బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఇంకెక్కడిదాకా వెళ్తారో…..

నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు, ఈవేళ్టి Indian Express లో వచ్చిన వార్త !. ఎప్పుడో, చిన్న పిల్లలకి కాపరాలు ఎలా చేయాలో కూడా నేర్పించే Toys వస్తాయేమో !! All in the name of child education..….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Excuse లు….

   ఈ Excuse లు రెండు రకాలు. రెండో రకం-Excuse me .. లు. ఈ రెండో రకానివి Sorry, Pardon me జాతిలోకి వస్తాయి. కాల మాన దేశ పరిస్థితులని బట్టి ఎక్కడ కావలిసిస్తే, అక్కడ నిస్సిగ్గుగా ఉపయోగించేసికోవచ్చు ! ఇంగ్లీషోళ్ళు మనకిచ్చిన వెల కట్టలేని ఆస్థి !

మా చిన్నప్పుడు ఓ “Sorry” చెప్పేస్తే పనైపోయేది. చేసింది ఎంత వెధవ పనైనా, ఓసారి “సారీ” అనేస్తే ‘తూ నా బొడ్డూ..” అన్నమాట. దానర్ధం అడక్కండి Sorry! ఎక్కడో విన్నాను! కాలక్రమేణా, మన మేధస్సు పెరిగి, ఆ మాటను ఎక్కడెక్కడ, ఉపయోగించుకోవాలో తెలిసేసింది. ఎంతైనా ఇంగ్లీషోళ్ళకంటే, మన బుర్రలు గట్టివి కదా!ఇంక Excuse me ని, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చో అంటే నేను విన్నవీ, చూసినవీ….
1.అవతలివాడు బోరు కొట్టేస్తూంటే ఓసారి Excuse me అనేసి,ఇంకోచోటకి జంపైపోయేటప్పుడు…..
2.బస్సులోనో, ట్రైనులోనో చెప్పులేసికున్న నాలాటివాడి కాలు తొక్కినప్పుడు ( అవతలివాడివి నాడాలేసికున్న బూట్లు!), ఓ Excuse me తో క్షమించేయాలిట…
3.అవతలివాడు,మనవైపు చూడాలంటే ఓ సారి మనవైపు చూస్తాడు Excuse me అంటే. ఛస్తాడా ?
4. తెలిసో తెలియకో ( చాలా సార్లు తెలిసే అనుకోండి) బస్సుల్లో వెళ్ళేటప్పుడు,ఏ ఆడాళ్ళకో మన చెయ్యో కాలో తగిలినప్పుడు, “Sorry..” తో పనైపోతుంది, అదృష్టాన్నీ, మనం
లేచిన వేళను బట్టీ…
5.అవతలివాడు మాట్లాడింది, మనకు అర్ధం అవకపోతే “Pardon me ” అనాలిట. మనకు అర్ధం అవకూడదనేగా, వాడు అవాకులూ చవాకులూ పేలేదీ ! ఓసారి అలా అనేస్తే, మళ్ళీ
రిపీట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గిరపెట్టుకుని చెప్తాడు! ఇది ఉభయతారకం ఇద్దరికీ ఉపయోగిస్తుంది!
6. తుమ్మినప్పుడల్లా ఓసారి excuse me అనేస్తే సరిపోతుందిట.

ఇంక ఇప్పుడు మొదటిది అదేనండి Excuse లు. వినే వెధవుంటే కావలిసినన్ని చెప్పొచ్చు!
1. అస్తమానూ మనమే ఫోన్లు చేస్తున్నామూ, అవతలివాడు ఒక్కసారైనా చేయడం లేదూ అని, వాడు ఉన్నాడో ఊడేడో తెలిసికుందామని,(ఎంతైనా ఇంటావిడ వైపు చుట్టం) ఇంక ఇదే ఆఖరుసారి వాడికి ఫోను చేయడం అని, (ఇంటావిడ దగ్గర ఎనౌన్స్ చేసి) చేయగానే, ఓ రెండు మూడు రింగులైన తరువాత, ఫోనెత్తి, “అర్రే సుబ్బారావుగారా, ఇప్పుడే మీకు ఫోను చేసి ఎలా ఉన్నారో కనుక్కుందామనుకున్నానండీ, ఇదిగో ఇంతలో మీరే ఫోను చేశారు” అనడం. దీనంత పచ్చబధ్ధం ఇంకోటుండదు. అసలు వాడెవరికీ ఫోననేది చెయ్యడు, బిల్లెక్కువవుతుందని, బయటకి వెళ్ళేటప్పుడు ఎస్.టి.డి లాక్ చేసి, కోడ్ పెళ్ళానికి కూడా చెప్పకుండా ఉండే రకం !ఇలాటి Excuse గాళ్ళని ఆ భగవంతుడు కూడా బాగుచేయలేడు!
2. ఎప్పుడూ మనమే వాళ్ళింటికి వెళ్తున్నామూ, ఒక్కసారైనా మనింటికి రావడానికి తీరికే లేదూ,వెధవ్వేషాలూ అని, పోనీ ఈ ఒక్కమాటూ మనమే వాళ్ళింటికి వెళ్ళి, ఈసారి చెప్పేయాలీ, మళ్ళీ మీరు మాఇంటికి వస్తేనే, మేము మీ ఇంటికి వచ్చేదీ అనుకుని వెళ్ళడం. వాడి కొంప చేరీ చెరడంతో మనకి కనిపించే అపురూప దృశ్యం ఏమిటయ్యా అంటే, వాడూ, పెళ్ళాం, పిల్లాడూ బయటకెళ్ళడానికి వేషం వేసికునుండడం. అంత పెద్దమనిషీ, మనల్ని చూడగానే ” అర్రే సుబ్బారావుగారా, చాలా రోజులయిందీ మిమ్మల్ని కలిసీ, ఇప్పుడే మీ ఇంటికనే బయలుదేరామూ… blah..blah..” అంటాడు. ఇంతలో వాళ్ళ పిల్లాడు , పాపం అమాయకుడు ఇంకా లౌక్యాలూ అవీ తెలియదు, ” అదేమిటి నాన్నా, సర్కసుకని కదా బయలుదేరామూ, వీళ్ళింటికీ అంటావేమిటీ..” అని ఆ “excuse” అనే ” పిల్లి” ని బయటెట్టేస్తాడు (cat out of the bag.. అనో ఏదో అంటారుట!). అప్పుడు మాత్రం తగ్గుతాడా ఆయనా- “అదేరా సర్కస్ నుంచి, దగ్గరలో ఉండే ఈ అంకుల్ వాళ్ళింటికి వెళ్దామనుకున్నాము, నీతో చెప్పేదేమిటిలే అని చెప్పలేదూ” అని తప్పించేసికుంటాడు.అసలు విషయ మేమిటంటే, సర్కస్ కెళ్ళి, భోజనం టైముకి, వీళ్ళింటికి ఓసారి వెళ్ళొచ్చెస్తే, హొటల్ ఖర్చూ ఉండదూ, వెళ్ళినట్లూ ఉంటుందీ అని! కానీ flop show అయిపోయింది! అందుకే అంటారు, ఈ excuse ల్ని ఇష్టం వచ్చినట్లల్లా వాడకూడదూ అని.

నేను ఈవేళ చదివిన జోక్….
What’s the similarity between MOBILE and MARRIAGE – In both case you feel “aur thoda ruk jaata to accha model milta”

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నిద్ర….

   ఇదేమీ నిద్ర గురించి కథ అని అపోహ పడకండి. ఊరికే, నిద్రపోవడంలో ఉండే రకాలూ, అందులో ఉండే సౌఖ్యాలూ వగైరా గురించి ఈ టపా. నేను ఉద్యోగంలో ఉండేటప్పుడు, మా ఫాక్టరీ 24 గంటలూ పని చేసేది , దానితో షిఫ్టుల్లో వెళ్ళవలసొచ్చేది. ఓ వారం అంతా నైట్ షిఫ్టూ రాత్రి పదింటినుంచి మర్నాడు ప్రొద్దుట ఆరున్నర దాకా. రాత్రి డ్యూటీ నాలుగేసి గంటలుండేది. మరీ నాలుగ్గంటలేనా, మిగిలిన నాలుగ్గంటలూ నిద్రేనన్న మాట అనకండి. విరామం లేకుండా,Explosives బిల్డింగులో, నిద్రకళ్ళతో పనిచేస్తే, కష్టం ,పనిచేసేవారికీ, బిల్డింగ్ కీ కూడానూ. అందుకే వంతులేసికుని, సగం మంది మొదటి హాఫ్ ( నాలుగ్గంటలు), మిగిలిన సగం మందీ సెకండ్ హాఫ్ లోనూ పనిచేసేవారు.రెండో హాఫ్ డ్యూటీ పడినవాడు, నిద్రొచ్చినా రాకపోయినా కంపల్సరీ గా షిఫ్ట్ రూం కి వెళ్ళడం, ముసుగెట్టేయడమే. అక్కడేమైనా పరుపులూ మంచాలూ ఉంటాయా ఏమిటీ, ఓ ఇటక నెత్తికింద పెట్టేసికుని, బెంచీ మీదే నిద్రపోవడం! అందుకే అంటారు నిద్ర సుఖమెరగదని !

బస్సుల్లో చూస్తూంటాము కొంతమంది ఆ బస్సు కుదుపుకి జోగుతూంటారు. జోగితే ఫరవాలేదు, పక్కవాడిమీదకు వాలి మరీ జోగుతారు. మనం కదలకూడదు, కదిలితే వాడి నిద్ర భంగం అయి, మనవైపు కొరకొరా చూస్తాడు, అక్కడికేదో వాడి సొమ్ము మనం తిన్నట్లు! కొంతమంది సుఖీ ప్రాణులుంటారు. వాళ్ళకి ఎక్కడ నిద్రపోతున్నామూ అని కాదు, ఎంతసేపు నిద్రపోవచ్చూ అనేది ముఖ్యం! బస్సవనీయండి, ట్రైనవనీయండి,ఆఫీసవనీయండి చదువుకునే టైములో పుస్తకం చేతిలో పట్టుకునేటప్పటికి, నిద్ర ముంచుకొచ్చేసేది. ఎలెట్రీ దీపాలు రాని రోజుల్లో, బుడ్డి దీపాలేగా, దానిముందర కూర్చుని చదవడం, నిద్రతో తూలడం.వెలుగు బాగా రావాలని, ఒత్తి పెంచడం, సడెన్ గా తూలినప్పుడు, నుదిటి మీదున్న వెంట్రుకలు కాలడం, దాంతో ఉలిక్కిపడి లేవడం! ఇంతలో నాన్నగారు అరవడం, ఏరా మెళుకువగా ఉన్నావా అంటూ! ఈ గొడవంతా ఎందుకంటే,రాత్రిళ్ళు చదవకపోతే, తెల్లారుఝామున లేపేస్తారు. దానికంటే ఇదే హాయి!

శలవు రోజొస్తే మాత్రం హాయిగా పొద్దెక్కేదాకా నిద్రపోవడం బాగానే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఈ వేషాలన్నీ సాగుతాయి. ఓ పిల్లో పిల్లాడో పుట్టుకొచ్చేటప్పటికి, ఈ లగ్జరీస్ అన్నీ స్టాప్! ఆ పసిపిల్లలు, రోజంతా హాయిగా నిద్రపోయి, రాత్రిళ్ళు మొదలెడతారు ఆట పాటలు. ఏ అర్ధరాత్రి పూటో లేచిపోతారు. ఇంక తెల్లారే దాకా మనకి జాగరణే! శలవు పూటా, హాయిగా భోజనం చేసేసి, మంచం ఎక్కేసేమంటే చాలు, హాయిగా నిద్ర పట్టేస్తుంది.

ఉద్యోగంలో ఉన్నంతకాలం, పిలిస్తే పలికే నిద్రాదేవి, ఉద్యోగంలోంచి రిటైరవగానే ఎక్కడకి వెళ్ళిపోతుందో తెలియదు. కొంపలంటుకుపోయినట్లుగా, ఏ అయిదింటికో మెళుకువ వచ్చేస్తుంది. మనకంటే నిద్ర పట్టదు కానీ, ఇంట్లోవాళ్ళకేం హాయిగా నిద్రపోతారు. మనవైపు, చీకటి తొందరగా పడ్డం కారణం కాబోలు, మా రోజుల్లో తొమ్మిది కొట్టేటప్పటికల్లా పడకేసేసేవారు. తెల్లవారకట్ల అయిదయ్యేసరికి మళ్ళీ రోజు మొదలు. టెలిఫోన్లు కొత్తగా అన్ని చోట్లా వచ్చిన రోజుల్లో, అందులోనూ, ఎస్.టి.డి. సౌకర్యం కొత్తగా వచ్చిన రోజుల్లో, మాకు తెల్లవారుఝామున ఫోనొచ్చిందంటే చాలు, మనవైపునుండే అని తెలిసిపోయేది. ఇక్కడ మాకు అంటే పుణె లో ఆరున్నరయేదాకా వెలుగే రాదు. అందుకే ఎప్పుడైనా, ఏ ప్రయాణానికో వెళ్ళడానికి, ప్రొద్దుటి ట్రైన్ బుక్ చేశామా, చచ్చే గొడవ!

ఇంక కొంతమందుంటారు, ఉత్తిత్తినే కళ్ళు మూసుకుని నిద్ర నటించేవాళ్ళు. ఈ మధ్యన ఏమౌతోందంటే, మా అగస్థ్య అప్పుడప్పుడు, అర్ధరాత్రి లేచి కూర్చుంటూంటాడు. వాడు నిద్రలేచేడంటే చాలు, నానమ్మ దగ్గరకి వచ్చేస్తాడు. ఈవిడకేమో మనవడంటే గారం, మధ్యలో ఏ పాలు కలపడానికో, వీలు పడక, నన్ను లేపడానికి, వాణ్ణి నామీదకొదుల్తుంది, నేనేమో కళ్ళుమూసుకుని, గాఢ నిద్రలో ఉన్నట్లు నటించవలసివస్తుంది. వాడా వదిలేది? నానా అల్లరీ పెట్టేసి, నా మీదెక్కి కూర్చుంటాడు. చచ్చినట్లు లేవాల్సొస్తుంది.

నేను ఈవేళ చదివిన రెండు జోక్కులు……
1)Question: What do you call a woman who knows where her husband is 24 hours a day/seven days a week?
Answer: A widow.
2)What is the difference between Mother & Wife? One woman brings you into this world crying… & the other ensures you Continue to do so!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మూడ్ బాలేదు…..

   ప్రపంచంలో మనం చేయాలిసిన పని ఎప్పుడైనా ఎగ్గొట్టాలంటే, ‘ ఏమిటోనండి, మూడ్ బాగాలేదూ....’ అనేస్తే సరిపోతుంది. అసలు ఈ మూడ్డేమిటి, బాగోపోడమేమిటీ,వీటన్నిటికీ సరైన సమాధానమూ లేదు, ఓ అర్ధం కానీ పర్ధం కానీ లేదు! అయినా దానంత బ్రహ్మాండమైన escape route ఇంకోటి లేదు. ఈ మూడ్ అనే స్థితిని క్వాంటిఫై చేయలేము. పోనీ ఏదైనా వైద్యం చేయిద్దామా అంటే అదీ వీల్లేదూ, ఆ మూడ్ పాడైపోయినవాడి మూడ్ మీద ఆధార పడడం తప్ప ఇంకో దారి లేదు.

   ప్రతీవాడూ, మూడ్ బాగోలెదూ అనడానికి వీల్లేదండోయ్. కాల మాన పరిస్థితుల బట్టి మార్చుకోవాలి. ఏదో ఉద్యోగంలో ఉన్నామనుకోండి, ఆ ఆఫీసులో ఉండే బాస్ కి తప్ప ఇంకెవరికీ ఈ “మూడ్ బాగోలేదు” అదృష్టం ఉండదు. ఎక్కడిదాకా వెళ్తుందంటే, ఆ బాసు మూడ్ బాగోపొతే, మనకి ప్రాణం మీదకొచ్చినా శలవు ఇవ్వడు.ఆ బాసు గారి మూడ్లు ఇంట్లో ఆయన పెళ్ళాం పెట్టే చివాట్లూ, బెల్లం ముక్కలను బట్టీ మారుతూంటుంది.కొంపలో మూడ్ బావుంటే, ఆఫీసులో మూడ్డూ సరీగ్గానే ఉంటుంది. మన ఖర్మకాలి,ఆయనకి ఆఫీసుకి బయలుదేరేముందు, ఇంటావిడ ఏమైనా కూతురు పెళ్ళి గురించో,ఇంకోదానిగురించో టాపిక్కు వచ్చిందా, అంతే సంగతులు.. కూతురు పెళ్ళి అని ఎందుకు అన్నానంటే, ఆఫీసులో బాస్ అయ్యే టైముకి, కూతురు పెళ్ళీడుకి వస్తుంది. బాస్ కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లుతుంది. ఇలాటిదానిని “ప్రివిలేజ్డ్ మూడ్ బాగో పోవడం” అంటారు. ఈ అదృష్టం అందరికీ పట్టదు. ముందర బాస్ అవాలి.మనలాటి ఆంఆద్మీకి అలాటి ఫెసిలిటీస్ ఉండవు ఆఫీసుల్లో.అందుకే ఆఫీసుల్లో చూస్తూంటారు, బాస్ మూడ్ ఎలా ఉందీ అని.ప్రతీ ఫైలు మీదా రాసేస్తాడు
” Please speak” అని
!

   అంతదాకా ఎందుకూ, చిన్న పిల్లల్ని చూస్తూంటాము, అంతా చేస్తే వేలెడుండడు, వాడిక్కూడా మూడ్లే! అంతా బాగుంటే, హాయిగా టైముకి అన్నీ చేస్తాడు. లేకపోతే అంతా పేచీయే.వాడి ఆయుధం ” ఏడుపు”. ఏ కారణం లేకుండా ఏడుస్తూంటాడు. ఆఫీసులో బాసు అరుస్తాడు, ఇంట్లో పిల్లాడు ఏడుస్తాడు. కారణం మాత్రం ఒక్కటే “మూడ్”! వాణ్ణి ఎత్తుకునో, వాడిక్కావలిసినవి సమర్పించుకునో, వాడి మూడ్ మార్చాలి. ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు అలా చేయాలని చూసినా, వాడి అమ్మా నాన్నా అలా చేయనీయరు, డిసిప్లీన్ పేరుతో. ఈ హడావిడితో చివరకి జరిగేదేమిటంటే ఇంట్లో వాళ్ళ అందరి మూడ్లూ తగలడ్డం! ఇలా అందరి మూడ్లూ పాడైపోయే సరికి జరిగేదేమిటయ్యా అంటే, ముందు హాల్ లో టి.వి. చూస్తున్న ఇంటి పెద్దాయన టి.వీ,లో వస్తున్నదేదో వినిపించక, సౌండు వాల్యూం పెంఛుతాడు,పెద్దావిడ, ” అసలు ఎప్పుడైనా నేనేమైనా చేద్దామనుకున్నా, అందరూ కళ్ళల్లో నిప్పులోసుకుంటారు” అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లో/పిల్లాడి ( మూడ్ పాడై పేచీ పెడుతున్న శాల్తీ) అమ్మ, చేయవలసిందంతా చేసేసి, స్నానం పేరుతో బాత్రూం లోకి దూరిపోతుంది.ఆ పూర్ తండ్రి అంటే పెద్దాళ్ళ పుత్రరత్నం, ఏం చెయ్యాలో తెలియక, బాల్కనీ లోకి సెల్ ఫోను లో మాట్లాడుతూ జారుకుంటాడు.ఆ ఏడ్చేవాడికి ఓ అక్కో చెల్లెలో ఉందా, అదేదో డ్యూటీ లాగ తనూ ఓ ఏడుపు ( సింపథెటిక్ ఏడుపు) మొదలెట్టేస్తుంది.

   ఈ గోలంతా భరించలేక, పెద్దాయన మూడ్ పాడిచేసేసికుని, టి.వి.ని ఆపుచేసేస్తాడు.ఇంట్లో తిండుందో లేదో తెలియదు. ఈ హడావిడిలో కుక్కర్ ఎవరూ పెట్టలేదుగా, అయినా ఆ పెద్దావిడకి తప్పదుగా, టైముకి ముద్ద పడకపోతే, పెద్దాయనకి ప్రాణం మీదకొస్తుంది! చూశారా ఆ కుర్రకుంక మూడ్ ఎంత పని చేసిందో? చేసిందంతా చేసేసి, హాయిగా నవ్వుతూ ఆడుకుంటారు పిల్లలిద్దరూ!

   అసలు ఈ మూడ్లు ఎందుకు పాడవుతాయో, ఎందుకు బావుంటాయో ఆ బ్రహ్మక్కూడా తెలియదు.పని చేయాలని లేకపోతే, మూడ్ బాగో లేదండీ అనేయొచ్చు.ఒక్కోప్పుడు మూడ్ ఎంత బాగుంటుందీ అంటే, రోజంతా మేఘాలమీదే ఉంటారు ( అదేదో cloud 9 అంటారుట! ఆ 9 ఎందుకొచ్చిందో నాకు తెలియదు!). ఈ గోలంతా ఎందుకు వ్రాశానంటే, ఈవేళ ప్రొద్దుటే, మా ఇంటికి బయలుదేరేముందర, మా ఇంటావిడ తో చెప్పాను,మనవణ్ణి చూసి, ఎవరినో కలవడానికి వెళ్ళొస్తానూ అని.కానీ, కారణం ఏమిటో స్పష్టంగా తెలియదూ, ఎక్కడికీ వెళ్ళే మూడ్ లేకపోయింది, బస్సెక్కేసి కొంపకొచ్చేశాను. ఇంటికొచ్చిన తరువాత మూడ్ బాగుపడిపోయింది లెండి, వంకాయ కారం పెట్టిన కూరా, మామిడికాయ పప్పూ, కొబ్బరీ మామిడి పచ్చడీ, మజ్జిగ పులుసూ వేసికుని భోజనం చేసేసరికి!

   అప్పుడప్పుడనిపిస్తూంటుంది, ఇన్నేసి వెధవ్వేషాలు వేస్తామే, సడెన్ గా ఇంటావిడ ” ఈవేళ అన్నం వండడానికి మూడ్ లేదండీ…” అంటే వామ్మోయ్……

   ఈవేళ నేను చదివిన ఓ జోక్కు….What do u call a woman in heaven? An Angel. A crowd of woman in heaven? A host of Angels. And all woman in heaven? PEACE ON EARTH!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు—Enjoy…..

ఇంట్లో గరిటెలు తక్కువయ్యాయా ?

Car imported from the wrong country?

వర్షం వస్తే శాటిలైట్ తడిసిపోయి టి.వి. రాదని భయమా ?

కారు వైపర్ల మోటారు పనిచేయడం లేదా ?……

పసిపిల్లాడికి పాలసీసా పట్టడానికి చెయ్యి ఖాళీగా లేదా ?

అన్నిటిలోకీ సూపర్–పిల్లాడికి వేయడానికి డయపర్లు లేవా?……

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Who says Test Cricket is boring….

   దిక్కుమాలిన ODI, T 20 లూ వచ్చి క్రికెట్ ఆటని తగలేశాయి! వేలం వెర్రిగా ఏడాదంతా ఆడేసి, అలసిపోయామనడం, కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకోవడం, కారణం, వాళ్ళు ఊహించనంత డబ్బులు రావడం. ఇంక వాళ్ళు వేసికునే డ్రెస్ కూడా గమ్గవెర్రులు ఎత్తడం! ప్రతీ వాడూ చెప్పేవాడే, ఆ వెధవది టెస్టు క్రికెట్ లో ఏముందండీ అనే.

   సరైన వికెట్టూ, ఆల్మోస్ట్ సరైన అంపైరింగూ ఉంటే, టెస్ట్ క్రికెట్ అంత ఆట ఎక్కడా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడే పూర్తయిన ఇంగ్లాండ్ భారత్ లార్డ్స్ టెస్ట్. మొదటి రోజు వర్షం మూలంగా, ఆగిపోయినా, రెండు జట్లూ అద్భుతంగా ఆడారు. చివరివరకూ ఉత్కంఠ భరితంగా నే ఉంది. అంపైరింగు కొంచం సరీగ్గా ఉంటే, ఇంకా ముందుగానే పూర్తయేది. వచ్చిన గొడవల్లా మన మీడియా ధర్మమే. ఉత్తిపుణ్యాన్న, ప్రతీ ప్లేయర్ మీదా ఒత్తిడి తేవడం. సచిన్ టెండూల్కర్ ఇంకో సెంచరీ చేయకపోతే, కొంపలెమీ అంటుకుపోవుగా. రేపటి పేపర్లో ఇంక ప్రతీ వాడూ పోస్ట్ మార్టెం మొదలెడతాడు. ధొనీ టాస్ గెలిచి వాళ్ళకు బ్యాటింగు ఇవ్వకుండా ఉండవలసింది. జహిర్ ఖాన్ కి దెబ్బ తగలకపోతే ఏమయుండేదో? అలా అంటే, ద్రవిడ్ ఇచ్చిన ఒకే ఓవర్ లో రెండు క్యాచ్చీలలో, ఏ ఒక్కటి పట్టినా, మన పని మూడో రోజుకే అయిపోయేదిగా !

   ప్రతీ దానికీ బొమ్మా బొరుసూ ఉంటాయి. World Cup లో రిఫరల్స్ ఉండబట్టి సచిన్ కి లైఫ్ దొరికింది పైగా LBW! మరి అదే సచిన్ కి టెస్టుల్లో LBW కి రిఫరల్స్ లేకపోవడంతో బ్రతికిపోలేదూ ?

Long live Test Cricket !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైంపాస్…

Kalmadi

   అప్పుడే రమారమి వారం పూర్తయిపోయింది, టపా వ్రాసి. ఏం లేదూ ఒఠ్ఠి బధ్ధకం. టాపిక్కుల్లేక కాదు. బయటకు వెళ్తే టాపిక్కు, పేపరు చూస్తే కావలిసినన్ని టాపిక్కులు, టి.వి అయితే అసలు అడగనే అఖ్ఖర్లేదు. ఏమిటో రాజీనామాలని హడావిడి చేసేశారు, ఏదో వారం అన్నారు, పక్షం అన్నారు ఏమిటేమిటో అన్నారు. నిజమే కాబోసూ, గొడవలన్నీ తగ్గి, ఏదో మనవైపుకి వెళ్ళొచ్చూ అనుకున్నాను. రైళ్ళూ,బస్సులూ ఏ గొడవా లేకుండా నడుస్తాయీ అని. తీరా చూస్తే ఏముందీ, తుస్సుమంది!
రాజీనామాలూ లేవూ, సింగినాదం లేదూ, నోరుమూసుక్కూర్చోమన్నారు. కారణం చెప్పరూ, హాయిగా ఎక్కడికో టూర్ మీదెళ్ళిపోయాడు, ఆ స్పీకర్ కాస్తా. ఆగస్టు 15 దాకా తిరిగి రాడట. ఈలోపులో ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కుంటున్నారు. ఛాన్స్ దొరికితే, తెల్లారేటప్పటికి టి.వి. స్టూడియోల్లో ప్రత్యక్షం చర్చా కార్యక్రమం అంటూ…

   మా కల్మాడీ గారికి జ్ఞాపక శక్తి తగ్గిపోయే ” రోగం” వచ్చిందిట! రోగం ఏమీ కాదూ? తిన్నన్నాళ్ళు కడుపునిండేలా మెక్కి, ఇప్పుడు ఏమీ గుర్తే లేవూ అండానికి సిగ్గూ శరమూ లేదు.పైన ఇచ్చినదానిమీద ఓ నొక్కు నొక్కండి, కల్మాడీ గారి ప్రస్తుత రోగం తెలుస్తుంది.
యడ్డీ గారైతే అడక్కండి, ఆ హెగ్డే మొత్తుకుంటున్నాడు, అందరూ కలిసి గనుల కుంబకోణం లో చేతికొచ్చినంత నొక్కేశారూ అని. తమ పార్టీయే మహా పతివ్రత అన్నట్లు మాట్లాడతారు,బి.జె.పి వాళ్ళు. మరి ఈ యడ్డీ ఎవడంట? ఇవన్నీ తిమింగలాలూ అవీనూ.ఇంక చిన్న చాపల సంగతికొస్తే…
వాడెవడో, రిటైర్డ్ ఆర్ టీ ఓ ట, ఎన్నెన్నో కోట్లు దొరికాయట! అప్పుడెప్పుడో, కిరణ్ కుమార్ క్యాబినెట్ ఏర్పరిచినప్పుడు, ఆయనెవడో మంత్రి, రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ ఇచ్చారూ అని, అలిగి కూర్చున్నాడు. అప్పుడే వ్రాశాను- ఏ ఆర్.టి.ఓ ని అడిగినా చెప్తాడూ, ఆ శాఖ ఎంత క్యాష్ రిచ్చీ అని!
అసలు ఇవన్నీ చూస్తే బొఫార్స్ ఏ మూలకీ? అంతా చేస్తే అరవై కోట్లు లేదు. దానికే ఏమిటో హడావిడి చేసేశారు ! దాని ధర్మమా అని, వి.పి.సింగు ఓ హీరో అయిపోయారు!

   “మా” టి.వీ. లో ప్రతీ రోజూ పన్నెండింటికి మాఊరి వంట అని ఓ కార్యక్రమం వస్తూంటుంది. ఈవేళ చూశాను, మీకెందుకూ వంటా వార్పూ అనకండి, అదో సరదా, ఏమైనా బావుంటే, మా ఇంటావిడినడగొచ్చు, చేయమని. ఈవేళ్టి కార్యక్రమం లో ఓ పెద్దావిడ ఓ 75 ఏళ్ళుట, శ్రీమతి మద్దూరి లీలావతి గారు– ఆవిడ చేసి చూపించిన వంటకం కంటే, ఆవిడ చెప్పిన కబుర్లు రుచిగా ఉన్నాయి. పదమూడో ఏట పెళ్ళై వచ్చారుట.ఆ యాంకరమ్మాయి తో ఆడేసికున్నారు ! పూర్వకాలం వారు ఇప్పటికీ హాయిగా గిన్నెడు నెయ్యీ ఖాళీ చేస్తారు ,నెయ్యేసికుంటే మేధస్సు పెరుగుతుందిట!. ఎక్కడలేని సూకరాలూ ఇప్పటి వాళ్ళకే. ఏమిటో నెయ్యేసికుంటే వళ్ళొచ్చేస్తుందని, నేతి చుక్క వేసికోరు. మా ఇంట్లో, నేనూ, మా మననవళ్ళూ, మనవరాళ్ళూ తప్పించి ఎవ్వరూ నెయ్యి వేసికోరు. అదేమి చిత్రమో, ఇంట్లో వాళ్ళందరినీ చూసి, మా ఇంటావిడ కూడా మానేసింది!
అసలు నెయ్యి వేసికోకుండా అన్నం ఏమిటండీ, ఊహించుకోడానికే బాగో లేదు. ఉన్నన్నాళ్ళూ హాయిగా కావలిసినదేదో తినక, ఎందుకొచ్చిన గొడవా? బయటి తిళ్ళు మానేస్తే, ఏ ఒళ్ళూ రాదు. మనం వదల్లేము మరి! అయినా సుఖపడే యోగం లేనప్పుడు ఎవరెన్ని చెప్తే లాభం?

   ఆ పెద్దావిణ్ని, యాంకరమ్మాయి అడిగింది-తాతయ్యగారు శ్రీరామచంద్రుడా, శ్రీకృష్ణుడా అని. దానికావిడ చెప్పిన సమాధానం- రెండూనూ(ఇంట్లోనే) అని! ఇంట్లో అధికారం ఎవరిదీ అన్నదానికి సమాధానం,’ అక్కడ అధికారం ఎవరిదీ అని కాదూ, వాళ్ళడిగినవి ఇచ్చేస్తూ, కావలిసినొచ్చినప్పుడు లాక్కుంటూనూ ఉండాలి’ అప్పుడే బాగుండేది అని. ఏదో మన ఇంట్లో ఉండే వాళ్ళు మాట్లాడినట్లనిపించింది. అప్పుడప్పుడు ఇలాటి కార్యక్రమాలూ వస్తూంటాయన్నమాట !

%d bloggers like this: