బాతాఖానీ ఖబుర్లు –38–(డాక్టరు కానన్న అమ్మాయి)

మా వరంగాం ఏరియా ఉత్తర మహరాష్ట్ర యూనివర్సిటీ ఏరియా లో ఉండేది. పూణే యూనివర్సిటీ లో సీట్ కావాలంటే, మైగ్రేషన్ ( తహసిల్దార్ ఆఫీసు నుండి) సర్టిఫికేట్, జలగాం కలెక్టర్ ఆఫీసునుండి సిటిజెన్షిప్ సర్టిఫికేట్ ( నాకు ఇప్పటికీ అర్ధం అవదు, దిని అవసరం ఏమిటో ) తీసికోవాలన్నారు. ముందుగా  భుసావల్ వెళ్ళి కొద్దిగా ” చాయ్ పానీ ” డబ్బులు సమర్పించుకొని మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసికొన్నాను. దానిని తీసికొని జలగాం వెళ్ళాను. మా అమ్మాయి మార్కులు చూసి, అక్కడ స్టాఫ్ ఏ విధమైన చాయ్ పానీ డబ్బులు ( ఉల్టా నాకు వాళ్ళు చాయ్ ఇప్పించారు !! ) తీసికోకుండా సిటిజెన్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఆ మర్నాడు పూణే వెళ్ళి, మెడికల్ కి, ఇంజనీరింగ్ కీ అప్లికేషన్ ఫారం లు తెచ్చాను.. ఇంజనీరింగ్ మెరిట్ లిస్ట్ లో రాష్ట్రానికి 3 వ నంబర్ లోనూ, మెడికల్ ( బి.జె. మెడికల్ కాలెజ్ లో ) కి 7  వ నంబర్ లోనూ మా అమ్మాయి రాంక్ వచ్చింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే దేనిలో చేరాలా అని.

దేనికైనా మేము సిధ్ధమే. ఇలా కాదు అనుకొని మా డాక్టరమ్మ గారి దగ్గరకు సలహా కి వెళ్ళాము, మేము నలుగురం కలసి. ఆవిడ కంటే మాకు శ్రేయోభిలాషి ఎవరూ లేరు. ఆవిడైతే మార్కులు చూసి చాలా సంతోషించారు. మేం అడిగిన సమస్య ఆవిడకు అర్ధం అయ్యింది. చాలా ఓపికగా, మెడికల్ లో చేరాలంటే కావలిసిన గుణాలు చెప్పారు — (1) ఓర్పూ, సహనం ఉండాలి (2) ఆర్ధికంగా నిలదొక్కుకునే ( నాకు ) దన్నుండాలి (3) మెడికల్ లో ఒక్క ఎంబీబిఎస్ తో సరిపోదు ఆ తరువాత ఏదో ఒక దానిలో స్పెషలైజేషన్ చేయాలి, అదంతా అయేసరికి చాలా కాలం పట్టవచ్చు. (4) ఆ తరువాత ప్రాక్టిస్ పెట్టడానికి,నిలదొక్కుకోడానికీ శ్రమ పడాలి.– అలాగని ఆవిడ మమ్మల్ని నిరుత్సాహ పరచలెదు. ఉన్న విషయమెమిటో చెప్పి, ఆఖరి నిర్ణయం మా అమ్మాయికే వదిలేశారు. మేము కూడా మా అమ్మాయి  ఏది చదవాలంటే దానికి సిధ్ధ పడ్డాము. డబ్బుకేముందీ ఎలాగోలాగ సర్దవచ్చు. మెడికల్ లో పిలిచి సీట్ ఇస్తా మంటే వద్దనేవారు ఎవరైనా ఉంటారా ? మెడికల్ లో సీట్ గురించి లక్షలు,లక్షలు పోసి ” పేమెంట్ ” సీట్ లు తెచ్చుకొన్నవారిని చాలా మందిని చూశాము. అందువలన మేము అన్నింటికీ సిద్ధం అయ్యాము.

ఏమనుకుందో ” డాడీ నేను ఇంజనీరింగ్ లోనే చేరుతానూ ” అంది. తను చెప్పిన కారణాలు చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి.

” తమ్ముడి చదువు పూర్తయినా నేను ఇంకా చదువుతూనే ఉంటాను, నాకు అంత ఓపికా, సహనమూ లేవు, మన  కుటుంబం లో అమ్మాయిలు చాలా మంది డాక్టర్లే ఉన్నారు, నేను మొదటి లేడీ ఇంజనీర్ అవ్వాలని ఉంది ”

మేము నలుగురం కలిసే ఈ విషయం చర్చించి ఈ నిర్ణయం తీసికొన్నాము. చాలా మంది అన్నారు ” కాళ్ళ దగ్గరికి మెడికల్ సీట్ వస్తే అలా వదిలేస్తున్నారేమిటీ ” అని. ” వుయ్ ఆర్ డిఫరెంట్ ” అని అదేదో “టొమాటో సాస్ ఎడ్వర్టైజ్మెంట్ ” లాగ చెప్పాము. నచ్చిన వాళ్ళకి నచ్చింది లేనివాళ్ళకు లెదు. చదవవలిసినది మా అమ్మాయి, చదివించేది మేము, మా ఇష్ట ప్రకారమే చేస్తాము కానీ ఊళ్ళో వాళ్ళందరి కోరిక ప్రకారం కాదు కదండీ .

అప్పుడు చెప్పాము మా అమ్మాయి తో ” జీవితం లో మాకు కావల్సినది మేము అడగఖర్లేకుండా ఇచ్చావు. ఇంతకంటే ఏ తల్లితండ్రులూ, పిల్లల మార్కుల విషయం లో ఆశించలేరు.  ఇప్పుడు నీకు కావల్సినది అడుగు. “అన్నాము. ” నేను ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత నాకు కావల్సినది అడుగుతానూ, కాదనకుండా ఇవ్వాలి ” అంది.

నా వరకూ నెను ఒక్క విషయం చెప్పాలి. మా ఇంటావిడ కానీ, మా అమ్మాయి కానీ, మా అబ్బాయి కానీ నన్ను ఎప్పుడూ ఏమీ తీర్చలేని కోరికలు అడగలేదనడంకంటే, అస్సలు ఏమీ అడిగేవారేకాదు !! అది నాకు భగవంతుడూ, వాళ్ళూ ఇచ్చిన  ఓ వరం !!

అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నేను వాళ్ళకి ఈ నాటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమీ చేయలేకపోయానూ అని.వాళ్ళకి న్యాయం చేయలేకపోయానేమోనని. నేను ఏ జన్మ లో చేసికొన్న పుణ్యమో నాకు అలాగ సహకరించే జీవిత భాగస్వామి, రత్నాల్లాంటి పిల్లల్నీ భగవంతుడు నాకిచ్చిన వరాలు.

%d bloggers like this: