బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    గవర్నమెంటు లో ఉద్యోగాలు చేసేటప్పుడు, ఏదైనా ట్రైనింగ్ కార్యక్రమాలకి వెళ్ళడం చాలా బాగా ఉండేది. బయటి ఫాక్టరీలనుండి వచ్చిన పాత మిత్రుల్ని కలుసుకోవడం మినహా పెద్ద ఏమీ నేర్చుకునీది ఉండేది కాదు. ఈ ట్రైనింగులు ఓ ఆటవిడుపు లాగ ఉండేవి.అదీ ఎక్కడైనా బయటి ఊళ్ళకి వెళ్ళడం ఇంకా బాగుండేది.

మీరు ఎప్పుడైనా గమనించారా ? ఎవరైనా మనకి తెలిసినవారు దివంగతులైతే చాలా బాధ పడతాము. ఎవరో ఒకరి ద్వారా ఈ వార్త తెలిసికొని, దగ్గర వాళ్ళందరూ చేరతారు.వెళ్ళిన మొదటి అరగంటా ఆ పోయినాయిన గురించే మాట్లాడుకుంటారు, ఆయన చేసిన మంచి పనులూ, ఆఫీసులో ఆయన ప్రవర్తనా వగైరా, వగైరా.. ఇదేదో నేను వాతావరణాన్ని హాస్యంగా తీసికుంటాననుకోకండి, మామూలుగా అటువంటి సందర్భాల్లో తరచూ జరిగే విషయాలు చెప్తున్నాను.
పోయినాయన ఇంటికి ముందర ఓ పెండాల్ వేసి ఓ పది పదిహేను కుర్చీలు వేస్తారు.ఇంకో చిత్రమేమంటే శుభ కార్యానికీ, ఈలాటి వాటికీ కూడా ఒకే రకమైన రంగు పెండాల్/షామియానా వేస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ, దివంగతులైన ఆసామీ, ఆ ముందు రోజు రాత్రి దాకా అందరితోనూ ఎలా మాట్లాడిందీ, తెల్లారేక అకస్మాత్తుగా ఎలా పడిపోయిందీ, డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళే లోపల ఎలా ప్రాణం పోయిందీ అన్నీ మాట్లాడుకుంటారు.ఓ అరగంటా, గంటా ఈ మాటలు పూర్తి అయిన తరువాత, ఆ వచ్చిన వాళ్ళందరికీ, ఇంక మాట్లాడడానికి ( పోయినాయనని గురించి) ఏమీ ఉండదు. ఇంక అక్కడినుండి, ఆయన బాడీ తీసికెళ్ళేదాకా ఏదో కాలక్షేపం ఉండాలిగా, ఊళ్ళో ఖబుర్లన్నీ మొదలెడతారు.వాళ్ళ ఉద్యోగాల లోని కష్టసుఖాలూ వగైరా వగైరా… ఇదేం విచిత్రమో అర్ధం అవదు. వీళ్ళు ఖబుర్లు చెప్పుకోవడానికి ఇంకో ప్రదేశమే దొరకలేదా?వచ్చిన పని ఏమిటి, మాట్లాడడానికి ఏమీ విషయం లేకపోతే నోరు మూసుకుని కూర్చోచ్చుగా.

ఇంక పెళ్ళిళ్ళలో కొన్ని చిత్రాతి విచిత్రమైన సన్నివేశాలు చూస్తూంటాము. పెళ్ళిళ్ళకి వెళ్ళేది, చిన్ననాటి స్నేహితుల్నీ, చుట్టాలనీ కలుసుకోవడం కోసమే. మొట్టమొదటగా ఎవరి పెళ్ళికోసం వెళ్ళేమో, వాళ్ళని కలుసుకొని, మీరు వచ్చి పిలిచారూ, ఇదిగో నేను వచ్చేశానూ, ఇంట్లో తీరిక లేక మా ఆవిడ రాలెకపోయిందీ (ఇవన్నీ స్టాండర్డ్ కారణాలే లెండి) అవన్నీ చెప్పేస్తారు. పెళ్ళిపెద్ద గారి భార్య ‘ అదేమిటీ వదిన గారిని తీసుకు రాలేదూ’ అని ఓ సారి అడిగేసి (అయితే ఈయనకేమీ ఇవ్వఖ్ఖర్లేదు, అని అకౌంటులో వేసేసికుంటుంది, మొగాళ్ళు ఒఖ్ఖళ్ళూ పెళ్ళికి వెళ్తే వాళ్ళకేమీ ఆఖరికి జేబిరుమ్మాలు కూడా దొరకదు. ఇంటావిడతో కలిసి వెళ్తే, మన చుట్టరికాన్ని బట్టి, జాకేట్టు గుడ్డో, పెట్టుబడి చీరో దొరుకుతుంది).
ఆ వచ్చిన పెద్దమనిషి, ముందుగా టిఫినూ, కాఫీ తీసికొని హాల్లో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారేమో వెదుకుతాడు. ఈయన అదృష్టం బాగుంటే, తను 30-35 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్నవాడో, లేక ఒకే ఊళ్ళో ప్రక్క ప్రక్కల ఇళ్ళల్లో ఉండేవాడో దొరుకుతాడు. ఎక్కడో చూసినట్లనిపిస్తుంది కానీ జ్ఞాపకం రాదు. ప్రతీ రోజూ చూసేవాళ్ళే గుర్తుండరు, ముఫై ఏళ్ళ తరువాత ఎలా గుర్తు పడతారూ?

ఎలాగైతేనే ఓ రెండు మూడు సార్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న తరువాత ఏవేవో జ్ఞాపకాలు వచ్చి ‘మీరు ఫలానా కదూ’, అని ఒకరినొకరు పలకరించుకుంటారు.ఒకటి రెండు మాటలైన తరువాత పూర్తిగా గుర్తుకొచ్చేస్తుంది. చాలా కాలం తరువాత కలుసుకోవడంతో ఇంక వీళ్ళ ఖబుర్లు, గడచిన ముఫై ఏళ్ళలోనూ జరిగినవన్నీ నెమరు వేసికుంటారు. చిన్నప్పుడు కలిసి చదువుకున్నట్లైతే, టీచర్లని ఎలా ఏడిపించేవారో, ఆడపిల్లల్ని ఎలా ఏడిపించేవారో గుర్తు చేసికుంటారు.పాత స్నేహితులు ఎవరొరు ఎక్కడెక్కడ ఉంటున్నారో అవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇంక వీళ్ళ కుటుంబ పరిచయాలు అవాలిగా. అందులో ఒకాయన ఒక్కడే వచ్చాడు కాబట్టి బ్రతికి పోతాడు. రెండో ఆయన, ఎవరో చిన్న పిల్లని పిలిచి,‘అక్కడ ఖబుర్లు చెప్తోందీ, మీ అమ్మమ్మని ఓ సారి ఇలా పిలూ’అని, హాయిగా ఏవో ఖబుర్లు చెప్తూన్న ఓ పెద్దావిడని పిలుస్తాడు.’ఇదిగోనోయ్, మా ఆవిడ’అని ఇంటర్ద్యూస్ చేసి, ‘ ఇతను గుర్తున్నాడా, రాజమండ్రీ లో మా ఆఫీసులోనే పనిచేసేవాడు’ అని అడుగుతాడు.ఈయన గుర్తు పట్టడానికే గంట పట్టిందని మర్చిపోతాడు. ఆవిడేమో మొహమ్మాటానికి, ‘ గుర్తు లేకేం, వదినగారిని తీసుకురాలేదేం’ అంటుంది. నిజం చెప్పాలంటే ఆవిడకి గుర్తేం ఉండదు,అయినా ఇలాటి స్టాండర్డ్ డైలాగ్గు చెప్పేస్తే గొడవుండదు!! అక్కడితో ఈ పరిచయ కార్యక్రమం పూర్తి అవదు, ఈయన కొడుకూ, కోడలూ, మనవడో మనవరాలో, వీళ్ళందరినీ పిలిచేసి, ఓ ఐడెన్టిఫికేషన్ పెరేడ్ చేయిస్తాడు.అందరూ వరసలో నిల్చోవడం, ఓ ప్లాస్టిక్ స్మైల్ ముఖానికి పులిమేసుకోవడం. వీళ్ళందరినీ చూసి ఫొటోలు తిసేవాడు ఓ సారి క్లిక్ చేయడం. ఇవన్నీ పూర్తైన తరువాత, ఒకళ్ళ సెల్ నంబర్లు ఒకళ్ళు తీసికోవడం, ఈ రోజుల్లో ఇంకో ఫాషనూ–మెయిల్ ఐ.డి ఉందా అని అడగడం, (అంటే అవతలి వాడికి తెలియాలన్నమాట వీడి దగ్గర కంప్యూటర్ ఉందీ అని !!
అందువలన ఈసారి మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్తే గుర్తుంచుకోండి, ఇలాటి అద్భుత దృశ్యాలు మిస్ అవకండి...

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-టెన్షన్లు–1

    మీరు చూసే ఉంటారు,ప్రపంచం లో నూటికి 90 మందికి ఏదో రకమైన ఒత్తిడి ( మన భాష లో ‘టెన్షన్’ అందాము.) తో బాధ పడుతూంటారు. అది ఆర్ధిక సంబంధమైనది కావచ్చు,ఆఫీసులో ఏదో రకమైనది అవొచ్చు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతీ ప్ర్రాణికీ ( అప్పుడే పుట్టిన పసి పాప తో సహా) ఈ ఒత్తిడి ఉంటూనే ఉంటుంది.కొంతమంది చెప్పుకుంటారు,కొంతమంది తమలో తమే బాధ పడుతూంటారు. ఇంకో రకం, వాళ్ళ టెన్షన్ ని ఎదురుగుండావాడికి ట్రాన్స్ఫర్ చేసేసి, వాళ్ళు చిదానందంగా ఉంటారు.వాళ్ళ పని అందరిలోకీ హాయి.పడే తిప్పలేవో రెండో వాడే పడతాడు. పసి పాపల టెన్షన్ ఈ కోవలోకే వస్తుంది. ఆ పాపకి వచ్చిన టెన్షన్ తెలిసికోవడానికి మనకి తాతలు దిగి వస్తారు.

ఇంకొంతమందుంటారు, ఊరికే పనీ పాటా లేకుండా, ఊళ్ళోవాళ్ళదగ్గర పోజు పెట్టడానికి, ఈ టెన్షన్ అనేదానిని ఓ ‘హాబీ’లా ఉపయోగిస్తూంటారు. తనేదో సొసైటీ కి ఏదో ఉపకారం చేస్తున్నట్లున్నూ, దానికోసం తను ఎన్ని తిప్పలు పడుతున్నాడో అందరికీ తెలియాలీ అన్నట్లు బిహేవ్ చేస్తూంటారు. ఇలాటివి తనంతట తనే తెచ్చికొన్నవి, ఇంట్లో వాళ్ళ ఆవిడని అడిగితే అసలు నిజం తెలుస్తుంది–‘ ఈయనకేమీ పని లెదండీ, ఊళ్ళోవాళ్ళ గొడవలన్నిటిలోనూ వేలెడతారు,అందుకే లేనిపోని గొడవలు.హాయిగా తిని రామా కృష్ణా అంటూ కూర్చోక రిటైర్ అయిన తరువాత ఎందుకూ ఈ తలనొప్పులూ’ అని అస్సలు సంగతి చెప్పేస్తారు.

ఇంకో రకం వాళ్ళు- ‘ మా రోజుల్లో ఎలా ఉండేదండి, తండ్రి ఎదురుగుండా నుంచునే ధైర్యం ఉండేదా? ఇప్పుడు చూడండి, అస్సలు క్రమశిక్షణే లెదు,వాళ్ళకి తెలియదు, చెప్తే కోపాలు, వీళ్ళూ, వీళ్ళ ఖర్చులూ, అయిపూ అదుపూ లేదు, ఎలా బాగుపడతారో తెలియదు’ అని పిల్లలు ఎదురుగుండా లేనప్పుడు, తమ ఇంటికి వచ్చిన స్నేహితులతో చెప్పుకుని, వాళ్ళని ‘స్ట్రెస్ బస్టర్’ లాగ వాడుకుంటారు.

చదువుకునే రోజుల్లో ఉండే ‘టెన్షన్’ ఇంకోలా ఉంటుంది. పరీక్ష పేపర్లు ఎలా ఉంటాయో అని మొదలెట్టినది, రిజల్ట్ వచ్చేదాకా వాడి మొహంలో కనిపిస్తూంటుంది,ఇది ఎవరికీ, శ్రధ్ధగా చదివి,పరీక్షలు రాసేవాళ్ళకి. నాలాటి వారు ‘ చిదానంద స్వరూపులు’ పరీక్షలు ఎప్పుడైపోతాయా అనే టెన్షన్ తప్పించి, ఏదో ప్రపంచాన్ని ఉధ్ధరించేద్దామన్న కోరికా ఉండేది కాదు,దేనికీ టెన్షనూ పడలేదు.అందుకే వఠ్ఠి డిగ్రీ చేతికొచ్చేసిన తరువాత ఊరిమీద పడ్డాను.

ఇదివరకటి రోజుల్లో అంటే ఇంకా ఈ ప్రెమ వివాహాలూ అవీ ప్రాచుర్యం పొందని రోజుల్లో, గుర్తుందిగా, అందరికీ, పెళ్ళిచూపుల కార్యక్రమం నుండి,కూతురు కాపరం పెట్టేదాకా అన్నీ టెన్షన్ లే.ఇంక అక్కడినుండి, పెళ్ళికొడుకు వాళ్ళకి టెన్షన్ ప్రారంభం అవుతుంది-కొత్త కోడలు ఎలా ఉంటుందో, చెప్పిన మాట వింటుందో లేదో,వేరింటి కాపరం పెడదామంటుందో, ఆడపడుచుని ఇంటికి రానిస్తుందో లెదో లాటివి. పెళ్ళిచూపుల టైములో అయితే, పెళ్ళికూతురి తండ్రికి టెన్షన్ ఉంటుందని తెలుసు, కానీ కొన్ని కొన్ని కేసుల్లో, పెళ్ళికొడుకు కి కూడా టెన్షన్ ఉంటుందండోయ్,ఉదాహరణకి నేను, అమలాపురం లో చూసి,అన్నవరంలో తాళి కట్టేదాకా అసలు నన్ను ఒప్పుకుంటుందో లేదో అనే టెన్షనే.దానికి సాయం,మేము పెళ్ళికి కాకినాడ మీదుగా బయలుదేరినప్పుడు, ఎక్కడో ఒక సందర్భంలో మా నాన్నగారు, రిక్షావాళ్ళతో దెబ్బలాట పెట్టుకున్నారు, ఎదో మాట తేడా వచ్చింది, ఎలాగో లాగ
అవన్నీ సెటిల్ చేసికుని, ఓ వ్యాన్ మాట్లాడుకుని వెళ్తూంటే, ఆరోజు కాకినాడలో ట్రాఫిక్ బందూ, మా గాడీని వదలమని గొడవా.ఎలాగోలాగ, ఆ హర్డిల్ దాటుకుని, అన్నవరం చేరిన తరువాత, అప్పటికింకా ఆడపెళ్ళివారు తణుకు నుండి రాలేదన్నారు.ఎవరినైనా అడగాలంటే సిగ్గూ,నా టెన్షన్ ఎవరికి చెప్పుకోనూ? ఓ చెవి మా వాళ్ళందరూ మాట్లాడుకొనేదానిమీద వేసుంచాను.ఇంతలో
తణుకు బస్సు వచ్చిందన్నారు. మెల్లిగా అందరూ దిగుతున్నారండి, ఇంతట్లో ఎవరో అరుస్తున్నారు-‘వెధవా ఫణీ అలా పారిపోకురా’ అని. అది నా చెవిన పడి వీళ్ళిళ్ళు బంగారంగానూ, పెళ్ళవకుండానే ఇలా తిడుతున్నారూ అనుకొని, పోన్లే ఎడ్జుస్ట్ అయిపోదామనుకున్నాను. ఆ తరువాత తెలిసింది ‘ఆ వెధవా ఫణీ ‘ అని పిలువబడిన ప్రాణి, నేను కాదనిన్నూ, నాకు స్నాతకం టైములో గెడ్డం క్రింద బెల్లంముక్క కొట్టబోయే నా ‘బావ మరిదీనూ’అని.ఇంక కొండమీద కి వచ్చిన తరువాత, ఎవరో చెప్పారు, దేవస్థానం ఆఫీసులోకి వెళ్ళి సంతకాలు పెట్టాలని, అదేదో తొందరగా చేసేస్తే గొడవ ఉండదుగా, ఇంక నచ్చినా నచ్చకపోయినా నాతోనే ఉంటుందీ అని, అప్పటిదాకా పడ్డ టెన్షన్ లోంచి బయట పడ్డాను.

ఇవాళ్టికివండి, మళ్ళి తరువాతి టపాలో ఇంకొన్ని కామన్ టెన్షన్ల గురించి…

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-పెళ్ళి సందడి

saakshi

నిన్న సాయంత్రం నా కంటె 6 సంవత్సరాలు ముందు రిటైర్ అయిన ఒక స్నేహితుడిని కలిశాను. వాళ్ళ అబ్బాయికి ఇంకా పెళ్ళి చేయాలని చెప్పాడు. పైన ఇచ్చిన లింకు లో చదివితే,అమ్మ బాబోయ్ అనుకున్నా !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

   మా చిన్నప్పుడు ఎవరైనా దేశం బయటకి వెళ్ళడమనేది చాలా అరుదుగా జరిగేది. వెళ్ళిన వారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదే.బయటకి వెళ్ళడం ఏదో అమలా పురం నుండి కాకినాడ వెళ్ళొచ్చినట్లుగా ఉంది.

   నాకు బాగా గుర్తు– మా అన్నయ్య గారు మొదటిసారి ఇంగ్లాండ్ ఓ ఏడాది ఉండడానికి వెళ్ళినప్పుడు, నేనూ, మా తల్లితండ్రులూ బొంబాయి ఏరోడ్రం ( అలా అనేవారు !!) కి వెళ్ళి వీడ్కోలు చెప్పాము !! అప్పుడు మేము అందరం కలిసి ఓ ఫొటోకి కూడా దిగాం !! వెళ్ళిన వారానికో, పది రోజులకో ఓ ‘ఏరోగ్రాం ‘ వచ్చేదాకా, ఈ వెళ్ళిన మనిషి క్షేమంగా చేరేడో లేదో తెలిసేది కాదు. కొన్ని రోజులకి మా వదినగారు కూడా వెళ్ళి ఆయనతో ఉన్నారు. ఇంక వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ హడావిడీ. ఏవేవో తెచ్చేవారు-టేప్ రికార్డరూ, వాచీలూ వగైరా వగైరా.అలాగే మా పెద్దన్నయ్య గారు కూడా ఎవరో వాళ్ళ స్టూడెంట్ పిలిస్తే వెళ్ళారు.అప్పుడూ ఇంతే !!
ఇప్పుడో దేశం బయటకి వెళ్ళని వారిని వేళ్ళమీద లెఖ్ఖ పెట్టొచ్చు, ఉదాహరణకి నేనూ, మా ఇంటావిడా. మా పిల్లలేమో బయటకి ‘లాంగ్ టర్మ్’ మీద వెళ్ళరూ, వెళ్ళినా ఏదో వారం, పదిహేను రోజులకీ వెళ్తూంటారు. ఇంక మమ్మల్నెవరు తీసికెళ్తారూ?

   ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే క్రిందటి శుక్రవారం, మా అబ్బాయి యు.ఎస్. ఓ వారం పనిమీద వెళ్ళాడు. వెళ్ళినప్పటినుండీ, మా మనవరాలితో మాట్లాడని క్షణం లేదు.అస్సలు ఆ పాపకి, వాళ్ళ నాన్న బయటకు వెళ్ళడనే భావమే లేదు.తను లేకపోతే ప్రొద్దుటే స్కూలికి వెళ్ళడానికి ఏమైనా ‘పేచీ’ పెడుతుందేమో అని, ప్రొద్దుటే ఫోన్ చేసి లేపడం నుండీ, తను స్కూలు బస్సు ఎక్కేదాకా ఫోన్లే !! ఏమిటో ఈ ఫాస్ట్ జీవితం !!

   నేను కొంతమందిని చూశాను–ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళకపోతే ఇంక నిద్ర పట్టదు, దానికోసం ఉద్యోగాలు మార్చడానికైనా వీళ్ళు రెడీ. ఆన్ సైట్ అనేది ఓ అబ్సెషన్ అయిపోయింది.
ఇంక సంవత్సరాలనుండీ బయటే ఉండేవారి గురించి నాకేమీ తెలియదనుకోండి.ఎక్కడో కొంతమంది ఉంటారు, పిల్లల పురుళ్ళకి వెళ్ళేవారు. వెళ్ళడం ఓ ఆరునెలలుండడం (వంతుల వారీగా).కొడుకు ఏ అమెరికాలోనో ఉన్నాడనుకోండి, ఇంక ఊళ్ళో వాళ్ళందరూ అతని తల్లితండ్రుల్ని సమయం దొరికినప్పుడల్లా పరామర్శీస్తూంటారు–‘అబ్బాయి దగ్గరకెప్పుడు వెళ్తున్నారూ?’అని.
‘ఇంకా వాళ్ళు పిలవలేదండీ’అని ఓ వెర్రి సాకు చెప్తారు. అప్పటికే ఆ అబ్బాయి అత్తమామలు వెళ్ళి ఆరునెలలుండి వచ్చేస్తారు. ఈ సంగతి ఈయనదాకా రాదు.ఎంత చెప్పినా మొదటి ప్రిఫరెన్సు అత్త మామలకే. పురుళ్ళకీ, చాకిరీకీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అమ్మ గుర్తొస్తుంది, ఆ అమ్మతో ‘యాడెడ్ లగేజ్ ‘ నాన్న !! అందరూ అలా చేస్తారని కాదు, నేను విన్న కేసులు అలాటివి. ‘మీరు ఎప్పుడూ దేశం బయటకి వెళ్ళకుండా ఇలాటి విషయాలమీద అంత ఘంటాపథం గా ఎలా చెప్తున్నారూ’ అంటే ఇవన్నీ నేను విన్నవీ, చదివినవీ. ఇందులో ఎవరినైనా ‘హర్ట్’ చేస్తే క్షంతవ్యుడిని.నేను విన్నదీ చదివినదీ నిజం కాకూడదనే నా ఆశ.

   మనం ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళామనుకోండి,ముందుగా ఓ చాక్లొట్ డబ్బా తెచ్చి ముందర పెడతారు.అంటే మనకి తెలియాలన్నమాట, వాళ్ళ అబ్బాయో కోడలో వచ్చేరని.అది చాక్లొట్ల ద్వారా మనకి తెలియచేయడం !! ఆ తరువాత వాళ్ళ పిల్లల ఆల్బం, ఆ వచ్చిన పిల్లో పిల్లాడో-వాళ్ళు యమా అక్సెంట్ తో ఎదో అడగడం,ఆ అడిగినది ఈ మామ్మకో, తాతయ్యకో అర్ధం అవదూ. ‘అక్కడంతా ఇంట్లో ఇంగ్లీషేనండి, తెలుగు అస్సలు అర్ధం అవదూ ‘ అని వీళ్ళ వివరణా!. ఇంక ఆ తాతయ్య గారు వీళ్ళని ఏ బజారులోకో తీసికెళ్ళి అన్నీ వివరించడం. అందరూ

   ‘సీతారామయ్య గారి మనవరాలు’ లాగ ఉండరుగా !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–బూంద్ బూంద్ సే !!

    ఈ మధ్యన బంగారం రేటు కొండెక్కేసింది.నాకు బాగా గుర్తు-నేను ఉద్యోగంలో చేరినప్పుడు అంటే 1963 లో 10 గ్రాముల బంగారం 80/- రూపాయలకి వచ్చేది.నా జీతంతో పాటే దాని ఖరీదుకూడా పెరుగుతూ వచ్చింది. 80/- రూపాయలున్నప్పుడు నా జీతం 200/- మాత్రమే. పైగా ఆరోజుల్లో స్మగ్లింగ్ చేసి తెచ్చేవారు, దానిఖరీదు కొంచెం తక్కువ ఉండేది.తెలిసున్నవాళ్ళకి తప్ప ఇతరులకి అమ్మేవారు కాదు.కాలక్రమేణా బంగారం ఖరీదూ, నా జితమూ ఒకేలా ఉండేవి.అదేదో తక్కువ ఉంటే కొనేవాడిననికాదు.ఊరికే పరిస్థితి చెప్పానంతే !!

    అయినా అప్పటికి మనకి మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయీ?స్వతంత్రం (నాకు !!) వచ్చిన కొత్తరోజులూ, అడిగేవాళ్ళెవరూ లేరు. మన ఇష్టం వచ్చినట్లుండేవాడిని.చేతిలో డబ్బులుంటే, ఏ సినిమాకి వెళ్దామా అనేకానీ ఇంకో ఆలోచన వచ్చేది కాదు. పైగా ఇంకో నమ్మకం–ఈ బంగారం వ్యవహారాలన్నీ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారని( అంటే తల్లితండ్రులన్నమాట!). పెళ్ళి అయే సూచనలేమీ ఉండేవికావు. ఎవడికోసం ఈ బంగారం అవీనూ అని ఇంకో ఆలోచనా!! ఇలాటి అప్రయోజక ఆలోచనలకేమీ లోటు లేదు.ఎప్పుడైనా అమలాపురం వెళ్తే అందరికీ అదో పేద్ద ఇంప్రెషనూ, చిన్న వయస్సులోనే అంత మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడూ, ఒక్కడే ఉంటున్నాడూ, ఇంటికి ఏమీ పంపఖ్ఖర్లేదూ ఎంతో కొంత వెనకేసేఉంటాడూ అని !!నాకొచ్చే 400/- రూపాయలూ ఆరోజుల్లో మంచిజీతంక్రిందే లెఖ్ఖండి !! ఒక్కొక్కప్పుడు ఇవన్నీ విని ‘గిల్టీ’ గా ఫీల్ అయేవాడిని.మా నాన్నగారికి ఎంతో కొంత పంపించిఉంటే ఆయనేం తినేస్తారా? వీడు ఎలాగా పంపడు అని ఆయనకి తెలుసు.నేను ఉద్యోగంలో చేరేటప్పుడు,నా మొదటి జీతం చేతికి వచ్చేలోపల, మా అన్నయ్య లిద్దరూ తలో వెయ్యి రూపాయలూ ఇచ్చి పంపారు.ఇంక మా నాన్నగారికి, ఓ వంక దొరికింది-‘మీ అన్నయ్యల దగ్గర పుచ్చుకొన్న డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి రా ‘ అని ఓ ఉత్తరం వ్రాసి, నా దగ్గరనుండి ఆడబ్బు ఎలాగోలాగ తీసికున్నారు. ఓ విషయం చెప్పనా-అలా నాదగ్గరనుండి తీసికున్న డబ్బుని ఫిక్సెడ్ లో వేసి, ఆడబ్బుతోనే నా పెళ్ళికి కావలిసిన బంగారం కొన్నారు !

    నాకు వయస్సులో పెద్ద అయిన ఓ స్నేహితుడు ఒకరుండేవారు.నన్ను ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ‘బెయిల్ ఔట్ ‘ చేసింది ఆయనే. పెళ్ళి అయినతరువాత కూడా, ఆయనే దిక్కు.వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన చెప్పారు.వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలూ,ఒక అబ్బాయీ.-ఆవిడకూడా టీచర్ గా పనిచేసేవారు. ఆయన నాకు ఓ అమూల్యమైన సలహా ఇచ్చారు.-వాళ్ళకి మొదటి కూతురు పుట్టినప్పటినుండీ, ప్రతీ నెలా ఓ గ్రామో,అరగ్రామో బంగారం కొనడమూ, దానిని ఓ కాగితంలో పొట్లంకట్టేసి, దానిమీద కొన్న తారీఖూ, రేటూ వ్రాసేసి కప్ బోర్డ్ లో పెట్టేయడం, దానిగురించి మర్చిపోవడం. ఇలా ఆ దంపతులు,ఇద్దరు పిల్లలి పేరనా ప్రతీ నెలా బంగారం కొనేవారు.అలా పోగెట్టిన బంగారం తోనే, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశారు. మనవాళ్ళు, ఆంధ్రా వాళ్ళైనా,ఇంకో ప్రదేశం వాళ్ళైనా అమ్మాయి పెళ్ళిలో బంగారం తప్పకుండా పెడతాముకదా ( మన పిల్లకే కదండీ).ప్రతీ నెలా ఓ గ్రాము బంగారం కొనడం ఓ పేద్ద ఘనకార్యం కాదు. మనం చేసే పిచ్చి ఖర్చుల్లో ఇదెంతా? కానీ దాని ఉపయోగం ఏమిటో కూతురి పెళ్ళి చేసినప్పుడు తెలుస్తుంది.
మేము కూడా ఇలాగే చేశాము. మా డాక్టర్ ఫ్రెండు గారికి ఈ సంగతి చెప్తే వాళ్ళూ మొదలెట్టారు.మా అమ్మాయి పెళ్ళిలో బంగారం పెట్టవలసివచ్చినప్పుడు,ఇది ఎంత ఉపయోగించిందో చెప్పలేము.మా మనవరాలు ( అబ్బాయి కూతురు) పుట్టినప్పుడు వాళ్ళకి సలహా ఇస్తే ముందర కొంచెం వెనుకాడేరు కానీ,ఆ తరువాత దానిలో ఉన్న సుఖం ఏమిటో తెలిసి, మా కోడలు వాళ్ళు కొన్నదానిగురించి చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో!

    ఇప్పుటి జనరేషన్ వాళ్ళకి ఇదంతా చాదస్థంగా కనిపించవచ్చు. చదువుతున్నాము కదా అని ఈయన ఊరికే ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నాడూ,బంగారం కొనాలంటే పేద్ద లేఖ్ఖేమీ కాదు,పిల్ల పెళ్ళి అవడానికి ఇంకా పాతికేళ్ళుంది, ఇప్పటినుండీ ఇవన్నీ ఎందుకూ అనవసరం అని. ప్రస్తుత రేట్ల ప్రకారం గ్రాము బంగారం ఎంతవుతుందీ–1700/- రూపాయలు మాత్రమే. ఆ ఎమౌంట్, మీరు,కుటుంబంతో హొటల్ కి వెళ్ళి ప్రతీ వారం తినేటంత కూడా ఉండదు. ఓ వారం వెళ్ళలేదనుకోండి ఏం అవుతుంది.? మీ లక్షరీస్ మానుకోమని చెప్పడం లేదు.. మనకి నచ్చినా, నచ్చకపోయినా అమ్మాయికి పెళ్ళి చేసినప్పుడు ఏ యుగంలోనైనా స్త్రీ ధనం క్రింద బంగారం ఇవ్వాల్సిందే. ఆ ఇచ్చేదేదో మనకి సౌకర్యంగా ఉండే పధ్ధతిలో చేస్తే ఎంత హాయిగా ఉంటుందీ?

    ఇన్ఫ్లెషన్ అయినా ఇంకో ‘ఫ్లేషన్’ అయినా బంగారం బంగారమే. పైగా ఇలా పిల్ల పేరుమీద కొంటే దానిమీద చెయ్యి వేయము !! అదో సెంటిమెంటూ.ఒక్క ఏడాది చేసి చూడండి, జస్ట్ సరదాగా !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-గుడినే మింగేవాడు !!

CLB

ఇదేదో చిత్రంగా ఉంది.రామలింగరాజు గుళ్ళోలింగాన్ని మింగితే, వాసుదేవన్ గుడినే మింగేవాడిలా ఉన్నాడు.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-కొంతమంది చేసికున్న అదృష్టం!!

    ఈ మధ్యన బయటకు బస్సులో గానీ, లోకల్ ట్రైన్ లో గానీ వెళ్తున్నప్పుడు చూస్తూంటాను–చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ళవాళ్ళుకూడా, ఒక్కళ్ళూ స్కూలికో, ఇంకెక్కడికో వెళ్ళడం చూస్తూంటే బలే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఉద్యోగంలో చేరేవరకూ అంటే 18 ఏళ్ళు వయస్సు వచ్చేవరకూ, ఒక్కడినీ ఎప్పుడూ ఎక్కడికీ అంటే బయట ఊళ్ళకి వెళ్ళనిచ్చేవారు కాదు.ఇప్పటి వాళ్ళని చూస్తూంటే బలే ముద్దొస్తూంటుంది.

   మా రోజుల్లో స్కూలునుండి ఎప్పుడైనా ఎక్స్కర్షన్ కి వెళ్ళాలంటే, వరదలొచ్చినప్పుడు గోదావరీ ( గట్టుమీద దాకానే), లేకపోతే రాజమండ్రీ పేపర్ మిల్లూ, జైలూ. జైలు మాత్రం రెండు సార్లు చూశాను( అంటే దాంట్లో పెట్టారని కాదు), ఎక్స్కర్షన్ ద్వారానండిబాబూ.ప్రొద్దుటే వెళ్తే సాయంత్రానికి వచ్చేయడమే. ఆ మర్నాడు చూసివచ్చిన దానిమీద ఓ కాంపోజిషన్ వ్రాయమనేవారు, అదొక్కటే బాగుండేది కాదు !!కాలెజీ కి వచ్చిన తరువాత బైయాలజీ, జూఆలజీ వాళ్ళూ ఎక్కెడెక్కడికో , అవేవో ఆకులూ, అలమలూ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. లెఖ్ఖల వాళ్ళం కాబట్టి అలాటివేమీ
ఉండేవి కావు. దానితో ఏమయ్యిందంటే అదేదో ఈస్థటిక్ సెన్స్ అంటారు, అది నాకు వంటబట్టలేదు.అలాటిది ఉండాలంటే పెట్టిపుట్టాలండి బాబూ. అప్పుడెప్పుడో అమ్మాయీ, అల్లుడూ మమ్మల్ని,
తాజ్ మహలూ అవీ చూపించడానికి తీసికెళ్ళారు.అంతకుముందరే రెండు మూడు సార్లు ఆగ్రావెళ్ళాను ఒక్కడినీ ( ఫాక్టరీ పనిమీద). ఆగ్రాదాకా వెళ్ళి తాజ్ మహల్ చూడలేదంటే తిడతారని భయం!! అందుకోసమని అక్కడికి వెళ్ళాను.అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు, మన వెనక్కాల పడి, అన్ని రకాల ఫోజుల్లోనూ ఫోటోలు తీస్తామంటారు. మనం తాజ్ మీద ఉన్నట్ళూ, తాజ్ మన చేతిల్లో ఉన్నట్లూ వగైరా వగైరా..అవన్నీ తీయించుకున్నాను, వెళ్ళినట్లు ఫ్రూఫ్ ఉండాలిగా, పైగా తాజ్ చూసివచ్చామంటే అదో స్టేటస్ సింబలూ. నాకైతే తాజ్ ఏమీ పేద్దగొప్పగా అనిపించలేదు, అలా అంటే డొక్క చీరేస్తారు. అందువలన ఏవేవో మాటలు చెప్పవలసివచ్చింది ‘ఇట్ వజ్ బ్యూటిఫుల్’నథింగ్ లైక్ దట్ ఇన్ ద వల్డ్ ‘ (అక్కడికి ప్రపంచంలో ఉన్నవన్నీ చూసేసినట్లు!!).ఇలాటి ఫాల్తూ ఖబుర్లు చెప్పెసి తీయించుకున్న ఫొటోలు చూపిస్తే గొడవ వదిలిపోతుంది !!

    అందుకనే ఎక్కడికైనా వెళ్ళడానికి అంత ముందుండను. మా ఇంటావిడకి అలా కాదే. తనకి ఈ ఈస్థటిక్ వ్యవహారం ఎక్కువ. ప్రతీదాంట్లోనూ అదేదో కనిపిస్తూంటుంది. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, ఎక్కడికీ వెళ్ళలెదు. పిల్లలూ, చదువులూ అంటూ వెర్రిమొర్రి వంకలు పెట్టి.ఎప్పుడైనా వెళ్ళినా తిరుపతీ, లేకపోతే ఇంటికీ ను.ఇప్పుడనిపిస్తూంది, నన్ను ఎలా భరించారో అని!!
మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళవలసి వస్తే, విజయవాడ దాకా ట్రైన్ లో వెళ్ళి, అక్కడినుండి బస్సులో తణుకు వెళ్ళేవాళ్ళం.స్టేషన్ లో దిగ్గానే, పోనీ ఆటోలో వెళ్ళొచ్చుగా, అబ్బే, అదేమిటో సైకిల్ రిక్షాలోనే ఆపసోపాలు పడుతూ, మేమూ, సామాన్లూ,ఇద్దరుపిల్లలతో బస్ స్టాండ్ దాకా వెళ్ళడం. అసలు ఆటోలో హాయిగా వెళ్ళొచ్చూ అనే ఆలోచన ఎందుకు వచ్చేది కాదో? తణుకు బస్ స్టాండ్ లో దిగి, మళ్ళీ సైకిల్ రిక్షా !! అప్పుడప్పుడు మా పిల్లలు ఇప్పుడు అడెగుతూంటారు–‘డాడీ ఆంధ్రాలో ఇంకా సైకిల్ రిక్షాలున్నాయా’అని.చెప్పానుకదండీ, మానసికంగా ఎదగాలంటే
ఎంతో పుణ్యం చేసికోవాలి.నాలాటి వాళ్ళు ఎప్పుడూ ఎదగలెరు.పోనీ జీవితంలో చేయవలసినవి అన్నీ పూర్తయ్యాయికదా, ఇప్పుడైనా సుఖపడొచ్చుగా, అబ్బే, ఇప్పటికీ బయటకు నేను ఒక్కడినీ వెళ్ళవలసివస్తే, నడకా,బస్సూ, లెక లోకలూ. అంతేకానీ ఎప్పుడూ ఒక్కడినీ ఆటో ఎక్కను. కొంతమందికి సుఖపడే యోగం ఉండదుట.మా ఇంటావిడనిమాత్రం ఎప్పుడూ ఆటోలోనే తీసికెళ్తానండోయ్.

    ఇప్పుడు పూణే వచ్చేసిన తరువాత, టైమున్నప్పుడు, వీకెండ్స్ లో ఎప్పుడైనా పిల్లలు ఎక్కెడెక్కడికో తీసికెళ్తూంట్టారు.వాళ్ళతో పాటు వెళ్ళడం,’ఆహా ఓహో ‘అనడం తప్పించి, నా బుర్రలో ఏమీ పడదు.అందులో వాళ్ళందరికీ కనిపించే అందాలు అదేమిటో నాకు చచ్చినా కనపడవు.నా దారిన నేనేదో పడిఉంటాను. మా ఇంటావిడకైతే ఆ ప్రకృతి చూసేటప్పడికి ఇంక ఒళ్ళు తెలియదు.పోన్లే పిల్లలద్వారా అయినా తన కోరికలు తీరుతున్నాయీ అనుకుంటూంటాను.

   ప్రతీ భార్యా, తన భర్తతో స్కూటర్ మీదైనా,కారులోనైనా, ఆఖరికి సైకిలు మీదైనా వెళ్ళాలనిఉంటుంది. తను చేసికున్న అదృష్టమేమిటో, నాకు సైకిలు కూడా రాదు.అందువలన ఆ కోరిక కూడా తీరలేదు!!

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పనిమనిషి

& nbsp;   ఈ వేళ ప్రొద్దుటే మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాము.12 గంటలకి, వెళ్ళి ఓ గంటన్నర కబుర్లు చెప్పుకున్నాము.సాయంత్రాలు వెళ్దామంటే ఏదో ఒక పనీ, ఆ తరువాత ట్.వీ. సీరియళ్ళూ
ఆ తరువాత భోజనం. అస్సలు కుదరడంలేదు.అప్పుడు మా వయస్సులో ఉండే వారి ‘భవ బంధాలు’ గురించి మాట వచ్చింది.

    అన్నిటిలోకీ ముఖ్యమైన భవ బంధం ఏమిటంటే పనిమనిషి. అది ఎప్పుడు వస్తుందో భగవంతుడుకి కూడా తెలియదు.ఎలాగూ వస్తుంది కదా అని, భోజనాలు అయిన తరువాతి గిన్నెలూ వగైరా ఉంచుతారు.ఇల్లు తను వచ్చి తుడుస్తుంది కదా అని వదిలేస్తారు.తను కనుక రాకపోతే ఉంటుంది గొడవ.ఒక రైలు లేట్ గా వస్తే మిగిలిన రైళ్ళన్నీ లేటైనట్లు, అన్నిపనులూ ( వంట వండడం తో సహా)ఆలశ్యం అయిపోతాయి.

    రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ ఆఖరి 3 నెలలూ మాకు పనిమనిషి లెదు.అలాగని మిగిలిన ఏడాదీ మా ఇంటావిడ ఏమీ సుఖపడిపోలేదు.పనిమనిషిని ప్రొద్దుటే పెందరాళే వచ్చేయమని చెప్పడం తో వచ్చాయి బాధలు.మనవైపు ‘వెలుగు’ తొందరగా వచ్చేస్తుంది కదా, అందువలన ఎప్పుడు మెళుకువ వస్తే మా ఇంటికి వచ్చేసేది.బయట చూస్తే వెలుగొచ్చినట్లుగా కనిపించదు, బెల్లు కొట్టేరు కదా అని తలుపు తీస్తే పనిమనిషి. ఆ చీకట్లోనే ఏదో తుడిచేసి వెళ్ళిపోయేది. మా ఇంటావిడకేమో, ఇల్లు ‘అద్దం’ లా ఉండకపోతే కుదరదు.ఇంకో గొడవ ఏమిటంటే ‘అయ్యగారు
( నేనే అని తరువాత తెలిసింది) పొడుక్కున్నారు కదండీ, అని మా రూం తుడిచేది కాదు. ఓ వారం రోజులు ఊరుకుంది, ఇలా కాదని,తనతో పాటు నన్ను కూడా లేపేసేది.రాత్రి ఏదో చదువుకుంటూనో, బ్లాగ్గులు వ్రాసుకుంటూనో చాలా సేపు మెళుకువగా ఉండే వాడిని, తెల్లారకుండా నన్ను లేపేసేది. చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడూ, తెల్లవారుఝామున లేచిన పాపాన్ని పోలేదు.

    సగం బట్టలు మెషీన్ లోనే ఉతికేది,కొన్నింటిని పనిమనిషికి ఇచ్చేది.వాళ్ళేమిటీ, పౌడర్ ని చాలా ఉదారంగా వాడేస్తారు.అలాగే అన్నినూ. వీటికి సాయం ప్రొద్దుటా, మధ్యాన్నం చాయ్ ఒకటి.అది తాగడానికే మా ఇంటికి అంత ప్రొద్దుటే వచ్చేసేదేమో అని నా నమ్మకం.మా ఇంటావిడ ఓ సారి తణుకు వెళ్ళినప్పుడు, నేను ఒఖ్ఖడినే ఉన్నాను, ఆ నాలుగు రోజులూ రాలెదు. వచ్చిన తరువాత అడిగింది ‘ప్రొద్దుటే వచ్చి పాచి చేసి ముగ్గు ఎందుకు వెయ్యలేదూ’ అని ( నన్ను కాదండి బాబూ, పనిమనిషిని). ‘అయ్యగారు వేసేసుకుంటారేమో అని’ ఓ తలతిక్క సమాధానం చెప్పింది.అంతే, ఆ పనిమనిషిని డిస్మిస్స్.

    ఇంకో సంగతి,దసరా కోసారీ, దీపావళి కోసారీ బక్షీసు ఇవ్వాలి. కనీసం ఓ చీరైనా ఇవ్వాలిట, అదీ కాటన్ ది కాదు. వామ్మోయ్ ఎన్ని కండిషన్ లో!తను ఎప్పుడైనా మానేస్తే దబ్బు కట్ చేయకూడదు,టోటల్ బ్లాక్ మెయిల్ !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-తెలుసుకోండి

20091120b_00812500520091120b_008125004

చదవండి ఎవరో ఒకరికి ఉపయోగిస్తాయి

బాతాఖానీ-లక్ష్మి ఫణి కబుర్లు–క్షవర కష్టాలు

   చిన్నప్పుడు,అంటే కాలేజీ లో చేరేముందర అన్నమాట,ఎప్పుడైనా క్షవరం చేయించుకోవాలంటే,,ఇంటికి వచ్చి చేసేవాడు–‘ఆస్థాన మంగలి’. అలాగే ఇళ్ళల్లో ఆస్థాన చాకలీ, పాలవాడూ, పనిమనిషీ అందరూ శాశ్వత సభ్యులే.ఇళ్ళల్లో ఏమైనా శుభ కార్యాలయితే, వాళ్ళని కూడా పిలిచి,అన్నం,కురలూ, పిండివంటలూ ఇచ్చేవారు. ఇంట్లో ఏదైనా పురుళ్ళు వస్తే ‘ఆస్థాన చాకలి’ది ముఖ్య పాత్ర.

మనం ఎప్పుడు క్షవరం చేయించుకోవాలన్నది మన ఇష్టాఅయిష్టాల మీద ఆధార పడి ఉండేది కాదు. ఇంట్లో ఎప్పుడు చెప్తే అప్పుడే.అరుగు మీద కూర్చోపెట్టి ‘అంట కత్తెర’ వేయించేవారు. ఆ బట్టలతో లొపలికి వెళ్ళనిచ్చేవారు కాదు, స్నానం అయిన తరువాతే లోపలికి వెళ్ళడం. శీతాకాలం లో చాలా కష్టాలతో కూడిన పని ఇది.క్రింద పొట్టిలాగు మాత్రమే వేసికోవాలి, పైన ఏమీ ఉండకూడదు. మంగలి క్షవరం చెసేటప్పుడు,జుట్టుమీద చల్లే నీళ్ళు వంటిమీద పడి చలేసేది. కొంచెం చదువులూ, వయస్సూ పెరిగిన తరువాత, ‘అరుగు’మీద నుండి, ప్రమోషన్ వచ్చి కాంపౌండ్ లో కుర్చీ వేసికొని చేయించుకోవచ్చు.పైన బనీను లాటిది కూడా వేసికోనిచ్చేవారు.అయినా స్నానం తరువాతే లొపలికి ప్రవేశం.

ఇలాటి కష్టాలన్నీ దాటుకుంటూ, అమలాపురం వదిలి, పూనా లో ఉద్యోగానికి వచ్చేనండి. అక్కడ రైల్వే స్టేషన్ కి ఎదురుగా, వరసలో, ఈ బార్బర్లు కూర్చునేవారు. రోడ్డు కి ప్రక్కగా వీళ్ళు ‘పొది’ పెట్టుకుని ఎదురుచూసేవారు. ఆ వచ్చినవాడి, ‘తల’ ని తన కాళ్ళ మధ్యలో పెట్టేసికొని, చకచకా 5 నిమిషాల్లో చేసేయడమే.నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేదనుకోండి. పూనా కాంప్ లో ‘ఎంబాసిడర్ సెలూన్’ అని ఒక ఏ.సీ. ది ఉండేది.ఇంట్లో కాకుండా, బయట షాప్పుల్లోనూ క్షవరాలు చేస్తారని అప్పుడే తెలిసికొన్నాను.ఎంతైనా ‘కోనసీమ’ దాటి బయట ప్రపంచం చూసింది తక్కువ అప్పటికి !!ఆ ఏ.సీ. సెలూన్ లోకి వెళ్ళగానే, వాడు నా ఎదురుగా ఓ ఆల్బం పెట్టి ఎలాటి స్టైల్ కావాలన్నాడు.
అప్పటిదాకా, ఏదో ‘అంట కత్తెర’ క్రాఫు లతో లాగించిన వాడికి ఈ విషయాలన్నీ ఏం తెలుస్తాయి? ‘ నీకు తోచినదేదో చేసేయ్’ అన్నాను.వాడు ఏవేవో మషీన్లూ అవీ, తిప్పేసి పూర్తయిందనిపించాడు. చేతికి బిల్లు ఇచ్చేటప్పడికి, గొంతుకు ఆరిపోయింది. జేబిలో ఉన్నవి 20 రూపాయలు మాత్రమే, అందులో వాడు 18 రూపాయలు తిసేసికున్నాడు.1963 ప్రాంతాల్లో 18 రూపాయలకి చాలా విలువ ఉండేది. ఇంటి అద్దే నెలకీ 35 రూపాయలే.మళ్ళీ ఇంకెప్పుడూ అలాటి హైఫై సెలూన్ లలోకి వెళ్ళలేదు. దీనితో తరువాతి ఆరు నెలలూ క్షవరం చేయించుకోలేదు.ఇంకో సంగతి– అప్పటికింకా షేవింగ్ కూడా మొదలెట్టలేదు !!జీతమూ పెరిగేది కాదు, జుట్టూ పెరిగేది కాదు ! ఎవరైనా మంచి ‘మీసకట్టు’ తో ఉంటే వాళ్ళలాగ నాకెప్పుడొస్తుందీ అనుకునేవాడిని !!

ఇంక ప్రస్తుత కాలానికొస్తే, క్షవరం చేయించుకోవడానికి, నెత్తిమీద ఏమీ మిగల్లేదు.ఆ ఉన్న కొన్నిటినీ ఏ రెండు మూడు నెలలకో ఓ సారి తీయిస్తూంటాను.నేను చెప్పొచ్చేదేమిటంటే,సెలూన్ లోకి వెళ్ళి కూర్చోగానే, కళ్ళజోడు తీసేసి పక్కన పెట్టేయాలి, వాడు అదేదో ఫ్రెష్ గా ఉన్న లుక్ ఇచ్చి, ఓ గుడ్డ మన మెడకేసి బిగించేస్తాడు. దురద పెట్టినా గోక్కోవడానికి వీలుండదు, కదలకూడదూ,ఆ హింస ఓ అరగంట భరించాలి. వాడు చేసే ‘మసాజ్’ మాత్రం చాలా ‘శవన’ గా ఉంటుంది. రోజూ ఎవడైనా చేస్తే ఎంత బాగుంటుందో !! అన్నిటిలోకి, ఆఖరి కార్యక్రమం, వాడు మనమీద కప్పిన తెల్ల గుడ్డ తీసే ముందర-ఓ అద్దం తెచ్చి మన వెనక్కాల పెట్టి చూపిస్తాడు. కళ్ళజోడు లేకుండా ఏం కనిపించి ఛస్తుందీ? అయినా మనం తల ఉపేదాకా వాడు అద్దం తీయడు !!వీడి గొడవ భరించలేక , ఓ సారి తల అటూ ఇటూ ఊపేస్తే, వాడు హాప్పీ.అన్నింటిలోకీ నాకు నవ్వోచ్చేది ఎక్కడంటే, ఉన్న నాలుగు వెంట్రుకలినీ దువ్వడానికి ప్రయత్నిస్తాడు!!

ఇంక ‘ తిరుపతి క్షవరం’ అయితే చెప్పక్కర్లెదు. మనం ‘దండి’ గా సంభావన ఇవ్వకపోతే అంతే సంగతులు !!