బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–హాస్యబ్రహ్మ

epaper-sakshi-com

హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి తో ఇంటిపేరు పంచుకోవడం, నేను చేసికున్న అదృష్టాలలో ఒకటి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

epaper-indianexpress-com

ఇలాటి మందేదో త్వరలో వస్తే అందరూ సుఖ పడతారు.

శ్రీ శ్రీనివాస బాబు తన ‘రచన’ బ్లాగ్గులో ఇచ్చిన ప్రకారం ప్రయత్నించాను.ఇదివరకటిలాగ పి.డి.ఎఫ్ డౌన్లోడ్ చేసికోవడం గొడవా లేకుండా, హాయిగా లింకు పెట్టేస్తే చాలు.రెడీ మేడ్ ఫుడ్స్ లాగ ,పి.డి.ఎఫ్ రెడీ అయిపోయింది. శ్రీనివాసూ, ధన్యవాదాలు.ఇలాటి ఇంకొన్ని కిటుకులు చెప్తే, నాలాటివారు సుఖ పడతారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నిజం చెప్పెస్తే ఉన్న హాయి…

    మామూలుగా మన జీవితంలో, మాట్లాడ్డం మొదలెట్టినప్పటినుండి, మన తల్లితండ్రులు నేర్పేస్తారు. ఎప్పుడూ నిజమే మాట్లాడాలనీనూ, అబధ్ధం చెప్పకూడదనీనూ. స్కూల్లో వెళ్ళినా కూడా,అక్కడ కూడా ఇదే నేర్పుతారు.కాబోసూ అనుకొని, మనం కూడా అదే అలవాటు చేసికుంటాము.కాల క్రమంలో, ఎప్పుడో అవసరంకొద్దీ అనండి, లేక మనం స్నేహం చేసే వాళ్ళవల్ల అనండి అబధ్ధాలు చెప్పడం మొదలెడతాము.మొదటిసారి అమ్మ దగ్గర అబధ్ధం చెప్పినప్పుడు కొంచెం తటపటాయిస్తాము.ఎప్పుడూ నిజమే చెప్పే తన కొడుకో/ కూతురో అబధ్ధం ఎలా చెప్తుందీ అనే దురభిప్రాయం తో, పాపం ఆ వెర్రితల్లి నమ్మేస్తుంది. కానీ ఆ స్టేజిలో అవేమీ ప్రాణహానికరమైన అబధ్ధాలు కావు (అని అనుకుంటాము మనం).కానీ, అవే మొదటి విత్తులు!

ఏ సినిమాకో వెళ్ళాలనిపిస్తుందనుకోండి, రాత్రిళ్ళు చదువుకోడానికి, ఫ్రెండింటికి వెళ్తున్నామూ అని సినిమా సెకండ్ షో కి చెక్కేయడం అన్నమాట. ఫ్రెండ్స్ తో జల్సా చెయ్యాలన్నప్పుడు, ఏవో పుస్తకాలు కొనుక్కోవాలీ అని డబ్బులు అడగడం వగైరా అన్నమాట!ఇంక పెద్ద అయ్యేకొద్దీ పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఈ అబధ్ధాలు చెప్పడం ఎంత అలవాటైపోతుందంటే, అసలు నిజం అనేది ఎలా ఉంటుందో మర్చిపోతాము. ఎప్పుడైనా పెళ్ళాంతో సినిమాకెళ్ళాలంటే, ఒంట్లో బాగోలేదని, ఆఫీసుకి శలవు పెట్టేయడం, మన ఇంటికి ఏ అప్పులాడైనా వస్తే, ఇంట్లో లేరని పిల్లలతో చెప్పించడం, వగైరా…ఇవన్నీ చూసి పిల్లలూ అవే నేర్చుకుంటారు. ఫర్వాలేదూ, మా నాన్నే అబధ్ధాలు చెప్తూంటే మనకేం నష్టం, అని వాడూ ఆ మార్గం లోకే వెళ్తాడు.ఇలాటి వాళ్ళు రాజకీయాల్లో బాగా పైకి వస్తారు.ఎందుకంటే ఆ ఫీల్డ్ లో నిజం చెప్తే, మనల్ని ఎవడూ నమ్మడు. అబధ్ధం అనేది ఓ ‘అబ్సెషన్’వాళ్ళకి!

మామూలు జీవితంలో కొంతమందికి ఓ అలవాటుంటుంది, ఏ వస్తువు కొన్నా దాని అసలు ఖరీదు చెప్పకుండా,ఎక్కువచేసో, తక్కువ చేసో చెప్పడం, పరిస్థితుల్ని బట్టి. అవతలవాడు ఓ సరుకు కొన్నాడనుకోండి, అదే వస్తువు మనం కొంటే, దాని ఖరీదు తక్కువ చేసి చెప్పి, అవతలి వాడికంటె తను ఎంత తెలివైనవాడో అని ప్రకటించడానికన్నమాట!అలాగే ఏ ఇల్లో, ప్లాటో కొన్నామనుకోండి, దాని ఖరీదుకూడా అంతే( తక్కువచేసి చెప్పడం). ఇంక అవతలివాడి ఇంట్లో రోజూ వాళ్ళావిడ వాడికి ఓ పాఠం తీసుకుంటూంటుంది, ‘చూడండి అన్నయ్యగారికి ఎంత తక్కువలో దొరికిందో, మీరూ ఉన్నారు, ఓ బేరం చెయ్యడం అదీ లేదు, అవతలివాడు ఏం చెప్తే దానికే తలూపేయడం ‘. అంతే కాకుండా ఈ ‘అన్నయ్య’ గారు కనిపించినప్పుడల్లా ఈ విషయం గుర్తు చేసి జీవితంలో తనేం కోల్పోతూందో, వదినగారు ఎంత అదృష్టవంతులో చెప్తూంటుంది. ఇదంతా ఓపిగ్గా చూసి చూసి, ఈయన అంటే ‘తెలివితేటలు లేని’ ఇంటాయన, అవసరానికి, ఓ బుల్లి అబధ్ధం చెప్పడం మొదలెడతాడు. ఏ సరుకు కొన్నా సరే తగ్గించే చెప్పడం . ఈవిడ ఊరుకుంటుందా, అమ్మలక్కలందరిదగ్గరా ఠముకు వేసేస్తుంది, తన భర్తకి ఎంతమంది తెలుసునో, దాని వలన తమకు ఎంత లాభం వస్తోందో వగైరా.. కొంతకాలం దాకా బాగానే ఉంటుంది ఈ పాప్యులారిటీ, ఎవరో ఒకరొచ్చి, మాక్కూడా తెచ్చిపెట్టండీ అనేంతవరకూ. అప్పుడు తెలుస్తుంది వీడి అబధ్ధం ఎంత కాస్ట్లీ అయిందో !

ఏ విషయంలోనైనా ఓ అబధ్ధం చెప్పామంటే, దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. ఎవడితో ఏం చెప్పామో, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో సహా,గుర్తుండదు. ఇంట్లో అయితే మరీ కష్టం, అదేంటండీ మొన్ననే కదా చెప్పారూ, మా ఇంటికి ఫోన్ చేశారనీ, ఈవేళ మా వాళ్ళు చాలారోజులనుంచీ మీదగ్గరనుంది ఫోన్నే రావడంలేదే అంది, మా అమ్మ, అంటే నన్నూరుకోపెట్టడానికి అబధ్ధం చెప్పేశారన్నమాట. చెయ్యకపోతే చెప్పొచ్చుకదా, అయినా మీఇంటివాళ్ళకేదైనా చెయ్యాలంటే ఊరికి ముందరుంటారు కానీ, మా వాళ్ళదగ్గరకొచ్చేసరికే ఈ గొడవలన్నీనూ,అని.కొంతమందికి అబధ్ధాలు చెప్పడం, ఓ ఫాంటానో, లింకానో త్రాగినంత ఈజీ. ఇదివరకటిరోజుల్లో అయితే ‘మంచినీళ్ళ ప్రాయం’ అనేవారు, కానీ కొంచెం మాడరన్ గా ఉండాలని పోలిక మార్చాను!

ఏ విషయమైనా సరే ఊరికే ‘అతి ‘ చేసి చెప్పేమనుకోండి, కొంతకాలం వరకూ బాగానేఉంటుంది, ఈ చెప్పబడిన ‘ప్రాణులు’ ఒకరితో ఒకరు కలుసుకునేవరకూ, అప్పుడు మన మాట వచ్చిందనుకోండి, అప్పుడు చూసుకోండి మనం వీళ్ళిద్దరితోనూ చెప్పినవి బయట పడిపోతాయి. ‘ అరే అలాగా మీతో అలా చెప్పాడా, నాతో ఇంకోలా అన్నాడే, అయినా వాడి మాట నమ్మమని ఎవడన్నాడూ, వాడి నాలక్కి నరం లేదండి’ అని మన ఇమేజ్ కి ఓ ఢక్కా వస్తుంది. ఇదంతా అవసరమా? ఇంక పెళ్ళిళ్ళ విషయంలో మధ్యవర్తులు-‘వెయ్యి అబధ్ధాలు చెప్పైనా సరే ఓ పెళ్ళి చేయించాలీ’ అని ఓ పాతకాలపు సామెత ముసుగులో, నోటికొచ్చినట్లల్లా అబధ్ధాలు చెప్పేస్తారు. ఆ పెళ్ళి పెటాకులైనప్పుడు, వాళ్ళదగ్గరకు వెళ్ళి ‘ ఏమండీ, అప్పుడు అలా చెప్పారూ, మీ మాట పట్టుకుని మేం ఈ సంబంధం నిశ్చయం చేసికున్నామూ, ఇప్పుడు చూస్తే అన్నీ గొడవలే’ అన్నాకూడా, దానికీ ఓ సమాధానం రెడీగా ఉంటుంది, ‘ ఆరోజుల్లో నాకు తెలిసున్నదేదో చెప్పానుకానీ,నాకేమైనా సరదా ఏమిటండీ, మిమ్మల్ని గొడవల్లో ఇరికించడానికీ’అని తప్పించుకుంటాడు.

ఇన్ని గొడవలతో ప్రతీవాళ్ళతో మాట పడఖ్ఖర్లేకుండా ఉండాలంటే జాయిగా నిజం చెప్పేయడం హాయి.. ఎందుకంటే నిద్రలోంచి లేపి అడిగినా ఒకే సమాధానం చెప్తాము.ఎవడితో ఏం చెప్పామూ అని గొడవుండదు. పైగా ఇంట్లో వాళ్ళందరూ నిజమే చెప్పేస్తే ఇంకా హాయి, ఎవడి సర్కిల్లో ఎవడడిగినా ఒకేలాగుంటుంది. ఏమంటారూ ?…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–క్లీనింగ్ అభియాన్

    క్రిందటి ఆదివారం నాడు మా అబ్బాయికీ, కోడలుకీ ఇల్లు క్లీన్ చేద్దామని ఓ బ్రిలియంట్ ఐడియా వచ్చింది.అంతకు ముందర మేము రాజమండ్రీ వెళ్ళేటప్పుడు, చెప్పాను వాళ్ళతో, మేము లేకుండా చూసి, ఇంట్లో ఉన్న వన్నీ అవతల పారేయకండి మెము వచ్చేదాకా అని. మొత్తానికి ఒప్పుకుని, ఆదివారం నాడు క్లీనింగు ,మొదలెట్టారు.

    నేను మా పిల్లల చిన్నప్పటి స్కూలు రికార్డులతో సహా జాగ్రత్త చేసి ఉంచాను.అవన్నీ చూసుకుని ఎంత సంతోషించాడో!ఇంక మిగిలినవన్నీ సార్ట్ చెయ్యడం మొదలెట్టారు.మా అమ్మాయి పుస్తకాలూ, రికార్డులూ విడిగా పెట్టి, తనకి చూపించాక డిస్పోజ్ చేద్దామని విడిగా ఉంచాము.

    మా అబ్బాయీ, కోడలూ మా నవ్య వ్రాయడం మొదలెట్టినప్పటినుండీ ఉన్న కాగితాలు తీసి జాగ్రత్త చేయడం మొదలెట్టారు. అప్పుడు అడిగాను,’ మీకు మీ పిల్లల జ్ఞాపకాలు ఎంత ముఖ్యమో, నాకు కూడా నా పిల్లల రికార్డులూ అంతే ముఖ్యం బాబూ అని.ఆఖరికి మా అబ్బాయి పుట్టినప్పటి, హాస్పిటల్ రికార్డుతోసహా, అప్పటి బిల్లులు కూడా జాగ్రత్త చేశాను.1980 లో మా అబ్బాయి పుట్టినప్పుడు, అయిన బిల్లు 528/- రూపాయలు.అదే జహంగీరు హాస్పిటల్లో, మా మనవడు పుట్టినప్పుడు అయిన బిల్లు అక్షరాలా 60,000/- రూపాయలు!! గుండె గుభేల్ మంది!

    ఈ క్లీనింగ్ అభియాన్ లో నేను మా ఇంటినుండి తెచ్చుకున్న ‘కొడక్ 620’ బాక్స్ కెమేరా ఒకటి దొరికింది. అది 1920 లోనో ఎప్పుడో తయారుచేసిందిట.దానితో, నేను చాలానే బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు తీశాను. ఆ ఫొటోలు అన్నీ చూడడంలో ఉన్న ఆనందం చెప్పలేనిది. ఈ నలభై ఏళ్ళలోనూ నేను జాగ్రత్త చేసినవి చాలా భాగం ఇప్పటికే తీశేశాము.ఇప్పుడు ఇంక తరవాతి తరానివి.

    ఇదివరకు తెలుగు వార పత్రికల్లో వచ్చే బాపు కార్టూన్లూ, సీరియల్సూ అన్నీ తీసి ఉంచాను.అందులో కార్టూన్లు మాత్రం ఉంచి మిగిలినవన్నీ తీసేశాము.ఇప్పుడు ప్రతీ పత్రికా ఎలాగూ నెట్ లోవస్తూంది కదా,అందుకనన్నమాట. ఊరికే ఇల్లంతా ఈ కాగితాలతో నింపడం కన్నా, కంప్యూటర్ లో స్టోర్ చేసికోవడమే హాయి కదా.

    ఏమిటో అనుకుంటాము కానీ, ఈ జ్ఞాపకాలు మనం ఉన్నన్నాళ్ళూ చూసుకొని ఆ పాతవన్నీ గుర్తుచేసికోడానికే, మనం వెళ్ళిపోయినతరువాత వీళ్ళేమైనా ఉంచుతారా ఏమిటీ? పాతనీరు వెళ్ళిపోయి కొత్తనీరు వచ్చేస్తుంది.అన్నీ తెలుసున్నవైనా, ఏమిటో ఈ తాపత్రయం ! మేమనే కాదు, ప్రతీ ఇంట్లోనూ జరిగేదే ఇది. ఎప్పుడో అవసరం వస్తుందని, ప్రతీ ఉత్తరం, కాగితం జాగ్రత్త చేయడం.ఎప్పుడో ముహూర్తం చూసుకుని అవన్నీ చింపేసి అవతల పారేయడం ! మొన్న మొన్నటి దాకా, నా నలభైరెండేళ్ళ, పే స్లిప్పులూ, జి.పీ.ఎఫ్ కాగితాలూ కూడా ఉంచాను!

   ఇవాళుంటాం, రేపటి సంగతి తెలియదు అయినా సరే, పిల్లలకి సంబంధించినవన్నీ, వాళ్ళకి మొదటవేసిన బట్టలతో సహా జాగ్రత్త చేయడం, వాళ్ళు చిన్నప్పుడు వేసిన బొమ్మలతో సహా ఉంచడం.

    ఇప్పుడంటే ఈ స్కానింగులూ అవీ వచ్చేయి కాబట్టి, పాత రికార్డులన్నీ స్కాన్ చేసేసి, హాయిగా కంప్యూటర్ లో పెట్టేస్తున్నాము, కానీ మాకు అలాటి సౌకర్యాలుండేవి కాదుగా. అందుకనే అంత రద్దీ పేరుకుపోయింది. మొత్తానికి ఈ నలభై ఏళ్ళ పైచిలుకి ప్రస్థానం లోనూ, నాకై ముఖ్యమైనవి అన్నవి ఓ సూట్ కేసుడు అయ్యాయి.వాటిని మాత్రం నేను బ్రతికుండగా బయట పడేయొద్దని, మొత్తానికి ఒప్పించాను !! ఏమిటో ఆ పాత కాగితాలు చూసినప్పుడు అదో ఆనందం, అది అనుభవించాలే కానీ చెప్పలేము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Occupational hazards.

    మామూలుగా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడో, లేక వృత్తిరీత్యా నో వచ్చే కొన్ని రకాలైన ఇబ్బందుల్ని ‘ఆక్యుపేషనల్ హజార్డ్స్’ అనొచ్చుననుకుంటాను.కానీ నిజజీవితంలో కూడా ఇలాటి ఇబ్బందుల్ని ఎదుర్కోవస్తూంటుంది.

   ఉదాహరణకి, నాకు చాలామందితో పరిచయం ఉంది.ఆ పరిచయానికి, అవతలివాడి ఆర్ధిక స్థితితో ఎటువంటి సంబంధమూ లేదు.ప్రతీ రోజూ మనకి ఎదురయ్యే వ్యక్తులతో మన పరిచయం పెరిగి, చూసేవాడికి అనిపిస్తూంటుంది, ‘ఓహో వీళ్ళిద్దరికీ చాలా స్నేహం ఉందేమో’ అని.ఆ పరిచయం ఉన్న మనిషిని చూసినప్పుడు, మన బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది.నేను ప్రతీ రోజూ చూసే, సొసైటీల వాచ్ మన్ లూ, ఆఖరికి ఇక్కడ దగ్గరలో ఉన్న దేముడి గుడుల వాచ్ మన్ లూ కూడా నాకు పరిచయస్తులే. నేను ఏదో పెద్ద పెద్దవాళ్ళగురించి చెప్పడంలేదు.
నాకు తెలుసును ఇలాటి పరిచయాల వలన నాకు ఒరిగేది ఏమీ లేదని, కానీ ఏం చెయ్యను, ఫ్రెండ్ షిప్ చేసికోవడం నాకున్న పేద్ద బలహీనత.మా వాళ్ళు చివాట్లు వేస్తూనే ఉంటారు, ఇంతమందితో స్నేహం ఎందుకూ అని.’దీనివల్ల మీకేమీ నష్టం లేదుకదా, నా దారిన నన్ను వదిలేయండి’అంటాను.

    ఆ విషయం వదిలేయండి, ఈ పరిచయాల వల్ల వచ్చే కొన్ని నష్టాలుకూడా ఉంటూంటాయి.ఈ వాచ్ మన్లుంటారే వాళ్ళు ,తమ అవసరాలకి మనల్ని ఉపయోగించుకుంటూంటారు. ఓ రోజున ఒకడికి కొంత డబ్బు అవసరం పడింది.ఏదో డాక్టరు దగ్గరకు వెళ్ళాలీ ఓ యాభై రూపాయలుంటే ఇమ్మన్నాడు, తన జీతంరాగానే ఇచ్చేస్తానూ అనికూడా చెప్పాడు.పోన్లే ప్రతీ రోజూ చూస్తూనేఉన్నాను కదా అని చిల్లరలేక వందరూపాయలనోటుంటే అది ఇచ్చాను. గుడికి వెళ్ళినప్పుడల్లా రోజూ దండం పెట్టి పలకరించేవాడు.తరువాతి నెల లో ఇచ్చేస్తాడుకదా అని, వాడివైపు చూస్తే, ‘ సాబ్ పగార్ నహీ మిలా, జైసా మిలేగీ ఆప్ కా పైసా వాపస్ కర్ దేగా’ అన్నాడు.పోన్లే పాపం అనుకున్నాను.ప్రతీ రోజూ ఇదే పాట,ఇంక విసుపొచ్చి, అస్తమానూ చెప్పకూ, నీకు వీలున్నప్పుడే ఇయ్యీ అన్నాను.అంతే అప్పటినుంచీ,ఆ పాటైతే మానేశాడు, డబ్బు సంగతి ఎత్తడే ! ఇదిగో ఇలాటివాటినే ‘ఆక్యుపేషనల్ హాజర్ద్’ అంటారు. వందరూపాయలతో వదుల్చుకున్నాను, లేకపోతే ఇంకా ఎంతకు పెట్టేవాడో? వాడు డబ్బు ఇవ్వా ఇవ్వడూ, నేను అడగను.ఇటుపైన ఇంక నన్ను డబ్బులు అడగడనే ఆశ !!

    మా మనవరాలుకి ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్, మేము ఇంట్లోనే ఉన్నాముకదా అని, క్రెచ్ కి పంపడంలేదు. ఎంతసేపని ఇంట్లో మా మొహాలు చూస్తూ ఉంటుందని, పక్క వాళ్ళ పిల్లతో ఆడుకోడానికి పంపుతూంటారు.తను ఇంకోళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి, ఆ మిగిలిన పిల్లల్ని మన ఇంటికి వస్తే ఏం అనకూడదు. అంతవరకూ ఫర్వాలేదు. కానీ వచ్చిన గొడవ ఏమిటంటే, మా మనవరాలు తను ఇంట్లో తినే స్వీట్లూ, చాకొలెట్లూ మొదట్లో పిల్లలందరికీ కూడా ఇచ్చేది. అప్పటికీ తనని అడిగేము, ‘నువ్వు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమైనా పెడతారా’అని.’అబ్బే ఏం పెట్టరూ ఊరికే ఆడుకోడం వచ్చేయడం’ అంది.కానీ ఆ వచ్చే పిల్లల్లో కొంతమంది అతితెలివైన వాళ్ళుంటారు, వయస్సేమీ అంత ఎక్కువ కాదు, ఆరేళ్ళో, ఏడేళ్ళో అంతే. వీలైనప్పుడల్లా, మా ఇంటికి వచ్చేస్తారు ఆడుకోడానికి, వచ్చిన ఓ పావుగంటలో, మా మనవరాల్ని పంపి, ‘ చాక్లెట్టులు తీసికు రా తినడానికీ’ అని పంపుతారు. ఇదేమో మమ్మీ చాకొలెట్ల డబ్బా ఇయ్యి, అందరం తింటామూ అంటుంది. ఇవ్వకపోతే ‘ఫ్రిజ్ లో ఉన్నాయికదా తీసియ్యీ అంటుంది.ఇక్కడ పరిస్థితి మింగాలేమూ, కక్కాలేమూ.ఏదో అప్పుడప్పుడంటే ఫర్వాలేదు కానీ, ప్రతీరోజూ ఇలా అంటే కష్టం కదా. నేను చెప్పాను మా పిల్లలతో’ మన పిల్లకి కాలక్షేపంకోసం, ఇంకోళ్ళ ఇంటికి పంపడమైనా మానేయాలి, కాదూ కూడదూ అంటే, ఇలాటివి భరించాల్సిందే’ అని.ఇదో రకమైన ‘ఆక్యుపేషనల్ హజార్డ్’ కదా!

    పోనీ చాకొలెట్లు అడుగుతోంది కదా అని, అల్పిన్ లేబే వి ఇస్తే ‘ ఛా ఇవి కాదూ, క్యాడ్బరీస్ ఉంటేనే బాగుంటుందీ’అంటుంది. అలాగని, ఇంట్లో ఉన్నవన్నీ, ఊళ్ళోవాళ్ళకోసం కాదమ్మా అనీ చెప్పలేరూ, ఎందుకంటే వీళ్ళు నేర్పినదే– మన దగ్గర ఉన్నది అందరితోనూ షేర్ చేసికోవాలీ అని ! ఇలాటివి చిన్న పిల్లలకి తెలియచేయడం చాలా సున్నితమైన వ్యవహారం.ఎటువంటివి అందరితోనూ షేర్ చేసికోవాలో, ఎటువంటివి చేసికోనఖ్ఖర్లేదో తెలిసికునే లౌక్యం నేర్పాలేము. వాళ్ళంతట వాళ్ళు తెలిసికునేవరకూ ఇలాటివి భరించాలి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-దున్నపోతు మీద వర్షం కురిసినట్లు…

    మామూలుగా గ్రామాల్లో చూస్తూంటాము, రోడ్డుకడ్డంగా, ఆవులూ, గేదెలూ వగైరా జంతువులు మేతకి వెళ్ళేటప్పుడు, రోడ్డు అంతా ఆక్రమించేస్తూంటాయి. చచ్చినా కదలవు, అవి వెళ్ళేదాకా ఆగవలసిందే.మేకలూ గొర్రెలూ ఫర్వాలేదు, అదిలిస్తేనైనా కదులుతాయి.దున్నపోతులూ అవీ ఎవరిమాటా వినవు.అంతే వాటి ఇష్టానుసారం మనం నడుచుకోవాల్సిందే.

ఈ మధ్యన పట్టణాల్లోనూ, నగరాల్లోనూ కూడా చూస్తున్నాము. రోడ్డుకడ్డంగా పడుక్కునుంటాయి. ట్రాఫిక్కంతా ఆగిపోతుంది. పోలీసాడు మనుష్యులమీద దాష్టీకం చూపించకలడు కానీ, వీటి విషయంలో మాత్రం ‘ అట్టర్లీ హెల్ప్ లెస్’. గ్రామాల్లో అయితే వాటిని తోలుకెళ్ళడానికి ఓ పాలేరు లాటివాడైనా ఉంటాడు. కానీ నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఇవి మన రాజకీయ నాయకుళ్ళ లాగ అదుపూ ఐపూ లేకుండా ఉంటాయి !! చూడండి, ఏ పనీ లేకపోతే బందంటారు, ధర్నా అంటారు, లేకపోతే ఇంకోటేదో పేరుపెట్టి, జనజీవనాన్ని అస్థవ్యస్థం చేయడమే వీళ్ళ సదుద్దేశ్యం.

ఆవులూ, గేదెలూ ఫర్వాలెదు, పాలైనా ఇస్తాయి. కానీ ఈ దున్నపోతులూ,రాజకీయానాయకుల వల్లా అంత ఉపయోగంకూడా ఉండదు.ఇంట్లో ఉన్న గేదెకి పుట్టింది కాబట్టి భరించాల్సిందే, అలాగే మనం ఎన్నుకున్నాము కాబట్టి భరించాలి.
ఈ కోవకి చెందిన వాళ్ళే మరో రకం జనం ఉన్నారు! మీరు ఏ రోడ్డు జంక్షన్ (అంటే మెయిన్ రోడ్లు కాదు),సందులూ గొందులూ ఉన్న చోట చూడండి, ఓ నలుగురు ఏ పనీ లేని పరమ లుచ్చాగాళ్ళు, సైకిళ్ళు పట్టుకుని రోడ్డుకడ్డంగా నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. పోనీ పక్కన ఎవడైనా వస్తున్నాడేమో వాడికి దారి ఇద్దామూ అనే ఇంగిత జ్ఞానం ఉండదు.ఆ మొహల్లాలో/లొకాలిటీ లో వీళ్ళు ఛోటా లీడర్లన్నమాట. పైగా ఇందులో ఎవడి బాబో కార్పొరేటరో, పోలీసో అయిఉంటే ఇంక వాడిని అడ్డేవాడే ఉండడు. వీళ్ళకేం పనీ పాటూ ఉండదు. లోకువగా కనిపించిన వాళ్ళని ఏడిపించడం, ఇదేమిటీ అని అడిగితే బెదిరించడం’ నీఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి చెప్పుకో’ అనడం.ఇవన్నీ సినిమాల్లో చూసి నేర్చుకున్న విద్యలు. ఆశుధ్ధం మీద రాయేస్తే ఏమౌతుందీ అనుకుని, పాపం మామూలు జనం వీళ్ళతో గొడవ పెట్టుకోలేక, తప్పించుకునే తమ మాన ప్రాణాలు కాపాడుకుంటూంటారు.

వీళ్ళ క్యాటిగరీకే చెందిన ఇంకో రకం ఉన్నారు. రోడ్డు సైడు పానీపూరీ,ఛాట్ కొట్లదగ్గర చూస్తూంటాము.ఫుట్ పాత్ అంతా వాళ్ళ స్వంతం అనుకుంటారు. అడ్డంగా నిలబడి, ఆవురావురుమంటూ తినడం, రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువా అని, కార్పొరేషన్ వాళ్ళు ఈ ఫుట్ పాత్ కట్టించారు, అదేమో ఈ తిండిపోతుగాళ్ళ పరం అయిపోతూంటుంది. కొంచెం దారేపోయే వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్లు తినొచ్చుగా, అబ్బే, ఊళ్ళోవాళ్ళేమైపోతే మనకెందుకూ అనే కానీ,కొంచెం సంస్కారవంతంగా ఉండాలని ఉండదు వీళ్ళకి. అలాగే ఏ ఈవెనింగు వాక్కుకో వెళ్దామనుకుంటాం, ఆ ఫుట్ పాత్ ప్రక్కనే ఉన్న ఇళ్ళవాళ్ళందరూ ఆ ఫుట్పాత్ మీదే నుంచుని కబుర్లు చెప్పుకుంటూంటారు. అందులో ఆడవారు మరీనూ( క్షమించండి, నేను ప్రతీ రోజూ చూస్తున్నది వ్రాశాను), వాళ్ళని రాసుకుంటూ, తోసుకుంటూ వెళ్ళలెము, వెళ్తే ఏం గొడవో! అంతే భరించాలి వీళ్ళని.

ఇక్కడ రోజూ చూస్తూంటాను, ఫుట్ పాత్ ప్రక్కనే ఏవేవో కూరలూ, చేపల దుకాణాలూ ఉంటాయి. కారుల్లో వచ్చే ప్రబుధ్ధులు, ఆ కొట్ల పక్కనే కార్లు పార్కింగు చేసికోవడం, రోడ్లమీద ట్రాఫిక్కు జాం చెయ్యడం. కొంచెందూరంలో పార్కింగు చేసికోవడానికి ఖాళీ ప్రదేశాలుంటాయి, మళ్ళీ అంతదూరం నడవడానికి బధ్ధకం. వీళ్ళనీ భరించాలి.

మనవైపు చూడలేదు, శివాలయాల్లో అయినా సరే, గర్భగుడిలోకి మనల్ని రానీయరు. ఇక్కడ అలా కాదు, యూనివర్సల్ బ్రదర్ హుడ్- ఎవడిక్కావలిసిస్తే వాడు లోపలికి వెళ్ళి, శివలింగానికి కావలిసినంత సేపు అభిషేకాలూ పూజలూ చేసికోవచ్చు.ప్రతీవాడికీ దేముడంటే భక్తుండాలి, కాదనం. కానీ గంటల తరబడి ఒక్కళ్ళే పూజలూ, అభిషేకాలూ చేస్తూంటే మిగిలినవాళ్ళసంగతేమిటీ? వాళ్ళొక్కళ్ళకే ‘వీర భక్తి’ ఉందనుకుంటారు. మిగిలిన ‘మోర్టల్స్’ ‘టు హెల్ విత్ దెం’. అంతే.

అలాగే ప్రతీ సొసైటీ గేటుకీ ఓ బోర్డుంటుంది, ‘ప్లీజ్ డు నాట్ పార్క్ వెహికిల్స్’ అని. ఒక్క దరిద్రుడికీ పట్టదు. బోర్డు దారి బోర్డుదే. వాచ్ మన అనబడే ప్రాణి సాయంత్రం పూట ఎక్కడా కనిపించడు.మనం ఏమైనా అడిగితే ‘ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాం,అని చెప్పి కారునో స్కూటరునో అక్కడ పార్కు చేసేసి ఎక్కడికో పోతాడు.పైగా ఏమైనా అంటే దెబ్బలాటోటీ, మేము రోడ్డు టాక్స్ కడుతున్నామూ అంటూ, అసలు ఆ సొసైటీలో ఉన్న కార్ల వాళ్ళకి ఇబ్బందౌతుందీ అని ఎందుకు ఆలోచించరో? కారుంటేనే సరికాదు, సంస్కారం కూడా ఉండాలంటాను.ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, మా సొసైటీ గేటు రోడ్డుమీదకుంటుంది. ఖర్మ కాలి రిలయెన్స్ వాళ్ళ స్టోర్ మా బిల్డింగు క్రిందే ఉంది.మాకు ప్రతీ రోజూ అయ్యే అనుభవం ఇది.

అందుకే ఈ బ్లాగ్గుకి శీర్షిక ‘ దున్నపోతుమీద వర్షం కురిసినట్లే’ అని పెట్టాను. వాటికీ , వీళ్ళకీ ఏం తేడాలెదు. వర్షం వచ్చినా సరే, ప్రళయం వచ్చినా సరే, ఇలాటి జనం మాత్రం మారరు, మారాలని ప్రయత్నించరు !!!

బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు–పొత్తూరి విజయలక్ష్మి-హాస్య(గుళికలు) కథలు

    శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు ” హాస్య కథలు’ అనే శీర్షికతో, ఒక పుస్తకం ప్రచురించారు. ఇందులో మొత్తం 24 ‘కథలు’ ఉన్నాయి….

ఆలిండియారేడియో, మహిళామండలీ కుట్టుమిషనూ , నా పెళ్ళి సమస్య తీరింది , మగ పెళ్ళివారమండీ,
కరెంటు సంబరం , ప్రయాణంలో మనిషి సాయం, పదిహేను పైసలికి ఆరుగురు పిల్లలు, నీళ్ళు తెచ్చుకునే చీర,
కారులో షికారు , కూరల పేరంటం , ఉత్తరీయం ఇస్త్రీ , ఇంటినిండా ఇంగిలీషు,
చదువు మధ్యలో ఏదో కాస్త..,. స్కూలు మీద కర్ర పెత్తనం , చండశాసన మహారాజు , యుధ్ధానికి సిధ్ధం,
భాగవత సారం , దొంగ అట్లు , సినిమాకి వెళ్తే రిక్షా ఎక్కం, సభల సంరంభం,
ఇరుగూ పొరుగూ ఆసరా , సర్వం శ్రీ జగన్నాధం , అన్నానా?? ఏమనీ ?? , పండు గాడు.

కథల పేర్లన్నీ వరస క్రమంలో వ్రాయలేదు. ఏం అనుకోకండి.

    వీటికి కథలు అని ఎందుకు పేరుపెట్టారూ అనుకున్నాను కానీ, ఆవిడ ‘ ఒక చిన్న మాట’ లో వ్రాసినట్లుగా ‘ బాల్యం అంటే అందరి జీవితాలకూ అపురూపమైన వరం.నా బాల్యం కూడా ఎంతో మధురంగా గడిచింది.మొదటినుంచీ హాస్య రచనలు చేయడం నాకు ఇష్టం.అందుకే నా చిన్ననాటి అనుభవాలు కొన్నిటిని మీఅందరితోనూ పంచుకుంటున్నాను’ అని ముందరే ఒక ‘డిస్ క్లైమరు’ పెట్టేశారు!!

    పై ‘కథల’లో ఉన్నవి, ప్రతీ ఉమ్మడికుటుంబంలోనూ, మన చిన్నతనంలో అనుభవంలోకి వచ్చినవే. మనలో ఎంతమంది, ఆ మధురానుభవాలని నెమరు వేసికుని వాటికి ఓ అక్షర రూపం ఇస్తారు? ఇక్కడే శ్రీమతి విజయలక్ష్మి గారు ఓ పేద్ద పాయింటు స్కోరు చేసేశారు. ప్రతీది చదివిన తరువాత, పాఠకుడు ‘ నిజమే, మా అమ్మమ్మా తాతయ్యా కూడా ఇలాగే ఉండేవాళ్ళు’
అని అనుకోకుండా ఉండలేరు. ఆవిడ వ్రాసిన ప్రతీ ‘కథ’లోనూ మన బాల్యం గుర్తుకొచ్చేస్తుంది.

   ఇందులోని మొదటి మూడు ‘కథల’ లోనూ అంటె ఆలిండియా రేడియో,కరెంటు సంబరం, కారులో షికారు లలో అమ్మమ్మగారి అమాయకత్వం, ఇతరులకంటె మన దగ్గర ఉన్న వాటిలోని,ఆధిక్యం దానివలన మనం ఎంతగొప్పవాళ్ళమో తెలియచేయడంలో ఉండే ఆనందం చదవాలే కానీ ,చెప్పడం కష్టం.
‘చదువు మధ్యలో ఏదో కాస్త..,భాగవత సారం ‘ లో అమ్మమ్మ గారి అథారిటీ ( స్కూలు మాస్టర్ల మీద) చూపించారు.‘ఇరుగూ పొరుగూ’ లో ఏదో సాయంగా ఉంటారు కదా అని, ఇంట్లో ఓ వాటా మంచివాళ్ళనుకుని అద్దెకు ఇచ్చి, ఆవిడ వాళ్ళతో పడే పాట్లు, ‘మహిళామండలీ కుట్టు మిషన్‘ లో ఓ మచ్చు తునక–” మల్లు గుడ్డ ఎంత పీకినా ఏం ప్రయోజనం,కవచం తో కర్ణుడిలా, ఆయనలా బనీనుతో ఉండిపోవాల్సి వచ్చేది” అన్న ముగింపు వాక్యం చదువుతోంటే ఆనాటి దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది.’ కూరల పేరంటం’ లో కొత్తగా చెన్నపట్నం నుండి తెచ్చిన ఇంగ్లీషు కూరలూ,’ స్కూలు మీద కర్ర పెత్తనం ‘లో అమ్మమ్మ గారిని అడ్డుకోలేని తాతయ్య గారి నిస్సహాయతా, అలాగే ‘దొంగ అట్లు’ లో తాతయ్య గారు బయట చేసే అట్లు తిని, దానికి అమ్మమ్మ గారిచే చివాట్లు కూడా తిని, చివరికి జిహ్వ చంపుకోలేక, ‘అమ్మడూ,నాకు ఒంట్లో బాగుండడం లేదే, పోనీ ఆ అట్లు ఏమైనా తింటే తగ్గుతాయేమో’ అని అడగడం.

    ఇంక ‘ నాపెళ్ళిసమస్య తీరింది‘ లో రచయిత్రి అనుభవించిన ఆనందం, సంతృప్తీ,’ ఉత్తరీయం ఇస్త్రీ’ లో తాతయ్య గారిని వీళ్ళు పెట్టే తిప్పలూ,’ చండ శాసన మహారాజు’లో తాతయ్యగారు
పోస్ట్ మాన్ తో ‘అవున్లే నువ్వు పరాయివాడివీ,నువ్వు చదవకూడదు,మేమంతా ఒక్కటే, నేను చదవచ్చు,నా చేతికివ్వడం నీ ఉద్యోగ ధర్మానికి విరుధ్ధం,అయితే అట్లా దూరంగా పట్టుకో చదువుతా’ అనడంలో, తాతయ్య గారి పెద్దరికం,‘సినిమా కి వెళ్తే రిక్షా ఎక్కం’ లో ఆనాటి పూర్వ సువాసినుల చాదస్థం,’ అన్నానా ఏమనీ‘ లో ఇద్దరు చెమిటి వాళ్ళ మధ్య జరిగే సంభాషణా,’ నీళ్ళు తెచ్చుకునే చీర‘ లో కొత్తకోడలి అమాయకత్వం,అన్నిటిలోకీ మచ్చు తునక ‘పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు’ అది చదివిన తరువాత నవ్వి నవ్వి కడుపు నొప్పొస్తే,
నేను బాధ్యుడిని కాను. మందులకోసం శ్రీమతి విజయలక్ష్మి గారినే ఖర్చులు పెట్టుకోమందాము!

    మొత్తం 96 పేజీలు , వెల 40/- రూపాయలు. అంటే ఒక్కొక్క కథా 1.67 రూపాయలయ్యిందన్న మాట. కిట్టుబాటయ్యిందంటారా? అన్ని కథలూ ఒక్కసారే చదివేయకండి, అటొచ్చీ, ఇటొచ్చీ వంటింట్లోకి వెళ్ళి ఓ బెల్లం ముక్క నోట్లో వేసికున్నట్లుగా ఆస్వాదించండి. ఎప్పుడు మీకు మూడ్ బాగోలేదంటే, ఆ పుస్తకం తీసి ఏదో ఓ కథ చదివేయండి. అంతే ఆ బ్యాడ్ మూడ్ అంతా ‘ హూష్ కాకీ’ అయిపోతుంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

    అసలు కార్యక్రమం ప్రకారమైతే, ఏప్రిల్ 15 కి రాజమండ్రి వెళ్ళి ఏదాది పుట్టిన రోజు కి ‘పురిటి మంచం’ ( నన్ను అనుమానించకండి బాబూ, నా బ్లాగ్గు ది) చూద్దామని టికెట్లు బుక్ చేశాము.కానీ కారణాంతరాలవలన క్యాన్సిల్ చేసికున్నాము.మళ్ళీ ఎప్పుడో వీలు చూసుకుని వెళ్ళాలి.ఎంత చెప్పినా నాలో, ఈ బ్లాగ్గులు వ్రాయడానికి స్పూర్తి ‘గోదావరి గాలి’ అని ఒప్పుకోవాలి. ఏమిటో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది.

    ఎంతమంది కొత్తస్నేహితుల్ని సంపాదించానో? ఎప్పుడు వారందరినీ కలుసుకునే అదృష్టం కలుగుతుందో? ఇప్పుడు తెలుగు వ్రాయడం ఎంత అలవాటు అయిపోయిందంటే, ఎప్పుడైనా ఇంగ్లీషులో మెయిల్స్ పంపాలన్నప్పుడు, చాలా కష్టం అయిపోతూంది.మా వాళ్ళందరూ నన్ను కోప్పడుతున్నారు! ఇంగ్లీషు అలవాటు తప్పిపోతుందీ, అప్పుడప్పుడు ఇంగ్లీషు బ్లాగ్గులు కూడా వ్రాస్తూండండి అని.అందుకోసమని ఈ మధ్యన నా ‘మిస్టరీ షాపింగు’ కొంచెం, ఎక్కువ చేశాను.

   గత వారం లో ‘షాపర్స్ స్టాప్’రెండు-ఒకటి నాదీ, ఇంకోటి మాఇంటావిడదీ చేసి దాని రిపోర్ట్ పంపాను.నేను వ్రాసిన రిపోర్ట్ బాగానే ఉందీ అని 8/10 మార్కులు ఇచ్చారు!ఫర్వాలేదు, ఇంగ్లీషు మరీ అంత అన్యాయంగా లేదూ అనిపించింది! రేపు డాక్టర్.బత్రాస్ క్లినిక్కు కి వెళ్ళాలి( మిస్టరీ షాపింగేనండోయ్). సాయంత్రం ఫోన్ చేసి మెయిల్ పంపారు. కన్సల్టేషనుకే 1500/- కట్టాలిట, మనకి వచ్చేస్తుందనుకోండి, ఏమిటో హోమియోపతీ క్లినిక్కుల్లో కూడా ఇంత ఫీజా, బాబోయ్!
కాలక్షేపం బాగానే అవుతోంది!

    ఈవేళ నాతో వరంగాం ఫాక్టరీ లో పనిచేసిన ఓ అబ్బాయి ( ఆ రోజుల్లో ఆర్డర్లీ గా ఉండేవాడు), ఇప్పుడు స్టాఫ్ లోకి ప్రొమోట్ అయ్యాడు, వచ్చాడు నన్ను కలవడానికి. ఆ ఊరు వదిలి 12 సంవత్సరాలయ్యింది, అయినా గుర్తు పెట్టుకుని వచ్చాడు. తను అన్నాడూ ” మీ దగ్గర పనిచేయడం వల్ల , పధ్ధతులన్నీ తెలిశాయీ, అందువలన ఎవరినైనా కూడా హాండిల్ చేయ కలుగుతున్నానూ’అని. చాలా సంతోషం వేసింది. అబ్బో ఫర్వాలేదూ, నేను ఇచ్చిన ట్రైనింగు కొంతమందికైనా పనిచేసిందీ అనుకున్నాను.

    నిన్న వ్రాసిన నా బ్లాగ్గు పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు వ్రాయలేక పోయాను, బ్లాగ్గు మరీ పెద్దది అవుతుందీ అని.ఏడాది పొడుగునా వ్యాఖ్యలు వ్రాసిన వారిలో, ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరి దగ్గరనుండీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలే వచ్చాయి. కొన్ని కొన్ని పోస్టుల్లో లింకులు ఇచ్చినప్పుడు, ఓ రెండు రోజులు పోయిన తరువాత, ఆ లింకులు మాయం అయిపోయాయి.ఇప్పుడు చూస్తే తెలిసింది. కారణం ఏమిటో తెలియదు.ఏదైనా తెలుగు న్యూస్ పేపరు లో నాకు నచ్చిన విశేషం గురించి వ్రాస్తూ, ఆ లింకు ఇచ్చేను. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కలింకూ చదవడానికి కనిపించడం లేదు. మీలో ఎవరైనా ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తే సంతోషిస్తాను.

    చెప్పానుగా , నాకు పనేం లెదు, ప్రతీ రోజూ తెలుగు పేపర్లన్నీ వివిధ జిల్లాల వార్తలతో సహా చదువుతూంటాను, అందులో ఏదైనా ప్రత్యేకమైన విషయం ఉంటే, మీఅందరితోనూ పంచుకోవాలని అంతే ! ఈ కిటుకేదో చెప్పేసేరంటే, ఈ ఏడాది కూడా మిమ్మల్నందిరినీ బోరు కొట్టేయొచ్చు!!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా బ్లాగ్గు బంధువులు-అందరికీ వందనాలు!

Pradeep,Amma Odi,Sree, vinay chakravarthi, గోపాలకృష్ణ కోడూరి, lalitha , అరుణ పప్పు, Phanikumar Bhamidipati, కొత్తపాళీ, వల్లూరి, Kiran, nEstam, naresh, Aruna, రాకేశ్వర రావు, pappusreenu, krishna rao jallipalli, Ashok, ఆర్జున్, bhavani, మురళి, అసంఖ్య, srikaaram, లలిత, telugodu, అంధ్రా చిన్నొడు, teresa, జ్యోతి, చక్రవర్తి, జీడిపప్పు, cbrao, iamharish, sAmAnyuDu, సుజాత, nutakki raghavendra , bollojubaba, sailaja, madhoos, మేధ, radhika, panipuri123, Sarath ‘Kaalam’, శివ బండారు, బ్లాగాగ్ని, నేస్తం, నరసింహారావు మల్లిన, sA.gi.sa.sA, aswinisri, sumna, subhadra, ramachandrudu, ఊకదంపుడు, sOmayAjulu, KumarN, sahiti, krishna, Hare krishna,
Ajitkumar, pappu, munikishna, evaraiteneMiTi, venaru, Durga Hemadribhatla, Sree, P.P.SRINIVAS, Rama Krishna, రాజ మల్లేశ్వర్ కొల్లి, అబ్బులు, త్రివిక్రమ్, Kolisetty, kcube varma, Rajashekar, యువ, bharathi, Uma, Bhaavana, స్నేహ, A2ZDREAMS , srinivasa raju Indukuri, nelabaludu, pcdhoom, karthick, Yogi, mohanrazz, lokesh reddy, rameshsssbd, Anza, తృష్ణ, Chaithanya MS, స్నేహ, krishna, నల్లమోతు శ్రీధర్, Nag Satish, anonymous, rama, వెన్నెల రాజ్యం, నాగప్రసాద్, అబ్రకదబ్ర, geeta, Mauli, కత్తి మహేష్ కుమార్, Kandi Shankaraiah, అమర్, Babu, phani, గోపాల క్రిష్ణ, కామేశ్వరి, prasad, Lakshman, viswamitra, విజయ్, durgeswara, anu, రవి చంద్ర, నేస్తం, mytreyi, Srikar, Praveen, sistla Ramachandra , suresh, psmlakshmi, somayajulu, chinta rama krishna rao, malapkumar, Venkata Appa rao Mattegunta, Ram, Venkata Ganesh, bonagiri, bhaskara, పదనిసలు, jagan, Chandrasekhar Sharma, raj, (maverick6chandu.wordpress.com), భోగరాజు, Rama Krishna, jatardamal, suchitra, raman, kvrn, praveen, బృహఃస్పతి, Javik Sastri, రాణి, pandu, santhi, K.Subramanyam Naidu, vimala bulusu, Clipped.in – Latest Indian , వీరుభొట్ల వెంకట గణేష్, c v ram mohan, sudha, pullarao, yes sir, chinna, రహంతుల్లా, Swathi.., SIVARAMAPRASAD KAPPAGANTU, mohan, sunita, Kumar, raju, ఏ రాయైతేనేమి, teluguvadhu, నాగేసర్రావ్, budugoy, Indian Minerva, ధరణీరాయ్ చౌదరి, blogubevars, anand, Chandu, srikar, shankar, రవి, అనామకుడు, రాజేంద్రకుమార్ దేవరపల్లి, virajaaji, bonagiri, అగ్నాని, prasanth.., సుధ ఇందుకూరి, kvsv, SivaGanesh, వంశీ, Sravya, krishna, Anand Bulusu, satya, అభిజ్ఞాన, lEdu, SansNom, పిండారి, bondalapati, Regular Visitor

వీలున్నంతవరకూ, నా బ్లాగ్గులో వ్యాఖ్యలు పెట్టి నన్ను ప్రొత్సహించిన అందరు ‘మహానుభావుల’ పేర్లూ పైన వ్రాశాను.ఎవరిపేరైనా దురదృష్టవశాత్తూ, విస్మరించితే, నన్ను క్షమింప కోరుతున్నాను.
ఇందులో ఉన్నవారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.

Endaro Mahaanubhaavulu…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా బ్లాగ్గు పుట్టినరొజు–April,15.

    నా బ్లాగ్గు ‘బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు’ మొదలెట్టి ఈవేళ్టికి ఓ సంవత్సరం పూర్తి అయింది. ఇప్పటికి అన్నీ కలిపి 312 పోస్టులు చేశాను.అంటె రమారమి రోజుకి ఒకబ్లాగ్ చొప్పున. నాకు తెలుగు లో బ్లాగ్గు వ్రాయొచ్చని సంకల్పం మొదట మేము రాజమండ్రి లో ఓ రెండు మూడేళ్ళు గడుపుదామని, గోదావరి గట్టు మీద, ఓ ఎపార్ట్ మెంటు అద్దెకు తీసికుని, ఉన్నప్పుడు కలిగింది.గోదావరి గాలి ధర్మమా అని!అంతకుముందు తెలుగులో టైపు చేయాలంటె అవేవో సాఫ్ట్ వేర్లు కొనుక్కోవాలేమో,మనకెందుకొచ్చిన గొడవా అనుకున్నాను.

    కానీ అంతర్జాల పత్రిక ‘ కౌముది’ సంపాదకుడు శ్రీ కిరణ్ ప్రభ గారికి ఒకసారి మెయిల్ పంపినప్పుడు, ఆయనా, శ్రీ వసుంధర గారూ చెప్పిన సలహా ప్రకారం, ఏ సాఫ్ట్ వేరూ డౌన్ లోడ్ చేసుకోనఖ్ఖర్లేకుండా, లేఖిని.కాం లో కి వెళ్ళి, ఇష్టం వచ్చినట్లు టైపు చేయడం మొదలెట్టేసరికి, ఇంగ్లీషు లోది చక్కగా తెలుగులో రావడం మొదలెట్టింది. అరె వా మనక్కూడా తెలుగులో వ్రాయడం వచ్చేసిందీ అనుకొన్నాను.

    ఆ రోజుల్లో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసిన కోతికొమ్మచ్చి సీరియల్, స్వాతి పత్రికలో వచ్చేది.సరే ఆ సీరియల్ గురించి స్వాతి వారికి ఓ ఉత్తరం వ్రాద్దామని కూర్చుని, నా కొచ్చినదేదో, నాకు తెలిసిన భాష( తెలుగే అనుకోండి) లో వ్రాసేశాను. మూడో నాటికి స్వాతి వారపత్రిక వారి దగ్గరనుండి ఓ మెయిల్ వచ్చింది.’ మీరు కోతికొమ్మచ్చి’ మీద వ్రాసిన ఉత్తరం,బెస్ట్ లెటర్ గా సెలెక్ట్ అయిందీ, ఆ ఉత్తరాన్ని ‘పీ.డీ.ఎఫ్ ‘ లోకి మార్చి, వెంటనే, మీఫొటోగ్రాఫ్ తో పాటు మెయిల్ చేయండీ’ అని.

    ఓరిదేముడో ఏదో టైపంటే చేసేశాను కానీ, మళ్ళీ ఈ పీ.డీ.ఎఫ్ లూ గోలా ఏమిటీ అని తల పట్టుక్కూర్చున్నాను. వెంటనే మా అబ్బాయికి(పూణే లో ఉన్నాడు) ఫోన్ చేశాను.తనన్నాడూ, నువ్వు టైపు చేసింది నాకు పంపూ, సాయంత్రానికి దాన్ని పీ.డీ.ఎఫ్ చేసి పంపుతానూ అని.ఇంతలో స్నేహితుడు రాకేశ్వర్రావు కి ఫోన్ చేస్తే, తను బయటెక్కడో ఉన్నాననీ, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళగానే ఫోన్ చేస్తాననీ, అప్పుడు ఈ పీ.డీ.ఎఫ్ గురించి చెప్తాననీ అన్నాడు.ఇంక ఇలా కాదని, నాకు కంప్యూటర్ కొనుక్కోని పూర్వం వెళ్ళే సైబర్ కెఫే కి వెళ్ళి అతన్ని అడిగాను, తనకంత బాగా తెలియదనీ, సాయంత్రానికల్లా ఎలగోలాగ చేయిద్దామనీ చెప్పాడు.
నిజం చెప్పాలంటే నేను పూర్తిగా నిరుత్సాహ పడిపోయాను, ఏదో నా అదృష్టం బాగుండి, స్వాతి పత్రిక వాళ్ళు నా ఉత్తరాన్ని ప్రచురిస్తామని చెప్పారూ, దీనికి ఎన్ని తిప్పలు పడాల్సివస్తోందో అని.ఇదిగో ఇలాటి టైము లోనే మనకి దగ్గరుండి ప్రోత్సహించేది ఎవరూ,ఇంకెవరోకాదు బాబూ, మా ఇంటావిడే. నా మూడ్ పాడైపోవడం చూసి,’తెలుగు లో టైపు చెయ్యడం, మీ అంతట మీరే నేర్చుకున్నారుకదా, మళ్ళీ దీని గురించి అంత దిగులు పడిపోతారెందుకూ, నెట్ వెదికి ఆ పీ.డీ.ఎఫ్ ఏదో మీరే నేర్చేసుకుని ప్రయత్నం చేయండి, లేకపోతే సాయంత్రానికల్లా అబ్బాయి ఎలాగూ చెప్తానన్నాడు కదా, ‘జై భజరంగ భళీ ‘ అనుకోవడం,ముందుకు వెళ్ళిపోవడం అని నన్ను ఎంకరేజ్ చేసింది. ఇంకేముంది అంతే సక్సెస్ ఫుల్ గా పీ.డీ.ఎఫ్ లోకి మార్చేశాను !

    ఇంక మనల్ని అడ్డేవాళ్ళెవరూ లేరని, తెలుగులో బ్లాగ్గులు ఏప్రిల్ 15,2009 న ప్రారంభించాను.అంతకుముందు కొద్దిగా ఇంగ్లీషులో వ్రాసేవాడిననుకోండి. మొదటి రోజు వ్రాసిన తరువాత వచ్చిన ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు చదివి ,ఫర్వాలేదూ, నా భాష మరీ అంత అధ్వాన్నంగా లేదూ అని నమ్మకం వచ్చేసింది. ‘లేడికి లేచిందే పరుగూ’ అన్నట్లు రోజుకోటి చొప్పున వ్రాయడం మొదలెట్టేశాను!

    నా బ్లాగ్గుకి ఓ రూపం చేసినందుకు జ్యోతి కీ, వాటికి రంగులూ, ఫాంటులూ పెట్టడం నేర్పిన మా కోడలు శిరీషకీ ధన్యవాదాలు. ఎందుకంటె మొదట్లో బ్లాగ్గులు వ్రాయడం మొదలెట్టినప్పుడు, ఏదో స్కూల్లో కాంపోజిషన్ వ్రాసినట్లుగా వ్రాసుకుంటూ పోయే వాడిని.నా వయస్సు మీద గౌరవం చేతా, ఏదో పెద్దవాడూ, నిరుత్సాహపరచడం ఎందుకూ అని చాలా మంది సందర్శకులు( వీరందరి పేర్లూ రెండో బ్లాగ్గులో ఇచ్చాను) మొహమ్మాటపడ్డారు.ఇంకా వీరిని హింసించడం బాగోదని జ్యోతి సహాయంతొ ‘ప్రెజెంటబుల్’ గా చేశాను.

    సాధ్యమైనంతవరకూ ఎవరి భావాలూ కించపరచలేదనే భావిస్తున్నాను. ఒకటీ అరా ఏమైనా ఉన్నాకానీ వదిలేయండి ఏదో ఛాదస్థం అనుకుని! ఒక ఏడాదిలోనూ సుమారు 42,000 మంది నా బ్లాగ్గుని సందర్శించేరంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ రోజూ ఏదో వ్రాయాలని వ్రాయడం కాదు, నా అనుభవాలు మీఅందరితోనూ పంచుకోవడమే నా ఉద్దేశ్యం.
ఇటుపైన కూడా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆ శ్రీ వెంకటేశ్వరుని ప్రార్ధిస్తూ..
….

%d bloggers like this: