బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సీనియర్ సిటిజన్లకోసం…

    ఎవరో చెప్పారు ఈవేళ అక్టోబర్ 1 వ తేదీన ‘సీనియర్ సిటిజన్స్ డే ‘ అని.ఈ సందర్భంలో శుభాకాంక్షలు. క్రిందటి ఆదివారం ‘ఈనాడు’ సప్లిమెంటులో ఒక మంచి వ్యాసం ప్రచురించారు. అది వ్రాసిన వారి క్రెడిట్ కూడా ఇస్తే బాగుండేది

    అప్పుడే అయిదు సంవత్సరాలైపోయింది రిటైరయ్యి.అయినా కాలక్షేపానికి మాత్రం ఏమీ లోటులేదు. మా అబ్బాయి ధర్మమా అని గత అయిదేళ్ళనుండి ( మధ్యలో రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం తప్పించి) ఈ మిస్టరీ షాపింగు చేస్తున్నాను. దాని వివరాలు క్రింద పొందుపరిచాను.ఎవరికీ తల వంచకుండా హాయిగా కాలక్షేపం అయిపోతుంది. మీరేకాకుండా, మీ ఇంట్లో ఎవరిపేరునైనా కూడా రిజిస్టరు చేసికోవచ్చు.ఎంతోమంది కొత్తవారితో పరిచయాలౌతాయి.
ఓ రెండుమూడు ఎసైన్మెంట్లు చేస్తే అదే అలవాటౌతుంది. మనం వ్రాసుకునే బ్లాగులు ఉండనే ఉన్నాయి. ఇంకెందుకూ దూసుకుంటూ వెళ్ళండి

పైన చెప్పిన వ్యాపకం, విదేశాల్లో చాలా కాలంనుండే ప్రాచుర్యం చెందింది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా అడుగు పెట్టింది. దాని శీర్షిక చూసి ఖంగారు పడకండి.18 సంవత్సరాలు నిండినవారు ఎవరైనా దీనికి register చేసికోవచ్చు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు.ఓ కంపెనీ తీసికొండి, దానికి దేశమంతా శాఖలుంటాయి. ఉదాహరణకి Reliance, Shopperstop, Crossword లా అన్నమాట.హెడ్ ఆఫీసుల్లో ఉండే యజమానులకి, దేశవ్యాప్తంగా
ఉండే వారి శాఖల్లో పనులు ఎలా జరుగుతున్నాయీ, ఆ శాఖల్లోవారు, ఖాతాదార్లతో ఎలా ప్రవర్తిస్తున్నారూ లాటి విషయాలమీద అవగాహన కల్పించడానికీ, అవసరమైతే బాగుచేయడానికీ, ఇది ఓ సాధనం అన్నమాట.

    ఈ పనులు అంటే Third party evaluation చేసి పెట్టడానికి, ముంబైలో రెండు సంస్థలూ, హైదరాబాదులో ఒక సంస్థా ప్రస్తుతానికి, పనిచేస్తున్నాయి నాకు తెలిసినంతవరకూ.
దీనిలో ఒకే ఇంటినుండి, ఎంతమందైనా సభ్యత్వం తీసికోవచ్చు. పూర్తిగా ఉచితం. ఏమీ డబ్బు కట్టనక్కర్లేదు. మీరు చేయవలసినదల్లా, వారి సైటు లోకి వెళ్ళి, ముందుగా register చేసికోవడమే.అలా చేసికున్నతరువాత, మీకు
ఒక confirmatory mail వస్తుంది. దానిలో మీ Userword, password ( మీరు ఎన్నుకున్నవి) వస్తాయి.

    ఒకసారి ఆ సైటులోకి sign in అయిన తరువాత,Job Board అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని నొక్కితే, మీ నగరంలో ఉన్న available shops కనిపిస్తాయి. మీకు ఏది చేయడానికి వీలుంటుందో, దానికి apply చేయడం.
అప్పటికే ఇంకొందరు apply చేసిఉంటే, ఆ ఏజన్సీ వారి ఇష్టాననుసరించి, ఎవరికో ఒకరికి ఆ Shop allot చేస్తూ మీకొక mail with attachments పంపుతారు. వారిచ్చిన లింకు లో sign in అయితే, మీరు ఆ షాప్పుకి
ఏ తేదీ లోపల వెళ్ళాలో, అక్కడ మీరు చేయవలసిన పనులేమిటో వివరంగా తెలుస్తాయి. ఒక ప్రశ్నావళి ఉంటుంది. దాన్ని నింపి పంపడం. అంతే.
మీరు ఆ షాప్పుకి వెళ్ళినట్లుగా proof కి, అక్కడ ఏదో ఒక వస్తువు కొని రసీదు తీసికొని,దాన్ని scan చేసి, వారికి పంపాలి.45 రోజుల్లో, మీకు డబ్బు (Shop fee) మీ బ్యాంకు ఎకౌంటులోకి వస్తుంది. వస్తుందీ అని ఖచ్చితంగా
చెప్తున్నానంటే, మేము చేసిన 70 assignments కీ మా డబ్బు,లక్షణంగా వచ్చింది. ఒక్కొక్క షాప్పుకీ 300 రూపాయలనుండి, 1000 రూపాయలదాకా ఉంటుంది.ఇవన్నీ అందరికీ చెప్తే నాకేం లాభం అంటారేమో,ఇంకోరితో పంచుకునే ఆనందం! ఏదైనా మనకున్నది, అందరితోనూ పంచుకుంటే ఆ సంతోషం ద్విగుణీకృతం అవుతుంది.

    రిటైరు అయ్యి, కాలక్షేపం లేనివారికీ, అంత పెద్ద పనేమీ లేని Housewives కీ ఇది చాలా ఉపయోగం. మీ conversation skills బాగుపడతాయి, ఏమీ తెలియనివారితో interaction చేయడం వలన, జీవితంలో ఎవరికీ
తలవంచక్కర్లేకుండా బ్రతకొచ్చు.దానికి సాయం కొదో గొప్పో డబ్బు కూడా వస్తుంది, మీరు ముందర డబ్బు పెట్టి కొన్న వస్తువు మీదగ్గరే ఉంటుంది.ఆ ఏజన్సీ వారు ఏ 500 లో Shop fee పెట్టేడుకదా అని అంతడబ్బూ పెట్టి కొనక్కరలేదు.

    ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యనే మొదలెట్టిన ఒక ఏజన్సీ వారికి, ఆంధ్ర ప్రదేష్ లో రమారమి ప్రతీ ముఖ్యమైన పట్టణం లోనూ Evaluators అవసరం ఉంది. నాకు రోజు విడిచి రోజు ఓ మెయిల్ పంపుతున్నారు, ఆయా ప్రదేశాల్లో, నాకు తెలిసినవారెవరైనా ఉన్నారా అంటూ. ఇలా ఓ వ్యాసం వ్రాస్తే, ఇలాటివాటిమీద ఆసక్తి ఉన్నవారెవరికైనా ఉపయోగం గా ఉంటుందని, ఈ వ్యాసం.ఇంట్లోనే కంప్యూటరు ఉండఖ్ఖర్లేదు, ఏ సైబర్ కఫే కి వెళ్ళినా చాలు.

1. http://www.bareinternational.com

2.http://www.onioninsights.info

3.http://thirdeye.kaizconsult.com

పైన చెప్పిన మూడు లింకుల్లోకీ వెళ్ళి ఒకసారి చూడండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Bad Dreams….

    ప్రతీ రోజూ పన్నెండు దాటే దాకా ఏదో పుస్తకం చదువుకుంటూ, నిద్రలోకి జారుకుంటూంటాను.ప్రొద్దుటే ఆరున్నరకి లేవడం.మొదటినుండీ ఇదే అలవాటు.నిద్రలో ఎప్పుడైనా కలలలాటివి వస్తూంటాయి.నిద్రలేచేటప్పటికి వాటిని జ్ఞాపకం తెచ్చుకుందామనుకున్నా గుర్తుకు రావు.పోన్లెండి అదే హాయి!

    నిన్నరాత్రి అదే ప్రకారం ‘చలవ పందిళ్ళు’ అనే కథా సంకలనం లో ఉన్న అద్భుతమైన కథలు చదువుతూంటే నిద్ర పట్టేసింది.అలాటి మంచి పుస్తకం చదివితే మంచి కలలు రావాలి రూల్ ప్రకారం. కానీ నా అదృష్టం ఏమిటో, దేన్నైతే గుర్తుతెచ్చుకోకూడదనుకుంటానో ఆ విషయమే కలలోకి వచ్చింది. నమ్మండి నమ్మకపోండి ఓ రాత్రివేళ సడెన్ గా చమటలు పట్టేసి, మెళుకువ వచ్చేసింది!

    అదేమిటో ఓ రోజు మా నాన్నగారు, నా చదువు వ్యవహారం ఎలా ఉందో అని చూద్దామని, పుస్తకాలు తీసికొని రమ్మన్నారుట.అన్ని సబ్జెక్టులూ ఏదో ఫరవాలేదనేటట్లుగానే ఉన్నాయిట.లెఖ్ఖలదగ్గరకు వచ్చేసరికి, నేను ఏ ఒక్క ప్రశ్నకీ జవాబు చెప్పలేకపోయానుట. ఫైనల్ పరీక్షలు ఓ నెల రోజుల్లోకి వచ్చేశాయిట.ఆయనకి బ్లడ్ ప్రెషరు పెరిగిపోతూంది, నన్ను ఏంచేయాలో తెలియడంలేదు, నన్ను ఎలా గట్టెక్కించడమో అర్ధం అవడంలెదు, నేను మాత్రం’నాకు లెఖ్ఖలు అర్ధం అవడంలేదు మొర్రో’అంటూంటే, మీరే నన్ను ఈ ఎం.పి.సి. లో చేర్పించారూ అని తిరిగి వాళ్ళమీద గయ్య్ మనడం మొదలెట్టానుట!అదంతా సరే, ఇప్పుడా ఫైనల్ యియర్ కి వచ్చినతరువాతా ఏడవడం,అని ఛడా మడా తిట్టేశారుట.నాకూ ‘ఔను నిజమే కదూ, పరీక్షలు నెలరొజుల్లో పెట్టుకుని, ఇప్పుడు చెప్తే ఏం లాభం, అనుకుని నాకూ నెర్వస్ నెస్ వచ్చేసిందిట! సడెన్ గా మెళుకువవచ్చేసింది!

 7nbsp; ఎలాగోలాగ నానాతిప్పలూ పడి లెఖ్ఖలు కూడా బట్టీపట్టొచ్చని తెలిసికొని, 300 కి 99 మార్కులు తెచ్చుకుని ( అవికూడా ఎలా వచ్చాయో ఆ భగవంతుడికే తెలియాలి!) బి.ఎస్.సీ డిగ్రీ లాటిది తెచ్చుకుని, ఆ లెఖ్ఖలు అనేవాటిని నా memory disk లోంచి పూర్తిగా erase చేసికుని అప్పుడే 47 సంవత్సరాలయిందే, ఇప్పుడేమిటండీ ఇలా కల వచ్చిందీ? మానసిక నిపుణుల దగ్గర అడిగితే ‘ ఏదో మీరు insecurity ఫీలౌతున్నారూ అందుకే అంటారు.నామొహం నాకలాటివేవీ లేవు! హాయిగా ఉన్నాను. ఏదో పాలవాడికి ఇవ్వవలసిన డబ్బుల లెఖ్ఖ తప్పించి దేంట్లోనూ లెఖ్ఖల మాటెత్తను. అదేమిటో లెఖ్ఖలు అంటే పేద్ద ఫోబియా!
చిన్నపిల్లలు నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తే ఓ సారి దిష్టి తీసి చన్నీళ్ళతో కళ్ళూ, కాళ్ళూ ఓసారి తడిచేస్తారు. నేనెవడితో చెప్పుకోనూ? రాత్రంతా మళ్ళీ నిద్ర పట్టలేదు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Vinod Dua’s opinion on News Channels

ప్రముఖ జర్నలిస్టు శ్రీ వినోద్ దువా మన న్యూసు చానెల్స్ పై తన అభిప్రాయాన్ని నిన్న పూణే లో చెప్పారు.ఆ వార్త ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఇచ్చారు. మీతో పంచుకుందామని క్రింద ఇచ్చాను.
ఈవేళ్టి అలహాబాద్ తీర్పు గురించి ప్రొద్దుటనుండీ అందరి ప్రాణాలూ తీశారు.ఇంక ఈ రెండు రోజులూ అదే గోల! ఎప్పటికి బాగుపడతారో ఏమిటో?
www-expressindia-com

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సలహాలు…

    ప్రపంచంలో ఒక్క డాక్టర్లవద్దా, లాయర్లవద్దా సలహాలు తీసికోవాలంటే డబ్బు ఖర్చుపెట్టుకోవాలి.ఎందుకంటే ఆ సలహాలివ్వడం మీదే వాళ్ళ రోజెళ్తుంది కాబట్టి!క్లైంటులు లేకపోతే వాళ్ళ పని గోవిందా! మనం చూస్తూంటాము- ఏ కోర్టు/ రిజిస్టార్ ఆఫీసు కైనా వెళ్ళినప్పుడు, అక్కడ ఓ టేబిలూ, కుర్చీ,ఓ టైపుమిషనూ పెట్టుకుని, వాటిమీద ఓ గొడుగు పెట్టి కూర్చునే లాయర్లని.ఎవరైనా వెళ్ళేమంటే చాలు,ఈ లాయర్లు పరిగెత్తుకొచ్చేస్తారు! మనం ఏదైనా మర్డరు చేసినా సరే, ఓ స్టాంప్ పేపరుమీద, ఏవేవో టైపుచేసేసి, దాన్ని లోపలకి తీసికెళ్ళి జడ్జీ గారిచే సంతకం పెట్టించేసి, మన చేతిలో పెట్టేస్తాడు! దాన్ని ఎఫిడవిట్టో ఏదో అంటారుట! ఆ మధ్యన తెల్గీ ధర్మమా అని ఈ స్టాంపు పేపర్లలో కూడా నకిలీలొచ్చాయి, అది వేరేసంగతి.ఇళ్ళల్లో ఉండే లాయర్ల సంగతి ఇంకోలా ఉంటుంది. నాకోటి అర్ధం అవదు వీళ్ళకి ఇన్నిపేర్లెమిటండి బాబూ Advocate, Lawyer, Pleader అని.వీటికి అర్ధాలేమైనా వేరా? తెలిస్తే చెప్పండి.

    ఇంక డాక్టర్ల విషయానికొస్తే అడక్కండి- ఓ పేద్ద కాంప్లెక్స్ లో మన దేహానికి సంబంధించిన అన్ని పార్టులకీ వైద్యం చేసే డాక్టర్లకూ ఒక్కో కేబిన్ ఉంటుంది.మనకొచ్చిన రోగం ఏదైనా సరే, ఆ కాంప్లెక్స్ లో ఉండే అందరి డాక్టర్లదగ్గరకీ వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సిందే! చివరకు మిగిలెది తడిపి మోపెడయ్యే ఖర్చు మాత్రమే! ఇన్నీ పూర్తయిన తరువాత మనం వెళ్ళిన మొదటి డాక్టరంటాడూ ‘I thought so..’ అని. ఆమాత్రం ముందరే తెలిస్తే, మనచేత ఇంత డబ్బు ఖర్చుపెట్టించడం ఎందుకో? ‘You scratch my back, I will scratch yours’ అని ఈ డాక్టర్లమధ్య ఉండే ‘gentleman’s agreement’ ధర్మమా అని మధ్యలో మనం నలిగిపోతాము!

    ఏ సి.ఏ. దగ్గరకో వెళ్తే, మనం కట్టవలసిన పన్నులూ, ఏవేవి ఎగ్గొట్టొచ్చో వగైరాలమీద సలహాలు దొరుకుతాయి.ఇంక అందరిలోకీ hi-fi వాళ్ళు psychiatrists. వీళ్ళు మనలోఉన్న సొ కాల్డ్ మానసిక సమస్యలు తీరుస్తారు. వీళ్ళ సంగతి అందరిలోకీ హాయి, మన సమస్యంతా విన్నతరువాత కౌన్సెలింగో ఏదో చేస్తారు. అది చివరకు solve అవకపోయినా ఎవరూ అడగలేరు, కారణం-‘నువ్వు నెను చెప్పినట్లు నీ ఆలొచనా పధ్ధతి మార్చుకోలేదూ’అని తీసిపారేస్తారు.అయినా ఫీజు లో రాయితీ ఏమీ ఇవ్వరండోయ్.ఇంక డెంటిస్టులు, మనం వెళ్ళగానే, మననోరు తెరిచేసి,ఓ సుత్తీ, ఉలీ పట్టుకుని,అమరశిల్పి జక్కన గారిలా, మన పళ్ళన్నింటిమీదా టక టకా కొట్టేసి, ఏదో ఒక వైద్యం చేస్తారు.
ఇలా ప్రతీ specialist ఏదో ఒకదానికి సలహా ఇస్తారు,

   ఇంతవరకూ బాగానే ఉంది,కొంతమందుంటారు ఎవడడిగినా అడక్కపోయినా సలహాలివ్వడమే ఓ hobby/ pastime గా పెట్టుకునేవారు.పాపం వాళ్ళు ఫీజేమీ పుచ్చుకోరు.అంతా ఉచితమే.ప్రపంచంలో ఉన్న ఏ సమస్యకైనా వారిదగ్గర ఓ solution ఉంటుంది. వినే ప్రాణి ఉండాలంతే.మనం చెప్పకపోయినా, మనకున్న సమస్య ఎలాగైనా మన నోటితోనే చెప్పించాలని విశ్వ ప్రయత్నం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.మనం ఇంకా మాట్లాడకపోయేసరికి,ఇంక వాళ్ళే డైరెక్టుగా
టాపిక్కు లోకి వచ్చేస్తారు.వాళ్ళ అభిప్రాయాల్ని మనమీద సలహా రూపంలో రుద్దేస్తారు.

   నిన్న రాంగోపాల్ వర్మ మీద ఓ టపా వ్రాస్తూ, టి.వీ-9 వారి 30 Minutes ప్రోగ్రాం మిస్ అయ్యాను. ఈవేళ ప్రొద్దుట చూసే అదృష్టం కలిగింది. జోక్ ఏమిటంటే, నిన్న వర్మ చెప్పిన దానిమీద అభిప్రాయాలు చెప్పించిన ‘ఘనుల’ మీదే
‘బెజవాడ రౌడీలు’ అని ఓ కార్యక్రమం చేయడం
. టి.వి-9 చేస్తే రైటూనూ, వర్మ చేస్తానంటే తప్పూనా! ఇక్కడ చూపించిన ‘హిస్టరీ షీటర్ల'(సేం టు సేం) నే అభిప్రాయం అడగడం-really takes the cake! హాయిగా వీళ్ళదగ్గరున్న క్లిప్పింగులు అన్నీ వర్మకి ఇచ్చేస్తే అతనికేనా ఉపయోగపడతాయి!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- రాంగోపాల్ వర్మ

    మన టి.వి. చానెల్స్ వాళ్ళకి ఓ మంచి సబ్జెక్టు దొరికింది. ఇదంతా పబ్లిసిటీ కోసమా లేక, మనవాళ్ళకున్న insecurity వల్లా, అర్ధం అవడంలెదు.వర్మ ఇంటర్వ్యూ లో చెప్పనే చెప్పాడు-నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తానూ, కావలిసిస్తే చూడండి, లేదంటే మీ ఖర్మా-అని. అతను ఏదో సినిమా తీస్తున్నాడు, దాని పేరు చూసి ‘గుమ్మిడికాయలంటే భుజాలు తడుముకోవడం’ ఎందుకో? తనేమీ బెజవాడలో ఉండేవాళ్ళందరూ రౌడీలు అనడంలేదే?
ఇదివరకెప్పుడో ‘అసెంబ్లీ రౌడీ’ ‘పోలీసు రౌడీ’ అనే పేర్లతో సినిమాలు వచ్చాయి. అలాగని అసెంబ్లీల్లోనూ, పోలీసుల్లోనూ అందరూ రౌడీలని అర్ధమా?

   అప్పటికీ చెప్తూనేఉన్నాడు-నా సినిమాలు అందరికీ నచ్చాలని లేదూ- అని. శివ సినిమా చూసి కుర్రాళ్ళందరూ సైకిలు చెయిన్లు చేతికి చుట్టుకున్నారూ-దీనికి సమాధానంగా అతను చెప్పింది చాలా నచ్చింది.అక్కడికేదో మనవాళ్ళు తీస్తున్న సినిమాలన్నీ, ఏవేవో గొప్ప గొప్ప సందేశాలిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేస్తున్నారు.అదేదో చానెల్ లో ఇంటర్వ్యూ వచ్చిన తరువాత, వాడెవడో వచ్చి ‘ నాకు సమాధానం చెప్పవలసివస్తుందని వర్మ పారిపోయాడు’అనడం హాస్యాస్పదం.ఈ ఇంటర్వ్యూ గురించి reaction లిచ్చినవాళ్ళు అన్ని చానెల్స్ లోనూ సేం. వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ మీడియా వాళ్ళు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే, ఆ ‘ప్రముఖుల’ మనుష్యులు వచ్చి, ఈ చానెల్ స్టూడియో లని థోడ్ ఫోడ్ చేస్తారని భయం!

   బెజవాడలో ఎంతోమంది ప్రముఖులున్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు.వచ్చిన గొడవల్లా బెజవాడ రౌడీలు అన్నందుకు.అందులో అసలు తప్పేమిటో ఎవరికీ అర్ధం అవడం లేదు.అతను తీసే సినిమా ‘బెజవాడలో రౌడీల’గురించి మాత్రమే!
ఇక్కడ కూడా డౌట్లు వస్తున్నాయి-పబ్లిసిటీ కోసమే ఇదంతా అని! ఏది ఏమైనా Verma had achieved his goal with great publicity ! Hats off !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అతి జాగ్రత్తలు !

    మా అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడల్లా చూస్తూంటాను-మనవరాలు(11 ఏళ్ళు), మనవడు(6 ఏళ్ళు) చేతుల్లో అవేవో ఐ ఫోన్లో ఏవో పెట్టుకుని, చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని వాళ్ళ లోకంలో వాళ్ళుంటూంటారు. మధ్య మధ్యలో ఏవేవో
కదుపుతూ వగైరా.నాకైతే జన్మలో ఇలాటి gadgets వాడడం వస్తుందనుకోను! ఈ సారి చెప్పేశాను- నేను వాళ్ళతో కబుర్లు చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రం వాటిని ఉపయోగించొద్దని ( కారణం మరేమీ కాదు-అంత చిన్నపిల్లలు ఠక్ ఠక్ మని ఉపయోగించేస్తూంటే, నాలాటివాడికి అదో రకమైన కాంప్లెక్స్ వచ్చేస్తుంది!).

  ఇప్పుడంటే ఇవన్నీ ఇప్పుడంటే part of day to day life అయ్యాయి కానీ, పదేళ్ళ క్రిందట క్రెడిట్ కార్డులూ, డిజిటల్ డైరీలూ,సెల్ ఫోన్లూ కొత్తగా వచ్చినప్పుడు, మేము పడ్డ తిప్పలు ఎవరితో చెప్పుకోము? అవన్నీ, కావాలని తెచ్చున్నవే గా! వాడెవడో బ్యాంకు వాడు, ఫాక్టరీ గేటు బయట ఓ ‘పందిరి’ వేసికుని, దాంట్లో ఓ ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు వచ్చేపోయేవారిని పిలిచి ఆ క్రెడిట్ కార్డుల గురించి చెప్తూ,ఏవేవో కాగితాలమీద సంతకాలు పెట్టిస్తూంటే, ఏమిటో చూద్దామని నేనూ వెళ్ళాను! నా జీతం వివరాలూ వగైరా తీసికుని, ఓ ఫారం మీద నా సంతకం చేయించుకుని పొమ్మన్నాడు!

    ఓ పదిహేను రోజుల తరువాత, ఓ కొరియర్ వాడొచ్చి సంతకం చేయించుకుని ఓ కవరు నా చేతిలో పెట్టి పోయాడు. కొరియర్ వాడు మా ఇంటికి రావడం అదే మొదటిసారేమో మంచి హుషారుగా ఉంది! అప్పటిదాకా టెలిగ్రాముల వాళ్ళూ, పోస్ట్ మాన్లేకదా!బుధ్ధిమంతుడిలా ఆ కవరులో ఉన్న వివరాలూ అవీ చదివి, వాళ్ళు పంపిన బుచ్చి plastic card దానికో పోచ్చీ,అబ్బో బావుందే అనుకున్నాము.దుకాణాలకి వెళ్ళినప్పుడు, డబ్బుల బదులుగా ఈ కార్డ్ చూపించి,వాడేదో దేంట్లోనో పెట్టి తిప్పి, ఓ కాగితం వస్తే దానిమీద ఓ సంతకం పడేస్తే చాలుట. బ్యాంకు వాడే మన తరపున డబ్బులు కడతాడుట.అప్పటిదాకా instalments లో సరుకులు కొన్న ‘ప్రాణులు’ కదా మనం, ఇదీ బాగానే ఉందనుకున్నాము!

   వచ్చిన గొడవల్లా మొదటిసారి ఈ కార్డు ఉపయోగించడానికి వెళ్ళినప్పుడే- ఆ కొట్టువాడు మనల్ని నమ్ముతాడో లేదో, మన మొహాలు ( మధ్య తరగతి కళతో) చూసి, వీడా, వీడి మొహానికో క్రెడిట్ కార్డా అంటాడేమో.. సవాలక్ష అనుమానాలు! ఎందుకైనా మంచిదని పర్సులో సరిపడేటంత డబ్బూ ( ఆ కొట్టువాడి ముందర వీధిన పడకుండా!) వేసికుని, కొట్టుకెళ్ళి,మొత్తానికి మొదటి పర్చేజ్ చేశాను. మరీ ఆ బ్యాంకు వాడు credit limit వేలల్లో ఇచ్చినా, బుధ్ధిమంతుడిలా వందల్లోనే ఖర్చుపెట్టి, ఆ నెలాఖరున ఆ బ్యాంకు వాడి డ్రాప్ బాక్స్ లో ఓ చెక్కు పడేసి పని పూర్తిచేశాను.ఆ తరువాత ఇంకో బ్యాంకు వాడుకూడా ఇచ్చాడు. వాటినే గత 10 సంవత్సరాలనుండీ వాడుతున్నాను. రిటైరయిన తరువాత, ‘నీకు పే స్లిప్పు లేదూ, కార్డు ఇవ్వం ఫో’అంటున్నారు!

    ఇంక మా ఫ్రెండు బర్త్ డే కి ఓ digital diary ఇచ్చాము (కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది కదా అని). తీరా కొన్నాక దాన్ని వాడ్డం మాకూ తెలియదు, ఆ పుచ్చుకున్నాయనకీ తెలియదు!కొట్టువాడన్నాడూ, దీంట్లో టెలిఫోన్ నెంబర్లు సేవ్ చేసికోవచ్చూ అని. అయినా అతి జాగ్రత్తతో, ఓ చిన్న పుస్తకంలో అలవాటు ప్రకారం,నెంబర్లన్నీ నోట్ చేసి పెట్టుకోవడం మాత్రం మానలేదు!అలాగే సెల్ ఫోన్లొచ్చినప్పుడు- ఏ హైదరాబాద్దేనా మాట్లాడాలంటే, బయటికెళ్ళి గట్టిగా అరుస్తూ మాట్లాడడం ( అటూ ఇటూ తిరుగుతూ), అవతలివాడికి వినబడకపోతే అనుకుంటూ..

   ఈ సందర్భంలో క్రిందటేడాది రాజమండ్రీ లో Broad Band తీసికున్నప్పుడు జరిగినది- బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళ తో రిజిస్టరు చేసికున్నతరువాత, మన కనెక్షన్ ఎక్టివేట్ చేయడానికి ఆలశ్యం అయితే, అక్కడి జి.ఎం గారికి కంప్లైంటు చేస్తే, ఆయనన్నారూ, మీ వివరాలు నా పి.ఏ. కి ఇవ్వండీ అని చెప్పారు.నా వివరాలన్నీ చెప్పాక ఆ అమ్మాయంటుందీ ” బ్రాడ్ బాండ్ యాక్టివేషను బెంగళూరు నుండి అవాలండి, దూరం కదా టైము పట్టొచ్చూ” అని!’మా తల్లే నాకంటే వెర్రివెధవ దొరకలేదా, నీ జ్ఞానం పంచుకోడానికీ’ అనుకుని, ‘చూడు తల్లీ నువ్వేమీ బెంగుళూరు దాకా శ్రమ పడి వెళ్ళఖ్ఖర్లేదూ, ఓ మెయిల్ పంపమని చెప్పూ’అన్నాను! ఇప్పటికీ కొన్ని ఏ.టి.ఎం. సెంటర్లలో మన కార్డు పెట్టగానే అది కాస్తా లోపలికి వెళ్ళిపోతూంటుంది. నాకు చచ్చేంత భయం! అందుకే కార్డుని ఊరికే పెట్టి రాసే (swap) చేసే సెంటర్లలోకే వెళ్తాను! ఇవన్నీ ఈ తరం వాళ్ళకి వేళాకోళంగా ఉంటుంది. ఎవరి భయం వాళ్ళది బాబూ !

    అలాగే ఎప్పుడైనా ఈ మెయిల్స్ పంపినప్పుడు, అవతలివాళ్ళకి అందాయో లేదో అని మళ్ళీ ఫోను చేసి అడగడం, ఆఫీసుల్లో ప్రతీదీ డిజిటలైజ్ చేసినా, రెండో మూడో కాపీలు పెట్టుకోవడం! ఇవన్నీ ‘అతి జాగ్రత్త’ల్లోకే వస్తాయి. నెను పనిచేసేటప్పుడు ఓ స్నేహితుడుండేవాడు, అతను ఓ టైపు మిషీన్ దగ్గర కూర్చుని, ఓ కీ నొక్కడం, ఆ అక్షరం సరీగ్గా పడిందో లేదో తొంగి చూడడం !! The last one takes the cake ! అలా ఉంటాయండి అతి జాగ్రత్తలు! ఈ టపా మా ఇంటావిడ గుర్తుచేస్తే వ్రాసింది.Credit should go to her!

బాతాఖాని-లక్ష్మిఫని కబుర్లు-సాక్షి పేపరు

తెలుగు వార్తాపత్రికలు హాయిగా నెట్ లో చదువుకోక, బయటికెళ్ళి కొనడం ఎందుకంట? ఏదో ఆదివారం అయితే, సప్లిమెంటొకటి వేస్తారు కాబట్టి పైసలు వసూలౌతాయి. ఏదో 2.50 పైసలకి, సాక్షి పేపరు దొరుకుతోందీ, రద్దీ గా కూడా అమ్మినప్పుడు, డబ్బులు రికవరౌతున్నాయీ అని తీసికునేవాడిని. ఈవేళ మా ఖడ్కీ(పూణె) బజారులో, అడిగితే, ఆ పేపరుమీద 2.50 అనే ఉన్నా, 3.00 రూపాయలిమ్మన్నాడు. అదేమిట్రా అంటే అంతే అన్నాడు, కావలిస్తే పేపరు వాళ్ళకి వ్రాసుకోమన్నాడు! ఇదేమైనా కొత్త పధ్ధతా లేక ‘ఓదార్పు యాత్రల్లో’ ఇచ్చే పరిహారం కోసం డబ్బులు తక్కువయ్యాయా ఏమిటో అర్ధం కాలేదు! ఏది ఏమైనా ఇంక ఆ పేపరు ఆదివారాలు తప్ప కొనకూడదని నిశ్చయించేసికున్నాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- టైం పాస్

    పెద్ద చేయడానికి పనేం లేదు. మా అబ్బాయి online library లో చేర్పించడానికి, నాకు పరిచయం ఉన్న స్నేహితులదగ్గరకు వెళ్ళాను, మొన్న శనివారం.మనం అడగ్గానే చేరిపోతారా ఏమిటీ, ఎన్నెన్ని ఆలోచించాలో, ఈ లైబ్రరీ వాళ్ళు సరైనవారేనా, ఏమిటో మరీ తెలుగువాళ్ళైపోయారూ, నమ్మొచ్చా, వచ్చిన పెద్దాయన కబుర్లైతే బాగానే చెప్పాడూ, నిజంగానే మనం ఆ లైబ్రరీకి వెళ్ళఖ్ఖర్లేకుండా, పుస్తకాలు మన ఇంటికో ఆఫిసుకో తెచ్చి ఇస్తారా అంటూ.ఒకసారి చేరితేనే కదా తెలిసేది, మా మాటల్లో నిజాయితీ ఎంత ఉందో? ఇంతా చేస్తే నెలకి 150/- రూపాయలు మూడు పుస్తకాలు, దానికి కట్టే డిపాజిట్టు 500/- రూపాయలూ, ఎప్పుడు సభ్యత్వం మానేస్తే అప్పుడు చేతిలో పెడతాము.

   ఈవేళ ప్రొద్దుటే టి.వీ వార్తలు చూస్తూంటే, వాడెవడో రాజకీయనాయకుడిని నిన్న రాత్రి హత్య చేశారుట హైదరాబాదులో. ఇంకేముందీ టి.డి.పీ వాళ్ళందరూ వచ్చేసి, హమ్మొయ్ నాయనోయ్ దేశం తగలడిపోతోందీ, ఎవరికీ రక్షణలేదూ, హోం మంత్రి రాజీనామా చేయాలీ, మొన్నటికి మొన్న వాళ్ళెవరినో చంపేశారూ, వీళ్ళెవరినో చంపేశారూ, అసలు మన రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా,ప్రతిపక్ష నాయకులని చంపడం, పాలక వర్గం వారికి ఓ ఆట లా తయారయిందీ, వగైరా వగైరా...
మధ్యాన్నానికల్లా తేలింది, ఆ పోయినవాడికీ, ఇంకోడికీ ఎదో సెటిల్మెంటు వ్యవహారంలో మాటా మాటా వచ్చి, వీణ్ణి చంపేసి పోయాడని!సెటిల్మెంటులూ వగైరాలంటే ఈ హత్యచేయబడిన ఘనుడూ ఇదివరలో ఏవేవో వెధవ పనులు చేసినట్టే కదా, ఈ మాత్రందానికి, ఏదో అమాయకుడిని ప్రభుత్వమే పొట్టపెట్టుకున్నట్లుగా ఏడవడమెందుకూ? ఇలా ఊళ్ళో ఉండే history sheeters అందరూ, ఎవడెవడు ఎవడెవడిని చంపుతున్నారో చూడ్డమే ప్రభుత్వం బాధ్యతా?

   నాకోటి అర్ధం అవదూ, ఎక్కడ ఏ గొడవ జరిగినా, మన రాజకీయనాయకులు/రాళ్లు అంత ప్రొద్దుటే మేకప్పులు చేసికుని, టి.వీ.ల్లో స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఎలా వచ్చేస్తారండి బాబూ? వీళ్ళకి ఇంకేమీ పనీపాటాలేదా?అవున్లెండి, వీళ్ళేమైనా మనలాగ పిల్లల్ని ముస్తాబు చేసి స్కూళ్ళకేమైనా పంపాలా ఏమిటీ, ట్రాఫిక్కు జామ్ములు దాటుకుంటూ ఆఫిసులకెళ్ళాలా.రాత్రంతా ‘ఇప్పుడే అందిన వార్తలూ’,’Just in’ ‘బ్రేకింగు న్యూసు’ ఉండనేఉంది చూస్తూ గడుపుతారనుకుంటాను, అందుకే తెల్లారేసరికి టి.వీ. స్టూడియోల్లో తయారు, మన ప్రాణాలు తీయడానికి!
రెండురోజులక్రితం విజయవాడలో అదేదో ‘సృష్టి’ట, బ్రహ్మదేవుడికి ప్రతిసృష్టి లా, ఆయన చేయడం మర్చిపోయినా,ఈ డాక్టర్లు ప్రతిసృష్టి కార్యక్రమంలో పడ్డారు.ఆ హాస్పిటల్ వాళ్ళకీ మన చానెల్ వాళ్ళకీ ఏదో ఇచ్చిపుచ్చుకోడాల్లో తేడా వచ్చిందనుకుంటాను, ఓ రోజంతా ఆ ‘సృష్టి’హాస్పిటల్ ని ఏకేశారు! మీకు గుర్తుండేఉండాలి, కొన్ని సంవత్సరాలక్రితం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, ’13-14-15′ అనే పేరుతో ఒక నవల వ్రాశారు,విజయవాడలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా. ఇదేమీ ఈవేళ కొత్తగా జరుగుతున్నదికాదు, దురదృష్టవశాత్తూ పిల్లలు లేనివారు, చేతిలో డబ్బుంటే ఇలాటివి ప్రయత్నిస్తారు.యోగం ఉందా ఫలితం ఉంటుంది. లేకపోతే, మన ప్రయత్నం మనం చేశామూ అనుకోవాలి.అప్పటికీ
ఆ హాస్పిటల్ వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు- మేమేమీ 100% సక్సెస్ ఉంటుందని చెప్పడం లేదూ-అని.అన్నిటికీ ఒప్పుకునే, వాళ్ళిచ్చిన కాగితాలమీద సంతకాలు పెట్టారూ, ఏదో చానెల్ వాళ్ళకీ, ఆ హాస్పిటల్ వాళ్ళకీ వచ్చిన గొడవల్లో, ఈ పేషంట్లందరూ రోడ్డెక్కారు.ఆ వ్యవహారం ఏదో సెటిల్ అయినట్లుంది, మళ్ళీ సృష్టి వ్యవహారం గురించి ఏమీ వినబడడం లేదు!

    ఎలాగైతేనేం సుప్రీం కోర్టు వాళ్ళు రంగంలోకి దిగి, రేపటినుండి, విచారణ మొదలెడతారుట, అయోధ్య వివాదం మీద తీర్పు పోస్ట్పోన్ చెయ్యాలాలేదా అని!ఎప్పటికి తేలుతుందో ఏమిటో? ఈ గొడవలన్నీ ప్రక్కన పెట్టి, ఆ సుప్రీం కోర్టు వాళ్ళే కేసును విచారించొచ్చుగా! అదేదో అత్తా కోడలూ యాయివారం బ్రాహ్మడి గొడవలా ఉంది!- ఒకసారి యాయివారం బ్రాహ్మడు, బిక్ష్క్షకొస్తే, కోడలు ఈ వేళ ఖాళీ లేదండీ, రేపు రండీ అందిట. పాపం ఆ బ్రాహ్మడు వెళ్తూంటే, చెరువులో స్నానం చేసి వస్తూన్న అత్తగారు కనిపించి, అదేమిటీ ఖాళీ చేతుల్తో వచ్చేస్తున్నారూ అంటే, ఆయన చెప్పాడుట ‘మీకోడలు పంపించేసిందీ’ అని. హాత్తెరీ అదెవరు మిమ్మల్ని పంపించేయడానికీ అని, తిరిగి ఆయన్ని తీసికెళ్ళిందిట. పోన్లే ఏమైనా ఇస్తుందేమో అనే ఆశతో ఆవిడతో వెళ్తే,లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ‘ఏమనుకోకండీ, ఈవేళ చేయి ఖాళీ లేదూ, రేపు రండీ’ అందిట!ఇక్కడేమిటంటే protocolఅన్నమాట!
తొందరగా లీగల్ ఫార్మాలిటీస్ పూర్తిచేసి, ఏదో ఒక తీర్పిచ్చేస్తే, హాయిగా మనరాజకీయనాయకులు కూడా ఇంకో Issue పట్టుకోవచ్చు! ఏమిటో అలహాబాద్ హైకోర్టు వాళ్ళు తీర్పు చెప్పాలిట, అది నచ్చని పార్టీ సుప్రీం కోర్టుకెళ్తుందిట! ఇప్పటికే
ఆ లాయరు శాంతి భూషణ్, సుప్రీంకోర్టు గత 16 మంది ప్రధాన న్యాయమూర్తుల్లోనూ 8 మంది లంచగొండ్లూ, అని అననే అన్నాడు. అని ఊరుకోవచ్చా ఓ సీల్డ్ కవరులో 16 మంది పేర్లు వ్రాసి ఇప్పటి సి.జె కి ఇచ్చాడుట! కొట్టుకు ఛస్తున్నారు ఆ లిస్టులో ఎవడి పేరు వ్రాశాడో అని! మన రాజ్యాంగంలో ఉన్న హాయి ఇదే- ఎవడి నోటికొచ్చింది వాడు చెప్పొచ్చు, వాడేమీ ప్రూఫ్ ఇవ్వఖ్ఖర్లేదు. ఎవడిమీదైతే ఆరోపణ వచ్చిందో వాడు ఛస్తాడు, నేను నిరపరాధిని మొర్రో అని పృవ్ చేసికోడానికి! అది ఓ డొమెస్టిక్ టార్చరు కేసవచ్చు, లేక అట్రాసిటీ కేసవచ్చు, లేక లైంగిక వేధింపు కేసవచ్చు, ఏమైనా అంటే ‘సామాజిక న్యాయం’ అని ఓ high sounding పేరెట్టొచ్చు! मेरा भारत महान !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఏమైనా అనుకుంటారేమో-2

    కూతురూ, కొడుకూ ఒకే ఊళ్ళో ఉంటే వచ్చే సమస్యలు ఒకలా ఉంటాయి. అమ్మాయి పిల్లలతో ఎక్కువ టైము గడిపేస్తున్నామేమో ని కొడుకూ,కోడలూ, అస్సలు తనకీ, తన పిల్లలకీ టైము ఇవ్వడం లేదని కూతురూ అనుకుంటారేమో అని ఓ భయం! వాళ్ళు అలా అనుకోపోవచ్చుకూడానూ, అదంతా మన భ్రమైనా కావొచ్చు! వాళ్ళు వాళ్ళ పిల్లలతోనే గడపడానికి సమయం దొరకనప్పుడు, మనల్ని గురించి ఏం ఆలోచిస్తారూ? అయినా అలా అనుకోవడంలో ఓ ఆనందం!

   మనం ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, వాళ్ళిచ్చే చాయో కాఫీలోనో అసలు పంచదార వేయకుండా ఇస్తారనుకుందాము వారికున్న సుగర్ కంప్లైంటు వలన, మనం పంచదార కావాలని అడిగితే ఏమైనా అనుకుంటారేమో!వాళ్ళనుకున్న లేకపోయినా ఇంటావిడ ( మనకి సంబంధించిన వారు), గయ్య్ మనొచ్చు, ‘ఏం ఒక్కరోజు పంచదార లేకపోతే ఏమైనా కొంప మునుగుతుందా, అలా లేకిగా అడిగితే వాళ్ళేమనుకుంటారూ’అని! ఈ చివాట్లు తినేకంటే, ఆ పంచదారలేని కాఫీయే బెటరు! ఏదో మందులా గుటుక్కుమని మింగేస్తే సరిపోతుంది!
మన అలవాటు ప్రకారం లొడలొడా మని వాగేస్తే ఏం అనుకుంటారో, అలాగని ఏం మాట్లాడకుండా ముంగిలా కూర్చున్నా కష్టమే! అటు తిప్పీ ఇటు తిప్పీ మనమీదకే వస్తుంది! ప్రాణం మీదకొచ్చినా సరే, టాయిలెట్టెక్కడ ఉందని ఛస్తే అడక్కూడదు, అడిగితే ఏమనుకుంటారో? మనం వెళ్ళేవారింట్లో పెద్దాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి పళ్ళూ, ఎంతమందుంటే అంతమందికీ ఏవో స్వీట్లూ తప్పనే తప్పవు, లేకపోతే ఏమైనా అనుకుంటే, అమ్మో!అంతదాకా ఎందుకూ ఏ పెళ్ళికైనా వెళ్తే చేతిలో పెట్టడానికి ఏదో ఒకటి కొని దాన్ని పెద్ద ప్యాకెట్లో పెట్టి ఇవ్వడమంత హాయి ఇంకోటుండదు,చవకలో తేలిపోతుంది.డబ్బులు ఎంతిచ్చినా ఓస్ ఇంతేనా అని అనుకుంటారేమో అని భయం!

   మనవడో మనవరాలో టి.వీ. పెట్టుకుని చూస్తూండగా, చానెల్ మారిస్తే పిల్లలేమనుకుంటారో అని భయం! బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ ఖాళీ సీట్లున్నా కానీ, వాటిల్లో కూర్చోడానికి భయం, అప్పటికే ఆ సీట్లో కూర్చున్నవారేమనుకుంటారో? ఇంటావిడ, అప్పటిదాకా చీరలు కట్టి, సడెన్ గా డ్రెస్సుల్లోకి మారితే ఊళ్ళోవాళ్ళేమనుకుంటారో అని భయం. ముందురోజు విచిత్రంగా కనిపిస్తుంది, రెండో రోజునుండి అలవాటైపోతుంది! అసలు వాళ్ళు పట్టించుకోనేపోవచ్చు,అంతా మన భ్రమ!

    ప్రపంచంలో నూటికి తొంభై మంది ఊళ్ళోవాళ్ళగురించి పట్టించుకోరు, వాళ్ళిష్టంవచ్చినట్లు చేస్తారు. మనం చూస్తూంటాము, పార్కుల్లో వయస్సుతో ప్రమేయం లేకుండా, ఒకళ్ళనొకళ్ళు పెనవేసేసికుని.. మరీ అలాగ ఉండఖ్ఖర్లేదూ, ఆఖరికి 60 ఏళ్ళు దాటినతరువాత, మొగుడూ పెళ్ళాం దగ్గరగా కూర్చోడానికి కూడా భయ పడతారు, పిల్లలేమనుకుంటారో అని! మరీ ఇంత భయమైతే ఎలాగండి బాబూ?
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయపడే సందర్భాలు నాకు గుర్తొచ్చినంతవరకూ వ్రాశాను. చాలామందికి ఇలాటి అనుభవాలు అయే ఉంటాయి. పాఠకులు వారి వారి అనుభవాలు హాయిగా అందరితోనూ పంచుకోండి. ఎవరూ ఏమీ అనుకోరు,అనుకున్నా వాళ్ళ ఖర్మ అని వదిలేయండి.
బై ద వే ‘కామన్వెల్త్ గేమ్స్ ‘ గురించి గత పదిరోజులుగా జరుగుతున్న గొడవమీద ఓ ఆర్టికల్ చదివాను. మీరూ చదవండి ఇక్కడ
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏమైనా అనుకుంటారేమో…

   నిన్న ప్రొద్దుట బయటకెళ్తూంటే, నా స్నేహితుడొకాయన కనిపించాడు. తనుకూడా రిటైరయ్యి అయిదారేళ్ళు గడిచింది. నాలాగే ఓ బస్సు పాసు తీసికుని ఊరంతా తిరుగుతూ, మధ్యాన్నం 12.30 కి కొంపకు చేరుతూంటాడు. కొడుకూ, కోడలూ తమతోనే ఉంటున్నారు. కోడలు పుట్టింటివారు కూడా పూణే లోనే ఉంటున్నారు. ఎదో మాటల్లో చెప్పాడు- కోడలి పుట్టింటివారు ఒకే ఊళ్ళో ఉంటే వచ్చే కొన్ని సమస్యలు.మొదటేడాది అంతా బాగానే ఉంటుందిట.కూతురు ఎలా ఎడ్జస్టయిందో చూడ్డానికి, వారానికోసారో, నెలకోసారో వీళ్ళింటికి వస్తూటారు.వచ్చినప్పుడల్లా ఎంతో <b.డిఫెన్సివ్ గా మాట్లాడడం, మీ అంతటివారు లేరంటూండడం, మీ ఇంట్లో కాబట్టి మా పిల్ల సుఖపడిపోతూందనడం వగైరా వగైరా...

    ఓ ఏడాది గడిచేటప్పటికి, ఆ కొత్తపెళ్ళికూతురు కూడా సెటిల్ అవుతుంది. సంగతులూ, సందర్భాలూ వంటపడతాయి! మూడో ఏటికల్లా,ఆ అమ్మాయివైపు వారు రావడం తగ్గిస్తారు, వారానికి ఒకసారి వీళ్ళే అక్కడికి వెళ్ళడం.మొన్ననోసారి,మా ఫ్రెండు భోజనం చేసేసి, సావకాశంగా కుర్చీలో సెటిల్ అయ్యాడుట. ఇంతలో కోడలికి ఫోనొచ్చిందిట, వాళ్ళ నాన్న కి కాలినొప్పో, కడుపునొప్పో వచ్చిందని. ఇంకెముందీ, ఈ పిల్ల హడావిడి పెట్టేసిందిట, వెంటనే వెళ్ళి చూసేయాలీ అని. సరే వెళ్ళండీ, అని ఈయన చెప్పాడుట. ఇక్కడ కోడళ్ళకి అదో అలవాటూ,. మామగారిని కూడా ‘పాపా’ అనడం, అత్తగారిని ‘మమ్మీ’ అనడం. అదేం అలవాటో బాబూ. హాయిగా మనవాళ్ళే నయం-అత్తయ్యగారూ, మామయ్యగారూ అంటారు. ఏ గొడవా లేదు, ఎవరెవరి హద్దులు ఎంతో తెలుస్తుంది!

    అసలు సంగతికొస్తే, ఆ కోడలందిట ‘పప్పా, మీరూ, మమ్మీ కూడా మా నాన్నని చూడ్డానికి రండీ’ అని. ఈయనకేమో భుక్తాయాసంతో నిద్రొస్తూంది, రానంటే ఏం ముంచుకొస్తుందో అని భయం, సరే అని అందరూ కట్టకట్టుకుని బయలుదేరారు. తీరా అక్కడికెళ్ళి చూస్తే, అంత సీరియస్సేమీ కాదు, ఏదో నడుస్తూంటే కాలు మడత పడిందిట! ఈ మాత్రం దానికి ఇంత శ్రమ పడిరావాలా, అని అందామన్నా, కోడలేమనుకుంటుందో అని ఓ భయం! ఇతనంటాడూ, నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నా,వాళ్ళవాళ్ళని ఎప్పుడూ రమ్మని పిలవదూ, కానీ వాళ్ళవాళ్ళకెమైనా వచ్చిందంటే మాత్రం హడావిడి చేసేస్తుంది అని!

    అసలు ‘ఏమైనా అనుకుంటారండీ’ అనే concept వల్లే కొందరి జీవితాలు నరకమైపోతున్నాయి. ప్రతీదానికీ, వాళ్ళేమైనా అనుకుంటారేమో, వీళ్ళేమైనా అనుకుంటారేమో అనుకుని,మొహమ్మాటపడి ప్రాణం మీదకు తెచ్చుకుంటూంటారు.ఉదాహరణకి ప్రతీ రోజూ ప్రొద్దుటే ఏవో మాత్రలు వేసుకోవాలనుకోండి, వాటిని వేసుకోవాలంటే ఖాళీ కడుపుమీద వేసికోకూడదంటాడు డాక్టరు. ప్రొద్దుటే వేసికుంటేనే కానీ రోజెళ్ళదు, ఏదైనా నోట్లో వేసికోడానికి ఉందా అని అడగడానికి జంకూ ఏమైనా అనుకుంటారేమో అని! పోనీ అలాగని ఏ బిస్కట్లైనా పెట్టుకుందామా అనుకుంటే, ఇంట్లో మనవల్నీ, మనవరాళ్ళనీ పెట్టుకుని చూడండి, చిన్న పిల్లల్లాగ బిస్కట్లు దాచుకుందీ మా అత్తగారూ అని కోడలేమైనా అనుకుంటుందేమో అని భయం! పోనీ అలాగని ఆ కొడుకూ, కోడలూ ఏమైనా రాక్షసులా ఏమిటీ, కావల్సిందేదో అడిగొచ్చుకదా, అలా కడుపు మాడ్చుకోడం దేనికీ అంటారు,అలాగని అడిగితే ఏమనుకుంటారోఅని భయం!

    భార్యాభర్తలిద్దరూ జీవించి ఉన్నంత కాలం ఫరవాలేదు. ఏది కావలిసినా భార్య భర్తతోనో, భర్త భార్యతోనో చెప్పి చేయించికుంటారు. దురదృష్టవశాత్తూ, వీళ్ళలో ఏ ఒక్కరైనా ముందరపోతే, ఇంక ఆ మిగిలినవాళ్ళసంగతే చెప్పేది. అందులో కొంతకి కొంత భర్త సంగతి మెరుగే, ఒక్కడూ ఉన్నా ఏ హొటలుకో పోయి ఏదో ఒకటి తింటాడు.భార్య సంగతలా కాదే, పాపం కావలిసింది నోరువిడిచి అడగలేదూ, అలాగని బయటకు వెళ్ళి తిననూ లేదూ, చేతిలో ఎంత డబ్బున్నా ఖర్చుపెట్టే స్వతంత్రం ఉండదు పాపం! ప్రతీదానికీ లక్షన్నర కారణాలు చెప్పుకోవాలి. బయటివాళ్ళనుకుంటారూ, హాయిగా ఉద్యోగం చేసింది కాబట్టి పెన్షనొస్తోందీ,ఖర్చు పెట్టుకోడానికి ఏ లోటూ లేదూ అని. కానీ ఈవిడకుండే సమస్యలు ఊళ్ళోవాళ్ళకేం తెలుస్తాయీ?
‘అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కుతినానివ్వదూ’ అన్నట్లుంటుంది వీళ్ళ పరిస్థితి.ఆస్థిపాస్థులున్నవాళ్ళ సంగతే ఇలాగుంటే, పిల్లలమీదే ఆధారపడేవాళ్ళ సంగతి అడక్కండి.

%d bloggers like this: