బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–EMIs

    1992 తరువాత ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని ఈ.ఎం.ఐ లు ఒక ఫాషన్ అయ్యాయి. ఇదివరకటి రోజుల్లో అయితే ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలంటే, దానికి కావలిసిన డబ్బు చేకూర్చుకోవడమూ, తీరా అంత డబ్బూ పోగైన తరువాత ఏదో అనుకోని ముఖ్యమైన ఖర్చు రావడమూ, ఈ డబ్బు దానికి ఖర్చైపోవడమూ. అలాగే జీవితమంతా గడిచి పోయింది.నెను మొట్టమొదట టి.వీ. కొనడానికి, మా క్రెడిట్ సొసైటీ లో లోన్ తీసికుని కొన్నాను.ఆ లోన్ జీతం లో కట్
చేసేవారు. ఒకవిధంగా అదికూడా ఈ.ఎం.ఐ లాంటిదే. ఆ రోజుల్లో అందరూ కొంటున్నారు కదా అని ఫ్రిజ్ కొందామని వెళ్తే ఆ రోజుల్లో కొన్ని బాంకులు కొన్ని కంపెనీలతో లింక్ పెట్టుకొని, ఆ కంపెనీల వస్తువులకే అప్పు ఇచ్చేవారు. అందువలన ఫ్రిజ్ కొనడం పడలెదు. ఎవరైనా అడిగినా ” మాకు ఫ్రిజ్ అంటే అంత ఇష్టం లేదండీ” అంటూ, ఓ వెర్రి సాకు చెప్పేవాడిని!! వచ్చే జీతం సంసారం సజావుగా గడపడానికే సరిపోనప్పుడు ఈ వస్తువులన్నీ లగ్జరీ ఐటం ల లాగే కనిపించేవి. అదృష్టం ఏమిటంటే మా ఇంటావిడ కానీ, పిల్లలు కానీ ఎప్పుడూ నన్ను ఇరుకున పెట్టలెదు–ఇలాంటివి కావాలని !! పూణే లో ఉన్నంత కాలం, ఫ్రిజ్ కొనుక్కునే అవకాశమే రాలెదు– కారణం అంత డబ్బు ఎప్పుడూ స్పేర్ లో ఉండేది కాదు. అలాంటిది నాకు వరంగాం ట్రాన్స్ఫర్ అయిన ఏడాది లోపులో అంత డబ్బూ ఒక్కసారే ఇచ్చేసి “ఆల్విన్” ఫ్రిజ్ కొన్నాము. ఆరోజు నిజంగా మా ఇంట్లో పండగే, మొట్టమొదటిసారిగా పూర్తి డబ్బు ఇచ్చి ఓ వస్తువు కొనుక్కోడంలో ఉన్న మజా ఏమిటో తెలిసింది !! ఇదంతా నేనేదో ఘనకార్యం చేశాననడానికి చెప్పటంలేదు, వాయిదా పధ్ధతి కాకుండా వస్తువు కొనడంలో ఉన్న ఆనందం/ సంతోషం ఎలా ఉంటాయో చెప్పాలని మాత్రమే. మీ ఇళ్ళలో ఉన్న మీ నాన్న గారిని కానీ, తాత గారిని కానీ అడిగి చూడండి–వాళ్ళు చెపుతారు.

    అలాంటిది ఈ రోజుల్లో ఎవరైనా ఏ వస్తువైనా– అది ఇల్లు కానీండి, కారు కానివ్వండి, ఇంట్లోకి కావలిసిన ఏవస్తువైనా సరే– అలా కొనకలుగుతున్నారా? ఏమైనా అంటే ఈ రోజుల్లో అన్నింటికీ ఖరీదులు ఎక్కువా అంటున్నారు, కానీ మీ జీతాలు కూడా అలాగే ఉన్నాయిగా బాబూ. వీటికి సాయం క్రెడిట్ కార్డులు, వాళ్ళైతే గూబ పగిలేటట్లుగా వడ్డీ వసూలు చేస్తారు. అయినా సులభ వాయిదాలంటూ మనం కొంటూనే ఉంటాము. ఉద్యోగం రాగానే ముందుగా ఓ బైక్కూ, కారూ, ఫ్లాట్టూ కొనేయాల్సిందే. అవి మనచేత కొనిపించడానికి ఈ బాంక్ వాళ్ళు ఎప్పుడూ రెడీ గా ఉంటారు, గుంత కాడ నక్కల్లాగ!!ఫ్లాట్ కొనగానే సరి కాదుగా, దానిలోకి కావలిసిన హంగులన్నీ కావాలిగా!! అన్నీ కలిపి తడిపి మోపిడౌతుంది. ఊళ్ళో మనవాడింట్లో అందరూ వీడి ప్రయోజకత్వమే అనుకుంటారు. అబ్బో మన వాడు ఉద్యోగంలోకి వచ్చీరాగానే అప్పుడే ఇల్లుకూడా కొనేశాడుట, మంచి పెళ్ళికొడుకూ అని మార్కెట్ లో మంచి డిమాండ్ వచ్చేస్తుంది. జరిగేదేమిటంటే మనవాడికి పెళ్ళి అయేసరికే అప్పుల ఊబిలో ఉంటాడు. ఆ వచ్చే పిల్లకూడా ఉద్యోగం చేస్తేకానీ, ఈ అప్పులు తీరవు. ఈ మధ్యన వచ్చిన ఆర్ధిక మాంద్యం లాంటి దేమైనా వచ్చిందా అంతే సంగతులు, మింగలేరూ ,కక్కలేరూ.

    ఇదివరకనుకునేవారూ ఎప్పటికైనా చనిపోతే స్వంత ఇంట్లోనే పోవాలని. కారణం ఏమిటంటే అద్దె ఇంట్లో ఉంటే అతని ” డెడ్ బాడీ” ని ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు. అందుకనే “ అంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనక్కాల చచ్చేడూ “ అనే వారు, అంటే స్వంత ఇల్లు లేదని !! ఈ కారణం వలన ఇంటి యజమాని ఎలాగోలాగ తల తాకట్టు పెట్టైనా ఓ ఇల్లు నిలబెట్టుకునే వాడు,అదీ మరీ ఎక్కువ అప్పు చేయకుండా. బాగా వయస్సు పైబడ్డవాళ్ళుంటే అద్దెలకు ఇళ్ళు దొరికేవి కాదు.

    పొనీ ఈ రోజుల్లో అప్పు చేసి ఓ ఫ్లాట్ కొన్నామనుకుందాము, దానికి ఓ 15–25 సంవత్సరాలదాకా ఈ.ఎం.ఐ లు కడుతూండాలి. పోనీ కొన్ని సంవత్సరాలు ఎలాగో

పొదుపు చేసి ఆ అప్పు తీరుద్దామనుకుని బాంక్ వాడి దగ్గరకు వెళ్తే వాడు ఈ లెఖ్ఖలూ, ఆలెఖ్ఖలూ చెప్పి ముందరి 5 సంవత్సరాలూ వడ్డిక్రిందే డబ్బు కట్టామని తేలుస్తాడు, అంటే మన అప్పు అప్పులాగే ఉందన్నమాట.ఇన్నాళ్ళూ ఆ బాంక్ వాళ్ళ జీతాలు మనం ఇచ్చామన్నమాట !! అందుకనే ఈ బాంక్ ఎక్జిక్యూటివ్ లు, వాళ్ళ జీతాలకొసం మనని వాడుకుంటున్నారన్నమాట.రోజుకో ఫోన్ కాలూ, ” మీకు జీవితంలో ఏదైనా కొనాలనుకుంటే మేము అప్పు ఇస్తామూ” అని. పోనీ ఇన్ని కష్టాలూ పడి ఓ ఫ్లాట్ కొన్నామే అనుకోండి దాంట్లోనే నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకొని ఉండాల్సిందే. అద్దె ఇల్లు అయితే ఆ గొడవే ఉండదు, మనకి నచ్చకపోతే ఇంకో ఇల్లు చూసుకొంటాము. ప్రపంచం లోని ఇళ్ళన్నీ మనవే !! మనవాడు కట్టే ఈ.ఎం.ఐ 15–25 సంవత్సరాల అద్దె అన్నమాట. పైగా స్వంత ఇల్లని పేరొకటీ , ఆ ఇంటి కాగితాలు(ఒరిజినల్స్) మనం పాతిక సంవత్సరాల తరువాతే చూడడం.దీంట్లో ఇంకో జస్టిఫికేషన్ చెప్తారు, మనం ఇంటిమీద ఇన్వెస్ట్ చేసినది పాతిక సంవత్సరాల తరువాత డబులో, ట్రిపులో అవుతుందీ అని. ఓ సంగతి మర్చిపోతున్నాము మనం ఈ పాతిక సంవత్సరాలూ మనం కట్టినది (వడ్డి తో సహా) మాత్రమే మనకి వస్తూందీ అని. ఇందులో మనకి ఏదో లాభం వచ్చేసిందనడానికి ఏమీ లెదు.

    చెప్పేదేమిటంటే మనం ఈ విష వలయంలో చిక్కుకుపోయాము. బయట పడలేము. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఆస్థేమిచ్చారనేవారు, ఇప్పుడు ఈ.ఎం.ఐ లు ఇంకా ఎన్ని మిగిల్చాడూ అంటున్నారు !!

%d bloggers like this: