బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ వేళ సాయంత్రం, మా ఇంటావిడ , నిమ్మకాయలూ, దబ్బకాయలూ తెమ్మంటే మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ప్రక్కనే ఒక అతను పనసపొట్టు కొడుతున్నాడు అంటే తెలుసు గా –-పచ్చి పనసకాయని కత్తితో చిన్న చిన్నముక్కలుగా కోయడం–అది ఒక ప్రొఫెషనల్ జాబ్, అందరూ చేయలేరు.చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ప్రక్కనే ఒకాయన తన కుమారుడికి వివరిస్తున్నారు, పనసకాయ అంటే ఏమిటీ,అలా పొట్టుగా తయారైనదానిని, ఆవ పెట్టి కూర ఎలా చెస్తారో అన్నీను. నాకైతే విచిత్రంగా అనిపించి, ఆయననూ, ఆ అబ్బాయినీ పలకరించాను. చెప్పానుగా నాకు కొత్తవారితో పరిచయం చేసికోవడం చాలా ఇష్టం.

    వారు గత 5 సంవత్సరాలనుండీ ఉద్యోగ రీత్యా లండన్ లో ఉంటున్నారుట, శలవలకి , ఆ అబ్బాయి అమ్మమ్మ గారింటికి వచ్చాడుట. ” మా వాడికి ఇవన్నీ విచిత్రంగా కనిపిస్తున్నాయీ, అందుకని వివరిస్తున్నానూ ” అన్నారు. అలా కొంచెం సేపు ఖబుర్లు చెప్పుకున్నాము. ఇప్పటి జనరేషన్ వారికి ఇలాంటివి చాలా తెలియదు, తరవాత తరానికైతే అస్సలు అడగఖర్లేదు అన్నారు. ” మనం ఇంట్లో శ్రధ్ధ తీసికుని, మన సంస్కృతీ,ఆచారవ్యవహారాలూ ఓపిగ్గాచెప్తే వింటారూ, ఇప్పటి వారిలో ఉన్న సుగుణం అదేనండీ” అన్నాను. ఇన్టర్నెట్ లో ఇస్తున్న వివరాలు చూస్తూంటే ఎంత సంతోషం వేస్తోందో !! వికిపీడియా చూస్తే తెలుస్తోంది అక్కడ లేని సంగతి లేదు.మనకి ఓపిక ఉండాలి అంతే.

    ఇంతలో ఆ అబ్బాయి తాతగారు వచ్చారు. నన్ను ఆయనకి పరిచయం చేశారు. ఆయన ముంబైలో బి.ఏ.ఆర్. సీ లో 35 సంవత్సరాలు పనిచేశారుట. అంటే ఇన్నాళ్ళూ అక్కడే ఉండి, ప్రస్తుతం రాజమండ్రీ కి వచ్చారు. ఆయన నాపేరూ, ఇంటిపేరూ అడిగి ” మీరు వైదీకులా, నియోగులా “ అన్నారు. అంటే నేనన్నానూ, ” మీరు ముంబైలో ఉన్న 35 సంవత్సరాలూ ఈ ప్రశ్న ఎవరినైనా ( తెలుగు వారిని) అడిగారా”. అంటే “ఇక్కడ అందరూ అడిగే మొదటి ప్రశ్న ఇదేనండీ, మీరెవరూ, మీశాఖ ఏమిటీ ఫలానా ఫలానా...” అంటే నేనన్నానూ ” ఇక్కడ అడిగితే మీకు ఇష్టం ఉంటే చెప్పండి, అంతేకానీ, ఇన్ని సంవత్సరాలూ ఎప్పుడూ అడగని ఈ ప్రశ్న మీరెందుకు ఇంకోళ్ళని అడుగుతారూ“అన్నాను.దానికి ఆయన నవ్వేసి, ” ఎక్కడుంటే అక్కడ వాతావరణానికి సర్దుకోవాలిగా “ అన్నారు. నా ఉద్దేశ్యంలో మనం ఎక్కడున్నా మన ప్రిన్సిపుల్స్ ని కాంప్రమైజ్ చేయఖర్లేదని. 45 ఏళ్ళుగా లేని కొత్త అలవాట్లు చేసికుని లేనిపోనివి కొనితెచ్చుకోవడం ఎందుకూ?

    రాత్రి జీ టివీ లో “లక్ష్మి టాక్ షో” అని ఓ ప్రోగ్రాం వచ్చింది. ఈ వేళ్టి అతిథి జయ సుధ. ఆవిడ చెప్పినవన్నీ తన నటన లాగే చాలా సహజం గా ఉన్నాయి. ఒక ప్రశ్నకి సమాధానం గా ఒక సంగతి చెప్పారు. తనూ, జయప్రదా, శ్రీదేవీ , –ముగ్గురూ తెలుగేతరులనే వివాహం చేసికున్నారూ. అందరూ బహుశా ” పొరుగింటి పుల్లకూరే” ఇష్ట పడ్డారేమో అని.నాకైతే ఆ ఇంటర్వ్యూ చాలా నచ్చింది.తను రాజకీయాల్లోకి ఎందుకు రావలిసి వచ్చిందీ, తను క్రైస్తవ మతం ఎందుకు పుచ్చుకున్నారూ,లాంటి ప్రశ్నలకి నిజాయితీ గా వివరించారు. ఒక్కటి మాత్రం నవ్వు వచ్చింది–” మీకు ఎప్పుడూ మీ వారితో దెబ్బలాట రాలెదా ” అన్నదానికి ” ఎందుకు రాలెదూ, ఎన్నోసార్లు వచ్చిందీ, వెళ్ళిపోతానని చాలా సార్లు బెదిరించాను, నాకు కారు డ్రైవింగు రాదు, ఏ ఆటో లోనో, టాక్సీలొనో వెళ్తే వాడు ఎక్కడికో తీసికెళ్తాడేమో అని భయమూ, లెకపోతేనా ఎప్పుడో పారిపోయేదానినీ” అంటూ చాలా బాగా చెప్పారు.

    ఈ రెండు రోజులూ టి.వీ. న్యూస్ చూస్తూంటే ఓ విధమైన రోత పుడుతోంది. అసెంబ్లీ లో వాళ్ళు కొట్టుకునే విధం చూసి. మన రాజకీయ నాయకులు ఎన్ని పుటాలు వేసినా బాగుపడరండీ. ప్రజల సొమ్ము ఎలా వ్యర్ధం అవుతోందో మన అసెంబ్లీ కార్యక్రమాలు చూస్తే అర్ధం అవుతుంది.ఎలా ప్రజలని దోచుకుందామా అనేకానీ,ఇంకో ధ్యాస లెదు. మన దురదృష్టం ఇలాంటి వాళ్ళనే ఎన్నుకోవలసి వస్తూంది.ఎప్పటికి బాగుపడతామో, ఆ భగవంతుడే మనల్ని కాపాడాలి.!!

%d bloggers like this: