బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గృహ నిర్భంధం-a.k.a House Arrest!

    ఎప్పుడైనా ఓ కాలికో,చేతికో నొప్పొచ్చి సమస్యొచ్చిందనుకోండి,అప్పుడనుకుంటాం, ఇలా కాలికి రాకుండా, ఇంకోదానికేదైనా వచ్చినా బాగుండును,ఎలాగోలా ఓర్చుకోవచ్చూ అని.అలాగే పిప్పి పన్ను నొప్పెట్టిందనుకోండి, మరణ బాధ పడాలి.ఇప్పుడూ పళ్ళే లేవుకనుక,ఆగొడవే లేదు!ఉన్నప్పటి ఫీలింగులెండి ఇది.అందువలన మన శరీరంలో ఎక్కడ సమస్యొచ్చినా, ప్రతీవాడూ ఆలోచించే పధ్ధతి ఇదే.అయినా అనుకుంటాంకానీ, దేనికదే, కాళ్ళూ చేతులూ సరీగ్గా ఉన్నంతకాలమే, మనం వేసే వేషాలు.

    సంగతేమంటే, నిన్న మా అమ్మగారి ఆబ్దీకం పెట్టడానికి, రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము,అక్కడ మూడు గంటలు క్రింద కూర్చునేటప్పటికి,ఆ తరువాత భోజనం చేసేటప్పుడు ఇంకో గంటా మొత్తం నాలుగు గంటల క్రింద కూర్చోడం ధర్మమా అని, అక్కడ ఉన్నంతసేపూ బాగానే ఉన్న మోకాళ్ళు, సాయంత్రానికల్లా pendown strike చేసేశాయి.ఇంక చూసుకోండి, రాత్రంతా కాలు వంచలేనూ, కదపలేనూ.ఇంట్లో వైద్యం-ఎవో పైన్ కిల్లర్లూ, వేణ్ణీళ్ళ కాపడం ( మరీ గిన్నెలో గుడ్డ ముంచి కాదనుకోండి, అదేదో హాట్ వాటర్ బ్యాగ్గులో)అన్నీ ప్రయత్నించాను.( మొన్న ‘సంచీ’ ల బ్లాగ్గులో దీనిగురించి వ్రాయడం మర్చిపోయాను, అందుకే గుర్తు చేసింది). అబ్బే ఏం ఫలితం లేదు, సరే అని ప్రొద్దుటే ఏ డాక్టరుదగ్గరకైనా వెళ్దామని,ఓ సారి మా దేష్ పాండే గారికి ఫోను చేశాను( భుసావల్ లో ఉన్నారు), ఆయనకి నా జాతక చక్రం అంతా తెలుసు, పాతికేళ్ళనుండి చూస్తున్నారు.ఆయన అక్కడినుంచే నా పరిస్థితి అడిగి, ఓ పైన్ కిల్లర్ మాత్రా,అదేదో క్రీమ్మూ రాసేసుకుని, క్రేప్ బ్యాండేజ్ కట్టుకుని 48 గంటలు, ఎక్కడకీ కదలకుండా, వెధవ్వేషాలెయ్యకుండా, ఓ మంచం మీద పడుక్కుని రెస్ట్ తీసికోమన్నారు.అదేదో, నాతో చెప్పి వదిలెయ్యొచ్చుగా, అబ్బే, మా ఇంటావిడకీ, మా అబ్బాయికీ కూడా చెప్పారు. పాత సినిమాల్లో చూస్తూంటాము,అలాగన్న మాట!

    ఇంక మా వాళ్ళిద్దరికీ ఎంత సంబడమో! చకచకా బయటకు వెళ్ళి కావలిసిన సామగ్రంతా తెచ్చేసి, నన్నో మంచం మీద పడేశారు. నేను కూడా సందర్భానుసారంగా ,ఓ పైజమా, చార్ల చొక్కా వేసేసికుని సెటిలైపోయాను! One must keep up with the times కదా మరి!చూసేవాళ్ళకీ అనిపించాలి కదా! కాఫీ,టిఫినీ, తిండీ అన్నీ అక్కడికే!’ తాతయ్య నిద్రపోతున్నారూ’ అంటూ, మా నవ్యతో చెప్పడం, డాడీ ఎలా ఉందీ అంటూ మా అబ్బాయీ, మామయ్యగారూ ఎలా ఉందీ అంటూ మా కోడలూ, డాడీ ఎలా ఉందీ అంటూ మా అమ్మాయీ, ఏమైనా కొంచెం తగ్గిందా అంటూ మా ఇంటావిడా ప్రతీ గంటకీ పరామర్శోటీ !ఇదంతా బాగానే ఉందనుకోండీ, అయినా అదేదో సామెత చెప్పినట్లుగా ‘తిరిగే కాళ్ళూ, తిట్టే నోరూ’ కట్టిపడేస్తే ఎలాగండి బాబూ,
తిరక్కుండా ఉండలేనూ, అలాగని నోరుమూసుకుని కూర్చోలేనూ. పోనీ ఎవరైనా వింటారా అంటే, 38 ఏళ్ళనుండి విన్నవే విని వాళ్ళకీ బోరుకొట్టేసింది!ఇంక ఇది కాదని, ఇలా బ్లాగ్గులోనైనా నా గోల వినిపిస్తే బావుంటుందని ఇలా సెటిలైపోయాను!

    మా ఇంటావిడకి ఓ ‘తీరని కోరిక’ ఉంది.అలాగని ఆవిడ కోరికలన్నీ తీర్చేశానని కాదు, ఎలాగోలా నా చేత శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారి Magnum Opus ‘వేయి పడగలు’ చదివించాలని.మా ఇంట్లో ఆ పుస్తకం లేదు.ఈవిడ గోల భరించలేక నెట్ లో డౌన్ లోడ్ చేసి ఉంఛాను ఆ మధ్య.తన ప్రయత్నం తను చేసింది, చదివేనా వినిపించాలని, అదేమిటో ఆవిడ చదవడం మొదలెట్టిన ఓ గంటలో నిద్రొచ్చేసేది!వచ్చిన గొడవల్లా ఏమిటంటే, నాకు ఆ పుస్తకం లోని భాష అర్ధం అయేది కాదు.నాది చాలా low IQ ! నేనేం చెయ్యను దానికి? నాకర్ధం అవదు మొర్రో అన్నా వదలదు.ఇప్పుడు ఛాన్సు దొరికింది. ఈ మధ్యనే, మా వియ్యపురాలు గారు 1986 లో ప్రచురించిన,14 th Edition మాకిచ్చారు.ఇంక మా ఇంటావిడ’ కాగల కార్యం గంధర్వులే చేశారు’ అన్నట్లుగా, నా మంచం ప్రక్కనో కుర్చీ వేసికుని, ‘ఎలాగా ఈ రెండురోజులూ కదలకూడదుగా, వేయి పడగలు చదువుతాను వినండి’ అంది.వామ్మోయ్ ఈవిడ వదిలేటట్టు లేదురా బాబూ అనుకుని, పైగా వింటున్నానో లేదో చూడ్డానికి మధ్య మధ్యలో ప్రశ్నలోటీ.ఈ గొడవంతా ఎందుకనీ, నేనే ఏదో తిప్పలు పడతాలే, చదవకపోతే తిండి పెట్టడం మానేస్తే,అమ్మో, బయటకు కూడా వెళ్ళలేను!అని ఆ పుస్తకం చేతిలోకి తీసికున్నాను.

    అసలు ఈయన దేనిగురించి వ్రాసేరా అని తెలిసికోవాలని, పుస్తకం చివరిలో ఉన్న ‘ వేయి పడగలలోని అంతరార్ధం’తో మొదలెట్టాను. వహ్వా వహ్వా ఏం వివరణ అండీ, అసలు నాలాటి పామరులకు అర్ధం అవాలనే శ్రీ విశ్వనాథ వారు,1955 లో ఆ వ్యాసం వ్రాశారేమో అనిపించింది.ఈ ‘గృహనిర్భంధం’ టైములో వేయి పడగలు పూర్తి చేసేస్తాను. దేనికైనా రాసిపెట్టుండాలంటారు!
భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా ‘గృహ నిర్భంధాలు’ వస్తే ఇదో డ్రెస్ రిహార్సల్ గా ఉపయోగిస్తాయి !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–సంచీలు

    మా చిన్నప్పుడు స్కూలుకెళ్ళాలంటే పుస్తకాలు ఓ సంచీ లో పెట్టి తీసికెళ్ళేవాళ్ళం.కాలేజీకొచ్చేసరికి ఆ అలవాటు మానుకుని స్టైలుగా చేతిలో ఒకటో రెండో నోట్ బుక్స్ పెట్టుకుని వెళ్ళడం.పాపం అమ్మాయిలుమాత్రం, ఒబ్బిడిగా ఓ నాలుగైదు పుస్తకాలు తెచ్చుకుని వచ్చేవారు.సంత సంచీ అని ఒకటుండేది,దాంట్లో సంత ( కూరగాయల మార్కెట్) కి వెళ్ళేమంటే, దాన్నిండా కూరలు వచ్చేవి.ఇప్పుడలా కాదుగా, ఎంత ఖర్చుపెట్టినా ఓ జేబిరుమాల్లో కట్టుకుని తెచ్చేసుకోవచ్చు.లేకపోయినా కొట్టువాళ్ళిచ్చే పాలిథీన్ బ్యాగ్గులో,కొన్న కూరలన్నీ కట్టుకుని తెచ్చేసుకోవచ్చు! ఏమైనా అంటే ఇన్ఫ్లేషనో అదేదో అంటారు.ఏది ఏమైనా సంతకి సంచీపుచ్చుకువెళ్ళే concept మాత్రం అటకెక్కేసింది! పాపం మా తరం వాళ్ళు ఇంకా మార్కెట్టుకి వెళ్ళేటప్పుడు ఓ సంచీ తీసికుని వెళ్తూంటారు.మార్కెట్నుంచి ఇంటికివచ్చేటప్పటికి, ఎండాకాలంలో ఎండిపోయిన నూతుల్లో నీళ్ళలాగ, కూరలెక్కడున్నాయో వెదుకుతూండాలి,! పైగా మా ఇంటావిడలాటివారు,’ అదేమిటండీ మరీ పావు పావే తెస్తే ఎలా సరిపోతాయీ అందరికీ’ అంటుంది.కిలోల్లో కొనే రోజులు కావు ఇప్పుడూ అన్నా కానీ నమ్మదు.ఎప్పుడో ఓసారి తనని కూరలు తెమ్మని పంపిస్తే తెలుస్తుంది!పైగా ఏమైనా అంటే వరంగాంలో ఉన్నప్పుడు నేనే కదా కూరలు తెచ్చేదాన్నీ అంటూ సాగతీస్తుంది.అది 1983 వ సంవత్సరమమ్మా, నెలకి 1000 రూపాయొలొచ్చినా హాయిగా బ్రతికేవాళ్ళం,ఇప్పుడు వేలకి వేలు పెన్షనొచ్చినా,కూరలూ అవీ ‘అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా ఉంది.దేముడిని ఉత్తి గంధం పెట్టేసి, అదే అలంకారం అనుకో అంటే ఆయనూరుకోవడంలేదూ,అలాగే, మనం కూడా వెరైటీకి తలో నాలుగు కూరలూ తీసికోవడం,అన్నీ కలిపి ఓ పావో,అర్ధకిలో తూపించి, ఇంటికి తెచ్చి ఏ అవియల్లో ఏదో చేసికొని తినడం.అలా కూరలసంచీలు extinct అయిపోయాయి!

యాయివారం బ్రాహ్మలని ఉండేవారు,వాళ్ళు ఇంటింటికీ తిరిగి,ఆ ఇంటివాళ్ళిచ్చే బియ్యం అందులో పోసుకుని,కొంపకి చేరి కుటుంబసభ్యుల ఆకలి తీర్చేవారు.ఆరోజుల్లో బియ్యం లాటివి సమృధ్ధిగా
దొరికేవి కాబట్టి, ఎవరైనా యాచకులు వస్తె, వాళ్ళకి దానం చేస్తే పుణ్యం పురుషార్ధం అనుకునే వారు.ఆఖరికి ఏ కరివెపాకు కొనాలన్నా బియ్యం ఇస్తే ఇచ్చేవారు!ఏ దేముడు ఊరేగింపు పల్లకీయో వచ్చినప్పుడు కూడా, బియ్యం అవీ ఇచ్చేవారు. అలాగే స్వయంపాకం అని, బియ్యమూ,ఓ అరటికాయో ఇంకేదో కూర ఎవరోఒకరికి ఇచ్చేవారు! ఇప్పుడు అలాటివన్నీbeyond our means అయిపోయాయి!

పళ్ళపొడి పొట్లాలు ఓ జోలాసంచీ లో వేసికుని అమ్మడానికి తెచ్చేవారు.అందుకే ఇప్పటికీ మనం ఎప్పుడైనా అలాటి సంచీ భుజానికి వేళ్ళాడతీసికుంటే, ‘పళ్ళపొడి అమ్మేవాళ్ళాగ ఆ సంచీ ఏమిటీ’అంటూంటారు.కానీ ఆ సంచీలు మాత్రం బలే convenient గా ఉంటాయి. నేనూ చాలాకాలం వాటినే వాడేవాడిని.జేబుల్లో పెట్టుకుంటే ఎవడైనా కొట్టేస్తాడని, అన్నీ అందులోనే పెట్టుకుని వెళ్ళేవాడిని.ఆ సందర్భంలోనే, తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ కంపార్ట్ మెంట్ లో వెళ్తూండగా, అలా భుజానికి వేళ్ళాడతీసికున్న, నా జోలా బ్యాగ్గు నీట్ గా కోసేసి,అందులో ఉన్న డబ్బూ దస్కం,టిక్కెట్ట్లూ కొట్టేసి ‘తిరుక్షవరం’ చేసేసిన తరువాత మళ్ళీ ఆ జోలా బ్యాగ్గు జోలికి పోలేదు!

ఆ తరువాత ఎప్పుడైనా ఇంటికి ( అమలాపురం)వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు, ఇంట్లో కాసిన కొబ్బరికాయలు ఓ సిమెంటు బస్తాలో వేసి ఇచ్చేవారు.,b>తీసికెళ్ళకపోతే అదో సెంటిమెంటూ,ఈ మూటలన్నీ మోసుకుని,అమలాపురంనుండి పూనా దాకా వచ్చేటప్పటికి తడిపిమోపెడయ్యేది!అమలాపురం నుండి తణుకు (అత్తారిల్లు) దాకా బస్సులో రావడం, అక్కడ మళ్ళీ మామగారిచ్చిన ఇంకో బస్తా తీసికోవడం,ఇవన్నీ తీసికుని హైదరాబాద్ బస్సులో రావడం, అక్కడ బొంబే వెళ్ళే ట్రైనెక్కడం. ఆరోజుల్లో డైరెక్ట్ కొణార్క్ ఉండేదికాదు.క్రమక్రమంగా సిమెంటు బస్తాలు మానేసి, కొబ్బరికాయలన్నీ, ఓ పురికోసతాడుతో దబ్బనంతో గుచ్చి, వాటిని తెచ్చుకునేవాళ్ళం.

&nbsp  ఇప్పుడు ఎవర్ని చూసినా ఓ నైకీ బ్యాగ్గో, ఓ రిబాక్ బ్యాగ్గో వేళ్ళాడతీసికుని వెళ్ళడం.దానికి సాయం Laptop పెట్టుకోడానికో బ్యాగ్గూ! ఎన్ని చెప్పండి, ఆ రోజుల్లోని ‘కూరలసంచీ’ కి మాత్రం ఇవి ఏమాత్రం సరితూగలేవు!ఇంకో రకం ఉండేవండోయ్,ఇప్పటికీ అరవ్వాళ్ళు ( ఏం అనుకోకండి అలా అన్నానని,ఇప్పటికీ తమిళులు కొంతమంది,’తెనుంగా’అంటూ అదేదో హీనపక్షమన్నట్టుగా పిలుస్తూంటారు,అందుకనే నేను వాళ్ళని ఎప్పుడూ అరవ్వాళ్ళే అంటాను!) ఓ గుడ్డసంచీ యే పట్టుకుని తిరుగుతూంటారు. ఏక్ దం ట్రేడ్ మార్కు పసుప్పచ్చ సంచీ.దాన్ని చూడగానే ఇతను అరవ్వాడే అని తెలుసుకోవచ్చు! మరి మనం కూడా అలాటిదో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో! పోన్లెండి అలాటివేవీ వద్దు, ఏ రంగు బ్యాగ్గు పెట్టుకుంటే ఆ పార్టీ అంటారు, ఇదో గోల మళ్ళీ!

ఇప్పుడు లేటెస్ట్-బ్యాక్ ప్యాక్కో అదేదోట! ఏ బస్సులో చూసినా వీపుమీద ఓ బస్తా తగిలించుకుని చూస్తూంటాము.బస్సుల్లో నిజం చెప్పాలంటే, ఓ పాతిక ముఫై మందిదాకా నుంచోవచ్చు. కానీ ఈ బ్యాక్ ప్యాక్కు ప్రాణుల ధర్మమా అని, అందులో సగం అంటే పది పదిహేను మందికంటే ఎక్కువ నుంచోలేకపోతున్నారు.కారణం,నుంచున్నవాడు బక్క పక్షి లా ఉన్నా, వాడు వీపుమీద తగిలించుకునే బ్యాగ్గు, ఇంకో మనిషి నుంచునేటంత స్థలం occupy చేస్తుంది. ఇక్కడ బస్సులో కండక్టర్ पुढॅ चला पुढॅ चला అంటూంటాడు,అంటే ముందుకు జరగండి అని. ఎక్కడకెళ్తాం నా నెత్తిమీదికి! చీమకుట్టినైనట్లేనా ఉండదు ఆ బ్యాక్ ప్యాక్కు వీరులకి.వాడి పనైపోయింది, ఇంకోళ్ళు ఏమైతేనేం! ఏ గంగలో దిగితేనే? కొంతమంది ప్రయాణాల్లో అలాటి బ్యాగ్గులు పెట్టుకుని వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది.కూలీలఖ్ఖర్లేకుండా,వీపుమీద పెట్టుకుని లాగించేయొచ్చు,కానీ మరీ బస్సుల్లో కూడా ఇలాగైతే ఎంత కష్టమండి బాబూ/

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు– ఆదివారం స్పెషల్

   ఏమిటో ఇవేళ్టి ఆదివారం ‘అదోలా’ ఉంది! ప్రొద్దుటే నా దైవదర్శనాలై కొంపకి వచ్చేటప్పటికి, జ్యోతి గారి ఫోన్నూ! ‘ఇందాకా ఒకసారి చేశానూ,ఇంకా నిద్ర లేవలేదా’ అంటూ!అంత లగ్జరీ ఎక్కడండి బాబూ? విషయానికొస్తే ‘ఈనాడు’ పేపరొస్తుందా అన్నారు. నేను ప్రతీ రోజూ ‘సాక్షి’ తీసికుంటాను.ఆపెపరుమీదేం ప్రేమా అభిమానం అనికాదు,ఖరీదుతక్కువ,రద్దీ వాల్యూ ఎక్కువా అని అంతే!ఆదివారం మాత్రం రెండూ తీసికుంటాను,అవేవో సప్లిమెంట్లు పెడతారూ,కాలక్షేపం అని!
సంగతేమని అడిగితే ‘మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి వెంటనే నా బ్లాగ్గు చూడండి’అన్నారు. సరేఅని ఓపెన్ చేస్తే అందులో మా ఇంటావిడ ఏం పనిలేక, మా( స్పెషల్లీ నామీద) ప్రయోగాలూ చేసే సందర్భంలో చేసే ఓ స్వీటు గురించి ఓ బ్లాగ్గు వ్రాసిందీ, అదేమో సుజాత గారు ఈవేళ్టి ఈనాడు వసుంధర లో ప్రస్తావించారుట. అయితే నాకేంటీ?

   నేను నమలక్కర్లేకుండా మింగేయొచ్చని ఇలాటి స్వీట్లు చేస్తూంటుంది,ఎంతైనా కట్టుకున్నవాడిని కదా!ఆ స్వీటుని ఊరిమీదకొదిలింది.ఎంతైనా పొరిగింటి పుల్లకూర లా, అందరికీ నచ్చేసింది ( మాకూ బాగానే ఉంటుందనుకోండి),ఆ బ్లాగ్గేమో
సుజాత గారికి నచ్చేసిందిట, ఆవిడేమో పేపర్లో వేయించేశారు.ఇంక మా ఇంటావిడేమో ఓ blog వ్రాసేసింది.

    గుర్తుందా మనం కొత్తగా వాచీ కొనుక్కున్నప్పుడు, అందరూ చూడాలని వాచీ పెట్టుకున్న చెయ్యే తిప్పుతూంటాం, అలాగ మాఇంటావిడ ఆ పేపరే చేతిలో పెట్టుకుని మాట్లాడుతోంది.ఒక విషయం ఒప్పుకోవాలిలెండి, మా అబ్బాయీ,కోడలూ మాత్రం ఇదంతా చూసి ‘అబ్బో మా అమ్మ ఇలాగా,మా అత్తగారు ఇలాగా’ అనుకుంటూ సంబరపడిపోతున్నారు!ఈవేళ ఈ సంతోషంలో,నాకు చపాతీలు కాకుండా దోశలు చేసిపెట్టింది.పోన్లే ఇదీ బాగుందని లాగించేశాను!
Thank you Sujaatha,Jyothi

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Mistaken identity.

    నిన్న సాయంత్రం,మా ఇంటావిడ శుక్రవారం పూజకి పువ్వులు తెమ్మని నన్ను క్రిందికి పంపించింది.రాజమండ్రీ లోనే హాయిగా ఉండేది, తెల్లారేటప్పటికి మా వాచ్ మన్ ( నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడూ, కరెంటు పోయినా జనరేటర్ వేసేవాడూ
రెండో వాచ్ మన్ కీ నాకూ పడేది కాదు,పండగ మామూళ్ళివ్వలేదని!) ఓ పెద్ద ప్యాకెట్టునిండా పువ్వులు తెచ్చేవాడు.నెలంతా పూర్తయిన తరువాత ఓ వందరూపాయలుచ్చుకునేవాడు.ఈవిడకి మందిరంలో ఉన్న దేముళ్ళందరికీ పెట్టగా, హాల్ లో
డెకొరేషన్ కి కూడా సరిపోయేవి. ఇక్కడ అలాగ కాదుగా, ఎప్పుడో శుక్రవారాలకే పువ్వులు లిమిట్ చేసేశాము.మిగిలినరోజుల్లో అక్షింతల్తోనే పూజ! పాపం ఆ దేముడికీ రేషనే !

    ఏమిటో దేనితోనో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను.క్రిందకు వెళ్తుంటే, లిఫ్ట్ లో, మా పక్క పోర్షనావిడా, ఆవిడతో ఓ అమ్మాయీ ఉన్నారు.వాళ్ళదారిన వాళ్ళెళ్తున్నారుకదా అని ఊరుకోవచ్చా, అబ్బే అన్నీ నాకే కావాలి, అందరిదగ్గరా నా ‘సో కాల్డ్’ పెద్దరికం చూపెట్టుకోవాలీ,ఆ అమ్మాయితో ” ट्यूशन हॉगया क्या?” అని పలకరించాను. మా పక్కింటి అమ్మాయి ఆరో క్లాసో,ఏడో క్లాసో లెండి, ఎప్పుడు కలసినా ట్యూషన్ కి వెళ్తూనో,వస్తూనో కనిపిస్తూంటూంది.ఆ అమ్మాయే అయిఉంటుందని,అడిగాను. పాపం ఆ అమ్మాయేమో ఈ ‘आजॉबा’ అలా అడుగుతున్నాడేమిటీ అని కంగారు పడిపోయింది. ‘అజోబా’ అంటే మరాఠీలో ‘తాతయ్య’ .కాదూ, నాకు 12 క్లాసు పూర్తయిపోయింది, ఈ సంవత్సరం కర్ణాటకాలో ఇంజనీరింగులో చేరుతున్నానూ అంది. అలారం సిగ్నల్స్ మ్రోగేశాయి-ఎక్కడో పొరపాటు జరిగిపోయిందీ అని,అయినా ఓ వెర్రిమొహం పెట్టుకుని,’ఐ మీన్ అదే’ అంటూ ఆ అమ్మాయి చదువుకునే కాలేజీ, కామన్ ఎంట్రెన్స్ టెస్టూ వగైరాలమీద అడిగేశాను! ‘పప్పులో అడుగేశానని ‘అర్ధం అయిపోయింది.మా పక్కింటావిడకూడా ఆశ్చర్యపడిపోతూంది, ఇంత పెద్ద పిల్లని పట్టుకుని ట్యూషన్ కెళ్ళావా, యూనిట్ టెస్టుల్లో మార్కులెలా వస్తున్నాయీ అని అడుగుతున్నాడేమిటీ అని!ఇదంతా తరువాత ,ఈవిడా,వాళ్ళ అసలమ్మాయీ( ట్యూషన్లకెళ్ళే పిల్ల), ఈ ఇంజనీరింగులో చేరే అమ్మాయీ ఒకేచోట కనిపించేసరికి తెలిసింది! అర్రే ఇద్దరూ ఒకే పోలికతో ఉన్నారే అంటూ.నా దురదృష్టంకొద్దీ,వీళ్ళందరిని కలిపి మాట్లాడేటప్పుడు,మా ఇంటావిడ కూడా ప్రక్కనే ఉంది.ఇంక చూసుకోండి,ఛాన్సొస్తే క్లాసు తీసికుంటుంది- ‘ అసలు మీకెందుకండీ ఎవరు ట్యూషన్లకెళ్తే మీకెందుకూ, ఊళ్ళో వాళ్ళ సంగతులన్నీ మీకే కావాలీ…’ అంటూ.

    ఇంకోమాటు, ఈ మధ్యన భాగ్యనగరం లో పెళ్ళికి ( లక్ష్మి మొగుడిగా కాదు, ఫణి పెళ్ళాం ఎపిసోడ్ లో) వెళ్ళాం కదా, అక్కడ మ్యారేజ్ హాల్ కి వెళ్ళగానే, మా మేనల్లుడు ( మా కజిన్ సిస్టర్ కొడుకు)’హల్లో మామయ్యా’ అంటూ పలకరించాడు. అతను నాకు బాగా తెలుసు పూణే లో.ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు.అతన్ని పలకరించి, లోపలకు వెళ్ళాము.అక్కడ తెలిసిన చుట్టాలని కలుసుకుని, మెల్లిగా బ్రేక్ ఫాస్ట్ తీసికుందామని, ప్రొద్దుట 10.00 గంటలకి బ్రేక్ ఫాస్టేమిటీ? అక్కడ లైన్లో అచ్చంగా ఇంతకుముందు కలిసిన మా మేనల్లుడిలాగ ఒకతను కనిపించేసరికి ‘ హాయ్’ అన్నాను.అబ్బే ఏమీ రియాక్షన్ లేదు. ఇంతలో యేమయ్యిందిరా బాబూ,ఇందాకా వచ్చినప్పుడు బాగానే ఉన్నాడూ,నోరారా పలకరించాడూ,నేనేమైనా తప్పుగా మాట్లాడానా, ఇదేం ప్రొటెస్టు రా భగవంతుడా అనుకున్నాను.పోనీ నన్ను చూడలేదా అనుకోడానికీ వీల్లేదు, శుభ్రంగా నామొహంలోకే ‘బ్లాంక్ ‘గా చూస్తున్నాడు.పోన్లే అని వదిలేశాను.ఇంతట్లో ,మా కజిన్ వచ్చి, ఏరా లచ్చూ బ్రదర్ రామూని కలిశావా అన్నాడు. వార్నీ ఇదన్నమాట అసలు సంగతి-నేను గేట్లో కలిసినవాడు ఒకడు, ఇప్పుడు ‘హాయ్’ చెప్పినవాడు రెండో వాడు.పాపం అతనికేం తెలుస్తుంది,నేనెవరో! ఇంతలో అతని భార్య వచ్చి, ఈ సంగతంతా తెలిసికుని ఒకటే నవ్వు. ‘చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూంటారండి బాబయ్యగారూ’అంది.మా మేనల్లుడికి మామయ్యనవుతే ఈ అమ్మాయికి బాబయ్యని కదా, అదీ చుట్టరికం!

     ఏపీ మీడియా కబుర్ల రాము గారు ఓ మెయిల్ పంపి, నన్ను కలుసుకోవాలనుందీ అన్నారు. పోన్లే నన్ను కలుసుకోవాలని ఉన్న అమాయకులూ ఉన్నారు కదా అని, వెళ్ళగానే ఓ ఫోన్ ‘కొట్టేశాను'(ఆంధ్రదేశం లో నేర్చుకున్నాను ఈ పదజాలం!).అదీ రాత్రి పదింటికి.పోనీ ప్రొద్దుటెప్పుడో చెయ్యొచ్చుగా, అబ్బే ఉన్న ఒక్క ‘గిరాయికీ’ మిస్ అయిపోతే అమ్మో! మామూలు హల్లో హల్లొల పలకరింపులూ వగైరాలూ పూర్తయిన తరువాత, ‘ మీకు శ్రమిచ్చానూ’ అని నేనూ
‘అబ్బే అదేంలేదండీ ‘ అని ఆయనా మొహమ్మాటాల డయలాగ్గులు
చెప్పేసికుని, మర్నాడు ఎక్కడ కలుసుకోవాలో చెప్పెసుకున్నాము.ఆఖరి నిమిషంలో మర్నాడు నా ప్రోగ్రాం కొంచెం మారింది ( నేనేమైనా వి.ఐ.పీ నా ఏమిటీ,ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం నడుచుకోడానికి). ప్రొద్దుటే ఆయనకి ఫొన్ చేశాను’ అయ్యా ఫలానా కారణాలవల్ల నా కార్యక్రమంలో కొంచెం మార్పొచ్చిందీ,ముందనుకున్నట్లుగా నేను లక్డీకా ఫూల్ రావడంలేదు’అన్నాను.’అమ్మయ్య ఓ గొడవ వదిలిందిరా బాబూ, ఈ సారి వచ్చినప్పుడు కలవడానికి ప్రయత్నిస్తానూ’ అని గ్యారెంటీగా అంటారని ఆశించాను!అబ్బే అలాటిదేమీ లేదు, ‘ ఏం ఫరవా లేదూ, మీరెక్కడుంటున్నారో చెప్పండీ ఫలానా టైముకి వచ్చేస్తానూ’ అన్నారు. ఇదేమిటీ ఈయనకేమీ పనీ పాటా లేదా,ఎక్కడో ముక్కూ మొహం తెలియనివాడికోసం ఇంత దూరం వస్తానంటారూ అనుకున్నాను. దూరం ఎలా తెలిసిందీ అంటే, అప్పటికే నాలుగు ట్రిప్పులు కాచిగూడాకీ,ఖైరతాబాద్ కీ ఆటోలో అయ్యాయిగా!3.30-4.00 మధ్యలో వస్తానన్నారు.
ఇంక మా వియ్యాలారింట్లో అందరికీ, అడిగినవాడికీ,అడగనివాడికీ చెప్పేశాను. మధ్యాన్నం నాలుగింటికి నన్ను కలుసుకోడానికి ఒకాయనొస్తున్నారోచ్ అని.పైగా నాకు ఆయనతో పరిచయం నెట్ ద్వారానే అని తెలియగానే మరీ మరీ ఆశ్ఛర్యపడిపోయారు! మీరొక్కళ్ళే కాదూ నాకూ తెలిసినవాళ్ళున్నారనే ‘ఫీలింగు’తో చెప్పాను.పాపం నిజానికి వాళ్ళేం అనుకోలేదు అలాగని. ఊరికే అలా పోజు పెట్టేశాను.ఆయనకి మన ఇల్లు తెలుసునా,ఎలా వస్తారూ అనే యూజుఅల్ ప్రశ్నలకి సమాధానంగా, దగ్గరలోకి వచ్చి ఫోన్ చేస్తారూ నేను వెళ్ళి తీసుకొస్తానూ అన్నాను.మా వియ్యంకుడుగారు ‘పొనీ సందుచివరదాకా వెళ్ళి నన్ను తీసుకురమ్మంటారా’అన్నారు.నాకే దిక్కు లేదు, ఆయనెలా ఉంటారో ఫొటోల్లో చూడడం తప్ప,ఈయనకెందుకూ శ్రమ అని వద్దన్నాను.

     ఏదో బ్లాగ్గు ప్రొఫైల్లో ఫుటో పెట్టుకున్నారుకదా,గంభీరమైన విగ్రహం, ట్రేడ్ మార్క్ ఫ్రెంచి గెడ్డం, ఆమాత్రం గుర్తుపెట్టలేనా అని నేనే బయలుదేరాను.ఆ సందులో గాడీల్లో వచ్చే ప్రతీ మనిషినీ గెడ్డం ఉందో లేదో పరిశీలించడం,టిక్ ఆఫ్ చెయ్యడం!
ఇంతట్లో ‘హల్లో సర్ ఫణిబాబుగారూ’అంటూ ఓ ఆకాశవాణి వినిపించింది.ఎదురుగ్గా చూస్తే ఒకాయన బైక్కుమీద ఆగి నన్ను పిలుస్తున్నారు.‘మీగెడ్డం వగైరాలెమయ్యాయీ అని మొదటి పరిచయంలోనే అడగడం బాగుండదు కదా అని వదిలేశాను!
ఏదో గంభీరమైన మనిషీ, ఓ యాభైఏళ్ళుండవచ్చు అనుకుంటే, ఇంతాచేస్తే నాసర్విసు 42 ఏళ్ళకంటె తక్కువట! ఏమిటో ఇలా ఉంటాయి! నేనూ నా ఐడెంటిఫికేషన్లూ !!!

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు– వయస్సు గుర్తు చెయ్యడం!!

   రిటైరయినతరువాత, ఎప్పుడైనా ఏ శుభకార్యాలకో వెళ్ళామనుకోండి,ఒక్కోప్పుడు అదేదో డిప్రెషన్ లాటిదోటి వచ్చేస్తూంటుంది.పేద్ద కారణమేమీ ఉండదు ఊరికే అయినదానికీ,కానిదానికీ లేనిపోని పెద్దరికం అంటకట్టేస్తూంటారు! పురోహితుడు అక్షింతలు మనచేతిలోనే ముందు పెడతారు, భోజనానికి ఆకలి వేసినా వేయకపోయినా బలవంతంగా ఓ కుర్చీ,ఓ టేబులూ వేసేసి, మనల్ని తెచ్చుకోనీయకుండా, ఎవరో ఒకరు తెచ్చి మరీ ఇస్తారు! పైగా అందులో ట్రెడిషనల్ వంటకాలే పెడతారు.పోనీ మనల్ని వదిలెస్తే,అక్కడున్నవాటిల్లో,మనకు కావలిసినవేవో తీసుకుంటాముగా అని కూడా ఆలోచించరు!

    పైగా మనల్ని ఎక్కడకూ కదలనీయకుండా, ఏమీ పనిలేని కుర్రాడినొకణ్ణి మనకు కాపలా పెడతారు!’ తాతయ్యని ఒక్కణ్ణీ ఎక్కడకూవెళ్ళనీయకురా’అంటూ.ఇంక వాడు మనతో ఆడేసుకుంటాడు! ఎలాగోలా వీణ్ణి తప్పించికుని, తినే వస్తువులదగ్గరకి వెళ్ళడానికి ప్రయత్నించామా,అక్కడ ఎవడో పలకరిస్తాడు!అందులోనూ ఈ మధ్యన ‘బఫే’ ల్లో,నోరూరించే సరుకులన్నీ పెడుతున్నారాయె! మొహమ్మాటానికి సాత్వీకాహారమే తినాల్సొస్తుంది! అన్నిటిలోకీ, ఆ పెళ్ళికూతురునీ,పెళ్ళికొడుకునీ మన కాళ్ళకి దండం పెట్టించడం! అప్పటికే ఎంతోమందికి దండాలు పెట్టేసి ఉంటారేమో,మన కాళ్ళమిద పడ్డట్లే పడి విసుగొచ్చి,మన కాళ్ళులాగేస్తే
ఇంక అంతే సంగతులు! ఇంకో డిప్రెసింగ్ థింగేమిటంటే,మొగాళ్ళకి తువ్వాలుగుడ్డో,పంచెలచాపో పెట్టడం!అసలు ఈ బట్టలు పెట్టడంతోటే ఖర్చెక్కువవుతూంటుంది!

    మేము మా అగస్థ్య అన్నప్రాశన సందర్భంలో కదా భాగ్యనగరం వచ్చిందీ, అక్కడైతే ,నాకు వియ్యంకుడి హోదా ఓటీ!ప్రతీదానికీ మొహమ్మాటపెట్టేయడం!నాకేమీ ఫార్మాలిటీస్ వద్దుమొర్రో అన్నా వినరు.కానీ అక్కడున్నంతవరకూ కాలక్షేపం మాత్రం చాలా బాగా జరిగింది.నా వయస్సు వారు ఇంకొక్కరే ఉన్నారు.ఇది మరీ కష్టం,ఆయనకీ,నాకూ అందరికంటె ముందుగా భోజనం పెట్టేశారు ఆకలి అవడంలేదన్నా వినకుండా!ఆ ఫంక్షన్ కి ఒకాయన వచ్చారు,వెళ్ళేముందర చెప్పులేసికుని
గొప్పగా తన భార్యని పిలిచి ‘ఓ గ్లాసుతో మంచినీళ్ళు తేవోయ్’అన్నారు.అదేమిటండీ ఇప్పుడే కదా త్రాగారూ అన్నాను.దానికాయన ఇచ్చిన సమాధానం మాత్రం గ్రేట్-‘ మా ఆవిడకూడా నేను చెప్పేమాట వింటుందని అందరికీ చూపించుకోడానికి
అప్పుడప్పుడు ఇలా చేస్తూండాలండి.ఇంట్లో బయలుదేరే ముందరే ఇలా చేస్తానూ అని పెర్మిషన్ తీసుకున్నానూ,దీనికి ప్రాయశ్చిత్తంగా,ఇంటికి వెళ్ళి, క్రిందనుంచి మూడు బకెట్లనీళ్ళు తేవాలని ఆర్డరూ! మాది మేనరికం లెండి’
అన్నారు!

    పోనీ ఒకసారి బయటకు వెళ్ళి తిరిగివద్దామని వెళ్ళాను.వామ్మోయ్ ఆ ట్రాఫిక్కేమిటండి బాబూ, రోడ్లూ అధ్వాన్నంగానే ఉన్నాయి,దానికి సాయం లైట్లు ఎక్కడా కనిపించవు. ఎందుకొచ్చిన గొడవరా బాబూ, ఏ స్కూటరు క్రిందైనా, బస్సు క్రిందైనా పడితే ‘టి.వీ’ లో ‘బ్రేకింగు న్యూస్’ లో నా పేరు వచ్చేస్తుందేమో అని భయ పడ్డాను.(నా పెన్షనర్ ఐ.డి.కార్డు ఎప్పుడూ జేబులోనే ఉంటుంది!).మొత్తానికి భాగ్యనగర ట్రిప్పు ఏ ఒడుదుడుకులూ లేకుండా పూర్తయింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    భాగ్యనగరం కబుర్లు ఇంకో రోజు వ్రాస్తానులెండి. నేను నిన్న వ్రాసిన బ్లాగ్గుకి మాఇంటావిడ తన version
వ్రాసుకుంది. అందుకే అంటారు- మొదటికొద్ది సంవత్సరాలూ మొగుడి మాట పెళ్ళాం వింటుందీ,ఆ తరువాత పెళ్ళాం మాట మొగుడు వింటాడూ, ఇంక ఆ తరువాత వీళ్ళ మాటలు ఊళ్ళో వాళ్ళందరికీ వినిపిస్తాయీ అని, ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళూ! ఏమిటేమిటో వ్రాసేసింది ఆవిడ, అదివరకు ఎప్పుడో ఆవకాయమీద తన ‘ టేక్’ వ్రాసి, బ్లాగు లో తన సపోర్టర్స్ అందరినీ కూడగొట్టుకుందిగా, అదీ చూద్దాం ఈ సంబరం ఎన్నాళ్ళో !!

    ఈ మధ్యన మిస్టరీ షాపింగు ప్రకరణంలో ఈ వేళ ‘యాప్ టెక్'(Aptech) వాళ్ళ ‘ఆన్ లైన్ టెస్ట్’ కి ఇన్విజిలేటర్ గా వెళ్ళాను.ఊరికే వాళ్ళు టెస్ట్ ఇస్తున్నంతసేపూ, అక్కడ కూర్చుని, వాళ్ళు కాపీలూ గట్రా చెయ్యకుండా చూడడం,ఆ తరువాత
వాళ్ళకొచ్చిన మార్కులు నోట్ చేసి పంపడం.అంతే. దానికి ఏమీ కంప్యూటర్ నాలెడ్జ్ అఖ్ఖర్లెదు.అయినా నాకేమీ ఉన్నట్లు ప్రిటెండు కూడా చెయ్యను!పరీక్షలు వ్రాసేవారిని సూపర్వైజు చెయ్యడం అంటే బలే సరదా నాకు!ఎంతచెప్పినా నా పరిజ్ఞానం ఎవడూ టెస్ట్ చెయ్యడుగా,అదన్నమాట ఈ సంతోషానికి కారణం !
ముందుగా అక్కడికి వచ్చిన పిల్లల ఐ.డి చెక్ చేయడం,అదేదో పేద్ద ప్రొఫెషనల్ గా చూడ్డం, ఐ.డి తేనివాడికి ఓ లెక్చరివ్వడం, మరీ ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూంటే ఓసారి దగ్గడం! ఇవన్నీ నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అసలు నేను ఈ చదువు ఎప్పటికైనా పూర్తి చేస్తానా, లేక జీవితమంతా ఇలా పరీక్షలు వ్రాస్తూనే ఉంటానా, ఎప్పటికైనా ఇన్విజిలేటరుగా కుర్చీలో కూర్చుంటానా అని కలలు కనేవాడిని.ఆ రోజుల్లో మన ఊహలు/కలలు కూడా అలాగే ఉండేవిలెండి
బస్సుల్లో టిక్కెట్లిచ్చే కండక్టరైతే బాగుండుననిపించేది. ఇంకోసారి సినిమా హాళ్ళలో గేటు దగ్గర టిక్కెట్లు చింపేవాడిగా,ఉంటే రోజూ సినిమా ఊరికే చూడొచ్చుగా అనిపించేది!ఏమిటో ఒక్కటీ అవలేకపోయాము! పోన్లెండి కనీసం,పరిక్షల వాచరుగానైనా పెట్టిపుట్టాను! ఆరోజుల్లోని వాచర్ నే ఇప్పుడు స్టయిలుగా ‘ఇన్విజిలేటర్’ అంటారని తెలిసింది!

 7nbsp;  ఆ రూం లో ఓ కుర్చీ వేసికుని,అప్పుడప్పుడు లేచి, ఓ సారి అటూ ఇటూ తిరగడం వరకూ బాగానే ఉంది.అక్కడకేదో, నేను కంప్యూటర్ విషయంలో,పేద్ద జ్ఞానం ఉన్నవాడినేమో అనే అపోహలో వాళ్ళకి జవాబులు తెలియని ప్రశ్నలకి,నన్నడగడం మొదలెట్టారు! పాపం వెర్రోళ్ళు,వాళ్ళకేం తెలుసూ,నాకు ఓ అంటే ఢాం రాదని! ఏదో ఇంట్లో కూర్చుని ఏదో గిలిక్కూండడమే కానీ, బయటకు వెళ్ళి సైబర్ కెఫే లో మెయిల్ చెక్ చెసికోవడం కూడా తెలియని అర్భకుడిని!

    ఇంట్లో పిల్లలందరిదగ్గరా ల్యాప్ టాప్ లు ఉన్నా సరే, దాన్ని వాడడం ఇప్పటిదాకా తెలియదు.ఎంత మెల్లిగా నొక్కినా, ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు,ఎప్పుడూ లొంగదు! అస్తమానూ పారిపోవడమే! ఇదండీ నాకున్న పరిజ్ఞానం! ఏదో వీధిన పడకుండా లాగించేస్తున్నాను! అలాటి ప్రాణిని,సబ్జెక్టులో ప్రశ్నలేస్తే ఎలాగా? ‘ సైలెన్స్’ అంటూ వాళ్ళని కోప్పడేసి,ఏదోలా తప్పించేసుకున్నా! అవన్నీ నా చిన్నతనపు ‘కలలు’. ఆ రోజుల్లో వాచర్లూ అంతే, మనం
చచ్చేటట్లుగా శ్రమ పడి పరీక్షలు వ్రాస్తూంటే, మన వాచరూ, ప్రక్క రూంలోని వాచరూ సినిమా కబుర్లో ఇంకోటో చెప్పుకుంటూండేవారు. వాళ్ళదేంపోయిందీ, వాళ్ళేం చదవాలా బట్టీ పట్టాలా మనలాగ! పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం!

   ఇవన్నీ ఎప్పటికైనా చెయ్యాలనేదే నా జీవిత ధ్యేయం! కానీ ఇందులో తెలియనివాటి గురించి చెప్పడం ‘ఇంక్లూడ్’ అవలేదే! అదొక్కటే బాగుండలేదు!
మొత్తానికి, వాళ్ళచేత టెస్ట్ వ్రాయించి,వచ్చాను. ఊరికే కాదనుకోండి, ఏదో డబ్బులిస్తారు.ఇంట్లో ఉంటే మా ఇంటావిడ బయటకు వెళ్ళి కూరలు తెండీ అంటుంది, బయట మార్కెట్ కి వెళ్తే ధరలు టాపు లేపేస్తున్నాయి.ఒకప్పుడు కిలోల్లో కొన్న ఈ చేతులే, పావుల్లో కొనవలసివస్తోంది ! ఇంటికంటే గుడి పదిలం అంటారు అందుకే!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–‘ లక్ష్మి మొగుడు’

    అమ్మయ్య ప్రాణానికి హాయిగా ఉంది-ఈయన గోల వినలేక పోతున్నామూ,ఈ మూడూ రోజులూ గొడవ వదిలిందీ అనుకుంటున్నారు కదూ.అబ్బే అలా వదులుతానా?ఇంట్లో వాళ్ళెవరికీ,నా గోల భరించే ఓపికా, టైమూ లేదు.నా కున్న బంధువర్గం అంతా నా బ్లాగ్గు స్నేహితులే! మరీ ఎదురుగుండా కూర్చోపెట్టి బోరుకొడితే కష్టం కానీ, ఇలా తోచిందేదో వ్రాసుకుంటూ పోతే, మీరు చదివారా లేదా, పోనీ చదివితే ఏమనుకున్నారూ అనే బాధ ఉండదు,నా కడుపుబ్బరం కూడా తగ్గుతుంది! ఏమంటారు?

మొన్న శనివారం నాడు, మా అగస్థ్య అన్నప్రాశనకి,భాగ్యనగరం వెళ్ళాము( వాళ్ళ తాతయ్య,అమ్మమ్మ ల ఆధ్వర్యంలో జరిగిందిలెండి). ఎలాగూ వెళ్ళాం కదా అని శనివారం నాడు, మా ఇంటావిడ అమ్మ మేనమామగారి కూతురి మనవరాలి మనవడి మేనమామ పెళ్ళికి ( చూశారా ఎంత ‘దగ్గిర’ చుట్టరికమో!) లక్డీకా పూల్ దగ్గర ఉన్న మారుతీ గార్డెన్స్ కి వెళ్ళాము.ఆ రోజు మర్నాడు ప్రొద్దుటే అవబోయే పెళ్ళికి రిసెప్షన్ ట.ఈ రోజుల్లో ముందర రిసెప్షనూ, తరువాతే పెళ్ళిగా! అక్కడ ఒక్కరంటే ఒక్కరూ ( పెళ్ళికొడుకూ, అతని తల్లితండ్రులూ తప్ప) నాకు తెలియదు.
ఆ మాటకొస్తే, మా ఇంటావిడకీ ఎవరూ అంత గుర్తులేరనుకోండి. పేర్లు,చుట్టరికాలూ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి.అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉండే బోర్డుల్నీ, వాటిమీదుండే పేర్లనీ బట్టి, ఫరవాలేదూ, కరెక్టు పెళ్ళొకే వచ్చామూ అనుకున్నాము.

కనిపించిన ప్రతీవారినీ అడిగి మొత్తానికి పెళ్ళికొడుకు తల్లి గారిని ట్రేస్ చేశాము.ఆవడేమో, మా ఇంటావిడని, వాళ్ళ ప్రతీ చుట్టం దగ్గరకీ తీసికెళ్ళడం, ‘ మన సీతక్క కూతురొచ్చిందే ( మా అత్తగారి పేరు సీతామహలక్ష్మి లెండి)’ అంటూ పరిచయం చేయడం! ‘ అయ్యో సీతకూతురివా అంటూ బోల్డంత ఆశ్ఛర్యపడిపోవడం! 40 ఏళ్ళక్రితం చూసిన మనిషి ఇంకా బాలా కుమారిలా ఉండదుగా!వాళ్ళూ అమ్మమ్మలూ/తాతయ్యలూ/మామ్మ (మా మనవలూ/మనవరాళ్ళు, మా ఇంటావిడని నానమ్మా అంటారోఛ్!) అయ్యారు, అయినా సరే అదో పలకరింపూ!ఇంక వాళ్ళూ, ఈవిడా ( అంటే మా ఇంటావిడ) ఒకటే ఖబుర్లు! ఒకటా రెండా, నలభైయేళ్ళ ఖబుర్లు చెప్పుకోవాలి.

ఈ కార్యక్రమం ( అంటే ‘ఓహో సిత కూతురివా, వగైరా వగైరా..)జరుగుతున్నంతసేపూ, నన్ను ఎవళ్ళూ మాత్రం పట్టించుకోలేదు.ఇంత పెద్ద మగాడ్ని పట్టుకుని! పాపం ఒక పెద్దావిడ మాత్రం,ముంగిలా వెనక్కాలే నుంచున్న నన్ను చూసి, మా ఇంటావిడని అడిగారు’ ఏమే మీ ఆయనా ఏమిటీ’ అంటూ. మా ఇంటావిడ కూడా అదేదో పేద్ద ఒబ్లైజు చేస్తూన్నట్లు, ‘హా’ అంది.మొత్తానికి నాకూ ఓ గుర్తింపొచ్చేసింది. మరీ ఎవడో పెళ్ళింట్లో సరుకులెత్తుకుపోయేవాడిలా కాక, నాకూ ఓ ‘స్థానం’ ఇచ్చేశారు.అప్పటికే ఓ పాతిక మందిదాకా, గుర్తుపట్టడాలూ( ఆవిడని,నన్ను కాదు, నన్ను ‘ఆల్సో రాన్’ లో వేశారు)వగైరా అయ్యాయి.ఈ లోపులో పెళ్ళికొడుకు తల్లి వచ్చి మా ఇంటావిడని, ప్రత్యేకంగా పిలిచి, పెళ్ళికూతురుని చూపించడానికి తీసికెళ్ళారు.అక్కడ కూడా ‘ జాతి వివక్షణే’ నన్ను పిలవలేదు!పోన్లెండి!

వచ్చిన గొడవల్లా ఏమిటంటే, కనిపించిన ప్రతీ చుట్టానికీ, ప్రక్కనే షాడో లా నుంచున్న, నన్ను ‘ లక్ష్మి మొగుడే’ అంటూ పరిచయం చేయడం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళూ, నా పేరడగలేదు, నా వయస్సడగలేదు, ఏదైనా ఉద్యోగం చేసేవాడినా అని అడగలేదు, అసలు ఊపిరి పీలుస్తున్నానా లేదా అనికూడా అడగలెదు! సింప్లీ ‘లక్ష్మి మొగుడు’ దట్సాల్ !!

వెతగ్గా వెతగ్గా మొత్తానికి నాకూ,వీళ్ళకీ ఉండే ఓ కామన్ ఫ్రెండొకాయన దొరికారు. అమ్మయ్యా అనుకుని,ఆయన్ని పలకరించాను. పాపం ఆయన సంగతీ నాలాగే ‘ఫలానా ఆవిడ మొగుడూ’ అని! ఆయనా వారి భార్య వెనక్కాలే షాడోలా ఫాలొ అవుతూండగా,మొత్తానికి నేను దొరికాను. అదృష్టంకొద్దీ ఆయనతో కబుర్లెసుకున్నాను.
ఇంక మా ఇంటావిడ చుట్టరికాల రివైవల్ కార్యక్రమంలో, ఎవరినో కలవడం,నన్ను పిలవడం, ‘ ఈవిడ తెలుసునా, మన పెళ్ళిలో స్టీలు క్యారీయరిచ్చిందీ,పిల్ల బారసాలకి స్టీలు ప్లేటిచ్చిందీ, గుర్తొచ్చారా’ అంటూ. నాకు నిన్న తిన్నదెదో ఇవాళ్టికి గుర్తుండదు, నలభై ఏళ్ళక్రితం ఎవరు స్టీలు పళ్ళెం ఇచ్చారో, ఎవరు ఉధ్ధరిణిచ్చారో ఎవడికి గుర్తూ? అయినా అదేదో గుర్తున్నట్లుగా, ఓ పోజు పెట్టడం!

ఈ వ్యవహారంలో నన్ను ఇరకాటంలో పెట్టే లోపలే ఇక్కడినుండి వెళ్ళిపోవడం ఆరోగ్యానికి మంచిదీ అనుకుని,మా ఇంటావిడని, వాళ్ళ చుట్టాలతో రాత్రంతా కబుర్లు చెప్పుకోమని, అక్కడ వదిలేసి, ఓ ఆటో పట్టుకుని కాచిగూడా వెళ్ళిపోయాను. అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే, పదిహేను రోజుల క్రితం, నా మేనకోడలి కొడుకు పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడేమో అందరూ ఈవిడని ‘ఫణి పెళ్ళాం, ఫణి పెళ్ళాం’ అనేకానీ, ఈవిడకి అసలు గుర్తింపే ఇవ్వలేదుట! అందుకని నన్ను ఈ పెళ్ళికి కావాలని తీసికెళ్ళి,తణుకు వాళ్ళేమిటో చూపించింది! ఏమిటో అమాయకుడినీ, ఇవన్నీ తెలియకుండా ‘ట్రాప్ ‘ లో పడిపోయాను!

మా చిన్నప్పుడు ఓ సామెత వినేవాళ్ళం, ఓ పెద్దాయన్ని పెళ్ళైనప్పటినుండీ ‘ పాతూరి బుల్లెంకమ్మ గారి మొగుడూ ‘ అనేవారుట.అంటే ఈ పెద్దాయనకి అస్థిత్వం లేనట్లుగా, అలా మేము వెళ్ళిన పెళ్ళిలో ‘ లక్ష్మి మొగుడు’ గా గుర్తింపు వచ్చింది. అన్ని రోజులూ మనవి కాదుగా! !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-వైద్యో నారాయణ హరి-2

    మేము 1975 లో ఫాక్టరీ క్వార్టర్స్ కి వచ్చినప్పుడు దగ్గరలో ఒక ఆర్.ఎం.పి డాక్టరొకరుండేవారు.ఆయన ఆయుర్వేదం,హోమోపతీ,ఎల్లోపతీ మూడూ చేసేవారు.మా ఇంటావిడకి తలనొప్పి ఒకటి ఉండేది.ఎలోపతీ లో అన్నిరకాల టెస్టులూ చేయించినా ఉపయోగం లేకపోయింది. ఎవరో చెప్తే ఈ డాక్టరుగారి దగ్గరకు వెళ్ళాము.అక్కడ విపరీతమైన రష్ గా ఉంది.నెంబరు టోకెన్ ఇచ్చి,ఓ రెండు గంటలు పోయిన తరువాత రమ్మన్నారు.ఆయన ఎంత బిజీ అంటే,ఓ చేత్తో ఒకపేషెంటు నాడి చూసేవారు,రెండో చేతితో స్టెతస్కొప్ పెట్టి ఇంకో పేషెంటుని చూశేవారు. ఆ ప్రక్రియలో, మా ఇంటావిడని ఒకచేతికి అందిచ్చాను! సమస్యేమిటీ దానికి మేము ఏమేం చేశామో చెప్పేలోపలే, ‘ బారా నెంబర్ గోళీ’ అని ఓ అరుపు అరిచారు,కాంపౌండర్ ఓ చిన్న బాటిల్ లో ‘బయోటెక్’ మాత్రలు తెచ్చి ఇచ్చాడు.వాటిని మూడు రోజులు వరుసగా వేసికోమని,నాలుగో రోజుకి తగ్గకపోతే,తిరిగి రమ్మన్నారు. ఫీజు–ఒక రూపాయి,అరవై అయిదు పైసలు మాత్రమే! మీరు నమ్మినా నమ్మకపోయినా, మా ఇంటావిడ తలనొప్పి మాయంఅయిపోయింది మూడో రోజుకి! ఆ డాక్టరుగారు ఇప్పటికీ మాకు దగ్గరలోనే ఉన్నారు, ఓసారి వెళ్ళి నా మోకాలి నొప్పికేదైనా మందిస్తారేమో చూడాలి! ఆయన అసలు ఉద్యోగం-ఈ.ఎం.ఈ. వర్క్ షాప్ లో కార్పెంటర్ !!!

    మాకు సి.జి.ఎచ్.ఎస్ ఉంది, కానీ చిన్న చిన్న సమస్యలకి, ఆ డిస్పెన్సరీకి వెళ్ళి క్యూ లో నుంచునే ఓపిక లేక, దగ్గరలో ఉండే డాక్టర్లదగ్గరకే వెళ్తూంటాము. ఇంక కార్పొరేట్ ఆసుపత్రిలకి వస్తే,ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఒకసారి నా మోకాలి నొప్పికి, మా దేష్పాండే గారు అదేదో డాప్లర్ టెస్ట్ చేయించుకోమన్నారు. సరేకదా అని జహంగీర్ ఆసుపత్రికి వెళ్తే, ముందుగా రెండు వందలూ వసూలుచేసి, మూడు గంటలు కూర్చోపెట్టి, రెండు రోజుల తరువాత రమ్మన్నారు! రోడ్డుకి అవతలివైపు ఉన్న రూబీ హాల్ కి వెళ్తే, నూట పాతిక రూపాయలకి,ఆ టెస్ట్ చేసి పంపారు. ఇలా ఉంటాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రులు, ఎవడికెంత తోస్తే దోచుకోవడమే! ఇదంతా నేను అప్పుడు పూణే లో ఉన్న న్యూస్ పేపర్లన్నిటికీ వ్రాస్తే, వాళ్ళు, ఆ ఆసుపత్రుల పేర్లు వేయకుండా, మిగిలినదంతా పబ్లిష్ చేశారు.ఇదేమిటీ అని అడిగితే, ‘మేము అన్ని ప్రూఫ్ లూ ఉంటేతప్ప, పెద్ద పెద్ద ఆసుపత్రుల పేర్లు వ్రాయమూ అన్నారు! ఇలా ఉంది మన ‘ఫొర్త్ ఎస్టేట్’! నా దగ్గర జహంగీర్ వాళ్ళిచ్చిన రసీదూ,రూబీ వాళ్ళిచ్చిన రసీదూ ఉన్నాయి మొర్రో అన్నా వినలేదు. ఒఖ్ఖళ్ళనే అనేదేమిలెండి, మన న్యూస్ పేపర్లూ అలాగే ఉన్నాయి!’యు స్క్రాచ్ మై బాక్, ఐ స్క్రాచ్ యువర్స్’ అనే పధ్ధతిలో!

    పళ్ళుతీయించుకున్నప్పుడు, మా కజిన్ మిలిటరీ హాస్పిటల్ లో సి.ఓ. కాబట్టి, అంతా మహరాజభోగంలా జరిగింది, నాలుగుసార్లూ! ఇంకా కొన్ని పళ్ళుంటే బాగుండునూ అనిపించేలా !!ఏంచేస్తాం అన్నీ పీకించేశాను! ఆ తరువాత డెంచర్స్ తయారుచేయడానికి కమాండ్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడూ, చాలా బాగా చేశారు.ఊరికె వచ్చాయి కాబట్టి ఉపయోగించడంలెదనుకోండి,అది వేరే సంగతి! అప్పుడే అనిపిస్తూంటుంది ‘ఫుకట్’ గా వచ్చినదానికి విలువ ఇయ్యము,అదే వందలూ,వేలూ ఖర్చుపెట్టుంటే, చచ్చినట్లు ఉపయోగించేవాడిని!దాన్నేఅంటారు ‘పెరట్లో చెట్టు వైద్యానికి ఉపయోగించదూ’అని!అలాగే ఇంట్లో డాక్టర్లున్నా సరే, వాళ్ళమాట ఎక్కడ వింటామూ? వాళ్ళు ఊళ్ళోవాళ్ళందరికీ దేముళ్ళు, మనం మాత్రం ‘కేర్’ చెయ్యం!

   మాకు దగ్గరలో ఉన్న ఓ డాక్టరు గారు విజిట్ కీ పాతిక తీసికుంటారు.నేను ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ నలభైఏళ్ళనుండీ, వెళ్ళే డాక్టరుగారు, వెళ్ళినప్పుడల్లా, పేషెంటుకి, వంద చొప్పున తీసికుంటున్నారు.ఈ డాక్టర్లు కూడా, వాళ్ళుండే యేరియాని బట్టి వసూలు చేస్తారనుకుంటాను.ఇంటద్దీ అన్నీ కలిపి మనకి రుద్దేస్తారు! ఈయన చిన్నపిల్లలకి డాక్టర్. సంవత్సరాలనుండీ తెలిసున్నవాడూ అనే సెంటిమెంటుతో వెళ్ళినప్పుడల్లా పేషంటుకి వంద చొప్పునా సమర్పించుకుంటున్నాము!
ఓ తలనొప్పి/జ్వరం కి సంబంధించిన మాత్రోటి ఉంటుంది, ఒక్కో కంపెనీది ఒక్కో రేటు. మామూలుగా పారాసిటమాల్/క్రోషిన్ 10 రూపాయలకి పదీ ఇస్తాడు,అదే డాక్టర్లు వ్రాసిన దానికి పదిహెను లాగిస్తాడు! దానర్ధం, ఆ కంపెనీ ఏజెంటెవడో వెళ్ళి, ఆ డాక్టరుగారికి సమర్పించిన బహుమతుల ఫలితం అన్నమాట! పోనీ ఏళ్ళ తరబడీ వస్తున్నారూ అనే జాలైనా ఉండదు, ‘ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదు’ అన్నట్లుగా!
మరీ మంచంపట్టే రోగం ఏదీ రాకుండా వెళ్ళిపోతే బాగుండునూఅనిపిస్తూంటుంది, ఈ హాస్పిటళ్ళ వ్యవహారాలు చూస్తూంటే, ఏమో ఆ భగవంతుడు ఏం రాసిపెట్టాడో !!!
మళ్ళీ మిమ్మల్ని మంగళవారంనుండీ బోరు కొడతాను. ఈ మూడు రోజులూ భాగ్యనగరంలో!

బాతాఖాని-లక్ష్మిఫణి – కబుర్లు-వైద్యో నారాయణా హరీ!!

    ఈ రోజుల్లో డాక్టర్లదగ్గరకు వెళ్ళాలంటే భయం.ఏవేవో టెస్టులు చేసేసి బిల్లు చేతిలో పెట్టేటప్పడికి, లేని రోగాలు కూడా వచ్చేస్తూంటాయి. మా చిన్నప్పుడు ఊరికి ఓ నలుగురో,ఐదుగురో డాక్టర్లుండేవారు. అమలాపురంలో హరిహరస్వామి గారూ, మంథా సుబ్బారావుగారు, గోటేటి సరస్వతి గారు,వీరే కాకుండా ఇంకా కొంతమంది ఉండేవారు.వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా డబ్బులీయఖ్ఖర్లేకుండా, ఏదో ఏడాదికి ఇంత అని ఇచ్చేవారు.అయినా ప్రతీదానికీ వెళ్ళేవారు కాదు.చిన్నచిన్న రోగాలు-జలుబూ,దగ్గూ,లాటివాట్లకి అల్లంరసం,శొంఠి కషాయం తీసుకోవడం,ఓ రెండురోజులు లంఖణం చేసేస్తే ఆ రోగం కాస్తా హాం ఫఠ్ !
<p.    ఏ కాలినొప్పో ,కాలు బెణకడంలాటిది వస్తే మా అమ్మమ్మగారు ‘ఇరుకు మంత్రం’ వేసేవారు. మన నమ్మకమో లేక నిజంగా వాటిల్లో మహాత్మ్యం ఉందో తెలియదుకానీ, రెండో రోజుకి తగ్గిపోయేది.పంటినొప్పి వస్తే ఓ లవంగం పెట్టుకుంటే తగ్గిపోయేది.నాకు చిన్నప్పుడు మోకాలు వాచిపోయేది,ఎన్నెన్నో వైద్యాలు చేయించారు.ఎవరేం చెప్తే అది.వాటిలో భాగంగా ఓసారి, మోకాలికి
తరవాణి అన్నం,చక్రకేళీ అరటిపండూ కలిపి కట్టమన్నారు. ఆ కాంబినేషను, నొప్పిమాట దేముడెరుగు, ఎవరూ చూడకుండా తినడానికి బాగుండేది!

నా అదృష్టమేమంటే, సర్వీసులో ఉన్న 42 సంవత్సరాలూ, డాక్టర్ల విషయంలో ఎప్పుడూ సమస్య రాలేదు. పిల్లలకి వైద్యానికి ఒకాయన ఉండేవారు పూనాలో.చెప్పానుగా ఈ నలభై ఎనిమిది సంవత్సరాలూ, ఆయన దగ్గరకే వెళ్తున్నాము. గైనకాలజీ కి అయితే మా డాక్టరమ్మగారు.మెము వరంగాం లో ఉన్నప్పుడు పరిచయం అయిన డాక్టరు దేష్ పాండే గారితో పరిచయం ఇప్పటికీ సాగుతోంది.ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ముందుగా ఆయననే సంప్రదించి, ఆయన ఏ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళమంటే వారిదగ్గరకే వెళ్ళడం.అవడం సాదా సీదా ఎం.బి.బి.ఎస్సే, కాని డయాగ్నసిస్ మాత్రం అద్భుతం. మామూలు వాటికి ఆయనే ఇచ్చేవారు.అదృష్టం కొద్దీ ఏ సీరియస్ సమస్యా లేకుండా లాగించేస్తున్నాము. పళ్ళు తీయించడంలో, మా కజిన్ చాలా సహాయం చేశారు.

ఇంట్లో ఒక్క డాక్టరుంటే బాగుండుననిపిస్తోంది అప్పుడప్పుడు. కానీ వాళ్ళతో ఓ తంటాకూడా ఉంది. అది తినకూ,ఇదితినకూ,అంటూ ప్రతీ రోజూ ఉన్నదానికీ,లేనిదానికీ ప్రాణం తీస్తారు!అంతా మన మంచికోసమే అనుకోండి, అయినా అస్తమానూ క్లాసులు తీసుకుంటూంటే,కష్టం కదా!ఎన్ని జాగ్రత్తలు తీసికున్నా వచ్చే రోగాలెలాగూ వస్తాయి బయట ఉండే పొల్యూషన్ వల్లా, మనం తినే తిండి వల్లా, మరి ఈ మాత్రందానికి మన ప్రాణాలు తీయడం ఎందుకో!

మేము రాజమండ్రీ లొ ఉన్నప్పుడు,మా అమ్మాయీ అల్లుడూ వచ్చారు. అల్లుడుగారికి ‘రివర్ బే’ లో తిన్న తిండి ధర్మమా అని స్టమక్ అప్సెట్ వచ్చింది. దగ్గరలో ఉన్న ఓ డాక్టరు దగ్గరకు వెళ్తే, అక్కడ చాలా మంది వెయిటింగు లొ ఉన్నారు.డాక్టరుగారిని, కొంచేం ప్రయారిటీ లో చూడమన్న పాపానికి, 300/- రూపాయలు ఛార్జ్ చేశారు. అవేవో నాలుగైదురకాలమందులు వ్రాసి ఇచ్చారు.దానికింకో మూడు వందలు, చిత్రమేమిటంటే ఓ డోసు వేసికోగానే అన్నీ బాగుపడ్డాయి.ఆ ఇచ్చేవికూడా ఓ యాంటీ బయాటిక్కూ,దాంతో వచ్చే యెసిడిటీ కి ఓ మందూ, ఓ రెండు మూడు రకాల విటమిన్లూ, అసలు ఇన్ని అవసరమా అనిపిస్తూంటుంది. అవున్లెండి డాక్టర్లూ బ్రతకాలి,ఆయన పెట్టుకున్న మందుల దుకాణమూ బ్రతకాలి.ఇంకో సంగతేమంటే సదరు డాక్టరుగారు వ్రాసిన మందులు ఇంకే కొట్లోనూ దొరకవు. పోనీ ఇంకో కొట్టుకి వెళ్ళి కొనుక్కుందామా అంటే, మనం కొన్న మందులు తీసికొచ్చి చూపించమంటాడు. ఈ గొడవలు పడలెక, చచ్చినట్లు ఆయన కొట్లోనే కొంటాం.

ఇంకో సారి మా ఇంటావిడకి వైరల్ ఫీవర్ లాటిది వస్తే దగ్గరలో ఉన్న డాక్టరు ( ఇదివరకు అల్లుడి విషయంలో వెళ్ళినాయన కాదు, ఎందుకంటే ఆయన ఇంకో పేరు చెప్పి మళ్ళీ నాదగ్గర 300/- లాగించేస్తే! వామ్మోయ్ అసలే పెన్షనుమీద బ్రతుకుతున్నవాడిని!).ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి వెళ్ళాను. ఊరికె ఈవిడని తీసికెళ్ళి అక్కడ కూర్చోపెట్టడం ఎందుకూ అని.
దగ్గరలో ఎక్కడ చూసినా ఆర్థోపెడిక్సూ, కళ్ళవాళ్ళూ, దంతాలవాళ్ళే ఉన్నారు. మొత్తానికి ఓ డాక్టరు పేరుచూసి, ఈయన జనరల్ ఫిజీషియనే కదా అని వెళ్తే ఆయన రాత్రి 8.00 గంటలదాకా రారన్నారు అక్కడ ఉండే నర్సమ్మ.8.00 గంటలకల్లా తీసుకువచ్చేయండీ, డాక్టరుగారు రాగానే మిమ్మల్నేముందర పంపిస్తానూ అనే ఎష్యూరెన్స్ ఆధారంగా, మా ఇంటావిడని తీసికుని వెళ్ళాను.
ఎనిమిదయ్యింది,తొమ్మిదైనా ఆ మహానుభావుడు రాడే.ఆ నర్సమ్మేమో ముందరే వందరూపాయలూ పుచ్చెసికుంది ( బస్సుల్లో కండక్టర్లు ముందరే టిక్కెట్టు కోసేస్తారు. ఆ బస్సు ఎప్పుడు బయలుదేరినా మనం చచ్చినట్లు దాంట్లొనే కూర్చోవాలి అలాగన్నమాట!). పోనీ ఆ వందా పొతేపోయింది ( అప్పటికే ప్రయారిటీ పధ్ధతిలో 300/- ఇచ్చుకున్న వాల్యుబుల్ ఎక్స్ పీరియెన్సుందిగా!) ఇంకో డాక్టరుదగ్గరకు వెళ్దామా అంటే ఆ నర్సమ్మ వెళ్ళనీయదే! మొత్తానికి ఆడుతూ పాడుతూ వచ్చారండి డాక్టరుగారు, నాకు చిర్రెత్తిపోయింది అడిగేశాను ‘ మీకు ఓ టైమూ గట్రా ఉండవా’ అని. నాదేంపోయిందీ, మళ్ళీ ఆయన మొహం నేను చూడనూ,నామొహం ఆయన చూడడూ! ఏదో వయరల్ ఫీవర్ అని చెప్పి ఓ కాగితంనిండా ఏవేవో వ్రాసి ఇచ్చారు.మామూలేగా ఆయన కొట్లోకే వెళ్ళి తీసికున్నాను.అంతా కలిపి మొత్తం మూడు వందలూ పూర్తిచేశారు.అంతా బాగానే ఉందికానీ, ఆ కాగితం మీద ప్రతీ మందు ముందరా తెలుగులో
ఉ. మ. రా. అనివ్రాశారు. మళ్ళీ ఇదేదో యునానీ మందేమో అనుకుని, అవి ఇవ్వలెదే అని ఆ కొట్టువాడిని కోప్పడ్డాను.అవి మందులు కాదండి బాబూ,వాటి అర్ధం- ఉదయం, మధ్యాన్నం, రాత్రి- అని! ఏదో మేం చేసికున్న పూర్వజన్మ పుణ్యం అనుకోండి, ఇంకే డాక్టరుదగ్గరకూ వెళ్ళవలసిన అవసరం లేకుండా మళ్ళీ ఆ ఉ.మ.రా ల అవసరం లేకుండా వచ్చేశాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వర్షాలొచ్చేశాయి !!!

    వర్షాలు మొదలెట్టడం,స్కూళ్ళు తెరవడం అదేమిటో ఎప్పుడూ ఒకేసారి మొదలౌతాయి.ప్రొద్దుటే 4-5 సంవత్సరాల పిల్లల దగ్గరనుండీ, పాపం రెయిన్ కోట్లు చుట్టబెట్టుకుని ఆ వర్షంలో
వెళ్తూంటే చాలా జాలి వేస్తుంది.ఈ రోజుల్లో అంత చిన్న వయస్సునుండీ స్కూళ్ళకి పంపకపోతే, ఆ తరువాత కష్టం అయిపోతుంది.

    ఈ వర్షాలు కూడా ప్రొద్దుటే స్కూలు మొదలెట్టే టైముకీ, మధ్యాన్నం/సాయంత్రం స్కూలు విడిచే సమయానికే వస్తూంటాయి! ఆ పిల్లలు ఇంటికి క్షేమంగా చేరేదాకా తల్లితండ్రులకి టెన్షనే.
కానీ ఏమీ చేయలేని పరిస్థితి.ఇవన్నీ చూస్తూంటే మేము ఎంత అదృష్టవంతులమో అనిపిస్తూంటుంది.మా రోజుల్లో మరీ ఇంత చిన్న వయస్సులో స్కూళ్ళకి పంపలేదు.గట్టిగా వర్షం వస్తే స్కూలు బందు చేసేవారు. స్కూలు జరుగుతున్న టైములో వస్తే ‘కంటిన్యూ’ చేసేవారు.ఇంటర్వెల్ లేకుండా, ఇంకో రెండు గంటలు కూర్చోపెట్టి, పెందరాళే అంటే ఏ రెండింటికో ఇళ్ళకు పంపించేసేవారు. హాయిగా ఉండేది.

    మా పిల్లలైతే ఈ కాన్వెంటులూ గొడవా లేకుండానే, కేంద్రీయ విద్యాలయాల్లో( అది కూడా మా క్వార్టర్ కి ఎదురుగా ఉండేది) లాగించేశారు.కానీ వాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లల్ని స్కూలుకి పంపడానికి చేసే కసరత్తులు చూస్తూంటే, ఏం చేయాలో తెలియడంలేదు.ప్రొద్దుటే 7.30 కి స్కూలు బస్సొచ్చేస్తుంది. టైముకి పంపడానికి వీళ్ళు పడే తిప్పలు చూస్తూంటే,నేను నా విషయంలో కానీ,మా పిల్లల విషయంలో కానీ అసలు కష్టపడ్డట్టే లేదు!

    ఈ వర్షాల్లో యూనిఫారంలు ఎన్ని జతలున్నా సరిపోవు.వాటిని ఉతికి ఆరేయడం,నెక్స్ట్ టు ఇంపాసిబుల్. పెద్ద పిల్లలైతే కొంచెం బాధ్యతతో ఉంటారు. చిన్నవాళ్ళు లోయర్ కేజీ నుండి,తర్డ్ క్లాసు వరకూ ఉండే పిల్లలతో పడే కష్టాలు పగవాడిక్కూడా ఉండకూడదనిపిస్తుంది. రైన్ కోట్లు ఇచ్చినా సరే, వాటిని వేసికోకుండా వర్షంలో తడవడమే వాళ్ళ జన్మహక్కనుకుంటారు. పైగా వీలుంటే ఆ రైన్ కోటు ని స్కూల్లోనో, బస్సులోనో డెలిబరేట్ గా మర్చిపోవడం ఒకటీ.ఇది పోతే మమ్మీ డాడీ కొత్తది కొంటారులే అని ఓ భరోసా! పైగా ఈ వర్షాల్లో చిన్న పిల్లలకి తప్పకుండా ఈ జలుబో, దగ్గో రాకుండా ఉండదు. డాక్టర్లకి ఈ వర్షాకాలం ఓ వరం లాటిది.

    ఏడాది కి కావలిసినంత నీరూ, నదుల్లోకీ, డాముల్లోకీ ఎలా సమకూర్చుకుంటామో, అలాగ ఈ డాక్టర్లు కూడా ఏడాది పొడుగునా సంపాదించేదానికన్నా, ఈ వర్షాకాలంలోనే మేక్ అప్ చేసేస్తూంటారు.ఇంటికి ఎంతమంది పిల్లలుంటే డాక్టర్లకి అంత ఆనందం.ఒక పిల్లకి వచ్చిన సమస్య ఇంకోళ్ళకి రాదు, పోనీ ఆ పిల్లకో పిల్లాడికో వచ్చినప్పుడు ఇచ్చిన మెడిసిన్, ఈ రెండో వాడికి ఇద్దామనుకుంటే, ఆ డాక్టరు ఒప్పుకోడు.పైగా సెల్ఫ్ మెడికేషన్ వల్ల వచ్చే నష్టాలమీద ఓ క్లాసు తీసికుంటాడు. ఇంతా చేసి, ఆ వర్షంలో తీసికెళ్ళినా, ఇంకో కంపెనీది అదే యాంటీ బయాటిక్క్ వ్రాసి, 100 రూపాయలూ వసూలు చేస్తాడు!

    ఈ వర్షాకాలంలో బస్సుల్లో చూడాలి, గొడుగులు తడిసిపోయి, నీళ్ళు కారుతూ ఉంటాయి.వీళ్ళ ధర్మమా అని, పొడిగా ఉన్నవాళ్ళు తడైపోతారు.బస్సుల్లో కిటికీ గ్లాసులు ఛస్తే క్రిందికి దిగవు.దాంతో, సీట్లన్నీ తడిసిపోతూంటాయి. మన వైపు ‘పల్లెవెలుగు’ బస్సులు అయితే, ఇంక చెప్పఖ్ఖర్లేదు.లోపలకి వర్షంనీళ్ళు కారుతూనే ఉంటాయి.
ఆఫీసుల్లోనూ, దుకాణాల్లోనూ, గొడుగులు బయటే పెట్టి రమ్మంటారు. ఎవడెక్కడ ఎత్తుకుపోతాడనే భయమే. ఇంక రైతుబజార్లకీ, సంత లకీ వెళ్ళేటప్పుడైతే, ఏదో ఓ కొట్లో మర్చిపోయే ఆస్కారం ఎక్కువ.

   ఇంక ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని సోఫాల్లో కూర్చోమనాలంటే, అవి ఎక్కడ పాడైపోతాయో అని భయం.అన్నిటిలోకి, ఇంటికి వచ్చే పనిమనుషులతో వస్తుంది.చాలా మంది
గొడుగుల్లేకుండానే వస్తారు. ఆ పనిమనిషి వర్షంలో వెళ్తే ఏ రోగమో వచ్చి మర్నాడు రాదేమో అనే భయం తో, ఇంట్లో ఉన్న గొడుగు, దానికిస్తాము.మన అదృష్టమ్ బాగుందా, మర్నాడు వర్షం వస్తుంది, ఆ గొడుగూ తిరిగి చూసే భాగ్యం ఉంటుంది.

    వర్షాల్లొ మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు పుంఖానుపుంఖంగా వచ్చేస్తూంటాయి.ఇప్పటిలా అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లు కాదుగా, ఇంటికి ఎదురుగా పెద్ద స్థలం,వెనక్కాల పెరడుతోటీ కలకలలాడుతూండేవి. పేద్ద వర్షం వచ్చిందంటే చాలు,మోకాలు లోతు నీళ్ళతో నిండిపోయేవి. ఆ నీళ్ళల్లో కాగితపు పడవలు చేసికుని ఆడుకోడం ఎంత బాగుండేదో. వర్షాకాలంలో, జలగల గొడవ
ఒకటి. ఆవులకీ, గేదెలకీ పొదుగులకి పట్టేసేవి.ఒక్కోప్పుడు మనల్ని కూడా పట్టుకునేవనుకోండి. నూతుల్లో నీళ్ళు ఎంతో పైకి వచ్చేసేవి. ఈ రోజుల్లో నూతులేలేవు.ఇంక నీళ్ళెక్కడినుండి వస్తాయి?.

   అయినా ఆరోజుల్లో వర్షాలుకూడా టైముకే వచ్చేవి. ఇప్పుడో ‘అదేదో గ్లోబల్ వార్మింగ్’ ధర్మమా అని వర్షాలూ, అప్పుడప్పుడు డుమ్మా కొట్టేస్తూంటాయి. చాలా మందికి ఈ వర్షాకాలం చాలా రొమాంటిక్ గా ఉంటుంది.బయట హోరున వర్షం పడుతూంటే,వేడీ వేడిగా చాయ్ త్రాగుతూ….ఇవన్నీ ఆరోజుల్లో ఉండేవి. ఇప్పుడో వర్షం వచ్చినా ప్రళయం వచ్చినా ఆఫీసులనుండి, ట్రాఫిక్ జాం లలో చిక్కుకుని, ఏ అర్ధరాత్రికో కొంపకు చేరేసరికి బాస్సు దగ్గరనుండి ఫోనూ, అదేదొ ప్రాజెక్ట్ ఏమయిందీ అంటూ- దేనికైనా రాసిపెట్టుండాలండి బాబూ.….

%d bloggers like this: