బాతాఖానీ-లక్ష్మిఫణిఖబుర్లు–మాతృదేవోభవ

సరీగ్గా రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు ( తిథుల ప్రకారం ) మా అమ్మగారు తన 95 వ ఏట స్వర్గస్థులైనారు. మాకు ఆవిడ చివరి 3 సంవత్సరాలూ సేవ చేసే అదృష్టం కలిగింది. అప్పటి దాకా ఆవిడ చాలా సంవత్సరాలు మా అన్నయ్యల దగ్గర ఎక్కువగా గడిపే వారు. మా చెల్లెలి దగ్గర కూడా కొంత సమయం గడిపారు. ప్రతీ సంవత్సరమూ ఓ రెండు నెలల పాటు మా దగ్గరకి వచ్చేవారు. వచ్చినప్పటినుంచీ, ఆవిడకు కాలక్షేపం లేక మన ప్రాంతాలకి వెళ్ళిపోతాననేవారు.

ఒకవిషయం మాత్రం చెప్పాలి– నన్ను ఎప్పుడూ మందలించిన జ్ఞాపకాలు లేవు.” ఏరా వెధవా ” అనికూడా ఎప్పుడూ అనలేదు. మరీ కోపం వచ్చినప్పుడు అదేదో  ” దొబ్బిడాయి ” అనే వారు. దానర్ధం ఇప్పటికీ నాకు తెలియదు. చిన్నప్పుడు ఆవిడతో పెరంటాలకి వెళ్ళిన గుర్తు. ఒకటి రెండు తీర్థయాత్రలకి ( అరసవిల్లి, శ్రీకూర్మం ) వెళ్ళాను.ఎడపిల్లాడిగా మా అమ్మగారి ఒడిలో కూర్చొని, మా చెల్లెలు పుట్టినప్పుడు పురిటి స్నానం చేయించారు. 60 సంవత్సరాలు జరిగిపోయినా ఇప్పటికీ గుర్తే.

ఆవిడకు వినిపించేది కాదు. ఏ కారణంవలనో ఆవిడకు చెవికి మిషన్ పెట్టించలేదు. అందువలన , ఆవిడ చెప్పేవి మేము వినడమే కానీ,మేము చెప్పేవి ( ఎప్పుడైనా విసుక్కున్నాకానీ ) ఆవిడకు వినిపించేవి కావు–అదృష్టంతురాలు !! నేను అమలాపురం లో ఉన్నన్నాళ్ళూ, మా ఇంటికి వచ్చే అతిథులకి మర్యాదలు చేయడం లోనే ఆవిడకు టైము గడిచిపోయేది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వండుతూనే కనిపించేవారు. ఆవిడ చేతి మీదుగా అంతమంది అన్నం తినడం వలనే  ఈ వేళ మేము  ఎటువంటి లోటూ లేకుండా  సుఖంగా ఉంటున్నామని నా నమ్మకం.

2003 వ సంవత్సరం లో మా చిన్నన్నయ్యగారు స్వర్గస్థులైన తరువాత, ఆవిడ మా దగ్గరకు పూణే వచ్చేశారు. అంతకుముందు ఒకసారి మా అబ్బాయితో అన్నారు ” నీకు పెళ్ళై ఓ పిల్ల పుట్టేదాకా నేను ఎక్కడికీ వెళ్ళను ” అని. ఓర్నాయనో అయితే ఇంకా చాలా కాలం ఉండాలి నువ్వు, అప్పటిదాకా నేను ఉండడం గారెంటీ లేదు అనేవాడిని !!

అదేం చిత్రమో ఆవిడ ఆశీర్వదించినట్లుగానే 2005 లో మా అబ్బాయి వివాహమూ జరిగింది,2006 లో వాడికి అమ్మాయి పుట్టింది, ఆ పాప మొదటి బర్త్ డే కి ముందరే ఆవిడ ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.

ఆవిడకు   చట్ట కి ( హిప్ బోన్ ) దెబ్బతగిలి,అదేదో రాడ్ వేశారు. రెండో సారి 2004 లో పూణే వచ్చేముందర మళ్ళీ విరిగింది. ఇంక ఆపరేషన్ చేయకూడదన్నారు. అందువలన అన్నీ మంచం మీదే జరిగేవి. అంత వయస్సు వచ్చినా ఆవిడకు బి.పి , సుగర్ లాంటి సమస్యలుండేవి కాదు. జ్ఞాపక శక్తి అద్భుతం. ఎప్పడెప్పడివో ( ఆవిడ పెళ్ళి దగ్గరనుంచీ ) ఖబుర్లు చెప్పేవారు. అన్నింట్లోకీ అద్భుతం ఏమంటే ఆవిడ తన రాలిపోయిన జుట్టుని, అదెదో నెట్ లాగ పేనుకొని అదే కట్టుకొనేవారు. చాలా కాలం వరకూ తెలుగు వార పత్రికలూ, పేపరూ చదివేవారు, దానిలో విషయాలు చర్చించడం ఒకటీ.

ఆవిడ పోవడానికి ముందు ఓ పదిహేను రోజులు, మా పనిపిల్ల ( ఆవిడ కి సంబంధించిన పనులన్నీ చేసేది ) శలవు పెట్టడంతో నేను ఆవిడను ఎత్తుకొని బాత్ రూం కి తీసికెళ్ళడం లాంటి పనులు చేసేవాడిని. మా ఇంటావిడైతే టైముకి ఆవిడకు అన్నీ అమర్చేది. ఒకానొక టైములో మా ఇంట్లో

95 ఏళ్ళ మనిషి దగ్గరనుంచి, నెలల పాప దాకా అందరూ ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి, మా పిల్లలు ఆఫీస్ నుండి రావడం, మా ఇంకో మనవరాలు స్కూల్ బస్సు మా ఇంటిదగ్గరే దిగడం, దానిని తీసుకోవడానికి మా అమ్మాయి మా మనవడితో రావడం. ఇల్లంతా అదేదో ” డే కేర్ సెంటర్” లాగ ఉండేది !!

ఓ వారం రోజులు ముందునుంచీ ఆహారం తినడం పూర్తిగా మానేశారు. డాక్టర్కి చూపిస్తే అన్నీ చెక్ చేసి, ఫాకల్టీలు అన్నీ బాగానే ఉన్నాయీ, మనం బలవంతంగా ఏమీ ఇవ్వలేము అన్నారు. పోయేముందు మా డాక్టర్ శ్రీదేష్పాండే గారుకూడా పరీక్షించి ఏమీ ఫర్వాలేదన్నారు.

ఎందుకో కారణం చెప్పలేను కానీ పోయేముందు ఆదివారం, మా అబ్బాయీ, కోడలూ ఘంటసాల గారి భగవద్గీత సి.డి. పెట్టారు ఆరోజంతా అబ్బాయీ, కోడలూ, మా ఇంటావిడా ఆవిడ దగ్గరే గడిపారు.  తెల్లవారుఝాము 4.00 గంటల దాకా ఆవిడ పక్కనే ఉండి, కొంచెం కునుకు పట్టితే, మా ఇంటావిడని లేపి కూర్చోపెట్టాను. సోమవారం ఉదయం 6.00 గంటలకు ప్రశాంతంగా మా ఇంటావిడ చేయి పట్టుకునే నిద్ర లోనే కన్ను మూశారు.

మనకి ఎంత వయస్సు వచ్చినా అమ్మ అమ్మే. ఇంకెవరూ ఆ స్థానాన్ని పూడ్చలేరు.అమ్మే లేకపోతే మనకి అస్థిత్వమే లేదు కదా. చేయవల్సినంత చేయకలిగామా అని అనుకుంటూ ఉంటాను. అయినా ఇప్పుడేమీ చేయలేము కదా !!

%d bloggers like this: