బాతాఖానీ–తెరవెనుక( లక్ష్మిఫణి) ఖబుర్లు–మొహమ్మాటాలు

మామూలుగా మనం, పరిచయం ఉన్నవాళ్ళింటికి ఎప్పుడో ఒకసారి వెళ్తాము.అది, కొంచెం పరిఛయమైనా సరే, గాఢ పరిచయమైనా సరే.

రాకపోకలు ఉంటేనే కదా మన స్నేహం వృధ్ధి చెందేది.మొదటిసారి ఎవరింటికైనా వెళ్ళేం అనుకోండి, ముందుగా హల్లో లతో ప్రారంభం అవుతుంది, ఆఫీసు లో అతనితో పరిచయం ఉంటుంది,

అందువలన ఒకరితో ఒకరికి పరిచయాలు పూర్తి అయిన తరువాత అస్సలు సంగతి ప్రారంభం అవుతుంది. వాళ్ళింట్లో ఆ మధ్యనే వారి కొడుకుదో, కూతురిదో పెళ్ళి అయిఉంటుందనుకొందాం,

ఇక్కడ ఆ వచ్చిన వాళ్ళ పని అయిపోతుంది. పెళ్ళి ఆల్బం తో ప్రారంభం అవుతుంది, అవి కూడా రెండు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సైజు లో ఉన్నవి, ఆ వచ్చిన వారి చేతిలో పెట్టేసి చూస్తూ

ఉండమంటారు. మనచేతి లో పెట్టి భార్యా భర్తలిద్దరూ కిచెన్ లోకో మరెక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలుసు, ఈ ఆల్బం లు చూడడానికి కనీసం గంటైనా పడుతుందని. ఈ లోపులో వాళ్ళు

ఏదైనా తయారుచేసికోవడానికి కావలిసినంత టైము దొరుకుతుంది.ఉప్మా ఓ, లేక ఇంకోటో.

ఇక్కడ హాల్లో మన శిక్షాకాలం ప్రారంభం అవుతుంది.మధ్య మధ్య లో ఓ చూపు విసిరి, మనం శ్రధ్ధగా చూస్తున్నామా లేదా అని ఓ లుక్ వేస్తారు

ఆ ఫొటోల్లో ఉన్నవాళ్ళెవరూ మనకి తెలియదు. ఇంటి పెద్దమనిషి, మనని ఒక్కరినీ వదలడం బాగా ఉండదని, మనతో హాల్లో కూచుంటాడు. ఏదో మనకి ఆసక్తి ఉన్నట్లుగా, ఫొటోలో ఎవరినో

చూపించి వారెవరూ అని అడగండి–ఆయనా అని ఏదో గుర్తు చేసికోవడానికి విఫల ప్రయత్నం చేస్తాడు. మా అవిడని అడిగితే తెలుస్తుందండి, వాళ్ళవైపు వాడే. మన ప్రాణానికి ఎవరైనా

ఒక్కటే. ఇలా ఈ డ్రామా, ఇంటావిడ టిఫినీలు తయారుచేసేదాకా సాగుతుంది.ఆవిడ చేతులు కడుక్కుని, చీర చెంగుకి తుడుచుకుంటూ, ఇక్కడ సీన్ లోకి వస్తుంది. అప్పుడు ఇంటాయనకి

మన దురదృష్టంకొద్దీ, మనం ఆయనని అడిగిన సందేహం గుర్తుకు వస్తుంది.మనం అయితే మొగవారిగురించి, మనవాళ్ళైతే ఆడవారిని గురించీ ఏదో రాండం గా అడుగుతాము.ఇంక ఇంటావిడ

ఆ అడిగినావిడ గురించి వివరాలు చెప్తుంది– ఆవిడ మా పిన్నత్తగారి, ఆడపడుచు మరిది పెళ్ళాం–అని.వాళ్ళెవరైతే మనకెందుకు, ఆర్చేవారా తీర్చేవారా.అయినా అదో మొహమ్మాటం.

ఈ కొస్చన్ ఆన్సర్ సెషన్ పూర్తి అవడానికి చెప్పానుగా ఓ గంట పడుతుంది. అప్పుడు కానీ ” పనికి ఆహారం స్కీం ” లో లాగ, మనకి తిండానికి

పెట్టరు.ఇంటావిడ మొహం నిండా నవ్వు పులుముకొని ఎప్పుడైనా వస్తూండండి అని టాటా చెప్తుంది.మనరోజు బాగుండకపోతే వాళ్ళింట్లో ఆ పెళ్ళికి సంబంధించిన సీ.డీ కూడా ఉంటే ఇంక

” అవర్ డే ఈజ్ మేడ్ ” అంతే సంగతులు !!

మా ముందు తరం వాళ్ళైతే, పెళ్ళి అయిన తరువాత, వధూవరులిద్దరూ మెడలో కర్పూరం దండలతో ఫొటో కి దిగేవారు. మన చుట్టాలిళ్ళల్లో అందరికి

ఫ్రేం కట్టీచ్చేవారు.అందుకనే ఒకే ఫొటో అందరి ఇళ్ళల్లోనూ ప్రామినెంట్ గా కనిపించేది. మా రోజులు వచ్చేటప్పడికి, ఏదో పీటలమీద కూర్చున్నప్పుడూ, మంగళసూత్రం కడుతున్నప్పుడూ

ఫొటో తీసేవారు. అందులో పెళ్ళికొడుకు తల్లి తండ్రులు కనిపించేవారు కాదు. ఆరోజుల్లో పెళ్ళిళ్ళకి రిజిస్ట్రేషన్ లూ గట్రా ఉండేవి కాదు, అందుకని సాక్ష్యం గా ఈ ఫొటోలు అన్నమాట.

మా పెళ్ళి అన్నవరం లో జరిగింది. అక్కడ ఇంకో పెళ్ళికోసం, ఓ ఫొటోగ్రాఫర్ ( తణుకు వాడు ) వస్తే, అతన్ని కాళ్ళావేళ్ళ పడి మాకు ఫొటో తీయించారు. నాకు ఒక విషయం

అర్ధం అవదు. మంగళసూత్రం కడుతున్నప్పుడు కెమేరా వైపు చూస్తూ మెడలో మూడు ముళ్ళూ ఎలా వేయడం వీలౌతుందీ అని.ఆ రోజుల్లోని ఏ ఫొటో అయినా చూడండి, మీకే అర్ధం

అవుతుంది. పెళ్ళికూతురి తల్లి జడ పైకి ఎత్తి పట్టుకుంటుంది, మనవాడేమో కెమేరాకి పోజు కొడుతూ తాళి కట్టేస్తాడు. రెండే ఫొటోలు శాంక్షన్.

ఈ రోజుల్లో అమ్మో ఎన్ని ఫొటోలో, వీడియోలో, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతీ వాడితోనూ ఓ గ్రూప్ ఫొటో దిగాల్సిందే. ఆ వధూ వరుల ఓపికని మెచ్చుకోవాలి

ఈ మధ్యన జీలకర్ర బెల్లం కార్యక్రమానికి ముందే ఈ రెసెప్షన్లూ అవీ అయిపోతున్నాయి.పెళ్ళికి ముందరే, ఆ పిల్లతో అంత సేపు గడపొచ్చనే బోనస్ తో ఆ ఓర్పు వచ్చేస్తుందేమో!!

ఈ ఫొటో సెషన్ల ఫలితమే నేను పైన చెప్పిన హింసా కాండ కి నాంది !!!

%d bloggers like this: