బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

    అదేవిటో కానీ, నాకు వారంలోని అన్నిరోజుల్లోనూ మంగళవారం అంటే చాలా ఇష్టం. కారణం చెప్పలేను, కానీ ఆరోజున అంతా బాగుంటుందనీ, ఆరోజంతా feel good గానే ఉండడం చేత, ఈ మంగళవారంకోసం ఎదురుచూస్తూంటాను. మా ఇంటావిడ ఏదైనా పని చెప్పినా, లేదా నేనేదైనా ముఖ్యమైన పనిచేయాలన్నా, ఈ మంగళవారానికే వాయిదా వేస్తూంటాను. అలాగని మిగిలిన రోజులు బాగుండవని కాదూ, ఏమిటో మంగళవారాల్లాగ మాత్రం ఉండవు. ఎవరి పిచ్చివాళ్ళకి ఆనందం అని సరిపెట్టేసికోండి.

    ఒక్కోప్పుడు ఏ పని చేద్దామనుకున్నా, పని అవదని కాదు కానీ, ఏదో ఆటంకం, చిరాకూ, మొత్తానికి అవుతుంది, కానీ అంత సంతృప్తిగా ఉండదు. నిన్నటికి నిన్న ( సోమవారం) అంతా అలాగే గడిచిపోయింది. మా ఇంట్లొ ఇక్ష్వాకుల కాలం నాటి ఒక SONY MUSIC SYSTEM ఉందిలెండి, అంటే మరీ అంత పాతదని కాదూ, 2000 సంవత్సరంలో కొన్నదే, ఇప్పటి వాటితో పోలిస్తే పాతదన్నమాట,మొదట్లో అన్నీ బాగానే పనిచేసేది. క్రమక్రమంగా, ఒక్కో “అంగమూ” పనిచేయడం తగ్గించింది. పాపం దానికీ వయసొచ్చేసిందిగా,క్యాసెట్లు పెట్టుకునేది బీట తీసింది, FM అయితే రావడమే మానేసింది, ఇంక CDలంటారా, పాత గ్రామఫోను రికార్డుల్లా ఒకచొటే తిరుగుతుంది. అయినా హాల్లో “అలంకారార్ధం గంధం సమర్పయామి” లా హాలుకి నిండుతనం తెస్తోంది.gadgets 036. దానికి వైద్యం చేయిద్దామని,దగ్గరలో ఉండే SONY వాడిని అడిగితే, ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాప్పుకి వెళ్ళమన్నాడు. దగ్గరా, దాపా , నేనా బస్సులవాడినాయె, పిల్లల్ని అడిగితే తీసికెళ్తారు, కానీ ముందర చెప్పేదేమిటయ్యా అంటే, దీన్ని మార్చేసి కొత్తది తీసికోమని. కానీ 10 సంవత్సరాలు, అంత బాగా పనిచేసినదాన్ని, ఏదో ” ఆరోగ్యం” బాగాలేదని బయట పారేస్తామా మరీనూ? ఎంతైనా ” పాతతరం ” వాళ్ళం, పోనీ ఓసారి వైద్యం చేయిస్తే బాగుపడుతుందేమో అన్న ఆశ.ఎంత చెప్పినా తరాలు వేరు కదా ! అలాటి ఆలోచనలు పిల్లలకి అంత నచ్చవేమోలే అనుకుని, మా స్నేహితుడు శ్రీ శాస్త్రిగారితో మాటవరసకి అన్నాను ” మాస్టారూ మీకు వీలైతే ఒకసారి మీ కారులో తీసికెళ్తారా..” అని , ఆమాత్రం చనువుందిలెండి ఆయనతో. దానికేముందండీ తప్పకుండా వెళ్దాం అన్నారు. ఆమధ్యన ఒక రోజు OLA cabs వాడు ఒక్కరోజుకి, అదేదో promotional offer పెట్టాడు. రోజంతా ఫ్రీగా వాడుకోవచ్చని. సరే అనుకుని, ఆ cab వాడిని పిలిచి మొత్తానికి ఆ SONY డాక్టరుదగ్గర నా Soundsystem ని చేరేశాము.ముందర ఓ 500 డిపాజిట్ చేయమంటే, నాదగ్గర లేకపోవడంతో పాపం ఆయనే ఇచ్చారు. (తరువాత తిరిగి ఇచ్చేశాననుకోండి.).

    మర్నాడు ఫోనుచేసి, దాన్ని repair చేయడానికి 5000 అవుతుందన్నాడు, పైగా గ్యారెంటీ కూడా లేదాయె.మరీ అంత డబ్బు ధారపోసే ఓపిక లేక , ఎప్పుడో exchange offer లో కొత్తదే తీసికోవచ్చనే ఉద్దేశ్యంతో వద్దనేశాను. మరి దాన్ని తిరిగితెచ్చుకోవద్దూ, మళ్ళీ శ్రీ శాస్త్రిగారి సహాయం అడిగేను. ఆ cab వాడు 50% రాయితీ ఇస్తాననడంతో, నన్ను ఆ షాప్పుకి బస్సులో వెళ్ళమనీ, తను అక్కడకి cab వచ్చేటట్టు బుక్ చేస్తాననీ చెప్పారు. ఆయన cab బుక్ చేసి, ఆ వివరాలు నా మొబైలో పంపేరు. ఓ అరగంటలో వస్తానన్నవాడు, గంటన్నరైనా అయిపూ, జాడా లేకుండా పోయాడు. అప్పుడు వాళ్ళకి ఫోను చేసి నానా చివాట్లూ వేసి బుకింగు క్యాన్సిల్ చేసి, ఆటోలో ఇంటికొచ్చాను. అనవసరంగా ఇంత శ్రమపెట్టేశానే అని శ్రీ శాస్త్రిగారు బాధపడిపోయారు. పాపం ఆయనేమైనా కావాలని చేశారా ఏమిటీ, ఆ దరిద్రపు OLA Cabs వాడి నిర్వాకమేగా ఇదంతా.ఏదో మొత్తానికి ప్రొద్దుటి session అలా పూర్తయి, ఇంట్లో తినడానికి పళ్ళు లేవని, బయటకి వెళ్ళి, పనిలో పనిగా D’mart కి వెళ్ళాను.

    ఈమధ్యన మా ఇంట్లో పనిమనిషి లేకపోవడంతో, మా ఇంటావిడే చేసుకుంటోంది.ఏదో మరీ ఒంగుని తుడిస్తే, నడుం నొప్పిపుడుతోందీ అనే ఉద్దేశ్యంతో, అదేదో కొన్నాను, ఉపయోగిస్తుందీ అని.
gadgets 034
నా చేతిలో చూడ్డంతరవాయి, ” మళ్ళీ ఇలాటిది ఎందుకు తీసికొచ్చారండి బాబూ.. ఇదివరకోసారి చెప్పానుగా..” అంటూ ధూం..ధామ్ అనేసింది. పోనీ ఓసారి వాడి చూద్దాం అంటే, ” ఇదివరకూ ఆలాగే చెప్పి నన్ను బుట్టలో వేశారు..” చివరకి అంత డబ్బూ పెట్టికొని, పనిమనిషికి ఇచ్చేసాం, పైగా ఇప్పుడు పనిమనిషికూడా లేదూ…అంటూ గయ్యిమంది.. పోతేపోయేయీ 282 రూపాయలూ అనుకుంటూనే, పోనీ వెనక్కి తీసికుంటాడేమో చూద్దామూ అనుకుని, అడిగితే , తిరిగి తీసికుని నా డబ్బులు వెనక్కిచ్చేశాడు… కథ సుఖాంతం..
పైన చెప్పిన olacabs వాడు, నాకు ఆరోజు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, మా ఫ్రెండు ఎకౌంటుకి 300 రూపాయలు జమచేశాడు, ఆయనేమో ఆ డబ్బులు నాకిచ్చారు !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

    ఈమధ్యన రోజుకో పేద్ద న్యూసు ! నిన్న సుప్రీంకోర్టువారు ,మన క్రికెట్ సామ్రాజ్యాధినేతల భాగోతం కాస్తా బయటపెట్టేశారు. ఆ మిగిలినదేదో కూడా పూర్తిచేసి, ఆటగాళ్ళ పేర్లు కూడా బయటపెట్టి పుణ్యం కట్టుకుంటే, కొద్దిలో కొద్దిమందైనా క్రికెట్ “వ్యామోహం” నుండి బయటపడతారని ఆశిద్దాం.అలాగే బెంగాల్ లో అదేదో శార్దా స్కాం.. ఆయనెవరో ఆత్మహత్య చేసికుంటానని ముందరే చెప్పేశాడో, లేదా ఎవరైనా చెప్పించారో కానీ, మొత్తానికి ఆయనకి కావాల్సినన్ని నిద్రమాత్రలు మాత్రం చేరేశారు, వాటినికాస్తా మింగేశాడు, అదీ ఎక్కడా అంటే జైల్లోట. మరి ఈయన ఆత్మహత్యంటూ చేసికుంటే, ఎవరు “బయట పడకుండా” ఉంటారో ఆ దేవుడికే తెలియాలి.

    ఈ మధ్యన ఓ కొత్త ఒరవడి ప్రారంభం అయింది…Voice Vote ట ! నెగ్గలేమని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు, దీన్ని ఉపయోగించేసి నెగ్గేస్తూంటారు. ఆ దౌర్భాగ్యం కాంగ్రెసువారే నేర్పారు రాష్ట్రవిభజన టైములో, దాన్నే ప్రస్థుత రూలింగు పార్టీవారు అనుకరించేస్తున్నారు. ఈమధ్యన మహారాష్ట్రలో జరిగిన భాగోతం ఒక ఉదాహరణ. శరద్పవార్ గారు అన్ని కబుర్లూ చెప్పి మొత్తానికి, ప్రస్తుతానికైతే స్కామ్ములనుండి బయటపడ్డట్టే.కాఫిడెన్సు వోట్ లో సమర్ధత ప్రకటింఛిన “పుణ్యానికి” ఆమాత్రమైనా బెనిఫిట్ లేకపోతే ఎలా మరి? ఎంతైనా ” ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు” గా శరద్ పవార్ కిరీటంలో మరో కలికి తురాయి ! ఆదర్శ్ స్కాం, అజీత్ పవార్ గారి ఇరిగేషన్ స్కాం లకి ఓ అయిదేళ్ళపాటు ఊరట ! మరీ ఒక్కడైపోయాడుగానీ, సురేష్ కల్మాడీ మిగిలాడు, ఎటూ కాకుండాపోయాడు పాపం !

    ఇంక so called biography లూ, auto biography ల విషయానికొస్తే , ఇదివరకటి రోజుల్లో ఓ ఆత్మకథ ని చదివితే కొత్త కొత్త విషయాలూ, జీవిత పాఠాలూ నేర్చుకునే వాళ్ళం. ఫలానావారి పుస్తకమూ అంటే అందులో ఎన్నో మనకి తెలియని విషయాలుండేవి. కానీ ఈరోజుల్లో వచ్చే పుస్తకాలలో , ఏదో ఒక సెన్సేషన్ సృష్టించేసి, డబ్బు చేసికోవడమే ముఖ్యోద్దేశంగా మారిపోయింది. ప్రభుత్వంలోని ఏ పెద్ద అధికారో రిటైరవగానే ఓ పుస్తకం వ్రాసేయడం, దాంట్లో తను పదవిలో ఉండగా ఏమేం ఘనకార్యాలు చేశాడో వ్రాస్తే అదో సంగతి, కానీ,తాను ఎంత “నీతిమంతుడో” పాపం ఎంతగా పైవారివలన ఎంతగా pressurise అయాడో వగైరా..వగైరాలు చిలవలూ పలువలూ చేసేస్తే ఆ పుస్తకం కాస్తా best seller అయిపోతోంది.ఇంక ఆ పుస్తకం గురించి చర్చలూ. మధ్యలో సందట్లో సడేమియాల్లాగ, కొంతమంది తందానతాన అనడం ఫ్యాషనైపోయింది. ఎవడికి వాడే తానో martyr అనుకోడం.

    ఈమధ్యన మా చుట్టం ఒకాయన, ” స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దేశానికి వచ్చేస్తుందిట, ఎంత మంచిపనిచేశారో కదూ, మన ప్రభుత్వం ..” అంటూ నా స్పందన ఆశించారు. ఔనండీ ఇదేమైనా కొత్తగా తెలిసిందా, ప్రభుత్వాలకి తెలిసి అయిదేళ్ళు అయింది, ఆ డబ్బేదో వచ్చినప్పుడు కదా, ఈలోపులో ఎన్నెన్ని “నాటకాలు ” జరగాలీ.. అయినా వచ్చిందే అనుకోండి, సాధారణ జనజీవనానికి కలిగే ఉపయోగం ఏమిటిటా? పెట్రోల్, డీసిలూ. గ్యాస్సూ ఓవారం తగ్గించడమూ, రెండో వారం పెంచడమూనూ. అతావేతా “ అచ్చే దిన్” వచ్చాయీ అంటే ఒక్క sensex కి మాత్రమే. అదిమాత్రం రోజురోజుకీ పాదరసంలా పెరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుముఖం పట్టేయీ అంటున్నారే కానీ, దేంట్లో తగ్గేయిట? మాకు పూణెలో బస్సు రేట్లు 25 % పెంచుతారుట.ఎపార్టుమెంట్ల ధరలు చూస్తే , ఐటీ కంపెనీల్లో పనిచేసేవారికే అందడం లేదు. మరి ఈ “అచ్చే దిన్ ” ఎక్కడ వెదకాలి?

    పైగా ఏమైనా అంటే కొత్తతరం వారు , రాజకీయనాయకులూ ఇళ్ళకప్పులెక్కి భాషణ్ ఇచ్చేస్తూంటారు..” దేశం మాకిచ్చిందేమిటీ అని కాదూ, దేశానికి మనమేమిచ్చామూ..” అని. వీళ్ళు మాత్రం చేస్తూన్నదేమిటిట? “స్వచ్చ్ భారత్” పేరు చెప్పి ఓ చీపురుచ్చుకుని ఫొటోలకి దిగితే సరిపోతుందా? ఉంటున్న కొంప స్వచ్చంగా ఉంచుకోగలిగితే దేశాన్ని బాగుచేసినంత, ఒక్కరోజు పనిమనిషి రాకపోతే, అంట్ల గిన్నెలు ఎక్కడివక్కడే ఉంచేసి, ఏ హొటల్లోనో లాగించేసే వాళ్ళు ఎన్నికబుర్లైనా చెప్తారు. కిందటేడాది అన్నాహజారే గారూ, అదేదో ” కరప్షన్ కూకటి వేళ్ళతో పీకేయాలని” ఓ పెద్ద హడావిడి చేశారు. మన యువతరం అంతా టోపీలూ, అవీ పెట్టేసికుని నానా హడావిడీ చేశారు, సోషల్ మీడియా నిండా హోరెత్తించేశారు.. ఆ వేడి లో కేజ్రీవాల్ కొంతకాలం ముఖ్యమంత్రికూడా అయ్యాదు. మళ్ళీ ఆ జనాలే తమిళనాడు ముఖ్యమంత్రిని , జైల్లో పెడితే గుండెలు బాదుకున్నారు..

    ఇంక మన కేంద్ర క్యాబినెట్టులో HRD శాఖ ఓ పెద్ద జోక్ గా మారిపోయింది.ఒకావిడకి అసలు చదువే లేదన్నారు. ఇప్పుడు ఆవిడగారి డెప్యూటీ మార్కుల లిస్టు లో ఏదో గడబిడ చేసిన శాల్తీట ! వీళ్ళిద్దరూ మన దేశ విద్యావిధానాన్ని శాసించే ప్రబుధ్ధులుట !వీళ్ళు చేసిన ఘనకార్యం ఏమిటయ్యా అంటే, కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ తీసేసి, సంస్కృతం పెట్టడం. పెట్టొద్దనెవడన్నాడు, కానీ దానికీ ఓ వారం వర్జ్యం ఉంటాయి. యకడెమిక్ సంవత్సరం మధ్యలో మారుస్తారా ఎవరైనా? వచ్చే విద్యాసంవత్సరంలో మారిస్తే, ఏమైనా వేదవ్యాసుడికి కోపం వస్తుందా? వీరిద్దరి జోడీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నెన్ని చిత్రాలు చూడాలో పాపం మన పిల్లలు !!

    మేరా భారత్ మహాన్…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వేలం వెర్రి..

quikr_logo_f3

    ఈమధ్యన ఓ వేలం వెర్రి ఒకటి మొదలయింది.. అర్ధం అయిందిగా నేను వ్రాసేది దేనిగురించో.. ఎవరికైనా ఫర్నిష్ చేసిన ఎపార్టుమెంటు అద్దెకివ్వాలంటే భయం, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఎప్పుడు ఎవడికి అమ్మేస్తాడో అనే భయం. ఇక్కడ మహారాష్ట్రలో అయితే యజమానీ, అద్దెకుండేవాడూ ఓ ఎగ్రిమెంటైనా రాసుకుంటారు, ఏదో కొంత ఎమౌంటు డిపాజిట్ గా తీసికునే సౌలభ్యమైనా ఉంది. మహా అయితే ఖాళీ చేసినప్పుడు, ఏ సామానైనా అమ్మేసినా, కొంతలో కొంత నష్టం భర్తీ చేసికోవచ్చు, కానీ మన ప్రాంతాల్లో మాటెమిటీ? ఏదో మూడు నెలల అద్దె ఎడ్వాన్సు తీసికుంటారు, ఎగ్రీమెంట్లూ వగైరా ఉంటాయనుకోను.ఈమధ్యన ఓ ప్రకటనలో అత్తగారూ, కోడలూ ఆఫీసునుండి కొడుకొచ్చే లోపల, ఇంట్లో ఉండే పాతసామాన్లు ఫొటోలుతీసి, ఆ మాయదారి క్విక్కర్ లో పెట్టి, అమ్మేయడం. దీనితో అందరూ అలా చేస్తే కొత్తవస్తువులు తెచ్చేసికోవచ్చుననే ప్రలోభంలో పడ్డం.

ఈ use and throw పధ్ధతి పశ్చిమదేశాలనుండి దిగుమతి చేసికున్నదనుకుంటా. కానీ మనదేశంలో సామాన్య మానవుల ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే కదా. ఇప్పుడంటే, అనుకున్న మరుక్షణం ఇళ్ళల్లోకి ఏ వస్తువు కావాలంటే అది వచ్చేస్తోంది కానీ, ఇదివరకటి రోజుల్లో అలా కాదుకదా. ఇంట్లోకి ఏదైనా వస్తువు రావాలంటే, దానికో పంచవర్ష ప్రణాలిక వేసికోవాల్సొచ్చేది. ఈరోజుల్లోలాగ ఏమైనా క్రెడిట్ కార్డులూ, EMIలూనా ఏమిటీ? పోస్టాఫీసులో ఓ ఎకౌంటూ , నెలనెలా కొంత డబ్బు దాచుకుని, ఏదో మొత్తానికి అయిదేళ్ళకి తేగలిగేవారు. 80 వ దశకం వచ్చేసరికి కొన్ని కంపెనీలవాళ్ళు వాయిదా పధ్ధతి మొదలెట్టడంతో ఇంట్లోకి ఉపయోగకరంగా ఉంటుందని ఓ కుట్టుమిషనో( దానితో ఇస్త్రీ పెట్టి ఫ్రీ ), ఓ టెబుల్ ఫాన్నో, చివరకి రేడియో కూడా అలాగే కొనాల్సొచ్చేది. నాగరికత పెరిగేకొద్దీ ఇళ్ళు ఎపార్టుమెంట్లలా మారిపోయేటప్పటికి ఇంట్లోకి డైనింగు టేబిళ్ళూ, డబుల్ కాట్లూ అవసరం వచ్చాయి. అవి కూడా వాయిదా పధ్ధతిలోనే. ఇంట్లోకి ఓ వస్తువు తేవాలంటే ఇంటియజమాని ఎంత కష్టపడుంటాడో ఊహించుకోవచ్చు. పైగా ఉద్యోగం చేసేది సాధారణంగా మొగాడు మాత్రమే. అలాగని ఆడవారు చదువురానివారుకాదు, వాళ్ళూ కనీసం ఏ స్కూలుఫైనల్ దాకానో, డిగ్రీదాకానో చదువుకున్నవారే. అయినా ఇంటిపట్టున ఉండి సంసార బాధ్యతలు తీసికుని, పిల్లల్ని పెంచి విద్యావంతులుగా తయారుచేయడంలోనే , బిజీగా ఉండేవారు. దానితో ఇంటి యజమానికి వాటిగురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు.ఎలాగోలాగ తన కుటుంబానికి ఉపయోగపడే వస్తువులు సమకూర్చడానికే నానా అవస్థలూ పడేవాడు. ఓ కొత్తవస్తువు ఇంటికి వచ్చినప్పుడు, తన భార్యా పిల్లల కళ్ళల్లో కనిపించే, సంతోషంతోనే ఈయనగారికి కడుపు నిండిపోయేది.

ఒక్కో వస్తువు ఇంటికి వచ్చినప్పుడల్లా, భర్త పడ్డ అవస్థలు భార్యకి మాత్రమే తెలిసేవి. అందువలన ఆ తెచ్చిన వస్తువుతో ఒక అనుబంధం ఏర్పడిపోయేది. ఇంట్లోకి ఓ వస్తువొచ్చిందంటే, దాని బాగోగులన్నీ భార్యే చూసుకోడం. పైగా ఆ వస్తువుల మన్నిక కూడా అలాగే ఉండేది. ఈరోజుల్లోలాగ వచ్చేప్రాణం పోయే ప్రాణం కాదు. గుర్తుందా కొన్ని సంవత్సరాలక్రితం ఒక ప్రకటన వచ్చేది అదేదో “కాలిన్” అనుకుంటా, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రతీరోజూ ఆ కాలిన్ తో తుడిచేటప్పటికి, ఆ వస్తువు నిత్యనూతనంగానే కనిపించేది. నా ఉద్దేశ్యం ఏమిటంటే కొత్తగా తెచ్చిన వస్తువు ఎంత జాగ్రత్తగా చూసుకునేవారో అని చెప్పడానికి. అందుకే 30, 40 ఏళ్ళైనా అప్పుడు కొన్న వస్తువులు ఓ డబుల్ కాట్టనండి, డైనింగు టేబుల్ అనండి, ఇప్పటికీ గుండ్రాయిల్లాగ ఉన్నాయి. కానీ “కొత్త ఒక వింత..పాత రోత ” గా మారిపోయిన ఈరోజుల్లో వారికి ఇంట్లో ఉన్న వస్తువులతో, ఆ ఇంటి పెద్దలకుండే bonding అర్ధం అవదుగా. ప్రతీదీ అడ్డమే. ఇంట్లో ఉన్నది పాత ఫాషనైపోయింది ఇదమ్మేసో, ఎవడికో ఇచ్చేసో కొత్తది తెచ్చేయడం. పోనీ అదైనా ఉంచుకుంటారా అంటే , మళ్ళీ ఏడాది ఇంకో కొత్త మోడలొస్తుంది. దీనికి అంతనేదే ఉండదు. వీళ్ళకి చాన్సొస్తే ఇళ్ళలో ఉండే పెద్దవారినికూడా ఏ “క్విక్కర్” లోనో, “ఓలెక్స్ ” లోనో అమ్మేయగల సమర్ధులు ! ఈ జాడ్యానికి ముఖ్యకారణం Easy availability- చేతినిండా డబ్బూ, డబ్బుల్లేకపోతే క్రెడిట్ కార్డులూ, ఊరినిండా మాల్సూ, పైగా ఒక్కో బ్రాండుకి విడిగా షోరూమ్ములూ, కొట్లకి వెళ్ళగానే ఊరించే డిస్కౌంట్లూ, ఇవికాకుండా ఆన్ లైన్ స్టోర్సులూ ఒకటేమిటి అడక్కండి. ఓ వస్తువు కొనడానికి ఏతావేతా ఏదైనా శ్రమ పడితేనే కదా ఆ వస్తువు విలువ తెలిసేదీ? ఉఫ్ మంటే ఇంట్లోకి కొత్తవస్తువొచ్చేస్తుంటే దానీ బతుకూ అలాగే ఉంటుంది.

ఎంతో అవసరం అయితేనేకానీ ఓ వస్తువు అమ్మకానికి పెట్టేవారు కాదు ఆరోజుల్లో..కానీ ఇప్పుడో ఇంట్లో ఉండే పాతవస్తువులు ఎంత తొందరగా వదిలించుకుందామా అనే ఆలోచన .మళ్ళీ ఏ ఇంటర్నెట్ లోనో చూస్తారు.. ఫలానా వస్తువుకి ఎంతో antique వాల్యూ ఉందని ఏ తలమాసినవాడో చెప్పడం తరవాయి, ఫేస్ బుక్కులోనో ట్విట్టర్ర్ లోనో సందేశాలూ ‘ఫలానా వస్తువుందా..” అంటూ. ఎంత ఖరీదైనా కొనుక్కుని అందరికీ చూపించుకోడం.

పైగా ఈరోజుల్లో అంతా పోటీ ప్రపంచమాయే. ఏ ఇద్దరు కలుసుకున్నా నా దగ్గర లేటెస్ట్ మోడల్ ఫలానాది ఉందీ అనేవాడే. వాడిదగ్గరున్నదో అంతకంటే లేటెస్టో మనదగ్గరకొచ్చేదాకా నిద్ర పట్టదు. ఉన్నదాని వదుల్చుకోవాలంటే క్విక్కర్ ఎలాగూ ఉంది… సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “అచ్చే దిన్.”..

    దేశానికి స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలయింది… ఈ విషయం ఈయనకి ఇప్పుడే గుర్తొచ్చిందా అని అనుకోకండి. ఈ అరవైఏళ్ళనుండీ ప్రభుత్వాలు కేంద్రం అనండి, రాష్ట్రం అనండి, లలో ఏదో కొంతమంది పనిచేస్తేనే కదా, రథాలు కదిలిందీ? ఓ వయసొచ్చిన తరువాత, వాళ్ళని ఇళ్ళకి పంపేసి, అన్ని రోజులు విశ్వాసపాత్రంగా పనిచేసినందుకు కొంత భ్రుతి “పెన్షన్ ” పేరిట ఇచ్చేవారు, ఇస్తున్నారు కూడా/ ఈ ప్రభుత్వాలూ, పెన్షనూ స్వాతంత్రం పూర్వంలోనూ ఉండేవి.ఈయనకి పనీ పాటా లేదూ, ఇంతకంటే మంచి సబ్జెక్టే దొరకలేదా అనుకోకండి… ఏదైనా వ్యవస్థలో అనుకోని మార్పు జరిగినప్పుడూ, ఆ మార్పుద్వారా కొంతమందికైనా మంచి జరుగుతూన్నప్పుడూ, ఆ మార్పు తేవడానికి బాధ్యుడైన వారికి మన థాంక్స్ చెప్పుకోవద్దూ?

   పెన్షన్ ఇవ్వడం వరకూ బాగానే ఉంది. కానీ ప్రతీ ఏడాదీ, ఈ ” పింఛనీదారు ” బతికున్నాడో, లేక ఈయన పేరున ఇంకోడెవడో తినేస్తున్నాడో అని తెలిసికునే కార్యక్రమంలో , ప్రతీ ఏడాదీ నవంబరు నెలలో ఈ పెన్షనిచ్చే చోటుకి వెళ్ళి ” నేను బతికే ఉన్నాను మహప్రభో ” అని విన్నవించుకోవాల్సొచ్చేది. ప్రతీ సంవత్సరమూ నవంబరు నెలొచ్చిందంటే చాలు, దేశంలో ఉండే ఈ “ ప్రాణు” లందరూ, స్వంత ఊళ్ళకి బయలుదేరేవారు. మరి అక్కడేగా వీళ్ళ పెన్షన్ దొరికేదీ? అసలు ఈ నవంబర్ ముహూర్తం ఎక్కణ్ణించివచ్చిందా అని బుర్ర పగలుకొట్టునేవాడిని. అప్పుడు తట్టింది- ఆ బ్రిటిష్ వాళ్ళకి, డిశంబరు లో క్రిస్మసూ అవీ ఉంటాయీ, శలవలూ హడావిడీ, తరువాత కొత్త సంవత్సర వేడుకలూ అవీనూ, నవంబరైతే శ్రేష్టఃమూ అనుకున్నట్టున్నారు. ఏదో మొత్తానికి ఆ పధ్ధతే మనవాళ్ళూ కంటిన్యూ చేసేశారు. ఆ నవంబరు నెలలో పడే పాట్లు నేను ఇదివరకెప్పుడో ఓ టపా లో వ్రాశాను.అందులో వ్రాసింది ఏదో అతిశయోక్తిగా వ్రాసింది కాదు. అనుభవం మీదే వ్రాసింది, నేనూ పెన్షనరేగా మరి.

   ఉద్యోగంలో ఉన్నంతకాలం జనాలు నీరాజనాలు పట్టేవారు. ఎంతైనా ప్రభుత్వోద్యోగం కదా! రాజకీయనాయకులకి కూడా వీరి అవసరం ఉండేది. ఉద్యోగంలోంచి రిటైరవడం తరవాయి, వీళ్ళ మొహం చూసేవాడూ లేడూ, పట్టించుకునేవాడూ లేడూ. ఏదో భుక్తి పడేస్తున్నాంగా..పైగా పనీపాటాకూడా లేదూ అని ఒకటీ.నవంబరొచ్చిందంటే చాలు, బ్యాంకుల్లో ఈ ” బతికేఉన్నాం మహాప్రభో” అని విన్నవించుకోడానికి వచ్చే వారి క్యూ చూస్తే బాధవేస్తుంది. ఒక్కరూ రాలేరూ, కొడుకునో, కూతురినో తోడు తెచ్చుకోపోతే పనవదు.వాళ్ళకి శలవు దొరకాలి, వారం వర్జ్యం కలిసిరావాలి.. ఎంత తతంగం.. ఆ క్యూలో అంతంతసేపు తిండీ తిప్పలూ లేకుండా నుంచుంటే ఈయనకేమైనా జరిగితే ఎవడు చూస్తాడూ? అలాగని నవంబరు నెలలో బతికున్నట్టు సంతకం పెట్టకపోతే, పై నెల పెన్షన్ రాదూ.. పైగా ఈ పెన్షన్ మీదే బతికే వారు చాలామందాయె. పోనీ అలాగని ఈ బ్యాంకులవాళ్ళు ఏమైనా విశాలహృదయులా అంటే అదీ లేదూ, ఒకే ఒక్క కౌంటరూ, ఆయనగారిఎదురుగా, ఆపసోపాలు పడుతూ కొల్లేరుచాంతాడులాటి క్యూలూ.. అడక్కండి, ఎద్దు పుండు ఎద్దుకే అన్నట్టు, అక్కడ పడే పాట్లు పెన్షనర్లకే తెలుసు. పైగా రైల్వే రిజర్వేషన్ లో లాగ ఇక్కడ సీనియర్ సిటిజెన్లకి ప్రత్యేక క్యూలు కూడా ఉండవు. మరి అందరూ “ఒకే జాతి పక్షులు “ గా ! వెళ్ళినవాడి అదృష్టం బాగుంటే, మధ్యాన్నం మాటెలా ఉన్నా, సాయంత్రం భోజనానికి కొంపకు చేరే అవకాశం ఉంది.

   గత పదేళ్ళగా వెళ్తున్నాను, ప్రతీ సంవత్సరమూ ఏదో ఒక గొడవే.. ఓసారి మనం నింపిన ఫారం సరీగ్గా లేదనేవాడు, ఇంకోసారి ఎకౌంటు నెంబరు సరీగ్గా లేదంటాడు ( చిత్రం ఏమిటంటే పాస్ బుక్కులో వాళ్ళు వేసిన నెంబరే ! ) అడక్కండి, కొద్దో గొప్పో వానాకాలపు చదువులు చదివిన నాలాటికే ఇలాటి కష్టాలొచ్చాయంటే, ” వేలిముద్రల ” వారి గతేమిటీ? అదృష్టం బాగుండి, ఈ ఏడాదీ, గతేడాదీ ఏదో తెలిసినవారుండబట్టి పని కానిచ్చేశాను. వచ్చే ఏడుండొద్దూ వాళ్ళూ? ఒకాయన రిటైరవుతారుట, ఇంకొకాయన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారుట. “దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళ వాన ” లాగ, వచ్చే ఏడాది ఇంకోళ్ళని పరిచయం చేసికోవాలిరా భగవంతుడా అనుకున్నాను.

   రోజులన్నీ ఓలాగే ఉండవుగా, ఎప్పుడో అప్పుడు బాగుపడతాయి అనే అనుకోవాలి మరి. ఆ సందర్భంలోనే నరేంద్ర మోదీగారు “అచ్చే దిన్ ” అంటూ రంగంలోకి వచ్చారు.మిగిన విషయాలు ఎలా ఉన్నా, ఈ పెన్షనర్లకి మాత్రం మొత్తానికి ” అచ్చే దిన్ “ వచ్చినట్టే. ప్రతీ ఏడూ నవంబరులో వెళ్ళి బ్యాంకుల్లోనూ, ట్రెజరీల్లోనూ ఆపసోపాలు పడఖ్ఖర్లేకుండా మొత్తానికి, పధ్ధతిని మార్చారు. వివరాలు ఇక్కడ చదవండి.. దేశం మొత్తంమీద అందరు పెన్షనర్లందరికీ ఎలా వీలౌతుందీ అనకండి. e-seva లో ప్రారంభిస్తే అదే వీలవుతుంది. ఆ బ్యాంకుల్లో నుంచోవాల్సిన అవసరం లేకుండా, ఓ పదో పాతికో చెల్లించేసి ” బతికుండడం “ more economical కదూ.. ఈ విషయంలో మాత్రం మోదీ జిందాబాద్...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు — ఏదైనా సరే ఎక్కువైతే మొహం మొత్తుతుంది….

    తినే పదార్ధమైనా సరే, చూసేదైనా సరే, వినేదైనా సరే అప్పుడప్పుడైతే ఫరవా లేదు కానీ, అంతం లేకుండా భరించడం కొంతవరకూ కష్టమే అని నా అభిప్రాయం. కొత్తలో బాగానే ఉంటుంది, రానురానూ విసుగు పుడుతుంది.దేంట్లోనైనా వెరైటీ ఉంటేనే బాగుంటుంది. అలా అంటే, ప్రతీ రోజూ చూస్తున్నారుకదా, కట్టుకున్నవాళ్ళకీ ఇదే రూలా అని between the lines పరీక్షలు పెట్టకండి. వాళ్ళు వేరూ, నేచెప్పిన విషయాలు వేరూ. అలా అంటే మళ్ళీ double standards అంటారు, నాకు తెలుసు. అయినా తిన్న తిండరక్క ఇలాటి topic మీద వ్రాయడం నాదే తప్పు, సరేనండీ ఒప్పుకుంటాను. కానీ ముందుగా నేను వ్రాసేది ఆలోచించండి.మొదటి లైనులో నేను వ్రాసిన వాటి గురించి ఒప్పుకుంటారా లేదా? నాకు తెలుసు ఒప్పుకుంటారని, బయటకి చెప్పుకోడానికి మొహమ్మాటం, ఎందుకంటే సొసైటీలో ఎవరైనా వెలేస్తారేమో అని భయం ! తినడానికి రుచికరంగా ఉంటుందికదా అని ఏ పదార్ధమైనా “అతి” గా లాగిస్తే భరించగలమంటారా?

    ఉదాహరణకి టీవీల్లో వచ్చే ప్రకటనలే తీసికోండి.. ఓ సినిమా వచ్చినా, ఇంకో క్రికెట్ మాచ్ ( నేను చూడననుకోండి) వచ్చినా, ఒకే యాడ్డు ఓ పాతిక సార్లైనా చూపించి మన ప్రాణం తీస్తారు. చివరకి ఎక్కడిదాకా వస్తుందంటే, వాళ్ళు చూపిస్తూన్న ప్రకటనలో వస్తువు అసలు కొనకూడదనేదాకా.. అంత వెగటు పుడుతుంది. అయినా, ఆ చానెళ్ళవాళ్ళు ఈ ప్రకటనలమీదేకదా బ్రతుకుతూన్నారూ అంటారు, అవునండీ నిజమే కాదనడంలేదు,కానీ వాళ్ళు చూపించే పధ్ధతి ఓ negative ప్రకంపనలగా మారడంలేదూ?

    ఈటీవీ వారు అప్పుడెప్పుడో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, “స్వరాభిషేకం ” అని. మొదట్లో బాగానే ఉండేది. చలనచిత్ర రంగానికి సంబంధించిన అతిరథమహారథులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చి, ( అందులో కూడా కొందరు boycott చేశారనుకోండి, ఆ విషయం పక్కకుపెడదాం), నేపథ్యగాయకులందరిచేతా, అలనాటి ఆణిముత్యాలని పాడించడం అదో అలౌకికానందంగా అనిపించింది.అయిదారువారాలపాటు, ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, టీవీ ముందర హాజరు ! ఒక్కో గాయకుడు, గాయని పాడుతూంటే అలా..అలా..పాతరోజుల్లోకి తీసికెళ్ళిపోయారు. దానికి సాయం ఆ కార్యక్రమానికి యాంకరింగు కూడా చాలా బాగుంది. అంతవరకూ బాగానే ఉంది.కానీ అదే కార్యక్రమాన్ని “రూపం ” మార్చేసి, ప్రతీ ఆదివారంనాడూ చూపించడం భావ్యంగా ఉందంటారా?
ఆ విషయం పోనీ పక్కకుపెడదాం… ఇంక మిగిలిన చానెళ్ళలో ఏదో పేరుపెట్టి, ఆ గాయకులే, ఆ పాటలే మళ్ళీమళ్ళీ వినిపించడం. ఆనాటిపాటలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు, పాడినవారుకూడా చాలా బాగా పాడేరనడంలోనూ సందేహం లేదు, అలాగని “పాటలు” ఎంత “తీయగా పాడినా” మొహం మొత్తేస్తుందేమో. దీన్నే over exposure అంటారనుకుంటా.

    దేనికైనా ఓ వెరైటీ ఉంటే బాగుంటుందేమో కానీ, ఒకే కార్యక్రమాన్ని మనమీద రుద్దితే అన్యాయం కదూ…