బాతాఖానీ ఖబుర్లు –39

అప్లికెషన్ ఇచ్చిన 15 రోజులకి      కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే ( సి.ఓ.ఈ.పి ) నుండి కౌన్సెలింగ్ కి తేదీ తెలిసింది. మేం నలుగురం కలసి వెళ్ళాము. మా అమ్మాయి రాంక్ బాగా పైనే ఉండడం వలన తనని త్వరగానే పిలిచారు. ఆ ఏడాదే మొదటిసారిగా ” కంప్యూటర్ సైన్స్” మొదలుపెట్టారు. తన ఇష్ట ప్రకారం దానిలోనే దొరికింది. ఇంక హాస్టల్ లో కూడా,రాంక్ ధర్మమా అని, తన రూం మేట్ల ని ఎన్నుకోవడం లో ప్రయారిటీ ఇచ్చారు.

మొదటి సారి మమ్మల్ని అందరినీ వదిలి పెట్టి వెళ్తున్నందుకు, చాలా బెంగ వచ్చేసింది. అయినా తప్పదుగా. పుణే లోనే ఉన్న మా స్నేహితుడి ని ” లోకల్ గార్డియన్ ” గా పెట్టాము. భుసావల్ నుండి పూణే కి ఒక రాత్రి ప్రయాణం( బస్సైనా, ట్రైన్ అయినా ). చెప్పానుగా మాకు వరంగాం లో

టెలిఫోన్ సౌకర్యం ఒక్క మా జి.ఎం. ఆఫీసు లోనే ఉండేది., అందువల్ల ఉత్తరాలే గతి మాకు. రోజూ ఉత్తరాలలోజరిగిన ప్రతీ విషయమూ వ్రాసేది. అదే నిష్పత్తి లో నేనూ జవాబు ఇచ్చేవాడిని.

ప్రతీ నెలా నేనైనా పూణే వెళ్ళేవాడిని లేకపోతే తనైనా వరంగాం వచ్చేది. మా ధర్మమా అని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళూ, రైల్వే వాళ్ళూ, ప్రైవేట్ బస్సుల వాళ్ళూ బాగుపడ్డారు ఆ నాలుగుఏళ్ళలోనూ !!!

తన ఫస్ట్ ఇయర్ లో 1992 లో మా పెద్దన్నయ్య గారు అకస్మాత్తుగా తణుకు లో పరమపదించారు. టెలిగ్రాం రాగానే మేము నలుగురమూ కలసి రాజమండ్రి వెళ్ళాము. మా అమ్మాయికి పరిక్షల టైము అవడం వల్ల, వాళ్ళు ముగ్గురినీ తిరిగి పపించేసి, నేను రాజమండ్రి లో ఉండిపోయాను.

ఆ పదిరోజులూ కార్యక్రమాలు చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ విధంగా మా పెద్దన్నయ్య గారికి ఋణం తీర్చుకోగలిగాను.

ఎప్పుడైనా ఉత్తరం  రాలేదూ అంటే మా అమ్మాయి వరంగాం వస్తున్నట్లన్నమాట.. అలాగే కాలెజీ నుండి వచ్చేసరికి, నా దగ్గరనుండి ఉత్తరం లేకపోతే, నేను ప్రత్యక్షం అయ్యేవాడిని !!

అమ్మాయి ఇంజనీరింగ్ లో చేరే సమయానికి మా అబ్బాయి క్లాస్ 7 లో ఉండేవాడు. తనకి క్విజ్ ల మీద చాలా ఆసక్తి ఉండేది. టి.వీ. లో వచ్చే బోర్నవిటా ( డెరెక్ ఓ బ్రైన్ ది ),క్విజ్, అలాగే సిద్ధార్థ్ బాసూ నిర్వహించే ” ఇండియా క్విజ్ ” అనుకుంటా ఎప్పుడూ మిస్ అయేవాడు కాదు. పుస్తకాలూ,  ఇంగ్లిష్ మాగజీన్లూ సరేసరి. చిన్నప్పటినుండీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రధ్ధ చూపేవాడు.క్రికెట్ అయితే చెప్పఖర్లెదు. మా అమ్మాయి పుణే వెళ్ళినా, మాకు  ఒంటరితనం ఎప్పుడూ ఉండేది కాదు, అబ్బాయి మాతోనే ఉండడం వలన.

మా జి.ఎం శ్రీ సుందరం గారు బహూకరించిన రోలింగ్ కప్ ( క్లాస్ 12 వారికి ) ముందటేడాది వచ్చినవాడు తనతో తీసికెళ్ళిపోవడం వలన, మళ్ళీ అప్పటికప్పుడు కొత్తది కొని, మా అమ్మాయి వచ్చినప్పుడు తనకి ప్రెజెంట్ చేసారు. అలాగే స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మా సొసైటీ ల వాళ్ళూ సత్కారం చేశారు.

మా అమ్మాయి ఉన్నంత కాలం స్కూల్లో జరిగే అన్ని విషయాలూ తెలిసేవి. అబ్బాయి తో అలా కాదు, ఏమీ చెప్పేవాడు కాదు.

వీడికి  మా అమ్మాయి లాగ పాటలమీద ఆసక్తి ఉండేదికాదు.రెసిటేషన్, గేమ్స్, క్విజ్, లలో ఎక్కువగా పాల్గొనేవాడు. స్నేహితులు కూడా  ఎక్కువే. మా క్వార్టర్ కి ఎదురుగానే స్కూల్ ఉండడం వలన ఇంటర్వెల్ లో ఇంటికి రావడానికి వీలు పడేది.చదువు విషయం లో నన్నెప్పుడూ ఇరుకులో పెట్టలేదు. ఏమైనా డౌట్ వచ్చినా

మా డాక్టర్ గారినే పట్టుకొనేవాడు.   వాళ్ళ అక్క కి కొన్న రిఫరెన్స్ పుస్తకాలు, తనకీ బాగానే ఉపయోగించాయి. కొత్తవేమన్నా కావాలంటే తెప్పించేవాడిని. అన్ని క్లాసులలోనూ తనుకూడా వాళ్ళ అక్క లాగే ఫస్ట్ లోనే ఉండేవాడు.

%d bloggers like this: