బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నాకు నచ్చిన ఓ వ్యాఖ్య

intitera _ ________ ______ _ Andhra Bhoomi

ఈ టి.వీ లో సోమవారాలు ప్రసారమౌతున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం మీద ఆంధ్రభూమి లో ఒక పాఠకుని నుండి వచ్చిన అభిప్రాయం. నూటికి నూరు పాళ్ళూ నాకైతే నచ్చింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

    నిన్నా మొన్నా శ్రీ కాళహస్తీశ్వర స్వామి రాజగొపురం సంఘటన గురించి, మన టి.వి.చానెల్స్ లొ హోరెత్తించేశారు.20 సంవత్సరాలనుండీ, రాజగోపురం బీటలు తీస్తున్నా, ఎవరూ పట్టించుకోలెదు. కాని నారావారు, అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమె అని నొక్కి వక్కాణించేశారు! ఈ 20 సంవత్సరాలలొనూ వారుకూడా మన రాష్ట్రాన్ని పరిపాలించారని మర్చిపొయారు పాపం! ఎన్నిపనులో ఆయనకి. ఇంక మన టి.వీ వాళ్ళయితే కనిపించిన ప్రతీ వాడి అభిప్రాయం అడిగి మనకి జ్ఞానోదయం చేశారు.దేవాదయశాఖ వాళ్ళు, పురావస్తు శాఖవారిది తప్పు అన్నారు, వీళ్ళేమో అబ్బే కాదు, ప్రభుత్వానిదే అన్నారు! ఈ లోపులో ఇంకోడొచ్చి, అప్పుడే ఎస్టిమేట్లు అవీ తయారుచేసేసి, గోపురం తిరిగి నిర్మించడానికి టెండర్లు పిలుస్తామూ, అందులో ఎంతెంతమందికి ఎంత వాటాలో వగైరా సిధ్ధం చేశారు. ఇందులో చూపించే ‘ఎంథూజియాసం’, గత 20 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా చూపిస్తే ఈ స్థితికి వచ్చేది కాదు.

   ఛాన్స్ దొరికినప్పుడల్లా, మందీ మార్బలం తో ప్రత్యేక దర్శనాలకి వచ్చే ఈ రాజకీయనాయకులకీ, దేవాదయ శాఖవారికీ, రాజ గొపురం బీటలు కనిపించలేదంటే ఎలా నమ్ముతాము? క్యూల్లో నుంచోకుండా ప్రత్యేక దర్శనాలకి అలవాటు పడ్డ ఈ దౌర్భాగ్యులకి, వాళ్ళకి జరిగే రాజలాంఛనాలమీద కాకుండా, మిగిలినవాటి మీద దృష్టి ఉంటుందని ఆశించడం మన అత్యాశే. ఒక టి.వీ, చానెల్ ( టి.వి-9 అనుకుంటా), శ్రీకృష్ణదేవరాయలి ఆత్మ ఎంత సంక్షోభం చెందిందో చాలా నాటకీయంగా వివరించారు. అది ఎలా ఉందంటే అవకాశం దొరికితే– ‘ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వర్గాన్నుండి మనతో లైన్లో ఉన్నారు’ అనేంత!మన టి.వీ.. వాళ్ళు దేనికైనా తగుదురు!

    తమిళనాడు లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా,వారు ఆరాష్ట్రంలోని దేవాలయాల గురించి తీసికునే శ్రధ్ధ చూస్తే కడుపు నిండిపోతుంది.ఏ దేవాలయం చూసినా, అక్కడి రాజగోపురాలకి రెగ్యులర్ గా రంగులు వేయడం,రిపెర్లొస్తే బాగుచేయడం ఒక డ్యూటీ గా చేస్తారు.మరి మనవాళ్ళకేం రోగం? ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎలా తిందామా అనే కానీ ఇంకో ధ్యాస ఉండదు.తిరుమలలో ఆదికేశవులు, కోర్టులు ఎంత అరచి గీ పెట్టినా సరే, ఆనంద నిలయం లోపల, స్వర్ణమయం చేయాల్సిందే అంటాడు. పాపం ఆ శ్రీ వెంకటేశ్వరుడికి నోరు లేదు, అయినా స్వర్ణమయం చేయకపోతే ఆయనెమైనా అంటాడా ఏమిటీ?

    ఇంక ఈవేళంతా, అవేవో యాత్రలూ, ఫైరింగులూ, ఆత్మహత్యా ప్రయత్నాలూ అడక్కండి, మన సహనం ఎంతవరకూ పరీక్షించగలరో దానికి ఉదాహరణ ఈ వేళ్టి ప్రసారాలు.వాడెవడో ఎం.ఎల్.సీ ట వాడి గన్ మన్ ఠపా ఠపా మని కాల్చేశాడు.మరి పోలీసులేం చేస్తున్నారుట? ఇంక హైదరాబాద్ సంగతికొస్తే ఆ కుర్రాళెవరో సావకాశంగా రాళ్ళు రువ్వుతూ, దుకాణాల అద్దాలు పగలకొట్టేస్తున్నారు. మన టి.వీ. వాళ్ళేమో, నాలుగైదు పార్టీల వాళ్ళని ఎవరినో స్టూడియో కి పిలవడం, వాళ్ళచేత అవాకులూ చవాకులూ మాట్లాడించడం. ఇంక ఈ ఏంకర్లు, ఆ మాట్లాడేవాడు ఏదైనా చెప్పడం మర్చిపోయాడేమో అని .ఒకే ప్రశ్నని అడిగిందే అడగడం.

    ఆ అత్మహత్యా ప్రయత్నం- ఓ జోక్ ఆఫ్ ద డికేడ్! అసలు చేతిలో ఉన్నవి నిద్రమాత్రలా, హోమొపతీ మాత్రలా? రెండంటే రెండే నిద్ర మాత్రలతోనూ ఆత్మహత్యా ప్రయత్నం చేయొచ్చని మనకి జ్ఞానొదయం అయింది. ఈ యాత్రలూ, ఫైరింగులూ, ట్రైన్లు అంటించడాలూ, దుకాణాల అద్దాలు పగలకొట్టడాలూ చుస్తూంటే నాకో బ్రిలియంట్ ఐడియా వస్తోంది. ఇవి మన రాజకీయ నాయకులు బ్రతికున్నంత కాలమూ ఎలాగూ తప్పవు, మన టి.వి వాళ్ళు వాటిని ప్రత్యక్షప్రసారం చేయడం ఎలాగూ మానరు, హాయిగా ఏ కంపెనీ బ్రాండు వాళ్ళో వీటినికూడా స్పాన్సర్ చెసేస్తే ఆ కంపెనీకి లాభాలెనా వస్తాయి. టి.వీ. వాళ్ళూ బాగుపడతారు.

    ఉదాహరణకి కార్యక్రమం ఇలా ఉండాలి– ఈ వేళ్టి బంధ్ స్పాన్సర్స్ ఫలానా కంపెనీ ఠింగ్ ఠింగ్..- తరువాతి కార్యక్రమం తార్నాకా లో దుకాణాల లూటీ స్పాన్సర్డ్ బై ఫలానా కంపెనీ.. ఆత్మహత్యా ప్రయత్నం కొద్ది క్షణాల్లో స్పాన్సర్డ్ బై…’
కావలిస్తే మన కార్పొరేట్ స్కూల్స్ లో కూడా వీటి గురించి ఓ పాఠం నేర్పొచ్చు. ‘ బంధ్ నిర్వహించడం లో రాష్ట్రం లో నెంబర్ 1, ఫలానా విద్యాసంస్థ అని. ఇదంతా ఏదో హాస్యానికి వ్రాస్తున్నది కాదు. కడుపులో బాధని చెప్పుకోలేక, ఏడవలేక నవ్వడం. అంత పేద్ద రాష్ట్రంలో మన రాజకీయాలు ఎంత బ్రష్టు పడిపోతున్నాయో అని ఆలోచించేవారే కరువయ్యారా? అసలు వీటినుండి బయటపడి రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందా అనిపిస్తూంది…
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Scholarships for IITs

Do the Math – The Best of Asia 2010 – TIME

   మొన్న ఐ.ఐ.టి ల ఎడ్మిషన్ పరీక్షల్లొ ఆల్ ఇండియా లెవెల్ లో తమ తమ కోచింగ్ సెంటర్ల కొచ్చిన ర్యాంకుల గురించి, టి.వీ. లలో యాడ్ లతో హోరెత్తించేశారు.ఇంకో చోట ఎక్కడో కోచింగ్ క్లాసెస్ లో ప్రవేశానికి కూడా అర్హత పరీక్షల గురించి చెప్పారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా, ఇన్ని పేపర్ల వాళ్ళూ, టి.వీ వాళ్ళూ ఇక్కడే మన భారతదేశంలోనే, అదీ బీహారు లో ఒక వ్యక్తి చేస్తున్న ఓ ఘనకార్యం గురించి వ్రాయాలనిపించలెదు.

    ఇక్కడ శ్రీ ఆనంద కుమార్అనే ఒక వ్యక్తి, పాట్నా లో ఉన్న 30 మంది విద్యార్ధుల్ని ఐ.ఐ.టి కి కోచింగ్ ఇవ్వడమే కాదు, తన స్వంత ఖర్చుమీద వాళ్ళకి ఫుల్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చి చదివిస్తున్నాడు. ఈ విషయం మనం విదేశీ పత్రికల్లో చదివితే గానీ తెలియలేదు. ‘మేరా భారత్ మహాన్”

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ప్రభుత్వ కార్యాలయాలు–2

   మాకు ఫాక్ల్టరీలలో ఎవరైనా సర్వీసు లో ఉండగా దివంగతులైనప్పుడు ‘ డైడ్ ఇన్ హార్నెస్’ రూలు క్రింద,చనిపోయినవారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ( భార్య కానీ, కొడుకు కానీ) ఉద్యోగం ఇస్తూంటారు. మరీ ఖాళీలు లేనప్పుడు, కొడుకుకి ఆర్డర్లీ క్రింద ఇస్తూంటారు. ఈ ఆర్డర్లీల సంగతి బహు విచిత్రంగా ఉండేది. తండ్రి పోయినప్పుడు అతని భార్యకు వచ్చే టెర్మినల్ బెనిఫిట్స్ తో ముందుగా ఓ బైక్కు తీసేసుకుంటాడు. పోయిన అతని పెన్షన్ ఎలాగూ వస్తుంది.
దానికి సాయం ఈ కుర్రాడికి ఉద్యోగం. ఇంక వీడిని పట్టేవాడుండడు.ఏ సెక్షన్ లో వేసేరో, అక్కడ ఇన్ ఛార్జేమో, ఏ బస్సులోనో, నడిచో ఆఫీసుకి వస్తూంటాడు, ఇతనేమో ఝూమ్మని బైకు మీద వస్తూంటాడు, పైగా దారిలో కనిపిస్తే లిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తూంటాడు! ఇంక ఈ కుర్రాడు ఆఫీసులో పనేం చేస్తాడు? మొట్టమొదట వీడు చేసే పనేమిటంటే ఏదో ఒక యూనియన్ లో చేరిపోవడం.ఆఫీసులో మొదటి రెండు మూడు నెలలూ ముంగిలా ఉంటాడు.ఆ తరువాత నీళ్ళు వంట పడతాయి! రూల్సూ, రెగ్యులేషన్సూ మాట్లాడతాడు. ఏమినా అంటే యూనియన్ వాళ్ళని తీసికొచ్చేస్తాడు.మనం ఏమీ అనకూడదు.పైగా పైనుంచి ఆర్డర్స్– ‘డిప్లొమాటిక్ ‘ గా ‘హ్యాండిల్’ చేయడం నేర్చుకోవాలీ అంటూ. దాని అర్ధం ‘నోరు మూసుకుని కూర్చో” అని! ఎవరైనా బయటి వాళ్ళు ఆఫీసుకి వస్తే ఈ కుర్రాడి స్టైలు చూసి అతనే ఇన్ ఛార్జేమో అన్నంతగా ఉంటాడు. వాడికి నచ్చిన పనే చేస్తాడు.మనకు ఇష్టం అయితే చేయించుకోవడం లేకపోతే తూర్పుకి తిరిగి దండం పెట్టడం! మామూలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో రెండోదే జరుగుతూంటుంది, ఇందులో సందేహం లేదు.

వీళ్ళు కాకుండా కొంతమంది లేడీస్ ఉంటారు. నేనేదో ఎమ్.సి.పి అనుకోకండి, నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను.ప్రతీ చోటా ఇలాగే ఉంటారనడం లేదు. మా సెక్షన్ లోకూడా చాలా మంది సిన్సియర్ లేడీస్ ని చూశాను.ఏదో పేరంటానికి వెళ్ళినట్లు ఖబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇదేమిటీ అని అడిగితే కళ్ళంబట నీళ్ళేట్టేసికుని, పై ఆఫీసరు దగ్గర ఉల్టా మనమిద కంప్లైంట్ చేసేస్తారు. ఆయనేమో మన ‘శీలాన్ని’ శంకించేస్తాడు! ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడం అంటే నిజంగా ‘ అశిధారావ్రతం’ లాటిది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్ద జాడ్యం యూనియన్లు. ఆఫీసరు దగ్గరనుంచి, క్రింద ఆర్డర్లీ దాకా ప్రతీవాడూ పేద్ద లీడర్ అనే అనుకుంటాడు. యూనియన్లు అనేవే లేకుంటే, వీళ్ళ మాట ఎవడు వింటారూ అంటారు. కానీ ప్రతీ దానికీ ఏదో పేద్ద రభస చేయఖ్ఖర్లెదుగా! పైగా ప్రతీదీ ‘హక్కు’ అంటారు. మరి పని దగ్గరకు వచ్చేసరికి ‘ విధి’ అనే మాట గుర్తుకు రాదా? ఇంకోటి- నిన్నో మొన్నో పెపర్లో చదివాను- మంగళూరు ఎయిర్పోర్ట్ లో ఏక్సిడెంట్ జరిగిన తరువాత, ఎయిరిండియా వాళ్ళు సమ్మేచేస్తున్నారు, అందులో యూనియన్ లీడర్స్ అసలు పనికే వెళ్ళరుట!కానీ అందరిలాగే జీతభత్యాలు అవీ మాత్రం ఠంఛనుగా తీసేసుకుంటారు. ఇలాటి ‘ జీవులు’ ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉంటారు.వీళ్ళ కి పనేమీ ఉండదు, మన రాజకీయనాయకుల ‘మీనిఏచర్ రూపాలు’.సంస్థలో ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగిందా, అక్కడ వీళ్ళు హాజర్. ఏ గొడవా లేకుండా ఉంటే వీళ్ళకి కడుపుబ్బరం వచ్చేస్తుంది. మన బి.జే.పీ వాళ్ళు చూడండి, ఏ పనీ లేనప్పుడు అయోధ్య లో రామ మందిరం వ్యవహారం మాట్లాడతారు. అలాగే ఈ యూనియన్ నాయకులు, జీతాల ఎగ్రిమెంట్లంటారు.ఇన్ని గొడవలతో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడానికి టైము ఎక్కడుంటుంది?

బ్యాంకుల్లో ఒక్కోసారి ఆఫీసర్లు సమ్మె చేస్తూంటారు! ఏమీ తోచకపోతే చేసే పని ఇదోటి.ఇంకా మన రక్షణ బలాల్లోనూ, పోలీసుల విభాగంలోనూ ఈ సమ్మెల రోగం రాలెదు. నాకు ఒక సంగతి అర్ధం అవదు-‘ కోర్ సెక్టార్’ లో చూస్తూంటాము
ఈ సమ్మెలూ అవీ. మరి పాపం ఐ.టీ లొ ఇలాటివేవీ ఉండవా అని.అయినా వాళ్ళననేం లాభం? అసలు ఒకే మనిషి ఒకే సంస్థలో చాలా కాలం పనిచేసిందెప్పుడూ? ఎక్కడ జీతాలెక్కువిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు జీవితంలో మంచి ‘థ్రిల్’ మిస్స్ అవుతున్నారు!

ఊరికే ప్రభుత్వ కార్యాలయాల్లోనివాళ్ళనే ఆడిపోసుకుంటే బాగో లేదు. మిగిలిన రంగాల్లోని వాళ్ళ గురించి కూడా చెప్తే ‘బాలెన్స్’అవుతుంది. సరదాగా, మీడియా అంటే ప్రింట్ , టి.వీ. ల్లోని తెరవెనుక భాగవతాల్ని కూడా చెప్తూంటే, ‘ఓహో
మన భారత భూమి ఎంత ప్రగతి సాధించిందీ’ అని చంకలెగరేసుకోవచ్చు.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ప్రభుత్వ కార్యాలయాలు

   ఈ వేళ సాయంత్రం ఎన్.టి.వి చూస్తూంటే అందులో ఒక కార్యక్రమం వచ్చింది.ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎలా ఉంటారు( అసలంటూ ఉంటే!), ఎప్పుడు వస్తారు వగైరా వగైరా.. ఒక్కకళ్ళనీ చూస్తూంటే ఒళ్ళు మండిపోయింది.ఎక్కడైనా సరే కార్యాలయ ముఖ్య అధికారి క్రమశిక్షణ పాటిస్తే, క్రింది వాళ్ళు కూడా పాటిస్తారు. ‘ కంచే చేను మేస్తే’ అన్నట్లు, ఆ అధికార్లే గడ్డితింటూంటే, క్రిందివాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్లు ఉంటారంటే ఆశ్చర్యం ఏమిటి?

   మామూలుగా చూస్తూంటాము-మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆ ప్రాంతానికి సంబంధించని ప్రభుత్వ వాహనాలని.ఏ మ్యున్సిపాలిటీ వారిదో,లేక ఏ ఆరోగ్య శాఖ వారిదో వాహనం చూస్తే అనుకోవచ్చు, మార్కెట్ లో ఏదైనా డ్యూటీ మీద వచ్చేరేమో అని. అలవాటు ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు, వాహనాల్ని తమ స్వంత పనులకీ,వాళ్ళ కుటుంబసభ్యుల పనులకీ ఇచ్చేరనుకుంటారు.

    ఇక్కడ పూణే లో చూస్తూంటాను- కేంద్రీయ విద్యాలయాల బయట ఆర్మీ వాళ్ళ కారులు. ఆ అధికారి కూతురో, కొడుకో అక్కడ చదువుతూండవచ్చు, వాడిని ఇంటికీ స్కూలుకీ తీసికెళ్ళడానికి, మేమ్ సాబ్ ని మార్కెట్ కి,బ్యూటీ పార్లర్ లకి తీసికెళ్ళడానికీ, ఈ వాహనాలు వాడేస్తూంటారు. ఈ మధ్యన నేను ప్రొద్దుటే ‘కాళీ మందిర్’ కి వెళ్ళినప్పుడు ‘ఓ గవర్నమెంట్ వెహికల్’ ని చుస్తూంటాను. ఇదిక్కడేం చేస్తూందని అడుగుదామనిపిస్తూంటుంది,కానీ అడగడానికి ఏదో సంకోచం!
ఆ అధికార్లకుండాలి క్రమ శిక్షణ అనేది.

    ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే గుమాస్తాలనే చూపించారు, పై అధికారుల గురించి కూడా చూపిస్తే, ఈ టి.వి వాళ్ళ సిన్సియారిటీ ని అంగీకరించేవాళ్ళం.కార్యాలయాలనేమిటి, బ్యాంకుల్లో ( ప్రభుత్వ బ్యాంకులు) వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? బ్యాంకులు జాతీయకరించక పూర్వం, పరిస్థితి కొద్దిగా బాగానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా యూనియన్ ల ధర్మమా అని, ఎవరినీ ఏమీ అనకూడదు. లేటు గా ఎందుకొచ్చేవూ అని కానీ,వచ్చిన రెండు మూడు గంటలకే ఎక్కడికి పారిపోయావూ అని కాని. ఏ అధికారైనా అడిగాడా, వాడి పనైపోయిందే.అదేదో ‘ టూల్ డౌన్ స్ట్రైక్కో’ మరోటో చేసేస్తారు.వాడు క్షమాపణ చెప్పేదాకా వదలరు.

   కలకత్తా లో మా అర్డ్నెన్స్ ఫాక్టరీ బోర్డ్ వాళ్ళ హెడ్క్వార్టర్ ఉందిలెండి. అక్కడికి మొదటి సారి వెళ్ళినప్పుడు చెప్పారు, అక్కడ సీట్ లో మనిషిని చూడడం చాలా కష్టం అని. ఆ బిల్డింగు 13 అంతస్థులు ఉంటుంది. ఒక్కో విభాగం ఒక్కో అంతస్థులో. వాళ్ళేం చేస్తూంటారంటే- మీరు ఏ అంతస్థులోకి వెళ్ళినా సరే,ఆ విభాగంలో మొత్తం 50 సీట్లకీ, నలుగురో అయిదుగురో కనిపిస్తారు. ఒక విచిత్రం ఏమంటే, మిగిలిన 45 సీట్లలోనూ, కుర్చీకి ఓ కోటో,సీతాకాలం అయితే ఓ స్వెట్టరో వెళ్ళాడుతూంటాయి. ‘ సొనే పే సుహాగా’ ఏమిటంటే, టేబిల్ మీద ఓ కళ్ళజోడు కూడా ఉంటుంది. అక్కడున్న ఒక్క ‘ప్రాణి’ నీ అడిగామనుకోండి, ఈ సీట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడూ అని.
‘ అభీ తక్ యెహీ పే థా, షాయద్ అగలే ఫ్లోర్ మే గయా హోగా’ అంటాడు.అసలు సంగతేమంటే, ఆ సీట్ కి సంబంధించిన ఆసామీ, ఆఫీసుకే రాలేదు. మరి ఆ కోటూ/స్వెట్టరు, కళ్ళజోడూ ఏమిటయ్యా అంటే, అవి మనం దేముడికి పూజ చేస్తాం చూడండి ‘ అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా, అది అలంకారార్ధమే. అసలువి వాడి వంటి మీదా, కంటి మీదా ఉన్నాయి! వాళ్ళకి ఓ ఎరేంజ్ మెంట్ ఉంటుంది– వారంలో మూడు రోజులు కొంతమందీ, రెండు రోజులు మిగిలినవాళ్ళూ ఆఫీసుకు రావఖ్ఖర్లేదన్నమాట. అంటే మనం వెళ్ళినప్పుడు చూసిన ‘ అక్కు పక్ష్క్షి’ ది ఆఫీసుడ్యూటీ అన్న మాట. మరీ రోజంతా డుమ్మా కొట్టేయరనుకోండి, ఏదో ‘హాఫ్ డే’ ఊళ్ళో పనులన్నీ చూసుకుని, మెల్లిగా అఫీసు మూసేసే టైముకి వస్తాడు.స్వంత పనులూ చూసుకోవచ్చు, జీతమూ వస్తుందీ! హాయి! పైగా దీనికి సాయం వారానికి అయిదు రోజులే ఆఫీసు. శుక్రవారం వెళ్తే ‘వీకెండ్’ అని పనిచేయరు, సోమ వారం వెళ్తే ‘ హాంగ్ ఓవర్’ తో పనిచేయరు. మరి ఫైళ్ళు కదలాలంటే ఎలా కదులుతాయీ?
రాజీవ్ గాంధీ టెల్ కాం లో అదేదో విప్లవం తెచ్చుండవచ్చు, కానీ ఆయన చేసిన పేద్ద దరిద్రపు పని ఏమిటంటే ఈ ‘ ఫైవ్ డే వీక్’.అందరినీ ఇలా చెరిగేస్తున్నారూ, మరి మీరేం చేశారూ 42 ఏళ్ళూ అనకండి.నేను పనిచేసినది ఫాక్టరీ లలో.

   అక్కడ మాకు ఓవర్ టైము అనేది ఒకటుండేది.వారానికి ( ఆరు రోజులు) 54-60 గంటలు ఉండాలి. దానికి ఓ.టీ ఎలవెన్స్ ఇచ్చేవారు.ఏ కారణం చేతైనా, శలవు పెడితే డబ్బులు తక్కువ వచ్చేవి.అందువలన చచ్చినట్లు సంవత్సరానికీ మూడు వందల రోజులూ డ్యూటీ కి వెళ్ళేవాళ్ళం. ఏ శలవైనా వచ్చిందంటే ఆ వారానికి 60 గంటలు పూర్తిచేయడానికి ఆదివారాలు పనిచేసేవాళ్ళం. అలాగని మా వాళ్ళేం బుధ్ధిమంతులనడంలేదు.ప్రొద్దుటే 7.30 కి వచ్చి కార్డ్ పంచ్ చేసి, మెల్లిగా కబుర్లు చెప్పుకుని,8.00 -8.30 కి కుర్చీలో సెటిల్ అవడం, 9.30 కి చాయ్ పేరు చెప్పి ఇంకో అరగంటా, 12.30 కి లంచ్, దానికోసం 11.30 నుండీ బిచాణా కట్టేయడం.తిండీ తిప్పలూ పూర్తిచేసికొని, ఓ కునుకు తీసి మెల్లిగా 2.30 కి సీట్ లోకి రావడం, మళ్ళీ 3.30 కి చాయ్ పానీ ! ఇన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది….
ఇంకా ఉంది…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పులు

    ఈ క్రెడిట్ కార్డులూ అవీ రాకముందు, పచారీ కొట్లలో నెలవారీ సరుకులు కొన్నప్పుడు పద్దు రాసేవాళ్ళం.ఓ పుస్తకంలొ కొట్టువాడు వ్రాసుకునేవాడు, దాని డూప్లికేటు కాపీ మన దగ్గర ఒకటుండేది. నెల పూర్తి అవగానే మన సావకాశాన్ని బట్టీ, చేతిలోకొచ్చిన జితాన్ని బట్టీ ఆ ‘అప్పు’ తీర్చేవాళ్ళం. ఎప్పుడైనా పెద్దవాళ్ళకి కొట్టుకి వెళ్ళడానికి తీరికలేకపోయినా, పిల్లల్ని ఆ ‘పుస్తకం’ ఇచ్చి పంపితే, సరుకులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో వచ్చే జీతాల్ని బట్టి ఈ ‘ఖాతా’తప్పనిసరై ఉండేది. జీ.పీ.ఎఫ్ కీ, సొసైటీకీ, పోనూ చేతికి ఎంతోకొంత వచ్చేది. ఆ చేతిలొకి వచ్చిన దానిలోనే సర్దుకుని కాలక్షేపం చెసేవాళ్ళూ. స్వంత ఇంటి ‘కల’ కలగానే మిగిలిపోయేది.ఎప్పటికో, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఓ కొలిక్కి వచ్చిన తరువాత, ఇంటావిడ పోరు పెట్టగా పెట్టగా మొత్తానికి ఓ కొంప ఏర్పరుచుకునేవాళ్ళు.

ఈ లోపల రోగాలు వచ్చినా , రొచ్చులు వచ్చినా మళ్ళీ ఎవడిదగ్గరకో వెళ్ళి చెయ్యి చాచవలసివచ్చేది. ఆ ఇంటాయన అదృష్టం బాగుంటే రిటైర్ అయ్యేనాటికి, పిల్లల పెళ్ళిళ్ళూ,చదువులూ పూర్తిచేసి, స్వంత కొంపలో సెటిల్ అయ్యేవాళ్ళు.ఇంత హైరాణ పడినా ఏ పెద్దమనిషీ తను ఏదో త్యాగాలు చేసేనని ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలెదు.పెళ్ళి చేసికుని, ఓ సంసారం ఏర్పరుచుకున్నాడు కనుక వాళ్ళని పోషించడం ఓ బాధ్యత గా తీసికుని నిర్వర్తించే వాడు. సంసారం గురించి పట్టించుకోకుండా, తన త్రాగుడుకీ మిగిలిన వ్యసనాలకీ దాసులైన వాళ్ళూ ఉండేవారనుకోండి, కాని వారి శాతం బహు తక్కువ.

ఇంకొ సంగతేమంటే ఆ రోజుల్లో ‘కన్జ్యూమరిజం’ అంత ఎక్కువ కాదు, ఉన్నదాంట్లోనే సంతృప్తి గా బ్రతికేసేవాళ్ళు. పిల్లలకి అప్పో సొప్పో చేసి చదువులు చెప్పించేస్తే వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే చాలనుకునేవారు.ఎంత చెప్పినా ఆ జీవితంలోనే ఎంతో సంతోషమనిపించేది. అదీ ఓ సంతోషమేనా అని ఈ తరం పిల్లలు అంటారనుకోండి, అది వేరే విషయం.ఎవరి అభిప్రాయం వాళ్ళది.మేం పెట్టిన ఖర్చులు, మా తల్లితండ్రులకి వేస్ట్ గా కనిపించి ఉండవచ్చు.అలాగే ఇప్పటి తరంవాళ్ళు చేసే ఖర్చులు పాత తరంవాళ్ళకి వేస్టనిపించొచ్చు.

ఈ రొజుల్లో ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని, ప్రతీ వాడూ ఈ అప్పుల బారిలో కూరుకుపోతున్నాడు.ఆఖరికి ఇదివరకు ‘పద్దు పుస్తకం’లో వ్రాయించుకున్న పచారీ కొట్టువాడుకూడా, క్రెడిట్ కార్డులు స్వీకరిస్తున్నాడు! ఇదివరకు వాడికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు బ్యాంకు వాడు వేసే ‘ వడ్డీ’ తో కలిపి బ్యాంకు వాడికి ఇస్తున్నాము. అంతే తేడా! ఏదో ఆమధ్య ‘ఆర్ధిక మాంద్యం’ ధర్మమా అని కొంతలోకొంత ఇటువంటివి కంట్రోల్ అయ్యాయి . మళ్ళీ మామూలే.

ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ వేళ టి.వీ. చూస్తూంటే ఓ బ్యాంకు వాడి యూనియన్ బ్యాంకో ఇంకోటో యాడ్ చూశాను. వీడు ( అంటే అప్పు తీసికున్న ‘బక్రా’) ఫ్లాట్ కోసం ఏదో ఫలానా ఎమౌంటు అప్పు తీసికున్నాడుట,
వచ్చే 25 సంవత్సరాలూ ఆ అప్పు తీర్చుకోవచ్చుట, అప్పుడు ఈయనగారి ‘బేటా’ అనుకుంటాడుట ‘ మేరా బాప్ కిత్నా హోషియార్ థా నా!
అని.ఇదివరకటి రోజుల్లో ప్రతీ తండ్రీ అనుకునేవారు–‘ ఆస్థులు ఇచ్చినా లేకపోయినా, అప్పులు మాత్రం వారసత్వంలో ఇవ్వకూడదూ’ అని.దానికి ఉల్టా ఈ రోజుల్లో ! మనం ఎంత అప్పుచేస్తే అంత గౌరవం. మన బ్యాంకుల వాళ్ళు ఎన్.పీ.ఏ అనో ఇంకేదో ఓ పేద్ద గ్లామరస్ పేరు పెట్టి చెప్తూంటారు, ‘ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్’అని.

మీరూ నేనూ ( మధ్య తరగతి లా ఎబైడింగ్ సిటిజెన్స్) అప్పు చేస్తే, గూబ పగలకొట్టి వసూలు చేస్తారు, మనం అప్పుచేసికొన్న ఫ్లాట్ వేలం వేసో, అప్పుచేసి కొన్న కారుని టౌ చేసి తీసికునిపోయో. వీళ్ళ ‘ఎన్.పీ.ఏ’ లలో సింహభాగం
సంఘంలో పెద్ద మనుష్యులుగా చెలామణీ అయ్యే రాజకీయ నాయకులూ, గూండాలూ మాత్రమే. వాళ్ళని ఏం చెయ్యలేరు.

ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని వందరూపాయలు ఖర్చుపెట్టే చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాము. 45 రోజులదాకా ఇవ్వఖర్లేదుగా! అప్పుడైనా ఓపిక ఉంటే ఇస్తాము, లేకపోతే ‘మినిమం ఎమౌంటు’ తో సరిపెట్టేసికుంటాము.
ఫోను ఎత్తితే చాలు, ఏ బ్యాంకు వాడో, మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తామంటూ.నేను ఏం చేస్తూంటానంటే, కాలక్షేపానికి వాడు చెప్పే సోదంతా విని, చివరలో చెప్తూంటాను, ‘ నాకు జీతంభత్యం లేదోచ్, పెన్షన్ మీద బ్రతుకుతున్నానూ’అని.అంతే,తుపాకీ గుండుకు కూడా దొరక్కుండా ఫోన్ పెట్టేస్తాడు!అలాగే ఈ మధ్యన ‘హెల్త్ ఇన్స్యూరెన్స్’ వాళ్ళ గోల ఎక్కువైపోయింది. వాళ్ళ ఫోన్ రాగానే,వాడు చెప్పే బక్వాస్ అంతా విని ఆఖరున చెప్తాను- నాకు 65 ఏళ్ళు నిండాయీ అని!

ఇదివరకటి రోజుల్లో కొన్ని దుకాణాల దగ్గర బోర్డులుండేవి–‘అరువు లేదు’ అని. ఇప్పుడు అలా కాదు ‘ వుయ్ యాక్సెప్ట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్’ అని. అదీ అప్పటికీ, ఇప్పటికీ తేడా !! ఇదివరకు కొట్ల వాళ్ళు కూడా మనల్ని అప్పులు చేయకుండా సహాయపడేవాళ్ళు. ఇప్పుడో మనం ఎంత ‘అప్పుల’ ఊబిలో కూరుకుంటే అంత ఆనందం అందరికీ. సర్వే జనా సుఖినోభవంతూ !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ప్రజాసేవలు-2

    నిన్న రైళ్ళలో టి.టీ లు చేసే ప్రజా సేవ గురించి చూశాముగా. ఏదో తిప్పలు పడి మొత్తానికి ప్రయాణం చేసి మన గమ్యానికి చేరుతాము.అక్కడ ఇంకో రకమైన ప్రజా సేవకులు తారస పడతారు.అన్ని భాషల్లోనూ రైల్వే స్టేషన్లలో అరుస్తూంటారు–మీ సామాన్లు ఆథరైజ్డ్ కూలీ ద్వారానే తీసికెళ్ళండి, అతనికి ప్రభుత్వం విధించిన కూలీ మాత్రమే ఇవ్వండి. ‘అని చెప్పి ఏవేవో రేట్లు బోర్డులమీద కూడా వ్రాస్తూంటారు. నాకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ అనుభవం చెప్పండి- ప్రభుత్వం వారు చెప్పిన రేటుకి ఏ కూలీ అయినా తీసికెళ్తాడా? ఛస్తే తీసికెళ్ళడు.మనం ఏ ఆర్డినరీ 3-టయర్ లోంచో దిగితే అసలు పట్టించుకోడు. వాళ్ళు ముందర ట్రైను కి ఆ చివరో, ఈ చివరో ఉన్న బోగీలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు, కారణం అక్కడే ఏ.సీ బోగీలుంటాయి.

   మన ఆంధ్రదేశంలో ఏ స్టేషనులోనూ, ఓవర్ బ్రిడ్జ్ మీద ర్యాంప్ సౌకర్యం ఉండదు. ప్రతీ స్టేషన్ ఓవర్ బ్రిడ్జ్ మీదా మెట్లే. ఈ మధ్యన వస్తున్న వీల్స్ సూట్ కేసులు అక్కడిదాకా లాక్కొచ్చినా, అక్కడికి వెళ్ళాక, నెత్తిమీద మోసుకుని వెళ్ళాల్సిందే. అందరికీ సౌకర్యంగా ఉండదుకదా ( నాలాటి 65 ఏళ్ళ వాడైతే మరీనూ!). అందువలన నచ్చినా నచ్చకపోయినా ఓ కూలీ ని మాట్లాడుకోవాల్సిందే. ఇంక ఆ పోర్టర్ తనకిష్టం వచ్చినంత రేటు చెప్తాడు. ‘టు హెల్ విత్ గవర్నమెంట్ రేట్స్ ‘. సో వీళ్ళు చేస్తున్నది కూడా ప్రజా సేవనే అనాలి కదా!

    ఇన్ని కష్టాలూ పడి బయటకు వస్తాము. ఇంక అక్కడ ఆటో వాళ్ళతో. మీటరు ఉన్నా సరే, వాడు చెప్పిన రేటుకే మాట్లాడుకోవాలి. ఏమైనా అంటే, మీటరు పనిచేయడంలేదంటాడు.రాజమండ్రీ లో అయితే మీటర్లే ఉండేవి కావు.మనల్నీ, మన సామాన్నీ చూసి వాడు ఏం చెప్తే అది నోరుమూసుకుని ఇచ్చేయడమే. అక్కడ అన్ని ఆటో వాళ్ళదీ ఒకే మాట ! ఇదీ ప్రజాసేవే.

    మీరు ఎప్పుడైనా మనవైపు రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళారా?నాకు తణుకు లో మూడు సార్లు వెళ్ళే అదృష్టం కలిగింది.అక్కడ రిజిస్టార్ అనబడే మహానుభావుడే అడిగేస్తాడు ‘కాఫికి డబ్బులివ్వండి’ అని! డబ్బులు ఇవ్వకపోతే మన రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తే అవదు. కాగితాలు తెచ్చుకోడానికి, మూడు చెరువుల నీళ్ళు త్రాగించేస్తారు! ఇదీ ప్రజాసేవే !

    పాస్పోర్ట్ కి ఎప్లయ్ చేసిన తరువాత, మన ఇంటికి వెరిఫై చేసుకోడానికి వచ్చే పోలీసాడికి మామూలు ఇవ్వకపోతే, మన ప్రవర్తన ‘సందేహాత్మకంగా’ ఉందని వ్రాసినా వ్రాసేస్తాడు.పాస్ పోర్ట్ మాట దేముడెరుగు, మనం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలెక చావాలి! ఇదీ ప్రజాసేవే !

    ఆఖరికి మన సొసైటీ లో ఉండే వాచ్ మన్ కి కూడా వాడడిగినప్పుడు పండగ మామూళ్ళు ఇవ్వాల్సిందే.మన వైపు ప్రతీ నెలా ఏదో పండగ వస్తూనే ఉంటుంది.మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు, అందరిలాగే దసరాకి మామూలిచ్చాను.మళ్ళీ దీపావళి అన్నాడు,ఆ తరువాత సంక్రాంతన్నాడు.ఇదేమిటీ అని అడిగినందుకు, ఎప్పుడైనా కరెంటు పోతే, జనరేటరు వేసేవాడు కాదు,నాలుగు అంతస్థులూ చచ్చినట్లు మెట్లమీదుగా వెళ్ళేవాడిని! వాడిదీ ప్రజాసేవే !

    నాకు ఆశ్చర్యకరమైన అనుభవం ఇప్పటిదాకా ఒకేసారి జరిగింది. 1992 లో మా అమ్మాయి, 12 క్లాసు పాస్ అవగానే, ఇంజనీరింగు లో ప్రవేశానికి, మహరాష్ట్రలో రెండు సర్టిఫికెట్లు ఇవ్వాలి.
మొదటిది ” డొమిసైల్” రెండోది ‘నేషనాలిటీ’. మొదటిది భుసావల్ తహసిల్దార్ ఇస్తాడు, రెండోది జలగాం లో కలెక్టరాఫీసు వాళ్ళిస్తారు. మొదటివాడు, 100 రూపాయలిచ్చిన తరువాతే నా కాగితాన్ని ముందరకి పంపించాడు.అది పుచ్చుకుని జలగాం వెళ్ళాను.అక్కడ రెండు గంటల్లో మా అమ్మాయి సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమైనా ఇచ్చుకోవాలా అని నసుగుతూ అడిగితే ఆయనన్నాడూ,’ సార్, మీ అమ్మాయి తెచ్చిన మార్కులు ( 98%), మన జిల్లాకే గర్వకారణం, మీదగ్గర కూడా చాయ్ పానీకి డబ్బులు పుచ్చుకుంటే, అర్ధంలేదూ’ అని. కారణం ఏదైతేనే నేను ఏ దక్షిణ ఇచ్చుకోకుండా పని పూర్తిచేసికున్నాను.మరి దీన్ని ప్రజాసేవ అంటారో లేదో నాకు తెలియదు.జీవితంలో మొదటిసారీ, బహుశా ఆఖరిసారీ నాకు ఎదురైన మంచి అనుభవం !

    ఇంక పోస్ట్ మాన్లు. వాళ్ళు పాపం ఒక్కసారే మనవైపు దసరాకీ, ఇక్కడ దీపావళికీ మాత్రమే మామూలు అడుగుతారనుకునేవాడిని. కానీ వాళ్ళు పాస్ పోర్టులు స్పీడ్ పోస్ట్ లో తెచ్చినప్పుడు కూడా అడుగుతారు! అది ఇవ్వవలసిందేట! ఈ మధ్యన మా అబ్బాయి పాస్ పోర్ట్ రిన్యూ చేయించినప్పుడు తెలిసిన విషయం !!
ఇంక మామూలుగా రోడ్డుమీద వెళ్తున్నప్పుడు అందులోనూ ఏ గాడీ మీదో వెళ్తే, మన అదృష్టం బాగోపోతే, పోలీసువాడి ‘ప్రజా సేవ’ కి బలైపోతాం !!!!

మీ అనుభవాల్లో ఇంకేమైనా ఉంటే చెప్పండి !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-” ప్రజాసేవలు”

    శ్రీరమణ గారి ‘గుత్తొంకాయ కూర-మానవ సంబంధాలు’ పుస్తకంలో ‘ప్రజాసేవ’ అని ఓ వ్యాసం చదువుతూటే, నేను ఉద్యోగం చేస్తూన్నప్పుడు, మా మేనేజరు ఒకాయన గురించి గుర్తుకొచ్చింది. ఆయనకి ఈ ‘ప్రజాసేవ’ ఎక్కువేలెండి. ఇక్కడ ప్రజాసేవ అంటే అదేదో గొప్ప సేవ అనుకోకండి.మామూలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, కొద్దిగా చేతి వాటం ఉన్నవాళ్ళు ,ఒక పని చేయడానికి వసూలు చేసే ‘ఫీ’ అన్నమాట.

    మన పనినిబట్టి ఉంటుంది, మనం కట్టవలసిన ‘మామూలు’. ఈయనేంచేసేవాడంటే, ఎప్పుడైనా తనకి ‘చిల్లర ఖర్చులకి’ డబ్బులు అవసరం వచ్చిందనుకోండి, ఎవడో ఓ వెండరుని
ఫామిలీ తో ఇక్కడనుండి ఢిల్లీ దాకా 2-టయర్ ఏ.సీ.లో టిక్కెట్లు తెమ్మనేవాడు.ఆ వచ్చినతను పాపం సిన్సియర్ గా స్టేషన్ కి వెళ్ళి, వెయిటింగ్ లిస్ట్ అయినా సరే, నాలుగు టిక్కెట్లు బుక్ చేసి తెచ్చేవాడు.ఆ రోజుల్లో ఆన్ లైన్ రిజర్వేషన్లూ అవీ ఉండేవి కావు. పాపం చాలా బాధపడిపోతూ ‘సారీ సార్, కన్ఫర్మ్డ్ టిక్కెట్టు దొరకలేదూ’అనేవాడు.ఈయనకేమిటీ, ఏమైనా ఢిల్లీ వెళ్తాడా పెడతాడా!మూడో రోజున స్టేషన్ కి వెళ్ళో, ఇంకో ఆర్డర్లీని పంపో, ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేసి, ఆ డబ్బులు జేబులో వేసికునేవాడు! ఆయనేమైనా పెట్టుబడి పెట్టాడా ఏమిటీ, ఎంతొస్తే అంతా లాభమే !

7nbsp;   కొంతమందుంటారు, సంవత్సరంలో ఏ సీజనైనా సరే రిజర్వేషన్ మాత్రం ఛస్తే చేయించుకోరు.అలాగని డబ్బులు ఖర్చుపెట్టరా అని కాదు.వాళ్ళకి వాళ్ళమీద అంత నమ్మకం! మనం నెలల ముందునుంచీ రిజర్వేషన్లు చేయించుకుని, అదేదో పేద్ద ప్లాన్డ్ గా ప్రయాణాలు చేసేమనుకుంటాము.ఈ ‘తమమీద తమకి నమ్మకం గాళ్ళు’ అదేదో తమ కి రిజర్వ్ అయినట్లు, మన సీట్ లో కూర్చుంటాడు. ఏమిటయ్యా ఇదీ అంటే, ‘ఆర్.ఏ.సీ’ అండీ, టీ.టీ. రాగానే కన్ఫర్మ్ చేస్తాడు,అప్పటిదాకా ఇక్కడ సర్దుకోనివ్వండీ, మీరుకూడా అప్పుడే పడుక్కుంటారా ఏమిటీ అని ఓ పరామర్శా! కాదు,ఇక్కడనుండి వెళ్ళిపో అనడానికి మొహమ్మాటం.చచ్చినట్లు వాడిని భరిస్తాము.ఆ టిటీ వచ్చేదాకా,పైగా దేశంలో పెరిగిపోతున్న లంచగొండితనం గురించి విన్నవాడికీ, విననవాడికీ
లెక్చరోటీ. ఇంతలో ఓ గంటో,రెండు గంటలకో, ఆ టీటీ గారు, బోగీలన్నీ చూసుకుంటూ మన బోగీకీ వస్తాడు.అప్పుడు తెలుస్తుంది, ఈ ‘తతనగా'( తమమీద తమకి నమ్మకం గలవాళ్ళు’) ఇంకా చాలా మందే ఉన్నారని.బోగీకి కనీసం ఓ డజను మందిదాకా తేలుతారు! అయినా సరే వాళ్ళకేమీ ఖంగారుండదు. చెకింగు పూర్తయిన తరువాత చూస్తానూ, అప్పటిదాకా ఎకడో అక్కడ ఎడ్జస్ట్ అయిపోండీ అనే ఓ ఎస్యూరెన్స్ సంపాదిస్తారు!

    పాపం ఆ టీటీ గారుమాత్రం ఏంచేస్తాడూ?ఎంతమందిని సర్దాలో! నోరులెని మామూలు జనాల్ని మాత్రం, రూల్సూ,సింగినాదం చెప్పి, ఆర్.ఏ.సీ అయితేమాత్రం ఫర్వాలేదు, వెయిటింగు వాళ్ళుమాత్రం ఇక్కడ ఉండకూడదూ అని ఓ ఆర్డరు వేసేసి వెళ్ళిపోతాడు. పైగా ఈసారి రౌండ్లకొచ్చినప్పుడు రైల్వే పోలీసుల్ని కూడా తోడు తెచ్చుకుంటాడు. గుండె ధైర్యం లేని మామూలు జనాలు
అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపంచేస్తారు.కానీ, మన ‘తతనగా’లు ఏమీ పట్టనట్లు, హాయిగా భోజనం అదీ పూర్తిచేసికుని కూర్చుంటారు.వీడికి, మామూలు టిక్కెట్టు మాత్రమే ఉంది.మన అదృష్టం బాగుంటే( మన అని ఎందుకన్నానంటే, వాడికి బెర్త్ దొరికే దాకా వాడు మనసీటు లొనే ఎడ్జస్ట్ అవుతాడు), ఆ టీటీ దగ్గరకి వెళ్ళి,’మామూలు’ ఏదో సమర్పించి, హాయిగా ఓ బెర్తు సంపాదించుకుంటాడు.బోగీలో అందరూ హాయిగా నిద్ర పోతున్నా, మనం మాత్రం వీడి సేవలో ఉండాలి.లేకపోతే, ఎక్కడో మన సీటు క్రిందే ‘కొంచెం జాగా చేసికుని’ సెటిల్ అయిపోతాడు.ఇలాటి కేసులు, ఏ.సీ. 3-టయర్, మామూలు 3-టయర్ లోనూ చూస్తూంటాము. ఏ.సీ. 2 టయర్ లో మరీ ఇంత అన్యాయంకాదు.

    రిజర్వేషన్ లేకుండా, మనం ప్రయాణం చేయాలనుకోండి, మనం స్టేషన్ కి చేరగానే ఓ పోర్టరొకడు మనల్ని గుర్తుపట్టేస్తాడు. అదేమిటో మన మొహంమీద వ్రాసి పెట్టుందనుకుంటాను, ఈ దరిద్రుడికి రిజర్వేషన్ లేదూ అని! ఆ టిక్కెట్టిలా ఇయ్యండి, నేను మా సార్ ని అడిగొస్తానూ అంటాడు.పోనీ అని వాడిని నమ్మి ఎలా ఇస్తామూ, వాడిని గుర్తుపెట్టుకుందామనుకోవడం వ్యర్ధ ప్రయత్నం, ఎందుకంటే ప్రతీ పోర్టరూ ఎర్ర చొక్కా వేసికునే ఉంటాడు కనుక!ఖంగారు పడకండి, నేనేమీ మీ టిక్కెట్టు తీసికుని పారిపోనూ,మీకు శ్రమ అవుతుందని ఏదో సహాయం చేద్దామనుకున్నాను అంటాడు. మొత్తానికి వాడిని నమ్మి, మన టిక్కెట్టు వాడిచేతిలో పెడతాము.కావలిసిస్తే నా బిళ్ళా నెంబరు గుర్తుపెట్టుకోమంటాడు.

   వాడికి టిక్కేట్టు ఇచ్చేసిన తరువాత, ఇంక మనవాళ్ళు మనకి క్లాసు తీసికోవడం మొదలెడతారు. ‘అదేమిటండీ, ఎవడో ముక్కూ మొహంతెలియనివాడికి టిక్కెట్టు అలా ఇచ్చేశారూ’ అంటూ. ఒకవైపు ఆ పోర్టరు మన టిక్కేట్టు తిరిగి తెస్తాడా లేదా అని బుర్ర పగలుకొట్టుకుని ఛస్తూంటే, ఈ గోడవోటీ ! వస్తూన్న ప్రతీ ‘ఎర్రచొక్కావాడూ’ మనవాడే అనుకుని ఎంతో ఆశ తో చూస్తూంటే, చూస్తూంటే,చూస్తూంటే…మొత్తానికి,మన ఎర్రచొక్కావాడు వస్తాడు. ఏమయ్యిందయ్యా అని అడిగితే, ‘ మనం వెళ్ళడం, పని అవకపోడమూనా’ అని ఓ పోజిచ్చేస్తాడు.

   ఇంతా చేసి వాడు చేసొచ్చిందేమిటా అంటే, మన టిక్కెట్టు వెనకాల, ఓ కొండ గుర్తూ, ఓ సంతకంలాటిదీనూ. సంగతేమిటంటే, మన టి.టీ గారికి ఎలాట్ చేసిన బోగీలో, ఈ ఎర్ర చొక్కవాడు మనల్ని సామాన్లతో సహా అక్కడ కూర్చోపెడతాడు, గంటకో రెండు గంటలకో ట్రైను ప్రయాణం మొదలైన తరువాత, ఈ టీటీ గారు వచ్చి, మన టిక్కెట్టుమీద, కొండగుర్తు గుర్తు పట్టి, అదేదో పుస్తకంలాటిదాంట్లో, మూడు కార్బన్ కాగితాలు పెట్టి,ఏదేదో వ్రాసేసి,అందులో నాలుగో కాపీ ( ఏం వ్రాసుందో బ్రహ్మకైనా తెలియదు!) మనం ఇచ్చిన టిక్కెట్టుకి తగిలించి ఇస్తాడు. ఈ తతంగానికి పూర్వమే, వీటికయ్యే ఖర్చు స్టేషన్ లోనే వసూలు అయిపోయింది.దాంట్లో, మళ్ళీ మన ఎర్రచొక్కా ఆయన ఫీజూ ( అదే చాయ్ పానీ). సామాన్లు పెట్టడానికి పైన ఇవ్వాలి. ఈ టిక్కెట్ల సేవ ప్రజా సేవ క్రింద వస్తుంది.
ఇంకా మరిన్ని తరువాతి పోస్టులో….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మాస్టార్లతో జీవితం-3

    ఏదో పెళ్ళైన మొదటి ఆర్నెల్లూ పరిస్థితులు అధ్యయనం చేసింది, ఏదో కొత్త స్కూలికి ట్రాన్స్ఫర్ అయిన టీచర్ లాగ. బుధ్ధులు ఎక్కడికి పోతాయీ? అప్పటిదాకా ఇష్టారాజ్యంగా ఉన్న నామీద అన్నీ ఆంక్షలే. స్కూల్లో అదీ 5-10 సంవత్సరాల పిల్లలకి పాఠాలు నేర్పేదేమో, ఇంక చూడండి ప్రారంభం అయింది- రెండు పూటలా స్నానం అంటుంది, ప్రతీ రోజూ బట్టలు మార్చాలి,స్నానం చేసీదాకా బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండవు.. ఇలా చాలానే ఉండేవిలెండి.

   అప్పటిదాకా ఏదో నాకు తోచినప్పుడు స్నానం చేయడం ( ప్రతీరోజూ చేసేవాడిననుకోండి, కానీ అదో పెద్ద కార్యక్రమంలా కాదు!), స్నానం చేసేసి తువ్వాలు తలుపుమీద వేసే అలవాటు,
ఠాఠ్ అలా అసహ్యంగా తలుపుమీద వేస్తారేమిటీ,అనేది. నా అదృష్టం కొద్దీ మేముండేది రెండే రూమ్ముల కొంప, దానికి బాల్కనీలూ వగైరా ఏమీ ఉండేవికావు.తనే బయట ఆరేసేది.తలుపుమీద మాత్రం ఆరేయకూడదు.

    ఏదో సెకండ్ హాండులో ఓ ఫ్రెండు (తెలుగు వాడే) అంటకట్టిన సోఫా సెట్ మీద కాళ్ళేట్టి కుర్చోకూడదనేది. ఈ గొడవ భరించడంకంటే ఆ సోఫా ఎవరికో ఊరికే ఇచ్చేయడం మంచిదీ అని, మా పనిమనిషికి ఇచ్చేశాను!సుఖపడ్డాను. తన ప్రణాలికలన్నీ అమలుపరిచేటంత ఏరియా ఉండేది కాదు( ఇల్లు చాలా చిన్నది కదా!).అయినా తనుచేసేవన్నీ చేసేసింది.పెళ్ళికి ముందర మా ఇల్లు, బ్రహ్మచార్ల మఠంలా ఉండేది.అక్కడ దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళందరూ( అందరూ పెళ్ళైనవాళ్ళే) నా కొంపకి వచ్చేసి, క్యారంబోర్డూ, పుస్తకాలతోటీ కాలక్షేపం చేసేవారు. నేను తప్ప ప్రతీవాడూ సిగరెట్టు కాల్చేవాడే. వాళ్ళు యాష్ ట్రేల్లా వాడుకోడానికి ఖాళీ 400 గ్రాముల నెస్కెఫే పెట్టేవాడిని.ఖాళీ డబ్బాలేమీ కొన్నవి కాదు, వచ్చిన వాళ్ళందరికీ కాఫీలోటి కదా. అయినా ఒక్క మనిషి రోజుకి లీటరున్నర పాలు పోయించుకోడం ఎక్కడేనా విన్నారా? తర్వాత్తర్వాత అర్ధంఅయేది ఈ పెళ్ళైనవాళ్ళందరూ నాకొంపకే ఎందుకు చేరుతున్నారూ అని! అంటే అదో రిలాక్సేషన్ అన్నమాట! ఛేంజ్ ఆఫ్ సీన్ !

    రాత్రిళ్ళు ఒంటిగంటా, రెండు దాకా క్యారంబోర్డులు ఆడుకుంటూ కూర్చుంటే, ఇంక రూమ్ములు తుడుచుకోవడానికీ నీట్ గా ఉంచడానికీ టైమెక్కడిదీ? దాంతోటి, ఈవిడ వచ్చేసరికి, ఇంటినిండా న్యూస్ పేపర్లూ, పుస్తకాలూ, ఖాళీ డబ్బాలూ, అట్టకట్టుకుపోయిన ఫ్లోరూ ! ఇందులో ప్రతీదీ ఈవిడ బీ.పీ ఉధృతంగా పెంచేసేదే! ముందుగా కొత్తగా వెళ్ళిన స్కూల్లో చూసుకున్నట్లుగా, ఇన్వెంటరీ చెకింగ్ ప్రారంభించింది. ఈవిడ కాపురానికి వచ్చేముందర, మా అమ్మగారు చెప్పేరట ఈవిడకి, నాదగ్గర ఏమేమి వస్తువులు/గిన్నెలు ఉన్నాయో. దానికి సాయం మిక్సీ, గ్యాస్సు వగైరా అన్నీ పెళ్ళికి ముందరే కొనేశానుగా.ఈవిడ వచ్చేటప్పటికి సీన్ లో ఇవేమీ కనిపించలేదు. ఆ తరువాత ఎప్పుడో ధైర్యం చేసి అడిగింది, ఎక్కడైనా తాకట్టుపెట్టానేమో ( మనవైపు ఇలాటివి ఉంటూంటాయి కదా!)అని. అలాటిదేదీ లేదూ, ఫ్రెండ్ల ఇంటిలో ఉండి ఉండొచ్చూ అని చెప్పిన తరువాత అందరి ఇళ్ళకీ వెళ్ళి మొత్తానికి అన్నీ తెచ్చేసింది.

    ప్రతీ స్త్రీ లోనూ ఓ టిచరు/మాస్టారు దాగేఉంటుంది. అలాగే లేకపోతే మనం ఇంత పెరిగి పెద్దయేవాళ్ళమా? ఏదో టీచరు ఉద్యోగమే చెయ్యఖ్ఖర్లేదు, ఆ గుణాలు అన్నీ ‘ బిల్ట్ ఇన్’. అదేదో
ఫ్రిజ్జిలూ అవీచూస్తాము బిల్టిన్ స్టెబిలైజర్ల లాగన్నమాట ! ఇంక టీచర్లక్రింద ఉద్యోగం కూడా చేస్తే ఇంక అడగఖ్ఖర్లేదు. ప్రతీ ఇంట్లోనూ జరిగే విషయమే ఇది. బ్రహ్మచార్ల క్రింద అనుభవించిన స్వతంత్రం అంతా ఉఫ్ మని ఎగిరిపోతుంది.ప్రతీదానికీ ఓ క్లాసు తీసికుంటూంటారు.

    మా ఇంటావిడ క్రాస్వర్డ్ పజిల్సూ అవీ పూర్తిచేస్తూంటుంది, మధ్య మధ్యలో నన్ను అడుగుతూంటుంది. నాకు తెలియదు మొర్రో అన్నా వినదు. తెలిసే చెప్పడంలేదని అనుకుంటుంది.నా ఐ.క్యూ అంత పెద్ద లెవెల్ లోది కాదన్నా వినిపించుకోదు!నేను ఏదైనా చదువుకుంటున్నప్పుడైనా సరే, తను చెప్పేవాటిమీద ఓ చెవి వేస్తూంటాను.ఇదివరకైతే ఉద్యోగం వంకతో తప్పించుకునే వీలైనా ఉండేది. ఇప్పుడా ఛాన్స్ కూడా లేదు.మధ్య మధ్యలో ప్రశ్నలోటీ, మనం వింటున్నామా లేదా అని!

    అప్పుడే ఎక్కడ అయిందీ! గుర్తొచ్చినప్పుడు వ్రాస్తూంటానులెండి. మీ మీ కష్టాలు కూడా పంచుకోండి !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మాస్టార్లతో జీవితం -2

    నేను మరీ సుఖపడిపోతున్నానని అనిపించింది ఆ దేముడికి, సరే వీణ్ణి కొంచెం నియంత్రణలో పెట్టాలీ, లేకపోతే పేట్రేగిపోతాడూ అనుకున్నారాయన.మరి అలాటప్పుడు మనకి కూడా, అదే దిక్కులో ఆలోచనలు తెప్పించేస్తారు.మనకి ఏది రాసిపెట్టుంటే అలాగే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పరిస్థితులు కూడా తోసుకొచ్చేస్తాయి. హాయిగా ఉన్నవాడిని ఉండక, ఇంక నాకు పెళ్ళిచేయండీ అని అడగడం ఏమిటీ, అప్పటికి 29 ఏళ్ళొచ్చాయనుకోండి. దానికి సాయం అడిగేడు కదా అని మా ‘హెడ్మాస్టారు’ ( అంటే మా నాన్న గారు, అప్పటికి రిటైర్ అయ్యారులెండి), సరే చేద్దాం, ఇక్కడికి రా అన్నారు. మరీ నా అంతట నేను అడగ్గానే చెయ్యకపోతే ఇక్కడే ఏ పిల్లనో చేసికుంటే..( అంత ధైర్యం ఎక్కడుండేదీ, ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని!). రమ్మన్నారు కదా అని ఓ మూడు వారాలు శలవు పెట్టేసి వెళ్ళాను.

    చెప్పానుగా ఇదివరకోసారి, మా పెద్ద అన్నయ్య గారు( మళ్ళీ ఆయన ఓ ప్రిన్సిపాల్) బాధ్యత తీసికుని, నన్ను మా పెద్దమ్మ గారింటికి తణుకు తీసికెళ్ళారు.మేము భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూంటే ఇద్దరు లేడీస్ అక్కడికి వచ్చారు. మరీ అంత పరిశీలనగా చూడ్డానికి వీలు పడలేదు. కారణం, మనవైపు ఇళ్ళలో పగటిపూట లైట్లు వేసేవారు కాదు, ఇంకో కారణం, వచ్చిన ప్రతీ వారినీ మనం ‘ఆ దృష్టి’ తో చూడకూడదుగా ( ఇంట్లో మాస్టార్లు చిన్నప్పటినుండీ బోధించిన నీతి పాఠాల ప్రభావం!). కారణం ఏదైతేనేంలెండి, చూసీ చూడనట్లుగా చూశాను.మరీ కనిపించిన వాళ్ళందరితోనూ కబుర్లు చెప్పే చొరవా, ధైర్యం ఉండేది కాదు. నా నమ్మకం ఏమిటంటే ఆ వచ్చిన వాళ్ళు నన్ను చూడ్డానికే వచ్చుంటారేమో అని, ఎందుకంటే ఆ తరువాత నా జీవితంలో జరిగిన పరిణామాల బట్టి, ఇప్పుడు ఆలోచిస్తూంటే అనిపిస్తోంది !

   ఆరోజు రాత్రికి అమలాపురం వెళ్ళేక, మా అమ్మమ్మగారు నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చి, నా పెళ్ళి టాపిక్కు ఎత్తారు. ఆ సందర్భంలో, తణుకు లో చిన్నక్కయ్య ( మా దొడ్డమ్మ గారిని అందరూ అలా పిలిచేవారు) వాళ్ళింట్లో చూసిన పిల్ల ఎలా ఉందీ అని అడిగారు. ఓహో అక్కడ జరిగినవి పెళ్ళి చూపులా అనుకుని ( ఆ మాటేదో ముందరే చెప్పొచ్చుగా, పరిశీలనాత్మకంగా చూసుండే వాడిని, పోన్లెండి, జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు!),మేము అక్కడ ఉండగా ఎవరో ఇద్దరు వచ్చారూ, ఇద్దరూ బాగానే ఉన్నారూ అన్నాను.నాకేం తెలుసూ అందులో ఒకావిడ నాకు కాబోయే అత్తగారని!( నా పాత బ్లాగ్గులు చదవని వారి సమాచారం కోసం!)

    మొత్తానికి అన్ని వ్యవహారాలూ జెట్ స్పీడ్ లో జరిగిపోయి, మా అవబోయే ఇంటావిడని ,మా అమ్మమ్మ గారు అమలాపురం పిలవడం, ఆవిడే నడుంకట్టుకుని మా పెళ్ళి నిశ్చయించడం జరిగింది.ఈ రోజుల్లో లాగ అప్పుడు, అమ్మాయినీ అబ్బాయినీ విడిగా మాట్లాడుకోనిచ్చారా ఏమిటీ. పైగా మా నాన్నగారికి ఎంత సంతోషమో, కొడుక్కి పెళ్ళవుతోందనీ, ఆ వచ్చే పిల్ల టీచర్ గా పనిచేసేదీ అని. ఈ ‘మాస్టార్ల జాతి’ అనేది ఉందే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతంత ప్రేమలూ, అభిమానాలో !ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూంటే చూడాలి ఆ ఆపేక్ష కారిపోతూంటుంది.

    ఆయనదేంపోయిందీ, మా అమ్మగారేమీ ‘ మాస్టారు’ కాదు. ‘ ఓరి నాయనోయ్, వచ్చి వచ్చి ఎలాటి చేతిలో పడ్డానురా దేముడోయ్’ ఇంట్లో ‘మాస్టర్ల ‘ బాధ తప్పిందనుకుంటే, ‘ ఫ్రైయింగ్ పాన్ లోంచి ఫైర్’ లో పడ్డట్టయ్యింది, నా పని! ‘రామా ఈజ్ ఏ గుడ్ బాయ్’ లాగ పితృవాక్యా బధ్ధుడై సరే అనేశాను. ( మనలో మన మాట బాగానే ఉంటుంది లెండి!). పోనీ అప్పుడైనా నా ‘ఫోబియా’ కారణం చేత వద్దనీ అనిపించలేదు. ఎప్పటికైనా నేనూ ఓ ఇంటివాడనౌతున్నానే, ‘మాయ’ లో పడి, ఆ ‘ఫోబియా’ గుర్తుకే రాలేదు!దేముడు తననుకున్నది జరిపించాలనుకున్నప్పుడు, ఇలాటి’మాయా, మైకం’ కప్పేస్తాడుట ( సినిమాల్లో చూస్తూంటాము!).

   ఇలా నాజీవితం లో ‘మాస్టారి’ ప్రభావం ఇంకో సారి ( ఇంకోసారేమిటిలెండి, జీవితాంతం) ప్రారంభం అయింది. ఇన్నింటిల్లోనూ విచిత్రం ఏమిటంటే, మా మామగారూ, అత్తగారూ కూడా టీచర్లే. నా జీవిత బంధం ఇంత పకడ్బందీగా ‘మాస్టర్’ లతో ముడి పడిపోయింది! అలాగ నా పుట్టిల్లూ, మెట్టినిల్లూ టీచర్ల మయం!
ఇంక వీళ్ళతో ఎలా నెగ్గుకొచ్చానా,( ఆర్ అదర్వైజ్) వచ్చే పోస్ట్ లో……
.

%d bloggers like this: