బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అప్పుడే ఏడాది వెళ్ళిపోయింది, నవ్వడం మర్చిపోయి…

    చూస్తూ..చూస్తూ.. అప్పుడే ఏడాది వెళ్ళిపోయింది, మన తెలుగువారి మొహాల్లో నవ్వు అనేది మాయం అయిపోయి. ఏడాది ముందు కనీసం ఓ ఆశాకిరణమైనా ఉండేది, ఈవారం మన బాపు గారి, కుంచె నుండి ఎలాటి కార్ట్యున్ వస్తుందో అని . ఆయన స్పృశించని కోణం లేదు. తెలుగు ప్రపంచంలో ఏ ఒక్కరంగాన్నీ విడిచిపెట్టలేదు. ఓ సంసారం అనండి, దేవుళ్ళనండి, సినిమాలనండి, జంతుజాలాలనండి. ఋషులూ, మునులూ అనండి, సరే రాజకీయనాయకులే మన అసలు సిసలు జోకర్లు, వాళ్ళగురించైతే గురువుగారికి నల్లేరు మీద నడకే.

    తెలుగునాట కార్టూనిస్టులు లేరా అంటే, ఉన్నారు, కొంతమందైతే వారిని మించినవారూ ఉండొచ్చు. కార్టున్ వేయడమే కాదు, దానికి తగ్గ caption వ్రాయడంలో శ్రీ బాపు గారు దిట్ట అనడంలో సందేహం లేదు. ఏది గొప్పా, గీతా, వ్యాఖ్యా అంటే, రెండూ కలిపితేనే కదా అసలు అందం.. .. బాపుగారి గీతని, వ్యాఖ్య లేకుండా ఆస్వాదించడం కష్టం. దానికి ముందుగా, తెలుగు భాష చదవడం రావాలి. కానీ, ఈరోజుల్లో ఎవరిని చూసినా, “ మాట్టాడ్డం వచ్చుకానీ, రాయడం చదవడం రాదండీ..” అంటూ, ఏదో ఘనకార్యం చేసినట్టు, వాళ్ళూ, వారి తల్లితండ్రులూ చెప్పుకోడం. సినిమాల్లోనూ, టీవీల్లోనూ, ఎప్పుడో అప్పుడప్పుడుతప్ప ప్రతీరోజూ వార్తాపత్రికల్లో వచ్చేదీ, మన శాసన సభల్లో, రాజకీయనాయకుల ప్రసంగాలూ, మాత్రమే తెలుగుభాషగా భావించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇది మన దురదృష్టం.

    శ్రీ బాపూ గారు, ఒక ముద్దుగుమ్మ బొమ్మ వేశారూ అంటే, అది అందానికి నిర్వచనంగా అయిపోయింది. తెలుగునాట అమ్మాయిల వేషధారణకి ఓ “ ప్రామాణికం “ గా ఉండేది, ఒకానొకప్పుడు. ఓ దేవుడి బొమ్మ వేశారూ అంటే, “ ఓహో.. రాముడు ఇలా ఉండేవాడా… శ్రీ కృష్ణుడు ఇలా ఉండేవాడా.. “ అనుకునేటంత గా ఉండేవి. అంతదాకా ఎందుకూ, రావణాసురుడిలోనూ జీవకళ ఉండేది.

    ఖండఖండాంతరాల్లో తెలుగు వారికి, ఎప్పుడైనా నిరాశా, నిస్పృహా కలిగితే, సంజీవిని లాటి మందు, శ్రీ బాపూ గారి కార్టూనే అనడంలో సందేహం లేదు. ఒక్కో కార్టున్ చూస్తే, ఒకసారి మందహాసం రావొచ్చు, ఒక్కోటి చూస్తే ఫక్కున నవ్వొచ్చేయొచ్చు. గట్టిగా నవ్వి కడుపునొప్పికూడా రావొచ్చు. “నవ్వునాలుగువిధాల చేటు” అన్న సామెత ని “ ఒట్టుతీసి గట్టుమీదపెట్టు” అన్నంతలా, మార్చేసిన ఘనాపాఠీ శ్రీ బాపూ గారు. బాపూ గారి కార్టూన్ చూస్తే నవ్వడం అనేది, తెలుగువారి హక్కుగా మారిపోయింది. కానీ వీటన్నిటినీ ఆస్వాదించి, మనసారా నవ్వుకోడానికి తెలుగు భాష చదవడం రావాలి. ఏదో తూతూ మంత్రంగా, ఆయన వ్రాసిన కాప్షన్ ని అనువాదం చేస్తే , మజా ఉండదు.

    అదృష్టవంతులు శ్రీ బాపూ గారు—తెలుగురాష్ట్రం విడిపోయిన మొదట్లోనే వెళ్ళిపోయారు, లేకపోతే, ప్రస్థుతం ఇరు రాష్ట్రాల మధ్యా జరుగుతూన్న అనవసరపు రాధ్ధాంతాలు చూడలేక “ కుంచె సన్యాసం “ చేసేవారేమో..

    శ్రీ బాపూ గారు వేసిన లక్షలాది కార్టూన్లలో కొన్ని….

Bapu2 001Bapu4 001Bapu1 001

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు— గురువుగారూ… మరీ అంత అవసరమంటారా ?

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, 2009 లో మేము రాజమండ్రి కాపరానికి వెళ్ళే వరకూ తెలియదు. ఈ ప్రవచనాలు వగైరా, కూడా వినడం మొదలెట్టింది, రాజమండ్రి లో, మొట్టమొదట సారి, శ్రీ గరికపాటి వారి ప్రసంగం, ప్రత్యక్షంగా విన్నప్పుడే. ఆరోజుల్లోనే, భక్తి టీవీ వారు ప్రతీరోజూ, శ్రీ గరికపాటి వారి మహాభారతం మొదలెట్టారు, ప్రతీరోజూ క్రమం తప్పకుండా వినేవాళ్ళం. అప్పుడు, తెలిసింది, మా ఇంటికి ఎదురుగా ఉండే ఒకాయనద్వారా, శ్రీ చాగంటి వారి గురించి. ఆరోజుల్లోనే, నా అంతర్జాల ప్రస్థానం, బ్లాగులూ, మొదలవడంతో, కొద్దిగా నెట్ గురించికూడా తెలిసింది. శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి ప్రత్యేకంగా ఒక సైట్ ఉన్నట్టుకూడా అప్పుడే తెలిసింది. ఇదంతా పూర్వరంగం.

    శ్రీ చాగంటి వారి ప్రవచనాలు వినేవారు ప్రపంచంలో ఎంతమంది ఉంటారో లెక్క కట్టలేము. దానికి కారణం, వారి భాషాపటిమ, ధారణాశక్తి.. ఏ విషయం గురించి చెప్పినా, అరటి పండు ఒలిచిపెట్టినట్టు చెప్పడం వారి ప్రత్యేకత. ఒకలా చెప్పాలంటే శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి addict అయిపోయాము. ఇప్పటిదాకా, వారి ప్రవచనాలు ప్రత్యక్షంగా వినే అదృష్టం కలగలేదని బాధపడుతూంటాము. ఆయనేమో పూణే రారూ, మాకేమో , ఆయన ప్రవచనాలు చెప్పేటైములో మన ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉండదూ. పోనిద్దూ, ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుందీ, అని వదిలేశాము.

    ఈమధ్య, గోదావరీ పుష్కరాల సందర్భంలో, ఆయన ప్రవచనాలమీద, కొన్ని విమర్శలు, అవీ తోటి ప్రవచనకారుల నుండి, రావడం, విని కొద్దిగా బాధపడ్డాము. ఎక్కడో అనిపించింది, బహుశా శ్రీ చాగంటి వారికి వస్తూన్న, Public Exposure కూడా ఓ కారణం అయుండొచ్చని. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా, శ్రీ చాగంటి వారే. దానితో, ఎక్కడలేని publicity వచ్చేసింది. దానికి పూర్తి హక్కుదారే కూడా. అందులో సందేహం లేదు. తోటి ప్రవచనకారులకి, అంతంత ప్రాచుర్యం రావడం , ఎవరికైనా అసూయ కలగడం కూడా but natural. దానికి సాయం, మన మీడియా వారికి కూడా చాలా కాలక్షేపం . ఆవిషయం పక్కకు పెడదాం.

    మన దేశంలో Hero Worship ఒక బలహీనత. ఏదైనా రంగంలో ఎవరైనా ప్రముఖులయారంటే చాలు, వారు ఏం చేసినా సరైనదిగానే భావిస్తారు, వారి అభిమానులు. ఓ ప్రముఖ సినీ నటుడు ఉన్నాడనుకోండి, వాడు తప్పతాగి కారు నడిపి, మనుషుల్ని చంపేసినా సరే, ఇంకోడెవడో, నెలకో పెళ్ళి చేసికున్నా సరే,ఇంకోడెవరో, రాజకీయపార్టి ప్రారంభించి,పదవులకోసం అధికారపార్టీలో, తను స్థాపించిన పార్టీని విలీనం చేసినా సరే అలాటివన్నీ just one of those things అంటారు. ఇంకొంతమందైతే, సమాజ సేవ అని పేరుపెట్టి, టీవీ ప్రకటనల ద్వారా, జనాలని impress చేసి, వారికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించినా సరే, లేదా వాళ్ళు endorse చేసినవి తిని, రోగాలు తెచ్చికున్నాసరే, ఆ celebrities మీద మాత్రం ఈగ వాలనీయరు.. అది మన దౌర్భాగ్యం.

     ఒక వ్యక్తి పేరు చెప్పగానే మనం వారిని ఒక విషయానికి relate చేస్తాము. అలాగే శ్రీ చాగంటి వారి ప్రవచనం అనగానే, ఏ లలితామ్మవారి గురించో, సౌందర్యలహరి గురించో, ఏ శంకర భగవద్పాదుల గురించో, వెంకటేశ్వర వైభవం గురించో, కాదూ కూడదూ అంటే, ముక్తిమార్గం గురించో, పునర్జన్మ గురించో చెప్తారని ఒక IMAGE ఉంది.. మధ్యమధ్యలో కాలేజీలకి వెళ్ళి, Pesonality Development మీద కూడా ప్రసంగాలు చేస్తూంటారు. వారు ఏ Subject మీదైనా అనర్గళంగా చెప్పగలరు. శ్రధ్ధగా వింటారు కూడానూ విద్యార్ధులు. అలాటి సందర్భాలలో, శ్రీ చాగంటి వారు, ఓ Professional Consultant లాగే కనిపిస్తారు, ఓ ప్యాంటూ, చొక్కా వేసికుని. కానీ ప్రవచనాల విషయం వచ్చేసరికి మాత్రం, ఓ పంచా, లాల్చీ, కండువా, మెడలో ఓ దండతోనే, సందర్భానుసారం దర్శనం ఇస్తారు. ఈమధ్యన భాగ్యనగరంలో, శంకరాభరణం గురించి ప్రవచనం అని చదివాము. ఏ శంకరుడి గురించో, లేదా శంకరుడి ఆభరణం వాసుకి గురించో, లేదా అప్పుడప్పుడు వారు చెప్పే సంగీత ప్రవచనాల సందర్భంలో, ఏ “ శంకరాభరణం “ రాగం గురించో, అనుకున్నాము కానీ, మరీ శంకరాభరణం సినిమా గురించి అని మాత్రం ఊహించలేదు..

     శంకరాభరణం was definitely a good Film , but not The Greatest Film శ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా. ఆరోజుల్లో వచ్చిన సినిమాలకంటే, ఇది కొద్దిగా వైవిధ్యంగా ఉంది. పైగా అలాటి చిత్రాలు, జయభేరి , భక్త జయదేవ లాటివి ఎప్పుడో వచ్చాయి. కొద్దిగా అతిశయోక్తి చేసి చెప్పారేమో అనిపించింది. అయినా శ్రీ చాగంటి వారు ఏ దేవుడి గురించి చెప్పినా, ఏ పుణ్యక్షేత్రంగురించి చెప్పినా Totally Devoted and Committed గానే చెప్తారు ఉదాహరణకి, తిరుమల, కాశీ, అరుణాచలం, శ్రీశైలం ల గురించి చెప్పినప్పుడు, మానసిక దర్శనం పేరుచెప్పి, ఆయా క్షేత్రాల దర్శనంలో, చూడగలిగే విశేషాలు, కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. వెంటనే, అక్కడకి వెళ్ళి దర్శనం చేసికోకపోతే మన జన్మ వ్యర్ధం అనుకుని, తీరా వెళ్తే, ఆయన చెప్పిన విషయాలు మనం చూడడం సాధ్యంకాదు. తిరుమలలో అన్నీ చూసే భాగ్యం, శ్రీ చాగంటివారు కాబట్టి వీలైంది కానీ, మనలాటి అనామకులకి క్షణంలో లక్షో వంతు కూడా దొరకదు. అది అందరికీ తెలిసిందే, అయినా ఆయన చెప్తారు మనం విని సంతృప్తి చెందుతాము..

    ప్రస్తుత ప్రవచనం లో, శ్రీ చాగంటి వారు సినిమాలోని ఒక్కో దృశ్యం గురించి ప్రసంగిస్తూ, దానిని, పురాణాలలోని ఘట్టాలతో పోల్చి చెప్పారు. చాలా బాగుంది. కానీ, ఆ సభలో ఉన్న శ్రీ విశ్వనాథ్, ఆయన హావభావాలు చూసినప్పుడు నాకు అనిపించిందేమిటా అంటే ..” అఛ్ఛా.. అలాగా.. అసలు నేనలాగే అనుకోలేదూ…” అని. బహుశా నేనకున్నది తప్పైయుండొచ్చు. కానీ , నాకు మాత్రం అలాగే అనిపించింది. ఆమధ్యన “జులాయి” అని ఓ సినిమాలో, హీరో, పోలీసు స్టేషన్ లో, బ్రహ్మాజీ అసిస్టెంట్లని ఎడా పెడా బాదేస్తాడు. అది చూసి, ఓ పోలీసు “ అయ్యబాబోయ్.. నా టెబుల్ మీద ఇన్ని మారణాయుధాలున్నాయా… “ అంటాడు. నాకు శ్రీ విశ్వనాథ్ గారిని చూస్తే అదే గుర్తొచ్చింది.

    3 గంటల, 36 నిముషాల “ప్రవచనం” లోనూ, అలాటి సినిమా తీయడానికి ధైర్యం చేసిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి గురించి కానీ, అద్భుతమైన బాణీలు కట్టిన శ్రీ మహదేవన్ గారి గురించి కానీ, ఒక్కమాట లేకపోవడం చాలా బాధేసింది. ఈరోజుల్లో జరిగే అదేదో, ఆడియో ఫంక్షన్ లాగ ఉందనిపించింది. కానీ చెప్పింది గురువుగారు శ్రీ చాగంటివారాయె, శిరోధార్యం కదా… గురువుగారూ… మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తేనే బాగుంటుందండీ… మరీ సినిమాల వైపుకి వద్దు సార్ , ఎంత “గొప్ప” సినిమా అయినా సరే. మా దృష్టిలో మీరు ఎప్పుడూ శిఖరం మీదే ఉండాలి. కిందకు దిగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అపర శంకరాచార్యుల గా కొలిచేవారు,ఎందరో ఉన్నారు…

    రేపెప్పుడో బాహుబలి గురించి ప్రవచనాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. It is the Order of The Day…

    ఆ విడియో మీరు కూడా చూసి “తరించండి “

1. https://www.youtube.com/watch?v=d8rbI6VbMKQ

2. https://www.youtube.com/watch?v=HowdXu-tO60

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– మళ్ళీ ఈ ” Special Status ” ఎందుకో…..

   ఏమిటో, మనవాళ్ళకి రోజుకో గొడవుంటేనే కానీ, తోచదు. క్రికెట్ లో అవేవో One Day International లాగ, ఒకరోజు “దీక్ష”, “మూడు గంటలు ఉపోషం “ టివీల్లో చర్చలూ అయితే పరవాలేదు కానీ, మరీ ప్రాణాలు తీసికోవడం ఎందుకో అర్ధం అవదు. పోనీ అదేదో “ ప్రత్యేక హోదా “ అనేది వచ్చేస్తే, రాష్ట్రం ఏదైనా రాత్రికి రాత్రి బాగుపడిపోతుందా? మహా అయితే, రాజకీయ నాయకుల జేబులు ఇంకొంచెం నిండుతాయి. ఈమాత్రం దానికి, పాపం ఆయనెవరో ఆత్మాహుతి చేసికున్నారుట. వెంకయ్యనాయుడి దగ్గరనుండి, తెలుగువారిని నట్టేట ముంచిన కాంగ్రెస్ వాళ్ళదాకా, ప్రతీవాడూ, “ విచారం వ్యక్త “ పరిచేవాడే. కొన్ని రోజులక్రితం ఈ విషయం మీద ఒక టపా వ్రాశాను. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మార్పులేదు. మార్పు వస్తుందని ఆశించడం కూడా, బుధ్ధితక్కువ. ఈ విషయం రాజకీయనాయకులకీ తెలుసు. కానీ, ఏదో ఒక కాలక్షేపం ఉండాలిగా, అసలంటూ పార్లమెంటు సమావేశాలు జరుగుతే, ఓ పార్టీవాడు, ఓ ప్రసంగం చేస్తాడు, మిగిలినవాళ్ళు, నల్ల బ్యాడ్జీలూ, అట్టముక్కలూ పట్టుకుని , ఓసారి ప్రత్యక్షప్రసారాల ద్వారా మన కళ్ళకి విందుచేస్తారు. ఈమాత్రం దానికి ప్రాణాలు తీసికునేటంత అవసరం ఏం వచ్చిందో?

   అసలు ప్రత్యేకంగా మళ్ళీ ఈ “ ప్రత్యేక హోదా “ ఏమిటో? అసలు మన తెలుగువారిలో ఉన్న ప్రత్యేకత, ఇంకో భాషవారికున్నట్టు చూపించండి. ఎక్కడ చూసినా “ప్రత్యేకతే “. ఉదాహరణకి….

   1) ఒకడు చెప్పింది ఇంకోడు వినడు. ఎవడికివాడే తనంత గొప్పవాడు లేడంటాడు.

   2) ప్రత్యేక హోదా వచ్చిన మన తెలుగు బాషలో మాట్టాడేదెంతమందుంటారు? పైగా, అవతలివాడు తెలుగువాడైతే, వాడిని తెలుగువాడిలా గుర్తించడం, మన యువతరానికి < నామోషీ—అదేదో “ గుల్టీ “ అంటారు.స్కూళ్ళలో మాతృభాషలో మాట్టాడితే చివాట్లూ, చెప్పుదెబ్బలూనూ. ఇది మన వారికే ప్రత్యేకత.

   3) మన తెలుగువారిలో ఉన్నంతమంది జ్యోతిష్కులు ఇంకే భాషలోనూ ఉంటారనుకోను. అదేమి చిత్రమో, ఓ చానెల్ లో చెప్పిన వారఫలానికి, ఇంకో చానెల్ లో చెప్పినదానికీ పోలికే ఉండదు. ఒకాయన “ మిశ్రమ ఫలితాలు” అంటారు, ఇంకో ఆయన , అసలు ఈ వారమంతా పట్టిందంతా బంగారం “ అంటాడు..

   4) ఇంక ప్రవచనకారుల విషయానికొస్తే, ఇంకోరెవరికో ప్రసారమాధ్యమాలద్వారా పరపతి పెరిగిపోతుందనే దుగ్ధ తో అవాకులూ చవాకులూ మాట్టాడ్డం. ఏ ఒక్క ప్రత్యేక సందర్భం వచ్చినా, దానికి, ఒకరితో ఒకరు ఏకీభవించకపోవడం. ఉదాహరణకి, ఈ మధ్య జరిగిన గోదావరి పుష్కరాలు—ఒకరేమో జూలై 7 , అన్నారు, పైగా గోదాట్లో ఆరోజున స్నానాలూ, పిండప్రదానాలూ చేసేసి ఫొటోలూ అవీనూ. ఇంకో ఆయన జూలై 12 అన్నారు. ఠాఠ్ మేం చెప్పిందే రైటూ అనేసి, నాయుడుగారేమో, స్నానాలూ గట్రా చేసేసి, ఓ ముఫై మంది ని బలిచేసేసి ( అని కొంతమంది ఉవాచ.. ఇంకా విచారణ కమెటీ పెట్టలేదు ), ఆ పన్నెండురోజులూ, రాజమండ్రీలోనే మకాం పెట్టి, చిట్టచివరగా ఊరు పేరే మార్చేశారు.

   5) దేశవిదేశాల్లో, ఏ రంగంలోఅయినా ఘనత సాధించగానే, ఆయన పుట్టుపూర్వోత్తరాలు కూపీ లాగేసి, కర్మకాలి వారిపేరులో “ తెలుగు వాసన “ కనిపించిందా, వెంటనే “ మనవాడేనోయ్ “ అనేసి చంకలు చరిచేసికోడం. ప్రతిభాపాటవాలున్న తెలుగువారిని గుర్తించకపోవడమే అసలు మనకే స్వంతమైన “ ప్రత్యేకత”. ఉదాహరణకి , శ్రీ బాపుగారు, ఆయనకి ప్రభుత్వ బిరుదు, పక్క రాష్ట్రం ద్వారా రావడం. పాపం శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారికైతే అసలు ఇవ్వనే లేదు.

   6) ఇంకో చిత్రమేమిటంటే, ప్రతీ ఏటా ప్రభుత్వం ప్రకటించే పద్మ ఎవార్డులని, అదేదో బిరుదులా పేరుకి ముందర తగిలించుకోడం. అదే కాకుండా, అసలు మాకు ఫలానాదే ఇవ్వాలీ అని అడుక్కోడం.

   7) ప్రసార మాధ్యమాల ద్వారా celebreties అయిన ప్రతీవాడూ, ప్రపంచంలో తనంత గొప్పవాడే లేనట్టు ప్రవర్తించడం.

   8) తెలుగు సాహిత్యం చదవడమే మహాపాపం అనుకుని, ఏ ఇద్దరు తెలుగువారు కలిసినా, అప్పుడే మార్కెట్ లోకి వచ్చిన ఇంగ్లీషు పుస్తకం గురించి చర్చించుకోడం. పైగా, వాటిని చదవనందుకు, అలాటివారిని చిన్నచూపు చూడడం.

   9) ఇంకో “ప్రత్యేకత” ఏమిటంటే, తెలుగులో వచ్చే వార మాస పత్రికల్లో, తెలుగు నటులకంటే, హిందీ చిత్రనటులగురించే రాయడం. , జాతీయ Magazines లో అసలు మనవాళ్ళనే గుర్తించరన్న విషయం మర్చిపోయి.

   10) అన్నిటిలోకీ ముఖ్యమైనది—మన ప్రజా ప్రతినిధులు, మన అదృష్టం బాగోక, ఏ ఇంగ్లీషు చానెల్ లోనో చర్చాకార్యక్రమాలకి వెళ్ళినప్పుడు, అవాకులూ, చవాకులూ పేలడం. ఉదాహరణకి అప్పుడెప్పుడో, ఓ పార్లమెంటు సభ్యుడు (పైగా మా అమలాపురం వాడేట, చెప్పుకోడానికే సిగ్గుగా ఉంది ) మన సైనిక దళాలగురించి నోటికొచ్చినట్టు మాట్టాడి, తెలుగువారందరి తలా దించుకునేటట్టు చేశాడు. అయినా అలాటివాటిని పట్టించుకోకపోవడం, మన రాష్ట్ర నాయకులకే చెల్లింది.

   ఇలా రాసుకుంటూ పోతే, మన రాష్ట్రానికి ఉన్న “ ప్రత్యేకతల “ చిఠ్ఠా, కొల్లేరు చాంతాడంత అవుతుంది. ఇంకా “Special Status “ లూ, సింగినాదాలూ ఎందుకండి బాబూ ?

   సర్వే జనా సుఖినోభవంతూ…

.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Friendship Day ట….

   అన్ని “దినాల” లాగానే ఈరోజు “ Friendship “ దినంట.. అసలు ఈ “ దినాల” ప్రాముఖ్యం ఏమిటో నాకైతే అర్ధం అవదు. అలా అంటే చాలామంది మనోభావాలు కించపరచినట్టవుతుందేమో అని భయం. అయినా “నలుగురితోపాటు నారాయణా” అని , నా మిత్రులందరినీ ఈ రోజున అభినందిస్తూ… ఓ నాలుగు మాటలు, అదీ నా మిత్రుల గురించే వ్రాయాలని ఈ టపా…

    గత పదిహేను, ఇరవై సంవత్సరాలనుండే, ఈ “ దినాలు” మొదలయ్యాయి. ప్రత్యేకంగా సంవత్సరంలో ఓ రోజు ఒక్కోకరిని గుర్తుచేసికోవడం. ఓ రోజు Fathers Day, ఇంకో రోజు Mothers Day, ఓ రోజు Womens Day. నా ఉద్దేశ్యంలో పైచెప్పినవారందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కానీ, ప్రత్యేకంగా ఒక్కటంటే ఒక్క రోజే కేటాయించడం అంత బాగా లేదు. ఈరోజుల్లో, ప్రతీరోజూ గుర్తుపెట్టుకోవడానికి టైము చాలడం లేదు కాబట్టి, విదేశాలలో ఏ తలమాసినవాడో ఈ పధ్ధతి మొదలెట్టేసరికి , మన వాళ్ళకీ, ఈ వేలంవెర్రి ప్రారంభం అయుంటుంది. ఇంక మొదలు—ప్రతీ షాప్ లోనూ, రెండేసి రూపాయలకి వచ్చే అవేవో రింగులూ, బ్యాండులూ… సింగినాదాలూ .. వందలు పోసి కొనుక్కుని, కనిపించినవాళ్ళందరికీ కట్టుకుంటూ పోవడం ఓ Status Symbol గా మారిపోయింది. పైగా ఈ రోజున చేతికి ఏదీ కనిపించలేదంటే, “అసలు స్నేహితులే లేరా అయ్యో..” అంటారు.

   అసలు విషయంలోకి వద్దాము. అసలు స్నేహానికి అర్ధమైనా తెలుసునా అని నా అనుమానం. కొంతమందికైతే చుట్టాలకంటే, స్నేహితులే ముఖ్యం. నిజంగా, స్నేహం చేయాలంటే, అదంత తేలికైన పని కాదు. అవేవో Wavelength, Frequency లు కలవాలి. లేకపోతే, ఒకడు ఎడ్డెం అంటే, ఇంకోడు తెడ్డెం అంటే, ఆ స్నేహం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. ఒకరిగురంచి, ఇంకోరు యాగీ చేసికోవడమే జరిగేది.

   చాలామందికి రైలు ప్రయాణాలలోనూ, యాత్రలకి వెళ్ళినప్పుడో కలుస్తూంటారు. ఒకరి నెంబరు ఇంకోరూ, ఈరోజుల్లో అయితే మెయిల్ ఐడీ లూ…ఇలాటి స్నేహాలు మహా అయితే , ఓ ఏడాది పాటు నిలుస్తాయి. रात गयी बात गयी…
అసలు స్నేహానికి నిర్వచనం చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది — తెలుగువారికే స్వంతమైన “ బాపు- రమణ” స్నేహం. పైగా వారి స్నేహం అందరిలాగా , ఏడాదీ, రెండేళ్ళూ కాదు, అయిదు పుష్కరాల పైమాటే. అంతగా Friendship Day గా గుర్తించాలంటే, ఆ ఇద్దరి జయంతులో, వర్ధంతులో అయితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అయినా ఆంఆద్మీలైన మనందరికీ అంతగా స్నేహాన్ని నిలుపుకోవడం, సాధ్యం కాకపోవచ్చు.

   ఈరోజుల్లో అంతర్జాల మహిమ ధర్మమా అని, ప్రపంచంలో చాలామందితో, బ్లాగుల ద్వారానో, ఫేస్ బుక్ ద్వారానో స్నేహాలు కలుస్తున్నాయి. కానీ, అభ్యంతరకరమైన విషయాలు, రాయనంతకాలమే నిలుస్తాయి. తిన్నతిండరక్క, తీరికూర్చుని, ఓ కులంగురించో, ఓ సమాజాన్ని గురించో రాయడం ఈరోజుల్లో ఫాషనైపోయింది. ఒకరినొకరు తిట్టుకోడంతోటే సరిపోతోంది. దానితో రెగ్యులర్ గా టపాలు రాసేవారూ, వీటికి దూరంగా వెళ్ళిపోతున్నారు.

   ఇన్ని గొడవలున్నా, పాత స్నేహితులని గుర్తుపెట్టుకునేవారు, బహుకొద్దిమందే ఉంటారు. ఆ విషయంలో, నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. నాకున్న స్నేహితులైతే, వేలల్లో ఉన్నారు, అంతర్జాలం ద్వారా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన కొంతమంది స్నేహితుల గురించి ఇదివరకు ఒక టపా పెట్టాను. అది, 2011 లో, కానీ ఈ నాలుగేళ్ళలోనూ, ఇంకొందరితో స్నేహం చేసే భాగ్యం కలిగింది. నెలకోసారైనా ఫోను చేసి క్షేమసమాచారాలు అడుగుతారు. డెభై ఏళ్ళొచ్చేశాయికదా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు.
ఈమధ్యన పుష్కారలకి వెళ్దామని, నాలుగునెలల ముందుగా రిజర్వేషనైతే చేసికున్నాను. కారణాంతరాలవలన, వెళ్ళలేకపోయాము. ఆ విషయం మా అమెరికా ఫ్రెండు శ్రీ అబ్బులు గారు ఫోను చేసినప్పుడు చెప్పాను. అయ్యో పాపం అన్నారు. కానీ, ఆ మధ్యన ఓరోజు ఫోను చేసి, కొరియరు అందిందా అన్నారు. ఇదివరకు రెండు పుస్తకాలు పంపారు, మళ్ళీ ఇంకో పుస్తకమేదైనా పంపేరేమో అని చూస్తే, “ గోదావరి పుష్కర పుణ్య జలాలు.”.Misc 042 అసలు నన్ను గుర్తుపెట్టుకుని, అంత హడావిడిలోనూ, ఆ పుణ్యజలాలు పంపారే, అదీ స్నేహానికి మారు రూపం. అలాగే ఇంకొక స్నేహితులు శ్రీ రామచంద్రరావు గారు, ఎంతో అభిమానంతో, శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి, రామాయణ, భాగవత అక్షరరూపాలు. ఇంక రోజువిడిచి రోజు, క్షేమసమాచారం విచారించే, మా కొంపెల్ల శాస్త్రిగారైతే అడగక్కర్లేదు. ఆయనకున్న భవబంధాల హడావిడిలో, రెండురోజులకోసారి ఫోను చేయడం మాత్రం మర్చిపోరు. అలాగే , నెలకో, రెణ్ణెలలకో సింగపూర్ నుండి ,ఫోనుచేసి, క్షేమసమాచారం అడిగే,
చి. వాత్సల్యా …వీరే కాకుండా, కొంతమంది ” దేవదూతలు” ఉన్నారండోయ్… శ్రీ అమరేంద్రగారు, ఆనందా, రవీ దంపతులూ— వీరిని దేవదూతలని ఎందుకన్నానంటే, ఎప్పుడూ గుమ్మం వదలని నాలాటివాడికి చేయూతనిచ్చి, దైవ సందర్శనాలు చేయించి పుణ్యం కట్టుకున్నారు.వీరందరినీ ప్రస్తావించానంటే, మిగిలిన వారెవరినీ తక్కువ చేశానని కాదు, అందరూ ఆత్మీయులే,నా స్నేహితుల గురించి వ్రాయాలంటే, ఓ ఏడాది పొడుగునా, రోజుకో టపా పెట్టినా సరిపోదు. నాకున్న స్థిరచరాస్థి నా స్నేహితులే. అప్పుడప్పుడు అనుకుంటూంటాను—ఏ జన్మలో ఏ పుణ్యం చేసికున్నానో, ఇంతమంది స్నేహితులు లభించారు. వారందరికీ శుభాకాంక్షలు.
అందరిలాగా రింగులూ, ఫ్రెండ్ షిప్ బ్యాండులూ, పంపలేనేమో కానీ, నా అమూల్యమైన స్నేహితులని సాధ్యమైనంతవరకూ ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటాను. అది కాస్తా ఆగిపోతే చేసేదేమీ లేదు….

   సర్వేజనా సుఖినోభవంతూ…

%d bloggers like this: