కొంతమందిని చూసే ఉంటారు.ప్రపంచంలోని కష్టాలన్నీ తామే భరిస్తూన్నట్లు మొహం పెడుతూంటారు. ఎప్పుడూ నవ్వనేది అస్సలు రాదు, ఆ మొహంలోకి. ఏమైనా నవ్వినా, పలకరించినట్లుగా చూసినా అవతలివాడు తనని ఏదో సహాయం అడుగుతాడేమోనన్నట్లు మొహం పెడతారు! నన్నుముట్టుకోకు నా మాలి కాకీ అన్నట్లుగా, వాళ్ళకి అవతలివాళ్ళ ఫీలింగ్స్ తో ఎటువంటి సంబంధమూ ఉండదు. అలాగని ఇంట్లోవాళ్ళతో ఏదో చనువుగా ఉంటారా అంటే అదీ లేదు.
అలాటివాళ్ళు భూమిమీద ఏం సాధించడానికి వచ్చారా అనిపిస్తూంటుంది ఒక్కొక్కప్పుడు. ఆఫీసులో ఏదో పేద్ద స్ట్రిక్ట్ గా ఉన్నట్లు ఓ ‘ఇమేజ్’ తయారుచేసికుంటారు.అందుకనే అలాటివాళ్ళకు ఏ కష్టమైనా వచ్చినా ఎవరూ పట్టించుకోరు. మనిషిని ‘ సోషల్ యానిమల్’ అన్నందుకు, అప్పుడప్పుడు బయటి ప్రపంచంలోవారి కష్టసుఖాల గురించికూడా తెలిసికుంటూండాలి.ఎప్పుడు చూసినా
ఏవో చలిచీమలో, ఎర్రచీమలో ఒళ్ళంతా పాకుతున్నట్లుగానే అనీజీ గా ఉంటారు.
ఎవడో ఒకడితోనైనా అలాటివాళ్ళు తమ విషయాలు పంచుకుంటారా? వాళ్ళింట్లో ఉన్న పిల్లలూ, భార్యా ఇలాటివాళ్ళని ఎలా భరిస్తున్నారా అనిపిస్తుంది! అయినా సరే వాళ్ళకేమీ నష్టం లేదు.వాళ్ళు ఎవరికీ సలహాలివ్వరూ, ఇంకోళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తే ‘ మైండ్ యువర్ బిజినెస్స్’ అంటారు. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకతనుండేవాడు. ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడగా చూడలేదు.ఎప్పుడైనా ఎవరైనా సంభాషించడానికి ప్రయత్నించినా హా హూ అంటూ మోనోసిలబుల్స్ లోనే సమాధానం చెప్పేవాడు.నేను పనిచేసే సెక్షన్ ( పర్చేజ్) తో అందరూ సంబంధాలు ఉంచుకునేవారు,వాళ్ళకి ఏవస్తువయినా కావల్సి ఉంటే నన్నే అడగాల్సొచ్చేది.అందువలన నాకు ఫాక్టరీ లో అందరితోనూ సత్సంబంధాలే ఉండేవి. ఈ పెద్దమనిషి నాకంటె నాలుగు సంవత్సరాలు ముందరే రిటైర్ అయ్యాడు. ఫాక్టరీలో ఉండగా ఫార్మాలిటీ కైనా ఒక్కసారైనా హల్లో చెప్పని మనిషి, ఈవేళ ప్రొద్దుట నాకోసం మా ఇంటికి వచ్చాడుట.అప్పుడు నేను మా రెంటెడ్ ఫ్లాట్ కి వెళ్ళాను.మా ఇంటావిడ ఫోన్ చేసింది, ‘ మీకోసం ఎవరో వచ్చారూ, మాట్లాడండి’ అని.
ఎవరా అని చూస్తే ఇదిగో ఈ పెద్దమనిషే. యు.ఎస్. వెళ్దామని వీసాకి ఎప్లై చేస్తే, ఇతను ఆఖరున పనిచేసింది ‘ఎమ్యునిషన్ ఫాక్టరీ’ అని చెప్పడంతోటే, ఛట్ ఇవ్వం పొమ్మన్నారు ఏ బిన్ లాడెన్ కో ఫ్రెండేమో అని! కాళ్ళా వేళ్ళా పడితే చెప్పారుట’ నీతో పనిచేసిన ఇద్దరి పేర్లూ ఫోన్ నెంబర్లూ ఇయ్యీ, వాళ్ళదగ్గర వెరిఫై చేస్తామూ’ అని. అందుకని, నా పేరివ్వచ్చా అని అడగడానికి వచ్చాడు. ఇక్కడ పూణే లో ఇంకా చాలామందే ఉన్నారు, అయినా ఎవడూ ఇతనికి సహాయం చేయడానికి తయారుగా లేరు. అందుకని ఇంకో దిక్కులేక నా దగ్గరకు వచ్చాడు !
నేను చెప్పొచ్చేదేమిటంటే మనిషన్నవాడు తను ఎంత గొప్పవాడిననుకున్నా ఎప్పుడోఒకప్పుడు ఇంకోళ్ళ సహాయం అడగాల్సివస్తుంది. మనమేదో ‘ఇన్విన్సిబుల్’ అనుకోకూడదు. ప్రతీ వాడితోనూ పూసుకు తిరగమనడం లేదు, ఓ చిన్న నవ్వు చాలు.ఎప్పుడైనా చూసినప్పుడు హలో అన్నా చాలు.అంతేకానీ, అవతలివాడితో మనకేమిటీ అని అనుకోకూడదు.ఉదాహరణకి మనం ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు బస్సులోనో ట్రైన్ లోనో మన పర్సు ఎవడో కొట్టేశాడనుకుందాం.అలాటప్పుడు, అక్కడ ఫుట్ పాత్ మీద బూట్లు పాలిష్ చేసే వాడే మనకి సహాయం చేయకలుగుతాడు. ఎందుకంటే అతను మనని ప్రతీరోజూ చూస్తూంటాడు ఆ దారిన వెళ్ళేటప్పుడు. అందుకనే ఎప్పుడో ఒకప్పుడైనా అతని వైపు ఓ పలకరింపు నవ్వు నవ్వేమనుకోండి చాలు.ఆ ఒక్క నవ్వు మనల్ని సేవ్ చేసేస్తుంది! అతనేమీ మన ఆస్థిమీద కన్నేయడు. చెప్పాలంటే వాళ్ళే మనకంటే సుఖంగానూ, హాయిగానూ ఉన్నారు. ఎలాటి ‘ఫాల్స్ ప్రెస్టీజ్ ‘ లూ లేకుండా!
కొంతమందుంటారు, వాళ్ళింటికి వెళ్ళేమనుకోండి, మనల్ని చూడగానే ‘వీడెందుకొచ్చాడురా బాబూ ‘ అనుకొని, మనం ఉన్నంతసేపూ ముళ్ళమీద కూర్చొన్నట్లుగానే ప్రవర్తిస్తాడు.ఆ పెద్దమనిషి,వాళ్ళావిడ బలవంతం మీద అక్కడ కూర్చుంటాడు.ఈ బాధ భరించలేక, మనం ‘ఇంక వెళ్ళొస్తామండీ’ అనగానే ఠక్కున ‘సరేనండీ’ అనేస్తాడు. ఇంక మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళే మూడ్ మనకి జన్మలో రాదు!
ఇంకొంతమంది ‘ఇటర్నల్లీ పెసిమిస్టిక్ సోల్స్’– వీళ్ళకి ఎప్పుడు ఏం చెప్పినా దానికి నెగెటివ్ గానే రియాక్ట్ అవుతారు.ఏదో మావాడు హైదరాబాద్ వెళ్ళడన్నామనుకోండి ఈయన వెంటనే ‘ జాగ్రత్తగా తిరిగి వస్తాడంటారా, అక్కడ గొడవలూ అవీ ఎక్కువగా ఉన్నాయిట’ అంటాడు. రేపటినుండి మా అబ్బాయికి టెన్త్ పరీక్షలూ అని చూడండి- ‘ ప్యాసు అవుతాడంటారా’. లేకపోతే
‘మా వాడు ఇంటర్ వ్యూకి ఢిల్లీ వెళ్తున్నాడు’ అనండి, ‘ ఏమిటీ ఉద్యోగానికే,మా చుట్టాలబ్బాయి అయిదేళ్ళనుండి ప్రయత్నిస్తున్నాడు, ఇప్పటిదాకా దొరకలేదు’ అంటాడు. ఆఖరికి మీవాళ్ళెవరో హాస్పిటల్ లో ఉన్నారనండి. ఈ పెద్దమనిషి ఆయనకి తెలిసిన ఎక్కెడెక్కడో ఏ ఏ హాస్పిటళ్ళకి వెళ్ళి తిరిగి రాని పేషంట్ల చిఠ్ఠా అంతా చెప్తాడు !
Filed under: Uncategorized | 3 Comments »