంటావిడకి సంఝాయిషీ చెప్పుకోవద్దూ, కాళ్ళూ చేతులూ కట్టేసి ఇంట్లో కూర్చోపెట్టేస్తుంది ! పైగా ఇలాటివేమైనా జరిగితే ప్రతీవాడూ తిట్టేవాడే ” కుదిరింది రోగం..” అంటూ. ఎవరికీ చెప్పుకోలేమూ.

    ఇంత గొడవయినతరువాత చివరకి నిన్న మధ్యాన్నం ఆ డబ్బు రానూ వచ్చిందీ, నేను ఈవేళ వెళ్ళి ఆ ట్రావెల్స్లో ఎడ్వాన్సు కట్టీవచ్చాను. వాళ్ళ ఎవాల్యుఏషన్ రిపోర్టు పంపి, దానితో పాటు ఆ డబ్బుల రసీదుకూడా పంపేను. ఇంత హడావిడయింది ఈ వారం రోజులుగా. ప్రతీ రోజూ పీడకలలే, కోర్టుకివెళ్ళాసొచ్చిందనీ, అన్నిఖర్చులూ తడిపిమోపెడయ్యాయనీ, ఆ డబ్బులు ఇరవైనాలుగ్గంటలలోపల కట్టకపోతే ఆస్థిపాస్థులు వేలం వేస్తారనీ, వెనక్కల బ్యాక్ గ్రౌండులో మ్యూజిక్కోటీ . ఇదండీ కథా కమామీషూనూ. సుఖాంతం.

    ఈమధ్య ఒక కొత్త తెలుగు లింకు దొరికింది ( మా స్నేహితుడి సౌజన్యంతో).

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    నేను అప్పుడెప్పుడో నా ఆవకాయ కష్టాలు వ్రాస్తే అందరూ నవ్వుకుని , పైగా మా ఇంటావిడ వ్రాసిన కౌంటరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, నా గొడవంతా కొట్టిపారేశారు. ఈమధ్యన పాత పుస్తకాలు బ్రౌజు చేస్తూంటే పాపం శ్రీ తురగా సుందరం గారు పడ్డ కష్టాలు వ్యాసరూపంలో అక్షరరూపంఆవకాయ ఇవ్వగా ఆనందవాణి లో ప్రచురించారు..అందుకే అంటాను ఈ ఆవకాయ భాగోతాలు అప్పుడూ ఉండేవి, ఇప్పుడూ ఉంటున్నాయి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే పాపం ఆ అమాయక భర్తకే అన్ని కష్టాలూనూ..

గోతెలుగు.కాం వారు గత కొన్నివారాలలాగే ఈ వారంకూడా నా వ్యాసం ప్రచురించారు. తీరికుంటే చదవండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

మహాగణపతి

    చి. శిరీష మా కుటుంబంలోకి 2005 లో , మా కోడలుగా వచ్చినప్పటినుండీ, ప్రతీ వినాయక చవితికీ , బజారునుండి వినాయకుడి విగ్రహమే తేవాల్సిన అవసరం లేకపోయింది. కారణం పూజ చేసికోకపోవడం కాదండోయ్, మా సొసైటీ ఎదురుగా , బొమ్మలు తయారుచేసేవారిదగ్గర, మట్టి తెచ్చికుని, ఎంతో ఓపిగ్గా వినాయక విగ్రహం తయారుచేయడమూ, తనూ మా నవ్యా ఆ విగ్రహానికి అలంకరణలు చేయడమూనూ. ఏక్ దం Eco friendly …

    ఈ సందర్భంలో పాత మాసపత్రికలో ఉండ్రాళ్ళ మీద వ్రాసిన వ్యాసమొకటీ, అలాగే గణేశస్తవము కూడా చదివి ఆనందించండి.

ఉండ్రాళ్ళు

గణేశ స్తవము

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– INDIAN IDOL JUNIOR

    ఒకానొకప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళలో ఉండి, ఆ ఇళ్ళని maintain చేయడం కష్టమయి, వాటిని డెవెలప్మెంటు కోసం ఇచ్చేసి అగ్గిపెట్టెల్లాటి ఎపార్టుమెంటల్లోకి మారిపోతున్నారు. వీటిలో ఉండే సదుపాయం వీటిలోనూ ఉంది. ఆధునిక ప్రపంచంలో ఏది చూసినా compact యుగమే కదా ! కానీ ఒకవిషయం చెప్పండి, అకస్మాత్తుగా పాత తరం లోగిళ్ళలోకి వెళ్ళమని ఎవరైనా ఆఫరు ఇస్తే వెళ్ళకుండా ఉంటారా? Nostalgia పేరుచెప్పి, ఈరోజుల్లో గ్రామాలకి వెళ్ళి అక్కడ కనీసం ఓ వారంరోజులైనా గడపడానికి ఎవరు కాదంటారు చెప్పండి? జనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక విషయం మాత్రం పచ్చినిజం- old is always gold.అందుకేకదా ఎక్కడ పడితే అక్కడ రిసార్టులూ అవీ వచ్చేశాయి.పైగా వాటికి ethnic అని ఓ పేరోటీ? ఏ ఎరువూ వేయకుండగా కూరగాయలు చేస్తే దానిని organic అంటారుట. ఎంత ఆరోగ్యకరం కాకపోతే, వాటివెనక్కాల పడతారూ? ఎలా చెప్పుకున్నా పాతబంగారంలో ఉన్న విలువ ఈరోజుల్లో కనిపిస్తుందంటారా?

    అసలు ఈ గొడవంతా ఎందుకు మొదలెట్టానంటే, సోనీ లో కొన్ని నెలలుగా Indian Idol Juniors అని ఓ కార్యక్రమం వస్తోంది. ఆ కార్యక్రమం పరాకాష్టకి వచ్చేసింది. నిన్నటి కార్యక్రమంలో, అలనాటి సంగీత జోడి లక్ష్మికాంత్ ప్యారేలాల్ జంటలోని ప్యారేలాలు గారు ముఖ్య అతిథి.ఆయన ఆ కార్యక్రమానికి రావడమే కాకుండా, తనతో పాటుగా తన 125 సభ్యుల Orchestra ని కూడా తీసికుని వచ్చారు. ఓ గంటన్నర పాటు ” అమృతమే ” జాలువారింది అంటే నమ్మండి. ఈ రోజుల్లో సంగీత దర్శకులు అవేవో సింథజైజర్లూ అవీ ఉపయోగించి, అన్నివాయిద్యాల ధ్వనులూ వినిపించగలుగుతున్నారు. నిజమే కాని ఆనాటి సంగీతదర్శకులకి ఓ పాతిక వయొలిన్లు, ఓ రెండో మూడో ఎకార్డియన్లూ, ఓ పియానో, ఇలా వివిధరకాలైన వాయిద్యాలతో ఓ వందమంది దాకా ఉండేవారు, కొంతమందికైతే రెండేసి వందల దాకా ట్రూప్పులుండేవి. వారంతా ఓ dedicated team లా ఉండేవారు.

    అలాగని ఈరోజుల్లో సంగీతం ఇచ్చేవారు లేరని కాదు, ఎవరి ఘనత వారిదీ.ఈరోజుల్లో అంతా compact యుగమే కదా. పాడేవారికంటే పాటకి అనుగుణంగా వాద్య సహకారం ఇచ్చేవారే గొప్ప. అదీ రెండువందలమంది కళాకారులు సంగీతం ఇస్తూంటే పాడే వాతావరణమే వేరు. ఇప్పటికీ Zubin Mehta గారి కార్యక్రమం ఉందంటే చెవికోసుకునేవారు లక్షల్లో ఉంటారు. పైన చెప్పినట్టుగా, ఎపార్టుమెంటుల్లో ఎన్ని సౌఖ్యాలు ఉన్నా, పాత తరం లోగిళ్ళ వాతావరణమే వేరు.

    సరీగ్గా అలాటి వాతావరణమే సృష్టించారు శ్రీ ప్యారేలాల్ గారు నిన్నటి కార్యక్రమంలో. మొదట్లో వారు , శ్రీ లక్ష్మీకాంత్ గారితో సంగీతసారధ్యం వహించిన 600 పైచిలుకు సినిమాల్లోంచి కొన్ని ఆణిముత్యాలు ఏరి,వాటిల్లో ఒకటా రెండా, ఓ పాతికదాకా ఓ medley వినిపించి, శ్రోతలని ఒక్కసారి ఎక్కడికో.. ఎక్కడెక్కడికో..అడక్కండి తీసుకుపోయారు. అద్భుతం..అజరామరం..అద్వితీయం.. ఆకార్యక్రమ విడియో దొరుకుతుందేమో అని వెదికేను,ఇప్పుడే దొరికిందండోయ్.. తప్పకుండా విని చూసి ఆనందించండి.సోనీ వారు పెట్టిన విడియోలో సౌండు రావడం లేదు. కారణం నాకైతే తెలియదు. నేను పెట్టిన క్లిప్పింగులు చూసి, ఆ తరువాత యూట్యూబ్ లో వచ్చినప్పుడు చూసి ఆనందిచ్చొచ్చు.

    ఇంక ఫైనల్స్ కి వచ్చిన నలుగురు పిల్లలూ ఒకర్ని మించినవారింకొకరు. వారు పాడినపాటలు- అదీ original సంగీత వాయిద్య సహకారంతో పాడి వినిపించడం వారు చేసికున్న అదృష్టం, విని ఆనందించడం మన అదృష్టం. ఈ నలుగురిలో “పోటీ” కాబట్టి, చివరకి ఎవరో ఒకరు నెగ్గుతారు. అదొక్కటే బాగుండదు. ఈవేళ రాత్రి 8.30 కి ఆ కార్యక్రమం చూడడం మాత్రం మిస్సవద్దని నా ప్రార్ధన. ఎవరు నెగ్గారూ కంటే, ఎంత అద్భుతంగా పాడారూ అన్నదే ముఖ్యం. ఇన్నిరోజులుగా ఆ కార్యక్రమం వస్తూన్నా, నేను ప్రస్తావించలేదు, కారణం ఆ కార్యక్రమాల్లో సంగీతసహకారం ఇచ్చిన వారు, ఒరిజినల్ పాటలకి అనుకరణ చేయకలిగారే కానీ, ఆ “అస్సలు” ది సృష్టించలేకపోయారు. కానీ నిన్నటి కార్యక్రమం వింటూంటే ఏదో live performance by LP అనే అనిపించింది. అందుకే అన్నాను అసలు అసలే అనుకరణ ఎప్పుడూ అనుకరణే. ఏదో నాకు సాధ్యమైనంతవరకూ నా కెమేరాలో కొన్ని రికార్డు చేసి పెట్టాను. .

    DO NOT MISS INDIAN IDOL JUNIORS GRAND FINALE on SONY at 8.30 PM today.

    ఒకటి

   రెండు

    మూడు

  నాలుగు

%d bloggers like this: