బాతాఖానీ –తెరవెనుక (లక్ష్మిఫణి ) ఖబుర్లు

                                                            నాకు చిన్నప్పుడు హైస్కూల్ చదువు, కాలెజీ చదువు కూడా ఇంటి నుండే జరిగింది. అదీ కాక అమలాపురం లో పెద్ద హొటల్ కుడా ఉండేదికాదు ( అంటే ఈ నాటి స్టాండర్డ్స్ లో ). మహా అయితే కాలేజీ ఎదురుగుండా అమ్మిరాజు హొటల్, ఎప్పుడైనా మా ఇంట్లో కారణాంతరాలవల్ల భోజనం తెప్పించాలంటే కనకం హొటల్నుండి డబల్ కారీయర్ ( అందులో నలుగురు తినగా ఇంకా మిగిలేది ), శనివారాలు నేనూ మా కజినూ, మోబర్లీపేట లో శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసికొని, ముమ్మిడారం గేట్ దగ్గర ఉన్న సత్యనారాయణా విలాస్ లో మసాలా దోశా. ఇంతే.

                                                          ఎప్పుడైనా మా నాన్నగారితో రాజమండ్రి వస్తే శాంతినివాస్, వరదరావు హొటల్, అలాగే కాకినాడలో సినిమా రోడ్ మీద రావూస్ కేఫ్ ( కఫే అంటారని చాలా కాలం తరువాత తెలిసింది !! ). విశాఖపట్నం లో కేజీ హాస్పిటల్ పక్కన పవన్ బేకరీ, ఆంధ్రా యునివర్సిటీ ఔట్ గేట్ దగ్గర ఓ హొటల్ ఉండేది ( పేరు జ్ఞాపకం లేదు ) .ఇవి తప్పించి  ఉద్యోగం లో చేరీ దాకా ఇంకే హొటల్ లోకి వెళ్ళలేదు. కారణం జేబులో డబ్బులు లేక !!

                                                           పూనా లో ఉద్యోగం లో చేరినతరువాత కూడా ఏదో ఉడిపీ హొటల్ తప్పించి ఇంకే హొటల్ కీ వెళ్ళే ప్రయత్నం చేయలేదు. బహుశా అది నా ” ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్” ఏమో. పెళ్ళి అయిన తరువాత మా ” మేనల్లుడు ” ఒకసారి ఓ మాస్తిరి పెద్ద హొటల్ కి తీసికెళ్ళాడు. అక్కడ అంతా అయోమయం నాకు. భోజనం అయిన తరువాత అదేదో వేడి నీళ్ళూ, నిమ్మకాయా ఇచ్చాడు. తను ముందుగా చెప్పేడు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను కూడా ఆనీళ్ళు నిమ్మకాయ పిండుకుని తాగేవాడిని !!!

                                                          అంతకుముందు మా కజిన్ చదివే ఏ.ఎఫ్.ఎమ్.సీ హాస్టల్ కి ఎప్పుడైనా వెళ్ళేవాడిని. ఎప్పుడూ భయమే అక్కడ ఆ నైఫ్లూ, ఫోర్క్ లతో ఎలా తినాలో తెలియక. ఏదో కానిచ్చేవాడిని.

                                                       అలాంటిది వరంగామ్ వచ్చిన తరువాత ఓ సారి క్వాలిటీ సర్కిల్ ట్రైనింగ్ కోసం బొంబే లో ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న ” సెంటార్ ” హొటల్ కి పంపారు. చూసుకోండి నా ఖంగారు. ఏమీ సిగ్గు పడకుండా మా మేనల్లుడిని అడిగాను ఏం చేయమంటావని. “నువ్వేం ఖంగారు పడకు, అక్కడకు వచ్చే మిగిలిన వాళ్ళలో కూడా నీలాంటి వాళ్ళుంటారు, అలాంటి వాళ్ళను గుర్తించడంలోనే ఉంది అసలు సంగతంతా. ఏమీ ఖంగారు పడకుండా ముందుగా అక్కడికి వెళ్ళి

అన్నింటిలోకీ ముఖ్యమైన టాయిలెట్లు/ రెస్ట్ రూమ్ లు ఎక్కడున్నాయో చూసుకో. వచ్చి లాబీ లో కూర్చో. చూస్తూ ఉండు  ఎవడో ఒకడు వచ్చి నిన్నే అడుగుతాడు, ట్రైనింగ్ రూమ్ ఎక్కడా అని. అంటే వాడు నీకంటే బడుధ్ధాయన్నమాట. అదే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది. ఒక్కసారి అలవాటు అయ్యిందంటే ఇంక నీకెదురు లేదు ”

                                                  ఆ తరువాత మళ్ళీ డిల్లీ లోని తాజ్ ఇంటర్ కాంటినెంటల్ కి వెళ్ళవలిసి వచ్చింది. మా టీమ్ లో ఉన్నవాళ్ళకంటే నేనే చాలా బెటర్ అనిపించింది.  బొంబాయ్ సెంటార్ ధర్మమా అని లిఫ్ట్ లో వెళ్ళడం కూడా తెలిసింది. అందు చేత డిల్లీ వెళ్ళినప్పుడు నేనే మా జనానికి గైడ్ ని !! ఒక్కటే సమస్య వచ్చింది–అది ఆటోమేటిక్ లిఫ్ట్ అవడం తో ఎలా ఆపాలో, ఎక్కడ దిగాలో తెలియలెదు !! ఇంక లంచ్ టైములో అందరికీ ఖంగారే. మొత్తం మా ఫాక్టరీలనుండి వచ్చిన

వర్కర్స్ చాలా మంది ఉన్నారు. అందరికీ లాన్ లో బఫే ఏర్పాటు చేశారు. ఆ వర్కర్స్ అందరూ వాళ్ళకి కావల్సినవి తెచ్చుకొని శుభ్రంగా ఆ లాన్ లో కింద కూర్చొని తినడం మొదలెట్టారు. అంతే అది చూసి మిగిలినవాళ్ళందరూ మొహమ్మాట పడకుండా లాగించేశారు.

 

                                           రిటైర్ అయినప్పడినుంచీ మా పిల్లలు పూణే లోనే ఉండడంతో వాళ్ళతో లే మెరిడియన్, బ్లూడైమండ్, హాలిడే ఇన్, కోరియాంథమ్, మెయిన్లాండ్ చైనా లాంటి హొటల్స్ కి తీసికెడుతున్నారు. నెలలో అయిదారుసార్లైనా వెళ్తూంటాము. ఎప్పుడూ నేను ఏమీ నోరెత్తను. ఆ మెనూ చూసి ఏం తెప్పించమంటారూ అని అడుగుతూంటారు. నేనంటానూ ” నాకు లేనిపోని టెన్షన్ తెప్పించకండి నాకేమీ తెలియదు మీరు ఏం తెప్పిస్తే అదే తింటాను” అని తప్పించేసుకొంటాను. చపాతీ కీ, నాన్ కీ, పరోఠా కీ తేడా తెలియదు. రుమాలీరోటీ ఒక్కటే గుర్తు పట్టకలను !! మిగిలనవన్నీ ఒకలాగే కనిపిస్తాయి. ఇంక బఫే అయితే నా పని గోవిందా. వంకాయ , ఫిష్షూ ఓ లాగే కనిపిస్తాయి. మా అమ్మాయో, కోడలో నాకు హెల్ప్ చేస్తూంటారు. ఒక్క డిజర్ట్ లు మాత్రం ఏంగొడవ లెదు, అందులో వెజ్, నాన్వెజ్ గొడవ ఉండదుగా !!

 

                                     నా కైతే ఇంట్లో కూర్చొని అంచులున్న కంచం లో హాయిగా ప్రతి ముద్దకీ కంచంఅంచుని గుజ్జు తీసికొంటూ తినడం లో ఉన్న హాయి, ఆనందం,ఇంకెక్కడా దొరకదని నా నమ్మకం. ఎవరు ఎలా అనుకొన్నా సరే మా మనవరాళ్ళు ( 10, 3 సంవత్సరాల వయస్సు వాళ్ళు ) ఆ గుజ్జు తింటూంటే ఎంత తాదాత్మ్యం చెందుతారో !! పిల్లల్ని పాడిచేసేస్తున్నావంటూ మా వాళ్ళందరూ ( మా ఇంటావిడ తో సహా ) చివాట్లు వేస్తూంటారు !!

%d bloggers like this: