నెను నంబర్లు ఇవ్వడం లో కొంచెం గడబిడ అయ్యింది. నిన్న వ్రాసినదానికి 35 బదులుగా 36 అని వేశాను. క్షంతవ్యుడిని. మళ్ళీ ఏ, బి అనకుండా ఇవాళ్టిదానికి 35 నంబర్ వెసేశాను. ప్లీజ్ బేర్ విత్ మి.
చెప్పానుగా మా అబ్బాయి కి క్రికెట్ మీద చాలా ఇష్టం. ఎవరూలేకపోయినా ఒక్కడూ గోడకి బాలు వేసి ( స్క్వాష్ లో లాగ ) ఆడుకొనేవాడు. వీడి దుస్థితి భరించలేక రోడ్ మీద వెళ్ళేవాళ్ళందరూ, కొంచెంసేపు ఆగి వాడితో ఆడేవాళ్ళు. !! ఎప్పుడు చదివేవాడో తెలియదు, నేను ఎప్పుడు చూసినా చేతిలో బాటూ,బాలూ లేకపోతే ఏదొ మెగజీన్ తో కనిపించేవాడు. ఏమైనా అడిగితే నన్ను చెప్పమంటాడో అని నా బెంగ !! ఒకసారి ,మా ఇంటావిడ చెప్పింది– రోజూ స్కూల్ నుండి రాగానే, ముందుగా హోం వర్కూ, ఆ తరువాత ఆరోజు దీ, మర్నాడు చెప్పబోయేదీ చదివేసుకొనేవాడుట. ఇలాంటి నిలకడ ఉండి ఉంటే నెనూ ఏదో కొంచమైనా పై చదువులకి వెళ్ళేవాడిని గా అనుకొనేవాడిని. అదైనా మూమెంటరీ గా మాత్రమే !!. వాడికి ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళ అక్కనే అడిగేవాడు. నా అనుమానం ఏమిటంటే తనే చెప్పి ఉంటుంది– ఊరికే డాడీ ని అడిగి తనకు టెన్షన్ పెట్టకూ అని– మే గాడ్ బ్లెస్ దెమ్ !!
స్కూల్లో న్యూస్ చదవడానికి వాడు ఎప్పుడూ స్పోర్ట్స్ న్యూస్ ఎన్నుకొనేవాడు. రాత్రి 11.15 కి “స్పోర్ట్స్ రౌండ్ అప్ ” అని వచ్చేది బి.బి.సి లో, అది విని రాసిఉంచేవాడిని. అప్పటికి మా హీరో పడుక్కొనేవాడు. పొద్దున్నే లేచి ఒకసారి చూసుకొని వెళ్ళిపోయేవాడు.
కొత్తగా వచ్చిన డాక్టర్ గారు మా అబ్బాయి తో చాలా టైము గడిపేవారు.ఇప్పటికీ ఆయనతో ఆ అనుబంధం అలాగే ఉంది. ఏవేవో ఎలెక్ట్రానిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు, వాళ్ళింటికీ మా ఇంటికీ మధ్య ఓ టెలిఫోన్ పెట్టాడు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకమే . వాడు చూసిన సినిమా లన్నీ మా క్లబ్ లో ఒపెన్ లోనే చూశాడు. ఒకసారి శలవలకి తణుకు లో ఓ సినిమా కి వెళ్తే వాడి చిన్ని బుర్రలో ” అరే ఇక్కడ సినిమాలు బయట వెయ్యరా, లోపలే చూడాలా ” అని అనుమానం వచ్చింది. ఇదెందుకు చెప్పేనంటే వాడు పెరిగిన పరిసరాలూ, ఎంత గ్రామీణమైనవో అని చెప్పడానికి. ఎల్.కే.జీ నుండి క్లాస్ 12 దాకా అలాంటి ఊళ్ళో చదివిన వాడు, ఆ తరువాత పూణే లాంటి మహానగరానికి వెళ్ళి ఎలా నెగ్గుకు వచ్చేడో వాడికీ, ఆ భగవంతుడికీ తెలియాలి !!
మా అమ్మాయి పధ్ధతి ఒకలాగా, వీడి పధ్ధతి ఒకలాగా ఉండేది.. అమ్మాయి తను ఓ వృత్తం గీసికొని దానిలోకి ఎవరినీ రానిచ్చేది కాదు ( మమ్మల్ని తప్పించి ),స్కూల్లో పాటలూ, మిగిలిన కల్చరల్ ఏక్టివిటీస్ లో ఇంకెవరూ ఫస్ట్ రాకూడదు. నా చేత ఫిలిప్స్ టేప్ రికార్డర్ ( పడుక్కునేది–హారిజాంటల్ టైపు అన్నమాట ) ఒకటి కొనిపించి అనూప్ జలోఠా పాటలు అన్నీ నేర్చుకొనేది, కాంపిటీషన్ లో అచ్చం ఆయన లాగే పాడి, ప్రైజ్ తెచ్చేసుకొనేది. ఒక సారి క్లబ్ ఆనివర్సరీ కి మొత్తం 14 భాషలలోనూ పాడి అందరి ప్రశంసలూ పొందింది.ఒకసారి ఆల్ ఇండియా రేడియో జలగామ్ కి వెళ్ళి వాళ్ళ స్కూల్ తరఫున పాటలు పాడింది.. తన నోట్స్ లు ఏమీ ఎవరినీ చూడనిచ్చేది కాదు. తన పధ్ధతి లో తనే రాసుకునేది.. మా ఇంటికి ఎదురుగానే స్కూల్ ఉండేది, ఇంటర్వెల్ లో ఇంటికి వచ్చేది,
ఓ సారి అనుమానం వేసింది తను లేనప్పుడు తన నోట్స్ ఎవరో చూస్తున్నారేమో అని. అంతే పధ్ధతి మార్చేసింది, రెండు రకాల నోట్స్లు తయారుచేసికోవడం!! వీళ్ళ క్లాసులో కొత్తగా ఓ అబ్బాయి వచ్చేడు– వీళ్ళిద్దరికీ మార్కులలో పోటీ ఉండేది. అన్నింట్లోనూ మా అమ్మాయికి ఎక్కువే వచ్చేవి, కానీ 10 వ తరగతి బోర్డ్ పరీక్షల్లో
మా అమ్మాయికి మాథ్స్ 99 వచ్చేయి, ఆ అబ్బాయి కి 100/100 వచ్చేయి !! దానికి జీవితంలో తీరని కోరిక అదొకటి !!
ఇంక మా అబ్బాయి పరోపకారి పాపయ్య. స్కూల్లో ఎవరైనా నోట్స్ అడిగితే పాపం , ఇచ్చెసి వచ్చేవాడు. మర్నాడు పరీక్ష అయినా సరే. ఏదో పేపర్లు దిద్దేటప్పుడు టీచర్లు మర్చిపోయి ఓ రెండు ,మూడు మార్కులు ఎక్కువ వేస్తే, నిజాయితీగా వెళ్ళి ఆ మార్కులు సరి చేయించుకొనేవాడు. ఒకసారి మార్కెట్ కెళ్తే
అక్కడ వీడికి తెలిసింది–మర్నాడు రాయ వలసిన పేపర్ లీక్ అయిందని– అంతే ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి ఆ పేపర్ మార్పించేశాడు!!
పరీక్ష రాసి వచ్చిన తరువాత మా అమ్మాయిని అడిగితే, ఎప్పుడూ ఏదో రాసేనులే అనేది, అన్నింటికీ అనుమానాలే ఏదో ఓ ప్రశ్నకి సమాధానం సరిగ్గా రాయలేక పోయానేమో అని రిజల్ట్ వచ్చేదాకా అందరికీ టెన్షన్ పెట్టేది– ఉత్త అనుమానం పక్షి !! అయినా ఎల్.కే.జీ నుండి క్లాస్ 12 దాకా స్కూల్ ఫస్టే.
ఇంక మా చిరంజీవిని అడగాలంటే భయం !! ఏం చెప్తాడో అని ఒక్కటి మాత్రం ఉండేది– తనకొచ్చే మార్కులు ఖచ్చితంగా చెప్పేవాడు, అలాగే వచ్చేవి. వాడు కూడా వాళ్ళ అక్క లాగ క్లాస్ 12 దాకా క్లాస్/ స్కూల్ ఫస్టే వచ్చాడు!! పోన్లెండి దేముడి దయ వలన, మా ఇంటావిడ తీసికొన్న శ్రధ్ధ వలనా, నా పోలికలు రాలెదనుకుంటూ ఉంటాను.
” భారతీయుడు ” లో ఓల్డ్ కమల్ హాసన్ లాంటివాడు. అర్ధం అయిందిగా. ఇప్పటికీ ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే పూర్తి డబ్బు కట్టేసి రసీదు ఇమ్మంటాడు. ఎవరికైనా కష్టం వస్తే ముందుంటాడు. మా పాస్పోర్ట్ ల గురించి పోలీసు ఇంటికి ఎంక్వైరీ కి వచ్చినప్పుడు, ఆ పోలీసుకి ఏదైనా చాయ్ తాగడానికి ఇద్దామంటే, నామీదే కంప్లైంట్ ఇస్తాడేమో అని భయం. అందుకే ననుకుంటా పాస్ పోర్ట్ రావడానికి మాకు 9 నెలలు పట్టింది !!!
Filed under: Uncategorized | 5 Comments »