బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సెంటిమెంటల్ బక్రాలు…..

   మిగిలిన వారి గురించి అంత తెలియదు కానీ, ప్రపంచంలో మనంత సెంటిమెంటల్ బక్రాలు ఇంకెక్కడా ఉండరేమో అనిపిస్తూంటుంది. మనం పెరిగిన వాతావరణమంటారా, మనకి చిన్నప్పటినుండీ మన తల్లితండ్రులు చేసిన బ్రెయిన్ వాష్ అంటారా? నేనేమీ నాస్థికుడను కాను.దేముడంటే భయం భక్తీ కావలిసినంత ఉన్నాయి.వీలున్నప్పుడల్లా గుళ్ళకీ,గోపురాలకీ వెళ్తూంటాను. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది – దేముడి పేర మనల్ని ఎంతమంది,exploit చేసేస్తున్నారో, అన్నీ తెలిసికూడా మనం succumb అయిపోతున్నామో అని.

   దేశంలో ప్రముఖ దేవాలయాల్లో చాలా చోట్ల (ఎక్కడో ఒక్కటీ రెండూ తప్పించి), ఉత్తరభారతంలో పాండాలంటారనుకుంటాను వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఉద్యోగంలో ఉండేటప్పుడు ఒకసారి కలకత్తా వెళ్ళాను. ఇంతదూరం వచ్చాను కదా అని కాలీఘాట్ కి వెళ్తే, వామ్మోయ్ అక్కడ, మనతో, మన మొహం చూడగానే తెలుస్తుందనుకుంటాను కొత్తమొహాలు ఇవీ అని,ఆటాడేసికుంటారు.మనం అడిగినా అడక్కపోయినా, వాళ్ళే చొరవ తీసికుని, మనల్ని దర్శనం పేరుతో లాక్కుని పోతారు. అంతా పూర్తయిన తరువాత, వాళ్ళడిగిన డబ్బు ఇవ్వకపోతే, దెబ్బలాటా, మన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవాలని శాపనార్ధాలూ. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుని వాళ్ళు డిమాండ్ చేసినంతా చేతిలో పెట్టి చక్కా వస్తాము. ఏదో ఆ ఊళ్ళో ఉండేవారితో వెళ్ళాలి కానీ, ఒక్కళ్ళం వెళ్ళే ధైర్యం చేశామా, అంతే సంగతులు!

   కలకత్తా లో ఒకసారి ఇలాటి అనుభవం జరిగిందని, కాన్పూర్ వెళ్ళినప్పుడు, దగ్గరలో గంగా నది ఉందికదా,అని, పగలు వెళ్తే వీళ్ళ బాధ పడలేమూ అనుకుని, చీకటి పడ్డ తరువాత ఓ సైకిలు రిక్షా చేసికుని, గంగ ఒడ్డుకి వెళ్ళినా అదే అనుభవం. అప్పటికీ రిక్షా వాడు చెప్తూనే ఉన్నాడు, జాగ్రత్తా, ఏ పాండానీ దగ్గరకు రానీయకూ, వాళ్ళు నిన్ను పీల్చి పిప్పి చెసేస్తారూ అని.అందుకోసమని, అటూ ఇటూ చూసుకుని,ఆ చీకట్లోనే, నీళ్ళ దగ్గరకు వెళ్ళి, ఓ దండం పెట్టుకుని, కాళ్ళూ చేతులూ కడుక్కుని, నెత్తిమీద నీళ్ళు చల్లుకున్నానో లేదో, ఎక్కడినుంచో వచ్చేశాడోడు. దక్షిణ ఇవ్వాలంటాడు, అదేమిటీ నువ్వేమైనా సంకల్పం చెప్పావా, నేనెందుకివ్వాలీ అంటే వినడే, నోటికొచ్చినట్లు తిట్టడం, ఇది మా గంగామయ్యా,
ఇక్కడ ఎవరు నీళ్ళు జల్లుకున్నా మాకు దక్షిణ ఇవ్వాల్సిందే అంటూ దెబ్బలాట. పైగా అక్కడున్నవాళ్ళంతా పోగైపోతారు.దీనితో ఏమౌతుందీ అంటే, మనకి దేముడంటే భక్తి ఉంటే, ఏదో మన దారిన మనం ఇంట్లోనే పూజలు చేసికుంటే హాయి అనిపిస్తుంది.

   ఈ వ్యవహారం ఏదో ఉత్తర భారతానికే కాదు, మన అన్నవరంలోనూ ఇదే భాగోతం.వాళ్ళు నిర్వహించే దుకాణాల్లోనే పళ్ళూ పువ్వులూ కొనాలిట. అక్కడ కొబ్బరికాయ ఎలాగూ కొట్టనీయరు. ఆ దుకాణాలవాళ్ళు ఎంత రేటు చెప్తే అంతా ఇవ్వాలి. మనమేమైనా ప్రతీ రోజూ యాత్రలకి వెళ్తున్నామా, ఏదో జన్మానికో శివరాత్రన్నట్లు, ఎప్పుడో ఒకసారి వెళ్తామూ, ఈ మాత్రందానికే ఇంత గోలా అనొచ్చు కొంతమంది.నాకు తోచింది నేను చెప్పాను.ఆమధ్యనెప్పుడో పేపర్లలో చదివాను, ఇదివరకటి ట్రస్ట్ బోర్డ్ మీద ఏదో ఎంక్వైరీ అవీ పెట్టి, దుకాణాలకి టెండర్లు పిలిచి,ఎంతంత దోచుకున్నారో అవీ బయట పెట్టారుట.

   పోనీ ఇంట్లో ఏదైనా అమంగళం జరిగిందా, ఈ బ్రతికున్నవాళ్ళు బలైపోతారు! ఆ మాటా, ఈమాటా చెప్పి మనచేత, ఎంత కక్కించగలరో అంతా కక్కిస్తారు.ఈ వ్యవహారాలు జరిపించే ఆయన్ని, మళ్ళీ ఏడాది చూశామంటే ఏ ఇన్నోవాలోనో కనిపిస్తాడు. పైగా చాఫర్ డ్రివెన్ ! మనం ఇదివరకెలా ఉన్నామో అలాగే ఉంటాము.తల్లితండ్రుల మీద ఆమాత్రం అభిమానం లేదా, ఈమాత్రం దానికే అలా ఏడవాలా అనకండి. అభిమానం,ప్రేమా వేరు. ఆ పేరుతో, మనం బక్రాలైపోతున్నామే,దానిగురించి ఈ టపా. అక్కడికేదో నేను ఏదో రిఫార్మ్ చేద్దామనికాదు.ప్రస్తుతం ప్రతీదీ, ఎంత commercialise అయిపోయిందో అందరి దృష్టికీ తెద్దామని.ఎవరికీ ఈ సంగతులు తెలియవా అంటే, అదీ కాదూ. ఎవరికివారికే భయం, సెంటిమెంటోటి.ఏదో పోనిద్దూ, మన డబ్బేమైనా ఏమిటీ, పాపం ఆ పెద్దాయన సంపాదించిందేగా, ఆయన డబ్బు ఆయన గురించి ఖర్చుపెడితే తప్పేమిటీ, ఊరికే ఎదేదో వ్రాస్తూంటాడు కానీ, ఆయన మాత్రం, తన తల్లితండ్రులకి చేయలేదా,మనకి మాత్రం చెప్పొచ్చాడూ పేద్ద, అని కూడా అనుకోవచ్చు.

   అంతదాకా ఎందుకూ, ప్రొద్దుటే స్నానం చేసి, గుర్తున్న ప్రతీ దేముడికీ దండం పెట్టుకుంటాము. ఎవరిని మర్చిపోతే ఏం గొడవో అని!
సర్వేజనా సుఖినోభవంతూ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-One must come out of shell…

   గవర్నమెంటు ఉద్యోగంలో ఉన్నంతకాలం, మాకు ఆరోజుల్లో వచ్చే జీతాలతో, ఏదో అత్యావశ్యకమైన వస్తువులు తప్పించి, మరీ లగ్జరీ వస్తువులవైపు దృష్టి మళ్ళేది కాదు. అవే లగ్జరీ వస్తువులు ఈ రోజుల్లో నెసెసిటీస్ అయిపోయాయి, అది వేరే సంగతి.ఆరోజుల్లో, ఓ ఫ్రిజ్ కొనాలంటే, ఏ ఆల్వినో, గాద్రెజో,కెల్వినేటరో. అదికూడా 165 లీటర్లు. ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందీ అంటే, వాళ్లు ఓ క్లాసు పైన ఉండేవారు. ఫ్రిజ్ కొన్నారు కదా అని, దాన్నిండా ఏవేవో పెట్టేశారనుకోకండి, మా బాస్ ఒకాయనుండేవాడు, ఫాక్టరీ లో ఆఫీసరూ,మరీ సైకిలు మీదొస్తే బావుండదుకదా, అందుకోసమని, ఫాక్టరీ వాళ్ళిచ్చే లోన్ తో ఓ స్కూటరూ, అలాగే ఏదో తిప్పలు పడి ఓ ఫ్రిజ్జూ మొత్తానికి కొనేశాడు. ఫాక్టరీకి వెళ్ళి రావడానికి, ప్రభుత్వ వాహనం ఉండేది. ఎంత చెప్పినా, మనకి బ్రిటిష్ వాళ్ళిచ్చిన వారసత్వం ఏమిటయ్యా అంటే, ఇదిగో ఇలాటివే.గవర్నమెంటులో ఆఫీసర్లకీ, మిగిలినవాళ్ళకీ ప్రోటోకాల్ తేడాలూ, వాళ్ళకి ఎక్కువ ఫ్రింజ్ బెనిఫిట్లూ వగైరా వగైరా… ఇలా వ్రాసుకుంటూ పోతే, కొంతమందికి నచ్చకపోవచ్చు.అప్పుడెప్పుడో, విదేశాలకెళ్ళొచ్చిన వారిమీద, నాకు జెలసీ అన్నాడో ప్రబుధ్ధుడు, అలాగే, నేను క్లాస్ ఒన్ ఆఫిసరు కాలేదని జెలసీ అని అన్నా అనొచ్చు.ఎవరి అభిప్రాయం వారిది!ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళాను,ఎప్పటికప్పుడనుకుంటూంటాను, ఏ టాపిక్ మొదలెడితే దానిమీదే వ్రాయాలని, కానీ మధ్యమధ్యలో పిట్ట కథలొచ్చేస్తూంటాయి. Please bear with me.. ఫ్రిజ్జి గురించి కదా చెప్తున్నానూ, ఆయన ఫ్రిజ్ నిండా, ప్లాస్టిక్ కూరలూ, పళ్ళూ నింపేవాడు! నిజం, మేము కళ్ళారా చూశాము!

   ఈ టపా కి పెట్టిన పేరు చదివారుగా, క్రమక్రమంగా ఎప్పటికో అప్పటికి, మనం అంటే ఎస్పెషల్లీ నాలాటివాళ్ళు,చదువూ సంధ్యా అంతగా అబ్బక, మన ప్రభుత్వ రూల్స్ ప్రకారం, ‘ఆఫీసరు’అవలేకపోయిన– అలాగని పేద్ద చదువులు చదవకపోయినా, ప్రివిలేజ్డ్ ‘క్లాసు’ లో ఉండడం వలన ఆఫీసర్లూ అయ్యారు, ‘కొంతమంది’ అదృష్టవంతులు! అది వారు చేసికున్న అదృష్టం.No complaints ! దీనితో ఏమయిందీ,మనకి అంత తాహతు లేదేమో అనుకుని, ఏదో ఉడిపీ హోటళ్ళకీ, మామూలు కిరాణా షాప్పులకీ సీమిత్ అయిపోయాము. ఈ కిరాణా షాప్పులెందుకయ్యా అంటే, అరువిచ్చేవాడు కాబట్టి. ఓ పద్దుపుస్తకంలో రాసేసికుని, కావలిసినవేవో తెచ్చుకునేవాళ్ళం. నెలాఖరుకి, కట్లు పోగా చెతికి వచ్చిన డబ్బులతో, కిరాణా వాడికీ, పాల వాడికీ ఇచ్చుకోవడం.ఇవి కాకుండా, పిల్లల స్కూళ్ళూ, బట్టలూ, పుస్తకాలూ , పండగలూ పబ్బాలూ, ఏ నెలకో రెండు నెలలకో ఓ సినిమా, ఇవండీ ప్రయారిటీస్! ఏదో నా అదృష్టం బాగుండి, పిల్లల స్కూలు చదువులు, మేము వరంగాం లో ఉన్న సమయంలో పూర్తయ్యాయి. అక్కడ అంత ఖర్చుండేది కాదు.అసలంటూఏమైనా ఉంటే కదా ఖర్చుపెట్టడానికీ?

   ఇంకో అదృష్టమేమంటే, అప్పటికింకా ఈ ఆర్ధిక సంస్కరణలూ అవీ రాలేదు కాబట్టి, ఒక విధంగా బ్రతికి పోయాము!92-93 తరువాత మెల్లి మెల్లిగా, ప్రతీ రంగంలోనూ కాంపిటీషన్ మొదలయి, ప్రతీ వస్తువుకీ, ఓ అరడజను బ్రాండులు రావడం మొదలయింది.మొదట్లో ఈ వస్తువులన్నీ పెద్ద పేద్ద షాపుల్లో ( వాటినే ఇప్పుడు మాల్సో, సింగినాదమో అంటున్నారు!).ఏ మెట్రో నగరాలకి వెళ్ళినప్పుడో చూసే వాళ్ళం ఈ స్పెన్సర్లూ, అవీనూ.బెంగుళూరు వెళ్ళినప్పుడు ( మా అమ్మాయి మొదటి ఉద్యోగం) మొట్ట మొదటిసారి షాపర్స్ స్టాప్ చూసి, నోరెళ్ళబెట్టి చూస్తూ నుంచున్నాను! ఏ కిరాణా కొట్టులోనైనా ఓ వస్తువు ఖరీదు మరీ ఎక్కువ చెప్తే, ” అదేమిటోయ్, మరీ స్పెన్సర్ రేటు చెబుతున్నావూ?” అనేవారు.నా ఉద్దేశ్యమేమిటంటే, ఖరీదైన వస్తువుని స్పెన్సర్స్ రేటుతో పోల్చేవారు.

   రిటైరయే టైముకి, పిల్లల పెళ్ళిళ్ళూ పూర్తయ్యాయి, ఓ కొంపా అముర్చుకున్నాము,ఏదో మరీ మధ్యతరగతి అనుకోకుండా, పిల్లల ఉద్యోగాల ధర్మమా అని, కొద్ది కొద్దిగా ఆ ” మధ్య తరగతి వలయం” లోంచి, అప్పుడప్పుడు బయట పడేవాళ్ళం. అదైనా పూర్తిగా కాదు, ఎప్పుడైనా పిల్లలు ఏ ఫైవ్ స్టార్ హొటల్ కైనా తీసికెళ్తే,” ఏదో మామూలు హొటల్ కి వెళ్తే సరిపోయేదిగా..” అంటూ నస పెట్టేవాడిని!కాలూ, చేయీ ఒకచోటుండదుగా నాకూ, క్రమక్రమంగా, నేనూ స్వయంగా, మిస్టరీ షాపింగుల ధర్మమా అని, గత రెండేళ్ళుగా, left,right,centre ప్రతీ మాల్ లోకీ వెళ్ళడం,ప్రతీ వాడితోనూ interact అవడం. దీనితో ఏమయిందీ అంటే, నామీద నాకో విశ్వాసం ఏర్పడింది.ఎక్కడైనా ఎవరితోనైనా డీల్ చేసే నమ్మకం వచ్చింది.

   అక్కడికి, నేనేదో గ్రేట్ అయిపోయానని కాదు, ఇదో బ్రహ్మ విద్యేమీ కాదు. వీటికి ట్రైనింగులేమీ అఖ్ఖర్లేదు. Just self confidence.నాలాటివాడే హాండిల్ చేయకలిగినప్పుడు, నాకంటే, ఎక్కువ అనుభవమూ, వాక్పటిమా ఉన్నవాళ్లకి ఇది చాలా సులభం. ఒక్కసారి మన మధ్యతరగతి shell లోంచి బయటకు రావాలి అంతే!ప్రతీవారిలోనూ అంతర్లీనంగా ఈ గుణం ఉంది.బయటకు తీయాలి బస్! ఏదో సాదాసీదా బట్టలు వేసికున్నామూ, అలాటి ఫాషనబుల్ యేరియాల్లోకి వెళ్తే నవ్వుతారేమో, అక్కడ సేల్స్ చేసే అమ్మాయిలూ,అబ్బాయిలూ సూట్లలో ఉంటారూ అనుకోవద్దు. వాళ్ళు ఆ కొట్టు యజమానిస్తున్నాడు కాబట్టి వేసికుంటున్నారు, వాళ్ళు మనకంటే ఏమీ పొడిచేయలేదూ, అని ఒక్కసారనుకుని చూడండి. మీకే తెలుస్తుంది.
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అసలు ఆయన్ని ఎందుకు కలుసుకోవాలీ…

   అసలు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారిని “హాస్య రచయిత” అని ఎవరనమన్నారు? అప్పుడేమో కోతికొమ్మచ్చి వ్రాసి ఏడిపించారు, ఇప్పుడేమో, పేద్ద పనున్నట్లు వెళ్ళిపోయి ఏడిపిస్తున్నారు.. పాఠకుల పట్ల ఆ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలాగండి బాబూ? హన్నా! ఆయన వ్రాసినప్పుడు, వాటిని చదివి ,నవ్వి నవ్వి కడుపునొప్పులు తెచ్చుకుని ఏడ్చాం. పోనీ ఏదో సినిమాలు తీసికుంటున్నారుకదా అనుకుంటే, ఓ “కోతికొమ్మచ్చి” వ్రాసి, వాటిల్లోని కొన్నిటిని చదివి,ఎమోషనల్ అయిపోయి, గొంతుకలో ముద్ద దిగక,ఎవరితోనైనా పంచుకుందామనుకుంటే, ‘ఏదో’ గొంతుక్కి అడ్డం పడి మాట్లాడలేక,ఏడవడానిక్కూడా సిగ్గుపడక ఏడ్చాం!ఆతావేతా చెప్పేదేమిటంటే, ఆయనకి ఏడిపించడమే ఓ లక్ష్యం అనిపించింది.

    క్రిందటేడాది జూన్ 28 న, శ్రీ ముళ్ళ వెంకట రమణ గారెవరో, మేమెవరమో! ఆయనకున్న లక్షలాది అభిమానులలోనూ, మేమూ ఒకళ్ళమూ.అందరూ చదివినట్లే, మేము కూడా చదివేవాళ్ళం, ఓహో ఆహా అనుకునే వారం.మనకి ఎంతోమంది మీద అభిమానం ఉంటుంది. ఒక్కసారి వారిని చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాగని అందరినీ కలుసుకోగలుగుతామా ఏమిటీ? అందులోనూ, అలాటి ప్రముఖవ్యక్తుల్ని.

    ఏదో, ఆయన వ్రాసిన పుస్తకాలు చదివేవాళ్ళం, ఫలానా ఆయన మా తెలుగాయనా అని చెప్పుకునేవాళ్ళం.అక్కడితో ఆగిపోయేటట్లైతే గొడవే ఉండకపోను. మా అబ్బాయి చెన్నై ఎందుకు వెళ్ళాలీ, తనతో మేముకూడా వెళ్ళాలీ అనె అవకాశం ఎందుకు రావాలీ, వచ్చిందే అనుకోండి, ఆయనకు ఫోనెందుకు చేయాలీ, చేశానే అనుకోండి, ” పోవయ్యా నీలాటివారిని లక్షల మందిని చూశానూ, అందరినీ కలుసుకోవాలంటే టైముండద్దా, ప్రతీ కోన్ కిస్కా గాడూ ఫొను చేసేవాడే,మాకేమి పని లేదనుకున్నావా, ఫోను చెసిన ప్రతీ ఆల్తూ ఫాల్తూ గాళ్ళనీ ఇంటికి పిలవడానికీ…etc ..etc…” అని కోప్పడేసి ఫోను పెట్టేస్తే అసలు ఈ గొడవే ఉండేది కాదుగా.అందుకే అంటారు దేనికైనా ఘటన అనేదుండాలి అని.జీవితాంతం ఏడవాలని రాసిపెట్టున్నప్పుడు, ఎవరేం చేస్తారు?

   పోనీ ఆయనేమైనా మాకు ఏ పెద్దన్నయ్యో,పెదనాన్నో,చివరాఖరికి ఏ వేలువిడిచిన మేనమామో కూడా కాదు.Afterall ఓ సాదాసీదా,ఆం fan లము. ఈ మాత్రం దానికి, అంత ఆప్యాయంగా, మమ్మల్ని దగ్గరకు తీసికుని అంతసేపు ఖబుర్లెందుకు చెప్పాలీ? పైగా అక్కడున్నంతసేపూ, ‘అహో మా భాగ్యమూ’ అనుకుంటూ, మా కళ్ళను మేమే నమ్మలేక, నోరెళ్ళపెట్టుకుని, కళ్ళల్లో ఆనందాశృవులు నింపుకుని, ఏం మాట్లాడాలో తెలియక, అప్పుడూ ఏడుపే!అసలు ఇలాటివారు ఎందుకు వస్తారో తెలియదు.అక్కడ మేము గడిపిన ఆ అమృతఘడియలు, నెమరువేసికుంటూ వచ్చే పుట్టినరోజుకి తిరిగి కలుసుకోవచ్చులే అనుకున్నంతసేపు పట్టలేదు, ఏదో పనున్నట్లు వెళ్ళేపోయారు.

   ఏదో దేముణ్ణి కొలుస్తూంటాం, అలాగని ఆ దేముణ్ణి చూశామా పెట్టామా? ఏదో ఈ జన్మలో ఓ దేముణ్ణి చూసి స్పర్శించే అదృష్టం కలిగింది. పోనీ అదైనా పూర్తిగా ఆస్వాదించే భాగ్యం కలిగిందా, అబ్బే అదీ లేదు. అసలు 80 ఏళ్ళు అంత పెద్ద వయస్సా ఏమిటీ,చిత్రం కాకపోతే. ఎంతమంది, ఉండడం లేదూ? ఆయన్నేమైనా మణులడిగామా, మాణ్యాలడిగామా, ఊరికే అక్కడ ఉండండీ అన్నాము. ఈ మాత్రందానికే అంత గొప్పలు పోవాలా? మీదారిన మీరు నా ఫుటోకి దండలేసికుని ఏడవండీ అని తనదారి తను చూసుకున్నారు.

   పైన పెట్టిన ఫొటో, శ్రీ వెంకటరమణ గారి శ్రీమతి, శ్రీదేవిగారు తీసినది. ఏం చేస్తాం, ఆ ఫొటో చూసుకుంటూ గడిపేస్తున్నాం !
This is my humble tribute to my GOD !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఉద్యోగం లో ఉండేటప్పుడే బావుండేదనిపిస్తూంటుంది. ఏదో వేళకి నిద్రలేవడం,ప్రొద్దుటే డ్యూటీ కి వెళ్ళి,అక్కడే భోజనం గట్రా ( మా ఇంటావిడిచ్చిందే !) పూర్తిచేయడం, సాయంత్రం ఏ ఏడింటికో కొంప చేరడం.ఓ రెగ్యులారిటీ ఉండేది. రిటైరయిన తరువాత, చెప్పేనుగా ప్రతీవారూ అనుకుంటారూ, వీళ్ళకేమీ పనీ పాటా లేదు. అయినా ఎప్పుడు పలకరించినా, ఏదో దేశాన్ని ఉధ్ధరించినట్లుగా, మాట్లాడతారూ, ” లేదండీ, ఇవేళ అసలు టైము లేదూ, మా అగస్థ్యకి క్రెచ్ శలవూ,కోడలొక్కర్తే ఉంటుందీ” అనో, ” మా అల్లుడు బయటకెళ్ళాడూ, అమ్మాయీ పిల్లలతో కొంతసేపు గడపాలీ” అనో, ఏవేవో వంకలు పెట్టేస్తామని మా స్నేహితుల అపోహ! కానీ నిజం అదే !

   ప్రతీ శనాదివారాలూ, మా ఇంటికి వెళ్తూంటాము. మొన్న శనివారం నాడు జరిగిన కార్యక్రమం గురించి, ప్రత్యేకంగా ఓ టపా వ్రాస్తాను. అక్కడినుండి, రాత్రి వచ్చేటప్పటికే చాలా టైమైపోవడం వలన, మా ఇంట్లోనే ఉండిపోయాము. ఆదివారం కదా అని, అబ్బాయి ఎక్కడో ముల్షీ డాం కి వెళ్దామన్నాడు. ఇలాటివన్నీ మా ఇంటావిడకి భలే ఇష్టం! నాతో ఎలాగూ కుదరదూ, పిల్లలతో ఇలాటి కోరికలు తీర్చుకుంటూంటుంది. నాకు చెప్పానుగా, అంత ఈస్థటిక్ సెన్స్ లేదు. ఏదో ప్రకృతీ, సౌందర్యమూ,వగైరా వగైరా లన్నీ.నా కంఫర్ట్ లెవెల్ వేరూ. మీదారిన మీరు వెళ్ళండీ, నేను హాయిగా ఇంట్లో ఉంటానూ అని చెప్పేశాను.ఏం లేదూ, సాయంత్రం వంటావిడొచ్చినప్పుడు, చెప్పడానికి ఎవరో ఒకరు ఇంట్లో ఉండొద్దూ? బయటకెళ్ళాడం కంటే, ఈ డ్యూటీ హాయనిపించింది.

   రాత్రి భోజనం చేసేసిన తరువాత, అబ్బాయి మేముండే ఫ్లాట్ లో దింపేసి వెళ్ళిపోయాడు.మా ఇంట్లోనే ఉండేమాటైతే, ప్రొద్దుటే లేవాల్సివస్తుంది! మరీ నవ్య స్కూలుకి వెళ్ళేటైముదాకా లేవకపోతే బావుండదు కదా అసలు అదీ కారణం, రాత్రి ఎంతాలశ్యమైనా వచ్చేయడానికి. మరీ ఈ విషయం పిల్లలతో అంటే బావుండదుగా! ఈ వేళ ప్రొద్దుటే, అమ్మాయి ఫోనూ! ” నేనూ ఇక్కడే ఉంటున్నానూ అని ఏమైనా గుర్తుందా అసలు మీకు,అప్పుడప్పుడు నన్నూ, పిల్లల్నీ కూడా పలకరించొచ్చు” అని కోప్పడేసింది! నిజానికి, మా కోడలు ఆఫీసుకెళ్ళవల్సిన అవసరం ఉండడంతో, నేను, మా నవ్య స్కూలునుంచి రాగానే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చేదాకా కంపెనీ ఇమ్మని, నిన్ననే చెప్పారు పిల్లలు. ఈ విషయం, అమ్మాయితో చెప్తే, అయితే అమ్మను పంపెయ్ ఇక్కడకు, అంది.ఇంతలో తనే చెప్పింది, నేనే వచ్చి పిక్ అప్ చేసికుంటానూ అని. నన్ను మా ఇంటిదగ్గర దింపెసి, వాళ్ళమ్మను తీసికుని వెళ్ళింది.

   మా ఇంటావిడ దగ్గర ఓ సెల్ ఫోనుంది. అప్పుడెప్పుడో ఓ టపా కూడా వ్రాసింది.అప్పుడేమో అగస్థ్య ధర్మమా అని, సైలెంటయిపోయింది, ఏదో మళ్ళీ పని చేయడం మొదలెట్టింది కదా అని కొత్త ఫోను కొనే ప్రయత్నం వాయిదా వేశాను. నిన్న నవ్య ధర్మమా అని, మళ్ళీ సైలెంటయిపోయింది! అందుకే ప్రొద్దుట అమ్మాయి ఎన్నిసార్లు ఫోను చేసినా, వినిపిస్తే కదా,నాకు ఫోను చేసి, అమ్మ ఇంట్లో లేదా, ఫోనెత్తడం లేదూ అని అడిగింది.శుభ్రంగా ఉందీ అని నిన్నటి భాగవతం అంతా చెప్పాను. ప్రస్తుతానికి “అలంకారార్ధం గంధం సమర్పయామీ” లాగనే ఆవిడ సెల్ ఫోనూ!ఈసారి మార్చకపోతే, వీధిన పడిపోతాను!

   ఛాన్స్ దొరికినప్పుడల్లా మేముండే ఇంటికి రావడానికి ఇంకో కారణమేమిటీ అంటే, ఇంటావిడ చేసే వంట.అబ్బాయి వాళ్ళింట్లో వంటావిడ చేస్తుంది. ఏదో వారానికి ఒక్కరోజైతే ఫరవా లేదు కానీ ప్రతీ రోజూ తినడం నా వల్ల కాదుబాబూ!ఈవేళ, మెంతికూర పప్పూ, మజ్జిగ పులుసూ, తోటకూర పులుసూ చేసింది. ఏక్ దం బ్రహ్మాండం.అక్కడ ఆ వంటావిడా చేస్తూంటుంది, “ఖడీ” అని, మరాఠీ మజ్జిగ పులుసు లాటిది. కానీ దేని దారి దానిదే.మజ్జిగ పులుసు రుచే వేరు!

   సాయంత్రం మాకోడలూ, అగస్థ్యా వచ్చిన తరువాత, అమ్మాయి దగ్గరకు బయలుదేరాను, మా ఇంటావిడను తెచ్చుకోవద్దూ? ఇంతలో ఓ ఫ్రెండు, మా అమ్మాయీ వాళ్ళింటికి దగ్గరలోనే ఉంటున్నాడు, కారులో లిఫ్ట్ ఇచ్చాడు. అమ్మాయి చేతి వంట తినెసిన తరువాత, ఇదిగో ఇప్పుడే దింపేసి తిరిగి వెళ్ళింది. మొత్తానికి ఈ రోజంతా వాహనయోగమే !

   మరి ఈ కార్యక్రమాలన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా టముకేసికోగలనూ? చెప్తే నమ్మరూ, ఏదో పోజెడుతున్నామంటారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–డేట్ ఆఫ్ బర్తులూ కన్యూజన్లూ….

    ఈ మధ్యన మన ఆర్మీ ఛీఫ్ జనరల్ సింగ్ గారి డేట్ ఆఫ్ బర్త్ మీద ఒక దుమారం లేచింది. వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఆయన మొదట్లో 1950 లో పుట్టానని, చెప్పారుట, సర్వీసు రికార్డుల్లో 1951 అన్నారుట. ఎవడో పనీ పాటు లేనివాడు ఈ గొడవంతా బయటపెట్టాడు. మొదట ఇచ్చిన తేదీ ప్రకారం ఆయన క్రిందటేడాదే రిటైరవాలనీ, అన్యాయంగా ఇంకో డేట్ ఇచ్చి, ఇంకో సంవత్సరం ఎక్కువ సర్వీసు చేస్తున్నారనిన్నూ ప్రస్తుత సమస్య. ఆయనకి ఎన్నేళ్ళూ అనేది మనకనవసరం. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు, ఇందులో మనకి ఒరిగేదేమీ లేదు. ఆయన ఇంకా కొన్నాళ్ళున్నా, మనకి వచ్చే నష్టమూ లేదూ, వెళ్ళిపోతే వచ్చే లాభమూ లేదు. ఎలాగూ రిటైరయిన తరువాత ఎక్కడో గవర్నర్ గా వెళ్ళి,హాయిగా ఉంటాడు !

ఇప్పుడు నేను వ్రాసేది, మనలాటి ఆంఆద్మీల గురించి. 1960 ల ముందుగా పుట్టిన వారికి, అదీ మన ఆంధ్ర దేశం లో , పిల్లో పిల్లాడో పుట్టగానే, మున్సిపల్ ఆఫీసులకెళ్ళో పంచాయితీ ఆఫీసులకెళ్ళో registration వగైరాలుండేవి కావు.ఉన్నా, అలా సిన్సియర్ గా చేసిన దాఖలాలు లేవు! ప్రతీ వాడూ హాస్పిటళ్ళకెవడెళ్ళేవాడూ? ఏదో ప్రతీ పురిటికీ వచ్చే ఆస్థాన మంత్రసాని రావడం, పురుడు పోయడం, బొడ్డు కోయడం, తనకి వచ్చే బహుమతీ ఏదో తీసికుని వెళ్ళడమూనూ ! అయిదో ఏడొచ్చిన తరువాత బళ్ళో వేయడం, ఆడుతూ పాడుతూ పెద్ద స్కూల్లోకి వెళ్ళడం,అక్కడ ఫిఫ్త ఫారం లోకి వచ్చినప్పుడు, ఓ బుక్కుండేది-SSLC Book అని.అప్పుడు అవసరం అయేది, మన డేట్ ఆఫ్ బర్త్.పిల్లలకి ఉద్యోగంలో చేరినప్పుడు, ఎక్కువ సర్వీసుంటుందని,అప్పుడప్పుడు తక్కువెయ్యడమో, మళ్ళీ కాలేజీల్లో ప్రవేశం దొరకదేమోనని ఎక్కువెయ్యడమో జరిగేది. వీటివల్ల ఉపయోగాలూ ఉండేవి, నష్టాలూ ఉండేవి.

మరీ అంత చదువురాని తల్లితండ్రుల్ని, స్కూలు వాళ్ళు, మీ అబ్బాయి/అమ్మాయీ ఎప్పుడు పుట్టారూ అని అడిగితే, ” ఆయ్ గోదారికి పెద్ద వరదలొచ్చినప్పుడు పుట్టాడనో, లేకపోతే, ఏ గాలివానొచ్చినప్పుడో పుట్టాడనో’ చెప్పేవారు, అక్కడికేదో వరదల్లో కొట్టుకొచ్చిన శాల్తీ అన్నట్లు! ఇంక ఆ స్కూలు వాళ్ళే ఉజ్జాయింపుగా ఏదో ఒకతేదీ వేసేసి, వీడికి ఓ అస్థిత్వం కలిపించేవారు! కొద్దిగా మధ్యతరగతి వారిళ్ళల్లో, జాతకచక్రాలూ వగైరా వేయించే అలవాటుండేది కదా, అలాటి చోట్ల మాత్రం, ఇంట్లో వాళ్ళ దగ్గర తిథి, వార నక్షత్రాలతో సహా ఉండేవి.ఫలానా సంవత్సరం అని కూడా ఉండేది.

ఆరోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష కెళ్ళడానికి, ఈ రోజుల్లోలాగ 18 ఏళ్ళు నిండాలీ అనే రూలుండేది కాదు. అదేదో విద్యాశాఖాయన ఓ exemption certificate ఇచ్చేస్తే, మన దారిన మనం చదువూ సంధ్యా నిరాటంకంగా సాగించేయొచ్చు! ఈప్రకారమే నేను 14 ఏళ్ళకి ఎస్.ఎస్.ఎల్.సీ, 18 నిండకుండా పూణే లో ఉద్యోగానికీ వచ్చేశాను! ఏదో జ్ఞాపకం వచ్చిందేదో, ఫిబ్రవరీ 1945 అని వేయించేశారు, మా నాన్నగారు,అసలు డిసెంబరు 1944 అయితేనూ. రెణ్ణెల్ల తేడా అంతే! నాకొచ్చిన నష్టమేమిటయ్యా అంటే, 1962 లోనే చేరవలసిన ఉద్యోగానికి, ఇంకో రెణ్ణెల్లు 1963 ఫిబ్రవరి దాకా ఆగవలసి వచ్చింది. దానివలన ఏమైనా ఎడ్వాంటేజీలొచ్చాయా అంటే, వచ్చాయి మరి, 1962 బాచ్ వాళ్ళందరినీ, పూనా లో ఉంచకుండా,భండారా అని నాగ్పూర్ దగ్గరకి పంపేశారు. 1963 కాబట్టి, తరువాతి 20 ఏళ్ళూ పూనా లోనే ఉండే యోగమూ పట్టింది.దేనికైనా ఘటననేదొకడుండాలండి బాబూ.ఏది జరిగినా మన మంచికే అనుకుంటే పోలేదూ ?

1950 ల్లో ఆంధ్రదేశం లో పుట్టిన వారికి,అందరి విషయమూ నాకు తెలియదూ, నాకు తెలిసిన ఒకాయనకి, 1953 బదులుగా,1951 వేయడం వలన, ఆయన ఇంకో రెండేళ్ళు కాకుండా, ఈ సంవత్సరమే రిటైరవమన్నారు. ఏమిటి మాస్టారూ, మీగురించి పుస్తకాల్లో 1953 అని చదివానూ,వాలంటరీ రిటైర్మెంటా అని అడిగితే, కాదండీ, కాలేజీలో ఎడ్మిషన్ దొరకదని, మా నాన్నగారు ఓ రెండేళ్ళు తగ్గించి 1951 అని వేశారూ అన్నారు.

ఈ రోజుల్లో ఆ గొడవలే లేవు,పిల్లకో పిల్లాడికో కార్పొరేషన్ వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికెట్ తీసికోకపోతే, స్కూలూ లేదు,రేషన్ కార్డూ లేదూ, పాస్పోర్టూ లేదూ, కాలేజీ లేదూ, అల్టిమేట్ గా ఉద్యోగమూ లేదూ!మా అమ్మాయి 74 లో తణుకు లో పుట్టింది.ఏదో జాతకాలూ వగైరా రాయించడానికి తిథి,వారం నక్షత్రం ఉన్నాయి, కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ గొడవ తెలియదు. అప్పుడు మా మామ గారికి వ్రాస్తే, తణుకు పంచాయితీ ఆఫీసు కి వెళ్ళి, వాళ్ళు తెలుగులో వ్రాసి ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ పంపారు. ఆ తెలుగులో వ్రాసింది, ఇక్కడెవరికీ అర్ధం అవదూ, చివరకి, మా ఫాక్టరీ లో పనిచేస్తున్న ఓ తెలుగు ఆఫీసర్ గారిచేత ఎటెస్ట్ చేయించిన తరువాత నమ్మారు!

కానీ ఆ 1945, 1950 ల్లో పుట్టి, ఈ డేట్ ఆఫ్ బర్తుల గంద్రగోళంలో పడ్డ ప్రతీ వారికీ, ఓ రెండేళ్ళ ముందరే, ఉద్యోగాల్లోంచి రిటైరు చేసేసి,” వయోవృధ్ధులు” కింద మార్చేశారు. రిటైరయ్యారూ అంటే, మన ప్రాంతాల్లో, వారికి ఓ లేనిపోని పెద్దరికం ఇచ్చేసి, ఎక్కడలేనీ ఆంక్షలూ పెట్టేస్తారు.బయట ఓ మడతమంచం వేసికుని పడుక్కోడం,బయటకెళ్ళి కూరలు తేవడం, మనవల్నీ,మనవరాళ్ళనీ రిక్షాలో స్కూలుకి తీసికెళ్ళడం, ఎప్పుడైనా ఖర్మ కాలి భార్య దగ్గర కూర్చుంటే,అయ్యో,అమ్మో అంటూ బుగ్గలు నొక్కుకోడం, ప్రతీ వాడికీ లోకువే! పైగా ప్రతీవాడూ పలకరించేవాడే – ఏమిటి మాస్టారూ రిటైరయిన తరువాత కాలక్షేపం ఎలా అవుతోందీ- అంటూ. అసలు వాడికెందుకూ ఈయనకి ఎలా అయితేనేం, వెధవ్వేషాలానీ.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

<a

   టి.వి. లో న్యూసు చూద్దామంటే, ఏం చూపిస్తారూ-హైదరాబాద్ లో ఓ హై ప్రొఫైల్ హత్య జరిగిందిట. అందులో విక్టిం ఓ కేంద్రమంత్రి మేనకోడలు, నిందితుడు ఓ రాష్ట్ర మంత్రి చుట్టం. పుట్టపర్తి లో సత్యసాయిబాబా జీవించి ఉన్నంత కాలం,అక్కడ జరిగేవి ఏవీ ఎవరికీ తెలిసేవి కావు. ఇప్పుడో, రోజుకో విషయం బయట పడుతోంది. నిజంగా ఈ వార్తలు చూస్తూంటే కడుపు నిండిపోతూంది !
కరుణానిధేమో, వీలైనప్పుడల్లా తీహార్ జైలుకి వెళ్తున్నాడు, కూతుర్ని కలవడానికి, అసలు తను కూడా ఆ జైల్లోనే కూర్చుంటే పీడా విరగడైపోతుందిగా!ఆ కన్మొయి, తను ఓ స్త్రీ అదీ ఒక కొడుక్కి తల్లి కాబట్టి, బెయిల్ ఇమ్మంటోంది. మరి ఆ విషయం ఇదివరకు గుర్తు రాలేదుటా?

   కావ్యా విశ్వనాథన్ గుర్తుందా, 2006 లో ఓ పుస్తకం వ్రాసేసి, అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించేసింది. చివరకు తేలిందేమిటంటే, ఆ పుస్తకం ప్లాగరైజ్డ్ అని! పాపం, ఆ అమ్మాయి తల్లితండ్రులు ఈ మధ్య, విమాన ప్రమాదంలో మరణించారుట.
May their souls rest in peace.! ఇంక ఆ కావ్యా గురించి ఇక్కడ చదవండి.
మొన్న ఆదివారం నాడు జీ చానెల్ లో వస్తూన్న ఝాన్సీ కీ రాణీ, మొత్తానికి పూర్తయింది. ఏదో టీ.వీ ల్లో వచ్చే మిగిలిన సీరియల్స్ లా కాక, ఏదో చరిత్రకి సంబంధించింది కదా ని చూసేవాడిని.ఆ జీ వాళ్ళు, చరిత్రని ఎంతలా distort చేయగలరో,ఇక్కడ చదివితే తెలుస్తుంది.

   ఇవి కాకుండా, మామూలుగా న్యూసు చూసినా, చదివినా ఒకటే గోల.వాడెవడో ఆ పార్టీలో చేరుతాడూ, ఈ పార్టీ లో చేరతాడూ అని! ఫలానా వాడు అసెంబ్లీ/పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలీ అంటూ డిమాండ్లూ. వాళ్ళేమైనా వెర్రి వెధవలా ఏమిటీ, అంతంత ఖర్చు చేసి నెగ్గితే, ఎవరో అడిగారని రాజీనామా చేసేయడమే? పైసా వసూల్ చేసికోవద్దూ?

   ఐ.పి.ఎల్. మొదలెట్టినప్పుడు, మోడీ అంతటి వాడు లేడన్నారు. రెండేళ్ళు బాగానే వెళ్ళింది.అంతకు ముందు లాలూ ప్రసాద్ లాగానే, CEO of the year… వగైరా వగైరా.. బిరుదిలిచ్చేశారు. ఏదో గొడవలొచ్చాయి, వీధిన పడ్డారు,ఇదిగో ఇప్పుడు అదే మోడీ, ట్విట్టర్ లో లెఫ్ట్,రైట్ సెంటర్, బి.సి.సి.ఐ వాళ్ళని ఏకేస్తున్నాడు. మర్చేపోయాను తీహార్ జైల్లో కన్మొయి కొవ్వొత్తులు తయారు చేయడం నేర్చుకుందిట ! అబ్బ ఎంత పెద్ద న్యూసో?

   ఈవేళ మెయిల్ లో వచ్చిన ఫొటోలు పైన పెట్టాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అందుకే అంటారు..

   ఎప్పుడూ మనం ఒక రచయితని గురించి,ఆయన వ్రాసిన ఏదో ఒక పుస్తకాన్ని చదివేసో, వినో ఓ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు. నాకున్న దురలవాట్లలో అదీ ఒకటి లెండి. జీవితంలో ఎప్పుడూ అలాటి పని చేయకూడదనీ, ఓపికుంటే,చేతికొచ్చిన ప్రతీ పుస్తకమూ చదవాలని నిశ్చయించేసికున్నాను. అయినా మనకీ ఓ ఇష్టాఇష్టాలు కూడా ఉంటూంటాయి కదా.ఏదో ఓ genre మీద, చినప్పటినుండీ, ఒక ఇష్టం అనేది, ఏర్పరుచుకుని, అలాటివే చదువుతూంటాము. ఈ సందర్భం లో నాకు చాలా ఇష్టమైనవి, హాస్య/ తేలికపాటి (light) రచనలే. దానితోటి ఏమయిందీ అంటే, ఓ ముళ్ళపూడి వారివో, ఓ భరాగో గారివో,మొదట్లో వసుంధర గారివో తప్ప ఇంకేమీ చదివేవాడిని కాదు. వ్యాకరణం, ఛందస్సూ,సాహిత్యం, కవితలూ అనేవి నాకున్న కొద్దిపాటి ఐ.క్యూ. కి పట్టేవి కావు.

మా ఇంటావిడ, నాకు ఏక్ దం ఆపోజిట్.తన కి ఈస్థటిక్ సెన్స్ ఎక్కువా అని ఎప్పుడో చెప్పాను. చేతికొచ్చిన ప్రతీ తెలుగు పుస్తకమూ, చదివి, కాచి వడబొసేస్తుంది. అందుకే కాబోలు, ఆ పజిల్సూ,ప్రహేళికలూ అవీనూ.ఎప్పటెప్పటివో పాత పుస్తకాల్లోవి కూడా చేస్తూంటుంది. ఈ మధ్యన, ‘నవ్య’ వార పత్రికలో ఒక వ్యాసం శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి గురించి ఒక వ్యాసం చదివాను.అందులో రచయిత డా. ఆర్.అనంతపద్మనాభ రావుగారు, శ్రీ దువ్వూరివారి ‘the other side’ వ్రాశారు. నాకైతే నచ్చేసింది. అరే, శ్రీ దువ్వూరి వారు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండులూ, ‘రమణీయ వ్యాఖ్యానం’ అనే పుస్తకం వ్రాశారని విన్నాను కానీ, ఆయనలో ఇంత హాస్యం దాగి ఉందా అనుకుని, తొందరలో ఈ పుస్తకం, మా టెండర్ లీవ్స్ కి తెప్పించేయాలీ అనుకున్నంత సేపు పట్టలేదు-మా ఇంటావిడ ‘ఇప్పుడేమీ అర్జెంటుగా తెప్పించుకోనఖ్ఖర్లేదు. మన లైబ్రరీ లో ఇప్పటికే ఉందీ, అనడం తోనే, తెచ్చేసికుని చదవడం మొదలెట్టాను…..

శ్రీ దువ్వూరివారు, తన స్వీయ చరిత్రని వ్యావహారిక భాషలోనా, లేక ఆయనకి అలవాటైన గ్రాంధిక భాషలోనా వ్రాయడం అనే విషయమై ఆలోచించగా , “వెనకటికెవరో ఒకాయన బిచ్చగాడిని పొమ్మనటానికి, ” ఓయీ బిచ్చగాడా! తందులంబులిచ్చు వారిచ్చట నెవ్వరుం గానరారు,ఎచ్చటకేని చెచ్చర విచ్చేయుము” అనేవారుట.ఈ పధ్ధతి చాదస్తాన్నీ వికారాన్నీ సూచిస్తుందే కానీ, గ్రాంధిక భాషానురక్తిని సూచించదు.స్థానాస్థాన వివేచన అంతటా అవసరం.దేని చోటు దానికివ్వాలి.

వారి నాన్నగారి గురించి వ్రాస్తూ..“ఊళ్ళో అందరితోనూ ఎంత కలిసికట్టు తనం ఉండేదో ఇంట్లో అంత ముభావం. ఇంట్లో నవ్వు కనబడేదే కాదు.పోనీ మామీద ప్రేమ లేదనుకుందామా అంటే అమితమైన ప్రేమ.లోపల ఉన్నది వాత్సల్యం,పైకి కనబడేది తాటస్థ్యం”

తాళ్ళూరులో ఉన్నప్పుడు గొవిందమ్మ అనే ఒకావిడ ఉండేవారు. ఆవిడ గురించి చెబుతూ,ఆవిడ పధ్ధతుల్ని వర్ణించే విధానం చదవాలి గానీ, వ్రాస్తే అర్ధం అవదు. ఒక మచ్చు తునక–” ఇంట్లొని గదుల్లో గోడలకు బల్లరమర్చి ఇత్తడివి, కంచువీ పాత్రలూ,అంటే గిన్నెలూ,పళ్ళేలూ, చెంబులూ,గ్లాసులూ, ఒక రకం కాదు,దుకాణాల్లో ఉండే రకాలన్నీ తెప్పించి బల్లలమీద అందంగా పేర్చి ఉంచేది.ఓ బొమ్మలకొలువులా ఉండేది.ఐశ్వర్యం ఉండగానే సరికాదు, వస్తువులు కొనగానే సరి కాదు,ఏది ఎక్కడ ఉంచాలీ అనే చూపూ శ్రధ్ధా ఉండాలి.ఉన్నంత వరకూ సద్దుకునే దృష్టుంటే చాలు.దరిద్రుని ఇల్లైనా దర్శనీయంగా ఉంటుంది.అది లేకపోతే, ఐశ్వర్యవంతుని ఇల్లైనా అసహ్యంగా ఉంటుంది

తమ ఇంటిపేరు ఎలా వచ్చిందో వ్రాస్తూ..“మా ఇంటిపేరు ‘దువ్వూరి’ వారు. దువ్వూరు అనేది గ్రామ నామం. ఊరు శబ్దం ఔప విభక్తికం కావున, ‘ఇ’ కారం చేర్చి దువ్వూరి వారయ్యారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలూ,పెద్దలూ ఒకచోట చేరారంటే, కాలక్షేపానికి ‘అంతాక్షరీ’ అని పాడుకుంటూంటారు. ఆయన చదువుకునే రోజుల్లో ‘ కట్టు శ్లోకాలు’ అనే వారుట, ఆ శ్లోకాలు ఎలా నేర్చుకునేవారో వివరిస్తూ-కట్టు శ్లోకాలంటే- ఒకరు ఒక శ్లోకం మొదట చదువుతారు.దాని కొసను ఏ అక్షరం వస్తుందో అది మొదటి అక్షరంగా రెండవ శ్లోకం … అలా అన్న మాట.శబ్దాలూ,సమాసాలూ,వ్యాఖ్యాన విశేషాలూ,అమరం ఏకరువూ,వ్యుత్పత్తుల పరీక్షా, వగైరా..

అన్నిటిలోకీ మచ్చు తునక, శ్రీ దువ్వూరి వారు తమ భార్య గురించి వ్రాస్తూ వ్రాసిన మాటలు…”‘ఆపాటి చదువు రాకుండా ఉంటుందా అనుకున్నాను. కానీ ఆవిడకి ‘అ’ మొదలు ‘క్ష’ వరకూ అక్షరాలూ,ఒకటి మొదలు నూరు వరకూ తడుముకోకుండా అంకెలూ,జనవరి మొదలు డిశంబరు దాకా నెలలూ తెలియకుండానే 70 ఏళ్ళ సంసార చక్రం దొర్లించానంటే,విన్నవాళ్ళు ఆశ్చర్య పడతారు’ కానీ జాలిమాత్రం పడొద్దు. నేను సద్దుకోలేక చిక్కుపడితే కదా మీరు జాలి పడాలి….అక్షరాలు రాని లోపం అడుగడుగునా కనబడకపోలెదు కానీ,మనస్సు సరిపెట్టుకుంటే, తీరని లోపం ఏదీ ఉండదు.”

పైన ఉదహరించినవి కొన్ని ఆణిముత్యాలలాటివి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో వివరణలు,అభిప్రాయాలూ ప్రతీ పేజీలోనూ కనిపిస్తాయి. ఆత్మకథ అంటే ఎలా ఉండాలో వ్రాసి చూపించారు శ్రీ దువ్వూరి వారు. ఇంక చదివేసి ‘ఒహో ఇలాగుంటుందా..’ అనుకోవడం మన వంతు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అబ్బ..ఇంకా టైముందికదా…

   ఇదివరకటి రోజుల్లో,ప్రతీ పనీ ఓ ప్లాన్ చేసికుని చేసేవారు, ఒక్క పిల్లల్ని పుట్టించడం తప్పించి ! దానికి ఓ ప్లానూ వ్యవహారం ఉండేవి కావు! ఇంట్లో ఎంతమందుంటే అంత ఆనందం, సంతోషమూనూ! అలాగని ఆ పిల్లలు ఏదో గాలివాటానికి పెరిగినవాళ్ళు కాదు.పిల్లలంటూ ఉండాలే కానీ, ఓసారి వచ్చిన తరువాత, ఓ పధ్ధతి లోనే పెరిగారు.ఈమాట మాత్రం ఎవరూ కాదనలేరనుకుంటాను.

   ఇప్పుడు వ్రాసేది,ఈ రోజుల్లో చూస్తున్న last minute rush గురించి.ఎవరు చూసినా, పోనిస్తూ ఇంకా టైముందిగా అనేవాడే.ఉదాహరణకి, స్కూలుకెళ్ళే పిల్లల పుస్తకాలకీ, షూస్ కీ, స్కూళ్ళు తెరవడానికి, ఓ పది పదిహేను రోజుల ముందునుంచీ, కొనడానికి ప్లాన్ చేసికుంటే వచ్చిన నష్టమేమిటో, నాకైతే అర్ధం అవదు.సోమవారం స్కూళ్ళు తెరుస్తారంటే, ఆ ముందరి శనివారమే టైము దొరుకుతుంది, ప్రతీ వాడికీనూ.దాంతో ఏమౌతుందీ, అందరూ ఒక్కసారే ఊరిమీదకి పడేటప్పటికి, ఆ మాల్స్ లోనూ, పుస్తకాలూ, యూనిఫారాలూ, షూసూ కొనుక్కునే చోట ఓ పేద్ద రష్షూ! పార్కింగ్ కి ప్లేస్ దొరకదు. పైగా హైదరాబాద్ లాటి చోట్ల ఆదివారాలు కొట్లకి శలవుకూడానూ. ఇక్కడ (పూణె) లో, ఇంకా ఆ పరిస్థితి రాలేదనుకోండి, సోమవారాలు శలవు కొట్లకి.

   ఓ పదిహేను రోజుల ముందు ప్లాన్ చేసికుని కొనుక్కోవచ్చు కదా,షూస్సూ, యూనిఫారాల సైజులూ ఈ పదిహేను రోజుల్లోనూ ఏమీ తక్కువా ఎక్కువా అయిపోవు.ఇదేమైనా కాంప్లాన్ వాడి యాడ్డా ఏమిటీ? జస్ట్ జరుగుబాటు అంతే!అక్కడికి, ముందునుంచీ ప్లాన్ చేసికునేవాళ్ళు, తెలివితక్కువ దద్దమ్మలూ,పాత చింతకాయ పచ్చళ్ళ గాళ్ళూ, పల్లెటూరి బైతులూనూ, వీళ్ళేమో చాలా స్మార్టూ! ఆ స్కూలు తెరిచే ముందు శనాదివారాలు, ఏ ధర్నా మూలంగానో కొట్లు తెరవకపోతే ఉంటుంది, వీళ్ళ సంగతి! తూర్పుకి తిరిగి దండం పెట్టడమే!

   అలాగే ప్రయాణాల విషయంలోనూ అంతే, ఏదో ఫలానా టైముకి ఫలానా చోటకి ఏదో కార్యక్రమానికి వెళ్ళాలీ అని ముందుగా తెలిసినా సరే, ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వ్ చేసికోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ. ఈ రోజుల్లో, ఓక్లిక్కు ద్వారా ఏ టిక్కెట్టైనా మూడు నెలలముందరే చేసికునే సదుపాయం ఉండనే ఉంది, అయినా సరే, చివరి నిముషందాకా ఆగడం, ఏ తత్కాల్ కో ప్రయత్నించడం, లేదా, ఏ ఏజంటుకో ఇవ్వడం, అదీ కాదంటే బస్సులుండనే ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ శలవల సీజన్ లో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తూంటారు. క్రిందటి నెలలో, మా అబ్బాయి, నవ్యని తీసికుని రావడానికి, హైదరాబాద్ నుండి పూణే కి ఒక్కో టిక్కెట్టుకీ 1800/- ఇచ్చాడు.just daylight robbery !! ఇదే ముందుగా రిజర్వేషన్ చేయించుకునుంటే, వెళ్ళకపోయినా, ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేసికోడానికి మహ అయితే, ఎంతయుండేది?

   నాకు ఆ విమాన ప్రయాణాల సంగతి తెలియదు. అయినా వాటిల్లోనూ అదేదో block చేయించుకుంటారుట కదా? అలా చేయించుకున్నా, బాగానే ఉంటుంది. చెప్పానుగా ప్రతీ వాడికీ, ఆఖరి నిముషం దాకా వెయిట్ చేయడం లో అదో అలౌకికానందమనుకుంటాను. రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, స్టేషనొచ్చినప్పుడల్లా ప్లాట్ఫారం మీదకి దిగి ఓ పోజు పెట్టుకుని నుంచోడం, ట్రైను కదులుతూండగా ఎక్కడం, అందులోనూ, ఏ.సి.ల్లో ప్రయాణం చేసేవాళ్ళైతే మరీనూ! ప్రతీ వాడికీ తెలియొద్దూ, తను ఏ.సీ. లో ప్రయాణం చేస్తున్నాననీ, పైగా ఈ ఏ.సీ.బోగీల్లో, బయటివాళ్ళకి మనం కనిపించం కూడానూ! ఇదో స్టేటస్ సింబలూ!

   సిటీబస్సుల్లోనూ అంతే, ఫుట్ బోర్డ్ మీద వెళ్ళాడుతూ ప్రయాణం చేసే కొందరు ప్రాణులుంటారు. లోపల ఎంత ఖాళీ ఉన్నా సరే, ఆ ఫుట్ బోర్డ్ మీదే నుంచోడం. ముంబై లోకల్స్ వ్యవహారం వేరు, ఇక్కడ పూణె లో చూస్తూంటాను, లోకల్ ట్రైనులో, ఎంత ఖాళీ ఉన్నాకానీ, వేళ్ళాడుతూనే ప్రయాణం చేస్తారు.
ఈ లాస్ట్ మినిట్ రష్ గాళ్ళని భగవంతుడు కూడా బాగుచేయలేడు !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- కాలక్షేపం..

   మొన్ననో టపా వ్రాశాను, నాకు మిస్టరీ షాపింగ్ విషయంలో జరిగిన ఒక అనుభవం గురించీ.. ఆ వ్యవహారం ఓ కొత్త మళుపు తీసికుంది.చెప్పానుగా, SOTC వాళ్ళకి నన్ను ముందుగా 20,000 రూపాయలు ఎడ్వాన్సు గా కట్టమన్నట్లూ, ఆ తరువాత వాళ్ళు ఆ డబ్బుని రిఎంబర్స్ చేసేటట్లూ. నేనా ఒప్పుకునేది? అసలే కోనసీమ వాడిని,ఛట్ నేనేమీ ముందర డబ్బులు కట్టనూ పొమ్మన్నాను. ఆ ఏజన్సీ వాళ్ళకీ ఏవో డెడ్ లైన్లూ అవీ ఉంటాయి కదా, ఏదో మాట తేడా వచ్చి నన్ను వదులుకోడం ఎందుకనుకున్నారో ఏమిటో, ఓ ఫోను చేశారు. మేము ముందుగా నీ ఎకౌంటు లో 20,000 రూపాయలూ జమ చేస్తామూ, అదే డబ్బుని డ్రా చేసి, SOTC కి వెళ్ళి ఎడ్వాన్స్ గా కట్టేయ్ బాబూ అని!నాదేం పోయిందీ,ఏ.టి.ఎం కి వెళ్ళి ఆ డబ్బు డ్రాచేసి, అక్కడకు వెళ్ళి, ఆ ఇవాల్యుఏషన్ పూర్తి చేశాను. ఈ లోపులో ఓ Reebok స్టోర్ ది ఒకటిచ్చారు.

   మొన్న శనివారం, రోజంతా బిజీ బిజీ. ప్రొద్దుటే రాఘవేంద్ర మఠానికి వెళ్ళి, మా అమ్మగారి ఆబ్దీకం (తిథుల ప్రకారం) పెట్టుకున్నాను.ఎంతచెప్పినా, మనవైపు పెట్టుకున్నట్లుండదు. అక్కడో జోక్కూ- నాతోపాటే, వాళ్ళ నాన్నగారి అబ్దీకం పెట్టుకోడానికి ఒకాయన వచ్చారు. ఆయనతో పాటుగా ఆయన భార్య,కొడుకూ( కాలేజీ కెళ్ళేవాడనుకుంటా),కూతురూ కూడా వచ్చారు. వాళ్ళ నాన్న చేస్తున్నంత సేపూ, ఆ అబ్బాయి జాగ్రత్తగా అన్నీ observe చేస్తూ, అన్నం పళ్ళెం తెచ్చుకోడానికి, ఆయన క్రిందకు వెళ్తూంటే, ఆ అబ్బాయి కూడా లేచేసరికి, ఆవిడ, ‘ఏం లేవనఖ్ఖర్లేదూ, ఇదేమైనా డ్రెస్ రిహార్శల్ అనుకున్నావా ఏమిటీ..” అని గదమాయించడం !!

   మొన్న పదిహేనో తారీఖున మా నవ్య పుట్టిన రోజుకి, మా సొసైటీ లో ఉన్న వాళ్ళకి పార్టీ ఇచ్చింది. చెప్పానుగా, ఎవరినీ గిఫ్టులు తేవద్దని చెప్పారూ అని.కానీ ఆ వచ్చిన పిల్లలందరికీ, మా కోడలు పైన ఫొటోలు పెట్టానే, ఆ సాప్లింగులు ఇచ్చింది. ఆ కార్యక్రమంలోని రెండో భాగం, నిన్న ఆదివారం వాళ్ళ స్కూలు ఫ్రెండ్సందరికీ నిన్న చేసికుంది.అంతా హడావిడి! వామ్మోయ్ వాళ్ళు పిల్లలా పిడుగులా? ఆ సందడంతా భరించే ఓపిక లేక, నేను ప్రొద్దుటే బయటకు వెళ్ళిపోయాను.మా ఇంటావిడ మాత్రం అగస్థ్య ని చూడ్డానికి, అక్కడే ఉండిపోయింది. ఇంక అబ్బాయీ కోడలూ, వచ్చిన పిల్లల్ని చూడ్డంతోనే సరిపోయింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఒక ఆసక్తికరమైన నివేదిక…

హెల్ప్ ఏజ్ ఇండియా వారు ఒక సర్వే నిర్వహించి, ఒక ఆసక్తికరమైన నివేదిక సమర్పించారు.. ఒకసారి ఓపిగ్గా చదివి ప్రతీవారూ ఆత్మశోధన చేసికోవలిసిన సమయం వచ్చిందని నా అభిప్రాయం. 147, 148 నెంబర్ల పేజీలు తప్పకుండా చదవండి.. ఏదో ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ
ఏడాదికోసారి తల్లితండ్రులకి ఓ బొకే, ఓ గిఫ్టూ ఇచ్చేసో, ఓ టపా వ్రాసేసో, ఊరుకోవడం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో అస్సలు ఖర్చు లేని పని–ఒకసారి పలకరించడం !