బాతాఖానీ-తెరవెనుక (లక్ష్మిఫణి)ఖబుర్లు–తిండి అలవాట్లు

   

మా చిన్నప్పుడు ఎప్పుడినా రాత్రిళ్ళు అన్నం లాంటిది మిగిలిపోతే, దానిని తరవాణీ లో వేసి, మర్నాడు పొద్దుటే పిల్లలకి పెట్టేవారు ( ఆ రోజుల్లో ఫ్రిజ్ లూ అవీ ఉండేవికావుగా ), ఇంట్లో పిల్లలు లేకపోతే ఏ మాధవ కబళం వాడికో వేసేసేవారు.భోజనాలు పొద్దుటే 10 గంటలకల్లా అయిపోయేవి. మధ్యాహ్నం మూడింటికి ఏదైనా తాయిలాలు చేసేవారు. బయట వస్తువులు అవీ తినడం అలవాట్లు లేవు.శనివారం, ఆదివారం ఎవరికైనా రాత్రి ఉపవాసాలుంటే వాసినిపోలులూ, దిబ్బరొట్టెలూ లాంటివి చేసే వారు దాంట్లోకి ఏదో ఊరగాయ నలుచుకోవడానికి.

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అందరూకూడా బయట తినుబండారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అన్నప్రాశన అయిన మర్నాడు నుండీ కుర్కురేలూ, చాకోలూ, బర్గర్లూ ఒకటేమిటి,రకరకాలు. నాకో అనుమానం–చిన్నపిల్లలు ఆ కుర్కురేలకి ఎందుకు ఎడిక్ట్ అవుతారో, దానిలో ఏమైనా కలుపుతారా? ఏమో? ఇంకోటి మరచిపోయాను, చిన్న పిల్లలకి అవేవో
ఫ్రూట్లూప్సూ, కార్న్ ఫ్లేక్సూ. అవిలేకపోతే వాళ్ళకి రోజు వెళ్ళదు. ఇదంతా ” గ్లోబలైజేషన్ ” మహిమా ?

నేను సర్వీసు లో ఉన్న 42 సంవత్సరాలలోనూ మొదటి తొమ్మిది సంవత్సరాలు ( పెళ్ళికి పూర్వం ) వదిలేస్తే మిగిలిన 33 ఏళ్ళూ, మాఇంటావిడ చేతి వంటే తిన్నాను. ప్రతీరోజూ ఫాక్టరీకి
డబ్బా ( మన భాషలో కేరీయర్ ) తీసికెళ్ళడమే. ఆ అలవాటు ఎంతగా అయిందంటే, మాఇంటావిడ నేను రిటైర్ అయిన తరువాత కూడా కొన్ని రోజులు డబ్బా ఇచ్చేసి, ఏదో మూలకి వెళ్ళి తినేయమనేది !!

పిల్లలకి ఇంట్లోనే ఏదైనా చేసి తినిపిస్తే బాగుంటుందేమో. ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ కంఫర్టబుల్ గా జీవితం గడపలేకున్నారు. బహుశా ఇదో కారణమేమో, ఈ ఇన్స్టెంట్ ఫుడ్లు మనజీవితం లో చోటు చేసికోవడానికి.ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ముందు తల్లితండ్రులు ఆ అలవాటు మానితే పిల్లలు వారిని అనుసరిస్తారేమో, ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. కొందరు అనొచ్చు– వీడికి తన చిన్నతనంలో ఇలాంటివి ఎప్పుడూ దొరకలేదూ అందుకనే ఇప్పటి వాళ్ళని చూస్తే దుగ్ధా అని.ఈ వాతావరణ కాలుష్యానికి తోడు ఈ తిండి అలవాట్ల ధర్మమా అని బాగుపడుతున్నవాళ్ళు డాక్టర్లూ, ఆ చిరుతిళ్ళు తయారుచేస్తున్న కంపెనీలూ, నష్టపోతున్నది మన పిల్లలూ, వారి భవిష్యత్తూ.

వీటికి సాయం ఆ సాఫ్ట్ డ్రింకులు –కోకాకోలాలూ, పెప్సీలూ, మాజాలూ ఎట్సట్రా ఎట్సట్రా…వీటి ధర్మమా అని చిన్నా పెద్దా లకి ఒబేసిటీ ప్రోబ్లం లూ. మళ్ళీ వాటికోసం జిమ్ములూ, డబ్బున్నవారైతే ఇంట్లోనే అన్నిరకాల వ్యాయామాలకి ఎవేవో కొని ఇల్లంతా ఓ గోడౌన్ లా చేయడం. పోనీ అవేనా రోజూ చేస్తారా అంటే అదీలేదు.
ఇదివరకటి రోజుల్లో మన ముందు తరం వారు వారి తిండి అలవాట్ల వల్లే వాళ్ళ ఆయుషు అంతగా ఉండేది.టైముకి ఓ పధ్ధతి ప్రకారం తినడం, చివరివరకూ చేశారు. కొంతమంది అనొచ్చు
–ఆరోజుల్లో ఈ పెస్టిసైడ్లూ అవీ ఉండెవికాదు, కల్తీలేని తిండి దొరికేది అని.బహుశా అదో కారణం అవొచ్చు.తిండి ఎలా ఉన్నా పధ్ధతి లో కూడా ఉందికదా?ఈ రోజుల్లో చిన్నపిల్లలకి ఓ చేతిలో
టి.వి రిమోట్టూ ( కార్టూన్లు చూడడానికి), రెండో చేతిలో ఎదో తినే ప్లేటూ. పిల్లలని ఆ టి.వి. ముందుంచుతే ఎలాగోలాగ పేచీ పెట్టకుండా తినేస్తాడని మనం కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నాము.

టీవీల్లో ప్రకటనల ధర్మమా అని ( అవికూడా చిన్నపిల్లలచేత చేయిస్తారు ) మన పిల్లలు కూడా వాటిమీదకు ఎగ బడుతున్నారు. ఈ మధ్యన ఎక్కడో చదివాను– టీవీ ల్లోనూ, సినిమాల్లోనూ, చిన్నపిల్లలచేత పనిచేయించే ప్రొడ్యూసర్ల మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తున్నారని, దీనిని, చిన్న పిల్లల తిండి మీద చేసే ప్రకటనల వాళ్ళ మీద కూడా అమలుచేయాలి.
ఈ కుర్కురేలూ అవీ నగరాలకే కాదు, చిన్న చిన్న గ్రామాలకి కూడా పాకేయి

ఒకప్పుడు దూర్దర్శన్ రోజుల్లో అదేదో సీరియల్ వచ్చేది డ్రగ్స్ మీద వాటి దుష్ప్రభావాలూ అవీ చూపించారు. కొంత కాలం కింద వాళ్ళెవరో సాఫ్ట్ డ్రింకులమీద ఏవేవో ఇన్వెస్టిగేషన్లు చేసి వాటిలో
పురుగు మందులూ అవీ ఉన్నాయన్నారు.కొంత కాలం అవి తాగడం మానేశారు, మళ్ళీ మామూలే.ఇప్పుడు వస్తున్న జంక్ ఫుడ్ మీద ఎవరూ ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయలేదు?
మన ప్రభుత్వాల నిజాయితీ దీనిలో తెలుస్తోంది.

.

%d bloggers like this: