బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–రిటైర్మెంట్ బ్లూస్

   మాకు ఇక్కడ పూణే లో ప్రస్తుతం ఏమీ పనులు లేవు. అందువలన ఏదో కాలక్షేపానికి స్నెహితులని కలుసుకోవడం లో గడుపుతున్నాము. ఆ సందర్భం లో ఈ వేళ నేను, నాకంటే రెండు సంవత్సరాలు ముందు రిటైర్ అయిన మా ఫ్రెండు ని కలుసుకున్నాను. ఈ మధ్యలో నా తరువాత రెటైర్ అయిన ఓ ఫ్రెండ్ ని, సాయంత్రం ఓ రెండేళ్ళలో రిటైర్ అయ్యే మా పాత కొలీగ్ నీ కలుసుకున్నాను. పొద్దుటనుండీ వాళ్ళతో నా అనుభవాలు పంచుకుందామని ఉంది.నేను రిటైరు అయ్యి నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది.

    రిటైరు అయ్యేనాటికి, పిల్లల పెళ్ళిళ్ళూ ( కొడుకు అయినా, కూతురు అయినా ) అవీ అయిపోతే సమస్యే ఉండదు.లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళూ అన్నీ అయేసరికి ఇంకా ఓ నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. అప్పటి దాకా ఏదో రకమైన ఒత్తిడి లోనే ఉంటాము.మన బాధ్యతల నుండి తప్పించుకోలేము కదా.అంటే 35-40 ఏళ్ళు సర్వీసు లో ఉండి ఏదో రెస్ట్ తీసికోవచ్చనే మన కలలు కలగానే మిగిలిపోతాయి.సర్వీసు లో ఉన్నంత కాలం గవర్నమెంట్ క్వార్టర్స్ లోనే మా జీవితం గడిచిపోయింది. అదృష్టం ఉన్నవాళ్ళు, బాగా ప్లాన్ చేసి ఓ ఇల్లు నిలపెట్టుకుంటారు. దానిలో భార్యా, భర్తా పెన్షన్ తో ( ఆరవ వేతన కమిషన్ ధర్మమా అని బాగానే ఉంది ) హాయిగా గడిపేయ వచ్చు. మన అవసరాలు కూడా చాలా లిమిటెడ్ గానే ఉంటాయి. కొంతమందికైతే ఆరోగ్యరీత్యా తినే తిండి లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.ఎవరి అదృష్టాన్ని బట్టి ఎలా రాసిపెడితే అలా ఉంటారు.

    నేను అర్ధం చేసికొన్నదేమంటే, మన జీవితం మన మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. ఈ వేళ మా ఫ్రెండ్స్ ని చూసిన తరువాత తేలిందేమిటంటే, మనం సమస్య లకి భయ పడి వాటికి దూరంగా పారిపోవాలనుకుంటే, అవి మనని ఇంకా భయ పెట్టి ఓ “డిప్రెషన్” లోకి తీసుకుపోతాయి. ఇన్నేళ్ళు జీవితం లాక్కొచ్చేము కదా ఇంకా ఎవరిని చూసి, ఏం చూసి భయ పడాలి?
భగవంతుని దయ వలన మన ఆరోగ్యం బాగా ఉంటే చాలు (చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి ), మేజర్ రోగాలుండకుండా చూసుకోవాలి.ఇవన్నీ చెప్పడం సులభమే అనొచ్చు.గవర్నమెంట్ సర్వీసు లో ఉన్న మాలాంటి మధ్య తరగతి ఉద్యోగుల గురించి మాత్రమే ఈ బ్లాగ్. పెద్ద పెద్ద ఆఫీసర్ కేడర్ లో రిటైర్ అయిన వాళ్ళు బాగానే ఉంటారు. పైగా రిటైర్ అయిన తరువాత ఏదో ఒక
ప్రైవేటు కంపెనీ ( ఉద్యోగం లొ ఉన్నప్పుడున్న పరిచయాల మూలంగా ) లో ఏదో కన్సల్టెంట్ గా చేరుతారు.మనం ఏదైనా అడుగుతే ” జుస్ట్ ఫర్ టైం పాస్ ” అంటారు. అంత హిపోక్రసీ ఎందుకో నాకు తెలియదు.మా కజిన్ ఒకడున్నాడు స్వతహాగా చాలా డబ్బున్నవాడు– అయినా సరే ఎంత దూరమైనా ఎక్కడైనా సరే వాళ్ళిచ్చే డబ్బు సరీగ్గా ఉంటే ఉద్యోగం లో చేరిపోతాడు.అతనికి టైం పాస్ అవడానికి మార్గాలేలేవా? అదంతే. ఈ డబ్బు సంపాదనకి అంతు లేదా? మనతో తీసికెళ్ళం. పోనీ మన పిల్లలేమైనా మననుండి ఆశిస్తారా, అదీలేదు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకూ, మా కొలీగ్స్ అందరి పిల్లలూ భగవంతుని దయ వలన బాగానే పైకి వచ్చారు. కొంతమందనొచ్చు డబ్బంటే చేదా అని. దానికీ ఒక లిమిట్ ఉండాలి కదండీ. మనకి సంతృప్తి అనేది ఒకటుండాలి. లేకపోతే ఈ పరుగుకి అంతుండదు.

    ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను ఈవేళ కలుసుకున్న వాళ్ళలో ఒకరి అబ్బాయి పెళ్ళి అవాలి, ఇంకొకడు తన పెన్షన్ వ్య్వవహారం లో ఏదో తేడా వచ్చిందిట, దానిగురించి చెప్పాడు ఇంకొకడు
తను ఇంకా ఇల్లు కొనుక్కోలేదనీ, ఏడాది తరువాత ఏంచేయాలో తెలియడం లేదనీ గోల పెట్టాడు.పొద్దుటనుండీ ఇవన్నీ విని విని నాకు ఎప్పుడూ లేనిది డిప్రెషన్ వచ్చేసింది.ఇలా కాదని, మాకు దగ్గరలోనే ఉన్న మా ఫాక్టరీ క్వార్టర్స్ కి వెళ్ళాను.అక్కడ నాతో పనిచేసిన ఓ ముగ్గురు కుర్రాళ్ళు కనిపించారు. నన్ను చూడగానే ” బాస్ మీరు రిటైర్ అయి నాలుగేళ్ళయ్యిందంటే నమ్మ బుధ్ధి కావడంలేదు, ఆఫీసులో పని చేసేటప్పుడూ ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, ఉండేవాడివి, ఇప్పుడూ అలాగే ఉన్నావూ”, చాలా సంతోషం వేసింది. మేము మాట్లాడుతూంటే ఇంకో నలుగురు పలకరించారు, వాళ్ళూ ఇదే మాట.నేనన్నానూ, నాకూ సమస్యలున్నాయీ, కానీ నేను దేనికీ భయపడలేదు ఎప్పుడూ.అస్తమానూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుందని ఎవరో చెప్పారు
అందువల్ల నవ్వుతూనే ఉంటాను.. పళ్ళు లేకపోవడం వల్ల మొహం కొంచెం క్యూట్ గా కనిపిస్తుందీ
అన్నాను.మనమీద మనం జోక్ వేసికొని ఇతరులని నవ్వించకలిగితే మనకి ఎదురుండదు.మా చిన్నప్పుడు రిటైర్ అయ్యేరంటే వాళ్ళని అందరూ తాత గారనేవారు, మరీ 58 ఏళ్ళకే ముసలాడు అనడం బాగుండదేమో నని నా అభిప్రాయం. ముసలాడిని ముసలాడనడం తప్పా అంటారు, మన మిత్రులు కొంతమంది. ఒకటి చెప్పండి, వీళ్ళు మీకు ఏమి తక్కువా? ఒక విషయం మర్చిపోతున్నారు-రిటైర్ అయిన వాళ్ళు, తమ విధులన్నీ నిర్వర్తించి,-ప్రభుత్వానికీ, కుటుంబానికీ-
ఇప్పుడు, వాళ్ళు వేసిన విత్తనాలు పెరిగి, ఫలిస్తుంటే చూసి సంతోషిస్తారు కానీ ,మీకు ఏలాటి కాంప్టీషన్ గా లేరుకదా.

    ఏదో రోగం వచ్చి మంచం పడితే, ఎలాగూ మీకు వాళ్ళతో మాట్లాడడానికి టైముండదు.. అలాగని మూల పడేస్తారనికాదు, ఒకలా చూస్తే, మా రోజులకంటే, ఇప్పుడే పిల్లలు వాళ్ళ తల్లితండ్రుల గురించి శ్రధ్ధ తీసికుంటున్నారనిపిస్తుంది.అంత మంచి గుణాలున్నవాళ్ళు, ఎంతమంది వాళ్ళ తల్లితండ్రులతో క్వాలిటీ టైము గడుపుతున్నారూ, ఒక్కసారి ఆలోచించండి.పొద్దుటనుండీ సాయంత్రం దాకా ఖబుర్లు చెప్పమనడం లేదు. సాయంత్రం ఆఫీసునుండి రాగానే ‘ హాయ్ ” అంటే ఆ ” ముసలి” ( మీ భాషలో ) తండ్రి ఎంత సంతోషిస్తాడూ.

    సాయంత్రం అయేసరికి రిటైర్ అయిన ప్రతీ వాడూ ఒకచోట కలుసుకుంటూంటారు. అక్కడ ఖబుర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. అందుకనే నేను వీలున్నంతవరకూ అలాంటి చోటకి వెళ్ళను. మన సమస్యలే కాకుండా ఊళ్ళో వాళ్ళ సమస్యలుకూడా ఎందుకూ మనకి? మనం చేసేది ఏమీ లేదు, మనం అర్చేవాళ్ళమూ కాదు , తీర్చేవాళ్ళమూ కాదు
నాకు రిటైర్ అయి నాలుగున్నరేళ్ళు అయిందనిపించదు. ఇంకా సర్వీసులో ఉన్నట్లే అనిపిస్తుంది.నా పాలసీ ఒకటే– జరిగిపోయినదానిని గురించి ఆలోచించను, జరగబోయేదాని గురించి భయ పడను– ఎందుకంటే అది మనచేతిలో లేదు. ఈవేళ ఎలా ఉన్నావూ అనేదే . ” అప్నా హాథ్ జగన్నాథ్”. అయితే దీని కన్నింటికీ మన సహధర్మచారిణి సహకారం ఉండాలి. ఆ విషయం లో నేను చాలా అదృష్టవంతుడిని. ” మే గాడ్ బ్లెస్ హెర్ “.

%d bloggers like this: